Saturday, January 21, 2023

4 వివేకపథం

 



వివేకపథం
సంపుటి:1   నవంబరు 1996  సంచిక : 4

కర్మ సిద్ధాంతము - ఒక పరిశీలన

(చర్చా వేదిక విశేషాలతో సహా) - పాఠక మిత్రులారా! ముందుగా ఒకమాట చెప్పాలి. చర్చావేదిక అనుకున్నరీతిలో, అనుకున్న స్థాయిలో, అనుకున్నంతమేర సంతృప్తికరంగా జరగలేదు. కారణాలు అనేకం. . అవి మొత్తం యిక్కడ వివరించడం కష్టం. అంత ప్రధానం కూడా కాదు. అందుకే ఈ వ్యాసంలో పాఠకులెదురుచూసేంత మేర విషయాన్ని ఇమడ్చాల్సిరావడంతో,  పై పేరెట్టాను. లేకుంటే "కర్మ సిద్ధాంతం పై చర్చావేదిక” విశేషాంశాలు; అనుండాల్సింది. ఏదేమైనా, అంటే మా వ్యయప్రయాసలకు తగినంత ప్రయోజనం సిద్ధించకున్నా, ఎదురుచూసే నాకై నా న్యాయం చేకూర్చడానికి గాను కర్మసిద్ధాంతపరమైన అంశాల స్వరూప స్వభావాలనూ ఇందులో పొందుపరచి మీకందిస్తున్నాను.

26-10-96 ఉదయం 10 గంటలకు సదస్సు ఆరంభమైంది. ప్రధాన ప్రతిపాదకులుగ డోంగ్రేగారుండగా ప్రతిపాదక పక్షంలో ఇంకా వెంకట్రావుగారూ, వాలకొండ నరశింహాచార్యులుగారూ ఉన్నారు. పృచ్ఛకులుగ శ్రీ పెంచలయ్యగారు, గుత్తా రాధాకృష్ణ గారు, ప్రసాదు ఉన్నారు.

రెండవరోజు ' రామచంద్రుల కోటేశ్వరశర్మగారు, సూరి రామకోటి శాస్త్రిగారు, ఆచార్య వేదవత 'మీమాంసక్' గారు, వంకం సుబ్బన్న గార్లు ప్రతిపాదకపక్షంలో ఉండగా; పెంచలయ్యగారు, గుత్తా రాధాకృష్ణగారు, సుజరేగారు,  ప్రొ. నాగన్నగారు, ప్రసాదు, నారాయణ శెట్టిగార్లు ఎదుటి పక్షంలో ఉన్నారు.

కార్యక్రమారంభసూచకంగా ఇరుపక్షాలనూ సభకు పరిచయం చేసి డోంగ్రేగారిని విషయ ప్రతిపాదన చేయండన్నాను.

మనిషికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మ చేస్తున్నాడు. జానాతి, ఇచ్చతి, యతతి తెలుసుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు అంటూ సరైన ఎత్తుగడతోనే ఆరంభించారాయన. తెలిసిన వాటిలో అవసరమైనవి, అనవసరమైనవి అని రెండు రకాలుంటాయి. వాటిని గురించి యత్నిస్తుంటాడు. ప్రయత్నం అన్నది. ఎప్పుడూ చేతనం యొక్క  ప్రేరణనుండి ఆరంభమవుతుంది. దానికి ఫలం వస్తుంది. - ఫలం సుఖదుఃఖ రూపంలో మాత్రమే ఉంటుంది. ఫల కారణం క్రియ అన్నది నిర్వివాదం అంటూ "కర్మఫలసాధనమ్ కర్మత్వాత్ కృష్యాదివత్” అని, ఒక తార్కిక ప్రయోగాన్ని చేశారు. కర్మను అనుసరించే  సర్వం ప్రవృత్తమాన మవుతుంటుంది. అంటూ. కర్మ దానిననుసరించి - ఫలోత్పత్తి - ఫలభోగంగా కర్మ సిద్ధాంత స్వరూపముంటుంది అని ముగించారు.

పెంచలయ్య గారు :- జీవాత్మ గుణకర్మ లేమిటి? అనడగ్గా, 

డోంగ్రే:  ఇచ్చాద్వేష ప్రయత్న సుఖదుఃఖ ధర్మాధర్మ సంస్కారములు అంటూ ఈ గుణములు ఆత్మకు ఆగంతుకములు (అంటే సంక్రమించినవి లేక వచ్చిపోయేటివి) అనన్నాడు.

పెంచ : అయితే ఆత్మకు సహజగుణ మేమిటి ? సురేంద్ర : ఇక్కడ డోంగ్రేగారు నిర్దుష్టమైన ప్రతిపాదన చేయలేకపోయారు. న్యాయం ప్రకారం జ్ఞానాశ్రయమనీ, వేదాంతుల ప్రకారం జ్ఞానరూపమనీ, ఆ జ్ఞానమూ మా లెఖ్ఖన  ఆగంతుకమేగాని విషయ రహితమైన జ్ఞానం సిద్ధించనందున విషయజ్ఞానోత్పత్తికి పూర్వం ఆత్మయందు జ్ఞానం సిద్ధించదనీ, ఆత్మ మనస్సంయోగానికి పూర్వం - ఆత్మయందు చైతన్యం లేదనీ, మనస్సంయోగానంతరం పుట్టిందే చైతన్యమనీ, కనుక ఆత్మ వస్తుతః జడమని డోంగ్రేగారు అన్నారు.

మరైతే జడ చేతనాలకు భిన్నత్వం ఎలా చెప్పుకోవాలి అనడగ్గా, ప్రకృతి రూపమైన జడానికి చైతన్యోత్పాదక సామర్ధ్యం ఉండదనీ, ఆత్మకైతే అట్టి సామర్థ్య ముంటుందనీ - ఆ సామర్థ్యాన్నే శక్తి అంటామని అన్నారు. ఇలా వారిపక్షం పృశ్చకులు గట్టిగా ప్రతిఘటించక్కరలేని విధంగా బలహీనంగా సాగింది. ఒకదశలో ఆత్మ జడం అన్నారంటేనూ, జ్ఞానం (చైతన్యం) పుట్టుక కలది అని అంగీకరించడమంటేనూ దాదాపు భౌతికవాద పొలిమేరల్లోకి ప్రవేశించడమేనంటూ ఆలోచించండంటూ ఒక హెచ్చరిక సూచన రూపంలో చేశాను.

వాలకొండ నరసింహాచార్యులుగారు ప్రతిపాదిస్తూ (వీరు డోంగ్రేగారితో మూలంలోనే విభేదించారు) .ఆత్మ ఎన్నడూ జడంకాదు. జ్ఞాతయే. చేతనుడేనని  అన్నారు. ఈ ఆత్మ భగవంతుని నుండి పుడుతున్నాడని ఒకమాట, అనాది నిత్యుడని మరోమాట చెప్పినారు. శరీరం జడం, జీవుడు చేతనుడు. శరీర-చేతన సంబంధం అనాది మాయవల్ల జరుగుతుందన్నారు. మాయ, ఈశ్వరుడు, జీవులు అనాదులు. జీవుడు అణు పరిమాణుడు అంటూనే అతడికి , అవయవాలున్నాయి అన్నారు. (ఒక్క వైరుధ్యముందన్నది గమనించాలి. ఒక ధోరణి ప్రకారం సావయవత్వం, పరిమితత్వం కార్యస్య లక్షణం. సురేంద్ర.) 

ఈ జీవుల్లోనూ ఆనంద, సుఖ, దుఃఖ జీవులని మూడు రకాల వారుంటారు. అని మధ్వమతానుసారం వివరిస్తూ పెంచలయ్య గారడిగిన ప్రశ్నకు జీవుని లక్షణాలుగా పై చెప్పినవే కాక అతడు మాయాధీనుడు, కర్మాధీనుడు, భగవదధీనుడు అంటూ జీవుని అస్వతంత్రతపై నొక్కి పెట్టారు.

ఈ దశలో పెంచలయ్యగారు జీవుడు పుణ్యపాప కర్మల యందు ప్రవర్తించడానికి కారణమేమి అన్న ప్రశ్నను లేవదీశారు. 

డోంగ్రే :- ఈశ్వరుడే ప్రేరేపిస్తున్నాడు. అయితే జీవుని పూర్వ కర్మానుసారంగా మాత్రమే ఈశ్వరుడే జీవునికి కర్మచేసే సామర్థ్యాన్ని, కర్మకు కర్మ ఫలితాన్నిచ్చే సామర్థ్యాన్ని కలుగజేస్తున్నాడు.

ప్రతిపక్షం :- అలా అయితే కర్మ స్వతంత్రత విషయంలోనే అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది కదా?

సురేంద్ర :- ఈ  ప్రశ్నపై ఇదమిద్ధమని సమాధానం రాలేదు వారినుండి, అలా ప్రతిపాదక పక్షమొక్కటే బలహీనంగా తయారైందన్నది అంగీకరించక తప్పని నిజమై కూచుంది.

రెండవరోజు ఆచార్య వేదవ్రత 'మీమాంసక్' , విషయ ప్రతిపాదన వారిదైన శైలిలో చేశారు.

కర్మ సిద్ధాంతం బహు విస్తృతం అంటూ ఆరంభించారాయన. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి అన్న మూడు తత్వాలు (ద్రవ్యాలు) ఉన్నాయనీ, అవి అనాది నిత్యాలనీ అందు

ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడనీ, సృష్టిస్థితి లయ కారకుడనీ, అది స్వతంత్ర చేతన పదార్థమనీ, కర్మఫల ప్రదాతృత్వం అతనిలో ఉందనీ, అతడు సర్వజ్ఞుడు, నిర్భ్రాంతుడునని, అజ్ఞానం పక్షపాతం అతనిలో ఉండవనీ, సృష్టి ద్వారా జీవులకు మేలుచేయడానికి వేద రూప జ్ఞానాన్ని లోకానికందించాడని చెప్పారు. అలాగే

జీవుడూ చేతనుడే. అయితే ఏకదేశి, సూక్ష్ముడు, అణురూపుడు, ఏకదేశి కనుక అల్పజ్ఞుడు, సుఖాభిలాషి, కర్మ చేస్తాడు కనుక కర్మఫలభోక్త  కూడా ఇతనికి జన్మ-మరణాలున్నాయి.

యోగాది ప్రయత్నాల ద్వారా ముక్తి సంపాదిస్తాడు. అవధి ఉంది ముక్తికి కూడా. ముక్తి పొందే మళ్ళా జన్మిస్తాడు.

ప్రకృతి సూక్ష్మ సాకార పదార్థం. అణువు సత్వ, రజస్సు, తమస్సులనెడి మూడు పరమాణువులతో కూడి ఉంది. సత్వాదులు ద్రవ్యపదార్థాలు. ఇది జడ రూపమైనది, జ్ఞాన రహిత మైనది. కనుక సుఖదుఃఖ భోక్తకాదు. ఇది ఈశ్వరుని అధీనంలో ఉండి, జీవునికి భోగాన్ని అనుభవింప జేయడానికి గాను ఈశ్వరునిచే సృష్టిరూపంగా మార్చబడుతుంటుంది. ఇది అనేకంగా ఉంటుంది.

సత్వరజస్తమస్సులనెడి మూడు ద్రవ్యాల ఒక కలయిక నుండి అహం, మరొక రీతి కలయికవల్ల పంచతన్మాత్రలూ, ఏకాదశ ఇంద్రియాలూ, అవి మరో కలయికకు లోనై పంచభూతాలు ఏర్పడతాయి. వీటితోనే లోక లోకాంతరాల సృష్టి జరిగి జీవోపాధులు ఏర్పడతాయి.

జీవుడు కర్మ స్వతంత్రుడు- కర్మఫలం అనుభవించడంలో పరతంత్రుడు.

ఇక మానవుడు కోరికల కనుగుణంగా చేసిన కర్మలకు ఫలితముంటుంది. భోగరూపంగా చేసిన కర్మలకు ఫలిత ముండదు. ఫల రూపాలైన సుఖదుఃఖాలలో సుఖం రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి ప్రకృతి పదార్థాల ద్వారా కాగా రెండోది ఆనందరూపమై పరమాత్మ సంబంధంవల్ల ఏర్పడేది.

మొదటి రకంలో కేవల సుఖంగానీ, దుఃఖంగానీ, అజ్ఞానంగానీ ఉండక అన్నీ మిశ్రితమై లభిస్తాయి. ఈ రకంగా లభించే సుఖం క్షణికం. ఇది పరిమిత సుఖం మాత్రమే.

ఇక రెండవ రకం అమిశ్రితం- కేవలానందరూపం శాశ్వితం. ఈ రెంటి భేదాన్నెరిగిన వాడు ప్రకృతి సంబంధ సుఖాన్ని కోరడు. . ఇక్కడో చిన్న సూక్ష్మం ఉంది.

భగవంతునిలో సుఖం ఉంది అన్నది తప్పు భావం. భగవంతుడంటే సుఖమే. అతడు సుఖస్వరూపుడు. నిజానికి జీవునికి మోక్ష సుఖం అనంతంగా అనుభవించే సామర్థ్యం కూడా లేదు.

ఫల స్థాయిల్లో తారతమ్యాలున్నాయి. మానసిక కర్మలకు ఫలితాలు అల్పము. వాచిక-కాయిక కర్మలకు అధికతర, అధికతమ ఫలితాలుంటాయి.

ఈ కర్మలు రెండు రకాలు. 1) ఫలభోగం కొరకు - చేసేవి. 2) ఫలోత్పత్తికమైనవి. ప్రయత్నంనుండి 1) కర్మ, 2) సంస్కారాలు, 3) ఫలం, 4) కర్మ విపాకం అన్నవి జనిస్తాయి. ఫలం కర్తకు మాత్రమే. 

జన్మాయుర్భోగాలు అనిశ్చితారా ? నిశ్చితాలా ? అన్న ప్రశ్నకు ఆయుర్వేదం అనిశ్చితం అని చెప్పింది. ఒక జన్మలోని కర్మకు ఒకే జన్మలోనూ ఫలితం రావచ్చు. అనేక జన్మలలోనూ ప్రాప్తించ వచ్చునని మీమాంస సిద్ధాంతంలోని తీర్మానం. సత్కర్మలనగా నెట్టివి? అసత్కర్మలనగా, నెట్టివి? అన్న ప్రశ్నరాగా ఎట్టి కర్మలద్వారా భగవంతుని తెలుసుకోడానికి వీలవుతుందో అవి సత్కర్మలు, భిన్నమైనవి అసత్కర్మలు. ఆత్మోన్నతిని, పదోన్నతిని కలిగించగలవి సత్కర్మలు, అలా కానివి దుష్కర్మలు.

వీటి విచక్షణ వేదా ధారంగా ఎరగాలి. లేదా భగవద్ జ్ఞానాన్ని పొందాక నేరుగా తెలుస్తుంది. ఇలా ఒక సుదీర్ఘ ప్రసంగం రూపంలో వేదవత గారు విషయప్రతిపాదన చేశారు. ప్రతిపాదనలో ఒక క్రమమూ, అధ్యయన పరతా, సొంతాలోచన కొంతా కలగలసి ఒకింత ప్రౌఢిమ గోచరించింది. అయినా ప్రతిపాదించాక కారణాంతరాలచే పరీక్షించేంతవరకు వారుండలేక పోవడంతో విచారణ జరుగమిచే పర్యవసానం అనిశ్చితంగానే మిగిలిపోయింది. వెళ్ళే ముందు వేద వ్రత గారు మరొక్కసారి కూర్చుని కూలంకష - విచారణ చేద్దామంటే నా కభ్యంతరం లేదంటూనే వీగిపోయిన వాటిని విడచివేయడంలో తడబడనంటూ తమ నైజానికి సంబంధించిన అంశాన్ని ప్రకటించారు.

సురేంద్ర : వీరి ప్రతిపాదనల్లో కొన్నింటి పై అద్వైతులైన సూరి రామ. కోటి శాస్త్రిగారు అభ్యంతరాలు తెలిపారు. మచ్చుకు, మానసిక కర్మలు అధిక బలో పేతాలనీ, దానికంటే . వాచికాలూ, కాయికాలూ బలహీనములనీ పేర్కొన్నారు.

 అద్వైతుల పక్షం నుండి సూరి రామకోటిశాస్త్రిగారు ప్రతిపాదించ నారంభించారు గానీ అదంత పకడ్బందీగా సాగలేదు. అద్వైత పక్షాన్నంగీకరించాక దీనిని ప్రతిపాదించ బూనడమే అందుకు కారణం. . "అసలు నిజం (పరమార్థ సత్యం) ప్రకారం ఈ వ్యవహారం (మనం నిజమనుకునేది) కూడా కలలా అసత్యమే.” అన్నది వారి అసలు పక్షం కనుక కర్మసిద్ధాంతం నిజం కాదనడమే వారికి ఎక్కువ అంగీకారము . కనుక కర్మసిద్ధాంతాన్ని సత్యమేననాలంటే వారికి లేని పామును లేని కర్రతో కొట్టినట్లు, అధవా లేని పామును ఉన్న కర్రతో కొట్టినట్లే అనిపిస్తుంది. 

పాఠక మిత్రులారా ! ఇంతవరకే ఈ సదస్సులోని చర్చయొక్క సారాంశరూపము. నిర్దిష్టంగా ఏ ఒక్క విషయము ముగింపుకు రాలేదన్న వాస్తవాన్ని అందరం ఒప్పుకోవాలి. దీనిని ఇక్కడకు ఆపుదాం. 

కర్మ సిదాంత స్వరూప స్వభావాలు- ఒక విమర్శాత్మక విశ్లేషణ

పూర్వరంగం :- సమాజం పై - అత్యంత ప్రభావాన్ని ప్రసరించిన, ప్రసరిస్తున్న భావజాలం కలిగి ఉందీ ధోరణి. దీనికి ' అనుకూలురూ - ప్రతి కూలురూ' అన్న రెండు పక్షాలూ బలంగా కొనసాగుతూనే ఉన్నారు. చాలా కాలంగా. "ఈ భావాలు ఎంతగా ఉన్నాయంటే జీవితంలో ఏదో ఒక క్షణంలో, ఒక సందర్భంలోనైనా ఇది నా కర్మ అనిగాని, అదృష్టం అనిగానీ అనుకోని మనిషే ఉండడు (ఈ దేశంలో) అనడం అత్యుక్తి కానే కాదు. 

మొన్నటి వేదిక ఏర్పరచక పూర్వం మా వరకు మాకు కర్మ సిద్ధాంత విషయాల పై కొన్ని నిర్దిష్టాభిప్రాయాలున్నా, సభానంతరం మరికొన్ని వచ్చి చేరాయి. దీనినంగీకరించే పండితుల్లో కూడా ఈ అంశాలపట్ల స్పష్టమైన, లోతైన అవగాహన లేదన్నది అందులో మొదటిది. వారిలో వారికే మత భేదాలున్నాయన్నది మరొకటి. ఏ మతానికా మతాన్ని విడకొట్టి వారి భావాలను స్వీకరించినా పరిశీలనకు నిలిచేంత పట్టు వాటిలో లేదన్నది ఇంకొకటి. ఇలా మరికొన్నింటినీ చూడవచ్చు మరింత నిశితంగా విశేషాల్ని విశ్లేషిస్తే.

ఈ వ్యక్తుల్ని, వారి సైద్ధాంతిక భావజాలాన్నీ ఆవలబెట్టి వీరందరికీ గట్టి పట్టుగానున్న వైదిక (ఉపనిషత్తులూ, గీత, బ్రహ్మ సూత్రాది దర్శనాలు) సాహిత్యాన్నవలోకించినా అక్కడా ఈ మత (అభిప్రాయం) భేదాలు కనబడుతూనే ఉన్నాయి. నిజానికిదెంతో, శోచనీయమైన విషయం. పైగా అంతటి వైవిధ్య వైరుధ్యరూప నానాత్వం కలబోసుకుని ఉన్నా, విశేషజ్ఞులుగా ప్రసిద్ధి నందిన వారికైనా ఈ గందరగోళం ఎదురవకపోవడం, అవగతం కాకపోవడం ఆశ్చర్యకరం కూడ. ఈ సిద్ధాంతంలో ప్రధానాంశాలుగా ఉన్న జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, జన్మ, కర్మ, సాధన, ముక్తి అన్న అంశాలలో ఏ ఒక్కదాని విషయంలోనూ ఏకాభిప్రాయాలు లేకనే అందరూ, ఇది సత్యసిద్ధాంత మని చెప్పబూనడం, నమ్మి నడచుకోవడం నిజానికి చెప్పుకోవాలంటే చిన్న విడ్డూర మేమీకాదు. ఆస్తికేతరులు గట్టిప్రశ్న వేయవచ్చు, వేయలేకపోవచ్చు గాక! వీరికేమైంది? దీనిలోని సత్యాసత్యాలు విచారించుకుని స్వీకరించాల్సిన బాధ్యత వీరి పైన లేదా? సిద్ధాంతాలు తమకు కాకుండా ఇతరులకెలా అవసరమవుతాయి? అవసరాలు తీర్చుతాయి? కించిత్ ఇంగితానికైనా ఎదురు కావలసిన ప్రశ్న యిది. మరి వీరెవరికీ ఎందుకు ఎదురవలేదో పట్టలేదో నాకై తే అర్థంకాలా.

ఇదింత కాలం బ్రతికి బట్టకట్టడానికి ప్రధాన కారణం దీనిలోని బలంకాక ప్రతిపక్షం బలహీనంగా ఉండడమేననడంలో తొందరపాటేమీ లేదు. ఎలాగంటే ఏయే అంశాల చుట్టూ ఇది గట్టిగా!!? అల్లుకుని ఉందో అందులో ఏ ఒకటికూడా సరైన రీతిలో రుజువు కాబడిలేదు. రుజువు చేయడానికి వీలు లేదు. ప్రమాణ, పదార్థ, విద్యలెరిగి పరీక్షించే నేర్పు కలవారికి దీనిని కొట్టి వేయడం గట్టి పనేమీ కాదు. నిలబెట్టాలనుకునే వారికై తేనో; వారెంత ప్రజ్ఞాశాలురై నా ఇట్టే (ఎట్టాగూ?!) అయ్యే పనికాదు. ప్రతివాది బలహీనతవల్ల నెట్టుకొస్తున్న బలహీన వాదమిది. అధవా వాది బలంవల్ల బ్రతికి ఉన్న బలహీన వాదమిది. అంటే ఏమని? వాది బలం (ప్రజ్ఞ)వల్లనో, ప్రతివాది. బలహీనత వల్ల నో మాత్రమే కొనసాగుతున్న బలహీనవాద మిది. మరో కారణమూ ఉంది ఇది మనగల్గడానికి. సామాన్యజనుల ఆశాభయాల పునాదులపై అదీ అవగాహనా లేమిని ఆధారం చేసుకుని ఉండగల్గుతోంది.

మరొక్క విషయాన్ని చెప్పుకుంటేగాని పూర్వరంగాన్ని అవసరమైనంతా పరికించినట్లవదు. - ఈ కర్మ సిద్ధాంతాన్ని సమాజానికందించిన వారు, సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు విజ్ఞులంగీకరించదగిన రీతిలో లేవనీ, దానికి మూల రూపమైన మనుషుల (కర్తలు అనే అనొచ్చు) పనులూ, వాటి వల్ల ఉత్పత్తిచెందే ఫలరూపాలూ, వాటి భోగం విషయంలో ఏర్పడుతున్న అనిశ్చిత, అవాంఛనీయ స్థితి కొనసాగుతూనే ఉన్నాయని సుస్పష్టంగా గ్రహించే ఉన్నారు. అలా ఉండగూడదని, మార్పు అవసరమనీ సహృదయులైన వారివరకైనా కోరుచున్నారు. కర్మలనూ, ఫలభోగాన్ని జన్మ జన్మాంత రాలకు ముడి పెట్టడాన్ని సహృదయంతో .మంచిగానూ అర్థం చేసుకోవచ్చు. పనికివచ్చే రీతిగా అన్వయమూ చెప్పవచ్చు. అలాగే స్వార్థ ప్రయోజనానికి వినియోగించుకోనూవచ్చు. ఇక్కడ ఒక చేదు నిజమేమంటే కర్మసిద్ధాంతం చరిత్రలో స్వార్థ ప్రయోజనాలకై అమాయకులు ఎదురుతిరక్కుండా చేయడానికే ఎక్కువ వినియోగపడింది. ఈ నాడూ పడుతోంది. 

ఈ సిద్ధాంత పరిశీలనలో ఆద్యంతం గుర్తుంచుకోవలసిన అంశాలు రెండున్నాయి. ఈ రెండంశాలూ కర్మసిద్ధాంతం తప్పనేవారూ, ఒప్పుఅనేవారూ కూడా గుర్తించినవే.

1) ప్రతి పనికీ అవశ్యంగా, అనివార్యంగా ఆ పనికి తగిన ఫలితం పుడుతుంది.

2) అనుభవాన్ని బట్టి చూస్తే : కర్తకే (ఆ పని చేసినవానికి) - ఆ పని నుండి జనించిన ఫలం అందుతూనే ఉంది అన్నింటా అనడం కుదరడంలేదు. కొన్ని విషయాలో లభిస్తోంది, కొన్ని విషయాల్లో లభించడం లేదు.

ఈ మౌలికమూ, కీలకమూవైన అంశాలనాధారంగా చేసుకునే ఒక పక్షంవారు ఇక్కడి వ్యవస్థ మారాలని కోరుకొని యత్నిస్తుండగా, మరోపక్షం కర్తకే ఫలం దక్కాలనడాన్ని అంగీకరిస్తూనే ఫలం ఏనాటికైనా అందక తప్పదు అంటూ ఫలప్రాప్తికి కాలాన్ని పొడిగించుకున్నారు.

ఫలం కర్తకే లభించాలనడంలో రెండు పక్షాల్లోనూ ఏకాభిప్రాయమే ఉంది. ఒకనాడు యీ ఫలభోగ సమయాన్ని కాలాంతరానికి వారెందుకు పొడిగించాలో గాని ఈ నాడు మాత్రం ఆ భావం అంగీకరించ దగ్గదీకాదు; ఆచరించ దగ్గదీకాదు. మన అనుభవంలోనూ, అన్యాయాన్ని ఎదుర్కొని పోరాడడంద్వారా మాత్రమే హక్కులు పొందడం జరిగిందన్నదో చారిత్రక వాస్తవంగా తేలింది. పోతే ఈ ఎదుర్కోవడం అన్న దానిలో అవాంఛనీయతేమైనా ప్రవేశిస్తే దానికి కారణాలు వెతకి అవి తొలగించుకోవాలి గాని వెనుకటి పంథానే అనుసరిస్తూ మరింత అన్యాయానికి తోడుపడడం వివేక వంతం కాదు. 

కర్మ సిద్ధాంతంలో చోటుచేసుకునే ప్రధానాంశాలు

ఈ సిద్ధాంతాన్ని అంగీకరించే వారిలో మత భేదాలున్నా అందరూ పేర్కొనే పదార్థాలు కొన్ని ఉన్నాయి. జీవుడు - ఈశ్వరుడు, ప్రకృతి, జన్మ, కర్మ, సాధన, ముక్తి, ఫలము, ఫలభోగము, ఫలోత్పత్తి క్రమము, ఫలప్రాప్తి క్రమము, కర్త, స్వతంత్రత, పరతంత్రత, జ్ఞానము, ఇచ్ఛ, స్వేచ్ఛ అన్నవే అవి.

ఈ పదాలను ప్రయోగించకుండా కర్మసిద్ధాంతాన్ని ప్రతిపాదించడమూ కుదరదు. పరిశీలించడమూ కుదరదు. కర్మాధ్యక్షుడు, పాలకుడు, నియామకుడు, చేతనుడు, స్వాధీనుడు, పరాధీనుడు వగైరా మరికొన్ని సందర్భవశాత్తు చోటు చేసుకోవచ్చు.

భాషా రూపంలో మనం ఈ భావజాలాన్ని ప్రకటించడం విచారించడం చేస్తాము కనుక "పద పదార్థ జ్ఞానం లేనివానికి వాక్యార్థ -జ్ఞానం కలుగదు" అన్న భాషా పరమైన సార్వత్రిక నియమాన్ని సదా గుర్తులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది సబబేనంటే ముందుగా భాషాపదాలకు సమానార్థాల్ని రాబట్టు కోవాల్సి ఉంటుంది. - అలా కాకుంటే శబ్దాలు ఒకటే అర్థాలువేరనో, అర్థాలు ఒకటై శబ్దాలు వేరనో అనుకునే పరిస్థితి దాపురిస్తుంది. సత్యనిర్ధారణకు వేదికే లేకుండా పోతుంది..

సుమారు ఒక పాతిక పారిభాషిక పదాలు చోటు చేసుకుని ఉన్న ఈ సిద్ధాంతంలో అత్యంత ప్రధాన పదార్థాలు జీవుడూ, ఈశ్వరుడు - ప్రకృతి, కర్త, కర్మ, ఫలం, ఫలభోగం అన్నవి మాత్రమే. వీటి గురించి కూలంకష విచారణ సాగించడమే అసలు సిసలైన కర్మసిద్ధాంత పరిశీలన అవుతుంది.

ఈ విషయాల్లో మత భేదాలు 

నోట్ :- కర్మసిద్ధాంతా న్నంగీకరించే వారంతా కొంత యుక్తినీ, మరి కొంత గ్రంధ ప్రామాణ్యాన్ని తమ వాదానికాధారాలుగా స్వీకరిస్తారు. అందునా ప్రధాన స్థానాన్ని గ్రంధాని కందిస్తారు. కనుక ముందుగా ఆయా గ్రంధాల అవగాహనను, అందలి మత భేధాల్ని విచారణకు స్వీకరిద్దాం. ఎలాగూ విచారణ రూపంగా విషయాన్ని లోతుగా చూడబోతున్నాం గనుక గుర్తుంచుకోవలసిన మరో విషయాన్ని ప్రస్తావిస్తాను. మానవులముగా మన అనుభవంలోనికి వచ్చే పదార్థాలనన్నింటినీ కొన్ని రాశులుగా వర్గీకరించుకోవచ్చు. అవగాహనా స్పష్టత కొరకూ, సౌలభ్యత కొరకు . అలా విడగొట్టు కోవాలి కూడా. దానినే 'పదార్థ వర్గీకరణ' అంటాము. అనుభవాల్ని క్షుణ్ణంగా పరికించినవారు ఎవరి కోణంలో వారు పదార్థ వర్గీకరణ చేసుకున్న అవన్నీ ద్రవ్య గుణ, క్రియా, సంబంధాలు అన్న నాల్గింటిలో చేరతాయి. (మండలి దృష్టి నుండి వస్తువని మరో వర్గాన్ని చేర్చుకోవాలి. ప్రస్తుతానికి దాన్నలా ఉంచుదాం) అంటే మనకు తెలియబడేవన్ని పై నాలుగు రాశుల్లో చేరిపోతాయన్నమాట. ఇది గుర్తుంచుకుంటేనే పక్ష ప్రతిపక్షాలు రెండూ చర్చను సజావుగా సాగించగలుగుతాయి. ఈ అంశం గుర్తుంచుకోండి. అదెలానో క్రింది విశ్లేషణలో గమనిద్దురుగాని.

జీవుడు : దీనిపై ప్రశ్నలు - సమాధానాలు 

1) ఇది ఏ పదార్ధము? సమా:- ద్రవ్యము.

Note:- ద్రవ్యమనగానే దానికి స్థలకాల సంబంధాల్ని గురించి అడగాలి. ఎక్కడుంది, ఎంతుంది? ఎప్పుడుంది? ఎందుకలా అడగాలి? అన్వేషకుడు దానిని గుర్తించాలన్నా, అది ఉందో లేదో తేల్చుకోవాలన్నా ఈ వివరాలు అవసరమవుతాయి కనుక. " అవి తేలాక దాని గుణా లేమిటి? క్రియలేమిటి అన్న మరో రెండు ప్రశ్నలున్నాయి.

2) జీవుడు. నిత్యుడు - అంటే ఎప్పుడూ ఉంటాడు, అనాద్యనంతుడు అంటూ కాలపరమైన ప్రశ్నకు సమాధానం చెప్పారు సిద్ధాంత కారులు. ఇక్కడ అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఎందుకంటే జీవుని నిత్యత్వాన్ని అంగీకరించకుంటే కర్మసిద్ధాంత మూలాల్లో ఒకటి లేకుండా పోతుంది. వాడుండి గదా అనుభవించాలి.

3) ఎంతుంది? దాని పరిమాణమెంత? ఈ ప్రశ్నకు అనేక అభిప్రాయాలు సమాధానాలుగా వచ్చాయి.

జీవుని సైజు విషయంలో మత భేదాలు :- 

A) నైయాయికులు - విభువు:- సర్వవస్తు బాహ్యాంతర వర్తమానత్వం  విభుత్వం.  అంతటా అని సామాన్యార్ధము.

B) అణువు  C) అంగుష్ఠమాత్రుడు  D) మధ్యమ పరిమాణము. 

4) ఎక్కడుంది? A) మూలాధారం B) హృదయం C) భ్రూమధ్యం D) నడినెత్తి (సహస్రారం) E) కుడికన్ను, కంఠము, హృదయము F) శరీర మంతటా G) విశ్వమంతటా 

5) ఇక దాని గుణములేమి? Note:- ద్రవ్యమనగానే చేతనమా? జడమా? అనడగాలి. చేతన ద్రవ్యమని సమాధానం (మొన్న చర్చావేదికలో డోంగ్రేగారు ఒకదశలో . జీవుడు జడద్రవ్యమేనన్నారు. గుర్తుంచుకోండి.) జ్ఞానము కలవాడు, జ్ఞానస్వరూపుడు, ఇచ్చా, ప్రయత్నములు కలవాడు. జానాతి, ఇచ్చతి, యతతి అని జీవుని స్వభావ గుణములు.

6) దాని - అతని - క్రియలేమిటి?

అనాది కర్మ సంస్కారవశాత్. ఈశ్వర ప్రేరితుడై కర్తృత్వంతో కర్మ చేస్తూ ఫలాన్ని భోగిస్తుంటాడు. ఈ క్రమం ఒక్క మోక్ష ప్రాప్తి పర్యంతం అనాద్యనంతంగా కొనసాగుతుంటుంది. మరో పక్షం ప్రకారం మోక్షం కూడా ఈ ప్రయాణంలో ఒక దీర్ఘ కాలిక మజిలీ మాత్రమే. క్రమం మళ్ళీ కొనసాగు తూనే ఉంటుందన్నమాట.

ఇక నాల్గవ పదార్ధమైన సంబంధం దగ్గరకొచ్చాము. 

7) జీవునికి ఈశ్వరునికి, జీవునికి-ప్రకృతికి ఉన్న సంబంధమెట్టిది?

A) జీవేశ్వరులకు:- 1) నియామ్య నియామకభావం, 2) భృత్యస్వామి సంబంధం 3) ఆశ్రితాశ్రయ భావసంబంధం 4) పాలక, - పాలిత భావ సంబంధం 5) శరీర శరీరిభావ సంబంధం 6) కర్మఫలభోక్త -ఫలప్రదాతల మధ్య సంబంధం 7) వ్యాప్యవ్యాపక భావసంబంధం అంటూ ఆయా సందర్భాలలో ఏర్పడుతున్న బంధాన్ని బట్టి సంబంధ నిర్ణయాలు చేశారు. 

B) జీవునికి ప్రకృతికి:- 1) భోక్త - భోగ్యము, 2) శరీరి-శరీరము C) ఈశ్వరునికి-ప్రకృతికి:- నియామక నియామ్య భావము.

(Note:- జగత్తుకు ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదాన కారణంగానూ, ప్రకృతి ఉపాదానం కాగా ఈశ్వరుడు నిమిత్తకారణంగానూ చెప్పబడింది.) 

ఈశ్వరుడు - దీనిపై ప్రశ్నలు - సమాధానాలు 

1) ఏ పదార్ధము? చేతన ద్రవ్యము.

2) ఎక్కడుంటాడు? ఎంతుంటాడు? సమా:- అంతటా ఉంటాడు సర్వ వ్యాపకుడు.

3) ఎప్పుడున్నాడు? ఎప్పుడూ ఉంటాడు. అనాద్యనంతుడు. నిత్యుడు.

4) అతని గుణము లేమిటి? సచ్చిదానంద స్వరూపుడు. అసంగుడు, సర్వవ్యాపిగా సర్వసంగుడు.

5) అతని క్రియ లేమిటి? కర్మాధ్యక్షుడు, కర్మఫలప్రదాత, నియామకుడు, సృష్టి స్థితి లయ కారకుడు.

6) జీవునితోనూ, ప్రకృతిలోనూ అతని సంబంధమెట్టిది? సమా:- పైన చెప్పుకున్నాము చూడండి. 

ప్రకృతి :-

1) ఏ పదార్థము :- జడద్రవ్యము.

2) ఎక్కడుంది ? ఎంతుంది ? విశ్వమునందంతటా,  విశ్వముగా (జగత్తుగా)

3) ఎప్పుడుంటుంది? ఎప్పుడూ ఉంటుంది. నిత్యము. అయితే నిరంతరం మారుతూ ఉంటుంది. పరిణామ నిత్యము.

4) దాని గుణములేమి? సత్వ రజస్తమస్సు లంటారు. (నోట్ : అవి గుణములుగా మన, అనుభవంలో లేవు.) . 

5) క్రియలు :- 1) జడానికి క్రియలు స్వయంగా ఉండవు. చేతనునికి ఉపకరణంగా ఉంటుంది. 

2) చేతన సామీప్యంచేత క్రియావంతమై పరిణమిస్తూ ఉంటుంది. 

6) జీవేశ్వరులతో దీనికున్న సంబంధము:- భోగ్యము, భోగసాధనము అన్న రూపాలలో, ఉపాధి రూపంతో. ఇవండీ ప్రధానంగా జీవేశ్వర ప్రకృతుల స్వరూప స్వభావాలుగా చెప్పుకోవలసినవి, చెప్పబడియున్నవి. 

ఈ మూడు ద్రవ్యపదార్థాలలో జీవుడే కర్మసిద్ధాంతంలో కథానాయకుడు. కర్త - భోక్త ఇతడే. ఇక ఈశ్వరుని పాత్ర కర్మాధ్యక్షత, ఫలప్రదాత. కర్మ ఫలప్రదానం విషయంలో భోగ్యంగానూ, భోగ సాధనంగానూ ప్రకృతిని స్వీకరించి కర్త అయిన జీవుని కర్మల కనుగుణ్యంగా ఫలభోగాన్ని అందజేయడంలో నియామక, పాలక, (పోషణ, రక్షణ, శిక్షణ) పాత్ర పోషణ చేస్తుంటాడు. ప్రకృతి భోగ్యం. 

కనుక కథా నాయకుడైన 'జీవుని చుట్టూ అల్లబడిందే కర్మ సిద్ధాంతం. అయితే కర్త ఎవరన్న విషయంలోనూ మత భేధాలున్నై కొన్ని.

1) కర్త ఈశ్వరుడే అని కొన్ని ఉపనిషత్తులన్నాయి. (ఈశ , కేన, కఠ, ప్రశ్న, ఐతరేయ, చాదోగ్య, శ్వేతాశ్వతర, బృహదారణ్య కౌషీతకీ, లలో) దీని కాధారాలు దొరుకుతాయి.

2) .బ్రహ్మ సూత్రాలు, (పరాయత్తాధికరణము) 

3) గీతలో - (13-23) (18-61) . 

4) కర్త-జీవుడే:- ఈశావాస్యం (2) కథ (1-3-4) ప్రశ్న: (4:9) గీత. 

5) కర్త మనస్సే :- ప్రశ్న (3-3);

6) ఇంద్రియాలే కర్తలు :- గీత (5-9) 

7) ప్రకృతి (స్వభావ గుణములే) కర్మారంభకాలు. శ్వేతాశ్వతర (5-12); గీత (3-5); (3-27) (3-28) (13-22).

8) స్వభావము గీత (5-14); (7-20); (13-30) 9) బహుకారణ జనితం - గీత (18-13) (18-14) (18-15).

నోట్ : ఇలా కర్త ఎవరనే విషయంలో అనేక భావాలు ఆస్తిక సాహిత్యంలో ఉన్నాయి.. వీటి నాధారం చేసుకునే శంకరాదులు ఎవరి మతాన్ని వాళ్ళు పోషించుకున్నారు. ఇందులో జీవుడే కర్త అన్న పక్షాన్నంగీకరించ కుంటే కర్మసిద్ధాంతం నిలవదు. అంగీకరించాలంటే ప్రామాణికాలలో, ఏకాభి ప్రాయం లేదు. సమన్వయమూ కుదరదు. మరేమి చేద్దాం, చేయాలి అన్నది, ఇదో సత్య సిద్ధాంతం అన్నవాళ్ళే తేల్చాలి. దీనిని సమాజం నెత్తిన పెట్టిన వాళ్ళే ఆపూచీపడడం, న్యాయం. .

కర్మసిద్ధాంతంలో ప్రధాన భాగం ఈ జన్మకు పూర్వోత్తర జన్మలను అంగీకరించడం. దానిని సాధించడానికి తర్కాన్ని సాధనంగానూ, వేదాది 'గ్రంధాలను ఆధారంగానూ స్వీకరిస్తారు. అందులో వారి తర్క మిలా ఉంది. కర్మకు అవశ్యం ఫలితం ఉంటుంది కదా! అపును. మరి ఆ ఫలం చేసినవానికే దక్కలా లేదా ? దక్కాల్సిందే. ఆ విషయాన్నింగీకరిస్తే ఈ జన్మలో పుట్టుకతోనే కొందరు సుఖులుగానూ, కొందరు దుఃఖితులుగానూ కనపడుతున్నారు కదా? మరి దానికి వారు చేసిన ,కర్మలే కారణం కావాలి గనుక ఈ జన్మకు పూర్వం జీవుని ఉనికిని అంగీకరించక తప్పదు. అలాగే మరణానికి ముందు చేసిన కర్మఫలాన్ని అనుభవించాలంటే " మరణానంతరం అతడుండాలి. లేకుంటే చేయనిదానికి రావడం, చేసిందానికి రాకుండానే పోవడం అన్న " అనియతి చోటు చేసుకొంటుంది. కనుక జనాంతరాల్ని అంగీకరించాలి. ఇదే న్యాయము.

ఇదండీ కర్మ సిద్ధాంతావిర్భావానికి ప్రధానాలంబనమైన యోచనా రీతి. దీనినే వారు పారిభాషికంగా అకృతాభ్యాగమము (చేయందానికి వచ్చుట) కృత ప్రణాశము (చేసిందానికి రాకుండుట) అంటారు. ఈ దోషాలు పోగొట్టాలంటే ఈ జన్మకు పూర్వోత్తరాలను అంగీకరించక తప్పదు.

కర్మే జన్మకు కారణము:- కఠ (2-2-7); ప్రశ్న (3-7); చాందోగ్యం (5-10-7); గీత (9-21).

కర్మఫల భోక్త : జీవుడు-కథ (1-3-1); మైత్రేయ (1-13); ముండక (3-1-1)

ఈశ్వరుడే :- గీత - (13-23)

కర్మఫల ప్రదాత :- ఈశ్వరుడు - కథ (2-2-13); శ్వేతాశ్వతర (6-11); బృహ (4-4-22), (24). 

కర్మనాశము : పరబ్రహ్మ జ్ఞానంవల్ల :- ముండక (3-1-3); (3-2-9); మైత్రేయ (1-6); గీత (1-18).

- అహంభావము లేకపోవడంవల్ల గీత (18-17).

కర్మవల్ల :- కఠ (1-1-17); ముండక (1-2-6); (1-2..10); గీత (2-51)

పాఠక మిత్రులారా ! ఇదండీ విషయం. కొన్ని సంవత్సరాలుగా అధ్యయనం చేసి అనితర సాధ్యమైన రీతిలో . అపూర్వ మనదగిన ఈ వివరాల క్రమాన్ని విజ్ఞ జనులకూ, జిజ్ఞాసువులకు అందించిన గౌరవం సత్యజ్ఞాన సంఘాధ్యక్షులైన పెంచలయ్యగారికే చెందాల్సి ఉంది. వారు క్రమబద్ధీకరించిన విషయానుక్రమణిక అందు ఆయా విషయాల క్రింద ఉట్టంకించిన శ్లోకాల క్రమం ఇందులో మీ ముందుంచాను. స్థలాభావరీత్యా ఆ శ్లోకాలు, మంత్రాల నన్నింటిని ఎత్తి రాయడం కుదరలేదు . రాయకపోవడానికి మరో కారణం ఉంది. జిజ్ఞాసువు First hand knowledge సంపాదించుకోవాలి. అందుకుగాను ఆయా గ్రంధాలను మీకై మీరు ఒక్క తూరన్నా చూసి మేము చెప్పినవి అందున్నవో లేవో నిర్ధారించుకోవాలి. కాకుంటే మీ శ్రమా కాలమూ కలసి రావడానికి గానూ ఆ శ్లోక సంఖ్యను సమాచార రూపంలో అందించాను.

భావసంస్కరణోద్యమంలో పాలుపంచుకొనగోరేవారు ఖండన మండనలకు లోనుచేయ వలసియున్న . భావజాలపు మూలాల్ని ఒక్కతడవైనా స్వయంగా తడిమిచూడడం అత్యంతావశ్యకం.  అలా చేసిననాడే దృఢ చిత్తంతో ఆయా విషయాలపై మన అబిప్రాయాలని సాధికారికంగా ప్రకటించగలం. అందుకే మీరందరూ ఆ స్థాయికి ఎదగాలనుకొన్నందుకే . మీరు శ్రమించవలసిన భాగాన్ని సూచించి వదిలేశాను. మరో కారణమూ ఉంది. త్వరలో "కర్మ సిద్ధాంతము - ఒక తులనాత్మక విశ్లేషణ” అన్న పేరున ఒక చిన్న పొత్తాన్ని వెలువరించనున్నాము. దానిలో ఆధారాలతో సహా విపులీకరించగలము. త్వరలో ఆ రచనను సమాజాని కందించాలని అనుకోవడం జరిగింది. ఔత్సాహికులు, జిజ్ఞాసువులు ఎదురుచూడండి. సర్వేపై ప్రస్తావితాంశము లను ఊత గొని విషయాన్ని సమీక్షిస్తాను. అవధరించండి.

1) జీవుని పరిమాణమును గురించి ఏకాభిప్రాయం లేదు. 

2) అతడుండు స్థలం విషయం లోనూ ఏకాభిప్రాయం లేదు. 

3) అతడు స్వతంత్రుడా? పరతంత్రుడా అన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. 

4) కర్త ఎవరు? భోక్త ఎవరు? అన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. 

5) కర్మకు జన్మ ఆధారమా, జన్మకు కర్మ ఆధారమాం అన్న దానికి సరైన సమాధానమే లేదు. 

6) ఈశ్వరుడు సర్వతంత్ర స్వతంత్రుడా? అయితే చేయనిదానికివ్వడం, చేసినదాని కివ్వకుండడం చేయగలడా అన్న ప్రశ్నకు సమాధానం ఏకోన్ముఖంగా లేదు. .

7) కార్యకారణ సంబంధరీత్యా ఈశ్వరుడు నిమిత్త కారణుడా? ఉపాదాన . కారణుడా? అంటే ఏకాభిప్రాయం లేదు. 

8) మోక్ష సాధనమేమిటి? అన్న ప్రశ్నకూ నిర్వివాదమైన సమాధానం లేదు

9) మోక్షం సిద్ధమా? సాధ్యమా, నిత్యమా? అనిత్యమా? అన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు.

10) ఈశ్వరుడు సగుణుడా? నిర్గుణుడా? రెండూనా? అన్న దానికి ఏకాభిప్రాయం లేదు..

11) సర్వశ క్తివంతుడైన ఈశ్వరుడు నియమిస్తే నడుస్తోందా? స్వభావాన్ననుసరించా అని ప్రకృతిని గురించి అడిగితే అక్కడా ఏకాభిప్రాయం లేదు.

అవన్నీ అలా ఉంచి అసలు జీవేశ్వరులు ప్రకృతికి అత్యంత భిన్నులు అన్నది సత్యమేనని నిర్ధారించడానికి ప్రమాణాంతరం లేదు. శబ్దప్రమాణంగా వీరుటంకించేది ప్రతిజ్ఞ మాత్రమే అవుతుంది. .

జీవుని ఉనికిగానీ, ఈశ్వరుని ఉనికిగానీ సిద్ధించనిదే కర్మసిద్ధాంత వ్యవస్థ కుదరదు. ఇంతా మాటవరస కంగీకరించినా ప్రత్యేకంగా పెంచలయ్యగారి పరిశోధనాజనితమైన "ఈశుడు కర్మఫలాన్ని జీవుల కెలా అందజేస్తున్నాడు” అన్న అత్యంత జఠిలమైన ప్రశ్నకు సమాధానం ఆ సాహిత్యంలో ఎక్కడా దొరకదు. ఇవన్నీ వైదికవాజ్మయంలోని విభేదాలు కాగా,

ఇంతకూ వేదం ప్రమాణమనే ఆయా హైందవ మతస్తులు (హైందవ మంటే మళ్ళా ఇందులో కొందరికి మహామంట) లేదా సనాతనులు ఏ జీవుని ఉనికిని సాధించినట్లు? ఏ మోక్షాన్ని నిర్ధారించినట్లు, కర్త ఎవరుగా తేల్చినట్లు? ఫలప్రాప్తికి వ్యవస్థ ఏదన్నట్లు? అబ్బ. . 

అంతా అనిశ్చిత స్థితే, గందరగోళమే. కానయితే, అంతా కలసి చేసే నినాదం ఒకటే, కర్మసిద్ధాంతం రైటు. రైటంటే రైటే. అదంతే, నమ్మకుంటే నీ ఖర్మే అంటుంటారు. ఏ ఒక్క అంశమూ తేలని దాన్ని పట్టుకుని నీ ఖర్మే ననేవాళ్ళనేమనుకోగలం, అయ్యోపాపం అనుకోవడంకంటే. ఇక వారి ఖర్మే వారిని రక్షించాలి. లేదా వారి న్యాయకారి. ఈశ్వరుడైనా అటు వైదిక సాహిత్యం (వాజ్ఞ్మయం అంటేగాని ఊరుకోరు కొందరు) ప్రకారం మత భేదా లున్నాయి, ఇటు ఆస్తిక సిద్ధాంత ధోరణులుగనున్న శంకరాదుల అద్వైతాదులందూ మత భేదాలున్నాయి. ఇక భారతీయేతరాల విషయం చెప్పక్కరలేదు. ఎవరి గొడవ వాళ్ళు పడుతూ ఈ అంశాలలో సత్యాన్ని వ్యక్తిగతం చేసి పారేసి ఒకరకంగా సత్యాన్ని సమాధి చేసేశారు. సార్వజనీనమూ, సార్వకాలీనమూ అయ్యుండాల్సిన దాన్ని వ్యక్తిగతం చేయడం ద్వారా ఏకదేశీయమూ, అనిత్యమూ చేసేశారు.

ఒక చిన్న సూచన, లేదా పెద్ద హెచ్చరిక:- 'సత్యాన్నాస్తి పరోధర్మః' అన్న సూక్తి సత్యమైనదే నని అంగీకరించితే సత్య స్థాపనమే ధ్యేయంగా, లక్ష్యంగా, సాధ్యంగా, విచారణకు సిద్ధంకండి. వేదిక నిర్వహణ, వ్యయ ప్రయాసలు మావి. కాదంటారా మీ యిష్టమొచ్చిన చోట, మీ యిష్టమొచ్చి నప్పుడు వేదికనేర్పరచండి. మీరంగీకరిస్తున్న, ప్రచారం చేస్తున్న భావాలు కర్మసిద్ధాంతానికి సంబంధించినంత వరకు అనిశ్చితాలు, అనిర్ధారితాలూనని నిర్ధారిస్తాము. ఆపై నా ప్రయాణ మెటో తేల్చండి.

"సాంప్రదాయకులలో నిజాయతీపరులూ, నిష్టావంతులకు. విషయం తెలీకున్నా ఈ సిద్ధాంతాన్ని త్రోసిరాజంటే సమాజంలో అధర్మం పెచ్చరిల్లుతుంది అన్న భయం నిజంగా ఉంది. వారి భయం వెనుకనున్న నిజాయితీని మనం శంకించడంలా. కానీ. ఆ భయకారణం నిజం కాదని మాత్రం చెపుతున్నాము. అందుకు రుజువుగా ఆస్తిక్యాన్నంగీకరించని వారిలో ఎందరో నిజాయితీ పరులనూ, ధార్మికులనూ చూస్తున్నాం. అలానే దేవునిలో జరిగే ఎన్నో అమానుష, స్వార్ధ కర్మకలాపాన్నీ చూస్తున్నాం. ఇంకెక్కడి భయం. ఇప్పుడు భయపెట్టలేని, కనుక అక్కరలేని భావజాలమది.

Note:- మా భావాలుగా వెలువరించిన ప్రతి అంశంపైనా రుజువుకు మేము సిద్ధము. 

 భిన్న ఆ స్తిక ధోరణులకు చెందిన మేధావులారా! మేమేదో చేసేస్తున్నామనీ, ధార్మికతను చంపివేస్తున్నామనీ గగ్గోలెట్టకండి. ఆ పని ఏనాడో పరస్పరం తప్పులు పట్టుకోవడం ద్వారా మీరే చేసేశారు. నేను వాటన్నిటినీ గుదిగుచ్చానంతే. కాదంటే మీరననివి గానీ, మీకందరకూ ఆధార మైన ప్రామాణిక గ్రంధాలలో లేనివిగానీ, అసందర్భాలుగానీ నా రచనలో ఉంటే ఎత్తిచూపండి.  సవినయంగా పొరపాటు సవరించుకుని ఆ విషయాన్ని నలుగురకు తెలియజేస్తాను. లేదంటే అవగాహనా దారుఢ్యంతో కూడిన రుజువు చేయగల సామర్థ్యం ఉందనుకుంటే వేదికకు సిద్ధంకండి. సత్యనిర్ధారణార్ధకమైన ప్రయత్నంలో ఈపాటి కటుత్వం అనివార్యం, అవసరం కూడా. నిజం నిష్ఠురమైందనీ, నిప్పులాంటిదనీ అనడం మనమందరమెరిగిందే కదా. ఇదీ అంతే. విజ్ఞ జనామోద యోగ్యం కాగల నిర్ణయం చేయండి.

ఆస్తికేతరులై కర్మసిద్ధాంత నిరసనోద్యుక్తులైన వారికీ ఒక సూచన చేయవలసి ఉంది. ఏదో అక్కడక్కడా విన్న నాలుగు మాటలు ముక్కున బట్టి దేవుడుంటే చూపు? చూపలేక పోయావు గనుక అట్టిది లేదు లాంటి బండ, మొండి వైఖరితో కాలం వెళ్ళబుచ్చకండి. ఆ పోకడ ఏమాత్రం శాస్త్రీయత లేనిదీ, సహేతుకం కానిదీను. నిజానికి ఒక అంశాన్ని దోషరహితం అనుకునే వాళ్ళకంటే ఆ విషయం దోషయుక్తమేననే వాళ్ళకు మొదటివారి కంటే పిసరంతైనా అధికం తెలిసుండాలి. కనుక ఒకటో రెండో ఖండనరూప ప్రశ్నలు చేతబట్టి వేదిక లెక్కడం విజ్ఞతకాదు. సమర్ధుల ఎదుట అది నిలవనూ లేదు. కనుక భావవిప్లవోద్యమకారుడు అవశ్యం ఆ సిద్ధాంత స్వరూప స్వభావాలనూ, అందలి గుణదోషాలనూ తులనాత్మకంగా ప్రతిపాదించి నిర్ధారించడానికి సరిపడినంత లోతైన అవగాహన కొరకు సునిశితమూ సూక్ష్మమూనైన వివేచనాశక్తితో అధ్యయనం చేయవలసి ఉంటుంది. లేకుంటే ఒకవంక వీరాభిమానమూ, మరోవంక అకారణ ద్వేషమూ చోటు చేసుకుని సత్యాన్ని నొక్కి పెట్టే ప్రమాదముంది. దీనిపై మీమీ విమర్శలను పంపగోర్తాను.

— సత్యాన్వేషణలో మీ సురేంద్ర


“శంకరాచార్య వ్యక్తిత్వం - తత్వం - వెంకటాద్రి" 

V’ఎందుకీ రచన’ XV పేజీలో ఈ నా పరిశీలనలో ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను అన్న రచయిత మాటలని నా ఈ వ్యాస రచనకు ప్రేరకాల్లో ఒకటిగా తీసుకున్నాను. పొరపాట్లు 1) గ్రంథనామం “శంకరాచార్య వ్యక్తిత్వం - తత్వం” అనే పేరెట్టాక గ్రంథంలో ప్రధాన అంశం కథా వస్తువు శంకరుని వ్యక్తిత్వ పరంగాను అతడు సమాజానికి అందించాలనుకున్న తత్వ పరంగాను మాత్రమే ఉండాలి. ఆ రెండు విషయాలనూ అసలు స్పృసించలేదనను గాని తులనాత్మకత లోపించిందని మాత్రం ఘంటాపదంగా చెప్పగలను.  ఆ రచనను అభిమాన వ్యతిరేకతలు విడిచి అతడు చదివిన ఆ విషయం తెల్లమవ్వగలదు. 

 మరో ముఖ్య విషయం ఉంది. వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఏయే అంశాలు పరిగణన లోనికి తీసుకోవాలి, తత్త్వాన్ని విశ్లేషించేందుకు ఏయే అంశాలు అవసరమవుతాయి. అన్నది శాస్త్రీయ దృక్పథంతో నిర్ధారించుకోవాలి. ఆ పని వెంకటాద్రి చేయలేదన్నది. ఒక వాస్తవం. ఆ విషయాన్ని అన్యాప దేశంగా రచయితే తెలుపుకున్నారు. చూడండి.

వెంకటాద్రి "విమర్శకు. ప్రతివిమర్శగా వ్రాయబడ్డ ఈ వ్యాస పరిసమాప్తి పరిమితమైనది. కాబట్టి శంకరుని తత్వాన్ని సాకల్యంగా పరిశీలించడానికి ఈ రచన ఉద్దేశింపబడలేదని చదువరులు గమనించగోర్తాను.

సురే:- మరైతే ఆ పేరెందుకు పెట్టినట్లు? కాల్పనిక కథలో, గిట్టని వారు పట్టుబట్టి ప్రచారంలో పెట్టిన వట్టిమాటలే అవి అని తానే అంటున్న విషయాల్ని సవిరంగా సాగదీస్తూ పుస్తకంలో ఎక్కువ భాగం ఎందుకు నింపినట్లు?

"తన్నెవరో విమర్శించారు గనుక వారిని విమర్శించడానికి సూటైన మాటందుకోక ఈ వంకర బాటేందుకు పట్టినట్లు? గ్రంథానికి "నయా శాంకరుల సంకరవాదులు”లాటి పేరెట్టి నేరుగా పట్టుబట్టే వారినే (తిట్టొచ్చు!?) విమర్శించవచ్చు గదా! చెపుతానన్న దొకటి? చెప్పిందొకటి? అనలేదా.

2. "నయాశాంకరుల వాచాలతకు సమాధానంగా శంకరుని వ్యక్తిత్వాన్ని తత్వాన్ని పరిశీలించక తప్పడం లేదు అని ఆ క్రిందనే "శంకరుడి తత్వాన్ని సాకల్యంగా పరిశీలించడానికే రచన ఉద్దేశింపబడలేదంటాడు."

ఎవరినో, ఎవరో ఎందుకో తిడితే అది తననే, తనవాళ్ళనే తిట్టినట్లు, నిజానికి తనని ఉద్దేశించే తిట్టిన సందర్భాలను . సమాజంలోని మంచి వాళ్ళందరనూ తిట్టినట్లు అర్థాలు చెప్ప బూనడం వెంకటాద్రిలోని ఒకానొక కళ. చూడండి.

3. వెంకటాద్రిని దృష్టిలో పెట్టుకుని గుత్తా రాధాకృష్ణగారు, బ్రహ్మం గారూ కొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. దానికి కావలసిన నేపథ్యం వారి గత సంబంధాల చరిత్రలో ఉంది. దాని కీయన మొత్తం హేతువాదులూ, భౌతికవాదులూ, మానవవాదులూ వెకిలి చేష్టలు చేస్తారని వాళ్ళన్నట్లు అర్థం పుట్టించి ప్రచారం చేశాడు.

 అది తప్పా? కాదా? దీనిని పొరపాటు క్రింద కూడా అనలేము. నిజానికది ఐచ్చికంగా చేసిన తప్పు పనే. కాదంటే తామూ మౌలికంగా భౌతికవాదులము, హేతువాదులమూ మానవవాదులమే నంటున్న పై యిరువురూ ఆ సంఘాలనో, ఆ స్వభావాలనో తృణీకరించినట్లు ఎలా చెప్పుకోగలం. కనీసం ఆ మాటలన్న వారినైనా వివరమడిగి నిర్ధారించుకోవచ్చుగదా? (విన్నమాటకు అర్థాన్ని 'అన్న వాణించే స్వీకరించడం విజ్ఞత.)

నోట్ :- విమర్శ ఘాటుగా ఉండడం తప్పనిసరి అనడాన్ని చాలవరకు అంగీకరించవచ్చు. ఎందుకంటే బండబారిన స్వభావాలుతోనూ, కావాలని తప్పుచేస్తున్న వాళ్ళలోనూ కదలిక రావాలంటే అది తప్పదు.

4. నయా శంకరులూ, అభినయ శంకరుల పేరున ఈయన ఎవరిపై ఎదురుదాడికి పూనుకున్నా నంటున్నారో వాళ్లు కావాలని లోకాన్ని మోసం చేయాలని శంకరుణ్ణి పదార్థవాది, భౌతికవాది, హేతువాది, నాస్తికుడు సర్వ సమతావాది, సాంఘిక విప్లవకారుడు వగైరాలలో కీర్తించారనడంలోని ఔచిత్య మెంత?' మనకూ తెలుసు పై యిద్దరు. వాళ్ళు సమాజాన్ని మోసగించే వృత్తి, ప్రవృత్తి కలిగున్నవారేనా?! తప్పు భావాలుంటే ఉండవచ్చుగాక! వాటిని విమర్శించడానికి వాళ్ళను మోసగాళ్ళను చేయనఖ్ఖర్లేదు కదా? అసలు విషయం ఏమంటే.

సురేంద్ర :- విమర్శించడం వేరు. నిందించడం వేరు. ఈ రెంటినీ కలగా పులగం చేయ కూడదు. అలా జరిగినప్పుడల్లా వైజ్ఞానిక దృక్పథం బలహీన పడ్డట్లే. విమర్శ ప్రతి చోటా అవసరం. సద్విమర్శవల్ల అందరకూ మేలు చేకూరుతుంది. నిందించడానికి తప్పని పరిస్థితులు ఏర్పడాలి. విమర్శిం చేందుకు విషయం ప్రధానం కాగా, నిందకు వ్యక్తి ప్రధానం అవుతాడు చాలా విషయాల్లో. వ్యక్తినీ విమర్శించవచ్చు. మరి నిందించడం అన్నది పరిస్థితి విమర్శా స్థాయిని దాటినప్పుడూ, ఎంతో బలీయమైన రుజువులు. నిందించక తప్పని స్థితిని చూపిస్తున్నప్పుడు మాత్రమే చేయవలసి ఉంటుంది. తప్పక అలాంటి పరిస్థితి ఏర్పడితే నిందించడం తప్పు కాదు గానీ, ప్రతీ నిండకూ ఋజువులు  చూపాల్సిన బాధ్యత నిందించిన వారిపై పూర్తిగా ఉంటుంది. లేకుంటే నిందించినవాడే నిందనీయు డౌతాడు. ఇది అందరికీ సమంగా వర్తించే

నియమమే.

5. N. V. బ్రహ్మంగార్ని ఉద్ధేశిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు వెంకటాద్రి. "కొంతకాలం క్రితం నా నుంచి దూరమై నన్ను సాధించాలనే లక్ష్యంతో మతి చెడగొట్టుకుని, ఒకటికి నాలుగైదు మజిలీలు మారి ఇప్పుడు సురేంద్ర పాదాల క్రింద దూరి నాయన కూడా ఒకరున్నారు.”

సురేంద్ర : దీనిని విషయపరమైన విమర్శ అంటారా, నిందారోపణలే వందనీయాలుగా మది నెంచుకునే పైశాచికానందపు రంధి అనుకోమంటారా? నిజంగా ఒక వ్యక్తి అవగాహనా లోపంతో ఉన్నా అతణ్ణి నిందించక్కరలేదు. భావసంస్కరణకై అతడిలో ఆలోచనలు రేకెత్తించేందుకు యత్నించాలి. నిందించవలసిందల్లా కపట మేధావుల్ని మాత్రమే. అమాయకుల్ని మైత్రితో గానీ, సానుభూతితోగానీ ఆదరించి వారిలో రాదగిన మార్పుకై యత్నించాలి. అదలా ఉంచండి ఈ రోజో రేపో ఈయనగానీ, (నిజాన్ని ఒప్పుకుంటానని ఒకచోట అనున్నాడు గనుక) ఈయన సహచరుల్లో ఎవరుగానీ జరిగిన పొరపాటును గుర్తించుకుని నాతో మైత్రికి సిద్ధపడితే అది అతని (వారి) మానసిక ఔన్నత్యాన్నీ, నిజాయితీని తెలుపుతుందా? కుసంస్కారాన్ని చూపుతుందా? నాతో మైత్రికి (అదీ నన్ను దగ్గరగా పరిశీలించుట ద్వారా?!) ఇష్ట పడ్డ వాళ్ళనూ, వారికి తెలీనికొన్ని విషయాలు నా వద్ద నున్నట్లు గ్రహించి వాటిని తెలుసుకోడానికి వయో భేదాన్ని ఆవలబెట్టి నిజమైన జిజ్ఞాసతో నాతో సన్నిహితంగా మెలగుతున్నవారిని మతిచెడిన వాళ్ళనీ, పాదాల క్రింద దూరుతున్నారనీ, మాయలఫకీరు ప్రాణం ఏ చిలకలో ఉందో కనిపెట్ట బోతున్నారనీ, పెద్దాచిన్నా భేదం మరచి, మంచి చెడూ విచక్షణను విడచి ఆబోతు వ్యవహరమే గాక, వదరుబోతు తనాన్నీ ప్రదర్శించడంచూస్తే ఈయన ఏ రకం మనిషో, ఏ స్థాయి సంస్కారో తెలియడం లేదా?

అందర్నీ మందలిస్తా నంటాడు. ఈయనకేమైన కొమ్ములు మెలిచాయా. నిజంగా అంతటి మొనగాడై ఉంటే ఈతడు అకారణంగా నిందించిన వాళ్ళందరితో ఒక వేదిక నేర్పాటు చేస్తాను. నిజంగా గదిలో కూచుని తనను గురించి ఊహించుకుంటున్నంత సత్తాయే గనక ఉంటే వారి వారి విషయంలో ఈయన వెలిబుచ్చిన అభిప్రాయాలనూ ప్రవర్తించిన వైఖరినీ సమర్ధించు కుంటూ తన సత్తా ఏమిటో రుజువుపరచుకోవచ్చు గదా. ఇంతగ నిగ్గదీస్తుంటే విషయం అర్థం కావడంలేదా? లేక ఇదీ రబ్బరు భాషలా అనిపించి మంచి మంచి. అర్ధాలు సాగదీసు కుంటున్నారా?

వీరి అసలు విషయం అసలు లేదననుగానీ, వెకిలితనమూ, నకిలీతనమూ ఉన్నంతగా మాత్రం లేదని నొక్కి చెప్పగలను. 180 పేజీల రచనలో శాస్త్రీయ పంథాకు వ్యతిరిక్తం కానీ, హేతుత్వ పరీక్షకు నిలబడే స్థాయిగల అంశాలు ఏ పది పేజీల్లోనో ఉంటుంది. మిగిలిన 170 పేజీల రాతా, కోతల రూపమో, తెగవేతల రూపమో, అహేతుకమో, అసందర్భమో, అసభ్య, అశ్లీలాత్మకమో ఐవుంది.

ఏదో సందర్భంలో ఈ రచన వెనుక రెండు సం॥ల అధ్యయన రూప శ్రమ ఉందన్నట్లు గుర్తు. భావ విప్లవోద్యమకారుల కాలానికి, శ్రమకూ ఉన్న విలువ గుర్తించగలిగితే ఈ రచన ద్వారా ఆయన పెట్టిన పసలేని నసంతా నిరర్థకమే. పైగా దురర్థక రూపమై కొందరు యోచనాపరుల్ని దూరం చేసుకొనేందుకు కారకమైందది.

నోట్ :- ఆయనగారి విరస జనిత నీరస నిగమనాల్ని ఎంచి పై సంచికలో కొన్నైనా మీ ముందుంచుతాను. అందుకీ సంచికలో స్థలాభావం ఉంది.

కళా శాస్త్ర వివాద విషయమై

సూర్యకుమారిగారి పునస్పందన - సురేంద్ర ప్రతిస్పందన

గౌరవనీయులు సురేంద్ర గారికి; 'వివేక పథమూ', ప్రసాద్ గారి ఉత్తరమూ అందాయి. ఒక విధంగా ప్రయత్నించి చాలవరకు మరచిపోయిన విషయాలన్నీ మళ్ళీ పైకి వచ్చాయి. కళలు రస దృష్టి అనే విషయాలపై హేతువాదంలో నేను రాయడం అనుకోకుండా జరిగిన పని.

హేతువాదిలో లక్ష్మిగారి వ్యాసం వచ్చిన సమయంలో వెంకటాద్రి గారు హైదరాబాదు వచ్చి మాయింటికీ వచ్చారు. ఆ విషయమై ఆయనకు నా భావాలు వెళ్ళడించినప్పుడు - వాటిని రాసి పత్రికకు పంపమని ఆయనే చెప్పారు. ఆయన మాపట్ల చాల వాత్సల్యం కలవారని అప్పటి వరకూ నమ్మి ఉన్నందువల్ల నన్ను ప్రోత్సహించి వ్యాసరచన చేయించాలనే అలా అన్నారనుకుని వ్యాసం రాసి పంపాను. నేను చాలా తెలిసిన దాన్నని గానీ రసదృష్టిని సాకల్యంగా అవగాహన చేసుకున్నాననీ గాక, ఆ విషయం పది మంది దృష్టిలోకి తీసుకురావాలనే ఆ వ్యాసం రాశాను.

దాన్ని విమర్శిస్తూ ఆయన రాసిన ఉత్తరం కాపీ మీకు పంపిస్తున్నాను. దాన్లోని ఆయన భావాలతో నేను ఏకీభవించకుండా సమాధానం రాశాను. అవన్నీ గుర్తులేవుగానీ నేను సైన్సును వ్యతిరేకిస్తున్నట్లు అర్థం చేసికోవడం సరికాదనే రాశాను.

దానిపై ఆయన నన్ను మళ్ళీరాసేట్టు ప్రోత్సహించడానికే తాను విమర్శిస్తూ రాశాననీ, నన్ను మళ్ళీ రాయమనీ రాశారు. నేను వేరొక వ్యాసం రాసి పంపాను. కళలకు సంబంధించి నేనొక ప్రాథమికస్థాయి విద్యార్థిని కావడంవల్ల నేనా వ్యాసంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మహామనీషుల అభిప్రాయాలను ఉదహరించాను. 'సహేంద్ర తక్ష కాయని....' పాపం వాళ్ళు కూడా బహుశా ప్రపంచంలో మరెక్కడా ఎదుర్కొని ఉండని నిందలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మాట చదివి, ప్రపంచంలో ఎవరూ చేయని పనిని చేసినవాణ్ణి నేనే అని గర్విస్తారేమో తెలియదు గానీ, కళా-శాస్త్రం వ్యాసానికి ఆయన మూడు వ్యాసాల సమాధానం - నా మనస్సులో ఆలోచించ గల వ్యక్తిగావున్న ఆయన గురించిన భావం మాత్రం పూర్తిగా మాయమైంది. నేను చాలా గొప్పవాణ్ణి, .నా పుస్తకాల్లో అన్నీ ఉన్నాయని ఎవరికి వారే చెప్పుకుంటే ఏమంత బాగుంటుంది. "జ్ఞానే మౌనం, క్షమా శక్తి" అనేది గొప్ప నిజంగా నేను నమ్ముతాను. పాపం! నా ఉత్తరాల్లో, వ్యాసంలో కనబడ్డ కారణంగా వెంకటాది పాలబడి పెద్దలెందరో జ్వరపీడితులు కాబడ్డారు. కొట్టని దెబ్బకి ఎదురు దెబ్బ కొట్టడమే వారి ఆదర్శం మరి!

ఒక సందర్భంలో బ్రహ్మంగారు A. G. K. ను విమర్శించారని ప్రస్తావిస్తూ - బ్రహ్మం ఎత్తి చూపించేటంత చిన్నమనిషి కాదు ఎ. జి. కె. అన్నారు వెంకటాద్రిగారు, వ్యక్తుల మధ్య అంతరాలను అంతగా చూడగలిగిన వెంకటాద్రిగారికి విల్ డ్యూరాంగ్ కీ తనకూ, టాల్ స్టాయ్ కీ తనకూ హక్సలేకీ మధ్యనున్న అంతకంటె వందల రెట్ల అంతరం అర్థం కాలేదెందుకనో.

ఇక ఆయన వాడిన భాష ఎవరికి అమర్యాదకరమో మా యిద్దరినీ ఎరిగి ఉన్న వాళ్ళకు అర్థం అవుతుంది. అయినా ఆ మాసపత్రికలూ చాల రోజులు నా కంట పడనివ్వలేదు స్వామిగారు. అది చదివితే నా మనస్సు పాడవుతుందని. ఆ తరువాత ఉండబట్టలేక మెల్లమెల్లగా తనే కొన్ని కొన్ని నా విషయాలు పైకి చదువుతూ వచ్చారు.

ఢీ! అనుకోక ఏం చేస్తాం! ఎందుకింత దూకుడుగా రాశారని ఒకరాయన్నడిగితే 'నన్నంటే నేనూరుకుంటానా!’ అని ఎదురడిగారట. ప్రతి విషయాన్ని తనకే వ్యక్తిగతంగా అన్వయించుకుంటే దానికి అర్థం ఏముంటుంది?

వివేకపథంలో మీరు నా వ్యాసం నుండి ఉదహరించిన విషయాలన్ని చూసి మీరు నా వ్యాసంలోని విషయాన్ని క్లుప్తంగా చెప్పిన తీరు- స్పష్టంగా నా అభిప్రాయాల ననుసరించే ఉంది. నా వ్యాసంలో ఉద్వేగమూ ఉండే ఉంటుంది. అయినా, నేను వీటిని ఈ తీరుగా చెప్పి వుండాల్సింది కాదని యిప్పటికీ అనిపించడంలేదు.

జీవితానికి సంబంధించిన ఒక ప్రధానాంశం పై ఎంతో ఉన్నత స్థాయిలో సాగుతుందని ఆశించిన చర్చ కొనసాగకుండా చేసినందువల్ల వ్యక్తిగతంగా నాకేం నష్టం కాదు. హేతువాద, మానవ వాద ఉద్యమాలే ఆ మేరకు నష్ట పోయాయి. కళా, సాహిత్య రూపాలపట్ల హేతువాదుల, మానవవాదుల వైఖరి ఏవిధంగా ఉండాలో, మానవ జీవితంలో సౌందర్యదృష్టి ఉన్నా, ఉండాల్సిన విలువ ఏపాటిదో మానవునిలో సృజనాత్మక ప్రతిభ ఎన్ని రూపాలలో వ్యక్త మవుతోందో విజ్ఞులు చర్చలో పాల్గొనడం ద్వారా అసభ్యకరంగా తిట్టడం, తిట్టుకోవడం ద్వారా కాదు చర్చించడానికి వీలయ్యేది.

రసదృష్టి సర్వస్వమా; అది ఉన్నవాళ్ళంతా సంస్కారులా అంటే; ఏదీ అదొక్కటే సర్వస్వం కాదుగానీ; దేని స్థానం, ప్రభావం జీవితంపై ఎంత ఉంది- అని చర్చించడానికి అడ్డు పెట్టడం మాత్రం ఉన్నత సంస్కారం కాదు. "తననెవ్వరూ విమర్శించనిరోజు తనకు నిస్సారంగా ఉంటుందంటాడు రాయ్”.

అటువంటి రాయ్ మహోన్నత వారసత్వాన్ని అందుకున్న వాళ్ళు ప్రవర్తించవలసిన తీరు ఏమిటనేది నా ప్రశ్న. మరొక్కసారి ఆలోచించుకునే పాటి సౌజన్యం కూడా లేకుండా అప్పటికీ, యిప్పటికీ అదే సరయిన దారి అనుకునేవాళ్ళు వాళ్ళ అనుయాయులకు చూపించే దారి ఎటువంటిది?

ఉత్తరం అంటూ ప్రారంభించి వ్యాసం తయారు చేసిందేమిటా? అనుకుంటున్నారా మీరు?

ఆ వ్యాసాల తరువాత నా వ్యక్తిత్వానికి ఏదో లోపం జరిగిందని అనుకోకపోయినా ఉన్నత సంస్కారుల సంఘంగా ఉండవలసిన మానవవాద ఉద్యమం అలా లేదేమో అనుకోవాల్సి వచ్చింది. అది మరీ బాధ కలిగించింది. అదే ఈ ప్రోద్బలంతో బయటపడింది. చాలా రోజుల తరువాత నా భావాలను వ్యక్తపరచే అవకాశం వచ్చింది. అందుకే ఉత్తరం పెద్దదయింది.

సురేంద్ర ప్రతిస్పందన :- సూర్యకుమారి గార్కి, లేఖ పెద్దదయినా అవసరమైన మేరకే విషయ ప్రస్తావన జరిగింది. పాయింట్ల వారీగా ప్రతిస్పందిస్తాను. వెంకటాద్రి, పాఠకులూ, మీరూ పరిశీలించండి.

1) ఈ వ్యాస సారాంశంగా నేను వెలిబుచ్చిన భావాలు మీరు చెప్పదలచుకున్న అంశాలను స్పష్టంగా చెప్పినట్లు మీరంగీకరించడం అంటే వక్త హృదయాన్ని యధాతథం గ్రహించామని నిర్ధారించుకోవడ మన్నమాట. అటుపై ఆ అభిప్రాయాన్ని దోషాదోషాలు చూడాలే గాని విమర్శకుడు తా యిష్టమొచ్చిన అర్ధాన్ని గుంజరాదు. అది వక్రభాష్యం అవుతుంది. మరి ఆ పని అద్రి చేశాడు. పైగా నాలో వక్రీకరణ, చలవాదమూ, వంచనా శిల్పం ఉందన్నాడు. నిజానికి ఆ మూడూ అతనిలోని (సు & దు)గుణాలే. వెంకటాద్రిలో ఒక కళ ఎంతో ఎదిగి ఉంది. తనలోని అవలక్షణాల్నే యితరుల పేర్ల యితరుల్లో ఉన్నట్లు ప్రకటించుకోవడం అని లోగడే నేను వ్రాశాను. దానికి మీరూ, నేనూ, మరి కొందరూ ఉదాహరణలుగా గతం నుండి రుజువులు చూపించవచ్చు.

2) 1-1-93 మేలుకొలుపులో "సంక్రాంతి-విప్లవ-సందేశం" అన్న వ్యాసం రాస్తే దాన్లో మోసగాళ్ళ గురించి, ముసుగు మనుషుల్ని గురించి, వీరాభిమానులు. అకారణ ద్వేషం  పెంచుకున్న ఆస్తిక - ఆస్తికేతర సంఘాలలోని సామాజిక అభ్యుదయ వ్యతిరేకుల్ని జనరల్ గా ప్రస్తావిస్తే ఆ తిట్లన్ని తననే తిట్టినట్లు ప్రకటించుకున్నాడు. పైగా నాస్తికోద్యమం, సోషలిస్టు ఉద్యమం, హేతువాద ఉద్యమం, నవ్యమానవవాద ఉద్యమం, వగైరాలన్నీ తానొక్కడే అయినట్లు పెద్ద ఫోజొకటి. నిజానికానాటికి ఒకనాటి మీలానే ఆయన యందొక తప్పుడు అభిప్రాయం పెట్టుకుని ఉన్నాను. సమాజహిత కాంక్షనీ, సహృదయుడైన మేధావి అనీ, సంస్కర్త అనిన్నూ.... క్రమంగా సాన్నిహిత్యం ఏర్పడే కొద్దీ పెద్ద పొరపాటే జరిగిందన్న ఒప్పు ఒద్దికగా బుద్ధికెదురైంది.

3) అతడొక పెడర్థాల పెద్ద....?. ఆత్మన్యూనతా భావపు పునాది నుండి ఆధిక్యతా ప్రదర్శనా కాంక్ష పెడత్రోవల బట్టగా; ఎవరో ఎందుకో ఉమ్మినా, చీదినా పనిమాల అడ్డు వెళ్ళి నన్ను చూసే ఉమ్మేవు, నా పైనే చీదావనే నైజం కార్యరూపంలో ప్రకటమవుతోంది. సామాజిక సంబంధాల పరంగా , అతని గతాన్ని తిరగేస్తే ఎదురయ్యే వాస్తవాల్లో ఇదెంతో ప్రధానమైంది.

ప్రక్కమీంచి లేచిన కాడ్నుంచి మళ్ళా పండేదాకా వాళ్ళే మనుకుంటున్నారు. వీళ్ళే మనుకుంటున్నారు. నన్నే అనుకుంటున్నారు. ఆడిపోసుకుంటున్నారు అనుకుంటూ - బొడ్డుకు సున్నం రాసుకుని అపవాఖ్యానాలు, విపరీతార్థాలు తాను మృతభాష లనుకుంటుండే వాటి నుండి రాబట్టే సందర్భ శుద్ధీ, డొక్క శుద్ధీ లేకుండా తెగబడి ద్వేషాగ్నితో తాను రగులుతూ ఇతరుల్ని రగిలించే బండ హృదయాలకు, సున్నిత స్వభావుల తట్టుకోలేని సుతిమెత్తని సంస్కారాల గురించి ఎంత చెప్పినా, మొత్తుకున్న తలకెక్కవు.

నిజానికి ఎందరో సామాన్యుల కంటే స్థాయిలో హేతువాదీ, మానవ వాదీ కాని, ఆయన . వ్యక్తిగత పోకడలతో ఆ రెంటి ముసుగులో నిర్హేతుక, అమానుష వైఖరికి అద్దం పట్టేదే. కనుక అది ఉంటేగాని హేతు, మానవ వాదులకు భద్రత ఉండదనే భ్రాంతి నుండి ఆ రెండు సంఘాలు ఎంత త్వరగా మేలుకొంటే అంత మంచిది. మిగిలిన హేతు, మానవ వాదుల విషయం ఏమోగానీ అద్రి, అతని అనుచర గణము మాత్రం భావ విప్లవోద్దేశ రీత్యా దాని ఆశయాలు-ఆచరణలతో సరిపోల్చి చూ స్తే మాత్రం ఉద్యమానికి వాళ్ళు ఆ ముఠా-చేసిన మంచికంటే చెడుగే ఎక్కువన్నదో నిక్కవం, ప్రబలమన్నదీ నిర్వివాదం. వంటరి బ్రతుకు వాళ్ళది. అలా ఎందుకైంది? విపరీతమైన ఆధిక్యతా భావమువల్ల తెలియసిందాంట్లోనైనా పెద్దగా తెలియకనే అంతా తెలిసినోళ్ళమూ, అది వివరించడంలో రాటు దేరినోళ్ళమూ , అనుకొంటూ ఇతరుల్ని గేలిచేస్తూ క్రియా శూన్యులై, వాగాడంబర మాత్రులై విపరీత కరణి నడయాడుతుండే వాళ్ళకు ఇప్పటివరకు అనుభవంలో ఎదురుపడని రీతిని చేదునిజాల్ని రుచి చూపించాల్సిన బాధ్యత నిజాయితీ, తపన కల హేతు, మానవ వాదులందరిపైనా ఉంది.

చాలా అంశాల్లో హేతువాదీ మానవవాదీ కాని అతడూ, అతని భజంత్రీలు ఎన్నో అంశాల్లో హేతుబద్ధంగా ఆలోచించగల, మానవికంగా ప్రవర్తించగల ఎందరి హృదయాల్నో మొరటుగా, బండగా గాయపరిచారు. మానవీయ సుగుణాలు కనీస స్థాయిలోనన్నా కదలాడుతుంటే గదా పశ్చాత్తాప పడడానికైనా, బడిత రోగానికి బాదుడు వైద్యమే సరైందన్నట్లు ఇష్టం లేకున్నా, వివేకం ఆగమంటున్నా తప్పనిసరి పరిస్థితిలో సమాజంలో ముసుగు మనుషుల గుట్టురట్టు చేయించాల్సిన అవసరాన్ని కాదనలేక, కాదనుకోలేక మేమీ బహిరంగ రగడకు దిగాము. మాలాటీ - వెంకటాద్రి అతని ముఠా బారినపడ్డ మరికొందరి బాధితుల వ్యధా భరిత హృదయాలను సమాజం ముందుంచి వాళ్ళు ముసుగు మనుషులేకాని ఆ సంఘీయులు కాదన్న నిజాన్ని వెళ్ళడించడం భావ విప్లవాకాంక్షిగా నామీదకూడా ఉన్న బాధ్యతే.

నిజానికి తనని అనాలా, అతడు మంచిదంటున్న సంఘాన్ని అనాలా. అయినా తననీ, ఆ సంఘాలనూ తిట్టాడంటూ ప్రచారం మొదలెట్టాడు. కాదనీ పొరబడ్డారని వివరణ యిచ్చాకైనా వాగింది చాలని మూసుకుని కూర్చుండాలి. సంస్కారమంటే పొరబడ్డందుకు చింతిస్తున్నట్లు వివరణ - సవరణ రూపంగా యిచ్చుకోవలసింది. మోసగాళ్ళను తెగడుతుంటే మిమ్మల్ని అంటున్నాడు చూడండి అంటూ ఆ సంఘాలవాళ్ళని రెచ్చగొట్టడం ఎంత నైచ్యం. అంతటి కుసంస్కారంతో కుళ్ళిపోతూన్న హృదయం నుండి మాటల్లోకీ, రాతల్లోకీ గబ్బుకాక మరేటి వస్తుంది.

వాళ్ళని హేతువాదులు, మానవవాదులు అనుకోవడంలో జరిగిన పొరపాటును మనం సవరించు కోవాల్సిందే గాని ఆ ముసుగుల్లో అది కానివారు ప్రేలే వాచాలతకు బాధపడ నక్కర లేదు.

ఇప్పటికి సంవత్సరం పై నుండి నువ్వు ఆరోపించిన అంశాలు నిరూపించమనీ హేతు, మానన వాదాల(?) పై గానీ, తాత్విక సంబంధమైన మరే విషయాల పైగానీ బహిరంగ చర్చకు రండని పిలుస్తూనే ఉన్నా ఆ ముఠాను. ఈ మధ్య నాయకుడికీ ఆహ్వానం పంపాను.

వెంకటాద్రిలోని మరో పెద్ద జబ్బేంటంటే తన ప్రతి అపసవ్య విమర్శా రచనలోనూ ముందే ఆ విషయం తగినంతగా నాకు తెలీదు అని రాసుకుంటాడు. అన్నీ తెలిసినోళ్ళా తప్పుడు నిర్ణయాలు చేస్తుంటాడు. దాన్ని భావ విప్లవం అంటాడు. అదేమిటంటే భావ విప్లవాన్నే ఎదుర్కొంటున్నా వంటాడు. మాట్లాడితే అదిగో తిడుతున్నాడు అంటాడు, మౌనంగా వుంటే కూలబడ్డాడు, చివరిదశ కొచ్చేశాడు అంటూ ప్రగల్భిస్తుంటాడు. 

అది సరే! నేను నిన్నన్న లేదు బాబూ అని అరచి చెపుతుంటేనూ, నన్నే అన్నావు నన్నే అన్నా వని నానాయాగీ చేస్తా డీయ నేమి పెద్దమనిషండీ! ఆ పోకడలో చ్ఛల కపటాలు తప్ప హేతుబుద్ధేదండి. మరింక సంస్కారమన్నది ఎక్కడి మాట.

Note:- 21-6-84 న సూర్యకుమారి గార్కి వ్రాసిన లేఖలో ఏ ముఖాన ఉన్నడోగాని కొన్ని నిష్ఠుర సత్యాల్ని ప్రవచించాడు వెంకటాద్రి. ఆ తరువాత అతని పోకడకు దీనికీ ఎక్కడా పొంతన లేకపోయింది.

1) సైన్సు చదివిన వాళ్ళంతా శాస్త్రజ్ఞులు కాలేరు. 2) హేతువాదాన్ని చెప్పే వాళ్ళంతా హేతువాదులు కారు. 3) నీతిశాస్త్రం చెప్పేవారంతా నీతి మంతులు కారు.

సాహిత్యం ఆకాశ వస్తువు కాదు. అలానే కళలు అన్నీ కూడా. ఏది సాహిత్యం ? ఏవి కళలు? అనేది అలా ఉంచండి. దేనిని గురించి మనం అర్థం చేసుకుంటామో దానిని గురించిన కళలు, సాహిత్యం సృష్టిస్తుంటాము. వాటికి పునాది అర్ధ జ్ఞానమే అంటే ప్రకృతిని అర్థం చేసుకున్న దాని ఫలితమే. ఆ అర్థం చేసుకోవడాన్నే మనం సైన్సు అంటాము. మనం అర్ధం చేసుకున్న దాన్ని సాహిత్యం ద్వారా, కళలద్వారా మీరన్నట్లు Powerful గా చెప్పవచ్చు కానీ Powerful గా జ్ఞానాన్ని గానీ, అజ్ఞానాన్నిగానీ చెప్పవచ్చు. సాహిత్యానికీ, కళలకు వస్తువు జ్ఞానమైనప్పుడు జ్ఞానాభివృద్ధికీ, వస్తువు అజ్ఞానమైనపుడు అజ్ఞానాభివృద్ధికి Powerful గా పని చేస్తాయని దీనినిబట్టి తేలుతుంది.

అన్యాయంపట్ల స్పందనను గురించి మీరు వ్రాశారు. స్పందనకు మూలం సంస్కారం. ఎవరి సంస్కార మెలా ఉంటే వారు అలా స్పందిస్తారు. ఈ సంస్కారాన్ని తీర్చిదిద్దేది సంప్రదాయం. సంప్రదాయాన్ని సైతం విచక్షణతో చూడమనేది నా దృక్పథం. అలా చూడ లేకపోతే ఏ విజ్ఞానమూ స్పందన కల్పించదు. ఇవండీ ఆ లేఖలో వెంకటాద్రి వెలిబుచ్చిన కొన్ని అతి విలువైన, అందరూ అంగీకరించ దగిన, అంగీకరించక తప్పని ఒప్పు భావాలు. వీటినే కొలమానులుగా పెట్టుకుని వారిపట్ల వారిపట్ల అతడు ప్రవర్తించిన స్పందనల వైఖరుల్ని పరికిస్తే ఆయనే అన్నట్లు ఆయన సంస్కారం ఏ రకానికి చెందిందో తేలిపోతోంది. అలాగే హేతువాదం చెప్పేవాళ్ళంతా హేతువాదులు కాదన్నదే మనమూ చెపుతోంది. చెపుతానన్న విషయానికీ, చెప్పిన విషయానికీ పొంతనలేని చింతనలో ఉన్న అహేతుకత పాలెంతటారు? .

కళ గురించి మరొక్కమాట

ఏమ్మా! వెంకటాద్రిగానీ, మరో శేషాద్రిగానీ కళను అంగీకరించనంత మాత్రాన ఏమవుతుంది? ఆ రకంవాళ్ళు కాదంటే 'కళ' తన స్థానాన్ని కోల్పోద్దా? ఒకవేళ గతిచెడో, గమనింపు పెరిగో 'కళ' పాత్రను వాళ్ళు మళ్ళీ అంగీకరించారనుకోండి! అంతమాత్రాన కళేమన్నా ఉద్దరింపబడ్డట్టా! రాగద్వేషాలతో రగిలే ఎంతటివాళ్ళ మాటకై నా ఇసుమంతై నా విలువుండదు సత్యాసత్యాల విషయంలో. ఇక ఇలాటి (తగినంత అధ్యయనం నాకు లేదని తానే చెప్పుకున్నా, కళాభిజ్ఞులైన సంజీవదేవ్ లాంటి వారిచే అంగీకరించబడని) మిడిమిడి జ్ఞానానంద లెన్నన్న నేమి జీవితంలో ఆనంద స్థానానికి సాధనభూతమైన, జీవ స్వభావంలో భాగంగా ఏర్పడివున్న రసదృష్టిని మనిషి నుండి ఎలా తీసివేయ గలరు? ఎవరో ఒకరు అసాధారణ మానసిక స్థితిలో ఆ స్వభావ జన్యగుణాన్ని అణచి పెట్టకుంటే పెట్టుకోవచ్చు గాక! ఆ మేరకు జీవితపు ఆ భాగాన్ని కోల్పోతాడు ఆ వ్యక్తి. అంతమాత్రమే గాని, మానవ జీవితంలో కళాత్మకత, రసాస్వాదన భాగాన్ని పోనాడడం ఎవరితరం.

మరొక నిజం చెప్పనా! కళను తాననుకున్న రూపంలో అణచి పెట్టాననుకున్నాడే గాని అద్రి, అది భద్రంగా అతనిలో రౌద్ర రసంగానూ, వంచనా శిల్పంగానూ, ఆధిక్యతా ప్రదర్శన రూపం లోనూ వ్యంగ్యోక్తుల రూపంలోనూ, అతిగా - శృతిమించి ప్రకటమవుతూనే వచ్చింది. దాని ఉనికిని పోగొట్టడం ఎవరితరం. కాకుంటే రూపాలు మార్చుకుంటూ ఉండనే ఉంటుందది.. అంతే.

సూచన :- ఇప్పటికై నా వెంకటాద్రి తావెలిబుచ్చిన అభిప్రాయాలు ఆ విద్యలో విజ్ఞులైన వారి పరిశీలనకిచ్చి చర్చకు సిద్ధం కావడమో! అలా వద్దనుకున్నప్పుడు ఆ తప్పుడు వాటినే పట్టుకుని బల్లలుగుద్దే పని వద్దనుకుని బుద్ధిగా మానుకోవడమో చేస్తే కనీసం కొంతమేరకైనా అతనిలో హేతుబుద్ది, శాస్త్రీయ దృక్పధం ఇంకా మిగిలే ఉన్నాయనుకోడానికి వీలవుతుంది. ఏమంటావు. పెద్దాయనా దేనికో దానికి రెడీనా!


No comments:

Post a Comment