Saturday, January 21, 2023

5 వివేకపథం

 


వివేకపథం

సంపుటి : 1                              డిసెంబర్ 1996                                      సంచిక : 5


ఒక ముఖ్యసవరణ


పాఠక మిత్రులారా !

వెంకటాద్రికి నాకూ మధ్య ఒక అవాంఛనీయమైన పరిస్థితి ఏర్పడి కొనసాగుతున్నట్లు మీ అందరకూ తెలుసు. డిసెంబర్, జనవరి సంచికల ద్వారా దానికో ముగింపు ఇవ్వనున్నట్లు సన్నిహితులందరకూ తెలుసు. అందుకై డిశంబరు సంచికను 'స్పందన-ప్రతిస్పందన'కు ప్రత్యేకిస్తున్నట్లూ, మీ మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు నన్నట్లూ అందరకూ తెలిపాను.

ప్రధానంగా వెంకటాద్రి పోకడవల్ల ఎందరు మానసికంగా గాయపడ్డా రన్నదీ, ఏ ఉద్యమకారునికీ ఆ వైఖరి సరికాదన్నదీ ఆయనకూ, అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో, బాధించడ మెంతగా బాధిస్తుందో తెలుసుకోడానికి బలంగా పనికొచ్చే ఆయన వైఖరినే ఆయనకు ఎత్తిచూపించడమన్న విధానాన్ని ఎంచుకున్నాను. నిజానికాయనదే అయిన ఆ పొడిచే విధానం డిశంబరు (ఈ) సంచికలో పరాకాష్ఠకు చేరుకుని ఆ పై ముగియవలసివుంది క్రమాన్ననుసరించి.

ఇంతలో ఇంగితాన్ని మేల్కొల్పే ఒక కబురందింది. వెంకటాద్రికి ఆరోగ్యం బాగుండడంలేదనీ, ఈ దశలో మీ విమర్శలు ఆయనపట్ల హితులు కోరదగిన ఫలితాల్ని పుట్టించలేవనీ - కనుక మీరే ఆలోచించి ఒక వివేకవంతమైన నిర్ణయం చేయండనీ, నిజానికి ఆయనకు నాకు మిత్రులైన వారి నుండీ, విషయం కొరకు మాత్రమే పత్రిక చదివే జిజ్ఞాసువుల నుండీ, ఆయన అభిమానులనుండీ, నా కనుకూలురైన వారి నుండీ కూడా ఈ విమర్శల భాగం పత్రికకు వన్నె తెచ్చేది కాదు ఆలోచించండంటూ సూచనలు అందుతూనే ఉన్నాయి.

అయినా! ఆరంభించాక సరైన ముగింపు వచ్చేదాకా కొనసాగించడం ఉచితం అన్న వైఖరి నుండి వాటినన్నిటినీ ఒక ప్రక్కనుంచి స్థిరచిత్తంతో నిర్దిష్ట లక్ష్యంతో కూడిన గమ్యంవైపు గమనం సాగిస్తూనే వచ్చాను.

1. నాపట్లా మరి అనేకులపట్ల అతడు నిర్వర్తించిన అనుచితపాత్ర, అందువల్ల బాధితుల హృదయాలకైన గాయము, వారు పడిన మానసిక క్షోభ, తద్వారా ఈయనకూ - ఈయన కార్యక్రమాలకూ దూరం కావడమన్న ప్రతిచర్య ద్వారా ఉద్యమానికి జరిగిన అన్యాయము మొదలైనవి, ఆయనా ఆయన సన్నిహితులూ గ్రహించేట్లు చేయాలన్నదే నా ఈ పోకడ వెనుకనున్న ప్రధానాశయము. 

ఎందరి పట్లో ఎంతో హింసాత్మకంగా ప్రవర్తించిన ఈయనను ఏనాడూ ఎవరూ అదేమిటని మందలించడంగానీ, ఎందుకీ వైఖరి అని నిరోధించడం గానీ జరిగిన దాఖలాలు మనకందలేదు. (రహస్యంగా ఎవరైనా విజ్ఞులు సూచనలిస్తే యిచ్చి ఉండవచ్చునేమో) అట్టిది: ఆయన పంథానే ఎంచుకుని, ఆయనపైనే తిరిగి నేను - ప్రయోగించేటప్పటికి వారి మిత్రులైతే గగ్గోలు పెట్టేశారు. ఆయన హితులైతే రకరకాలుగా ముఖ్యంగా, భయపెట్టీ, బ్రతిమిలాడీ నన్నాపడానికి పెద్దగానే యత్నిస్తూ వచ్చారు. ఆశ్చర్యమేమిటంటే తామంతా గతంలో ఎందరి ఎడో ఇదే వైఖరి నవలంబించామన్న విషయాన్ని పట్టించుకోకపోవడం. నిజానికి ఆ ఒక్క విషయం వారు గమనించాలేగాని, వారి ఎడల ఎలాంటి వ్యతిరేక భావమూ లేకుండా, పరస్పరం సఖ్యతగా ఉండడానికి నావైపునుండి ఈషణ్మాత్రమూ అభ్యంతరం నాడూ ఉండేదికాదు. ఈనాడు, ఏనాడులేదు, ఉండదుకూడా. నావరకు నాకు, ఇప్పటికైనా వారు భావ విప్లవోద్యమ కార్యక్షేత్రంలో అందరం చేయి చేయి కలిపినడుద్దాం అన్న ఆకాంక్షను వ్యక్తపరిస్తే, నిజంగా సిద్ధపడితే సర్వాంగీకారం సంసిద్ధుడనై ఉండడానికి నాకు ఎట్టి అభ్యంతరంలేదు. అది నాకు సంతోషదాయకమైన పర్యవసానం కూడా.

డిశంబర్ సంచిక దాదాపు (ముందుగానే అందిద్దామనుకుని) పూర్తి చేసేశాను నవంబర్ 15, 16 తేదీల నాటికే. బాపట్ల సమావేశంలో ముందుగానే మిత్రులందరకూ (అందులో నవ్య మానవవాదులూ ఉన్నారు) వినిపించి అనవసరాలుంటే తొలగించడం, మరికొన్ని అవసరమైతే చేర్చడం చేద్దామనుకుని మొదలెట్టబోయే తరుణంలో ఆయన బారిన పడ్డాయనా, ఆయన శ్రేయోభిలాషి కూడా అయిన ఒకరు పై కబురు నా చెవినేశారు. నన్ను సముదాయించి, ఒప్పించి విరమింప జేయాలన్న ఆశయంతో సామరస్య ధోరణిలో ఏదేదో చెప్పబోయారు. ఒకే ఒక్కమాట చెప్పాను వారికి. ఈ రభస నా వైపు నుండి ఆపుతున్నాను. వివరణలూ, నచ్చజెప్పడాలతో పనేమీలేదులెండి, వారి ఆరోగ్యం కంటే మా స్పర్ధలూ, ఆవేశాలు చల్లార్చుకోవడాలూ, బలహీనతలు బైట పెట్టుకోడాలూ విలువైనవని నేననుకోడంలేదు. నిజానికి ఇప్పటికి ఏర్పడి ఉన్న పరిస్థితుల్లో (చివరిలో) మానుకోవడం కొందరి విమర్శలకు లోనయ్యేదే అయినా, వాటన్నిటినీ ప్రక్కనబెట్టి ఏకపక్షంగా ఈ విషయాన్ని ముగిస్తున్నాను. ఈ నా నిర్ణయంపై వారూ, వారి హితులూ, సన్నిహితులూ, మా ఇరువురికీ తెలిసినవారూ ఉచితంగానే స్పందిస్తారనీ, వారి అరోగ్యం విషయంలో జరగ కూడనిది జరగకుండా ఉండడానికి నావంతు మూల్యం నేను చెల్లించానన్నదీ, బాధ్యతాయుతంగా (వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఆపుకునే) వివేక పథంలోనే కదిలానన్నది వారూ మీరూ గమనించగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను.  ఆవేశాణ్ణనుచుకుని, అవాంఛనీయతకు అడ్డుకట్టగా నే పెట్టిన ఈ గట్టుకు అనాలోచితంగా మరోచోట గండి పెట్టవద్దని వారినీ, వారి మిత్రులనూ, అందరినీ అభ్యర్థిస్తూ ఆయన ఆరోగ్యం కుదుటపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

విజ్ఞప్తి

డిశంబర్ సంచికకై ఇష్టంతో ఎదురుచూసే ఆయన పాలబడ్డ వ్యధిత హృదయాలకు:- మానవికమైన ఆవేశకావేశాలు మనందరిలోనూ సహజం. ఒక్కోసారి ఒక్కొక్కరి నుండి అనవసరపు పోకడ ఆరంభం కావచ్చు. ఆపవలసిన, ఆపుకోవలసిన పరిస్థితులెదురైనపుడు గతాన్నొకింత ప్రక్కన పెట్టి వర్తమానపు అవసరానికి ఎక్కువ విలువివ్వడం ఉచితం కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం మనందరకూ కోరదగిందే కనుక వ్యక్తి గతంగా మనకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని ఓర్చుకోవడం విజ్ఞత. ఆ మేరకు అట్టి సంయమనాన్ని కలిగివుండి ఈ నా ఏకపక్ష నిర్ణయాన్ని సందర్భోచిత మైనదిగానే పరిగణించి వివేకంతో స్వీకరిస్తారని, హర్షిస్తారని ఆశిస్తున్నాను.

ఎన్నింటిని ఎన్ని విధాలుగా సవరించుకున్నా, సరిపెట్టుకున్నా ఒక్క విషయంలో ఎవరమూ రాజీపడరాదన్నది మిక్కిలి నిక్కవము. అదేమంటే... 

సమాజంలో ఎప్పుడూ తత్వ విచారణ 'విశ్లేషణ - చర్చ - పరీక్ష - రుజువు' లతో; కొనసాగిస్తూనే ఉండడం అత్యంతావశ్యకము. కనుక వెంకటాద్రిగారికి, మరి ఇతరేతర ధోరణులకు చెందిన పరిచయస్తులకూ, మిత్రులకూ, కూడా నేను ఆహ్వాన పూర్వకంగా చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే. రండి సుహృద్భావ వాతావరణంలో మన మన అవగాహనలను అందరి ఎదుట పెట్టుకుని పరిశీలించుకుందాం. సరైన వాటన్నిటినీ గుదిగుచ్చుకుని జీవితంలోకి తెచ్చుకుందాం. సమాజాని కందించే బాధ్యతనూ పుచ్చుకుందాం. మరో వంక అవి ఎవరివిగానుండి వీగి పోయిన - సరికాని - భావాలను జీవితాన్నుండి తీసివేసికుందాం. సమాజం వాటిపాల బడకుండా యధాశక్తి నిరోధిద్దాం. తాత్విక పరంగా ఇదొక్కటే శాస్త్రీయ విధానం

ప్రత్యేకాహ్వానము:- నవ్యమానవ వాదులకూ, భారత హేతువాద సంఘానికి ముఖ్యంగా యిది వర్తిస్తుంది. రేపు జనవరిలో జరుగవలసి వున్న మార్క్సిస్టు సిద్ధాంత ప్రధాన భాగమైన గతితార్కికతపై చర్చలో బాధ్యతతో మీరూ పాలు పంచుకోండి.

ఆపై - తత్వ చర్చకు (1997 ఏప్రియల్లో జరిగేది) నవ్యమానవ వాద తత్వ విచారణ చేద్దామని మీరు సిద్ధపడితే రంగాన్ని సిద్దపరుస్తాము. ప్రతిపాదకులుగ మీరుంటే పృచ్ఛకులుగ భిన్న భిన్న సంఘాల మేధావుల నాహ్వానిస్తాము. ఏ విషయమూ అలోచించి స్పందనద్వారా కబురందించండి.. ఉంటాను. సెలవు.

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర 


అద్వైత సిద్ధాంతము - ఒక పరిశీలన " - 6


జిజ్ఞాసు మిత్రులారా! పొంతనలేకుండా మాట్లాడుతున్నవారిని చూసి "ఏమిటయ్యా అద్వైతం మాట్లాడుతున్నావు" అనడం లోకవాడుకగా మారిందంటే ఈ సిద్ధాంతం వినడానికి ఎంత గందరగోళంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఏది అనుభవంలో మనమందరం ఉన్నదానినిగా గ్రహిస్తున్నామో దానిని మనతోపాటు ఉన్నదానినిగానే అంగీకరించడంతో ప్రారంభించి తనదైన శైలిలో విచారణను మనముందుంచుతూ ఉన్నదనుకున్న దానిని ఉండక్కరలేనిదానినిగా; లేనిదానినిగా చూపించి ఊకొట్టించడం అంటే మాటలామరి. అలాగే ఏనాడూ మనకనుభవంలోనికి రానిదానిని అసలున్న దానినిగా స్థాపించబూనడం, మననికాదని అనలేని స్థితికి తెచ్చి ఆపుజేయడం మరో ముఖం ఈ సిద్ధాంతానికి. అలా అంతా అయోమయంగామారి అవునన్నదే కాదనీ, కానని దానిని ఉన్నదనీ అనిపించడం అనడం ఉందే అదే అద్వైతంలోని గందరగోళానికి మూలం.

Note :- అద్వైతంపై నేను సాగిస్తున్న పరిశీలనలను పరిశీలిస్తున్న ఒక మేధావి 'ప్రక్రియ'లని మీరుటంకించిన వాటిని శంకరుడు నేరుగా ఎక్కడన్నా పేర్కొన్నాడా? అన్న ప్రశ్నను లేవదీశారు. మంచి ప్రశ్నే.

నా సమాధానం :- శంకరుని ప్రధాన రచనలుగా అందరూ అంగీకరిస్తున్న (???) ప్రస్థానత్రయ భాష్యాలు, ఉపదేశ సాహత్రిలలో ఈ ప్రక్రియలద్వారా నేను సిద్ధాంత స్థాపన చేస్తున్నాను అని అనలేదుగానీ, తదనంతరం భాష్యార్థ కోవిదు లందరూ శంకరుని ఎత్తుగడలను కూలంకషంగా పరిశీలించాక అతని ప్రధాన తర్కపద్ధతైన ‘అధ్యారోప అపవాద న్యాయం’ ద్వారా అతడు ఉదహరించిన దృష్టాంతాలనుబట్టి అట్టి నిర్ణయం చేశారు. ఈనాడు అద్వైత విదులలో ఈ ప్రక్రియా విశేషాలను గురించి ఎట్టి వివాదమూ లేదు. ఆధారాలు చూపిస్తాను. మీరూ చూడండి.

1. మాండూక్యము - దాని కారికలు:- ఈ ఉపనిషత్తంతా 'ఓం'కార వివరణం పేరున మనం నిత్యం అనుభవిస్తున్న మూడవస్థలను ప్రధానంగా తీసుకుని (జాగ్రత్తా, స్వప్నము, సుషుప్తి, అన్నవే మూడవస్థలు.) వాటిని గమనిస్తున్న, తెలుసుకుంటున్న వాడిని అవస్థాత్రయసాక్షి అని చెప్పి; నాలుగవస్థితి ఉందనీ, అది తురీయమనీ నిజానికి అవస్థకాకున్నా మూడూ కానిది, కనుక నాలుగవది అంటున్నారనీ బోధిస్తారు, అద్వైతాలకు ఇది ప్రధానమైన ప్రబలమైన ఆధారంగా ఉంటుంది.

తదనంతరం అద్వైతజ్ఞులు ఈ మొత్తాన్ని గురించే అవస్థాత్రయసాక్షి, విచారణ ప్రక్రియ అన్నారు,

2. కార్యకారణ ప్రక్రియ:- అద్వైతాల ప్రకారం మాయాశబలిత చైతన్యమైన ఈశ్వరుడు (బ్రహ్మ) జగత్తుకంతటికీ అభిన్న నిమిత్తోపాదాన కారణుడు. దీనికి ఉదాహరణగా ఊర్ణనాభి (సాలెపురుగు)ను చూపుతారు. దీనిని శంకరుడూ ప్రమాణంగా ఉదహరించాడు. వేదంతో చెప్పబడ్డటిదీ, ఉపనిషత్తులూ అచ్చటచ్చటా పేర్కొన్నట్టి విహిత కర్మకాండలు, విధినిషేధ కర్మల ప్రస్తావన వగైరాలను త్రోసిరాజంటే వ్యవహారమే నడువదు గనుకనూ, వేదంలో కొంత ప్రమాణమూ, కొంత అప్రమాణమూనా? అన్న ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది గనుకనూ అవిద్యా లేక అద్యాస విషయంగానే సృష్టినీ, సృష్టికి ఉపాదాన నిమిత్త కారణాలనూ అంగీకరిస్తాడు మాట మాత్రంగా. అతని వాదం ప్రధానంగా నలుగురూ అవునంటున్న స్థానాన్ని మాటవరసకు అలానే అనుకుందాం అనేమాదిరి అంగీకరించి అదెలా నిలవదో నిర్ధారించడమేకదా! కనుక ఆరోపిత విషయంగా సృష్టిని - జీవేశ్వరులనూ అంగీకరించి దానిని అపవాదంగాచూపి పారమార్ధికంగా సృష్టే జరగలేదు పొమ్మంటాడు. స్వభావతః అజాతవాదం అద్వైతులది. కార్యోత్పత్తే అబద్ధం అని దానర్థం, ఇక కారణ సంబంధం గానీ, వ్యవహారంగానీ ఎక్కడ. అజాత వాదాన్ని సిద్ధాంతం చేయాలంటే అపవాదంగా చూపడానికి సమాజం అనుభవంలో వున్న దనుకుంటున్న ఒక అంశాన్ని స్వీకరించాలిగదా. అందుకు అతనికి అందుబాటులో ఉన్నదీ, వేదంలో ప్రస్తావించబడినదీ అయిన సృష్టివాదం కార్యకారణ వ్యవహారానికి సంబంధించినదే. 1) యదోర్ణనాభిః సృజతే..., 2) తదైక్షత బహుస్యాం... 3) వాచారంభణం వికారో నామదేయం.... 4) యతోవా యిమాని భూతాని జాయంతే.... 5) ఆత్మానః ఆకాశ సంభూతా....  వగైరాలను ఎత్తిచూపుతూ కార్యాకారణ ప్రక్రియను నలుగురితో బాటు అంగీకరించి, దానిని అపవాదంగా చూపడానికి 1) నిర్వికారో నిరంజనః, 2) అలక్షణ, మగ్రాహ్యం, .... ప్రపంచోపశమం, శివమద్వైతం.... (3) ననిరోధోనచోత్పత్తి....  వగైరా ఉపపత్తులను ఎత్తిచూపుతూ సజాతీయ, విజాతీయ స్వగతభేద శూన్యం బ్రహ్మ అంటూ కార్యాకారణ బద్ధమైన సృష్టి - సృష్టికర్త - నిమిత్త, ఉపాదాన కారణరూప అనాది పదార్ధము ఇదంతా వ్యవహారిక సత్తా విషయమేనంటూ ప్రవచిస్తాడు. అంటే నిజానికి నిజాలు కావనడమన్నమాట.

3) దృక్ దృశ్య వివేకప్రక్రియ:- దీనికి ప్రాతిపదికలు అతడి అద్యాస భాష్యం లోనే గోచరిస్తాయి. చూచేవాడు చూడబడేదీ అత్యంత విలక్షణ పదార్థాలంటూ అతడు పేర్కొనే ఈ అంశం దాదాపు ఆస్తికులంతా అంగీకరించిందే. ఆస్తికేతరులు కూడా చాలమటుకు దీనితో విభేదించరు అట్టి సర్వానుభవసిద్ధ విషయంగా దీనిని చెప్పి ఈ శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి అన్నది నేనుకాదు. ఇవన్ని నాకు దృశ్య విషయాలు నేను వాటికి ద్రష్టను అన్న అంశాన్ని నిగ్గదీస్తాడు. ఈపోకడకు కొనసాగింపే ఈనాడు-స్వాములూ, వేదాంత ప్రచారకులూ తరచుగా సభలలో నా కాలు అంటున్నాం కనుక -కాలు వేరు నేను వేరు ఎలా నా ఇల్లు అన్నప్పుడు ఇల్లు నేనూ వేరో అలా అంటూ అదోగొప్ప లాజిక్కనుకుంటూ తమకంటే తక్కువ తెలిసిన వారి ముందు ఎక్కువలు పోతుంటారు. అద్వైతజ్ఞులం అన్న భ్రాంతిలో ఉన్న ఈ తరహా తరహా పండితమ్మన్యులకు అసలు శంకరుడు ఇదంతా అజ్ఞానమే - భ్రాంతేను అనడానికే ఈ అంశాన్నెత్తుకున్నాడన్న అసలు ద్రష్ట దృశ్యము అన్నవి రెండూ, వాస్తవాన్ని చూడగలిగితే ఉండవని, భ్రాంతి సములుగా మాత్రమే వాటి వునికి అనీ విభ్రాంతిని కలుగజేస్తాడు.

Note :- ద్రష్ట దృశ్యము అన్న రెండుగా ఉన్నా ఈ విభజన ఒక దానిపై మరొకటి ఆధారపడి ఉంది. అంటే దృశ్యం లేకుంటే ద్రష్ట ఉనికిని గాని ద్రష్ట నంగీకరించక దృశ్యాన్ని ఉందనడం కానీ అసాధ్యము. కనుక ఈ వాదంలోని దేనినంగీకరించినా అద్వైతం తప్పై కూచుంటుంది. ఈ రెంటితో కలసి అంతర్లీనంగా మూడో అంశం ముడిపడింది. అది దృష్టి - చూపు అన్నదే. ఈ అంశాన్ని ప్రకరణాంతరాల్లో చాలమంది సంప్రదాయకులు అందరూ అనైనా అనుకో వచ్చు అంగీకరించారు. ‘త్రిపుటి’ అని దాని ప్రసిద్ధ నామం.  1) ద్రష్ట - దృష్టి - దృశ్యము, 2) ప్రమాత - ప్రమాణము - ప్రమేయము, 3) జ్ఞాత - జ్ఞానసాధనము- జ్ఞేయము లాంటి పదాలచే పై అర్థమే వ్య క్తికరించారువారు. త్రిపుటి రహితం కానిదే తత్వం అవగాహనకాదు అన్న వాడుకా ఒకటుంది లోకంలో - ఈ మాట తెలిసి అన్నారో, విని అనడం అలవాటుగా సాంక్రమికంగా వచ్చి అంటున్నారో పరీక్షించాలి. అది మరో ప్రకరణం అవుతుంది. కనుక దాని సంగతి మరోసారి. ఏదేమైనా ఈ వాదం ద్వైత ప్రతిపాదక సమర్థమే కాని, నిజానికి అద్వైతాన్ని నిలబెట్టలేదు. ఈ సంగతి ఆధునిక అద్వైతులకు ఎంతవరకు తెలుసో మనకు తెలియదుగానీ, శంకరునికి మాత్రం బాగానే తెలుసు. కనుకనే తన అధ్యారోప అపవాద న్యాయ పద్ధతిలో ఈ వాదాన్ని ఆరోపితాంశంగానూ, అపవాదంగానూ స్వీకరించి పూర్వపక్షం క్రింద తేలుస్తాడు.

శంకరుని వాద ప్రక్రియలోని వైచిత్రి, అసాధారణత, ఏమంటే ప్రతిజ్ఞా రూపంలో దేనిని ఆరంభంలో వాద ప్రతివాదులిరువురూ అంగీకరిస్తారో ముఖ్యంగా ప్రతివాది అభీష్టమో దానిని అవునంటూ ఆరంభించి కుదరడం లేదెలా? అంటూ ముగించడం. సరే నాల్గవ ప్రక్రియను కూడా అనుకుంటే అతని తార్కిక పోకడలోని ప్రధానభాగాన్ని విచారించినట్లవుతుంది.

పంచకోశ విచారణ ప్రక్రియ:- కోశము అంటే సంచి లేక వర అని అర్థము. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనందమయములన్నవి. ఈ ఐదు కోశముల పేర్లు.                                                     (సశేషం)

“స్పందన - ప్రతిస్పందన”

స్పందన ; 1) అనంతపురం నుండి జయరామిరెడ్డి (సుజరే) గారిలా రాస్తున్నారు. లేఖ సుదీర్ఘంగా ఉండడంవల్ల సారభూత విషయాలు పొందుపరుస్తున్నాను.

1) అమాయక సమాజాన్ని మోసగిస్తున్న అమాయకులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని అభ్యుదయా కాంక్షులైన మిత్ర సంఘాలను సంఘటిత పరచి సమైక్య వేదిక నేర్పాటు చేయడం గురించి ప్రశ్నించారు.

2) హైద్రాబాదులో జి. వీరన్నగారు: వెంకటాద్రి ఆగి ఎనిమిది నెలలు కావస్తున్నా వీరెందుకు ఏదో ఒక రూపంలో ఆయనను యిలాంటి అనుచితమైన రాతలు పాఠకులకు శృతికంఠ కాలే.

3) "రావిపూడి వెంకటాద్రి - ఒక విశ్లేషణ" "P. S. R. గారి విషయం” "వెంకటాద్రికో బహిరంగలేఖ" అనే శీర్షికల క్రింద వివేకపథంలోని రాతల వల్ల మీరు పొందే ఆనందం లబ్ది ఏమిటి? ఈ తరహా పోకడ ఒకరకమైన ఫోబియా అన్నా పొరపాటుకాదు.

4) వెంకటాద్రిపై మీరు పదే పదే రాసేరాతలన్నీ చర్విత చర్వణం గానే ఉన్నాయి. క్రొత్తదనం ఏమీలేదు.

5) ఇంతదూరం ఈ అవాంతర సంఘటనలకు తావివ్వరాదు. పాఠక లోకానికి అసౌకర్యం కలిగించరాదు. పాఠకలోకం హర్షించాలంటే మీరు సర్దుకపోక తప్పదు.

6) B. S. రాములు రాసిన "పుస్తకాల పురుగులు - వాలి విద్యలు” అన్న వ్యాసాన్ని ప్రచురించమని మీకు, వెంకటాద్రి గారికి, రాధాకృష్ణగారికి పంపారు. ప్రచురించేలా సిఫారసు చేయమని నాకో లేఖ రాశాడు. ప్రచురణ ఖర్చులు తానే భరిస్తానని గుత్తావారిని బ్రతిమలాడారుకూడా. గుత్తాగారు దానిని ప్రచురించుటకు సాహసించలేదు. మీరు మాత్రం రావిపూడి Hurt చేస్తూ - Shunt తున్నారు. మీరు Freelance writer, కాబట్టి మీ కలానికి బలం ఉంది. అతడు కూడా ఫ్రీలాన్సు రైటరే. అందుకే అంబేడ్కరిజం పై చర్చలకు కొంతమందిని రాకుండా చేశాడు. ఇదొక సైకిక్ ఫోబియా.

7) గుత్తా రాధాకృష్ణను పొగిడితేచాలు ఉబ్బిపోతూ మేను నేనులను మరచిపోతారు. ఇదొక Special Character.

8) రావిపూడి గారికీ, వారి బృందానికి మీపై సదాభిప్రాయం లేదు. వాళ్ళు మిమ్ము ప్రచ్ఛన్న హిందువనీ భావిస్తూ ఉంటే ప్రతిసారీ మీరు వాళ్ళను చర్చకు రండని వాళ్ళ పేళ్ళను సాగదీస్తూ పత్రికలలో రాస్తుండడంలోని ఔచిత్యమేమిటి? అలా రాస్తుంటే మీ పాఠకులకేమైనా గిలిగింతలు పెట్టి నట్లుంటుం దనుకున్నారా? లేక ఇది మీకలవాటుగా మారిందా?

9) మీరు గతంలో (2/96) మేలుకొలుపుద్వారా కొన్ని సూక్తులు ప్రకటించారు. మీ సూక్తులూ, బోధనలూ ఎండమావులే. మీలో సంయమనం నశించినట్లే.

10) వెంకటాద్రిగారు 3/96 నుంచి మీ ప్రసక్తే హేతువాదిలో రాయడం లేదు. అయితే మీరు పాఠకులకు అక్కరలేని అంశాలనే రాస్తూ మీ నిజాయితీని పరీక్షకు పెట్టారు. అంటే ఉక్కిరిబిక్కిరి కానక్కరలేదు.

11) "ఒకటే నియమంతో ప్రయాణిస్తున్న వాణ్ణి నేను. రాగద్వేషాలు విడచి మంచెక్కడున్నా స్వీకరించడం, చెడును విసర్జించడం అన్నదొక్కటే నాకున్న మార్గదర్శక సూత్రం" అని చెప్పుకుని, మరోవంక రాగద్వేషాలను పెంచుకుని వెంకటాద్రిని ఏకుతున్నారేగాని, మీరనుకున్న మార్గదర్శక సూత్రానికి గొప్ప విఘాతంతో కూడిన విపత్తు వాటిల్లింది. మీ నియమానికి తిలోదకాలిస్తారు.

12) సమాజంలో సరైన మార్పుకై మీ కంట్రిబ్యూషన్ కనబడడం తక్కువ: Contradiction ఎక్కువగా ఉంది. గతాన్ని మీరు తవ్వుతున్నారే గాని పునరాలోచన మచ్చుకైనా కానరావడంలేదు.

13) "వ్యక్తిగతమైన అంశాలపై విమర్శలూ, ఆవేశకావేషాలు అనవసరం" అన్న మీరు ఆ స్టేట్మెంటును పూర్తిగా విస్మరించారు. ఆచరణ చాలా అరుదైన ప్రొడక్టు, పై స్టేట్మెంట్ కు మీరు బద్ధులుగా లేరు. దానిని పూర్తిగా ఉల్లంఘించారు. మీరు కాదంటే అత్మవంచనే. 

14 ) సరైన జ్ఞానం ఉన్నవాళ్ళెవరైనా నా రాతలు సరిగానే ఉన్నాయంటారే గాని పొరపాటు రాతలని చెప్పలేరు. అలా చెప్పుటకు సాహసించిన వాళ్ళు Hypocrites యేగానీ Realists కాదు. 


15) సత్యాన్వేషణ మండలి బానర్ క్రింద మీరు నిర్వహించే సదస్సులు సఫలం కావడంలేదు. చర్చలో పాల్గొన్నవారు అరకొర జ్ఞానంతోనే చర్చలు జరపడం జరుగుతోంది. పృచ్ఛకులలో గుత్తా రాధాకృష్ణ లాటివాళ్ళు నోరు తెరచి ఒక్కవాక్యం కూడా మాట్లాడలేదు. ఇకపోతే స్టేజీమీద ఆయస, ప్రయాస, ప్రసూతి జాలలన్నీ కూడా మీ ఒక్కరివే. కనుక వీటన్నిటినీ, అధిగమించి సదస్సులు విజయవంత మయ్యేదానికి ప్రత్యామ్నాయ పద్ధతులు కనుకొనగలరు.

16) మీరు సదస్సులు ప్రారంభించి నప్పటినుండి నేటివరకు ఎందరు ప్రభావితులై, యోగ్యులై, వక్తలై ఈ సమాజాన్ని సంస్కరించే దానికి సిద్ధహస్తులైన దాఖలాలు చూపండి. అలా కాకుంటే మీ విజ్ఞాన, ప్రజ్ఞాపాటవాలు ఆనకట్ట తెగి నీళ్ళన్నీ ఊర్లపై బడి పారినట్లుగుతుంది.

17) మీ రాతలతో విరక్తిచెంది మౌనం వహించిన వెంకటాద్రి గారిపై రాసే రాతలు పాఠకుల జ్ఞానాన్ని పెంచవు. కనుక మీరు సహృదయంతో ఈ లేఖను "వివేకపథం”లో వెలువరిస్తే బాగుంటుంది. ఈ లేఖ సారాంశమంతా పాఠకుల నాడే. ఇదంతా కుటిలంతో రాసిందికాదు. యదార్థమే.

ప్రతిస్పందన:- సుజరేగార్కి, సుదీర్ఘమైన లేఖరాశారు. అందులోనూ చాలా చాలా ఆరోపణలు, వాదులూ, నిందలూ చేశారు. కానీ ఎదుటి వాళ్ళను మనం ఎన్నంటున్నా అవి అనకూడనివిగా మన ఇంగితానికి అందవు ఎందుకనో? అదే అలా ఎందుకన్నావు. రుజువు ఉందా? ఇలా ఎందుకన్నావు బుర్ర పనిచేస్తోందా లాంటి ప్రతివాక్యాలే మీకు శల్యాల్లా  బాధిస్తుంటాయి. మీది బడిత బాష కాదు గానీ భావం మాత్రం యోగ్యంగా లేదు. వెంకటాద్రి మొరటుగా అన్న అనేకంకంటే, నాకు ప్రాక్టికబులిటీలేదని మీరన్న మాట పెద్ద తిట్టులాంటిది. నిజానికి లేఖద్వారా మీ పట్ల కూడా కఠిన వైఖరి నవలంబించక తప్పనిస్థితికి నన్ను గుంజారు. కానీ ఆ విషయము మీకు అంగీకరించ బుద్ధిపుట్టదు. పైగా మీ రాతలు సరికావని అవాస్తవికులూ, డాంబికులూ మాత్రమే అంటారని మరోపోటు ఇతరులు నోరెత్తకుండా. బాగుందండీ చాలా సామరస్యం, సౌమనస్యం ఉన్నట్లే మీ మాటల్లో.

మాట మాటనూ ఎత్తిచూపుతూ నా ప్రతిస్పందన రాయడం స్థలాభావ రీత్యా నాకు సాధ్యపడదు. కాదని మీ లేఖకు అనుగుణ్యంగా ప్రతిస్పందిస్తే అది మీకు మింగుడుపడదు. కనుక ఆ కోణాన్ని ఆపుతాను. 

మీకూ నాకు మధ్యగానీ, వెంకటాద్రికి మీకూ నాకూ మధ్యగాని నిజానికి వున్న సంబంధాలేమిటంటారు. 1) సామాజిక సంబంధం 2) సంస్కరణోద్యమాల, విప్లవోద్యమాలలో ఉండేవారి మధ్య ఉండాల్సిన సంబంధం - శాస్త్రీయ పంధాతో కూడిన హేతుబుద్ధితో సత్యజ్ఞానాన్ని సంపాదించడం, నిలిపి ఉంచుకుని వినియోగించు కోవడం, సాటి వ్యక్తులకూ ఆ జ్ఞానం అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయడం అన్నక్రమంలో ఏర్పడే సంబంధం. ఇంతేనంటారా? ఇంకేమైనా ఉందా?

నిజంగా ఉండాల్సిన పై సంబంధాల ననుసరించే ఎదురైన ఎరుకైన ప్రతివారి విషయంలోనూ దాదాపు ఒకే విషయాన్ని చెపుతూ వస్తున్నాను నేను. భావపరమైన విభేదాల్ని, వైరుధ్యాల్ని విచారణకు స్వీకరించి వీగిపోయిన వాటిని విడచి, సరైన వాటిని ఇరువురము స్వీకరించి కలిసి కదులుదాము రండని. ఎందుకనో ఇది మీకెవ్వరికీ రుచించడంలా? నిజానికి సత్యదృష్టి, సత్యాన్వేషణాసక్తి, హేతుబద్దత వాస్తవాలను అంగీకరించి, స్వీకరించ గల ధైర్యమూ ఉంటే నా ప్రతిపాదనలో అంగీకరించరానిది, లేనిదీ ఏమీలేదు. అలాగే మన మన అవగాహనలను పరిశీలించుకోడానికి వేరెవరితోనూ ముడిపెట్టుకో వలసిన పనిలేదు. మన మిరువురమే మన అవగాహనలను విచారించు కుందాం రండి. 4 రోజులుండేట్లు రాగలిగితే కొన్ని విషయాల్లోనైనా మనం ఒక కొలిక్కి రావచ్చు. కొన్ని భావాలల్లోనైనా స్పష్టత ఏర్పడవచ్చు.

మీ అందరి విషయంలోనూ నేననేదొక్కటే. నాపై ఏమైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆధారాలతో రుజువు పరచడానికి సిద్ధపడి చేయండి. మీ పక్షాన్ని ప్రకటించడానికి 'వివేక పథాన్ని' వేదిక చేసుకోండి - నేనూ అట్టి నియమాన్నే పాటిస్తాను. ఇక విషయ పరంగా పరస్పరం మన అవగాహనలను పరీక్షించుకుందాం రండి. ఇందుకు వెనుకాడితే మొత్తం మొత్తంగా మీ నైజాన్నే శంకించాల్సి ఉంటుంది. మన మధ్య జరిగే చర్చలలో పరిశీలకులుగ మీకు నచ్చిన మీరు కోరిన వారినీ తోడ్కొని రావచ్చు. అనవసరపు మాటలు అనవసరం. భావవిప్లవాన్ని కోరేవారు నిరంతరం తమ తమ భావాల పరిశీలనకు, పరీక్షకు సిద్ధపడి ఉండడం అత్యంతావశ్యకం. మీ రాక తెలుపుతూ వెంటనే లేఖ రాయండి.

సరైన దారికి నన్ను కదిలించండి కదులుతాను. మిమ్ము కదిలిస్తాను కదలగలరేమో తేల్చుకోండి.

స్పందన-2:- బాపట్ల నుండి శాంతారాంగారు, ఇలా రాస్తున్నారు. మీరు పంపిన వివేక పథం - 3 చేరినది, శ్రీమతి విజయగారు ద్వారా మీ పరిచయం కలగడం సత్సంగాలలో మిమ్ము వినడం నాకు కలిగిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.

బాపట్లలో మొదటిసారి మిమ్మల్ని విన్నప్పుడు మీరు నాకు అర్థం కాలేదు. అన్నింటినీ ప్రశ్నించి అందరనూ ఓడించాలను కుంటున్నారా? అనిపించింది. దానితోపాటే మీ మార్గము క్రొత్తది అనిపించింది. తరువాత 'మేలుకొలుపు'లు కొన్ని చదివాక మీ దృక్పథము, కృషి కొంతవరకు అర్థమయ్యాయి. మనుషుల మెదడుల ఉన్న అజ్ఞానమనే తుప్పును వదలగొట్టి ఆలోచించడం అంటే ఏమిటో తెలియజేస్తున్న మీకు ధన్యవాదములు.

నేను డిగ్రీలకోసం, బోధనకోసం, ఆశక్తితోనూ కొన్ని పుస్తకాలు చదివాను. అర్థం చేసుకున్నాను. తెలియంది లేదనుకోలేదు గానీ చాలా తెలుసుకున్నా ననుకున్నాను. కానీ మిమ్మువిన్నాక అర్థమైంది నేను ఆలోచించడం సరిగా నేర్చుకోలేదని, మీ సహకారంతో ఆపనికిప్పుడే స్వీకారం చుట్టాను.

వివేక పథం - 3 సమగ్రంగా చదివాను. అద్వైత సిద్ధాంతం: ఒక పరిశీలన-5 చదివాను. అర్థం అవుతూ అవుతూవుంది. 'రావిపూడి వెంకటాద్రి- ఒక విశ్లేషణ' చదివాను. పూర్వం జరిగిన వాదప్రతివాదనలు నాకంతగా తెలియవుగానీ తెలిసినంతలో "ఒక సిద్ధాంతాన్ని విమర్శించాలంటే దాన్ని సమగ్రంగా అర్ధం చేసుకోవాలని” చాలమందికి తెలియనట్లే వెంకటాద్రిగారికీ తెలియదు అనిపించింది. “కృష్ణునికి 16 వేల గోపికలు ఆయనేమి దేవుడు" అనే పాతకాలపు క్రైస్తవ మిషనరీల విమర్శలాగే సాగింది శంకరాచార్యునిపై వెంకటాద్రిగారి విమర్శకూడా. వ్యక్తి పుట్టుకనుబట్టి సిద్ధాంతాన్ని కొలుస్తారా? అపుడు సరైన ఫలితాలు వస్తాయా అది హేతుబద్ధమైన వివేచన అవుతుందా?

మీ విశ్లేషణ వెంకటాద్రిగారి మీదయినా, అందరమూ ఎలా ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నాము, వ్రాస్తున్నాము, అది సరైనదేనా అని సరిచూసుకోవటానికి తోడ్పడుతూంది.

ప్రతిస్పందన-2 : శాంతారాంగార్కి :- ఈ మధ్యకాలపు అధ్యయనాధ్యాపన రీతులనుబట్టి కొత్తదైన నాపోకడ మీకలా అనిపించడంలో గమ్మత్తేమి లేదు. 1) గట్టిగా యితర రంగులేమీ అతుక్కోనుండక పోవడమూ, 2) బోధనా వృత్తిలో ఉంటూ అధ్యయనశీలత కలిగుండడమూ 3) నిష్పాక్షిక విచారణము సాగించగలా, వాస్తవాన్ని స్వీకరించడానికి సిద్ధపడగలా నైజం తగినంతగా కలిగి ఉండడమూ అన్నవాటివల్ల మాటి మాటికీ మన మధ్య ఏర్పడిన ప్రత్యక్ష సాన్నిహిత్యం వల్ల నాగురించి ఒక అంశంలో సరైన అంచనానే వేయగలిగారు. మీరన్నట్లు ఆలోచించడం సరిగానేర్చుకోకపోవడ మన్నది లోకంలో ఉన్నదే. అందుకు కారణం విద్యావిధానంలో ఉన్న లోపమే. అనేక కారణాలవల్ల మరుగునపడి వున్న సమర్థవంతమైన ఆలోచనా పద్ధతి ‘సమాజం నుండే సుమండీ’ మాకు అందింది. అది మళ్ళా సమాజానికి విస్తృత పరిధిలో అందించాలన్నదే మా లక్ష్యాల్లో ప్రధానమైనది. సరే ముందు ముందు కలసే కదులుదాం ముందు ముందుకు.

స్పందన-3: చొప్పెల్ల నుండి Ch. S. గోపాలరావు వ్రాయులేఖ. వివేక పథం - 3 లో 20వ పేజీ చివరి పేరాలో వెంకటాద్రి గారితో తిరిగే వారినీ లేదా వారు వెంటేసుకునే పదిమందినీ పిచ్చిబుడంకాయలు, భట్రాజులు అని పిచ్చి పిచ్చి రాతలు రాసినందుకు నేను నీకీలేఖ రాయవలసివచ్చింది.

మొదట ఆయన మాకు 'హేతువాది' పత్రికద్వారా అందించిన మానవవాద సభ్యత సంస్కారం-జ్ఞానంతో నీపై సానుభూతితో ఇస్తున్న సలహా.

"ఇమిడియట్ గా సైకాలజిస్టును కలసి నీ మానసిక సమస్యను వివరించి తగిన ట్రీట్మెంటు తీసుకొనుము.” ఇది నిన్ను అవమానించడానికి నీచబుద్ధితో రాసిందికాదు. ఏ మానసికరోగీ తనకు పిచ్చి ఉందని ఒప్పుకోడు కనుక.

నీకు పిచ్చిలేదు. అతి తెలివి లేదా మతి సెబ్బరితనం. ఐతే .... వెంకటాద్రి నీపై విసిరిన విసుర్లు అంతకుముందు ఆయన పై నీవు చేసిన వ్యాఖ్య లకు రెస్పాన్సులు, ఆ విమర్శలు హుందాగా - సభ్యతగా ఉన్నాయి. మరినీవో? తిట్లు - తన్నులు, ఆయనది కాదు, నీది బజారు భాష - బడితభాష.

నీవు అద్వైతివి కాదు కాదు, అడ్డకురుచవాదివి, హిందూ ఫండ 'మెంటలిస్ట్' వి. కాదు కాదు ఒట్టి మెంటల్ వి. నీ పత్రికకు రిజిస్ట్రేషన్ అయిందా? అది పత్రికేనా? నీ ఎంబ్లంలో 'వాస్తవిక దృష్టి' అనుంది. నీకు అసలు చూపు ఉందా? మనోనేత్రం కూడా లేనట్లుంది. సత్యాన్వేషణకంటే రంధ్రాన్వేషణ లేదా బొక్కలు వెదకుట ఎక్కువ. అదికూడా బొక్కలు లేనిచోట. వసుధైక కుటుంబ భావన. నీకు మీ ఇంట్లోనే పడడంలేదని తెలిసింది.

ఇంతకూ నీకు పెళ్ళయిందా లేదా? సెక్సు తీరక మదపిచ్చితో రాస్తున్నావా? శంకరాచార్యుణ్ణి వెనకేసుకొస్తున్నావు. అసలు నీ సంభవమెట్టిది? పత్రికకు నేను చందా కట్టడంలేదు. ఖర్చు నిజంకదా? ఏ మతసంస్థ లేదా బాబా పెట్టుబడి పెడుతున్నాడు? అసలు నువెన్ని పేజీల రచనలు చేశావు, పేర్లు చెప్పు.

ఈ చెత్త పత్రికలు తప్ప వేరేలేవా? అన్నీ యివేనా? వెంకటాద్రిగారి అంచనా తప్పు. ఆయన రచనలు అర్థం చేసుకోవడానికి 40 సం..లు కాదు. నీ లైఫ్ చాలదు. అందుకుతగ్గ నిజాయితీగల మనస్సు నీకులేదు. మారేరకం కాదు నువ్వు. అహంకారం త్యజించు. అపుడంతా అర్థమవుతుంది. సత్యాన్వేషణ మండలి అంటే ఎవరెవరో పేర్లు ఎడ్రస్ లతో పత్రిక వివరాలన్నీ తెలుపుతూ 'ఎన్లార్జ్ ఎడిషన్' వెయ్యి. "మాటల్లో కాలు ఎత్తావు" చేతల్లో ఎత్తావో? చెప్పను నరికేస్తాను జాగ్రత్త. నీ పత్రిక చింపి లెట్రిన్ కుండీలో పారేశాను. దురుద్దేశ పత్రిక కావున.

ప్రతిస్పందన-2: గోపాలరావుకు; వెంకటాద్రి ద్వారా ఎక్కించుకున్న మానవవాద సభ్యత - సంస్కారాలు, జ్ఞానం పేరున నీవు వెలిబుచ్చిన అభిప్రాయాలు అచ్చుగుద్దినట్లు వెంకటాద్రి పోకడకు సరిపోతున్నాయి. సభ్యత పేరున అసభ్యత, సంస్కారం పేరిట కుసంస్కారము, జ్ఞానం పేరిట అజ్ఞానం బల్ల గుద్ది మరీ వెల్లడించడంలో వెంకటాద్రితో సరిపోలిన దిట్టతనం నీలోనూ ప్రకటిత మయింది. ఇది నాకు వెంకటాద్రి నుండే సంక్రమించిందని నీవనడం పచ్చి పచ్చిగా వెగటుగా వున్నా పక్కా నిజమే చెప్పావేమో ననిపిస్తోంది. మరి ఆయనేమంటారో చూడాలి.

నీవన్నట్లే నేనెరిగిన ఒక మనో విశ్లేషకుడి వద్ద నీలేఖ నాకు వెంకటాద్రికీ జరిగిన గతమూ చూపాను. ఏ ముఖానున్నాడో, ఊరకే అన్నాడో గాని నీవచ్చావేంటయ్యా, నాదగ్గరకు రావలసింది వాళ్ళిద్దరూ కదా! అన్నాడు. గోపాలా! ఆయన నీకు నచ్చకుంటే నీ యిచ్చవచ్చిన సైకియాట్రిస్టును ఎంచుకో, కలిసే వెళదాం. ఆయన ఎవరికి వైద్యమవసరమంటే వాళ్ళం చేయించుకుందాం. రెండోవాళ్ళం చికిత్సలో రోగికి సాయం చేసుకుందాం. 'ఏమంటావు? నీ స్టేట్మెంట్సులో మతి సెబ్బరితనం ఉందో, అనాలోచిత వీరాభిమానమూ, అకారణ ద్వేషమూ ఉన్నాయో లేక మానసిక చాంచల్యం జొరబడి ఉన్నదో - ఆలోచించ గల మంటున్న మీ హేతువాద మిత్రులైనా చెపితే విని ఎంత ఆలోచించగలరో తేల్చుకుంటాను.

1) సానుభూతితో సైకాలజిస్టును కలవమన్నావు. అంతలోనే నీకు పిచ్చిలేదు. అని ఒక నిర్ణయం చేశావు. ముందేమన్నాను అన్నది మరచిందేమో నీ బుర్ర అంతలోనే ఫండ 'మెంటలిస్టు'వు 'ఒట్టి మెంటలివి' అన్నావు.

2) వెంకటాద్రి విసుర్లు హుందాగా - సభ్యతగా ఉన్నాయన్నావు. 

(Note :- సభ్యతంటే ఎరిగిన విజ్ఞులెవరైనా ఇద్దరు, ముగ్గురు ఆయన నా పై వేసిన నిందలూ - చేసిన ఆరోపణలూ సభ్యతనుగానీ, సంస్కారాన్నిగానీ, వివేకాన్ని గానీ సూచించేవిగానే ఉన్నాయని నిర్ధారించితే మీరు నలుగురూ వదిలేసిన చెప్పుల దండ మెళ్లో వేసుకుని మీరు కోరిన చోట వీధుల వెంట నడుస్తాను. విజ్ఞులు మరోరకంగా తీర్పుచేస్తే ఏమి చేద్దామంటావు. 'నీవు - నీ మార్గదర్శి' ఏమి చేయడానికి సిద్దపడగలరో నీవైనా, ఇద్దరూ అనుకునైనా తేల్చండి. ఆ విషయం లేఖద్వారా స్పందనకు రాయండి. దానినీ వివేకపథంలో ప్రకటించి విషయాన్ని విజ్ఞుల పరిశీలనకు పెడతాను. నిజమైన నిజాయతీ పరుడికి నిజం ఎడల మక్కువ ఎక్కువగా ఉండడంతో పాటు ధైర్యంకూడా తక్కువగాకుండా ఉండాలి.

3) నా యింట్లో నాకు పడడంలేదని తెలిసిందంటావు. మళ్ళా నీకు పెళ్ళయిందా లేదా అంటావు నీవెక్కడి మాలోకంరా బాబూ. తెలీని విషయాలు తెలిసినట్లు మాట్లాడడంలోనూ, అబద్దాలాడడంలోనూ గొప్ప పట్టు సాధించిన నీవు బడి పెట్టి బుడతలకెలా సత్య ధర్మాలను వంటబట్టించ గలవో నాకైతే అంతుబట్టడం లేదు.

4) "అసలు నీ సంభవమెట్టిది?” అనడిగావు, ఓరి పిశాచపు నీపాడెగట్ట M.A. B. Ed. నంటావు. నీవన్న ఆమాట కర్థం తెలుసట్రానీకు. నామీద పడి ఏడిచేదేదో ఏడ్వక మా అమ్మజోలెందుకు పోయావు. ఇదీ మీ పెద్ద అందించిన సభ్యతా, సంస్కారాలు, జ్ఞానంవల్ల పుట్టిన హుందాతో కూడిన విమర్శేనట్రా. పుర్రెగాని చెదలెక్కలేదు గదా!

5) నరికేస్తానన్నావు. నాచోటి కొచ్చి ఆ పని చేస్తావో, నీచోటికి రమ్మంటావో నిలబడిచెప్పు. ఒప్పుకుని అలాగే చేస్తాను. అప్పుడు చేసేద్దువుగాని నీవు చెప్పుకున్నట్లు, నీ ఇచ్ఛవచ్చినట్లూ.

6) ఇవ్వడం చేతగాని వెధవలకు ఇవ్వగలవాళ్ళను చూస్తే చచ్చేంత జెలసీ. తాము చిన్నబోతున్నామే అన్న మాత్సర్యంతో ఇచ్చేదంతా కొట్టు కొచ్చిందో, పట్టుకొచ్చిందో, అడుక్కొచ్చిందోనని అంటేగాని మనసూరుకోని ఉడుకుమోత్తనం.


వేదాన్ని (ఆస్తిక్యాన్ని) కాదంటే ధర్మం నశిస్తుందా?


మండలి పోకడపై, డోంగ్రేగారు వెలిబుచ్చిన అభిప్రాయంపై శాస్త్రీయ దృక్పథంతో కొంత విషయ విచారణ సాగించాల్సివుంది. సందేహించిన ప్రధాన విషయం.

1) వేద ప్రామాణ్యాన్ని కాదన్నారు కనుక దాని నంగీకరింపకున్నచో ధర్మాచరణకు హాని కలుగుతుంది. కనుక అట్టి వాటిలో పాల్గొనగూడదు.

సురేంద్ర:- ఆయన హృదయాన్ని పట్టిచూస్తే ధర్మ పథాన్ని సర్వులూ అనుసరించాలన్న ఆకాంక్షకల వారుగా తేలుతోంది. ధర్మబద్ధ జీవనం గడిపే వ్యక్తులుగల సమాజాన్ని ఏర్పడాలని కోరని విజ్ఞులెవరుండగలరు? అది మంచిదే.

ఇక పోతే ఆయన అవగాహనను పట్టిచూస్తే వేదాన్ని కాదన్న మాత్రాన ధర్మాచరణకు ఆటంకం ఏర్పడుతుందన్నది ఒట్టి భయం మాత్రమేననిపిస్తోంది. వట్టిభయం కాదనడానికి తగిన గట్టి దాఖలాలేమీ అనుభవంలో గోచరించడంలా. వారంగీకరించే చరిత్ర (సాంప్రదాయక చరిత్ర లేక పురాణ ఇతిహాసాలు)ల్లోనే నా మాటలకు బలం చేకూర్చే దృష్టాంతరాలెన్నెన్నో, మీరూ

చూడండి.

1) కృతయుగం :- లెఖ్ఖప్రకారం ధర్మం నాలుగు పాదాలా నడవాల్సి ఉంది. అయినా హిరణ్యకశిపాది అధర్మ స్వభావులు (ఆస్తికుల లెక్కప్రకారం) ధర్మరక్షణకై భగవంతుడవతరించ వలసినంతగా అధర్మాన్ని స్థాపించారు- ధర్మపక్షాన్ని జయించి, పాలించారు.

2) త్రేతాయుగంలో 1) పరశురాముడు, 2) శ్రీరాముడూ కూడా అవతరించ వలసి వచ్చింది. వారికి ప్రతినాయకులుగ నున్నవారిలో నాస్తికులు కానరారు. వేదాన్ని అంగీకరించనివారూ కానరారు.

3) ద్వాపరంలో భారత భాగవతాలల్లో మనకెదురయ్యే విలన్లందరూ ఆస్తికులే. ఆఖరికి పౌండ్రిక వాసుదేవుడు కూడా దేవుడు లేడనడు. నేనే అసలు అంటాడు. కానీ పై మూడు యుగాల్లోని సాంప్రదాయకుల లెక్కల ప్రకారం దుర్మార్గులైన వారందరూ (ప్రతినాయకులందరూ) దైవభక్తులే. ఒక దేవుడి భక్తులు మరొక దేవుడ్ని దూషించడం విషయంలోనూ, అతడి భక్తుల్ని హింసించడం విషయంలోనూ పోటీ పడ్డారు. పురాణేతిహాసాల్లో కనపడే మానభంగాలు, భూృణ హత్యలు, దాయాది పోరాటాలు, వ్యభిచారాలు, వగైరా వగైరా కర్మకాండంతా అగ్ని కార్యాలు నిత్యం చేసుకునేవాళ్లు చేసినవే.

4) ఈనాడు ప్రత్యక్షానుభవంలో చూచినా ఆస్తికత పేరున జరుగుతున్నంత అరాచకం, వంచన, దోపిడీ, విహిత కర్మాచరణ రాహిత్యం, సోమరితనం, భోగలాలసత, వ్యాపారం (వ్యభిచారంకూడాననుకోండి) ఆస్తికేతరంగా జరగడం లేదు. ఈ నా అభిప్రాయానికి రుజువులు మీరు కోరినచోటల్లా (ఎక్కడంటేఅక్కడ) పట్టి చూపించగలను.

5) వీటన్నిటికీ ఆధారంగా ఉన్నది. అవాస్తవ జ్ఞానమే. అవాస్తవ జ్ఞానాన్నీ, అనిర్ధారిత భావాలనూ సమాజం నెత్తిన రుద్దడంలో ఆస్తిక్యం నిర్వర్తించినంత పెద్ద పాత్ర మరేధోరణీ నెరవేర్చలేదు. విభిన్న, విరుద్ధ భావాలను ప్రామాణిక గ్రంధాల పేర వెలయించి సమాజాన్ని గందరగోళ పరచడమే కాకుండా యదార్థ జిజ్ఞాసువులకు సందిగ్ధాన్నీ, అమాయకులైన సామాన్యుల మస్తిష్కాల్లో పరస్పర వ్యతిరేక దృష్టినీ పుట్టించి కొన్ని సందర్భాలలో మానవ మారణ హెూమానికి దారితీసిందీ ఆస్తిక భావజాలమే. చరిత్ర - జరిగిన దానిని కాదనడం సత్యాన్ని సమాధి చేయడమే. సత్యాన్నే తృణీకరించాక (సత్యాన్నాస్తి పరోధర్మః) ఇంక ధర్మాచరణ ధర్మరక్షణ ఎక్కడిమాట?

6) ఆస్తికులారా! ఇప్పటికి తెగిందా మామధ్య అసలు దేవుడెవరో? అద్వైతాలు, విశిష్టాద్వైతాలు, ద్వైతాలు, ఆర్య సమాజికులు, నైయాయికులు, సాంఖ్యులు, మీమాంసకులు, శాక్తేయులు, గాణాపత్యులు, సౌర్యులు, వీర వైష్ణవులు, వీర శైవులు. తాంత్రికులు, గ్రామదేవతారాధకులు మొ॥వారు లోగడనుండే కొనసాగుతుండగా, మధ్యకాలంలో పుట్టుకొచ్చిన వెంకటేశ్వరుడు, అయ్యప్ప, రాముడూ, కృష్ణుడూ దేవుళ్ళలయ్యారు. వీరు చాలరన్నట్లు రాఘవేంద్రుడు, వీరబ్రహ్మం, పోతరాజు, షిరిడీశాయి. సత్యశాయి, బాలశాయి, మెహర్, కుసుమహరనాధ్, దత్తాత్రేయుడు, ఆనందమయి, జిల్లేళ్ళమూడి అమ్మ, బండలమ్మ, మంగమ్మవ్వ, తిరుపతమ్మ, వగైరా వగైరా లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతున్నారు. ఇదంతా సరైంది కాదంటూ మరీ దగ్గరకాలంలో (నిన్నా మొన్నా) బ్రహ్మకుమారీ సమాజం, కల్కి భగవాన్, రామచంద్రజీ, ప్రేంపాల్ రావత్,ల సమాజాలు వారి వారిదే అసలైన పోకడంటూ పోరు బెడుతున్నాయి. సామాన్య సమాజంలో చాపక్రింద నీరులా పాకిపోతున్నాయి.

డోంగ్రేసాబ్ ! మరియు నిజాయితీకల ఆస్తిక పంథీయులారా! ఎక్కడ వేదము, ఎక్కడ దేముడు? ఎక్కడి ధర్మము? మీరెవరుగానీ ధర్మాదీక్షా కంకణు లగుటకు సిద్ధపడగలరా? అయితే రండు. ధర్మాధర్మ విచికిత్సచేసి ధర్మాన్ని నిలపడానికి, అధర్మాన్ని పోనాడడానికి మేము సిద్ధము, ధర్మ రక్షణకై కలసి కదలగల సంసిద్ధత, సాహసము, బద్దత కలిగి, బాధ్యత స్వీకరించగల ధీశాలురూ, కార్యశూరులు, ఏ మూలనున్న వారిని మండలి గుండె విప్పుకొని ఆహ్వానిస్తోంది కలసికదులుదాం రండని. రాగలరేమో చూడండి. ఊరకే మాటకు మాత్రం ధర్మ చ్యుతి జరుగుతుందనుకుంటుంటే దానిని ధర్మదీక్షా అనరు, ధర్మరక్షణా అనరు.

అసత్య ప్రచారం కంటే ధర్మ వ్యతిరేకత - అధర్మ కర్మ మరేముంటుంది? సర్వధర్మములూ సత్యముపైనే అధారపడి ఉంటాయి. ఉండాలి కూడా. 

మీరభిమానించే వేదం ఆద్యంతమూ సత్య విషయ ప్రతిపాదమేనని నిర్దారించగలిగితే మీ కంటే అధికంగా సంతోషించి దానిని సమాజాని కందించేందుకు అతిబద్దులమై యత్నించగలము. అలాకాదు, వేద ప్రతిపాదితాలలో అవకతవకలెన్నో కలవని తేలితే ఏమి చేద్దామో, ఏమి చేయగలరో ముందుగా నిర్ధారించండి. కొన్ని సూచనలిస్తాను ఆస్తికులూ, వైదికులూ లోతైన పరిశీలన సాగించి చర్చా వేదికకు రావడానికై. ఇందులో వైదికేతరులై న ఆస్తికులూ చేరవచ్చు. చేరాలికూడా. ఉదా:- క్రైస్తవులూ, ఇస్లామీయులూ, యూదులు వగైరాలు. 

1) దైవవాక్కులు అంటూ మీరు మీరు ఎత్తిచూపుతున్న గ్రంధాలు పరస్పరం విరోధిస్తుంటే దేనిని సరైనదిగా స్వీకరించాలి? దానికి ఉపాయమేమి? అంటే వాటిలో సరైనది ఇదేనని నిర్ధారించే మార్గమేమిటి?

2) ధర్మ స్వరూపం ఏమిటి? ధర్మ పదార్థం ఏది? ధర్మాధర్మ వివేచన సల్పడానికి మనకున్న ఆధారాలెలాంటివి?

3) ధర్మం దేశకాలాలననుసరించి మారుతాయా లేదా? మారుతుందంటే ఏ నింబధన గ్రంథమైనా సార్వకాలీనము సార్వ జనీనమూ కాగలదా?

4) కొన్ని శాశ్వత ధర్మాలు, కొన్ని అశాశ్వత ధర్మాలు అన్న విభజన ఉందా? ఉండాలా? లేదా?

5) ఆయా మత గ్రంథాలలోని ధర్మాలు పరస్పరం విరోధించు కుంటుంటే ఏది సరైందో ధర్మ నిర్ణయం చేయడం ఈనాడు మనవల్ల అవుతుందా? అవదా?

6) అసలు ఏదైనా ఒక విషయాన్ని గురించి అభిప్రాయాన్ని పుస్తకంలో ఉంది కనుక అథవా ఫలాని పుస్తకంలో ఉంది గనుక సత్యము అనడం వివేక వంతమా? కాదా? శాస్త్రీయమా? కాదా?

Note :- ఆస్తిక, ఆస్తికేతరులైన విజ్ఞులారా! ధర్మనిష్టులారా! "ధర్మా ధర్మ స్వరూప స్వభావాలు - ఒక విశ్లేషణ” అన్నది చర్చనీయాంశంగా 'తత్వచర్చా వేదిక'పై సమావేశం ఏర్పాటు చేస్తాను. రెండు పక్షాలూ పాల్గొని అధర్మ స్వరూప నిర్ణయంలో ధర్మాచరణకు వన్నె తేగలరీతిని ధర్మ స్వరూప పరమైన సత్యాన్ని నిర్ధారించండి. ఇక్కడ వెనుకాడితే మీ ధర్మాభిమానం ఏపాటిదో తేలిపోతుంది. ఆస్తికులు అధర్మపరులని నాస్తికులూ, నాస్తికులు అధర్మపరులని ఆస్తికులు పరస్పర దూషణ తిరస్కారములతో వారి వారి అభిమానుల మధ్య వాకొంటూ, రచనలద్వారా వాదులాడుకొంటూ వందల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నారు. కానీ యథార్థ ధర్మానురక్తులై ధర్మ నిర్ణయం చేయడానికి, నిర్ణయాని కనుగుణ్యంగా మసలుకొనడానికి సిద్ధపడి సత్యదృష్టితో ఎదురుపడి నిగ్గు తేల్చుకుందెక్కడ? ఎప్పుడు?

ఇప్పుడు అట్టి వేదిక నేనేర్పాటు చేస్తాను. ధర్మజ్ఞులము, ధార్మికులము అనుకున్న రెండు పక్షాలవారూ వేదిక పైకి వచ్చి ధర్మస్థాపన రూప ధర్మాచరణ చేసి చూపండి క్రియారూపంగా. ఉంటాను. సెలవ్.

మీ,

సురేంద్ర


కళ ఒక పరిశీలన 1 భూమిక


మానవ జీవితం జ్ఞానేచ్చాకర్మ సముచ్చయం - జీవన వ్యవహారమంతా 'జ్ఞానాతి, ఇచ్ఛతి, యతతి' అన్న మూటిలోనే, మూడుగానే యిమిడి ఉంటుంది. ఇది నాడు నేడు ఏనాడైనా, అక్కడ ఇక్కడ ఎక్కడైనా నిర్వివాద విషయం. విద్య లన్నీ జ్ఞానరూపాలే. విద్యావంతుడన్నా జ్ఞానవంతుడన్నా సమానార్ధ బోధకాలే. విద్-జ్ఞానే అని ధాతురూపం. విద్య లేక జ్ఞానాన్ననుసరించే ఉద్దిష్ట కార్యకలాప మంతా నడుస్తుంటుంది మనిషి జీవితంలో. మానవ శరీర నిర్మాణాన్ని, వ్యవస్థనూ పరికించినా ఈ విషయం బోధపడుతుంది. మనం పని చేయడానికి రెండు రకాల పరికరాలు శరీరంలో నిర్మాణమై ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలూనని. గ్రహణ, ధారణ, చింతన అవగాహన నిర్ణయం, సంకల్పం అన్న క్రమంలో జ్ఞానేంద్రియాల పనులన్నీ జరిగి స్మృతి రూపంలో ఆ అనుభూతు లన్నీ నిల్వవుండి కర్మేంద్రియాలద్వారా వ్యవహారం నడుపుకొనడానికి దేహంలో నియంత్రణ కేంద్రంగా పని చేస్తూంటుందీ జ్ఞాన భాగం. జ్ఞానేంద్రియాలు మనసు, బుద్ధి, చిత్తం, అహం అన్న పదాల ద్వారా వెనుకటివారు ఈ విషయాన్ని ప్రస్తావించగా, 'నాడీమండల వ్యవస్థ’ అని ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రం వాకొంటుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ప్రస్తుతం జ్ఞాన భాగం అంటున్నాం. అవగాహన కొరకు దీనినే పైన జ్ఞానము, ఇచ్ఛ  అని పేర్కొనడం జరిగినది. దానినే (వివేకము, ఇష్టము) అనీ అనొచ్చు. దీనిలోని గ్రహణాదుల సమష్ఠి సామర్థ్యం నుండి మనిషిలో సృజనాత్మక శక్తి జనిస్తుంటుంది. సృజనాత్మక శక్తి ఉద్దీపనం కావడానికి జీవితంలో సమస్య ఎదురుకావడం మూలకారణం అవుతుంది. ఆ సమస్య గూడా కావలసింది లేకపోవడమూ, రాకపోవడమూ, ఉన్నది తరిగిపోవడమూ అన్న రూపంలోనూ; అక్కరలేనిది ఉండడమూ - పోకపోవడమూ, పెరుగుతుండడమూ అన్న రూపంలోనూ ఏర్పడుతుంటుంది. ఇదిగో ఇక్కడ ఉంది మానవుడు అనేకం సృష్టించుకోడానికి మూలం. కనుక సృజన అన్నది ఈ జ్ఞానభాగపు సారంగా పర్యవసాన రూపంగా ఏర్పడిం దవుతోంది. సృజన మూలంలో భావ రూపం. అదిన్నీ - అనేకానేక అనుభవాల సారమైన (సమన్వయు నుండి జనించిన) అవగాహన ప్రాతిపదికగా కొనసాగే ఊహారూపం అనాలి. ఇక్కడికి మనం జ్ఞానభాగపు క్షేత్ర దర్శనం చేశాం సార రూపంగా.

మనకున్న మరో పరికరాల సముదాయాన్ని కర్మేంద్రియాలని వ్యవహరిస్తాము. పై  జ్ఞానభాగపు మార్గదర్శకత్వంలో ఏదో ఒక రూపంలో మనస్సుకు సమస్యగా గోచరిస్తున్న దానిని పరిష్కరించుకోడానికి (ఏర్పడి ఉన్న స్థితిని మార్చుకోడానికి) చేసే కర్మ కలాపమంతా ఈ క్షేత్ర పరిధిలోకి చేరిపోతుంది.

అలా జ్ఞాన క్రియా శక్తులు రెండూ పరస్పర పూరకాలై అనిష్టార్థ పరిహారము, ఇష్టార్థ ప్రాప్తి నెరవేరాలన్న మానసిక (హృదయ) ఆకాంక్షలను తీర్చు కోవడం అన్నదే జీవిత పరమాశయంగా సాధారణీకరించవచ్చు మానవ జీవన వ్యాపారాన్నంతనూ సాకల్యంగా అవలోకిస్తే. (సశేషం)


No comments:

Post a Comment