Thursday, January 26, 2023

6 వివేకపథం


వివేకపథం

సంపుటి: 1 జనవరి 1997 సంచిక : 6


డిశంబరు 22న సీతానగరంలో జరిగిన ఐక్యసంఘటన ప్రధమ ప్రయత్న విశేషాంశాలు

మిత్రులారా ! ప్రస్తుతసామాజికావసరంగా తలంచి ప్రారంభించిన ప్రధమయత్నం సఫలమై అనంతర కార్యాచరణకు ఊతమిచ్చే రీతిలో కొనసాగిందనే అనుకోవచ్చు. రాస్ట్రం నలుమూలల నుండి పిలుపందినంతనే స్పందించి అనుకున్నంతమేర, అంచనాలకు సరిపడా అనేక సంఘాల ప్రతినిధులు ఈకార్యక్రమానికి హాజరయ్యారు. ఐక్యసంఘటన ఆవశ్యకతను అందరూ ఏకగ్రీవంగా అంగీకరించినా, అట్టి సంఘటన నిర్మాణం, కొనసాగింపు, ప్రణాళిక రూపొందించడము, కార్యాచరణల సందర్భాలలో ఎదురయ్యే ఇబ్బందులు, వాటి పరిష్కార విషయమైన సాధ్యాసాధ్యాలు, అన్న అంశాలపై దీర్ఘమైన విశ్లేషణ కొనసాగింది. అందరూ భిన్న భిన్న ధోరణులకు చెంది ఉండడము, ఎవరి ప్రణాళికలు వారేర్పరచుకుని ఉండడము, కొన్నింట భావ వైరుధ్యాలుండడము అన్న అంశాలు , ఐక్యసంఘటనకు ఎదురయ్యే ప్రధాన సమస్యలుగా కనబడ్డాయి.

 మరోవంక ఇప్పటికే చాలాకాలం ముందునుంచే బీజమాత్రంగా ఐక్య వేదిక అవసరాన్ని గమనించిన ఒకటిరెండు సంఘాలవారు తయారుచేసుకున్న ఆశయాలు, మార్గదర్శక సూత్రాలను సభముందుంచడం జరిగింది. అవన్ని వివేకులు అంగీకరించదగినవిగానే ఉన్నప్పటికీ, విస్తృతక్షేత్ర పరిధిని కలిగి అనేకానేక సమస్యలపై పోరాటం చేయవలసినవిగా ఉన్నాయి.

 కనుక, పదేపదే సదస్సుకు ఒక అంశాన్ని గుర్తించవలసిందిగా, అర్థం చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయవలసి వచ్చింది. ఉమ్మడి కార్యక్రమం అనగానే ఇది చాలా పరిమితమైనదన్న విషయం తేలిపోతోంది అయితే ఎంతో శక్తివంతమైందన్నదీ మనం గుర్తించాలి. అనేక కార్యక్రమాలు ఉమ్మడి కార్యక్రమాలుగా చేయడం అచరణరీత్యా వెంటనే సాధ్యపడదు. కనుక ప్రత్యేకించిన ఒక ప్రధాన విషయమై కార్యాచరణ మాత్రమే ఉమ్మడి వేదిక ఆకాంక్షగా ఉండడం మంచిది. అలాగే ఉమ్మడి కార్యక్రమం మధ్యలో విభిన్న ధోరణులకు చెందిన విభేదాలు ప్రస్తావన అనవసరం, అసందర్భం అన్నదే కాకుండా అట్టిది ఐక్యసంఘటనోద్యమానికి ప్రతిబంధకం కూడా అవుతోందన్న అవగాహనా ఎంతో అవసరం. తాత్వికపరమైన విభేదాలు తప్పనిసరిగా తేల్చుకోవలసినవే అయినా అవన్నీ ఒక పట్టాన కొద్దికాలంలో, ఒకటి రెండు యత్నాలవల్ల మాత్రమే సాధ్యమయ్యేవి కాదు. స్పష్టమైన అవగాహనతో ఆవైపు క్రమంగా, నిరంతరాయంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఈలోపు సమాజంపై పెనుభారంగా రూపొందుతోన్న సంఘవ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులు కనుగుణ్యంగా తాత్కాలిక ప్రణాళికలతో ఎదుర్కోవడమూ అవసరమే. ఆ పనిని నిర్వర్తించడానికి మాత్రమే పరిమితమైనదీ ఐక్యసంఘటన. అయితే దీనివల్ల దీర్ఘకాలికమైన ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యమైన ఒకటి రెండు ఉదహరిస్తాను. మీరూ వీటి గురించి ఆలోచించండి.

సమష్టిహితకాంక్ష నిజంగా కలిగిఉండే మనమధ్యలో తాత్విక విబేధాల కారణంగా వేరుబాటుతనం చోటుచేసుకొని ఉంది. ఇది ప్రధానాశయాన్నే బలహీనపరుస్తుంది. కనుక సాన్నిహిత్యం అవసరం. అది మన మధ్యనున్న పొరపొచ్చాలను కొంతవరకైనా తొలగిస్తుంది. పరస్పరావగాహనకు దోహదపడుతుంది. అవగాహనపరంగా, వ్యక్తిత్వాలపరంగా, కార్యశీలతపరంగా ఆయా వ్యక్తుల వాస్తవ స్థితిగతుల్ని అర్థంచేసుకోడానికి వీలవుతుంది. కార్యా చరణలో ఆత్మస్థయిర్యాన్ని పురికొల్పి సామూహిక శక్తిరూపంలో ప్రతి వ్యక్తినీ నిర్భయుడ్ని చేస్తూ కార్యోన్ముఖుడగుటకు సంసిద్ధుడ్ని చేస్తుంది. మరో వంక ఆదర్శాల పేరన మనలోనే ఇమిడిఉన్న వాచాలురనూ, సోమరులనూ, క్రియాశూన్యులనూ మరికొన్ని రకాలవారినీ గుర్తించుటకు వీలు కలుగుతుంది. తద్వారా ఉద్యమానికి అంతర్గతంగా ఏర్పడిఉన్నా, ఏర్పడనున్న ప్రతికూల శక్తులపట్ల జాగ్రత్త వహించే వీలును కలిగిస్తుంది. ఇలా ఐక్యసంఘటన ద్వారా సరైన మార్పునుకోరే వ్యక్తులకు ఉద్యమానికి పనికివచ్చే అనేక సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.

 Note :- సదస్సులో ఇంత వివరంగా ఈ విషయం చర్చించలేదన్నది మిత్రులు గమనించగోర్తాను. అయినా ఇవన్నీ అవలోకించదగిన నిజాలే గనుక మీ ముందుంచుతున్నాను.

 వ్యక్తిగతమైన అవగాహనలు, అభిప్రాయాల నేపధ్యంలో చాలాసేపు చర్చ కొంత ప్రక్కకుపోయినా జరిగిన చర్చలకు ముగింపుగా చార్వాక వెంకటేశ్వర్లుగారు చేసిన విలువైన సూచనల ప్రసంగంతో సదస్సు మళ్ళా సరైన దిశకు మళ్ళి ఐక్యసంఘటన అవసరాన్ని అంగీకరింపజేసింది. అన్ని సంఘాలవారూ, విచ్చేసిన అందరూ ఐక్యసంఘటనలో ఐక్యమవడానికి వారి వారి సంస్థల పేరునా వ్యకిగతంగా అంగీకారాన్ని ప్రకటించారు. భవిష్య కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి వీలుగా అవసరమైన తాత్కాలిక నిర్వహణ విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నాము. నేను, గుత్తా రాధాకృష్ణగారూ కన్వీనర్లుగానూ, సభ్యులుగా కోట ప్రసాద్, ఎమ్. వి. రావు, డా|| నాగన్న, పి. మోషే గారలు సత్యాన్వేషణ మండలి నుండి; సోంప్రకాశ్, ధర్మాచరణ మండలి తిరుపతి నుండి; జె.ఎస్. రఘుపతిరావు, ఎమ్. ఆర్. వెంకటరామయ్య జె.కె. స్టడీ సెంటర్ తిరుపతి, చిత్తూరుజిల్లా నుండి; చుక్కపల్లి రామకోటయ్య జయరామిరెడ్డి, రౌతు సత్యనారాయణగార్లు ఆం.ప్ర.రా. హేతువాద సంఘము నుండి; డా॥ రమేష్, యోగయ్యగార్లు ఆర్యసమాజ్ నుండి; అచ్యుత ఇందుశేఖర్ గారు అవగాహన, సామాజిక సాంస్కృతిక వేదిక నుండి ఒక అడహాక్ కమిటీ ఏర్పడింది. 1997 జనవరి 11,12,13 తేదీలలో జరుప తల పెట్టిన మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికలైన "గతితార్కికత-ఒక విశ్లేషణ” అన్న కార్యక్రమానికి జోడించి 14వ తేదీన "ఐక్య సంఘటన" జనరల్ బాడీని జరపాలనుకున్నాము. ఐక్యసంఘటనలో భాగస్వాములైన సంఘాలు దీనిలో మనడానికీ, కొనసాగడానికీ, విడిపోడానికి వాటి వాటికి తగినంత స్వేచ్ఛ ఉండాలన్న ఆం. ప్ర. హే. ప్రధాన కార్యదర్శి శ్రీ వేదాంత ప్రతిపాదనను - ఇది ఐచ్ఛికంగా బాధ్యత తీసుకుని ఏర్పడిందేకనుకనూ, మోరల్ & ఓరల్ కమిట్మెంటు మిగిలిన అగ్రిమెంట్సు కంటే బాధ్యతారూపంగా విలువైందన్న వివేకంవల్లనూ ఆ స్వేచ్ఛ సంఘాలన్నింటికి సహజంగానే సంక్రమించి ఉంది అంటూ అంగీకరించడంతో ఆ విషయానికో ముగింపు ఏర్పడింది.

జనవరిలో జనరల్ బాడీ సమావేశమయ్యేలోపు తిరుపతిలో ధర్మాచరణ మండలి, j.k అధ్యయన కేంద్రాల ప్రతినిధులుగా ఐక్యసంఘటనలో ఇమిడి ఉన్న శ్రీ సోంప్రకాశ్, శ్రీ రఘుపతిరావుగార్ల నిర్వహణలో ఐక్య సంఘటన బ్యానర్ క్రింద కార్యాచరణలో ప్రధమ యత్నంగా కల్కిభగవాన్ పేర జరుగుతోన్న కార్యక్రమాలపై ఒక వేదిక నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది. దానికి అడహక్ కమిటీ సభ్యులంతా విధిగా హాజరవ్వాలన్న నిర్ణయమూ తీసుకున్నాము. ఆ కార్యక్రమం 1997 జనవరి 4 ఉదయం 10 గం. నుండి 12:30 వరకు భవిష్య కార్యక్రమాల విచారణ, సాయంకాలం అనుకున్న కార్యక్రమానికి సంబంధించిన సదస్సు నిర్వహింపబడతాయి.

 Note :- సదస్సు స్థలము : యస్. సోంప్రకాష్, మారుతీ కాంప్లెక్స్ ఆల్ ఇండియా రేడియో సర్కిల్, రాయల్ చెరువు రోడ్డు, తిరుపతి-1. వివరాలు కావలసినవారు యస్. సోంప్రకాశ్-ధర్మాచరణ మండలి, తిరుపతి,Ph. No. 24874 ( Off. ), 22806 ( Res. ) ;రఘుపతిరావుగారు Ph. No. 20827 (Res.) గార్లను సంప్రదించవచ్చు.

 తిరుపతి సమావేశంలో ఉదయపు కార్యక్రమంలో 1) ఐక్యవేదిక పేరును ఖరారు చేయడమూ, ఐక్య సంఘటన ప్రతినిధుల రాష్ట్ర పర్యటన ప్రణాళికా నిర్మాణము, "కల్కిభగవాన్" పేరున జరుగుతున్న కార్యక్రమ వివరాల సేకరణ పద్ధతుల గురించిన యోచన అన్నవి పరిశీలనాంశాలుగా అనుకోవడం జరిగింది.

 సమాజాభ్యుదయోద్యమ కార్యక్రమంలో ప్రధాన భాగమనదగ్గ స్వార్థపరులైన మేధావి వర్గాల వంచనారీతులను అరికట్టడమన్న ప్రధానాశయంలో భాగంగా ఒక కోణానికి చెందిన వంచనను, వంచకులను ఎదుర్కోవడం అనే సదుద్దేశంతో ఏర్పడ్డ ఈ మన ఐక్య సంఘటన సామాజిక విప్లవగతిలో గొప్ప అనుకూలశక్తికి జన్మనిచ్చినట్లుకాగా, ఇది విప్లవానికి నాందీ అనదగ్గ సంఘటనా జరిగింది. కార్యాచరణకు ప్రధమ లక్ష్యంగా మనమెంచుకున్న కల్కి భాగోతపు బూటకం నిజంగా బూటకమేననడానికి తగిన ఆధారాలు సేకరించి అ సంఘపు పడగ నీడ నుండి ప్రజలను బైటపడేయాలన్న దృఢసంకల్పంతో వ్యక్తిగతంగానే అయినా ప్రాణాలకు తెగించి తనదైన శైలిలో ప్రణాళికా బద్ధంగా పోరాటం సాగిస్తున్న అదే సంస్థలో శిక్షణ పొంది, ఆచార్య పదవిని పొందిన అజిత్ భగవత్పాద అను వారి గురించి మండలికి తెలియడమూ, ప్రసాదు, వెంకటేశ్వర్లుగార్లు ముందుగానే వారిని సంప్రదించి 22 నాటి సమావేశానికి వారినీ తీసుకురావడమూ జరిగింది. అజిత్ భగవత్పాద (అజిత్ కుమార్)గారు సహేతుకంగా కల్కికి చెందిన వంచనా రీతులను వివరించి ఐక్యసంఘటన కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా, సంపూర్తిగా పాల్గొంటాననీ, మరికొందరు వంచకులనూ ఎదుర్కొనవలసి ఉందనీ, అందుకు తగిన వివరాలకై యత్నిస్తున్నాననీ కలిసే కదులుదామనీ అనడంతో ఐక్యసంఘటన అవసరమే కాక, శుభమూ కనపడింది అందరకూ. మరింకేం మంచికి ముహూర్తా లెందుకనుకుని తిరుపతి మిత్రులు సోంప్రకాష్, రఘుపతిరావుగార్లు అక్కడకక్కడే అజిత్ కుమార్ తో మాట్లాడి తిరుపతి కార్యక్రమానికై సమాయత్తమయ్యారు. దానిని-వారి క్రియాత్మకతను స్ఫూర్తిగాగొని ఆవేశంలేని ఆలోచనతో ఐక్య సంఘటనలోని అందరమూ బాధ్యతాయుతంగా ఎవరి వంతు కర్తవ్యాన్ని వారు నెత్తికెత్తుకోవలసి ఉంది. ఆ రకంగా విప్లవ కార్యాచరణలో ఈ ఐక్య సంఘటన ఒక ప్రభంజనంగా పనిచేయవలసి ఉంది. పనిచేయగలదు కూడా. ఇది మనందరిదీ, ఇందులో మనమందరము సమభాగులమే. కార్యకర్తలమే.

 వంచనలెన్నో, వంచకు లెందరో, ఒకేసారి వాటన్నింటినీ ఎదుర్కోవాలనుకోడం అద్భుతాన్ని అంగీకరించడం లాటిదే. వివేక మార్గదర్శికత్వమూ, యోచనాశీలత, దృఢదీక్ష, సంసిద్ధత, స్వార్థాకాంక్షల నదుపులో ఉంచుకొనుట అన్న సుగుణయుతమైన వివేకపథంలో కదిలితే కాని పని కొనసాగదు. కీలెరిగి వాతెట్టాలన్నట్లు దేశ కాలాలను బలాబలాలను ఎరిగి ప్రతిఘటనారీతుల్ని మలచుకోవాల్సి ఉంటుంది. దీనికెంతో సంయమనమూ, సహనమూ, సహకారదృష్టి, ఐకమత్యము అవసరమై ఉన్నాయి.

 ఒక నిష్ఠూర వాస్తవముంది. ఐక్యసంఘటన విఘటితం కావడానికి ప్రతి క్షణము, అనేకావకాశాలుంటాయి. విడదీయడానికి సందుకోసం వంచకులు పొంచి ఉంటారు. వాటన్నిటినీ త్రోసిరాజనాలంటే వ్యక్తిగత యిష్టాయిష్టాలనూ, సంస్థాగత లక్ష్యాలనూ దీని కార్యాచరణతో పోటీ పెట్టరాదన్న అతిముఖ్యమైన విషయాన్ని అందరం జీర్ణించుకుని వుండాల్సి ఉంటుంది.

 ఇప్పటికీ ఐక్యవేదికలో సంఘటితమైన సంఘాల వివరాలు : 

1. సత్యాన్వేషణ మండలి-చిల్లకల్లు

2. ధర్మాచరణ మండలి - తిరుపతి.

3. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘము-విజయవాడ 

4. అర్యసమాజ్-విజయవాడ-గుంటూరు శాఖలు. 

5. అవగాహన - గుంటూరు.

6. జె. కె. గ్రూప్ - చిత్తూరుజిల్లా

 ప్రాతినిధ్యం వహించిన ప్రాంతాలు: విజయవాడ, గుంటూరు, ఖమ్మం, వరంగల్, గోదావరి, ప్రకాశం, చిత్తూరు, అనంతపూర్ జిల్లాలకు చెందిన పలు ప్రాంతాలు.

 సూచన : సమష్టిహిత కాంక్షులైన మిత్రులారా! మీరూ, మీ ప్రాంతాల, వేరు ప్రాంతాల మీ మిత్రులూ పరస్పరం సమాచారాన్నందించుకుని, సమాజానికీ సమాచారాన్నందించి మంచిని వాంఛించే వారందరినీ కదిలించాల్సి ఉంది. దానికై ప్రయత్నాలారంభించండి. రండి జనవరి 14 నాటికి రాష్ట్రం అన్ని ప్రాంతాలనుండీ, ప్రముఖమైన అన్ని పట్టణాలనుండీ ప్రతినిధులు కార్య క్రమంలో పాల్గొనాలి. అది ప్రస్తుత లక్ష్యం. మీ వంతు కార్యం నిర్వర్తించండి. అదనపు వివరాలకై మా అడ్రసుతో సంప్రదించండి. ఉంటాను. సెలవ్.

 సత్యాన్వేషణలో

 -మీ సురేంద్ర. 

మన ఈ కార్యాచరణలో భాగంగా చట్ట వ్యతిరేకమైన విషయాలపై చట్టబద్ధంగా పోరాడటానికీ తద్వారా విషయాన్ని అటు ప్రజల ముందుకూ, ఇటు ప్రభుత్వం ముందుకూ తీసుకురావడానికిగాను న్యాయవ్యవస్థ పరంగా పని చేసే ఒక న్యాయశాస్త్ర నిపుణుల విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలనీ, ప్రధాన ప్రచార సాధనాలైన పత్రిక, రేడియో, టీవీలను అధికాధికంగా వినియోగించు కోవాలనీ అందుకై తగిన యత్నాలు సలపాలనీ అనుకోవడమూ జరిగింది. ఈ ఐక్యసంఘటన కార్యకలాపాలను, సమష్టి హితకాంక్షతో భావప్రచార కార్యక్రమంలో పనిచేస్తున్న వార, పక్ష, మాసపత్రికలను ప్రచార నిమిత్తం వినియోగించుకోవాలని అనుకున్నాము. అందుకై ఆయా పత్రికా సంపాదకులందర్నీ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

 మోసాన్ని సహించలేని మనస్సున్న ప్రజానాయకుల్ని, రాజకీయపరమైన ప్రజా ప్రతినిధుల్ని ఈ సామాజికపరమైన ఉత్తమ కార్యానికి సహకరించవలసిందిగా, చేయూత నివ్వవలసిందిగా, కలిసి రావలసిందిగా విజ్ఞప్తిచేస్తూ ఆహ్వానిస్తున్నాము. విభిన్న కోణాల్లో అభ్యుదయం కొరకై ఉద్యమాలు సాగిస్తున్న సంఘాల వారినందరనూ ఐక్యసంఘటనలో ఉమ్మడి కార్య క్రమంలో పాలుపంచుకోవలసిందిగా కోరుతున్నాము.

 చిన్న గమనిక :- మాతృసంస్థ లక్ష్యాలకు వేరుకాని అంశాలే ఉమ్మడి కార్యక్రమంలో ఉంటాయి గనుక మనం సిద్ధాంత రాద్ధాంతాల జోలికి పోనంత వరకు ఈ వేదిక సమాజపరమైన గొప్ప కార్యభారాన్ని వహించగలుగుతుంది. అదిన్నీ ప్రస్తుత నిర్ణయాలనుబట్టి ఉన్న అనేక వంచనా రీతుల్లో ఆస్తికత పేరున జరుగుతున్న మోసాల్ని మాత్రమే (ఆస్తిక సిద్ధాంతాన్ని కాదు) ప్రతిఘటించడంలో ఈ వేదిక ఆరంభమైంది. ఈ అంశాన్ని ఆస్తికేతరులు ముఖ్యంగా గమనించాల్సి ఉంది. ఐక్య సంఘటనలో భాగస్వాములైన ఆర్య సామాజికులు ఈ కార్యక్రమంలో ప్రాణా లర్పించడానికైనా మేము సిద్ధము ! అని నిర్ద్వందంగా ప్రకటించడాన్నిబట్టీ, అజిత్ కుమార్ ఇప్పటికే కల్కి దొంగ అని బహిరంగంగా ప్రకటించి పోరాటం కొనసాగించడాన్నిబట్టీ ఈ వేదిక పరిధిలో ఆస్తికతను దుయ్యబట్టాల్సిన అవసరంలేదనీ, అది ఉచితంకాదనీ తేలుతూనే ఉంది. ఆస్తికులంటే దుర్మార్గులనో, నాస్తికులంటే ధర్మదూరులనో అనుకునే అపోహ మనమధ్య ఏర్పడి ఉంది. నిజానికది నిజం కాదు. 22 సదస్సులోనే ఇందుకు మరో విషయం ద్వారా పరిస్థితిని వివరించాను. అదేమంటే ఆస్తికత పేరున జరిగే వంచనతో వంచితులెవరో చెప్పండి? అనడిగాను. ఆలోచించారు. ఆస్తిక విశ్వాసులేగాని, ఆస్తికేతరులు కాదన్నది స్పష్టమైంది. అదీ విషయం. ఆ విభాగంలో వంచకులూ ఆస్తికులుగానే చలామణీ అవుతున్నారు. మరి వంచితులూ అమాయకులైన ఆస్తికులే. మనం ఆస్తికత పేరన బలైపోతున్న వారికొరకే అమాయకులైన ఆస్తికుల కొరకే - గదా ఉద్యమిస్తున్నదీ, మరి ఆస్తికులుగానే ఉన్న ఈ వంచితులు మనకు మిత్రులా? శత్రువర్గమా? వారిపై మనకు వ్యతిరేకతా? సానుభూతా? నిదానంగా ఆలోచించండి.

 ఇదంతా ఆలోచించితే వంచనను వ్యతిరేకించే అన్నివర్గాల వారితో కూడినప్పుడే ఇది సమగ్రమైన సమైక్య వేదిక అవుతుంది. సరైన- గుణాత్మక స్థాయిలో - ఫలితాలను తక్కువ కాలంలో అందించ నారంభిస్తుంది అని తేలుతుంది.

 మిత్రులారా! ఎంతో ఉంది మనం మనసు విప్పుకుని మాట్లాడుకోవలసింది అయినా తొందరపడినందువల్ల అయ్యేదేమిలేదు. క్రమంగా, దృఢంగా, అవగాహనా పూర్వకంగా నడుద్దాం - చెడు మాత్రం జరగదు.

 గతితార్కికతపై చర్చా వేదికకు

 పూర్వరంగ విశేషాలు (భూమిక)

మిత్రులారా! గత జూలైలో జరుపుకున్న "మార్క్సిజం-ఒక తులనాత్మక విశ్లేషణ" అన్నదానికి కొనసాగింపే రేపటి జనవరి 11, 12, 13న జరగనున్న సదస్సు. ఆనాడే మనమందరం జనవరి కార్యక్రమానికి సన్నద్ధులం కావాలనీ, మరింతమంది అధ్యయన శీలురను వేదికపైకి, సదస్సుకూ వచ్చేలా అందరం గట్టి యత్నం చేయాలనీ అనుకున్నాము. ఇంతవరకు మీ అందరకూ తెలిసిన విషయమే.

 రేపటి సదస్సుకు సొంతలాభం ఒకింత మానుకుని కొంత వ్యయ ప్రయాసలకోర్చి మీరంతా తరలిరావలసిందిగా విజ్ఞప్తిచేస్తూ ఆహ్వానిస్తున్నాము. ఎవరి వంతు వారు చేయందే ఇట్టివి ఆసాంతం కొనసాగించడం కష్టం. కనుక మా వంతు మేము నిర్వర్తించడానికి సన్నద్దులమయ్యే మీకీ కబురందిస్తున్నాము · అనేక కార్యక్రమాల ఒత్తిడివల్ల మిమ్ములను వ్యక్తిగతంగా కలవడం సాధ్య పడకపోయినా విజ్ఞతతో సదస్సు కేతెంచిన వారినందరనూ ఆహ్వానితుల క్రిందనే ఎంచగలము. దీనినే ఆహ్వానంగా భావించమని కోరుతున్నాము.

 గతితర్కంపై విచారణలో అర్థంచేసుకుని ఉండవలసిన అంశాలు

ప్రతి సిద్ధాంతంలోనూ ఒక తాత్విక భూమిక, ఆచరణ భాగము కలిసుంటాయి. అలాగే మార్క్సిజానికీ ఉంది. అందు తాత్విక పరమైన అంశాలుగా : 

1) ఇది భౌతికవాద ధోరణికి చెందినది.

 2) పదార్థ - చలనాలను శాశ్వతమైనవిగాను, విడదీయరానివిగానూ అంగీకరించి; ఉన్న పదార్థం చలనంలో ఉందనిన్నీ, ఆ చలనం కొన్ని తార్కిక సూత్రాల కనుగుణ్యంగా అర్థంచేసుకునే స్థిరమైన క్రమంలోనే, పురోదిశగానే కొనసాగుతుందనే ప్రాతిపదిక ననుసరించే ఈ తత్వ శాస్త్రమంతా నిర్మాణమైంది. వాటినే గతితార్కిక సూత్రాలుగా చెప్పుకుంటున్నాం. ఆ సూత్రాలు ప్రధానంగా మూడు.

1) విరుద్ధ శక్తులమధ్య ఐక్యత ఘర్షణ. Unity of opposites and its Struggle.

2) సంఖ్యాత్మక లేక పరిణామాత్మకమార్పు గుణాత్మకమార్పుకూ, గుణాత్మకమార్పు సంఖ్యాత్మకమార్పుకూ దారితీస్తుంది. Quantitative Change leads to qualitative Change and its Vice versa.

3) "ప్రతిషేధ ప్రతిషేధము”, లేక "అభావము నభావము చేయుట” స్త్రీకరణ నా స్త్రీకరణము". The Negation of the Negation. 

 పరిణామ క్రమమంతా అనివార్యంగా, నిర్ణీతంగా పురోదిశగానే కొనసాగుతుందన్న అభిప్రాయం ఈ తాత్విక ధోరణిలో అత్యంత కీలకమైనది.

 (Note:- సాధారణంగా ప్రతి తత్వశాస్త్రమూ మూడు ప్రత్యేకాంశాలుగా ఉన్నదానిని విడదీసి అర్థం చేసుకోవాలంటుంది. వాటి గురించే వివరించే సందర్భంలో వాటివాటి దృక్పధాల ననుసరించి విభిన్న ధోరణులుగా అవన్నీ రూపొందాయి.) 

అది అనేకంగా మారిపోయింది.

 3) తాత్విక వైఖరులు మౌలికంగా రెండుగా (భావవాద - భౌతిక వాదాలుగా) విడిపోవడం ఆదిలోనే జరిగినా- మళ్ళా మళ్ళా దేని భాగంలో అది అనేకంగా మారిపోయింది. కనుకనే ఈనాడు భావవాదానుసరణకల అనేక ధోరణులూ, భౌతికవాదానుసరణకల అనేకానేక ధోరణులూ ప్రవర్తిల్లు తున్నాయి. ప్రస్తుతాంశం భౌతికవాద ధోరణికి చెందిన మార్క్సిజాన్ని గురించింది గాన దీని పై అనుకూల - ప్రతికూలురైన భౌతికవాదుల అవగాహనల్నే ప్రధానంగా విచారించడం బాగుంటుంది.

నామాట అర్థమవుతూనే ఉందనుకుంటాను. భావవాదులేలా నూ మార్క్సిజాన్ని అంగీకరించరనుకోండి. భౌతికవాదుల్లోనే, వైజ్ఞానికావిష్కరణలే తాత్విక వైఖరికి ఆధారంగా ఉండాలన్న భావసారూప్యత కలవాళ్ళలోనే, సైన్సునూ, చరిత్రనూ (సమాజాన్నీ), వ్య క్తినీ క్షుణ్నంగా పరిశీలించామనుకుంటున్నవాళ్ళలోనే Anti-Marxists, Pro-Marxistsగా చీలి ఉండడం కనబడుతుంది. కనుక ఈనాడీ తాత్విక ధోరణిని తులనాత్మకంగా విచారించి పరీక్షించాల్సిన అవసరమూ, పరీక్షించడంలో మరింత నిదానించాల్సిన అవసరమూ ఎక్కువగా ఉంది.

 మార్క్సిజాన్ని కాలం చెల్లిన లేక తప్పు అవగాహనతో కూడిన ధోరణిగా ఎంచే భౌతికవాదులు ప్రధానంగా చూపే ఆధారాలు సంగ్రహంగా యిలా ఉన్నాయి.

1) గతితార్కిక సూత్రాలు శాస్త్రీయంగా రుజువుకు నిలవవు.

2) ఈ సూత్రాలాధారంగా విషయాన్ని(పరిణామ క్రమాన్ని) వివరించడంలో మార్క్సు , ఏంగెల్సులు ఉదహరించిన దృష్టాంతాలు సరైనవికాదు. వాటిని తప్పుగా సూత్రానికి సరిపెట్టడం జరిగింది. 

3) ఈ సూత్రాలాధారంగా నిర్ణీత క్రమంలోనే జరగాల్సినవిగా వారు వారు చూపిన అంచనాలు నెరవేరలేదు.

4) ఈ సూత్రాలే విశ్వపరిణామ క్రమాన్ని నియమిస్తున్నాయని అంగీకరిస్తే వర్గరహిత సమాజం ఆదిమ కమ్యూనిజం గానీ రేపు రావలసి ఉందంటున్న, అభివృద్ధి చెందిన వర్గరహిత సమాజం గానీ ఉండేందుకూ, ఏర్పడేందుకూ కూడా వీలులేదు. వేరు రీతిలో నైనా Opposites ఉన్నాయనీ, వాటి మధ్య ఘర్షణ ఉండనే ఉంటుందనీ ఆవశ్యకంగా అంగీకరించాల్సి ఉంటుంది. లేకుంటే గతితార్కిక మూలాధారమే పడిపోతుంది. లేదా బలహీనపడిపోతుంది.

5) గతితార్కికాన్వయంలో మొదటి ఐదుగురి మధ్యనే మార్క్సు- ఎంగెల్సు-లెనిన్- మావో - స్టాలిన్లు భిన్నాభిప్రాయాలున్నాయన్న విషయాన్ని అత్యంత కీలకమైనదిగా పరీక్షకు స్వీకరించాల్సి ఉంది.

6) మార్క్సు ఏంగెల్సుల భావాలలో ముఖ్యమైనచోట్ల లెనిన్-మావో- స్టాలిన్లు వేరుపడ్డారన్నది నిజమా? కాదా?

7) అసలు మార్క్సు ఎంగెల్సులే మ్యానిఫెస్ట్లో రచనకు అనంతర కాలంలోనూ, జీవిత చరమాంకంలోనూ తాము ప్రధానంగా వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాల్లోనే పొరపడినట్లు, అందుకు పశ్చాత్తాపపడినట్లు వారి రచనల నుండే ఉట్టంకింపులు దొరుకుతున్నాయి. మరి వీటిమాటేమిటి? వీటికి విలువ ఉందా లేదా? మార్క్సిజాన్ని పరీక్షించే సందర్భంలో వీటిని విలువైన అభిప్రాయాలుగా పరిగణించాలా? అక్కరలేదా?

 అవలాఉంచండి. ఒక సత్యాన్వేషిగా ఎవరికివారం మరికొన్ని విషయాల్ని పరిశీలించాల్సి ఉంది.

1) గతితార్కిక సూత్రాల-నియమాల చట్రంలో మానవుని స్వభావాన్నీ స్వేచ్ఛను, సృజనను శాస్త్రీయంగా ఇమడ్చగలమా?

2) గతితార్కిక పునాదులాధారంగా మార్క్సు -ఏంగెల్సులు ఊహించిన అంశాలు - ప్రెడిక్షన్సు - నేరవేరని సందర్భాలలో వారి అవగాహనను శంకించాలా? గతితార్కిక శాస్త్రీయతను అనుమానించాలా? మరొకదాన్నా?

3) ఈ శతాబ్దిలో -వ ర్తమానంలో- మనందరం మన మన జీవితాల్లోనే గమనిస్తున్న చారిత్రక క్రమాన్ని చూస్తుంటే ప్రతిచోటా విప్లవం వచ్చిందనడం- అది విఫలమైపోవడం, యూరపు, చైనా, రష్యాలు క్రమంగా తిరిగి పారిశ్రామికీ కరణవైపుకూ, పాత భావాల (ఇందులో మతాలు, సామ్రాజ్యవాద వైఖరీ మరల ప్రాణం పోసుకోవడమూ కనబడుతోంది) వైపుకూ మరలడం జరుగుతున్న వాస్తవమనిపించడంలేదా?

4) మార్క్సిజం పేరున చెలామణి అవుతున్న, చాలభాగం చెత్త అన్న ఏంగెల్సు మాటల్ని, తమ కాలాలనాడే మార్క్సిజానికి వస్తున్న రకరకాల అర్థాలనూ, పోకడలనూ గమనించి నేను మార్క్సిస్టును కానని వ్యంగ్యంగా మార్క్సు అన్న మాటల్ని లెక్కలోకి తీసుకుంటే అసలు మార్క్సిజమంటే ఏమిటో నిర్ధారించడానికెంత జాగరూకత వహించాలో అర్థం కావడంలేదా? మరి మావోయిజం మార్క్సిజమా ? లెనినిజం మార్క్సిజమా ? మరోటినా? అన్నది నిర్ధారించడమెలా?

5) అతి ముఖ్యమైన ఒక సూచన చేస్తాను :- ఏయే పరీక్షా పద్ధతుల్ని, ఆధారాల్ని స్వీకరించి మార్క్సిజం సరైందనిగానీ, సరికానిదనిగానీ తేల్చుకోడానికి వీలవుతుందో దానిని సరైనదేననేవాళ్ళూ, సరికాదనేవాళ్ళూ కూడా ముందుగా నిర్థారించాల్సి ఉంది. ఉమ్మడిగా ఆ పరీక్షా పద్ధతి సరైందేననీ నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఏ సిద్ధాంత పరీక్షకైనా పరీక్షా విధానము, పరికరాలను రెండు పక్షాలూ అంగీకరించాలి. అవి అంగీకరించేవిగా ఉండాలి. ఏమంటారు? అవునంటే వాటిని రెండు పక్షాలూ వివరించండి. కాదు, అక్కర లేదంటే మరి తప్పొప్పులు తేల్చడానికి మార్గమేమిటో చెప్పండి. సమష్టిహిత కాంక్షులూ, విజ్ఞులూ లేక రెండు పక్షాల మేధావులకూ వీటిని గురించి నిజాయితీగా, తీవ్రంగా ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. 

సత్యాన్వేషణలో 

మీ సురేంద్ర

 భిన్న తాత్విక ధోరణులూ - ఒక పరిశీలన - 7

అధ్యయన శీలురైన జిజ్ఞాసు మిత్రులారా! గత కొద్దికాలంగా అద్వైత సిద్ధాంత మౌలికాంశాల్ని కొద్ది కొద్దిగా వివరిస్తూ వస్తున్నాను. సారసంగ్రహంగా మిగిలిన అంశాలను ముచ్చటించి ప్రతిపాదనరూపాన్ని పూర్తిచేశానీ సంచికలో. ఈ ధోరణి తప్పనేవాళ్ళూ వప్పనేవాళ్ళూ కూడా పరికించి అద్వైత సిద్ధాంత స్వరూపాన్ని వివరించానో లేదో ముందు నిర్ణయించండి. దాని బాగోగుల విషయం తరువాత చూద్దాం.

 గత సంచికలో పంచకోశ విచారణ ప్రక్రియను వివరించ నారంభిం చాను. గుర్తుంది కదూ. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ,ఆనందమయ కోశాలని వాటి పేర్లు.

 వాస్తవానికి (పారమార్థికంగా) ఐదూ అద్యాసరూపాలేననీ బ్రహ్మ భిన్నాలేననీ, వ్యావహారిక సత్తాకు చెందినంతలో మన అనుభవానికి వేరు వేరుగా అనిపిస్తున్నాయనీ చెప్పడమే అద్వైతుల అభిమతం. అందుకాధారాలు ఉపనిషత్తుల్లోనూ కనబడతాయి.

 (అన్నం బ్రహ్మైతి వ్యజానాత్.... ఆనందో బ్రహ్మైతి వ్యజానాత్) అయినా శంకరుని అధ్యారోప అపవాద న్యాయ పద్ధతిని బట్టి ముందుగా వ్యవహారంలో సామాన్యుల కామోదవిషయాన్ని అలాగేనని అంగీకరించి చివర కది నిలిచేది కాదని తేల్చడం జరుగుతుంది గనుక ఆ విధంగా ఒక ప్రక్రియా విశేషంగా మాత్రమే దీనిని స్వీకరించాడనుకోవాలి.

 ఆ నాటికి లోకంలో దేహాత్మవాదులు నుండి-ఆనందాత్మవాదుల వరకు భిన్న ధోరణుల వారూ ఉండి ఉండవచ్చు. కనుకనే దీనినొక చర్చనీయాంశంగా స్వీకరించి వాటికి వేరైనదే (పంచకోశ విలక్షణమైనదే) ఆత్మ లేక బ్రహ్మము అని సిద్ధాంతీకరించబోతాడు.

 సామాన్య జనులేకాక అసామాన్యులైన అద్వైతేతర ద్వైతవాదులు కూడా భ్రాంతులే నంటూ, అద్వైతాన్ని ప్రతిష్ఠించాలంటే రెండు విధాలుగా విషయాన్ని దృఢపరచాల్సి ఉంటుంది. ఒక వంక వారు వారనుకునే, మనకూ అనిపించే ఆయా ఆత్మవాదాలన్నీ (నానాత్మమంతా) అవిద్యా రూపాలేననీ (మాయా కార్యమిదంద్వైతం) (అజ్ఞాన కార్యరూపా లంటారు వాటినే) కనుకనే వాటిని 'వరలు' అనో 'ఉపాధులు' అనో అనాల్సిందేననీ వాటికి వేరైనదే పరమార్థ వస్తువనీ చెప్పవలసి వస్తోంది. ఒప్పించాల్సి ఉంది.

మరోవైపు, అలా అదివేరు ఇది వేరు అనడంకూడా నిజానికి నిజంకాదనీ, వ్యవహార మాత్రమేననీ అసలున్నదానిపై ఆరోపించడమేననీ వాస్తవానికి అవిన్నీ పరమార్థ సత్తాకంటే వేరు కానేకాదనీ, కాలేవనీ చెప్పవలసీ నిర్ధారించవలసీ ఉంది.

అందుకే, ఆఖరుకు-మీరనుకునే పంచకోశాలూ బ్రహ్మంకాదనీ, అలాగని బ్రహ్మ భిన్నాలూ కాదని చెప్పడం కొరకే - అధ్యారోప అపవాద న్యాయాన్నిబట్టి వివరించే ప్రక్రియల్లో దీనిని ఎత్తుకోవడం జరిగింది. 

 అతి ముఖ్య విషయం

ప్రతి సిద్ధాంతమూ కొన్ని ప్రమాణాల్ని, పదార్థాల్ని అంగీకరించి ఆ ప్రమాణాలద్వారా ఆ పదార్థాల జ్ఞానాన్ని కలిగించడం ద్వారా తన తత్వాన్ని వివరించే పనిచేస్తుంది. మరిప్పుడు అద్వైతానికా అంశాన్ని అనుసంధిస్తే - అద్వైతు లంగీకరించే ప్రమాణాలు-6, పదార్ధాలు-4 (శంకరుడు అన్యాప దేశంగా పేర్కొన్న వీటిని అద్వైతుల్లోనే పెక్కురు గమనించలేదంటే ఆశ్చర్యమే.)

 ప్రమాణాలు : ప్రత్యక్షాను మానోపమాన శబ్ద అర్ధాపత్యనుపలబ్ధులు.

పదార్థాలు :- నామ, గుణ, క్రియా, సంబంధాలు. (నోట్ : అయితే బ్రహ్మపదార్థం వీటిలో చేరదంటాడు?!)

 ప్రమాణాలలోని తారతమ్యాలు:- ఈ ప్రమాణాల వినియోగం విషయంలో శంకరుని పోకడలో కొంత గందరగోళముంది. 

1) ఆరు ప్రమాణాలు మా కంగీకారమంటాడు ప్రధానంగా.

2) ఉత్తమం శబ్ద (శృతి) ప్రమాణ మంటాడు.

3) శృతికీ, యుక్తికీ, స్వానుభవానికి సరిపోయిందో లేదో చూసుకో మంటాడు. దానర్థం శబ్దానుమాన ప్రత్యక్షాలు చాలునని.

4) కొన్నిచోట్ల అనుభవ విరుద్ధం కనుక అంగీకరించరాదనీ, మరి కొన్నింట ప్రత్యక్షానుమానాలవల్ల గ్రహించడానికి వీలులేని విషయాల్లో శబ్దాన్నే అంగీకరించాలనీ, మరోచోట బ్రహ్మం హేతు దృష్టాంత వర్జితమనీ అంటే అనుమాన ప్రమాణ విషయం కాదనీ... ఇలా రకరకాలుగా ఆయా సందర్భాలలో ప్రకటించాడు.

5) ప్రత్యక్షము - అపరోక్షము అన్న పదాలు ప్రయోగించేపుడు వాటిమధ్య విభజన రేఖ ఎక్కడో స్పష్టంగా లేదు.

6) బ్రహ్మము ప్రత్యక్ష విషయమా? కాదా? అనుమాన విషయమా? కాదా? శబ్దప్రమాణ విషయమా? కాదా? ఈ ప్రశ్నలకు శంకరుని అంగీకరించి అద్వైతులు ఏమి సమాధానం చెపుతారో చూడాల్సి ఉంది.

 ఎందుకంటే బ్రహ్మం అప్రమేయం, అలక్షణం, అవ్యవహార్యం, అచింత్యం వగైరా వగైరా పదాలచేతనూ, నేతి, నేతీతి వాక్యాల చేతనూ వ్యతిరేక రూపంగా ప్రతిపాదింపబడింది. ప్రత్యక్ష మవ్వాలంటే 'ఇంద్రియార్థ సన్నికర్ష' అన్న పరిధిలోకి రాగలగాలి. పైగా అతి సూక్ష్మమూ, అపరిమితమూనైనవి అతీంద్రియాలవుతాయి. బ్రహ్మము అణోరణీయాన్ మహతోన్ మహీయాన్ అని చెప్పబడింది. కనుక ప్రత్యక్ష మవడం కుదరదు.

 మరోచోట "చైతన్యాత్కించిన్నాస్తీతి సాక్షాత్కారనుభవం జ్ఞానం” అంటాడు. మరీ సాక్షాత్కారానికి అర్థమేమిటో?

 అపరోక్షానుభవాన్ని విలువైందిగా ఎంచుతారు వీరు. అపరోక్షమంటే సామాన్యార్థంలో న+పరోక్షం ప్రత్యక్షమనే మరీ బ్రహ్మం విషయంలో ప్రత్యక్షమూ పరోక్షమూ కాని అపరోక్ష మేమిటో వారే వివరించాలి.

 అనుమాన శబ్ద ప్రమాణాలవల్ల కలిగే జ్ఞానం పరోక్ష జ్ఞానమే నన్నది నిర్వివాదాంశం.

ఏదైనా విషయా న్నంగీకరించాలంటే శృతికీ, యుక్తికీ, స్వానుభవానికీ సరిపోవాలన్న అభిప్రాయం వెలిబుచ్చాడు శంకరుడు.

 మరైతే : - ఎ) శృతికీ-యు క్తికీ సరిపడి అనుభవానికి రానిదిగానీ సరి పోనిదిగానీ ఉంటే ఏమి చేయాలి?

 బి) అనుభవానికీ, యుక్తికీ సరిపోయి శృతిలో లేనిదిగానీ, శృతికి సరి పోనిదిగానీ ఏమి చేయాలి?

 సి) శృతిలో లేకా, అనుభవానికి రాకా యుక్తికి మాత్రం అందుతుంటే అప్పుడేం చేయాలి?

డి) పై మూటికీ ఆమోద యోగ్యం కాని విషయాలుగానీ, మూటిలో కొన్నిటికి సరిపోనివిగానీ, పరస్పరం విభేదించేవిగానున్న విషయాలుగానీ ఉంటే అప్పుడేం చేయాలి?

 ఇ) అసలింతకూ శృతి అని అద్వైత లంటున్నది దేనిని? వారు శృతులనే వాటిలోని ప్రతిమాటా సమాన ప్రామాణికత కలిగిందేనా? అనేకాంశాలు అద్వైతు లంగీకరించే, వివరించే ప్రమాణ పద్ధతుల విచారణలో ఎదురుపడతాయి.

పదార్ధాలు 

అద్వైతులు ప్రయోగించే పారిభాషిక పదాలు సుమారు 40 దాకా ఉంటాయి. అవన్నీ పైనన్న నాల్గింటిలోనే చేరతాయా ? లేదా ? అన్నదీ ఆలోచించాల్సి ఉంది. 

పరిభాష:- అద్వైతం, ద్వైతం, బ్రహ్మం, మాయ, అవిద్య, ఈశ్వరుడు, జీవుడు, సత్యం, సత్తా, ప్రాతిభాసికం, వ్యావహారికం, పారమార్థికం, అధ్యాస, అధ్యారోపం, అపవాదం, వివర్తం, సాక్షి, ద్రష్ట, దృశ్యం, దృష్టి, సృష్టి, ప్రత్యక్షం, పరోక్షం, అపరోక్షం, ప్రమేయం, అప్రమేయం, అనుభవం, జ్ఞానం, అంతఃప్రజ్ఞ, బహిఃప్రజ్ఞ, ఉభయతఃప్రజ్ఞ, ప్రజ్ఞ, అప్రజ్ఞ, స్వరూప లక్షణం, తటస్థలక్షణం, సజాతి, విజాతి, స్వగతభేదాలు, అనిర్వచనీయ ఖ్యాతి మొ||నవి. (నోట్: మరికొన్నింటినీ ఉటంకించవచ్చు. అవసరమైతే కలుపుకోవచ్చు) అభావం.

వీటన్నింటినీ ఇక్కడ వివరించడం కుదరదు. కానీ వీటిపట్ల సరైన అవగాహన ఉంటే అద్వైత సిద్ధాంతాధ్యయనం సులభతరమవుతుంది. సత్యాసత్య వివేచనకూ మార్గం సుగమం అవుతుంది. అతి ముఖ్యమైన కొన్ని మాత్రం ఈ విచారణలో చెప్పుకుందాం. గతంలో కొన్ని చెప్పే ఉన్నాను. వాటినీ గుర్తు చేసుకోండి.

 అద్వైతుల మాయ

ఏది నిజానికి లేనిదేనో, అయినా సమస్త సృష్టి కార్యానికీ కారణరూపం కాగలుగుతుందో, సత్యమనడానికి వీలులేనిదీ లేదనడానికి వీలు కానిదీ, అట్టిదిట్టిదనడానికి వీలుపడనిది ఏదో అది మాయ. యామా సామాయా ఏది లేనిదో అది మాయ అని అర్థం చెపుతారు అద్వైతులు. అయితే గొడవేముంది మనమధ్య అంటారేమో; అసలు గొడవంతా ఈడనే - మాయలోనే - ఉంది మాయా కార్య మిదం ద్వైతం అద్వైతం పరమార్థితః అని అద్వైతుల ప్రధాన నిర్ణయం. మరిందాక లేనిదన్నావు కదయ్యా మాయంటే, ఇప్పుడేమో ఈ నానాత్వ మంతటికీ కారణం ఆ లేనిదేనంటా విదేమి మాయయ్యా. నిజంగా మాయగా ఉందే అని ఎదురాడగా; మాయలో - నానాత్వంలో - మునిగి ఉన్నోళ్ళకీ మాయ ఒకపట్టాన అంతుబట్టదు సుమండీ. ఈ స్థితి నంతరించాక గానీ పొడసూపదు ఇది లేనిదేనన్న నిజం. అందుకనే బొత్తిగా లేనిది అని యనక సదసద్విలక్షణం, అనిర్వచనీయం అన్నారు దీనిని.

ఏమిటయ్యా నీ గొడవ! ఇంతకూ ఆ 'మాయ' ఉన్నదనా లేదనా నీ వాదన? అనడగ్గా; నిజంగా లేదుగానీ అసలే లేదంటానికి మాత్రం వీలు గాదు. పని జరిగిస్తోంది కదా!

నోట్:- నిజానికీ రగడ సామాన్యునికి అంతుబట్టేదికాదు. అసామాన్యులమనుకునే వారికీ అంతుబట్టిందనడానికీ దాఖలా లేదు. కాకుంటే, అద్వైతుల మనుకునేవారు ఎవరికివారు తమకు మాత్రం విషయం అర్థమైందనీ, అనుభవాని కొచ్చిందనీ!? ఇతరుల విషయం (వారెంత పండితులై నా) చెప్పలేమనీ చెప్పుకుంటుంటారు. అసలు ఉంది లేదనడానికి వీలుకాని ఈ 'మాయ' పై అద్వైతజ్ఞులలోనే అభిప్రాయ భేదాలున్నాయి. 'మూలావిద్య' 'తూలావిద్య' అంటారు వాటిని. మాయా మూలంలోనే అంటే బ్రహ్మంలోనే ఉందనీ, అలా అనరాదు అది మూలంలోనే ఉన్నదైతే మూలం ఉన్నంతవరకూ ఉంటుంది కనుక బ్రహ్మంవలెనే అదీ సత్యమై కూచుంటుందనీ, అపుడు ఈ నానాత్వం కూడా సత్యమే అవుతుందనీ అంటారు మూలావిద్య నంగీకరించని వారు. శంకరుని అధ్యాసభాష్యం పట్టిచూస్తే అద్యాస అనాద్యనంతమూ, నైసర్గికము అని తెలుస్తుంది. మరింక అవిద్య తొలగడం జ్ఞానం ఏర్పడడం తద్వారా బంధ విముక్తి కలగడం ఎలాగన్న ప్రశ్న పుడుతుంది.

 అద్వైతుల ‘బ్రహ్మ'

పరమార్థ సత్తు అని గతంలో చెప్పుకున్నాం గుర్తుంది కదూ. ఆ వివరణకు సరిపోయేదీ, మూడు కాలాలలో మార్పులేక ఉండేది కనుక సత్యమనడానికి వీలైనదీ, అన్నిగా కనిపిస్తూ, అయినట్లుగా అనిపిస్తూ, స్వరూపంలో నిర్వికారమైనది ఏదో అది బ్రహ్మము. అది సజాతీయ విజాతీయ స్వగత బేధ రహితమైంది. అట్టిది మరొకటి లేనిది కనుకనే హేతుదృష్టాంతాలు లేనిది. ఏకరసమైనది. ప్రజ్ఞాన ఘనమైనది. అది నిర్వికారము, నిరంజనమూ కూడా. కనుక తానుగా మార్పునొందదు. మరొకదానిచేతనూ మార్పునొందించబడదు. (మరొకటుంటే గదా.)

ఈ నానాగా కనిపిస్తున్నదీ బ్రహ్మమే. నానాత్వం రాక ముందున్నదీ, పోయాకా ఉండేదీ బ్రహ్మమే. యతోవాయిమాని భూతాని జాయంతే, ఏన జాతాని జీవంతి, యతృయంత్యభి విశంతీతి తద్విజిజ్ఞాస స్వతబ్రహ్మ. జీవేశ్వర జగత్తులుగా భాసిస్తున్నదీ అదే. అభిన్న నిమిత్తోపాదాన కారణం బ్రహ్మ.

ఆగాగు నాయనా! ఈ భాసించడమేమిటి? అదే ఇదిగా అయ్యిందా లేదా? పరిణమించలేదంటవా ? అనేగా అనేది. కార్యకారణ ప్రక్రియ అధ్యారోప అపవాద న్యాయరీత్యా మాటవరసకే నిజంగాని, నిజంగా నిజం కాదనేగా.

మరైతే ఈ నానాత్వాన్నంతా ఎలా సరిపెడతావయ్యా? వివర్తవాద రీత్యా అనంటాడు శంకరుడు. 

విపర్తవాదం

బ్రహ్మ వివర్తమే ఈ జగత్తుగా భాసించేదంతా. నానాత్వమంటే ఇంకేమోననుకునేవు. జీవేశ్వర ప్రకృతాలే నానాత్వమంటే.

ఇంతకూ వివవర్తమంటే ఏమిటో వివరించవయ్యా బాబూ. తినేస్తున్నావు గదయ్యా.

సరే, సరే విను, ఉన్నది వాస్తవానికి ఏ మార్పూ, పొందకనే-ఏ రీతి గనూ పరిణమించకనే-మారినట్లు గోచరించడం, ఉన్నది ఉన్నట్లే ఉండగనే అనేకంగా తోచడం ఉంది చూశావూ దానినే వివర్తమంటారు. ఉన్నది క్రొత్తదిగా అనిపించడం, కనిపించడమేగాని వేరుగా అవడంలేదు. ముందున్నది తన స్వరూపాన్నిగానీ, స్వభావాన్నిగానీ కోల్పోకనే కొత్తది ఏర్పడినట్లు కొత్త లక్షణం భాసించడముందే దానినే వివర్తమంటారు.

వివరణ నిక్కడికాపి విషయాన్ని సమీక్షిస్తాను

1. అద్వైతం-అజాతవాదాన్ని ప్రతిపాదిస్తుంది అంటే సృష్టి స్థితిలయాలన్నవి అసలు జరగనే లేదంటుంది. ననిరోధో నచోత్పత్తి నబద్ధో నచసాధకః నము ముక్షుర్నవై ముక్తః ఇత్యేషా పరమార్థతా.

2. సజాతీయ విజాతీయ స్వగత బేధ శూన్యము, నిర్వికారము, నిరంజనము, హెతుదృష్టాంతవర్జితమైనదా బ్రహ్మము.

 3. త్రివిధ సత్తాలున్నాయి. అందు పారమార్థిక సత్తానే సత్యమనడానికి తగిన యోగ్యత ఉంది.

 4. అధ్యారోప వాద న్యాయపద్ధతిన తన సిద్ధాంతాన్ని నిలబెట్టే యత్నం చేస్తాడు శంకరుడు.

 5. అధ్యాస అన్నది నానాత్వానికి ఆధారము. అధ్యాస అన్న పదము భ్రాంతికి పర్యాయము (స్మృతిరూపః పరత్ర పూర్వ దృష్టావ భాసః అధ్యాస). 

6. ప్రమాణాలు :- 6, పదార్థాలు-4, చాలా విషయాల్లో శృతికి అధికత ప్రామాణికతను ఆపాదిస్తాడు.

7. ఈ నానాత్వమంతా అధ్యాస జనితము, మాయాకార్యము, వ్యవహారిక సత్తా మాత్రము నిజానికి లేనిదే.

8. అతని తత్వ సారమంతా రెండు ముక్కలో చెపుతానంటూ ఇలా అంటాడు. బ్రహ్మసత్యం- జగన్మిధ్యా, జీవో బ్రహ్మైప నాపరః (మిధ్య అంటే అతస్మిన్ తద్ బుద్ధిః అన్న అర్థమూ అతడు చెపుతాడు.)

 సత్యాన్వేషణ మండలి - ఒక అవగాహన

విభిన్న ధోరణులకు చెందిన మేధావులకూ, అనుయాయులకూ, జిజ్ఞాసువులకూ,

ఆర్యులారా! సత్యనిష్ట, సమాజహితకాంక్ష మనందరి యోగ క్షేమాలకు అవసరమై ఉంది. వివేకులెవరూ కాదనరాని, కాదనలేని అంశమిది.

 గత 4,5 సం॥లుగా మండలి అంతకుముందుకంటే సమాజానికి మరింత దగ్గరైంది. అటుపిమ్మట సమాలోచన శిబిరాల ద్వారానూ, రెండేండ్లు పైబడి "తత్వ చర్చావేదిక” ద్వారాను మరింతమంది ఉద్యమకారులతో, మరింత సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంది. అలా సంఘాల, వ్యక్తులతో ఏర్పడ్డ పరిచయాలద్వారా పరస్పరం ఒకరి నొకరు మరింత దగ్గరగా చూసుకునే అవకాశం ఏర్పడింది. అయినా —

మండలి అనుసరిస్తున్న తనదైన ప్రత్యేక రీతివల్ల ఒక బాణీకి అలవాటు పడ్డ సమాజం మా గురించిన అనేక సందేహాలను వెలువరిస్తూ వస్తోంది. అడపాదడపా తప్పనిసరైనప్పుడో, అవసరం అవకాశం ఏర్పడ్డప్పుడో మా (మండలి) గురించి అంతో యింతో సందర్భానికి తగినట్లు వివరిస్తూనే వస్తున్నాము. అయినా అవేవీ తామాశించిన రీతిలో, స్థాయిలో లేకపోవుటచే కొందరూ, తమ అంచనాలకు వేరుగా ఉండడంవల్ల కొందరూ, యిష్టపడిన మూసలో ఇమడకపోవడంవల్ల మరికొందరూ మా వివరణలవల్ల సంతృప్తిని చెందలేకపోతున్నారు. మిత్రదృష్టి కలిగినవారిలోనూ మండలిపట్ల అనుకూల వైఖరేగాని స్పష్టమైన అవగాహన ఏర్పడలేదన్నదీ పరిశీలనలో తేలుతున్న విషయమే. ఈ గతాన్నంతటినీ దృష్టి నిడుకుని మండలి స్వరూప స్వభావాలూ, దాని సాధ్య సాధనాలు, కార్యక్షేత్రము అన్నవాటిని గురించి ఒక ప్రత్యేక రీతిలో తెలియజేయాలనిపించింది. అలా అనిపించడమే ఈ వినిపించడానికి మూలం (ప్రాతిపదిక) అయ్యింది. వినడం తెలిసి విని వాస్తవాన్ని కనండి.

1) తాత్విక అవగాహనల పరంగా సమాజం ప్రధానంగా "ఆస్తికత - నాస్తికత” అన్న రెండు దారులు పట్టిందిగదా? మీరేదారినంగీకరిస్తున్నారు? అనుసరిస్తున్నారు?

సమా :- చాలా సందర్భాలలో సమాజం నుండి మాకెదురైన ఈ ప్రశ్నకు సుస్పష్టంగానూ, ఆధార సహితంగానూ నా నిర్ణయాన్ని తెలుపుతూనే వచ్చాను. నేను ఆస్తికుణ్నీ కాదు, నాస్తికుణ్నీ కాదని. అదెలా సాధ్యం అన్న ఆస్తిక, నాస్తిక పక్షీయుల్ని కొన్ని వివరాలడిగేవాణ్ని.

A) ఆస్తికుణ్నంటున్నావు కదా? ఆస్తికతను తెలిసే అంగీకరించావా? వినా? ఎక్కువమంది వినడం, చదవడం ద్వారాననే చెప్పేవారు. కేవలం వినడం, చదవడం (శబ్ద ప్రమాణమంటారు దీన్ని) ద్వారా కలిగేది వాళ్ళేమంటున్నారో, వీళ్ళేమంటున్నారో అన్న విషయమేగాని ఆ మాటల ద్వారా వారు వ్య క్త పరచింది వాస్తవమో కాదో విన్నవారికి తెలియదుకదా!

B) కొందరు హేతుబుద్ధితో (తార్కికంగా) ఆ నిర్ణయానికి వచ్చాము అనేవాళ్ళు, అనుమాన ప్రమాణం ద్వారా నన్నమాట. హేతుసాధ్యాల స్వరూపం తెలిసి, దానిని సపక్షంలో చూసి ఉంటేగాని అనుమానం ద్వారా ఈశ్వరుని ఉనికిని ఊహించడానికి వీలవదు. ఈశ్వరుని అనుమానించడానికి తగిన సద్ధేతువుగానీ, యోగ్యమైన దృష్టాంతం (ఇక్కడ ఉదాహరణకు- ఉపమానానికి ఉన్న తేడా తెలిసుండడం అత్యంతావశ్యకం) లభించిందా ? కోణంలోనూ సంతృప్తికరమైన సమాధానం ఆస్తికుల నుండి ఇప్పటికీ మాకు లభించలేదు. వ్యక్తిగతంగా నా ఆలోచనకూ అందలేదు.

C) ఇక ప్రత్యక్షంగా తెలియడం :- ఆస్తికతత్వ స్వరూపాలెరిగిన పండితులెవరూ ఈశ్వరుడు ప్రత్యక్ష విషయం కాగలడని చెప్పలా. పైగా ఒక నిర్ణయానికి వచ్చారు కూడా చాలామంది. ప్రత్యక్ష, అనుమానాలకు విషయంకాడని. ఎలాగంటే అతీంద్రియుడు కనుక ప్రత్యక్ష విషయం కాదు. హేతు దృష్టాంత వర్జితుడు కనుక అనుమాన విషయంకాదు. కనుకనే దాదాపు అన్ని మతస్తులూ గ్రంథ ప్రామాణ్యాన్ని ప్రధానంగా స్వీకరించారు.

 మొత్తంమీద ఈశ్వరాస్తిత్వం ఇప్పటికీ అనిర్ధారిత విషయమేనన్నది నిర్వివాదం. కనుక అలా తేలని విషయమగుటచే నేను ఆస్తికుణ్ణనడం వీలవడంలేదు. పైగా అన్నవాళ్ళూ విశ్వాసమూలకంగానే అంటున్నారుగానీ, వ్యక్తిగతంగా వారికి దానిని గురించి (సృష్టికర్తయిన ఈశ్వరుని ఉనికిగానీ, శరీరభిన్నమైన జీవుని ఉనికిగానీ, మరణానంతరం పొందవలసి ఉంటుందని వాళ్ళు చెప్పే పరలోకంగానీ తేలని, తెలీని విషయాలే గనుక) తెలిసిందిలేదు. కనుకనే తెలిసి ఆస్తికుణ్ణనడం ఎవరికీ సాధ్యంకాదని స్పష్టంగా చెప్పే ఉన్నాను.

 ఆస్తికులు ఏమీ అనలేక మౌనంగా ఊరుకోగా, ఇది వింటున్న నాస్తికులు నువ్వు చెప్పింది కరెక్టేగానీ దీనికింత విచారణ కూడా అనవసరం. లేనిదాన్ని లేదనుకోడానికి ఎందుకింత ప్రయాస? అనన్నారు. అయ్యా, వారూ ఉందన్నది వారు రుజువుపరచలేకపోయారు. మనకూ తార్కిక యోచనకు గానీ, అనుభవానికి గానీ అందడం లేదు అన్నంత వరకే గదా  పైన తేలింది. అనడిగాను. అవునంటూనే అది చాలదా నాస్తికత రైటన్న నిర్ణయానికి రావడానికి? అని ఎదురాడారు. రెండు మూడు ప్రశ్నలు వేస్తాను ఆలోచించి సమాధానాలు చెప్పండన్నాను.

1) ఒక విషయంపై నలుగురు నాలుగభిప్రాయాలు వెలిబుచ్చారనుకోండి. అందులో 1వవాని భావము రుజువుకు నిలవకపోవడమో, తప్పని రుజువుకావడమో జరిగిందనుకుందాం. దానినిబట్టి మిగిలిన మూడూ వాస్తవాలనో మూటిలో ఏదో ఒకటి వాస్తవమనో రుజువైనట్లు అవుతుందా? 

 2) మూడు తప్పని తేలినాయనుకోండి. ఇక నాల్గవది ఒప్పని తేలినట్లా? కాదా? ఈ ప్రశ్నలు వేసి నా కేమనిపిస్తోందంటే, పై రెండు సందర్భాలలోనూ - ఒప్పేదో తేలినట్లు కాజాలదు. అని చెప్పాను.

 పరిశీలకులారా! ఇక్కడికాగి మీ అభిప్రాయం ఎలా ఉందో తేల్చుకోండి. నాది రైటోకాదో తేల్చండి. మరో కోణమూ పరిశీలించాల్సి ఉంది.

 1) పై నలుగురి అభిప్రాయాల్లో ఒకనిది ఒప్పని రుజువైందనుకోండి. మిగిలినవన్నీ తప్పని తేలినట్లేనా?

 2) ఒకటవవానితోపాటు మరి ఒకరిద్దరివి కూడా ఒప్పులయ్యే అవకాశం ఉందా, లేదా ? నా లెక్కనైతే ఒక విషయంలో ఎన్ని విభిన్నాభిప్రాయాలున్నా అందే ఒక్కటి నిక్కచ్చిగా ఒప్పని తేలినా మిగిలినవన్నీ తప్పులనీ తేలినట్లే. మొత్తమ్మీద ఏమని తేలినట్లు?.... ఇది స్పష్టంగా తేల్చుకుంటే దీనినే మన ప్రస్తుతాంశానికి అన్వయింపచే స్తే ఏమని తేలుతుంది

1) సృష్టికర్తను గురించిన భిన్నాభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. అవి ప్రధానంగా రెండు రూపాలల్లో ప్రకటమయ్యాయి. 1) ఉన్నాడు-లేడు అన్నది కాగా 2) ఉన్నాడు అన్నవాళ్ళలోని అంతర్గత భేదాలు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు లాంటివి. 

ఇప్పటి మన విచారణ ప్రకారం దేవుడు ఉన్నాడని రుజువు కావడంలా. రెండో విషయాన్ని బట్టి ఉన్నాడంటున్న వాళ్ళలో వాళ్ళకే ఎవరున్నాడంటున్నది నిజానికి సరైందో కూడా తేలలా. ఏమంటారు? మిత్రులారా! విశ్లేషణ విచారణ సజావుగానే సాగుతోందా? ఇంతవరకు చేసిన విచారణను బట్టయితే నాస్తికత రుజువైనట్లు కాదు. ఆస్తికత రుజువుకానట్లు మాత్రమే. అస్తి-నాస్తి అన్న ధోరణులపై శాస్త్రీయ విశ్లేషణ చేయాలనుకుంటే మాత్రం ఇదెంతో కీలకమైన విషయం.

ఉంటే చూపించు అనడిగి చూపించలేకపోయావు గనుక అనో, ఎవరికీ కనబడడంలేదు గనుక అనో, లేదని అనడం ఉందే అది హేతువాదమూ కాదు, దానిలో శాస్త్రీయ పోకడాలేదు. అది ఎదుటివాని బలహీనతపై నిలబడి రగడ చేసే బండవాదం మాత్రమే. కాబట్టి మనం నాస్తికులమని ప్రకటించు కోవాలంటే ఆస్తికుడు ఉన్నాడని తేల్చలేకపోయాడు గనుక అన్న ఆధారం హేతువు కాజాలదు. దాదాపు నాస్తికులంతా ప్రధానంగా అనుసరిస్తున్న ఈ వైఖరి పరీక్షకులంగీకరించ దగింది కాదు. నాస్తిక్యాన్ని రుజువు పరిస్తేగా నాస్తికుడనని శాస్త్రీయంగా చెప్పుకోవడం సాధ్యంకాదు. మరి అందుకున్న మార్గమేమిటి? వనరులేమిటి? ఆలోచించండి. సర్వస్వతంత్రమైన, పదార్థ జన్యం కాని చేతన పదార్థం సిద్దించడంలేదన్నది మాత్రం నాస్తికతను నిర్ధారించే రుజువుకాదు. మరేమంటే పదార్థ జన్యమే చైతన్యము అని నిర్థారణ కావడమే సరైన ప్రయోగమవుతుంది. దీనికి నాస్తికులలో విజ్ఞులు చూపే ఆధారాలిలా ఉంటున్నాయి.

1) విజ్ఞాన శాస్త్రావిష్కరణలనుబట్టి చైతన్యం పదార్థ సమ్మేళన జనితమని అంటున్నాము. జీవ పరిణామవాదం దీనిని రుజువు పరుస్తోంది గదా?

మళ్ళా నా ప్రశ్న ఆస్తికుల్నడిగినట్లే. 1) ఇది నీవు తెలిసి చెప్పావా? విని, చదివి చెప్పావా? దీనికి సమాధానం నాస్తికులందరూ, ఆస్తికులు చెప్పినట్లే వినో చదివో చెప్పాననే అంటున్నారు.

పరిణామవాదం యోచనాత్మక సిద్ధాంతమా ? ప్రయోగాత్మక సిద్ధాంతమా ?

Note:- సైన్సులో 1st డిగ్రీ థియరీస్ అనీ 2nd డిగ్రీ థియరీస్ అనీ వుంటాయి. నిజానికి మొదటితరహా వాటినే శాస్త్రీయస్థాయి కలిగిన విషయాలంటారు. ఈ తరహావాటిపై భిన్నాభిప్రాయా లుండవు. వాటికి సార్వకాలీనత, (యూనివర్సాలిటీ ఉపయోగార్హత వుంటుంది.) మరి రెండో తరహావో; కొన్ని ఆధారాలతో పరికల్పన రూపంగా ఉంటాయి. ఒకే విషయముపై భిన్నవాదాలు (హైపోథిసిస్) ఉండేందుకు వీలుంది. కనుక 1 st డిగ్రీ థియరీస్ నే ప్రయోగాత్మకంగా నిర్ధారిత విషయాలుగా స్వీకరించాలి. రెండో తరహా వాటి పై కొన్ని అభిప్రాయలు మాత్రం ఏర్పరచుకుని వాటి యాదార్ధ్యతానిరూపణకై - ప్రయోగాలు సాగిస్తూంటుంది విజ్ఞాన శాస్త్రం. సరే. ఇదంతా ఎందుకు అనుకోవలసి వచ్చిందంటే నాస్తిక్యతవైపు మొగ్గడానికి (మామూలు నాస్తికులందరకూ మరో నాస్తిక పెద్ద చెప్పిన మాటే బండగుర్తుగా నమ్మకమై కూచుంది) ఉన్న ఒకే ఒక్క శాస్త్రీయాధారం పరిణామ వాదం. అంతకు మించిన ఏ రకమైన వైజ్ఞానికావిష్కరణలూ ఇప్పటికి (అంటే ఇదిరాసే -1996 డిశంబరు 1 నాటికి) మనకందుబాటులో లేవు. అయితే దూకుడుగా ఆస్తికుల మల్లేనే ఒకవైపుకు తగినంత రుజువులు లేకుండానే) ఒరిగిన - దూకిన - నాస్తికుల మనుకునే వాళ్ళకు ఒక పట్టాన ఈ విశ్లేషణ ఫలితాన్ని అంగీకరించ బుద్దిపుట్టదు.

మరో ముఖ్యమైన విషయముంది నాస్తిక్యం రుజువు కాబడలేదు రుజువైన విషయంకాదు అనడానికి. మన మెరిగిన భౌతిక పదార్థాల విషయంలోనే కొన్ని పదార్ధాల సమ్మేళనం వల్ల కార్యద్రవ్యం (క్రొత్త లక్షణంకల మరో పదార్ధం) ఏర్పడడం. ఇది మనందరకూ తెలుసు. ఇక్కడి విజ్ఞులైన ఆస్తిక - నాస్తిక పక్షాలు రెండూ విభేదించరన్నది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి

 (Note:- ఈ మాటనేటప్పటికి నాస్తికుడికి విషయం తేలిపోయినట్లే అనిపించింది. కాని నిజానికి తేలలేదన్నదే నిజం.)

2) కొన్ని పదార్ధాల కలయికవల్ల ఏర్పడ్డ కార్యద్రవ్యం వల్ల అంతకు ముందే ఉండి వ్యక్తంకాని మరో పదార్థం వ్యక్తదశకు రావడం. అభివ్యక్తమవడం అన్నదీ ఉంది. ఈ అంశాన్ని విజ్ఞాన శాస్త్రం నిర్వందంగా అంగీకరిస్తుంది. రేడియో, టి. వి, టేపురికార్డింగ్, సినిమా ఫిలింపై సౌండ్ ట్రాక్, వగైరాల ద్వారా మనకీ విషయం నిర్ధాణవుతుంది. ఒకరకమైన పరికరం తయారవడంతో అది రిసీవర్గా పనిచేసి అంతవరకు ఉన్నవాటినే పట్టియిస్తుంది. ఈ వైజ్ఞానికావిష్కరణలను తీసుకుని ఆస్తికులడిగారనుకోండి. మీరనే జీవపదార్థానికి వలసిన సమ్మేళనం ఏర్పడినప్పుడు ఉన్న చైతన్యమే వ్య క్తమవుతోందంటాము. దానిని త్రోసిరాజని పదార్థజన్యమే చైతన్యమనడానికి మీ వద్ద రుజువులున్నాయా అని. ఇదిగో ఇక్కడ ఇంకా తేలనితనముంది నాస్తిక్యం ప్రక్కకు శాస్త్రీయంగా రావడానికి. నిజాయితీగల కొందరు శాస్త్రజ్ఞులుకూడా ఏదో రూపంలో విశ్వనియామక శక్తిని ఊహించుకోడానికి ఇక్కడే వెసులుబాటు ఉంది. పరిణామవాదం తెలిసి ఉన్నవారైనా పూర్తిగా నిర్ణయానికి రాకపోవడానికీ కారణాలూ ఇక్కడే ఉన్నాయి. ఆవాదం సైన్సు ప్రకారం 2nd డిగ్రీకి చెందినది మాత్రమే. ఇన్ని రకాల ఆధారాలు చూపుతున్నా నాస్తికంవైపు ఇవేవీ ఆలోచించుకోకుండ గనే కొమ్ముకాసినవారు ఎదుటివారు చూపిన ఆధారాలు ప్రక్కనబెట్టి నిలబెట్ట వీలులేని తమ పాత భావాలకి నెత్తినెట్టుకోవడం అన్న ఆస్తికుల విధానాన్నే ప్రధానం చేసుకుని కొనసాగుతున్నారు. దిశలు వేరేగానీ పోకడరీతి ఒక్కటే నన్నమాట.

 పైగా ఆస్తికులూ, నాస్తికులూ కూడా రెండూకాలేని మమ్ము వారి వారి పక్కీలో మావాడివి కానంటున్నావు కనుక రెండోవారి వాడివేనంటూ రెండు ముద్రలు వేసి హేతుబద్దంగానే ఈ నిర్ణయం చేశాము. నీగురించిన నిజాన్నే ప్రకటించాము అంటున్నారు. మరికొందరైతే ఇంకొంత ముందుకెళ్ళి అదో యిదో గూడ తేలని, తేల్చుకోలేని, తెగేసి చెప్పలేని నీవు మేలుకొలుపులు, వివేకపథాలు లాంటి మాటలు వాడడం విడ్డూరమే. నిజానికి నీవొక భయస్తుడివి అనీ అంటున్నారు. ఈ రకంవాళ్ళకు నేను చెప్పేదొకటే ధైర్యస్తులు కదామీరు. రండి కూర్చుని మాట్లాడుకుందాం. పై రెండు పక్షాల్లో దేనినైనా సరే ఆధార సహితంగా నిర్ధారించండి. నేను ఆ గొడుగు క్రిందకుచేరి పది మందినీ చేర్చే యత్నం చేస్తాను. మీరనుకున్న పక్షం అనిర్ధారితమైతే మీరా పడగనీడ నుండి బైటపడి మరో నలుగుర్నీ బైటకు లాగవలసి ఉంటుంది. ఏమంటారు? రెడీనా?

 విజ్ఞానశాస్త్రంతో పరిచయమూ, హేతుబద్ధాలోచన ఉందనుకుంటున్న- ఉన్న-కొందరైతే ఏమయ్యా ఆస్తిక గ్రంథాల, గురువులపై అమాయకంగా పెట్టుకునే నమ్మకానికీ, శాస్త్రీయ పరిశోధన లాధారంగా హేతుబుద్ధితో అంగీకరించే నమ్మకాలకు సమాన ప్రతిపత్తిని కలిగిస్తున్నాపు గొప్ప సత్యాన్వేషణే నయ్యానీది అంటూ నిజాయితీగానే ఎత్తిపొడుస్తున్నారు. ఇది వినడానికీ, ఆలోచించుకోడానికీ కూడా ఒకింత సబబుగానే అనిపిస్తుంది. అది నిజంకూడా. విజ్ఞానశాస్త్ర గ్రంథాలూ, ఆస్తికశాస్త్ర గ్రంథాలూ విశ్వాసులకు సమాన స్థాయి కలవి అనడం పొసగదు ఎందుకంటే ఆస్తిక్యం చెప్పబడ్డ అనేకాంశాలు తప్పనీ వైజ్ఞానిక ప్రయోగాలు తేల్చాయి. పైగా ఈనాడు మనమూ కావాలనుకుంటే ప్రయోగశాలల్లో వాటిని పునఃపరీక్షకు లోనుచేసి చూసుకోవచ్చు కూడా- పైగా మనం నమ్ముతున్న, మన కందుతున్న విజ్ఞాన శాస్త్రావిష్కరణలు ప్రపంచ వైజ్ఞానికు లందరిచేతా సరిచూడబడుతున్నవే. సరిచూడబడ్డవే. వైజ్ఞానికాంశాలలో వేటిపట్ల సార్వ జనీనత లేదో వాటినింకా తేలని అంశాలుగానే విజ్ఞానశాస్త్రజ్ఞులు భావించి ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ఒకే అంశంపై రెండూ అంత కెక్కువ ధియరీస్ ఉన్నంతకాలం వాటినింకా తేల్చవలసిన వాటిగనే వైజ్ఞానికు లెంచుతారు. మరి ఆస్తిక్యంలో ఆ దృక్పధం కొరవడింది. వందల సిద్ధాంతాలు పరస్పరం ఒకే విషయంలోనే విభేదించుకుంటూనే ఎవరి సత్యం వారిదే ననుకుంటూ తమ ధోరణికి భిన్నమైనవి అసత్యాలూ భ్రాంత్యాత్మ కాలూనని ఎంచుతూ, ఖండన సాహిత్యాన్ని ఉత్పత్తిచేస్తూ బండగా మొండిగా కొనసాగుతున్నాయి. మాటకు మాత్రం ఆధారాలుండాలంటూ హేత్వాభాసల్నే హేతువులుగా చూస్తూ, చూపుతూ గట్టిగా నిలదీసినపుడల్లా ముడుచుకుంటూ సందు దొరికినపుడల్లా సాగుతూ వస్తున్నాయి. ఒక్కరిలోనూ నిజాయితీగా 'నిజం తేల్చుకునే స్వీకరించాలన్న' స్థిరచిత్తం కానరావడంలేదు. అదే ఉంటే పరీక్షించుకుందాం రండంటే సరేనంటూ రారెందు కని? దాదాపు అందరూ సత్యధర్మాల గురించి ప్రవచించే వారే. ఆచరించేవారు బహు అరుదు.

 కనుక నిజానికి తేలని ఒక అంశంపై రెండు పోకడలూ విశ్వాసపూర్వకమైనవే అయినా వైజ్ఞానికాధారాలపై నిలబడి విశ్వసించడం ఒకింత యోగ్యమైనదనుట కాదనరాని విషయం. అయినప్పటికీ విశ్వాసం రుజువు కాదు. కాలేదు కూడా. కనుక ఆస్తికతా, నాస్తికతా శాస్త్రీయంగా రుజువైన అంశాలు కాదన్నది మరొక పక్షం. పై రెంటికంటే ఇది మరింత వైజ్ఞానికం, మరింత యుక్తి సహం. ఇవి మూడు దృష్టులు.

మూడోవైపున్న నన్ను మిగిలిన యిద్దరూ నిగ్గదీయడానికి యోగ్యులు కాదు. వారిద్దరిలో ఒకరినొకరు నిగ్గదీసుకుంటే మాత్రం నాస్తిక్యంవైపు మొగ్గు చూపుతుంది ముల్లు. కారణం పైన వివరించిందే అయినా అవధారణ కొరకు రెండు వాక్యాలు చెపుతాను. ఇద్దరూ ప్రధానంగా విశ్వాసులే అయినా.

ఆస్తిక్యపు విశ్వాస స్థానాలు:- పరస్పరం విబేధించుకునే, విరోధించుకునే అనేక ప్రమాణ గ్రంథాలు పచ్చి మోసగాళ్ళలా తేలుతున్న, ప్రపంచాన్ని గురించి (ప్రకృతి-సమాజము-వ్య క్తి-వాటి మధ్యనున్న సంబంధాల గురించి) కనీసావగాహనలేని గురువులు. వీరిలో వీరికి ఒకడంటే ఒకడికి గిట్టదు.

 నాస్తిక్యపు విశ్వాస స్థానాలు:- ముఖ్యంగా వైజ్ఞానికావిష్కరణలు, సామాజిక శాస్త్ర రచనలు, చరిత్ర గ్రంథాలు, తేలని, తెలీని విషయాల నావల పెట్టి ఈ లోకసంబంధమైన అంశాలలో పరిశీలనలు.

పై వాటినిబట్టి నమ్మకానికున్న బలహీనత అలా ఉండనే ఉన్నా నమ్మక తప్పని స్థితంటూ వస్తే రెండో పోకడకు చెందిన సమాచారాన్ని నమ్మడం హేతుబద్ధం అవుతుంది కదా ! అయినప్పటికీ వాస్తవమేమంటే,

 ఆస్తిక నాస్తిక ధోరణుల్లో నాస్తికంవైపు మొగ్గు కనబడుతున్నా రెండూ శాస్త్రీయంగా తేలని విషయాలే. కనుక సత్యాన్వేషణ తీరుతెన్ను లెరిగిన ఎవరైనా ఆ రెంటిలో తెలిసి తెలిసి ఒకవైపుకు వంగడం కుదరదు. సత్యాన్వేషికి మూడు రకాలైన (మూడు గుంపులుగా) భావజాలం ఉంటుంది మనస్సులో.

 1. ప్రయోగరీత్యా రుజువైన అంశాలు. మరల ప్రయోగంలో సరి చూసుకుంటానికి వీలైనవి. అందుబాటులో ఉన్నవి. వీటిని నిర్ధారితాంశాలు అందాం.

2. ప్రయోగరీత్యా పనికిరానివి, వీగిపోయినవి అని తేలిన అంశాలు. వీటినీ ప్రయోగంలో సరిచూసుకోవచ్చు. వీటిని వీగిపోయిన అంశాలు అందాం.

3. ప్రయోగంలో తేలనివి, వైజ్ఞానిక లోకంలోనూ, హేతుబద్ధాలోచన పరులలోను ఒకే విషయంపై ఒకటి కంటే ఎక్కువ అభిప్రాయాలు కలవు. వీటిని అనిర్ధారితాంశాలు అందాం.

 సత్యదృష్టి కల మిత్రులారా, ముందిక్కడ కాగి ఈ మూడు రకాల భావ జాలాలు మన యందున్నాయో లేదో, సమాజంలో ఉన్నాయో లేదో ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఆపైన

ఆస్తికత-నాస్తికత ధోరణులు పై మూటిలో ఏ కోవకు చెందుతాయో తేల్చండి. అటు పిమ్మట నిజమైన సత్యాన్వేషి ఏ దృష్టి కలిగుండాలో తేల్చండి. 

మండలి దృష్టి మాత్రం నిర్ధారితాంశాలను స్వీకరించి వినియోగించుకో, తదనుగుణ్యంగా నడుచుకోడానికి యత్నించు.

అనిర్ధారితాంశాలను పరిశీలనలో ఉంచు. వాటిపట్ల ఒక ప్రక్కకువంగకు. 

వీగిపోయిన అంశాలను విడచివేయి. అప్పటికి వాటివల్ల జరిగిన జరగకూడనిదేమైనా ఉంటే సరిచేసుకో, ఈ క్రమాన్ని సమాజానికీ అందించి ఆచరించేటట్లు ఒక క్రమబద్ధమైన యత్నంచేయి.

ఇదండీ విషయం. మండలికి సంబంధించిన ఒక పోకడను మీ ముందుంచాను. పరిశీలించి న్యాయవాదిగా కాకుండా న్యాయమూర్తిగా మిమ్ము మీ రెంచుకుని ఒక నిర్ణయం చేయండి. స్పందనకు రాయండి. అవసరమైతే దీని పై, మండలి స్వరూప స్వభావాల పై కొంతకాలం నిబంధనలులేని ఓపెన్ గా చర్చ సాగిద్దాం. 





 

No comments:

Post a Comment