Tuesday, January 31, 2023

7 వివేకపథం

  

వివేకపథం

సంపుటి: 1                                  ఫిబ్రవరి 1997                           సంచిక : 7


సంపాదకుని స్వాంతనము

వివేచనాశీలురైన పాఠక మిత్రులారా! సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తాత్విక ధోరణులు ఎన్నో ఉన్నట్లు మనందరకూ తెలుసు. ఆయా ధోరణులన్నీ మానవ జీవితంతో ముడిపడి ఉన్న అంశాలాధారంగానూ, కొన్ని ఊహ లాధారంగానూ జనించినవే ననుట నిర్వివాదము. ప్రతి సిద్ధాంతకారుడూ అనేకాంశాలకు సంబంధించిన తన అవగాహనను సమాజాని కందించాలని వాంఛిస్తాడు. యత్నిస్తాడు. ఆయా ధోరణులను నిశితంగా పరిశీలించితే వాటిలో కొన్ని సామాన్యాంశాలు మరికొన్ని విశేషాంశాలూ ఉన్నట్లు- అంటే అందరూ అంగీకరించేవి. కొందరే అంగీకరించేవి. ఎవరికి వారివిగా పరస్పరం విభేదించుకునేవిగా  ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మూడవ రకానివే మనం వేరువేరు ధోరణులుగా చీలిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.

నిజానికి ప్రతి సిద్ధాంతకారునికీ సమాజహిత కాంక్ష ఉంటుంది. ప్రతి సిద్ధాంతాశయమూ సమాజాభ్యుదయమే. సమష్టి హితాన్ని కాంక్షించని తత్వ శాస్త్రం ఉండదు. కనుక నిజానికి మనమందరం ఏకలక్ష్యం కలవారమే నన్న మాట. మరైతే ఏకలక్ష్యం కలవారలమధ్య భిన్న పోకడ లెందుకు ఏర్పడుతున్నట్లు? గతంలోని ఆలోచనా పరులకూ ఈ ప్రశ్న ఉదయించింది. ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పుకున్నారు వాళ్ళు, "దారులు వేరు గమ్య మొక్కటే" అన్న భావనొకటి కాగా? నీ దారి సరైంది కాదనో సమగ్రమైంది కాదనో పరస్పరం అనుకుంటూ చెప్పుకొంటూ దెప్పుకుంటూ విడివిడి కుంపట్ల సంఖ్య పెంచుకుంటూ కొనసాగే వైఖరి రెండోది. నిజానికి దారులు వేరు గమ్యమొక్కటే అనే వారిదీ కూడా అదో తరహా వేరుకుంపటే. ఇంతవరకు చెప్పుకున్నది ఉన్నదే. ఇది జరుగుతున్న  వాస్తవమేనని గమనించగలిగితే ఇక ఆయా ధోరణులను సమాజంలోకి తీసుకువెళుతున్న, వెళ్ళాలనుకుంటున్న సిద్ధాంత వేత్తల, కార్యకర్తలపై ఒక తప్పని సరైన పెద్ద బాధ్యత వచ్చి పడుతోంది.

ప్రతి ఉద్యమ స్వరూపంలోనూ (సిద్ధాంతంలో) నిర్దిష్ట లక్ష్యము (ఉద్దేశము) దానిని చేరుకోవడానికి తగిన పరికరాలు, విధానము, అమలుచే సే వ్యక్తి, వ్యక్తులు [కర్త లేక కార్యకర్తలు అంటాం వీరిని ]అతను-వారి -ప్రయత్నము అన్నవి తప్పని సరౌతాయి. కర్త, ఉద్దేశము, పరికరాలు విధానము, యత్నము అన్న వీటిని కారణ సామగ్రి అంటారు. ఇందేది కొరవడ్డా, సరిగా లేకున్నా, సరైనది కాకున్నా, యత్నం సరైన- అనుకున్న-ఫలితాన్ని పుట్టించదు. ఏ ఉద్యమ కారులైనా, సైద్ధాంతికులైనా అతి కీలకమూ , మౌలికమూ అయిన  ఈ అంశాన్ని చక్కగా గ్రహించకున్నా,  గ్రహించీ అమలు పరచకున్నా జరిగేది తమ ఆశయానికి తామే, ప్రతికూలతను ప్రవేశ పెట్టుకోవడమే.

ఈనాడు, ఉన్న సిద్ధాంతాలన్నీ తమలో తాము, నీది తప్పంటే నీది తప్పనుకుంటూ కొట్లాడుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని మారమంటున్నాయి. తమవైపు రమ్మనీ, ఇతర వాటిల్లో తప్పులున్నాయి అటు పోకండనీ, వాటిని విడిచి రమ్మనీ - ఈ మాటలు, ప్రతి ధోరణివారూ అంటున్నవే. దీనర్థం ఏమిటి? తప్పును విడవడం, ఒప్పును గ్రహించి అనుసరించడం అన్న దొక్కటే  అభ్యుదయానికి సరైన మార్గం అనేకదా! మరందుకు సిద్ధపడే నిజాయితీ మాత్రం అటు అనే వాళ్ళలోగానీ, ఇటు వినే వాళ్ళలోగానీ కనిపించడంలేదు. మొండిగా నీది తప్పంటే నీది తప్పనుకోవడము , మాది  ఒప్పేనంటే ,మాది ఒప్పేననుకోవడమూ, నువ్వు మారాలంటే నీవే మారాలనడమూ, నీవు గ్రుడ్డి వాడివంటే నీవే గ్రుడ్డివాడి వనుకుంటుండడమూ, నాది శాస్త్రీయమంటే నాది  శాస్త్రీయ దృక్పథం అంటూ అరవడమూ , పరీక్ష చేయడానికిగానీ, పరీక్షింపబడడానికి గానీ సిద్ధపడకపోవడం, వగైరా వగైరా అపసవ్యపు పోకడలు అన్ని సిద్ధాంతాల వాళ్ళలోనూ సమానంగానే చోటుచేసుకుని ఉన్నాయి. సమాజాన్ని మార్చాలనుకునే వారికి మార్పు ఎందుకో ,  ఎక్కడనో , ఎలానో తెలిసుండాలి. ఆ అంశం తనకూ వర్తిస్తుందన్న గమనింపూ, అవసరమైన చోట మారడానికి నిజాయితీతోకూడిన సంసిద్ధత ఉండాలి. లేకుంటే అదంతా వాచాలతే అవుతుంది. త్వం శుంఠంటే, త్వం శుంఠ అనుకునే వైఖరి అభ్యుదయానికి కాదుగదా, ఉన్న స్థితిని మరింత దిగజార్చి పరస్పర ప్రతికూల వైఖరికి దారితీస్తుంది. చూడగలిగితే ఇప్పటి స్థితి అట్టిదే.

భావ విప్లవం యొక్క ఆవశ్యకత లోగడకంటే ఈనాడెక్కువగా ఉంది. కనుక ఆయా సిద్ధాంతాలకు చెందిన మన మందరమూ సంసిద్ధులమై ఉమ్మడి వేదికపై మన మన భావాలను ముందుగా పరీక్షకు పెట్టుకుని సరైనవేవో, సరికానివేవో తేల్చుకోనిదే 'భావవిప్లవం' అన్నది నీటిమీది రాత, గాలి మూట వంటిదే అవుతుంది.

మాకీ రకమైన అవగాహన కలిగినప్పటి నుండి అంటే దాదాపు 13,14 సం॥రాలుగా పెంచలయ్యగారూ నేనూ కలసి ప్రసిద్ధ తాత్విక ధోరణులకు చెందిన పెద్దలతో చర్చలు చేస్తూ ఈ విషయాల్ని. వారి ముందుకు పెడుతూ వస్తున్నాము.  దానికి కొనసాగింపుగా గత మూడు సం॥ పైబడి 'తత్వ చర్చా వేదిక' పేరుతో ఒక్కో సిద్ధాంతాన్నీ పదిమంది పరీక్షకూ  పెట్టడానికి వీలైన ఒక ప్రత్యేక తరహా సమష్టి వేదికను ప్రతి మూడు మాసాల కొకసారిగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నాము. అవి జనవరి, ఏప్రియల్, జూలై, అక్టోబరు మాసాలలో జరుగుతున్నాయి. శోచనీయమైన విషయ మేమంటే....

ఈ సూచన నందుకుని వారికి వారుగా ఈ వేదిక పైకి వచ్చిన వారొక్కరు లేరిప్పటికి. ప్రతి వక్కరినీ ఒకటికి నాలుగుసార్లు కలిసి అయ్యా, సమాజం మారాలంటున్నారు కదా! మార్చే యత్నమూ చేస్తున్నామంటున్నారు కదా! మేమూ మీకు సమాజమే. మా ఈ వేదిక  సమాజానికి చెప్పడానికి మీకూ పనికి వచ్చేదే. కనుక ఈ వేదిక ద్వారా మీరు మాకూ ,సమాజానికీ  మీ సిద్ధాం తాన్ని (మారవలసిం దేమిటి? చేరవలసిం దేమిటో- మార్చడమూ చేర్చడమూ ఎలానో) అర్థమైయ్యేట్లు వివరించండి అని అడుగుతున్నా ఒక్కరూ  పూర్తిగా నిర్థారణ రూపంగా వివరించడానికి సిద్ధం కావడంలా . సత్యనిర్ధారణ జరగాలనీ, సరైన దిశలో ఆచరణ ఆరంభించి కొనసాగించాలనీ అందరూ అంటున్నదే. ఎవరి గిరిలో వారు కూచుని, ఎవరి బడిలో వారు చెప్పుకుంటూ పోతుంటే సత్య నిర్ధారణ అయ్యేదెలా? భావ విప్లవం వచ్చేదెలా? ఎప్పటికిది జరిగేను? పైన చెప్పిన లాంటి వేదిక పైకి రాక ఎప్పటికైనా జరిగేనా ?

సత్యాసత్యాలు తేలకుండా, తేల్చుకోకుండా ఏ భావజాలాన్ని నెత్తికెత్తుకున్నా; నినాదాల, ప్రవచనాల హెూరులో సమాజం నెత్తికెత్తాలనుకున్నా ఆ పోకడంతా అశాస్త్రీయమూ, అ హేతుకమూ, అవాంఛనీయమూ మాత్రమే.   ఆ వైఖరిలో ఉండేది అభిమాన, విశ్వాసాల పాత్రేగాని వివేకపు పాత్ర మృగ్యము. మీరందరూ,, మనమందరమూ ఇతరులకు చెప్పుతున్నది అకారణాభిమాన ద్వేషాలు ఉండరాదనీ అది గ్రుడ్డిపోకడేనని కదా! మరి అలా చెప్పేవారూ ఆచరణ కొచ్చేటప్పటికి అదే పోకడ ననుసరిస్తున్నారు. అందులోని ఔచిత్య మేమిటో నా కర్థం కాదు.

ఇదంతా విని మీ నుండి ఒక రకమైన స్పందన రావచ్చు. ఏమయ్యా! మేమలా ఉన్నామని ఎందు కనుకుంటున్నావు. శాస్త్రీయ విశ్లేషణకూ , పరీక్షకూ మేము సంసిద్ధంగానే ఉన్నాం కదా! అంటూ :

నిజంగా అయా సిద్ధాంతకారులుగానీ, ప్రచారకులుగానీ పై మాట వట్టిది కాదనీ గట్టిదేననీ, పైగా అది మా మాటేననీ అనగలిగితే, ముందుకు రాగలిగితే నిజంగా మనమందరం వాంఛించే సమాజంలో రాదగిన మంచి మార్పు వచ్చేందుకు అంకురార్పణ జరిగినట్లే. మీరట్టి వారే అయితే గుండె నిండిన సంతోషంతో సత్యాన్వేషణ మండలి భావి భవితకు బాట వేయగల నిజాయితీ, నిబ్బరమూ కల అట్టి వారి నందరానూ  సాదరంగా కొన్ని సూచనలతో వేదిక పైకి రండని ఆహ్వానిస్తోంది. అన్నలారా! తమ్ములారా! మిత్రులారా! రండి. కలసి కూచుని సామరస్యంతో సత్యావిష్కరణకై యత్నిద్దాం.

1.నిజాలునిరూపింపబడాలి.నిరూపించబడని వాటిని నిజాలనరాదు.అంగీకరించరాదు.

               2. అబద్ధాలుగా తేలిన వాటిని విడిచివేయాలి.విడిపింపజేయడంలో వెనుకాడక గట్టి యత్నం చేయాలి.

3. సిద్ధాంతపరమైన బేధాలే తప్ప మనమధ్య శతృత్వం ఉండాల్సిన అవసరంలేదు. అది మంచిదీ కాదు.

4. ప్రతి సిద్ధాంతాన్ని పదిమంది ఎదుట పరీక్షకు పెట్టగలగాలి . శాస్త్రీయంగా పరీక్షించాలి.

5. ఏ ఒక్క సిద్ధాంతాన్ని పరీక్షకు స్వీకరించినా మిగిలిన వాటితో ముడిపెట్టకుండా దానిని దానిగానే ఆమూలాగ్రం పరీక్షకు లోనుచేయాలి. అప్పుడుగానీ వాస్తవంగా దాని బాగోగు లేమిటో తేలవు.

6. సత్యాన్వేషణ మండలి తనవరకు తాను నిగ్గుతేలిన భావాలను స్వీకరించడానికి, అటువైపు కదలడానికీ ఎటువంటి షరతులూ లేకుండా సంసిద్ధంగా ఉంది.

7. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రసిద్ధమైన భావజాలాన్ని కలిగున్న వారందరినీ పేరు పేరునా సత్య నిర్ధారణలో పాలు పంచుకొనండని ఆహ్వానిస్తోంది. నిగ్గదీస్తోంది కూడా  ఈ ఆహ్వానం అందరికీ వర్తిస్తుంది. అయినా నే నెరిగిన ప్రసిద్ధ ధోరణులను పేర్కొంటాను గమనించండి.

ఆస్తికత 

నాస్తికత 

అజ్ఞేయత

హిందూ, క్రైస్తవ, ఇస్లాం

హిందూ: త్రిమతాలు, ఆర్యసమాజ్, పూర్వమీమాంసకులు, సాంఖ్యులు,నైయాయికులు, భక్తులు, యోగులు

కైస్తవం: క్రైస్తవుల్లోని శాఖలు, యూదులు.

 ఇస్లాం: ఇస్లాంలోని శాఖలు. 

నాస్తికులు 

కమ్యూనిస్టులు 

హేతువాదులు

 నవ్య మానవ వాదులు

అంబేద్కరైట్లు

త్యంతెలియబడదు

నిర్ధారింపబడదు అనేవారు. 


ఇంకా బౌద్ధులు, జైనులు, తాత్విక పునాది ఉందనుకున్న ఎవరుగానీ. 

ఇప్పటికి మండలి "తత్వ చర్చావేదిక" పైకి అద్వైతుల్ని, ద్వైతుల్ని, ఆర్య సామాజికుల్ని, క్రైస్తవుల్ని, ఇస్లాంను, నాస్తికుల్ని, కమ్యూనిస్టుల్ని, హేతువాదుల్ని, నవ్య మానవవాదుల్ని, జైనుల్ని ఆహ్వానించి స్థూలంగా సిద్ధాంత చర్చలు నిర్వహించింది. అందేవీ స్పష్టంగా సమగ్రమైన, ఆచర ణాత్మకమైన భావజాలాలుగా నిర్ధారణ కాలేదు. చర్చలుకూడా ఆసాంతం కొనసాగనూలేదు. సంపూర్ణంగా సిద్ధాంత విచారణ పూర్తిచేయకుండా ఏ నిర్ణయం చేసినా అశాస్త్రీయ మవుతుంది కనుక మలియత్నం మరింత లోతుగా ముగింపు లక్ష్యంగా కొనసాగించాలన్న దృష్టితో తత్వ చర్చను రెండో విడత మొదలెట్ట బోతున్నాం. ఇప్పటికైనా, సత్యనిష్ట, ఆచరణశీలత, నిజాయితీతో కూడిన నిబ్బరమూ ఉంటే లేవండి, కదలి రండి సత్యాసత్యాలు తేల్చుకుందాం. స్వీకరిద్దాం ఆచరిద్దాం.

ఈసారి తాత్విక చర్చాక్రమాన్ననుసరించి 'ఏప్రియల్' లో ఉంటుంది. 'క్రైస్తవం' చర్చనీయాంశం. పైన పేర్కొన్న ఏ ధోరణివారైనా 'మేము సిద్ధం నిజనిర్ధారణ'కు అని నిలవగలిగితే ఎప్పుడంటే అప్పుడు (నాలుగు ధోరణుల పెద్దలనూ వేదికపైకి చేర్చడానికి తగినంత వ్యవధి మాత్రం తీసుకుని) సభ నేర్పాటు చేసుకుందాం. దీనికి వెనుకాడితే నిజంగా మీలో నిజాయితీగానీ, సరైన దిశలో మార్పునుకోరే లక్షణం కానీ, సత్యాని కనుగుణ్యంగా మసలుకో గల ధైర్యంగానీ లేనట్లే, ఇక్కడ వెనుకాడితే, ప్రక్కదారులంట తప్పొప్పులతో పని లేకుండా ప్రచారాలు సాగిస్తున్న వాళ్ళమే అవుతాము మనమూ.

ఆస్తికులారా! (ఆస్తికతకు చెందిన దేశవిదేశ ధోరణుల వారందరూ) నాస్తికులారా! (భౌతికవాద పక్షంలోని విభిన్న ధోరణుల వారందరూ) నిజం తెలిసిఉన్నా, తెలుసుకోవాలనుకున్నా, తెలియజేయాలనుకున్నా మండలి వేదికకు మించిన మంచి అవకాశం ఇప్పటికిలేదు. ఇప్పట్లో ఉండే అవకాశమూ లేదు. కనుక రండి. ప్రచారంలో ఉన్న సిద్ధాంతా లన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని పరీక్షించుకుందాం. ఆస్తికులతో మాకేటిలే అని నాస్తికులూ, నాస్తికులతో మనకెందుకని ఆస్తికులూ అనుకుంటూ కొనసాగుతున్నంత కాలం భావ విప్లవం అసాధ్యం, అసంభవం ముందీ విషయాలపై మీ అభిప్రాయాలు తెలపండి. ఇక్కడ ఒక కొలిక్కి వస్తేగాని.

1) ఆస్తికతగా చెప్పబడుతున్న అంశాలు సత్యాలని తేలకపోవడానికీ, అసత్యమని తేలడానికీ తేడా వుందా? అవి ఒప్పులని తేలకపోవడమే తప్పులని తేలినాయనడానికి శాస్త్రీయమైన ఆధారం అవుతుందా ? 

2) నాస్తికత సత్వమని తేలిందా? ఎక్కడైనా, ఎన్నడైనా?

 నోట్ :- ఈ రెండు ప్రశ్నలూ ఆస్తికత నాస్తికతలకు చెందిన సిద్ధాంతాలపైనా వేసుకుని తమ తమ సిద్ధాంతాలు తప్పులనిగానీ, ఒప్పులనిగానీ తేలినాయో లేదో నిర్దారించుకోగలగాలి. ఎందుకంటే ప్రతి సిద్ధాంతాన్ని మిగిలిన సైద్ధాంతికులు లోపభూయిష్టమనే అంటున్నారు. అయినా ఏ సిద్ధాంతాని కాసిద్ధాంతం సరైనదేనని ఆ సిద్ధాంతానికి చెందిన వారు ఢంకా భజాయిస్తున్నారు. నిజానికి జ్ఞానపరంగా ఇదెంత విచిత్ర, విపత్కర పరిస్థితి, వాస్తవాని కింకా అనిర్ధారితాలుగానో, దోషసహితాలుగానో మాత్రమే అవి తేలుతున్నాయి. కానీ వాటిని ఆ మేరకు సరిచేసుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని వివరంగా మీ ముందుంచుతాను చూడండి. అణువు పగులుతుంది. అణువు పగలదు అన్నవి ఒకే అంశానికి చెందిన భిన్నాభిప్రాయాలు (విరుద్ధాభిప్రాయాలనీ అనొచ్చు) పగులుతుంది అన్న పక్షంవారిని రెండోవారు (లేక మనం) మీ ప్రతిపాదన రుజువు చేయండని అడిగారు. చాలాకాలం శక్తిమేర యత్నించి పగలగొట్టలేకపోయారు ఆ పక్షంవాళ్ళు. ఒకానొక దశలో వారూ వీరూ కూడా కలిసి అణువు పగలదు అన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏకాభిప్రాయానికి రావడమే సత్యం మనడం అనుకుని విషయం తేలిపోయింది. అణువు పగలదు అన్నదే సత్యము. పగులుతుందన్న పక్షం వీగిపోయింది. అని నిర్ణయం చేసి ఆ భావాన్ని సమాజం నెత్తినా రుద్దారు. అణువు పగులుతుందన్న వాళ్ళు రుజువు చేయలేకపోయారు గనుక అణువు పగలదన్నది రుజువైనట్లా? కాదా?  హడావుడి పడకుండా ఇక్కడో నిర్ణయానికి రండి. ఆపై మన సిద్ధాంతాల దగ్గరకు రావచ్చు.

సత్యాసత్యాలు వివేచించగలిగే నేర్పులేనివాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తప్పన్నా ఒప్పున్నా దానికేమీ విలువలేదు. కనుక ముందుగా పరీక్షకు కూర్చునే, పరీక్షించే రెండు పక్షాలకు పరీక్షా పద్ధతి తెలుసుండాలి. పరీక్షించగలిగీ ఉండాలి. పై అంశాన్ని మరొక రీతిలో వివరిస్తాను. అప్పుడెలాంటి ముగింపులిస్తుందో చూడండి.

కొంతకాలానికి నేనున్నానంటూ మరొకడు బయలుదేరి క్రితం అందరూ గలసి నిర్ణయించుకున్న అణువు పగలదు అన్న అభిప్రాయాన్ని తప్పుబట్టి పగులుతుంది అన్నాడు. సరే చూడండంటూ పగలకొట్టాడు. ముందటి పక్షం వాళ్ళు అబ్బురపడ్డారు. వైజ్ఞానిక పంధాలో ఉన్నవాళ్ళు గనుక ఏ మాత్రం వెనుకాడకుండా తమ పొరపాటు నిర్ణయాన్ని మార్చుకుని పగులుతుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. మళ్ళా అందరూ కలసి ఏకాభిప్రాయానికి వచ్చారు. అది సత్యమేనన్న నిర్ణయానికి వచ్చారు.

గమనిక :- మొదటిసారీ రెండు పక్షాలున్నాయి. పరీక్ష జరిగింది. అణువు పగలదని రుజువైంది (తేలిపోయింది) కనుక అణువు పగలదు అన్న ఏకాభిప్రాయానికి రావడంతో అందరూ ఆ అభిప్రాయం సరైందేనన్నారు. రెండోసారీ రెండు పక్షాలున్నాయి. పరీక్ష జరిగింది. అణువు పగులుతుందని రుజువైంది (తేలిపోయింది) కనుక అణువు పగులుతుంది అన్న ఏకాభిప్రాయం ప్రకారం, ఆ అభిప్రాయం సత్యమన్నారు. ఈ రెండూ చూసినాయన సత్యాలు మారుతాయి. మారని సత్యాలుండవు అన్నాడు. మరొకాయన ఈయన్నడిగాడు, సత్యాలు మారుతాయి. మారని సత్యాలుండవు-అన్న అభిప్రాయం సత్యమా? అసత్యమా? అని. సత్యమే నన్నాడు పైవాడు. మరి ఈ సత్యంకూడా మారుతుందా అనడిగాడు ఆఖరివాడు. పై మాటన్నాయన నివ్వెరపోయాడు. పై వాటికి మీ సమాధానాలేమిటి? 

 మార్క్సిజం - ఒక తులనాత్మక పరిశీలన- (2)

 గతితర్కం:

ఉద్యమ స్పూర్తి, జిజ్ఞాస, యోచనాశీలతకల పాఠకమిత్రులారా! భిన్న ధోరణులకు చెందిన విజ్ఞులారా !

1996 - జూలై లో మార్క్సిజంపై తాత్విక చర్చా రూపంలో జరుపుకున్న వేదికకు కొనసాగింపే ఈ సమావేశం. ఆనాటి సదస్సులో ఉన్న అన్ని ధోరణులవారం కలసి చేసుకున్న నిర్ణయం మేర గతితర్కాన్ని పరిశీలనాంశంగా స్వీకరించడం జరిగిందీ వేదికకు, వేదికలో పాల్గొనడానికి విచ్చేసిన సంఖ్యను బట్టి చూస్తే చేసిన శ్రమకు తగిన ఫలం పుట్టలేదన్నదో పక్కానిజం - అది నిజంగా నిర్వాహకులను నిరుత్సాహాన్ని కలిగించేదే. జిజ్ఞాసువులూ పరిశీలకులునైన శ్రోతలకూ నిరాశనే కలిగించింది. మొదటిరోజు.

అయితే అనుకోకుండా ఏర్పడ్డ అవకాశం వల్ల రెండోరోజు నండూరి ప్రసాదరావుగారూ, జక్కా వెంకయ్యగారు, కొండపల్లి సీతారామయ్యగారు, పరకాల పట్టాభిరామారావుగారు, రాధాకృష్ణదాసుగారు, మూడవ రోజు ఈడ్పుగంటి నాగేశ్వరరావుగారు, ప్రొ॥ నాగన్నగారు, కళ్యాణ కృష్ణగారు మార్క్సిజం పక్షాన పాల్గొనడంతో తగినంత ప్రాతినిధ్యమూ ఏర్పడినట్లైంది. ప్రశ్నించువారి పక్షాన నవ్యమానవ వాదుల నుండి రావి సుబ్బారావుగారు, ధర్మాచరణ మండలి తరపున సోంప్రకాష్ గారు సందర్భ పడ్డప్పుడల్లా నేనూ పాల్గొన్నాము.

ఒక క్రమంలో పటిష్టమైన రీతిలో వాదప్రతివాదాలు కొనసాగలేదు గనుక ప్రతి అంశాన్ని పేర్కొనడం ఇక్కడ కుదరదు. కనుక సారభూత విషయాలను మాత్రం మీముందుంచుతాను.

ముందురోజు పట్టాభిరామారావు గారు సంధానకర్తకాగా, నవ్యమానవ వాదులు గతితర్కంపై ప్రశ్నించారు.

ప్రశ్న:- అయ్యా, ఉన్న బార్లీ గింజ అభావం చెంది మొలకెత్తి పెరిగి మరల అదీ అభావముచెంది అధికాధికంగా బార్లీ గింజలు రూపొందుతున్నాయన్నారు. సరే. మరి ఉన్న మర్రివిత్తనం అభావం చెంది మొలకెత్తి  మొక్కై మానై తానభావము చెందకనే అనేక విత్తనాల నిస్తుందికదా ఇక్కడ రెండో అభావమెక్కడ? దీనిప్రకారం మీ గతితర్కం తప్పని తేలడం లేదా?

సమాధానం:- మర్రిచెట్టు అభావం చెందకుండగనే  విత్తనాలనిచ్చినా ఏదో ఒకనాటికి అదీ చస్తుందికదా? కనుక ప్రతిదీ అభావం చెందేదే అవుతుంది. కనుక మా గతితర్కం సరైందని రుజువై నట్లే.

దీనిపై ప్రశ్నించేవారు సరైన ప్రశ్న వేయకపోవడంతో పట్టాభిగారు ఇక్కడకిది తేలినట్లేననుకుందాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అనడిగారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిపాదక పక్షం స్థాపించబడ్డట్లు ప్రకటించారాయన.

సురేంద్ర:- చర్చ లిలా పేలవంగా జరగడానికి రెండు పక్షాలలోనూ సరైన అధ్యయనం లేకపోవడం ప్రధాన కారణం. అదలా ఉంచి ఒక భావాన్ని ఒప్పుకునేవాళ్ళ కంటే నిజానికి తప్పనబోయేవాళ్ళకు దాన్ని గురించి ఒకపిసరంతైనా అధికం తెలుసుండడం అవసరం. ఇలా ఎందుకంటున్నానంటే! ఆ మధ్య తెనాలిలో ఒక నవ్యమానవవాద ప్రముఖుడొకడు గతితర్కాన్ని ఎద్దేవచేస్తూ, సభాముఖంగా యిలా అన్నాడు. ఏముందండీ గతితర్కమంటే  థీసెస్, యాంటిథీసిస్, సింతసిస్ - లేగదా! అవీ యిదుగో యిలా ఉంటాయి. థీసెస్ రెండురెళ్ళు ఐదనుకుంటే, యాంటిథీసెస్ రెండురెళ్ళు తొమ్మిదంటుంది. ఈ రెంటి సమన్వయంగా సింథసిస్ రెండురెళ్ళు ఏడని తేల్చుతుంది అంటూ ప్రగల్పించాడు బహిరంగంగా వేదికమీదే. పక్కనే ఉన్న ఆ వర్గానికే చెందిన ఇంగిత జ్ఞానమున్న మరోవ్యక్తి, అలా నోరు పారేసుకోకండి.  అదికాదు గతితర్కమంటే. అలా అనలేదు మార్కు, ఏంగెల్సులు అంటూ సర్దిచెప్పాడు. హేతువాద, శాస్త్రీయ దృక్పథాలకు అసలు సిసలైన వారసులం అంటుండే నవ్యమానవవాదుల అధ్యయనమూ, పోకడా అలా ఉన్నాయి. మరి పైగా వేదికపైకి రమ్మంటే మాకు తగిన స్థాయిగల వాళ్ళుంటే చర్చకొస్తాముగానీ, అల్పులూ అనామకులు!? పిలిస్తే చర్చ కొస్తామా అని బిర్రబిగదీసుడు ధోరణొకటి కనిపిస్తుంది వారిలో చాలామందిలో. మార్క్సిజాన్ని సరైన రీతిలో తప్పని తేల్చగల అధ్యయనమూ, అవగాహనా, సత్తా, ఉంటే మండలి వారిని మార్క్సిస్టు సైద్ధాంతికులతో చర్చకే సిద్దపడమని సాదరంగా ఆహ్వానిస్తోంది. వేదిక వారికిష్టమైనచోట ఏర్పాటు చేయగలము.

రెండోపూట సభలో సంధానకర్తగా నేనుండగా వేదికపై మార్క్సిజం పక్షాన కొండపల్లి సీతారామయ్యగారు, నండూరి ప్రసాదరావుగారు, జక్కా వెంకయ్యగారు, పరకాల పట్టాభిరామారావుగారు, నాగన్నగారు, కళ్యాణక్రిష్ణ గారు, రాధాకృష్ణదాసుగారు, గుత్తా రాధాకృష్ణగారు, చుక్కపల్లి రామకోటయ్య గార్లు కూర్చున్నారు. ఆడిగేందుకు సోంప్రకాశ్ గారు, రావి సుబ్బారావుగారు, నారాయణగార్లున్నారు. నండూరి ప్రసాదరావుగారు గతితర్కాన్ని సామాజిక చరిత్ర కన్వయించి వివరించడం జరిగింది. కానీ సోంప్రకాష్ గారు అయ్యా మార్క్సు ఏంగెల్సులు (dialectical laws) ప్రకృతిలో సహజంగా ఉన్నాయన్నారుగదా! మీరు వాటిని ప్రకృతిలో అన్వయించి చూపండని ప్రశ్నిం చారు. మార్క్సి ఏంగెల్పులిచ్చిన ఉదాహరణల్నే ప్రతిపాదకులు ఎత్తిచూపారు. అప్పుడు సోంప్రకాష్ గారు ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించి ఆకోణంలో సూత్రాల్ని వివరించమన్నారు. అదేమంటే గతితార్కిక సూత్రాలుగా మన మందరం ఎరిగి ఉన్న 1) విరుద్ధ శక్తులమధ్య ఐక్యతా ఘర్షణ 2) పరిమాణాత్మకమార్పు సంఖ్యాత్మక మార్పుకు దారితీస్తుంది, 3) అభావాభావము లేక ప్రతిసేద ప్రతిసేద నియమము అన్నవి ఒక సంఘటనలోనే చూపించాలి గతితర్కం సరైందనాలంటే. కనుక అలా మాకు ఒక వస్తువును చూపి అందులో పై మూడు నియమములూ పనిచేస్తున్నట్లు చూపండని అడిగారు. గతితర్కాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడానికి తగిన అవసరమైన అతిముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారాయన. నేనెరిగినంతలో గతితర్కాన్ని ఆ రీతిలో అధ్యయనం సాగించినవాళ్లు అరుదు. రెండు పక్షాలకు చెందినవారూ వారి వారి రచనల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు నా పరిశీలనకు అందలా ఎక్కడా.

రెండు వైపులనుండీ కొంత సంభాషణ జరిగాక నండూరి ప్రసాదరావు గారు, విజ్ఞతతో ఒక మాటన్నారు. ఈ తరహా చర్చలలో ఈ రీతివాదం మాకూ క్రొత్తగానేవుంది. కనుక ఈ విధానంలో వివరించడానికి వీలుగా మరికొంత అధ్యయనం అవసరం. మరోసారి కలుద్దాం అన్నారు. వెంటనే మంచిదే మీరందరూ అంగీకరిస్తే, తప్పక వస్తామని మాటిస్తే మరో సమావేశం ఏర్పాటు చేసుకుందాం అన్నాను నేను. అలాగేనంటూనే ప్రతిపక్షం ఎలా ఉండేవీలుందో ముందుగా మాకందిస్తే దానికనుగుణ్యంగా అధ్యయనం చేసి రావడానికి వీలవుతుందన్నారాయన. పరిశీలనాంశాలను గూర్చిన కొన్ని వివరాలు త్వరలో అందచేస్తానని వారికి మాటిచ్చాను.

సంభాషణల మధ్యలో జక్కా వెంకయ్యగారు తత్వశాస్త్ర పరంగా వాడుకునే మాటలకూ, వ్యవహారంలోవున్న మాటలకు అర్థాలలో తేడాలుంటాయి. సిద్ధాంత చర్చలలో ముందుగా వాటిని గమనించడం, అర్థం చేసుకుని ఉండడం అత్యంతావసరం అంటూ ఒక మౌలికమైన అంశాన్ని కదిపారు. అలాగే జ్ఞాన సిద్ధాంతం విషయాన్ని ఎత్తిచూపారు. కేటగిరీస్ (భావాభివర్గాలంటారు వాటిని) (పదార్థ వర్గీకరణమంటాము మేము) గురించి తెలిసుండడం తప్పనిసరి అంటూ కొన్ని మార్క్సిస్టు పారిభాషిక పదాలను వివరించారు. శాస్త్రీయ విశ్లేషణకు అవసరమైన మరో ముఖ్యాంశాన్ని వీరు ప్రస్తావించారు. (ఇంతకుముందు సోంప్రకాష్ అలాంటి విలువైందే ఒకటి చెప్పారని అనుకున్నాం గుర్తు చేసుకోండి.)

సురేంద్ర:- అసలింతకూ పారిభాషిక పదాల అర్ధ నిర్థారణ చేసుకోవాలనిగానీ, పదార్థ వర్గీకరణ పట్ల సరైన అవగాహన లేకుండా విషయాన్ని గ్రహించడంగానీ - ప్రతిపాదించడంగానీ సరైన రీతిలో సాగదనిగానీ జ్ఞాన సిద్ధాంతం- ప్రమాణ వివేచన - పట్ల తగినంత అవగాహన సైద్ధాంతిక చర్చల్లో  తప్పనిసరి అనిగానీ విస్పష్టంగా గ్రహించిన వారెందరు? మా లెఖ్ఖల్లో అట్టి వారు బహుతక్కువ. జక్కా వెంకయ్య గారిక్కడ నొక్కు పెట్టడంలో వేదికకో చక్కటి ప్రాతిపదిక ఏర్పరుచుకునేందుకో వీలు చిక్కింది. సరే త్వరలో మరింత సరైన అవగాహనతో విచారణకు- చర్చకు - కలిసి కూచుందాం అనడంతో ఆ సమావేశం అలా ముగిసింది. ఈ సందర్భంలో ఒక పొరపాటు జరిగిందంటూ ప్రొ. నాగన్నగారో విషయం లేవనెత్తారు. సోంప్రకాష్ గారి ప్రశ్నకు ఇంకెవరైనా సమాధానం చెపుతారా అని మీరడిగుండాల్సింది. వారి ప్రశ్నకు కళ్యాణ కృష్ణగారుగానీ, నేనుగానీ సమాధానం చెప్పగలిగుండే వాళ్ళం అన్నారు. నిజమే. ఈ సారలా జరక్కుండా చూసుకుందాం అనుకున్నాము. మరునాడు ఈడ్పుగంటి నాగేశ్వరరావుగారు ప్రతిపాదకులుగా ఉన్నారు. నిన్నటి ప్రశ్న దగ్గరే ఆరంభిద్దాం అనుకుని జరిగినంతవరకు విషయాన్ని వారికి చెప్పి ప్రకృతిపరంగా ఒక ఉదాహరణను తీసుకుని మూడు సూత్రాలను దానియందు చూపండనగా, అయ్యా! ఇక్కడొక విషయం చెప్పాలి. విజ్ఞానశాస్త్రం విస్తరిస్తున్నవేగాన్నీ, అది కనిపెట్టిన కొంగ్రొత్త విషయాలనూ గురించి వింటుంటే మతిబోతోంది. అట్టి స్థితిలో వాటిని గురించి తగినంత పరిజ్ఞానం లేకుండా నేను చెప్పాలనుకోవడమూ, మీరు పరీక్షించాలనుకోడమూ సరైనవి కాదు. నా వరకు నాకు అంతటి యోగ్యతలేదు. అందుకు తగ్గరీతిలో వేదికకు న్యాయం జరగాలనుకుంటే విజ్ఞానశాస్త్ర విషయాల్లో విశేషజ్ఞులైన శాస్త్రజ్ఞుల్ని యిద్దరు ముగ్గుర్ని పరిశీలకులుగానూ, వివరణ లిచ్చేందుకునూ వేదిక పైకి తెచ్చుకుని ఉండడం తప్పనిసరి. అంటూ శాస్త్రీయ విశ్లేషణకు అవసరమైన మరో ముఖ్యాంశాన్ని ఎత్తిచూపారు. ఆ మాట వినీవినగానే కొందరి ముఖాల్లో గోచరించిన వీరూ చెప్పలేక పొయ్యారన్నట్టి భావనను పసిగట్టి నేనో మాటన్నాను. ఇది కొందరనుకుంటున్నట్లు వారి అయోగ్యతను గాక యోగ్యతనే చాటుతుంది. ఏమంటే, నిజంగా తెలీని విషయాలు తెలీనివిగా గుర్తించడం, నిర్ద్వంద్వంగా ప్రకటించగలగడం సరిగ్గా తెలుసుకొనే యత్నంలో కీలకమైన మలుపు తిప్పగల అంశం. నిజానికా అంశంలో ఆయనలాగే మనమందరమూ విశేషజ్ఞుల సహకారం అవసరం అనే స్థాయిలోనే ఉన్నాము అన్నాను. దాంతో గతితర్కాన్ని ప్రకృతి కన్వయించి పరీక్షించడం అన్న కోణం ఆగింది. మరో సారి ఏర్పరచుకుందామనుకున్న సమావేశం నాటికి కొందరు భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులనూ వేదిక పైకి ఆహ్వానించాలనుకున్నాం సభ ముగింపుగా, మొదటి- జూలై 1996 సమావేశంలో లానే విషయ పరిశీలన ఒక కొలిక్కి రాలేదు. మరింత అధ్యయనంతో మరో విడత కలుద్దాం. ఆ నాటికైనా రెండు పక్షాలూ తగినంత అవగాహనతో రావడం అవసరం. బాధ్యతకూడా అంటూ  ముగించాను.

 “ఐక్యవేదిక - విశేషాంశాలు”

సుమారు 70, 80 మంది రాష్ట్రం నలుమూలల నుండి సమావేశానికి ఏతెంచారు. జనవరి 11న తిరుపతిలో జరిగిన అడ్ హాక్ కమిటీ సమావేశానికి సంబంధించిన విషయాలను సోంప్రకాష్ వివరించారు. 1) సంఘము పేరు :- వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక. 2) రాష్ట్ర పర్యటన 24 జిల్లాలు మూడు దఫాలుగా చేయాలనీ ముందుగా ఫిబ్రవరి 22 నుండి 28 వరకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలలో ప్రధానమైనచోట్ల సమావేశమై జిల్లా సంఘాలను ఏర్పాటు చేసేందుకు యత్నించాలనీ 3) న్యాయపరమైన అంశాలను న్యాయస్థానాలద్వారా విచారణకు పెట్టి, ప్రజల ముందుకూ విషయాన్ని తీసుకెళ్ళడం అన్న పని

కొరకుగా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలనీ 4) విధాన, చట్టసభలలో సమాజ వంచనా రీతులను గురించి చర్చను లేవనెత్తి ప్రభుత్వ దృష్టిని ఈ వంచనలవైపు సారింపజేయడం. ఐక్యవేదికకు అనుకూలురైన ప్రజా ప్రతినిధులను ఐక్యపరచి అదో విభాగంగా రూపొందించేందుకు యత్నించడం జరగాలనీ, 5) ప్రచార విభాగాన్ని ప్రత్యేకించి, ప్రచార సాధనాలైన పత్రిక, రేడియో, టి.వి.ల ద్వారానూ, కరపత్రాలు, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారాను వంచకులను సమాజానికి బహిరంగపరచడం ద్వారా  ప్రజల్ని జాగృతం చేయాలనీ, నిర్ణయించామనగా, వాటిని సమావేశం కొంత విశ్లేషణ చేసి పిదప ఏకగ్రీవంగా అంగీకరించింది. దాని కొనసాగింపుగా పర్యటన నాటికి తగిన వాతావారణము నేర్పరచుటకూ, ప్రజలను సమీక రించుటకు జిల్లాకు ఇద్దరు ముగ్గురు కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది. సంఘంలోనికి సభ్యులను చేర్చుకోవాలనీ విడిగా వ్యక్తికై తే సభ్యత్వ రుసుము సం॥నికి రూ. 5/- లు గానూ, ఒక్కో సమాజానికైతే రూ. 100/- గానూ నిర్ణయించడం జరిగింది. అందరం ఎవరికి వారం మన మన పరిచయస్తు లందరికీ ఐక్యవేదిక సంబంధించిన సమాచారం అందిస్తూ దీనిలో చేరేట్లు ప్రోత్సహించాలనీ, రేపు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశానికి వారూ వచ్చేట్లు చూడాలనీ అనుకున్నాము. ఇది తాత్విక పునాది మీద ఏర్పడ్డ సంఘం కాదుగనుకనూ, మనమధ్య సైద్ధాంతిక భావసారూప్యత లేదు గనుకనూ-దీని పరిమితుల్ని సదా జ్ఞ ప్తి యందుంచుకుని సైద్ధాంతిక ఘర్షణలకు గానీ, చర్చలకుగానీ తావీయకుండా అందరం వివేకంతో ప్రవర్తించవలసి ఉంటుందన్నది మరింతగా నొక్కి చెప్పడమైంది. ఆ మేరకు విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నట్లే అనిపించింది నా వరకు నాకు. క్రొత్త వాళ్ళందరకూ ముందుగా ఈ విషయాన్ని ఎరుకపరచి ఉమ్మడి కార్యక్రమం యొక్క  ఆవశ్యకత, శ క్తి, పరిమితులనూ ప్రతివారూ ప్రతివారికీ అర్థమయ్యేట్లు విడమరచి చెప్పాల్సిన బాధ్యత చాలా ప్రధానమైనదని అనుకోవడం జరిగింది. అలా ఆ కార్యక్రమం ఉత్సాహవంతంగా ముగిసింది. మరునాడీ వార్తను ప్రెస్మిట్ ద్వారా ప్రజలకు తెలియజేశాము. ప్రముఖ దినపత్రికలూ, సిటీ కేబుల్ టి.వీ. వీటికి తగినంత ప్రాధాన్యత నిచ్చి ప్రజల కందించాయి.

ఐక్యవేదిక నిర్మాణంలో భాగంగా ఏజన్సీ ప్రాంత మిత్రులను కలుద్దాం అని జగన్ మోహన్-చీరాల వారనగా సరేననుకుని 20న బయలు దేరి భద్రాచలం వెళ్లి డా॥ భానుప్రసాద్ గార్ని కలిశాము. అప్పటికప్పుడే ఆయన పని ప్రారంభించి రాత్రికి ముఖ్యులైన 10, 15 మందిని హాజరు పరచగా రాత్రి 12.30 వరకు ఐక్యవేదిక స్వరూప స్వభావాల్ని, అవరోధాల్ని, జాగ్రత్త వహించవలసిన అంశాలనూ వివరించగా అందరూ ఎంతో ఉత్సాహంతో ఏజెన్సీ ప్రాంతం ఈ పనిలో పెద్దపాత్ర వహించగలదన్న హామీ నిచ్చారు. ఆ పై మొదటి ప్రతిఘటనకు మన మెంచుకున్న 'కల్కి' వివరాలడగ్గా నా దగ్గరున్నంత వరకు వివరించాను. ముఖ్యమైన విషయంగా శంకర్- విజయకుమార్ అనే మిత్ర ద్వయపు కుటిల నాటకమే ఈ భాగోతం అని ఉద్యమం పుట్టుపూర్వోత్తరాలు సంక్షిప్తంగా వారి కందించాను. వారిద్దరూ తాత్త్వికంగా పొట్టకో స్తే అక్షరం ముక్క రానివారనీ కనుకనే వారు బహిరంగ చర్చకు రానుగాకరారనీ, రెండేళ్ళకు ముందే తిరుపతిలో వీరి తొత్తైన సుబ్రహ్మణ్యం అనే స్వార్థపరుణ్ణి ఎదుర్కొని ఉన్నామనీ చెపుతూ ఐక్యవేదిక లోని మనందరం ఈ ఉమ్మడి కార్యక్రమం యొక్క సామాజికావశ్యకతను గమనించి మనమధ్యనున్న సిద్ధాంత విబేధాలను ఎత్తుకోకుండా కొనసాగ గలిగితే ఈ లాటి వంచకులను ఊఫ్ అని ఊదేయగలమని, వారెంత బలిసి ఉన్నా ఒంటరివాళ్ళేనని మన ఐక్యసంఘటన స్థిరపడి దృఢపడితే సామాజిక భవిత చాలా ఆశావహంగా ఉంటుందనీ చెప్పాను.

మరోవంక గుత్తా రాధాకృష్ణగారు ఖమ్మం మిత్రులకూ ఈ కబురు చేర వేశారు. వారూ ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లూ వాస్తు - అశాస్త్రీయత పై ఒక పెద్ద సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖమ్మం మిత్రులా సదస్సులో పాల్గొనడానికి నన్నూ, పెంచలయ్యగారినీ ఆహ్వానించారని చెప్పగా నా వైపు నుండి అలాగేనంటూ అంగీకారం తెలిపాను.

ఐక్యవేదిక లక్ష్యాలు రెండు, 1) వంచనారీతుల నెదుర్కొనడం, 2) ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటికి ఎవరి గొడవల్లో వారుగా కొనసాగుతున్న మనమందరం క్రమంగా దగ్గరై పరస్పరావగాహనను పెంచుకుని ఐక్యతను సాధించుకుని దృఢపరచుకోవడం. మిత్రులారా! ఐక్యవేదిక మనందరిదీ, మనందరి అవసరం కూడా. గమనించి ఐక్యవేదికలో ఐక్యం కండి. నేల నాలుగు చెరగులా ఈ కబురందించండి.

అంతర్మధనం - (మనలో మనం)

సమాజ హితకాంక్షులూ సహృదయులూనై విభిన్న ధోరణులకు చెందిన విజ్ఞులై న ఉద్యమకారులారా! సామాజిక పరంగా సమూలమైన మార్పును- విప్లవాన్ని లేక సంక్రాంతిని ఆశించే ధోరణులకు తప్పనిసరిగా ఒక సిద్ధాంతమూ, అది సూచించు ఆశయసాధనకైన కార్యాచరణ ప్రణాళిక ఉంటాయి. ఉండి తీరాలి.

అలాగే ఆయా ఉద్యమకారులకు తమ తమ సిద్ధాంతాల యందూ, కార్యాచరణ ప్రణాళికను గురించి సరైన సమగ్రమైన అవగాహాన కలిగుండడం అవసరం. అందునా ముఖ్యంగా అవగాహనా పరంగా ప్రజలను చైతన్య వంతులను గావించాలనుకునే ఉద్యమకారుల విషయంలో ఇది మరింత ఆవసరం. ఇంత మాత్రమే గాకుండా ఈ తరహా భావోద్యమ కారులకు తమ సిద్ధాంతంతో పాటు సమాజంలో ప్రవర్తిస్తున్న మిగిలిన ప్రధానమైన సిద్ధాంతాల గురించిన్నీ క్షుణ్ణమైన అవగాహన అవసరం. అలాంటి అవగాహన ఉన్నవాళ్ళే భావోద్యమాల్ని సార్థకరూపంలో కొనసాగించగలుగుతారు. ఈ స్థాయిలేని వ్య క్తులతో కూడిన ఉద్యమాలు బండపోకడను - మతవైఖరిని - సంతరించు కుంటాయి. అది ఉద్యమ లక్ష్యాన్నే - సమష్ఠిహిత కాంక్షను దెబ్బతీసి గుంపుల (గ్రూపిజాన్ని) శతృత్వాన్ని పుట్టించి బలపరుస్తుంది.

నిజాన్ని చూడగలిగితే సామాజిక ఉద్యమాలకు చెందిన అనేక ధోరణుల వారిమధ్య శతృవై ఖరికి-అది సిద్ధాంతపరమైందిగా గానీ, వ్యక్తులపరంగా గానీ, ఆస్కారమే లేదు. అశాస్త్రీయత, అహేతుకత, ఉద్యమాల లక్ష్యాలను గురించిన అవగాహనా లోపము, వైయక్తిక నిమ్నాధిక్యతల దృష్టి, ఆధిపత్య కాంక్షల లాటివి చోటుచేసుకున్న తావులందు మాత్రమే శత్రుత్వవైఖరి తలెత్తుతుంది, అది క్రమంగా బలపడి విచారణ శూన్యమైన వీరాభిమానంగానో, అకారణ వైరంగానో రూపొంది స్థిరపడుతుంది. నిదానించి చూడగలిగితే ఇది ఈనాడు లెబఖ్ఖలోకి తీసుకోవలసిన స్థాయికి చేరే వుందని తెలుస్తుంది. ముందీ ప్రతిబంధకాన్నుండి మనమందరం బైటపడవలసి ఉంది. అందుకు రెండు రకాలుగా మనం మనమధ్య సంబంధాలను సరిచూసుకుని సరిచేసుకోవలసి ఉంటుంది. 1) సిద్ధాంత-విషయ-పరంగా, 2) వ్యక్తిపరంగా, ఇక్కడ సరైన నిర్ణయానికి రావడానికి వివేకాన్ని ఉపయోగించాలి. ఎ) శాస్త్రీయ దృక్పథము, హేతుబద్ధత బి) సామూహిక శక్తి - ఐక్యత - యొక్క ఆవశ్యకతపట్ల స్పష్టమైన అవగాహన.

1) సిద్ధాంతపరంగా :- మనందరి ఆకాంక్షా-ఉన్నస్థితిలోని అవాంఛనీయత తొలగి ఉండవలసిన స్థితికి సరిపడ సరైన మార్పులూ చేర్పులూ జరగాలన్నదే కదా!? వాటిని గురించిన మన మన అవగాహనలలో ఏర్పడి ఉన్న తేడా పాడాలవల్లనే మనందరం భిన్న భిన్న ధోరణులుగా ఏర్పడ్డాము. ఎవరికి వారంగా మనం, మన మన ఉద్యమాల ప్రధానాశయంగా అందరి సంక్షేమాన్ని సిద్ధాంతపరంగా కోరుతునే ఉన్నాము. (సమాజాభ్యుదయం అంటే అదే కదా అర్థము) అయినా ఆచరణ దగ్గర కొచ్చేటప్పటికి మీది మాది అన్న భావనలు మనమధ్య ఉండవలసిన మిత్ర దృష్టినీ, సహకార సంబంధాలనూ, సామరస్యాన్ని బలహీన పరుస్తున్నాయి. ఒక్క విషయం ఆలోచించండి..

ఎవరికి వారంగా మనం సమాజంలో అత్యల్పభాగం మాత్రమే. నిక్కచ్చి అంచనాలు వేస్తే 1, 2 శాతంలోపే ఎక్కువ సంఘాలున్నాయి. మరి మనం నలుగురం మిగిలిన మొత్తం సమాజాన్నీ అయా సంఘాలవారుగ మనకు పరాయి వారుగా ఎంచితే మనంకోరే సమష్టి శ్రేయస్సు అన్నమాట కేవలం మాటకు మాత్రమే పరిమితమై, నినాదంగా పరిణమించి ఆచరణీయతను కోల్పోతుంది. ఇది అనుభవంలో అలా ఉందో లేదో పరికించి చూడండి. కనుకనే ఉద్యమ లక్ష్యాలు మహోన్నతంగా అందరి బాగు కొరకు ఉండగా, మన మన ఆచరణలు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడే రకంగానూ, కక్ష సాధింపుల రూపంగానూ తయారవుతున్నాయి. అటు అవగాహనా పరంగా గాఢత లేకున్నా మాది రైటంటే మాదే రైటనే మొండివైఖరీ, ఇటు హృదయపరంగా మన అన్న భావన లేమిచే ఏర్పడుతున్న అమిత్ర లేక శతృవైఖరి ఏర్పడి, మన లక్ష్యాలను, ఆశయాలను చేరడానికీ, సాధించు కోవడంలో ప్రధానమైన అడ్డంకిగా ఏర్పరచుకున్నట్లవుతోంది. ఇది ఈనాడు నిజమైన మార్పునుకోరే ఉద్యమకారులందరి ఎదుట ఉన్న పెద్ద సమస్య. మరి ఈ సమస్యను పరిష్కరించుకోలేమా ? పరిష్కరించుకో నక్కరలేదా? ఉద్యమం ఊపందుకోడానికి ఐక్యతయొక్క ఆవశ్యకత ప్రధానం కాదా? గుడి గుడి గుంచాల ల్లాగా ఏ నలుగురి కా నలుగురం ఏదేదో చేసేస్తున్నా మన్న భ్రాంతిలో జీవితాల్ని వెళ్ళదీసుకుంటే చాలునా?!?

మహెూధృతంగా సాగక సామాజికంగా సరైన మార్పును తీసుకురావడం ఒక పట్టాన అయ్యే పనేనా? ఏ మాత్రం ఉద్యమాశయాలకు సంబంధించిన సృహ ఉన్నా, కాదు- కానేకాదు - ముందుగా మనందరం కలసి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంది. అన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది.

మరి పరిష్కారం ఎలా? ఎక్కడ?

1) భావసారూప్యతలేని ఐక్యవేదికలన్ని తాత్కాలికాలూ, చాలా చాలా పరిమితమైనవీ కూడా. వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలూ చాలా పరిమితమైనవే. కనుక భావ సారూప్యతను సాధించవలసి ఉంది. అందుకు మార్గం? ఉంది. ఒకే ఒకమార్గం ఉంది. నిజమైన సత్యాన్వేషణా తత్పరతతో నాది వారిది అన్న భావాలను విడచి మన మన ధోరణులను ఒక్కొక్కదానినీ అందరం కలసి శాస్త్రీయ పద్ధతి ననుసరించి పరీక్షలకు లోనుచేయాలి. కాలం చెల్లిన, వీగిపోయిన అంశాలను విడచి నిర్నిబంధనంగా నిలచిన అవగాహనలను గుదిగృచ్చి  వైజ్ఞానిక స్థాయిగల ఆ అంశాల పరంగా భావసారూప్యతను పొంది వాటికై కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమించాలి. ఇంతకు మించి భావసారూప్యత శాస్త్రీయ పద్దతిలో సాధ్యంకాదు. యూనివర్సాలిటీ - సార్వజనీనత-కల భావాలవద్దే భావసారూప్యత సాధ్యము. అట్టివి కానివి పాక్షి కాలై - సమాజాభ్యుదయానికి ప్రాధాన్యత వహించే సాధారణ సూత్రాలు కాజాలవు. ఇంతకు మించి మరోమార్గం ఉంటే విజ్ఞులైన మీలో ఎవరుగానీ సూచించండి. ఇదే సరైనదన్న నిర్ణయానికి రాగలిగితే మరందుకు మన మందరం ఏం చేయాలి. “అంతర్మధనం” చేయాలి.

అందరిబాగు కోరుకుంటున్నమన్నా మనందరి మధ్యనే ఆయా ధోరణుల స్వరూప స్వభావాలపై విచారణ రూపంగా అంతర్మధనం జరగాల్సి ఉంది. అదుగో అందుకు ఉద్దేశించిన యత్నారంభ రూపమే ఈ లేఖ, పిలుపున్నూ. ప్రస్తుతానికీ వేదికను 'అంతర్మధనం' మనలో మనం విచారించుకోడం అని అనుకుందాం. మరో  పేరెట్టుకుందామన్నా నాకెట్టి పట్టింపూ లేదు. విషయం ప్రధానం.

ఈ వేదికయొక్క ఆచరణ రూపం :

పై అంశాలు సరైనవేనన్న అవగాహన కలిగిన నలుగురం ఈ వేదికలో భాగస్వాములం కావడం, ఒక క్రమపద్ధతిలో ఒక్కొక్క సిద్ధాంతాన్నీ - ఆ పరిశీలనా కాలంలో ఆదొక పరీక్షాంశమే కానీ మన దెవ్వరిదీ కాదు. అన్న భావంతో నిక్కచ్చిగా వైజ్ఞానిక పద్ధతిలో, ఆవేశకావేశాలకు లోనుకాకుండా, తావీయకుండా విశ్లేషణ-విచారణ పరీక్షలకు లోనుచేయడం, ఇతరేతర ధోరణుల వారికిన్నీ ఈ వేదిక సమాచారాన్నందించి వారినీ యిందులో భాగస్వాములను చేయ యత్నించడం క్రమంగా కొనసాగించాలి.

సిద్ధాంత పరిశీలనలో ఒక్కోభావాన్ని ప్రతిపాదనగా స్వీకరించడం-దాని పక్షాన అది సరైనదేనని చెప్పడం కుదురుతుందేమో చూడడం, సరికాదనడానికి కుదురుతుందేమో చూడడం - ఏది యోగ్యపక్షమో, బలవత్తరమో ఒక అవగాహనకు రావడం- అలా ఒక్కో అంశాన్ని విచారించడం ద్వారా ఆయా ధోరణులను ఆమూలాగ్రం పరీక్షించి బాగోగులను విడగొట్టడం చేయాల్సి

ఉంటుంది.

ఇంత విశాల దృక్పథంతో నూటికి నూరు శాతం సత్యాన్వేషిగా, ఉండడం వెంటనే ఆచరణరీత్యా సాధ్యం కాదనుకుంటే, కనీసం, గాఢమైన అధ్యయనంచేసి దాని పక్షాన్ని కొందరు స్వీకరించి నిలబెట్టే యత్నంచేయడం, మిగిలిన వారందరూ దాని యందేమైన లోటుపాట్లున్నాయేమో చూపించే పక్షం వహించడం చేయాలి. నిజమైన వైజ్ఞానిక పద్ధతి వంటబడితే మనమధ్య ఈ తరహా విచారణ ఆత్మవిమర్శా రూపమై, అంతర్మధనం కొనసాగి సామరస్య పూర్వకంగానే మరింత స్పష్టమైన అవగాహన కలవాళ్ళంగా రూపొందడం ఎక్కువ అంశాల్లో భావసారూప్యత ఏర్పడడం సాధ్యపడుతుంది. ఈ లోపు మనమధ్య సాన్నిహిత్యం ఏర్పడడం ద్వారా ఒకరినొకరు పరిశీలించుకుని పరస్పరం మనలను గురించిన సరైన అవగాహన ఏర్పరచుకోడానికీ వీలవుతుంది ఏమంటారు? మంచిదే, అందరికీ అవసరమైందే, సత్యనిర్ధారణకూ మార్గం సుగమమవుతుంది అనుకుంటే వెంటనే మాకు తెలుపండి. సమావేశం ఏర్పాటు చేసుకుందాం.

సత్యాన్వేషణలో, మీ సురేంద్ర

                                              స్పందన - ప్రతిస్పందన

గౌరవనీయులు సురేంద్రబాబు గార్కి

నమస్తే, మీరు "భిన్న తాత్త్విక ధోరణులు ఒక పరిశీలన"లో భాగంగా 'వివేక పథం'లో 2 నుండి 6 సంచిక వరకూ అద్వైత విచారణ చేసారు. విషయం కాస్త జటిలంగావుంది. సామాన్య పాఠకుడికి అద్వైతం గురించి కొద్దిపాటి పరిచయం గలిగింది. అయినా కొన్ని పదాలు అర్థంకాలేదు. కాని వాటిని వివరించడం ఈ వ్యాసంలో కుదరదని అన్నారు. ముఖాముఖి కలిసినప్పుడు వివరించుదురుగాని. కానీ విషయాన్ని సంక్షిప్తం చేయాలనే లక్ష్యంతో మరీ కొన్ని వివరణలు దాటేశారు. ఉదా॥ బ్రహ్మము అణోరణీయాన్ మహతోన్ మహీయాన్ అని చెప్పబడింది. కనుక ప్రత్యక్షమవడం. కుదరదు” అని తేల్చారు. ఏమీ అర్థంకాలా. పాఠకునికి మీరు చెప్పాలనుకున్నది చేరిందా అన్నది సందేహమే - ఆ వాక్యం క్రిందే  మరోచోట "చైతన్యాత్కించిన్నా స్తీ తి సాక్షాత్కారనుభవం జ్ఞానం" అంటాడు. మరీ సాక్షాత్కారానికి అర్థమేమిటో? అని వ్రాశారు. మా అభిప్రాయం డిటో -అంటే ఇదీ అర్థం కాలేదు.

విషయం సూటిగా చెప్పాలంటే అద్వైతంపై మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల్లోని దోషాదోషాలు సామాన్య పాఠకుడు నిర్ణయించలేరు. అద్వైతం గురించి బాగా అధ్యయనం చేసిన వారికే అది సాధ్యం. మరి మీ పత్రికను అటువంటి వారికి పంపిస్తున్నారా? వారి అభిప్రాయాల్ని అడిగారా? లేకుంటే దయచేసి వారికి పంపండి స్పందన - ప్రతిస్పందన రూపంలో చర్చ జరిగితే మాకు వివరంగా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. 

అంతేకాక అద్వైతం ప్రకారం దేవుడూ, జీవుడూ ఒక్కటేనని, రెండు కావని చెప్తూనే అద్వైతులు కొందరు మనిషి (జీవుడు) దేవుని యందు విశ్వాసముగల్గి విగ్రహాలకు పూజ చేస్తుంటారు. ఈ విషయము మీరు 'అద్వైత విచారణలో ప్రస్తావించక పోయిననూ నా మనసులోని అభిప్రాయం. ఈ సందేహం కూడా మీరుగాని, అద్వైత పండితులుగాని తీర్చగలరు.

                                                                                                                                           ఇట్లు,

                                                                                                                                జగన్ మోహన్

శ్రీ ఎమ్. వి. రావు, విజయవాడ నుండి వ్రాస్తూ, వివేకపథంలోని అద్వైతం గురించి మీరు వ్రాసినది చూస్తున్నాను. ఈ ప్రతిపాదనకు అద్వైతుల నుండి ఎలాంటి స్పందన ప్రచురింపబడలేదు. పత్రిక అద్వైతులలోని ముఖ్యులకు పంపడం జరగటంలేదా? పంపించటం జరగకపోతే మరింత శ్రద్ధ తీసుకుని పంపండి అద్వైతం యందలి వాస్తవాస్తవాలు పరిశీలనకు రాబడాలనే కోరికతో ఈ లెటరు వ్రాస్తున్నాను.

ప్రతిస్పందన: జగన్ మోహన్, రావుగార్ల స్పందన అనుగుణంగా మరింత శ్రద్ధ తీసుకుని మరికొంత మంది అద్వైత పండితులకు అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలు చేసిన వివేకపథం కాపీలను పంపుతున్నాము.

ఇప్పటికే శ్రీ రామచంద్రుల కోటేశ్వరశర్మ, హైదరాబాదు; గోడా సుబ్రమణ్యశాస్త్రి పెదకాంచీపురం; వి. గోపాలకృష్ణశాస్త్రి, రాజమండ్రి; రాణి రామకృష్ణ, సికింద్రాబాదు; శ్రీపాద సుబ్రమణ్యం, హైదరాబాదు; సుభి  బ్రహ్మాశ్రమం, శ్రీకాళహస్తి; వ్యాసాశ్రమము, ఏర్పేడుకు పంపుతున్నాము. మిగిలిన పండితులకు కూడా ఇప్పుడు పంపుతున్నాము. పై స్పందనను సరించి పండితులు తగిన విధముగా ప్రతిస్పందించి స్పందనకు వ్రాయగలరు.

                                                     

No comments:

Post a Comment