Wednesday, February 1, 2023

8 వివేకపథం

 

వివేకపథం

సంపుటి: 1 మార్చి 1997 సంచిక : 8

వంచన  ప్రతిఘటన ఐక్యవేదిక ప్రత్యేక సంచిక

మంచికై సంఘటితమై వంచనను ప్రతిఘటించేందుకు ఇష్టపడి సిద్ధ మయ్యే మంచి వాళ్ళందరుకూ, మిత్రులారా! అందరిదీ అయిన ఐక్యవేదిక మనమందరమూ కలసే ఏర్పరచుకున్న వైనం మీ అందరకూ తెలుసు. దాని శరీర నిర్మాణం (బాడీ ఫార్మేషన్) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పర్యటన జరపాలనుకోవడమూ చాలమందికి తెలిసిందే. పర్యటన విశేషాలు, ఆయా ప్రాంతాలలోని ప్రజల ప్రతిస్పందన మొదలైన వివరాలకై చాలమంది ఎదురు చూస్తుంటారని మాకు తెలుసు. అందుకే మీ అందరి ముందుకొచ్చిందీ ప్రత్యేక సంచిక.

అనుకున్న ప్రకారం 22-2-97 తారీఖు ఉదయం 10 గంటలకు పర్యటనలో ఉండవలసిన వారంతా గుంటూరు సమావేశ స్థలానికి (ఆర్య సమాజ మందిరం-పీచికల గుంట) చేరుకున్నాం. ఐక్యవేదిక భాగస్వామ్యులై న ఆర్య సామాజికులూ, 'అవగాహన' సంస్థవారూ, కొందరు హేతువాద మిత్రులూ ఎంతో శ్రమించి సభా నిర్వహణ, ప్రచార కార్యక్రమాలను నిర్వర్తించారు. వచ్చిన వారందరికీ భోజన సదుపాయాలున్నూ సమాజంవారే కల్పించారు. సభకు భిన్న సంఘాలకు చెందిన '50' మందికి పైగా యోచనా పరులు ఏ తెంచారు ముందుగా అందరం పరిచయ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం.

పర్యటనలో పాల్గొనడానికి తిరుపతి నుండి వచ్చిన ధర్మాచరణ మండలి అధ్యక్షులు సోంప్రకాష్ గారు ఐక్యవేదిక ఏర్పాటుకు ప్రేరణగా ఉన్న పరిస్థితు లనూ, వేదిక స్వరూప స్వభావాలు, సాధక బాధకాలూ వివరించమనగా సరే నంటూ కొంత గతాన్ని కూడా స్మరిస్తూ మొదలెట్టాను.

ఆలోచించగల, చూడగల నేర్పు, ఓర్పు ఉన్న వాళ్ళెవరైనా గతాన్ని నిశితంగానూ, నిదానించి చూడగలిగితే నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్న కొన్ని అంశాలు ఎదురుపడతాయి. అవేమంటే.

1. ఎప్పటికప్పుడు అప్పుడున్న సమాజంలో, సామాజిక - ప్రాకృతిక సంబంధాలలో ఉండకూడని అంశాలు (పరిస్థితులు) ఏర్పడి ఉండడమూ, వాటిని పుట్టించి, పెంచి, నిలిపి వుంచే శక్తులూ వ్యక్తుల రూపంలోనే ఉండడమూ.

2. అలా ఏర్పడి ఉన్న ఉండకూడని అంశాలను, పరిస్థితులను తొలగించేందుకు అవసరమైన మార్పులు తెచ్చుకొనేందుకు యత్నిస్తున్న అభ్యుదయ శక్తులూ వ్యక్తుల రూపంలోనే వుండడమూ.

3. ఈ రెండు రకాల శక్తులూ ఎ) సమాజాభ్యుదయ నిరోధకశక్తి బి) సమాజాభ్యుదయ కారకశక్తి నిరంతరం సంఘర్షించుకుంటూ ఉండడమూ • అయితే ఈ చారిత్రిక క్రమంలో ధార్మికశక్తులు ఆశించినంత మేర అధర్మంపైన లేక ప్రగతి నిరోధక శక్తులపైన విజయాన్ని సాధించి వ్యతిరేక శక్తులను మొత్తంగా నిర్మూలించిన దాఖలాలు ఇప్పటికి లేవు. దీనర్థం అభ్యుదయ శక్తుల పోరాటంవల్ల సమాజానికి మంచి జరగలేదని కాదు. ఆశించినంతమేర, ఆశించిన రీతిలో జరగలేదని మాత్రమే. (గతాన్నించి ఈ వాస్తవాన్ని గమనించకుంటే ఈనాడు అభ్యుదయ, ప్రగతిశీల శక్తుల పక్షంగా నిలిచివున్న మనమూ ఆశించిన ఫలితాలు సాధించేందుకు అవసరమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కుదరదు.) అదలా వుంచండి. అధర్మం, వంచకులూ, వంచనా రీతులూ-క్రమంగా సన్నగిల్లుతున్నవనడానికి ఆధారాలు లేకపోగా అనుభవంలో అవి క్రమంగా బలపడుతూ రకరకాల రూపాల్ని ధరిస్తూ విస్తరిస్తోంది అన్నది స్పష్టంగా గోచరిస్తోంది.

ఎందుకని యిలా జరుగుతోంది? ఎంత కాలంగా ఎందరు, ఎంతగా ప్రతిఘటించినా, ప్రతిఘటిస్తూనే వస్తున్నా అధర్మం పెరగడంలోని వేగాన్ని ఆపగలిగా రేమోగాని దాని పెరుగుదలను ఆపలేక పోయారెందుకని? ఆనాటి నుండి ఈనాటి వరకు తత్వశాస్త్రం ముందున్న అపరిష్కృతంగా ఉన్న పెద్ద సమస్యయిది. ప్రజాభ్యుదయాన్నికోరే సైద్ధాంతికులందరూ సరైన సమాధా నానికై తలలు బద్దలు కొట్టుకోవలసిన ప్రశ్న యిది. ఆశ్చర్యకరమూ, విచారకరమూనైన విషయమేమంటే ఇంతటి మౌలికమైన, కీలకమైన అంశం పై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించిన సైద్ధాంతికులెవరూ గతంలో లేకపోవడం భిన్న ధోరణులకు చెందిన మేధావులెవ్వరూ పట్టించుకోవలసినంతగా దీనిని గురించి పట్టించుకోకపోవడం.

అతి ముఖ్యమైన విషయమేమంటే, అధర్మం పెచ్చరిల్లడానికి ప్రధాన కారణం జీవస్వభావంలోనే ఉన్న స్వార్థకాంక్ష, స్వపరభేద దృష్టి, ఇష్టా యిష్టాలు, కనుకనే అధర్మం పెరగడానికీ, బలపడడానికి సమాజంలో పెద్ద యత్నాలూ, ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకపోతోంది.

యితే జీవ స్వభావంలోనే మరో అంశమూ ఉంది గనుకనే ఆనాటి నుండి ఈనాటి వరకూ అంతో యింతో స్థాయిలో ఆదర్శం పై పోరాటమూ కొనసాగుతోంది. మంచినికోరే లక్షణము మనిషిలో ఉండబట్టే అట్టియత్నమూ ఆనాటి నుండి ఈనాటి వరకూ జరుగుతోంది.

జీవ స్వభావములో ఉన్న ప్రధాన ప్రేరక స్థానాలైన తాను ఉండా లనీ, ఎదుగుతూ వుండాలనీ, గుర్తింపబడాలనీ, తనదికూడా ఎదుగుతుండాలనీ అనుకొనే ఇష్టరూపమైన ఆకాంక్షే. ఇటు స్వార్థపరత్వానికీ, అటు పెరిగిన అవగాహన నుండి జనించిన ధర్మపరతకూ ఆలంబనగా వుంటున్నది.

మిత్రులారా! అర్ధమవుతోందా? అధర్మమూ ధర్మమూ కూడా స్వార్ధమూలకాలే. అపరిమిత స్వార్థం అధర్మానికి దారి తీయగా - పరిమిత స్వార్ధం ధర్మ రూపాన్ని పొందింది. అపరిమిత స్వార్ధంలో యితరుల బాగోగులు గమనించే - పట్టించుకొనే - నై జం కొరవడుతుంది. (ఉండదు) పరిమిత స్వార్ధంతో సామాజిక సంబం ధాలు చెడకుండా ఇతరుల బాగోగులను గురించిన ఆలోచనతో ముడిపడే తన బాగోగులను గురించిన ప్రయత్నం కొనసాగు తుంటుంది.

జీవ పరిణామక్రమంలో విచక్షణ ఈమధ్య పుట్టింది. స్వార్థం ఆరంభం నుండీ ఉన్నదై బలంగా పాదుకొని ఉంది. కనుక విచక్షణ మానవాభ్యుద యానికి సంబంధించి విలువైందవుతోంది. అదే సమయంలో స్వార్థం బలమైందవుతోంది. ఇదిగో ఇక్కడుంది సమస్య సమస్యగానే ఉండిపో డానికీ సమిష్టి అభ్యుదయానికీ ప్రతిబంధకమైన ప్రగతి నిరోధకశక్తులు ఎప్పటి కప్పుడు పెచ్చరిల్లడానికీ. దీనిని ఒక ప్రత్యేక చర్చనీయాంశంగా పరిశీలిం చడం మంచిది గనుక మరోసారి దీనిని విచారించుదాం. తాత్విక అవగాహన కలవాళ్ళ మనుకొనేవాళ్ళు, కలిగించుకుందామనుకొనేవాళ్ళు దీనిని గుర్తుంచు కోండిప్పటికి, మనిషిని ప్రయత్నపరుణ్ణి చేస్తున్నవి మూడు. 1) జీవితంపట్ల సరైన అవగాహన 2) భయం 3) ఆశ, వాటిలో మొదటిదైన అవగాహన ఒక పట్టాన ఏర్పడేదికాదు. అందరికీ కుదిరేదికాదు. మరిక ఆశాభయాలు మాత్రం సర్వులలోనూ స్థాయీ భేదాలలో ఉంటున్నాయి, నడిపిస్తున్నాయి. వీటి పునాదులెంతటివంటే అవగాహనకల పక్షంలోనూ ఉండనే ఉంటాయివి. కాకుంటే తగినపాళ్ళలో ఉంటూ అదుపులో ఉంటాయి.

ప్రాచీన కాలం నుండీ మనిషి ఆలోచనా పరుడైన మనిషి - జీవి తాన్ని సుఖశాంతులతో మరింత సరళంగా, సౌలభ్యంగా కొనసాగించడ మెలాగన్న విషయమై అవగాహనను పెంచుకుంటూ అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలోనివే భావవాద - భౌతికవాద దృక్పథాలు. నిజానికీ రెంటి ప్రధానాకాంక్షా సమాజహిత రూపమైనదే. అందులో ఏది సరైంది అన్నది ఆయా కాలాల పక్షాల మేధావులు తేల్చుకుని ఒకే మార్గాన్ని ఎన్నుకోలేక పోయారు. రెండు దారులూ కొనసాగు తూనే ఉన్నాయి. అంతటితో ఆగక పరస్పరం శతృదృష్టినీ పెంపొందించు కున్నాయి. వాటి పోకడల నలా పెడితే.

నిజానికి మనిషి అతడే వర్గానికి (భావవాద, భౌతిక వాదాల్లో) చెంది వున్నా మంచివాడుగా ఉండడానికీ. వంచకుడిగా ఉండడానికీ అవకాశం  ఉంది. అలా ఉన్నట్లు మన అనుభవంలోనూ కనబడుతుంది. అయినా ఆస్తికత పేరున చెలామణిలో వున్న నానారకాల సాహిత్యంలో చోటు చేసుకునివున్న స్వర్గ నరకాలు, పాప పుణ్యాలు, శాశ్వతానందము, నిత్యనరకము వగైరా భావజాలం ఆశాభయాలకు సంబందించి నవి మనిషిని నియంత్రిస్తున్నవే. అంతటి బలమైనభావాలు ఆశాభయాలకు సంబందించినవి భౌతికవాదం సాహిత్యంలో చోటు చేసుకొనిలేవు. కనుకనే ఈనాడు వంచకు లకు ఎక్కువ అవకాశమిస్తోంది ఆస్తిక సాహిత్యం. ఈనాడు సామాన్య ప్రజ జీవితంపట్ల, సామాజిక - ప్రాకృతిక సంబంధాలపట్ల సరైన అవగాహన కలిగిలేదు. ఇది ఆ స్తిక – నా స్తికాల పేరున ఉన్న రెండు పక్షాలలోని వాళ్ళకూ వర్తిస్తుంది. అయినప్పటికీ ఆశాభయాలను ప్రభావితం చేయగల అంశాలు ఆస్తికత పేరున ఉన్న సాహిత్యంలో అధికాధికంగా చోటు చేసుకొని ఉండడంతో ఆశాభయాలకు లొంగడం సామాన్య ఆస్తిక జనంలో అధికాధికంగా ఉంది. కనుకనే అందరిలోనూ స్వార్థపరత స్వభావరీత్యా ఉన్నప్పటికీ వంచనారీతులూ, వంచనలు, వంచకులూ, వంచితులూ కూడా ఆస్తిక పక్షం లోనే పెద్ద మొత్తంలో కానవస్తాయి, కానవస్తారు. ఇది నిజాయితీపరులైన ఆ స్తికుల్నిగానీ, తత్వశాస్త్ర పరంగా ఆ స్తికతనుగానీ నిందించడంకాదు. ఏది అసలైన ఆ స్తికత అన్న విషయంగానీ, ఆ స్తిక జీవన విధానం అన్న విషయం గానీ నిర్ణయించడానికి వీలులేనంత చెత్త సాహిత్యం పరస్పరం పొసగని, విరుద్ధమైన భావాలతోకూడి సమాజం నెత్తిన రుద్దబడివుంది. గత చరిత్రను గానీ, వర్తమానంలో ఆస్తికత పేరున జరుగుతున్న వివిధ కార్యక్రమాల్ని గానీ వా స్తవిక దృష్టితో వీక్షించగలిగితే వంచన ఆస్తికత పేరునే వివిధ రీతుల్లో, కొంగ్రొత్త రూపుల్లో విస్తరించుతోందన్న పచ్చినిజం పెద్దరూపం లోనే కనబడుతుంది. నిజానికి ఆస్తికత వంచనలకు ఆలవాలం కావడం భక్తి సాంప్రదాయము అవతార వాదమూ ప్రచారంలోకి వచ్చాక ప్రబలమై బహుముఖంగా వి స్తరించింది, మరింతగా పాకిపోయింది:

నిజానికి మానవ సమాజంలో వంచనా రీతులెన్ని ఉన్నాయి. మొత్తం సమాజాన్ని మేధావులూ, సాధారణులు అన్న రెండు వర్గాల క్రింద విడదీయ వచ్చు. అందులో మేధావుల్లో రెండు రకాల వాళ్ళున్నారు. వంచకులు (మాయకులు) మంచివాళ్ళు. ఈ రెండు రకాల మేథావులూ మిగిలిన సామాన్య జనాన్ని (వీరు అమాయకులుగా ఉంటారు. ఆశా భయాలకు లోనవుతూ ఉంటారు.) ఆకర్షించి, నమ్మించి తమవెంట నడిచేట్లు చేస్తుంటారు. ఈ రెండు రకాల వాళ్ళలోని మాయకుల(వంచకుల) పాలబడిన అమాయకులు పై కుటిల మేధావులు పైపైన చూపే మంచిని చూసి మోసపోతుంటారు. మంచిని కోరే మిగిలిన మేధావి వర్గం వంచనకు గురికాని అమాయకులైన ప్రజల్ని మేలు కొలిపి వంచనకు గురై, మరికొందరినీ వంచనకు తెలియకనే గురిచేస్తున్న అమాయకుల్ని వంచన బారినుండి బైటపడవేయడానికీ, వంచకుల ఆట కట్టించడానికి ధర్మపోరాటం సాగిస్తుంటారు. ఇక్కడ కాగుదాం.

తాత్విక చరిత్రను తిరగేస్తే, సామాజికాభ్యుదయం కోరే సిద్ధాంతాలను, వాటిని ఆరంభించిన సైద్ధాంతికులనూ గమనిస్తే పై రెండు పోకడలూ ఇప్పటి వరకూ తెంపులేక వస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఆ క్రమంలోనే మేమూ ఇప్పుడు వంచనకు వ్యతిరేకంగా మంచికి బాసటగా పనిచేయడానికి ఉద్యుక్తులమైనాము. ఒక ప్రణాళికాబద్ధంగా వంచకుల నెదిరించడానికి రెండు పక్షాల బలాబలాలను, వనరులను సరైన అంచనా వేసుకోవలసి ఉంది. అందుకు ముందుగా గతంలో జరిగిన అధర్మ వ్యతిరేక పోరాటాల రీతులూ, వారి ప్రణాళికలు, వారు ఆ పోరులో ఎదుర్కొన్న సాధక బాధకాలు పొందిన జయాపజయాలు (సాఫల్య, వై ఫల్యాలు) మొ॥ వాటిని అధ్యయనంచేసి అవసరమైన మార్పులు, కూర్పులు చేసుకోవలసి ఉంది. ఈ పరిశీలనలో ముఖ్యంగా రెండు విషయాలు అర్థమయ్యాయి. 1) తగినంత బలసమీకరణ జరగలేదనీ 2) ఒక క్రమ బద్ధంగా దీర్ఘ కాలిక పోరాటానికి ప్రణాళిక ఏర్పరచుకోలేదని. మొదటిదానికి కారణం మంచి నాశించే వారిలోనే లక్ష్యాలు నెరవేరడం, వ్యక్తిగత ప్రాధాన్య తలు చోటుచేసుకోవడం కారణంగా సమీకరణకు అవకాశాలు సన్నగిల్లడమే కాక ఉన్న పదిమందీ చిన్న చిన్న గుంపులుగా చీలిపోవడం జరిగింది. అనేక అంతర్గత, బాహ్య కారణాలవల్ల అనైక్యత చోటుచేసుకుంది. ఆ చాలీచాలని నలుగురైనా ఆలోచనతో అవగాహనతో ప్రతిఘటన సాగించడం కాక రెచ్చ గొట్టబడి ఆవేశంచేత చేసిన పోరాటాలే అగుపిస్తాయి. అలా జరిగిన వాటిలో ఆవేశంపాలు మరింత పెరిగినపుడు జరిగిన మంచికన్నా నష్టమే ఎక్కువ. అదిన్నీ యోగ్యులూ, సమర్థులూ, సంసిద్ధులూఐన కార్యకర్తలను బలిచేయడం, కోల్పోవడం అన్న రీతిలో. పైన పేర్కొన్న విషయాలన్నింటినీ గుదిగుచ్చి ఒక క్రమంలో అర్థం చేసుకొంటే 1) తగినంత బలం లేకపోవటమూ, 2) క్రమబద్ధమైన యోచనా పూర్వకమైన కార్యాచరణ ప్రణాళిక నేర్పరచు కొనక పోవడమూ అన్న రెండూ అనుకున్నది నెరవేరకపోవడానికి కారణాలుగా తేల్తాయి. సంఘటిత శక్తియొక్క ఆవశ్యకతవల్లనే సంఘాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన సంఘాలలో పైన మనమనుకున్న కారణాలవల్ల అసంఘటిత - అనైక్యతా - స్థితి ఏర్పడుతూ వచ్చింది. ఉన్న నలుగురూ లేక నాలుగు సంఘాలూ తమ తమ గుంపును పెంచుకోవడం వరకే లక్ష్యాన్ని పెట్టుకోవ డంతో అసలు పోరాడవలసిన అంశంపై వత్తిడి తగ్గింది. వీరిలోనూ పోరాడే శక్తి సన్నగిల్లింది. పైగా వీరిలో వీరే గుద్దులాడుకోవడం, ఏదైనా ఒక పని అందరూ చేయాలనుకుంటున్నదే అయినా ఎదుటి సంఘంవారు చేస్తుంటే మన కెందుకులే అని ఉదాసీనంగా తటస్థంగా ఉండడం వగైరా వైఖరులు అభ్యుదయాకాంక్షుల యత్నాలనే బలహీనపరుస్తున్నాయి.

మిత్రులారా ! ఇప్పటివరకు జరిగిన క్రమానికి సంబంధించిన పై విశ్లేషణనంతా విచారించగలిగిన యోచనా పరులలో ఈ మధ్య కలసి పని చేయాల్సిన అవసరం మాటి మాటికీ మదిలో మెదులుతోంది. ఒకరిద్దరు ఐక్య సంఘటనకై కొంత ప్రయత్నమూ చేశారు. అనేక కారణాలవల్ల అవన్నీ ఆదిలోనే ఆగిపోయాయి. ఇది ఒక పట్టాన అయ్యేపని కాదులే అనుకుని ఎవరికి వారు అవసరం కనబడుతున్నా ఏమీ చేయలేక ఊరకుండి పోయారు.

ఈ నేపధ్యంలో 'తత్వ చర్చావేదిక' అన్న కార్యక్రమం ద్వారా సత్యాన్వేషణ ఎన్నో సంఘాల వారితో పరిచయా లేర్పడడం, ఆయా సంఘాల వారిలోని యోచనా పరులతో సాన్నిహిత్య మేర్పడడంవల్ల సమాన లక్ష్యాల విషయంలోనైనా కలసి పనిచేస్తే బాగుంటుంది గదా అన్న ఆలోచన రావడం జరిగింది.  వెంటనే ఒకరిద్దరి చెవినేశానీ విషయాన్ని. అప్పటికే వారిలోనూ ఈ ఆలోచన ఉండడంతో వెంటనే అంగీకరించడమే గాక ఇతరులతో సంప్రదించడానికీ ముందుకొచ్చారు వారు. మొదటగా ఈ విషయాన్ని ఆం. రా. హేతువాద సంఘాధ్యక్షులు గుత్తా రాధాకృష్ణగారికీ, అదే సంఘంలోని వారైన సుజరేగారికీ చెప్పాను. వ్యక్తిగతంగా తమ ఆమోదాన్ని తెలుపుటే గాక వారి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని చర్చించుకొని ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపారు. పిదప తిరుపతి ధర్మాచరణ మండలి అధ్యక్షులు సోంప్రకాష్ గారిని సంప్రదించాను అంతకుముందునుండే మే మిరువురం కలసి పనిచేయాలన్న నిర్ణయానికి వచ్చి ఉండడంతో ఆ కలసి పనిచేయడం ఈ ఐక్యవేదిక రూపంలో అరంభిద్దాం. కొరవ విషయాలు క్రమంగా చర్చించుకోవచ్చును అని ఐక్య వేదిక రూపొందడానికి కావలసిన భిన్నసంఘాల కలయికలో భాగస్వాము లైనారు. వారున్నూ, ఇహ పరవాలా! ముగ్గురం అంతో ఇంతో ధృఢచిత్తులం, పరస్పర అవగాహన కలవాళ్ళం., మంచికై కలసి చెడుపై పోరాడవలసిన అవసరాన్ని గుర్తించినవాళ్ళం అగుటచే ఐక్య సంఘటనకు బీజావాపనం జరిగినట్లే ననిపించింది నాకు. ఆపై తెలిసిన వాళ్ళందరకూ ఉత్తరాలు రాసి 1996 డిసెంబరు 22 నాటికి పరిచయస్తు లందరితోటి ఒక సమావేశం వేశాము. 6, 7 సంఘాలకు చెంది 12 జిల్లాల నుండి సుమారు 100 మంది దాకా హాజరైన ఆ సమావేశంలో ఐక్య వేదిక ఆవిర్భవించింది. అనంతర కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడానికిగాను తాత్కాలిక సంఘాన్ని (అడ్ హాక్ కమిటీ) ఏర్పరచుకోవడమూ, సంఘానికి ఏ పేరు నిర్ణయించాలన్న అంశంపై దాదాపు 25 పేర్లు సూచనలు రాగా వాటిలో ఒకదానిని నిర్ణయించడానికి అడ్ హాక్ కమిటీకి అధికారం ఇవ్వడమూ జరిగింది. ఆనాటి సభనే ప్రధమ సర్వసభ్య సమావేశంగా పరిగణించడం జరిగింది. ఆపై తిరుపతిలో 1997 జనవరి 4న తాత్కాలిక కమిటీ సభ్యులంతా కలసి చర్చించుకుని వంచనా ప్రతిఘటన ఐక్య వేదిక అన్న పేరును ఖరారు చేయడం జరిగింది.

అటుపిమ్మట జనవరి 14న మరో సర్వసభ్య సమావేశం మాజేటి ప్రహ్లాదరావు కళ్యాణమండపంలో జరిగింది. ముందనుకున్నవారూ, మరి కొందరు క్రొత్త మిత్రులతో సమావేశం జరిగింది. అందు ఐక్యవేదికకు స్థిరత్వాన్నివ్వడానికి రాష్ట్ర కార్యవర్గంలోని 10 మందితో జిల్లా సంఘాల నేర్పాటు చేయడానికిగాను రాష్ట్ర పర్యటన జరపాలనుకోవడం జరిగింది.

ఇక్కడి కాగుదాం. ఒకసారి అయినంతవరకు నెమరువేసుకుందాం. ఐక్య వేదిక అవసరాన్ని గుర్తించి సిద్ధపడ్డ మొదటి సంఘాలు మూడు 1) సత్యా న్వేషణ మండలి, చిల్లకల్లు 2) ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, విజయవాడ 3) ధర్మాచరణ మండలి, తిరుపతి. ఈ మూడు సంఘాల ప్రయత్నంవల్ల జరిగిన 1996 డిశంబరు 22 నాటి సమావేశానికి అదనంగా భాగస్వాములై న సంఘాలు 4) ఆర్యసమాజ్, గుంటూరు-విజయవాడ శాఖలు 5) అవగాహన, గుంటూరు-6) జె. కె. అధ్యయన కేంద్రం, తిరుపతి-చిత్తూరు.

జనవరి 14నే నిర్ణయించుకున్నాం ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ప్రధమ విడతగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరులు, విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలు పర్యటించాలని, పర్యటనలో నేనూ, గుత్తా రాధా కృష్ణ, సోంప్రకాశ్, సుజరే, నాగన్న, జగన్, రమేష్, వెంకట్రామయ్య, ప్రసాద్, ఆనంద్ గార్లూ పాల్గొన్నాం.

ఐక్యవేదిక స్వరూప - స్వభావాలు

ఐక్యవేదిక అనడంతోనే భిన్నసంఘాల ఉమ్మడి వేదిక అని అర్థమవు తోంది కదా. అంటే ఏవో కొన్ని కార్యక్రమాలకే పరిమితమై కలసి పని చేసేందుకు ఏర్పరచుకున్న వేదికన్న మాట యిది. అన్ని విషయాల లోనూ మనమధ్య ఏకాభిప్రాయం లేదని గుర్తిస్తూ, అంగీకరిస్తూనే కలవగలిగిన చోట కలసి పనిచేద్దామని అనుకుని ఏర్పరచుకున్న వేదికన్న మాట యిది. ఏ క్షణా నైనా  విడిపోడానికి విచ్ఛిన్నం కావడానికి అవకాశాలున్నట్టిదీ, కలవగలిగినంత సేపూ అమిత బలంగా పనిచేయగలట్టిదీ ఈ వేదిక. కనుక నిలిపి ఉంచుకోడం కంటే చీలదీయడం సులభమైన దీనిని ఎవరికివారం నిలిపి ఉంచుకోడానికి నిరంతరం మెలకువతో బాధ్యత వహించవలసి ఉంటుందన్న అంశమూ, ప్రముఖంగా ప్రస్తావించుకోవడం గుర్తించడమూ జరిగింది. ఆ అవగాహనతో నే తప్పనిసరిగా పాటించాల్సిన క్రింది నియమాలను మనకు మనమే విధించుకోడం జరిగింది.

1) ఈ వేదిక పై సిద్ధాంతపరమైన చర్చలు చేయరాదు. సైద్ధాంతిక అనుకూల-ప్రతికూల వైఖరులను ప్రదర్శించరాదు.

2) ప్రస్తుతానికిది వంచనకు వ్యతిరేకంగా పోరాడడాని కుద్దేశించింది మాత్రమే. అదిన్నీ ఆ స్తికత పేరున జరుగుతున్న, వంచనలను మాత్రమే. ఇప్పటికి ప్రతిఘటన లక్ష్యంగా స్వీకరించడం జరిగింది. కనుక ఎవరి దృష్టి నుండి వారు వారి వారికి ముఖ్యమని తోచిన విషయాలను ముందుగా ప్రతిఘటించడానికి సిద్ధపడమని వత్తిడి చేయరాదు. అందరం కలసి నిర్ణయించు కున్న ఒక్కో అంశంపై ఒక క్రమంలో ప్రణాళికాబద్ధంగా మాత్రమే ప్రతిఘటన కార్యక్రమం కొనసాగించాలి.

3) ఇది విధి నిషేధాల రూపమైంది కాక, బాధ్యతతో ఐచ్ఛికంగా సిద్ధ పడింది కనుకనూ, ఎవరికి వారికి అప్పటికే వారివారి మాతృసంస్థల రూపంలో లక్ష్యాలూ, ప్రణాళికలూ ఏర్పడే ఉన్నవి కనుకను షరతులులేని స్వేచ్ఛ ప్రతి సంఘానికీ ఉంటుందనీ, భావ సారూప్యత కల అంళాలవరకే ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొనవచ్చుననీ, వంచనను వ్యతిరేకించే వారెవరైనా ఇందు చేర వచ్చుననీ, ఏనాడు అంగీకారం కాకుంటే ఆనాడు వెళ్ళిపోవచ్చుననీ అను కున్నాము. అయితే బైటకు వెళ్ళేటప్పుడు ఐక్యవేదికను చీలదీసే యత్నం చేయవద్దనీ, అది సమాజాభ్యుదయానికి ఆటంకమవుతుందనీ పరస్పరం వివేకంతో హెచ్చరించుకోవడం జరిగింది.

గమనిక : ఆస్తికత పేరున జరుగుతున్న వంచలనే ముందుగా ఎందుకు ఎంచుకోవలసి వచ్చిందన్నది ఈ వ్యాసం మొదట్లోనే వివరించాను దానికి సంబంధించిన మరికొంత సమాచారాన్ని మీ ముందుంచుతున్నాను గమనించండి.

ఈనాడు ఆస్తికత పేరున చెలామణి అవుతున్న వాటిలో 99% తాత్విక పునాదిలేని పోకడలే. ఒకే కాలంలో ఇద్దరూ, ముగ్గురూ, నలుగురూ.... ఇలా తామే దేవుళ్ళమనో, దైవావతారులమనో, ప్రచారం చేసుకోడం దానిని ప్రజ అంగీకరించడం పెద్ద విడ్డూరం. ఈ దేవుళ్ళ మనేవాళ్ళు ఒకరినొకరు అంగీకరించరు. అంటే నేనే దేవుణ్ణనే ఒకడు, దేవుణ్ణి నేనేనంటున్న మరొకడ్ని దేవుడివి కాదంటున్నా డన్నమాట. ప్రజల కివేమీ పట్టడంలేదు, పెద్ద లనబడే వాళ్ళు పట్టించుకోవడంలేదు. మెహర్, సత్యసాయి, బాలసాయి, బ్రహ్మబాబా (బ్రహ్మకుమారీల సమాజం), కల్కి, వీరభోగ వసంతరాయుడు, లహరీ కృష్ణ వగైరా లందరూ తామే దేవుళ్ళమని ప్రకటించుకున్నారు.

ఇహ పొట్టకోస్తే అక్షరం ముక్కరాని అమ్మలూ, అవ్వలూ, పేరంటాళ్లు బ్రతికుండీ, చచ్చీకూడ దేవతలై కూచున్నారు. ఇక యోగులూ, సిద్దులూ, జ్ఞానులూ అన్న పేరున ఆయా వేషాలేసుకుని లెక్కకు మిక్కిలిగా సమాజం నెత్తికెక్కి కూచుంటున్నవారు తంబలు తంబలుగా బయలుదేరుతున్నారు. ధరణీమాతలూ, ధవళేశ్వరం స్వాములూ, దత్తావతారులూ మరోవంక చలా యిస్తున్నారు. చెప్పేవి శ్రీరంగనీతులూ అన్న నానుడి వీరికి అన్వయించి నట్లుగా ఇతరుల కన్వయించదు.

వెంకన్నా దేవుడే, రాఘవేంద్రుడూ దేవుడే, షిరిడీ సాయి  దేవుడే, సత్య సాయి దేవుడే. అసలిందరు దేవుళ్ళెక్కడి నుండి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇక వీరి ననుసరించే పిచ్చి మంద తాము చెడింది కాక పదిమందిని చెడలాగు తుంటారు. ఇదండీ ఈనాటి వా స్తవ పరిస్థితి. అందుకే వంచన అన్ని చోట్లా శాఖోప శాఖలుగా విస్తరించి ఉన్నా ముందుగా అత్యంత ప్రమాదకరంగా తయారౌతున్న దోపిడీ రూపమైన దేవుడి పేరన జరిగే వంచనలను ఎదుర్కోవాలకనుకోడం జరిగింది. ఈ విషయానికి సిద్ధాంతపరమైన అవగాహన కల ఆస్థికులుకూడ అంగీకరించారు. ఆస్తికత పేరున జరుగుతున్న వంచనలూ బహు ముఖంగా ఉండడంతో కార్యాచరణ శక్తివంతంగా ఉండాలంటే ఏకలక్ష్యం, ఏకసూత్ర కార్యక్రమం అవసరమని అనుకుని కల్కి ఉద్యమం పేరున క్రొత్తగా పాదుకుని ఊపందుకుని ఊడలు దించుకుంటున్న విజయకుమార్, శంకర్ అను కుటిల మేధావులపై పోరాటం ఆరంభించాలనుకోవడం జరిగింది.

ఈ మన ఆరంభానికి ఊతంగా కల్కి ఉద్యమంలో ఒక ప్రాంతానికి శిక్షకుడిగా కొంతకాలం పనిచేసి కల్కి పేరున జరుగుతున్నది వంచనేనని గమనించి బైటపడ్డ అజిత్ భగవత్పాద (ఆజిత్ కుమార్) మనతోపాటు కలసి పోరాడడానికి సిద్ధపడి మూడు నాల్గు సభలలో పాల్గొన్నారు. కల్కి బాగోతాన్ని ఆధారాలతో సహా వెళ్ళడించి వాళ్ళ దొంగ బ్రతుకుల్ని ఎండగొట్టారు. వాళ్ళ గతానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని మన కందించారు. కల్కి ఉద్యమం పేరున విజయకుమార్, శంకరులు చేస్తున్నది వంచనేనన్న సంగతి తమిళనాడు, బెంగుళూరులలో ఇప్పటికే బట్టబయలైంది. కొన్ని పత్రికలు ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి కూడ. ఆంధ్రలో అజిత్ కుమార్, మనమూ, మరికొన్ని సమాజ హితకాంక్షకల సంఘాలు వీరి వంచను ప్రతి ఘటిస్తూ ప్రజల్ని మేల్కొల్పుతున్నాయి.

హెచ్చరిక: ఒక్క ముఖ్యవిషయం. తెలిసో తెలియకో కల్కి ఉద్య మానికి-వంచనకు-వత్తాసు పల్కుతున్న కల్కి అనుయాయుల్లారా! మేల్కోండి. చేసిన తప్పును గుర్తించి సరిదిద్దుకోండి. లేదా చరిత్ర మిమ్ము క్షమించదు. దొంగలుగా మిగిలిపోతారు చివరకు ఆ యిద్దరు దొంగలతోబాటు సమాజం విధించే శిక్షకు మీరు గురికాక తప్పదు.

మంచిని ప్రేమించి వంచను వ్యతిరేకించగల సహృదయమూ, సాహసమూ కల ధార్మికులారా! ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇదే ఒక గ్రంథమవుతుంది. మొత్తం విషయాన్ని సమీక్షిస్తాను. నిజానిజాలను గమనించండి.

1. సమాజంలో ఆరంభంనుండీ ధర్మాధర్మ పక్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. పోరాడుకుంటూనే ఉన్నాయి.

2. రెండూ జీవస్వభావ జన్యమైన స్వార్థమూలకాలే. అయితే ధర్మ పక్షములోని స్వార్థం అవధులు, అదుపు కలిగి పదిమంది స్వార్థాలతో ముడి పడి అందరి హితంలో ముడిపడే తన హితము ఉంటుందనుకుంటుంది.

మరి అధర్మ పక్షపు వైఖరి ఇందుకు భిన్నంగా అడ్డూ ఆపూలేక ఇతరుల స్వార్ధాన్ని హితాన్ని పట్టించుకోదు.

3. మనిషి-అవగాహన పైనా, ఆశా భయాలపైనా ఆధారపడి (వాటిచే ప్రేరేపింపబడి) యత్నశీలుడవుతున్నాడు.

4. ఇంతవరకు అధర్మం తగినంతగా అదుపు చేయబడకపోవడానికీ ధర్మం స్థిరపడకపోడానికి తగినంత మానవశక్తి సంఘటితం కాకపోవడమూ ఆవేశాలు విడచి ఆలోచనతో దీర్ఘకాలిక కార్యాచరణ పథకాన్ని ఏర్పరచుకుని దృఢంగా యత్నించక పోవడమూ అన్నవి అతి ముఖ్యమైన కారణాలుగా కనిపిస్తున్నాయి.

5. మంచినికోరే సంఘాలలోనే అనేక కారణాలవల్ల అనైక్యత, శతృ దృష్టీ ఏర్పడి ఉండడం మరో ప్రధాన కారణం.

4, 5 అంశాలలోని వాస్తవాన్ని గమనించడంవల్లనూ, ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఆకళింపు చేసుకోడంవల్లనూ ఏర్పడిందీఐక్యవేదిక. ప్రస్తుతం ప్రధమ కర్తవ్యం మనందరి ఐక్యత, జనసమీకరణ అన్నదే. నిదానించి విషయాన్ని అర్థం చేసుకోండి. పొరపొచ్చాలుంటే మనసు విప్పి మాట్లాడుకుని సరిచేసుకుందాంరండి! నిజాయితీగా మంచిని కొరేవారి కలయిక చెడుకు గొడ్డలి పెట్టు అవడమేగాక మంచికి రాచబాట అవుతుంది. ఐక్యవేదిక వల్ల చెడుమాత్రం జరగదు. రండి చేతులు కలపండి. అందరకూ ఈ సమాచార మందించి కలసిరావడానికై కదిలించండి.

ఇదండీ ఇప్పటివరకు జరిగిన మా పర్యటనలోని వక్తలందరి మాటల సారాంశం. పర్యటనలో నేనూ గుత్తా రాధాకృష్ణ, సోంప్రకాశ్, నాగన్న, సుజరే, రమేష్ గార్లు వ్యక్తలుగా కొనసాగగా వెంకట్రామయ్య, ప్రసాద్, ఆనంద్, జగన్ గార్లు శ్రోతలలో ఉండి క్రొత్తవారికి కలిగిన సందేహాలు నివృత్తిచేస్తూ వారిలోని స్పందనలను గమనిస్తూ వచ్చారు.

ఆయా జిల్లాలలో తాత్కాలిక సంఘాలను ఏర్పరచుకోవడం జరిగింది. ఆ వివరాలు క్రింద రాస్తున్నాను.

1. గుంటూరు : 1) వై. కోటేశ్వరరావు, 2) కె. నాగభైరవి గంగా పార్వతి 3) కె. లక్ష్మారెడ్డి 4) ఏలూరు ప్రసాదరావు 5) గమనం 6) ఇందు శేఖర్ 7) కె. మల్లిఖార్జునరావు 8) జి. పకీరయ్యగార్లు. 

2. కృష్ణా : 1) ఎస్. నాగార్జునరావు (కన్వీనర్) (కన్వీనర్) 3) ఆర్. పిచ్చిరెడ్డి 4) ఎస్. పవన్ కుమార్ (మెజీషియన్) 6) పి. శ్యామల. 7) ఎమ్. సుశీల 8) కె. జయ  9) శ్రీనివాసరావు 10) టి. రాములు, 11) టి. వెంకటేశ్వరరావు 12) డి. శ్రీనివాసరావు, 13 ఎన్. శ్రీనివాస్.

పశ్చిమ గోదావరి : 1) కఠారి ప్రభాకరరావు 2) రౌతు సత్యనారా యణ 3) జానా నాగేశ్వరరావు 4) ఎన్. కృష్ణయ్య 5) కె. దమయంతి 6) దాసరి గంగరాజు 7) చక్రవర్తి 8) వి. రాజారావు (లాయర్) గార్లు.

4. తూర్పు గోదావరి :- 1) Ch. S. గోపాలరావు 2) V. కొండల రావు (కన్వీనర్) 3) A. ఆదినారాయణ (కన్వీనర్) 4) Dr. V. V. రమణ (కన్వీనర్) 5) S, సిద్ధార్థభక్షా 6) P. వెంకటేశ్వరరావు, 7) D. పేర్లింగమ్ 8) కఠారి బెంజిమన్ 9) గోపు చంద్రారావు 10) A. వెంకటే శ్వరరావుగార్లు.

5. విశాఖ : 1) ఆకురాతి మురళీ కృష్ణ 2) J. N. V. ఈశ్వర్ 3) -K.P. సుబ్బారావు (ప్రొఫెసరు) 4) వెంకటేశ్వర్లు (PD.SU) 5) శ్రీమతి నవత 6) Ch. ప్రసాద్ 7) N. నిర్మలగార్లు.

6) విజయనగరం : 1) M. V. R. కృష్ణాజి 2) N. దామోదరరావు 3) పాపయ్యరాజు 4) S. V. L. N. మూర్తి 5) అప్పలనాయుడుగార్లు. 7. శ్రీకాకుళం : 1. B. V. A. రామారావు 2) డా॥ 3) P. సూర్యనారాయణ 4) కాళీపట్నం రామారావుగార్లు

ఐక్యవేదిక కార్యాచరణ తీరుతెన్నులు

మానేపల్లి

కార్యాచరణ మూడు రకాలుగా ఉండాలనుకున్నాము. దానికవసర మైన శక్తికోసం i) సభ్యులను చేర్పించుట, ii) జిల్లా సంఘాల నిర్మాణము, మండల స్థాయి వరకు ప్రాతినిథ్యం ఉండేట్లు చూడడము lii) వనరుల సమీకరణ ముందుగా, చేయవలసినపని అనుకున్నాం ఇంతవరకయ్యాక కార్యాచరణ ఆరంభం.

1) జన జాగరణ : పత్రికలు, T. V., కరపత్రాలు, సభలు, సమా వేశాలు, ప్రదర్శనలు, ఇష్టాగోష్టులు, మొదలగు సాధనాలు, విధానాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేయడం; వంచనారీతుల, వంచకుల గుట్టురట్టు చేయడం.

2. న్యాయ విభాగం ; ప్రతిజిల్లా కమిటీలోనూ ఒక నా న్యాయవాదిని సభ్యునిగా చేర్చుకొనుట; అలా ఏర్పడ్డ న్యాయవాదులతోటి ఒక న్యాయ విభాగాన్ని ఏర్పరచుకోవడం. జరుగుతున్న వంచనలను, వాటికి సంబంధించిన వివరాలను సేకరించి న్యాయ స్థానాలలో కేసులు నడుపుతుండడం; ఆ రకమైన అంశాలను అటు ప్రభుత్వ దృష్టికి ఇటు ప్రజల దృష్టికి తీసుకు వెళ్ళడం.

3. శాసన, చట్ట సభలలో సమాజ పీడకులైన వంచకులను గురించి, వంచనలను గురించిన అంశాలను లేవనెత్తి ప్రభుత్వదృష్టిని ఇటు సారించేట్లు చేయడంద్వారా వంచకులను అదుపుచేయడం.

ఈ మూడు రీతుల్లో కార్యాచరణ కొనసాగించాలనుకున్నాం.

విజ్ఞప్తి: ఇందుకుగాను ప్రజలకు, ఉద్యమాలకు అనుసంధానకర్త యైన [ప్రధాన మీడియా అయిన] ప్రెస్ యాజమాన్యాన్ని వంచనా ప్రతిఘటన ప్రజోద్యమ రూపమైన ఈ కార్యక్రమానికి నిండు మనస్సుతో బాధ్యతతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

సూచన: రెండవ విడతగా రాష్ట్ర పర్యటన తెలంగాణా జిల్లాలుగా అనుకుంటున్నాము. నిర్ధారణైన వెంటనే ఆయా జిల్లాల మిత్రులకు, మిత్ర సంఘాలకూ కబురు అందించగలము. ఈలోపు ఈ సంచిక చూసిన వెంటనే తెలంగాణా జిల్లాలలో మీ మీ పరిచయస్తుల వివరాలు మాకందించుతూ వారినీ ఐక్య వేదికలో పాల్గొనేట్లు ప్రోత్సహించవలసినదిగా మంచిని కాంక్షించే వివేకులందరకూ విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మనందరిదీ, అలాగే వంచనను ప్రతిఘటించడంకూడ మనందరి బాధ్యత.

జూన్ నెలలో రాష్ట్రం మొత్తం నుండి జనసమీకరణ చేసి విజయవాడలో ఒక పెద్ద బహిరంగసభ భారీ ఎత్తున నిర్వహించాలనుకోవడం జరిగింది. ఇప్పటినుండే మీ మీ ప్రాంతాల ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి అధిక సంఖ్యలో తరలి వచ్చేందుకు కృషి సల్పండి.

ఆ సందర్భములో ఐక్య వేదికకు సంబంధించిన పూర్తి సమాచారం తోనూ విజ్ఞులూ, విప్లవోద్యమ పెద్దలూ ఐన ప్రముఖుల అభిప్రాయాలతోనూ ఎంతో విలువైన సమాచారంతో ఒక సావనీరు విడుదల చేయాలను కోవడమూ జరిగినది.

చివరిమాట : భిన్న సంఘాల వాళ్ళమైన మనలో తప్పనిసరిగా కొన్ని విషయాలలోనైనా అభిప్రాయభేదాలుండక తప్పదు. అలాగే ఏవో కొన్ని అంశాలలోనైనా భావ సారూప్యత ఉండకపోదు. ముఖ్యంగా మంచిని పెంచాలి. వంచన నరికట్టాలి అన్నదగ్గర మనమంతా ఏకలక్ష్మియులమే కనుక ఐక్య వేదిక ద్వారా ఉమ్మడి కార్యక్రమాలను ఏర్పరచుకుని చెడుని పోనాడ డానికి, అలా దగ్గరగా కలసి పనిచేయడంద్వారా ఏర్పడ్డ సాన్నిహిత్యంతో -ఒకరి నొకరు మరింత సరిగా అర్థం చేసుకోడానికీ, ఉన్న అభిప్రాయభేదాలను


మిత్రులంగానే కలసి విచారించుకుని, విశ్లేషించుకుని, పరీక్షించుకుని సరిచేసుకోడానికీ కూడ ఈ వేదికంతమంచి అవకాశం మరొకటుండదు. కనుక సరైన యోచనతో ఏర్పడ్డ వివేకంతో ఉచితానుచితాలను వివేచించి ఐక్య వేదిక విస్తరణకు స్థిరత్వానికీ నడుంబిగించండి. "మిత్ర సంఘాల ఐక్యత వర్థిల్లాలి" ప్రస్తుతానికిదే మన నినాదం. ఉంటాను సెలవు. సత్యాన్వేషణలో మీ ఐక్య వేదిక కన్వీనర్ సురేంద్ర.


తాత్కాలిక ప్రధాన కార్యాలయం అడ్రసు: వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక 

4 రాఘవ బిల్డింగ్ 

మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ 

విజయవాడ-520010 (ఫోన్ : 484153)


సంతాపము


ఐక్యవేదిక క్రియాశీల కార్యకర్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడూ ఆర్య సామాజికుడూ, నిజాయితీ, నిష్కల్మషతతో కూడిన ఆవేశపరుడూ, రాష్ట్ర పర్యటన మండలిలో ఒకరూ అయిన డా॥ రమేష్ బాబు హఠాత్తుగా మరణించారు. ఐక్యవేదిక తరుపున ఒక మంచి కార్యకర్తను కోల్పోయినందుకు చింతిస్తూ వారి బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నాము. సంపాదకులు


తత్వ  చర్చా వేదిక

విజ్ఞులారా ! క్రమాన్ననుసరించి చర్చావేదికను 1997 ఏప్రియల్లో ఏర్పాటు చేసుకోవలసి ఉంది. చర్చనీయాంశంగా ఈసారి 8/12 (బైబిల్ సిద్ధాంతాన్ని) ఎంచుకోవడం జరిగింది. ప్రతిపాదక పక్షం సమ లుండేట్లు చూడడానికి యత్నించవలసి ఉంది. సిద్దవటంలోనున్న ఫాదర్ చిన్నప్పగారి సలహా మేరకు విజయనగరం చర్చినందున్న విశేషజ్ఞులైన రెవ. ఫా. పుదుచ్చేరిగారిని చర్చావేదికకు రమ్మనడమూ, వారంగీకరించడమూ జరిగింది. వారి సూచన మేరకు బెంగుళూరు, హైద్రాబాద్ లలో ఉంటున్న మరి కొందర్ని కలవవలసి ఉంది. ఆ యత్నం చేస్తున్నాము. తెనాలినుండి సైన్సు పట్టభద్రుడై క్రైస్తవ ప్రచారం చేస్తున్న సుధాకర్ గారిని పిలవడమూ వారు అంగీకరించడమూ జరిగింది. ఫా. చిన్నప్పగారూ సదస్సుకు వస్తానన్నారు.

ఇహ ప్రతిపక్షంగా ఉండడానికి బైబిల్ను అత్యంత నిశితంగా క్షుణ్ణంగా పరిశీలించిన వారుగా పేరుబడ్డ P.S.R. (P. సుబ్బరాజు) N. V. బ్రహ్మం గార్లను ఎంచుకుని అహ్వానించగా వారూ తమ అంగీకారం తెలిపారు. మేమంతా కొందరం బైబిల్ను మరొకసారి అధ్యయనం చేస్తున్నాము.

విషయ విచారణ సజావుగా లోతుగా జరగడానికి వీలుగా విచారణ క్రమాన్ని విచారణీయాంశాలనూ చర్చించే ఇరుపక్షాలకు, వినే జిజ్ఞాసువులూ, పరీక్షకులకు ముందుగా అందించితే బాగుంటుందన్న యోచన రెండు పక్షాలకూ మాకూ కలిగింది. అందుకే చర్చావేదికకు భూమికగా ఉండగల కొన్ని విషయాల్ని ముచ్చటిస్తున్నాను.

ప్రతి తాత్విక ధోరణి మనిషీ - సమాజము - ప్రకృతి వాటి మధ్య ఉన్న _ఉండవలసిన సంబంధాలను గురించి తన అవగాహన నేమిటో వివరిస్తుంది. సిద్ధాంత విచారణంతా ముఖ్యంగా వీటిచుట్టూ తనే అల్లుకుని ఉంటుంది. ఉన్న పరిస్థితి అందు ఉండకూడని తనం ఏమిటో వాటికి కారణా లేమిటో (దీనినే సమస్యా రూపం అని అందాం) వాటిని తొలగించు ఉపాయ మేమిటో (పరికరాలు - విధానముల తోటి సాధన క్రమం అందాం) మరి ఉండవలసిం దేమిటో అదెందుకు లేదో ఎలా వస్తుందో ఆ స్థితి ఏర్పడడంవల్ల ఆ వనగూడే ప్రయోజన మేమిటో (దీనిని అంతిమ సాధ్యం అందాం) వివరించాలి. అప్పుడే ఆయా ధోరణులకు తాత్వికస్థాయి ఏర్పడు తుంది ఆపై ఆ భావజాలాన్ని శాస్త్రీయ విశ్లేషణకు లోనుచేసి సత్యా సత్యాలను తేల్చుకోవలసి ఉంటుంది. అలా తేలిన అంశాల వరకే నిజంగా తాత్విక స్థాయి కలిగున్న విషయాలుగా ఎంచదగి ఉంటాయి ఇదీ విచారణ పద్ధతి.

ఈ మొత్తంలో 1) ప్రకృతి - మనిషిని గురించిన భౌతిక విజ్ఞానము 2) సామాజిక సంబంధాలు; వ్యష్టి - సమష్టి భావాలు; ప్రజలనుసరించదగ్గ, అనుసరించకూడని విధి విధానాలు 3) మనిషి స్వభావము, ఇష్టాయిష్టాలు, వివేకము, సామాజిక కట్టుబాట్లు మానవజీవిత గమ్యము అన్నవాటికి సంబం ధించిన భావజాలం విచారణీయాంశాలుగా ఉంటాయి.

కనుక ఈ నాడు మన మెంచుకున్న క్రైస్తవ మతం (నిజానికి బైబిల్ సిద్ధాంతం అనాలి)లోనూ ఈ అంశాలకు చెందిన వారి అవగాహనేమిటో విచారణకు స్వీకరించి పరీక్షించాల్సి ఉంటుంది,


1. ఈ విశ్వాన్ని, విశ్వపరిణామ క్రమాన్ని, భూమిని సూర్యచంద్ర నక్షత్రాలను గురించి బైబిలు అవగాహన ఎట్టిది?

2. సామాజిక సంబంధాలు, ధర్మాధర్మాలు, వ్యవస్థ తీరుతెన్నులు, వీటికి సంబంధించి బైబిలు ఇప్పటి మన సమాజానికి చేయగల చేస్తున్నసూచనలు.

3. మనిషిని గురించి, మనిషి నడవడిని గురించి అది చెపుతున్నవిషయాలు.

4. పరివర్తనకై బైబిలు సమాజానికి సూచిస్తున్న మార్గాలు.

5. బైబిలు ప్రవచనాలలోని సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు ఆచరణ విషయంగా సాధ్యాసాధ్యాలు.

6. బైబిలు ప్రామాణికతను అంగీకరించడానికి ఉన్న ఆధారాలు? 

7. బైబిలులో దేవుని పలుకులుగా చెప్పబడుతూ ఇప్పటి మన అవ గాహనకే అజ్ఞానయుతాలుగా తేలే విషయాలు.

8. పరస్పరం ఖండించుకుంటున్న ప్రకటనలూ, ప్రవచనాలు.

9. మానవతా దృష్టినుండిగానీ, నాగరికత నుండిగానీ, విజ్ఞత నుండి గానీ అంగీకరించడానికి వీలులేని అంశాలు ఉన్నాయా?

10. తేలని, తేల్చలేని (రుజువు పరచలేని) అంశాలేమైనా ఉన్నాయా? లేకుంటే సరి. ఉంటే అవేవి?

11. మానవుని స్వభావంలోనే ఏర్పడిఉన్న వక్రతను సరిచేయడానికి బైబిలు దేవుడు చూపిన విధాన మేమిటి?

12. యెహెూవా నిర్వర్తించిన పాత్ర విజ్ఞులూ, సమదృష్టి కలిగిన వారూ అంగీకరించదగిందే ననగలమా?

13. సృష్ట్యారంభం గురించిన, అంతాన్ని గురించిన బై బిలు భావనను సశాస్త్రీయ మనడానికి ఉన్న ఆధారాలేమిటి?

14. స్వస్థత ప్రార్థన పేరున ఈనాడు అతిగా జరుగుతున్న కర్మ కాండలో వంచనేమి లేదనగలమా? అది వా స్తవమేనని రుజువుపరచగలమా? 

15. దైవత్రయము - త్రియైక దేవుడు - అని బహుళ ప్రాచుర్యం పొందిన భావనకు బైబిలులో ఆధారాలున్నాయా?

16. దేవుడు ముఖ్యమనీ, కుమారుడే ప్రధానమనీ, పరిశుద్ధాత్మే బలీయ మనే భావాలుగల క్రైస్తవ సంఘాల మాటేమిటి? వారి వారికా దృష్టులు ఏర్పడడానికి ఆధారాలేమిటి?

 17. క్రైస్తవులు, యూదులు విడిపోయి పోరాడుకోడానికిగల కారణా

18. బైబిల్ - ఖురాన్ల మధ్యనున్న సారూప్య వైరూప్యతలెట్టివి?

 19. బైబిల్ దేవుడు సర్వవ్యాపీయా? కాదా? సాకారుడా? నిరా కారుడా? సర్వశక్తివంతుడా? కాదా? న్యాయకారా? కాదా? ప్రేమమయుడా? రోషకారా? జ్ఞానా? అజ్ఞానా? 

20. దేవుడు సృష్టించనివి కొన్ని బైబిల్ సృష్టిక్రమాన్ననుసరించి అంతకుముందే ఉన్నాయనడానికి ఆధారాలేమైనా బైబిల్లో ఉన్నాయా?


21. సృష్టి అంతానికి సంబంధించిన వర్ణనగానీ, కాలంగానీ, నిశ్చి తంగా ఇది అనడం కుదురుతుందా? 

గమనిక : చర్చా సందర్భంలో మరికొన్ని ప్రశ్నలూ చేరితే చేరవచ్చు కానీ ఇవన్నీ మౌలికంగా క్రింది వర్గాలకే చెందుతాయి.

1. భౌతిక విజ్ఞాన పరమైన అంశాలు. 2. సామాజిక సంబంధాలకు చెందినవి. 3. మనిషి స్వరూప స్వభావాలు, ప్రవర్తనా రీతులు, మూల నమస్య పరిష్కార రూపము, విధానము, నీతి, అవినీతులు. సత్యాసత్యాలు.

ఇరు పక్షాల చెందిన మిత్రులారా! సత్య దృష్టితో సమాజహిత కాంక్షతో మండలి ఏర్పాటు చేస్తున్న ఈ చర్చా వేదిక అందరి హితాన్ని ఉద్దేశించింది మాత్రమే. అందరి హితమన్నది సత్యాజ్ఞానంపైనా, ధర్మాచరణ పైన మాత్రమే జరగలదు. మరో మార్గంలేదు. కనుక అందరి హితం నిజంగా మీ మీ హృదయపులోతుల్లో జ్వలిస్తుంటే, సత్య ధర్మాల నిర్ధారణకు రాగద్వేషరహితులై మీ వంతు మీరు నిర్వర్తించడానికి వెనుకాడక సన్నద్ధులుకండి.

సమావేశం: 1997 సం॥ము ఏప్రియల్ 15, 16, 17 తేదీలు. సమావేశ స్థలం : ఏప్రియల్ సంచికలో తెలియపరచబడును.


సిద్ధాంత ప్రచారకుల— వేత్తల వైఖరి :- ఒక పరిశీలన

ఈనాడు రకరకాల బ్యానర్ల క్రింద శబ్ద కాలుష్యాన్ని, సృష్టిస్తూ తప్పుడు భావజాలాన్ని అనిర్ధారిత, అశాస్త్రీయ విషయాల్ని, అమాయకుల నెత్తిన రుద్దు తున్న ఆయా ధోరణుల ప్రచారాలను చూస్తుంటే దేశానికి అన్నింటికంటే పెద్ద పీడ ఇదేనేమో ననిపిస్తోంది. సత్యాన్నే చెప్పాలి. అసత్య, అజ్ఞాన పూరితాంశాలు సమాజం నెత్తిన రుద్దకూడదు అన్న కట్టుబాటు అమలులో లేకపోవడంవల్ల భ్రాంతులూ (తప్పు జ్ఞానం కలిగినవారూ) దొంగలూ (కావాలని తప్పు చేస్తున్నవారూ) యిరువురూ జ్ఞానులల్లే మార్గదర్శులల్లే చెలామణి అవుతున్నారు. తాము వెలిబుచ్చుతున్న భావాలను సమాజ పరీక్ష కిచ్చి రుజువుపరచుకో వలసి ఉంటుందన్న కఠినమైన చట్టం అమలు చేసుకోనంత కాలం ఈ నానాకచాట అంతా తత్వం పేరుతో సత్యం పేరుతో చెలామణీ అవుతూనే ఉంటుంది.

సైన్సు పేరున పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్న అంశాలకు పూర్తి . విరుద్ధ విషయాలు మతాలు, సిద్ధాంతాల పేరున బోధించడానికి ఏ వివేకపుటా లోచన నుండి ప్రభుత్వం అంగీకరిస్తోందో అర్థంకాదు. ఒకే విషయంపై విరుద్ద జ్ఞానాన్ని భావితరం నెత్తిన రుద్దేందుకు చట్టరీత్యా వెసులుబాటు కల్పించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఏమని తిడితే సరిపోతుంది.

ఎవరేమీ అనరే అన్న భరోసా ఉండడం, ఒకరో యిద్దరో ఎదురాడి పరీక్షకు నిలవమని అడిగితే నీ కెందుకు పోవయ్యా, మా యిష్టం మాది అని దబాయించడం తప్పుకోవడం పరిపాటై పోయింది. ఇంక సమాజంలో సత్య జ్ఞా.. మే. ప్రచారంలో ఉంటుందనిగానీ, శాస్త్రీయ దృక్పధం అమలుచేయడానికి వీలుంటుందని గానీ, అనుకోడానికే వీల్లేకుండా పోయింది. ఇది జ్ఞానపరంగా ఈనాడున్న విపత్కర పరిస్థితి.

మా వరకు మాకు ఈ విషయంలో ఎన్నో అనుభవా లున్నాయి. అటు భావవాద -ఆస్తిక పక్షానికి చెందిన నానా సిద్ధాంతాల వాళ్ళనూ, ఇటు భౌతిక వాద -ఆస్త్రీకేతర పక్షానికి చెందిన నానా ధోరణుల వారినీ అయ్యా, మీరు చెపుతున్న భావజాలం సరైందేనని నిరూపించాల్సిన బాధ్యత మీమీదే ఉంది. ఆ బాధ్యత నుండి వైదొలగడం అశాస్త్రీయం, అనుచితం కూడ. కనుక సరైన రీతిలో పరీక్షకు సిద్ధపడండి. పరీక్ష కిచ్చి నిర్ధారించండని గత పదేళ్ళ పైగా అడిగినవార్ని అడక్కుండా అందర్నీ అడగడం మరోసారి అడిగినవారినే మళ్ళా మళ్ళా అడగడమూకూడ అయ్యింది యిప్పటికీ, ఊఁహూఁ ఒక్కరంటే ఒక్కరు నిక్కచ్చిగా నిలచి నిగ్గుతేల్చిన పాపానపోలా! కనీసం ఎందుకు నిర్ధారించలేక పోయామన్న ఆత్మవిమర్శ చేసుకున్న దాఖలానూ లేదు. అరే! ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయామే. వాటిగురించి తేల్చుకున్నాక, తెలుసుకున్నాకనే ప్రచారం చేయడం సరైనది. అంతదాకా తెలియని వాటిని తెలిసినట్లు చెప్పడం దోషమవుతుంది అన్న ఇంగితమే కరవై పోయిందీనాడు. గట్టిగా నిలేసి అడిగితే తెలీదంటూ గుడ్లు తేలేస్తారు. విశ్వాసం అంటారు. అవతలకుపోయి మళ్ళీ అంకా తెలిసినవాడిలా ఫోజెట్టి బల్లగుద్ది మరీ ఇది నిజం ఇది నిజమంటూ ప్రగల్పిస్తుంటారు.

ఈ పోకడ విషయంలో ఎవరినీ మినహాయించడానికి తగిన అనుభవం మాకెదురవలా అట్టి అవకాశం ఇప్పటికి చిక్కలా. అట్టిదే అనుభవం మళ్ళా మరోబెదురైందీనాడు మాకు. వివేకపథంద్వారా 'అద్వైత సిద్ధాంత' ప్రతి పాదనచేసి ఆటు అద్వైత వేత్తలు మంటున్నవారికి ఇటు దానిని తప్పుబట్టే వాళ్ళకి కూడ అహ్వానం పంపాను. ఒక్కరంటే ఒక్కరు తప్పనేవాళ్ళుగానీ, ఒప్పనే వాళ్ళుగానీ విచారణలో పాలుపంచుకోడానికి సిద్దపడలా. సిద్ధాంత విచారణలు జరిగి విషయం నిగ్గుతేల్చుకోకున్నంతకాలం తిక్క తిక్క భావాలన్నీ చక్కని భావాలుగా మిక్కుటంగా చలామణి అవుతుంటాయి.

ఏ మాత్రం సత్య ధర్మాలపై గౌరవదృష్టి ఉన్నా సిద్ధాంత విచారణకు రెండు పక్షాలూ సర్వదా, సర్వథా సంసిద్ధమై యుండాల్సి ఉంటుంది. లేకుంటే అంతా దొంగాటకం క్రిందే జమ చేయాల్సి ఉంటుంది. ఆఖరిగా నేచెప్పే దొక్కటే. మీ మీ సిద్ధాంతాలను సమాజ పరీక్షకు ఇవ్వనంతకాలం, ఇచ్చి నిర్దారించనంతకాలం మీరు చేసేదంతా చేయకూడనినే. ఎన్ని సిద్ధాంతా లను, ఎందరు దేవుళ్ళను, ఎన్ని పోకడలను అమాయకుల నెత్తిన రుదుతారు. ముందుగా `మీరందరూ ఒకచోట కూచుని అసలేదో, నకిలీ ఏదో తేల్చు కోవచ్చుగదా !

మాది రైటంటే మాది రైటంటూ, మావైపుకు రండంటే మావె పుకు రుడంటూ తేలని విషయాలతోటి ప్రజల్ని ఎందుకు చంపుకు తింటారు?

సత్య ధర్మాలు సమాజంలో నిలిచి ఉండాలన్న దృఢభావన స్థిరంగా ఉంటే మండలిని వేదికగ ఉపయోగించుకోండి ప్రతి సిద్ధాంతాన్ని అందరమూ కలసి సరైన రీతిన విచారించి పరీక్షించాల్సి ఉంటుంది. అదొక్కటే శాస్త్రీయ మార్గము. అది జరుపకుండ సమాజాన్ని పెడమార్గాన పట్టించిన వాళ్ళంతా చరిత్రలో వంచకులుగా, ప్రగతి నిరోధక శక్తులుగా మిగిలిపోక తప్పదు.

ప్రస్తుతానికి: అద్వైతులారా! మీ సిద్ధాంత విచారణకు సిద్ధమై పరీక్షలో దాని సత్యా సత్యాలు నిగ్గుతేల్చండి. ఈనెలా చూసి వచ్చే నెలనుండి దాని బలా బలాలు విచారించేందుకు ఆరంభిస్తాను. తాము చెపుతున్నది వా స్తవమే నని నిర్ధారించడానికి సిద్ధపడక పోవడం భీరుత్వం, వంచన, అశాస్త్రీయం, నేరం. ఉంటాను సెలవ్

సత్యాన్వేషణలో

మీ సురేంద్ర


 

No comments:

Post a Comment