Friday, February 10, 2023

10- వివేకపథం

  

వివేకపథం

సంపుటి:1   మే 1997       సంచిక : 10


సంపాదకీయం 

యోచనాశీలురైన పాఠక మిత్రులారా! గత నాలుగేండ్ల పైబడి మేము నిర్వహిస్తూ వస్తున్న తత్వచర్చా వేదికల ద్వారా కొన్ని అంశాలు పదేపదే మా అనుభవానికొచ్చాయి.

ప్రతి (తాత్విక లేక మత) ధోరణికి చెందినవారు తాము వెలిబుచ్చే భావాలు ఆయా అంశాలకు సంబంధించిన సత్యాలేనని, అలా అని నిర్ధారణైన అంశాలేననీ, అందుకు భిన్నమైన ఇతరుల  భావాలు భ్రాంతిరూపాలో, అసంపూర్ణ రూపాలోననీ బల్లలుగుద్ది మరీ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళలోనూ ఈ మధ్య రెండు పోకడలు ఏర్పడ్డాయి. నిక్కచ్చి సాంప్రదాయానుసారులుగా నుండేవారు ఆయా భావాలు పెద్దలనుండి మా కందాయి.  వాటి జ్ఞానం నేరుగా మాకు లేకున్నా అవి సత్యమేనన్న విశ్వాసం మాకుంది. నిర్ధారించే శక్తి మాకు లేకపోవచ్చుగాక అనే తీరును ప్రదర్శిస్తుండగా, అంతో యింతో సైన్సు, చదువుకుని వారి వారి సైద్ధాంతికాంశాలన్నీ వైజ్ఞానికావిష్కరణలకు భిన్నం కాదనీ, పైపెచ్చు విజ్ఞానశాస్త్రం కనుగొనని అనేకాంశాలు కూడా మా సిద్ధాంతకారులు ప్రకటించారనీ మా భావమంతా శాస్త్రీయ పోకడనుండి జనించిందేననీ ప్రచారం చేస్తున్నారు.

వివేకానికి పని చెప్పగలిగితే, విజ్ఞానశాస్త్ర చరిత్రగతిని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఈ రెండో వైఖరి అశాస్త్రీయము, అహేతుకము, (ఆధార రహితము) మాత్రమే గాక అనవసరపు అభిమానంతో అఖ్ఖరలేని బరువును నెత్తికెత్తుకోవడంగా స్పష్టమవుతుంది. ఈ రకం వారిలో ఏదో రూపంలో స్వార్థం ప్రధానమై, వాస్తవాన్ని మరుగుపరచేందుకూ సిద్ధపడే వంకర స్వభావమూ చోటుచేసుకుని ఉంటారు. ఎందుకంటే, తమకు కలిగిన కొద్దిపాటి సైన్సు జ్ఞానాన్నాధారం చేసుకుని తమ మత గ్రంథాలలోని విషయాలకు సైన్సు రంగు పూయాలనుకోవడం, నిజంగా వాస్తవాలుగా తేలని విషయాలనే తేలిన విషయాలుగా (ఈ రెండూ తెలియని అమాయకుల దగ్గర) తేల్చి చెపుతుండడం నిజానికి అశాస్త్రీయ పద్ధతే అవుతుంది.

ఒక వంక అశాస్త్రీయ వైఖరిని అనుసరిస్తూనే తామే శాస్త్రజ్ఞులమేనని చెప్పుకునే వారూ ఎదురుపడ్డారు మాకు. అలాగే హేతు (రీజన్) స్వరూప స్వభావాలు క్షుణ్ణంగా తెలియకనే హేతువాదులం, రేషనలిస్టులం అనేవారూ ఎదురయ్యారు. విశ్వాసం మాది అనేవారు సత్యమిది అని ప్రచారం చెయ్యడానికి తాము యోగ్యులము కాదు అనే సంగతిని మరచి ప్రచారకుల వేషంకట్టి తమకే తెలీని విషయాలను సత్యాలనో, అసత్యాలనో చెప్పడం మొదలెట్టారు. ఇవన్నీ వారివారి అపసవ్యపు పోకడలకు నిదర్శనాలేనన్నది కాదనరాని, కాదనలేని నిజం. నిప్పులాంటి నిజం. పై రెండు పోకడలకు మింగుడుపడని చేదునిజం ఇదిలా ఉంచండి. మరో వైఖరీ గోచరించింది ఈ రెండు రకాల వాళ్ళలోనూ.

సత్యమే జయిస్తుంది, సత్యం అన్నిటికంటే విలువైంది. సత్యాన్నంగీకరించని వాడు సన్మార్గాన నడవడమే అసాధ్యం. సత్య స్వీకారానికీ అసత్య విసర్జనకు నిరంతరం సిద్ధంగా ఉండు. ల మాటలను పెద్దలకే చెపుతుంటారు. సత్యమంటే ఏమిటయ్యా, తెలిసిందటయ్యా ?! లాంటి సూటిప్రశ్నలు వేస్తే ఏవేవో కప్పదాటు సమాధానాలు చెప్పడమో, తర్కించకు ప్రశ్నించకు లాంటి ఆశాస్త్రీయ వైఖరిని ప్రదర్శించడమో, మరో రకంగా అనవసరపు టంశాలు లేవనెత్తి రభసను సృష్టించి అసలు విషయాన్ని. విడచేట్లు ప్రక్కదారి పట్టించడమో లాంటి ఎత్తు గడలు చేపడుతుంటారు. మచ్చుకు కొన్ని పరిశీనాంశాలు మీ ముందుంచుతాను పరికించండి.

1. కమ్యూనిజం శాస్త్రీయమా? కాదా?

2. నాస్తిక్యానికో సిద్ధాంతం లేక తత్వం ఉందా?

3. ఆస్తిక్యానికి శాస్త్రీయస్థాయి అనదగ్గ తత్వం ఉందా?

4. మీ మీ మతగ్రంధాలల్లో చెప్పబడ్డ అనేక విషయాలకు వైజ్ఞానిక స్థాయిగానీ, వాటిలో అవిరోధతగానీ ఉందా? ఉదాహరణకు.

ఎ) మార్క్సిస్టుల్ని :- గతితార్కిక నియమాలు శాస్త్రీయంగా రుజువు పరచబడ్డాయా?

బి) ఆస్తిక్య ప్రాతిపదికలు తప్పనడానికి గానీ, పదార్థ జన్యమే చైతన్యం అనడానికి గానీ అవసరమైన శాస్త్రీయ ప్రయోగాలు, వాటి ఫలితాల వివరాలు మీ వద్ద ఉన్నాయా?

సి) వేదంలో అన్నిరకాల వైజ్ఞానికాంశాలు నిక్షిప్తం చేయబడ్డాయనే వైదికుల రాద్ధాంతానికి తగిన ఆధారాలు వేదం నుండి చూపగలరా?

డి) క్రైస్తవ సృష్టి క్రమం సత్యమనడానికి తగిన ప్రయోగాలు ఏమిటి? వగైరా ప్రశ్నలకు గదమాయింపులే సమాధానాలుగాని, ఒక విషయమై సైన్సును ప్రశ్ని స్తే - విజ్ఞానుల్లో ప్రశ్న పుడితే - ఆ విషయంలో పరిశోధన చేసిన విజ్ఞాన్ని ఏ రీతిగా ప్రతిపాదితాంశాన్ని నిర్ధారించే యత్నం చేస్తారో ఆ రకమైన వైఖరి కలికాని కూడా కానరాదు ఈ మతతత్వ  ప్రచారకుల్లో. 

వైదికుల్ని నిలేస్తే సృష్టికర్త ఉన్నాడు అంటూనే, మా వైదిక ప్రతి పాదిత లక్షణయుతుడే అసలు సిసలైన సృష్టికర్త అనీ తదితర దేవుళ్ళు కాల్పనికులనీ, క్రైస్తవుల్ని అడిగితే సృష్టికర్త ఉండక తప్పదు. అదీ మా బైబిలుతో తనని తాను ప్రకటించుకున్న యహోవానే అసలూ, నిఖార్సు ఐన దేవుడనీ ఇలా వైష్ణవుల్నడిగితే విష్ణువనీ, శైవులు శివుడనీ, శాక్తేయులు పరాశక్తి అనీ నానా పోకడలు పోతుంటారు. అరే! ఏమి గొడవయ్యా ఇది. అందరూ సత్యాన్ని నిలబెట్టే టందుకు పుట్టినోళ్ళమేనంటారు. ఇందేది సత్యమోతేల్చాల్సిన బాధ్యత గానీ,  తేల్చుకోవాల్సిన అవసరంగానీ మీ కెవరికీ లేదటయ్యా అంటే మాత్రం ఎదుటి వారి దేవుడేలా నకిలీ దేవుడో, తేలని దేవుడో చెప్పడానికి మాత్రం వురకలేస్తుంటారు. ఈ ప్రహసనం మాత్రం అనాదిగా (మొదటి నుండీ) ఎవరి శ క్తిమేర వారు కొనసాగిస్తునే ఉన్నారందరూ. మా అనుభవంలో ఇప్పటికి తేలిందేమంటే....

మార్క్సిస్టులకు మార్క్సిస్టు తాత్విక పునాది (ప్రాతిపదికల) గురించీ నాస్తికులకు నాస్తికపు తాత్విక పునాదిని గురించీగాని ఆస్తికులకు ఆస్తికపు తాత్విక పునాది గురించిగానీ వీరిలో ఒక్కోదానిలో మరల అనేక పంథా (శాఖ)లుగా చీలిన వారలూ వారివారి అభిప్రాయాలకు తగిన ఆధారాల గురించిగానీ స్పష్టంగా తెలియదు. నిర్ధారణ కవసరమైన బలమైన రుజువులూ లేవు. ఇదీ అసలు పరిస్థితి. ఎవరికి వారు నోరు మూసుకుని వినేవాళ్ళ దగ్గర గానీ ఏ విషయమూ తన స్వంతానికి అవసరంలేని కాలక్షేపరాయుళ్ళ వద్దగానీ, అమాయకులూ తమకంటె తక్కువ తెలిసిన వాళ్ళవద్దగానీ చెప్పుకుంటూ పనికిమాలిన జీవితాల్ని గడుపుతుంటారు. తేలని, తెలీని విషయాలను ప్రచారం చేసే పనే పెద్ద బాధ్యతాయుతమైన పనిగా అనుకొంటూ, సమాజం ఎదుట పెద్ద జ్ఞానులల్లే, త్యాగులల్లే ఫోజులు పెడుతూ సమాజానికి ఒక రకంగా భార భూతులై జీవితాలు గడుపుతుంటారు. సమాజాన్నుండే ఆర్థిక వనరులు గుంజు కుంటో చెత్త సాహిత్యాన్ని మాత్రం టన్నులకు టన్నులు సృష్టించి సమాజం నెత్తిన రుద్దుతుంటారు.

తప్పు జ్ఞానాన్ని కనీసం ఒక్క భావాన్నైనా సరే సమాజం నెత్తినేయడం దండనార్హమైన నేరాల్లో కెల్లా పెద్ద నేరమన్న ఇంగితం వీరి కుండదు. సమాజ గతిని పర్యవేక్షిస్తూ, క్రమ నియతిని అమలు చేస్తూ ఉండవలసిన ప్రజా ప్రతినిధులకుగానీ, ప్రభుత్వానికి గానీ న్యాయవ్యవస్థకు గానీ, విద్యా శాఖకు గానీ ఈ విషయంలో చీమ కుట్టినట్లైనా ఉండదు. అందరూ మంచిని గురించి ఊక దంపుడు ప్రసంగాలు చేసేవారే.

నిజంగా సమాజ హితాన్ని గురించి మనసా కర్మణా వాంఛించే వారందరిపై ఈ వాచాలతపై నిఘావేసి సరైన జ్ఞానం మాత్రమే సమాజంలో నిలచి ఉండేట్లు చూసుకోవలసిన బాధ్యత ఉంది. అది ప్రతిపౌరుడి ప్రథమ కర్తవ్యం కూడా.

ఏ పౌరుడైనా ఈ ప్రచారకుల భావాలను నిర్ధారించమని నిలదీసే హక్కు చట్టబద్ధంగా ఏర్పరచుకోనంత కాలం ఈ పీడకుల పీడ విరగడవదు. నా ఈ మాట వాస్తవమో కాదో రాగద్వేషాలు విడచి ఆలోచించండి. వివేకించండి. ఈ రకమైన సమాజానికి సరైన హితాన్ని కలిగించ గల చట్ట బద్ధతను గురించి ఉద్యమించాల్సిన ఆవశ్యకత మనందరిదీ. ఆ విషయంలో క్రమంగా ఉద్యమించ బోయే మండలితో చేయి కలిపి మీ వంతు మీరూ నిర్వ ర్తించండి.

సత్యాన్వేషణలో

మీ, 

సురేంద్ర

మండలి అన్ని ధోరణులవారికీ నిజాయితీతోనూ, నిర్భయంగానూ నిలేసి అడుగుతున్న ప్రశ్న, చేస్తున్న హెచ్చరిక :- దీనినే ఆహ్వానంగా స్వీకరించినా మంచిదే.

రండి. మండలి తత్వ చర్చావేదికను వినియోగించుకోండి. మీ మీ సైద్ధాంతికాంశాలను సమష్టి పరిశీలనకు, పరీక్షకూ పెట్టి నిలబెట్టండి. లేకుంటే మీదీ ఈనాడు కాకుంటే రేపటికైనా వంచనారీతుల్లో ఒకటిగా చరిత్రలో నమోదు చేయబడుతుంది. గుర్తుంచుకోండి. మీ మీ సిద్ధాంతాల నిరూపణకు ఎప్పుడు, ఎక్కడ సదస్సు నేర్పాటు చేయమన్నా మేము సిద్ధము.

గమనిక : 1) మొన్నటికి మొన్న క్రైస్తవానికి సంబంధించి జరిగిన తత్వ చర్చా వేదికలో బైబిల్ ప్రతిపాదక పక్షంలో కూర్చున్న 'రవి జక్రియా ఇంటర్నేషనల్ ' సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్. సుధాకర్ గారు సభాముఖంగా బైబిల్ లో వెళ్ళడించబడ్డ భావాలలో అసత్యాలుంటే బైబిల్ను తగలేసి బైట కొస్తాను అని ప్రకటించారు. సంతోషించదగ్గ వార్తే. దానిపై నేనూ ప్రతి స్పందించి, అలాగే కానీండి. బైబిల్ భావాలు సత్యాలై తే, ఇప్పటికీ స్వీకరించ దగిన, కాలం చెల్లని అంశాలతోనే కూడి ఉంటే నేను సువార్తకుణ్ణై ఆ ప్రచారంలో తను మన ధనాలను ఖర్చుచేస్తూ జీవితాన్ని గడుపుతాను అని ప్రకటించాను. కనుక ఆ సంస్థవాళ్ళు, సుధాకర్ గారూ కాలవిలంబన లేకుండా ముందీ విషయం తేల్చేందుకు సిద్ధపడి ఇవి తేలాకనే వారి ప్రచార కార్యక్రమం చేపడితే బాగుంటుంది. అది విజ్ఞత, సామాజిక బాధ్యత కూడా.. 

2. ఈ మధ్య ఆర్య సామాజిక సిద్ధాంత ప్రచారకుల్లో మన రాష్ట్రానికి చెందినంతలో ప్రముఖులైన ఆచార్య వేద వ్రత (మీమాంసక్) వైదిక విద్యా విషయంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఒక ప్రకటన చేశారు. వైదిక ఖగోళ విజ్ఞాన విషయాలు బోధింపబడతాయని.

వారిని నేను కోరేదేమంటే వేదంలో ఉన్నాయంటున్న సైన్సు-విజ్ఞాన- విషయాలూ, వాటి వైజ్ఞానికత అన్న అంశంపై చర్చ పెడతాను. వచ్చి నిర్ధారించగలరేమో ఆలోచించండి. వేదిక పైకి రావడానికి సిద్ధపడండి.

ప్రస్తుతానికి ఈ రెండు ప్రతిపాదనలకు చెందిన సుధాకర్ - వేదవ్రత గార్లు సమష్టి వేదికపైకి రాగలరేమో ఆలోచించుకోండి. నిర్వహణ వ్యయ ప్రయాసలు మావి. సత్యాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మీది. ఏమంటారు. తడవు సేయక తయారుగానే ఉన్నామన్న విషయాన్ని బహిరంగంగా ప్రకటించండి.లేకుంటే మీ వైఖరి అ హేతుకమూ, అశాస్త్రీయమూ, అనైతికమూ, ఎంతో కొంత వంచనా రూపమూ కూడా అవుతుంది. నాతో కూర్చున్నా సరే, మీరిద్దరు ఎదురుపడి ఏది సరైందో తేల్చినా సరే. సత్యప్రతిష్టే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్న ఆకాంక్షతో ఈ ఆహ్వానం- హెచ్చరిక - సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఏ భావజాలానికి సంబంధించిన వారికైనా సమానంగా వర్తిస్తుంది.

అతి ముఖ్య విషయం

మిత్రులారా !

అన్ని ధోరణుల వారికీ, ప్రతి ఒక్కరికీ సంబంధించి సత్యనిర్ధారణకూ సంవాదానికీ తప్పనిసరిగా తెలుసుకుని, తేల్చుకుని ఉండవలసిన చర్చావేదిక- విచారణ-ప్రాతిపదికలు అన్న వాటిని ముందుగా నిర్ధారించుకుని ఉండడం మంచిది అని మొన్నటి వేదికపై సుధాకర్ గారు ప్రస్తావించారు. నిజానికీ అంశం అత్యంత విలువైంది. కనుకనే వారామాట అన్న క్షణంలోనే అలాగే కానిద్దాం అని ప్రకటించి ముందుగా దీని కొరకై మనమందరం కలుద్దాం అని అప్పటి కచ్చట నున్న అన్ని ధోరణుల వారికి సూచించాను. మంచిదే నన్నారందరూ. మంచిదే ననడంతో సరిపోదు. సిద్ధపడడం అవసరం. వివేకవంతం బాధ్యత కూడా అని చెప్పాను. ఆ విషయమే మరింత మందికి తెలియడానికి ఉద్దేశించిందే ఈ రచన.

సజావుగా సాగే అన్ని చర్చల ప్రధానాశయం. ఆయా అంశాలపై మనకున్న రకరకాల అభిప్రాయాల్లో ఏది, ఏ మేరకు సరైంది అన్నదే. మరి దానిని నిర్ధారించుకోడానికి తప్పొప్పులను తేల్చగల అసలైన తూనిక రాళ్ళను (కొలతలను) నిర్ధారించుకోవడం అవసరమే కదా. సహజంగా రెండు రూపాల్లో ఈ పరీక్షలు అవసరమవుతాయి. మనిషి జీవితానికి సంబంధించినంతలో. 1) కలిగిన అవగాహన (జ్ఞాన) పరమైనది కాగా, రెండవది పనుల (ప్రవర్తన) విషయం. దీనినే పారిభాషికంగా 1) సత్యా సత్యాలేమిటి? అనీ, 2) ధర్మా ధర్మాలేమిటి? అని అంటారు. కనుక మానవులంతా మన బ్రతుక్కి సంబంధించి వివేచించుకోవలసిన అంశాలు జ్ఞానపరంగా, ప్రవర్తనా పరంగా మాత్రమే ఉంటాయి. మొత్తం జీవితమంతా ఈ రెండు శీర్షికల్లో యిమిడిపోతుంది. జ్ఞాన కర్మ సముచ్చయమే జీవితం. ఎ) ఉన్నదే గ్రహించడం బి) చేయవలసిందే. చేయడం అనీ అనవచ్చు వాటినే. ఈ రెండు అంశాల్లోనే తాత్వికంగా ఆయా ధోరణుల మధ్య పరిశీలనలూ, పరీక్షలూ అవసరమవుతాయి.

కనుక ప్రతి ధోరణి వారికీ సత్యాసత్యాలను తేల్చుకోవడం (తేల్చడం) ఎలాగో, ధర్మాధర్మాలను విడగొట్టడ మెలాగో అందరూ అంగీకరించగల రీతిలో తెలుసుండాలి. ఈ తూనికలు సార్వజనీనమై యుండకపోతే ఒకరికి కలిగిన జ్ఞానం సరైందో కాదో తేల్చే అవకాశమేలేదు. ఒక పని చేయదగిందో కాదో తేల్చుకోవడమూ కుదరదు. సత్యధర్మాలు వైయక్తికం అన్నామంటే సామాజిక వ్యవస్థంతా అతలాకుతలమై ఛిన్నాభిన్నమై పోతుంది. అదలావుంచి సత్యధర్మాలు రెండూ అందరికీ సంబంధించి ఉంటాయి అనే తేలుతుంది. పరీక్షించి చూడగలిగితే అందు సత్యం దేశకాలాబాధితంగా ఉంటే, ధర్మం మాత్రం దేశకాలానుగుణ్యత కలిగుంటది. ఈ విచారం తరువాత చేద్దాం.

వాద. ప్రతివాద రూపమైన చర్చావేదికకు ఇరుపక్షాలూ అంగీకరించ దగిన క్రమాన్ని గూర్చి మీమీ అవగాహనలను వ్రాతమూలకంగా తెలుపండి. ఆలోచనకు పనికివచ్చే కొన్ని వివరాలిస్తాను గమనించండి. 

1. పారిభాషిక పదాలు-వాటి నిర్వచనాలు తెలిసుండాలి.

2 ప్రమాణాలు - వాటి క్షేత్రాలు - శక్తి - పరిమితులు తెలిసుండాలి. ఈ రెండూ తెలిశాక.

3. వాద నియమాలు తెలిసుండాలి.

4. సత్యమంటే ఏమిటి? ఏది సత్యము? అన్న వాటి తేడా పాడాలు తెలిసుండాలి.

5. అలాగే ధర్మమంటే ఏమిటి? ఏది ధర్మము?

6. ఒక పక్షం వీగిపోయిందని నిర్ణయించడ మెలా? అలాగే నెగ్గిందనడమున్నూ.

7. వైరుధ్యాలు-స్వవచన వ్యాఘాతాలను గుర్తించడమెలా?

8. ఒక విషయం రుజువైందనడం ఎప్పుడు కుదురుతుంది?

9. ఒక అభిప్రాయం తప్పని తేలితే ఆ విషయంలో ఇతరులవి ఒప్పని తేలినట్లా?

10. ఒక అభిప్రాయం ఒప్పని తేలితే ఆ విషయంలో ఇతరులవి తప్పని తేలినట్లా?

11. మనుషుల భావాలుగా చెప్పబడ్డ వాటిలో తప్పొప్పులుండేందుకు వీలుంది. తప్పునూ, ఒప్పునూ అంగీకరించేందుకు వీలుంది. అవునా?

12. అదే దైవవాక్కులుగా చెప్పబడ్డ వాటిలో ఏ ఒక్కటి తప్పైనా అది దైవ వాక్కనడం కుదరదు. అవునా?

13. ఒక దానికి సంబంధించిన ప్రయోగ ఫలితాలు 99 సార్లు ఒకే రకంగా వచ్చి 100వ సారి మార్పుగా ఉంటే 100వ ప్రయోగానికే విలువెక్కువ. ఆ మొత్తం ప్రయోగ మింకా నిర్ధారించవలసింది గానే అవుతుంది శాస్త్రీయ పోకడలో. అవునా?

వాద పద్ధతిలో అవశ్యం తెలుసుకుని ఉండవలసిన కొన్ని కీలకమైన మాటలను చెపుతాను. వాటి అర్ధాలను-వాటి మధ్యనున్న అర్ధబేదాలనూ వివరించండి.

14. అష్టపద వివేకం : పదము, పదార్థము, పర్యాయపదము, నిర్వచనము, ఉపమానము, ఉదాహరణ, వివరణ, నిర్ధారణ.

15. ప్రధానమైన భాషా నియమాలను తెలుపండి.

మిత్రులారా! వేరువేరు ధోరణులకు చెందిన వేత్తలారా! పై అంశాలలో మీ అవగాహనేమిటో వ్రాస్తూ ఇంకా అదనంగా మీరవసర మనుకున్న చర్చా నియమాల్నీ తెలుపండి. అందరం కూర్చుని చర్చించుకుని ఒక కామన్ డయాస్ ఏర్పరచుకుని ఆ పై విషయ విచారణ సాగించుదాం.

ప్రతిపాదనలను వేటికై నా ప్రతిపాదించినవారే నిర్ధారించవలసి ఉంటుంది ఆ విషయంలో ప్రశ్నించువారిని ప్రశ్నించడం అశాస్త్రీయం.

ఒక వై జ్ఞానికుడు తన పరిశోధనా ఫలితాలను ఎదుటి వైజ్ఞానికుల కిచ్చి పరీక్షించ మన్నప్పుడు ఆ ప్రయోగం ఆ ఫలితాల్నిస్తుందో లేదో చూసుకుంటాడు గానీ తన తెలివితేటలతో దానిని నిలబెట్టాలని చూడడు. అవునా?

తన ప్రయోగం దోషయుక్తమని తేలితే పడిన శ్రమ విషయంలో బాధ పడతాడుగానీ తప్పని తేలడం ఒక ఒప్పు తెలియడంగానే గుర్తిస్తాడు గానీ బాధపడడు. మళ్ళా సరైన రీతిలో పరిశోధన చేస్తాడు. అవునా?

(తత్వ చర్చావేదిక - విశేషాలు)

బైబిల్ - ఒక విశ్లేషణ

సామాజిక స్పృహ, తత్వ జిజ్ఞాస కల యోచనాశీలురైన మిత్రులారా! అనుకున్న ప్రకారం 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రథమ సమావేశం ఆరంభమైంది. ప్రతిపాదక పక్షంలో సెయింట్ జాన్ సెమినరీ హైద్రాబాద్ నుండి 1) రెక్టార్, ఫా. ప్రకాష్ గారు, 2) రవి జక్రియా ఇంటర్నేషనల్ అసిస్టెంటు డైరెక్టర్ డా॥ ఎమ్. సుధాకర్ గారు 3) ఎడ్వర్డు విలియమ్సుగారు 4) ఫా. స్టీఫెన్ గారు 5) రెవరెండ్ మోజస్ ప్రేమానందం గారు మరికొందరూ పాల్గొనగా.

ప్రశ్నించు పక్షంలో జిన్నూరు నుండి 1) ఆంధ్రప్రదేశ్ హేతు వాద సంఘాధ్యక్షులు పి. సుబ్బరాజు గారు 2) జిజ్ఞాసావేదిక వ్యవస్థాపకులు N. V. బ్రహ్మంగారు, 3) కె. ప్రసాద్ సత్యాన్వేషణ మండలి విజయవాడ, 4) ఆర్య సమాజ్ కు చెందిన చలవాది సోమయ్య గుంటూరు, వారూ కూర్చున్నారు.

వేదికను సభకు పరిచయంచేస్తూ నాలుగు 'తొలి పలుకులు చెప్పాను నేను.వేదిక కేవలం చర్చా రూపమైంది. విశ్వాసరూపమైంది కాదు. ఈవిషయం ఇరుపక్షాలకు ముందుగనే తెలియ జేయడమైంది. అలాగే చర్చ ఒక క్రమంలో సాగించడానికి వీలుగా పరిశీలనాంశాల క్రమాన్నీ రెండు పక్షాలకూ (వివేక పథం పాఠకులకూ) తెలియజేశాము. కనుక ఆక్రమంలోనే ప్రతిపాదన కొన సాగించి చర్చ నారంభించవలసి ఉంటుంది. ప్రతిపాదకులు పృచ్ఛకుల్ని ప్రశ్నించరాదు. పృచ్ఛకులు ప్రకరణ భంగంకాకుండా ప్రశ్నించాల్సి ఉంటుంది అని చెపుతూ ఆ రోజు సభా కార్యక్రమాలకు అనుసంధాన కర్తగా డా. ఆనంద్ కుమార్ ని ఉండమని కోరుతూ ముగించాను.

ఇరుపక్షాలనూ సభకు పరిచయంచేస్తూ ఆనంద్ ప్రారంభిస్తూ ఫా. ప్రకాష్ గారిని ముందుగా విషయ ప్రతిపాదన చేయమన్నారు. ప్రకాష్ గారు :- వీరు 18 సం॥ క్రితం ఫాదరయ్యారు. 6 సం॥గా ఫాదర్సుని తయారుచేసే కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉంటున్నారు. భాగవతం (సంస్కృతం) పై P.hd. చేశారు.

'క్రైస్తవ మత సత్యం' అన్న విషయం ప్రస్తావిస్తాను అంటూ ప్రారంభించి క్రైస్తవాన్ని అర్థం చేసుకోడానికి అవసరమైన పరిధిల్ని గురించి చెప్పారు. బైబిల్ కు ఎవరికి తోచిన అర్థంవారు చెప్పకూడదు అన్నారు. బైబిల్లో చెప్పబడ్డ విషయం అంగీకరించాలా వద్దా అన్నది నిర్ణయించడానికి అది జీవితంలో సంబంధపడి ఉందా లేదా అనీ అర్థవంతంగా ఉందా లేదా అనీ పరిశీలించాల్సి ఉంటుంది అనన్నారు. ఇలా జనరల్ గా చెపుతూ ఉండగా ఆనంద్ డైరెక్టుగా విషయానికి రండని ఒక సూచన చేశారు. అలాగేనంటూ

1) దేవుడు సర్వానికీ మూలకారణం. అన్నీ అతని ఆధీనంలో ఉంటాయి.

2) మనిషిని తన పోలికగా సృష్టించి సృష్టికి యజమానిని చేశాడు. 

3) సృష్టి, రక్షణ, పోషణ చేయువాడతడే. ఈ ప్రకృతంతా అతని సృష్టే.

4) ఇదంతా మానవుని అధీనంలో ఉంటూ మనిషి వికాసానికై ఉద్దేశింపబడింది.

5) దీనిలో మానవునికి ప్రతికూలాంశాలూ ఉంటాయి. అందుకు కారణం మానవుని ద్వారా పాపం లోకంలో చోటుచేసుకుని ఉండడం. 

6) సహజీవనం యొక్క ఆవశ్యకతను బైబిలు చెపుతుంది. ఈబాధ్యత ప్రతి మానవుడిపై ఉంది.

7) పాప ప్రవేశ రూపం అవిధేయతే. ఈపాప విముక్తి మనిషి స్వశక్తి వల్లే అసాధ్యం అందుకు దైవ ప్రమేయం అవసరం.

8) ఏసు రాకడతో మానవ జీవితానికి, జీవిత లక్ష్యసాధనకు క్రొత్త మార్గం ఏర్పడింది. అతడు అటు దైవంగా, ఇటు మానవుడిగా ప్రవర్తించాడు.

9) ఏసు నూతన ఆదాముగా వచ్చాడు. పాపంపై విజయంసాధించాడు.

10) క్రైస్తవ విశ్వాసి పాపంపై జయంతో అభివృద్ధి సాధించినమాట నిజమేగాని పూర్తి జయం పొందలేదన్నది నిజం. ఇది నిజమైన క్రైస్తవుడు అంగీకరిస్తాడు.

11) జీవనం ఆ దేవుని యందే ఆరంభమై ఆ దేవుని యందే అంత మవుతుంది అంటూ ముగించారు. అనగా ఆయన ఉపదేశించిన క్రమాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించడమే.

12) రెండో ప్రతిపాదకునిగా డా॥ సుధాకర్, ఇలాంటి చక్కటి అవకాశాన్ని కలిగించిన మండలికి కృతజ్ఞతలు అంటూ ప్రారంభించారు. మొదట్లో దైవవిశ్వాసం లేనివాణ్ణి. పిదప విశ్వాసిని. మధ్యలో 16 స॥లు సందిగ్ధత, సత్యాన్వేషణలతో గడిచింది. అని తన గురించి పరిచయం చేసుకున్నారు. వీరు జువాలజీ M.Sc. చేశారు. M.Ed. ప్రస్తుతం రవి జక్రియా ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అను క్రైస్తవ సంస్థలో ఫుల్ టైమ్ వర్కర్ గా గత 23 సం||లుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు: ఆయన మాట్లాడుతూ.

ఇలాటి చర్చా వేదికలు సక్రమంగా నిర్వహింపబడాలంటే ముందుగానే చర్చకు అవసరమైన నియమ నిబంధనావళిని ఏర్పరచుకోవడం అవసరం అన్న ఒక ముఖ్యమైన నూచన చేశారు.

అలాగే ఒక అంశంపై అనేక ధోరణులు ఎదురైనపుడు ఏది సరైందో నిర్ధారించడ మెలాగు అన్నదీ ముందే తేల్చుకుని ఉండడం అవసరం లేకుంటే ఎవరివి వారికి సత్యాలుగానే కానొస్తాయి. బైబిలు నీవు నమ్మేదాన్ని ఎందుకు నమ్ముతున్నావో చూడు అంటుంది. గ్రుడ్డిగా నమ్మమనదు. నేనూ బైబిలును బైబిలుపై అభిమానంతో నమ్ముతా. నమ్మడానికి ముందవసరమైన సాధారణాంశాలు పరిశీలించే నమ్మేను అంటూ ఇలా చెప్పారాయన.

మనవాదము కాదనలేని రీజనింగ్ పై ఆధారపడి ఉండాలి. అందుకు 

1) తార్కిక నియమాలను ఆధారం చేసుకుని ఉండాలి. 

2) ప్రతిపాదనల్లో పరస్పర విరుద్ధంశాలున్నాయా అన్నది చూడాలి. 

3) ప్రకరణబద్ధత, విషయానుక్రమణికలో క్రమత, పూర్వాపర సంబద్ధత ఉండాలి.

4) అనుభవంలో నిగ్గుతేలిన విషయాలకు (ఆయా శాఖలకు చెందిన ప్రాయోగిక ఫలితాలకు లేక విజ్ఞాన శాస్త్రానికి సరితూగుతుందా లేదా అన్నది పోల్చి చూసుకోవాలి.

5) సిద్ధాంతం అవసరమైన అన్ని విషయాలనూ వివరించగలిగి ఉందో లేదో చూడాలి.

6) విశ్వం యొక్క అంతం, మానవజీవిత లక్ష్యం, దానిని చేరుమార్గం వగైరా తాత్విక పరమైన అంశాలకు సరైన సమాధానాలు చెప్పగలిగుండాలి.

7) నీతి నియమాలు, మొదలైన ప్రవర్తనావళిని నిర్దేశించగలిగుండాలి. అంటూ.

నావరకు నేను ఈ అంశాలాధారంగానే బైబిల్ విశ్వసించదగ్గది అన్న నిర్ణయానికి వచ్చాను. ఇకపోతే బైబిల్ మొత్తం ఇప్పుడే విచారించడం సాధ్యపడదు గనుక ముఖ్యమైన (మూల) సిద్దాంతంపై చర్చించడం బాగుంటుంది. కనుక ఆ మేరకు నా ప్రతిపాదన కొనసాగిస్తాను.

1) మనం ఉన్న విశ్వం పరిమితమైనది. దీనికో ఆరంభం ఉంది. దీనిని సృష్టించిన వారొక రుండాలి. అతడే దేవుడు లేక సృష్టికర్త. ఇది బైబిల్ చెప్పిన ప్రధానాంశము.

2) అతణ్ని తెలుసుకోడానికి అతడు చేసిన సృష్టిని పరిశోధించడంలో మొదలెట్టాలి. అంటే కలిగించిన కారకాన్ని తెలుసుకోవాలంటే కదిలింప బడిందాన్ని అధ్యయనం చేయాలి.

3) Note : దేవుడు (సృష్టికర్త) లేడనే వాళ్ళతో బైబిల్ గురించిన చర్చేమిటి? కనుక ముందుగా దేవుని వునికిని గురించి మాట్లాడాలనుకుంటున్నాను.

4) దేవుడు అదృశ్యరూపుడు, స్వతంత్రుడు, అనంతమైనవాడు, సర్వసమగ్రుడు పదార్థాతీతుడు. తెలివికలవాడు, నీతికలవాడు.

5) అనంతమైన వ్యక్తిత్వం కలిగిన ఆత్మఅని చెప్పొచ్చు ఒక్క మాటలో. ఇది నాప్రతిపాదన అంటూ బైబిల్ రిఫరెన్సులు చెప్పారు. వాటి వివరాలు సంఖ్యల్లో యిస్తున్నాను. అవసరమైనవారు బైబిల్ చదవండి. రోమా: 1-18,20; కీర్తన: 90-2; 102-25, 26, 27; హెబ్రీ: 11-3 యోహాను: 1-24 ఇంకా చాలా ఉన్నాయి. అయినా విషయం గ్రహించడానికివి చాలు.

ఈ ప్రతిపాదనారూపం అయ్యాక వాటికి బలం చేకూర్చడానికిగాను వైజ్ఞానికాంశాలను ప్రస్తావించారు సుధాకర్ గారు. ముఖ్యంగా కాస్మోలజీ (ఖగోళ శాస్త్రం), ధర్మో డైనమిక్సులోని రెండవ నియమం 'ఎంట్రఫీ' విశ్వావిర్భానికి చెందిన పరికల్పనలు. యధాస్థితివాదం, పెద్ద ప్రేలుడు. పల్సెషన్ . ధియరీ వగైరాలను గురించీ కొంత వివరణచేసి విశ్వవ్యాకోచ సిద్దాంతాన్ని 'రెడ్ షిఫ్టు' ననుసరించీ కొంత వివరించి మొత్తంమ్మీద ఇవన్నీ బైబిల్ క్రియేషన్నూ, క్రియేటర్ న్నూ విశ్వసించేలా తనను ప్రేరేపించాయని చెప్పారు.

విశ్వంలోని అద్భుతమైన క్రమత, రూప నిర్మాణంలోని పొందిక నిపుణత, క్రమబద్ధమైన చలన రీతులు ఇవన్నీ చూస్తుంటే అనంత శక్తికల ప్రజ్ఞావంతమైన బాహ్య కారకాన్ని అంగీకరించక తప్పని స్థితి ఏర్పడుతోంది హేతుబుద్ధికి. ఆ బాహ్యకారకమున్నూ తప్పనిసరిగా పదార్థాతీతమైనదై యుండాలి. అలాగే ఆయన సృష్టిలోని వారమే అయినా మనం వ్యక్తిత్వం కలిగున్నామంటే మనను సృష్టించిన ఆ కారకంలోనూ వ్యక్తిత్వం ఉండి తీరాలి. ఆయనలో లేనిది మనలో ఉండేందుకు వీలులేదు. మనలోని ప్రేమ హేతుత్వం వగైరాలను బట్టి ఆయనలోనూ, అవి ఉన్నాయని చెప్పక తప్పదు మనలో ప్రేమ  ఉన్నదంటే ఆయనలోనూ అది ఉండి తీరాల్సిందే. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అన్న సూత్రానికి తగినట్లుగా ఆయన ఒక్కడు (ఏకము), త్రిత్వమూకూడా - అంటూ ఆగారు. ఇక్కడికి ఆరోజు ప్రతిపాదన భాగం పూర్తయింది. మధ్యాహ్నం చర్చారంభానికి ముందు నాలుగు మాటలు చెప్పాను నేను.

సురేంద్ర : 1) సత్యా సత్యాలు నిర్ణయించడమెలాగు? అన్నది ముందుగా నిర్ణయించుకోవడం, చర్చా వేదికకు అందరూ అంగీకరించదగిన నియమ నిబంధనావళి ఏమిటి? అన్నది ముందుగా నిర్ధారించుకోవడం అవసరం అన్న సుధాకర్ గారి సూచన అత్యంత విలువైంది. విభిన్న సిద్ధాంతాల వాళ్ళైన విూరందరను సిద్దపడితే దాని కొరకే ఒక వేదిక నేర్పాటు చేస్తాను. సామాజిక సృహతో కూడిన బాధ్యతతో అందుకు సిద్ధపడండి. అందరం అనుకుని నిర్వర్తించుకోవలసిన సత్యస్థాపనకు భూమిక వంటిదైన కార్యక్రమమిది.

2) ఒక మనిషి ప్రతిపాదించిన సిద్ధాంతంలో 89 సత్యాలు, 1 సంశయము, 10 అసత్యాలూ ఉన్నాయని తేలిందనుకోండి. పెద్ద యిబ్బందేమీ లేదు. సత్యాలు స్వీకరిస్తాం సందిగ్ధాన్ని పరిశీలనలో ఉంచుతాం. అసత్యాలు కొట్టివేస్తాం.

అదే మరి ఒక సిద్ధాంతం దైవ ప్రసాదితం అనబడి అందులో ఒకే ఒక్క అంశం అసత్యమని తేలిందనుకోండి. ముందుగా వచ్చే యిబ్బందేమిటంటే అది దైవగ్రంధం కాకుండా పోతుంది. దైవ వాక్కులుగా చెప్ప బడే సిద్ధాంతాల విషయంలో అత్యంత ప్రధానమైన తూనిక యిది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి.

3) ఒక వ్యక్తిని సమాజంలో ఉంచుకోవాలా, విడచివేయాలా అన్నది తేల్చుకోడానికి ఆ వ్యక్తి అన్నిటా మంచివాడై యుండాలన్న నియమం లేదు. కనీస మంచి ఉందో లేదో చూస్తాము. పరివర్తన కవకాశం ఉందో లేదో చూస్తాము. అదే.

ఒక సిద్ధాంతాన్ని స్వీకరించాలా వద్దా అన్నప్పుడు ఎక్కడైనా దోషాలున్నాయేమో చూడాలి. కనుక దైవవాక్కుగా చెప్పబడుతూ ఒక సిద్ధాంతంగా కొనసాగుతున్న బైబిల్ పరిశీలనలో ఈనాడు మనం చేయవలసింది. ప్రధానంగా ఎంతమంచి ఉందని కాక, ఎక్కడైనా చెడు ఉందా అని మాత్రమే. ఇదెంతో సూక్ష్మమైన విషయము. ఈ నా సూచనలను దృష్టిలో పెట్టుకుని గెలుపోటముల వైఖరిని విడచి సత్య దృష్టితో ఆవేశాలకు లోనుకాకుండా చర్చ కొనసాగించండి అంటూ ముగించాను.

ఆనంద్ సంధాన కర్తగా చర్చ నారంభించవలసిందిగా పృచ్చకుల్ని ఆహ్వానించి ప్రశ్నించే వారూ అనుసరించవలసిన విధానాన్ని వివరించారు. ముఖ్యంగా, ప్రతిపాదన ననుసరించే ప్రశ్నించడం, ప్రశ్నలు క్లుప్తంగా స్పష్టంగా ఉండేట్లు చూడడం, ఒకరి తరువాత ఒకరు ప్రశ్నించడం అన్న విధానం మంచిది కనుక అలా చేయండని చెప్పారాయన.

పి. సుబ్బరాజుగారు పాలకొల్లు ప్రాంతంనుండి ప్రశ్నించువారి పక్షంలో పాల్గొన్నారు. వీరు టెలిఫోన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నారు. బైబిల్ పై అనేక విమర్శనాత్మక గ్రంథాలు వ్రాశారు. వారు మాట్లాడుతూ ప్రతిపాదన లోని బైబిల్ దైవభావనపై ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తారు.

ప్రశ్న :- బైబిల్ లోని దేవుడు అందరికీ దేవుడా, లేక కొందరికేనా? బైబిల్ ను నిశితంగా పరిశీలిస్తే నేరుగా ఆయనే చెప్పిన, ప్రవక్తల నోట పలికించిన వాటినిబట్టి అబ్రాము సంతతైన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడైనట్లు తోస్తుంది. రిఫరెన్సు కావాలంటే.

నిర్గమ 6 = 6,7; 9=6; 29=45, ద్వి. ఉ.కాం. 14=21; సంఖ్యా 35=34, యెహోషువ -11-20, 1రాజు 6–3; మత్త 10=5; 19-28; మార్కు 7 = 25 అంటూ దీనిపై మీ సమాధానం ఏమిటి ? అనడిగారు.

ఫా. ప్రకాష్ గారు సమాధానం చెపుతూ ఒక రకంగా బైబిల్ భగవంతునికీ ఇజ్రాయేలీయులకు మధ్య నడచిన కథను తెలుపుతోంది గనుక వారి మధ్య సంబంధాన్ని-కట్టడిని - ప్రత్యేకించి తెలుపుతోంది. ఇదెవ్వరమూ కాదన లేని, అనకూడని వాస్తవం. అంతకంటే సరైన సమాధానం చెప్పుకోవడం కష్టం. ఏమంటే యెహెూవా వారిపట్ల ప్రత్యేకంగా ప్రవర్తించినట్లు బైబిల్ స్పష్టంగా చెపుతోంది. అయతే మరోవంక ఇశ్రాయేలీయుల ద్వారా మానవ లోకం అంతా ఆశీర్వదింప బడుతుంది అన్న వచనాలూ ఉన్నాయి. వాటినీ కలిపి విషయాన్ని సమన్వయపరచుకోవాలి. ఆపై క్రీస్తుద్వారా సువార్త అందరకూ అందజేయవచ్చనీ అంగీకరింపబడింది. మరో వంక విశ్వాసం ద్వారా అందరూ రక్షణ పొందుతారనీ సూచింపబడింది. వీటినీ ఆలోచించండి అన్నారాయన. పిమ్మట సుధాకర్ తన సమాధానం ఇలాగుంది అంటూ - P.S.R. ని ఒక తప్పుబట్టారు. 

సుధాకర్ : వాద నియమాలు మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాదులు తమ కనుకూలమైనంతవరకే ఎత్తిచూపడం- సెలెక్టివ్ సైటింగ్ అన్నది సరైన పద్ధతికాదు అది సత్య నిర్ధారణకు తోడు పడదు. ప్రశ్నించే వారు తప్పు చేశారిప్పుడు. సుబ్బరాజుగారు చూపిన అంశాలన్నీ ఆ ఆ కోవకు చెందినవే. దానికి వేరైన అందరికి చెందిన దేవుడు అనడానికి తగిన ప్రవచనాలు కొల్లలు. రిఫరెన్సులు. ఆది. 17=1,2,3; 22=17, 18;

ఎషయ 45=56; 56=7; 10=5, 6; 58=6; మరికొన్ని . దానితో ఆ అంశం అలా ఉంచి P.S.R. బలవంతుడు సర్వశక్తి వంతుడన్నారు కదా....ఒక్కసారి న్యాయా: 1=19 చూడండి. "యెహెూవా యూదా వంశస్తులకు తోడై యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదాన మందు నివశించువారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి.” ఇక్కడ యెహెూవా సర్వశక్తి మత్తతను సందేహించాల్సి వస్తోంది కదా? దీనికి మీరేమంటారు?

ఈ సందర్భంలో సుధాకర్ గారు వేరేవేరే ఏవేవో అంశాలను లేవనెత్తి ఇక్కడ జయాన్నిచ్చాడు అక్కడ జయాన్నిచ్చాడు. ఆయన ఇష్టమైన చోట జయాన్నిస్తాడు. లేకుంటే ఏదో అవిధేయతను బట్టి ఇబ్బందులు పాల్దేస్తాడు లాంటి మాటలతో అసలు విషయాన్ని పరిశీలనకు తీసుకోడానికే సిద్ధపడలా? ఆశ్చర్యమే. మాటిమాటికి నియమాలు, సందర్భము, భాషా నియమాలు లాంటి హెచ్చరికలు చేసే ఆయనే ఎన్నిసార్లు ఆ సందర్భాన్ని - ఆ భాషను పట్టి వివరించండని అడిగినా పట్టించుకోలా ఏ సందర్భంలోని కొటేషన్ ఎత్తి చూపి ప్రశ్న చేశారో ఆ సందర్భంలో జరిగిందేమిటో పరిశీలించక వేరే వాటిని దీనికి ముడి పెట్టట మెందుకు- అని ఆయన్ను వారించగా, అదేమిటండీ అసలు బైబిల్ అంతా ఒక్కటే. అందులో ఒక వాక్యానికి, ఆ అధ్యాయం సందర్భమవుతుంది . ఆ అధ్యాయానికి ఆ పుస్తకం సందర్భమవుతుంది. ఆ పుస్తకానికి ముందు పుస్తకం సందర్భమవుతుంది. లాంటి విజ్ఞులు మెచ్చని తర్కాన్ని భుజాని కెత్తుకున్నా రాయన.

మరో ప్రశ్నగా P. S. R. యోహాను. 1=18, 1. 6=16 వగైరాలలో భగవంతుని కొందరు చూసినట్లూ - ముఖాముఖి మాట్లాడినట్లు ఉండగా ఎవరూ అయనను చూడలేదనీ, చూచి బ్రతుకరని చెప్ప బడింది. దీనినెలా వివరిస్తారు? అనడిగారు.

సుధాకర్ మాట్లాడుతూ దేవుని స్వరూపాన్ని గురించి అదృశ్యరూపుడనీ, పదార్థంకాదనీ చెప్పబడి ఉంది కనుక ఆ సందర్భంలో సింబాలిక్ గా తీసుకోవాలిగాని రూపమే లేనివానికి ముఖమేమిటండీ అని ప్రశ్నించారు? ఉదాహరణకు ఏదో మత కలహాల విషయంలో పాకిస్తాన్ హస్తముంది అన్నారను కోండి పాకిస్తాన్ కో చెయ్యి ఉందన్న అర్థం వస్తుందా? దాని ప్రమేయ ముందని గ్రహించాలి గానీ అనీ అన్నారు.

అప్పుడు P.S.R., నేను, అయితే ఏ రకమైన సింబాలిక్ అర్థం చెపుతారక్కడ సందర్భానికి అనడిగాము. నిర్దిష్టంగా వివరించ లేదాయన.

ఆ సందర్భంలోనే అవసరమైనపుడు తాత్కాలికంగా రూపాన్ని, దేహాన్ని ధరించగలడనీ చెప్పారు. అది వైరుధ్యం కాదా అని సోమయ్యగారూ ప్రశ్నించారు. నాకేం వైరుధ్యం కనిపించడం లేదన్నారు సుధాకర్ గారు. ఈ సందర్భంలో అసలు వైరుధ్యం - Contradiction అంటే అర్థమేమిటి? అన్న ప్రశ్న లేవనెత్తా రాయన. అది తేల్చుకోవడం అవసరమేననుకున్నా మందరం.

.

ఆ తరువాత మరో ప్రశ్న వేశారు సుబ్బరాజుగారు. నిర్గ - 34=6: 34=14; సంఖ్యా=13=32 -కీర్త. కనికరము, దీర్ఘశాంతము కల దేవుడనీ, రోషము గల దేవుడనీ, ఆయన కోపం 40 సం॥పాటు కొనసాగిందనీ, ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందనీ వ్రాయబడింది. ఈ భావాలలో వైరుధ్యం లేదా? అనడిగారు?

ఈ సందర్భంలో ఫా. ప్రకాష్ గారు బైబిలును ఒక తత్వశాస్త్రంగా చూడడం సరికాదన్నారు, ఈ విషయం చిన్నదికాదు. దీనిని గురించి క్రైస్తవులందరూ ఆలోచించాల్సి ఉంది. అప్పుడే సుధాకర్ గారో భావాన్ని వెలి బుచ్చారు. బైబిల్ లో చెప్పిందేదీ సైన్సుకు విరుద్ధంగా ఉండదు. అలాగే తాత్వికాంశాల విషయంలోనూ, ఎందుకంటే ఆయన తాత్వికులకే తాత్వికుడు కనుక. మరోమాటగా వీటన్నిటికీ ముందు అసలు దేవుడున్నాడా లేడా అన్నది తేల్సుకోవాలి. అది తేలక ఈ చర్చంతా నిరర్థకం అనీ అన్నారు. పైగా దేవుని ఉనికిని నిర్ధారించడానికి ఉదయం నేను చెప్పిన వాటిపై ఒక్క ప్రశ్న వేయలేదు. ఇది మీరే ఏర్పరచిన చర్చా నియమాన్ని (ప్రతిపాదనపైనే ప్రశ్నలుండాలి అన్న నియమాన్ని) మీరే ఉల్లంఘించినట్లు కాదా? అనీ నిగ్గదీశారు.

అందుకు నిర్వహకుడిగా నేను స్పందిస్తూ మీరు తేల్సుకోవాలన్నది ముఖ్యమైన అంశమేగాని ప్రస్తుత సందర్భానికి నేరుగా వర్తించదు. ఎందు కంటే బైబిల్ లో చెప్పబడ్డ విషయాలలోని సబబు బేసబబుల్ని విచారించడమే ప్రస్తుత విషయం అని చెప్పాను. దేవుడున్నాడా లేదా అన్నది చర్చనీయాంశంగా మరో వేదిక నేర్పాటు చేసుకుందామని చెప్పాను.

రేపటి చర్చ మరొక ఫలవంతంగా ఉండేట్లు అందరూ బాధ్యత వహించండి అన్న ప్రకాష్ గారి విజ్ఞప్తితో ఆనాటి సమావేశం ముగించాము.

Note:- ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలి. బైబిల్ పై విశేష పరిశ్రమ చేసిన వారిలో ఒకరైన N. V. బ్రహ్మంగారు మొత్తం చర్చను గమనిస్తూ సాక్షిగా మౌనంగా ఉన్నారు.

రెండవ రోజు నా ఉపోద్ఘాతంతో సమావేశం ఆరంభమైంది. లోకంలో ప్రజలు రెండు పంధాల ననుసరించి సాగుతూంటారు. విశ్వాస పంథా, విచారణ పంథానే ఆ రెండూ. ఈ వేదిక విచారణ పంధాకు చెంది ఉంది. ఇక్కడ విశ్వాసాల ప్రస్తావనకు వీలులేదు. ఈ విషయాన్ని మీ అందరకూ ముందే తెలిపాము. సాంప్రదాయాన్ని బట్టి చూస్తే క్రైస్తవం విశ్వాస పంధాకు చెందివుంది. రెండు పద్ధతులూ సమాజంలో ఉన్నా జ్ఞానార్జనకు కలిగిన జ్ఞానంలోవి సత్యా సత్య వివేచనకూ విచారణ పద్ధతే ప్రధానావలంబన. కనుక మనం విషయాన్ని విశ్వాస దృష్టినుండి గాక, విమర్శ దృష్టి నుండి చూడవలసి ఉంది. అందుకు ముందుగా భాషద్వారా అందుతున్న ఆయా ధోరణుల భావజాలాన్ని యధాతథం గ్రహించగలిగుండాలి. ప్రయోక్త హృదయాన్ని గ్రహించడానికి కాలవలసిన భాషా నియమాలను పరిగణనలోకి తీసుకొని అర్ధగ్రహణ పూర్తిచేయాలి ఆపైనే విమర్శ.

మరో విషయం సాధారణంగా చర్చలు, సంభాషణలు మూడు దృష్టుల నుండి ఏర్పడుతుంటాయి. కాలక్షేపం కోసం, గెలుపోటములు (గుర్తింపు) కోసం, సత్య జ్ఞానం కొరకు. సామాజిక స్పృహ కలిగి బుద్ధున్న వాళ్ళకు మొదటి రెండూ త్యాజ్యాలు. ఈ వేదిక ఆద్యంతమూ మూడవ దృష్టిని కలిగి ఉన్నది, ఉండాల్సింది మాత్రమే. అలాగే విశ్వాస ప్రాతిపదికలపై నడిచేదీ కాదు. దీనిని గమనించి ఫలవంతంగా చర్చ సాగించండి అంటూ ముగించాను.

ప్రతిపాదన చేయాల్సిందిగా థామస్ స్టీఫెన్ గార్ని ఆహ్వానించాడు ఆనంద్. ఆయన ప్రత్యేకంగా నిన్న అనుకున్న విషయాన్ని గాకుండా జనరల్ (Information on bible) అన్న దృష్టిని అనుసరించి ప్రసంగించారు. ముందుగా నిన్న ఆగిన వైరుధ్యాల గురించి ముచ్చటిస్తూ కణ, తరంగ సిద్ధాంతాన్ని వివరించారు. (Note:- వీరు ఫిజక్సులో Phd. చేశారు.) అక్కడ సాధారణ ఇంగితానికి అసంబద్ధం, వైరుధ్యం అనిపించే వాస్తవాలుండేందుకు వీలుంటుంది అన్నది తెలిపారు. పదార్థం ఒకే సమయంలో కణంగానూ, తరంగంగానూ ఉంటోంది. అన్నది చూపించారు. అలాగే బైబిల్ లోను మామూలుగా వైరుధ్యంగా అనిపించింది వైరుధ్యం కాకపోవచ్చుకూడా అన్నారు. అలాగే బైబిల్ లోని మోషే లాంటివాళ్ళు భగవంతుని గురించి తము కన్నదాన్ని తమకు చేతనైన భాషలో అపరిణిత భాషలో చెప్పి ఉండవచ్చుగదా అంటూ ఒక పిల్లవాడు తెలిసీ తెలియక మాట్లాడిన ఒక సంఘటనకు ఉదహరించారు. ఈ విషయాన్నిక్కడకాపి బైబిల్ పై ప్రసంగించారు.

ఆ మొత్తం ఇక్కడ రాయడం అనవసరం. సారాంశం మాత్రం చెబుతాను బైబిల్ పాత, క్రొత్త నిబంధనల పేరుతో రెండు ప్రధాన భాగాలుగా ఉన్న గ్రంథం. ఆబ్రాము నుండి క్రీస్తు వరకు (ఆదాము నుండి అనండి) సాగిన వివిధ చారిత్రక దశలు (అబ్రాము సంతతికి సంబంధించింది) ఇందులో వ్రాయబడ్డాయి. అందులో భగవంతుడు అబ్రాముతో చేసుకున్న ఒడంబడిక దాని ప్రకారం అతని జనాంగములో అతను నెరపిన సంబంధాలు వారికీ తనకూ మధ్య ఉండివలసిన కట్టడి, వారిలో వారికుండ వలసిన ధర్మాలు (10 ఆజ్ఞలంటారు వాటిని) వివరించబడ్డాయి.

క్రీస్తు నుండి క్రొత్త నిబంధన అన్నది ప్రారంభమైంది. కానీ అబ్రాము సంతతిగా అక్కడివరకూ కొనసాగిన యూదులు క్రీస్తును అంగీకరించలేదు. దేవుడు తమకు అనుగ్రహిస్తానన్న రాజు, రాజ్యము అన్న వాటికై నిరీక్షిస్తూ వచ్చారు. తానే ఆ రాజుని అని క్రీస్తు ప్రకటించుకున్నాడు. కానీ తన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని అనడంతో నిరీక్షలో ఉన్న యూదులు దానిని స్వీకరించ లేకపోయారు. కనుకనే ఈనాటికీ తమకై రాజు (మెస్సయా) ఇంకా వస్తాడనే విశ్వాసంలోనే ఉన్నారు. తరువాత క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారే నేల నాలుగు చెరగులా సువార్తను ప్రచారంచేసి క్రైస్తవులుగా స్థిరపడ్డారు. ఆ సంఘమే కేథలిక్ సంఘము.

ఇవన్నీ నేను బైబిల్ ప్రధానాంశాలను మీ ముందుంచడానికి చెపుతున్నవే. ఇవన్నీ - అబ్రాముతో, అతని సంతానముతోడి దేవుని ఒడంబడిక దశ ఆజ్ఞలు, దేవుని వాగ్దానపు నెరవేరుపుకై అజనాంగముయొక్క నిరీక్షణ ఇవన్నీ విశ్వాస ప్రాతిపదికకు చెందినవి మాత్రమే అవేవీ ఈ చర్చా వేదిక నియమాల పరిధికిరావు అంటూ మొత్తంగా బైబిల్ దిగ్దర్శనం చేయించి ముగించారు స్టీఫెన్ గారు.

ఇంతలో పాలకొల్లునుండి వచ్చిన జానా నాగేశ్వరరావుగారు క్రీస్తు చారిత్రక వ్యక్తేనా, అలా అయితే సమకాలీన చారిత్రక రచనలో ఆయన గురించి వ్రాయబడిందా? అని ప్రశ్నించారు. దానిపై చాలా సేపు వాద ప్రతి వాదాలు జరిగాయి. పృచ్ఛిక పక్షమంతా అలాంటి ఆధారాలు లేవు. అనగా స్టీఫెన్, ప్రకాష్ గార్లు గూడా దానిని ఒక రకంగా ఆమోదించారు.

సుధాకర్, విలియంగార్లు మాత్రం 4, 5 రచనల్లో ఆ విషయం ప్రస్తావించబడి ఉన్నట్లు కొన్ని రిఫరెన్సులు ఎత్తి చూపగా అవన్నీ సమకాలీన రచనలు కావని ప్రతిపక్షం ఆక్షేపించింది. చారిత్ర కాధారాల పరిశీలన ఈ నిమిషంలో ఈ వేదిక పై చేయడం అసాధ్యం కనుక ఈ అంశాన్ని తరవాత పరిశీలనకు పెట్టుకోండి. ఆ అంశం నేరుగా ఈ వేదికకు సంబంధించిందీ కాదు అనడంతో ఇరు పక్షాలూ శాంతించాయి.

సుధాకర్ గారిచ్చిన చారిత్ర కాధారాలకు చెందిన అంశాలు : 1) యాంటి క్విటీస్ - జోసిఫస్ AD. 93;  2) పైనీ దియంగర్ AD 62-113; 3) టాసిడస్ AD 55-120; 4) సుటోనియస్ AD 120 అను వారు రాసిన పుస్తకాలలో క్రీస్తును గురించి ప్రస్తావించారు.

ఈ సందర్భంలో N V. బ్రహ్మంగారు, చార్వాక వెంకటేశ్వర్లుగారూ, డా॥ నాగన్నగారూ సుధాకర్ గారిచ్చినవి సమకాలీనుల పేర్లు కాదు గనుక అవి ప్రశ్నకు సరైన సమాధానాలు కావు అన్నారు.

వెంకటేశ్వర్లు గారైతే అటువంటి ఆధారాలు జీరో, నిల్ అన్న స్టీఫెన్ గారితో పూర్తిగా ఏకీభస్తున్నా నని మళ్ళా ఉన్నాయంటా రేమిటండీ మిూరు అని సుధాకర్ గారిని నిలదీశారు. కాని సుధాకర్ గారి నుండి సరైన సమాధానం రాలేదు. పైగా స్టీఫెన్ గారు లేవనలేదు అని అన్నారు. అప్పుడు తిరిగి స్టీఫెన్ గారిని వివరమడగ్గా జోసిఫస్ గురించి నాకు తెలుసు. అతడు క్రీస్తు సమ కాలీనుడు కాకపోవడం యూదుల బోధకుడై యుండడంవల్ల ప్రశ్నించిన వారి ప్రశ్నకు తగిన సమాధానం అనిపించక నిల్ అన్నాను అని వివరించారు.

ఈ దశలో బ్రహ్మంగారొక కీలకాంశాన్ని లేవనెత్తారు. రోమీయులకో ఆచార ముంది. తమ కాలంలోని ప్రధాన ఘటనలను రికార్డు చేయడమన్నదే అది. అట్టి స్థితిలో వారి రాజ్యంలో వారి చేతనే సిలువ వేయబడ్డ ప్రధాన ఘట్టాన్ని రికార్డు చేయకుండా ఉంటారా? అనడిగారు. పైగా యూదులు ఏసును క్రీస్తు (మెస్సయ)గా అంగీకరించడమే లేదన్నదీ చాలా ప్రధానంగా గుర్తుంచుకో వలసిన అంశం.

దానిపై కొంత చర్చ జరిగాక జెరూసలెంలో నిక్షిప్తం చేయబడ్డ రికార్డంతా జెరూసలెం విధ్వంసం చేయబడింది. దానితో పాటే ఆ రికార్డూ నాశనమై పోయింది. అని స్టీఫెన్ గారన్నారు. 

P.S.R. :- అసలా ప్రశ్న ప్రాధాన్యాన్ని మనం గుర్తించాలి. ఏసులాంటి మహిమాన్వితుని గురించి చరిత్ర దాఖలాలు వెతకాలి తప్పక. దానికి నిజంగా ఆ సుహార్తలు తప్ప సరైన ఆధారాలు లేవు.

క్రీస్తు జన్మదినంగా ఈ రోజు మనం పండుగ జరుపుకుంటున్న డిశంబర్ 25 నిజంగా క్రీస్తు జన్మదినమా అని P.S.R అడగ్గా, స్టీఫెన్గారు ఖచ్చితంగా అలా అని కాదు. అయనను గుర్తు చేసుకోడానికి ఏర్పరచుకున్న రోజు మాత్రమే అది, అది చాలాకాలం తరవాత ఆచరణలోకి వచ్చింది. అది రోమనుల సూర్యదేవుని పండుగను పురస్కరించుకుని జీసెస్ ను Sun తో పోల్చుకుని ఆరంభింప బడింది. పిదప ప్రకృతి ప్రతిపాదనలు అ అటు సుధాకర్ గారూ, ఇటు P.S.R.గారు చేశారు.

మధ్యాహ్నం:- తోటకూర వెంకటేశ్వర్లుగారు సంధానకర్త 

చా. వెం. :- బైబిల్ లో భూమిని గురించి ఏమి చెప్పబడిందో అన్న దానితో మొదలెట్టండి సుధాకర్ గారూ.

సుదా:- దేవుడు సృష్టించాడు అని ఉంది. 26-7 యోబు. శూన్యంలో వ్రేలాడదీశాడు. ఎషయా. 40-22. గ్రంథంలో భూమి గుండ్రంగా ఉందని చెప్పబడింది. 40-12 ఎషయా. భూమిపై సమతుల్యతను దేవుడే పెట్టాడు. భూమి అంతమవుతుంది. అగ్నివల్ల, మరల నూతన సృష్టి జరుగుతుంది. (2 పే.- 3 అధ్యా -10 వచనంలో)

N. V. బ్రహ్మంగారు :- మత్తయి (4-8-9) అపవాది మిగుల ఎత్తయిన కొండమీదికి ఆయనను ఎత్తుకుపోయి ఈ లోకరాజ్యములన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలబడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చెదనని పలికెను. దీనిలో భూమి బల్లబరుపుగా ఉందన్నది బైబిల్ అవగాహన అని తెలుస్తోంది. దీనికేమంటారు?

సుధా :- ఎషయా 40-22 తెలుగు మండలం, ఇంగ్లీషులో సర్కిల్ అని ఉంది హెబ్రీలో ఖుగ్ - స్పియర్. దానర్థం గోళాకారమని. ఇక బ్రహ్మం గారి కొటేషన్లో భాషా నియమాల్ని స్వీకరించి అర్థాన్ని గ్రహించారు. ఉత్ప్రేక్ష చేయబడిందక్కడ అని గమనించాలిగానీ బల్లబరుపు అన్నదికాదు. ఈ అంశాన్నే ప్రకాష్ గారు చెప్పి ఆ సందర్భం భూమి ఆకారాన్ని చెప్పడానికుద్దేశించింది కాదు. అని అన్నారు

P. S. R. Ch, ప్రాన్సిస్ గారు సాతాను ఏసును ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి ఈలోక రాజ్యము లన్నీ చూపించినపుడు అమెరికా కూడా కనబడిందని చెప్పాల్సిందే నన్నారు.

మరొక క్రైస్తవ సంఘం బైబిల్ రచనా కాలంనాటికి అప్పటి ప్రజలకు తెలిసిన దాని కంటే బైబిల్ రచయితలకు అధికంగా తెలిసియుండ లేదు. ఆనాటికి ప్రకృతి విచారణ ఇంత వృద్ధి పొందలేదు. కనుక ఆనాటి రచనలో ఈ విషయమై కొరతలుండక మానవు. అన్న రెండు ఉట్టంకింపులు చూపి వ్యాఖ్యానాలిలా వున్నాయి. వాస్తవమేమిటి? అన్నది ఎలా తేల్చుకోవడం అని ఆగారు. ఇక్కడ భాషా పరమైన చర్చ కొంతసేపు సాగింది. హిబ్రులో ఖుగ్ అని వాడబడింది. దాని అసలర్థం గోళము బంతి అని అన్నారు సుధాకర్ గారు. మరైతే అనువాదాల్లో ఆ విషయం ఎందుకు వ్రాయబడి లేదు అని బ్రహ్మంగా రడిగారు అనువాదం చేసేనాటికి అనువాదకులకు స్పష్టంగా ఆ అర్థం తోచలేదు. తరువాతి పరిశోధనల్లో "సర్కిల్" అన్న చోట స్ఫియర్ అనాలన్నది తేలింది అన్నారు సుధాకర్ గారు. అనువాదకు లెవ్వరికీ "ఖుగ్" అన్న మాటకు అర్థం తెలీలేదన్నమాట.

సురేంద్ర :- సుధాకర్ గారు మరొక భాషా పరమైన మెలిక పెట్టారేగాని సరైన రీజన్ కు నిలబడదది. లేదా ఏదో రకంగా కొత్త అర్థాలొచ్చే పదాలతో సరిపెట్టే నైజం ఉందేమోనన్న సందేహము కలిగే అవకాశం కల్పించినట్లు అయ్యింది. నిజానికది స్వపక్షాన్ని బలహీనపరచేదేగాని బలపర్చదు. ఈ అంశాన్ని సుధాకర్ గారెందుకు గమనించడంలేదో అర్థం కావడంలా కొత్త అర్ధాల్లో వ్యాఖ్యానాలు చేసేవారెవరైనా ఈ అంశాన్ని గమనించడం వారికే మేలు.

P. S. R. :- ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా ధ్వనితో (పేతురు; 10-2) గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమై పోవును. భూమి దాని మీదనున్న కృత్యములునూ కాలిపోవును.

(ప్రక. 1 అ. 4వ) తరము వెంబడి తరము నడిచిపోవును. భూమి యొకటే ఎల్లప్పుడు నిలచునది.

(క్రీ. 104-5) భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదులపై స్థిరపరచెను. ఇవి వైరుధ్యంగా ఉందనిపిస్తోంది. ఏమంటారు?

విలియమ్సు:- అవి వేరు వేరు సందర్భాలకు చెందినవని వివరించారు.

P. S. R :- పె. 2:1-20, 21 ఒకడు తన ఊహనుబట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ వచనము పుట్టదని గ్రహించవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్ఛను  బట్టి కలగలేదు. కనుక మనకు కొరుకుడుపడని చోటెల్ల ఏదో మిషతో అది దైవవాక్కు కాదనో, దానర్థం అదికాదనో అనడం సాగిస్తే బైబిలే ప్రమాణం కాకుండాపోయే అవకాశం ఉంది. మరో విషయం, విలియంగారు భూమి తన కక్ష్యలో స్థిరంగా ఉంది. అంటూ "కక్ష్" అన్నమాట వాడారు. మరి ఈ కక్ష్య అనడానికి తగిన ఆధారం బైబిల్లో ఎక్కడైనా ఉందా? విలియమ్స్ లేదన్నారు.

Note :- ఈసారి ప్రింటయ్యే వర్షను నాటికి దానిని కూడా ఎక్కడ నుంచైనా గుంజి చేరుస్తా మంటారేమో.

ప్రసాదు :- బైబిల్లోని అన్ని వాక్యాలు దేవునివి కావు. సత్యాలూ మంచివీ కూడా కాదు అన్నారు కదా. వాటిని విడకొట్టి ఇవి దైవ వచనాలు, ఇవి అన్యులవి అని చెప్పడానికేదైనా మార్గముందా? దీనిపై ఫ్రాన్సిస్ గారు అవును. అన్నీ ప్రామాణికాలు కావు. సాతాను మాటలు, సామాన్యుని మాటలు కూడా అందులో ఉన్నాయి కదా మరి. అని వివరించారు.. నుధాకర్ గారు మాత్రం బైబిల్లో కొన్ని తప్పులూ, కొన్ని ఒప్పులూ లేవన్నారు.

అప్పుడు ప్రసాదు అయితే మీరన్న భూమి గుండ్రముగా ఉన్నదన్న బైబిల్లోని మాట దేవునిది కాదు యోబుదే (26-7) కదా అని ప్రాన్సిస్ గారితో అన్నారు. దానికొన సాగింపుగా P. S. R. యోబు గ్రంథంలో నుండి (38-1 నుండి) యెహెూవా సుడిగాలిలో నుండి ఈలాగున యోబుకు ప్రత్యుత్తర మిచ్చెను.

P.S.R. సుధాకర్ గారి వివరణను అధిక్షేపిస్తూ బైబిల్ సృష్టి క్రమంగా రెండు సార్లు ఆదికాండంలో ప్రతిపాదింపబడ్డ మాటలకు సాంప్రదాయకపు బోధకులెవరూ చెప్పని అర్థాల్ని, తనకున్న అధునిక విజ్ఞానపు అవగాహనతో ముడిపెట్టి చెప్పబూనడం విడ్డూరం మాత్రమే కాదు; అది చాలా తప్పు పద్ధతి. కూడా అని అన్నారు.

డా॥ రాజుగారడిగిన భూమి పుట్టకమునుపే వెలుగుందా? సూర్యుడు ముందా, భూమి ముందా? అన్న ప్రశ్నలపై సాగుతూన్న చర్చ యిది.

సుధాకర్ గారు మొండిగా అవును వెలుగు ఉంది అనీ, సూర్య చంద్రులు భూమ్యాకాశముల తోటే సృష్టింపబడ్డారనీ, నాల్గవనాడు సూర్యచంద్రుల్ని చేశాడనడం ఉన్న సూర్యచంద్రుల్నే అక్కడ ఏర్పరచాడన్నట్లు అర్థం చెప్పుకోవాలనీ అంటూ హిబ్రూలో ఈ అనువాదానికి మూలంగా 'బారా,' 'ఆసా' అన్న రెండు పదాలు వాడబడ్డాయనీ ఒకదానికి సృష్టించాడనీ రెండవదానికి చేశాడని అర్థం వస్తుందనీ అన్నారు.

N. V. బ్రహ్మం :- 3వ రోజు వృక్షాలు పుట్టినట్లుంది. సూర్యచంద్రులు 4వ రోజు చేయబడ్డట్లుంది. ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగక్రియ)కు సూర్యుడు ఉండాలి. కనుక వృక్షాలు బ్రతకాలంటే సూర్యుడుండాలి. ఇదెలా సరిపెడతారు అనడిగారు. (సూర్యుడి కి. సం. క్రీ. కి ముందే చెట్లు !!)

 సుధాకర్ :- దీనికై పెద్దగా ఇబ్బంది పడవలసిందేమీ లేదు. కిరణ జన్య సంయోగ క్రియకు సూర్యుడుండక్కర్లా, వెలుగుంటే చాలు.

ఇకపోతే సూర్యుడు చేయబడక పూర్వమే దినముల గుర్తించడ మెలా సాధ్యము అన్న దానిని ఆయన వివరిస్తూ సూర్యుని బట్టి దినం కొలతకాక వేరే కొలత అయ్యుండవచ్చు అనగా పృచ్ఛకులు దేన్నిబట్టో చెప్పండి సార్ అనడిగారు.

అందుకు సుధాకర్ గారు దేన్నిబట్టంటే అప్పటికే వెలుగుంది గనుక వెలుగునుబట్టి దినమన వచ్చు. భూభ్రమణాన్నిబట్టిగానీ, మరి దేన్నిబట్టిగానీ అప్పటికే పగలు వెలుగు, రాత్రి చీకటి పడుతుండి ఉండవచ్చు. ఆ రకంగా బైబిల్ సృష్టి క్రమంలో చాలా క్రమత ఉంది. సైన్సుకు విరోధమూ లేదు మీరు సైన్సుకు విరోధ మవుతుందంటున్నారు గానీ నేనొక శాస్త్రజ్ఞుడుగా నేను చేసిన పరిశోధనంతటిలో సైన్సులో కూడా మొదట లైటు వచ్చినటు ఇదంతా కనుపిస్తున్నాయి. సైన్సుకు విరుద్ధమైనవిగానీ, పరస్పర విరుద్ధమైనవి గానీ, మొదటి రెండధ్యాయాలల్లో ఏమిలేవు. అది చక్కటి క్రమం. ఏ దృక్కోణం లోనుంచి యివి వ్రాయబడ్డాయో తెలుసుకుని చదివిన వారికే బైబిలు అర్థమవుతుంది. అలా కాని వారికి అర్థం కాకపోవచ్చు కూడా.

సురేంద్ర :- మేము బైబిల్ను క్షుణ్ణంగా అధ్యయనం చేశాము, పరిశీలించాము అనుకుంటున్న ప్రతిపాదకుల్లోని మిగిలిన వారికి ఒక విన్నపం చేస్తున్నాను. ఏదైతే జనిసిస్ పై సుధాకర్ గారు వ్యాఖ్య చేశారో అది కరెక్టని మీ గుండెమీద చేయి వేసికుని చెప్పగలరా? ఒక సత్యానికి కట్టుబడే క్రీస్తు ఫాలోయర్ గా మీరు నిజాయితీగా అంగీకరించగలరా?

స్టీఫెన్ : ఇప్పటి కాస్మాలజీకి, బైబిల్ కాస్మోలజీకి తేడా ఉంది. రెండూ ఒకటి కాదు. ఆనాటి బాబిలోనియన్ కాస్మోలజీ అవగాహనే బైబిల్లో చెప్ప బడింది. బైబిల్లోని రెండు సృష్టి క్రమాలకూ తేడా ఉంది. అసలా రచనా కాలాలమధ్య 4 సం॥లు వ్యత్యాసముంది. అది సుమారు క్రీస్తుపూర్వం 5, శతాబ్దాల నాటి మాట.

(నోట్:- ఈ మాటన్న స్టీఫేన్ గారూ M.Sc., P.hd. ఫిజిక్సులో చేసిన వారే) ఇంతకూ అక్కడా మాటలు చెప్పినవారు వైజ్ఞానికులు కాదు.

సురేంద్ర :- ఆనాటి అవగాహన నెత్తిన నేనూ శాస్త్రజ్ఞుణ్ణే నంటూ సుధాకర్ గారు ఈ నాటి వైజ్ఞానికావిష్కరణల రంగు పులమడం ఉందే అది సరైన నదేనా అని ఒక క్రీస్తు అనుచరునిగా ఉన్న, మారు మనస్సు పొందిన వ్యక్తిగా చెప్పండి, సైన్సు తెలిసిన వ్యక్తిగా దీనికీ దానికీ తేడా లేదనడం సాధ్యమా? అన్నది నా ప్రశ్న. దానికాయన చెప్పారు. దానికీ దీనికీ తేడా ఉంది అదేనాటిదో అవగాహన అని.

P.S.R. గారు అనివార్య కారాణాలవల్ల ఈ సమయంలో వేదికను విడచి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళిపోతూ నాలుగు ముక్కలు మాట్లాడారు. ఈ నాటి సుధాకర్ గారి వ్యాఖ్యానాలు విన్నాక ప్రతి మతం సైన్సు, సైంటిస్టుల పట్ల ఎలా ప్రవర్తించిందో, ప్రవర్తిస్తూ వచ్చిందో, మనకు తెలుసు. అదొక చారిత్రక వాస్తవం. కాలానుగుణ్యంగా మరల అదే మతం సైన్సును వాడుకుంటూ ఈ నాటికి ఈనాడున్న విజ్ఞానమంతా మా కానాడే తెలుసు అంటోంది. మత ప్రచారకులు మత భావాలకు సైన్సురంగు పూయడమనే పనిచేస్తున్నారు. సుధాకర్ గారిని ఎన్నో అడగాలనిపించింది. కానీ నిజాయితీగల క్రీస్తు ఫాలోయర్సుగా, స్టీఫెన్ గారూ, ప్రకాష్ గారు చెప్పిన మాటలు విన్నాక చర్చ అనవసరం అనిపించింది. తప్పుడు భాష్యాలు చెప్పనందుకు, అంగీకరించనందుకు వీరికి నా కృతజ్ఞతలు. సత్యాన్వేషణ పరంగా వారికున్న అభినివేశం అత్యంత హర్షణీయం అంటూ అందరికీ కృతజ్ఞతలు చెపుతూ ముగించారు.

దానిపై సుధాకర్ గారు అన్ని మతాల్లా క్రైస్తవంకూడా సైన్సు రంగు పులుముకుంటోందన్న మీ మాట నేనంగీకరించను. ఎన్నో ఏండ్లుగా పరిశోధన చేసి మేము చెపుతున్న విషయాలను తెలియకుంటే తెలుసుకుంటానికి యత్నిస్తాననడం సత్యాన్వేషణ పద్ధతవుతుందిగానీ, మీకు తెలియందంతా తప్పనడం ఎలాగండీ అంటూ ఆక్షేపణ చేశారు. ఆపై చర్చ వద్దు లేండన్నారు నిర్వాహకులు.

సోమయ్యగారు దేవుని ఆత్మ నీటిపై అల్లాడుచుండెను అని ఉంది. దేవుడంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? అల్లాడడమంటే ఏమిటి? వివరించండి. 

ఫ్రాన్సిస్ గారు :- దేవుడే ఆత్మయున్నాడు. దేవుని శక్తే నీటిపై చలిస్తూ ఉంది.

సోమయ్యగారు :- సమాధానము సరిగా రాలేదు. ఎందుకంటే ఆత్మ నీటిపై అల్లాడుతోంది అన్నామంటేనే దేవుడు పరిమితుడని తేలుతుంది. వ్యాపక తత్వం కదలడం ఉండదు. ఇది నా సందేహం. ఈ ప్రశ్ననలా ఉంచి కళ్యాణ కృష్ణగారు లేవనెత్తిన పరిణామవాదం తప్పు. బైబిలు సృష్టి రైటు అంటున్నారంటే మీరు విజ్ఞానశాస్త్రాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరన్న మాట అని ఆక్షేపించగా సుధాకర్ గారు పరిణామవాదం ఒకానొక వాదమేగాని శాస్త్రం కాదు. విజ్ఞానశాస్త్రంలో ఎన్నో వాదాలు వచ్చాయి కొట్టుకుపోయాయి. అలాగే పరిణామ వాదంకూడా త్వరలో పాఠ్యగ్రంథాల నుండే కొట్టివేయబడుతుంది అన్నారు.

దానిపై చార్వాక వెంకటేశ్వర్లుగారు మొత్తం ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా ఇప్పటికి తమ పాఠ్య ప్రణాళికల నుండి పరిణామ వాదాన్ని తొలగించిందా? అనడిగారు.

సుధాకర్ గారు మాట్లాడుతూ పరిణామవాదం ఒక సిద్ధాంతం మాత్రమే. సిద్ధాంతం స్వీకరించడానికి తగిన అధారాలు ఉన్నాయో లేదో ముందు చూస్తాడు సైంటిస్టు. అంతేగాని మరో విజ్ఞానే చెప్పాడు గనుక స్వీకరించాల్సిన పనిలేదు. అంటూ శాస్త్రీయ పోకడకు సంబంధించిన నియమాన్ని తెలియజేశారు. నా వరకు నాకు అది అందరం గమనించాల్సిన అంశంగా అనిపించింది.

సుధాకర్ గారే, వెంకటేశ్వర్లుగారు చదివిన జడ్జిమెంటు నే నంగీకరించను అంటూ ఒక ఛాలెంజ్ లాంటి ప్రతిపాదన చేశారు. ఎవల్యూషన్ థియరీ 100 శాతం సరైందని ఎవరైనా రుజువు చేస్తే నేను నాస్తికుడై బైబిలును తగల బెట్టేస్తాను. అలాగే బైబిల్లో ఉన్న సృష్టి తప్పు అని రుజువుచే స్తే పరిణామాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆ జడ్జి యిచ్చిన స్టేట్ మెంటు కరెక్టు కాదు. అదీగాక ఆ స్టేట్ మెంటులో మరో అంశాన్ని మీరు విడిచి పుచ్చారు. సృష్టిని నమ్మే శాస్త్రజ్ఞులూ, లెక్చరర్లందరూ పరిణామ వాదానికి వ్యతిరేకంగా, సృష్టి వాదానికి అనుకూలంగా ఉన్న ఎవిడెన్సెస్ ను  యూనివర్శిటీలో ప్రజెంటు చేయొచ్చు అని కూడా జడ్జి పర్మిషన్ ఇచ్చారు. దానిని గూడా మీరు చదివి ఆపై మాట్లాడండి.

బైబిలు చూపిస్తున్న సామాజిక సంబంధాలు, కట్టుబాట్లు అన్న అంశం పై రేపటి చర్చ కొనసాగుతుంది. చర్చను దానికి పరిమితం చేసేందుకు తయారై రండి అనడంతో రెండో రోజు ముగిసింది.

మూడవరోజు : బైబిలు ద్వారా సామాజిక వర్తన అన్న విషయమై అందిన అంశాలు మాటల ద్వారా చేతల ద్వారా ఎలా అందాయో చూడాలి.  ఈ రోజు స్టీఫెన్గా గారు ముందీ విషయం ప్రతిపాదిస్తారు.

ఫా. స్టీఫెన్: దేవుడు మనిషిని తన రూపమందు, పోలికగా సృష్టించడం వెనుక ఒక ఉద్దేశ ముంది. అది మనిషి తనలాగా పరిశుద్ధునిగా ఉండాలన్నదే కానీ పాపం అడ్డుపడింది. కనుక దేవుని సంకల్పానికి విరుద్ధంగా మానవుడు ఉంటున్నాడు. అందుకే మరల వారిని సరిజేయడానికి 10 ఆజ్ఞలను వారికి ఇచ్చాడు. అవి బైబిల్-నిర్గమ 20=1 నుండి 17 వచనాలల్లో చెప్పబడింది. 

పది ఆజ్ఞలు :

  • నేను తప్ప వేరొక దేవుడు నీకు వుండకూడదు.

  • పైన ఆకాశమందేగాని, క్రింది భూమియందేగాని, భూమిక్రింద నీళ్ళయందేగాని వుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు; వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహెూవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించు వారి విషయములో మూడు, నాలుగు తరముల పర్యంతము, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల పర్యంతము కరుణించువాడనై వున్నాను.

  • నీ దేవుడైన యెహెూవా నామమును వ్యర్థముగా ఉచ్ఛరింపకూడదు, యెహెూవా తన నామమును వ్యర్థముగా వుచ్ఛరించువానిని నిర్దోషిగా ఎంచడు.

  • విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు జ్ఞాపకముంచు కొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ యిండ్లలో నున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును వాటి లోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను. అందుచేతసు యెహెూవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరిచెను.

  • నీ దేవుడైన యెహెూవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

  • నరహత్య చేయకూడదు.

  • వ్యభిచరింపకూడదు.

  • దొంగిలించకూడదు.

  • నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.

  • నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు; నీ పొరుగువాని భార్య నైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదెనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు.

అందు 1, 2, 3 దేవునికీ మనిషికీ మధ్య ఉండే సంబంధాన్ని, 4 నుండి 10 వరకు మనుషుల మధ్య సంబంధాలను తెలియజేస్తాయి. 

అందులో 4వ ఏమి చేయాలో చెపుతోంది. మిగిలినవి ఏమి చేయ కూడదో తెలుపుతున్నాయి. అంటే ఆజ్ఞలద్వారా చేయవలసినవి, చేయకూడనివి ఏమిటో తెలిపాడన్నమాట. కేవలం ఆజ్ఞలను గురించి మాట్లాడుకున్నంత మాత్రాన సరిపోదు. ఆచరించాలి అప్పుడే మంచికి నమూనాగా ఉండగలం.. దేవుని అనుసరిస్తున్నాం అనగలం. దీని విషయమై (నీతిని గురించి) మత్తయి 5వ అథ్యాయం మొత్తం వివరిస్తోంది. అంటూ మరికొన్ని క్రొత్తవి. వచనాలను ఉటంకిస్తూ విశ్వాస ప్రధానమైన అనుసరణను నొక్కిచెప్పారు.

సుధాకర్ :- నైతిక విలువలకూ, మానవ సంబంధాలకూ సృష్టికర్తే ఆధారం. మనిషి కాదు. ఆ దేపుడు నైతిక సూత్రాలను మనుషులకు ఒకే సారిగాకాక అంచలంచలుగ అందించారు.

10 ఆజ్ఞలలో మొదటి మూడూ ప్రాథమికమైనవి. మిగిలినవి వాటిపై ఆధారపడినవి - ద్వితీయ స్థాయికి చెందినవి మొదటివి ఉంటేనే రెండో వాటికి విలువుంటుంది.

నీ పూర్ణహృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించు. మొదటి 3 సూత్రాలు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నది 10 అజ్ఞలలోని చివరి ఏడింటి సారాంశం. మరల క్రీస్తు ద్వారా ఇవన్నీ ఒకే సూత్రంలో చెప్పబడ్డాయి. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారో మీ ప్రక్కవానికి మీరది చేయుడి. దీనిని ఏసు ఆచరించి చూపాడు, కొంత సొంత వ్యాఖ్యనూ జోడించారు. ఇలా బైబిల్లోని సువార్తలలోనూ, ఇతరత్రాను చెప్పిన మంచి మాటలను ఎత్తిచూపారు సుధాకర్ గారు. Note:- అయితే ఆయన ప్రసంగం మొత్తం మళ్ళీ టేపు విన్నాక ఒక సూచన చేయడం అవసరమనిపించింది.

సెలెక్టివ్ సైటింగ్ చేయడం వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ఉపయోగపడే ఒక ప్రక్రియ. అది తప్పు పద్ధతి అని ప్రత్యేకంగా ఎత్తి చూపిన ఆయనే బైబిల్లోనే ఉన్న మరో రూపాన్ని అస్సలు చెప్పక పోవడం ఆజ్ఞలకు వ్యతిరేకంగా జరిగిన సంఘటనలను విడచివేయ విడచివేయడం ఇతరులు ఏది చేయకూడదని అంటున్నామో అది మనమే చేయడం కదా. అటు క్రీస్తు విశ్వాసాన్ని బట్టిగానీ, ఇటు అందరికీ ఒకే న్యాయం అన్న సూత్రాన్నిబట్టి గాని ఆయన చేసింది చేయకూడని పనే. పైగా ఇది తెలిసి చేయడం కూడా.

మనిషి దేపునితో ఉండవలసిన సంబంధాన్ని కలిగి ఉండడంలేదు. కనుకనే సాటి మనిషి తోనూ సరైన సంబంధాన్ని కలిగి ఉండలేక పోతున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటంటే ముందుగా దేవునితో సరైన సంబంధాలు ఏరర్పచుకుంటే గాని మనిషితో మనిషికి సరైన సంబంధాలు ఏర్పడవు. ఈనాడు మానవుని ఎదుటనున్న ప్రాధమిక సమస్య మంచి చెడులు తెలియక పోవడం కాదు.. ఆచరించడానికి తగిన నైతికశక్తి లేక పోవడం. (రోమా 7:14-25) మరో ముఖ్యాంశం. అంటూ తక్కువ స్థాయికల నియమాన్ని ఉత్తమ స్థాయికి చెందిన నియమం (అంటే మరింత మంచి ఫలితాల కొరకు) త్యజించవచ్చు.

అలా జరిగినప్పుడు వాటిని పరస్పర విరుద్ధత అనుకోనక్కరలేదు. ఇదీ బైబిల్ కు సంబంధించి నంత వరకు ఉన్న నైతిక స్వరూపం అంటూ ముగించారు..

రాజుగారి ప్రశ్న:- మొదటి ఆజ్ఞను వివరించండి. బైబిలు ఎందరి దేవుళ్ళను అంగీకరిస్తుంది.

సుధాకర్ సమా :- నకిలీ దేవుళ్ళు ఉన్నట్లు చెప్పబడింది. అసలు దేవుడు ఒక్కడే అతడు బైబిల్ దేవుడే.

సురేంద్ర :- ఇక్కడ రాజుగారు నకిలీదేవుళ్ళనైనా అంగీకరిస్తోంది కదా అంటూ ఒక పేలవమైన ప్రశ్న లేవనెత్తారు. దానివల్ల ఆయన సాధించ దలచిన దేమిటో నాకగపడడంలా.

ఈ సమయంలో విలియంగారు కల్పిత దేవుళ్ళకూ, అసలు దేవునికీ వున్న తేడా చెపుతూ దేవుడు సర్వ శక్తివంతుడు, స్వయం ఉనికి గలవాడు అని చెప్పారు.

రాజుగారు :- అట్టి మీ దేవుడు సర్వాంతర్యామా, కాదా?

సర్వాంతర్యామి కూడా అని చెప్పారు విలియమ్స్ గారు.

అలాగైతే సర్వాంతర్యామి జలములపై అల్లాల్లాడడమెలా కుదురుతుంది?

సోమయ్యగారు, 5వ ఆజ్ఞ చదివారు. తల్లిదండ్రులను సన్మానించ వలెనన్నదే అది. (మత్తయి. 10:34, 35) నేను భూమి మీదకు సమాధానము పంపుటకు వచ్చితినని తలపకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు రాలేదు, కుమారునికి - తండ్రికి, కూతురుకు - తల్లికి.... విరోధము పెట్ట వచ్చితిని....తల్లికైనను తండ్రికైనను నాకంటె అధికముగా ప్రేమించు వాడు నాకు పాత్రుడు కాదు. అంటాడు ఏసు. ఈ రెండూ విరుద్ధపు ప్రబోధాలు కాదా?

విలియమ్:- వాటిమధ్య వైరుధ్యంలేదు. క్రీస్తు బోధనలు విని ప్రభువును అనుసరించువారు కుటుంబీకులతో విభేదించే అంశాన్ని చెపుతున్నారే గానీ తల్లిదండ్రుల్ని సన్మానించ వద్దన్నది ఆ మాటల అర్థంకాదు.

ఈ సమయంలో సమాధానం నేను చెపుతానంటూ సుధాకర్ గారు మత్తయి 10:27, 32 వచనాలు చదివి; నన్నెంతగా ప్రేమించవలెనంటే మీ కుటుంబీకులను (ఇతరులను) ద్వేషించేటంతగా అని వివరణ యిచ్చారు. బైబిల్ కు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా అన్న సందేహం పుడుతోంది. ఏమంటే ఈ స్టేట్మెంటును స్వీకరిస్తే '5' ఆజ్ఞను ధిక్కరించినట్లవుతోంది.

ఫ్రాన్సిస్:: తల్లి దండ్రుల్ని ప్రేమించు. కానీ అదెంతవరకు నియమం? నన్ను ప్రేమించే విషయంలో వారు అడ్డుకి రానంతవరకు అన్న వివరణ చేశారు. బాగుంది అంటూ దీనిపై ఏమి ప్రశ్నిస్తారు. అని ప్రశ్నించే వారిని అడిగాను.

సోమయ్య :- అది 19, 20 అధ్యాయాలు (ఆది. 35-22) లలో అక్రమంగా వ్యభిచరించినట్లు వ్రాయబడింది గదా ఇది దశ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను అతిక్రమించడం కాదా?

ప్రాన్సిస్ గారు, సుధాకర్ గారు :- యెహెూవా దేవుడు వారిని అంగీకరించలేదు పైగా శపించాడు కూడా.

విలియమ్సు :- ద్వి. ఉ. కాం. 23-3 చదివి లోతు కూతుళ్ళకు పుట్టిన వారి వంశాలు యెహెూవా సంఘంలో చేరరాదని శపించబడ్డారు.

N. V. బ్రహ్మంగారు అంతేగాని తప్పు చేసిన లోతు కూతుళ్ళుగానీ, లోతుగాని శిక్షించబడలేదు కదా అని అధిక్షేపించగా వారి వంశం బహిష్కరింప బడితే అది వారికి శిక్షకాదా అన్నారు ప్రతిపాదక పక్షంవారు.

ఈ సందర్భంలో ధర్మశాస్త్రం ప్రకారం ఏ తప్పుకు ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడిందా లేదా అన్నదే వారి సందేహం దానికి సూటిగా సమాధానం చెప్పండి అని నేనన్నాను. అందుకు. సుధాకర్ గారు అలాగంటారా? అయితే ఆ ఘటన జరిగే నాటికి ఈ ధర్మశాస్త్రం లేదు అన్నారు. దానిపై సుకుమార్ గారు మరొక వివరణ దానిపై మరో ప్రశ్న.... చివరకు అసంపూర్తిగానే ఆగింది. అప్పుడు చార్వాక వెంకటేశ్వర్లు గారో కొటేషన్ బైబిల్ నుండి చూపి:-

ఒకరు చేసిన తప్పుకు వారి పిల్లా, పాపలు నాలుగు తరాలపైకి శిక్షను పంపుతానన్నాడు యెహెూవా. అసలా తరహా నీతిని మనం అంగీకరించగలమా? అంగీకరించవచ్చా? అని అడిగారు.

అప్పుడు ఫ్రాన్సిస్ గారు మరో వాక్యాన్ని వివరిస్తూ ఒకడు పుల్లని పండ్లు తింటే మరొకనికి పండ్లు పులుస్తాయా? అన్న ప్రకారం ఎవరి పాపానికి వారికే శిక్ష అని చెప్పారు. అందుకు నేను ప్రశ్నించిన వారికి సూటైన సమాధానం రాకపోగా ఎవరి పనికి వారికే ఫలం అని, అలా కాక నాలుగు తరాల వారికీ నన్న రెండు రకాలున్నట్లు తెల్పి విషయాన్ని మరింత జఠిలంచేశారు అన్నాను.

ఇక్కడ సుధాకర్ గారు ప్రవేశించి తరాన్నుంచి తరానికి శిక్ష రావడం ఉందా అనడిగారు కదా? తండ్రికి డయాబిటిస్ ఉంటే కొడుక్కి రావడంలేదా? తండ్రి అప్పుచేసి చచ్చిపోతే వారసత్వం ఉన్న కుమారుని మీద ఆ భారం పడుతుంది అలాగే ఆస్థి సంక్రమిస్తుంది. ఈ విధంగా సమాజంలో వారు చేసిన మంచిచెడులు తరం నుండి తరానికి సంక్రమించడం ఉంది..

సురేంద్ర శిక్షలు గురించి అడుగుతుంటే వారసత్వపు రోగాలు, చట్ట పరమైన వారసత్వపు హక్కులు ఉదహరించడం విషయాన్ని ప్రక్కమార్గం పట్టించడం కాదా? ఒకడు హత్యచేస్తే జైలుశిక్ష కొడుక్కి వేస్తారా? అన్నది మన చర్చానీయాంశాపరంగా చూడవలసిన రూపం అంటూనే, అవన్నీ అలా ఉంచేద్దాం ఎందుకంటే మనం ఈనాడు చర్చకు స్వీకరించింది దేవునికీ  మనిషికీ మధ్య ఉన్న నియమాల గురించి కాదు. మనిషికీ మనిషికీ మధ్య ఉన్న నియమాల గురించి అని ప్రకరణాన్ని గుర్తు చేశాను.

బానిసత్వాన్ని అంగీకరించడం సరైందేనా? అని చార్వాక వెంకటేశ్వర్లు అడిగారు. ఈ ప్రశ్న నన్నడుగుతున్నారా? బైబిలు ఏమంటోందనా? ఎదురడిగారు సుధాకర్ గారు.

ముందు ఒక మనిషిగా మీ అభిప్రాయం చెప్పండి అని అన్నారు వెంకటేశ్వర్లుగారు.

వ్య క్తిగతాభిప్రాయాలు చెప్పడానికి రాలేదు నేను అనన్నారు సుదాకర్. 

మరెవరైనా చెపుతారా అని ప్రతిపాదకుల్ని అడగ్గా ప్రకాష్ గారు, స్టీఫెన్ గారు.

పర్సనల్ గా నేనంగీకరించను అన్నారు. ఓ. కె. అన్నారు వెంకటేశ్వర్లు గారు అంటూనే యెహెూవా బానిస వ్యవస్థను ఉండకూడనిదిగా కొట్టివేయలేదు అని నిర్గమ 21 అధ్యాయంలోని 2 నుండి కొన్ని వచనాలు చదివారు.

స్టీఫెన్గారు, క్రైస్తవులుగా మేము దీనిని అంగీకరించము. కానీ ఆ నాటి సమాజంలో బానిస వ్యవస్థ నడుస్తోంది అని వివరించారు.

సురేంద్ర :- ఈ సందర్భంలో సుధాకర్ గారు బైబిల్ లోని రెండు మూడంశాలు ప్రస్తావిస్తూ క్రీస్తులో భేదాలులేవు అంటూ కనుక బైబిలు బానిసత్వాన్ని అంగీకరిస్తుందన్న అర్ధం ఎక్కడా లేదు అనన్నారు. ఇక్కడో చిన్న కీలకం ఉంది..

ఈ విషయమై ముందుగా మీ వ్యక్తిగతాభిప్రాయం చెప్పమనగా చెప్పనన్నారు. ఇప్పుడు బైబిల్ అభిప్రాయం బానిసత్వాన్ని అంగీకరించడం కాదన్నారు. మరి వీరి వ్యక్తిగతాభిప్రాయం ముందెందుకు చెప్పనన్నట్లు? ఈ చర్చా సందర్భంలో ఒకటి రెండు చోట్లయినా నా అభిప్రాయం ఏమిటంటే అన్న మాటలూ ఆయనే వాడారు. ఇలా ఎట్లా పడితే అలా, అప్పటికెలా చెప్పి సరిపెడదాం అనుకుంటూ సాగించే వివరణలకు సత్యతవిషయాలలో ఉన్న స్థానమెంత?

ప్రసాద్ మరో ప్రశ్నవేస్తూ సుధాకర్ గారు బైబిల్ లో ప్రోగ్రెసివ్ ఛేంజస్ జరిగినట్లు కనిపిస్తున్నాయి అన్న దానిపై ఇప్పటి సమాజానికి బైబిల్లో లేని ప్రోగ్రెసివ్ స్టెప్ అవసరమైతే అప్పుడు మనమేం చేయాల్సి ఉంటుంది అనడిగారు.

ప్రకాష్ గారు అలాంటి అవసరం నిజంగా ఏర్పడితే ప్రస్తుతాని కవసరమైన మార్పునే ఆహ్వానిస్తాము. అయితే బైబిల్ రచనను మార్చము. అది ఒక డాక్యుమెంటు కనుక అన్నారు.

స్టీఫెన్ గారైతే క్రైస్తవులకు ఆనాటి నియమాలు నిబంధనలు అనే వాటికంటే క్రీస్తు బోధనలను జీవితంలోని తెచ్చుకోడమెలా గన్నదే ప్రధాన విషయం అన్న అభిప్రాయం వెలిబుచ్చారు.

ఒక వంక నిన్ను ద్వేషించినవాణ్ణి కూడా ప్రేమించమన్నట్లు ఉంది, మరో వంక నన్ను ద్వేషించు వానిని, నా 4 తరాల వరకు వేధిస్తానని ఉంది. ఇదెలా పొసగుతుంది. మీరేమో అక్కడ చెప్పిన మంచిని ఎక్స్ పోజ్ చేస్తున్నారు. మరో రకంగా ఇంకో చోట చెప్పిన వాటిని గురించి మాట్లాడరు. ఇదేమి సత్యదృష్టండీ అంటూ ఆక్షేపించారు వెంకటేశ్వర్లుగారు. 

సోమయ్యగారు : ఆరవ ఆజ్ఞ అయిన నరహత్య చేయకూడదు అన్నదానిని (నిర్గ-20=13) చదివి - మరో వాక్యం (నిర్గ. 32 = 27 నుండి 29) కూడా చదివారు అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని నడుముకు కట్టుకుని పాళెములో ద్వారము నుండి ద్వారమునకు వెళుతూ ప్రతి వాడూ తన సహెూదరుని, చెలికానిని, పొరుగువానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహెూవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడువేల మంది కూలిరి. దీనిపై పెద్ద చర్చ సాగలేదు.

సువర్ణ సూత్రంపై కొంత చర్చ జరిగింది. పాత నిబంధనలోని మాటలకు - కొత్త నిబంధనలోని ఏసు చెప్పిందానికీ తేడా ఉంది. యెహెూవా చెప్పింది ఇశ్రాయేలీయుల నుద్దేశించింది మాత్రమే అని బ్రహ్మం గారన్నారు. సుధాకర్ గారు విషయం అంగీకరించలా. ప్రకాష్ గారు మాత్రం ఆ తేడా నిజమే నన్నారు. ఆ పూట సమావేశం ముగిసింది. ఈ వేదిక తీర్పు గురించి ఇరుపక్షాలు, శ్రోతల అభిప్రాయాలు తెలియపరచుకోవడం అన్నది మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాం.

1) ఫా: చిన్నప్పగారు :- ఈ రెండు రోజులుగా జరిగిన చర్చలలో సందేహాలు సమాధానాలు ఎలా ఎక్కడ వెతకాలి అన్నది స్పష్టంగా నాకు తెలిసింది. ప్రశ్నించు పక్షంలో సత్యాన్వేషణా దృష్టి నాకెంతో సంతోషాన్ని కలిగించింది. సమాధానాలు చెప్పడంలో ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం గోచరించింది. మరో కోణంలో రెండు పక్షాలు బైబిల్ ను  నేను పడగొట్ట గలననో, బైబిల్ ను నేను నిలబెట్టగలననో అనుకోవడం సరైన దృక్పధం కాదు. కొంత ఇరువురూ అక్కడక్కడా అలా కనిపించారు.

2) ఫా. M. ప్రకాష్ గారు :- నన్నాహ్వానించినందుకు మండలికి కృతజ్ఞతలు. ఈ సదస్సులో నేను గమనించిందేమంటే చిన్న చిన్న సవరించు కోవాల్సినవి . కనబడ్డా, సిన్సియారిటీ అందరిలోను కనబడింది. నిర్వహణ తీరు మరో రకంగా ఉండి ఉంటే చర్చ మరింత ఫలప్రదంగా ఉండేదేమో.

3) ఫా. స్టీఫెన్ గారు :- ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనడం నాకిదే ప్రధమం. సత్యాన్ని తెలుసుకోడానికి ఇక్కడివారంతా చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషించదగింది. కార్యక్రమం బాగానే నడిచిందనుకుంటున్నాను. స్పష్టమైన నిర్ణయాలు జరక్కపోయినా ఈ వేదిక బైబిలును చక్కగా చదవవలసిన అవసరాన్ని గుర్తింప జేసింది. కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని దీనిని చదవకుండా Open mind తో అధ్యయనం చేయాల్సిన అవసరం మరోసారి గుర్తుచేసుకోడానికి పనికివచ్చింది.

4) సుకుమార్ గారు :- సోమయ్యగారి ద్వారా ముందుగానే వార్త అందింది. మండలి సభ్యులు పిల్లలు. యవనస్తులు, వృద్ధులూ కూడా ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నట్లు నాకు కనబడింది. అదెంతో విశిష్టమైన విషయము.

5) విలియంగారు:- కార్యక్రమానికి ఆహ్వానించిన మండలికి ధన్య వాదాలు. ఈ సమావేశం చూశాక క్రైస్తవులేకాక ఇతరులూ బైబిలును క్షుణ్ణంగా చదువుతున్నారని తెలిసింది. ప్రశ్నించేవాళ్ళ నిశితాధ్యయనంవల్ల మళ్ళా మేము మరింతగా బైబిలును చదవాన్సిన అవసరం ఏర్పడింది. పౌలుకి తిమోతికి రాసిన మాటల్లో ఇది సత్యాన్ని ప్రకటించడానికి, సత్యంలో నడిపించడానికీ ఉద్దేశింప బడిందే బైబిలు అని రాస్తుంటారు. మనిషి సత్యాన్ని వెంటనే స్వీకరించలేడు, అసత్యాన్ని సులభంగా నమ్ముతాడు. ఈ అంశం ఇక్కడ మరింతగా సత్యమని రూఢైంది నాకు అన్నారు.

6) Ch. ఫ్రాన్సిస్ :- సత్యాన్వేషణ మండలి ఎంచుకున్న ఈ తరహా వేదిక (అటు ఆస్తికులకూ, నాస్తికులకూ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ ఉండకుండా ఉండగలగడం) అపూర్వం. అన్నాడో లేదో తేలని అంశాలనలా ఉంచి సామాజిక అపసవ్యతలను తొలగించుకునేందుకు సిద్ధపడమనే వైఖరిగల సురేంద్రగారిని అభినందించడం, ఆమోదించడం చేయాలి.

7) సుధాకర్ :- నిర్వాహకులకు కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఎంతో విలువైందని అనుకోవడం వల్లనే పూర్వ నిశ్చిత కార్యక్రమాలున్నా వాటిని వాయిదా వేసుకొని ఇక్కడకు వచ్చాము పృచ్ఛకులు, పోకడ కూడా మాలో మిత్ర భావాలనే మిగిల్చింది అందరికీ కృతజ్ఞతలు. 

8) N. V. బ్రహ్మంగారు :- ఏదో ఒక సిద్ధాంత వైఖరికి కట్టుబడిన వారే ఇరుపక్షాల్లో ఉన్నప్పటికీ అందరూ సంయమనాన్ని పాటించారు చాలా వరకు. నా వరకు నేను బాలెన్సు గానే ఉన్నా ననిపిస్తోంది. ఒక విషయం గుర్తుకొస్తోంది ఒక ఆర్చిబిషప్ కూ, బెట్రాండ్ రస్పెల్ కూ B. B, C లో చర్చ జరిగినట్లు ప్రసారమైంది మొదటి ప్రశ్న బిషప్ చేశారు రస్సెల్ ను.

బిషప్ : దేవుడులేడని మీరు రుజువు చేయగలరా? 

రస్సెల్ :- నేను రుజువు చేయలేను.

బిషప్ :- అయితే దేవుడు ఉన్నాడని విశ్వసించి ఎందుకు ప్రచారం చేయరు?

రస్సెల్ ;- ఉన్నాడంటానికీ నాకు రుజువులేదు కనుక.

బ్రహ్మం :- దీనిలోని అతి సూక్ష్మమైన వాస్తవిక పరిస్థితిని విజ్ఞులు మాత్రమే అర్ధం చేసుకో గలము చాలాకాలం హేతువాదిననో, మరోటనో ప్రకటించుకుని ఎన్నో కార్యక్రమాలు చేశాను నేను, కానీ ఈనాడు సత్యాన్వేషణ మండలి పరిచయంవల్ల ఆ గిరులు చెరుపుకున్నాను. అదెంతో సరైనదని మరింత సూక్ష్మమైన ఆలోచనద్వారా స్పష్టంగా గ్రహించి మసలు కుంటున్నాను. ఈ మార్పు వల్ల బైబిల్ బండారం వ్రాసిన నేను ఈనాడు బైబిలుపై ఒక పాజిటివ్ థింకింగ్ లో మరొక రచన చేయాలనుకుంటున్నాను.

9) కె. ప్రసాదు :- సమాజంలో అనేక జీవిత విధానాలు ఆగపడుతున్నాయి. వాటికి ఆధారం ఆయా ధోరణులు ప్రచారం చేసిన భావజాలంలో ఉంటోంది. సత్యం ఒకటేనంటూనే ఎవరికి వారు తమదే సత్యం అంటున్న ఈ ధోరణుల వైఖరిలో తేల్చుకోవలసిన రీతిలో తేల్చుకోకపోవడమన్నది ప్రధాన లోపం. దానినధిగమించి సత్య నిర్ధారణ చేసుకోవలసిన అవసరాన్ని గుర్తించి నిర్వహిస్తున్నదే ఈ చర్చా వేదిక. సత్యమెక్కడో నేనక్కడే అన్న వైఖరితో ఈ వేదిక ఆశయాల నెరవేరడానికి కృషి చేయ వలసిన బాధ్యత మనందరిపై ఉంది.

10. తోటకూర వెంకటేశ్వర్లు:-

11. సోమయ్యగారు:- అందరకూ వందనాలు ఇలాంటి సమావేశాల్లో గతంలో పాల్గొనలేదు.  కనుక నావరకు నాకు నాకిది ఒక అవకాశంగా భావిస్తున్నాను. మరింత ప్రగాఢమైన అధ్యయన అవసరం ప్రశ్నలనడగడానికి కూడా అని గమనించాను. సురేంద్ర గారితో ఈ మూడునాళ్ళు కలసి ఉండడంవల్ల ఆయన అవగాహన, వ్యక్తిత్వాలపట్ల నాకెంతో ఉదాత్తమైన అభిప్రాయం కుదురుకుంది. ఇక చర్చావేదికలో ప్రశ్న, సమాధానము సూటిగా, సంక్షిప్తంగా ఉండడం అత్యంతావశ్యకం.

12. శ్రోతల నుండి;- యోగయ్యగారు:- అధ్యక్షులవారికీ, ఇరుపక్షాలకు వందనాలు - డబ్బు సంపాదించడమే పరమావధిగా సర్వే సర్వత్రా ప్రవర్తిస్తున్న ఈనాటి సమాజంలో సంపాదన వనరులున్నా అవి ఆవలబెట్టి ఉన్న డబ్బును నలుగురికీ విజ్ఞానం కలిగించడానికి ఖర్చు పెడుతున్న. సురేంద్రగారి లాంటి వారుండడం అరుదు. దైవం పేరున ఎన్ని వేషాలు ఏర్పడ్డాయో చూస్తుంటే నిజాయితీ గల ఆస్తికులకు నిర్వేదం కలక్కమానదు. మండలితో సత్సంబంధాల నేర్పరచుకుని విజ్ఞాన పధంలో పురోగాములు కావలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.

E. ప్రసాదరావుగారు :- చర్చా వేదికలో చారిత్రక పరిణామక్రమాన్ని ముఖ్య విషయంగా పరిగణించక పోవడం విచారకరం.

14. సుధాకర్:- చివరిమాటలు చాలా ప్రాముఖ్యత కలిగుంటాయి. కనుక, సావధానంగా విన గోర్తాను. సత్యాన్వేషణకు ఓపెన్నెస్ చాలా అవసరం. ప్రశ్నించేవారు ఎవరి గొడవలో వాళ్ళు వారివారి ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ప్రతిపాదకులను శ్రద్ధగా ఆలకించకపోవడం కనిపించింది. సత్యాన్ని గుర్తించా లనుకునేవాళ్ళు ముఖ్యంగా హేతువు నుపయోగించే వాళ్లు గమనించవలసిం దొకటుంది. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పుడు లాజిక్ లో రూల్ నెం-1 ప్రకారం; Law of non Contradiction ప్రకారం ఏదోఒకటి సత్యమవుతుంది గానీ రెండూ సత్యాలు కావు. ఒక విషయాన్ని అటూ యిటూ Decide చేయకుండా ఉండడం సత్యాన్వేషణ ఉద్దేశం కాదు. నేను కూడా బైబిల్ను సోమయ్యగారు. విలియమ్సుగారూ అన్నట్లే ఇంకా ఎక్కువగా చదవాల్సి ఉందని భావిస్తున్నాను.

ఓపెన్నెస్  ఉండాలి. సత్యమేముందో చూద్దామని ఉండాలి. తప్పులేమైన ఉన్నాయేమో చూద్దాం అని ఉండరాదు అన్నారు.

సత్యాన్వేషణ అంటే ఇది ఇంతే, అది అంతే అని చెప్పకూడదను కుంటున్నారు చాలామంది అది సరైంది కాదు.

బైబిల్ ఎంతైనా నమ్మదగింది అన్న నా పూర్వ నిర్ణయం ఈ వేదిక పై మరింత దృఢపడింది అంటూ, ముగించారు. you will know the truth. that will set you free. మూడో దినం ఏసు లేచాడని చెపుతోంది బైబిల్. నేనది పరిశోధించి నిజమేనని తెలుసుకున్నాను.

సురేంద్ర:- నా పాత్రకు న్యాయం చేకూర్చాలి గనుక రెండు మాటలు చెపుతాను సుధాకర్ గారి ప్రసంగాన్ని సృశిస్తూ ఒక చిన్న కథతో ఆరంభించారాయన తన ప్రసంగాన్ని, ఏది జరగడానికి వీలు లేదో అది కథా రూపంలో చెప్పి Like that అంటూ మొదలెట్టారు. ఏదో రాజకీయ వేదికలపైనో, మరెక్కడో జరగాల్సిన రీతి అది. నిజాని కది దేనికీ ఉదాహరణ కాదు. ఉదాహరణంటే జరిగిన సంఘటనై యుండాలి. పైగా సిద్ధాంత చర్చల్లోనా ఇటువంటి కథలు. అదలా వుంచండి ఒక పక్షానికి చెందిన ఎవరూగానీ మొత్తం వేదికను సమీక్షించడమేమిటి? ఆ పనిగానీ ఆ బాధ్యతగానీ సుధాకర్ గారెందుకు తీసుకున్నట్లు? అందులోని ఔచిత్యమేమిటి? అందుకే రెండో పక్షమూ సమీక్షిస్తా నంటూందిపుడు. అందరూ చెప్పారు ఓపెన్ గా ఉండాలని. కాని అమలులో ఏ మేరకు కనబడిం దన్నది ఎవరికి వారం ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది. అదలా ఉంచండి.

నిజానికీ సదస్సు ఇప్పటికి అసమగ్రంగా ముగిసింది. దీని కొనసాగింపు గురించి ఆలోచించాల్సిన అవసరముందిప్పుడు. రెండు పక్షాలూ ఒక విషయాన్ని గమనించాలి. బైటకు వెళ్ళాక ఏమీ చెప్పలేకపోయారు మా ప్రశ్నలకు అని ప్రశ్నించేవారు చెప్పుకున్నా, ఏమడిగారయ్యా అడిగిన నాల్గింటికీ ఇట్టే చెప్పేశాం సమాధానాలు అని ప్రతిపాదకులనుకున్నా అది తమకు తామే తప్పు చేసుకున్నట్లు అపుతుంది. సిద్ధాంత చర్చలన్నది కూలంకషంగా మరింత మరింతగా మరొక సారి, వేరొక సారిగా మరికొందరి విజ్ఞులతో కలిపే మనం కూర్చోవలసి ఉంది. కానీ ఇందుకు మీ అందరి పైనా బాధ్యత ఉంది. మా వంతు మేము (నిర్వహణ వ్యయ ప్రయాసలు) చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

మేమీ కార్యక్రమాలు జనవరి, ఏప్రియల్, జూలై, అక్టోబర్ లో నిర్వహిస్తుంటాము. మొత్తం ఒకే సమావేశంలో పూర్తిచేయలేమన్నది తెలుస్తోంది గనుక ప్రత్యేక విషయాన్నెంచుకుని దానిపై రెండు పక్షాల వాళ్ళము సమగ్రమైన పరిశీలన చేసుకుని నిర్వాహకులకు వ్రాతమూలకంగా అందజేస్తే వాటిని అన్నింటినీ అందరకు అందించే పనిచేస్తాము. అప్పుడు సదస్సు మరింత ఫలప్రదంగా సాగుతుంది.

అలాగే చర్చకు అవసరమైన పారిభాషిక పదాల అర్ధ నిర్ధారణము, చర్చా నియమాలు నిర్ధారించుకోడానికి ఒక వేదిక ఏర్పరచుకుందామంటే అది మరీ మంచిది.

అసలు సత్యమంటే ఏమిటి? ఒక విషయం సత్యమా కాదా నిర్ధారించడ మెలాగు? అన్నది తేల్చుకోకుండా చర్చించడమేమిటి? అన్న సుధాకర్ గారి సూచన అత్యంత విలువైంది. మరి ఆ పని చేద్దామా? ముందుగా అలాగేనంటే అందులో పాల్గొనదలచిన వారు అనంద్ కు మీ పేర్లు చిరునామా యివ్వండి. చర్చావేదిక పరంగా నేను చెప్పవలసింది అయ్యింది.

సుధాకర్ గారికి వ్యక్తిగతంగా నేనొక ప్రతిపాదన చేస్తున్నాను. నిన్న ఆయన ఒక ఎనౌన్సుమెంటు చేశారు. ఇది అసత్యమని గనుక తేలితే బైబిలు తగల పెట్టేస్తాను. ఇది సత్యం కోసమే గనుక నేను దానిని స్వీకరిస్తున్నాను. మనిద్దరం బైబిల్ పై చర్చ సాగిద్దాం. సైన్సు అవసరమైనచోట సైన్సును, సామాజిక సంబంధాల విషయంలో అవసరమైన వాటినీ పెట్టుకుని పరిశీలన సాగిద్దాం. బైబిల్లో మానవుడు స్వీకరించదగిన మౌలికాంశాలన్ని ఉన్నాయని తేలితే ఒక సత్యాన్వేషిగా ఇప్పటికి అటూ యిటూ చేరకుండా ఉన్న నేను దాన్ని వదలి బైబిలును నెత్తిమీద పెట్టుకుని ఒక సువార్తకుడిగా నా శక్తి యుక్తుల్ని వినియోగిస్తాను (ఈ మాటనగానే నుధాకర్ గారు నా ప్రతి పాదనను అంగీకరిస్తూ అది తనకెంతో సంతోషకరమైన విషయం అని చెప్పారు.)

ఈ మధ్య నేనొక వ్యాసం వ్రాశాను వివేకపథంలో. నా గురించి పలువురు వేసిన ప్రశ్నలకు సమాధానంగా అందులో నేను నాస్తికుణ్ణి కాదు: ఆస్తికుణ్ణి కాదు; ఎందుకంటే అంటూ నాకున్న ఆధారాలు చూపుతూ ఆస్తిక నాస్తికుల్ని ఒక విషయంలో నన్ను సత్యం తెలుసుకునేట్లు చేయండి. నాస్తికులారా! మీరెలా నాస్తికత సత్యమన్న నిర్ణయానికి వచ్చారో ఆ సత్యాన్నెరుక చేసి నన్ను నాస్తికుణ్ణి చేయండి. అలాగే ఆస్తికుల్నీ అభ్యర్థించాను. ఇప్పుడు సుధాకర్ గారితో మాత్రమేకాదు నేను ఒడంబడిక చేసుకుంటోంది. మీరే ధోరణి వారైనా సరే అదెలా సత్యమో, సరైందో నా కర్థమయ్యేట్లు వివరించండి. నేనా పక్షాన్ని వహించి ఆ వాస్తవాన్ని సమాజాని కందించే యత్నం చేస్తాను నిర్విరామంగా. ఇది నేను వ్యక్తిగతంగా మీ అందరి ముందూఉంచుతున్న నా హృదయ మది.

మూడవ అంశంగా "వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక" వివరాలు చెప్పి దానిలో చేరరండని అందరినీ ఆహ్వానించడంతో ఆ కార్యక్రమం ముగించాము. హమ్మయ్య చాలా పెద్ద వ్యాసమైంది. దాదాపు 20 గంటల టేపు విని రాయవలసి వచ్చింది. దాదాపు ముఖ్యమైన ఏ విషయాన్ని విడవకుండానే రాశానిది. అయితే మాట్లాడిన కొందరి పేర్లు విడిచివేశాను. విషయాన్ని మాత్రం విడువలా.

No comments:

Post a Comment