Wednesday, February 1, 2023

9 వివేకపథం

 

వివేకపథం

సంపుటి 1                          ఏప్రిల్ 1997                            సంచిక : 9


   "కల్కి భాగోతం"  పుట్టుపూర్వోత్తరాలు

పాఠక మిత్రులారా! కల్కి భగవాన్ అన్న పేరున ఈ మధ్యకాలంలో అధిక ప్రాచుర్యంలోనికి వస్తున్న, అతిగా అమాయకుల్ని వంచిస్తున్న ఓ వంచకుడి గుట్టురట్టు చేయడాని కుద్దేశించిందీ, ఆ విధంగా ప్రజల్ని మేలు కొలిపి అప్రమత్తుల్ని చేయనెంచి రచించింది ఈ రచన దీని బాగోగులనూ, సత్యాసత్యాలను విచారించి భద్రతను పొందవలసిందిగా కోరుతున్నాను..

              ఈ కల్కి ఉద్యమ రథాన్ని లాగుతున్నది జోడు గుర్రాల్లాటి ఇద్దరు. ఒకని పేరు విజయకుమార్. ఇతణ్ణే  ఇప్పుడు కల్కి భగవాన్ అంటున్నారు. రెండోవాడు 'శంకర్'  ఇతణ్ణే  యిప్పుడు శంకర భగవత్పాద అంటున్నారు. పరమగురువు అనీ అంటారు.

            తల్లిదండ్రులు :- విజయకుమార్ తండ్రి వరదరాజులు తల్లి వైదేహి. ఊరు అర్కోణంలోని గుడియాత్తం దగ్గర నెత్తం అనే గ్రామము. వరద రాజులు అన్నాయన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయి. విజయవాడలోనూ  కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం తిరుపతి తిరుత్తనిల మధ్యగల నేమం అనే గ్రామంలో ఇల్లు కట్టుకుని సెటిల్ అయ్యారు.

            'కల్కి' అనబడే విజయకుమార్కు రవి, రమేష్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. రవి లక్ష్మీ కమర్షియల్ బ్యాంకు కోయంబత్తూరులో పనిచేస్తున్నారు. రమేష్ 'కల్కి' సెంటర్కు ఇన్ఛార్జిగా చేస్తున్నారు. అతడికి ఒక సోదరి ఉంది. ఆమె భర్త పేరు రామ్మూర్తి. ఇటుకల వ్యాపారం చేస్తుండేవాడు. ప్రస్తుతం 'రామభగవత్పాద' అన్న పేరు తగిలించుకుని కల్కి సంఘంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాడు.

             ఇతనికి ఒక కూతురు ఉంది. ఆమెను బావమరిది (కల్కి ఉరఫ్ విజయకుమార్) కొడుకు కృష్ణకిచ్చి పెండ్లి చేశారు. కృష్ణ ఇంజనీరింగు చదివి ప్రస్తుతం ఫారిన్-ఆస్ట్రేలియా వెళ్ళారని తెలిసింది.

             ఆశ్చర్యకరమైన విషయమేమంటే అందరినీ భక్తులను కమ్మంటూ అందరకు ముక్తి ప్రసాదిస్తా నంటున్న అతగాడు స్వయంగా కొడుకూ కోడలికి మాత్రం దాస, దాసిల వేషం వేయించలా. (వారు నిజాయితీపరులై వ్యతిరేకించీ ఉండొచ్చు. లేదా ఈ నా మాటలు విని ముందు ముందు మరింత ప్రజలను మోసగించడానికి వారికీ గుండు కొట్టించో, గడ్డం పెంచో వేషధారులను చేసినా చేయొచ్చు) కాగా లోకుల పిల్లల్ని మాత్రం ఏదో రీతిని లొంగ దీసుకుని, లేదా ఆకర్షించి దాసులుగానో, దాసినిలుగానో మార్చడానికి తీరి కూర్చున్నాడు.

            ఈ మధ్య ఈయన కార్యకలాపాలను  దగ్గరగా పరిశీలించీ, ఇతణ్ణి ఆశ్రయించాకనూ కోర్కెలు తీరడంగానీ, సమస్యలు తొలగడంగానీ జరక్క పోగా మరింత దిగజారిన పరిస్థితు లేర్పడ్డ సందర్భాలలో కొందరు కన్నులు తెరచి సందేహించడం, ప్రశ్నించడం, వ్యతిరేకించడం, నిగ్గదీయడం లాటి చేదు అనుభవాలు ఎదురై క్రమంగా ఎక్కువవుతూండడమూ, వివేకవంతులు కొందరిలో చైతన్యం ఏర్పడి ఈతడి కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ రచ్చకీడ్చే యత్నం చేస్తుండడం మొదలైంది (ఉదా:- ఈతడి శిష్యుడుగానే చాలాకాలం . కొనసాగి ఈతని అనుపానులన్నీ కనిపెట్టి గుట్టురట్టు చేస్తున్న అజిత్ కుమార్, మరియు తమిళ పత్రిక "నకీరన్”; ఇండియన్ ఎక్స్ ప్రెస్(97 మార్చి 8,10,12) ఇతని భాగోతాన్ని బయట పెట్టినవి. బెంగుళూరు నుండి మరో పత్రికా ఇతగాడి పై ధ్వజమెత్తింది. పురాణాల ప్రకారం అవతార పురుషుడైన కల్కి ఆ పురాణాల ప్రకారమే రావలసిన కాలంగానీ, పుట్టే చోటుగానీ ఈ దొంగ పుట్టిన చోటు, వచ్చిన చోటు కాకపోవడంచే పురాణ విశ్వాసుల్లోనే కొందరు పురాణా లాధారంగానే ఇతగాడు దొంగ కల్కేగాని ! ?! అసలు కల్కి గాదని తెగేసి చెప్పారు. ఈమధ్య ధవళేశ్వరం స్వామి బహిరంగంగానే ఇతడు కల్కి అయ్యే అవకాశంలేదని ప్రకటించాడు. ఈ రకంగా నాల్గువైపుల నుండి వచ్చే తాపుల్ని ఆపుకోలేక గట్టిగా కాపుకాసేవారూ లేకపోవడంతో ఒక క్రొత్త పన్నాగం పన్నారు. కల్కి హిమాలయాలలోని 'శంబల' గ్రామం నుండి రావలసి ఉందని. అందుకే ఈయన 'ప్రస్తుతం అక్కడున్నారు అన్న ప్రచారంచేసి దర్శనం కూడా లేకుండా చేశారు. ఇక ఏ బాధా లేదులే అనుకున్నారు.

                  నోట్ :- హిమాలయాలు, శంబల గ్రామము అను వాటి కథ చాలా పెద్దది. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన ప్రామాణిక గ్రంథంగా ఎంచబడుతున్న మేడం బావెట్స్కీ రచించిన 'సీక్రెట్ డాక్ట్రిన్' అన్న రచనలో దాని ఆధారాలు లభిస్తాయి. దానిని నెత్తి నెత్తుకునే అనిబిసెంట్ జిడ్డు కృష్ణమూర్తిని జగద్గురువుగా, మరో క్రీస్తుగా ప్రచారం చేసి లోకం నెత్తి కెక్కించాలనుకున్నది.  జిడ్డు కృష్ణమూర్తిలోని నిజాయితీ, సత్యాన్వేషణా తత్పరత, వాస్తవాలను గమనించినంతలో ప్రకటించగల నిర్భయత తగినంతగా ఉండడంతో సమాజం ఆ ప్రమాదం నుండి బైటపడింది. జగద్గురువూ లేడు మరో క్రీస్తూ లేడంటూ ప్రకటించి అప్పటికి తన చుట్టూ అల్లబడ్డ సంస్థనే రద్దుచేసి ఒంటరిగా బైట పడ్డాడు. దాని సంగతి మరోసారనుకుందాం. అదుగో ఆ పుస్తకంలోని నిజానికి లేని శంబల గ్రామానికి వెళ్ళిపోయాడు మన కథానాయకుడు వంచనా శిల్పి 'కల్కి' అనబడే విజయకుమార్.

                 ఈ దొంగ నాటకానికి సంబంధించిన ఒక రుజువు అజిత్ ద్వారా మన కందింది. అతడు - కల్కి - హిమాలయాలకు వెళ్ళాడని ప్రకటించి భక్తుల్ని నమ్మించాక నిజానికి 178 B, కపిలేశ్వర నగర్, నీలంగరై - చెన్నైలోనే ఉంటున్నాడు. అందుకు రుజువుగా అజిత్ అతనితో ఇంటర్వ్యూ తీసుకుని కలసి మాట్లాడిన టేపులున్నాయి. దొంగ బ్రతుకులలానే ఉంటాయి మరి.

              ఈ సందర్భంలో ఈ కథంతా నడిపిన సూత్రధారిని గురించి చెప్పవలసి ఉంది. కల్కి-పాపం నిజానికి ఒక బుద్ధావతారం. అతనొక పాత్రధారి మాత్రమే.  కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ శంకర్ అనువాడు చేశాడు. ఎవరీ శంకర్ ఏమాతని గతం ?

             శంకర్ అనేవాడు  విజయకుమార్-కల్కి-బాల్యమిత్రుడు, హైస్కూలు చదువుల నుండి కలిసి చదువుకున్నారు మద్రాసులో . వీని తల్లి దుర్గా రామ చంద్రన్, భార్య ప్రేమ. సోదరుడు శ్రీరాం (ఇతనికి మానసిక వైకల్యం ఉంది.)

                                                 కల్కి భగవాన్ నాటకంలోని భిన్నాంకాలు

              డ్రామాను డ్రామాగా చూడలేని నైజం మనిషిలో ఉంది.అది మామూలు మనిషిలో మరింతగా ఉంది. ఆ కోణంలో మనిషిని బాగానే - తగినంతగానూ అర్థం చేసికున్న శంకర్ జరగాల్సిన కథనంతా విజయకుమార్ కు ఎక్కించాడు. వీడూ పత్తిత్తేమీ కాకపోవడంతో ఊం  కొట్టేశాడు. ఇది వారి మత డ్రామాకు నాందీ. అయితే దీనికి ముందున్న గతాన్ని కొంత చెప్పుకుంటే గాని దీనికి పూర్వాపర సంగతి-ముందూ వెనుకల లింకు కుదరదు. చదువులో క్రమంగా విజయకుమార్ సాంకేతిక విద్యలో పట్టా పొందగా - శంకర్ భౌతిక విజ్ఞాన శాస్త్రంలో  పి.జి. చేశాడు. అయ్యాక ఏమి చేయాలన్నది ఆలోచించుకుని సోమ్మంగ్లమ్ వయా కొండత్తూర్ నందు 'ది టెంపుల్ ఆఫ్ ది లైట్ ఆఫ్ గాడ్ ' అన్న పేరుతో ఒక ఆధ్యాత్మక కేంద్రాన్ని స్థాపించారు. వి. కుమార్ అనే స్థానికుని స్థలంలో చిన్నపాక వేశారు. ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు జరుగుతాయని ప్రకటించి శిక్షణకు 1100 రూపాయల రుసుము తీసుకున్నాడు. ఆ తరగతులు 11 రోజులపాటు ఉంటాయని తెలిపారు. ఏమైతేనేమి ఆ ఎత్తుగడ ఫలించలా. వచ్చింది తృప్తిని కలిగించలా. దాంతో దానికి గుడ్ బై చెప్పి జిడ్డు కృష్ణమూర్తి సంస్థ నాశ్రయించారు. శంకర్ తల్లి కూడా అప్పటికి అక్కడే ఉండేది. ఆ సమయంలో ఇప్పుడు మా సత్సంగ మిత్రునిగా ఉంటున్న బోధ చైతన్య రుషివ్యాలీ - జె. కె. హైస్కూలు మదనపల్లిలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆనాటికి వీరు ముఖ్యంగా శంకర్ కృష్ణమూర్తి ఆలోచనలకు అనుగుణంగానే దేవుడూ నై, గీవుడూ నై అంటుండేవాడు. ప్రమాణ గ్రంథాల్ని,గురువుల్ని  చెడ తిడుతుండేవాడు. అక్కడే ఉండి సత్యాన్వేషణ చేయడం నిజానికి వారి అంతరంగం కాదు గనుక ఉన్న కాలంలో గ్రంథ పఠనమూ,  స్కూలు నమూనాను అధ్యయనం చేయడమూ సాగించారు. ఇక చాలనుకున్నారు. పరమార్థం పరమావధి కాకపోవడం, అర్థమే పరమార్థం కావడం మూలాన అందుకై తగిన పని గావించి చిత్తూరుజిల్లాలోని కుప్పం దగ్గరలో ఉన్న రామ కుప్పంలో జీవాశ్రమం పేరున ఒక రెసిడిన్షియల్ స్కూలు ప్రారంభించారు.

               ‘విద్యా బోధనలో భాగంగా ఆసనాలు - ధ్యానము నేర్పేవారు. వాటిల్లో కొంత ప్రవేశమున్న విజయ్ కుమార్ ఆపని చూసేవాడు. ఒక స్కూలుగా దానికి కొంత మంచి పేరే వచ్చినా ఆ తరహా గాడిద చాకిరి ఈ తరహా  మిత్ర  ద్వయానికి సంతృప్తినివ్వలా. క్రమంగా విద్యాలయం  ఆధ్యాత్మిక సాధనాలయంగా రూపాంతరం చెందింది. ధ్యానమందిరం ఏర్పడ్డది. దానిపై మత సామరస్య సూచకంగా ఓంకారమూ, క్రాసు, నక్షత్రములు కలసిన ఎంబ్లం కాపీ కొట్టి నిలబెట్టారు.

                [నోట్:- సిద్దాంత ప్రాతిపదికన మత సామరస్యం అసంభవం మతస్తులైనప్పటికీ కలసి జీవించక తప్పని సామాజిక సంబంధాలే భిన్నమతస్తులు కలసి ఉండడానికి వీలు కల్పిస్తున్నాయి. నిజానికీ విషయం పెద్ద పెద్ద పీఠాధిపతులకూ, బడాబడా స్వాములూ, యోగులూ, జ్ఞానులకు తెలిసిచావదు. మందిని మాయబుచ్చడానికి ఎరగా వాడుకుంటున్న ఎత్తుగడ మాత్రమే యిది. ]

                 విద్యాలయాలలో విద్యాభ్యాసం కోసం చేరిన పిల్లల్ని తమ భవిష్యత్ప్రణాళికకు వీలుగా మలచుకున్నారు. ఇక్కడొక ముఖ్య విషయం చెప్పు కోవాలి. ఆరంభంలో "The temple of the light of god" సంస్థ  నాటికి  దేవుడై పోదామన్నంత ఆతృతగానీ, వంచనా శిల్పంలో పరిణితిగానీ లేదు వీళ్ళకు. అంతో యింతో ఆసన ప్రాణాయామాదులెరిగిన విజయకుమార్ పరమ గురువుగానూ, శంకర్ గురువుగానూ మాత్రమే తమను గురించి తాము చెప్పుకున్నారు. అధికాశాపిపాసగల వీళ్ళకు ఆ వేషాల్లో చేయాల్సిన చాకిరీ- వచ్చే ప్రతిఫలము సంతృప్తి నివ్వలా. కనుక దాన్నుంచి J. K. స్కూలు సంపాదన వారినాకర్షించి స్కూలు పెట్టారు. అదీ శ్రమతోనూ, బాధ్యతతోనూ, జవాబుదారీ తనంతోనూ కూడుకున్నదే  అవడం వల్ల అదీ వీరి స్వభానికీ, ఆకాంక్ష పరిపూర్తికి నప్పిందికాదు. ఫైనల్గా ఈ దేశజన మనస్తత్వంలోని ఒకానొక పెద్ద బలహీనతను గుర్తించి దాన్ని తమ లక్ష్యంగా చేసుకుని ఉన్న శక్తుల్ని దానిపై ఎక్కు పెట్టారు. అంతే  ఫటా పట్  అనూహ్యమైన రీతిలో క్లిక్కయిందా టెక్నిక్కు. ఒక దుర్దినాన, ఒక వినాశకర ఉదయాన విజయ్ కల్కి భగవానయ్యాడు. శంకర్ పరమాచార్య శంకర భగవత్పాదుడయ్యాడు. ఈ విధంగా సమాజమనే వృక్షంపైన మరో రెండు బలమైన బదనికలు వేరూనాయి. అదేమిటన్నవాడులేడు. రాత్రికి రాత్రే దేవుడెలాగయ్యావన్న ప్రశ్న వేసినోడులేడు. ఆస్తికతకు ప్రతినిధులం, జగద్గురువులం, సంస్థానాధి పతులం అంటూ వంది మాగధులతో స్తోత్రపాఠాలు చెప్పించుకుంటూ బుభుక్షా ప్రియులై, సోమరులై, లాలసులై, గానుగెద్దులల్లే కళ్ళకు గంతలు కట్టుకుని తిరిగిన గిరిలోనే తిరిగే నైజాన్ని పెంపొందించుకుని బ్రతుకుతున్న ధర్మపరిరక్షకులు మంటున్నవారెవ్వరూ ఇదేమిటని అడిగిన పాపానసోలా.. చూస్తూ ఉరకుండలేని యోచనా పరులు చేసిన హెచ్చరికలు వినీ వినబడనట్లూరుకున్నారు. తేలుకుట్టిన దొంగల్లా గమ్మునున్నారు. ఏమనిపించిందో ఏమోమరి. స్వజాతి అభిమానం అయ్యిండవచ్చునేమో. సమాజాన్ని దండుకోని ఆధ్యాత్మిక కేంద్రాలున్నాయా? నాకు తెలిసిలేవు. మీకెవరికైనా తెలిసుంటే ఆ వివరాలు దయచేసి నాకందించండి. నేను విచారించి చూస్తాను. అలా ఎందుకు జరిగిందో సరే వివరాలు మరోసారి.

              అడిగేవాడులేడు ఆబగా దొరికే అమాయకపు  బొందలెందరో మందలు మందలుగా ఉండనే వున్నారు. మరింకేమి కొరవ. అర కొర సంపాదననుండి కుత్తిక బంటిగా ఏమి చేసుకోవాలో తోచనంతగా వరుంబడి ఆరంభమైంది. సొంత మందిని పెంచి పోషించే స్థాయి ఏర్పడింది. క్రమ క్రమంగా సొంత రక్షణ సైన్యం కూడా భక్తుల రూపంలో పోగయ్యారు. ఒకరంటే ఒకరికి భక్తేమీలేదు. వాత్సల్యమూలేదు. ఎవడి స్వార్థంవాడిది. ఎవడి భయం వాడిది. ఒకడిజుట్టు ఒకడి గుప్పెట్లో ఉండడంవల్ల ఒకరినొకరు కాదనుకునేందుకు వీలులేదు. కనుక కలసికట్టుతనం గట్టిగానేవుంది. ఉంటుంది కూడా.

                దేవుడుకాని ఈ దేవుడు, గురువుకాని ఆ గురువూ కలసి మందిని మోసగించడానికి మంచి పేరుతో అనేక ఎత్తుగడలు - పన్నాగాలు (టెక్నిక్స్) కనిపెట్టారు. ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నిరకాలుగా జనాన్ని దండుకుంటున్నాయో క్షుణ్ణంగా పరిశీలించారు. రజనీష్, మహేష్ యోగి, యోగా థెరఫీ, భక్తి, భజనలు, ప్రాయశ్చిత్త ప్రార్ధన, సాక్ష్యమిప్పించుట, భగవదనుభవాలు రప్పించుటకై హిప్నాటిజం ఇలా అనేక ప్రక్రియలద్వారా జనాన్ని ఆకర్షించి లొంగదీసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు పెట్టి రకరకాలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాటి వివరాలు క్లుప్తంగా వ్రాస్తున్నాను వరిశీలించండి.

                 1) వరయజ్ఞ :- ఇది ప్రవేశ కార్యక్రమం. కల్కి చేత ప్రచారకులుగ నియమించబడ్డ దుండగీళ్ళు ఆయా ప్రాంతాలలో యజ్ఞ కార్యక్రమాన్ని ప్రచారం చేసి వరయజ్ఞంలో పాల్గొనేందుకు సీట్ రిజర్వేషన్ ప్రాతిపదికన ముందుగానే డబ్బు వసూలు చేస్తారు . ఒకొక్కరి నుండి రూ. 300లు పైగా భోజన ఖర్చులు వగైరాలకు అదనం. ఇది దాదాపు ప్రతి వారం జరిగే కార్యక్రమంగా రూపొందించారు. ఎవరో ఒకరిద్దరు డబ్బుకు లొంగేవాళ్ళుగానీ, మూఢ భక్తులుగానీ దొరగ్గానే ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆపై ఒక కౌంటర్ ప్రారంభమవుద్దన్నమాట • ఈ యజ్ఞం పేరు ఒక్క ఆంధ్రలోనే నెలకు 22 లక్షలపైగా ఆదాయం వస్తున్నట్లు అజిత్ అంచనా. 

                2) దైవిక పరిణామ యజ్ఞ :  నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి  ఫీజు రూ. 450/-లు జిల్లా జిల్లాకు సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్యక్రమం తీసుకోవాలన్నది  ప్రణాళిక. ఈలోపు సొంత జీతగాళ్ళు భక్తుల రూపంలో సమాజంలోని వ్యక్తులను ఒప్పించి వారూ ఇందులో పాల్గొనేట్లు బుక్ చేస్తుంటారు. బిజినెస్ సేల్స్మెన్సులాగా నన్నమాట.

              3) ముక్తియజ్ఞ :- 1998 నాటికి ఈ యజ్ఞం జరుపబడుతుందనీ ఆ అవకాశం పోతే తిరిగిరాదనీ ఇప్పటి ఇప్పటినుండే తమ తమ సీట్లు రిజర్వు చేసుకోండని ప్రచారం మొదలెట్టిన కార్యక్రమమిది. దీనిలో  ప్రవేశానికి వ్యక్తికి రూ. 500/-లు ఫీజు వసూలు చేస్తున్నది.

               నివేదిక :- ఇప్పటివరకు జరిగిందాన్నిబట్టే మొదటి రెండు యజ్ఞాలూ ఒక్కొక్కటి వెయ్యి వెయ్యి జరిగినట్లు రికార్డు ఉంది. ఏ రకంగా సంపాదించనీయండి - ఈనాడు కల్కి ఆస్తులు రూ. 200 కోట్ల దాకా ఉండవచ్చని అంచనా. ఈ దోపిడీ కార్యక్రమంలో స్థాయీ భేదాలతో అనేక కార్యకర్త లుంటారు. ఎగ్జిక్యూటివ్స్ గా ధర్మ గురువులనువారూ, భగవద్దాసులనువారూ  ఉంటారు. వీరు ఆయా ప్రాంతాల ప్రజలను ఆకర్షించి దీక్షలిస్తుంటారు. ఈ సెంటర్లలో కార్యక్రమాలు 1) నయన దీక్ష , 2) నామజపం 3) సంకీర్తన 4) నాట్యం వగై రాలుంటాయి.

                ఆయా వ్యక్తుల వివాహపరమైన, ఆర్థిక పరమైన, కుటుంబపరమైన సమస్యల కన్నింటికీ సులభ పరిష్కారాలు లభిస్తాయన్నది ప్రచారంలో ప్రముఖ భాగంగా వుంటుంది. అలా తమకు జరిగాయని డబ్బుకు సాక్ష్యం చెప్పే దొంగ భక్తులు ఏర్పరచబడి ఉంటారు. నిజానికివన్నీ  అబద్దాలే గనుక క్రమంగా ఒక్కొక్కటి బైటపడుతున్నాయి. మోసపోయిన వారెందరో ఉన్నప్పటికీ జరిగింది చాలులే అని ఎవరికివారు  గమ్మునుంటుండడంతో ఎక్కువ విషయాలు బైటికి పొక్కడంలేదుగానీ ఇదంతా వంచన అని గుర్తిం చిన వారెందరో ఉన్నారు.

                  స్వయంగా శంకర్ ర్ తమ్ముడైన శ్రీరాంకు మెంటల్. అతడికి అది తగ్గలా పైగా  పెద్దలిద్దరూ కలసి తగ్గించలా. అయితే అలా నిగ్గదీసి అడిగేవారి నోరు మూయించడానికి భారతీయ కర్మ సిద్ధాంతంలో గొప్ప గొప్ప చిట్కాలున్నాయి. వాడికర్మ పరిపాకంకాలా. అందుకే స్వామి వెయిట్ చేస్తున్నారు లాంటి సమాధానాలు రెడీమెడ్ గా ఉన్నాయి. కానీ మంద బుద్ధులైన  ప్రజలు మరైతే మాకర్మ పరిపాకంకాక మాకు నీవు చేసేదేమిలేదుగదరా దొంగతొత్తు కొడకా అని అడగరు. ఒకప్రక్క ఆశాభయాలు, మరోవంక ఉదాసీనత కలబోసుకుని వంచకులు ఆడిందాటగా పాడింది పాటగా సాగిపోతోంది.

                  ఇలా వ్రాస్తూపోతే పెద్ద గ్రంథం తయారవుతుంది. సారాంశంగా చెప్పుకోవలసిన మాటలు చెపుతాను పరిశీలించి వంట బట్టించుకోండి.

                  హిందూ ఆస్తిక సిద్ధాంతపరంగా :- ప్రామాణిక గ్రంథాలుగా చెప్పవలసింది ముందు వేదం, పిదప ఉపనిషత్తులూ, దర్శనాలు ఆపై ధర్మ శాస్త్రాలు, వీటి తరువాత కడకు వచ్చినవి పురాణాలు.

                    కల్కికి సంబంధించిన ప్రస్తావన పురాణ భాగానికి చెందింది. వేదంలో గానీ, దర్శనాలల్లోగానీ, ఉపనిషత్తుల్లో గానీ లేదు. ఎందుకంటే అవన్నీ ఆస్తిక సిద్ధాంత ప్రతిపాదన రూపాలు గనుక. ఇది- కల్కి భావన - ఆస్తిక సిద్ధాంత రూపమైంది కాదు గనుక.

                 భారతీయ ఆస్తిక తత్వ చింతనలో ప్రధానాంశాలు జీవేశ్వర ప్రకృతులు. అవి అనాది నిత్యాలు. అందు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వశ క్తివంతుడు,సర్వజ్ఞుడు. వైదిక, దార్శనిక ఔపనిషదిక ఈశ్వరుడు అవతరించడమే సాధ్యపడని, అవతరించాల్సిన పనిలేని సకల గుణ సామర్థ్యయుతుడు. సంకల్ప మాత్రంచేత  సర్వ బ్రహ్మాండాలనూ లీలామాత్రంగా నియమించగలవాడు. పరిమితుడైతేగానీ రాకడ పోకడ సాధ్యంకాదు. పరిమిత శక్తి వంతుడైతేగానీ రావలసిన అవసరంలేదు. ఈ రెండూ లేవు గనుక అవతార వాదమే తప్పు  సైద్ధాంతికంగా. (నోట్ :- ఈ అంశం ఆస్తికత స్వరూప స్వభావాలూ పూర్వా పరాలు అని రాబోయే  సంచికలలో విపులంగా వివరిస్తాను.) కాల్పనిక రచనలైన పురాణాలను అక్షర సత్యాలుగా స్వీకరించడం ఒక అవివేకంకాగా కథలోని పాత్రలను విడచి సారాంశాన్ని గ్రహించాలన్న ఇంగితజ్ఞానాన్ని విడచి పాత్రలను చారిత్రకాంశాలుగా స్వీకరించడం మరో బుద్ధిలేనిపని. ప్రజలలోని ఆ బలహీనతల్ని ఆసరా చేసుకుని సందుకీ, గొందుకీ, దేవుళ్ళమంటూ పుట్టు కొస్తున్నారు ప్రజా పీడకులూ, ప్రబుద్ధులూ. అలా సిద్ధాంతపరంగా అవతార వాదమే తప్పు.

                  ఈ మధ్య పురాణాల వలలో పడిఉన్నవారే అయిన ఒకరిద్దరు స్వాములు ఒక ప్రకటన చేశారు. పురాణాల ప్రకారమే ఈ కల్కినంటున్న వాడు దొంగ కల్కేనని. కల్కి పురాణం ప్రకారంగానీ, సీక్రెట్ డాక్ట్రిన్ లాటి మరికొన్ని రచనలవల్లగానీ, ఈ మదరాసు ప్రాంతపు విజయకుమార్ లెక్క ప్రకారం రావలసిన కల్కికాదు. రావలసి ఉందనుకుంటున్న అసలు కల్కి గెటప్పూ ఇదికాదు.

                  1. నిజానికీ నాటకమంతా ఒక దొంగ గుంపు చేసే  తతంగమే. 

                  2. తెలిసిగానీ, తెలియకగానీ ఈ గుంపుకు కొమ్ముగాసే వాళ్ళంతా కొద్ది కాలంలోనే సమాజ న్యాయస్థానం ముందు దోషులుగా చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుంది. చరిత్రలో దొంగలుగానే ముద్రపడడమూ జరుగుతుంది.

                  3. కల్కి పేరున ప్రచారమైన అసాధారణ సూచనక్రియలు ఏమీ వాస్తవాలు కావని రుజువు చేయడానికి మేము సిద్ధం. మేముకోరే ఏ సూచన క్రియ ఆయన చేయగలరేమో రమ్మని బహిరంగ సవాలు విసురుతున్నాము. 

                 4. రాజకీయంగా సమర్థత, పలుకుబడి, ఆర్థికంగా మంచి స్థితీ కలిగున్న వారు కొందరతని కొమ్ము కాయడం జరుగుతోంది. అంతటివారే భక్తులయ్యారు కనుక సత్యమే అయ్యుంటుందన్న భ్రమలోపడి అమాయకులు మందలుగా ప్రవేశించడం జరుగుతోంది. నిజానికి పై చెప్పిన డబ్బు, అధి కారము కలవాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్షేత్రాలలో సమర్థులేమోగాని ఈ అంశంలో వారు సాధారణ మానవులే. పైగా స్వాములవారినుండి స్వార్థం నెరవేరడమో మరొకటో మనస్సులో  పెట్టుకుని వారికి వత్తాసు  చెపుతున్నారు. సాయిబాబా దగ్గరకు ప్రధానిగానీ, ప్రెసిడెంటుగానీ వచ్చి దండా లెట్టడమూ, ఈ కల్కికి మొక్కి శంకర్ కు ఆతిధ్య మిచ్చి మన ముఖ్యమంత్రి గౌరవించడం లాటివన్నీ తెలియని తనం నుండి ఏర్పడ్డ తప్పు నిర్ణయాలే. ఒక వంక ప్రజా సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాల్ని రూపొందిస్తూ మరో వంక ప్రజా పీడకులకు అండదండలు చేకూర్చడం విచారకరం. ముఖ్యమంత్రి త్రికరణ శుద్ధిగా ప్రజా శ్రేయస్సును కోరుకుంటున్నట్లైతే ఈ దేవుణ్ణంటున్న వాణ్ణి వత్తిడి చేసైనా ఆస్తికతకు ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాధిపతుల సమక్షంలో విచారణకు నిలవమని ఒప్పించాలి. అలాగే ఆస్తికత  పేరున జరుగుతున్న ఈ నాటకమంతా దొంగాటకమే ననిపిస్తే మతాచార్యు లందరూ కలిసి ఈ కథ నాపు చేయించాలి. అలాకాక ఈ కల్కివారి పెద్దలు చెప్పిన కల్కేనని నమ్ముతుంటే వచ్చి దర్శనం చేసుకుని అర్చనాధికాలు నిర్వర్తించుకోవడం, తమ శిష్య గణాన్నంతా ఈ సాక్షాద్భగవంతునికి అప్పగించడం చేయాలి. కనీస ఆస్తిక విశ్వాసాని కది గుర్తు. లేకుంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచు కున్నట్లవుతుందీ రభసంతా. అవసరమైనపుడు వాస్తవాల్ని ప్రకటించలేని ఈ పెద్దలు వేష గాండ్లేనని తేలిపోతుంది.

               మిత్రులారా! ప్రతిఘటించండి. పరీక్షకు రమ్మనండి. వీరితో మీరెవరు పంతమాడినా ఐక్యవేదిక మీ వెంటనంటి ఉంటుంది.

               ఆస్తికులారా ! దొంగను దొంగనలేని, దొంగల నెదిరించడంలో కలసి కట్టుగా నిలబడలేని మీ పరిస్థితి నొకతూరి అంచనా వేసుకోండి. వంటిగా చేయలేక ఊరుకుండి వుండవచ్చు. జంటగా మేమున్నాము. రండి ఐక్యవేదికలో చేరి చరిత్రలో మంచికై నిలచిపోరాడుదాం.

                                              స్పందన - ప్రతిస్పందన

                 మిత్రులారా! ఒక సందర్భంలో వెంకటాద్రే పల్కిన మాటలను స్మరించుతూ ఈనెల స్పందన ప్రతి స్పందనలను వివరించుదాం. అందరకూ వర్తించేమాట ఎవరి నుండి వచ్చినా స్వీకరించడం సబబు. అవసరంకూడా.

                 "గోరా వంటి వ్యక్తులపట్ల మనకు గౌరవం వుండవచ్చు. కానీ వారి అభిప్రాయాల మంచి చెడ్డలను బేరీజు వేసుకోవడంలో అభిమాన దురభిమానాలు మనకు అడ్డురాకూడదు.” (చార్వాకుల చర్చ అను గ్రంథమునుండి]

                  ప్రస్తుత స్పందనలోని ప్రధాన భాగం వెంకటాద్రి  అభిప్రాయాలపై విచారణ రూపంగా ఉండడంతో పై ఆయన మాటలకు మరింత విలువ ఏర్పడింది. కనుక ఆయన అభిమానులూ, అనుయాయులూ - వ్యతిరేకులూ కూడా పె సబబైన మాటను ఊతగా గొని విషయ విచారణ చేయడం వివేకవంతమైన పని. ఈమాట చెప్పకున్నా, పోయిన నెల 'హేతువాది'లో ఆయన వాతబడిన వారెలాగూ ప్రతి చర్యగా స్పందిస్తారు గనుక వారిని విడచి, వెంకటాద్రిని గౌరవించే వాళ్ళందరకు చిన్న విన్నపమొకటి చేస్తున్నాను. దయచేసి మరొక్కసారి హేతువాది '153' మార్చి 97 - సంపాదకీయం "పులి వేషాలు - ప్రక్క వాద్యాలు" క్షుణ్ణంగా చదవండి. ఆయనే అన్న అభిమాన దురభిమానాలు అడ్డురాకుండా దాని ఆయన వెలిబుచ్చిన భావాలలోని - సబబుచేసబబుల్ని వివేకించండి. అంటీ ముట్టనట్టు ఊరుకున్నట్లైతే హేతుపద్ధతిగానీ, సత్యస్థాపనోద్ధతిగానీ, సమాజహితకాంక్షానిబద్ధతగానీ లేనట్లే అనుకోవలసి వస్తుంది. హేతువాద, నవ్య మానవవాద ప్రముఖుల స్పందన కొరకై ఎదురుచూస్తాను ఈ నెలంతా. పైనెల 'వివేకపథంలో' నావైపు నుండి వివేచన నారంభిస్తాను. దీనిని కూడా పైన ఆయనన్న మాటల పై ఆధారపడే ( అభిమాన దురభిమానాలు విడచి) సబబు బేసబబుల్నివివేకించుదురుగాని.

స్పందన-1 : పులివేషాలు - ప్రక్క వాద్యాలు ఒక స్పందన అంటూ ఇంకొల్లు నుండి రావి సుబ్బారావు గారిలా వ్రాస్తున్నారు.

            1) హేతువాది మార్చి 1977 సంచిక సంపాదకీయం 81 పేజీ  మూడవ పేరాలో ఎవరు ఏ పేరుతో సంఘటితమైనా, ఆ సంఘటనలోని భాగస్తుల మూల సిద్ధాంతాలను మనం విస్మరించడానికి వీలులేదు. లక్ష్యాలు భిన్నమైనపుడు కలసి పోరాడడమనేది సాధ్యంకాదు.” అని వ్రాశారు.

            కానీ భిన్న సిద్ధాంత కారులు భిన్న లక్ష్యాలు కలిగి ఉన్నప్పటికీ సమాజ హితకాంక్షులు సమాజంలోని ఏదైనా వంచన, లేక మోసాన్ని ఎదుర్కో టానికి కలసి కృషి చేయలేరా? ఎంతవరకు కృతకృత్యులౌతారనేది వేరే విషయం. తెల్ల దొరలను భారతదేశం నుండి ప్రారద్రోలడానికి భిన్న సిద్ధాం తాలవాళ్ళు కలవలేదా? సంఘటితమైనవారు ఎవరో, ఎందుకు సంఘటిత మైనారో, ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారో తెలుసుకోకుండానే పోరాటమనేది సాధ్యంకాదని - అనవచ్చా? చట్టబద్ద, చట్టరహిత పోరాటాలలో వీరిది ఏ కోవకు చెందిందో ఐక్య వేదిక నన్నవారికి తెలుసా?

               2) నాల్గవ పేరాలో "ఆర్య సామాజికులు ఆస్తికులు వేదాలను  ఈశ్వరుడే ఇచ్చాడంటారు. నాల్గు వర్ణాలు దైవ సృష్టిలోనే ఉన్నాయంటారు. వారితో కలసి ఎవరి మీదనో ఆందోళన జరపడమేమిటి? ఐనపుడు వారిమీద హేతువాదులు ఆందోళన జరపాలా? వద్దా? అని వ్రాశారు.

  ఆర్య సామాజికులు ఆస్తికులు. హేతువాదులు నాస్తికులు. ఆస్తికులూ నాస్తికులూ సాంఘిక రాజకీయ ఆర్థిక, మానవాది హక్కుల కోసం కలసి ఆందోళనలు జరపలేదా? జనాభాలో 0.1 శాతం కూడా లేని హేతువాదులొక్కరే ఇతరులతో కలవకుండా అన్నీ సాధించారా? ఎవరి సిద్ధాంతాలు వారికుంటాయి.  సిద్ధాంతాల విషయంలో ఎవరిదోవ వారిదే. సిద్ధాంతాల జోలికి పోకుండా సమాజ హితాన్నికోరే మానవులుగా సమాజంలో జరుగుచున్న వంచన లేక మోసాన్ని ఎదిరించుటలో నైతిక వత్తాసు ఇవ్వవలసిన కనీస బాధ్యత హేతువాదులకు లేదా?

              3) 5వ పేరాలో ధర్మమంటే మతం. తిరుపతిలోని ధర్మ ప్రచార సభవారు ఏ మత ప్రచారం కోసం ఓ స్వాములవారిపై ఆందోళనకు పిలుపు యిస్తున్నారు? తిరుపతి వేంకటేశ్వరస్వామిపై ఆందోళనకు వారు ఎందుకు  పిలుపు ఇవ్వలేదు?" అని వ్రాశారు. 

            ధర్మం అంటే మతం అన్న ఒక్క అర్ధమే ఉందా? ధర్మ మన్నదానికి ఉన్న విస్తృతార్థం వదలి సంకుచితార్థాన్ని తీసుకోవడం ఏమి సబబు? విధి నిషేధాత్మికం ధర్మం. చేయవలసిన పనులు చేయడం, చేయకూడని పనులు చేయకుండడం ధర్మం. భారతంలోని ఒరులేయవి యొనరించిన... పరమధర్మ  పధముల కెల్లన్, అనే పద్యం అంద రెరిగినదే కదా! ధర్మానికి సంకుచితార్థం తీసుకుని తిరుపతి ధర్మ ప్రచారసభ వారిపై ఒక విసురు విసరడ మేమిటి? వారు యితరులతో కలసి సమాజాన్ని వంచిస్తున్న ఏ స్వామినైనా ఎదుర్కొన కూడదా? తిరుపతి వెంకటేశ్వరస్వామిపై వారు చేపట్టిన కార్యక్రమ మేమిటో తెలుసా ?

             4. 82 పేజీ చివరి పేరాలో అలా తంతారనే భయంతోనే సత్య సాయిబాబా లాటి  పెద్దస్వాముల జోలికి పోకుండా చిన్న చిన్న స్వాములమీద  ఆందోశన జరపడానికి పైసంఘటన వారు పూనుకున్నారని గూడా ఈ వ్యాసం రాయడానికి కారణమైన మార్క్సిస్టు మిత్రులు నాతో చెప్పారు అని రాశారు.

            చెప్పుడు మాటలకు ఎంతవరకు విలువ నివ్వాలి? పై సంఘటన వారు ప్రస్తుతం ఏ స్వామిని సాధించడం లక్ష్యంగా ఎందుకు పెట్టుకున్నారో, సత్య - సాయిబాబాని ఎందుకు వదిలారో ఆ చెప్పిన మార్క్సిస్టు మిత్రులకేమైన తెలుసా? ఎవరైనా ఏ కార్యక్రమం చేపట్టినా ఏది ముందు ఏది వెనుక అనేది వారు నిర్ణయించుకుంటారు గానీ మధ్యలో ముందు వెనుకల ప్రసక్తి ఇతరులకు ఎందుకు?

5. 83వ పేజీ రెండవ పేరాలో  "ప్రజల్లో వికాసం కల్పించడానికి బదులు వారు మనల్ని ప్రతినిధులుగా పంపినట్లు మనమే ఎదుర్కోవడం ప్రారంభిస్తే.... 84వ  పేజీలో కుక్కపని గాడిద చేసినట్లు.... హేతువాదులు చేయాలనడం వివేకవంతం 'కాదు' అని రాశారు.

            నాకు తెలిసినంతవరకు ప్రజల్ని వికాసవంతుల్ని చేయడం - ప్రజలే వారి పనులు వారే చేసుకునేట్లు దోహదపడడం (Help them to help themselves) అన్నదే ఇటీవల ఏర్పడిన ఐక్యసంఘటన వారు చేస్తున్న పని. నా అభిప్రాయంలో సమాజంలో హేతువాదులు 0.1 కాదు 0.01 శాతం ఉంటారేమో. మరి హేతువాదుల ప్రచారాలు, కార్యక్రమాలు ఎవరి కోసం? మిగతా వారితో కలిసినప్పుడు నష్టపోయేది ఏదైనా ఉంటే గింటే హేతువాదులా?  విశ్వాసులా?  అంటే హేతువాదులకు వారి హేతువాదం మీదనే విశ్వాసం సడలినదనుకోవాలా?

            ఇతరులను ముట్టుకోకూడదు. ఇతరులతో పొత్తు పెట్టుకోరాదు. అనుకున్నప్పుడు సామరస్యపూర్వక సహకార సంబంధాల ప్రసక్తికి తావెక్కడ? అంటూ ముగించారు.

ప్రతిస్పందన: సుబ్బారావుగార్కి ! పెద్దలేఖ రాశారు. అంతో యింతో సాహసం కూడా చేసినట్టే. ప్రతిస్పందన వెంకటాద్రి నుండే రావడం సబబు. వ్య క్తిగత దూషణలు కాకుండా విషయపరంగా స్పందించండని ఆయన్నూ ఈ రూపంగా ఆహ్వానిస్తున్నాను. ఒక్క విషయం చెప్పి ఆగుతాను. అపరిణి తుడుగా, జిజ్ఞాసిగా తనను తాను గుర్తించుకునే దశలోని వెంకటాద్రిలో గోచరించిన హేతుత్వస్థాయి, ఎంతో పరిణితుణ్ణని తలపోస్తున్న ఈనాటి వెంకటాద్రిలో చాలా అధమస్థితికి పడిపోయిందన్నదో నిష్ఠూర సత్యం. దీనికి ఆధారాలు చూపండని పత్రికాముఖంగా ఆయనగానీ ఆయన అభిమానులుగానీ స్పందనకు రాస్తే నా ప్రతిపాదనలోని వాస్తవం పాలేంతో వివరిస్తాను. అది సరే, మీరు జాగ్రత్త. మీ రసలు హేతువాదులు కాదనే ప్రమాదం దగ్గరలో ఉంది. వారూ, వారి వారూ మీవీ మతభావాలేనన్న తీర్మానం చేస్తారేమో కూడా వేచిచూడాల్సి ఉంది. చూద్దాం

స్పందన–2 : ఆ.ప్ర. హేతువాద సంఘ అధ్యక్షులు గుత్తా . రాధాకృష్ణ గారు ఇలా వ్రాస్తున్నారు.

          పులివేషాలు-ప్రక్క వాయిద్యాలు" అనే పేరుతో 'హేతువాది' పత్రికలోని సంపాదకీయం చూచాను. అది వెంకటాద్రిగారు రాశారా లేక ఆయన ప్రక్క వాద్యకారులు రాసి ఆయన పేరు పెట్టారా అనే సందేహం కలిగింది. వెంకటాద్రిగారు తన తాత్విక స్థాయినుండి దిగజారి ఇలాంటి చవుకబారు రచన చేయరని నేననుకోవటం కారణంగా అటువంటి సందేహం నాకు కలిగింది. అందులో అశాస్త్రీయమైన ఆలోచనలు, వైరుధ్యాలు వుండటంతో పాటు సభ్యతకాని భాషను ఉపయోగించటం అనేది కూడా మరొక కారణం. 

            "లక్ష్యాలు భిన్నమైనపుడు కలిసి పోరాడడమనేది సాధ్యపడదు" అన్నారు. భావసారూప్యం గల సంఘాలమధ్య ఐక్యత ఎందుకు కుదరటం లేదో చెప్పలేదు. ఒకే సంఘంలోని వ్యక్తులమధ్య ఐక్యత లేకపోవటానికి కారణా లేమిటో నా కర్థం కావటంలేదు.

             "తంతారనే భయంతోనే సత్యసాయిబాబా లాంటి పెద్ద స్వాముల జోలికి పోకుండా చిన్న చిన్న స్వాములమీద ఆందోళన జరపటానికి పూనుకున్నారని కూడా ఈ వ్యాసం వ్రాయటానికి కారణమైన మార్క్సిస్టు మిత్రుడు నాతో చెప్పారు” అంటూ రాశారు. స్వబుద్ధి లోపించి చెప్పుడు మాటలకు ప్రాముఖ్యత నివ్వటం వారి స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది.

               మరోమాటగా, ఆ మార్క్సిస్టు పేరైనా చెప్పివుంటే ఆయన ఏపాటి మార్క్సిస్టో మాకూ అర్థమయ్యేది.

               ఈ వ్యాసంలోనే మరొకచోట "కుక్కపని  గాడిదచేసి నడుం విరగ గొట్టించుకున్నట్లు” అన్నారు. మార్క్సిస్టు-రాడికల్ హుమనిస్టు ఒకచోట జేరి చేసినపని అదే ననిపిస్తున్నది. గాడిద పాత్ర (అరవటం) కుక్క పాత్ర (కరవటం) ఎవరిది ఏ పాత్రో అర్థం కావటంలేదు. ఇది ఏమి శాస్త్రీయతో అర్థంకావటంలేదు.

                ఈ వ్యాసంతో కనిపించే ఆనేక అశాస్త్రీయ భావాలవల్ల ఈ వ్యాసం రావిపూడివారు వ్రాసింది కాదని, ఆయన భజంత్రీలు వ్రాసి వారి పేరు పెట్టారని అనుకోవలసి వచ్చింది.

               ఒకవేళ వారే రాసివుంటే సక్రమంగా ఆలోచించగలం అనుకునే మిగిలిన సంపాదక వర్గమన్నా ఆపి వుండవలసింది. కనీసం హేతువాదుల మర్యాదన్నా దక్కిఉండేది.

స్పందన-3 : జగన్ మోహన్ రావుగారు, చీరాలనుండి ఇలా వ్రాస్తున్నారు: గౌరవనీయులు ‘హేతువాది' పత్రిక సంపాదకులు రావిపూడి వెంకటాద్రి మాస్టరుగారికి నమస్కారం. కల్కి మొదలగు అవతారాలకు మరికొందరు దొంగస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యంకల్గించుటకు లక్ష్యింపబడిన వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక పై 'హేతువాది'లో మీరు వ్రాసిన సంపాదకీయం చదివాను. నేను కూడా ఐక్యవేదికలోనూ, ముఖ్యంగా పర్యటనా కార్య క్రమంలో కొంతవరకు క్రియాశీలక పాత్ర వహించాను కనుక మీ సంపాదకీయంపై స్పందించడం తప్పనిసరి అవుతుంది. దీనిపై హేతువాదు లనేవారు ఎవరితోనైనా పత్రిక ద్వారాగాని, బహిరంగసభ ద్వారాగాని చర్చకు నేను సిద్దం. చర్చల ఫలితంగా ప్రస్తుత భావాలు మార్చుకోవలసివస్తే మార్చుకుందాం. విషయానికి వద్దాం.

                  1. శీర్షిక “పులివేషాలు-ప్రక్క వాద్యాలు" పత్రిక స్థాయిని దిగజార్చుతుంది. ఇతర ఉద్యమకారులను చిన్నబుచ్చటమే మీ లక్ష్యంగా కనబడుతుంది. శీర్షికను ఇతర హేతువాదులు మెచ్చుతారనుకోను.

                  2. హే.మా. ఉద్యమాల లక్ష్యం క్రింది స్థాయినుండి విప్లవం తేవడం అన్నది నిజమే. హే,మా. సంఘాల కార్యక్రమం ఎట్లా ఉన్నాగానీ, ఐక్య వేదిక కార్యాచరణ అదే గదా?

                  3. ఆందోళనోద్యమాలు నిరాశకు చిహ్నాలు అన్నారు. నిరాశావాదులు క్రియాశీలురు కాలేరు. ఆశాజీవులు మాత్రమే కోరుతున్న మార్పు తెచ్చుకొనుటకు ప్రయత్నం చేస్తారు. ఐక్యవేదిక అలాంటి ప్రయత్నమే చేస్తుంది. కావున ఐక్య వేదికకూ, మీ ఊహల్లోవున్న ఆందోళనోద్యమానికి తేడా ఉందని గ్రహించగలరు.

                4. ఇతర సిద్ధాంతకారులతో కలసి ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమించడం కుదరదు అన్నారు. కాని చరిత్ర విరుద్ధంగా ఉంది. 1975 ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అనుకూలంగా జరిగిన ఉద్యమంలో R.S.S. జనసంఘ్ (ఇప్పటి B.J.P.) లతో అన్నిరకాల వాళ్లూ హేతువాదులతో సహా కలసి పనిచేసారు. ఫలితం మనకు తెల్సిందే. అంతే కాదు ఫాసిజం యొక్క ప్రమాదాన్ని గుర్తించి భారతీయులు మిత్రరాజ్యాలకు యుద్ధంలో తోడ్పడాలని M.N. రాయ్ వాదించాడు. భిన్నలక్ష్యాలు కలిగి వున్నా, ఉమ్మడి శత్రువును ఎదుర్కోటానికి రాయ్ ఆ విధంగా సలహా యిచ్చాడని చాలా గొప్పగా చెప్పుకుంటూ వుంటాం. మరి ఇప్పుడు అదే విధానం అహేతుకంగా ఎలా కన్పిస్తుంది?

                5. ఐక్యవేదికలోని సంఘాలు వాటి సిద్ధాంతాలను విస్మరించాల్సిన అవసరంలేదు. కాని ఉమ్మడి లక్ష్యం ఒకటి ఉన్నప్పుడు ఐక్యం కావాల్సిన ఆవశ్యకతను వివేకంతో గుర్తించాయి.

                6. ఆర్యసామాజికులు ఆస్తికులే కాని విగ్రహారాధనకు, అవతారాలకు, దొంగ స్వాములకు వారు వ్యతిరేకం. అందుకే ఐక్యవేదికలో భాగస్వాములయ్యారు. సిద్ధాంత చర్చలు చేయడం ఐక్యవేదిక బయట జరుగవచ్చు. ఒకరికొకరు విమర్శించుకోవచ్చు.

                 7. "ధర్మం అంటే మతం" అని వ్రాశారు. మాస్టారూ! నిస్సందేహంగా అది పొరబాటు. (వివరణ కావాలంటే చర్చలు పొడిగిద్దాం. ముందు ముందు జరిగే చర్చల్లో వస్తుంది) ధర్మానికి మీ రిచ్చుకున్న ఆ అర్థమే తిరుపతి వారి ధర్మాచరణ మండలి ఒక మత సంస్థ అనే అపోహను మీలో కల్గించింది. వాస్తవం తెలియక విమర్శ చేస్తే హేతువాదులం ఎట్లా అవుతాం ?

               8. ఐక్యవేదికను స్వైర్యం చేసే మూకలు నడిపే ఆందోళనోద్యమముగా మీరు ఊహిస్తున్నట్లున్నారు. అందుకే దేవాలయాన్ని పడగొడ్తారేమో ప్రజలు తంతారేమోనని హెచ్చరిక చేస్తున్నారు. ఐక్యవేదికలో అలాంటి సభ్యులు ఎవరూలేరు, కొంతమంది హేతువాదులూ ఉన్నారు.

               9. 0.1 శాతం కూడా లేని హేతువాదులు మూఢవిశ్వాస సిద్ధాంత ప్రచారకులపై చేసే దండయాత్రలు కేవలం పత్రికలో ప్రచారంకోసమేనని వ్రాశారు. అలాగైతే ఇక హేతువాదులు అలాంటి దండయాత్రలు చేయటం మానేయాలి. ముఖ్యంగా ఇప్పటికీ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నందుకు, గతంలో T.V. ప్రోగ్రాముల్లో పాల్గొన్నందుకు హేతువాద నాయకులు పశ్చాత్తాపం వెలిబుచ్చాలి.

                10. ప్రజల్లో, స్వాములకు, బాబాలకు, అమ్మలకు వ్యతిరేకంగా వికాసం కల్గించాలని వ్రాశారు. కార్యాచరణ ఎలా ఉండాలో వివరించండి. ఆందోళనోద్యమాలకువలే కార్యక్రమాలుండరాదు. బహిరంగ సభలు జరుపరాదు. వ్యూహాలు చేయరాదు. ప్రచారం కోసం పత్రికల్ని T.V. లను ఉపయో గించుకోకూడదు. గతంలో మీరు వ్రాసినట్లుగా ఇతర ఆస్తిక సంఘాలతో గాని, వ్యక్తులతోగాని చర్చలు చేయనక్కర్లేదు. ఇవేవీ వద్దనుకుని ప్రత్యామ్నాయ వికాస మార్గాన్ని సూచించండి.

               11. మనదేశం స్వాములకు గొడ్డుపోలేదు కదా! అంటే నిజమే, తంతారేమోనని, ఫలితం వచ్చేలోపు మన జీవితాలు చాలవని మేధావులు నిరాశతో ఉంటూ, అనుచరుల్ని నిరుత్సాహపరుస్తూ వుంటే, సమాజంలో ప్రజల సమస్యల పట్ల ఉదాసీనత కనబరుస్తుంటే, ఐక్యవేదికలను భగ్నం చేస్తుంటే, నేడు మొక్క దశలో ఉన్న ఏ స్వామియైనా రేపు మహావృక్షంలా పెరిగిపోడూ!

               12. డా॥ A.T. కోవూర్ పర్యటన సత్యసాయికి ప్రచారం తెచ్చిందన్నట్లుగా వ్రాశారు. ప్రశాంతి నిలయంలో హత్యల తరువాత సాయిపై భక్తి మరింత పెరిగిందని  వ్రాశారు. కాని వాస్తవం యేమంటే స్థబ్దతతో ఉన్న హేతువాద ఉద్యమానికి A. T. కోవూర్ పర్యటన మళ్ళా పునరుద్ధరణ కల్గించింది. దాని ఫలితమే "చార్వాక” మాసపత్రిక జననం. అలాగే పురాణాల్ని ఒక పట్టుబట్టి కవిరాజు హేతువాదానికి రూపు నిచ్చారు. అంతేకాక అనేక బహిరంగసభల్లో హేతువాది సంచికల్లో సాయిబాబాను మీరే స్వయంగా విమర్శించినట్లు పత్రికా రిపోర్టులున్నాయి. సంపాదకీయంలో ఉదహరించిన కథలో లాగా మీరూ అవివేకంగా విమర్శించినట్లేనా ?

                   13. ఐక్యవేదిక మీరు చూసిన ఆందోళనోద్యమాలకు వలె హింసాత్మకం కాదు. 14-1-97న విజయవాడలో జరిగిన ఐక్య వేదిక జనరల్ బాడీ సమావేశంలో ప్రముఖ హేతువాది, ఇంకొల్లు రాడికల్ హ్యుమనిస్ట్ సెంటర్ స్థాపకుడు అయిన శ్రీ రావి సుబ్బారావుగారు ఇదే అంశాన్ని లేవనెత్తగా ఐక్య వేదిక అహింసాత్మకంగా ఉంటుందని జనరల్ బాడీ తీర్మానించింది.

                    పై కారణాలవల్ల ఐక్యవేదికపట్ల మీకున్న అపోహలకు, అపార్థాలకు తెరదించి కలసిరండి. ఐక్యవేదికకు చేయూత నివ్వండి. మరోసారి పిలుస్తున్నాం. మా కోసంకాదు. మీరు కోరుకుంటున్న సమాజ నిర్మాణానికై అందరం ఐక్యంగా కృషిచేద్దాం. శలవు.                                               ఇట్లు 

                                                                                                                                                       మీ జగన్ మోహన్.

                నోట్ :- 1. పై వ్యాసం కేవలం హేతువాది సంపాదకీయం వరకే పరిమితి చేయబడింది. దీని అనుబంధ వ్యాసం "భావోద్యమాలు - ఆందోళనోద్యమా"లును ముందు ముందు చర్చల్లో విశ్లేషిద్దాం.

                  2. ఈ స్పందనకు ప్రతిస్పందించేవారు ఎవరైనా చేపట్టే శైలిమీదనే తరువాత నా చర్చాశైలి ఆధారపడుతుందని మనవి. 

ప్రతిస్పందన: హేతువాదులు కొందరైనా మిగిలియున్నందుకు సంతోషంగా వుంది. నిజమైన హేతువాది వ్య క్తులను విడిచి విషయాన్ని మాత్రమే నిష్కర్షించి వుండగలగాలి. బలహీనంగానైనా, హేతుత్వం కలిగి బ్రతికియున్న హేతువాద సంఘాలను ఆరోగ్యంగానూ, బలంగానూ ఎదిగేట్లు చూచుకోవలసిన బాధ్యత ఉన్న కొద్దిమంది హేతువాదులమీదనే వుంది. ఈ విషయం శాస్త్రీయ దృక్పథము కలిగిన వారందరికీ పునరాలోచించుకోడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అసలు ప్రతిస్పందన వెంకటాద్రిగారికి సంబంధించి వుండడంచేత ఆ విషయం వారికి, వారి మిత్ర మండలికి వదిలి ఇంతటితో నిష్క్రమిస్తాను.

 స్పందన 4: కొత్తపల్లి నుండి వెంకటేశ్వరరెడ్డిగారు : ఈమధ్యనే ప్రమోద చైతన్యగారిని నంద్యాలలో కలిశాను. వారు ఆస్తి నాస్తి విషయమై అడిగారు· దేవుణ్ణి విశ్వసించే వాళ్ళంతా ఆస్తికులు, అలా విశ్వసించనివాళ్లు నాస్తికులు కదా ! ఆస్తి నాస్తి కాకుండా మధ్యన ఇంకేముంది? సురేంద్రేమో ఈ రెండూ నేను కానంటాడు. సత్యాన్వేషణలో ఆయన తెలుసుకోబోతున్న సత్యపదార్థమేది? చెప్పమనండి చూద్దాం. వసుధైక కుటుంబం అంటే ఏమిటో చెప్పి, ఆయన కుటుంబానికి అన్వయించమనండి చూద్దాం అంటూ ముగించి ఈ విషయం ఆయనకు రాయండి అన్నారు. ఈ విషయమై మీరే ఆయనతో డైరెక్టుగా మాట్లాడండి అని చెప్పాను. ఇదీ విషయం అంటూ రాశారు. 

ప్రతిస్పందన:- రెడ్డిగార్కి, నా ఆరోగ్యం బాగానే ఉంది. ముందుగా మీకు నా సూచన ఏమంటే, ప్రమోద చైతన్య ఏమన్నారు అన్నది అలా ఉంచండి. మీ వరకు మీకు మీ గురించి ఏమనిపిస్తోంది. అలా అనిపించడం సరైనదే అని నిర్ధారించుకోడానికి మీ వద్దనున్న ఆధారాలేమిటి? నేను వ్రాసిన ఆస్తికత-నాస్తికతలలో నాపోకడలపై మీ స్పందనేమిటి? నేనెందుకు ఆస్తికుణ్ణిగానీ, నాస్తికుణ్ణిగానీ కాలేకపోతున్నానో వివరించిన అంశాలలోని లోపాలోపాలేమిటో ఆలోచించండి. ఎవరికివారుగా తానున్నచోటు సరైనదేనని నిర్దారించుకోగలగాలి. సమాజానికి ఆ విషయం చెప్ప బూనుకుంటే నిరూపించగలగాలి. ఈ రెండూ చేయని, చేయలేని వారితో వాదప్రతివాదాల నవసరం. కనుక ముందుగా మీరేమిటో మీ కొరకుగా మీరు తేల్చుకోండి. ఆ మీ నిర్ణయం నా భావాల కనుగుణంగా ఉంటే ఆయనతో మీరే మాట్లాడండి. లేకుంటే నా కర్థమయ్యేట్లు చెప్పండి.

                   ప్రమోద చై తన్యగార్కి :- తెలిసి అస్తికుణ్ణవడం ఎలా కుదరడంలేదో నా వ్యాసంలో వివరించాను. నేను నాస్తికుణ్ణా కాదా అన్నది అలా ఉంచుదాం. ఆస్తికేతరుణ్ణన్నది నిజం. కనుక మీ పక్షం వాణ్ణికాదు. మీరున్న పక్షంలో నిరూపణకు నిలిచే సత్తావుంటే "ఆ స్తిక స్వరూప స్వభావాలు-దాని వాస్తవా వాస్తవాలు" అన్న పేరున చర్చావేదిక నేర్పాటు చేస్తాను. మీరు గానీ, మీకు నచ్చిన మరెవరుగానీ ఆస్తికతను ప్రతిపాదించి నిర్దారించవచ్చు. అలా జరిగిన నాటి నుండి ఆస్తికుణ్ణవడానికి నాకెట్టి అభ్యంతరంలేదు. తెలియని విషయాలు నెత్తికెత్తుకుని, తెలిసిన వారివలె బోర్డు పెట్టుకుని బజారున పాడతమ్  నా నైజం కాదు. ఈ విషయంలో మీతో సహా ఆస్తికు లందరూ ప్రతిపాదిస్తున్న విషయంలో జ్ఞానం లేనివారే. అథవా వ్యపదేశమాత్ర  జ్ఞానులే. నిజానికి తత్త్వతః అద్వైతి ఆస్తికుడు కావడానికి వీలులేదు. అందుకే వైదికులందరూ (ద్వైత, విశిష్టా ద్వైత, ఆర్య సామాజికులు) శంకరుణ్ణి అవైదికుడన్నారు. అసలింతకూ మీరు ఆస్తికులా? అద్వైతులా? ఆస్తికులూ అద్వైతులూ కూడానా? నాకు తెలిసినంతలో ఆస్తికత అవశ్యం వాస్తవాలుగా అంగీకరించాల్సిన విషయాలు మూడున్నాయి.

                1. ప్రకృతి అనాది, నిత్యము, సృష్టికి ఉపాదానము, జీవునికి భోగ్యము.

               2. ఉన్న ప్రకృతిని సృష్టి, స్థితి, లయ రూపాలలో పరివర్తింపచేయు చేతనశ క్తి ఈశ్వరుడు. ఈతనికి అతడు చేయు కర్మరీత్యా మూడు గుణాలు లేక సామర్థ్యాలు తప్పక ఉండాలి. సర్వవ్యాపకత, సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం . ప్రకృతికి భిన్నుడై  పై మూడు గుణాలు కల చేతనుడు ఈశ్వరుడు. అతడు

నియామకుడు.

             3. స్వయంగా తన కవసరం లేకున్నా ఎవరి కొరకు ఈశ్వరుడు ఈ ప్రకృతి పరిణామానికి నిమిత్త కారణం అవుతున్నాడో వాడు జీవుడు. వీడూ చేతనుడే. ప్రకృతికి భిన్నుడే. ఈశ్వరునికీ భిన్నుడే. జీవుడు కర్మబద్ధుడు. జన్మాంతరాల్ని పొందుతాడు. ముక్తి పరమ సాధ్యంగా యధాశ క్తి యత్నిస్తుంటాడు.

                చేతనులైన జీవేశ్వరులనూ, తద్భిన్నమైన ప్రకృతినీ, పరలోకాన్నీ, జన్మాంతరాలనూ అంగీకరించక ఆస్తిక్యం లేదు. అద్వైతం వాస్తవానికి వేవీ లేవంటుంది. కనుక అద్వైతి వైదికుల ప్రకారం ఆస్తికుడు కాదు. మరి నాస్తికుడు కూడా కాదు. మరింకేమిటి. "ఆస్తికుడు- నాస్తికుడు - భావవాది" ఈ ముగ్గరకూ తేడా ఉంది. అది తెలిస్తేగాని అద్వైతి ఆస్తికుడు కాకుండా భావవాదెలా అయ్యాడో అర్థంకాదు. ఈ వివరం మీకు తెలీదన్నది నిజం. నిజాన్నింగీకరించడానికి చాలా నిజాయితీ అవసరం. సాహసం, సత్యనిష్ఠ అన్నవీ తగినంతగా ఉండాలి. తెలియాల్సిన విషయాలు తెలియవలసిన రీతిగా తెలియకుండగనే కొన్ని నిర్ణయాలకు వచ్చిందిగాక వాళ్ళదగ్గరా  వాళ్ళదగ్గరా పెడప్రశ్న లెందుకు? రండి మనిద్దరం మాట్లాడుదాం. ఏకాంతంగా మాట్లాడు కుందామన్నా,నలుగురిలో బహిరంగంగా మాట్లాడుదామన్నా నేను రెడీ ముందు మీరు అద్వైతో, ఆస్తికుడో, రెండూనో ప్రకటించండి. ఆ విషయంలో నేను ఆస్తికుణ్ణి నాస్తికుణ్ణి కాదని ప్రకటించే ఉన్నాను. తేలినవైపు ఇరువురం కదలాలన్నది నిమయం.

              ఇక వసుధైక కుటుంబ భావన గురించిన మీ రడిగిందేమిటో సరిగా అర్థంకాలా "అదీ ఆయన కుటుంబానికి అన్వయించమనండి" అన్న మాటల వెనుక మీ ఆంతర్యం ప్రకటిస్తేగాని సమాధానం సరిగా చెప్పడం సాధ్యపడదు. నిజానికి వసుధైక కుటుంబ భావన నాలో యింకా స్థిరపడలా. అదింకా సాధ్యంగానే ఉంది నా వరకు నాకు, అయినా ఆ దిశలో పురోగతి సాగుతోంది నాలో అన్నది నాకు నేనుగా గమనిస్తున్న అంశం. అది చర్చల్లో తేల్చడం కష్టం. అయినా దానినీ చర్చనీయాంశంగా తీసుకుని విచారించి చూద్దాం అంటే నాకెట్టి అభ్యంతరం లేదు.

                చూడగలిగే నేర్పు ఓర్పు ఉంటే రామానుజ, మధ్వ, దయానందాది ఆస్తికులు తమ సిద్ధాంత గ్రంథాలలోనే శంకరుణ్ణి, అద్వైతాన్ని ఏమన్నారో చూడండి. ఈ పని చేయలేను అని మీరంటే మీ కొరకూ, మరి నలుగురి కొరకూ వారి సిద్ధాంత గ్రంథాలలోని అ విషయం ఎత్తిరాస్తాను పైసంచికల్లో. వారందరి సంగతలా ఉంచండి. మనిద్దరం సరైందేమిటో తేల్చుకుందాం. రండి. తేలినవేపు కలిసినడుద్దాం మిత్రులమల్లేనే. విషయాన్ని విడచి అనవసరపు రాద్దాంతం చేయనంతవరకు పత్రికలో మీ స్పందనకు స్థలం కేటాయిస్తాను. చర్చా వేదికే ప్రధానంగా అభిలాషణీయం 1) ఆస్తికత గురించీ, అద్వైతం గురించీ గత సంచికల్లోని నా భావాలపై నిరూపణకు నిలవగల  మీ విమర్శను పంపండి.

               గమనిక :- పాఠకుల ఆలోచనలకు పదునెట్టే ఒక విషయం రాస్తాను. కార్యకారణవాదాన్ని   ఆస్తికులూ, నాస్తికులూ కూడా అంగీకరిస్తారు పరిణామశీలమైన ప్రకృతి వాస్తవం కనుక. కార్యకారణాల వాస్తవికతను సత్యంగా అంగీకరించకుంటే ఈశ్వరుడు [నియామకుడూ, నిమిత్త కారణుడూ] అవాస్తవం అయిపోతాడు. అదే [జీవేశ్వరులు అవాస్తవం అనే] శంకరుడు చెపుతాడు. శంకరుడు కార్యకారణ వాదాన్నిగానీ, ప్రకృతి పరిణామాన్నిగానీ [నిజానికి ప్రకృతినే] అంగీకరించడు. అతనిది వివర్తవాదం. మరోరకంగా అజాతవాదం. కార్యకారణ వాదానికీ వివర్త (అజాత) వాదానికీ ఉన్న విబేదం - వై రుధ్యం - తెలిసిన  అద్వైతి ఉంటే రమ్మని ఆహ్వానిస్తున్నాను తత్త్వ చర్చావేదిక పైకి.  అలా అద్వైతం సత్యమనీ, బ్రహ్మవివర్తమే ఈ నానాత్వమనీ, అజాత వాదమే సరైన వాదమనీ అంటూనే తామూ ఆస్తికులమని చెప్పడం చూస్తుంటే అటు ఆస్తికతగానీ, ఇటు అద్వైతంగానీ వారికి వంట బట్టలేదని తేలుతోంది.

అవన్నీ అలా ఉంచండి. మేకేమి తెలుసో, ఆ తెలిసింది సత్యమోకాదో నన్నది తేలిందోలేదో తేల్చండి. ఆపైన ఆ జ్ఞానం మీ బ్రతుకులో ఏ రీతిగా పని చేస్తోందో పరీక్షించడానికి అవకాశమివ్వండి.

                అలాగే నాకేమి తెలిసిందో, అది సత్యమని తేలిందో లేదో, అయినా ఇంకా సత్యాన్వేషిగానే ఎందుకుంటున్నానో, ఎవరుగానీ సిద్ధపడితే చెప్పడానికి నేను రెడీ నా బ్రతుకుని పరీక్షించండి. అనాచర్యలు మనమధ్య వద్దు.

మీ చిన్మయా మిషన్ ప్రధాన వాదమైన సాక్షి  ఫిలాసఫీ (నిజానికది ఫిలాసఫీ కూడా కాదు. శంకరుని ప్రకారం సాక్షిత్వం అధ్యారోపమే.] అద్వైతాన్ని ప్రతిపాదించలేదు. కనీసం రెండు లేక సాక్షి అన్నదే పొసగదు.

              సూచన :- గతంలో 6, 7 సంచికలో అద్వైత స్వరూప స్వభావాలుగా శంకరాదుల పోకడ వైఖరిని ప్రతిపాదించి దాదాపు 10 మంది ప్రసిద్ధులైన అద్వైతులకు ప్రతిపాదన సరిగా జరిగిందో లేదో నిర్ధారించండని తెలియపరిచాను. ఇంతవరకు ఒక్కరు ముందుకురాలా. వారందర్ని అలా ఉంచండి. అద్వైతంపై చర్చ నేర్పాటు చేస్తాను. మీరుగానీ మీకు నేర్పిన వారుగానీ చర్చకు సిద్ధపడగలరేమో  తేల్చండి. వేదిక పైకివచ్చి సత్యాన్వేషణ చేసి నన్ను తెలియని వాడిగా తేల్చి నాకు మార్గదర్శకులుకండి. ఆ పని చేయలేకుంటే నిజాయితీగా ప్రచార కార్యక్రమాన్ని మాని నా దర్శకత్వంలో సత్యాన్వేషణకు సిద్ధంకండి. నిజాయితీ విషయంలో స్థిరత్వం లేనివాడు తాత్విక పంధాలో ఒక మనిషిగా ఉండడానికే అర్హుడుకాడు ఆస్తికుడైనా. నాస్తికుడైనా, మరోటైనా, మరోటైనా. వ్యక్తిగత విమర్శలనాపి విషయపరంగా మీరెంత దూకుడును ప్రదర్శించినా విజ్ఞతతో స్వీకరిచగలను వేదికమీద కలుద్దాం. మీకిప్పటికి వాస్తుదోషాలు పట్టువదల్లా. గ్రహబలాల పీడా పీడిస్తోనే ఉంది. నిజమైన ఆస్తికుడికి సైద్ధాంతికంగానే పై రెంటి పట్టు ఉండదు. ఆ రెండూ పట్టాయంటే అవగాహనలో మరింత బ్రష్టస్థితిని సూచిస్తాయి. ఇన్ని అపసవ్యతలు పెట్టుకుని నన్నెంచడం.

                                      సిద్ధాంత వేత్తల- ప్రచారకుల వైఖరి - ఒక పరిశీలన-2

           యోచనాశీలురైన మిత్రులారా! సత్యజ్ఞానం యొక్క అవసర మేమిటో ఎంతో సరిగా గుర్తించగలిగితేగాని, అసత్య జ్ఞానంవల్ల కలిగే చెడులేమిటో ఎంతో తగినంతగా బోధపడదు. ఆయా సిద్ధాంతాల-భావజాలాల-పరిశీలన- విచారణ కొనసాగించే ముందు ఆ పనెందుకు చేయవలసి ఉందో తెలుసుకుని ఉండడం అవసరం. లేకుంటే అదంతా లక్ష్యశుద్ధిలేని, అవగాహనా పూర్వకం కాని అనవసరపు చాకిరే అవుతుంది. ఈ ఆంశంపై ఈనాటి వారికంటే వెనుకటి వారిలో ఎంతో స్పష్టమైన అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది వారి వారి రచనల నారంభిస్తూ వారువెళ్ళడించిన అభిప్రాయాల్ని కొన్నింటిని పరికిస్తే. అందులో అతి ప్రధానమైనది,అందరకూ వర్తించేదీ సామాన్యమైనదీ, "అనుబంధ చతుష్టయం." 

            అనుబంధ చతుష్టయం :-అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనము. అన్న నాలిగింటినీ అనుబంధ చతుష్టయమంటారు. ఒక రచన ఎవరి నుద్దేశించో, రచనలోని విషయమేమిటో అధికారియైన పాఠకునికీ, విషయానికీ ఉన్న సంబంధ మేమిటో, ఆ సంబంధం వల్ల అధికారిలో ఏర్పడ్డ ప్రయత్న సాఫల్యరూపమైన ప్రయోజన మేమిటో, ఆ రచన చదవడానికి ముందే విచారించుకుని తరువాతే ఆయా గ్రంథాలను అధ్యయనం చేయడం సబబు .

                 కానీ ఈ నాడా అంశము మరుగున పడిపోయింది. అధవా అప్రధానంగా ఎంచబడుతుంది.

ముఖ్యగమనిక: 1997, ఏప్రియల్ 15, 16, 17 తేదీలలో క్రైస్తవం (బైబిలు సిద్ధాంతము) పై చర్చావేదిక, ఏప్రియల్ 18వ తేదీ వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక సర్వసభ్య సమావేశము, నారాయణం గోపాలకృష్ణారావు కళ్యాణ భవన్, కోట నాగభూషణం వీధి, హనుమాన్ పేట, శంకరమఠం వెనుక సందు, విజయవాడ-3 లో జరుగుతుంది. Ph. 76993 Code, 0866.

                                                                                                                                                          సత్యాన్వేషణలో

                                                                                                                                                                               మీ

                                                                                                                                                                          సురేంద్ర


 

No comments:

Post a Comment