Thursday, April 1, 1993

ప్రమాణ వివేచన-14

సంపుటి 3                        సంచిక 4                                                           01-04-1993
అన్ని ప్రమాణాలకూ ఆధార పీఠంగా ఉండ దగిన (ఉన్న) ప్రత్యక్షంతో ప్రారంభించి తగినంతగానూ దానిని విచారించి చూశాము. అయినా మరల సరి చూసుకోవలసిన, ఎవరెవరికెంతెంత అవగాహన ఏర్పడిందో పరీక్షించుకోవలసిన అవసరం ఉండనే ఉంటుంది. అలానే ప్రత్యక్షం తరువాతి చెప్పకోవలసిన జ్ఞాన సాధనమైన అనుమాన ప్రమాణాన్నీ సంపూర్ణంగా కాకపోయినా ఎక్కువగానే విశ్లేషించి చూశాము. అందులో భాగంగానే జిజ్ఞాసువులకూ, పరీక్షకులకూ కూడా ఆలో చించడానికి పనికి వచ్చే కొన్ని సంఘటనలను ఎవరికి వారుగా ఆలోచించడానికి అందించాను. అనుమాన ప్రమాణానికి ఉన్న విస్తృత పరిధినీ ప్రామాణికత (శక్తి) రీత్యా బలహీనమైన దాని పరిమితినీ. దృష్టినిడుకునే దానిని తాత్కాలికంగానే ముగించుకున్నాము. ఆయా సందర్భాలలో, వినియోగంలో దానిని పరీక్షించి చూసుకుంటే తప్ప దాని స్వరూప స్వభావాలు యథాతథంగానూ సరిగానూ అర్థం కావు. ప్రస్తుతం ప్రమాణ క్రమంలో మూడవదీ (చివరిదీ), విశ్వాసులకాధారమైనదీ, స్లామర్థ్యత రీత్యా జ్ఞానసాధనంగా చాలా బలహీనమైన దైనప్పటికీ ఎక్కువ మందిచే ప్రజల ప్రమాణంగా స్వీకరించబడుతున్నదీ, ఆ కారణంగానే ప్రజలు రకరకాల సైద్ధాంతిక వర్గాలుగా చీలి ఘర్షించుకుంటానికి హేతుభూతంగా ఉంటున్నదీ ఈ శబ్ద ప్రమాణం. అయితే యధాతథంగా దాని స్వరూపాన్ని అర్దం చేసికుని, దానికున్న వాస్తవమైన శక్తినీ, పరిమితినీ గ్రహిచి అది పని చేయగలంతలోనే ఉపయోగించుకుంటే మనిషికి చాలా కోణాల్లో ఉపయోగపడగలదు కూడా, ఈ ప్రమాణం.
Note :- శబ్ద ప్రమాణం అన్నమాట విచారణలోనూ, వినియోగంలోనూ తరచుగా తప్పుగా గ్రహింపబడుతూ, నిర్వచింపబడుతూ వస్తున్నది. అయినా నిత్యజీవితంలో మిగిలిన, రెండు ప్రమాణాల కంటే ఎక్కువ వినియోగంలో ఉంటూ విషయ సేకరణలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తోంది ఈ ప్రమాణం. ప్రత్యక్ష,పరోక్ష జ్ఞానాలకున్న స్థాయి భేదాన్ని క్షుణ్ణంగా గమనించగలిగితే మాత్రం ఈ శ్రవణ నేత్రం' ఎంతో విశ్వాన్ని ఛాయామాత్రంగానైనా మన మనోఫలకంపై ముద్రించగలదు. శబ్ద ప్రమాణం స్వరూపరీత్యా సాంకేతికమైనది. సమాచార రూపంలో మాత్రమే విషయాన్నందించగలదు. దీనిని సంపూర్ణంగా గ్రహించాలంటే ముందుగా భాష పుట్టుపూర్వోత్తరాలు [బాష పుట్టుక, శక్తి-పరిమితి) అర్థం చేసికోవలసి ఉంటుంది. Note అన్న దాన్ని మరొక్కసారి చదివి దీని భావాన్ని గమనించండి ముందు. పిదప ప్రారంభించండి,  శబ్ద ప్రమాణ పరిధుల్ని వీక్షించడం.
పరోక్షజాన సాధకాలకు ఒక సామాన్య లక్షణముంటుంది. ఏదో ఒకటి ప్రత్యక్షమవుతుంది, దాని ఆధారంతో దానితో సంబంధపడిన మరొక దానిని గురించిన జ్ఞానం కలుగుతుంది. అనుమాన, శబ్ద ప్రమాణాలకు రెంటికి ఇది వర్తిస్తుంది. రెంటికీ స్మరణయే ఆధారంగా ఉంటుంది. ఏ రకమైన సంబంధాలు అనుమాన ప్రమాణంలో పనిచేస్తుంటాయో, మరి ఏ రకమైనవి శబ్ద ప్రమాణంలో వినియోగంలో ఉంటాయో తెలియడం వలన  ఆ రెంటి మధ్య తేడా ఎక్కడుందో తెలుసుకోగలం. ఈ సందర్భంలో అనుమాన ప్రమాణాన్ని ఒకసారి స్మరించండి. అక్కడ పక్ష ధర్మత-హేతువు ఎక్కడ గోచరిస్తుందో అక్కడే సాధముంటుంది అన్నది  ప్రధాన పాత్ర వహిస్తుంది. శబ్ద ప్రమాణంలో ఆ నియమం లేదు. పైగా సాంకేతిక సంబంధ స్మరణ( ఈ సంకేతాఅనికి అర్ధమిది అన్న స్మృతి-ప్రముఖ భూమిక వహిస్తుంది. సంకేతం ప్రత్యక్షమై సంకేతి (సంకేతం దేనిని చూపగలదో అది) తెలియబడితే, అక్కడ పని చేసింది శబ్ద ప్రమాణం, కలిగింది. శాబ్దీ ప్రమ. ఇదంతా భాషతో ముడిపడి ఉన్న అంశం గనుక ముందు భాష అంటే ఏమిటి? దాని పుట్టుక(ప్రధమ రూపం) ఏది? దానికి ఇప్పటికున్న రూపాంతరాలేవి? అన్నది శబ్ద ప్రమాణాన్ని అర్ధం చేసికునేందుకు తెలుసుకోవలసి ఉంది.
                భాష:- తనకు కలిగిన అనుభవాల్ని గుర్తు పెట్తుకునేందుకు ఆయా అనుభవాలకు మనిషేర్పరచుకున్న గుర్తులే భాష అంటే. సూత్రప్రాయంగా చెప్పుకోవాలంటే అనుభవ సంకేతాలే భాష. ఇది అక్షర సముదాయ రూపము. ఏకాక్షరమో, కొన్ని అక్షరములు కలసో అర్ధయుక్త శబ్దంగా మారినపుడు, దానిని పదం అంటాము, పదమంటే అర్ధయుక్త శబ్దమన్న మాట. అట్తి పదముల సముదాయము వాక్యము.
                Note:-పద పదార్ధ సంబంధ జ్ఞానం లేని వారికి వాక్యార్ధ జ్ఞానం కలుగదు అన్నది సార్వత్రిక నియమం. దీనిని ఈనాడు సరిగా గ్రహించిన వారు బహు కొద్ది మంది ఉంటారేమో! అదీ సందేహమే.
                పదం తెలియడమంటే ఏమిటో, పదార్ధం తెలియడమంటే ఏమిటో పద పదార్ధ సంబంధ జ్ఞానం కలగడమంటే ఏమో అర్ధం కానంతవరకు జ్ఞానార్జన పేరిట అజ్ఞానాన్ని పోగుచేసికోవడమే మనిషి చేసేది. ఈనాడు పుస్తక జ్ఞానం కోకొల్లలు. మస్తక జ్ఞానులు వేళ్ళ మీద లెక్కించడానికి కూడా దొరకడం లేదు. పరిశీలించి చూస్తే కేవల పుస్తక జ్ఞానం సత్యాసత్యాలు నిర్ధారించుకోడానికెంత మాత్రమూ పనికిరాదని తెలిసిన వారెందరు? అసలు ఈ నా మాట విని అపహాస్యంగా నవ్వుకునేవారే ఎక్కువ మంది ఉండవచ్చు. శబ్ద ప్రమాణం పట్ల సమాజం పెంచుకున్న అనవసరపు అభిమానం అట్టిది. ప్రమాణాల బలబలాలు, స్వరూప స్వభావాలు ఎరగనితనం నేడు సమాజంలో చినావారి నుండి మేధావులమనుకునే వారి వరకు పాదుకుని ఉంది. ఏ విషయాలనైనా వేటి ద్వారా మనిషి తెలుసుకోగలడో అలా తెలిసిన వాటిలోని వాస్తవావాస్తకాలను విడగొట్టి చూడడమెలానో  వాటిని గురించి తెలివి లేకపోవడం, తెలుసుకునే యత్నమైనా చేయకపోవడం నిజంగా శోచనీయం గదా.
                ఉదాహరణల రూపంలో చూద్దాం ఈ విషయాన్ని మరింత స్పష్టత కొరకు. ఆయ వ్యక్తుల మాటలో, రచనలో ఈ రోజు మనకు ఆయా విషయాలను గురించి తెలుసుకునేందుకు ఉపకరణాలవుతున్నాయి కదా. పలానా విషయం నీకెలా తెలిసింది అని అకణ్ణడిగామనుకోండి. మా గురువుగారు చెప్పారనో, ఆ మహానుభావుని ఉపదేశం వలననో, పలానా గ్రంధం ద్వారాననో చెపితే అది శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమన్న మాట. ఆ విధానం ద్వారా ఏది తెలిసిందంటున్నాడో అది అతనికింకా తెలియవలనే ఉందన్నది అసలు నిజం. ఈనాడు లోకం దీన్ని గ్రహించడం లేదు, అంగీకరించడం లేదు. అందువల్ల ఏమవుతోంది? తెలియకనఏ తెలిసిందనుకునే భ్రాంత స్థితి ఏర్పడుతోంది. అందువల్ల అతనా విషయం తెలుసుకునే అవకాశాన్ని కూడా చేజేతులా జారవిడచుకుంటున్నాడు. ఇంత ప్రమాదకరమైన ఈ అంశం పట్ల పండిత, పామరుల్నిరువురనూ మేల్కొలలేని శోచనీయ పరిస్థితి ఏర్పడి ఉంది సమాజంలో.
                దీనికంతటికీ మూలకారణం తెలియడమంటే ఏమిటో, ప్రత్యక్షం ద్వారా తెలిసిన దానికీ, పరోక్ష రూపాలైన అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా తెలిసిందానికి ఉన్న వ్యత్యాసమేమిటో తెలియకపోవడమే. పరోక్ష జ్ఞాన సాధకాల ద్వారా ఏది తెలిసిందనుకుంటున్నామో అది నామ మాత్రపు తెలియడమె. అదింకా తెలియవలసే ఉంది.
                ఉదా:-నీవు ఆనంద స్వరూపుడివి-అయినా దుఖితుణ్ణి అనుకుంటున్నావు అని ఒక ధోరణి స్వామి చెప్పారనుకోండి. శ్రోత అది విని అర్ధమైందంటున్నాడు, తెలిసిందనుకుంటున్నాడు. మరొకరితో వాదులాటకు దిగి నేనానంద స్వరూపుణ్ణే. కాని దుఖించుకుంటున్నాను అని రగడ చేస్తున్నాడు. అదెలాగని తర్కిస్తే మాత్రం మనకింకా అనుభవం లేదుగానీ అది పచ్చి నిజం అంటున్నాడు. ఈనాడు ఆస్తిక ప్రపంచంలో ప్రభంజనంలా సాగుతున్న భావమిది. నాకు తెలీదుగాని అది నిజం అన్న మాట తనను తానే బలహీనపరచుకుంటుంది. నాస్తిక,హేతువాద,కమ్యూనిజమాదిగాగల వర్గాల్లోనూ తెలియని విషయాలపట్ల తెలుసుననే మొండి వైఖరిని అవలంబించడం, పిడివాదాలు సాగించడం జరుగుతూనే ఉన్నా ఆస్తిక వర్గంలో ఇది విశ్వరూపంలో దర్శనమిస్తుంది. తెలిసి మాట్లాడే వాళ్ళూ ఆస్తికుల్లో అత్యల్ప సంఖ్యలోనూ లభించరు. మొండి వైఖరి మాత్రం బండలా కొండలా స్థిరంగా ఉంటుంది. గ్రంధం ప్రమాణం అన్న భావన వారిని జిజ్ఞాసువుల్ని కానివ్వదు. వారిని జిజ్ఞాసువులుగా మార్చుదాం అనుకునే వారి యత్నాలను కొనసాగనివ్వదు. పుస్తక జ్ఞానం, పుస్తక జ్ఞానం, పుస్తక జ్ఞానం. ఇదే ఈనాఅడు జ్ఞాన రూపంలో విలయ తాండవం చేస్తోడి. వివేకాన్ని, యోచననూ అపమార్గం పట్తిస్తోంది.   (సశేషం)


No comments:

Post a Comment