Showing posts with label జ్ఞాన సిద్ధాంతం. Show all posts
Showing posts with label జ్ఞాన సిద్ధాంతం. Show all posts

Thursday, March 23, 2017

ప్రమాణము - ప్రమ - ప్రత్యక్షము



''ప్రమాకరణం ప్రమాణం'' అన్న అర్థంలో దీనిని వాడారు. ప్రమ అనగా ఒప్పు జ్ఞానం అని అర్థం. కరణం అనగా అసాధారణ కారణం అని అర్థము. కనుక ప్రమాణం అంటే ఒప్పు జ్ఞానానికి అసాధారణ కారణం అని చెప్పినట్లయింది. ''అనధిగత అబాధిత విషయజ్ఞేయత్వం ప్రమాత్వం'' అని అన్నారు.

''తద్వతి తత్ప్రకారకో అనుభవం యథార్థం, యథార్థ జన్య జ్ఞానం ప్రమ''

''యథా అర్థో తథా జ్ఞానం యథార్థ జ్ఞానం ప్రమ''

ఉన్నది ఉన్నట్లే కలిగిన జ్ఞానమునకు పెట్టిన పేరే ప్రమ. అట్టి జ్ఞానమును కలిగించు కారణమును ప్రమాణం అంటారు. సత్యాన్వేషణ మండలి ఈ ప్రమాణం అన్న పదాన్ని యథార్థ జ్ఞాన సాధకం అన్న అర్థంలో కాక, జ్ఞాన సాధకం అన్న అర్థంలో వాడుతుంది. అలాగే ప్రమాకరణం అన్న దానిలో కరణం అన్న మాటకు అసాధారణ కారణం అన్న అర్థాన్ని అంగీకరిస్తూనే, వెనుకటి వాళ్ళు చెప్పినదానికంటే మరికొంత విస్తృత అర్థాన్ని చెబుతుంది. ఏదైనా ఒక ఫలితాన్ని పుట్టించటానికి పరికరము, పద్ధతి అన్నవి కూడా అసాధారణ కారణాలు అవుతాయి. ఆ పరికరాన్ని వాడడం వలన ఆ ఫలితం వచ్చింది అన్న సందర్భమూ, ఆ పద్ధతిని వాడటం వలన ఆ ఫలితం వచ్చిందన్న సందర్భమూ, ఈ రెండు సందర్భాలనూ బట్టి కూడా వాటికి అసాధారణ కారణత్వం సిద్ధిస్తుంది. భాషాపరంగా చూస్తే పరికరానికి, విధానానికి కూడా కరణత్వం సిద్ధిస్తుంది అన్నంతవరకూ, సాంప్రదాయక పండితులు అంగీకరిస్తూనే తాము ప్రస్తావిస్తున్న ప్రమాకరణం అన్న శబ్దంలోని కరణం అన్న మాటకు ''తస్మాత్‌ ఇంద్రియం ప్రమాణం'' అనే అర్ధాన్ని చెబుతూ పరికరాన్నే సూచించారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే, ప్రమాణ శాస్త్రంలోని ప్రమాణములు అన్న పేర్లు పరికరములను అనుసరించి పెట్టినవిగా కాక పద్ధతిని అనుసరించ పెట్టినవిగానే తేలతాయి. ప్రమాణ క్షేత్రంలోని కరణం అన్న మాటకు భాషాపరంగా రెండు రకాల వ్యుత్పత్తులున్నాయి.

''ప్రమీయతేయేన తత్ప్రమాణం'' ''ప్రమీయతే అనేన ఇతి ప్రమాణం'' యేన అన్న పదం దేనిచేత అని అర్ధాన్నిస్తూ, పరికరాన్ని సూచిస్తుండగా, అనేన అన్నది ఈ ప్రకారముగా అన్న అర్థాన్నిస్తూ విధానాన్ని సూచిస్తుంది. సాధనం అన్న పదము పరికరాన్ని సూచించేది కాగా, సాధకం అన్న పదము సాధించిపెట్టేది అన్న అర్థములో పరికరాన్ని, విధానాన్ని కూడా సూచించగలుగుతుంది. ఇందులో కరణం అన్నదానికి సాధకం అన్న అర్థం తీసుకుంటేనే జ్ఞాన సిద్ధాంతంలో పేర్కొనబడ్డ ప్రమాణాలను వివరించుకోవడం వీలుపడుతుంది.

అవగాహనా స్పష్టత కొరకు మరికొంత వివరిస్తాను. జాగ్రత్తగా పరిశీలించండి. దీన్ని ఇంత విపులంగా ఎందుకు వివరించవలసి వచ్చిందంటే, ఈ సిద్ధాంత క్షేత్రానికి సంబంధించిన మౌలిక అంశాలలోనే వెనుకటి వాళ్ళతో మేము విభేదిస్తున్నాము. గనుక ఈ విషయంపై మీలో కొంత స్పష్టత రావడంకోసం మరికొంత వివరించవలసిన అవసరం ఉందనిపిస్తోంది.

ప్రపంచంలో ఉన్న జ్ఞాన సిద్ధాంత క్షేత్రాలన్నీ, ప్రమాణాలన్నవాటి పేర్లు ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమానము, అర్థాపత్తి, అనుపలబ్ది, సంభవము, ఐతిహ్యము అంటూ పేర్కొన్నాయి. పైన చెప్పుకున్నట్లు కరణం అన్న మాటకి ఇంద్రియం (పరికరం) అన్న అర్థాన్ని గనుక తీసుకొని పేర్లు పెట్టి ఉంటే, ఆ పేర్లు నేత్ర ప్రమాణం, శ్రోత్ర ప్రమాణం, ఘ్రాణ ప్రమాణము, త్వక్‌ ప్రమాణం, రసన ప్రమాణము అని ఉండాలి. ఎందుకంటే జ్ఞాన సాధనాలు ఇంద్రియాలే గనుక. కానీ ప్రపంచంలో ఎక్కడా, జ్ఞాన సిద్ధాంతంలో ప్రమాణాల పేర్లు అలా పెట్టబడి లేవు. కనుక  పరికరాలను అనుసరించి కాక ప్రక్రియలను అనుసరించే ప్రమాణాల పేర్లు పెట్టబడ్డాయని రూఢి అవుతుంది. అంటే ప్రత్యక్ష పద్దతి, అనుమాన పద్ధతి, శబ్ద పద్ధతి అంటూ చెప్పటమే వాస్తవాన్ని చెప్పటం అవుతుంది. పద్ధతులననుసరించే ప్రమాణాల పేర్లు వచ్చాయి.

సత్యాన్వేషణ మండలి వెనుకటి వాళ్ళతో విభేదిస్తున్న మరోముఖ్యమైన అంశము ప్రమాకరణం ప్రమాణములో ప్రమ అన్న పదానికి సంబంధించినది. జ్ఞాన సాధకాలు అయిన పరికరాలను గాని, పద్థతులను గాని వాడినప్పుడు, ఉన్నది ఉన్నట్లు తెలియడము, లేనిది ఉన్నట్లు తెలియడము జరుగుతున్నాయి. వీటినే మనము ఒప్పుజ్ఞానము, తప్పు జ్ఞానము అంటున్నాము. ఒప్పు జ్ఞానం కలగడానికి, తప్పు జ్ఞానం కలగడానికి కూడా అవే పరికరాలు, అవే పద్ధతులు కారణాలు అవుతున్నప్పటికీ ప్రమాకరణం అన్న పదంలో ప్రమ అన్న పదానికి యథార్థజ్ఞానము అన్న అర్థం మాత్రమే నంటూ వెనుకటి వాళ్ళు చెప్పిన అర్థాన్ని గనుక స్వీకరించినట్లుయితే, తప్పు జ్ఞానాన్ని పుట్టించేదానికి, పరికరాన్ని, విధానాన్నీ వేరుగా చెప్పవలసి వస్తుంది. వాస్తవానికి మన అనుభవంలో అటువంటి వేరే పరికరాలు, విధానాలు లేవు. కనుక భాషను అనుసరించి ప్రమ, భ్రమ అన్న పదాలకి ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న అర్థం చెప్పుకుంటున్నప్పటికీ ప్రమాకరణంలోని ప్రమ అన్న పదానికి యథార్థ జ్ఞానం అనికాక, యథార్థజ్ఞానాన్నీ, అయ్యథార్థ జ్ఞానాన్నీ కూడా సూచించగల 'జ్ఞానం' అన్న అర్థాన్ని చెప్పుకోవడమే సరైనది అవుతోంది. వినియోగంలో సమస్యలు తలెత్తకుండా ఉండడానికి వీలవుతుంది. ఒకవేళ ప్రమ అన్న పదానికి ఒప్పుజ్ఞానం అన్న అర్థం తప్ప, వేరే అర్థం చెప్పటానికి వీలులేదు అనిగనుక అన్నట్లయితే, ప్రమాణములు అన్న పదం స్థానే జ్ఞాన సాధకం అన్న అర్థాన్నిచ్చే పదం వాడటమే సరైనది అవుతుంది. అట్టి యోగ్యమైన పదమన్నా ఏర్పరచుకోవాలి. లేదా ఉన్న పదాన్నే వాడుకోక తప్పని స్థితి ఉన్నట్లయితే ఈ అర్థంలో వాడుచున్నామన్న వివరణ అయినా చేసుకోవాలి. మండలి ఈ విషయంలో ప్రమ, భ్రమ అన్న వాటికి ఒప్పుజ్ఞానం, తప్పుజ్ఞానం అన్న అర్థాలను అంగీకరిస్తూనే, ప్రమాకరణంలో ప్రమ అన్న మాటకు యథార్థ జ్ఞానము అనికాక, జ్ఞానము అన్న అర్థాన్ని కలిగి ఉంది. ప్రత్యక్షములోని వివిధ రకాలైన జ్ఞానం కలుగుతున్న సందర్భంలోనైతే, ఆ రకమైన ప్రత్యక్ష జ్ఞానం కలగడానికి ఇంద్రియమే అసాధారణ కారణమని అంగీకరిస్తుంది. కనుక పైన చెప్పుకున్నట్లు నేత్ర ప్రత్యక్షము, శ్రోత్ర ప్రత్యక్షము మొదలైనవి ప్రత్యక్ష పద్ధతిలో కలిగే జ్ఞానములో వివిధ రకాలు అవుతాయి.

మిత్రులారా ! ఇక మా సిద్ధాంతాన్ని పరిశీలించబోతారు గనుక ప్రమాకరణంలోని ప్రమ అన్నదానికి, కరణం అన్నదానికి పైన మేము అంగీకరిస్తున్న అర్ధాలను మనసులో పెట్టుకొనే అధ్యయనం చేయండి.

జ్ఞానమనగా నేమి? :


ఏదో ఒక విషయాన్ని గురించిన అనుభూతి కలగటాన్ని జ్ఞానం (తెలియడం) అంటారు. జ్ఞానం ఏర్పడుతున్న క్రమం : విషయం లేకపోయినా, జ్ఞానేంద్రియం లేకపోయినా, గ్రహించేవాడు లేకపోయినా, ఈ మూడిటితో ముడిపడి ఒక పద్ధతి ప్రకారం పని జరగకపోయినా అనుభూతి కలుగదు. అంటే తెలియడం జరుగదు. ఆ మూటితో ముడిపడి అనిపించడం అన్నది ఏర్పడే వరకూ జరిగేదాన్ని జ్ఞానం ఏర్పడే క్రమము అంటున్నాము. దానిని సూటైన మాటల్లో ఇలా చెప్పుకోవచ్చు.

















దీనినే అనుభూతి చెందడం అనిపించడం అంటున్నాము. ఈ విషయంలో వెనుకటి వాళ్ళతో సత్యాన్వేషణ మండలి ఒక విషయంలో విబేధిస్తుంది. భారత దేశంలోని ప్రమాణజ్ఞులు జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని ఇలా చెప్పారు.

ఆత్మ మనస్సుతో సంయుక్తమై, ఇంద్రియం ద్వారా విషయాన్ని చేరి విషయాకారాన్ని ధరిస్తుంది. అప్పుడే ఆ విషయంయొక్క జ్ఞానం కలుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిశీలనలు, పై దానికి పూర్తి విరుద్ధమైన రీతిలో జ్ఞానం ఏర్పడుతున్న క్రమం ఉంటుంది అని పరిశోధనల ద్వారా రుజువుచేశాయి. మన అనుభవాలను పరిశీలించి చూసుకుంటే కూడా ఆయా ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలకి సంబంధించి ఆయా ఇంద్రియాలు పట్టుకోగలిగిన మేర సమాచారమే తలకిచేరి, తెలుస్తూ ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. సత్యాన్వేషణ మండలికి దీనిని వివరించే ఒక ప్రక్రియ ఉంది. ''లోపలికి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నావా? బయట ఉన్న విషయాన్ని గమనిస్తున్నావా?'' అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే లోపల చేరిన దాన్ని గమనిస్తున్నామని తెలుస్తుంది. ఈ విషయాన్ని కొన్ని ఉదాహరణలు తీసుకొని పరిశీలించి చూద్దాము.

ఉదా 1 :  కొద్ది దూరంలో ఒక వస్తువు ఉంది. భౌతిక నియమాలను అనుసరించి అది ఒక ఆకారంలోనూ, ఒక పరిమాణంలోనూ, ఏదో ఒక రంగును కలిగి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఆ వస్తువుకి మన కంటికి మధ్య వేరే రంగు అద్దాన్ని పెట్టిచూస్తే, ఆ వస్తువు మనం పెట్టిన అద్దపు రంగు కలిగినదిగా అనిపిస్తుంది. బూతద్దాన్ని పెట్టి చూపినట్లయితే వస్తువు పరిమాణము ఉన్నదానికంటే పెద్దదిగా కనిపిస్తుంది. వక్ర / గరుకు తలం కలిగిన అద్దాన్ని గనుక పెట్టినట్లయితే వస్తువు వంకర టింకరగా కనిపిస్తుంది. పుటాకార అద్దంలో నుంచి చూస్తే చాలాదూరం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి ప్రయోగాలన్నీ వస్తువునుంచి కంటిద్వారా మెదడుకు సమాచారం ఏ రీతిలో చేరితే ఆ రీతిలోనే వస్తువు కూడా ఉంటుంది అన్న వాస్తవాన్ని చూపెడుతుంది. అలాగే మిగిలిన ఇంద్రియాలకి సంబంధించిన అంశాలనీ పరిశీలించి చూసుకోవచ్చు.

ఉదా 2 : ఒక శబ్దాన్ని గురించిన అనుభూతి (జ్ఞానం) కలగాలంటే పై పండితులు చెప్పినట్లు ఆత్మ మనస్సుతో కూడి శబ్దం పుట్టిన చోటుకి వెళ్ళి శబ్ద రూపాన్ని ధరించటం అనేది చాలా అసంబద్దంగా కన్పిస్తుంది. దానికి మారుగా శబ్ద తరంగాలు చెవిని చేరడము, అక్కడ నుంచి ఆ సమాచారము గ్రహణ కేంద్రానికి చేరటము సరైనదిగా అనిపిస్తుంది. మరో ప్రయోగం కూడా చేసి చూసుకోవచ్చు. హటాత్తుగా ఒక విపరీతమైన శబ్దం వినపడితే చెవులు గింగురు మనటము, కొన్ని సందర్భాలలో కర్ణభేరి పగలడము (చిల్లు పడటము) జరుగుతాయన్నది మన అనుభవంలో ఉన్న విషయమే.

ఇలాంటివి ప్రతి జ్ఞానేంద్రియంతో ముడిపెట్టి ఈ క్రమము ఇలాగే ఉందో లేదో పరీక్షించి చూసుకోండి. చాలా విషయాలలో బాగానే ఆలోచించారు అనిపించే వెనుకటి వాళ్ళు ఈ విషయములో ఇంత బండ తప్పు ఎందుకు చేశారో ఒక పట్టాన అర్థం కాదు. వారెందుకు చేశారన్నది ఊహించటాన్ని ప్రక్కనపెట్టి, సాంప్రదాయ తర్కాన్ని పట్టుకున్న ఈనాటి ఆ పక్షపు అధ్యయనపరులను చూస్తే వారుకూడా, దానినే పట్టుకొని వేలాడడమూ, తమ వాదనా పద్ధతిలో నిలబెట్టబూనటం, విడ్డూరం కాకపోతే మరేమిటి? తమ పెద్దలు చెప్పింది నెత్తికి ఎత్తుకోవడం, అవకాశం ఉన్నంత మంది నెత్తికి ఎత్తడం అన్న దృష్టే తప్ప, సత్యాసత్యాలను అవగాహన చేసుకోవాలన్న దృష్టి ఈ విషయంలో వారికి కలగలేదన్నది స్పష్టంగా కనపడుతుంది కదా. ఈ మొత్తాన్ని క్రోడీకరించి చూసుకుంటే ఉన్నవాటి గురించి మనకి అనిపిస్తున్నది, 1. ఉన్నది ఉన్నట్లే అన్న రూపంలోనూ, 2. ఉన్నది ఉన్నట్లే కాకుండా మరో రూపంలోనూ కూడా ఏర్పడుతున్నట్లుగా రుజువవుతున్నది. మానవ జ్ఞాన వికాస పరిణామ క్రమంలో, ఉన్నది ఉన్నట్లే కాక, లేనిది ఉన్నట్లు కూడా అనిపించవచ్చు అన్న విషయం గమనింపులోకి వచ్చిన రోజు జ్ఞాన క్షేత్రానికి సంబంధించినంతలో ఒక పెద్ద మలుపులాంటిది. అక్కడి నుండే మనిషిలో ఆయా విషయాలకి సంబంధించి కలుగుతున్న జ్ఞానం సరైనదా కాదా పరిశీలించి చూసుకోవాలి అన్న దృష్టి ఏర్పడింది. అదే క్రమంగా జ్ఞాన సిద్ధాంత రూపకల్పనకు దారితీసింది. ఎప్పుడైతే; సహజ ప్రక్రియని అనుసరించే తప్పుజ్ఞానము, ఒప్పు జ్ఞానమూ కలుగుతూ వస్తున్నాయని గమనించాడో, ఒప్పుజ్ఞానం బ్రతుకు అవసరమని గమనించాడో అప్పటి నుండే ఈ జ్ఞాన క్షేత్రాన్ని నిశితంగా శోధించడం, స్ఫష్టంగా అర్థంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే తప్పు జ్ఞానమంటే ఏమిటి? తప్పు జ్ఞానము ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అలాగే ఒప్పు జ్ఞానం అంటే ఏమిటి? ఒప్పు జ్ఞానం ఏర్పడడానికి గల కారణాలు ఏమిటి? ఒప్పు జ్ఞానమే కలుగుతూ ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అన్న వాటి జ్ఞానాన్ని సంపాదించుకొని వినియోగించుకోవటం బ్రతుకు అవసరంగా గమనించటం జరిగింది. ఈ పరిశీలన నుండే ఎన్ని రకాల జ్ఞానం ఏర్పడుతున్నది, ఆ జ్ఞానం ఏఏ పరికరాల ద్వారా, ఏఏ విధానాల ద్వారా ఏర్పడుతోంది అన్న అవగాహన కలిగింది.

అభ్యాసము : పైన మనం వివరించుకున్న జ్ఞాన క్రమము ప్రత్యక్ష ప్రమాణానికి సరిపోతుంది. అనుమాన ప్రమాణ క్రమము వివరించుకునేటప్పుడు మరికొన్ని దశలు కలపాలా? ఈ క్రమం సరిపోతుందా? అవసరం లేకుంటే ఈ క్రమంలోనే ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి మధ్య ఏ దశలో తేడా వస్తుంది? ఇంకొంత కలపాలి అనుకొంటే ఏమేమి ఎక్కడెక్కడ కలపాలి? వివరించండి.

జ్ఞానంలో రకాలు


ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము అని జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. పరోక్ష జ్ఞానంలో అనుమాన ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము, శబ్ద ప్రమాణము ద్వారా కలిగే జ్ఞానము (భాష ఆధారంగా కలిగే జ్ఞానము) అనే ఉప విభాగము ఉంటుంది. ఈ మూడు రకాలుగా కలిగే జ్ఞానములోనూ మళ్ళా తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము అన్న విభాగము ఉంది. వీనినే ప్రమ, భ్రమ అనికూడా అంటారు. ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే ఆ జ్ఞానాన్ని ప్రమ అంటారు. లేనిది ఉన్నట్లుగా తెలియటాన్ని మరియు ఉన్నది ఉన్నట్లుగా కాక ఇంకొకలా తెలియటాన్ని భ్రమ అంటారు.

భ్రమ : ''అతస్మిన్‌ తద్బుద్ధి మిధ్యా'' ''విపర్యయో మిధ్యాజ్ఞానం తద్రూప అప్రతిష్టితం'', ''తదభావవతి తత్‌ప్రకారకో అనుభవం అయ్యథార్థం తద్జన్యం జ్ఞానం భ్రమ'', ''తత్‌ అవిద్య తత్‌ దుష్టజ్ఞానం''

గమనిక : భ్రమ, మిధ్య, విపర్యయము, తప్పుజ్ఞానము, అసత్యము, అవిద్య, అబద్దము, బాధిత జ్ఞానము అన్న పదములన్నీ ఈ క్షేత్రములో సమానార్థకాలు.

ప్రమ : ''అసన్ని కృష్ణార్థ పరిచ్చిత్తిః ప్రమా''

అని వైశేషికం ప్రత్యక్షం గురించి చెపుతోంది.

జ్ఞానానికి సంబంధించి కొన్ని సాధారణ అంశాలు :

*   విషయ రహితమైన జ్ఞానం ఉండదు.

*   ఉన్నది తెలియడం అన్నది ప్రత్యక్ష పద్ధతి ద్వారానే సాధ్యము

*   పరోక్ష జ్ఞానసాధకాలైన అనుమానశబ్ద ప్రమాణముల ద్వారా తెలిసింది, అనిపిస్తున్నది వాస్తవానికి ఇంకా తెలియవలసిందిగానే ఉంటుంది.

*   అనుమాన ప్రమాణం ద్వారా కలిగే జ్ఞానంలో రెంటి సంబంధం ఆధారంగా; ఇప్పుడు తెలియబడుతున్న దానితో సంబంధపడిన రెండవది ఉండిఉంటుంది అన్న ఊహాత్మక నిర్ణయాన్నే; అనిపించటం జరుగుతోంది గనుక జ్ఞానం అని పిలుస్తున్నాము. నిజానికి ఏది ఉంటుందన్న ఊహాత్మక నిర్ణయం జరిగిందో అది తెలియని స్థితే ఉంటుందక్కడ. కనుకనే దానిని పరోక్ష జ్ఞానం అని పిలుచుకున్నాము.

*   అలాగే శబ్ద ప్రమాణంలో కూడా ఒక వ్యక్తో, ఒక గ్రంథమో ఏదైనా ఒక విషయానికి సంబంధించిన సమాచారము అందించినపుడు లేదా అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు, అతనేమంటున్నాడన్నది తెలుస్తుందేగాని, అతను దేనిని గురించి అయితే సమాచారం అందించాడో అది తెలియనిది గానే, తెలియవలసినదిగానే ఉంటుంది. కనుకనే శబ్ద ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానాన్ని  కూడా పరోక్షజ్ఞానం అనే అంటున్నాము.

ప్రత్యక్ష ప్రమాణం


జ్ఞానం ఏర్పడుతున్న క్రమాన్ని అనుసరించే పైన పేర్కొన్న ప్రత్యక్ష జ్ఞానమన్నది కలుగుతూ ఉంటుంది. ఇంద్రియాలు విషయాలకి సంబంధించి తాము పట్టుకోగలిగిన మేర పట్టుకున్న సమాచారాన్ని గ్రహణ కేంద్రానికి చేర్చటం ద్వారా అందిన సమాచారం వరకు కలిగిన జ్ఞానాన్నే ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఇంద్రియం వెళ్ళి విషయాన్ని తాకిందా, విషయం వచ్చి ఇంద్రియాన్ని తాకిందా అన్నది ఖచ్చితంగా నిర్ణయించుకోనక్కర లేకుండానే ఇంద్రియార్థ సన్నికర్ష జరగటం అన్నది ప్రత్యక్ష ప్రమాణములో కీలకం అయి ఉంది. సన్నికర్షలో ఉన్నంత వరకు తెలియడం అన్నదే ప్రత్యక్ష ప్రమాణం యొక్క పరిమితి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా కలిగే వివిధ రకాలైన జ్ఞానాలకు ప్రమాణ పద్ధతి సామాన్య కారణంగానూ, ఇంద్రియం (జ్ఞానేంద్రియం) అసాధారణ కారణంగానూ ఉంటుంది. కనుకనే తెలుసుకొనే మనకు /జ్ఞాతకు (గ్రహణకేంద్రానికి) వేరుగా ఉన్నవాటన్నిటి గురించి కలిగిన జ్ఞానాన్ని, ఆయా ఇంద్రియాలతో ముడిపెట్టి కలిగిన జ్ఞానంగా పేర్కొంటాము. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక మరియు అంతరింద్రియము అన్న ఆరు పరికరాలను అనుసరించి మనిషికి ఆరు రకాల ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంటుంది. వాటినే 1. నేత్ర ప్రత్యక్షము, 2. ఘ్రాణ ప్రత్యక్షము, 3. రసన ప్రత్యక్షము, 4. శ్రోత్ర ప్రత్యక్షము, 5. త్వక్‌ ప్రత్యక్షము, 6. అంతరేంద్రియ ప్రత్యక్షము అనంటాము.

గమనిక : అంతరింద్రియము అన్నదానికి వివిధ జ్ఞాన సిద్ధాంత కారులు మనసు అని ఒకరు,బుద్ధి అని ఒకరు, చిత్తమని ఒకరు ఇలా పేర్లు పెట్టారు. ఏ పేరు సరైంది అన్న విషయంలో వివాద పడకుండానే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా కలుగుతున్న జ్ఞానానికి వేరైన ఆరోరకం జ్ఞానమూ కలుగుతుందన్నది అన్నది మన అనుభవములో ఉన్న విషయమే. కనుక ప్రమాణ క్షేత్రాలను అధ్యయనం చేయదలచిన వ్యక్తికి ఏఏ ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తాయి అన్న విషయం స్పష్టంగా అవగాహనై ఉండాలి.

మిత్రులారా! ఈ ఐదు ఇంద్రియాల ద్వారా ఏఏ విషయాలు తెలుస్తున్నాయో మీమీ అనుభవాలు పరిశీలించి రాయండి. ఆరవ రాశిగా ఏఏ విషయాలు తెలుస్తున్నాయోనూ రాయండి.

గమనిక: ప్రమాణ విద్యను నేర్వదల్చుకున్నవారు ఈ విషయములను ఇతరుల నుంచి స్వీకరించటం అంత మంచిది కాదు. క్షేత్ర దర్శనం చేస్తూనే వాటిని గురించిన అవగాహన పొందాలి. కనుక ఎవరికి వారుగా ఈ పరిశ్రమ చేయండి.

''యేనేంద్రియేణ యావ్యక్తిర్‌గృహ్యతే, తేనేంద్రియేణ తద్గతాజాతిః తదభావచ్ఛ'' అంటే ఏ ఇంద్రియముల ద్వారా ఒకటి ఉంది అని తెలుస్తుందో, అది లేదు అనికూడా ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంది. అది ఏ జాతికి చెందిందన్నదీ ఆ ఇంద్రియం ద్వారానే తెలుస్తుంటుంది.

భ్రమ :


భ్రమ అంటే తప్పు జ్ఞానమని అర్థం. ఉన్నది ఉన్నట్లు కాక మరోలా అనిపించటం, ఏమీ లేకుండానే ఏదేదో ఉన్నట్లు అనిపించటం అని భ్రమలు రెండు రకాలు. ఇందులో రెండో రకమంతా మానసిక భ్రమల క్రిందికే వస్తుంది. ఈ రకాన్ని ఆంగ్లంలో హెల్యూషినేషన్‌ అని తెలుగులో భ్రాంతి అని అంటున్నారు.

భ్రమ, మిధ్యాజ్ఞానం, విపర్యయం, భ్రాంతి, అవిద్య, అసత్యం, తప్పుజ్ఞానం, బాధిత జ్ఞానం లాంటి పదాలన్నీ ఒకే అర్థాన్నిచ్చే మాటలే.

మనో వైజ్ఞానిక క్షేత్రాలలో ఇల్యూషన్‌, హెల్యూసినేషన్‌, డెల్యూషన్‌ అన్న పదాలు వాడుతున్నారు. అవన్నీ కూడా పైన మనం చెప్పుకున్న అర్థాన్ని తెలిపేటివే. వాటన్నింటి సారాంశం తప్పు జ్ఞానం అన్నదే.

ఓ   ఈ భ్రమలన్నింటినీ విపులంగా అర్థం చేసుకోవాలన్నా, విడివిడిగా అర్థం చేసుకోవాలన్నా ఆ భ్రమను అలా తప్పు జ్ఞానం కలగడానికి జ్ఞానం ఏర్పడుతున్న క్రమంలో ఇమిడిఉండే వాటిలో ఏది ముఖ్య భూమికను పోషిస్తున్నదో దాని కారణంగా కలుగుతున్న భ్రమ అనంటున్నాం. మండలి దృష్టినుండి తప్పు జ్ఞానం ఏర్పడడానికి కారణాలు నాలుగు గా ఉన్నాయి.

1. బాహ్య కారణాలు : ఇంద్రియాలు సరిగనే ఉండి, మనస్సూ సరిగనే ఉన్నప్పటికీ విషయాలు ఉన్నది ఉన్నట్లుగా అనిపించకపోడానికి గల కారణాలు, ఇంద్రియాలకు సమాచారం చేరేలోపునే ఉన్నట్లయితే అట్టి వాటిని ఆయా భ్రమలకు బాహ్యకారణాలు అనంటాము.

నేత్ర భ్రమలు : కంటి ద్వారా తెలియబడే ఎన్నో విషయాలలో బాహ్య కారణాల వల్లనూ భ్రమలు కలుగుతుంటాయి. ఉదా: 1. నీటిలో సగం వరకుముంచిన కర్ర వంగినట్లుండడం, 2. తారు రోడ్డుపైన మంచి వేసవి కాలములో మధ్యాహ్నం పూట నీరున్నట్లు కనిపించటం, 3. నదిలో ప్రయాణిస్తున్న వారికి గట్టుమీద చెట్లు కదులుతున్నట్లు అనిపించటం, 4. ఒక వస్తువును కుంభాకార, పుటాకార, అసమతల అద్దాలలో నుండి చూసినప్పుడు ఆయా వస్తువులు, దృశ్యాలు ఉన్నది ఉన్నట్లుగా కాక మరోలా కనిపించడం, 5. సమాంతర రేఖలు వంకరగాను, సమాన నిడివి ఉన్న రేఖలు చిన్నా పెద్దగా అసమానంగానూ, ఒక పెద్ద వృత్తంలో ఒక దానికంటే మరొకటి చిన్నగా ఉన్న అనేక వృత్తాలు, ఒకే సర్పిలాకారంగానూ అనిపించటం లాటివన్నీ బాహ్య కారణాల వల్ల కలిగే నేత్ర భ్రమల క్రిందకి చేరతాయి. రంగులకు సంబంధించిన భ్రమలూ ఈ కోవకు చెందినవి కొన్ని ఉన్నాయి.

ఇంద్రియ లోపాల కారణంగా కలిగే భ్రమలు :

1. రాత్రిపూట దూరాన ఉన్న లైట్లు, అవి ఉన్నవి ఉన్నట్లుగా కాక, రెండుగా గాని, పొడుగ్గానో, వెడల్పుగానో గాని కనిపించటం.

2. దూరదృష్టి, హ్రస్వదృష్టి కారణంగా కలిగే భ్రమలు.

3. రంగుల్ని యథాతథంగా గమనించలేక పోవడం - కంటి అద్దాల వల్ల నేల ఎగుడుదిగుడుగా అనిపించడం.

4. సినిమా తెరపై మనకు రకరకాల కదలికలు కనిపిస్తుంటాయి. నిజానికక్కడ స్థిర చిత్రాలే ఉంటాయి కనుక చలనచిత్రంలోని చలనరూపాలన్నీ భ్రమ రూపాలే.

శ్రోత్ర భ్రమలు : 1. స్టీరియో శబ్దాలు వింటున్నప్పుడు రెండు వైపుల నుండి శబ్దాలు వస్తున్నా తలపై నుండి శబ్దాలు వస్తున్నట్లుండడం, ఒక వైపునుండి వచ్చే శబ్దాలు మరోవైపు నుండి వస్తున్నాయనిపించడం, బాహ్య కారణం వల్ల కలిగే శబ్ద భ్రమే.

2. చెవుల్లోని వినికిడి శక్తి లోపాలు, తేడాల వల్ల ఒకవైపు నుండి వస్తున్న శబ్దం మరోవైపు నుండి వస్తుందనిపించడం ఇంద్రియ కారణంగా కలిగే శబ్ద భ్రమ అవుతుంది.

3. బయట ఎటువంటి శబ్దాలూ లేకుండానే చెవుల్లో హోరు ధ్వనులు వినిపించడం.

4. తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించడం, తానెవరితోనో మాటాల్లడుతున్నట్లు అనిపించటం. వశీకరణలో ఉండి హిప్నాటిస్టు ఏదేది వినిపిస్తుందంటే అదంతా వినిపిస్తున్నట్లే అనిపించడం మానసిక కారణంగా ఏర్పడే శబ్ద భ్రమలు. దేవుళ్ళు, దెయ్యాలు మాట్లాడినట్లనిపించటం ఇలాంటిదే.

  త్వగింద్రియానికి సంబంధించిన భ్రమలు :

1. చూపుడు వేలు - మధ్య వేలును మడిచి, రెండు వేళ్ళ కొనల మధ్య ఒక బఠాణీ గింజంత గుండ్రని వస్తువును దేనినైనా ఉంచితే, రెండు వస్తువులున్నట్లు అనిపిస్తుంది. అలాగే చూపుడు వేలు మాత్రమే వస్తువును తాకేట్లు ఉంచితే, మధ్యవేలు వస్తువును తాకుతున్నట్లు అనిపిస్తుంది.

2. ఒక చేతిని అధిక ఉష్ణం కలిగిన నీటిలోనూ, మరో చేతిని అతి శీలంగా ఉన్న నీటిలోనూ కొద్దిసేపు ఉంచి తరువాత ఒక బకెట్టులోని నీళ్ళలో ఆ చేతులనుంచితే ఒక చేతి స్పర్శ ద్వారా బకెట్లో చల్లని నీళ్ళున్నట్లు, మరో చేతి  స్పర్శ ద్వారా వెచ్చని నీళ్ళున్నట్లూ అనిపిస్తుంది. ఇదీ స్పర్శకు చెందిన భ్రమే.

3. హిప్నటైజ్‌ చేసిన వ్యక్తిని మేకుల పడకపై పరుండబెట్టి నీ విప్పుడు పరుపుమీద పడుకున్నావని ఆదేశమిస్తే, అతనికి పరుపుమీద పడుకున్నట్లే అనిపిస్తుంది. ఇది స్పర్శకు సంబంధించిన మానసిక కారణంగా ఏర్పడ్డ భ్రమ (భ్రాంతి అవుతుంది).

*   జిహ్వ భ్రమలు (రుచుల భ్రమలు) :

1. పడపత్రి ఆకు నమిలి కొద్దిసేపయ్యాక పంచదార తింటే, తీపి అనిపించదు. చప్పగా ఉందనిపిస్తుంది. నాలికపై ఇసుక ఉన్నట్లనిపిస్తుంది.

2. అతి తీపి పదార్థాలు, అతి ఉప్పని పదార్థాలు తిన్నాక వెంటనే సాధారణ మధుర పదార్థాలు లేదా కాఫీ టీ లాటివి తీసుకుంటే చప్పగానో, అతి తీపిగానో ఉన్నట్లు అనిపించడం రుచికి సంబంధించిన భ్రమలే.

3. హిప్నటైజ్‌ చేసి ఒక వ్యక్తిచేత మిరపకాయ తినిపించి అది తీపిగా ఉందన్న ఆదేశమిస్తే అతనికది తీపిగానే అనిపిస్తుంది. అది రుచివిషయమైన మానసిక భ్రమ (భ్రాంతి) అవుతుంది.

4. జ్వరం వచ్చినప్పుడు ఏదితిన్నా చేదుగా అనిపించడం ఇంద్రియం కారణంగా జరిగే భ్రమే.

5. ఉసిరి కాయ తిన్నాక మంచినీల్ళు తాగితే అవి తియ్యగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది రసాయనిక భ్రమ.

ఘ్రాణ భ్రమలు :

1. ముక్కు చెడిపోయినప్పుడు వాస్తవంగా ఉన్న వాసనలు లేనట్లు అనిపిస్తుంటుంది.

2. హిప్నటైజ్‌ చేసి వేరువేరు వాసనలున్నట్లు భ్రమలు కల్పించవచ్చు.

మానసిక భ్రమలు : దేవుడు కనపడడం, దయ్యాలు కనపడడం, మాట్లాడడం, లాటివన్నీ మానసిక భ్రమలే.

ఉదా :- 1. దినకరన్‌ గారికి హాస్పటల్‌ పార్కులో ఏసుకనపడి ప్రక్కనే కూర్చుని అనేక విషయాలు మాట్లాడాడనిపించడం.

2. రంజిత్‌ ఓఫీర్‌గారికి నిత్యం ఏసు మాట్లాడుతున్నాడనిపించడం

3. పోలేరమ్మలు, దేవరలు పూనడం లాటి పూనకాలన్నీ మానసిక భ్రమలే.

ఓ   రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలు :

1. గంజాయి, నల్లమందు లాటి మాదక ద్రవ్యాల వల్ల గాలిలో తేలిపోతున్నట్లు, దారి ఎగుడుదిగుడులుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది. అలాటి వాటిని రసాయనిక కారణాల వల్ల ఏర్పడే మానసిక భ్రమలంటారు.

గమనిక :- భ్రమలకు ఎన్ని రకాల కారణాలుండే వీలుందన్న విషయంపై శాస్త్రీయ పరిశోధనలెన్నో జరిగాయి. జరుగుతున్నాయి కూడా. కనుక ఈ జాబితాకు ముగింపంటూ పెట్టుకోనక్కరలేదు. ఎన్ని రకాలుగ భ్రమలుండే వీలుందో అర్ధం చేసుకుని, అవి ఏర్పడకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్త లేమిటో తెలిసికుని, వినియోగించుకోవడం అలవరచుకుంటే జీవితంలో తరచుగా తప్పు జ్ఞానం ఏర్పడకుండా ఉంటుంది.

*   'భ్రమలు - వాటికి కారణాలు' అన్న వాటి గురించి కొంత వరకు విచారించు కున్నాం. ఇక వాటి నివారణోపాయాలను గురించి తెలుసుకోవలసి ఉంది.

1. బాహ్య కారణాల వల్ల కలిగే భ్రమలు కలక్కుండా చూసుకోవడానికి 1. ఇంద్రియార్థ సన్నకర్షను బలంగా, ప్రగాఢంగా ఉండేలా చూసుకోవడం 2. పెక్కింద్రియాలను వాడడం ద్వారా తెలియబడే దానిని గురించిన స్పష్టత ఏర్పరచుకోవడం 3. ఆయా విషయాలలోని గుణాలననుసరించి వాటికి ఉండే సామర్ధ్యాలను పరిగణనలోకి తీసుకుని (అర్ధక్రియా కారిత్వ మంటారు దీనినే) అట్టివి ఉన్నాయో లేదో చూసుకోవడం వలన, బాహ్య పరిస్థితులను చక్కజేయడం వలన వాటిని నివారించుకోవచ్చు.

2. ఐంద్రియిక దోషాలనే కారణాలను, ఇంద్రియాలు దోషరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఐంద్రియిక కారణాలను పరిష్కరించుకోవచ్చు.

3. రసాయనాలవల్ల ఏర్పడే భ్రమలనైతే రసాయనాల ప్రభావం పడకుండా చూసుకోడం ద్వారా సరి చేసుకోవచ్చు.

4. మానసిక భ్రమలకు అనేక కారణాలుండే వీలుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాలు లేకుండా ఉండడం, మూఢనమ్మకాలు లేకుండా జాగ్రత్తపడడం, అతి ఆవేశానికి లోనుగా కుండడం, ఆత్మాధిక్యతకుగానీ, ఆత్మన్యూనతాభావానికి గానీ లోను కాకుండడం లాటి వన్నీ మానసిక భ్రమలు కలగకుండా ఉండేందుకు పనికి వచ్చేటివే. శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవడం, శాస్త్రీయ పద్దతిని వినియోగించుకోవడం అన్నరెండూ మానసిక భ్రమలు ఏర్పడకుండా ఉండేందుకు దోహదపడుతాయి.


అపరోక్షము



ప్రమాణ విచారణలో ప్రమాత - ప్రమాణము - ప్రమేయము అన్న మూడు అత్యంత కీలకమైనవి. సాంప్రదాయంలో వీటినే త్రిపుటి అని అంటారు. ప్రమాత అంటే తెలుసుకొనే వాడు అని. జ్ఞాత, విషయి, ద్రష్ట అన్న పదాలూ తెలుసుకునే వానికి వర్తించే పదాలే. చూచేవాడు, తెలుసుకునే వాడు అన్నవి సమానార్థకాలు. తెలుసుకునే సామర్ధ్యం కలిగి, తనను - తనకన్యమైన వాటినీ కూడా తెలుసుకుంటాడితడు. తనకు అన్యమైన వాటిని గురించి తెలుసుకోడానికైతే ప్రమాతకు ఆ పనికి అవసరమైన పరికరాలు, పద్ధతులు అవసరమవుతాయి. వాటినే ప్రమాణాలు (జ్ఞాన సాధకాలు) అంటారని ముందే చెప్పుకున్నాం. ఇకపోతే తన గురించి తాను ఎరుక కలిగి ఉండడానికి ప్రమాణావశ్యకత లేదుగనుక, ప్రమాతకు సంబంధించిన ఏ విషయాలైనా త్రిపుటితో పనిలేకుండానే తనకు తనకుగానే తెలుస్తూ ఉంటాయి. కనుకనే ఈ భాగానికి సంబంధించిన తెలివిని (జ్ఞానాన్ని లేదా ఎరుకను) అపరోక్షజ్ఞానం అంటున్నాము.

దీనికి సంబంధించిన క్షేత్ర దర్శనం


ఒక్కసారి నిద్రనుండి మెలకువలోకి వచ్చే సందర్భాన్ని గుర్తుచేసుకోండి. మెలుకువ వచ్చిందని తెలుస్తుంది మొదట. గమనించడం ఆరంభమైందని దానర్ధం. నేను అన్న భావన కూడా పుట్టకముందే ఎరుకలోకి రావడం జరుగుతుంది. అంటే గమనించడం మొదలైంది. ఆ క్షణంలో గమనిస్తున్నాను అన్న స్పృహకూడా ఉండదు. రెండో దశలో నేను అన్న భావన, నేను గమనిస్తున్నాను అనిగాని, నాకు మెలుకువ వచ్చింది అనిగాని అనిపిస్తుంది లేదా తెలుస్తుంది. తెలుసుకునే దానికి / వానికి తనకు అన్యమైన వాటి గురించి తెలుసుకునేందుకున్న విధానాలు, సాధనాలనే ప్రమాణాలనుకున్నాం కదూ! ఒక ముఖ్యమైన విషయమేమంటే త్రిపుటిలోని ప్రమాణాలు, ప్రమేయాలూ కూడా ప్రమాతకు అన్యమైనవే అవుతాయి. ఆ దృష్టినుండి చూస్తే; తెలుసుకునే వాడు, తెలియబడేటివి అన్న రెండుగానే వీటిని అర్థంచేసుకోవచ్చు.

ఓ   జ్ఞాత (ప్రమాత) : ఎవరన్న విషయంలో రకరకాల 'సిద్ధాంతాలు - రాద్ధాంతాలు' ఉనికిలో ఉన్నా శరీరంలో తెలుసుకునే పని జరుగుతూనే ఉందనీ, మనందరికీ ఆ పని మనమే చేస్తున్నామని అనిపిస్తుంటుందనీ అనేంతవరకు ఏకాభిప్రాయమే ఉంటుంది. నేనే తెలుసుకుంటున్నాను. ఈ శరీరంలో తెలుసుకుంటున్నది 'నేనే' అని మనందరికీ అనిపిస్తుంటుంది. తెలుసుకునే పని తలలో జరుగుతుంటుందనీ మనందరకూ తెలుసు. భారతీయ ఆస్తిక సాహిత్యంలో జ్ఞాన లక్షణం ప్రకృతికి, ప్రకృతి సంబంధితాలకూ ఉండదన్న దృష్టిఉండడంతో, శరీరభిన్నము (జడ భిన్నము) అయినది ఒకటుండక తప్పదనీ, దానినే ఆత్మ అంటారని, కనుక తెలుసుకునే నీవే ఆ ఆత్మవు అనీ చెప్పబడింది. మన ప్రస్తుతాంశం శరీర భిన్నమైన ఆత్మ ఉందా లేదా? అన్నది కాదు. ఈ శరీరంలో నేను అన్న భావనతో కూడి తెలుసుకునే పని చేస్తున్నదొకటి ఉందని, అది మనందరికి, ఆ తెలుసుకుంటున్నది నేనేనని అనిపిస్తుంటుందని, సందేహ రహితంగా తెలుసు. కనుక తెలుసుకునేది ఏది? లేక ఎవరు? అన్నది ప్రస్తుతానికి ప్రక్కనుంచుదాం.

అంటే; జ్ఞాతను నేనే. తెలుసుకునే లక్షణము గల నేను పరిమిత సామర్ధ్యముతో తెలుసుకుంటుంటాను. నన్ను నేను తెలుసుకుంటూ, నాకు సంబంధించిన విషయాలూ తెలుసుకుంటూ, నాకితరమైన వాటిని వివిధ పరికరాలూ, పద్ధతులాధారంగా తెలుసుకుంటూ ఉంటాను. ఇంతవరకు ఇదంతా మీమీ అనుభవం (ఎరుక)లో ఉందో లేదో ఎవరికి వారుగా, మీమీ అనుభవాలను తరచిచూసుకోండి. తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు మనకెవ్వరికీ అభ్యంతరం ఉండదనే అనుకుంటున్నాను. కనుక నేను ఉన్నాను, తెలుసుకుంటున్నది నేనే అన్నంత వరకు ప్రమాణాపేక్ష లేకుండానే తెలుస్తుంటుంది.

ఈ ప్రమాత లేదా జ్ఞాత (అహం) కు సంబంధించిన తెలివినే (ఎరుకనే) అపరోక్షం అనంటారు. జ్ఞాన సాధకాల తీరుతెన్నులను విచారించుకునే సందర్భంలోనూ, ఏఏ జ్ఞాన సాధకాల అంటే ఏఏ పరికరాల, పద్ధతుల ద్వారా ఏ రకమైన జ్ఞానం కలుగుతుంటుందో విచారించే సందర్భంలోనూ ఈ ప్రమాత స్వరూప స్వభావాల విచారణ అంత ప్రధానం కాదు. అయినా మనకు కలిగిన జ్ఞానరాశినంతటినీ పరిశీలించి చూస్తే. మూడు ప్రమాణాల ద్వారా కలిగిన జ్ఞానం కాక, మరికొంత జ్ఞానమూ ఉన్నట్లు తేలుతుంది. ఆ జ్ఞానానికి మనం ప్రమాణాల పేరిట చెప్పుకున్న పరికరాలు గానీ, పద్ధతులు గాని అవసరపడలేదని తెలుస్తుంది. అదిగో ఆ భాగాన్నే అపరోక్షం అనంటున్నాం. ఇదంతా ఇక్కడెందుకు విచారించు కుంటున్నామంటే ప్రమాణబద్ధమైన జ్ఞానానికీ, అది ఒప్పు జ్ఞానం కావచ్చు, తప్పు జ్ఞానం కావచ్చు, అపరోక్ష జ్ఞానానికీ, అంటే ప్రమాణాల క్రింద చెప్పుకున్న పరికరాలు, విధానములన్న వాటి ప్రమేయము లేకుండనే కలిగే జ్ఞానానికి తేడా ఉందని గమనించి, ఆ అపరోక్ష జ్ఞాన రాశిని విడిగా ఉంచడానికే.  ముందుగా ఆ పని చేసుకుంటేనే ప్రమాణాల విషయాన్ని వివరంగా పరిశీలించగలుగుతాం. మరి 1, 2 ఉదాహరణలు చెబుతాను. అపరోక్ష జ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోడానికి (స్పష్టత రావడానికి) ప్రత్యక్షం ద్వారా ఏదో ఒక విషయానికి చెందిన అనుభూతి కలుగుతుందను కుందాం. అంటే ఏదో ఒక దానిని గురించి ఏదో ఒకటి అనిపించింది. ఇంతవరకు ఇది ప్రమాణం ద్వారా కలిగిన జ్ఞానమే. ఆ తరువాత ఆ విషయం మనకు తెలిసిందని తెలుస్తుంటుంది. ఒక విషయం తెలియడం - అది తెలిసిందని తెలియడం ఇది మీమీ అనుభవాలలో ఉందో లేదో చూసుకోండి. తెలిసిందని తెలియడానికి మూడు ప్రమాణాలలో ఏ ప్రమాణంతోనూ పనిలేదు. అది తెలుసుకునే మనకు, మనకుగానే తెలుస్తుంది. దానితో పాటు తెలుసుకుంటున్నాను అన్న తెలివీ కలుగుతుంటుంది. ఈ జ్ఞాన భాగాన్ని అపరోక్ష జ్ఞానమనే అనాలి. ఇక ప్రమాణజన్య జ్ఞానమంతా ప్రమాతకు - ప్రమేయ స్థానంలో ఉన్న విషయానికి సంబంధం ఏర్పరిచే వ్యవహారం జరిగి ఏర్పడ్డదై ఉంటుంది. ప్రస్తుతానికీ వ్యత్యాసాన్ని గమనించుకొని ప్రమాణాలను, తద్వారా కలిగే వివిధ రకాల జ్ఞానాలను వివరించుకుందాం.

అపరోక్షాన్ని మినహాయించితే, మిగిలిన జ్ఞాన రాశీ, అదేర్పడేందుకు అవసరమైన పరికరాలు, పద్ధతుల విచారణే ప్రమాణ విచారణంతా. అదిన్నూ ప్రత్యక్షమూ - పరోక్షమూ అన్న రెండు రాశులుగానూ, ఒప్పు జ్ఞానము, తప్పు జ్ఞానము అన్న భేదంతోటీ ఉంటుంది. ప్రత్యక్ష పద్ధతిననుసరించి కలిగే జ్ఞానం ఇంద్రియాల తేడావల్ల మరల 6 విధాలుగా ఉంటుంది. ఇక పరోక్ష జ్ఞానం అనుమాన పద్ధతిన, భాషనాధారం చేసుకునీ, రెండు రకాలుగా కలుగుతూ ఉంటుంది. భాషనాధారం చేసుకునేదంతా మానవుడు తమారుచేసుకున్నదే. అదికాక మిగిలిన రెండూ అంటే ప్రత్యక్షమూ - అనుమానమూ అన్న రెండూ శరీర నిర్మాణంలోనే అమరిఉన్న వ్యవస్థ రూపాలు. కనుకనే మండలి అవైవున్న ప్రమాణాలు రెండనీ, భాష ఆధారంగా మనిషి చేసుకున్నదొకటనీ అంటూ ప్రమాణ పద్దతులు మూడని నిష్కర్షిస్తోంది. మొత్తంమీద, మానవ జీవితానికి ముడిపెట్టి చూసుకుంటే, మూడు విధానాలను వాడుకోకుంటే జీవితంలో జ్ఞానపరంగా లోటుఏర్పడుతుంటుందనీ, నాలుగో ప్రమాణంతో పనిలేదని, మూటికంటే అధిక సంఖ్యలో ప్రమాణాలున్నాయనే వారంతా ఉన్న వాటినే అనవసరంగా అధిక భాగాలు చేసి సంఖ్యను పెంచే పనిచేసినట్లేనని మండలి సిద్ధాంతీకరిస్తోంది.

Tuesday, November 1, 2016

మండలి జ్ఞాన సిద్దాంతము - ప్రమాణ - పదార్థ విద్య

 ఉపోద్ఘాతము :- యోచనాశీలురైన చదువరులారా!
మన జీవితాలను జాగ్రత్తగా గమనించితే, అది రెండు ప్రధాన విభాగాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి జ్ఞాన భాగం కాగా రెండోది కర్మభాగం. ఈ అంశాన్నే తాత్వికులు జ్ఞానకర్మ సముచ్చయం మానవ జీవితం అన్న సూత్రం ద్వారా చెపుతారు. ఎదురుపడిన మరియు అవసరమైన విషయాలను తెలుసుకుంటూ, అలా కలిగిన జ్ఞానాధారంగా అవగాహన పెంచుకుంటూ, దానిని జీవితానికి అన్వయించుకుంటూ, జీవితాన్ని సాగిస్తుంటాం మన మందరమూ. అంటే జ్ఞానం మన జీవితంలో మార్గదర్శక పాత్ర (నడిపించే పాత్ర)ను పోషిస్తుంటుందన్నమాట. ఇది ఎవ్వరమూ కాదనలేని, నిత్యమూ జరుగుతుండే వ్యవహారమే. గాఢనిద్రలోనూ, స్పృహ కోల్పోయినప్పుడు తప్ప ఇది ఒక నిరంతరాయ ప్రక్రియే. మన శరీరాన్ని పరిశీలించినా అది తల (మెదడు) చేసే పనీ, మిగిలిన శరీరం చేసే పని అన్న రూపంలో రెండుగా ఉంటుంది. అందులో ప్రస్తుతం మనం విచారణకు - అధ్యయనానికి - ఎంచుకున్న అంశం జ్ఞాన భాగానికి చెందింది. (పారిభాషికంగా దీనిని జ్ఞాన క్షేత్రానికి చెందింది అనీ అనవచ్చు) అందుకే దీనికి 'జ్ఞాన సిద్దాంతం' అన్న పేరు వచ్చింది. అంటే జ్ఞానంతో ముడిపడి ఉన్న అనేకాంశాలను గురించిన సిద్ధాంతం అని.
  • మన శరీర నిర్మాణంలోనే, తెలుసుకోడానికి, ఆ తెలుసుకున్నది నిలిపి ఉంచుకుని, తిరిగి ఉపయోగించుకోడానికి అవసరమైన పరికరాలు, వాటి అమరిక అవి పని చేసే (తీరు) పద్దతి అన్నవి పుట్టుకతోనే ఏర్పడి ఉన్నాయి. ఈ మొత్తాన్నే మెదడు, జ్ఞానేంద్రియాలు, నాడులు అన్న మూటితో కూడిన నాడీ మండల వ్యవస్థ అంటున్నాము. జ్ఞాన సిద్ధాంతం అన్నది జ్ఞానమనగానేమి? తో మొదలై, కలిగిన జ్ఞానం సరైందా? కాదా? అన్న సత్యాసత్య విచారణతో ముగుస్తుంది. దీనిని గుర్తులో ఉంచుకోండి.
  • జ్ఞానమేర్పడుతున్న క్రమమేమిటి? ఎన్ని రకాల జ్ఞానం కలుగుతుంది? జ్ఞానాన్నార్జించడానికి- ఆయా విషయాలు తెలుసుకోడానికి - ఎన్ని రకాల పరికరాలున్నాయి? ఎన్ని రకాల విధానాలున్నాయి? తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము (పారిభాషికంగా భ్రమ - ప్రమ అనంటారు వీటినే) అంటే ఏమిటి? శరీర నిర్మాణంలోనే పరికరాలు - విధానములన్నవి అమరి ఉండగా, కొన్నిసార్లు తప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? మరికొన్ని సార్లు ఒప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? తప్పు జ్ఞానం కలక్కుండా, ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఉండాలంటే తీసుకోవలసిన, తీసుకోగల జాగ్రత్తల మాటేమిటి? కలిగిన జ్ఞానం సరైందేనో కాదో తెలుసుకునే (నిర్ధారించుకునే) పద్దతేమైనా ఉందా? ఉంటే అదేమిటి? జ్ఞానం యొక్క పాత్రేమిటి? తప్పు జ్ఞానం వల్ల జరిగే ముప్పేమిటి? ఒప్పుజ్ఞానం వల్ల ఒనగూడే (మేలు) మెప్పేమిటి? లాటి వాటి నన్నింటినీ విచారించి వివరిస్తుందీ జ్ఞాన సిద్దాంత శాస్త్రం .ఆంగ్లంలో దీనిని థియరీ ఆఫ్‌ నాలెడ్జి అనీ ఎపిష్టమాలజీ అనీ పిలుస్తున్నారు.
  •  దీన్నంతటినీ మేము ప్రమాణ వివేచన అంటున్నాము. జ్ఞాన సిద్దాంతంలో ఒక పార్శ మిదికాగా, రెండో పార్శాన్ని పదార్ధ వివేచన అంటున్నాము. అందులో కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ ఎన్నిగా విడదీసి (ఉపరాశులుగ చేసి) పెట్టుకుని, వినియోగించుకోవచ్చు అన్నది ఇతివృత్తంగా ఉంటుంది. అందుకే మండలి దీనిని 'పదార్ధ వర్గీకరణ' అన్న పేరుతో వ్యవహరిస్తోంది. (పిలుచుకుంటోంది)
  •   కనుక మండలికి సంబంధించినంత వరకు మండలి జ్ఞాన సిద్దాంతంలో ప్రమాణ వివేచన, పదార్ధ వివేచన అన్న రెండు పార్శ్వాలుంటాయి.
జ్ఞాన సిద్దాంత క్షేత్రానికి సంబంధించినంతలో, గతంలో - ఇప్పటి వరకు - దీని విషయంలో జరిగిన పరిశోధనలూ, అందువల్ల వెలువడిన వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన తాత్విక ధోరణులకన్నింటికీ, వాటి వాటికి సంబంధించిన జ్ఞాన సిద్దాంతాలూ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకస్థాయి కలిగిన తాత్వికులందరూ, తమతమ సిద్దాంతాలను (తాత్విక భావజాలాన్ని) ప్రకటించే సందర్భంలో, తమదైన జ్ఞాన సిద్దాంతాన్నీ ప్రకటించారు. అంటే తామంగీకరిస్తున్న ప్రమాణాలనూ - పదార్ధాలనూ ప్రకటించారన్నమాట.

ఉదాహరణకు :- న్యాయదర్శనకారుడు తనకు నాలుగు ప్రమాణాలనీ, 16 పదార్ధాలనీ చెప్పగా వైశేషికుడు ప్రమాణాలు మూడనీ, పదార్ధాలు ఆరనీ ప్రకటించాడు. ఇక యోగదర్శన కారుడూ సాంఖ్యదర్శనకారుడూ తమకు ప్రమాణాలు మూడన్నారు. సాంఖ్యుల ప్రకారం పదార్ధాలు 25. సాంఖ్యయోగ దర్శనాలు రెంటినీ ఒక కట్టగా చూస్తుందీ దేశ సాంప్రదాయం, కనుక యోగుల పదార్ధాలూ సాంఖ్యాన్ననుసరించేనని అనుకోవచ్చు. పూర్వోత్తర మీమాంసాకారులు '6' ప్రమాణాలనంగీకరిస్తారు. జడచేతనాలన్న పదార్ధాలనంగీకరిస్తారు. శంకరుడు వ్యవహారంలో '6' ప్రమాణాలనూ, నాలుగు పదార్థాలను అంగీకరిస్తాడు. ఇక కొందరైతే, పదార్ధ వర్గాలను ప్రత్యేకంగా పేర్కొనకున్నా, వారి వారి ప్రమాణాలను మాత్రం పేర్కొన్నారు. మరికొందరు ప్రత్యేకంగా వాటి పేర్లను పేర్కొనకున్నా, వారి సిద్దాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తూపోతుంటే, వారూ ప్రమాణాలను, పదార్ధాలను ప్రస్తావించారన్న విషయం అన్యాపదేశంగా కనపడుతూనే ఉంటుంది.
           ఏదేమైనా ఈ విషయంలో స.మం తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని విస్పష్టంగా ప్రకటిస్తోంది. మండలికి ప్రమాణాలు మూడు. పదార్ధ వర్గాలు ఐదు అదనంగా పదార్ధాల ఉపవర్గీకరణొకటీ ఉంది మాకు. వివరాలు లోపలి పుటల్లో ఆయా శీర్షికల క్రింద విపులంగా వివరించాను. వాటిని అక్కడ గమనించండి.
        శరీర నిర్మాణంలోనే అమరి ఉండి, పుట్టిన దగ్గర నుండి పని చేస్తూ వినియోగపడుతూనే ఉన్న జ్ఞానేంద్రియ వ్యవస్థ స్వరూప స్వభావాలు మరియు దాని పనితీరు తెన్నుల గురించిన సిద్దాంతరాద్దాంతాల అవసరమేమొచ్చింది? వాటి వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి కదా? అన్నప్రశ్న వేసుకుని పరిశీలిస్తే ఆయా వాస్తవాల గురించిన ఎన్నో వివరాలు మన అవగాహనలోకి వస్తాయి. అలాగే ఆయా సందర్భాలలో ఈ వ్యవస్థను నేర్పరితనంతో ఎలా వినియోగించుకోవచ్చోనూ అర్ధమవుతుంది.
        జ్ఞానేంద్రియాల ద్వారా ఆయా విషయాలకు సంబంధించి మనకు కలుగుతున్న జ్ఞానం రెండు రకాలుగా ఉంటోంది. ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి అవెలా ఉన్నాయో అలానే తెలియడం, అవెలా ఉన్నాయో అలాకాక, మరోలా తెలియడం జరుగుతోంది. వీటినే యదార్ధ జ్ఞానం అయదార్ధ జ్ఞానం అంటారు. ఒప్పుజ్ఞానం - తప్పు జ్ఞానమన్నా, ప్రమ - భ్రమ అన్నా సత్యం - అసత్యం అన్నా ఉన్నది ఉన్నట్లు తెలియడం, లేనిది ఉన్నట్లో, ఉన్నది ఉన్నట్లు కాక మరోలానో తెలియడం అన్నా ఒకే అర్ధాన్నిస్తాయవన్నీ. అంటే జ్ఞాన సిద్దాంత క్షేత్రంలో వాటిని పర్యాయ పదాలుగా వాడవచ్చన్నమాట.
  •   వాడుకలో, వాస్తవం, యథార్ధం, సత్యం, నిజం అన్న పదాలు ఒకే అర్ధంలో వాడేస్తూ ఉంటారు. (వినియోగించడం కనపడుతుంది) కానీ జ్ఞానసిద్దాంతం ప్రకారం ఆ పదాలుదేని అర్ధాన్ని అవి కలిగి ఉన్నాయి. ఒక్కో పదం ఒక్కో దగ్గర మాత్రమే వాడవలసినదిగా ఉంటుంది. అంటే దేని అర్ధం దానిదేనన్నమాట.
  •   అలాగే మనమెవరమైనా ఒక విషయాన్ని గురించి, ఎవరో ఒక తను చెప్పింది విని, అది నీకెలా తెలిసింది అనిగానీ, అది నిజమేనని ఎలా చెపుతున్నావు అనిగానీ మరొకరు - మనం - అడిగామనుకోండి. దానికతడు, అది నేను స్వయంగా చూసి చెపుతున్నాననో, స్వానుభవం ద్వారా తెలుసుకుని చెపుతున్నాను అనో అనగానే, అతడు చెప్పింది సరైందేనన్న నిర్ణయానికి సాధారణంగా వచ్చేస్తుంటారు (ము). కానీ జ్ఞాన సిద్దాంతం, ఒక వ్యక్తి చూసి చెపుతున్నానన్నంత మాత్రాన, లేదా స్వానుభవం ద్వారా చెపుతున్నా నన్నంతమాత్రాన, అతనన్నది సత్యమేనని (యథార్ధమేనని లేదా ఉన్నదేనని) నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంలోనూ భ్రమలుండే అవకాశం ఉంది గనుక, కలిగిన జ్ఞానం సరైందో కాదో కూడా తేల్సుకున్నాకనే అంతిమ నిర్ణయానికి రావలసి ఉంటుందన్న జాగ్రత్తనూ జత చేస్తుంది. సరైన రీతిలో తెలుసుకోవడమంటే ఏమిటో, అలా తెలుసుకున్న దానిని, మరలా సరైన రీతిలో సరిచూసుకోవడమెలానో కూడా వివరించి, అభ్యాసరూపాన్నీ జోడించిన జ్ఞానసిద్దాంతమే సరైందీ, సమగ్రమైనదీ అవుతుంది. అత్యంత కీలకమైన ఈ సాధారణ సూత్రాన్ని అర్ధం చేసుకుని, ఆయా సందర్భాలకు అన్వయించగలిగే నైపుణ్యం - సామర్ధ్యం - సంపాదించుకోకుంటే, జీవితంలో ఎదురుపడే మౌలికమైన కీలకమైన సందర్భాలలో సరైన నిర్ణయాలకు రావడం కష్టమవుతుంది.
    వెనుకటి తాత్వికులలో కొందరు ఈ విషయాన్ని నిర్వహించగల విలువైన పాత్రను సుస్పష్టంగా గమనించారుగనుకనే దీనికి సంబంధించిన ఒక సాధారణ సూత్రం ఉనికిలోకి వచ్చింది.  
      సూ :- 'కాణాదం - పాణినీయంచ సర్వ శాస్త్రోపకారకం'
      సాంప్రదాయంలో కాణాదం అంటే తర్కశాస్త్రమని, పాణినీయమంటే వ్యాకరణ శాస్త్రమని రూఢి. తర్కశాస్త్రము - వ్యాకరణ శాస్త్రములన్నవి సర్వ శాస్త్రాలకు ఆధారంగానూ, ఉపబలకంగానూ పని చేస్తాయన్నది సూత్రార్థం. అవి లేకుంటే ఏ సిద్దాంతాన్నీ రూపొందించలేమన్నది నిజం.
       వారెవరో సూత్రీకరణ చేశారనిగాక, మనలో ఎవరం, ఎప్పుడు, ఈ అంశాన్ని పరిశీలించి చూసినా, ఏరకమైన సిద్దాంతాలు రూపొందించాలన్నా, ఆ సిద్దాంతకారులకు తార్కిక శక్తీ, భాష మీద పట్టు తప్పనిసరి అన్నది తెలిసిపోతుంది.
       అంతేకాక, వ్యక్తి జీవితంగానీ, సామాజిక గమనం గానీ, వాటివాటికున్న జ్ఞానము, అవగాహనల ననుసరించే సాగుతుంటాయన్నది మనందరి అనుభవంలో ఉన్నదే. కనుక, కేవలం శరీర నిర్మాణంలో అమరి ఉన్న ఆయా జ్ఞానార్జనా పరికరాలు, అవి పని చేయగల తీరు వాటి సామర్ధ్యాలను సహజ స్థితిలోనే ఉంచితే వాటి వినియోగం చాలా పరిమితమైందిగానూ, దాదాపు జంతు దశతో సమానంగానే ఉంటుంది. ఎలా మనకున్న కరచరణాది అవయవాలను, ఒక క్రమ పద్దతిలో శ్రమకు, శిక్షణకు లోను చేస్తే అలాటి పరిశ్రమ చేయనివారికంటే, ఎన్నో పనులు, ఎంతో ఎక్కువ పని తక్కువ శ్రమతో, నైపుణ్యంతో (చక్కగా) చేయగలగడం జరుగుతుందో, అలానే, జ్ఞానక్షేత్రంలోనూ మనకున్న పరికరాలను ఒక క్రమ పద్దతిలో, శిక్షణకులోను చేస్తే అవీ అధిక సామర్ధ్యాన్ని నైపుణ్యతనూ సంతరించుకుని, తక్కువ శక్తితో ఎక్కువ పని, చక్కగా చేయగలుగుతాయి. కనుకనే జ్ఞానక్షేత్రానికి సంబంధించినవే అయిన ఏ సిద్దాంతాలకైనా మేధో సామర్ధ్యమూ, భాషావిజ్ఞత అన్నవి సహకార శక్తులవుతాయన్న సూత్రం ఏర్పడింది.
  •   మెదడు - జ్ఞానార్జనా వ్యవస్థ కంతటికీ ప్రధానమైనదీ, కీలకమైనదీ అయిన మెదడు - పనితీరు మరింత శక్తివంతం కావడానికీ, నైపుణ్యతను సంతరించుకోడానికీ, మేధో సామర్థ్యాన్ని పెంచే క్రమబద్ధమైన అభ్యాసం చేయాల్సి ఉంటుంది. జ్ఞాన సిద్దాంతంలో అందుకు కావలసిన విధివిధానాలు, అభ్యాస ప్రక్రియలూ చెప్పబడి ఉంటాయి.
  •   మెదడు చేసే పనుల్ని ప్రధానంగా ఐదుగా చెప్పుకోవచ్చు.
         1. గ్రహణ 2. ధారణ 3. స్మరణ 4. చింతన 5. సృజన అనంటారు వాటిని, ఈ ఐదు రకాల పనులను ఒక క్రమంలో అభ్యాసం చేయించితే మేధోసామర్ధ్యం పెరుగుతుంది. జ్ఞాన క్షేత్రంలో మెదడు చేయాల్సిన పనుల విషయంలో దీర్ఘకాలం పాటు వ్యాయామం - పరిశ్రమ చేయించగలిగితే మేధావిత్వం సిద్ధిస్తుంది. అంటే గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం గుర్తుకు తెచ్చుకోవడం, చక్కగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, ఊహాశక్తి పెరగడం జరుగుతాయి. వీటినే మేధోసామర్ధ్యాలనేది.
కనుకనే 'లక్షణ ప్రమాణ విద్య' అనేది అభ్యాస విద్యల కోవకు చెందిందైయ్యింది.
గమనిక :- జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచనా అన్న రెంటినీ కలిపే మేము లక్షణ ప్రమాణ విద్య అనంటున్నాము. అది అభ్యాసిక విద్య కనుక, వింటేనో చదివితేనో, చూస్తేనో రాదు. నేర్పితేనే అలవడుతుంది. అభ్యాసిక విద్యలనదగ్గవేవైనా పనితో ముడిపడి, పని ద్వారానే తెలియడం, చేతనవడం జరుగుతుంది. కనుకనే సాంప్రదాయం తర్క విద్యను నేర్చడానికి (తెలుపడానికి కాదు, నేర్పడానికి) దీర్ఘ కాలం నేర్పేవాని దగ్గరుండి నేర్వాలి అనంటోంది. గతంలో 10, 15 ఏండ్ల నుండి 20, 30 ఏండ్ల పాటు దీనిని అభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు.
అనేక మంది తాత్వికులు వారివారి దృష్టి కోణం నుండి ఎవరి జ్ఞాన సిద్దాంతాన్ని అంటే ప్రమాణాలను పదార్ధాలను, వారు ప్రకటిస్తూ వచ్చారు. అవన్నీ లభ్యమవుతుండగా, ఈనాడు మళ్ళా నేను మండలి జ్ఞాన సిద్దాంతమంటూ మరోదాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న అధ్యయన పరుల్లో కొందరికైనా వచ్చే అవకాశం ఉంది. రెండు రకాలుగా దీనికి సమాధానం చెప్పుకోవచ్చు.
1. ప్రతి తాత్వికుడూ లేదా తాత్వికులెందరో అప్పటికే అంతకు ముందటివారు రూపొందించిన జ్ఞాన సిద్దాంతాలున్నప్పటికీ, తానూ తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని ఎందుకు తయారు చేసి సమాజం ముందు పెట్టినట్లు? ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరచన చేసినట్లు?
శాస్త్రీయ రచనలు చేసే సందర్భాలలో, ఒక సాంప్రదాయం అమలవుతోందీ దేశంలో, రచయిత తన రచన యొక్క అవసరాన్ని తెలిపే సందర్భం అది. రచనలో అపూర్వత - అప్పటి వరకు లేనిదేదో ఉండడం - ఉండాలి.
గమనిక :- ఈ అపూర్వత - ఇంతకు పూర్వపు వాటిలోలేని కొత్తదనం - అనేక రూపాలలో ఉండవచ్చు. ఉదా :- వెనకటి వాటిలోని దోషాలను - లోపాలనూ ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసే రూపం అయ్యుండవచ్చు. భాషా పరంగా, ఒక స్థాయి భాష నుండి మరోస్థాయి భాషలోనికి మార్చడం రూపంలోనూ ఉండవచ్చు. తులనాత్మక పరిశీలన రూపంలోనూ ఉండవచ్చు. అలా అపూర్వత అంటే అప్పటి వరకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో లభ్యంకానిది ఏదో ఉండడం, అది మనకు ఉపయోగపడగలిగి ఉండడం లేదా అవసరమైందై ఉండడం జరిగితే, అపూర్వత అన్న లక్షణాన్ని కలిగి ఉందనే అర్ధం. ఆ దృష్టి నుండి గనక చూస్తే మండలి జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచన అన్న విభాగాలలో వెనకటివాటిలో చోటు చేసుకుని ఉన్న కొన్ని దోషాలు లేకుండా ఉండడం కొన్ని లోపాలను సరిచేసుకున్న సమాచారంతో ఉండడం అన్నదే కాక, ఆనాటి వాటిలోని జఠిల పదాలు, సమాసాలను చాల వరకు సరళమైన రీతిలో చెప్పడం జరిగింది. తర్కం కర్కశమైంది అన్నమాట నుండి, అంతేమీ కర్కశమైంది కాదులే అన్న దృష్టిని కలిగించే రీతిలో ఉందిది.
       వెనకటి కాలంలో తర్కము, తర్కవిద్య ఎవరో కొందరు మేధావులకు అవసరమైంది మాత్రమే నన్న దృష్టి బలంగా ఉండేది. సిద్దాంతరాద్ధాంతాలకు, వాద ప్రతి వాదాలకు చెందింది మాత్రమే అది. పండిత ప్రకాండుల కొరకే ఆ విద్య అన్నట్లుండేది. కాని, స.మండలి, తర్కం ప్రతి మనిషికీ అవసరమైందనీ, ఏదో ఒక సందర్భానికి గాక, నిత్యజీవితంలో, నిరంతరం అవసరపడుతుండేదేనన్న వాస్తవన్ని బలంగా ప్రతిపాదించి, దానిని అందరికీ అందుబాటులోనికి తేవాలని ప్రతిపాదిస్తోంది. తర్కించడమంటే ఎడ్డిమంటే తెడ్డెం అనడం కాదనీ, నందంటే పందనడం కాదనీ, అవునంటే కాదనడం కాదనీ ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. తర్కశాస్త్రమంటే సక్రమాలోచనా నియమాలను, శాస్త్రీయ పద్ధతిలో వివరించి, అభ్యాసమూ చేయడానికి వీలైన సూత్రాలున్న సిద్దాంత గ్రంధమనీ చెపుతుంది. అది మేధోసామర్ధ్యాల పెంపుకు, తప్పనిసరైన విద్య అనీ, ప్రతి మనిషికీ అతడు శిక్షణ పొందే వయస్సుకు చేరినప్పటి నుండి ఆయా వయస్సులకు తగిన రీతిలో తార్కికశక్తి ఇనుమడించేలా విద్యా విభాగం ద్వారా తెలిపి, నేర్పి, అలవడజేయడం, ఏ సమాజానికైనా తప్పనిసరి అనీ చెపుతుంది.
జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన మెర్పడుతున్న క్రమమేమిటి? ఏయే పరికరాల ద్వారా, ఏయే విధానాలలో జ్ఞానం కలుగుతుంటుంది. ఎన్ని రకాల విషయాలకు చెందిన జ్ఞానం కలుగుతుంటుంది? ఒప్పుజ్ఞానము, తప్పుజ్ఞానములంటే ఏమిటి? అవి ఎందుకెర్పడుతున్నాయి? తప్పు జ్ఞానం కలక్కుండా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? తప్పు జ్ఞానం వల్ల కలిగే అనర్ధమేమిటి? ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? ఒప్పు జ్ఞానం వల్ల కలిగే మేలు ఏమిటి? కలిగిన జ్ఞానం సరైందో కాదో నిర్ణయించుకునేదెలా? వగైరా, వగైరా జ్ఞాన క్షేత్రానికి సంబంధించిన పలు విషయాలను ఒక క్రమ పద్ధతిలో వివరించి, దానిని అభ్యాసం చేయడమెలానో తెల్పి, మనిషి, యోగమైన జ్ఞానంతో జీవించేందుకు అవసరమైన భూమికను అందిస్తుందీ జ్ఞానసిద్దాంతం.