Showing posts with label అభ్యాసక్రమము. Show all posts
Showing posts with label అభ్యాసక్రమము. Show all posts

Wednesday, June 9, 2021

మేలుకొలుపు 13

మేలుకొలుపు

సంపుటి-2                                         సంచిక-3                                               1-3-92

ప్రమాణ వివేచన  4

 మానవ జీవితానికి గల తర్కావశ్యకతను గురించీ, దానిని ఒక విద్యగా నేర్వవలసిన అవసరాన్ని గురించీ ప్రతి సంచికలోనూ కొద్దికొద్దిగా పరిశీలిస్తూనే వస్తున్నాము. దానికే చెందిన మరికొన్ని వివరాలున్నూ ప్రస్తావిస్తున్నాను పరికించండి. ఏ విషయాన్ని గూర్చి తెలుసుకుందా మనుకుంటున్న వారైనా ముందుగా ఆ విషయాన్ని గూర్చి అప్పటికేమయినా సమాచారం అందుబాటులో ఉందేమో చూస్తాడు మామూలుగా. మీకే ఒక విషయాన్ని గురించి తెలిసికోవా లనిపించిం దనుకోండి. ఏo చేస్తారు? ఆ విషయం తెలిసిన వారెవరైనా ఉన్నారా? అని విచారిస్తారు. వారిని కలసి వీలైనంత సమాచారాన్నిసేకరిస్తారు. వాటిని లోతుగానూ, నిదానంగానూ పరిశీలించి దోషాదోషాలు విశ్లేషించి స్వానుభవంలో అవెట్లున్నాయో సరిచూసుకుని ఒక నిర్ధారణకు వస్తారు. సాధారణంగా ఎవరైనా యిలానే చేస్తారు. ఈరోజు విశ్వవిద్యాలయాలలో విశేష జ్ఞానరూపమైన పరిశోధనలందు సిద్ధాంత వ్యాసాలు ప్రతిపాదించే అధ్యయన శీలురున్నూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రాచీన మేధావులున్నూ జిజ్ఞాసువులకీ క్రమాన్నే బోధించారు.

గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరఃI

ఫలాలమివ ధాన్యార్ధీ త్యజేద్గ్రంథమశేషతః.II

జ్ఞాన విజ్ఞానములను లక్ష్యముగా నెంచిన మేధావి ముందు గ్రంథాధ్యయనం చేయాలనీ, ఏదో ఒక రోజు-అది అనుభవజ్ఞానం పొందిన రోజే-గ్రంథాదులను ఆమూలాగ్రం విడువవలెననీ శ్లోక తాత్పర్యం. మరో విషయం. తర్కమే జ్ఞానగమ్యమనో, తర్కం జీవితానికంత ప్రధానమైనది కాదనో తలచే రెండు దృక్పథాలూ, భ్రమాత్మకాలే. మరో శోచనీయమైన విషయమేమంటే మానవజీవితంలోని వివేక భాగాన్ని సమగ్రమూ, సమర్ధవంతమూ చేసికుని తద్వారా జీవనాన్ని ధార్మికమూ, సుఖశాంతియుతముగా నడుపుకొనుటకుగాను వినియోగించుకోవలసిన తర్కమును నేడు కేవల మొుక జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు తర్కం నేర్చినవాళ్ళు. ఇప్పుడు నేర్చుకునేవాళ్ళున్నూ వృత్తిగానే (ఉద్యోగ సముపార్జనకే) నేర్చుకుంటున్నారు. నిజంగా తర్కం కేవల మొక పొట్టకూటి విద్యకాదు. కారాదుకూడా. వివేకమన్నది జ్ఞాన నేత్రంగా చెప్పుకుంటే, దానిని తయారు చేయటానికి తర్కం నిమిత్త కారణమవుతుంది. అనుభవం ఉపాదాన కారణమవుతుంది. తర్కానికి ప్రారంభం ఏదేని విషయములో అనిశ్చిత స్థితి ఉండడమే. సంశయమే విచారణకు మూలం. ఈ వాస్తవం తర్కశాస్త్రంలోనూ ప్రస్తావించబడింది. సంశయించక పరీక్షించుటే కుదురదు కనుకనే న్యాయదర్శనంలోనూ పదార్థ పరీక్ష సంశయంతో ప్రారంభమవుతుంది. ఈ వాస్తవాన్ని ఆస్తిక సాంప్రదాయకులెందుకు గమనించరో, గమనించామని ఎవరైనా అంటే మరి వారివారి సిద్ధాంత పరీక్షకెందుకు సిద్ధపడరో నావరకు నాకు బోధపడని విషయం. ఈ మాటెందు కనవలసివస్తోందంటే, ముఖ్యమైన అన్ని సిద్ధాంతాలవాళ్ళూ తర్క ప్రావీణ్యులే అయినప్పటికీ, అన్ని ఆస్తిక సిద్ధాంతాలకూ ప్రాతిపదిక విశ్వాసమే అయి ఉన్నది. పరస్పర విరుద్ధములైన ఈ రెంటికీ వారికి సమన్వయం ఎలా కుదిరిందో అర్థం కాని విషయం.

Note:-ఏ విషయమైనా ఒకనికి అది విశ్వాసంగా ఉన్నంతవరకు అతనికి దానిని గురించిన తెలియనితనం ఉన్నట్లే. ఒకవేళ ఎప్పటికైనా ఎవరికైనా దానిని గురించిన జ్ఞానం అనుభవం కలిగిందంటే ఇక ఆ విషయమై అతనికి విశ్వాసమన్నది లేదు. తెలిసే ఉంది కనుక. విశ్వాస మూలకములైన సిద్ధాంతానుయాయు లుపయోగించు తర్కము విశ్వాసానికి-తెలియనితనానికి-అనుయాయియై తన స్వీయ స్వభావాన్నే కోల్పోతుంది. ఈ విషయమూ ముందుముందు విశేష చర్చనీయాంశం కాబోతోంది కనుక ప్రస్తుతానికిదీ ఒక చర్చనీయాంశమే నన్నది గుర్తులో ఉంచుకోండి చాలు.

తర్కం మానవ మేధో ప్రక్రియలో- మెదడు చేసే పనిలో- భాగంగా సహజంగానే ఏర్పడియుండగా దానిని నేర్పడమూ, నేర్వడమూ ఎందుకన్న పక్షాన్ని గూర్చి గతంలో కొంత విచారించాము.

వారినీ, వారి వాదనా సబబుగానే ఉందనుకునే కొందరు పాఠకులనూ, దృష్టి నిడుకుని క్రింది విషయాలు వ్రాస్తున్నాను. (1) ప్రతి మనిషికి కాళ్ళూ, చేతులూ ఉన్నాయి. అవసరమైతే ఆత్మరక్షణకు వాటిని ఉపయోగించడమూ ప్రతి మనిషికి తెలుసు. మరింక ఆత్మరక్షణ విద్యలంటూ నేర్వడమెందుకు? నేర్పడమెందుకు? అలానే ఇప్పటి వరకు మానవ సంఘంలో పుట్టి పెరిగిన అన్ని విద్యల విషయం తోనూ మొదటివాడికి గురువేడీ అని అడిగి, వీటిని ఎవరికి వారే సాధించుకోవచ్చు, అని తర్కబద్దంగా వాదించవచ్చు. అది ఒకరకంగా నిజమూ కావచ్చు. వీటిని ఎవరికి వారే నేర్వవచ్చు. అయినా అవన్నీ నాటినుండి నేటివరకు విద్యారూపాలుగా నేర్పబడుతున్నాయి. నేర్వబడుతున్నాయి, కనుక, వాటిని ఎవరికి వారే నేర్వవచ్చు వాటికై విద్యాలయాలూ, బోధనలూ, నిరర్ధకమనడం వివేకవంతం కాదు. అదలా ఉంచి, సాంప్రదాయక తర్కాన్ని పరిశీలించవలసిన-నేర్వవలసిన అవసరం లేదనుకునే వాళ్ళకు నేచెప్పేదేమంటే ఈ అంశాన్ని పరీక్షకు పెట్టి చూసుకోండి. ఒక్క ఆరుమాసాలు నిజమైన విద్యార్థిలానో, నిష్పాక్షిక పరిశోధకుని లానో ప్రాచీన తర్కాన్ని-తర్క విద్యను-అభ్యసించండి. పూర్తయిన పిదప ప్రారంభానికి ముందున్న బుద్ధి వికాసానికీ, ప్రస్తుత జ్ఞాన స్థాయికి తేడా ఉందో లేదో చూసుకోండి. విషయం పరిశీలనా సామర్థ్యంలోనూ, విషయజ్ఞతలోనూ అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉందో లేదో గమనించండి. అలా చేయుటవలన విషయాన్ని అనుభవం ద్వారా పరీక్షించినట్లౌతుంది.

Note- : కలిగిన జ్ఞానం సత్యమా కాదా? అందిన సమాచారం (అనుమాన శబ్ద ప్రమాణాల ద్వారా) సత్యమా కాదా? నిర్ణయించుకోడానికి మనిషికున్న ఆధారం ఒక్కటే. అది యదార్ధ అనుభవమే. అదే-స్వతః ప్రమాణం

మీ, మీ పరిశీలనల ద్వారా మీరు ప్రాచీనులలోని దోషాదోషాలను నిర్ణయించగలగడమూ, వెనుకటివారు భ్రమపడినవిషయాలకు చెందిన వాస్తవాన్ని గ్రహించడమూ చేయగలిగినప్పటికీ, వెనుకటి వారిచే చెప్పబడిన ఆయా విషయములను అధ్యయనం చేయడం నిష్ప్రయోజనం మాత్రం కాదు. ఈ విషయాన్ని తర్కం అక్కరలేదనే నవీన వేదాంతులూ, హేతువాదు లనుకునేవాళ్ళూ, తగినంత విషయావగాహన లేకనే తమను తామే జ్ఞానులుగా చెప్పుకునే వాళ్ళు కూడా స్పష్టంగా గమనించడం అవసరం.

అలానే, తార్కికత మానవస్వభావం కనుక తర్కం నేర్వనక్కరలేదనే వాళ్ళను నేనడిగినదేమంటే, సహజ తార్కికులారా! వెనుకటివాళ్ళ ఏ పరిశోధితాంశాలనూ స్వీకరించకుండా మీ స్వాభావిక తర్కశక్తి ద్వారానే యీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. 1) జ్ఞాన మెన్ని రకాలు? 2) పదార్ధా లెన్ని? 3) భ్రమలెన్ని రకాలు? మానవుడు పొందవలసిందేమిటి? దానిని పొందటమెలా? ఇతరుల భావాలు మీపై పడకుండా సమాధానాలు చెప్పండి చూద్దాం.

ఏతావాతా నే చెప్పదలచుకున్న దేమంటే, ఆయా విషయాలను సాధించిపెట్టు పరికరములమరి ఉన్నంత మాత్రానే ఫలితాలు జనించవు. ఉపయోగించు మెలకువల నెరుంగుటా, ఉపయోగించు అభ్యాసము ద్వారా నిపుణత సాధించుట అన్న విన్నీ సమకూడినప్పుడే ఫలితం కోరినస్థాయిలో సిద్ధిస్తుంది, కనుక ఎంతగా మానవునిలో తర్కించే స్వభావమున్నా, తార్కికంగానే జీవిస్తున్నాడని ఒప్పుకున్నా, తర్కాన్ని సంపూర్ణంగా జీవితంలో వినియోగించుకోగల నేర్పుకై దానిని విద్యగా నేర్వవలసియే ఉన్నది. దీనిపై మీ, మీ యభిప్రాయాలను వ్రాయండి.

ప్రమాణముల పేర్లు ఏ దృష్టినుండి ఏర్పరచడం జరిగింది? అన్నది ప్రస్తుత పరిశీలనాంశమై యున్నది. ఫిబ్రవరి సంచిక చూసిన పిదప శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారు వ్రాసిన లేఖను కూడా ప్రచురించడం ఈ విషయంలో జిజ్ఞాసువుల పరిశీలనకు కాగలదని అనిపించుటచే దానినీ వ్రాస్తున్నాను. మIIశ్రీII 1-2-92 సంచిక అందినది. నా ప్రశ్నకు సమాధానము సరిగా లేదు. ప్రత్యక్షమను ప్రమాణము శ్రోతనేత్రాదులకంటె వేరా? కాదా? అని నా ప్రశ్న. వేరనిగానీ, వేరుకాదనిగానీ సమాధాన ముండాలి. ఏదో వివరణ యిచ్చారు. అది నా కంత అవసరము గాదు. వేరే అంటే ఆరింటికంటె వేరైన ప్రత్యక్ష ప్రమాణమేమో చెప్పాలి. వేరు కాకపోతే పద్ధతుల ననుసరించి ప్రమాణములను వాటిలో ప్రత్యక్షమును చేర్చరాదు. మొదటి వర్గములోనే '6'న్నూ చేరినవి కనుక.

మీరు “రంగు” అంటూ ఏదో వ్రాశారు. రంగు అనునది సామాన్యవాచక శబ్దము. ప్రత్యక్ష ప్రమాణమనునది కూడా అటువంటిదే. తెలుపు, నలుపు, ఎరుపు ఇత్యాదులు రంగు యొక్క విశేషముల చెప్పు శబ్దములు. విశేషములకంటె విడిగా సామాన్యముండదు. అంటే తెలుపో, నలుపో, ఎరుపో కాక ఇంకా రంగు అనేది ఒకటి వేరే ఉండదు. అట్లే ప్రత్యక్ష ప్రమాణముకూడా. శోత్రమో, నేత్రమో ఇత్యాది ‘6’ కాక వేరే ప్రత్యక్షముండదు. అనునంతవరకే నాకు తెలిసిన అంశము.

మీరు ప్రత్యక్ష ప్రమాణ విశేషములగు శోత్ర నేత్రాదులారింటినీ మొదటి వర్గములో చేర్చినారు. [మొదటి వర్గమంటే పరికరముల ననుసరించి ప్రమాణములన్న వర్గమని పాఠకులు గమనించాలి-సురేంద్ర] ఇక దానికంటూ అన్యమైన ప్రత్యక్ష ప్రమాణమేదేని ఉంటే దానిని రెండవ వర్గములో చేర్చవచ్చు. కానీ ఆ ఆరింటికీ అతి రిక్తమైన ప్రత్యక్ష ప్రమాణం నాకు తెలియదు. మరొక్కమాట. మీరు అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? అని ఓ మాట న్నారు. దీనినిబట్టి అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లు అర్థమగుచున్నది. అలా అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీ భావమా? ప్రమాణ వివేచన ఆరంభించినప్పుడు మీరన్న ప్రాచీనులు కానీ, మీ సమకాలీనులు కానీ ఎటువంటి అభిప్రాయములు కలిగియున్నారో పేర్కొని, వారి యభిప్రాయములలోగల దోషమేమిటో తెలిపి, మీ అభిప్రాయమునకూ, వారల అభిప్రాయములకూ గల భేధమేమో వివరించి, ఎందువల్ల ఆ భేదమేర్పడిందో వివరించితే కొంత విషయ స్పష్టత ఉండేదేమో ననిపించుచున్నది. సరి. సంతకం.

సురేంద్ర :- ఈ విషయమై నేనిప్పటికే వెలిబుచ్చిన అభిప్రాయములను క్రోడీకరించి చూపుతాను గమనించండి.

1] ప్రమాణమన్నమాట జ్ఞానార్జనలో ఉపయుక్తమవుతున్నది. అది పరికరములనూ, పద్ధతులనూ సూచించగలదు.

2] ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ ఇత్యాది పేర్లు పరికరముల యందలి తేడాలను సూచించునవిగా కాక, ప్రక్రియా విశేషములను సూచించునవై యున్నవి.

3] ప్రమాకరణం ప్రమాణం అని వివరణ చేస్తూ కరణమింద్రియం అని అన్వయించినచో, ప్రమాణముల పేర్లూ, సంఖ్యా ఇంద్రియాల పరంగా నిర్ధారించవలసి వస్తుంది. కానీ అవి అలా లేవు.

4] ప్రత్యక్ష మొక్కదానిలోనే “6” ఇంద్రియాలు చేరిపోతాయి. మరి విుగిలిన ప్రమాణాల కింద్రియాలేవి? అన్న ప్రశ్నకు ప్రమాకరణం ప్రమాణం, ప్రమాణమింద్రియం అన్నవాళ్ళే సమాధానం చెప్పవలసి ఉంది.

5] ఒక్క ప్రత్యక్షంలోనే “6” జ్ఞానేంద్రియాలూ ఇమిడిపోతాయి. పరికరాలననుసరించే ప్రత్యక్షాది పదములు ఏర్పాటుచేసి ఉంటే అనుమానమూ, శబ్దమూ నన్న పేరు నిరర్థకమౌతాయి.

        6] ప్రత్యక్షంలో ఆయా ఇంద్రియాలు ఆయా విశేష విజ్ఞానాలకు ప్రమాణం లౌతాయి. వాటి పేర్లూ వాటికి సంబంధించే ఉంటాయి. నేత్ర ప్రత్యక్షం వగై రా. సరే.

అదీకాక రంగు సామాన్యవాచక శబ్దమై ఎరుపాదులు విశేషత్వబోధకాలై నప్పటికీ ఎరుపూ, రంగూ ఒకే పదార్థమును సూచించు పదము లనరాదు. అవి పర్యాయ పదములు కావు. ఎందుకనగా రంగు అన్న పదార్ధాని కన్యంగా ఎరుపు ఉండదుగానీ ఎరుపు లేకున్నా రంగు ఉంటుంది. అలానే అవయవావయవిలన్న రెండు పదార్ధములనూ విడదీసి చూపలేకపోయినా, అవయవాలకంటే అన్యంగా అవయవి లేకున్నా అవి రెండు పదములూ, రెండు పదార్ధములూ అనాల్సిందే. పదార్థవివేచన అలా చేయవలసిందే. కనుక ప్రకరణోద్దేశాన్ననుసరించి ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అన్న పేర్లు ప్రకార భేదాలననుసరించిపెట్ట బడినవే. అయితే ప్రత్యక్ష పద్ధతిలో కలుగుతున్న జ్ఞానానికాధారం ఇంద్రియాలే.

ఆచార్యులవారే, మరోమాట అంటూ “అనుమాన ప్రమాణాని కింద్రియ మేదందాము” అన్న నా మాటను ప్రస్తావించి, అనుమాన ప్రమాణం కూడా ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లున్నది. అవునా? అని అడిగారు. ఇక్కడ నామాటేమిటంటే సంచికను వారూ, పాఠకులూ కూడా మరోసారి చూడమని. ఎందు కంటే ప్రమాణ పద నిర్వచనంలో ప్రమాకరణం ప్రమాణం అని, ప్రమాణ మింద్రియం అను పక్షంవారు సమాధానం చెప్పవలసిన అంశంగా ఆ ప్రశ్న వేశాను. నా ప్రతిపాదన దృష్టినుండీ అది అసంబద్దమనే కదా! ప్రమాణపదములు ఇంద్రియాలనుబట్టి కాక విధానాలనుబట్టి ఏర్పరచారన్నదే నా ప్రతిపాదన.

సాంప్రదాయకులున్నూ ప్రమాణ పదవ్యుత్పత్తి రెండుగా చేశారు;1) ప్రమీయతే ఏన తత్ర్పమాణమ్! 2) ప్రమీయతే అనేన ఇతిప్రమాణం- మొదటిది పరికరాన్ని, రెండవది ప్రకారాన్నీ సూచిస్తాయవి.

ప్రత్యక్ష జ్ఞానకరణ మింద్రియం అనడంలో దొసగేమీలేదుగానీ ప్రమాణ నిర్వచనంలో ప్రమాకరణం ఇంద్రియం అంటే అనుమాన, శబ్దములందు ఇంద్రియ కారణత్వానికి అవ్యాప్తి సంభవిస్తుంది. గమనించగలరు.

ప్రమాణ సంఖ్యపైననూ తార్కికులలో బహుచర్చ సాగింది. కానీ సంఖ్య విషయమై పెద్దగా పెనుగులాడ వలసిన అవసరం లేదు. పోతే కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ మనం నిర్ణయించిన ప్రమాణములలో ఇమడ్చగలగాలి. అదే అసలు విషయం. ఈ దృష్టినుండి చూస్తే(ఆయా పక్షాలవారు, నేచెప్పిన సంఖ్యనే అంగీకరించా లంటూ అక్కరలేని పిడివాదాన్ని పట్టుకోకపోతే) మానవ జీవితంలో కలుగుతున్న జ్ఞానరాశిని, (ఉపయుక్తమవుతున్న జ్ఞానరాశిని) ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ నన్నమూడు వర్గాలలో ఇమడ్చవచ్చు.

 

చేదు నిజాలు-3

చేదునిజాలు ప్రారంభ వ్యాసంలో విద్య గ్రహించవలసిన వాడూ- (విద్యార్థి, జిజ్ఞాసువు, సాధకుడు) విద్యగరపువాడూ [ బోధకుడూ, వక్తా, గురువు] కలసి శ్రమించినగానీ విద్యా ప్రయోజనం సిద్ధించదనీ, అందుకై యిరువురూ వివేక పరంగానూ, హృదయ పరంగానూ కొన్ని అర్హతలు కలిగియుండాలనిన్నీ, అయితే

ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఈ రెండురకాల అర్హతలూ, ఇరువురిలోనూ మృగ్యమై పోయాయనే అనుకున్నాము. ఇవి అన్ని రకాలైన విద్యారంగాలలోనూ ఉండవలసివే ఐనప్పటికి, ముఖ్యంగా వ్యక్తిత్వ నిర్మాణానికి పనికివచ్చే నైతిక, ధార్మిక, తాత్విక కేంద్రాలలో, వీటిని ప్రాణప్రదంగా ఎంచవలసి ఉంది. శోచనీయమైన విషయమే మంటే ఈ కేంద్రాల లోనూ మామూలు విద్యా కేంద్రాల స్థాయిలోనో, మరింకొంత ఎక్కు వగా నేనో కాపట్యమూ, డాంభికతా, స్వార్థ పరత్వమూ, కులవర్గ, వర్ణపిచ్చిలు, భోగలాలసతా, అజ్ఞానమూ కరడుగట్టుకుని పై అర్హతలను పాతాళానికి తొక్కి వేశాయి. వేస్తున్నాయి.

సమాజాన్ని సరైన దిశకు మళ్ళించాలనుకునే హృదయావేదనకల ఆస్తిక, నాస్తిక, హేతువాదాది నానా సంఘాలలోని సహృదయులలోనూ, అట్టిసరైన మార్పు వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మాత్రమే సాధ్యమనే అవగాహన లేకపోవడం, ఒక వేళ ఒకరిద్దరికి ఉన్నా, అది అయ్యే పనికాదులే అన్న ఉదాసీనత ఏర్పడి ఉండడం అన్నది, సమాజంలో - వ్యక్తిలో-మార్పు రాక పోవడానికి, ప్రసంగ ప్రహసనాలకూ హేతువౌతూ ఉంది. సంస్కరణోద్యమ నిర్మాతలలో ఈ విషయమైన వివేకాన్ని మేల్కొల్పడమూ కష్టసాధ్యంగా ఉంటున్నది. ఎందుకని? వారి వారిలో ఒకరకమైన అభిమానం విషయం మనకు తెలిసే ఉంది. పరుల సూచనల లేమిటి గ్రహించేది అన్న భావన-హృదయపు లోపలిపొరల్లో ఉండి ప్రతిబంధకం అవుతోంది. ఇది ఎంతో సున్నిత విషయమగుట వలననూ, దీనిని చెప్పి వప్పించవలసిన వారు మేధావులై ఉండడం వలననూ, మేధావులలో ఉంటున్న శృతిమించిన ఆత్మ విశ్వాసం అడ్డుగోడలా ఉండడం వలననూ, ఇది కష్ట సాధ్య మవుతోంది. ఈ రోజు సమాజ సంస్కరణోద్యమకారులందరూ గమనించవలసిన మౌలిక విషయమిది. ఈ ప్రతి బంధకం ఉద్యమానికో రూపు సంతరించుకోనీయడం లేదన్నదో పచ్చి నిజం.

చేదునిజాలు-2లో, ఆధ్యాత్మిక విద్యాలయాలలో- ఆశ్రమాలూ, పీఠాలు మొ|| -గు వాటిలో- తరచుగా గోచరిస్తున్న అధ్వాన్న స్థితుల గురించి కొంతవరకు ఆవలోకించాము. మన దేహంలో తల భాగానికెటువంటి స్థానము-పాత్ర- ఉన్నదో, మొత్తం సమాజాన్ని ఒక శరీరంగా భావిస్తే అందులో విద్యాలయాలకూ - విద్యా విధానానికి కూడా అట్టి పాత్రే ఉన్నది. మెదడులో అపసవ్యత ఏర్పడ్డ వాడి జీవితంలానే ఉంటుంది సమాజంలో విద్యావిధానంలోనూ, విద్యాలయాలలోనూ అపసవ్యత ఏర్పడితే.  దయనీయమైన అంశమేమంటే ప్రస్తుతం మన మందరమూ అనుభవిస్తున్న ప్రమాదకర పరిస్థితే ఇది. బుర్ర చెడిన వాడి బ్రతుకులా ఉంది నేటి సమాజపు బ్రతుకు కూడా. అయినా పట్టించుకొనే నాధుడు లేడు. పిచ్చి వానికి చికిత్స చేస్తానంటే నీకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి నా కేమిటిరా?! అన్నట్లే, సమాజంకూడా ఆరోగ్యకరమైన చికిత్స చేద్దామన్నా స్వీకరించేట్లు లేదు. అది ప్రమాదకరమైన విషయమే. అయినా అంతకంటే దౌర్భాగ్య కరమైన పరిస్థితేమంటే చికిత్సకులూ; చికిత్సాలయాలుగా నుంటున్న ధార్మిక సంఘాలూ, ప్రచారకులూ కూడా యదార్థంగా రోగగ్రస్తులై చికిత్స చేయించుకోవలసినవిగా నుండుటయే. ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే దీనిని చదువుతున్న వారిలో కొందరకైనా ఎందుకొచ్చిన సొద అనో, ఎవరికి తెలీని విషయమిది అనో, అబ్బా! ఈ నాటికో క్రొత్త సంస్కర్త పుట్టుకు వచ్చాడయ్యా అనే....అవహేళనా పూర్వకమైన ఆలోచనో మదిలో కదలాడుతుండవచ్చు - ఎందుకనో తెలుసా? ఈ అంశ మీనాడు మనిషి నిత్యజీవితంలో సామాన్య విషయంగా - ఆశ్చర్యపడవలసిన అంశంగా కాకుండా-మారిపోయింది. సామాజిక మార్పు అవసర మనుకునేవాళ్ళు కూడా ఉదాసీనులై, క్రియా శూన్యులై ఉండడానికి యీ భావన (ఆఁ... ఇది మామూలేలే, సమాజం కుక్క తోక వంటిది. దానిని సరిచేయలేము లాంటి యోచన) బలీయంగా ఉండడం కూడా ముఖ్య కారణమే. ఎప్పుడూ ఏదో రోగం ఉంటూనే ఉంటున్నది. ఇక మందు తినడమెందుకులే అంటే ఎంత సబబుగా ఉంటుందో ఇదీ అంతే. సమాజంలోని ఏదో ఒక భాగంలో, ఏదో ఒక రకమైన సంఘ వ్యతిరేక శక్తులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయన్నది కాదన లేని వాస్తవమే అయినా సమాజం ఆరోగ్యదాయకంగా ఉండడం, అవసరమైన వాటిని అవసరమైనంతగానూ సాధించుకోగల క్రియాశీలతా, సామర్ధ్యము కలిగి యుండడమూ, ప్రతికూల శక్తులు ప్రమాద స్థాయికి చేరకుండా నిరంతరం జాగరూకత కలిగి యుండడమూ నన్నవి వివేకవంతమూ, అత్యావశ్యకమూ కూడా. సామాజిక శరీరంలోని ప్రతివ్యక్తీ - భాగము - కూడా తన వంతు విధులను నిర్వర్తించుటా, న్యాయబద్ధమైన హక్కులనే అనుభవించడమూ అన్న విధానమునమలు పరుచుట ద్వారానే యిట్టి స్థితిని సాధించడం సాధ్యపడుతుంది. ఇక్కడో విషయాన్ని గమనించండి.

Note: ఉన్నత లక్ష్యాలు కలిగి యున్న నిరాశావాది కంటె అల్ప లక్ష్యాలు కలిగియున్న ఆశా వాది ఎక్కువ క్రియాశీలుడూ, కార్య శూరుడూ కూడా కాగలరు. ఈనాడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసలు - జాడ్యం అకర్మణ్యతా; కుకర్మణ్యతా అన్న వే.

కళ్ళు మూసుకుని ప్రపంచం మనని గమనించడం లేదులే అనుకునే స్వాముల వార్లనేమనుకోవాలి. వారిని చూస్తుంటే “మార్గాల పయః పాన న్యాయం” గుర్తుకొస్తోంది. సమాజం వాళ్ళ ఎదుట వాళ్ళనేమంటోంది, వాళ్ళ వెనుక ఏమనుకుంటోంది అన్న సృహే వాళ్ళకుండదు, ఒక వేళ ఎటునుండైనా విమర్శలు వచ్చినా, వచ్చిన విమర్శలను స్వీకరించి ఆత్మ విమర్శ చేసుకోగల నిజాయితీగానీ, విమర్శలోని వాస్తవాలను స్వీకరించగల ధైర్యంగానీ వాళ్ళకు లేవు. ఎందుకనో తెలుసా? వారి, విద్యార్ధి లేక సాధన దశలలో వాటి ప్రాముఖ్యత నేర్పబడలేదుగదా వాస్తవంగా. ఆశ్రమానికి రావడమే అసాధారణ విషయంగానూ, అనేక జన్మల పుణ్య ఫలంగానూ వారికి బోధింపబడింది. ఇక సమాజం చేసే విమర్శలను పరిశీలించుకునే అవకాశ మెక్కడిది? వారేమో, వారి  పీఠాధిపత్యమూ, కీర్తీ, భోగమూ, ధనార్జనా అబ్బా తీరు బాటే లేదాయె. వారిలో కొందరైనా నిజాయితీపరులుండక పోతారా అన్న సదుద్దేశ్యంతోనే వారి ఆత్మవిమర్శ కేమైన సహకారి కాగలదేమోనన్న వూహ వల్లనే ఒకటి రెండు జరిగిన విషయాలు చెప్పాలనిపిస్తున్నది.

ఆయా సాంప్రదాయ ప్రచారకులనూ, వారి ప్రచార ధోరణులనూ, ప్రజల నాకర్షించుటకై వారు చేయు గిమ్మికులనూ పరిశీలించు సమయంలో విజయవాడలో జరిగిన అనేక సంఘటనలు కూడా నా అవగాహనకు చాల ఉపయోగ పడ్డాయి. జరిగినవే అయిన వాటిలో కొన్నింటిని మీ ముందుంచుతాను గమనించండి. (1) స్థలం కొత్త గుళ్ళు (విజయవాడ-1లో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే చోటు) - ఆధ్యాత్మిక సమావేశాలకూ, సత్సంగాలకూ వాటి- పేరుతో జరిగే నానా భీభత్సకాండకూ కూడా ఆంధ్రదేశంలోనే ప్రముఖంగా చెప్పుకోదగ్గ నగరం విజయవాడ. ఇక్కడ ప్రారంభించని ఆధ్యాత్మిక, ధార్మిక శాఖలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అయితే విజయవాడ పౌరులలోని ప్రత్యేకతేమంటే (అన్ని చోట్లా అలానే ఉన్నారని మీకనిపించవచ్చు ) 1] - అన్నిటినీ ముట్టుకుంటారు దేనినీ అంటించుకోరు.

గమనిక :- విజయవాడలోని సత్సంగాలలో బహుళ ప్రాచుర్యం పొందినదీ, 13, 14 సంIIరాలుగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ, ఇతర సంఘాలతోనూ, సన్నిహిత సంబంధాలు కలిగి యున్న  ఒక సంస్థ ఉంది. దానితో నాకూ చాలాకాలం నేరుగానూ, ప్రస్తుతం ఏదో రూపంలోనూ, బలమైన సంబంధాలున్నా యనే నే ననుకుంటున్నాను. ఆ సత్సంగీయులు పరోక్షంలో ఏమనుకుంటారో గానీ నా ఎదుట మాత్రం నన్ను సంఘ ప్రారంభకులలో ఒకరిగానే యితరులకు పరిచయం చేస్తుంటారు. (బహుశా వారి లౌకిక కొలతల నుండీ, బ్రతకడం

నేర్చిన, ధర్మంగా ఉంటే బ్రతక లేమనే - ఆలోచనల నుండి వారి దృష్టిలో నేనొక దారి తప్పిన సాధకుడై యుండవచ్చు. చాలా కాలం నిజాయితీగా సాంప్రదాయక ఆస్తిక మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించిన నేను, వివేక నేత్రం తెరుచుకున్న కొద్దీ, ఆ మార్గం నుండి దారి తప్పిన మాట నిజమే సుమండీ. అయితే నాస్తికత పేరున నేడున్న ఏ సంప్రదాయానికి కూడా చెందిన వాణ్ణి కాదు నేను. మీ పరిశీలనా సందర్భంలో మీరు నా పై ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకుని నా రచనలు పరిశీలించే ప్రమాదముందనే-అంటే నిస్పాక్షికంగా పరిశీలనలు చేయుట కొరకై-ఇంత మాత్రం చెప్పుకొనుట అవసరం కాగలదని ఈ మాట చెప్పాను. సాంప్రదాయక - ఆస్థికులూ, సాంప్రదాయక నాస్తికులు కూడా సమగ్ర విప్లవానికి తగిన తాత్విక సిద్ధాంత దారుఢ్యమూ, ప్రణాళికా, ఆచరణా కలిగి లేరన్నది నా స్వానుభవం. సిద్ధపడితే ఇతరులకూ ఈ విషయాన్ని ఋజువు చేయగలనుకూడా. సరే.

ఆరోజు క్రొత్తగుళ్ళలో ఉపన్యాసం జరుగుతోంది. రెండు మూడు సిద్ధాంతాలకు చెందిన అస్తిక బోధకులూ, అనుయాయులూ, శ్రోతలతో సభ నిండుగానే ఉంది. ఉపన్యాసకులు ముందు వాక్యానికీ, వెనుక మాటకూ పొంతన లేకుండగనే అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. ఒకరి ఉపన్యాసానికీ, మరొకరి ప్రసంగానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలూ కనబడడం లేదు. మధ్యలో అప్పుడప్పుడూ వాళ్ళ చప్పట్లూ, ఓంకార నినాదమూ వినిపిస్తున్నాయి. సదస్యులు ఎవరి గొడవలో వారున్నారు. ఉపన్యాసకులు ఎవరి సొద వాళ్ళు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్య నిర్వాహక పెద్దలు వేదిక నెక్కి ఇప్పటివరకు మనం జ్ఞానామృతాన్ని చవి చూశాము. చూపించిన వారంతటివారు ఇంతటివారు అని ఉపన్యాసకుని ఆకాశానికెత్తి వేస్తున్నారు.

నగర ప్రముఖులలోనూ, ఆ కార్యక్రమ ఆహ్వాన సంఘ ప్రముఖులలోనూ ఒకరు ఆనాడు వేదిక మీద ఉపన్యసించారు. పేరు పేరున స్వాములను స్మరిస్తూ వారి జ్ఞాన సామర్థ్యాలను, ధర్మ నిరతినీ, నిరాడంబరతనూ, భోగ రాహిత్యాన్నీ అనితర సాధ్యంగా ప్రస్తుతించి నగర పౌరులందరి అదృష్టం పండిన రోజిది. .... వగైరా మరి కొన్ని మాటలు చెప్పి ముగించారు. ఉపన్యాసానంతరం వారే ప్రాంగణం బైట నాకు తారసపడి పలకరించారు. కుశల ప్రశ్నలైనాక ఎవరీ స్వాములు ఏమిటీ కధ? అని అడిగాను. అతనేం చెప్పుంటాడో ఊహించగలరా? ఖచ్చితంగా ఊహించలేరు. ఏమండీ సురేంద్రగారు..... వీళ్ళు స్వాములా? దొంగలు, ఇంద్రియలోలురు, డబ్బుకై నానా వేషాలూ, మాటలూ నేర్చినవారు. పరమ స్వార్ధులు, అజ్ఞానులు.... ఇలా, వేదికపై వారి గుణకీర్తన మెంత స్థాయిలో చేశారో అంతకంటే అధికంగా వారి స్వభావాలను గురించి చెప్పి, కాసుకై మా కాళ్ళ వద్దకు వచ్చిన వారు, అడుక్కునే కళలో ఆరితేరిన వాళ్ళు, జీవితంలో దాన ధర్మాలు గురించి చెప్పని రోజుగానీ, చేసిన రోజు గానీ లేని వాళ్ళు.... ఇలా .... ఇలా... [అతనా నాడు పలికిన ప్రతి మాటా లిపి బద్ధం చేయుట సభ్యత కాదు కనుక ఆ తరహా మాటలు పొందు పరచ లేదు] ఈసడించి వెళ్ళాడు. క్రితం క్షణంలో వేదిక మీద చూసిన అతని స్వరూపానికీ, బయట మరో క్షణంలో కనబడిన అతని అంతరంగానికి ఉన్న తేడా చూసి నివ్వెర పోయాను. అశ్లీలమైన పదాలను విడిస్తే బయట అతడు నాతో అన్న మాటలలో అతిశయోక్తి వుండవచ్చేమో గాని, అవాస్తవం మాత్రం లేదన్నది నిజం. దీనిని మ్రింగడం స్వాములవార్లకూ, ఆశ్రమాధిపతులకూ, ప్రచారకులకూ వారి వారి అనుయాయులకూ కష్టంగా ఉండవచ్చు. అయినా ప్రజలిలా అనుకుంటారన్న విషయం కొందరు స్వాములకైనా తెలియకపోదు. అయినా పై నగర ప్రముఖుల లానే, వీరూ లోపలొకటి బైట ఒకటిగా ఉండగల ఉద్ధండులే. మరింకేం దొందూ దొందే.

2) అదే స్థలం, మరోరోజు, మరోసభ, వేదిక అలంకరించిన ఆనాటి పెద్దలలో యతీంద్రులవారూ ఉన్నారు. ఒక ఉపన్యాసకుడు-అతడు గీతా ప్రచారకుడు కూడా. గీతలోని ఒక శ్లోక పాఠాన్ని చెప్పి వివరించాడు. అది “తన్ని బద్నాతి కౌంతేయ” నాయనలారా అది మామూలుగా బంధించదు. తన్ని మరీ బంధిస్తుంది అని చెపుతున్నాడు. యతీంద్రుల వారికి చురుక్కుమంది. మెల్లిగా అతణ్ణి పిలచి దానర్థం మరొకటంటూ చెప్పారనుకోండి. ఆ మొదటి ఉపన్యాసకుడు తనను తాను సంపూర్ణజ్ఞానిననే భావిస్తున్నాడు. శిష్యుల కొరకై వెదుకులాడుతున్నాడు కూడా !? మీరేం ఆశ్చర్య పోకండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇట్టివీ నాడు సర్వసాధారణం.

3) ఈరోజు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న ఒక స్వామిని విజయవాడకు ప్రప్రధమంగా ఆహ్వానించాలను కుంటున్నారు. పై సత్సంగ స్థాపకు లలో ఒకరు. ఆ విషయం ముందుగా నాకు తెలిసింది. వెంటనే వారిని కలసి మిత్రమా! ధార్మిక సంస్థలు అధార్మికుల తరపున ప్రచారం చేయడమూ, కాలాన్ని, డబ్బునీ అందుకై వినియోగించడమూ, అతనికై కొమ్ము కాయడమూ మీకూ, లోకానికి మంచిది కాదు. ఈ ప్రయత్నం విరమించండి. లేదంటే ముందుగా వారితో ఒక చర్చా వేదిక నేర్పాటు చేయండి మనం మాట్లాడుదాం. ఆపై మీకెలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పాను. వారు నా మాట చాలా తేలికగా కొట్టివేస్తూ దోషం లేని వాడెవడండీ, మోసం లేని దెక్కడండి. అలా వెదికితే మనమేమీ చేయలేం. మాలో లేవా, మీలో లేవా దోషాలు అంటూ ప్రారంభించారు. చివరగా ఒక మాట చెప్పి వచ్చేశాను. మీరాహ్వానించబోయే స్వామికై ఈ నగర ప్రజలు వెచ్చించబోయే ప్రతి క్షణమూ, ప్రతి పైసా అధర్మకార్యానికి వినియోగించినట్లే కాగలదు. మీయిష్టం. మీరిది గమనించేటప్పటికి పరిస్థితి మీ చేయి దాటి స్వామి చేతిలో ఉంటుంది. ఆ స్వామి జనాకర్షణలో అంతటి నిపుణుడు అని. తరువాత జరిగిన సంఘటనలు అక్షరశః నా మాటలు సత్యమని ఋజువైనా యా మిత్రునికి. ఈనాడు సత్సంగీయు లనబడేవాళ్లు సమాజ హితాన్ని హృదయ పూర్వకంగా కోరు కుంటున్నారా? పోనీ ఆత్మోద్ధరణనైనా నిజంగా కాంక్షిస్తున్నారా? ఈ రెండూ గానీ, ఈ రెంటిలో ఏ ఒక్కటిగానీ అతని హృదయగత కాంక్షే అయితే ఇక నాతడు తప్పు చేయుటగానీ, తప్పుడు వాళ్ళకు సహకరించుట గానీ చేయగలడా? ఆలోచించండి.

సంక్రాంతి - విప్లవ సందేశం

 గత సంచికలో సారభూతమైన ఒక వాక్యం చెప్పాను. “రావలసిన-కోర దగిన మార్పు. అందుకై మనం చేయ వలసిన పని” అన్నదే ఆ మాట. మనకి తెలీని విషయమా ఇది అనో, మరో దృష్టినుండో దీనిని నిరాదరణ చేయక ఆగి కొద్దిగా ఆలోచించండి. ఈ భావన ఆధారంగానే సమస్తమూ పరిశీలించాల్సి ఉంది. ఈ  భావనాధారంగా చేసిన పరిశీలనల నుండే సమగ్ర విప్లవ సిద్ధాంతమూ, ప్రణాళికలూ తయారు కావలసి ఉంది. అవునో కాదో చూడండి.

జ్ఞానరూపాలే ఐయున్నప్పటికీ హృదయానికీ, విషయజ్ఞతకూ ఉన్న తేడాను గమనించనంతకాలం మానవునిలో-సంఘంలో రావలసిన మార్పుకు తగిన ప్రణాళిక నేర్పరచడం సాధ్యంకాదు ఎందుకంటే అర్హుడై న-సరైన వ్యక్తిత్వంకల వ్యక్తి తయారు కానంతవరకు సాంఘిక విప్లవం యదార్థంగా సాధించలేము. వ్యక్తిని సమాజము బాహ్యం నుండి అదుపు చేస్తే, వివేకము అంతరికమైన అదుపును కలిగిస్తుంది. బైటా, లోపలా కూడా వ్యక్తి ఏదో రకమైన అదుపు చేయ బడుతుంటాడు. అలా ఉండాలి కూడా. అలా రెండు శక్తులూ విలువైనవే అయినప్పటికీ విప్లవ సాధనలో ఉద్యమకారులు ఆత్మనియంత్రణ కలవారై యుండుట తప్పనిసరి. వివేకంచే జనించిన ఆత్మనియంత్రణ విప్లవకారులకు ఊపిరివంటిది. దీనిని గ్రహించని, గ్రహించినా ఆ స్థాయి లేని విప్లవ సంఘాలవల్ల విప్లవ లక్ష్యాలు సాధింపబడవు. కాకుంటే ఆవేశపూరిత నినాదాలూ, బంద్ లూ, విధ్వంసకాండలూ, ఎన్ కౌంటర్లు సాధింపబడవచ్చు. కదాచిత్ ఏవైన సంస్కరణలు జరిగినట్లు గోచరించినా అవన్నీ తాత్కాలికాలే కాగలవు. ఈనాడున్న విప్లవ పంథాలన్నింటా దాదాపు ఈ లోపం-(వ్యక్తిత్వం-వివేకం కల వ్యక్తులు లేని లోపం) కొట్టవచ్చినట్లుగా ఉంటోంది. సిద్ధాంతాలూ ఆవేశకావేశాలూ, వర్గపోరాటాలూ ఉన్నాయే గానీ; సిద్ధాంత లక్ష్యాలను సాధించ గల వ్యక్తిత్వమున్న వ్యక్తులు లేరు. వివేకమూ, సహృదయతా సరైనపాళ్ళలో మేళవింపబడని విప్లవశక్తుల త్యాగాలూ, ఉద్యమాలు కూడా ఆత్మ వినాశనానికో, తమకన్యులైన వారి వినాశనానికో హేతువులౌతాయి. ఇట్టివారు ఆవేశంలో ఆత్మత్యాగమైనా చేసుకుంటారు. అన్యులను చంపనైనా చంపుతారు. ఇదినాడు మనందరికీ - అనుభవంలోనున్న విషయమేనంటాను. మీరేమంటారు?

ఇష్టమూ, అయిష్టమూ, పట్టుదలా, చపలత్వమూ, ప్రేమ, వాత్సల్యమూ, కోపమూ, ద్వేషమూ, ఆవేశమూ, నిరుత్సాహమూ, ధీరతా, పిరికితనమూ, ఆశా భయాలూ, తృప్తి అసంతృప్తి, శాంతి, అశాంతి, సుఖ-దుఃఖాలు, అసూయ, లోభత్వము, మదము, అహంకారము, డాంబికత, కపటము, నిజాయితీ, ఆర్ద్రత, సానుభూతి, కాఠిన్యము, జాలీ, వగైరాలన్నీ భావరూపములే. హృదయానుభూతులన్న మాట. ఈ భావనలే మనిషిని ప్రధానంగా నడిపిస్తున్నవి. ఇవన్నీ మేధస్సుకు, చెందిన అంశములే అయినా-జ్ఞానరూపాలే అయినా ఈ తరహా పదార్థములను హృదయ సంబంధిత పదార్దములనుట ఉచితము. ఈ పదార్థములకు భౌతిక అస్థిత్వం లేక పోయినా అవి అస్థిత్వం కలవే. శక్తిరూపాలే. మీదు మిక్కిలి మనిషిని మరే యితర భౌతిక శక్తీ కదిలించనంత శక్తివంతంగా కదిలించగలవు. తనకొరకు సమస్త ప్రపంచాన్ని బలిపెట్టునట్లూ, తన ఆదర్శాల కొరకూ, ఇషాలకొరకూ తనను తానే బలి పెట్టుకొను నట్లూ కదిలించగల శక్తివంతాలీ భావనలు. నవీన సిద్ధాంతాలలో ఈ భావాల శక్తిని యథాతధంగా అంచనా వేసిన సైద్ధాంతికులు గానీ, భావ విప్లవం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమన్న మౌలికాంశాన్ని తగినంతగా గుర్తించి దానికై యత్నించినవారుగానీ అరుదు. సరే. అదలా ఉంచండి. హృదయ సంబంధితాలైన ఈ భావరూప శక్తులను వివేకశక్తి నియంత్రించవలసి ఉంది. అలా జరిగినంతకాలం ఈ భావశక్తులు అవసరమైన స్థాయిలో ఎక్కువా తక్కువా కాకుండా ఉండి ఆయా కార్య నిర్వహణకు వ్యక్తిని వ్యక్తులను పురికొల్పుతాయి. సంసిద్ధుణ్ణి చేస్తాయి. ఇవి గనుక అదుపు తప్పినట్లేతే వివేకం పనిచేయదు. ఉద్రేక స్థితులలో మనిషి విచక్షణను కోల్పోవడమో, అది బలహీనపడడమో జరుగుతుందన్నది మనందరి అనుభవములోనూ ఉన్నదే. కనుక హృదయపరమైన శక్తులుగా నున్న భావనలూ, విచక్షణా శక్తిగానున్న జీవితానుభవాల సారాంశమూ, కలసి-మెలసి పనిచేసినంతకాలం జీవితం వ్యక్తిది కానీ, సంఘానిది కానీ- ఒక క్రమం లోనూ, అభివృద్ధి దిశ వైపునకున్నూ సాఫీగా సాగిపోతుంది. ఇట్లా ఈ రెంటినీ (హృదయమూ - వివేకమూ) చక్కగా వివేచించగలగడమూ, వాటివాటి క్షేత్రాలలో అవి ఎక్కువా తక్కువా కాకుండా ఉంచగలగడమూ చేయగలగాలి. విప్లవోద్యమ రుల ముందూ, సంస్కర్తల ముందూ, సిద్ధాంతకారులా, ప్రచారకుల ముందూ ఉన్న అసలు సమస్య యిదే. సహృదయతా, యోచనాశీలతా, కార్యకుశలతా ఇవే ఈనాడు లోపించి ఉన్న ప్రధానాంశాలు. వీటియందు విప్లవాన్ని -సరైన మార్పును తేగలిగిననాడే సమగ్ర విప్లవానికి యదార్థంగా అంకురార్పణ జరుగుతుంది.

అయితే ఇది లేక పోవడానికి కారణమేమి? ప్రధానకారణం జీవితంపట్లా, జీవిత సాధ్యాల పట్లా, వృష్టి, సమష్టి, ప్రకృతి వీటి మధ్యనున్న పరస్పర సంబంధాలపట్లో సరైన అవగాహన లేకపోవడమే. అదే సమయంలో తప్పు అవగాహన లుండడమున్నూ, ఈ తప్పు అవగాహన (దీనినే తత్వశాస్త్రం అవిద్య అంటుంది) నుండి పుట్టి నానా విధములైన పోకడలన్నీ సమాజానికెంతో కొంత అప్రకృతిని కలిగిస్తాయి. సమగ్ర విప్లవాన్ని - సంక్రాంతిని గూర్చి విచారించబోయే ముందు విప్లవ ప్రతిబంధకాలైన అజ్ఞాన జనిత వికృత ధోరణులను గురించీ కూలంకషంగానూ, నిష్పాక్షికంగానూ, సమష్టి సంక్షేమ దృష్టి నిడుకుని పరిశీలించవలసి ఉంటుంది. లేనిచో ఎక్కడోచోట, ఏదో క్షణంలో పరిశీలనలోనూ, నిర్ణయాలలోనూ పాక్షికతా, అసమగ్రతా చోటుచేసికొంటుంది. విషయాన్ని రాగంతో చూస్తే ఉన్న దోషాలు కనపడవు. ద్వేషంతో చూస్తే ఉన్న గుణాలూ గోచరించవు. ఇప్పటి వరకు జరిగిన సామాజిక చరిత్రనూ, దానిలోని సిద్ధాంత ధోరణులనూ సవ్యంగా చూడగలిగితే దాదాపు వాటన్నిటా పైదోషం కొట్టవచ్చినట్లుగా కనుపిస్తుంది. ఈ అంశాన్ని వివరించడమూ, చర్చకు పెట్టడమూ కూడా ఎంతో సాహసంతోనూ, అనేక సమస్యల తోనూ కూడుకున్న పనే అయినా ప్రస్తుత సామా జికావసరమై, “మేలుకొలుపు” పత్రిక లక్ష్యాలలోనూ ఒకటై యుండుటచే, క్రమంగా ఆయా సిద్ధాంత ధోరణుల లోని లోపాలోపాలు మీ ముందుంచేందుకు యత్నిస్తాను. సావధానులూ, ఉద్రేక రహితులూనై నిర్వికారంగా సత్యదృష్టి కలిగి విషయాన్ని పరిశీలించండి. నిజంగా నిజాన్ని స్వీకరించి సమాజాని కందించండి, నిజాని కనుబంధంగా మార్పులూ, కూర్పులు చేసికోండి. యదార్థ విప్లవానికై తగిన సాధకులు కండి.

Note: ప్రతిమనిషీ, సమాజం ఉండకూడని విధంగా ఉన్నదని, మార్పు అవసరమనీ అంటున్నాడు. కనీసం అనుకుంటున్నాడు ఏదో క్షణంలో. కానీ ఆ సమాజం తనకు అన్యంగా లేదనీ, తాను మారుటతోనే సామాజిక మార్పు ప్రారంభించాల్సి ఉంటుందనీ తలంచడు. విప్లవ ప్రతిబంధకాల్లో మొదటి అడ్డంకి యిదే. కనుక అందరం మారాలనీ, అవసరమైనంత మార్పు నాతోనే ప్రారంభం కావాలనీ ఎవరికి వారం మానసికంగా నిర్ధారించుకోగలగాలి.

అభ్యాసక్రమము -7

క్రమంగా వ్యక్తిత్వ వికాసాని కవసరమైన అంశాలను సాధన దృష్టినుండి - అమలు పరచు ఉద్దేశ్యంతో ముచ్చటించు కుంటున్నాము. అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి సంచికలో అభ్యాస క్రమం ప్రచురించలేక పోయాను. క్రమాన్ననుసరించి, వాక్కును క్రమబద్ధమూ, శక్తివంతమూ చేయుట అన్న దగ్గర ఉన్నాము. ఈ సమాజాన్ని సరిగా చూడగలిగితే, పత్రికలలోనూ, వేదికల పైననూ, కరపత్రాల - ద్వారానూ, చర్చలలోనూ, సాధారణ సంభాషణల లోనూ ప్రస్ఫుటంగా కనిపించే అంశం వాచాలతే. ఆదర్శాలను వల్లించడమూ, ఇతరులకు సందేశాలివ్వడమూ, తెలిసిన రెండు విషయాలకు తేలీని 98 విషయాలను జోడించి అనర్గళంగా ఉపన్యసించడమూ, విప్లవం, విప్లవ మంటూ యాగీ చేయడమూ, త్యాగం గురించీ, స్వార్ధ రాహిత్యాన్ని గూర్చి, సమానత్వాన్ని గూర్చి నినాదాలూ, కరపత్రాలూ .... యిలా.... అబ్బో రాశులకు రాశులు కొండల మల్లే ఉద్ధరణ సాహిత్యం పెరిగిపోతోంది. ఆధ్యాత్మకవేత్తల స్థానాలలో నున్న వారూ, పరిపాలకులుగానున్న వారూ, వ్యాపారులూ ఈ మూడు వర్గాలవారిలోనున్న వాచాలతా, కపటమూ, విశ్వరూపు ధరించి ఉన్నాయి. వీటిన్నిటికీ మూల వేరు మాటకూ చేతకూ సంబంధం లేని తనమే. అరిచే కుక్క కరవదంటారు. అది కుక్క గురించి చెప్పిన విషయంగాదనీ మనస్తత్వాన్ని ఒకింత లోతుగానే అధ్యయనం చేసిన వారు, మనిషిలోని వాచాలతనూ, దాని మాటున దాగియున్న సోమరితనాన్ని బట్టబయలొనరించేందుకుగా చెప్పిన వాక్యమని స్పష్టంగా గమనించిందెంతమంది? గమనించామని వాదనకు ఎవరైనా అన్నా, అది వదిలించుకోవలసిన దుర్లక్షణమనీ, తానిక్కడ పట్టుదలతో యత్నించి మితభాషిత్వాన్ని సాధించవలసి ఉన్నదనీ మనసా నిర్ణయించుకుని సాధన చేస్తున్న దెంతమంది? నిజం నిష్టురంగానే ఉంటుంది మరి. వాచాలతా, కపటమూ,-చెప్పేదొకటి చేసేదొకటి-దాదాపు ప్రతి మనిషిలోనూ తగితంతగానే ఉన్నా యన్నది నా యనుభవం. ఆత్మ విమర్శన చేసికుని మీరూ మీ మీ యనుభవాన్ని పరిశీలించుకోండి. ఇక్కడ సరైన మార్పురాక మనిషికీ, మనిషికీ ఉన్న సామాజిక సంబంధాలు మెరుగుపడవు. నాయనలారా! దృఢంగా ఒక్క విషయాన్ని నిర్ణయించుకోండి. తెలిసిన విషయాన్నే మాట్లాడుతాను. మాట్లాడిన విషయానికి కట్టుబడి ఉంటాను. ఈ నిర్ణయానికి రాగలిగావా ధన్యుడవే. క్రమంగా జీవితం అర్థవంతమూ, శక్తివంతమూ కాగలదు.

నిజంగా ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయమే మాట్లాడుతాను, యదార్థంగా తెలియని విషయాలు తెలిసికుంటానికే యత్నిస్తాను. అని నిర్ణయించుకున్నాడను కోండి. అప్పుడేమవుతుంది. ఏమవుతుందో నేను చెపితే మీకాశ్చర్యంగా ఉంటుంది? కానీ వాస్తవమేమంటే ఆ వ్యక్తిలో అద్భుతమైన మార్పు వస్తుంది. అతని మాటలలో నిజాయితీ చోటు చేసి కుంటుంది. మాటలలో విజ్ఞానమూ, వివేకమూ, తగినంతగా ఉంటాయి. సొల్లు కబుర్లు తగ్గిపోతాయి. ఇతరుల సమయాన్ని మింగి వేసే ప్రమాదం తప్పిపోతుంది.

అతిగా మాట్లాడడం అలవాటుగా మారిన వాళ్ళకు సందర్భ శుద్ధి ఉండదు. ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారో, అవతల వాళ్ళ పనుల వత్తిడెంతటిదో అన్న స్పృహే ఉండదు. చివరకది వాళ్ళకో కండూతిగా కూడా మారుతుంది. ఎవరూ దొరక లేదనుకోండి. ఏమీతోచదు. ఎదురిచ్చైనా ఎవరోవకరిని కూర్చోబెట్టుకుని తమ కాలాన్నీ ఖర్చు చేస్తూ, వారి కాలాన్ని తినివేస్తుంటారు. ఈ వాచాలతా స్వభావం మానవ సంఘంలో లక్షల, కోట్ల మానవ శ్రమ గంటల్ని హరించి వేస్తుంది. అంతేకాక మనుషులను సోమరులనుగానూ, బాధ్యతా రహితులను గానూ, నిర్వీర్వులనుగానూ మార్చి వేస్తుంది. వాచాలతా-అక్కర లేని మాటలు మాట్లాడు స్వభావం ఈనాడు సంఘానికి పట్టిన పెద్ద భూతం, పెద్దరోగం అంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. కానీ దీనిని గూర్చి ఎవ్వరూ ఆలోచించడం లేదు. సాధారణమైన ధూమపానాది దురభ్యాసాలకంటే అతి ప్రమాదకరమూ, నష్టదాయకమూనైన దురభ్యాసమిది. మనిషిని వర్తమానం నుండి ప్రక్కదారులు పట్టిస్తుంది ఆ సామెత మనిషిని లేని గొప్పలు చెప్పుకునే వాడినిగా తయారు చేయ గలదిది. ఇతరులలో లేని దోషాలు చూసే స్వభావాన్ని కూడా పెంచుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అంశమే ఒక గ్రంథమంత అవుతుంది. అయినా నేను మరింత విడమరచి చెప్పడమెందుకు? మీరే మీ యనుభవంలో నుండే దీనిని కొట్ట వచ్చినట్లుగా చూడవచ్చు. ఒక్కపని చేయండి చాలు.

(1) నిజంగా తెలిసిన విషయాల్నే మాట్లాడుతాను.

(2). అదైనా అవసరమైనప్పుడే ,అవసరమైనంత వరకే మాట్లాడుతాను.

(3) ఇతరుల కాలాన్ని హరించే పనులు చేయను. నా కాలాన్నీ దుర్వినియోగం చేసికోను.

(4) ఇది సాంఘిక విప్లవ కార్యంలో ఒక ప్రధానావశ్యకమైన అంశంగా గ్రహిస్తున్నాము. దీని వ్యాప్తికై త్రికరణ శుద్ధిగా యత్నిస్తాము. ఈ నియమాల్ని పెట్టుకోండి. జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పును గ్రహించండి. వెనుకటి వారూ దీనిని చక్కగా గ్రహించారు. వారి మాటవినండి. “యోగస్య ప్రధమద్వారం వాగ్నిరోధో అపరిగ్రహః”

:-స్పందన ప్రతిస్పందన-:

స్పం సురేంద్ర బాబుకు. నమస్తే, సత్యాన్ని సమగ్రంగా తెలిసికోవాలన్న జిజ్ఞాసులకు, పొందవలసిన దానిని [తెలిసికోవలసినదానిని] స్పష్టంగా పొందే దానికి పనికివచ్చే, శరరేంద్రియ మనస్సులను శక్తివంతంగా సమర్థవంతంగా ఉంచుకోమనీ, చివరికి నీమోక్షానికి కూడా సహకరించేది నీ ముందున్న సమాజానికి ఋణగ్రస్తుడవు కావద్దనీ, స్వార్ధాన్ని నియమించుకుని వీలయినంత సేవ చేయడం కర్తవ్యమనీ, బుద్ధి ఉన్న వాడికి ఆది బాధ్యతనీ, విజ్ఞానం లేనివానికి విధిగానూ, వీటన్నిటికి ప్రధానమైనదైన (పరిక్షించి గ్రహించడమనే) వివేకాన్ని నూరిపోసే మీ రచనలు మీ పత్రికల ద్వారా ఆస్తికులకూ, నాస్తికులకూ ఆదర్శం కాగలవని ఆశిస్తున్నాను. మిధ్యాచారులకు నిజాలు చేదైనా, నిజంకావాలన్న వారికి మధుర పదార్థాలు కాగలవు. హరి ఓం జ్ఞానసేవలో, మీ ప్రమోద చైతన్య.

ప్ర.స్పం ఆర్యా; మీ లేఖ మీపరిశీలనా దృష్టికీ, నిజం ఎడల మీకున్న నీజమైన గౌరవానికి అద్దం పడుతోంది. నా హృదయాంతరాళంలోని ఒక అంశాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించి లేఖలో చూపారు. ఆస్తికులూ, నాస్తికులూ - కూడా రావలసిన విప్లవాన్ని సాధించలేరు. అన్ని సంఘాలలోని వాస్తవికులూ, ధార్మికులూ మాత్రమే విప్లవానుకూల శక్తులు కాగలవన్నదే నా ఆంతర్యము. నా రచనల వెనుక నున్న అనేక లక్ష్యాలలో ఇది అత్యంత ప్రాథమికమైనది. ఈ యత్నంలో మనమూ, మరి మనలాంటి వారమూ, చేయి చేయి కలిపి నడవగల్గుదుము గాక. సెలవ్

మాటిమాటికీ సందేహాలంటూ లేఖలు వ్రాస్తుంటే మీ రేమనుకుంటారోనని శ్రీ మరిగంటి శ్రీరంగాచార్యులు వ్రాశారు.

ప్ర. స్పంఆర్యా! ఇందులో అనుకునేందుకేమీ లేదు. పైగా నా రచనల పై నేనాశించినంతగా స్పందన లేదే అన్న బాధ కూడా నాకున్నది. వ్యక్తికి, ఒక రచన పై స్పందన కలగలేదంటే, ఆ విషయం అతని కఖ్ఖర లేనిదైనా అయ్యుండాలి. లేక పూర్తిగా తెలిసినదైనా, అస్పలు తెలీనదైనా అయ్యుండాలి.పాఠకులు పై వాటిలో ఏ కోవకు చెంది ఉన్నారో గానీ తృప్తికరంగా స్పందించడం లేదన్నదో నిజం. మీలాంటి వారి స్పందనలే నారచనలకు కొంతైనా ఉత్తేజాన్ని ఇవ్వగలవు. తప్పక మీరు, ఈ సంచిక చూసిన పిదపైనా ఒకరి పాఠకులూ (పండితులూ, జిజ్ఞాసువులూ) పత్రిక ఆలోచనలలో పాలుపంచుకుంటారని ఆశిస్తాను.

మీ సురేంద్ర.

గమనికలు:

(1) ఉత్సాహం చూపుతూ అనేక లేఖలు అందుతున్నాయి. సంతోషించదగ్గ విషయమే అది. అయినా ఆత్మ సంస్కారాని కంతమాత్రం ఉత్సాహం సరిపోదు. సాధన ప్రారంభించడం. భావ సారూప్యత కల వారందరమూ వీలయినంత తరచుగా కలుసుకోవడమూ, ఆయా అంశాలను పరస్పరం పరిశీలించుకుంటూ అవసరమైన మార్పులూ, కూర్పులూ, చేసికోవడం జరగవలసి ఉంది.

2) యధాప్రకారం ప్రతి మూడు మాసాలకు జరుగు సమాలోచన సమావేశాలు జరుగుతాయి. పాఠకులందరూ ఆహ్వానితులే. సభ్యులుగా నుండ గోరువారూ, సాధనచేయగోరువారూ, భవిష్యత్తులో మండలి చేయబోయే సామాజిక విప్లవ కార్యక్షేత్రంలో భాగస్వాములు కాగోరువారూ ఈ సమావేశాలకు తప్పక రావలసి ఉంటుంది.        (3) ‘మేలుకొలుపు’ పత్రిక పట్ల అభిమానమూ, మండలి కార్యక్రమంపట్ల సానుభూతీ మాకు ప్రోత్సాహ కారకాలే అయినప్పటికీ మీ నుండి మేము కోరుతున్నదీ మాత్రమే కాదు. చేయవలసిన కార్యక్రమంలోనికి మీరూ రండి, రావలసిన మార్పుకై మన నుండే యత్నం మొదలెడదాం రండి. అన్నదే మండలి ఆకాంక్ష.

సత్య పక్షాన నిలవండి - ధర్మ బద్ధంగా జీవించండి.

Monday, June 7, 2021

మేలుకొలుపు - 10

 

మేలుకొలుపు

సంపుటి-1                                    సంచిక-10                                            1-12-91.

ప్రమాణ వివేచన -1

మానవ జీవన యానానికి చుక్కాని వంటిదగు జ్ఞానాన్నీ, జ్ఞాన సాధనలనూ గురించి వివరించేముందు దానికి చెందిన గతాన్ని స్మరించడం, అధవా పూర్వీకుల ధోరణులను గూర్చి పాఠకులకు కనీసంగానైనా పరిచయం చేయడం సందర్భో చితంగా ఉండ గలదు.

ప్రమాణ వివేచన అన్నది వాస్తవంగా, శరీరంలోనే సహజంగా నిర్మితమై యున్న ఆయా జ్ఞాన పరికరాలనూ, వాటి పనుల తీరు తెన్నులనూ సమగ్రంగా అవగాహన చేసికోవడమే ఐయున్నది. దానితో పాటే సహజంగానే ఏర్పడి మొత్తం -జ్ఞాన ప్రక్రియలో అంతర్భూతంగానే ఉన్న విచక్షణా శక్తి, దానికాధారమైన హేతురూపజ్ఞానమూ వాటి తీరుతెన్నులూ కూడా అర్థం చేసికోవలసి యున్నది. ఈభావాలనే నేను ప్రమాణ వివేచన-తర్కవిద్య- అన్న పేరున తెలియజేస్తున్నాను. వీటినే మరోలానూ చెప్పుకోవచ్చు.

వాటి వాటి క్షేత్రాలలోని విషయాలను ఆయా ఇంద్రియాలు స్వీకరించి, మెదడుకు పంపడంద్వారా అనుభవ రూపాన్ని పొంది తెలివిచే గ్రహింపబడి, విశ్లేషించబడి నిశ్చయరూపాన్ని పొందుతున్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు పని చేయడమూ, తద్వారా అందిన సమాచారాన్ని పూర్వానుభవ సామర్థ్యంతో విచారించి నిర్ణయించు కోవడమూ నన్నది, తలలో జరుగుచున్న కార్యక్రమ మన్నమాట. ఈ క్రమంలో (1) ఇంద్రియార్థ సన్నికర్ష, (2) అనుభవమూ, తద్గ్రహణా, (3) గతజ్ఞానంతో సరిచూసుకుని ఒక నిర్ణయానికి రావడమూ (4) అదిన్నీ స్మృతిరూపంగా నిక్షిప్తం చేయబడి వర్తమాన, భవిష్య జీవితాలను నడుపు వివేకరూపంగా-బుద్ధిశక్తిగా-ఉండడమూ జరుగుతోంది. ఈ బుద్ధి శక్తి స్వాభావికంగానే హేతుబద్ధత కలిగి ఉంది.

                ఎట్లు విషయగ్రహణా, హేతుబద్ధతా అన్న రెండూ, శరీరంలో స్వాభావికంగానే ఏర్పడి యున్నవో అట్లే ప్రస్తుతాంశమైన ప్రమాణ వివేచనలోనున్నూ ప్రమాణములూ, తర్కమూ కూడా విడదీయరానివిగానే ఉన్నాయి. తర్కశాస్త్రం(తర్కం)పై ఒక విపరీత భావన బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందుచే జిజ్ఞాసువులైన పాఠకులలోనూ అట్లే ఏర్పడి యుండుటకు వీలున్న ఆ దోష దృష్టిని పోగొట్టిన పిదపనే అసలు విషయాన్నివారి వారి పరీశీలనలకు అందించడం సర్వదా సమీచీనమూ, శ్రేయస్కరమూ కాగలదు. కనుకనే ఈ విషయం ముందుగా చెప్పవలసి వచ్చింది. మీరందరూ ముందీ విషయాన్ని చక్కగా అర్థం చేసికోవలసి ఉంటుంది.

జ్ఞానేంద్రియ వ్యాపారంలో బుద్ధికున్న స్థానమే, విషయ పరిశీలనలో తర్కానికి ఉంది.తర్కాన్ని విడచి పరిశీలించడమంటే బుద్ధిని విడచి జ్ఞానార్జన చేయడం వంటిదే ఔతుంది. అయితే తర్కం ప్రస్తుతం రెండురూపాల్లో ఉంది. (1) కేవలతర్కమూ (2) అనుభవాంగ తర్కమూనని. వాటిని సందర్భం వచ్చినప్పుడు విపులంగా వివరిస్తాను. వాటిలో ఒకటవది విడువదగినదిగానూ, రెండవదైన అనుభవాంగ తర్కము సర్వులూ, సర్వదా స్వీకరించవలసినది గానూ ఉన్నాయి. ఈవిషయం ఇంతవరకూ స్పష్టంగా అర్ధం చేసికోగలిగితే మిగిలిన విచారణ సులభమవుతుంది. సక్రమమైన జీవనానికి సక్రమమైన వాస్తవజ్ఞానం ఆధారంగా ఉందన్నది నిర్వివాదాంశం. అట్టి సత్యజ్ఞానమునే ఎప్పుడూ పొందుచుండవలె నన్నచో తర్క ప్రమాణములను గూర్చి తెలిసికొని, వినియోగించుకోవలసి యున్నది. అయితే ఈ రెండు విషయాల్ని గూర్చి సమగ్రమైన అవగాహన పొందడం మిక్కిలి కష్టంతో కూడుకున్న పనిగాను ఉంది. గత చరిత్రను చూస్తే అనేకవేల ఏండ్లుగా ప్రతి సంప్రదాయ ప్రవర్తకుడూ, సిద్ధాంతకారుడూ కూడా వారి వారి సిద్ధాంతాల కనుగుణ్య మైన రీతిలో తర్కాన్నీ, ప్రమాణ స్వరూపాల్నీ ఏర్పరచుకునే యత్నం చేసినట్లు కనబడుతోంది. అలా ఏర్పడినవే తర్కం పేరుతో నున్న వివిధరీతులూ.

ప్రధానంగా తర్కశాస్త్రం అన్న పేరనే రెండు దర్శనములున్నా [న్యాయ, వైశేషికములను తర్కశాస్త్ర మంటారు. వీటిని సిద్ధాంత రూపములుగా అంగీకరించి అనుసరించువారిని తార్కికులు లేక నైయాయికులు అంటారు] ప్రతి దర్శన కారుడూ తన పరిధిలో తర్కాన్నీ, ప్రమాణాల్నీ ప్రతిపాదించారు. (1) నైయాయికుల తర్కం, (2) అద్వైత తర్కం, (3) బౌద్ధతర్కం, (4) సాంఖ్యతర్కం (5) జైన తర్కం (6) నాస్తిక తర్కం (7) ద్వైత తర్కం (8) పాశ్చాత్య తర్కం. ఇట్లా యనేకంగా ఏర్పడ్డాయవి. వాటి మధ్య కొద్దిగానో, గొప్పగానో తేడాలున్నా అన్నిటిలోనూ హేతుదృష్టి, విశ్లేషించి, పరీక్షించి, నిర్ధారించడమూ నన్నది సామాన్యంగానే ఉంటూ వచ్చింది. అలా సామాన్య నియమాన్ని కలిగియుండి కూడా తర్కాన్నీ, ప్రమాణాలనూ రకరకాలుగా ఎలా ప్రతిపాదించగలిగారు? అసలెందుకలా చేయవలసివచ్చింది? ఈ అంశాన్ని ముందుగా అర్థం చేసికోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయా ప్రతిపాదన లన్నింటి వెనుకా ప్రతిపాదించువారి కాధారంగా నున్నది స్వీయ జీవితమేకనుకనూ, ఆ జీవితంలో జ్ఞానేంద్రియాల స్వరూప స్వభావాలూ అందరకూ ఒక్కరకంగానే ఉన్నవి కనుకనూ, వాస్తవంగా వైరుధ్యానికీ, వైవిధ్యానికీ కూడా తావుండరాదు కదా? మరెందుకు, ఎలా ఇన్ని తేడాలేర్పడ్డాయి? నిష్పాక్షికంగానూ, లోతుగానూ విచారించగలిగితే కొన్ని విషయాలు గోచరించగలవు.

(1) ప్రధమ కారణం ఆయా సిద్ధాంతకారుల అవగాహనలలోని అసమగ్రత. (2) ముందుగానే కొన్ని సిద్ధాంతాలేర్పరచుకుని వాటిని నిలబెట్టుకొనుటకే తర్కాన్ని తయారు చేసికోవటం, (3) ఎదుటి పక్షాన్ని నిగ్రహించుటే లక్ష్యంగా కలిగి అందుకే తర్కాన్ని తయారు చేసికోవడం. ఎప్పుడైతే తర్కం యిలా అవగాహనా లోపం కలవారిచేతనూ, రాగద్వేష సంకలితమైన మనస్సుగలవారల చేతనూ తయారు చేయబడిందో ఆనాడే అది తన సహజ వివేకరూపాన్నీ, ప్రయోజనాన్నీకూడా కోల్పోయింది. ఆయా తర్క పద్ధతులందు పాక్షికత, చోటుచేసికుని ఉంది. కనుకనే నాటినుండి నేటివరకూ ప్రతితార్కికుడూ మరోతార్కికుని తనదైన శైలిలో తప్పు పట్టగలుగుతున్నాడు. అట్లుగాక అనుభవాంగ రూపమైన తర్కాన్ని ఉన్న దున్నట్లుగా ప్రతిపాదించ గలిగితే లోకంలో ఎవ్వరూ, ఏనాడూ దానిని కొట్టివేయ జాలరు. ఎప్పుడైనా ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి సామర్థ్యం ఉంటుంది.

ఇప్పుడు మనం చేయబోయే విషయ పరిశీలనలోనూ ఎన్నో దోషా దోషాలు ప్రస్తావించవలసి ఉంటుంది గనుక అనుభవంలో ఎట్లుంది? అన్న కొలత నుండే అందరమూ ప్రతిపాదిత విషయాలను పరికించవలసి ఉంటుంది. అదే ఆద్యంతమూ మన పరిశీలనకు వేదిక గానుండగలదు. ఉండాలికూడా. అట్లుగాక నేను చెప్పిన విషయాన్ని ఎవరుగానీ, ఆయా సాంప్రదాయ గ్రంధాలలో చెప్పినవాటినే ప్రమాణాలుగా పెట్టుకొని పరిశీలించడం మొదలిడితే వాస్తవం తెలియడం కష్టతరమౌతుంది. అట్టివారిని ముందుగా నే నడిగే ప్రశ్నేమంటే ఆయా శాస్త్రాలలో చెప్పబడ్డ వాటికి ప్రామాణికత ఎలా ఏర్పడింది? అని. వాటిని ప్రామాణికములే నని నిరూపించిన పిదపనే వాటి ఆధారంతో నేను చెప్పిన విషయాన్ని కొలిచిచూడడం ఉచితంకాగలదు. కానినాడు వారి పరిశీలనలన్నీ నేలవిడిచిన సాము వంటివే కాగలవు. మరో దృష్టినుండి ఆలోచిస్తే ప్రమాణాదులలోని వైవిధ్యానికి మరో కారణమూ కనిపిస్తుంది. అది వారివారి అనుయాయులకు బోధించుటకుగాను అవగాహనా సౌలభ్యం కొరకుగా వారు వారు ఏర్పరుచుకున్న విభజన అయ్యుండచ్చు. నిజంగా అట్లు జరిగే ఏర్పడి ఉన్న తేడా లైతే వాటిని అర్ధం చేసికోవడమూ, సర్దుకుపోవడమూ కూడా కష్టమేమీకాదు. ఈ ప్రమాణ వివేచన మన్నది ఆ విషయము యొక్క గాఢతా, జటిలతలను బట్టి నిదానంగానూ కూలంకషంగానూ, పరిశీలించుకుంటూ, అవగాహన చేసి కుంటూ మాత్రమే చేయదగియున్నది. ఇందు రచయిత లేక వక్త పాత్ర చాలా కొద్ది మాత్రమే. అదే మంటే విషయాన్ని ఒక క్రమంలోనూ, తగినంత స్పష్టంగానూ, శ్రోతచే శ్రవణం చేయించడమే. పఠితలకు తగినంత సమాచారాన్నందించడం మాత్రమే నన్నమాట. అటుపిమ్మట వినిన-చదివిన-విషయాన్ని సమగ్రంగానూ, నిష్పాక్షికంగానూ పరిశీలించి నిర్ణయించుకోవలసిన పని శ్రోతపైనే ఉన్నది. మననమూ, నిదిధ్యాసనమూ రెండూ శ్రోత బాధ్యతే. అప్పుడే అది అతనికి అనుభవాంగ రూపమౌతుంది. గతంలో జ్ఞానపీఠ మను పేర ప్రకటించిన ఒక సంచిక ఈ సందర్భంలో గుర్తుచేసుకోవడం మిక్కిలి ప్రయోజనకారి కాగలదు. అందులో విషయాన్ని చెప్పాలకున్నవారూ, వినాలనుకున్న వారూ కూడా అనుసరించ వలసిన నియమావళి విపులీకరింపబడింది.

సహజంగానే ఆయా విషయాలు గ్రహించినప్పుడు దానిని పరిశీలించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. తెలుస్తున్న విషయాలను పరిశీలించి ఒక అభిప్రాయానికి రావడం సహజ ప్రక్రియగా నున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కూడా మీరందరూ అలా పరిశీలనా దృష్టితోనే చూస్తారు. అందుకే ఇచ్చట మీకో హెచ్చరిక చేయవలసి వస్తోంది. అదేమంటే, ఏ విషయాన్ని గూర్చి న్యాయ నిర్ణయం చేయాలన్నా చేయు వారు న్యాయ నిర్ణేతలుగా- న్యాయమూర్తిగా ఉండగలగాలి. న్యాయవాదిగా ఉన్నంతకాలం ఎవరూ సరైన న్యాయం చేయలేరు. అప్పుడు వారి వారి మేథస్సులన్నీ తమ పక్షాన్ని నిలుపుకొనుటకే వినియోగిస్తారు. అనుకోకుండానే, నీ పక్షంలోనే న్యాయముంటే తప్ప ఏ న్యాయవాదైనా స్వపక్షాన్ని నిలుపుకొనుటకే యత్నిస్తాడు. రాగ ద్వేషాలు లేకుండా-నిష్పక్షపాతంగా-నిర్ణయించగల స్థితిలో ఉన్నప్పుడు, (అది ఒకే పక్షాన్ని స్వీకరించిన వారి వల్ల కాక న్యాయ మూర్తిగా నుండగలిగిన వారి వల్లనే సాధ్యపడుతుంది.) తీసుకున్న నిర్ణయమే వాస్త వానికి దగ్గరగా ఉండగలుగుతుంది. సాంప్రదాయక తర్కాన్ని [ఏదో ఒక తర్క ధోరణికి కట్టుబడి] ప్రామాణికంగా స్వీకరించిన పిదప నీవు శుద్ధంగా ఉండుట కష్టము. ఈ కారణమే ఇంతకాలమూ సత్య నిర్ధారణకు అడ్డుపడుతూ వచ్చింది.

ఇక్కడ మార్పు రాక, అంటే అనుభవాంగ తర్కాన్ని ప్రమాణంగా స్వీకరించక సత్యాన్ని నిర్ధారించడం కుదరదు. ఈ విషయంలో మీకేమైనా అభిప్రాయ భేదముంటే మాకు తెలుపండి. స్పందన-ప్రతిస్పందన శీర్షికన ఆయా విషయాలలోని నిజానిజాలను పరిశీలించి చూద్దాము.

ప్రమాణములనగా జ్ఞానోత్పత్తికి అసాధారణ కారణము లనుకున్నాము కదా! జ్ఞాన మన్నదొక కార్యరూపము, పుడుతోంది కనుక. ప్రతి కార్యోత్పత్తికీ పరికరములూ, పనీ సామాన్య కారణాలు గానే ఉంటాయి. ఆ రకమైన పరికరాలూ, ఆ రకమైన పనీ, ఆ రకమైన కార్యానికి అసాధారణ కారణాలౌతాయి. కనుకనే ప్రస్తుతాంశమునందునూ ప్రమకు-జ్ఞానానికి-జ్ఞానేంద్రియములూ, ప్రక్రియలూ కూడా కరణములు (సాధకములు) అవుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రమాణ మంటే జ్ఞాన సాధకమనాలా? యదార్ధ జ్ఞాన సాధక మనాలా? అన్నది పరిశీలించ వలసి ఉంది. వెనుకటి వాళ్ళీ విషయంలో కొందరు జ్ఞాన సాధకమనీ, మరి కొందరు యదార్ధ జ్ఞాన సాధకమనీ, రెండు రకాలుగానూ అభిప్రాయపడ్డారు. ఈ దృష్టి భేదం వల్ల కూడా తర్క ధోరణులు వేరు వేరుగా మారాయి. ఎవరి అభిప్రాయాల్ని వారు మాటి మాటికీ పునరుద్ఘాటిస్తున్నంత కాలం ఈ విషయంలో వాస్తవం తేలదు. రెండు పక్షాలలో అనుభవానికేది సరిపోతుందో చూసుకోవాలి గాని నాది నాదేనంటే ఎలా? దీనినే విశ్లేషించి చూపడానికి యత్నిస్తాను. మీరూ పరిశీలించి చూసుకోండి.

సంస్కృత భాషలో ప్రమ, భ్రమ అన్న రెండు పదాలున్నాయి. ప్రమ అనగా ఒప్పు జ్ఞానమనీ, భ్రమ అనగా తప్పుజ్ఞానమనీ ఆ పదాలకు రూఢ్యర్థం ఉంది. దాని ననుసరించి ప్రమాణమనగా ప్రమాకరణమనీ, అనగా యదార్ధ జ్ఞాన సాధకమనే అర్ధాన్ని స్వీకరించా మనుకోండి. అప్పుడు మనం నిర్దేశించే-అంగీకరించే ప్రమాణాలన్నీ యదార్ధ జ్ఞాన సాధకములేనని నిరూపించవలసి ఉంటుంది. మరో వంక భ్రమ(తప్పు జ్ఞానాని) కి సాధకమేమో చెప్పవలసి ఉంటుంది. భ్రమ కూడా ఒక రకమైన జ్ఞానమే నన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే.

[Note :అవగాహనకూ, జ్ఞానార్జనలో ఎల్లప్పుడూ ఉపయోగించుకో గలందులకూ ఒక విషయాన్ని యీ సందర్భంలో చెప్పడం మంచిదనిపిస్తున్నది. అజ్ఞాన మన్న పదం రెండు సందర్భాలకు సరిపోతుంది. బొత్తిగా తెలియని తనానికి, తప్పుగా తెలిసి ఉండడానికీ, ఎలానంటే రెండు సందర్భాలలోనూ ఉన్నది తెలియక పోవడం జరుగుతోంది. అయితే వాటిని రెండని ఎందుకనాలి? శుద్ధంగా తెలియ లేదు అన్న స్థితిలో ఆ వ్యక్తి తెలుసుకుంటానికి వీలుంది. ఈ విషయం తనకి తెలియలేదు అన్న దృష్టి ఉంటుంది కనుక. మరి రెండోదైన తప్పు తెలివి గల వారిలో తనకు విషయం తెలిసి పోయింది. అన్న భావం ఉంటుంది. ఇకవారు తెలిసికునే అవకాశమే ఉండదు. బొత్తిగా తెలియని తనం కంటే తప్పుగా తెలియడం ఆద్యంతమూమూ ప్రమాదకరమైయున్నది. జ్ఞానార్జనలో ప్రారంభకులూ, కొంత పరిశ్రమ చేసిన వారు, పూర్తయిందను కున్నవారూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఉండడం సర్వదా శ్రేయస్కరము. జ్ఞానార్జనాపరుడు అప్పటికా విషయంలో తనకెంత తెలిసిందో, ఎక్కడనుండి, తెలిసికోవలసి ఉందో స్పష్టంగా గమనించి ఉండాలి. అప్పుడే ఆతని జ్ఞానార్జనా యత్నం ఫలవంతమవుతుంది. చక్కగా వ్యక్తం చేయబడీ తప్పుగా వ్యాఖ్యానించబడుతున్న గీతా శ్లోకాన్నొక దాని నిచ్చట చెప్పితే విషయం మరింత వివరణాత్మకంగా ఉంటుంది.

“అజ్ఞానేనా౬ వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః”

"అజ్ఞానముచే నావరింపబడిన జ్ఞానంచే మోహితు లౌతున్నారు జనులు" అన్న అర్ధాన్నిస్తోందా వాక్యము. జ్ఞానమే మనిషిని కదిలిస్తోంది అన్న అనుభవాన్ని బట్టి చూస్తే అజ్ఞానం-తెలియని తనం-మనిషిని మోహితుల్ని చేయలేదు, ప్రయత్న పరుల్నీ చేయజాలదు. మరిక్కడ అజ్ఞానానికే అర్ధం చెప్పుకోవాలి? క్రితం నే చెప్పిన రెండవ అర్థాన్నే. తప్పుగా తెలియడమన్నదే ఒప్పు తెలివిని సాధించు కోడానికి గల మార్గాన్ని మూసి వేస్తోంది, కప్పివేస్తోంది. మరి మోహితు లవడమేమి? తప్పుగా తెలియడంలో ఉన్నది తెలియక పోవడమూ, తెలిసింది అనుకోవడమూ కలిసి ఉన్నాయి. యీ ఉన్నది తెలియకనే తెలిసిందనుకోవడం వలన ఆ విషయమై ఇక తెలిసికోవడం అన్నదే ఏర్పడదు. ఇదే కప్పి వేయడమంటే, విపర్యయ-భ్రమ-జ్ఞానమే వాస్తవాన్ని కప్పివేయ గలదు. చక్కగా ఒకటి, రెండు సార్లు చదివి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లోపాలున్నా యనిపిస్తే సహేతుకంగా పత్రికకు వ్రాయండి.] సరే అసలు విషయానికి వద్దాం. భ్రమ కూడా జ్ఞాన రూపమే ఐనప్పుడు అదీ ఒక కార్యరూపమే అవుతుంది. దానికీ అసాధారణ కారణం ఉండితీరాలి. ఆ కరణాలూ, పద్దతీ ఏమిటి? వాటినే పేరుతో పిలవాలి? యదార్ధ జ్ఞాన సాధకమే ప్రమాణ మన్న నిర్వచనం చేసేవారు, ఈ సందేహానికి సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పక్షం వారైనా మూడు పదాలకు అర్థ నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. (1) జ్ఞానము, (2) యదార్థ జ్ఞానము, (3) అయదార్థ జ్ఞానము. ఈ మూడు పదార్థాల జ్ఞానం లేక ప్రస్తుత విషయాన్ని పరీక్షించుట కుదురదు. భిన్న ధోరణులు కల వారు పత్రికను పరిశీలిస్తున్నారు గనుక వారు గానీ, మీరు గానీ ఈ మూటి అర్థాల్నీ మీమీ దృష్టుల నుండి నిర్వచించండి. భిన్న మార్గీయులైన ఆయా తార్కీకులు ప్రతిపాదించిన నిర్వచనాలు రెండు, మూడు మీ ముందుంచుతాను గమనించండి. న్యాయ, వైశేషిక దర్శనాలను ప్రామాణిక గ్రంధాలుగా స్వీకరించు తార్కికులు-వీరిని నైయాయికులంటారు-చెప్పిన నిర్వచనం ప్రకారం, ప్రత్యక్షంలో భ్రమకు తావు లేదు.

         సూ:- “ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానమ్, అవ్యపదేశ్య మవ్యభిచారి వ్యవసాయాత్మికం ప్రత్యక్షం!” ఇంద్రియములూ, విషయములూ సంబంధ పడగా ఏర్పడ్డ జ్ఞానమే, వినికిడి జ్ఞానం కాకుండానూ, తెలియబడుతున్నది మార్పుకు లోనుగాకుండానూ, సంశయ రహితంగానూ ఉన్నప్పుడే ప్రత్యక్ష మవుతుంది. అని పై సూత్రార్థం. ఈ సూత్రం ద్వారా రెండు విషయాలు తెలుస్తున్నాయి. (1) ఇంద్రియార్థ సన్నికర్షవల్ల జ్ఞాన మేర్పడుతుందని, (2) ఆ జ్ఞానము అవ్యప దేశ్యాది మూడర్హతలు కలిగి యున్ననే ప్రత్యక్ష ప్రమ అవుతుందని, ఈ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంలో వ్యపదేశ జ్ఞానం గానీ, భ్రమజ్ఞానం గానీ సంశయ జ్ఞానం గానీ ఉండవు. అదే మరి సాంఖ్య దర్శన కారుని మతం ప్రకారమైతేనో.

అసన్ని కృష్టార్థ పరిచ్చిత్తిః ప్రమా!

బుద్దికి, ఫలానా కొత్త విషయం మేధస్సుకు చేరింది అని తెలియడాన్నే ప్రమ అంటారు అని సూత్రార్ధం. ఇక్కడ ప్రమ అనగా ఇంద్రియార్థ సన్నికర్షవలన పుట్టిన జ్ఞానమనే అర్ధం వస్తోంది. అయితే మరి ఆ తెలుస్తున్నది ఉన్నది ఉన్నట్లేనా అన్న నిర్ధారణేమీ వారి సూత్రం ద్వారా లభించదు. పై నైయాయిక మతాన్నంగీకరించి నట్లైన ప్రత్యక్షంలోనే గాక, ఏ ప్రమాణం లోనూ భ్రమలుండవు. సాంఖ్యాదుల ప్రకారం కలుగుతున్న జ్ఞానానికే ప్రమ అని పేరు. అందు తప్పు జ్ఞానమూ, ఒప్పు జ్ఞానమూ ఉండవచ్చు. మరొకరి దృష్టి నుండి ప్రమకు అనధిగతత్వమూ, అబాధితత్వమూ ఉండాలి. తెలియనిది తెలియడం, తెలిసింది మార్పుకు లోనుగాకుండడం అన్న స్థాయిగల ఆయా విషయ జ్ఞానాన్నే ప్రమ అంటామని వారి అభిప్రాయం. మరో వర్గం వారికి ప్రత్యక్షమే ప్రమాణం అంటే ఇంద్రియాలే పరికరాలే - జ్ఞానసాధకాలు. మన మనుకునే అనుమానాది ప్రమాణములు ప్రమాణములే కాదు. వాటి వలన జ్ఞాన మేర్పడదు అని, అంటే పరోక్ష జ్ఞానమన్న పదమే తప్పని దాని అర్ధం. పరిశీలకులను పరిశీలనకు తగిన విధంగా సంసిద్ధులను చేయవలసియుండుట చేతనూ, అది బహు ప్రయాసతో కూడియున్న విషయమగుటచేతనూ ఈ ప్రమాణ వివేచనకు పీఠికగానున్న ఈ వ్యాసము ఒకింత దీర్ఘమైంది. మేలుకొలుపులో క్రమంగా వస్తున్న ఆయా విషయాలను భిన్న సిద్ధాంతాభిమానులైన తార్కికులొకవంకా, ప్రాధమిక పరిచయాన్ని పొంద యత్నించు జిజ్ఞాసువు లొకవంకా పరిశీలించే వారుగా ఉండుటచే ఇరువురకూ అందుబాటులో ఉండే విధంగా భాషను మలచడం కొంత శ్రమతో కూడుకున్న పని. వెనుకటి వారు ఉపయోగించిన భాషా పదాలు వాడక తప్పదు. వాటిని ఉపయోగిస్తూనే వాటి అర్థాలలోని దోషాదోషాలు చూడడమంటే బహు క్లిష్టమైన పని ఔతుంది. ప్రకరణ విషయం నాకు అనుభవ రూపంలో స్పష్టంగానే ఉన్నప్పటికీ రెండు స్థాయిలలోని పరిశీలకులకూ అందుబాటులో ఉండగల వాక్య నిర్మాణానికై నేపడ్డ శ్రమ ఎంత వరకు ఫలవంత మవుతుందో మీ స్పందనలను బట్టి గాని నిర్ధారించ వీలులేదు.

అభ్యాస క్రమము - 5

సాధన విధానమును గురించి చెప్పవలసినది యదార్థ సాధకులకే, గమనించ వలసినదీ యదార్థ సాధకులే సాధనా వసరాన్ని గమనించక పోయినా, సాధన ఇష్టపడక పోయినా సాధనలు ఆచరణ సాధ్యాలుగా కనిపించవు. అవసరంగానూ అనిపించవు. కనుక మనమెంత చెప్పినా వినివూరుకుంటారు వారు. వీరి విషయంలో- మన బోధనలు వ్యర్ధాలే కాగలవు. అంతవరకే పరిమితమైతే, పెద్దగా మునిగిపోయేదేమీ లేదు. కేవలం శ్రమ దండుగ మాత్రమే అవుతుంది. అయితే మరో రెండు రకాల మనుషులున్నారు. అందొకరికి ఆయా విషయాలను తెలుసుకోవడం స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికై ఉంటుంది. ఇందులో ఒక రకం వారు గుర్తింపు తపన కీర్తి కండూతి కలిగి కేవల వాచాలురై - ఆచరణ శూన్యులై పాండిత్య  ప్రకర్ష కనపరుస్తూ ఉంటారు. రెండవ వారికి స్వార్ధమే పరమార్థంగా ఉండటమేగాక కపటులుగా కూడా ఉంటారు. ఆధ్యాత్మ విద్యా విలువలనూ, ధర్మాన్ని, సమ్యగాచరణనూ - బ్రష్టుపట్టించిందీ రెండు రకాలవారే. లోకహిత కాంక్షులైన మేధావులారా, యదార్థ సాధకులారా! జిజ్ఞాసువులారా! ఈ విషయాన్ని చక్కగా గమనించండి. నేను చెపుతున్నది వాస్తనమో కాదో నిస్పాక్షికంగా విచారించి ఓ నిర్ణయానికి రండి. మరలా ఆధ్యాత్మ విద్య మానవాళికి తనదైన ప్రయోజనాన్ని కలిగించాలన్నా, సమాజం యదార్థ ఫలితాల్ని సాధించుకోవాలన్నా ఈ రెండు వర్గాల వారి బారినుండి దానిని కాపాడి సరైన పంథాలో అర్హులైన వారికందించే క్రమాన్నేర్పరుచుకోవాలి. ఈనాడు మన ముందున్న అనేక బాధ్యతలలో ఇదీ గురుతరమైనదే. ప్రస్తుతం యదార్థ బోధకులకూ, సాధకులకూ కూడా పై రెండు రకాలవారు వ్యతిరేక శక్తిగా పనిచేస్తుంటారు. ఈ రకంవా రన్ని తరహాల సంఘాలలోనూ చాపకింద నీరులా పాకిపోతుంటారు. వీరిని గుర్తించడమూ, తొలగించడమూ కూడా ఎంతో కష్టంతో కూడుకుని యున్నది. వీటన్నిటి నుండి ఏర్పడుతున్న, ఏర్పడనున్న ప్రమాదం నుండి యదార్థ సాధకులు తమను తామైనా రక్షించుకోవాలంటే సాధన విషయాలుగా చెప్పబడుతున్న వాటిని తమ అనుభవాలతో సరిపోల్చుకుని అది తమకవసరమో కాదో వాటిని అమలు పరచుట ద్వారా ఏమి జరుగుతుందో, విడచిపెట్టిన వచ్చు నష్టాలేమో పరిశీలించి చూసుకోవాలి. అట్లు చేయగలిగిన వారిని మాత్రం పై రెండు వర్గాల వారూ-ఆచరణ శూన్యులూ, కపటులూ ఏమీ చేయ జాలరు. నిదానంగా ఆలోచించి నిరంతర మెలకుల కలిగియుండండీ విషయాలలో.

విషయాన్నింతగా ఎందుకు చెప్పవలసి వస్తోంది? సాధన క్రమంలో సాధన కెంత ప్రాధాన్యత ఉందో దానిని రక్షించు కోవడానికి ప్రతిబంధకాల్ని తొలగించు కోవడానికి అంతకంటే అధిక ప్రాధాన్యత ఉండడమే అందుకు కారణం.

మొదటి అభ్యాసముగా-ఆధ్యాత్మ సాధనా దృష్టి నుండి సకాలమునకు మేల్కొండుట, పరుండుట అన్న వాటిని స్వీకరించి అమలుపరుస్తున్నాము. అట్లే రెండవ సాధనగా నిత్య కాలకృత్యములూ, శరీర వ్యాయామమూ అన్న వాటిని స్వీకరించాము. పిదప సాధించవలసినది ఆహారనియమాన్ని. గత సంచికలలో ఆరోగ్యమూ - ఒక పరిశీలన అన్న శీర్షికన ఈ విషయమై కొన్ని అంశాల్ని ముచ్చటించాను. ఒక్కసారి వాటిని మననము చేసుకోండి. ఒక సారి ఆహారాన్ని స్వీకరించిన పిదప 8గం. వ్యవధి శ్రేష్టమైన అవధి కాగలదు. కనీసం 4గం. వ్యవధానంతో మాత్రమే మళ్ళీ ఏమైనా తినడం చేయాలి. ఆహారంలో తప్పనిసరిగా ఆరోగ్యదాయకములైనవీ, బలమునిచ్చునవీ అని రెండు రకముల పదార్థములు కలసి ఉండేట్లు చూసుకోవలసి ఉంది. తిండే జీవిత పరమార్థంగా ఉండే వ్యక్తులనూ, తిండి కనీసావసర మన్న స్పృహే లేని వ్యక్తులను కూడా సమాజంలో నేను గమనించాను. ఈ రెండూ, యదార్థమైన ఆధ్యాత్మ సాధనలకు ప్రతిబంధకాలే. ఈ విషయం యోగ దర్శనకారులూ, వ్యాసుడూ కూడా చాలా స్పష్టంగా గమనించారు. వారు చెప్పారు గనుక వాటికా విలువ రాలేదు. మన జీవితంలో ఎప్పుడైనా పరిక్షించి చూసుకోదగిన విషయంగా ఉందది. ఆత్మోన్నతి నందగోరిన వారందరూ, ఆహార నియంత్రణనూ (ఎక్కువా వద్దు, తక్కువా వద్దు అన్న సూత్రాన్ని, యధావిధిగా స్వీకరించవలసి ఉంది. ఇంద్రియాలలో రుచి-నాలుక-బలీయమై మనిషిని ఆహార స్వీకరణంలో అదుపు కోల్పోయేట్లు చేస్తున్నది. కనుక క్రమంగా దృఢ యత్నం చేసి ఆహార నియమాన్ని సాధించుకోవాలి. సాధకుడు-ఈ విషయమై అధిక వివరాలకూ, సందేహ నివృత్తికి మమ్ము సంప్రదించండి.

-:స్పందన - ప్రతిస్పందన:-

గత సంచిక నుండి నూతనముగా పంపుచున్న వారినుండియూ క్రమంగా లేఖలు అందుతున్నాయి. అందరూ తగినంతగా స్పందిస్తారో లేదో చూడవలసి ఉంది. ప్రస్తుతాని కందినంత వరకు మీ ముందుంచుతున్నాను.

స్పం|| (1) శ్రీ మరంగంటి శ్రీ రంగాచార్యులు. హైద్రాబాద్ వారు “మిత్రులు శ్రీమాన్” సురేంద్రకు నమస్కారములు. మీరు పంపిన మేలుకొలుపు సంపుటి-1 సంచిక -9 అందినది. మీ వ్యష్టి సమష్టి శ్రేయోభిలాష సత్యాన్వేషణమువలె సర్వ సమ్మతము. సంతోష ప్రదము. మీ ఆశయాల నవగాహన మొనరించుకొనడానికి యత్నింతును.

'5' వ పేజీలో ప్రమాణమును వివరించుచు అది (1) పరికరములను బట్టి (2) పద్ధతుల ననుసరించి రెండు రకా లనినారు. సరి. వీనిలో “ఇహపోతే పద్ధతుల ననుసరించి కలుగుతున్న జ్ఞానం” అంటూ జ్ఞానమును రెండురకాలుగా విభజించినారు. మరి జ్ఞాన సాధనమనిన ప్రమాణము యొక్కడ రెండవ రకమేమిటో వీలును బట్టి స్పష్టపరచండి.

చక్కని శాస్త్రీయ విషయమును ఆధునిక మేధావి ఆలోచనాసరిణికి అందించే మీ మేలుకొలుపు, సత్యాన్ని మరికొంత బట్టబయలొనరించి సమాజానికి మేలు కలిగించ గలదని ఆశింతును. “ధన్యవాదములు” అంటూ వ్రాశారు.

ప్ర. స్పం: ఈ 10 వ సంచిక నుండి ప్రత్యేక శీర్షికగానే “ప్రమాణ వివేచన” ధారావాహికంగా మీ ముందుండబోతోంది. అందుకు భూమికే యిప్పుడు మీ చేతిలో నున్నది. అయినా మీ ప్రశ్నకు సంగ్రహంగా వివరణనిస్తున్నాను గమనించండి. పరికరముల ననుసరించి ప్రమాణములారు. అవి జ్ఞానేంద్రియములే. పద్దతులనసరించి ప్రమాణములు ముఖ్యముగా రెండు (1) ప్రత్యక్ష ప్రమాణము, (2) పరోక్ష ప్రమాణము. ఈ రెండవది మరల అనుమాన, శబ్ద, ఉపమానాది విభాగమును కలిగి యున్నది. ప్రత్యక్షము అందరికీ సమానమే. పరోక్షమన్న పదం పరోక్ష జ్ఞానమునిచ్చునది అన్న అర్థంలో ఉపయోగించాను. జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానమనీ, పరోక్ష జ్ఞానమనీ రెండు రకములన్నదే ఇక్కడ నేను చెప్పదలచుకున్న అంశం గమనించగలరు.

స్పం॥ (2) శ్రీడా:ఐ. బి. రామారావు ఎమ్. ఎ. పి హెచ్ డి. ప్రొద్దుటూరు వారు. “ప్రియమైన మేలుకొలుపు ఎడిటర్ మహాశయులకు నమస్కా రములు.” మీరు పంపిన మేలుకొలుపు అందినది. అందు నన్ను మేధావి వర్గంలో చేర్చడం ముదావహమే కానీ చేర్చడానికి హేతువు మృగ్యము. తర్క శాస్త్రోద్దేశము తెలిసికుని ఆ శాస్త్రము నిర్వచించిన పదార్థములను, వాటి వివరములనూ మీరు ఎన్ను కొనిన పెద్దలనుండి ప్రశ్నోత్తరముల రూపమున రాబట్టి ప్రచురించిన మేలుకొలుపు అన్వర్థ నామము కలదగును. అని నా యభిప్రాయము. అని వ్రాశారు.

ప్రతి. స్పం|| (2) ఆర్యా, మీకూ నాకు పరిచయమున్న ఆప్తులనుండి మీ వివరం గ్రహించడం జరిగింది. ఇప్పుడు మీ లేఖ ద్వారానున్నూ మిమ్ము మేధావి వర్గంలో చేర్చుట ఉచితమనియే తేలినది. ఏలనంటే ప్రతిపాదిక విషయ మదేదైనా, మీకు యిష్టాన్ని కలిగించేదైనా హేతువును చూడక అంగీకరించని స్వభావం మీదని మీ వాక్యాలు తెలుపుతున్నాయి. పరిశీలించవలసిన వ్య క్తికుండదగిన ప్రధాన అర్హత కదా అది. ప్రమాణ వివేచన మన్న శీర్షికన నేనే తార్కిక విషయాన్ని మీవంటి వారి ముందూ, జిజ్ఞాసువుల ముందూ ఉంచబోతున్నాను. అందు పైవచ్చు అభిప్రాయములను స్పందన-ప్రతిస్పందన శీర్షికలో ప్రచురించగలను. యధావకాశం మనం కలవ గలిగిన విషయములను విపులంగా చర్చించు కొనుటకు వీలుపడగలదు. వారం వారం జరుపుకొనునట్లు తిరుపతిలో ప్రారంభింపనున్న అధ్యయన శిబిరములో నెలకొక తూరి నేనూ పాల్గొనునట్లు నిర్ణయించు కోవడం జరిగింది. కనుక మనం అక్కడైనా కలుసుకోవడానికి వీలవుతుంది. సంచికాంతర్గత విషయాలపై నిష్కర్షగా మీ అభిప్రాయాల్ని స్పందనకు పంపండి.

స్పం || (3) శ్రీ రమణేంద్రకుమార్. హైద్రాబాద్ వారు “పూజ్యులైన శ్రీ సురేంద్రగార్కి రమణేంద్రకుమార్ నమస్కరించి వ్రాయునది.” అదివరలో మీరు మాకో లెటర్ వ్రాస్తూ మా యొక్క activities గురించి అడిగినారు. మేము సిండికేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాము. బ్రహ్మచారులము. జీవితమును భక్తి మార్గములోనూ పరులకు మంచి చేయవలెనను  ధ్యేయముతోనూ మార్గము నేర్పాటు చేసికొనుటకు యత్నించుచున్న జిజ్ఞాసువును. పెద్దలా, సత్పురుషులా సత్సంగములో గడపుటకు ఇష్టపడే వ్యక్తిని. అనేక పెద్దల అనుగ్రహ భాషణము వినే భాగ్యమునకు నోచుకున్న వ్యక్తిని. ఇహపోతే మీ పత్రిక మీద అభిప్రాయం వ్రాయమన్నారు. చాల సంతో షము. మీరు చేయు కృషికి మా సహాయ సహకారము లెప్పుడూ ఉండును. పత్రిక ప్రతినెలా పంపండి. మా అభిప్రాయాల్ని తెలుపుతూ ఉంటాము. క్రొత్త మెంబర్సుకు తెలుపగలము. పత్రిక ఉచితముగా కాకుండా కనీస చందా స్వీకరిస్తే బాగుంటుందని మా సలహా. మీరు పత్రికలో పెద్దలా, నిష్ణాతులా, పరిశీలనాత్మక వ్యాసములను ప్రచురించవలెను. ఒకే వ్యక్తి వ్రాసిన అభిప్రాయాలూ వ్యాసాలూ - చదివిన విసుగని పించవచ్చు. కనుక మా మెంబర్స్ రుచులను కూడా దృష్టిలో పెట్టుకొన వలెను. నమస్కారములతో మీ మిత్రుడు అంటూ వ్రాశారు.

ప్ర. స్పం|| (3) విశ్లేషించవలసిన రెండు మూడంశములు కలిగి ఉందీ లేఖ. లేఖకులూ, పాఠకులూ కూడా పరిశీలించండి. విషయాన్ని క్రమంగా వివరించడానికి యత్నిస్తాను.

(1) మీ వ్యక్తిగత వివరములడుగుటలో గల వుద్దేశము (A) మీ పరిచయాన్ని పెంచుకొనుట కొరకు (B) జరుపవలసి ఉన్న వుద్యమంలో మీరే పాత్రకు సరిపోతారో అన్నది కూడా ఒక ఆలోచనగా ఉంది. వ్యక్తిలో సమాజహిత దృష్టి బలీయంగా ఉన్న నాడు అవసరమైన మార్పులను తానై గుర్తించిగానీ, ఇతరులచే గుర్తింప జేయబడి గానీ, ఆ వ్యక్తి పొందుతాడు. కనుక మనం కలవడానికి భావాలలో ఇప్పటి కేమైనా తేడాలున్నా మౌలికమై వేదిక ఏర్పడినట్లే కాగలదు.

(C) ఇహ చందా విషయం వ్యక్తిగతంగా నాకు భారమనిపించిన నాడు సమాజ కార్యానికవసరమైన అండ దండల్ని సమాజంనుండి స్వీకరించడానికేమీ వెనుకాడను. ప్రస్తుతానికంత ఆర్థిక యిబ్బంది లేదు. నా వద్ద చేరిన డబ్బు వనరులు కూడా సమాజం నుండి ఏర్పడినవే కనుక అవసరమైనంతమేర అవి సమాజానికై వినియోగింపబడడం ఉచితమే ఔతుంది.

(D) మీరన్నట్లు ఇతరుల వ్యాసావళి ప్రచురించడం, పత్రికోద్దేశ రీత్యా సాధ్య పడదు. పెద్దలనబడే వారి నుండి వ్యాసాలను స్వీకరించడం మొదలెడితే అనేక విష యాలు, అనేక ధోరణులూ చోటు చేసికుంటాయే గానీ అందించాలనుకున్న విషయాన్ని క్రమబద్ధంగా అందించడం కుదరదు. అయితే మేలుకొలుపు ఇతర స్వరాలను స్వీకరించదా అంటే అట్లేమీకాదు. ‘స్పందన-ప్రతిస్పందన’ శీర్షికన అందరి భావాలను స్వీకరించి ప్రచురించగలను.

 (E) ఎప్పుడూ ఒకే వ్యక్తి రచనలు విసుగనిపించవచ్చు అన్నదో సందేహము. రమణేంద్రకుమార్ గారూ, నేచెప్పదలచుకున్నది ఉబుసుపోక వ్యాసాలు కాదు. ఆధ్యాత్మ విద్యను. జీవితం పట్ల సమగ్రమైన అవగాహనా, తదనుగుణ్యాచరణా, మనం కలిగియుండి ఇతరులలోనూ కలిగించుట సత్యాన్వేషణ మండలి లక్ష్యమైయున్నది. అందుకు ఒక క్రమం అవసరం. విషయాన్ని నిష్పాక్షికంగా గ్రహించ గలరనుకుంటాను.

స్పం॥ (4) T. పానకాలు, తుళ్ళూరునుండి సంచికను గూర్చి ప్రశంసాత్మకంగా వ్రాస్తూనే ఒకటి రెండు - సందేహాలను వెలిబుచ్చారు. “తాను లేని చోటులో జరిగినది విచారణతో పనిలేదని” అన్నారు. భారత రామాయణాదులు మనం చూడ లేదు. వాటిని విశ్వసించకూడదా! అవి నిజంగా కధలే అయినా నాలాటి సామాన్యులకు కొంత ఆధారముగా,  ఉపయోగంగా ఉందని నా విశ్వాసము.

ప్ర. స్పం :- (4) తాను లేని చోటులో, లేని కాలంలో జరిగిన వాటినిగూర్చి విచారించుట కుదరదు అన్నది నా ప్రతిపాదన. అక్కడ విశ్వాసమే (ఒప్పుకోవడం, గానీ ఒప్పుకోక పోవడంగానీ) మనిషి కాధారము. మీరన్న విషయాన్నే తీసికుందాం. రామాయణాదులు జరిగినవంటున్న దేశకాలాలలో మీరు లేరు. ఇప్పుడు మీరు ఇతరులపై ఆధారపడి విశ్వసించడమో, విశ్వసించకపోవడమో కాక ఏమి చేయ గలరు? ఏవైన ఆధారాలు లభించినచో కొంత ఊహ చేయగలరు. ఉన్న వాస్తవాన్ని మీ ముందుంచడం వరకే నా పని. గమనించి ఒక నిర్ణయానికి రావడం మీవంతే. నేను విశ్వసించమనను, విడువమనను. మన పరోక్షంలో జరిగిన జరిగినవంటున్న - వాటి ఎడల మీకెప్పటికీ పరోక్ష జ్ఞానమే ఉంటుంది.

స్ప-4-B. రామాయణాదులలో మంచే వుంది. అన్నది మీ యభిప్రాయం.

ప్ర. స్పం|| అందరకూ అలా అనిపించడం లేదెందుకని? ఈ ప్రశ్నకు ఒక పక్షాన్ని స్వీకరించకుండా సమాధానం చెప్పడానికి యత్నించండి. నాయభిప్రాయం చెప్పమంటే వాటిని పరిశీలించేవారు అనుకూల దృష్టినో, ప్రతికూల దృష్టినో పెట్టుకునే ఉంటున్నారు కనుక అని చెపుతాను. గ్రంథం పై అభిప్రాయం చెప్ప మంటే వాల్మీ కాదులు లోకహిత కాంక్షకల మేధావులేననియూ, గ్రంథ రచనలో సమాజంలోని విభిన్న స్వభావాలనూ, ఆ స్వభావాలుకల వ్యక్తుల పోకడలనూ అనితర సాధ్యమైన రీతిలో భావితరం వారి ఎదుట ప్రతిఫలింపజేయగలిగారు అంటారనియూ,

కనుకనే ఈ నాటికీ అవి బ్రతికే ఉన్నాయి. మంచికీ చెడుకూ కూడా-ఆయా వ్యక్తుల స్వభావాలననుసరించి ప్రేరకాలుగా ఉంటున్నాయి. ఇది మీకాశ్చర్యకరంగానో, కొంత చేదుగానో ఉన్నప్పటికీ వాస్తవమే ఐయున్నది. మంచి, చెడుల కెట్లు సమాజమే ప్రేరణ స్థానంగా ఉందో అట్లే ఆ గ్రంథాలున్నూ, ఇక్కడ మరో నిజమేమంటే అట్టి రచనే నిజంగా పూర్తి సమాజానికి దర్పణం వంటిది కాగలదు. అట్టి రచయితే సమాజాన్ని -మానవుల స్వభావాల్ని-వీలయినంత ఎక్కువగా అర్థంచేసికున్న వారు కాగలడు. ఆ శక్తి వాల్మీకి, వ్యాసులలో గోచరించినంత ఇతరులలో గోచరించదు. నవీనులలో ఆ పంథాననుసరించిన వారున్నా ఎంతో కొంత పై యిరువురిచే ప్రభావితులైయ్యే ఉంటారనిపిస్తుంది నావరకు. ఆలోచించగలరు. సరైన రచయిత ఉన్న స్థితిని చూపడమూ, ఉండాలను కుంటున్న స్థితిని ఫలిత రూపంలో చూపడమూ చేస్తాడు. అదే అటు రామాయణంలోనూ, భారతంలోనూ ముగింపుగా కనుపిస్తుంది. రావణ వధ, రామ పట్టాభిషేకం, కౌరవ వధ, పాండవ పట్టాభిషేకం ఈ రెండూ సమాజానికి ఆదర్శాన్నివ్వడానికి కవి ఎంచుకున్న రూపాలు. కవిలోని వాస్తవిక దృష్టి కాలంబనగా మరో అంశం కూడా కనుపిస్తుంది చూడగలిగితే, అది ధర్మజ పట్టాభిషేకానంతరం మరల అధార్మికత క్రమంగా చోటు చేసికోవడం అన్నది. ఇది సమాజపు పోకడకు అద్దం పడుతోంది. సమాజ గమనానికి ప్రబంధకాలేమీ లేకుంటే అది క్రమంగా అవాంఛనీయ స్థితికి జారడం ఎప్పటికప్పుడు దానిని సరిచేయడానికో ఉద్యమం అవసరం కావడం; జరిగిన, జరుగుతున్న, జరుగనున్న విషయమై ఉన్నది. ఈ వాస్తవాన్ని గమనించనిచో ఊహలలో ఉండడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ అనుభవాల నుండీ, చరిత్రాధ్యయనం నుండి గ్రహించి నిర్ణయించుకోండి.

:విశ్వాసమూ - వివేకము:

 గత రెండు సంచికలలోనూ విశ్వాస వివేకాలను గూర్చి కొంత వరకు వివరించాను. పాఠకులా విషయాన్ని సరిగనే అర్థం చేసికున్నారనుకుంటాను. మరికొన్ని విషయాలు చెప్పి ఈ శీర్షిక ముగిస్తాను. ఆపై మీనుండి వచ్చే సందేహాలకూ, అభిప్రాయాలకూ స్పందన శీర్షికన బదులివ్వగలను.

విశ్వాసమంటే తెలియని వాటిపట్ల ఒక నిర్ణయానికి రావడమనీ, ఆ నిర్ణయానికి రావడానికి ఆధారంగా ఆ విషయానికే చెందిన అంశాన్ని గాక మరొక దానిని (సాధారణంగా ఆయా వ్యక్తులనూ, గ్రంథాలనూ) ఆధారంగా స్వీకరిస్తుంటారనీ చెప్పాను. ఏనాటికైనా వ్యక్తి ఈ మెట్టును విడువక ఆయా విశ్వాసాంతర్గత విషయాలలోని వాస్తవావాస్తవాలను తెలిసికో లేడు. ఆయా విషయాలను గురించి ఎవరు తెలిసికోవాలనుకున్నా వాటిని ప్రయోగం ద్వారా మాత్రమే రూఢిగా తెలిసి కోవడం సాధ్యపడుతుంది. జ్ఞానానికంతకంటే మార్గం లేదు. అన్వేషకులు ముందీ విషయాన్ని స్పష్టంగా గమనించాలి. ఇక్కడో విషయం తెలుపడం ప్రయోజన కారికాగలదు. విశ్వాసులనగానే ఆస్తిక మార్గీయులు అనే అర్ధం ప్రచారంలో వుంది. కానీ వాస్తవమేమంటే ఆయా విషయాలను గూర్చి సమగ్ర జ్ఞానం లేకనే ఆ యా మార్గాలను బట్టి పోవువారందరూ విశ్వాసులే. ఈ విషయాన్ని గమనించగలిగితే ప్రతి సిద్ధాంత ధోరణికి కొందరు విశ్వాసుల గుంపు ఏర్పడే వీలుంది అనీ తెలుస్తుంది. ఆస్తికులూ, నాస్తికులూ కూడా ఆయా సిద్ధాంతకారులు ప్రతిపాదించిన విషయాలను సిద్ధాంత స్వరూప స్వభావాలను-అర్థంచేసికొని గాక సిద్ధాంత ప్రవర్తకుల వ్యక్తిత్వం చేతనో, మరో కారణం చేతనో ప్రభావితులై ఆ మార్గాలనుసరిస్తున్న వారే. ఈ కోవకు చెందిన అందరిలోనూ అజ్ఞానం పాత్ర సమానంగానే ఉంటున్నది. ఉదా: వేదం చెప్పింది గనుక ప్రమాణమని వైదికులెలా అంటుంటారో అలానే మార్క్సు లెనిన్ లు చెప్పారు గనుక కమ్యూనిజం శాస్త్రీయమేనని కమ్యూనిష్టు లంటుంటారు. యదార్ధంగా, కమ్యూనిష్టు లనుకునే వారిలో ఎంతమందికి కమ్యూనిజం గానీ, మార్క్సు ఆర్థిక సూత్రాలు గానీ అర్థమైనాయంటారు? కొందరకు అర్థమైనా యనుకున్నా అవి ఆచరణ సాధ్యాలేనని ఎంచి ఎందరు నిజ జీవితంలో అమలు పరుస్తున్నారు. (పి. సుందరయ్యగారి లాంటి ఆదర్శ వ్యక్తిత్వం గలవారిని అలా వుంచండి. అలాటి వారు ఏ పోకడకు కట్టుబడి ఉన్నా త్రికరణశుద్ధిగా ఉంటారు.) మార్క్సిజానికి ఆధారంగా ఉన్న పదార్థ తత్వశాస్త్రపు మూడు ముఖ్య సూత్రాలనూ అర్థంచేసికున్న దెంతమంది? అసలా మూడు సూత్రాలూ జడపదార్థానికీ, చేతన పదార్థానికి అన్వయించి సరి పెట్టడం కుదురుతుందా? మార్క్సుకే ఊహా స్వర్గమైన కమ్యూన్ - (ఆశ్చర్యంగా ఉందా!? కొందరకు ఆవేశంగా కూడా ఉండొచ్చు. విశ్వాసులెవరికై నా వారి, వారి విశ్వాసాలపై దెబ్బపడితే అలానే ఉంటుంది మరి) నేటి కమ్యూనిష్టులకొక శాస్త్రీయ సత్యమెట్టైంది. అలానే వెంకటాద్రిగారు కమ్యూనిజం అశాస్త్రీయం అనగానే అవుననుకునే, (ఆ విషయ పరిజ్ఞానం తగినంత లేకనే అవునని వాదింపబోయే) హేతువాద సంఘీయులు చాలమంది దొరుకుతారు మీకూ. వారిని విశ్వాసులనాలా? వివేకులందామా? గోరాగారు దేవుడు లేడంటే లేడనుకునే నా స్తికానుయాయులూ విశ్వాసులే. ఆయా పంధాలననుసరిస్తున్న వీరందరూ ఆయా సిద్ధాంతాల విషయంలో కొద్దిపాటి జ్ఞానం కలవారే. ఇక పోతే విశేషజ్ఞానం కలిగి ఉన్నామనుకునే వారిలోనూ ఆ యా సిద్ధాంతాలను పరీక్షించి సత్యా సత్యాలు నిర్ధారించ గల కొలతలు-ప్రమాణ జ్ఞానం కలవా రెందరు? ఇందెంత నిష్కర్షగా పరిశీలించ వలసిన అంశమో అలానే ఆ యా సిద్ధాంతకారులూ, ప్రవర్తకులూ కూడా సమాజ క్షేమాన్ని కోరే సహృదయులేనన్నదీ అంతే నిష్కర్షగా అంగీకరించాల్సిన వాస్తవమే. గతంలో సత్యా సత్యాలను నిర్ధారించు యత్నాలే జరగ లేదనను గానీ సరైన తూనికలు కలిగి సత్య నిర్ధారణా యత్నం జరిగి యుండినచో, (అలా నిర్ధారించబడినా వాటిని స్వీకరించుటకు అందరూ సిద్ధపడి ఉండినచో) ఈనాడు ఇన్ని వర్గ వైషమ్యాలుండేవి కాదని మాత్రం చెప్పగలను. అసలీనాడు మాత్రం, రాగ ద్వేషాలు విడచి సత్య నిర్ధారణకై సిద్ధపడు వారెంత మందున్నారు? నా విజ్ఞాపనేమంటే అందరి శ్రేయస్సూ కోరి అలా పరిశీలించుకుందాము కదలిరండనే.

విశ్వాసమూ-వివేకమూ-3

 ప్రకృతి పరిణామ క్రమంలో అత్యుతమ వికాసరూపం మానవుడు. అయినా మానవ సామాజిక చరిత్రను చూడగలిగితే, స్పందించే హృదయం నీకుంటే అవెల్లా సహృదయుల నెవ్వరినైనా కలచి వేయుగల సంఘటనలే నన్నది, నిర్వివాదం. నాటి బుద్ధుని హృదయస్పందనల నుండి, నేటి శ్రీశ్రీ లాంటి వారి కలాల నుండి జాలువారిన కన్నీటి సిరా ముద్రల వరకు చూడగలిగే హృదయముంటే చూడండి. “నరజాతి చరిత్ర అంతా పరపీడన పరాయణత్వం ” అన్న మాట ఎన్ని విషాద సంఘటనలు ఆయన హృదయాన్ని తాకితే పుట్టి ఉంటుందో ఊహించగలరా? మాదిగొప్ప, మాదిగొప్ప అనుకుంటూ నాలుగు గోడల మధ్యనో, అనుయాయుల పొగడ్తల మధ్యనో కూర్చుని జీవితాల్ని జీవితాల్నే గడిపివేసే వాళ్ళకేం తెలుస్తాయి మానవత్వపు విలువలు. వందల, వేల సిద్ధాంతాలు కలసైనా సమాజహితం కంటే విలువైనవి కాలేవన్న వివేకం ఆయా సిద్ధాంతాల ప్రవర్తకులలో కలుగనంత కాలం, ఈ వర్గ వైషమ్యాలకు అంతం ఉండదు. వ్యష్టి, సమష్టి, సుఖ శాంతుల కొరకై ఉపయోగించవలసిన ఆయా సిద్ధాంతాలూ, - ప్రణాళికలూ కూడా మానవ వినాశనానికి (ద్వేషమూ, పగా మొదలైన అవలక్షణాలకు) ఆధార స్థానాలుగా ఉంటున్నాయి. వాస్తవాన్ని చూడాలన్న తపనా, ధర్మానికి మానవత్వపు విలువలకూ అనుగుణ్యంగా స్పందించే హృదయమూ ఉంటే, వివేక నేత్రాన్ని తెరవడానికి యిష్టపడగలిగితే, జ్ఞానమన్నది ఉన్న సమస్యల్ని పరిష్కారాలనూ కూడా చూపుతుందనీ, అజ్ఞానం-తప్పు తెలివి-అసలు సమస్యల్ని చూపజాలదనీ, పరిష్కారాలు కూడా లభించవనీ గ్రహించగల తెలివి తేటలుంటే, గతాన్నీ వర్తమానాన్ని మీ వ్యక్తిగత జీవితాన్ని కలిపి అధ్యయనం చేయండి. అప్పుడు తెలుస్తుంది జరగ కూడనివెన్ని జరిగిపోయాయో, జరుగుతున్నాయో, జరగనున్నాయో, కొన్ని సంఘటనలు చూపుతాను గమనించండి. (1)క్రీస్తు ఎందుకు సిలువ వేయబడ్డాడు? (2) మహమ్మద్ మక్కా వదిలి పారిపోవలసిన పరిస్థితి ఎందు కేర్పడింది? (3) వేద విధుల పేరిట నర మేధ పర్యంతమైన హింసాకాండకు బలమెక్కడ నుండి వచ్చింది? (4) శంకరులవారి పై విషప్రయోగ మెందుకు జరిగింది? శంకరుల నానాటి బ్రాహ్మణ సంఘం వెలివేసిందెందుకు? (5) శంకరుల ప్రాణాల్ని కోరిన కాపాలికుని కోర్కె వెనుక నున్న ప్రేరణశక్తి ఏమిటి? (6) దయానందసరస్వతి పై విష ప్రయోగం ఎందుకు చేయబడింది? (7) అలానే పల్నాటి యుద్ధానికి బీజం ఎక్కడుందో గమనించగలరా? (8) ఈ దేశంలో మతాంధత నుండి పుట్టిన యుద్ధాలను గూర్చి ఆలోచిస్తే ఏమి తెలుస్తుంది? (9) గజనీ, గోరీ దండయాత్రల -వెనుక నున్న మార్మకశక్తి ఏది? ఈనాటి పంజాబ్, అస్సాం, పాకిస్తాన్, కాశ్మీర్, నక్సలిజం ఈ సమస్యలన్నిటినీ పుట్టిస్తున్న శక్తి ఏది?

 బాహ్య కారణాలనేకం కనుపిస్తున్నా వీటన్నిటికీ మూలకారణం ఒక్కటే. అది అజ్ఞానమే. ఆ అజ్ఞాన జనిత విశ్వాసాల నుండి ఏర్పడిన, నాదీ-ఇతరులది అన్న భావనే వర్గ వైష్యమ్యాలకు ఆధారస్థానంగా ఉంటోంది. ఈ అజ్ఞానమన్నది శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం, పార్టీతత్వం, ఇలా ఎన్నో శాఖ లున్నాయి, ఈ అజ్ఞాన వృక్షానికి. దీనికి స్వార్ధం కాండంగా ఉంది.

ఈ అజ్ఞానం నుండి పుట్టిన విళ్వాసాలను, వీటిని కల్పించిన స్వార్ధపూరిత కుటిల మేధావి వరాన్నీ, సంఘం సామూహికంగా వెలివేయగలిగిననాడు అంతా శుభంకాగలదు. కొందరు కుహనా మేధావుల యత్న ఫలితంగా ఈ దేశంలోని మనిషి క్షుద్ర జంతువు కంటే హీనంగా చూడబడ్డాడు. దీనికి బాధ్యులైన వారిని శిక్షించ కుండా విడువడం మానవత్వానికే మచ్చ కాగలదు సహించి ఊరుకోవడం అధర్మా నికి పట్టం కట్టడమే. అసలు ఒక మనిషికి మరో మనిషిని శాసించే అధికారం ఎలా సంక్రమించింది? ఏవడో కుటిల మేధావి అది నాకు జన్మతః లభించిన హక్కు అన్నాడనుకోండి, నిజం దానిని ఎలా, ఎందుకు అంగీకరించి సహించగలిగింది. ఇలా జరిగిన అన్యాయాలూ, అమానుషాలూ వందల కొలది ప్రత్యక్షమవుతాయి చూడగలిగితే. కళ్ళుండీ చూడలేని, మనుషులుగా పుట్టి మనిషిగా జీవించ లేని వారిని మనుషులుగానూ, మాన్యులుగానూ చూడడమే సమాజం గతంలో చేసిన నేరం చేస్తున్న పొరబాటు, నేడూ నేనంటానూ ఎవ్వడైనా నిన్ను అసృశ్యుడా అంటే నీవే వాడిని వెలివేసేయ్. సమాజంలోని సాటి మనిషిని పుట్టుకను బట్టే నికృష్టులనీ, అంటరానివారనీ వేరు చేసే బుద్ధి లేనివాళ్ళను వేలి వేయగలిగిన రోజునగానీ వారికి బుద్ధిరాదు. అంతవరకు మనమెంతచెప్పినా వినరు సరికదా! ఏవేవో దిక్కుమాలిన ప్రమాణాల్ని వారి వారి చచ్చు గ్రంధాలనుండి ఉటంకిస్తారు. అట్టి వారినీ, వారి కాధారమైన గ్రంధ రచనలు చేసి మానవత్వాన్నే మంట గలిపిన వారి మూల పురుషుల్నీ, గంగలో దూకమనండి. ...

సాటి మానవులారా! మానవత్వపు పరిధిలోనే జీవించగల మేధావులారా! మనిషి మనిషిగా జీవించడమే సహజంగా ఉంటుంది. మిగిలిన నానా భావాలన్నీ కృత్రిమమే. ఈనాడు మన ముందూ, అన్ని సాంప్రదాయ ప్రవర్తకుల ముందూ ఉన్న అసలు సమస్య, నిద్రాణమై, అణగ గొట్టబడియున్న మానవత్వాన్ని మేలుకొలిపి ఉద్ధరించి దానికి పట్టం కట్టడమే. అందులోనే ఉంది అసలు శ్రేయస్సూ, అందరి శ్రేయస్సూ. లేవండి! వివేక నేత్రం తెరవండి. అజ్ఞానపు పొరల్ని చించి వేయండి. సమాజంలో మానవత్వమే రాజమార్గమని చాటండి. ఇది కష్టసాధ్యమైన విషయమే అయినా ఈ విషయం లోనే విప్లవం రావలిసి ఉంది. ఈ వందల సంవత్సరాలపాటు అనేక కుటిల మేధావుల నిరంతర యత్నంవల్ల (అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశాలు లేకుండా చేయడం ద్వారానూ, విశ్వాసాల ప్రయోజనాన్ని పదే పదే నూరిపోయడం ద్వారానూ) సహజంగా సంక్రమించిన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మనిషి గొర్రెలా మారాడు. ఈనాడు మన మనస్సులెంతగా ముకుళించుకుపోయాయంటే, నాయనా! కళ్ళు కప్పి వేయ బడ్డాయ్ నీకు,  నిజంగా నీవు చూడగల సమర్థుడివే, కళ్ళు తెరువు అని తట్టి లేపుతుంటే, కళ్ళు మూసుకుని “గొర్రెలా” అనుసరించటాని కలవాటు పడ్డ అతని మనస్సు లేవ నంటోంది. కళ్ళు తెరవనంటోంది. అదేమంటే అదేదో పుట్టి మునిగిపోతుందని భయపడుతోంది. పైగా అసలెందుకు కళ్ళు తెరవాలి? అని మనల్నే కసురుకుంటోంది. ఇది ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితి. ఎక్కువభాగం ఈ పంధాలోనే ఉంది సమాజం. వీటన్నిటికీ కారణం తప్పు తెలివే, అజ్ఞానమే. అజ్ఞానాంధ కారమునుండీ ఏర్పడిన కొన్ని విశ్వాసాలే. అజ్ఞానమనే విత్తనం నుండే విశ్వాసవృక్షం పుడుతోందన్న వాస్తవాన్ని గమనించగలిగినవాడు, విశ్వాస క్షేత్రాన్ని జీవితంలో దాని పాత్రనూ కనీస (ప్రమాదరహిత) స్థాయికి కుదించడానికి వీలవు తుంది.

అయ్యలారా! కళ్ళుతెరవండి! మీ కొంపేంమునగదు. విచారణ-వివేకమార్గంలో ప్రమాదములేమీ ఉండవనీ, ఏ రకంగా చూసినా జ్ఞానం యొక్క పాత్ర జీవితంలో తగ్గించడానికి వీలు లేనిదనీ, దాని ఆధారంతోనే జీవికను సాగించవలసి వుందని స్పష్టంగా గమనించండి. చక్కగా విషయ పరిశీలన చేసి ఉచిత నిర్ణయం తీసుకుని శ్రేష్ఠ మార్గాన ప్రయాణించండి. ఈ శీర్షిక ఇంతటితో ముగిస్తున్నాను. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు స్పందన-ప్రతిస్పందన ద్వారా జరుపుకొనగలము. పై సంచిక నుండి “చేదు నిజాలు” అన్న శీర్షిక ప్రారంభం కానున్నది. ఉంటాను.