Showing posts with label 226. Show all posts
Showing posts with label 226. Show all posts

Tuesday, July 5, 2016

సత్యాన్వేషణ మండలి అనుచరులకు నా మనవి-ఫజులూర్‌ రహ్మాన్‌ గారిఫేస్‌బుక్‌



సత్యాన్వేషణ మండలి అనుచరులకు నా మనవి-ఫజులూర్‌ రహ్మాన్‌ గారిఫేస్‌బుక్‌


చిల్లర చిల్లరగా తెలిసీ తెలియని ప్రచారములు మానుకోండి.. బహుశా రక్షింపబడే అవకాశం ఉంది. నేను విన్నదానిని బట్టి కొందరు లేని తప్పుడు ప్రచారం చేస్తున్నా రనిపిస్తోంది. అవునో కాదో చూడండి. ఫజులూర్‌ రహ్మాన్‌ తనకివ్వబడిన విషయాన్ని ఖురాను హదీసుల నుండి ఋజువుచేయలేకపోయారని.. సత్యాన్వేషణ మండలికి రహ్మాన్‌ రావడం లేదని, మానేశాడని. సొంతతల సరిగా పనిచేయని వారు ముఖ్యముగా నిర్ణయించడం విషయంలో ఇతరులపైనే ఆధారపడే వారే ఎక్కువగా అలాంటి బలహీనత కలిగి ఉంటారు. దానికి ఋజువుగా ప్రేరేపింపబడి కొందరు వ్రాసిన లెటర్లు అని మచ్చుకు చెప్పవచ్చు. విషయపరంగా చూసినట్లయితే నేను ద్వారకుంటలో మాట్లాడిన తరువాత మన కార్యక్రమములోని భాగముగా తదుపరి ఎప్పుడు కూర్చుందామో ఎందుకు ప్రకటించలేదు. కనీసం ఆ తరువాతైనా మీరు నిర్ణయిస్తే నాకు తెలియజేయాలి కదా? ఎందుకు తెలపలేదు? తెలియజేశారా లేదా అని ఎందుకు అడగలేదు? మీరు అడిగినట్లయితే ఆ తదుపరి కార్యక్రమమైనా నాకు తెలియజేసేవారు కదా? అసలు మీరు సరిగా ఆలోచించేవారే అయితే తదుపరి కార్యక్రమము జరగకపోవడానికి స్పష్టంగా కారణాన్ని గుర్తించియుండేవారు. నేనైనా ఆ రోజు చెప్పి లేదా తరువాతైనా అడిగి తేదీని గూర్చి మాట్లాడవచ్చు. వివేకము సరిగా పనిచేయని కొందరి థోరణి కారణంగా వ్యక్తిగతంగా అవగాహన కలిగించడమే సరైన పద్ధతి అనిపించింది. దానికి సంబందించిన కార్యాచరణే ప్రారంభించాలన్న ఆలోచన ఉన్నా దానిని కార్యరూపములోకి రాకముందే కొన్ని ఉత్తరాలు వచ్చాయి. కేవలం ప్రేరేపితులై వ్రాసిన ఆ లెటర్స్‌కి నేను వ్యక్తిగతంగా ఎంతో సమయాన్ని తీసి చాలామందితో మాట్లాడాను. జవాబు ఇచ్చాను. అందులో ఈ మధ్యనే దివంగతులైన మోషేగారు కూడా ఉన్నారు. ఇకనైనా నాతో కొనసాగింపు ప్రోగ్రాం చేయాలనుకుంటే అనుకూల తేదీ నిర్ణయించి ప్రకటించమనండి. నా వరకు నాకు ఒక అంశం తేలకుండా మరో అంశం చర్చించే ప్రసక్తే లేదు. దీనికి సత్యాన్వేషణ మండలి 100% ఏకాభిప్రాయం కలిగిఉంటుందని నాకు తెలుసు. గతంలో అంశము అంతా పరిశీలించాలని కాస్త సాగదీసి అవిశ్వాసుల పట్ల ఖురాను వైఖరిలో 1. ఇస్లాంకి బయటవారిపట్ల, 2. ఇస్లాం నుండి బయటకు వెళ్ళిన వారిపట్ల, 3. ఇస్లాములోనికి ప్రవేశించి బయటకి వెళ్ళిన వారిపట్ల అని సురేంద్ర గారు పొడిగించి పరిశీలించాలని ప్రారంభించారు. మేము ఎటువంటి కల్మషం లేకుండా కొనసాగించాము. అసలు విషయం అంటే మేము ఏ ప్రకటన సురేంద్రగారు చేస్తే - ఆ విధంగా ఖురాను బోధిస్తే మీరు ఋజువు చేయండి ఆ మరుక్షణం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీ వెంట వస్తామని ప్రకటించామో, దానికి ఇప్పటికీ నా వరకు నేను కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటిస్తున్నాను. ఇస్లాం సందేశమిచ్చిన తరువాత దానిని నమ్మని లేక తిరస్కరించిన వారిని తమ అవిశ్వాసము కారణంగా ఖురాను హదీసులు చంపమని బోదిస్తున్నాయి అన్నది. ఇకపై కూర్చుందామనుకునే వారికి షరతును పెంచాలనుకుంటున్నానని రాజేంద్ర ప్రసాద్‌ గారికి జవాబిస్తూ తెలియజేశాను. బహుశా మీదాకా ఆ విషయం చేరిందో లేదో. అదేమంటే ఆ విషయం ఋజువు చేయలేని మరుక్షణం మీ ఆ సిద్ధాంతాన్ని వీడి నన్ను అనుసరించవలసింది అనేది. రాజేంద్ర ప్రసాదు గారు సత్యాన్వేషణ మండలితో మాట్లాడి మీకు తెలియజేస్తానని జవాబు కూడా ఇచ్చారు. అదెప్పుడా అని జవాబు కోసం ఎదురుచూస్తున్నాను. ఒకటి మాత్రం మరచిపోవద్దు. ప్రకటించిన వారే తాను ప్రకటించినది 100% సత్యమని రుజువు చేసుకోవలసిన బాధ్యత ఉంటుంది.

ఖుద్దూస్‌ జవాబు :


మీ పదజాలమెందుకు అవసరం లేని మోటుతనాన్ని చూపిస్తుంది. చిల్లరగా ప్రచారం చెయ్యటం ఏమిటి? దేనినుంచి రక్షింపబడటం గురించి మాట్లాడుతున్నారు.

మీరు విన్నవాటిలో ఒకటి అయితే వాస్తవమే ఉంది. మీరు నిరూపించవలసిన విషయం నిరూపించలేక పోయారు అనేది. 'తనని ఒప్పుకోని కారణంగా ఖురానులో దేవుడు చంపమంటున్నాడా?' అనేది ప్రశ్న. అవును అనటానికి చాలా వాక్యాలు చూపించినా, మీరు ఒక్కటే చాలు, ఉంటే ఇస్లాం వదిలేస్తాను అని అన్నారు కాబట్టి, మండలి మీకు బాలుని ఉదంతాన్ని (18:80) ఎత్తిచూపింది. ఇతను తన అవిశ్వాస వైఖరితో ఎక్కడ వారిని వేధిస్తాడో అని ఖిజరు ఆ బాలుడిని చంపివేస్తాడు. ఈ విషయాన్ని అల్లాహ్‌ ఖురానులో చెబుతూ ఉంటాడు. ఈ విషయాన్ని ఖురానులో ఎందుకు చెప్పాడు అల్లాహ్‌? అని పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఖురాను మనుషులకి మార్గదర్శకత్వం అంటున్నాడు అల్లాహ్‌. మరి ఈ బాలుని విషయంలో ముస్లింలకి ఏ మార్గదర్శకత్వం ఉంది? అన్న విషయం ఆలోచిస్తే 2.1 విశ్వాసులను వేధిస్తాడు అన్న అనుమానం వస్తే చిన్న పిల్లలు అయినా చూడనక్కరలేదు, చంపివేయమంటుంది ఖురాను. దీనియొక్క తీవ్రత ఎంత ఉన్నది అనేది గమనించారా రహమాన్‌ గారూ? 2.2. పైగా అక్కడ దేని కారణంగా ఆ విశ్వాసులు వేదించబడతారు అని ఉంది చూడండి. తుఘ్‌ - యాన్‌ (దేవుడు పెట్టిన హద్దు మీరటం, తాగూత్‌ ఈ పదం నుంచే వచ్చింది) మరియు ఖఫ్రాన్‌ (అవిశ్వాసం, తిరస్కారం) కారణాలుగా చెప్పబడ్డాయి. అంటే ఏమిటి. ఒక వ్యక్తి అవిశ్వాసి అవుతాడు అన్న అనుమానం ఉంటే చాలు అతన్ని చంపివెయ్యొచ్చు అని ఖురాను ముస్లింలని మార్గదర్శకత్వం చేస్తునట్లేకదా.

అవిశ్వాసులు ఉండకూడదు అన్నది ఇస్లాం లక్ష్యం. అవిశ్వాసులు లేకుండా చేయటానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఇస్లాం. పై సందర్భం గమనిస్తే ఆ పిల్లవాడు, భవిష్యత్తులో తల్లిదండ్రులను వేధిస్తాడని చంపేస్తాడు. అంటే అప్పటికి అతను తల్లిదండ్రులను వేధించి ఉండడు. అవిశ్వాసం కారణంగా విశ్వాసులను వేధించటం అంటే ఏమిటి? ఒకరి అవిశ్వాసం కారణంగా ఒక విశ్వాసి అనుభవించే వేదన ఏమిటి? అసలు ఇస్లాం సాహిత్యం చాలాభాగం అవిశ్వాసులని వేధించేవారిగాను, చెడ్డవారిగానూ చూపించి ముస్లింలను, అవిశ్వాసుల పట్ల ద్వేషం పెంచుకొనేలా పురిగొలిపేదిగా ఉంటుంది. ఖురానును బలంగా విశ్వసించే వారెవరూ కూడా ఒక అవిశ్వాసిని, విశ్వాసితో సమానంగా చూడలేరు. ఒక అవిశ్వాసితో స్నేహం చెయ్యలేరు. చేస్తే ఇస్లాంలోకి ఆకర్షించటానికి స్నేహం నటిస్తారు, ఇస్లాంలోకి వచ్చే అవకాశం లేకపోతే శతృదృష్టితో చూస్తారు. పై సందర్భంలో అయితే అవిశ్వాసి అయితే ఏం చేస్తాడో కూడా చెప్పకుండా, అవిశ్వాస కారణంగా ఏదో చేస్తాడు అని అనుమానం ఉందికాబట్టి చంపేయమంటోంది ఖురాను. ఇక్కడ రెండు చెయ్యరాని పనులు చేస్తుంది ఖురాను. 1. అవిశ్వాసులు ముస్లింలను వేధిస్తారు అని ముస్లింలకు సందేశం ఇవ్వటం. 2. అవిశ్వాసి అన్న సందేహం కలిగినా సరే, అది నిరూపితం అవ్వకపోయినా చంపెయ్యవచ్చు అని ముస్లింలకు మార్గదర్శకత్వం చెయ్యటం. ఇదండీ ఆ వేదికలో ఆ మండలి చూపిన వాక్యం చూసిన నాకు కలిగిన అవగాహన. వేదికలో పాల్గొన్న మిత్రులలో ఎక్కువమంది కూడా ఆ వాక్యాలు అవిశ్వాసులను చంపమంటున్నాయి అని అంగీకరించారు. సురేంద్ర బాబు గారు కూడా మీరు అడిగినది చూపించాను అనిచెప్పి ముగించారు. కాబట్టి ఇక బాధ్యత మీపైనే పడిఉంది. అయితే సురేంద్ర బాబుగారు తప్పుచెప్పారు అనిచెప్పి దాన్ని నిరూపించాలి. లేక ఆ విషయములో మీ అవగాహన తప్పు అని అంగీకరించి మీకు మీరుగా పెట్టుకున్న షరతు ప్రకారం ఇస్లాం విడిచి బయటకు వచ్చేయాలి.

ఆయన పని ఆయన పూర్తిచేశాడు. మీ పని మీరు పూర్తిచెయ్యలేదు. మీ పని మీరు పూర్తిచెయ్యటానికి ఆయన మీకు కబురు పెట్టాలా? నాకు ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి మీ మాటలు. మీరు ఎప్పుడు స్పందిస్తారా అని చానా కాలం వేచిచూచిన వారిలో నేనూ ఒకడిని. ఇప్పటికే చాలా ఆలశ్యమైపోయింది. కదలిక రావలసింది మీ వైపునుంచే. వత్తిడి ఉండవలసినది మీ వైపునుంచే. మీ జీవనశైలి మొత్తం ఒక విశ్వాసం ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. మీ విశ్వాసంలో తప్పు ఉన్నదని ఎవరైనా చెప్తే, ఉందోలేదో తేల్చుకోవడం మీ తక్షణ కర్తవ్యం అవుతుంది. స్పష్టత కోసం మరొకమారు చెప్తున్నా. ఆ రోజు సురేంద్రగారు ''తనని ఒప్పుకోకపోతే (నమ్మకపోతే) చంపటం ఏమిటండీ అసలు? అన్నారు. సమాధానంగా మీరు ''ఆయనని ఒప్పుకోకపోతే చంపివేయండి'' అనే స్టేట్‌మెంట్‌ ఏదైనా ఉంటే లేక ఆ అర్థమిచ్చే స్టేట్‌మెంట్‌ ఏమైనా ఉంటే ఇస్లాం వదిలేయటానికి నేను సిద్ధం. అదే స్పిరిట్‌లో ఉంటే వదిలివేయటానికి సిద్ధం అని ముస్తాక్‌గారు కూడా చెప్పారు. మరి ఆ స్టేట్‌మెంట్‌ ఇలా ఎందుకు రూపాంతరం చెందింది?

''ఇస్లాం సందేశమిచ్చిన తరువాత దానిని నమ్మని లేక తిరస్కరించిన వారిని'' తమ అవిశ్వాసము కారణంగా ఖురాను హదీసులు చంపమని బోధిస్తున్నాయి అన్నది. మనం ఇంత మాట్లాడుకోలేదుగా ఆ రోజు. పైగా మీరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌నే చూద్దాం కొద్దిసేపటికోసం. ఇస్లాంలో నుంచి బయటకి వెళ్ళిన వారిని వధించమని ఖురాను 100% చెబుతుంది అని మీరే అంగీకరించారు. మరి ఇస్లాం నుంచి బయటకి వెళ్ళటం అంటే అవిశ్వాసమే కదా. అవిశ్వాసం కాకుండా ఏ కారణం ఉంది? ముర్తాద్‌లను చంపటానికి? మీరు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కి అయితే మీరే సమాధానం ఇచ్చేశారు అనొచ్చు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధానం దొరికేస్తుంది. ఇక ఇస్లాం నుంచి బయటకు రావటమే మిగిలి ఉంది.           (ఖుద్దూస్‌ గారి వాట్సాప్‌ జవాబు ఇంకా ఉంది)

మిత్రులు ఫజులుర్‌ రహ్మన్‌ గారికి


మిత్రులు ఫజులుర్‌ రహ్మన్‌ గారికి


ఖురాన్‌ వాక్యాలాధారంగానే, అల్లా చేసిన, చేయించిన అవిశ్వాసుల హత్యాకాండ చాలా పెద్దదని రుజువు చేయవచ్చు. దానికి పెద్ద తార్కిక సామర్ధ్యంగానీ, వాదనాపటిమగానీ అక్కరలేదు. ఉన్నమాటల్ని ఉన్నట్లుగా చూడగలిగితే చాలు. ఇక మహమ్మద్‌ జీవితాన్ని చదివినా, మత ప్రచారం మొదలెట్టిన నాటి నుండి ఖలీఫా అయ్యే వరకూ, అనంతరం చనిపోయే వరకూ కూడా అతని ప్రధాన కార్యక్రమం ఇస్లాం మత వ్యాప్తి, ఇస్లామేతరులతో యుద్దము అన్నదే. అవిశ్వాసుల, అన్యమతారాధకుల సొత్తు దోచుకోవడం, దేవుని ఆదేశం మేర భాగాలు పంచుకోవడం ధర్మ సమ్మతమే అంటోంది ఖురాను. ఇంకొక మాట చెప్పాలి. ఇతర దేవతా మందిరాల ధ్వంస కార్యక్రమం మొదలెట్టింది మహమ్మదే. మక్కాలోని 360 మందిరాలను ధ్వంసం చేశాడతడు. కడకు 5,6 రోజులలో చనిపోతాడనగా ప్రధాన సూచనొకటి చేస్తాడు. చిత్రాలుంటే చెరిపేయిండి చించేయండి. ప్రతీకలుంటే (నేలపై ఎత్తుగా విగ్రహంలాటిదేది ఉన్నా) నేల మట్టం చేయండి అన్నదే ఆ సూచన.

మీరు ఖురానులో చంపమని ఉన్నది తమపై దండెత్తిన అవిశ్వాసులను మాత్రమేనని మాటిమాటికీ అంటూ వచ్చారు. అప్పుడు నేను అది తప్పుడు వివరణ చేయడమేననీ, దండెత్తిన వారితో పోరాడడం, పోరాటంలో ఒకరినొకరు చంపుకోవడం యుద్ధ నీతి క్రిందికే వస్తుంది గనక అది ఇరుపక్షాల సైనికులకూ న్యాయమే అవుతుందని అంటూ, కానీ ఖురానులో జరిగింది అదొక్కటే కాదనీ, అలా యుద్దంలో జరిగిన మారణకాండకు దారితీసిన కారణాలేమిటి? అంటే అసలా యుద్ధం ఎందుకు ఏర్పడింది? అన్న దానిని బట్టే, జరిగింది మతపరమైన శతృత్వంవల్ల జరిగిన మారణకాండనా? ఈ లోకసంబంధమైన ధర్మాధర్మాల సంబంధంగా జరిగిన మారణ కాండనా అన్నదే నిజమేమిటో నిర్ధారించడానికి ఆధారము అవుతుందనీ చెప్పాను. మరో మాట... ఇస్లాం స్వీకరణ విషయంలో నిర్భంధమేమీ లేదంటోంది ఖురాను అని ముస్లిం పక్షాన మాట్లాడే పండితులంతా అంటుంటారు. అయితే అది ఏ సందర్భంలో అన్నమాటో, దాని అర్ధమేమిటో, దేనికి అన్వయించాలో గమనించడం చాలా అవసరం. ఎందుకంటే మహమ్మద్‌ ఖలీఫాగా తనని ప్రకటించుకున్నాక, తనకంటే పెద్దరాజులైన ఇస్లామేతరులైన అనేక రాజులు, చక్రవర్తులకూ ఒక తాకీదు పంపుతాడు. ఇస్లాం స్వీకరిస్తారా? యుద్దానికి సిద్దపడతారా? అని, ఇది పురాణ కల్పనలాటికధ ఏమీ కాదు. చరిత్రే. ఈ పని ఇస్లామేతరులపై నిర్భందాన్ని సూచించేది కాదన్నమాట. ఇస్లాం స్వీకరించడమో, పోరాటానికి సిద్దపడడమో తేల్చుకోండనడం నిర్భంధం కాదన్న మాట! అది స్వేచ్చనివ్వడమన్నమాట! గొప్ప వివరణే మహాగొప్ప భాషా పరిజ్ఞానమే ఇస్లాం పండితులది!?

నిజానికి, ఒక గ్రంధం ఏమి చెపుతుందన్నది నిర్ధారించాల్సిన సందర్భంలో ఆ గ్రంధ పక్షం వహించినవాళ్ళు గానీ, దాని వ్యతిరేక పక్షం వహిస్తున్నవాళ్ళు గాని చేసే నిర్ణయాలకు ప్రామాణికత, సాధికారత ఉండదు. ఎందుకంటే గ్రంధం ఏమి చెపుతుందన్న విషయంలో వారు వాదప్రతివాదులుగ ఉంటున్నారు కనక. అందులో ఒకరు చెప్పింది నిజమయ్యే అవకాశం ఉన్నా అది నిర్ణయించాల్సింది, ఏ పక్షానికీ చెందని వారూ ఆ గ్రంధాన్ని విచారణకు తీసుకున్నంత వరకైనా క్షుణ్ణంగా చదివినవారు లేదా విచారణ సందర్భంలో అప్పుడైనా సరిపడినంతా చూడడానికి సిద్దపడినవారు, ఆ గ్రంధపు భాషలో తగినంత భాషాపటిమ కలవారు మాత్రమే. అట్టి వారినే చర్చావేదికలలో గాని, వాద ప్రతివాదుల వేదికలలోగానీ, నిర్ణేతల పక్షం అనంటున్నాము. ఇది ఎవరూ అభ్యంతరపెట్టగూడని, పెట్టజాలని సార్వత్రక నియమం.

 సూత్రము :- వాద ప్రతివాదు లిరువురకూ న్యాయా న్యాయాల నెరిగే సామర్ధ్యం ఉండవచ్చేమోగాని, న్యాయ నిర్ణయం చేసే అధికారం ఉండదన్నదే ఆ నియమం మాత్రం.

ఖురాను వాక్యాలు, మహమ్మదు చేసిన కార్యాలను అలా ఉంచుదాం. భారత దేశం పైకి ఇస్లాంను అనుసరిస్తున్న అనేక విదేశీ రాజులు దాడులు చేశారు. కొందరు ఇక్కడి సంపదను దోచుకుని తిరిగి వెళ్ళిపోయారు. మరి కొందరు మళ్ళామళ్ళా దాడులు చేస్తూ, దోచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో హత్యలూ, మానభంగాలు మత మార్పిడులు, స్త్రీలను ఎత్తుకెళ్ళడాలు, పురుషులనూ ఎత్తికెళ్ళడాలు, వారిని బానిసలుగా చేయడాలూ ఇదంతా జరిగిన చరిత్రేనండీ రహమాన్‌ గారూ! ఈ క్రమంలో దేవాలయాలను ధ్వంసం చేయని ముస్లిం రాజులు లేరు. ఇక మరో రకం దండయాత్రలు జరిగాయి. ఆ రకం దాడులు చేసి ఇక్కడి రాజులను చంపి, తామూ ఇక్కడే స్ధిరపడటమో, తమ వారసుణ్ణో ప్రతినిధినో ఇక్కడ పాలకునిగ నియమించడమో జరిగింది. దాంతో దాడులు దోపిడీ కొరకన్నది పోయి, రాజ్యం కొరకు అన్నది వచ్చి ముస్లిం రాజుల పాలన మొదలైంది.

రహ్మాన్‌గారూ! ఆ తర్వాత ఇక్కడ జరిగిందంతా ఇక్కడి వారిని ఇస్లాంలోకి మార్చడం, విగ్రహాలను విగ్రహారాధకుల్ని నిర్మూలించడం అన్నదే చరిత్రలో ఎంతో ఉదారునిగా, మత సామరస్యం కలిగినవానిగా పేర్కొనబడిన అక్బర్‌ చక్రవర్తి కూడా అనేక వందల హిందూ మందిరాలను పడగొట్టించాడన్నది చారిత్రక వాస్తవం. అతడు హిందువుల స్త్రీలను జనానాకు చేర్చుకున్నాడేగాని, హిందూ పురుషులకు ముస్లిం స్త్రీల నిచ్చి వివాహాలు జరిపించలా, తాను హిందువుగానూ మారలా, చాలా మందిని ముస్లింలుగ మార్చాడు కూడా.

ఆనాడే కాదు. ఈనాటికీ ఇస్లాం అదే వరవడి కొనసాగుతోంది. ఒక హిందూ స్త్రీని ముస్లిం వివాహం చేసుకుంటే ఆ స్త్రీ ఇస్లాం స్వీకరించాల్సిందే. అలాగే ఒక హిందూ పురుషుడు ముస్లిం స్త్రీని వివాహమాడాలంటే అతడూ ఇస్లాం స్వీకరించాల్సిందే. మీరూ అలా మారినవారే. మీ పిల్లలకు పెళ్ళిళ్ళు ముస్లిమేతరులతో చేయాలని మీరూ యత్నంచారు. మీ పిల్లలు పెళ్ళి చేసుకున్న వారి మతాన్ని స్వీకరించడానికై మీరేమీ సిద్దపడలా. పైగా వారికి ఇస్లాం పద్ధతినే పెళ్ళిళ్ళు జరిపించాలన్న షరతు పెట్టారు. ఇస్లాం ఇస్లామేతరుల పట్ల ఇంత వివక్ష పెట్టుకుని, పిల్ల పెండ్లిండ్లనూ మత మార్పిడికి సాధనంగా వాడుకున్నారు ముస్లింలు. కానీ మీరు ఒక మతం మరో మతాన్ని కెలకకూడదు, ఎవరిష్టానికి వాళ్ళని ఉండనివ్వాలి, వారి ఇష్టం విషయంలో ఎలాటి వత్తిడిని కలిగించినా అది అమానుషమే, ఇస్లాంలో అలాటివైఖరి ఉంటే దానిని వదిలేస్తాను లాటిమాటలెన్నో మీ ప్రతిపాదన క్రింద మాట్లాడేశారు.

మొన్న మీరు నరసింహులు, నిన్న విజయ్‌కుమార్‌ గారు ఈ రోజు రహ్మాన్‌గారుగా ఉన్నారు. హిందువులూ మిమ్మేమి అనలా. క్రైస్తవులూ మిమ్ము ఏమీ అనలా. మీరు ఇస్లాం నుండిబైటికి రండి ముస్లింలు మిమ్మేమైనా  అంటారో అనరో చూద్దాం! ఒక వేళ భారతదేశంలోని ముస్లింలు ఇక్కడి సంస్కృతికి అలవాటుపడి ఉండడం వల్లనో, భారత రాజ్యాంగం ఊరుకుకోదన్న భయం లేదా అవగాహన వల్లనో మిమ్మేమి అనకపోవచ్చుగానీ, అసలు గ్రంథమే అలాటివాణ్ణి 'ఏసెయ్‌' (చంపేయ్‌) అని అంటున్న మాట 100% నిజమేనని మీరే అంగీకరించారుకదా!

రహ్మాన్‌ గారు 1) ఖురాన్‌ అవిశ్వాసులపట్ల కౄరవైఖరి కలిగి ఉంది. దానిన అమలు పరచడం సాధ్యంకాని పరిస్థితుల్లోగానీ, అవిశ్వాసుల్ని ఇస్లాంలోకి మార్చేయత్నాలు చేస్తున్న పరిస్థితులలో గానీ మాత్రమే ఎత్తుగడగా అవిశ్వాసుల్ని తాత్కాలికంగా చంపకుండా ఊరుకుంటుంది.

2) ఖురానులోని సామాజిక కట్టుబాట్లు వివేకవంతులు అంగీకరించదగినవిగా లేవు. వాటిలో కొన్ని అమానుషాలుకాగా, మరికొన్ని కాలం చెల్లినవి (ఈనాటికి పనికిరానివి)

3) వ్యక్తి గురించి, సమాజంగురించి, ప్రకృతి గురించి ఖురాను చెప్పినవెన్నో ఈ రోజు ప్రయోగరీత్యా తప్పులని రుజువు చేయవచ్చు.

4) ఖురాను చెప్పిన స్వర్గాన్ని కోరుకునే వ్యక్తిని వివేకవంతుడని గాని విజ్ఞుడు అని గాని అనలేము. ఎందుకంటే, అందులో అలుపూ సొలుపూ లేకుండా తినడం, తాగడం, అనేక స్త్రీలతో పండడం అంతే ముప్పాతికమూడొంతులు, అవి అసహ్యం, జుగుప్స కలిగించేవిగానూ ఉన్నాయి. బహిరంగంగా అందరిముందూ వాటిని చదివి వినిపించుదామంటే నాకేమీ అభ్యంతరం లేదు. వారు వినగలరో లేదో, మీరు వినిపించగలరోలేదో చూడండి.

అంత భయంకరమైన పోకడలున్నా ఖురానును మంది నెత్తికెత్తే పని మాకెందుకండీ! ఇంతకూ ఈ చాకిరంతా మీరూ ఆ స్వర్గాన్ని అనుభవించాలనేనా? ఇంకేమైనా ఆలోచన ఉన్నదా?

 రహ్మన్‌ గారూ! ప్రతిదినం ప్రపంచంలో ఏదో మూల జరుగుతున్న మత ఉగ్రవాద మారణకాండకు సంబంధించిన వార్తలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతూనే ఉన్నై. వాటిలో 99% ఇస్లాం విశ్వాసులుగ ఉంటున్నవాళ్ళు, ముస్లింలమంటున్నవాళ్ళు సాగిస్తున్నవే, పాశవికంగా కౄరంగా, రాక్షసంగా వారు సాగిస్తున్న మారణకాండ లేవీ మీకు కనిపించడం లేదా? వాళ్ళుచేస్తున్నవన్ని ఖురానుకు వ్యతిరేకమైనవీ, సత్య తిరస్కారులు మాత్రమే చేస్తున్నవీ అని మన స్ఫూర్తిగా (త్రికరణ శుద్ధిగా) ప్రకటించగలరేమో ఆలోచించండి. ప్రపంచ వ్యాపితంగా జరుగుతున్న అలాటి ఘటనలకన్నింటికి ఖురాను విశ్వాసులే ఎందుకు కారణమవుతున్నారంటారు? 30-6-2016 ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇదే విషయం మొదటి పేజీలో ప్రచురితమైంది. ఇలాటివి జరిగినప్పుడల్లా మానవ హృదయం వేదన చెందాలి. ఇతరమైన ఏ మత ధోరణుల వారి వల్లా ఇంతటి ఘోర కృత్యాలు జరగడం లేదన్నది నిజం కాదా? 

- భారతీయ ముస్లింలు దీనిపై స్పందించాల్సి ఉంది.

సత్యాన్వేషణలో  - మీ సురేంద్ర

పెరికల మోషే మరణానికి మండలి నివాళి


పెరికల మోషే మరణానికి మండలి నివాళి


సత్యాన్వేషణ మండలి రాష్ట్ర అధ్యక్షుడు, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు అయిన శ్రీ పెరికల మోషే జూన్‌ 9వ తేదీ రాత్రి గుంటూరులో మరణించారు. శ్రీ పెరికల మోషే వెంకటేశ్వర్లు, దయమ్మలకు పేర్లిగ్రామంలో జన్మించాడు. మరణించేనాటికి అతని వయసు 62 ఏళ్ళు. అతడు ముందే రాసిన అవయవ, దేహదాన వీలునామా ప్రకారం ఆ రాత్రి నేత్రదానం మరుసటిరోజు అంటే జూన్‌ 10 వ తేదీన మధ్యాహ్నం బాపట్లలో దేహదానం కార్యక్రమాలు జరిగాయి.

17వ తేదీ ఉదయం 11 గంటలకు బాపట్ల అంబేద్కర్‌భవన్‌లో అతని సంతాపసభ సత్యాన్వేషణ మండలి ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 500 మంది హాజరైన ఈ సభకు సత్యాన్వేషణ మండలి బాధ్యుడు శ్రీ శీలం నాగార్జునరావుగారు అధ్యక్షత వహించగా, శ్రీ అబ్రహంలింకన్‌, ఆనందకుమార్‌, ఇన్నయ్య, ఏబేల్‌, యర్రం శెట్టి జగన్‌ మోహన్‌రావు, మాధవి, శాంతారామ్‌, జయన్న, రామకృష్ణారెడ్డి, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరెడ్డి, నటుకుల శ్రీనివాసరావు, చుండూరినాగయ్య పాతూరి రాధాకృష్ణారావు తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ సభకు శ్రీ పుట్టా సురేంద్రబాబు, కోట ప్రసాదశివరావు, పి.సి సాయిబాబు, కొడాలి రవిబాబు తదితరులు కూడా హాజరయ్యారు. సభలో మిత్రులు చేసిన ప్రసంగాల ముఖ్యాంశాలను సంక్షిప్తీకరిద్దాం.

మోషేని మండలికి పరిచయం చేసినవారు శ్రీ హెబేల్‌, డా|| ఆనందకుమార్‌లే. హెబేల్‌గారు మాట్లాడుతూ, మోషే ఒక ఉక్కు మనిషి అని అభివర్ణించగా, డా|| ఆనందకుమార్‌ మోషే మాట తీరు ఇతరులను గాయపరిచేదిగా వుండేదనీ, స్నేహ పూర్వకంగా అనిపించదనీ, అయినప్పటికీ మంచి హృదయం కలవాడనీ మాట్లాడారు.

మిత్రులు శ్రీ శాంతారామ్‌గారు మాట్లాడుతూ, మోషే చేసిన అవయవ, దేహదానం స్ఫూర్తితో తాను కూడ అవయవ దేహదానం చేయాలనినిర్ణయించుకున్నట్లు, అంతేకాక మహాకవి శ్రీ శ్రీ అవయవ దేహదానం వీలునామా వ్రాసినప్పటికీ అతని కుటుంబ సభ్యులు అమలు పరచలేదనీ, కానీ ఈ విషయంలో మోషే కుటుంబ సభ్యులు మోషే వీలునామాను గౌరవించి అమలు చేయటం అభినందించదగ్గదన్నారు.

సమాచార హక్కు ఉద్యమకారుడు శ్రీ నటుకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ మోషే స్మారక దినాన్ని ప్రతి సం|| ప్రకాశం జిల్లాలో జరుపుకుంటామని చెప్పారు.

యర్రం శెట్టి జగన్‌మోహన్‌రావు గారు మాట్లాడుతూ మోషేని మండలిని అర్ధం చేసుకోవటానికి సమాజానికి కొంత టైమ్‌ పడుతుందన్నారు అవయవ, దేహదానం చేయటంలో మృతుని బంధువులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.

1. అవయవ, దేహదానం చేయాలనుకునే వ్యక్తి ముందుగా కుటుంబ సభ్యుల అనుమతి సంతకాలతో తన ఉద్దేశ్యాన్ని వీలునామా ద్వారా తెలియపర్చి దగ్గరలో ఉన్న మెడికల్‌ కాలేజికి ఇవ్వాలి.

2. వ్యక్తి మరణించగానే కాలేజీకి మృతుని బంధువులు తెలియచేయాలి.

3. మరణించిన 6 గంటలలోపు వ్యక్తి నేత్రాలను (కార్నియాలను) దానం చేయాలి. నేత్రదానం జరిగేలోపు అవి చెడిపోకుండా, కళ్ళపై తడిగుడ్డ ఉంచాలి. దగ్గరలో ప్రమిదలు, కొవ్వొత్తుల వేడి, తగల నీయరాదు. ఎండలో తల ఉంచరాదు.

4. శరీరం చెడిపోకుండా ఫ్రీజర్‌లో ఉంచాలి. కాలేజీవాళ్ళకు మృత శరీరం అప్ప చెప్పే వరకు బయటకు తీయరాదు.

5. రక్తదానం చేసేవారు 50 సం||లోపువారు అయితే మంచిది. 350 మి.లీ కంటే ఎక్కువ తీసుకోరు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన రోజే మన పనుల్ని యధావిధిగా చేసుకోవచ్చు.

6. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాల్ని అంటే నేత్రాల్ని ఇద్దరికీ, కిడ్నీలు, ఇద్దరికీ, కాలేయం, ముగ్గురికీ, ప్రాంక్రియాస్‌ ఒక్కరికి, గుండె ఒకరికీ, గాల్‌బ్లాడర్‌ ఒకరికీ, ఊపిరితిత్తులు ఇద్దరికీ ఎముకలు మొదలగునవి మొత్తం కలిపి సుమారు 18 మందికి పైగా జీవితాన్ని ప్రసాదించవచ్చు.

శ్రీమతి మాధవి మాట్లాడుతూ జగన్‌గారి తల్లిగారు దేహదానం చేసిన రోజునే అంటే సుమారు 3 సం|| క్రితమే మోషే కూడా ఆ స్ఫూర్తితో వీలునామా వ్రాసి తమ సంస్థకు అందచేశాడన్నారు.

ఎర్ర కండవా లింకన్‌గారు మాట్లాడుతూ మోషే తమ దళం నుంచి విడిపోయినా, సమాజానికి సేవ చేస్తున్న మండలిలో సభ్యుడై కొనసాగుతున్నందున సంతోషంగా ఉండేదన్నారు.

శ్రీ కాగిత కోటేశ్వరరావు మాట్లాడుతూ మోషే తనను తాను ఒక కులానికో ఒక మతానికో సంబంధించినవాడుగా భావించుకోలేదనీ, మండలి చెబుతున్న కుల, మత బంధనాలు విడవండన్న మాటను ఒంటబట్టించుకున్న వ్యక్తిగానే మోషేను చూడడం సరైందనీ అన్నారు.

మోషే కుటుంబ సభ్యులను సభకు పరిచయం చేయడం ద్వారా నాగార్జునరావు గారు సభ ముగిస్తూ.

సత్యాన్వేషణ మండలిలో మోషే ఆదర్శాలైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం, గ్రామ సభ, వార్డు సభలు జరిగేట్లు కృషి చేయాలని, మోషే మరణానంతరం మోషే లానే మండలి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాద్యత మనందరిపైనా ఉందని భావిస్తూ మోషే కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియచేశారు.

సంస్మరణ సభకు హాజరైన శ్రీమతి మంచినేని మాధవి 'సంఘమిత్ర సేవాసమితి' మరియు శ్రీ కొడాలి రవిబాబు 'జపాన్‌ నమూనాల కరాటే అసోసియేషన్‌' ల తరపున అవయవ, దేహదాన ప్రచారం కోసం కరపత్రాలు, వీలునామ పత్రాల కాపీలు పంచారు.

సహచర మిత్రుడు మోషే భౌతికంగా మనతో లేడు. లేడుకదూ!? అవును!


సత్యాన్వేషణ మండలిని / నన్నూ అతి దగ్గరగా చూచిన అతి కొద్దిమందిలో మోషే ఒకడు. అలాగే నాలాగే మండలి జీవితావగాహనననుసరించి క్రమంగా తనను తాను మరింత మెరుగైన మనిషిలా తీర్చిదిద్దుకొనేందుకు స్వీయసాధన చేసుకుంటూ వస్తున్న వ్యక్తి అతడు. తెలిసినంతలో తాను సరైందని నిర్థారించుకున్న మేర నిజాయితీగా నడవాలనుకునే స్వభావం ఉన్నవాడు. మండలిలోని బాగా దగ్గర వాళ్ళకూ, మండలిని దగ్గరగా చూస్తున్న వాళ్ళకు మోషే సంభాషణలు విషయపరంగా నేను మాట్లాడుతున్నట్లే అనిపించేవన్న మాట నలుగురికి తెలిసిందే. సత్యాన్వేషణ మండలి, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక కూడా ఒక నిబద్ధత కలిగిన, సమర్ధుడైన క్రియాశీల కార్యకర్తను కోల్పోయిందన్నది నిజం. ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా మనల్ని మనం తయారుచేసుకుంటూ, మరింతమంది మోషేలు రూపొందాల్సి ఉందన్నది నిజం. నాకున్న ప్రతి రూపాలలో ఒక రూపం కనుమరుగైందన్నది నాలోపలి మాట. తప్పదు. వాస్తవాలనంగీకరిస్తూ మిగిలిన వాళ్ళం కాలంతో కదులుతూ నడచిపోక తప్పదు.

- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

అన్న (మోషే) - నేను


జూన్‌ 9వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో మిత్రలు కోట ప్రసాద్‌ గారు 'అన్న' అకాల మరణం కబురందించారు. జీవితంలో ఇటీవల కాలంలో నాకు 'షాక్‌' (దిగ్బ్రాంతి) కలిగించిన వార్తయిది. నాకే కాదు 'మోషే'ని ఇటీవల కాలంలో కలిసిన వారెవరూ, అంత త్వరగా నమ్మలేని వార్తే అది. మెడికల్‌ కాలేజీకి నేత్ర, దేహదానం చేయాలని వీలునామా రాశాడని, ఏర్పాట్లు చూడమని మిత్రులు కోటేశ్వరరావు, బాలాజీరెడ్డిలు కోరారు. తాము నిర్వహిస్తున్న సంఘ మిత్ర సేవాసమితికి ఆ వీలునామా అందచేసాడని మిత్రురాలు మాధవిగారు తెలియజేశారు. హేతువాద మిత్రుడు పర్వతయ్య (గుంటూరు)గారి సహకారంతో నేత్రదానం (శంకర్‌ ఐ ఫౌండేషన్‌ వారికి) దేహదానం (కాటూరు మెడికల్‌ కాలేజీవారికి) చేయడం జరిగింది.

మోషే వయసులో నాకంటే ఒక ఏడాది పెద్ద. అందుకనే 'అన్న' అని పిలిచేవాణ్ణి. ఇతరులకూ కూడ అన్న అనే చెప్పేవాణ్ణి. తాను మాత్రం నన్ను 'సార్‌' అనిపిలిచేవాడు. బహుశా తనకంటే నేను ఎక్కువ చదువుకున్నాననో, మంచి ఉద్యోగం చేసాననో, ఆర్ధికంగా మెరుగ్గా ఉన్నాననో సమావేశాలలో ఎక్కువగా మాట్లాడతాననో ఏదైనా కావచ్చు. కాని ఇద్దరం అరమరికలు లేకుండా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. పోట్లాడుకునే వాళ్ళం. సరదాగా ఒకరినొకరం ఆటపట్టించుకొనే వాళ్ళం. మా ఇద్దరికీ బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళతో సరదాగా నన్ను తన 'శత్రువు'గా చెప్పేవాడు. సమవయస్కులంకావడం, స్వతంత్ర భావాలు కలిగి ఉండడం, సత్యాన్వేషణ మండలికి దాదాపు ఒకేసారి పరిచయం కావడం, ఆ భావజాలం సరైందనిపించడం మేము రెండు దశాబ్దాలుగా కలిసి ఉండడానికీ కారణం కావచ్చు.

కాని తన దేహదానం జరిగేరోజున జరిగిన సంతాపసభలోను, 17వ తేదీన అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన సంస్మరణ సభలోనూ మోషేను స్ధానికంగా అందరూ ఎతుమతం మోషే అని పిలిచేవారని ఒకాయన ప్రస్తావించారు. వాడుకలో 'రెటమతం' అన్నా 'ఎతుమతం' అన్నా మొండి తనమని, ఎవరి మాటవినని సీతయ్య స్వభావమని అర్ధం. మరొకరు ఒక దళితుడి గొప్పదనాన్ని సత్యాన్వేషణ మండలి గుర్తించి రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిందని అది ఆ సంస్ధ గొప్పదనమన్నారు. ఇంకొకరు మోషే చేసిన దేహదానం అగ్రవర్ణాలకే ప్రయోజనం అనీ వాఖ్యానించారు. పెంచలయ్య, అరవిందుడు, చలం లాగా తన చివరిరోజుల్లోనైనా మోషే ఆస్తికుడవుతాడని ఆశించానని, కాని మోషే అకాల మరణం చెందాడని మరో మిత్రుడు బాధను వ్యక్తపరిచాడు. ఇలా రకరకాలు వాఖ్యానాలు విన్నతరువాత, మోషే వారికి సరిగా అర్థంకాని మోషే అసలు స్వరూపాన్ని వివరించడం చాలా అవసరమనిపించింది మాకు.

మోషే ది పైకి 'ఎతుమతం' లా అనిపించవచ్చు. కాని నా దృష్టిలో అతనిది ఎతుమతం కాదు. ఎంతో 'ఎత్తుకెదిగిన మతం' తాను ఎదగాలనే తత్వం. తన తోటి వారూ ఎదగాలని, ఎదగటం గురించి వారికి నచ్చ చెప్పటానికి తపనపడే తత్వం. అడవిలో అన్నల పట్ల సానుభూతి పరుడుగా ఉన్నా, సత్యాన్వేషణ మండలి బాధ్యుడుగా ఉన్నా అతని స్వభావంలోని వివిధ గుణాల పూసలను కలిసి వుంచిన 'దారము' అదే. సహజంగానే అది అర్ధం కాని వారికి అతనిది 'రెటమతం' లాగే వుంటుంది. తన గురించి కంటే సమాజం గురించి ఎక్కువ ఆలోచిస్తూ, సంస్కరణ కోసం ప్రయత్నించిన ఏ వ్యక్తి అయినా ఆనాటి సమాజంలో ప్రతిఘటన ఎదుర్కొన్నవాడే. ఎదురీదిన వాడే. అటువంటి వారి భావాలను అర్ధం చేసుకోవటానికి సమాజం చాలా సమయం తీసుకుంటుంది. బ్రూనోను, గెలీలియోలను ఆనాటి సమాజాలు చిత్రహింసలపాలు చేసాయి. హత్యచేసాయి. పరిణామసిద్దాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్‌ డార్విన్‌ను గేలి చేసిన క్రైస్తవ సమాజం, ఆయన మరణించిన 125 ఏండ్ల తరువాత పశ్చాత్తాపం వ్యక్తపరిచింది. ఏ సంస్కర్తకైనా ఇదే పరిస్ధితి.

అప్రియశ్యతు పధ్యశ్య వక్తా శ్రోతా చ దుర్లభః - ఎదుటి వానికి నచ్చకపోయినా అతనికి మేలుకూర్చే మాట చెప్పేవాడు, చెప్పినా వినేవాడు అరుదు.

మోషే సమాజం దృష్టిలో ఎలా ఎతుమతమో చూద్దాం.


1. సత్యానికి పెద్దపీట వేయమంటుంది మండలి. ప్రతి విషయాన్ని వాస్తవంతో సరిచూసుకోమంటుంది. వాస్తవంతో సరితూగిన విషయమే సత్యము అంటుంది. కాని సమాజంలో ఆ పరిస్థితి లేదు. నలుగురు ఏం చెప్తే అదే సత్యముగా చలామణీ అవుతుంది. నలుగురూ ఏదారి నడిస్తే అదే సరైనదే అనుకుంటుంది. వారి దృష్టిలో మరి మోషే ఎదురుమతం కాక మరేమౌతారు.

2. కుల, మతాలు లేకుండా ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా అందరం కలిసి మెలసి ఊండాలంటున్న మోషే కులాల కుళ్ళుతో, మతాల గబ్బుతో మమేకమై జీవనం సాగిస్తున్న సమాజం దృష్టికి ఎతుమతం వానిలానే కనిపిస్తాడు మరి.

3. శాస్త్రీయ దృక్పథం పెంచుకోమంటున్న మండలి మాటలు, నిత్యం మూఢనమ్మకాల్లో మునిగి తేలుతున్న సమాజం దృష్టిలో ఎతుమతమే.

చెప్పదలచుకున్నది ఇతరులకు సరిగా చెప్పటం, ఇతరులు చెప్పింది సరిగా వినటంలో కూడా నిపుణత అవసరమని మండలి చెప్తోంది. అవతలివాడు ఏదైనా ప్రశ్నించినపుడు ఆ ప్రశ్నను సరిగావిని, అర్ధం చేసుకున్న తరువాతే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని మండలి బోధిస్తుంది. మోషే ఈ సూత్రాన్ని బాగా వంట బట్టించుకున్నాడు. కాని ప్రశ్నించడమే ఇష్టపడని, ప్రశ్నించడమే తెలియని, సరిగా ప్రశ్నించడమే చేతకాని జనాల వద్ద అసలు సరిగా వినడమే అలవాటులేని జనాన్ని, మోషే ప్రశ్నించినపుడు వారికి ఇది ఎతుమతంగా అనిపించటం సహజం కాని ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా ఆ విషయంలో సమాచార హక్కు చట్టం ఉపయోగించుకోవాలని మండలి, ఐక్యవేదికల ద్వారా మోషే చెప్పేవాడు.

4. గీత, బైబిలు, ఖురానులు మన ధర్మ శాస్త్రాలు అనేకంటే, ప్రతి భారతీయ పౌరునికీ భారత రాజ్యంగమే ధర్మశాస్త్రమని మండలి ప్రబోదిస్తుంది. అసలు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియని, అసలు దాని పేరే వినని సగటు సమాజానికి మోషేలాంటి వారు ఎతిమతంగానే కనిపిస్తారు.

రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు (12వ అధికరణ నుండి 35 వ అధికరణ వరకు, ఆదేశసూత్రాలు (36వ అధికరణ నుండి 51వరకు) పౌర బాధ్యతలు 51ఎ లోని 11 అంశాలు మోషే వరుస క్రమంలో వివరించటం రాజ్యాంగం పట్ల అతనికున్న శ్రద్ద అతని జ్ఞాపకశక్తి తోటి సభ్యులను అబ్బురపరిచేవి స్పూర్తినిచ్చేవి.

5. నోటుకు ఓటును అమ్ముకోకూడదని, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకూడదని, అందరూ ఓటు విధిగా వేసి తీరాలని చెప్పే మండలి అసలు ఎన్నికల రోజును ఒక సెలవు దినంగా భావించి టివిలో క్రికెట్‌ మ్యాచో, సినిమాలో, సీరియల్స్‌తోనూ కాలక్షేపం చేసే సమాజం దృష్టిలో ఎతుమతంగానే వుంటుంది.

ఓటును అమ్ముకోకూడదంటూ మోషే సభల్లో పాడిన పాట అందరినీ ఆలోచింపచేసేది.

6. ఆడబిడ్డల్ని, పిండదశలోనే చంపేస్తూ, పుట్టిన వారిని బడికి పంపక కూలికి పంపిస్తూ, ఎదిగిన తరువాత అత్యాచారాలకు గురి చేస్తూ, వ్యభిచార కొంపలకు అమ్మేస్తున్న సమాజానికి, 'ఆడపిల్లనమ్మా, నేను ఆడపిల్లనాని' అని ఆర్ధ్రంగా పాడే మోషేది ఎతుమతమే మరి.

7. స్వార్ధమే పరమార్ధం అనే సమాజం దృష్టిలో, తానూ మరణించినా పది మందికీ ఉపయోగపడాలనే దృష్టితో అవయవ, దేహదానం వీలునామా మోషే రాయటం 'ఎతుమతమే'. మండలి సభ్యులందరూ అవయవ దేహదానం చేస్తామని ప్రతిజ్ఞ చేసారు.

మండలికి రాష్ట్ర అధ్యక్షుడు అవటం మోషే గొప్పదనమని కొంతమంది ప్రసంగించారు.

నిజానికి మండలి సభ్యుల్లో ఆ పదవుల పట్ల ఎవరికీ లాలసలేదు. గుర్తింపూ కోరుకోరు. మోషే కూడ తనను తాను ఎప్పుడూ గొప్పగా భావించలేదు. ఇతర సమాజంలో అలాంటి పదవులు కొంత తృప్తినిస్తాయి కాబట్టి అలా వారు అనుకోవడంలో తప్పు లేదు. ముందే చెప్పినట్లుగా మండలికి కుల మతాల పట్టింపులేదు కనుక, మోషేను దళితునిగా అసలు భావించలేదు సరికదా ఒక మేధావిగా గుర్తించింది.

8. మండలి బోధించే 3 నియమాల్లో ముఖ్యమైనది సమయపాలన. అంటే ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పనికి ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించటం అని అర్ధం. అనుకున్న సమయానికి ఒక గంట అటో ఇటో ఒక రోజు అటో ఇటో ఒక నెల అటో ఇటో పని చేయటం అలవాటైన వారికి, అది ఇండియన్‌ పంక్చువాలిటీ అని సమర్ధించుకునే వారికి ఆహారం తీసుకోవటంలోను, నిద్రకు ఉపక్రమించటంలోనూ, వ్యాయామం చేయటంలోనూ సమావేశానికి హాజరు కావటంలోను అలాగే ప్రతి విషయంలోనూ ఖచ్చితమైన వేళలు పాటించే మోషే ప్రవర్తన ఎతుమతం గానే కనిపిస్తుంది.

ఎప్పటికైనా మోషే ఆస్తికునిగా మారతాడేమో అని ఆశించిన డా|| ఆనంద్‌ మోషేని అర్ధం చేసుకోలేదేమోనంటాను. ఎందుకంటే 'సత్యమే' మా మతం అనే సత్యాన్వేషణ మండలికి మోషేని పరిచయం చేసిన 'ఆనంద్‌' కూడా 'మతమే సత్యం' అనే భావాలలోకి మారటం గురించి మోషే బాధపడేవాడు. కుల మతాల్ని వదులుకోవాలని చెప్పిన మోషేని, కుల నిర్మూలనే లక్ష్యంగా చెప్పుకున్న అంబేద్కర్‌ని కూడా ఒక కులానికి పరిమితం చేసి మాట్లాడ్డం, ఒక రకంగా వారి గొప్పదనాన్ని తగ్గించటమేనని నాలాంటి వారి అభిప్రాయం.

ఈ కుల దురభిమానం ఎంత వరకూ పోయిందంటే మోషే చేసిన అవయవ, దేహదానాలు అగ్రవర్ణాలకే ప్రయోజనం కలిగిస్తాయనేంత వరకూ సాగింది. ఒక రకంగా ఇలా ఆలోచించే వారికే 'శాస్త్రీయ వైఖరి' ని మోషే నేర్పదలచుకుంది. అలాంటి వాఖ్యానాలు అవయవ, దేహదానాల పట్ల అనుమానాలు  రేకెత్తిస్తాయి. మోషేలాంటివారు చేసే ఈ ఉద్యమాల్ని నిర్వీర్యపరుస్తాయి. అవయవ దానాలు ఒక ప్రొసీజర్‌ ప్రకారం నడుస్తాయి. అంతేకాని దాత ఏ కులం వాడు? స్వీకర్త ఏ కులంవాడు? అనే సంకుచిత దృక్పధం ఆ ప్రొసీజర్‌లో లేదు. అంతేకాదు దేహదానం చేయబడిన 'శరీరం' వైద్య విద్యార్ధులకు ప్రాక్టికల్స్‌కు ఉపయోగపెడతారు కాని, ఆ వైద్య విద్యార్ధి ఏ కులంవాడు అనీ, ఈ మృత శరీరం ఏ కులానిదీ అని చూడరు. అలా చూస్తారనుకోవడం కుల దురభిమానమే. మోషే కలలు గన్న శాస్త్రీయ వైఖరికి అది పూర్తి వ్యతిరేకమే.

సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికలో జిల్లా స్ధాయిలో కార్యవర్గ సభ్యుడైనప్పటికీ, రాష్ట్రస్ధాయిలో అతడు నిర్వహించిన అధ్యాపక పాత్ర గొప్పది. అతడు పాల్గొన్నన్ని శిక్షణా శిబిరాలు, తిరిగిన ప్రాంతాలూ, చేసిన ప్రసంగాలూ వేదికలోని ఏ ఇతర కార్యకర్త చేయలేదనటం అతిశయోక్తికాదు. మరణించటానికి కేవలం వారం 10 రోజుల ముందు కూడా ద్వారకుంటలోనూ, అనంతపురంలోనూ శిక్షణ శిబిరాల్లో పాల్గొనటం అతని ఉద్యమ అభిలాషకు తార్కాణం. మోషే హాజరయిన ఏ శిక్షణాశిబిరమయినా, ఏ ఇతర సమావేశమయినా అతడు పాడే గురజాడవారి 'దేశమును ప్రేమించుమన్నా' దేశ భక్తి గీతంతో ప్రారంభమవ్వాల్సిందే. సమావేశాల మధ్యలో బ్రేక్‌ వచ్చినా ఏదో ఒక సామాజిక స్పృహ కలిగించే గీతం పాడేవాడు. మంచిగాయకుడు. అతని దేహదానం జరిగిన రోజే అనంతపురంలోనూ సంతాప సభ జరిగిందంటే మోషే పట్ల వారికి ఉన్న అభిమానాన్ని అర్ధం చేసుకోవచ్చు.

సత్యాన్వేషణ మండలిని అయినా, దానిని అనుసరించే మోషేని అయినా, 'ఎతుమతం' అని ఈనాడు అన్న వారు 'మండలి' భావాల్ని పరిశీలనగా చూసి అర్ధం చేసుకుని, అనుసరించడమే మోషేకి నిజమైన నివాళి.

మోషే మరణం వ్యక్తిగతంగా నాకేకాదు. సహ ఉద్యమ కారులందరికీ లోటే. మోషే కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.

- యర్రంశెట్టి జగన్‌ మోషన్‌రావు

ఆడలేక మద్దెలోడు అనవద్దు


ఓఫీర్‌గార్కి                    - కె. అంజయ్య

అద్దంకి రంజిత్‌ ఓఫీర్‌గారి పలాయన వాదం పై వివేకపథం పాఠకునిగా ఇది రాయాలనిపించింది. ''ఉడుంకెందుకురా ఊళ్ళో పెత్తనం వడిని పట్టి వంటింట్లో ఉడక పెడతారు ఖబడ్డార్‌''  అన్న సామెత ఓఫీర్‌గార్కి బాగా సరిపోద్ది అనిపించింది. సవాల్‌ను స్వీకరించాలన్నా సవాల్‌ విసరాలన్నా ఖలేజాతో పాటు నిజాయితీ ఉండాలి. ఈ రెండు మీకులేవు. వివేకపథం ద్వారా ఓ ఓఫీర్‌గారూ మీరు పలాయనావస్తలో ఉన్నట్టుగా అనిపించింది. పారిపోయే మార్గం కూడా తెలిసినట్టు లేదు ఈయనకు. నేను చాలా బలవంతుడ్ని నాతో కుస్తీకి సై అనేవాడికి నా అంతబలం లేదుగదా? అందుకే తటపటా ఇస్తున్నాను. అన్న బిల్డప్‌ ఇస్తూ సొంత డబ్బా మోగకపోయినా కొడుతున్నారు. ఓఫీర్‌గారూ మీకున్న విశ్వాసాన్ని ఎక్కడో చాటుమాటున మూఢనమ్మకాల ఊబిలో మునిగిన అమాయకుల మధ్య మీ విశ్వాస విద్యను ప్రదర్శిస్తే, అక్కడకు మత బండారాలను బయటపెట్టే పుట్టా సురేంద్రగారి లాంటి సాహిత్య విమర్శకమల్లయోధులు రారు. అక్కడ మీరే యోధులు. మీరే విద్యార్ధులు. మీరే అన్నీ.  మేధావుల మధ్య తలపండిన సాహిత్య విమర్శకులతో తలపడాలనుకుంటే ఇలాగే తలబొప్పి కడుతుంది.

మీరు రాసిన దానికి మీరే కట్టుబడకుండా, గ్రంథ సమీక్షపై స్పష్టత లేకుండా, ప్రశ్నించవచ్చు అంటూనే జవాబుదాటవేస్తూ మళ్ళీ ప్రశ్నించమంటూ పొల్లుమాటలు? చూడు ఛాలెంజ్‌ చెయ్యాలన్నా స్వీకరించాలన్నా దానికి సంబంధించిన చర్చల్లో నిబంధనలు నియమాలు పూర్తిగా తెలిసినట్టులేదు మీకు. ఇప్పటికైనా మునిగి పోయింది లేదు. ఇలాంటి పొల్లు రాతలు రాయటం మాని ఓఫీర్‌గారూ చర్చా నియమాలు ఛాలెంజ్‌ స్వీకరణ ఇలాంటి శిక్షణా శిభిరాలలో శిక్షణ పొందండి. గ్రంధాలపై విశ్లేషణ చేసే వారి పరువు తీయకండి. విశ్లేషకులు తప్పును ఎత్తిచూపాలి. తప్పయితే భేషరతుగా వప్పుకోవాలి. కొర్రీలు పెట్టి జారుకోవాలనుకోవడం సుష్క వాదనలతో వాగాడంబరం చేయటం గమనించేవారు అసహ్యించుకునేలా వ్యవహరించటం సబబు కాదు. సరిచేసుకోండి. సత్తా ఉన్న వారితో కుస్తీకి దిగండి. సెలవ్‌.

మంచి స్వాగతం


ఈ సందర్భముగా ఫజులూరి రహమాన్‌గారినీ ప్రస్తావించటం సమంజసం అనిపించింది. రహమాన్‌గారూ మన మధ్య స్నేహ సంబంధాలు అంతగా చిక్కుముడి పడకున్నా ఎన్నోసార్లు సత్యాన్వేషణ మండలి సమావేశ కాలమందు పలకరించుకున్నాము. అయితే మీ చిత్తశుద్దిని మీ నిజాయితిని శంకించాలని నాకు లేదు కానీ, అన్నమాటకు కట్టుబడి, నేటి సమాజానికి ఏమాత్రం ఉపయోగం గాని, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన మీ మతం నుండి బయటపడి, సత్యాన్వేషణ మండలితో కలిసి మానవత్వ విలువలకు కట్టుబడిన మహోన్నతమైన మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వటం మంచిదని నా భావన. మీ నిర్ణయం నాలుగు రోజులు ఆలస్యమైనా పరవాలేదు. నవ సమాజ నిర్మాణంలో సురేంద్ర గారితో జత కట్టి మెరుగైన సమాజం నిర్మించే దానిలో చేరితే సంతోషిస్తాను.

అమరజీవి పెరికల మోషే


సాకీ.     అమర్‌ రహే పెరికల మోషే     2

1.     కాలమనే కడలిలోన కలిసిన ఓ మిత్రమా

    ఈ కాలంలో నువ్వు లేని లోటున్నది మిత్రమా

    సత్యాన్వేషణ చేస్తూ పాలు నీళ్ళు వేరు చేస్తు

    మంచి సమాజ స్ధాపన లక్ష్యంగా శ్రమించావు    ||అమ||

2.     అభ్యుదయ భావాలతో సమాజంలో అడుగుపెట్టి

    శ్రమతోటే దుర్బిక్షం నాస్తి అన్న యోచనతో

    మనిషే మహనీయుడు ఏ దేవుడిలలో లేడన్నవ్‌

    మార్పుకొరకు శ్రమించిన మానవతామూర్తి మోషే    ||అమ||

3.     నిజాయితి నిబద్దతకు మోషే కెవరు సాటి రారు

    హేతుబద్ద జీవనమే ఎంతో మంచిది అనుకొని

    సత్యాన్వేషణ మండలి సైనికునిగ సాగినావు

    అందినట్టి సత్యాన్ని సమాజాని కందించిన         ||అమ||

4.     పుట్టినట్టి ప్రతివ్యక్తి మరణిస్తా డెప్పుడైన

    మరణించిన ఏ వ్యక్తికి పునర్జన్మ ఉండబోదు

    మూఢ నమ్మకాలు దేశ ప్రగతికడ్డుగోడలంటు

    సమరం సాగించినట్టి అమరజీవి మన మోషే        ||అమ||

- కన్నెబోయిన అంజయ్య, అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం

రామక్రిష్ణాపురం, చింతకాని (మం) ఖమ్మం జిల్లా, సెల్‌ : 9490370563

మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన


మతస్వేచ్చ - భారత రాజ్యాంగము : - ఒక పరిశీలన


(గత సంచిక తరువాయి)

విన్నవాటి విషయంలో లేదా చదివిన వాటి విషయంలో, వాటిని గురించి మరొకరు నీకే విధమైన సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఏరకమైన వత్తిళ్ళు పెట్టకుండా, నీకునీకుగానే, అప్పటికున్న నీ సొంత జ్ఞానం- అవగాహన - ఆధారంగానే వాటిపట్ల అనుకూలతో, ప్రతికూలతో (ఇష్టమో, అయిష్టమో) ఏర్పడితే అదిగో దానిని అనాలి స్వ-ఇచ్చ = సొంత యిష్టము = స్వేచ్చ అని.

అలాకాక ఆ విన్నవాటి విషయంలో అంటే వాటికి చెందిన సమాచారం వరకు తెలిసిన సందర్భంలో మరొకరుగానీ, ఆ సమాచారం అందించిన వ్యక్తేగాని, వాటి గురించి తన ఇష్టాఇష్టాలననుసరించి నిన్ను ప్రభావితం చేయడం ద్వారా అలాగా! అయితే అది నాకిష్టమేననిగాని, అయిష్టమేనని గాని నీవనుకుంటే దానిని స్వయిచ్చ అనరు. ఆదశలో నీవు ఎంతో కొంత మేర స్వేచ్చను కోల్పోయావు. మరొకరి ఇష్టాయిష్టాల ప్రభావానికిలోనై నావు అనాల్సిందే.

తాత్వికంగా దానినే పరాధీనమనస్కత అంటారు. మనం ఎత్తుకున్న విషయపు విచారణంతటికీ ఇదే ఆధారశిల లాంటి అంశమై ఉంది.

స్వేచ్చంటే ఏమిటి? స్వేచ్చ లేకపోవడమంటే ఏమిటి? అన్న విషయం స్పష్టంగా నిర్వచించుకోగలిగితేనే ఈ రాజ్యాంగ శాసనాన్ని దాని సరైన అర్దంలో వినియోగించుకోగలుగుతాం. స్వార్ధపరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోగలుగుతాం.

బాధ్యత గల ప్రతిపౌరునికీ ఇలాటి విషయాలలో అంటే చట్టం విషయంలో రెండు రకాల బాధ్యతలుంటాయి. 1. చట్టాన్ని తాను సరిగావాడుకోవడం, దుర్వినియోగం చేయకుండడం 2. ఇతరులూ చట్టాన్ని వాడుకునేలా, దుర్వినియోగం చేయకుండేలా చేయగలంత చేస్తుండడం. ఇది అర్ధమైతేనే ఒక వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయవచ్చు. వేయాలి అని రాజ్యాంగం ఎందుకు చెపుతోందో అర్ధమవుతుంది. అలాగే న్యాయస్ధానాలు ప్రజల నుండి ఫిిర్యాదులు లేకున్నా కొన్ని విషయాలను సుమోటోగా తమంత తాముగా విచారణకు తీసుకోవచ్చని, తీసుకోవాలని చట్టం ఎందుకు చెపుతోందోనూ అర్ధమవుతుంది. కనుక రాజ్యాంగంలోని స్వేచ్చకు సంబంధించిన అధికరణాలను అర్ధం చేసుకునే సందర్భంలోగాని, వివరించుకునే, వ్యాఖ్యానించుకునే సందర్భంలోగానీ, వినియోగించుకునే సందర్భంలోగాని పై అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. ఇక్కడగాని ఏమాత్రం పొరపాటు పడినా అంటే అవగాహనాలోపం ఏర్పడినా, తప్పవగాహన వున్నా ఇక ఆపై జరిగేదంతా స్వేచ్చనకు స్వేచ్చకాదనుకోవడమో, స్వేచ్చ కాని దానిని స్వేచ్చ అనుకోవడమోనో జరుగుతుంటుంది. వేరే మాటలతో మళ్ళా ఈ విషయాన్నే చెపుతాను చూడండి.

పూర్తి స్వాధీన మనస్సుతో ఏదైనా విషయాన్ని గురించి తెలుసుకుని అది కావాలనో, వద్దనో కోరుకోడాన్నే - అనుకోడాన్నే - స్వేచ్చ అనాలి. ఏ రకమైన పరాధీనత ఏర్పడినా, అంటే దాని విషయమై అనుకూలంగానో, ప్రతికూలంగానో మరో వ్యక్తి మాటలో, మరొకరచనలోని మాటలో ఏ మేరకు నిన్ను ప్రభావితం చేసినా ఆ దశలో నీవు చేసుకునే నిర్ణయం అది కావాలనిగాని, వద్దనిగాని, అన్న రెంటిలో ఏ రూపంలో ఉన్నా దానిని స్వేచ్చ అనరు. అంటే అది నిజంగా నీ సొంత ఇష్టం కాదన్నమాట. మరొకరి ఇష్టం యొక్క ప్రభావం కలిసి ఉన్న నిర్ణయమన్న మాట అది.

ఈ అవగాహనలేకున్నా, దీనికి లోబడే మత స్వేచ్చా హక్కును మరే స్వేచ్చా హక్కునుగానీ వినియోగించుకోవాలన్న దృష్టి, నిబద్దత లేకున్నా రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ దుర్వినియోగం అవుతూనే ఉంటుంది. మరో రూపంలోనూ దీనినే వివరించవచ్చు.

'స్వతంత్రుడే (నిజమైన) స్వేచ్చను అనుభవించగలడు'. అనంటాను. నామాట తప్పొ వప్పో చెప్పండి చూద్దాం.

దీనిని సక్రమంగా విచారించుకోవాలంటే స్వేచ్చ అన్నమాటతో పాటు స్వతంత్ర మన్నమాటనూ నిర్వచించుకోవలసి ఉంటుంది. తాత్విక క్షేత్రంలో స్వేచ్చ - స్వతంత్రత అన్నవి పర్యాయ పదాలు కావు. పైగా వేరు వేరు అర్ధాలు కలిగి ఉన్న చాలా ముఖ్యమైన పదాలు కూడా. స్వేచ్చ అన్నది ప్రధానంగా మానసిక క్షేత్రానికి వర్తించేపదం. కొన్ని కొన్ని చోట్ల బంధం నుండి విముక్తుడైన సందర్భాలలో - జైలులాటి నిర్భందాల నుండి విడుదలైన సందర్భాలలో స్వేచ్చావాయువులు పీల్చుకున్నాడు, స్వేచ్చ లభించింది లాటి మాటలు వాడుకలో ఉన్నా, దాని అసలైన అర్ధం మానసిక క్షేత్రానికి చెందింది మాత్రమే.

మనిషి శారీరకంగా బంధింపబడి ఉన్నా మానసికంగా అంటే భావాలు, ఆలోచనల విషయంలో సొంత ఇష్టాయిష్టాలనే కలిగి ఉండవచ్చు. దానికి అంటే స్వఇచ్చకు - ఎట్టి ఆటంకాలూ ఉండవు. అదే మరి అతడో శారీరకంగా ఎట్టి నిర్భంధాలు లేని స్థితిలోనూ పరాధీన మనస్కుడై ఉండవచ్చు. ఆ దశలో అతనిలో ఏర్పడిన ఇష్టాయిష్టాలు అతని సొంతానివి అనడానికి వీల్లేదు. అప్పడతడు స్వేచ్చను కోల్పోయినట్లే అదే మరి అతడు భౌతికంగా నిర్బంధాలూ ఉండీ ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలో, స్వీయజ్ఞానం పై ఆధారపడి ఏర్పరచుకున్న ఇష్టాఇష్టాలనే కలిగి ఉన్నట్లైతే, ఆ విషయాల వరకు అతడు స్వేచ్చను కలిగి ఉన్నట్లే. మానసిక పరాదీనత లేనట్లే.

ముఖ్య గమనిక :- అవధారణార్ధం ద్విరుక్తి సరైనదేనని విజ్ఞులంటారు. అంటే భావన గట్టిపడడం కోసం గానీ, అవగాహనలో మరింత స్పష్టత రావడం కోసం గానీ ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పుకోడం తప్పుకాదు సరైనదేనని దానర్ధం. మన ప్రస్తుతాంశం అత్యంత కీలకమైనదీ, సూక్ష్మమైనదీ కూడా అవడం చేత ఒకే విషయాన్ని వివిధ రూపాలలో చెప్పుకుంటూ వస్తున్నాం. చదువరులలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పదజాలం సుబోధకంగా (బాగా అర్ధమవుతూ) ఉంటుంది కనుకనే ఈ పని చేస్తున్నాం.

స్వతంత్రము = స్వ + తంత్రము = స్వ = తన (స్వీయ, స్వీకీయ) తంత్రము = వశము = తనవశము అని ఆ పదానికి అర్ధం. కనుక స్వతంత్రుడు అంటే తన వశంలో తానున్నవాడు, పరవశుడు కానివాడు పరుల అధీనంలో లేనివాడు అని దానర్ధం.

ఇది ప్రధానంగా భౌతిక క్షేత్రానికి వర్తించేదిగా ఉన్నా, మానసిక పరాధీనత, మానసిక స్వాధీనత అన్న సందర్భాలకూ వర్తించగలపదమే. ఒక వ్యక్తి భావదాస్యంతో ఉన్నాడనుకుందాం. అంటే మానసికంగా పరాధీనుడన్నమాట. ఆ దశలో నిర్ణయాలు అతడేతీసుకుంటున్నా, అతడా నిర్ణయాలకు రావడానికి అతని స్వీయ జ్ఞానానికి ఆవలి నుండి వస్తున్న ఇతరుల భావాలు పని చేస్తున్నట్లైతే అతడు మానసికంగా అస్వతంత్రుడుగా ఉన్నట్లే అవుతుంది. అంటే మానసిక స్వేచ్చ లేకపోవడాన్ని, మానసిక స్వతంత్ర లేకపోవడంగానూ చెప్పవచ్చు. అయితే శారీరక పరాధీన స్ధితిని, మానసిక స్వేచ్చ లేకపోవడం అనకూడదు. విషయం అర్ధమవుతుందనే అనుకుంటాను

ముగింపు :- ఒక వ్యక్తి శారీరకంగా బంధింపబడి అంటే స్వతంత్రత కోల్పోయిన దశలోనూ మానసికంగా పరాధీనుడు కాకుండా ఉండగలడు. అంటే శరీరం తన అధీనంలో లేకున్నా మనస్సు తన అధీనంలోనే ఉండడమన్నమాట. ఇది ఆచరణ సాద్యమో కాదో ఆలోచించండి.

అదే మరి అతడు భౌతికంగా ఎట్టి నిర్బంధాలూ లేని స్థితిలోనూ, మానసికంగా పరాధీనుడై ఉండవచ్చు. ఆ దశలో భౌతిక నిర్భందం లేకున్నా, మానసికంగా స్వయిచ్చ - స్వేచ్చ  లేని వాడే.

ఒక సందర్భంలో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని బంధించి ఉంచి, మేము చెప్పినట్లు నడచుకుంటానంటే నిన్ను విడిచిపెడతాము, మరి కొంత లాభాన్ని చేకూరుస్తాము. అలా కాక మేము చెప్పినట్లు వినకున్నా, నడచకున్నా నిన్ను విడిచిపెట్టము, మరిన్ని కష్టాల పాలు చేస్తాము. అన్నారనుకోండి. అప్పుడతను మీరేమి చేసినా నా నడవడిని మార్చుకోను, మీ ఇష్టమొచ్చింది మీరు చేసుకోండి అన్నాడనుకోండి. అతడు శారీరకంగా పరాధీనుడేగాని, మానసికంగా పరాధీనుడుకాలేదు. స్వాధీనమనుస్కుడే, స్వతంత్రుడే అనితీరాలి. అంటే స్వేచ్చ = స్వ + ఇచ్చ కలవాడేనని తీరాలి. మరి కొంత చెప్పవలసింది ఉన్నా, ఒకింత వివరంగానే చెప్పుకున్నాం స్వేచ్చ గురించి. ఈ మేరకు అర్ధమైనా మనం భారత రాజ్యంగం కల్పించిన మతస్వేచ్చను సక్రమంగా అర్ధం చేసుకోడానికి సరిపోతుంది. విజ్ఞులైన పాఠక మిత్రులకు స్వేచ్చకు సంబంధించిన నాఈ రచనలో ఏవైన లొసుగులున్నాయనిపించినా, దీనిని మరింత పరిపుష్టం చేయడానికి పనికి వచ్చే భావాలు మీ దగ్గరున్నా నాకు తెలియపరచండి. ఈ విషయాన్నంతటినీ ఒక చిన్న పుస్తక రూపంలోకి తెస్తున్నాము. మలిముద్రణ నాటికైనా మీ భావాలు మాకందితే ప్రజలకు మరింత సమగ్రమైన సమాచారాన్ని అందించే వీలు కలుగుతుంది.

మత స్వేచ్చ - భారత రాజ్యాంగం ప్రకారం


భారత రాజ్యాంగంలో మత స్వేచ్చకు సంబంధించిన అధికరణాలు ముఖ్యంగా నాలుగు. మరికొన్ని అధికరణాలూ వీటి పరంగానూ అర్ధం చేసుకోడానికీ, వాటికి బలాన్నివ్వడానికీ సంబంధ పెట్టుకోడానికి వీలుగా ఉండి ఉండవచ్చు. ముందుగా ఈ నాల్గింటిని గురించి చెప్పుకుందాం.

ఒక్కమాట ! పైన మనం 'స్వేచ్చ' అన్నమాటకు స్వతంత్రం అన్న మాటకు అర్ధాల్లో తేడా ఉందని చెప్పుకుని అదెలానో కూడా వివరించుకున్నాం. మరిప్పుడు ఈ ప్రకరణలోని 'మతస్వేచ్చ - మత స్వాతంత్య్రము అన్న మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి?

స్వేచ్చ = ఫ్రీ విల్‌, స్వాతంత్రము = ఫ్రీడమ్‌ అన్న రెంటి స్వభావంలో కొంత పోలికా, కొంత వ్యత్యాసమూ ఉంది.

మత స్వేచ్చ అన్న పదం వాడితే దానర్ధం ఉన్న విశ్వాసాలలో ఏదో ఒక దానిని లేదా దేనినిగానీ ఇష్టపడడానికీ, ఇష్టపడకపోవడానికీ, ఎటువంటి బాహ్యవత్తిడులూ కారణం కాని రీతిలో తన సొంత అవగాహననుండే ఇష్టం ఏర్పడడం అన్న అర్ధమే చెప్పుకోవాలి. అలా ఇష్టాన్ని ఏర్పరచుకునే హక్కును రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా అందిస్తోంది. అంటే నీవు ఎంచుకో, దానికి అడ్డంకులు ఏర్పడకుండానూ, అమలయ్యేలానూ బాధ్యత మేము తీసుకుంటాం అని ఒప్పందం చెప్పడమన్నమాట. ఈ మాటలను మరో రూపంలో చెప్పుకుంటే నీవెంచుకుంటే అది మత స్వేచ్చ అవుతుంది. అది అమలయ్యేట్లు చూడడమంటే నీకు స్వాతంత్య్రం ఏర్పడడం, (ఏర్పరచడం) అన్నమాట. మత స్వేచ్చను హక్కుగా చేయడమంటే మతం విషయంలో స్వతంత్రుణ్ణి చేయడమన్నమాట.

మరోరకంగా చెప్పుకుంటే వ్యక్తిమతపరంగా దేనిని ఇష్టపడతాడో దానిని అనుసరించుకునేందుకు ప్రతికూలతలు లేకుండా చూడడం, అనుకూలతలు కల్పించడం అని దానర్ధం. హక్కు అమలయ్యేట్లు చూడడమే రాజ్యాంగ శాసనాలన్నింటిలోకి తలమానికమైన శాసనం. ఆర్టికల్‌ 32 హక్కులకు రక్షణ అన్నదే. అందుకే ఆర్టికల్‌ 32 రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అన్నాడు అంబేద్కర్‌ మహాశయుడు.

మరొక్క ముఖ్యమైన విషయాన్ని నిరంతరం గమనికలో ఉంచుకుంటేనే హక్కుల గురించి సరైన అవగాహనకు రాగలుగుతాం. ఒప్పందంలో పొందుపరచిన ఏ హక్కులైనా వాటి వాటికి సంబంధించిన పరిమితులకులోబడే ఉంటాయి. పరిమితుల్లేని స్వేచ్చగానీ, స్వతంత్రం గానీ హక్కుగా సరైన ఏ ఒప్పందంలోనూ ఉండదు. ఉండకూడదు. ఈ విషయం 100% సరైందే కనుకనే మన రాజ్యాంగంలోనూ స్వేచ్చ స్వాతంత్య్రాలకు సంబంధించిన అధికరణాలన్నింటా అక్కడే దాని పరిమితులు విధింపబడి ఉన్నాయి. స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడుకునే ప్రతి సందర్భంలోనూ ఈ పరిమితులకు లోబడి అన్నమాట - పదం - వాడితీరాలి. ఒప్పందంలో సంపూర్ణ స్వేచ్చ, సంపూర్ణ స్వాతంత్య్రం అన్నమాటలుండవు.

ఇప్పుడిక మతస్వేచ్చకు సంబంధించిన అధికరణాలను చూద్దాం


అధికరణం : 25 : freedom of conscience and free proffession, practice and propagation of religion..

1.పడాల రామిరెడ్డి :- ఇది, అంతరాత్మ (freedom of conscience) ననుసరించిన స్వాతంత్య్రము, స్వేచ్చాయుత మతావలంబన, ఆచార ప్రచారములను practice and propagation of religion గురించి వ్యవహరిస్తోంది.

2. తెలుగు అకాడమీ :- అంతరాత్మ స్వాతంత్య్రాన్ని, స్వేచ్చగా మతాన్ని అవలంభించడానికి, ఆచరించడానికీ, ప్రచారం చేసుకోడానికీ ఈ ప్రకరణ అనుమతినిస్తున్నది.

3. సుంకర రమాదేవి :- అంతరాత్మ ప్రబోధానుసారం మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు బలవంతపు మతమార్పిడులపై నిషేధం.

గమనిక : అనువాదాలకెప్పుడూ కొన్ని పరిమితులుంటాయి. అనువాదకుని భాషాభిజ్ఞత, శైలి అన్న రెండూ అనువాదకులు ఒకే విషయాన్ని వేరు వేరు మాటలతో చెప్పడానికి కారణాలవుతుంటాయి. ఈ ఇబ్బంది ఉంది కనుకనే పదానువాదం, భావానువాదం, స్వేచ్చానువాదం అంటూ అనువాదంలో అనేక రకాలు పుట్టుకొచ్చాయి. వాటిలో దేని ప్రయోజనాలు దానికున్నాయి. దేని బలహీనతలు (ఇబ్బందులు) దానికున్నాయి. వాటిని ఇప్పుడు మనమేమీ చేయలేం, ఎప్పటికప్పుడు మరింత జాగ్రత్తగా దాని అసలు భావాన్ని గ్రహించే శ్రద్ద పెట్టడం తప్ప.

సురేంద్ర :- మత విశ్వాసాలను స్వయంగా ఎన్నుకునే (యిష్టపడడం, అయిష్టపడడం కూడా ఎంపికే) ప్రకటించుకునే ఆచరించుకునే, ప్రచారం చేసుకునే స్వయిచ్చకు ఆచరణరూపం అంటే స్వతంత్రమూ ఏర్పడేందుకు వీలుగా దానిని హక్కుగా ప్రకటిస్తోందీ

గమనిక :- పరిమితుల్లేని హక్కులుండవు ఏ ఒప్పందంలోనూ (రాజ్యాంగంలోనూ) అని చెప్పుకున్నాం గుర్తుంది కదూ! ఇదిగో దీనికీ రాజ్యాంగం కొన్ని పరిమితుల్ని విధిస్తొంది గమనించండి.

అధికరణం 25/(1) :- Subject to the public order, morality and health and to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience and the right freely to profess, practice and propagate religion.

సురేంద్ర :- పబ్లిక్‌ ఆర్డర్‌ అన్న మాటకు ప్రజాశాంతి అని కొందరు ప్రజా సంక్షేమం అని సుంకర రమాదేవి అనువాదం చేశారు. పరిమితులను తెలుపుతూ వాడిన పదాలకు నిక్కచ్చి అర్ధాన్ని లేదా ఆ సందర్భానికి బాగా నప్పుతుందనిపించే అర్ధాన్నిచ్చేలా చాలా జాగ్రత్తగా అనువదించాలి. పబ్లిక్‌ ఆర్డర్‌ అంటే సమాజంలోని జనుల నడవడిని రాజ్యాంగంలోని అనేక శాసనాలు క్రమ బద్దంగా ఉండేలా నియంత్రిస్తుంటాయి. ఎట్టి అపసవ్యతలు, అలజడులూ, అక్రమాలు, చోటు చేసుకోకుండా కట్టడి చేస్తుంటాయవి. ఈ మొత్తాన్ని కలిపి ఒప్పందం ద్వారా అమలవుతున్న సామాజిక కట్టడి అంటాము. దీనికి భంగం కలకుండా మాత్రమే పై చెప్పిన స్వేచ్చా స్వాతంత్రాలను వాడుకుంటుండడం అన్న అర్ధాన్నిస్తుంది. subject to the public order అన్న వాక్యం. క్రమం నడుస్తుంటే ప్రజాజీవనం శాంతియుతంగా సాగుతుంటుంది. గనుక ప్రజాశాంతికి భంగం కలగని రీతిలో అని అనువదించారు. ప్రజా సంక్షేమానికి ఆటంకం కలగని రీతిలో అన్నది ఒకింత స్వేచ్చానువాద రీతికి చెందిందైనా రాజ్యాంగ ప్రధానాకాంక్ష ప్రజా సంక్షేమమే. కనుక అన్ని శాసనాల పర్యవసానం ప్రజా సంక్షేమమే కనుక ఆ శాసన హృదయం ప్రజా సంక్షేమం అనడం తప్పుకాదు. కాని పబ్లిక్‌ ఆర్డర్‌ అన్న దానికి సామాజిక జీవన గతిలో క్రమం జరుగుతుండేలా క్రమరాహిత్యం చోటు చేసుకోకుండా ఉండే మేరనే ఈ మత స్వేచ్చ స్వాతంత్రపు హక్కు ఉంటుంది.

25/ 1 :- Morality అన్నది పరిమితులకు సంబంధించిన మరో మాట. నీ విశ్వాసం, ప్రకటన, అభ్యాసం, ప్రచారం అన్న నాల్గింటి విషయంలోనూ ఎలాంటి అనైతికతా చోటు చేసుకోకూడదు. నిజానికీ పదాన్ని చాలా లోతుగా విస్తారంగా వివరించుకోవాలి. ఉదా :- మతాదేశాలలోని నిజంగా నీకు తెలియని అంశాలనూ, రుజువుకు నిలబడవని తెలిసిన అంశాలనూ తెగ తెలిసిన వానిమల్లే సత్యాలని, అనేకసార్లు రుజువైనాయని ప్రకటించడంలో అనైతికత ఉందాలేదా?

ఉదా:- 'విశ్వాసి తాను చేసిన లాటివేకాక, అంతకంటే గొప్ప పనులూ చేయగలుగుతాడు' అన్న ఏసు వాక్యమొకటుంది బైబిలు కొత్త నిబంధనలో, ఈనాడు బైబిలు ప్రచారకుల్లో చాలామంది, ఎక్కువలో ఎక్కువ మంది, తాను ఏసుకు అత్యంత సన్నిహితుణ్ణి అనీ, ఏసే తనను నడిపిస్తున్నాడని బల్లగుద్ది మరీ ప్రకటిస్తుంటారు. ఇది నిజమా? అబద్దమా తెల్సుకోవాలంటే బైబిలు ప్రకారం మనకున్న ఒకే ఒక మార్గం. విశ్వాసి సుళువుగా చేయగలడని ఏసు చెప్పినవి చేసి చూపండని అడగడం, నిలదీయడమే వారిలో ఎవరందుకు సిద్దపడకపోయినా వారిలో అనైతిక చోటు చేసుకుందనే అర్ధం అనుకోవలసివస్తుంది.

గమనిక :- ఉదాహరణ ఏసుని- క్రైస్తవ ప్రచారకుణ్ణి ఎత్తుకున్నా గనక అది వారికి పరిమితమైంది మాత్రమే అనుకునేరు. నా మాటలు అన్ని ఆస్తిక ధోరణులవారికేగాక, ఆస్తికేతర ధోరణుల వారికీ వర్తిస్తుంది. లక్ష్మీయంత్రాలు, ఆరోగ్య యంత్రాలు, గెలుపు యంత్రాలు, విద్యాయంత్రాలువగైరాల గురించి మాట్లాడుతుంటే, దానినే వృత్తిగనూ చేసుకుని బ్రతుకుతుండే వారిలోనూ అనైతికతాంశం లేదనగలమా?

25/1/5 ఆరోగ్యం :- మనం విశ్వసించిన మతాచరణలో ఆరోగ్యాన్ని చెడగొట్టే అంశాలుంటే వాటిని ఈ స్వేచ్చ క్రింద అభాసంచేయరాదు. అలాగే వాటిని ప్రకటించడం, ప్రచారం చేయడమూ చేయరాదు. ఆ అభ్యాసం ఆచారకాండ, వ్యక్తిని మానసికంగా శారీరకంగా అనారోగ్యానికి దారి తీయరాదు. ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి.

ఉదా :- హిందూ సాంప్రదాయాలలోని ఉపవాసాలు, వాతావరణ కాలుష్య కారకాలైన కర్మకాండలు ఆచారం పేరున అనారోగ్యకారకాలైన, మురికి నీళ్ళు స్నానాలు అపరిశుభ్రమైన ఆహార పానీయాల స్వీకరణ, జాతరలు ఇలా ఎన్నో ఈ ఆరోగ్యం అన్న మాట క్రింద మతస్వేచ్చకు పరిమితుల్ని విధిస్తుంది. అన్ని మతాల ఆచార కాండలోనూ, ఎక్కడోచోట, ఎంతో కొంత మేర ఈ అపరిశుభ్రత, కాలుష్యాలూ ఉండడం చూడవచ్చు. ఇది చిన్న విషయం కాదు గనుకనే దీనిని స్వేచ్ఛా శాసనానికి పరిమితులభాగంలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానిదేముందిలే అని కొట్టేయడానికో. పక్కన పెట్టేయడానికో తగిందికాదిది.

గమనిక :- మన రాజ్యాంగ నిర్మాతలకు, పరిష్కర్తలకూ ఈ మూడు చెప్పి ఊరుకుంటే సరిపోదని అనిపించే మత స్వేచ్ఛాహక్కు పరిమితుల భాగం చాలా పెద్దదిగా ఉంది, ఉండాలి అనుకునే ఈ భాగంలో మరో మాటనూ పొందుపరిచారు.

And the other provisions of this part.  ఇందులో of this part   ఈ విభాగానికి చెందిన other provisions ఇతరాంశాల లోను ముడిపడి అన్నది. రాజ్యాంగంలోని ఈ భాగంలోని అంశాలకు అంటే ప్రాధమిక హక్కుల భాగంలోని అధికరణాలకు అనుకూలంగా ఉండే, ప్రతికూలం కాని రీతిలో మాత్రమే పై మత స్వేచ్ఛాస్వాతంత్య్రాలు హక్కుగా సంక్రమిస్తాయి అని చెప్పినట్లైంది. ఆ మూడవ భాగంలోని సాధారణాంశాలను గమనించండి.

రాజ్యాంగం 3వ అధ్యాయం ప్రాధమిక హక్కులకు సంబంధించిందై ఉంది.

ఎ. తెలుగు అకాడమీ :- 12 నుండి 35 వరకున్న అధికరణాలు ప్రాధమిక హక్కులను తెలుపుతాయి.

బి. వాటిని (6) రకాలుగా విభజించి అర్ధం చేసుకోవచ్చు. అవి.

1. సమానత్వహక్కు సంబంధితాలు 14 నుండి 18 వరకు (5)

2. స్వేచ్ఛా హక్కుకు సంబంధించినవి 19 నుండి 22 వరకు (4)

3. పీడన నిరోధక హక్కుకు సంబంధించి 23 - 24 అధికరణాలు (2)

4. మత స్వేచ్చా హక్కుకు సంబంధించినవి 25 నుండి 28 వరకు (4)

5. విద్య మరియు సాంస్కృతిక హక్కు సంబంధంగా 29, 30 అధికరణలు (2)

6. రాజ్యాంగ పరిరక్షణ హక్కు సంబంధించిన 32వ అధికరణం (1) = 18 ప్రాధమిక హక్కులు

గమనిక :- 25/1 అధికరణంలోని బిదీఖి శినీలి ళిశినీలిజీ చీజీళిఖీరిరీరిళిదీరీ ళితీ శినీరిరీ చీబిజీశి అన్న మాట, పై 18 అధికరణాలతో ముడిపడి, వాటికి ఆటంకం కాని రీతిలో మాత్రమే మత స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న అత్యంత కీలకాంశాన్ని తెలియజేస్తున్నది. ఆ మొత్తాన్ని ఒకటికి పది మార్లు చదివాకనే మత స్వేచ్చకున్న అవధుల్ని గమనించాకనే, మత స్వేచ్చ గురించి సరిగా మాట్లాడే అర్హత వస్తుంది ఎవరికైనా.

25/2 :-Nothing in this article shall affect the operation of any existing law or prevent the state from making any law
సురేంద్ర :- మత స్వేచ్చకున్న పరిమితుల్ని, అపరిమితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించి రాజ్యాంగాన్నమలుచేయడానికి తగిన చట్టాలు రూపొందించేందుకు ప్రభుత్వానికున్న అధికారాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటిస్తోందీ 25/2 వ భాగం.

ఉనికిలో ఉన్న ఏ చట్ట వినియోగాన్ని ప్రభావితం చేయడానికి నూతన చట్టాలను చేయడానికి ప్రభుత్వానికున్న అధికారాన్ని అడ్డుకోడానికిగానీ ఈ మత స్వేచ్చా హక్కు క్రింద ఉన్న అంశాలేవీ ఏ రకంగానూ కల్పించుకోలేవు.

25/ 2 (ఎ) :- :- regulating or restricting any economic financial, political or other secular activity which may be associated with religious practice

మతావలంబనకు మతాచారాలతో కలిసి ఉన్న ఆర్ధికాంశాలు, రాజకీయాంశాలు మరియు ఇతర లౌకిక స్వభావం కల పనులను క్రమబద్దీకరించే లేదా పరిమితులను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

25  :- వివరణ (1) శిక్కులు కృపాణం ధరించవచ్చు. (2) సిక్కు, జైన, బౌద్దులూ హిందూ మతంలోని భాగాలే. మతమంటే ఏమిటి? అన్నదానికి సుప్రీంకోర్టు, అది తప్పనిసరిగా ఆస్థిక మతమై ఉండాల్సిన అవసరం లేదనీ అది వ్యక్తుల సమాజాల విశ్వాసానికి సంబంధించినదై ఉంటే చాలునని వివరణ చేసింది. ఆ దృష్టితోనే దేవుణ్ణి అంగీకరించని జైన బౌద్దాలనూ మతాలుగనే పరిగణించింది.

ముగింపు,  సురేంద్ర :- ఈ అధికరణం యొక్క సారాంశం :- ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా. స్వాతంత్రాల హక్కు ప్రజాశాంతికి, నైతిక విలువలకు, ఆరోగ్యానికీ భంగం కలిగించని మేరకే ఉంటుంది. అంతేగాక ఆ స్వాతంత్య్రము, మిగిలిన వ్యక్తులకు రాజ్యాంగం 3వ విభాగం ద్వారా కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం కలిగించనంతవరకే ఉంటుంది. ఆ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగపు మూలభూత లక్షణమైన లౌకికత స్ధాపనకు ప్రతికూలం కానంత వరకే ఉంటుంది. ప్రజా సంక్షేమానికి అవసరమైన ప్రభుత్వ నియంత్రణాధికారానికీ లోబడే ఉంటుంది.

 ముఖ్య గమనిక :- నాస్తికవాదమూ, లౌకికవాదమూ రెండూ ఒకటికాదు. వేరు వేరు. భారతరాజ్యాంగం లౌకికవాదాన్ని తన ఆచరణ క్షేత్రానికి పునాది - ఆధార -భావనగా స్వీకరించింది. అయినా అది నాస్తిక వాదాన్ని స్వీకరించలేదు. పైగా నాస్తిక వాదాన్ని స్వీకరించడం - స్వీకరించకపోవడం మత స్వేచ్చా హక్కు భాగానికి చెందింగా భావించింది.

1) నాస్తిక వాదం, అన్ని రకాల ఆస్తికవాదాలు చెప్పే దేవుడు, జీవులు, జన్మాంతరాలు, పరలోకాలు, స్వర్గనరకాలు, తీర్పుదినాలు వగైరాలన్నీ అబద్దాలనీ, మూఢనమ్మకాలనీ, అట్టివేవీ లేనే లేవనీ పేర్కొంటుంది. దానితోపాటు ఈ లోకమే వాస్తవమనీ అంటుంది.

2) అదే మరి లౌకికవాదం, వ్యక్తి - సమాజము - ప్రకృతిలకు సంబంధించి మానవుల మధ్య జరిగే వ్యవహారమంతా ఈ లోకానికి పరిమితమైంది మాత్రమేననీ ఆస్తికులు చెప్పే దేవుడు వగైరాలున్నాయన్న విషయంగానీ, నాస్తికులనే అట్టి వేవీ లేవు అనే విషయంగాని తన ప్రకారం వ్యవహారాలు నడుపుకోడానికి అవసరం లేదనీ అంటుంది.

కనుక, లౌకిక వాదమంటే నాస్తికమేనని అనుకోవడం అవగాహనాలోపం వల్లనేనని నేనంటున్నాను. అందుకనే ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్రాలున్నూ దేవుడున్నాడా? లేడా అన్న విషయాన్ని ప్రస్తావించవు. విచారణాంశంగానూ స్వీకరించవు. వాటి పనల్లా ప్రకృతిని శోధించడం, ఎరుకలోకి వచ్చిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు అప్పటికి అందినంత, అందిన రూపంలో ప్రజలకు అందించడం, వాడుకోడానికి పనికివచ్చేదైతే వినియోగ రూపానికి తెచ్చుకోవడం, ఇదే దాని క్షేత్రం కనుకనే అదిన్నూ ఆస్తికతను గురించి గానీ, నాస్తికతను గురించిగాని మాట్లాడదు. మన భారత రాజ్యాంగాన్ననుసరించి పాలన - నిర్వహణ వ్యవహారమంతటికీ ఆస్తికత ఎంత దూరమో, నాస్తికతా అంతదూరమైనదే. ఆ రెంటినీ సమాన దూరంలో ఉంచుతూనే లౌకిక వాద స్వభావంతో పనులను నిర్వహిస్తుంటుందది. ప్రజలూ అలానే ప్రవర్తించాల్సి ఉంటుందని శాసిస్తుంది.

ఇదంతా ఇప్పుడెందుకు చెపుతున్నానంటే, నాస్తికత్వమే తమ తాత్విక వైఖరి అనే లేదా అనుకుంటుండే భౌతికవాద దృక్పధం కలిగి ఉన్నవాళ్ళకూ కూడా 25వ అధికరణంలో చెప్పిన మత స్వేచ్చా హక్కుతో పాటు దానికున్న పరిమితులన్నీ వర్తిస్తాయి. అంటే సామాజిక అస్తవ్యస్తత ఏర్పడే లేదా ప్రజాశాంతికి భంగం కలిగే రీతిలో వారైనా వారికి ఉన్న దేవుడు లేడనే స్వేచ్చా హక్కును వాడకూడదు. ఎందుకనంటే ఇతరులకున్న మత స్వేచ్ఛ హక్కును అడ్డుకోడంగానీ, వ్యతిరేకించడంగానీ ఎవరూ చేయకూడదు. దానితోపాటు 25/2 లో చెపుతున్నట్లు, ఆయా మత విశ్వాసులకు ప్రాథమిక హక్కుల రూపంలో సంక్రమించిన వాటిపరిమితులను ఎవరూ అతిక్రమించకూడదు. మత స్వేచ్చను వినియోగించుకునే విషయంలో ఇదెంతో కీలకమైన అంశము. కానీ దీనిని ఎడాపెడా అనేవాళ్ళూ పట్టించుకోడంలేదు. అనిపించుకునే వాళ్ళూ పట్టించుకోడంలేదు. కనుకనూ,వాళ్ళెవరు పట్టించుకుందామనుకున్నా ప్రభుత్వం అసలే పట్టించుకోదు కనుకను ఆ అధికరణాలకు విరుద్దంగా ఎన్నో జరిగిపోతున్నా సమాజంలో ఎలాంటి అలజడులూ, ఆందోళనలు పుట్టుకరావడంలేదు.  అధికరణం 26 :-freedom to manage religious  affairs. subject to public order, morality and healths, ....

 తెలుగు :- మత సంబంధమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వాతంత్య్రముంది.

1. మత సంబంధమైన సంస్థలన్నింటికీ, సంస్థలను మత పరమైన, ధార్మికపరమైన కార్యక్రమాలను స్ధాపించి, నిర్వహించుకునే - వాటికి సంబంధించిన సొంత వ్యవహారాలను నిర్వహించుకునే, స్ధిరచరాస్థులను సమకూర్చుకునే చట్టానికి న్యాయ పద్దతులకు లోబడి వాటిని పర్యవేక్షించుకునే స్వాతంత్య్రం ఉంది.

అధికరణం 27 :- ఆదాయ వ్యయాలు, పన్నులకు సంబంధించిన వివరాలున్నాయి.

అధికరణం 28 :- దిగువ సూచించిన పరిమితులకు లోబడి మత సంస్థలు ఏర్పరచుకునే విద్యాలయాలలో వారి వారి మత నియమావళిని, ఆరాధనలను గురించి బోధించవచ్చు.

ఈ నాలుగు అధికరణాల క్రింద 'రాజ్యాంగం' కల్పించిన మత స్వేచ్చా హక్కు, ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యానికీ, మిగిలిన ప్రాథమిక హక్కుల అమలుకూ ఆటంకం కాని రీతిలో మాత్రమే ఉండాలన్నది ఈ మొత్తానికీ పరిమితుల్ని విధిస్తూ కట్టడి చేస్తుంటుంది.

అత్యంత సారరూపం


భారతదేశంలో ....

1) ఖురాను ఒక ముస్లింను అనుసరించమన్న విధులుగాని, నిషిద్దాలుగానీ, అది చెపుతున్న నేరాలు, శిక్షలు గానీ యధాతధంగా అమలుపరచే, ఆచరించే స్వేచ్చ ఉందా? లేదా? ఖురానుకు సంబంధించిన రాజ్యాంగం అంగీకరించే విశ్వాస స్వేచ్చ, ఆరాధనా స్వేచ్చ, ప్రచార స్వేచ్చ అన్నదాని అర్ధం, ఖురానును అన్ని విషయాలలో 100% అనుసరించే స్వేచ్చ అని అర్ధమా?

రాజ్యాంగపు సమాధానం :- కానే కాదు 1) ఇతర మత విశ్వాసుల స్వేచ్చకు అడ్డురాని, భారతరాజ్యాంగపు లెక్కన మాత్రమే నేరాలు, శిక్షలను మాత్రమే అమలుపరచుకునేందుకు లోబడి ఉన్నంత మేరనే వారికి మత స్వేచ్చ ఉంటుంది.

ఖురాన్‌ అంగీకరించిన విగ్రహాల విధ్వంసం చేసే స్వేచ్చ ఉందా ఈ మత స్వేచ్చలో? సమాధానం :- లేదు గాక లేదు. ఎందుకంటే అది మరో పౌరుని మత స్వేచ్చను కాదంటూంది కనక.

భారత రాజ్యాంగం ప్రకారం బైబిలులోని మోషే, ధర్మశాస్త్రాన్ని యధాతధంగా అమలు పరచుకునే స్వేచ్చ ఉందా? యూదులకుగానీ, క్రైస్తవులకు గానీ?

 సమాధానం :- లేదుగాకలేదు. వారంతా ఈ లోకసంబంధమైన వ్యవహారాలు, నేరాలు, శిక్షలు భారత రాజ్యాంగ నిర్ధేశాల మేరకే అనుసరించడానికి లోబడి దానికి అడ్డురాని భాగం వరకే మత స్వేచ్చను కలిగి ఉంటారు.

భారత రాజ్యాంగం ప్రకారం ..

3) ఈ దేశ మతాలు లోగడ అనుసరించిన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసుకునే స్వేచ్చ కలిగి ఉంటారా?

సమాధానం  :- అట్టి స్వేచ్చ కలిగి ఉండరు గాక, కలిగి ఉండరు. వారెవరైనా, ఏ సాంప్రదాయానికి చెందిన వారైనా భారత రాజ్యాంగానికి ప్రతికూలం కాని అంశాల వరకే వారి మత గ్రంధాలను విశ్వసించే, ఆరాధించే పాటించే స్వేచ్చను కలిగి ఉంటారు.

ముగింపు


 మత విశ్వాస స్వేచ్చా హక్కు కలిగించడమంటే, తనకు నచ్చిన ఆరాధ్యాన్ని, ఆరాధనారీతిని విశ్వసించే, అనుసరించే స్వేచ్చ అని మాత్రమే అర్ధం. వారి వారి మత గ్రంధాలను తు.చ . తప్పకుండా అనుసరించే స్వేచ్చ అని అర్ధం కానే కాదు. నాస్తికులతో సహా ఎవరుగానీ, ఏ మత విశ్వాసాలను గాని నిందించే, కించపరచే, తప్పుని చెప్పేస్వేచ్చ ఉండనే ఉండదీ మత స్వేచ్చలో. అలాగే మత విశ్వాసాలను గానీ, ఆరాధనా రీతులనుగానీ, రాజ్యాంగంలోని మరే అధికరణాన్ననుసరించైనా నిందించే ఖండించే స్వేచ్చ ఉండదు. ఎందుకనంటే మత స్వేచ్చను గూర్చిన భాగమంతా దిగువ నిబంధనకు లోబడింది మాత్రమే.

Subject to public order morality and health and to the other provisions of this part all persons are equally entitled to the freedom of conscience.

ప్రశ్న :- మరైతే ముస్లిం వివాహ విధి, బహుభార్యాత్వం, విడాకుల విధానం పై సూత్రాన్ని అతి క్రమిస్తున్నేౖ కదా! అది వారి మతాచారం అనడం న్యాయంకాదు. సమన్యాయాన్ని తృణీకరించడం కూడా కదా?

 నా సమాధానం :- నూటికినూరు శాతం బహుభార్యాత్వంగాని, విడాకుల విధానంగాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనదే, వివాహమన్నది 1) ఈ లోక సంబంధమైనది

2) స్త్రీ పురుషులుగా ఉన్న మనుషులకు సంబంధించినది

3) శారీరక - మానసిక అవసరాలు కొరకు ఏర్పరచింది.

4) సామాజికావసరాలతోనూ ముడిపడి ఉన్నది.

కనుక మత గ్రంథం చెపుతోంది కనుక అన్న నెపాన, స్త్రీ పురుషుల మధ్య అసమానతను, సామాజిక అన్యాయానికీ దారితీసే అలాంటివాటిని 1) నిషేదించాలి 2) ఉక్కుపాదంతో అణచి వేయాలి. భారత రాజ్యాంగపు పరమాశయం వివక్షారాహిత్యం, సమానత్వం స్ధాపనే.

1) మతాచారం అంటూ బాల్యవివాహాలు చేసుకోవచ్చా?

2) మతాచారాం అంటూ సతీసహగమనం చేయవచ్చా?

3) మతాచారం అంటూ వ్యభిచార నేరానికి రాళ్ళతో కొట్టిచంపవచ్చా?

 చివరి మాట :- సమానత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి అనివార్యం, తప్పనిసరి.

నలుగురిని చేసుకుంటాను, నచ్చకుంటే తల్లాకంటాను అనే వ్యక్తుల మానసిక స్ధితిని చక్కజేయనైనా చేయాలి. పక్కలిరగదన్ననైనా తన్నాలి. అంతేగాని దీనిని వాద వివాదాలలోకి లాగనే కూడదు. మానవులంతా సమానులే. అన్న దిశగా ఒక్క మెట్టు ఎక్కుతూ అడ్డు వచ్చిన వాటినన్నింటినీ ప్రక్కకునెట్టేస్తూ సాగడమే అసలైన వివేకపథం.
Common civil code  ఉమ్మడి పౌరస్మృతి కై పెద్ద ఎత్తున ఉద్యమించాలి. దానిని కాదనే వారిని ఎందుకు కాదంటున్నారని నిలదీయాలి. ఈ విషయమై అన్యాయానికి గురవుతున్న తీవ్ర మనోవేదననుభవిస్తున్న, మనస్సంగీకరించకున్నా సర్దుకుపోతున్న మహిళల ఆలోచనలో మార్పు రావాలి. సమానత్వ సాధనకై ఉద్యమించాలి. అవసరమైతే తిరగబడాలి. బుద్దున్న మగవారంతా ఆ ఉద్యమానికి అండగా నిలవాలి.

7వ శతాబ్ది నాటి సామాజిక పరిస్థితులు - అవసరాలు - ఆచారాల గొడవ మనకు అనవసరం. ఈనాడు మన వివేకానికి అందినంతలో, ఈనాటి, రేపటి తరాల మానవులందరికీ న్యాయాన్నందించగలవీ, సామాజికావసరాలకు ఉపయుక్తంగా ఉండగలిగేవీ అయిన నియమ, నిబంధనలను, ఉన్నవాటి నుండి పనికి వచ్చేవి తీసుకుని లేనివాటిని జత చేసుకునే విధానాన్ని అమలుపరచుకుంటూ సాగడమే బుద్ధిమంతులనుసరించదగిన విధానం.

దేవుని పేరున గానీ, మరేపేరున గానీ, మార్చుకోనక్కరలేని, మార్చకూడని వంటూ సంపూర్ణాలంటూ మన నెత్తిన పెట్టే వేటినీ యదాతధంగా స్వీకరించడం, స్వీకరించాలనడం బుద్దిమంతులు చేయగలిగిన, చేయవలసిన పని మాత్రం కాదు.

 గమనిక :- వ్యక్తిగతాంశాలను ప్రస్తావించకుండా, విషయ నిష్ఠతో ఈ వ్యాసం పై సూటిగా, నిర్మొగమాటంగా స్పందించండి. మేలు కలిగించే వాటిని జతచేసుకోడానికి మండలి సర్వదా, సర్వదా సిద్దంగా ఉంది, ఉంటుంది.

పాత కొత్తల మేలుకలయికే ఎప్పటికప్పుడు అప్పటికి మెరుగైన విధానం అవుతుందన్నది, ధర్మాధర్మాల విషయంలో మండలి మూలభావనల్లో ఒకటి.

సత్యాన్వేషణలో - మీ సురేంద్ర

ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు


ఓంకారమే క్రీస్తు అయ్యెను - వివేకానందుడు


-హైం.క్రై.పు.168


''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యెను'' అని వివేకానందుడు అన్నట్లు మన అడ్డగోలు అపొస్తలుడు రంజిత్‌ ఓఫీరుగారు తమ చాలెంజి పుస్తకం హైం.క్రైస్తవంలో ప్రకటించారు. కానీ ఆ వచనాలను ఎక్కడనుండి పట్టుకొచ్చిందీ అక్కడ పేర్కొనలేదు. రిఫరెన్సులు (ఆధారాలు) చూపించాలన్న తెలివిలేదనుకుందామా అంటే అలా అనుకోడానికి వీలులేదు. తానన్న ప్రతిమాటకూ ఆధారాలు చూపి రుజువు చేశానని ప్రకటించారు. గ్రంథం చివరలో మీరే వెతుక్కుచావండంటూ, 115 రిపరెన్సులు ఎక్కడున్నాయో ఆ సమాచారం ఇచ్చారు. నిజానికి ఇలాటి చాలెంజ్‌ గ్రంథాలలో వాటన్నంటినీ ఆ సందర్భం దగ్గరే చూపించి ఉండాలి. అది నియమం కాకున్నా నైతిక బాధ్యత. చదువరికి సులభంగా ఆధారాలను సరిపోల్చుకునే అవకాశం ఉండేది. అలాకాకపోవడం వల్ల, ఇప్పుడు హైందవ క్రైస్తవం పుస్తకాన్ని విమర్శనాత్మకంగా చూడాలనుకుంటే, అదెంత కష్ట సాధ్యమో గమనించారా? 1. దాశరథి నాలుగువేదాల అనువాదం కొనుక్కోవాలి (లేదా సంపాదించాలి), నాలుగు వేదాల మూలం సంపాదించాలి. దానికి రెండు మూడు భాష్యాలన్నా దగ్గర పెట్టుకోవాలి. అవన్నీ వెదకాలి. సరిచూడాలి.

ఈయన గారి పుస్తకంలో చెప్పింది సత్తో, చెత్తో తేల్చడానికై, ఇంత వ్యయ, ప్రయాసలకు ఎందరు పూనుకుంటారు? పూనుకోగలరు? అస్సలు ధీమా! మన రంజిత్‌ ఓఫీరుగారి అస్సలు ధీమా అదే. హిందువులు - అందులోనూ హిందూ మత గ్రంధాల పండితులూ ఇంకా సరిగా చెప్పాలంటే వేదాలను అర్ధ సహితంగా చదువుకున్న పండితులు ఇంత శ్రమకు పూనుకోరని ఓఫీర్‌గారికి గట్టి నమ్మకం. అలాటిది, పైన తానన్న మాటలు ఎక్కడినుండి పట్టుకొచ్చిందీ చెప్పకుంటే ఇక దానిని పట్టించుకుని నిలదీసే పరిస్థితేరాదు. ఇక తాను మాత్రం అమాయకపు మంద దగ్గరకు వెళ్ళి ఇలాటివి చూపి, తోలు కెళ్ళగలిగినంత మందిని తోలుకెళ్ళవచ్చు.

పుస్తకారణ్యంలో పడి దాని ఆచూకీ కనుగొనడానికి మాకు చాలా సమయం, శ్రమాఖర్చైంది. కడకు రామకృష్ణ మిషన్‌ను సంప్రదిస్తే, ఉత్తేజిత ప్రసంగాలన్న పుస్తకంలో ఆ వివరాలున్నాయన్నారు. ఆ పుస్తకం తెచ్చుకున్నాం. తరవాత, కొందరు మిత్రులు ఈ విషయమై ఓఫిర్‌ మినిస్ట్రీస్‌ను ఒత్తిడి చేయగా, ప్రబోధరత్నాకరంలో ఆమాట ఉంది చూసుకొండి అన్నారు. ఉత్తేజిత ప్రసంగాలలోని ఒకరోజు ప్రసంగమే ప్రబోధరత్నాకరంలోనూ ఉంది. క్లుప్తంగా ఆ వివరాలివిగో.

''1995 జూన్‌లో వివేకానంద, సహస్రద్వీపవనం (థౌజండ్‌ ఐలండ్‌పార్కు) లో తన శిష్య బృందానికి జూన్‌ 19 నుండి ఏడు వారాలపాటు ప్రతిరోజూ పాఠాలు చెప్పారు. 19వ నాడు మేమంతా హాజరుకాలేదు. అయినా సమయం మించిపోతుండడంతో, అప్పటికి ఉన్న మా ముగ్గురు, నలుగురికే పాఠం బోధించడం మొదలెట్టారు. ఉన్న నలుగురం క్రైస్తవులమవడంతో బైబిలు తెచ్చి దానిలోని యోహాను సువార్తను తెరిచి దానిలోని మొదటి వాక్యాలను చదివి వివరించడం మొదలెట్టారు''. ఇదండీ సందర్భం.

ఆదిలో 'శబ్దం', అది దేవుడి వద్ద ఉండినది, శబ్దమే దేవుడు ఇది (శబ్దం) బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమనీ, మాయ అనీ చెపుతారు. విశ్వం ద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటున్నాం. సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, ప్రత్యేకంగా కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ, ఇలా 'శబ్దం' రెండు రీతుల వ్యక్తమవుతోంది.

యోచనాశీలులారా! ఇది చదివిన తలకాయ ఉన్నవాడెవడైనా ఓంకారమే క్రీస్తు ఆయను అని వివేకానంద అన్నాడని అనగలడా?! మన ఆధునిక అపొస్తలుడు, ఏసునోరు అయిన ఓఫీర్‌ అనగలిగారు.

వివేకానంద తాత్వికంగా అద్వైత ధోరణికి చెందినవాడు. అంతా బ్రహ్మమే ధోరణి అది. అందుకనే ఆ శబ్దం యొక్క సామాన్య రూపం ప్రకృతేనన్నాడు. విశేషరూపం అయితే, కృష్ణుడు, బుద్దుడు, క్రీస్తు, రామకృష్ణుడు లాంటి అవతారమూర్తుల రూపంలోనూ, ఇలా రెండు రూపాల్లో వ్యక్తమవుతుందన్నాడాయన . దానిని వివరించుకుంటే విశేషరూపాలలోని వ్యక్తులు ఆగణితంగా (అసంఖ్యాకంగా) ఉండవచ్చు, అన్నదే ఆయన ఉద్దేశం. కనుకనే కృష్ణుణ్ణీ, బుద్దుణ్ణీ, తన గురువు రామకృష్ణుణ్ణి కూడా ఆ శబ్దం యొక్క విశేష రూపాలేనంటూ, మొదలైన అన్నపదం వాడాడు, అదీగాక శబ్దమంటే బ్రహ్మశక్తి అనీ, అదే బ్రహ్మస్వరూపమని, మాయ అనీ హిందువులంటారనీ అన్నాడు. ఈ సందర్భాన్నీ వివేకానంద దృష్టికోణాన్ని, ఆ సందర్భంలో అతడన్న మొత్తం మాటలను కప్పిపెట్టి ఓంకారమే క్రీస్తు అయ్యాడని వివేకానందుడన్నాడనడాన్ని అమాయకత్వం అనగలమా? మాయకత్వం - వంచన లేదా కుటిల పన్నాగం అని అనకుండా ఉండగలమా?

ఆ రోజు ప్రసంగంలో వివేకానంద ఇంకా ఏమన్నాడో చూడండి.

''టేకెత్‌ అవే ది సిన్‌ ఆఫ్‌ ది వరల్డు''లో కులపాపాన్ని హరిస్తున్నాడు, అనే పాదానికి, పరిపూర్ణులమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు. అని అర్ధం అన్నాడు. వివేకానందుని ఈ మాటను ఓఫీర్‌ అంగీకరిస్తారా? మానవుడికి అతడి తత్వాన్ని ప్రకటించే నిమిత్తం, మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు. మనం బ్రహ్మాన్ని ఆవరించి ఉన్న మానవాచ్చాదనలం. కాని పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఏకమే ..... ఈ అవతార మూర్తులు సదాతమ దైవత్వాన్ని గురించిన ఎరుక కలిగే ఉంటారు. పుట్టుక నుండి వారికది తెలిసే ఉంటుంది. తమనటన సమాప్తమైనా, తిరిగి ఇతరులను సంతుష్టపరచడానికై నాటకరంగానికి వచ్చే నటులవంటివారు అవతారమూర్తులు. ఈ మహనీయులు ఐహిక స్పర్శేలేనివారు. మనకు బోధించడానికి తాత్కాలికంగా వారు ఉపాధులను ధరిస్తారు. వాస్తవానికి వారు ఉపాథిరహితులు, అపరిశ్చిన్నులు, నిత్యముక్తులు.

పాఠక మిత్రులారా! పరిశీలకులారా! ఇదీ ఓఫీరుగారు ఎత్తుకొచ్చానంటున్న ప్రబోధరత్నాకరంలో ఉన్న వివేకానందుని ప్రసంగానువాదంలోని సమాచారం.

అయ్యా దేశ చాలెంజర్‌ ఓఫీరు గారూ!

1. ఇందులో ''పరబ్రహ్మతత్వాన్ని మనకు ఎరిగించుటకు ఓంకారమే క్రీస్తు అయ్యను'' అన్న వాక్యం ఎక్కడుందండీ?! డొంక తిరుగుడు మాటలు మాట్లాడకుండా, ఆ మాటలు ఎక్కడున్నాయో చూపించండి. అసలానాటి ప్రసంగంలో ''ఓంకారపు ప్రస్తావనే లేదుకదా! ఇంత అడ్డగోలుగా మాట్లాడుతూ'', నాతో వాదించాలంటే ఇంగితముండాలి, చాలా జ్ఞానముండాలి, తర్కం తెలిసి ఉండాలి అని అనడం ఆ మూడూ ఉన్నవాళ్ళు చేయగలిగిన పని కాదు. సరైన రీతిలో వాదన చేయాలంటే ఆ మూడూ ఉండాలన్నంత వరకు నాకూ అంగీకారమే. ఇంగితమంటే సాధారణ విచక్షణాజ్ఞానమనీ, జ్ఞానమంటే, విచారణీయాంశాలలో సరిపడినంత తెలిసుండడమనీ, తర్కం తెలిసుండడమంటే, తార్కిక నియమాలు, వాద రీతులు, తెలిసుండడమనీ, అనుకునే ఈ మూడూ ఉండాలన్నది నాకు అంగీకారమేనంటున్నాను. హైందవ క్రైస్తవం ఆధారంగానే పై మూడూ మీకు లేవనిగానీ, తెలిసుండీ ఆచరించడం లేదని గానీ రుజువు చేస్తాను. అయితే ఈ విచారణంతా వీటి విషయం తెలిసున్నవారూ, ఏపక్షానికీ చెందని - నిస్పాకిక్షులూ అయిన పరిశీలకుల - నిర్ణేతల - సమక్షంలో జరగాలి. వాదనియమాలలో, వాద ప్రతివాదులే నిర్ణేతలుగ ఉండరాదు. నిస్పాకిక్షులు, విచారణీయాంశంలో విజ్ఞులూ అయిన మూడో పక్షమే నిర్ణేతలుగ ఉండాలి. అదీ చాలా కీలకమైన నియమం.

గమనిక :- శ్రోతల (ప్రేక్షకుల) స్ధానంలో ఉన్న ప్రజలే నిర్ణేతలు అనేతప్పుడు పోకడ ఒకటి ఈమధ్య కాలంలో చర్చావేదికల పేరన జరుగుతున్న వాటిలో వినపడుతోంది. ఇలాటి ఏర్పాట్లు చేసుకున్న వారికి తార్కికనియమాలుగానీ, వాద నియమాలుగానీ, నిర్దారణ నియమాలుగాని తెలియనే తెలియవన్నది నా అభిప్రాయం. అది ముమ్మాటికీ నిజం కూడా.

ఓఫీరుగారికి, పి.రాధాకృష్ణరావు (మండపేట) వారికీ మధ్య ఈ విషయంపైనే వాట్సాప్‌లో కొంత సంభాషణ జరిగింది. (31 మే 2016న జరిగినట్లుంది నా వాట్సాప్‌లో) అలాగే మే 30-2016 సత్య సంస్థాపన అన్న పేరున ఓఫీర్‌గారి వీడియో ప్రసంగం కూడా నాకు అందింది. క్రైస్తవనాడు, పుట్టా, మరియు షఫీగారు రంజిత్‌ ఓఫీర్‌ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఖండన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. యూట్యూబ్‌. కామ్‌. పేరున ఉందది వాటిలో ప్రస్తుతానికి సంబంధించిన భాగం వరకు ప్రస్తావిస్తాను. ఓఫీర్‌గారు : 1. రాధాకృష్ణగారూ! ప్రబోధ రత్నాకరంలోని టాపిక్‌ ఇప్పుడు క్రొత్తగా ఎత్తిందికాదు. వివేకానందుని ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి...... కనుక నాహైందవ క్రైస్తవంలో ఆ మహాపురుషుల మాటలను మొదటి పేజీలోనే ప్రముఖంగా ఎత్తిచూపాను.

2. రాధాకృష్ణగారూ! మరొక ముఖ్య విషయం ప్రమాదకరమైన మీ పోకడలు మానుకొండి అని పుట్టావారన్నారు. రెండు మత గ్రంధాలసారం ఒక్కటే అని చెప్పడం వలన ఎవరికి ప్రమాదం వస్తుందో, ఏ రకమైన ప్రమాదమో, హైం.క్రైస్తవం పుస్తకాన్ని ఎక్కడ ఖండిస్తున్నారో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీపైన ఉంది.

3. రాధాకృష్ణగారూ! వివేకానందుడు చెప్పినంత మాత్రాన అది సత్యంకాదు అన్నారు మీరు! మరి ఎవరు చెప్పింది సత్యమవుతుంది? సత్యాన్వేషణ మండలివారు చెప్పినంత మాత్రాన సత్యమవుతుందా?

రాధాకృష్ణగారు :- మీరు పంపిన ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో ఓంకారమే క్రీస్తు అయ్యెను అని వివేకానందుడు అన్నట్లు ఎక్కడ ఉందండీ!? ఇవిగో ఆ సందర్భంలోని మాటలు.

''మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం, బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు.... పరమపురుష రూపంలో క్రీస్తూమనమూ ఒక్కటే''.

సురేంద్ర :- అయ్యా అద్దంకి రంజిత్‌ ఓఫీరుగారూ! వివేకానందుడు చెప్పింది సత్యమే అవుతుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కనీసం ఆమాటవరకైనా కడదాకా నిలబడగలరేమో చూడండి. నిజానికి అక్కడ అప్పుడు వివేకానందుడు బైబిలులోని ఏసును గురించి చెప్పాలనుకోలేదు. తన సిద్దాంతమైన అద్వైతాన్ని, బ్రహ్మాన్ని గురించి క్రైస్తవులకు చెప్పాలనుకున్న సందర్భం అది. విచారణకు ఇంగితం పని చేస్తుండాలన్న మీకు ఇక్కడ, అదెందుకు పనిచేయలేదు. ''ఆ ప్రసంగంలో ఓంకార ప్రస్తావన లేదు. శబ్దం బ్రహ్మశక్తి కాబట్టి హైందవులు దీనిని బ్రహ్మ స్వరూపమని, మాయ అని చెపుతారు. విశ్వంద్వారా ప్రతిబింబించే బ్రహ్మాన్నే ప్రకృతి అంటారు. ఆ శబ్దం (బ్రహ్మశక్తి సామాన్యంగా ప్రకృతి రూపంలోనూ, విశేషంగా కృష్ణుడు, బుద్దుడు, జీసెస్‌ క్రీస్తు, రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల రూపంలోనూ ఇలా రెండు రీతుల వ్యక్తమవుతోంది.'' ఇవండీ ఆ ప్రసంగంలోని వివేకానందుని మాటలు. నా లెక్క ప్రకారం అవి తప్పా ఒప్పా అన్నది పరీక్షించాల్సీఉంది. అయినా అదలా ఉంచుదాం. మీ వరకు మీరు తెగరెచ్చిపోయారు కదా! వివేకానందునివి సత్యంకాకుంటే, పుట్టా వారివి సత్యమవుతాయా? అంటూ వ్యంగ్యాన్ని జోడించారుకదా! వివేకానందుని పై మాటలు సత్యాలని అంగీకరించి మీ క్రీస్తు దేవుడు కాదనిగానీ, హిందువుల బ్రహ్మం యొక్క అవతారాలలో ఒకటి మాత్రమే, ఎలా కృష్ణుడు, బుద్దుడు, రామకృష్ణుడుల్లాగా ననీ అంగీకరించండి. వివేకానందుని ప్రకారం బుద్దుడు, రామకృష్ణుడు కూడా ఏసులాటి అవతారులేననీ అంగీకరించండి. ఆ వివేకానందుడే మీ ఏసు గురించి మరికొన్ని విషయాలూ చెప్పాడు. గుండె చిక్కబట్టుకుని వినండి (చదవండి) మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా అవును అవన్నీ సత్యాలే వివేకానందుడు చెప్పాడు గనక అని ప్రకటించండి.

''రెండు గ్రంథాలలో ఒకే దేవుని గురించి చెప్పబడింది.'' అంటే ఏమి ప్రమాదమొచ్చిపడిందండీ! అంటూ నంగనాచిలా మాట్లాడారు. అబద్దాలు చెప్పగూడదన్నంత వరకైనా ఇంగితం పని చేయడంలేదా? పైగా బైబిలువైపుకు అమాయకపు జనాన్ని ఆకర్షించడానికి, ఇలాటి అబద్దాలు, స్వకపోలకల్పిత మాటలూ చెప్పడం మీ దృష్టిలో తప్పుకాదన్నమాట. 10 వేల మందికి బాప్తిజమ్‌ ఇచ్చానని ఒక ప్రసంగంలో చెప్పుకున్నారు. 4 లక్షల మంది నీ మాటలు వినేవారున్నారనీ చెప్పుకున్నారు. అంత పెద్ద సంఖ్యలో జనాన్ని అబద్దాల ప్రభావానికి లోను చేయడం ప్రమాదంకాదన్నమాట! అది వంచనాకాదన్నమాట.

ఒక్కమాట సూటిగా అడుగుతాను సూటిగానే సమాధానం చెప్పండి. డొంక తిరుగుడొద్దు.

1. వేదాలు సృష్టిలో మొదటి గ్రంథాలు అని మీరూ అన్నారు.

2. వేదాలు, బైబిలులోని వివరాలు నూటికి నూరుశాతం సరిపోతున్నాయన్నారు.

3. వేదాలలోని దేవుడు బైబిలులోని దేవుడు ఒక్కడేనన్నారు.

4. హిందూమతం - క్రైస్తవం నిజానికి రెండు కాదు ఒక్కటేనన్నారు.

నిజాయితీ అట! అంటూనన్ను ఎకసెక్కమాడారు. మీతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, ఇంగితం పని చేస్తుండాలి, తర్కం వచ్చుండాలి అని తెగ బిగువుగా మాట్లాడారు.

షఫీలాటి ముస్లింలను ఉద్దేశించి, ఖురాను బైబిలును అంగీకరిస్తున్నట్లైతే, ముందొచ్చిన బైబిలులోని దేవుని పేరుతోనే దేవుణ్ణి పిలవండి. ఎందుకనంటే మీ అల్లానే, అబ్రహాము,ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణినేనేనంటున్నాడు కనక, ఆ దేవుడు తన పేరు ఎహోవాననే ప్రకటించుకున్నాడు గనుక అని నిగ్గదీశారు కదా!

మరి అదే నియమాన్ని మీ బైబిలుకూ, వేదానికీ అన్వయించవద్దా!

కాబట్టి, బైబిలును అవతల పారేసి వేదాన్ని పట్టుకోండి. వేదంలో చెప్పబడిన ప్రార్ధనలు, కర్మలే చేయండి. వేదంలోని పేర్లతోనే ఆ మీ దేవదేవుణ్ణి పిలవండి! నిజాయితీ గురించి ఎందుకు మాట్లాడానో, మాట్లాడుతున్నానో, మాట్లాడుతునే ఉంటానో ఇంగితానికి అందడం లేదా? మీది నయవంచన కపటస్వభావం లేదా విషయం తెలియకుండానే తెలుసుననుకునే భ్రాంతస్థితి.

మళ్ళా మనం వివేకానందుని దగ్గరకువద్దాం. మీరు గుండె నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకుని వినాల్సిన వివేకానందుని మాటలు - మీ ఏసు గురించే సుమండీ! మరికొన్ని వున్నాయి. బేజారు కాకుండా వినండి.

1. క్రీస్తు ప్రవచనాలన్నీ తూర్పు దేశానికి చెందినవే.

సురేంద్ర :- అర్ధమవుతోందా ఓఫీర్‌జీ ! భారతదేశం నుండి ఏసు అరువు తెచ్చుకున్నవేననిదానర్ధం.

జగన్మాతలో ఒక అంశం కృష్ణుడు, మరొక అంశం బుద్దుడు, వేరొకటి క్రీస్తుగా భాసించారు.

సురేంద్ర : మీకిది సమ్మతమేనా? ఇది బైబిలు ఒప్పుకుంటుందా? (దివ్యవాణి జూలై 2 మంగళవారం)స్వీయధర్మాన్ని పూర్తిగా ఆచరించని కారణంగానూ, అన్నింటికంటే, స్త్రీకి పురుషునితో సమాన ప్రతిపత్తినివ్వని కారణంగానూ ఏసు అపరిపూర్ణుడు. స్త్రీలే అతనికి సర్వం ఒనర్చారు. అయినా ఒక్క స్త్రీనైనా అతడు శిష్యురాలిగా స్వీకరించలేదు. యూదుల ఆచారానికి అంతగా కట్టుబడ్డాడు. అతని కంటె బుద్దుడు కొంత మేలు. స్త్రీని బుద్దుడు పురుషునితో తుల్యాధికారిణిగా అంగీకరించాడు. అయినా అతడూ అపరిపూర్ణుడే (పే. 478)

సురేంద్ర :- ఓఫీర్‌జీ! వింటున్నారా! మీ మహనీయుడు వివేకానందుని సత్యవాక్కులు అవి సత్యాలేనని మీరంటే అనగలిగితే, మనస్ఫూర్తిగా స్వీకరించగలిగితే మావరకు మాకు అభ్యంతరం ఏమీ లేదండీ అద్దంకోరూ!

4. ఒక మానవుడు అతడెంత మహనీయుడైనా అవుగాక! మనం అతణ్ణే నమ్ముకుని ఉండకూడదు. మనం కూడా బుద్ధులం, క్రీస్తులం కావాలి. క్రీస్తు మానవుడే, బుద్దునికంటే కొంచెంతక్కువవాడు. అతణ్ణీ నమ్ముకోడం సరికాదు. (పే. 478)

5. జీసస్సే జన్మించకుంటే, మానవకోటికి తరుణోపాయం ఉండేదికాదని తలంచడం మహాపరాధం..... ఇంతకు ముందూ మనమే పరాత్పరులం. క్రీస్తులూ, బుద్దులూ ఆత్మసాగరంలోని వీచికలు. నీలోని పరమాత్మకు తప్ప దేనికీ ప్రణమిల్లకు. నువ్వే ఆ దేవదేవుడినని గ్రహించే వరకు నీకు ముక్తిలేదు. (పే. 478)

సురేంద్ర : చాలా! రంజిత్‌ ఓఫీర్‌గారూ! మొహం వాచేలా, కడుపు నిండేలా చాలా పెట్టాడనుకుంటా మీ మహనీయుడు వివేకానందుడు!? ఇది చాలా? ఇంకా కావాలా? హైందవం - క్రైస్తవం వకటికాదనే అంటున్నాడు వివేకానందుడన్నంతవరకైనా మీ ఇంగితానికి అందుతోందా? గుండె దిటవు చేసుకుని వింటానంటే, విని తట్టుకోగలనంటే, ఇంకొన్ని, వివేకానందుని మాటలనే మీ ఇంగితంముందు పెట్టగలను.

6. భగవంతుడే భగవంతుణ్ణి గ్రహించగలడు. సో-హం, సో-హం అనేదే గానంలోని పల్లవి. ప్రతి వస్తువూ సజీవదైవం, సజీవక్రీస్తు,.... సకల బైబిళ్ళనూ, క్రీస్తులనూ, బుద్దులను వెలుగొందజేసే జ్యోతి మనమే. అది లేనిదే ఇవన్నీ మృతప్రాయాలు.

సురేంద్ర :- మాడు పగిలిందా రంజితయ్యా! నేను అనే జ్యోతి - (అది మనమేనంటున్నాడు వివేకానంద) లేనిదే ఏసూ, బుద్దుడూ కూడా మృతప్రాయులేనట! బాగుందికదూ మహనీయుల మాట! మా మాటకేంగానీ, మీవరకు అదంతా సత్యమేనని ఒప్పేసుకోండి. నావెంట మంగలి తన కత్తితో సిద్దంగా ఉన్నాడు. లక్షసార్లుకైనా సవాలుకు కట్టుబడి ఉన్నానంటిరి కదా! త్వరగారండి నాకంత టైం లేదు.

7. సత్యాన్ని పరిశీలించకుండానే, ప్రాచీన సంప్రదాయాన్ని విశ్వసించడం జరిగింది. విశ్వాస ప్రభావం అలాంటిది. ... జీసెస్‌ క్రీస్తు, మహమ్మదు లాటి మహా పురుషులైనా సరే, అనేక మూఢభావాలను విశ్వసించారు. వాటిని త్యజించలేకపోయారు. కానీ మీ దృష్టిని సర్వదా సత్యం మీదే కేంద్రీకరించాలి. సకల మూఢనమ్మకాలను పూర్తిగా పరిత్యజించాలి.

ముగింపు :


అయ్యా ఓఫీిరుగారూ! వివేకానందుడు అన్నాడని మీరు అన్నట్లు, ఆ ప్రబోధరత్నాకరం మొదటి పుటల్లో, ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలులేవు. ఇక్కడికిది ఒక అబద్దం.

ఆ రోజు వెయ్యి ద్వీపాలవనంలో వివేకానందుడు చెప్పదలచింది ఓంకారాన్ని గురించీ కాదు, క్రీస్తును గురించీ కాదు. క్రైస్తవులుగా ఉండి తన శిష్యులుగ మారడానికి సిద్దపడి తన ప్రసంగాలు వినడానికి వచ్చిన ముగ్గురు నలుగురు క్రైస్తవులతో, బ్రహ్మతత్వాన్ని గురించి మాత్రమే. ఆయన ప్రసంగసారాంశం బ్రహ్మం. ప్రకృతి రూపంలోనూ, విశిష్ట వ్యక్తుల రూపంలోనూ రెండుగా వ్యక్తమవుతూ ఉంది. మనం బ్రహ్మమే. మనమే బ్రహ్మం అని చెప్పాలన్నదే వివేకానందుని ఉద్దేశం.

ఏసు మనిషే ఇకపోతే హైందవ అద్వైతసిద్దాంతం ప్రకారం ఏసూ బ్రహ్మమే, బుద్దుడూ బ్రహ్మమే, రామకృష్ణుడూ బ్రహ్మమే. మనమూ బ్రహ్మమేనన్నదే ఆ ప్రసంగ సారాంశం.

ఏసు అపరిపూర్ణుడు, అనేక మూఢవిశ్వాసాలూ కలిగి ఉన్నవాడు. అతడే రక్షకుడు అనడం మహాపరాధం.

బ్రహ్మనంద సాగరంలో ఏసులాంటివాళ్ళు వీచికలు (చిన్న తెప్ప) వంటి వాళ్ళు మాత్రమే మనమే అసలు బ్రహ్మస్వరూపులం మనం లేకుంటే వాళ్ళంతా మృతప్రాయులే.

గమనిక :- హైందవ క్రైస్తవంలోని ఈ భాగంలో మీరు చెప్పిన లేదా ప్రలోభపెట్టదలచి రాసిన ''ఓంకారమే క్రీస్తు ఆయను'' అన్న మాటలు వివేకానంద అనలేదనీ, క్రీస్తును ఒక మంచి వ్యక్తిగా అదిన్నీ అనేక లోపాలున్న మహనీయునిగా మాత్రమే వివేకానందుడు తలచాడనీ వివేకానందుని మాటలాధారంగానే చూపించాను. దాంతో మీవన్ని అబద్దాలేనని రుజువు చేసినట్లైంది. నిజాయితీ గురించి మాట్లాడడమే తప్పన్నట్లు భాషించారు. మీ నిజాయితీని శంకించకుండేట్లు గుండు గీయించుకుని పిలకపెట్టుకోడానికి సిద్దపడి రండి. ఇక్కడ అన్నీ - మంగలి - కత్తి - సిద్దంగా ఉన్నాయి. మీరు గాని మీ నిజాయితీని నిరూపించుకుంటే, నిజాయితీ గురించి మాట్లాడాల్సిన పని మాకేమీ లేదు.

బాంబులాటి మరోమాట (వివేకానందునిదే ఇది కూడా!) చెప్పనా? ఏసు చారిత్రక వ్యక్తికాడు. మరో భారతీయ తాత్వికుని భావాలను ఏసు పేర ప్రచారం చేశారు. ఆ తాత్వికుడే సముద్ర ప్రయాణ సమయంలో వివేకానందునికి కలలో కనపడి ఈ మాట చెప్పాడు. ఆ కలలోని కొన్ని అంశాలు అనంతరం చారిత్రక పరిశోధనలో తేలాయి.

అట్టపైన మొదట, చివరి పేజీలలో ఉన్న రెండూ మీ పెడపోకడను పట్టిచ్చేవే.

1. ముఖ చిత్రం జాతిని అవమానించుతోంది.

2. అట్ట చివరి పేజిలోనివి, సొంత డబ్బాకు చెందిన అబద్దాలు మాత్రమే.

పుస్తకం లోపలి ముందుపుట 3. సత్యమహంగంభీరః - పులుముడుగొడవే అక్కడా మీ రాతలు అబద్దాల పూతలు మాత్రమే. ఇక పుస్తకం చివరిపేజీలోని 4. ఓంకారమే క్రీస్తు ఆయను అబద్దాలపుట్టే. ఆ విషయమే ఈ వ్యాసంలో చూపించాను.

ఇలా మీ హైందవ క్రైస్తవం మొదటి చివరి పుటల్లోని నాలుగంశాలూ అబద్దాలేనని రుజువు చేశాను. నిరంతర సత్యాన్వేషిననీ, సత్యం నీవు చెప్పు హిందువునవుతానని ప్రకటించిన మీరు మాటకు కట్టుబడి ముందుకు రండి.

1. పరిపూర్ణానంద గారి అమ్మవడిలోకి చేరతారా? లేదా

2. చిన్న జియ్యరుల వారి తిరునామాలు ధరించి గుండుకొట్టుకొని పిలక పెట్టుకుంటారా? లేదా

3. సత్యాన్వేషిని అంటున్నారు గనుక సత్యాన్వేషణ మండలిలో చేరుతారా? మీ యిష్టం.