Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Friday, July 15, 2016

నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుగుతున్న ప్రజాస్వామ్యం - పార్టీలు - ప్రచారాల తీరుతెన్నులు


నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుగుతున్న ప్రజాస్వామ్యం - పార్టీలు - ప్రచారాల తీరుతెన్నులు


దేశంలో 1. మోడీ 2. రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ, భారత ప్రధాని - ప్రచారాలు

రాష్ట్రంలో :-
 1 తెలుగుదేశం - చంద్రబాబు నాయుడు, 2. లోకేష్‌ 3. బాలకృష్ణ

2. టి.ఆర్‌.ఎస్‌  - 1. కె.సి.ఆర్‌ 2. కవిత  3. హరీష్‌రావు

3. వైకాపా - జగన్‌ 2. షర్మిల 3. విజయమ్మ

4. సి.పి.ఐ - 1. నారాయణ

5. సి.పి.ఐ (ఎమ్‌) - 1. రాఘవులు

6. బి.జె.పి - 1. మోడీ 2. వెంకయ్య నాయుడు 3. చిన్నమ్మ

7. కాంగ్రెస్‌ - 1. రాహుల్‌ 2. సోనియా 3. ప్రధాని 4. ప్రియాంక గాంధీ

8. జైసమైక్యాంద్ర -  కిరణ్‌ కుమార్‌ రెడ్డి

9. లోక్‌సత్తా - జయప్రకాష్‌ నారాయణ

10. ఆమ్‌ ఆద్మీ - కేజ్రీవాల్‌

11. టి.ఆర్‌. యల్‌.డి - జయప్రద

12.     - మందకృష్ణ మాదిగ

13. ఎం.ఐ.యం - అసదుద్దీన్‌

గమనిక :- చిన్నా చితకా పార్టీలనలా ఉంచితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా 1. బిజెపి 2. కాంగ్రెసు 3. టి.డి.పి 4. వైకాపా 5. టిఆర్‌ఎస్‌ మధ్యనే యుద్ధంయుద్ధం జరుగుతూ ఉంది. యం.ఐ.యం యుద్ధంలో లేదుగానీ పై అయిదింటిలో దేని బలాన్నెనా తగ్గించడానికీ, పెంచడానికీ కూడా సత్తా కలిగి ఉందది.

కొన్ని విషాద సంఘటనలు


ఒక విషాదం :- స్వాతంత్య్ర పోరాటం నాటికి కాంగ్రెసుకు దీటైన ప్రత్యామ్నాయంగానూ, ప్రతి పక్షంగాను మనగలిగిన కమ్యూనిస్టు పార్టీ, 'నానాటికీ తీసికట్టు నాగం బోట్టు' అన్న సామెతగా బలహీన పడుతూ వచ్చి, చివరకీనాడు మనుగడ పోరాటం చేస్తూ ఉంది. ఆ పార్టీలోని ప్రధాన కూటాలైన సి.పి.ఐ,  సి.పి.యంలు ఒకటి కాంగ్రెసుతోనూ, మరోటి వైకాపాతోనూ జత కట్టడం, కనీస పక్షం ఆ రెంటివరకైనా కలసికట్టుగా ఎన్నికల వరకైనా పొత్తుకు సిద్దపడకపోవడం దానికదే ఒక పెద్ద విషాదం.

మరో విషాదం :- 67 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో, రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు ఎత్తుగడలు - చిత్తు చేసుకోడాలు, అస్మదీయులు - తస్మదీయులన్న పోకడలు, వివిధ పార్టీలలో ఉంటూనే, ఎవరి అవసరాలు వారు తీర్చుకోడాలు, ఒకరి అవసరాలు ఒకరు తీర్చడాలు, అన్న మాటేనని నమ్ముతూ వచ్చిన జనం; ఏ కళనున్నారోగానీ లోక్‌సత్తాను, ఆమ్‌ ఆద్మీ పార్టీని, మంచి రాజకీయాలకు మొలకలుగా తలచినట్లు కనపడింది. 30 ఏండ్ల వెనక్కి వెళ్ళి చూస్తే - జనతా పార్టీ విషయంలోనూ ప్రజలు మంచికి అనుకూలంగా నిలబడిన దాఖలా కనపడుతుంది. అయితే పెద్ద విషాదమేమంటే, ఎప్పుడో ఒకసారైనా, ఈ ఒక్కసారి చూద్దామనుకుంటూ జనం సాంప్రదాయ రాజకీయ పార్టీలనకు విడచి వీరివైపు అనుకూల దృష్టి పెట్టినా, వీరెవరూ జనం నమ్మకాల్ని సొమ్ము చేసుకోలేదు సరికదా వమ్ము చేశారనీ అనవచ్చు. మంచి రాజకీయాల దిశగా మరో గట్టి యత్నం చేద్దామనుకునే వారికి, ఈ మంచివారి వైఫల్యాలు పెద్ద అడ్డుగా నిలుస్తాయి. ఇదీ మరో పెద్ద విషాదమే. ఈ ఎన్నికల్లో లోక్‌సత్తా ఎవరితోనైనా పొత్తులకు సిద్దం అంటూ దేబిరించుకున్నంతగా ప్రవర్తించడాన్ని, విషాదంగా కాక ఎలా అర్థం చేసుకోగలం? ఒకరోజు మీడియాలో ఆమ్‌ ఆద్మీతో పొత్తంటూ లోక్‌సత్తా బహిరంగ ప్రకటన రావడం, మరునాడు అలాటిదేమీ లేదని ఆమ్‌ ఆద్మీపార్టీ తరపున మరో ప్రకటన రావడం; మంచిరాజకీయాలు వస్తే బాగుండుననుకునే వారికి విషాద వార్తకాక మరేమిటి?

మల్కాజిగిరిలో మరో విషాదం :-

సమాజహితైషేననదగ్గ జె.పి. మల్కాజిగిరి నెందుకు ఎంచుకున్నారో నిజాయితీగా ఆయనే చెప్పాలి. రాష్ట్రాన్ని వదలి, కేంద్రం వైపుకు ఎందుకు దృష్టి పెట్టారోనూ ఆయన చెపితేనే మేలు, కేంద్రంలో ఉంటే ఎన్నో చేయవచ్చులాటి, వాదనకు చెప్పే కారణాలకంటే, బలమైన కారణాలున్నాయనడమే నా హేతుబుద్దికి (వివేకానికి) నిజమనిపిస్తోంది. ఈ మధ్య ఆయన, లోక్‌సత్తా సంస్థగా ఆవిర్భవించిన సందర్భంలో తొలినాళ్ళలో ప్రకటించిన పలువిలువైన అభిప్రాయాలకు వేరుగా ప్రవర్తించడం, మాట్లాడడం కనపడుతూ వస్తొంది. ముఖ్యంగా, ఆర్థికాభివృద్ధి విషయంలో సరళీకృత ఆర్థిక విధానం, భారీ పరిశ్రమల నిర్మాణం, విదేశీ పెట్టుబడులతో సహా పెట్టుబడి దారుల నాహ్వానించాలనడం, అధికోత్పత్తే ఆర్థికాభివృద్ధికి తిరుమంత్రమన్నట్లు మాట్లాడడం, నా అవగాహనననుసరించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. సమానాభివృద్ధి మూల సూత్రంగా లేని, మూలవనరులను పొదుపుగా వాడుకోవాలన్న దృష్టిలేని, ఏ అభివృద్ధీ రాజ్యాంగాశయాలకు అనుగుణ్యమైంది కానే కాదు. ఈ విషయంలో, రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో పలికిన అత్యంత కీలకమైన మాటల్ని గుర్తు చేసుకోవడం ఉచితం. సోషలిస్టు ఆర్థిక విధానాన్ని అమలు పరచుకోకుండా ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ఎలా సాధ్యమో నా ఊహకందడం లేదు. అనంటాడాయన. ఆయనన్నాడని కాదుగానీ, సమానాభివృద్ధి భవిష్యత్తుకు భద్రత అన్నది వివేకం కోరదగిన భావనేనని అంగీకరించగల వాళ్ళంతా, అలానే ఆలోచించాలి. ఆలోచిస్తారు.

మరో సమాజహితైషీ, సామాజిక క్షేత్రాలకు చెందిన వివిధ అంశాలలో లోతైన అవగాహన కలిగిన మేధావీ, కె. నాగేశ్వర్‌ గారూ మల్కాజిగిరి నుండే లోకసభకు అభ్యర్థిగా నిలబడ్డారు. తాను గెలవాలన్న దృష్టితోకంటే, ఆర్థికాంశాలకు సంబంధించి జె.పి. పోకడను ఎండగట్టడానికనే ఆయన మల్కాజిగిరిని ఎంచుకున్నారు. ఆర్థికాంశాలకు సంబంధించి జె.పి చెపుతున్న దానిని, ఖండించకపోవడం ఒక మేధావిగా, రాజ్యాంగాశయాన్నెరిగిన వాడిగా తగని పని అని అనుకుని, దానిని ఖండించడం తనకు నైతిక బాధ్యత అనంటూ ఆయన ఆస్థానంలో నిలబడ్డారు.

నిజానికి, వారిద్దరి వ్యక్తిత్వాలను బట్టిగానీ, వారికున్న విజ్ఞత, వివేక సామర్ధ్యాలను బట్టిగానీ, వారిరువురూ, (అలాంటి మరికొందరూ) కూడా శాసనసభల్లోనూ లోక్‌సభలోనూ ఉండాలి. అట్టి వారిని మనలాంటివారం పట్టుబట్టి ఎంపిక చేసుకుని చట్ట సభల్లోకి పంపుకోవాలి. ఆవేశానికి లోను కాకుండా వారిరువురూ వేరు వేరు స్థానాల్లో నిలబడి, ఇరువురి తరపునా ఇరువురూ ప్రచారం చేసుకుని ఇరువురూ ఎన్నిక కావడానికి చేయవలసినంతా, కనీసం చేయగలిగినంతైనా సమష్టిగా కృషి చేయాల్సింది. ఆ సంయమనాన్ని పాటించకపోగా, ఒకటి రెండంశాలలో అవగాహనల్లోని వ్యత్యాసాలాధారంగా ఒకరికెదురుగా ఒకరు నిలబడి, వారివారికున్న నైతిక బలాన్ని పరిపతిని, (మంచివారన్న పేరును) వాదనా బలాన్నికూడా ఉపయోగిస్తూ, పరస్పరం ఒకరి ఓటమికి మరొకరు కారకులు కావడానికి సిద్దపడడాన్ని, మంచి కావాలనుకున్న, మంచివారు రావాలనుకుంటున్న వారికి విషాదమనికాక మరేమనుకోగలం. వారిరువురు గాని ఎన్నికైయ్యుంటే అనేకానేక విషయాలలో 5 ఏండ్ల పాటు తమ మేధస్సును, తమ వాయిస్‌ను సమాజహితం దిశగా దిశానిర్ధేశం చేయడానికి ఉపయోగించగలిగి ఉండేవారు. నా దృష్టి నుండి, అభ్యుదయా కాంక్షులందరికీ వారిరువురూ పోటీలో ఎదురెదురుపడడం ఖచ్చితంగా గొప్ప విషాధసన్నివేశమే.

ప్రజాస్వామ్యం పేరిట - ప్రజా ప్రతినిధులుగా రాజులు, మహారాజులు, చక్రవర్తులు


ముఖ్యమైన ఏ పార్టీ అధినేతల్ని చూసినా, 'నేనే మీకు రక్షకుణ్ణి, నన్నెంచుకుంటేనే మీకు భవిష్యత్తు' అన్న ఒకే ఒక్క పోకడ కనిపిస్తోంది.

 నన్ను చూసి అభ్యర్తులకు ఓటేయండి, అన్న నినాదమే అన్ని పార్టీల అధినేతల నుండి వెలువడుతోంది. ఒక అసెంబ్లీ స్థానానికిగానీ, ఒక లోక్‌సభ స్థానానికి గానీ, ప్రజా ప్రతినిధిగా ఒకణ్ణి ఎందుకెంచుకోవాలో నన్నది, ఎక్కడా ముఖ్యమైన అంశంగా చూడబడడంలేదు. ఆయా చట్టసభలకు అభ్యర్ధులుగా నుంచున్న వాళ్ళలో వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే కనబడడంలేదు. ఆయా పార్టీల అధినేతలు ప్రసంగిస్తూ ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీ కండువా కప్పుకుని, మెళ్ళో ఓదండ వేసుకుని, దండం పెడుతూ శిలావిగ్రహంలా చేష్టలుడిగి నుంచుని కనబడుతున్న వాళ్ళను చూస్తుంటే, వీళ్ళా ప్రజా ప్రతినిధులు !? మనమెంచుకోవలసి వాళ్ళు! అన్న వెటకారపు భావన మదిలో మెదలుతోంది.

గతంలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకూ కొట్టవచ్చినట్లుగా ఒక వ్యత్యాసం కనబడుతోంది. గతంలో రాష్ట్ర పర్యటనకు ఒకటి, రెండు ప్రదేశాలలోని బహిరంగ సభలకు మాత్రమే జాతీయ స్థాయి కల ఆయా పార్టీల అధినేతలు వచ్చి వెళ్ళేవారు. అందుకు పూర్తి విరుద్దంగా, అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయి సమావేశాలకూ ప్రధాన మంత్రి అభ్యర్థులుగ ఎంచబడుతున్న మోడీ, రాహుల్‌ అన్న వారూ, కాంగ్రెసు అధినేత్రి (మహారాజ్ఞి) గా తలచబడుతున్న సోనియమ్మ, బిజెపి నుండి చిన్నమ్మ నంటూ తననితాను పరిచయం చేసుకొంటున్నామె ఉరుకులు, పరుగులు వేస్తున్నారు. ప్రధానీ పరిగెడుతూనే ఉన్నాడు. పార్టీ ముఖ్యునిగ మన్మోహన్‌సింగ్‌ పర్యటన అని అనడంలా పత్రికలు. ప్రధాని ప్రసంగం అనే ప్రచారం చేస్తున్నాయి. ఒక పార్టీ ప్రచారానికి ప్రధాని రావడమేమిటో అర్థమైచావడంలా?

ఇక ప్రాంతీయ పార్టీలలో ముఖ్యమైనవిగ చూడబడుతున్నవి టి.డి.పి, వైకాపా, టి.ఆర్‌.ఎస్‌లు

1. టి.డి.పి పోకడ :- సర్వం తానేనన్నట్లుంటుంది చంద్రబాబుగారి వరస. రాజకీయంలోనూ, షడ్యంత్ర రాజకీయంలోనూ రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితులలో అతనంత ఘటికుడు మరొకడులేడు. అన్ని నియోజక వర్గాలలోనూ మాట్లాడుతోంది ఆయనొక్కడే. అభ్యర్థులు దిష్టి బొమ్మల్లా నుంచుని ఉంటే, తనకు అధికారం కట్టబెట్టమనీ, తాను అధికారంలోకి రావాలంటే తాను చూపిన వారినే గెలిపించాల్సి ఉంటుందనీ, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పగలిగిన వాణ్ణి తానొక్కణ్ణేననీ, ఇంకెవర్ని ఎంచుకున్నా ముఖ్యంగా వైకాపా, టిఆర్‌ఎస్‌లను గాని ఎంచుకుంటే అంతా దొంగలపాలేననీ హోరెత్తించేస్తున్నారు.

*    ఇక టిడిపి అభ్యర్థులు :- ఒక్కడూ తన నియోజక వర్గం గురించిగాని, తన గురించిగానీ గట్టిగా నాలుగుమాటలు కూడా చెప్పుకోరు. టి.డి.పిని గెలిపించడం ద్వారా చంద్రబాబును మహారాజును చేయండి. ఆయన ప్రజల్ని - రాజ్యాన్ని - సుభిక్షంగా పరిపాలిస్తాడు. అని మాత్రం ఊదరగొట్టేస్తుంటారు.
*  ఉన్న నాలుగు నాళ్ళలో రాష్ట్రమంతా తానొక్కడే ఎలానూ తిరగలేడుగనక, కచ్చితంగా తన వాళ్ళనుకున్న వాళ్ళ నొకళ్ళిద్దరిని మాత్రం ప్రచారానికి పంపుతున్నారాయన. ఆ యుద్దంలో, ఒకరు కొడుకులోకేష్‌, రెండు వియ్యంకుడు బాలకృష్ణ. కొడుకు రాజకీయాలలో అన్నప్రాసన దశలోనున్నవాడు. అతి రథ మహారథులనబడుతున్న వాళ్ళను జనానికి చూపుతూ, వారిని - ఆ పార్టీ సీనియర్‌ మోస్టుల్ని - గెలిపించమనీ, వాళ్ళు గెలిస్తేనే తన తండ్రి, అదే! చంద్రబాబు నాయుడుగారు సింహాసనాన్నధిష్టించి పాలించడం సాధ్యపడుతుందనీ ప్రవచిస్తున్నాడు.

ఇక రెండో ఆయన, సినిమాల్లో నాయక పాత్రలో చేసినట్లుగానే అభినయం చేస్తూ, అవసరమైతే ఏమాత్రం హుందాతనం లేకుండా తొడగొట్టడాలు, మీసాలు మెలేయడాలు చేస్తూ, నాలుగు వాక్యాలు తడబడకుండా మాట్లాడడం చేత కాని వాడని తెలుస్తూనే ఉన్నా, రాజకీయాలకు సంబంధించి లోతులేవీ తెలియని వాడేనని తెలుస్తూనే ఉన్నా, తగుదునమ్మా అని ప్రచార రథమెక్కుతాడు. డబ్బు దీసుకుని, దర్శకులాడమన్నట్లు ఆడే, ఒక్కోడైలాగు నాలుగైదుసార్లు చెప్పుకుంటూ నటిస్తూ బ్రతికేనటకుల్ని నాయకుల్ని చేస్తూ, వీరాభిమానాన్ని కనబరుస్తూ అభిమాన సంఘాలున్నంతకాలం, ఈనాటకీయుల మాటలకూ ఓట్లు రాలుతునే ఉంటాయి మరి!

ఎన్‌.టి.రామారావును గుర్తు చేసుకోండి. టి.డి.పి కి ఓటేయండి. నన్ను రాజును చేయండి. నేను తప్ప మిమ్మల్ని ఉద్దరించగలవాడు రాష్ట్రంలో లేడు. గతంలోని అన్ని మంచి పనులూ నేను చేసినవే. రాబోయే కాలంలో మంచి పనులేవైనా నేను చేయాల్సిందేనంటూ హోరెత్తించేస్తున్నారు బాబుగారు. కేసిఆర్‌ టక్కరి. మాయలమరాటి లాటివాడు. ఇక జగన్‌ ఎలాగూ జైలు కెళ్ళాల్సినవాడే. కాంగ్రెసు కప్పల తక్కెడ లాంటిది. మిగిలింది ఇక్కడ టి.డి.పినే. బాగా ఆలోచించుకోండి. కేంద్రంలో మోడీతో కూడిన బిజెపీ కూటమే రాజ్యమేలుతుంది. మా ఇద్దరిని ఎంచుకోకుంటే రాష్ట్రానికి అగచాట్లు తప్పవు.


జగన్‌
:- రాజశేఖర్‌ రెడ్డి గారిని గుర్తుచేసుకోండి. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని నిస్సిగ్గుగా మాటాడేస్తుంటాడు. వై.యస్‌.ఆర్‌ ఒకవేళ జనానికి ఏదో చేశాడనుకున్నా, అది ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన విధిగనక చేశాడు. దానికి ఈయనకెందుకు పట్టంగట్టాలో మనలాంటి పద్దతెరిగిన బుద్దులకు ఒక పట్టాన అర్థం కాదు. ఒకటో సంతకం, రెండో సంతకం .... 10 సంతకం .. 15 సంతకమంటూ ఒకటే గొడవ. ఈయన పార్టీలో ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఒక్కడంటే ఒక్కడు నోరెత్తి మాట్లాడిన పాపాన పోలా. ఉత్సవ విగ్రహాలే అంతా. ఇక ఈ యువకుడు 60 ఏళ్ళ బామ్మల్ని చిన్న పిల్లల్నిలా ముద్దాడుతుంటాడు. ఆశీర్వదిస్తుంటాడు. అమ్మ విజయమ్మ వైయస్‌ఆర్‌ పోవడంతో తాను అనాథనయ్యానని అంటూ సానుభూతిని సంపాదించుకునేందుకు తెగప్రయాస పడుతుంటుంది. బైబిలు చేతిలో పట్టుకుని, క్రైస్తవ ఓటర్లు, మన మంతా క్రీస్తు సంఘం వాళ్ళమేనని అనుకోవాలని కాబోలు, తెగ ఆరాటపడుతుంది. ఇంక కూతురైతే, అన్నకి పట్టంగడితే రాజన్న పాలనే అందిస్తాడంటూ అరుస్తుంటుంది.

ఒక వంక అనేక కేసుల్లో అడ్డగోలుగా బుక్కైపోయి, కుడితితొట్టిలో పడ్డ ఎలుకల్లే కొట్టుకులాడుతూ, మరోఒంక అవినీతిని పారద్రోలండి, దోపిడీని అరికట్టండంటూ తెగ అదరగండంగా వదరుతుంటారు. ఉండలేకో, నెట్టేయబడో ఆ పార్టీలో నుండి బైటపడ్డ వాళ్ళందరూ అతణ్ణి గురించి వెలిబుచ్చే అభిప్రాయం ఒక్కటే. నియంత అతడు. వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేరు అన్నదే ఆ మాట. డబ్బులు వరదల్లే పారించడమేకాదు, డబ్బులు దండుకోవడమూ దండిగనే జరుగుతుంటుందని, అందులోని అసమ్మతివాదులే గొణుక్కుంటుంటారు.

ముఖ్యమైన మూడు మాటలు

1. టి.ఆర్‌.ఎస్‌ అధికారం చేజిక్కించుకుంటే మనకభ్యంతరం లేదు గాని, ఎట్టి పరిస్థితుల్లోను వెకిలితనమున్న కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి కాకూడదు. అసలలాటి అడ్డగోలు మనుషులు ఏ రకంగానూ పాలనలో భాగస్వాములు కావడానికి తగినవారు కాదు.

2. ఇక వైకాపా తరుఫున జగన్‌ అధికారంలోకి రావడమూ వివేకవంతులు కోరదగింది కాదు.

3. వీటిలో వేటిలోనూ ప్రజాస్వామ్యానికి పట్టం కట్టే వాడొకడూలేడు. కనుక ఇప్పటికి అవసరమైన మాట ఒకటే!

* ఈ మందలోని ఎవనికీ లేదు మన హృదయంలో చోటు. అందుకే వేద్దాము నోటాకే మన ఓటు:
ఈ నినాదం కొంతకాలం దేశమంతా మారు మ్రోగాలి. 'నోటా' అభిమానుల ఓట్ల సంఖ్య గణనీయంగా పెరగాలి. అదే సమయంలో సరైన అభ్యర్ధులను నిలబెట్టుకోక తప్పని పరిస్ధితులు పార్టీలకు ఎదురవ్వాలి.

జై భారత్‌  - మేరా భారత్‌ మహాన్‌ - ప్రజాస్వామ్యం వర్థిల్లాలి.
*  రాబోయే ఎన్నికల నాటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. ప్రజల మనుషులుగా ఉండగలిగిన వాళ్ళను గుర్తించి ప్రతినిధుల్ని చేసుకోవాలి. ఆ దిశగా జనాన్ని మేలు కోలిపిందుకే అభ్యుదయ శక్తులు సంఘటితంగా ఈ ఐదేండ్లు కృషి చేయాలి.

ప్రజాస్వామ్యం ఊపిరిపోసుకోవాలంటే, 1. ప్రతిగ్రామాన గ్రామాభ్యుదయ సంఘాలు ఏర్పడడం, 2. గ్రామ సభలు సరైన రీతిలో ఆచరణకు రావడం వినా మరో దారిలేదు.

జ  అసాంఘిక శక్తులింతగా చెలరేగడానికి కారణం, అభ్యుదయ శక్తులు సంఘటితం కాకపోవడమే.

జ  దేశమింకా గొడ్డుపోలేదు. మంచివాళ్ళకు దేశంలో కొదవలేదు. అయితే వారంతా కలసికట్టుగా ఒక్కటికాలేకపోవడమే - అనైక్యతే - ఈ దేశ సమస్య.

గమనిక :- నడుస్తున్న రాజకీయాలపై పత్రికలో ఏమీ రాయకపోవడం ఏమీ బాగలేదు. ఏదో ఒకటి రాయండి! అన్న వత్తిడి మిత్రులనుండి రావడంతో, వాస్తవ పరిస్తితుల్ని చూస్తుండడం వల్ల కలిగిన మానసిక నిర్వేదం నుండి కలం ఈ విధంగా, ఒకింత పూర్వాపరక్రమం లేకుండానూ - కదలాడింది. వరుస క్రమాన్ని వదిలిపెట్టి వాస్తవాలెన్ని ఉన్నాయో నన్నది మాత్రం పట్టించుకోండి.

మన రేపటి లక్ష్యం - 2019 అవధిగా, ప్రజాస్వామ్య రక్షణకై ప్రజల్ని మేలుకొలిపే ఉద్యమం


ఆలోచించండి. ఆచరణకై కదలిరండి.

జనవాణి - సామాన్యుని మనస్సులోని మాట


1. జె.పి :- మనకవసరం లేని, మన అవసరానికి రాని, క్షుద్ర రాజకీయాలలో గెలవలేని, మంచి మేధావి.

2. కె. నాగేశ్వర్‌ :- జెపి తనలాటి మరో మేధావి, సంఘహితైషి అని తెలుస్తూనే ఉన్నా, తానంగీకరించరాని వైఖరి కనబరచాడన్న ఆవేశంతో, తానూ, అతనూ కూడా ఎంపిక కాకుండేలా పొరపాటు నిర్ణయం తీసుకున్న; 'తప్పు ఎవరు చేసినా ఒప్పన'నే ఆవేశ పూరితుడైన మరో మంచిమేధావి.

3. చంద్రబాబు :- భారత దేశ చరిత్రలో; మహాభారతంలో, గుప్తుల కాలంలో ఇరువురు రాజనీతిజ్ఞులు మరెవరితోనూ పోల్చడానికి వీలు కానంత ప్రజ్ఞావంతులుగ కనబడతారు. ఒకరు కృష్ణుడు కాగా మరొకరు చాణుక్యుడు. ఇరువురు అనుసరించిందీ, సామదాన భేద దండోపాయాలనే. ఇరువురిలో కనబడేదీ శతృపక్షాన్ని చీల్చడం, స్వపక్షాన్ని కూడగట్టడం అన్న ఎత్తుగడే. ఈనాడు రాజకీయముఖ్యులందరూ అనుసరిస్తున్నది ఈ పోకడనే అయినా, ఇప్పటివారందరిలోకీ ఈ విషయంలో విశేష ప్రజ్ఞను కలిగి ఉన్నవాడు చంద్రబాబే. ఎలాగంటే,

ప్రస్తుత రాజకీయంలో బలంగా పని చేస్తున్న సాంఘికాంశాలు 'కులం - మతం' అన్నరెండే. ఇక ప్రాంతమన్న దానినీ మూడో అంశంగా చెప్పుకోవచ్చు.

ఎ)    బి.సిలు, ఎస్‌.సిలు, ఎస్‌.టిలు, మైనారిటీలు అన్నవి కులంపేరున మతం పేరున కట్టగట్టుకుని ఉన్న ప్రధాన సామాజిక వర్గాలు :- 1. ఆర్‌. కృష్ణయ్యను కలుపుకోవడం ద్వారా, అంతమాత్రం సరిపోదని ఎరిగి, అతడే టి.డి.పి తరఫున తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడం ద్వారా, మిగిలిన అన్ని పార్టీలలోని బిసి ఓట్లను చీల్చడం ఆ మేరకు టి.డి.పికి ఆ ఓటర్లను జత చేయడం.

2. మాదిగ పోరాట సమితిని ఆలింగనం చేసుకోడం ద్వారా కృష్ణ మాదిగకు మద్దతు తెలపడం ద్వారా ఆ సామాజిక వర్గంలోనూ చేయతలపెట్టిందదే.

3. గిరిజన తెగలవారినీ అభ్యర్ధులుగ నిలపడం ఆ తరహా ఎత్తుగడే.

బి)    మతం పరంగా హిందువులూ, క్రైస్తవులు, ముస్లిములు ముఖ్యంగా చెప్పవలసినవారు.

1. బిజెపితో పొత్తు వల్ల హిందువుల తోడ్పాటు.

2. కె.ఎ.పాల్‌ను, అతనితో మిత్ర సంబంధాలు కలిగిన ఇతర క్రైస్తవ సంఘాలను కలుపుకోవడం ద్వారా వైకాపా ప్రభావాన్నుండి క్రైస్తవ ఓటర్లను చీల్చడం, తన జాబితాకు వారిని జతచేసుకోవడం

3. ముస్లిం పక్షంలోని ఎం.ఐ.యంతో ఎలానూ పొంతన కుదరదు గనుక, వారినలా ఉంచి ఇతర ముస్లిములను ఆకట్టుకునే యత్నం చేయడం.

4. జె.పిలాటి వారి నుండి ప్రతికూలత లేకుండా చూసుకోవడం, ఒకింత అనుకూలత ఉండేలా సంబంధాలు నెరపడం ద్వారా తన స్వీయ సామాజిక వర్గపు ఓట్లు చీలకుండా జాగ్రత్తపడడం - ఇలా సాగుతుంటుంది, చంద్రబాబు కృష్ణ, చాణక్య తంత్రం. అయితే కృష్ణ, చాణక్యులకూ, ఈయనకూ అత్యంత ప్రధానమైన ఒక తేడా ఉంది. వారిరువురూ ఆధిపత్య కాంక్షలేనివారు కాగా, ఈయన తాను రాజైతేనే ప్రజలకు మేలు జరుగుతుందనంటారు.

4. వై.యస్‌. జగన్‌ :- ఈయన ప్రధాన చట్రమంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినదైయ్యుండడం కీలకాంశం. ఈయనదీ చాణక్య తంత్రమే గాని, వీరి ఎత్తుగడంతా చాణుక్యుని అర్థశాస్త్రపు సూత్రాలకు సంబంధించిందిగా ఉంది. ఆ సూత్రం -  ప్రపంచంలోని ప్రతిదీసరుకే - ప్రతి సరుకూ ఏదో ఒక ధరకు అమ్ముడకుపోతుంది, అన్నదే. రాజకీయ క్షేత్రాలలో ప్రధానంగా రెండు రకాల సరుకులే ఉంటాయి. 1. ఓటర్లు 2. అభ్యర్థులు. ఈ రెండు సరుకులను కొనడం, అమ్మడంలో చాణక్యునకున్నంత ప్రజ్ఞతనకూ ఉందనుకుంటుంటాడీ జగనన్న. గెలుపు విషయంలో ఆయనకున్న ధీమా అంతా ఆ సరుకును ఏ దశలోనైనా కొనగలను అన్నదొక్కటే.

జ  అమ్మ విజయమ్మ బైబిలు పట్టుకుని కూచుంటుంది. వైయస్సార్‌ లేనిలోటు తనకెవరూ తీర్చలేరంటుంది. తన చావుతో గాని ఆలోటు తీరదంటుంది. వైయస్సార్‌ను గుర్తు చేసుకుని జగన్‌ను రాజును చేయమంటుంది.

ఇక వైకాపాకు ప్రధాన దిక్కుగా (ప్రచార సారథిగా) ఉన్న జగన్‌ సోదరి షర్మిల విషయం :- రాజకీయ పరిజ్ఞానంలేని, ప్రసంగ నైపుణ్యతలేని, పడికట్టు ప్రసంగాలు చేస్తుండే ఈ రాజకీయ కూన చంద్రబాబును, కాంగ్రెసునకు తిట్టడం, తన తండ్రిని పొగడడం, అన్నకు పట్టంకడితే రాజన్న పాలన వస్తుందనంటూ చెప్పిందే చెపుతూ, దాసరి పోకడ పోతుంటుంది.

5. కె.సి.ఆర్‌. :- ఈయన్న గురించి చెప్పుకోకుంటే, నడుస్తున్న అలగారాజకీయాల వివరాలు చెప్పుకున్నట్టే అవదు. గబ్బు నోరున్న, పోకిరీ భాషలో పి.హెచ్‌.డి చేసిన, దానిసరైన అర్థంలో రాజకీయానికి అర్థం చెప్పుకుంటే రాజకీయాలకు పనికి రాని కారెక్టరిది. సభ్యతా సంస్కారాలన్న వాటికి గానీ, నీతి నిజాయితీలన్న వాటికిగానీ, అందరంగీకరించే - సాధారణంగా మనం  చెప్పుకునే - అర్థాలుండవు ఈయనకు. కె.సి.ఆర్‌ అంటే మాట మీద నిలిచేటోడని అర్థం; అబద్దాలాడుడు చేతగానోణ్ణి నేనంటూ; పెద్ద అబద్దంతో ప్రసంగం మొదలెట్టగల దిట్ట. వివేకవంతులు సిగ్గుపడేంత ఎగ్గు భాష నిస్సిగ్గుగా మాట్లాడేయగల దిట్ట తన మున్నవాడు.

ఈ మధ్య జనసేన నేత; మోడీ, చంద్రబాబు సరసన కూర్చునే పరిస్థితి దాపురించడంతో తెగరెచ్చిపోయి, మరెవరూ దొరకనట్లు ఈ కేసి ఆర్‌ ను పట్టుకుని, తాటతీస్తానంటూ ఒక అవాకు విసిరాడు. మామూలుగానే మంట లెగేసే కెసిఆర్‌ ఇది విని ఊరుకుంటాడా?! పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి వాడు, వీడులతో పోనీకుండా, నే చిటికెన వేలు కదిపితే చిదిమేస్తరు నిన్ను 'నాకొడకా' అనీ అనేశాడు.

నాలుక్కోస్తానంటాడొకడు, చేతులు నరుకుతానంటాడింకొకడు, ఇక్కడుండనీయం పొండిరా కొడకల్లారా! అంటాడు మరొకడు, రా! చూసుకుందామంటాడింకొకడు, మరి కొందరైతే భౌతిక దాడులకూ సిద్దపడిపోతుంటారు. ఇక ఆంధ్రోళ్ళంతా దోపిడీ దారులే, పీకకోసుకుంటా, తల నరుక్కుంటా, లాంటి మాటలు కెసిఆర్‌కు ఊత పదాల్లాటివి.

ఎక్కడి రాజ్యాంగం ? ఎక్కడి ప్రజాస్వామ్యం? ఎక్కడి స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులు? దాదాపు అందరిదీ ఒకే మూస, ఒకే భాష

పెద్ద విడ్డూరం


1.    కెసిఆర్‌ - కాంగ్రెసు కుమ్మక్కైపోయారంటారు టి.డి.పి వాళ్ళు

2.     వైకాపా - కేసిఆర్‌ కుమ్మక్కైయ్యారంటారు కాంగ్రెసు వాళ్ళు.

3.     కాంగ్రెసు - టి.డి.పి అంటకాగుతున్నేౖ అనీ అంటారు వైకాపా వాళ్ళు, టి.ఆర్‌.ఎస్‌ వాళ్ళు

4.     మొదట టిఆర్‌ఎస్‌ - బిజెపితో పొత్తుకు యత్నించి విఫలమైంది. ఆ తరవాత, బిజెపితో పొత్తు పెట్టుకున్న టి.డి.పిని నీతిలేని పార్టీ అనడం మొదలెట్టింది.

5.     తెలంగాణా బిల్లు పాసైన వెంటనే, ''సోనియాకు తెలంగాణా జనం కృతజ్ఞులై ఉంటారు, ఆమె చలవే ఇదంతా'', అన్న కేసిఆర్‌- అదేనోటితో ఆమె గానీ, కాంగ్రెసు గానీ ఇవ్వలేదు, తన్నిలాక్కున్నాం తెలంగాణాను అంటున్నాడిప్పుడు.

6.     టి.డి.పి - తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణా ఏర్పాటు కుదిరింది అంటోంది.

7.     బిజెపి అనుకూలంగా ఉండడం వల్లే తెలంగాణా విభజన సాధ్యమైందంటుంది, బిజెపి

8.     సోనియాగాంధీ తలచుకొబట్టే, తెలంగాణా ఏర్పడిందంటుంది కాంగ్రెసు

9.     టి.డి.పి వల్లె తెలంగాణా విభజన జరిగిందంటాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

10.     టి.డి.పి వల్లే తెలంగాణా విభజన జరిగిందంటాడు వై.ఎస్‌ జగన్‌

11.     కె.సి.ఆర్‌ కడిగిన ఆణిముత్యం, కాల్చిన బంగారం అంటుంది టి.ఆర్‌.ఎస్‌

12.     తాను ముఖ్యమంత్రి కాకుంటే తెలంగాణా ఆంధ్రోళ్ళ  క్రింద బ్రతకాల్సిందేనంటాడు కె.సి.ఆర్‌

13.     కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడా, గడీలపాలనే అంతా. ప్రతి దానికీ రేటుకట్టి అమ్మకంపెడతాడు అంటాడు చంద్రబాబు.

14.     ఒకణ్ణొకడు దొంగ అనుకోని వారు గానీ, దోపిడీ దారుడు, కుట్రదారుడు అనుకోని వారుగానీ కలిగ్గానికీ కనబడటంలా.

అలాంటివే మరికొన్ని విడ్డూరాలు


1.     కె.సి.ఆర్‌. హోమాలు చెస్తాడు. జంతుబలులూ ఇస్తాడు, వాస్తు జూపిస్తడు, జాతకాలూ, ముహూర్తాలు ముందు చూడాలంటాడు, బొట్టుపెడతడు, కనపడిన గ్రామ దేవతకల్లా మొక్కుతాడు. మతతత్వ వాదిని కాదు, సెక్కులర్‌నంటాడు.

2.     చేతిలో బైబిలుంటుంది, క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. హిందూ దేవాలయాలనూ వదలరు, సగం భారం దేవుడిపైనే వేస్తుంటారు. భగవంతుని దయ అంటునే తామే సెక్కులర్‌ దోరణి వాళ్ళ మంటుంటారు జగన్‌ కుటుంబం.

3.     బిజెపి, ఎం.ఐ.యంలు, నేరుగా రెండు మతాలకు చెందిన వారుగా ఉంటూనే, ఎదుటి వారే మతతత్త్వ వాదులనీ, తాము సెక్కులరిస్టులమేననీ బుకాయించబోతారు.

4.     ఎర్రజెండాలోని కొందరిని మినహాయించితే, అన్ని పార్టీలలోనూ, ఉన్న వారిలో 99% ఆస్థికులే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రకరకాల మూఢనమ్మకాలతో అంటకాగుతున్న వాళ్ళే.

కె.ఎ.పాల్‌ :- సుమారుగా మతిస్థిరంతప్పిన ప్రగల్భాలరాయుడు. క్రీస్తు తన చేయిలోని వాడేనన్నట్లు, తన ఆశీర్వచనాల వల్ల ప్రపంచంలో ఎందరో రాజ్యాధినేతలైనట్లు పిట్టలదొర మాదిరి ఉట్టుట్టిగనే అరుస్తుంటాడు. ప్రపంచంలో 140 దేశాల అధినేతలు తన శిష్యులే నంటున్నాడు మొన్న టివిలో. చంద్రబాబును ఆశీర్వదించాడు. టి.డి.పి., బిజెపిలను క్రీస్తు ఆశీర్వదించమన్నాడనీ అనేశాడు.

ఇన్నీ అని, మీరు అధికారంలోకి వచ్చాక, అధికారంలో మాకూ ఒక కుర్చీ ఇవ్వండని ప్రాదేయపడి, ఈ మాట మరిచిపోకుండా గుర్తుంచుకోండని వేడుకున్నాడు.

కొన్ని ప్రశ్నలూ - సమాధానాలు


జ  గత 67 ఏండ్లలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఒక్కలాగే తేలిన నిజం ఏమిటో తెలుసా?

    ఓటరంత బుద్ది హీనుడు ఈ దేశంలో మరెవ్వరూ లేరన్నదే అది.

జ  రాజకీయ నాయకులు ప్రతిసారీ ఆడుతూ వచ్చిన పెద్ద అబద్దం ఏమిటో తెలుసా?

    ఓటరంత విచక్షణా శక్తి కలవారు మరెవ్వరూ లేరు. వారు సరైన సమయంలో సరైన తీర్పు చెప్పారు, అన్నదే అది.

జ     అన్ని ఎన్నికలలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన అంశమేదో తెలుసా?

    2 లక్షల ఓట్లు వచ్చిన అభ్యర్థి ఓడినట్లు 2 లక్షల ఒక్క ఓటువచ్చిన అభ్యర్థి గెలిచినట్లు నిర్ణయించి, 2 లక్షల ఓట్లకు సున్నా విలువలను కట్టబెట్టిన ఎన్నికల విధానమే ఆ అంశం -

జ      అంతే కీలకమైన అప్రజాస్వామిక మనదగ్గ మరో అంశాన్ని చెప్పగలవా?

    విని అర్థం చేసుకోగలిగే తలనీకుండాలేగాని, చెప్పడానికి అలాంటివి చాలానే ఉన్నేౖ. ఇదిగో అలాంటి మరోటి. గత 67 ఏండ్లలోనూ 30% ఓట్లు వచ్చినవారే అధికారం చెలాయిస్తున్నారు 70% ఓట్లు చెల్లకుండా కొన్ని, ప్రతిపక్ష స్థానాన్నివ్వడానికి కొన్ని, ఉపయోగపడుతూ వచ్చినై

జ  చాలా చెప్పవచ్చన్నావు కదా! మరోటి చెప్పు అలాటి అంశాన్ని?

    తప్పుడు ఓటర్ల జాబితా + రిగ్గింగులను మినహాయించితే, 50% ఓటర్లె ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం కాదంటావా?

జ  ఈ ఒక్కసారి అడుగుతాను, చాలా ఉన్నాయలాటివన్నావు కదా! పై వాటికి దీటైన అలాంటిదే మరొక అంశాన్ని చెప్పుచూద్దాం.

    ఏమి ఉబలాటం తండ్రీ! మరోటి, మరోటంటూ ఎన్నడుగుతావు? విని ఏమి చేస్తావు? మరికొన్నింటికీ లేదా అన్నటికీ సరిపెట్టుకోదగిన ఒక్క విషయం చెప్పి ఆగుతాను. నిజమో కాదో తెల్చుకో! నిజమేననిపిస్తే ఏమి చేస్తే బాగుంటుందోనూ ఆలోచించుకో.

జ  ప్రజాస్వామ్యంలో, ఓటరు ఓటే యడమంటే, తన ప్రతినిధిగా '5' ఏండ్లపాటు ఎవడు ఉండదగిన వాడో, తనకు తానుగా నిర్ణయించుకుని, ఆ నిర్ణయాన్ని ప్రకటించడమని. మరి ఆ పని చేయాలంటే తన తరపున ఉండదగిన వానినిగా ఎంచుకొనబోయే వ్యక్తి గురించి ఏమేమి తెలుసుండాలి?

1.     అభ్యర్థి ఏ ప్రాంతపు జనులకు ప్రతినిధిగా ఉండగోరుతున్నాడో ఆ ప్రాంతాన్ని గురించి అతనికి క్షుణ్ణంగా తెలిసుండాలి. అంటే ఆ ప్రాంతపు; అందరికీ వర్తించే అవసరాలు, ఎక్కువ మందికి వర్తించే అవసరాలు, కొద్ది మందికి వర్తించే అవసరాలు, విడివిడి వ్యక్తులకు సంబంధించిన అవసరాలు అన్న ప్రాధాన్యతా క్రమాన్ని గుర్తెరిగి పాటిటించే వాడైఉండాలి.

2.     వాటిని నెరవేర్చెందుకు ప్రభుత్వం తరపునుండి అందగల వనరుల; (తానుగా చేయగలిగినవి పాలన క్రమంలో అందివచ్చేటివి అన్న రకాలుంటాయి అందులో) గురించిన అవగాహన కలిగి ఉండాలి.

3.     ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలపై పెత్తందారీగా కాక, వారి ప్రతినిధిగా ఉండే వైఖరి కలిగి ఉండాలి.

4.     చట్ట సభలలో గాని, స్థానిక ప్రభుత్వాల సంబంధంగాగానీ ఎన్నికైతే, ఆమేరకు అందరికీ చెందిన వానిలా ప్రవర్తించగలిగి ఉండడం.

5.     రాజకీయాధికారం; సంపాదన కొరకు గాని, ప్రజలపై పెత్తనం చేయడానికి గానీ ఏర్పరచుకున్నది కాదని, అది అత్యున్నత సేవారంగమని, ప్రజలే అసలైన యజమానులనీ ఎరుక గలిగి దానికి తగినట్లు మసలుతుండాలి.

6.     ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేది గాకాక, ఓటరు కావాలని ఎంపిక చేసుకునేదిగా ఉండాలి ఆ ఎన్నిక.

జ  ప్రజాస్వామ్య బద్ద ఎన్నిక అంటే పై విధానంలో జరిగిన ఎంపికే అన్నంత వరకు కాదనేందుకే మీలేదు. కానీ మన అనుభవంలో వీటిలో ఏ ఒక్కటి అమలు కావడంలేదు. నిజమా? కాదా?

జ  పార్టీ స్వామ్యమే లేదా పార్టీల కూటమి స్వామ్యమే, ప్రస్తుతం ప్రజాస్వామ్యం పేరిట నడుస్తోంది. అక్కడ కూడా అతి కొద్ది మంది ఆధిపత్యమే చలామణి అవుతుంటుంది. ముఖ్యమైన పార్టీలలోనైతే ఏకనాయక స్వామ్యమే నడుస్తోంది. అవునా? కాదా?

జ     ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుగా పార్టీ, మతం, కులం, వర్గం, ప్రాంతం, లింగం, మంద మనస్తత్వాన్ని వాడుకునే అనుచర నాయకత్వం, అన్నవి బలంగా పని చేస్తున్నై. నిజమా? కాదా?

జ  అభ్యర్ధులుగా నిలబడే వారున్నూ తమ వ్యక్తిగత ప్రయోజనాల నెవరు నెరవేరుస్తారో ఆ పార్టీల వైపు మొగ్గడమూజరుగుతోంది.

జ      వీటన్నింటికంటే బలమైందిగానూ, మరింత సాధారణ రూపంలోనూ, డబ్బు, మందు, విందులను అందించడం అన్నదీ జరుగుతూ వస్తోంది. నిజమా? కాదా?

జ     ఇలా చిన్న చిన్న తాయిలాలకు చేయిచాచని మధ్యతరగతి ఓటర్లు, (ఉద్యోగుల, విద్యాధికులు, పట్టణాలలోని రకరకాల వ్యాపారస్తులు) అస్సల ఓటు వేయడానికి రాకపోవడమూ జరుగుతోంది. నిజమా? కాదా?

ఇదంతా అప్రజాస్వామికం కాక మరేమిటంటావు? జరుగుతున్నదంతా అప్రజాస్వామికమే.


ఉదా : ఈ ఎన్నికలలో ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థి, 10 నుండి 15 కోట్లు ఖర్చు పెట్టాల్ని ఉంటుందని ముఖ్యమైన పార్టీలన్నీ చెపుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఒక లోకసభ స్థానానికి 30 నుండి 50 కోట్లు ఖర్చు అంచనా వేయబడుతోంది. అలా బలమైన పార్టీలన్నీ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణా, సీమాంధ్రలు రెంటికీ కలిపి, ప్రధాన పార్టీలుగా పోటీపడుతున్న టి.డి.పి, కాంగ్రెసు, టి.ఆర్‌.యస్‌, వైకాపా, బిజెపిల వరకు తీసుకున్నా, లెక్కల కొచ్చే లెక్కకు రాని మొత్తమంతా కలిపి; 10 వేల కోట్లు రూపాయల వరకుంటుందంటే, తెలియని వారికి ఆశ్చర్యంగానే ఉంటుంది గానీ, వాటిలోతుపాతులెరిగిన వారికి ఆశ్చర్య మనిపించదు.

1.డబ్బు, 2.కూలి, 3.మందు, 4.బిర్యాని, 5.రానుపోను ఖర్చులు ఇచ్చి జనాన్ని తరలించని బహిరంగ సభలు ఉండడమేలేదు. ఎలెక్షన్ల సందర్భంగా ఇదో వ్యాపారం క్రిందనూ మారిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద గ్రంథమవుతుంది. ఒక పెద్ద సభకు, అంటే సుమారు లక్షకుపైగా సమీకరణ జరిగిన సభకు, దినవారీకూలి (ఇది 200 నుండి 500 వరకు ఉంటోంది) రవాణా చార్జీలు, భోజనము, మద్యము అన్న వాటికన్నింటికీ కలిపి తలకు 500రు అవుతుందనుకున్నా లక్ష þ 500 = 5 కోట్ల రూపాయలు అవుతోంది, సభ ఏర్పాట్లకు, నాయకుల రాక పోకలు వగైరాలకు మరో రెండు కోట్లు అవుతుంది. మరింత మందిని సమీకరించాలనుకుంటే లెక్క ప్రకారం దానికి తగ్గట్టు లెక్క పెరుగుతుంటుంది.

కొన్ని నియోజక వర్గాలలో, ఎన్నికలబరిలో 10 నుండి 30 మంది వరకూ నిలబడుతున్నారు. ఉదా - మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి 30 మందికిపైగా అభ్యర్థులున్నారు. 32 లక్షల పైగా ఓటర్లున్నారు. అంటే అందులో పోలయ్యేది ఎంత? గతంలోనైతే 50% పోలయ్యేవేమొగానీ, ఈతూరి మాత్రం రకరకాల కారణాల వల్ల అక్కడ 60% పోలవ్వవచ్చు. కనుక 15, 18%ఓట్లు వేయించుకోగల వారు విజయ అవకాశాలున్న వారి జాబితాలో చేరిపోతారు. 1. టిడిపి + బిజెపి 2. టి.ఆర్‌.ఎస్‌, 3. కాంగ్రెసు 4. వైకాపా 5. లోక్‌సత్తా 6. కె. నాగేశ్వర్‌లు ప్రధానంగా పోటీలో ఉంటారు. అంటే 4 లక్షల ఓట్లు వేయించుకోగలిగితే గెలుపు పొందవచ్చన్నమాట. నా అంచనా ప్రకారం ఈ అంకెకు దగ్గరగా టి.డి.పి, టి.ఆర్‌ఎస్‌, కాంగ్రెసు, లుంటాయి. వైకాపా కొంతవరకు కాంగ్రెసు ఓట్లు చీలుస్తూ టిఆర్‌యస్‌కు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లోక్‌సభ స్థానపు పరిధి క్రిందికి వచ్చే అసెంబ్లీ నియోజక వర్గాలలో జె.పి గానీ, కె. నాగేశ్వర్‌కు గానీ తమ వారనదగ్గ అభ్యర్దులుండరుగనక వారిరువురికీ 4 లక్షల ఓట్లు రావడం కష్టం. కనుక ఓడిపోడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. మేధావు లిద్దరూ పోటీపడి, తమ కంటే ఎంతో కొంత తక్కువ అర్హత ఉన్నవారే ఎన్నికయ్యేందుకపరోక్షంగా దోహదపడుతున్నారన్నమాట.

రాయితీలు - రుణాల మాఫీ, అదనపు వివరాలు


ఉద్యోగుల జీతాలు కట్టడానికి తికాణా లేదు ఉన్నబడ్జెట్టునుండి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ తలకో 70,, 80 వేల అప్పుల భారముంది పౌరులపైన, ప్రతిపార్టీ కూడా ఆచరణ సాధ్యంకాని హామీలను చేసేస్తూవస్తోంది. ఒకతను లక్షలోపు రుణాలు రద్దు చేస్తానంటాడు, మరొకడు లక్షేమి ఖర్మ రెండు లక్షలలోపు రుణాలు రద్దు చేస్తానంటాడు. కె.సి.ఆర్‌ అయితే ఒక్కోనికి 3 లక్షలు పెట్టి, రూపాయి తిరిగి చెల్లించనక్కరలేకుండా ఇళ్ళు కట్టిస్తానంటున్నాడు. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామని మరొకరు చెపుతారు. బిసిల సంక్షేమానికి 5, 6 వేల కోట్లు కేటాయిస్తానంటారు వేరొకరు. 10 సం||లు టాక్స్‌లు కట్టనక్కరలేదంటారు మరో అధినేత, ఇలా ఎవరిష్టమెచ్చినట్లు వారు వరాల వర్షాలు కురింపించేస్తున్నారు. వీరందరినీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో నేనడుగుతున్నది ఒక్కటే ...

రుణాలు మాఫీ చేయడానికీ, రాయితీ లివ్వడానికి, తిరిగివ్వక్కరలేని రీతిలో ఇళ్ళు కట్టివ్వడానికీ, హజ్‌యాత్రకు డబ్బులు కేటాయించడానికి అదేమైనా మీ స్వార్జితమా? పిత్రార్జితమా? ప్రజాధనాన్ని అంటే అందరి నుండి పన్నుల రూపంలో సేకరించిన డబ్బును, కొందరికి అదీ ఓట్లడగడానికి వచ్చిన సందర్భంలో ఊరికే ఇచ్చేస్థామనడం ఎలా సరైందవుంతుంది. ఇంతకూ ఈ వాగ్థానాలన్నింటిని ఆయా పార్టీలకు చెందిన 1వ నంబరు స్థానంలోని వారే ప్రకటించేస్తుంటారేమిటి? తనకు పట్టంకడితే తాను వరాలిస్తాడన్నమాట.

ప్రజాస్వామ్య పద్దతిననుసరించి నాకున్న అవగాహనను బట్టి అయితే ఈ వరాలు, వాగ్ధానాలు, చేసిన ప్రతివాణ్ణీ; ఒక్క ఆ మాట అన్నందుకే (వాళ్ళను) మా ప్రతినిధిగా నీవు పనికిరావురా! ఇక ఇంటికెళ్ళు అని పంపించేయాలి.

1.    పాలన నిర్వహణలకూ, అభివృద్ధి అవసరాలకు ఉన్న డబ్బు చాలక, వడ్డీలకు ప్రపంచం నుండి అప్పులు తెస్తూ, వడ్డీలేని రుణాలిస్తావన్నమాట.

2.     తీసుకున్న రుణాలు గట్టిగా వసూలు చేయాల్సిందిపోయి, ఓట్లకోసం ఆ రుణాలు మాఫీ చేసి, ఆ భారం మిగిలిన, ఆ రకంగా డబ్బు వాడుకోని - వారినెత్తిన పెడతావన్నమాట.

3.     అందరికీ ప్రయోజన కరమైన ప్రాజెక్టులు, విద్యా, వైద్య  రంగాలకు కేటాయించిన నిధులను వాటికి తగ్గించి, ఇలా ఎన్నకల వాగ్థానాలు నెరవేర్చడానికి తరలిస్తారన్నమాట.

ప్రజాస్వామ్య స్ఫూర్తి సక్రమంగా అమలవుతుండాలంటే కనీసం రెండు ప్రక్రియలు చక్కగా ఆచరణలో ఉండాలి


1.     ముఖ్యమైన, కీలకమైన అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ వాటిని; జనరల్‌ బాడీ సమావేశం ముందు చర్చకు పెట్టడం.

2.     ఆ జనరల్‌ బాడీ ఎంపిక చేసిన నిపుణులతోను కలుపుకుని ఉన్న అఖిల పక్ష కమిటీ ముందుకు ఆ అంశాన్ని తేవడం.

గమనిక :- వ్యవస్థకు సంబంధించినంతలో అసెంబ్లీ, పార్లమెంటులు జనరల్‌ బాడీ క్రిందికి వస్తాయి. పార్టీ రహిత ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యానికి సార్థక రూపమైనా, ప్రస్తుతం నడుస్తున్నది పార్టీ సహిత ప్రజాస్వామ్యమేగనక, పార్టీల రూపంలోనే ప్రతినిధులుంటున్నారు కనుక, అన్ని పార్టీల అధికారిక ప్రతినిధులతో కూడిన బృందమే అఖిల పక్ష కమిటీ అనదగి ఉంటుంది.

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చట్ట సభల్లో మెజారిటీ ఉండడాన్ని బట్టి, ఒకే పార్టీనో రెండు మూడు కలసో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా, నిజానికది ప్రజలందరికీ ప్రాతినిద్యం వహించజాలదు. కనుకనే ప్రభుత్వం సభకు (అసెంబ్లీకో, పార్లమెంటుకో) జవాబుదారీగా ఉండాలన్న నియమం ఏర్పడింది. అలా జరిగినప్పుడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించడానికి తగి ఉంటాయి. ప్రస్తుతం ఆచరణలో అత్యంత కీలకమైన ఈ విధానం తిరగబడి నడుస్తోంది. ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటిస్తే క్యాబినెట్‌ సరేననడమో, వంతపాడడమో జరుగుతోంది. ఆ పిమ్మట చట్టం ప్రకారం దానిని సభముందుంచాలి గనుక ఉంచుతున్నారే గాని, సభల అభిప్రాయాలకు పరిగణన ఏ మాత్రం ఉండడంలేదు.

అఖిల పక్ష కమిటీ + నిపుణుల కమిటీల ఏర్పాటుకై ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.

Tuesday, October 1, 2013

సంపాదకీయం

రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ సంక్షోభాన్ని చూస్తుంటే, దేశం ఎటుపోతోంది? ఏమైపోవనుంది అన్న ఆందోళన కలుగుతోంది. ఒక్కడంటే ఒక్కడూ, సభ్యతా సంస్కారాలతోగానీ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యంగా గానీ, మాట్లాడుతున్న దాఖలా లేదు. జనంలో ఆవేశాలను రగిలించే పనినీ దాటి రాను రాను బూతులు తిట్టుకోవడంలోనూ పోటీ పడుతున్నారు. ఏ ఛానల్‌ను చూద్దామన్నా కనపడే దృశ్యాలూ, వినపడే మాటలూ ఒక్క తీరునే ఉంటున్నాయి. పెద్ద తరహా మనుషులకైతే అసహ్యాన్నీ కలిగిస్తున్నాయి. డబ్బులున్నాయి, పదవులున్నాయి వెంటమందా ఉంది కనక డాబూ దర్పం ప్రదర్శించడానికే అడ్డూ ఆపు ఉండడం లేదు గాని, నోరు తెరిస్తే చాలు వీళ్ళంతా ఎంత దిగజారిన (హీన) స్థాయి మనుషులో ఇట్టే తెలిసిపోతూ ఉంది.
పాలన పరమైన ఏ విషయాన్ని తీసుకున్నా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వివక్ష పర్వతాకారంలో దర్శనమిస్తున్నాయి. దిక్కుమాలిన మంద, మందినెత్తిన పెత్తందారులై కూర్చుని, దేశానికే ప్రాణ స్థానీయమైన వ్యవసాయానికి ఆధారమైయున్న నీటి వనరుల్ని సంరక్షించుకునే, సద్వినియోగం చేసుకునే పనిలోనూ తప్పుడు పోకడలేపోతున్నారు. 40 ఏండ్ల క్రితం మొదలెట్టిన ఆనకట్టల నిర్మాణాలూ పూర్తికాలేదిప్పటికీ, ఆనాడు 4, 5 వందల కోట్లతో 2, 3 ఏండ్లలో నిర్మించగలమనుకున్నవి కాలం మారింది, ధరలు పెరిగాయి అన్న ఒకే ఒక ఒంకతో, వాస్తవంగా పెరిగిన ధరలకనుగుణ్యంగాకాక, అందుకు అనేకరెట్లు పెంచి తలాయింత దండుకుంటున్నారు. కట్టవలసి ఉన్న ప్రాజెక్టులన్నింటిపైనా 'లక్షా ఎనభై వేల కోట్లకు టెండర్లు పిలిచినట్లు, సుమారు 80, 90 వేల కోట్లు విడుదలైనట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ఆ దామాషా ప్రకారం జరగాల్సిన పనులు థాబ్దాలు గడిచినా జరగనేలేదు. విడుదలచేసిన ఆ డబ్బులో ఎవరెవరికెంత ముట్టిందో, అసలు నిర్మాణం పనికి ఎంత చేరిందో తెలుసుకోగలిగితే సామాన్యుల గుండెలైతే ఆగిపోతాయి కూడా. పరాన్న భుక్కులు, రక్తం పీల్చే జలగలు అన్న పదాలు 100% వీరికి సరిపోతాయి.
ఒక్క ఉదాహరణ చెపుతాను 1988 నాడు ఎన్‌.టి. రామారావుగారు పులిచింతలకు శంకుస్థాపన చేసే నాటికి ప్రాజెక్టు నిర్మాణ వ్యయపు అంచనా 270 కోట్లు. 95 నాటికి దానిని 500 కోట్లన్నారు.
2011 నాటికి అది 1300 కోట్లయ్యింది. వాస్తవంగా నిర్మాణవేగం పెంచిందీ సమయం నుండే. గట్టిగా పూనుకుంటే 2 1/2 సం||లలో పూర్తి చేయగల నిర్మాణమది. సంకల్పించి 26 ఏండ్లు దాటింది. ప్రస్తుతం దాని నిర్మాణ వ్యయాన్ని 2,600 కోట్లంటున్నారు. మూడు వేల కోట్లని తలాకాస్త పంచుకున్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇదీ పరిస్థితి.
రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో మనమంతా 'ఒకేజాతి, ఒకే ప్రజ, దేశమంతా ఏకఖండమే' సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం, అన్న రెంటి కొరకుగా గీసుకున్నవే (ఏర్పరచుకున్నవే) రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులన్నీ. ఈ విషయాన్నంగీకరించకుండా చేసే వాదనలుగానీ, కోరే కోర్కెలు గానీ, మరేవైనా గానీ, రాజ్యాంగానుకూలమైనవి మాత్రం కాజాలవు.
కేంద్రం తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని 3.10.2013 రాత్రి ప్రకటన వెలువడ్డ వెంటనే టిడిపి నేత చంద్రబాబు గారు, వైకాపా నేత జగన్‌గారూ (చంద్రన్న, జగనన్న గార్ల) రెండు ప్రకటనలు విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి 4.10.2013 నాటి దినపత్రికలో వచ్చాయా వివరాలు.
చంద్రబాబు గారి ప్రకారం :- సోనియా గాంధీ (కాంగ్రెసు)కి, టి.ఆర్‌.ఎస్‌, వైకాపాలతో అవగాహనుంది.
జగన్‌గారి ప్రకారం :- ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, చంద్రబాబు కలసి పొయ్యారు.
ఏమిటీ ప్రకటనలు? సిగ్గుపడే లక్షణం లేకపోవడం వల్లే, ఇంత విడ్డూరమైన వార్తలు వస్తున్నాయి. జనం ఇదేమిటని అడగరు సరికదా ఎవరి దొరని వాళ్ళు భుజాలకెత్తుకుని మోస్తుంటారు. ఈ దేశానికిది ఎంత విషాదకర పరిస్థితి?!
ఇవి చాలదన్నట్లూ, మేమూ ఆ బళ్ళో చదువుకున్నవాళ్ళమేనని చెప్పాలనో, మిగిలిన నాయకులూ ఇదే బాటన నడుస్తున్నారు. ప్రతివాడు మిగిలిన వారిని కాంగ్రెసుతో కుమ్మక్కైయారని బల్లగుద్ది మరీ ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ మొత్తానికి అసలు కారణం -మూలవేరు -ఎక్కడుందో తెలుసా? గింత విత్తానికీ, కూసింత మత్తునీళ్ళకీ లొంగి, ఈ రకాన్నంతా ఎంపిక చేసి నెత్తికెత్తుకున్నారు చూడండి, ఆ బుద్దిహీనులైన ఓటర్ల మెదళ్ళలో ఉంది. తరవాతి కారణం, తిన్నదరగనంత సంపాదించుకుంటూనే, గింత చదువు సంధ్యా ఉండీ ఓటు వేయకుండా ఇండ్లలో పండడమో, క్లబ్బుల్లో వుండడమో చేస్తుండే రకం ఓటర్లు. మొత్తంమ్మీద ఈ పాపం అనర్హుల్ని ఎన్నుకున్న ఓటర్లదే. కనుక అనుభవించాల్సింది వాళ్ళే.
మేధావుల కర్తవ్యం
ధర్మ పక్షానికీ, అధర్మపక్షానికీ నేతృత్వం వహించేది మేధావులే. సామాన్యులు ఆ తలగలవాళ్ళకు శరీరంగా (భౌతిక శక్తిగా) పని చేస్తుంటారంతే. కనుకనే సామాజిక స్థితికీ, గతికీ కూడా మేధావులు నిమిత్త కారణం అవుతుంటారు.
ఎప్పటికప్పుడు అప్పటికున్న థ నుండి సమాజాన్ని నడిపించడానికి దిశా నిర్ధేశం చేస్తూ, చోదక శక్తిగా ఉంది, ఉంటున్నది ఉండగలిగిందీ కూడా మేధావులే.
చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే, మంచివాళ్ళ మౌనం మరింత ప్రమాదకరమైంది.
అసాంఘిక శక్తులింతగా పెచ్చరిల్లుతున్నాయంటే అందుకు కారణం అభ్యుదయ శక్తులు అసంఘటితంగా ఉండడమే.
సమర్థత ఉండీ అధర్మాన్ని నిలువరించక ఎవడు ఉపేక్ష వహిస్తాడో వాడు సమూలంగా నశిస్తాడు.
ఇలాటి సూక్తులు - కాచివడపోసిన సూత్రీకరణలు - అన్నీ మేధావుల నుద్దేశించి, వాళ్ళ కర్తవ్యాన్ని గురించి హెచ్చరిస్తున్నవే. మేధావులు మూడు సమూహాలుగ (రకాలుగా) ఉంటున్నారు. (1) దుష్ట మేధావులు (2) శిష్టమేధావులు (3) నిర్లిప్తమేధావులు ఈనాటి అపసవ్యతలలో ఎక్కువలో ఎక్కువ ఆ ముగ్గురిలోనూ ఒకటవరకం సాగిస్తున్న దురాగతాలే. ఇక శిష్టమేధావులు కొద్దిమంది ఉన్నా వారంతా ఎవరెవరి ప్రాధాన్యతలననుసరించి వారు, వారెంచుకున్న క్షేత్రాలలో క్రియాశీలంగా పని చేస్తూ పోతుంటారు. ఈ రకం క్రిందికి వచ్చేవారిలో ఎక్కువ మంది ప్రక్కవారితో కలవరు, కలుపుకుపోరు. వీరిలో నున్న స్వతంత్రాలోచనాశీలతే, తన అవగాహనపైనా నిర్ణయాలపైనా తనకున్న తనదే సరైందన్న దృష్టే; ఇతరులు చెపుతున్న దానిని సరిగా విననీయదు, పునరాలోచన చేయనీయదు. ఇలాటి మంచివారైన మేధావుల్ని బహుగా అనుభవంలో చూడడం ద్వారానే ఒక నానుడి పుట్టింది. ''సామాన్యుల్ని వెయ్యి మందినైనా ఒక బాటంట నడిపించవచ్చుగానీ, ఆలోచనా పరుల్ని నలుగుర్ని కొద్దికాలం కూడా ఏకబాటన నడపలేము'' అన్నదే అది. నలుగురు ఆలోచనాపరులూ ఏకాభిప్రాయానికి రాకపోగా, రాలేకపోగా, ఏకాభిప్రాయానికి వస్తే వాళ్ళు మేధావులెందుకవుతారయ్యా, అనే వాదననూ ముందుకు తెస్తున్నారు కొందరు. భిన్నాభిప్రాయాలున్న అంశాల్ని తాత్కాలికంగానైనా ప్రక్కనబెట్టి, వచ్చిపై బడ్డ అత్యవసర విషయాలలో, సమానాభిప్రాయం ఉన్న వరకైనా (తక్షణావసరము, మౌలికమునైన వాటివరకైనా) కలసి కదలగలిగితే ఎంత బావుణ్ణు
వీరిరువురూ కాక మిగిలిన మూడోరకం మేధావులు నిర్లిప్తమేధావులు. వీరికి విషయాలు అవగతమవుతూనే ఉన్నా, కొంత మేర పరిష్కారాలనూ సూచించగల మేధోసామర్ధ్యమున్నా, దేనినీ పట్టించుకోరు. ఎక్కడన్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అప్పటి కనిపించింది మాట్లాడేసి, ఇవన్నీ మాకూ తెలుసులేవో, ఊరకే వ్యర్ధ ప్రయత్నాలెందుకు చేస్తారు! ఊరుకుండండంటూ మరికాస్త నీరసాన్ని ఇంజెక్టు చేస్తారు పనిచేస్తున్న వాళ్ళకి. ఈ వర్గమే క్రియాశీల మేధావులకంటే అధికంగా ఉంటోంది.
దుష్ట మేధావులేమో స్వార్థ ప్రయోజనాలుంటాయి కనుక కలవగలిగిన ప్రతిచోటా కలిసిపోతూ, వచ్చిదాంట్లో వాటాలు పంచుకుంటూ సాగుతున్నారు. శిష్ఠమేధావులు తామనుకున్న దానికి పరిమితమై, కలసిపని చేయడానికంత సుముఖంగా లేరు, ఇక మూడోరకం మాటలకు పరిమితమై, పనికి సిద్దం కారు, పని చేసే వారిని వెనక్కులాగుతుంటారు.
స్వతంత్ర యోచనాశీలురైన మేధావులారా! ఇదే మనందరి ముందున్న, సమాజం ముందున్న అసలు సమస్య. దీని నుండి సమాజమనే శరీరంలో తలభాగానికి ప్రతీక అనదగ్గ శిష్ట మేధావులు ఉన్న నలుగురూ కలసి, నిర్లిప్త మేధావులలో కదలిక తేగలిగినంత వరకైనా వారినీ చైతన్యపరచి, అందరం కట్టగట్టుకుని దుష్టమేధావుల కుటిలయత్నాలను భగ్నం చేయడమూ, ప్రజా సంక్షేమానికి తగిన దిశా నిర్ధేశం చేస్తూ జన సమూహాన్ని ఆ దిశగా కార్యోన్ముఖులను చేయడము అన్న పనికై ఉద్యమించాల్సి ఉంది. ఈరకం పూనుకోకుండా ఈ దేశ ప్రజలకు కోరదగ్గ భవిష్యత్తే లేదు. అభ్యుదయ శక్తులు సంఘటితం కావడమన్నదగ్గరే అస్సలు సిసలు పరిష్కారం ఉంది. సామరస్య పూర్వక సహకార సంబంధాలే వర్తమాన సామాజికావశ్యకత అన్నది గమనించండి.
స్పందన - ప్రతిస్పందన
స్పం :- (1) :-  హేతువాదం తత్వం, సిద్దాంతం, సూత్రం, విధానంపై మీరు ఇంత కూలంకషంగా, వివరంగా వ్రాయడం సంతోషాన్ని కలిగించింది. ఇది మంచి సామాజిక పరిణామం. ఆశాజనకం. ఈ విషయంలో మిమ్ము మరోసారి అభినందిస్తున్నాను. 24-7-2013 నాటి లేఖ.
భువనగిరి నుండి మూర్తిగారి జనార్ధన్‌ గారిలా వ్రాస్తున్నారు మీరు చేస్తున్న హేతువాద పునర్వికాస యత్నానికి అభినందనలు. హేతువాదము, మరియు హేతువాద ఉద్యమ వికాసానికి చేపట్టవలసిన కార్యక్రమాలను మిత్రులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా హేతువాద ఉద్యమాన్ని సామాన్య ప్రజలవద్దకు తీసుకురావాలి. కేవలం వేదిక వరకే పరిమితమైతే విస్తరించదు. హేతువాదం అందరికీ కావాలి. హేతువాద ఉద్యమం అందరిదీ. దాని ఫలాలు అందరికీ అందాలి. అది మనందరి సామాజిక బాధ్యతగా భావించాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి. అది సహజం కనుక, మన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని నా అభిప్రాయం. 6-8-2013 నాటి లేఖ.
ప్రతి స్పందన :- మూర్తి గారి జనార్ధన్‌గారికి; ఒక విషయంలో స్పష్టత రానంత వరకు, ఎవరెన్నెన్ని మాటలు, ఎంతగా మాట్లాడినా, అసలు విషయం ఆచరణలోకి రాదు. అదేమంటే; ఇంతకూ హేతువాదమంటే ఏమిటి? హేతువాదం పేరున ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన విషయాలేమేమిటి? అన్నది స్పష్టంగా తేలకుండా ఏమి ఉద్యమం చేస్తాము? హేతువాద ఉద్యమాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకెళ్ళాలన్నారు. ఎవరు తీసుకెళ్ళాలి? ఇంతకాలం ఆ పని ఎందుకు జరగలేదు?
నాకు తెలిసి ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పుకోవాలి. భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేసే కార్యకర్తల నిర్మాణం జరగాలి. అదింత వరకూ సరైన రీతిలో, సరిపడినంతగా జరగలేదు. ఉద్యమ వ్యాప్తి సామాజికావసరమన్న విషయంగానీ, అది మన సామాజిక బాధ్యత అన్న విషయంగానీ, చేతల దాకా సాగేంత తపన లేదు ఉన్న నలుగురికైనా. కనుకనే అప్పుడప్పుడూ సందర్భం వచ్చినపుడు మాట్లాడుకోడానికో, సూచనలు, హెచ్చరికలు చేసుకోవడానికో పరిమితంగానే ఉంటోందది. ఈ విషయాన్నే సూత్రప్రాయంగా, ఉద్దేశ స్పష్టతతోబాటు తీవ్రతా ఉంటేనే పని జరుగుతుంటుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హేతువాదులమనుకుంటున్న వారిలో ఎక్కువ మందిలో ఉద్దేశ స్పష్టతలేదు. ఉన్న కొద్ది మందిలో ఉండాల్సినంత తీవ్రత లేదు. ఇదే ప్రధాన కారణం.
ఇక రెండో సమాధానం, హేతువాదాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకువెళ్ళడం ఒక పట్టాన అయ్యే పనికాదు. ముందుగా ఒకింత యోచనాపరుల దగ్గరకైనా తీసుకెళ్ళే పని చేయగలిగితే తొలిథలో అక్కడికదే గొప్ప. దీనంతటికీ ముందు సిద్దాంతం గుది గుచ్చబడాలి. లేకుంటే ఒక్కో ముఖం నుండి ఒక్కో హేతువాదం పుట్టుకొస్తుంటుంది. అందుకనే ఆ దిశగా ప్రయత్నం మొదలెట్టాను. అవగాహన, మనస్సు ఉన్న వాళ్ళు కలసిరావాలి మరి, నా వైపు నుండి మాత్రం అందరికీ ఆహ్వానమే. ఇక విమర్శలంటారా! విషయ నిష్ఠకల విమర్శల్ని ఆహ్వానించాల్సీ ఉంటుంది. నిందల్ని విమర్శలనుకునే అపోహ నుండి ఉద్యమాలు బైటపడాల్సి ఉంది. ఉద్యమ యత్నంలో పాలు పంచుకోగల మిత్రులందరికీ కబురు చేయండి.
స్పందన -2 : హైద్రాబాద్‌ నుండి ఫజులుర్‌ రహ్మాన్‌ గారిలా వ్రాశారు. 'భౌతికవాది' 2013 జులై, ఆగస్టు సంచిక 13వ పేజీలో 'విశ్వం - మనిషి' అనే అంశంపై వ్రాసిన వ్యాసంలో,
''మన మత గ్రంథాలన్నీ భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, చుక్కలు అన్నీ తిరుగుతున్నవి - అనే అన్నాయి'' అని వ్రాశారు. దాని పై నేను స్పందిస్తూ, ఒక ముస్లింగా నేను, ఖురాన్‌లో అలాంటి అర్ధాన్నిచ్చే వాక్యం ఒక్కటి కూడా లేదు కదా! మీరు తెలియక వ్రాశారా? తెలిసి వ్రాశారా? అని అడుగుదామని 10-9-13 ఉదయం లయశ్రీ గారికి ఫోను చేశాను. ఈ విషయాన్ని వివరించే యత్నం చేస్తుండగనే, ఆయన నా మాటలు వినకుండా మాట్లాడడం మొదలెట్టి, (1) ఇది సైన్సుకు సంబంధించిన విషయమని, (2) తన దగ్గరా బైబిలు, ఖురాను గ్రంథాలున్నాయని, (3) నా పుస్తకంలో నీకు నచ్చింది తీసుకో, నచ్చనిది వదిలేయ్‌ అనీ, (4) మీరు సాంప్రదాయ ముస్లింలలాగున్నారు నేను వాదనలు చేయను అనీ (5) తనకు సమయంలేదనీ అంటూ ఫోన్‌ కట్‌ చేశారు.
ఇది నాకు ఇబ్బంది కలిగించింది. మళ్ళీ ఫోన్‌ చేసి ఒక్క నిముషం సమయమడిగి, నా ప్రశ్నేమిటో తెలిపాను. నా ప్రశ్న అర్థమైందో లేదో కాని, తన దగ్గర సమయం లేదంటూ మళ్ళా ఫోన్‌ కట్‌ చేశారు. సురేంద్ర గారూ! ఇదంతా మీ కెందుకు తెలుపుతున్నానంటే; లేనిది ఉన్నట్లు చెప్పడమేనా భౌతిక వాదమంటే ? ఉంటే ఆధారం అడిగితే ఎందుకు చెప్పడంలేదు?
(2) తమ దగ్గర అంతగా సమయం లేనివారు రకరకాల పేర్లతో ఉద్యమాలు అంటూ ఎందుకు ప్రారంభిస్తున్నారు?
(3) లేని విషయాల్ని ప్రజలలోనికి ప్రచార సాధనాల ద్వారా పంపిస్తూ; ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, అనడమేమి పద్దతి?
(5) భౌతిక వాదమంటే వారు చెప్పింది ప్రశ్నించకుండా నమ్మడమని అర్ధమా?
మీ వివేకపథం పత్రిక ద్వారానైనా వివరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రతిస్పందన :- (2) మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌ గారికి; నిజానికీ లేఖాంశాలకు మలయ శ్రీ గారు సమాధానాలు చెపితేనే సమంజసంగా ఉంటుంది. అయినా మనకున్న పరిచయాన్ని బట్టీ, మీరు లేవనెత్తిన ప్రశ్నలు సాధారణ స్వభావం కలిగినవిగా ఉండడాన్ని బట్టీ సమాధానాలు వ్రాస్తున్నాను.
(1) ఎవరైనా సరే, తను ప్రకటించిన అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యత వహించితీరాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లుండకూడదు. ఇది భావజాల క్షేత్రానికి సంబంధించినంతలో నైతిక బాధ్యత అవుతుంది.
(2) నాహేతు బుద్ధికి; మలయ శ్రీ గారు (లేదా ఆవ్యాసరచయిత) ''గతంలో అన్ని మత గ్రంథాలూ, భూ కేంద్ర సిద్దాంతాన్నే సరైందనుకుంటుండేటివి'' అన్న అభిప్రాయంతో ఆ మాటలు వ్రాసి ఉంటారనిపిస్తోంది. ఖచ్చితమైన అర్థం పెట్టుకుని ఆ మాటలు వ్రాసి ఉండకపోవచ్చు. కానీ; పత్రికలో లేదా రచన రూపంలో ప్రకటించే అలాటి అభిప్రాయ ప్రకటనలకు ఆధారాలు పెట్టుకుని ఉండడం, అడిగినప్పుడు చూపించడం అన్నది సైద్దాంతిక స్థాయి కల పత్రికలకు తప్పని సరి.
(3) ఈ ముఖంగా నేను మీ ఇరుపక్షాలకూ ఒక మిత్రునిగా నిజాయితీతో చేయగల హిత సూచనేమంటే, భావ విప్లవ క్షేత్రాలలో పని చేసే వ్యక్తులూ, పత్రికలు, కథలూ, నవలల మాదిరి కాకుండా, శాస్త్రీయ వైఖరి, స్థాయి కలిగి ఉండే రీతిలో అభిప్రాయాలు ప్రకటించే విధానాన్ని స్వీకరించాలి అనుసరించాలి. ప్రశ్నించడం నేర్పుదాం అంటూ మొదలెట్టిన క్షేత్రాలూ, ప్రశ్నించకు అనడం బావుండదు కదా! అలాగే మక్కికి మక్కీ అర్థం చెప్పి మా గ్రంథం అలా ఎక్కడనింది లాంటి నిగ్గ దీసుడు కంటే, అన్నీ ఉన్నాయంటున్న ఆయా ప్రధాన మత గ్రంథాలలో దేనిననుసరిస్తున్న వారైనా, ఈ నాటి వైజ్ఞానికులు ప్రకృతిని గురించి ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్న విషయాలతో పోలనీ, విభేదించే అంశాలు మత గ్రంథాలలో ఉన్నప్పుడు, ఎదుటి వారిని అడిగినంత నిక్కచ్ఛిగానూ, తమని తామూ ప్రశ్నించుకోవడం సరైందవుతుంది. భౌతిక, అభౌతిక వాద పక్షీయు లిరువురూ దీనిని గురించి ఆలోచించవలసి ఉంది. ఏమంటారు? ఈ సందర్భానికి సరిపడిందే ఒక ఘటన చెపుతాను, చాలా కాలంగా పలు దఫాలు మూర్తిగారి జనార్థన్‌ గారు వివేక పథంలో ఇతర రచయితల రచనలకూ చోటు కల్పించండి. పత్రికలో విభిన్న భావాలకు చోటు కల్పించండి. అంటూ సూచిస్తూ వచ్చారు. ప్రతిసారీ వారికి నేను, తమ భావాలు సరైనవేనని నిరూపించే బాధ్యత కల వారెవరి రచనలనైనా స్వీకరించడానికి నేను సిద్దము. అలా కాక తమ భావాలు సబబు బేసబబులకు బాధ్యత వహించని రచనలను భరించేంత సహనంగానీ, శక్తి గాని నాకు లేవు అంటూ వచ్చాను. ఒప్పుభావాలే సమాజంలోకి వెళ్ళాలి. తప్పుభావాలను సమాజం నుండి వెళ్ళగొట్టాలనుకునే వారికీ నిష్కర్ష తప్పని సరి.
స్పం (3) :- మిత్రులు సురేంద్ర గారి కంటూ పిఠాపురం నుండి గౌరవ్‌ ఇలా వ్రాస్తున్నారు. వివేక పథం పత్రికలన్నీ తీరిక చూసుకుని చదివాను, అనేక తాత్వికాంశాల పట్ల భిన్న సైద్దాంతిక ధోరణులకు చెందిన వాదనలనన్నిటినీ సమాజహితం కోసం చర్చకు (పరీక్షకు) పెట్టే బృహత్తర కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుని, నిజాయితీగా కొనసాగిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు. మీ పట్ల కఠినంగా వ్యవహరించిన వార్ని సైతం సాదరంగా సామరస్య పూర్వక సమావేశాలకు ఆహ్వానించడం, అవాంఛనీయ శత్రుపూరిత వైఖరుల్ని విడవడానికి ముందుకు రావడం, సమాజ హితం కోరేవారందరూ కలసి పని చేయాల్సిన అవసరముందని ప్రతిపాదిస్తూ ఐక్యమిత్ర మండలి వేదికల్ని నిర్మించేందుకు కృషి చేయడం, ఇవన్నీ నాలాటి వారికి స్ఫూర్తి నిచ్చేవే. నిజానికి మన పరిచయానికి ముందే మీ మీద ఎన్నో ఆరోపణలు విన్నాను. వివేక పథాన్ని ఇప్పటి దాకా చదవడమే కుదర్లేదు. ఇప్పుడు చూస్తోంటే భావవికాసోద్యమానికి మీ వంతు చేస్తున్నారనిపిస్తోంది. మనం చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సమయం చూసుకొస్తాను. ఈ రోజు 'మద్యం' ఒక బలమైన సమస్యని నా ఉద్దేశం. దీనిపైనా చర్చించాల్సి ఉంది.
ప్ర.స్పం : (3) యోచనాశీలత కల గౌరవ్‌కు; నా గురించి మీరు గమనించినంతలో మీరు వెళ్ళడించిన అభిప్రాయాలు నన్ను మీరు సరిగనే చూస్తున్నారనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా మండలి నిర్వహించిన తత్వ చర్చావేదిక అభూత పూర్వం. ఆ వేదిక నియమనిబంధనల తీరూ అపూర్వమైనదే. ఇక ఆరోపణలంటావా! అవి పుట్టకుండా ఆపడం చాలా కష్టం. వివిధ వ్యక్తులు వివిధ దృష్టికోణాల నుండి మనల్ని చూస్తుంటారు. కనుక అలాటి వాటిలో వారి వారి రంగుల్ని మనకు పులిమే వారూ, వాస్తవాలను వెళ్ళడించేవారూ ఉంటారు. వాస్తవాలన దగ్గ వాటిని తక్షణం, నిజాయితీగా స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులూ చేసుకుంటుండాలి సత్యానికి పెద్దపీట వేయగలిగిన వారంతా. ఇక పులుముడు రూపాలను వీలైనంత వరకు సహించడం, పాఠకులకూ అవగాహన కలిగిస్తుంది, అపోహలను తొలగిస్తుందనుకుంటే ప్రతి విమర్శకు సిద్దపడడం అన్నది వివేకవంతమవుతుంది. చాలా మాట్లాడాలన్నావు కనుక వీలు చూసుకుని వీలైనంత త్వరలో కలువు.
స్పం (4) :- తూ||గోదావరి జిల్లా, గొల్లపాలెం నుండి ఆ కేటి సూరన్న (హేతువాది) గారిలా వ్రాస్తున్నారు (1) మీ వివేకపథం - 198, 200 సంచికలు చదివాను. మీ సుదీర్ఘ సత్యాన్వేషణలో హేతువాద ఉద్యమావశ్యకతను గుర్తించినందులకు చాలా సంతోషము.
(2) హేతువాదుల లక్ష్యం భావవిప్లవం. అన్ని రకాల మౌడ్యాలకు, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలమైన దైవభావన, మత భావజాలాలపై విమర్శతోనే హేతువాదం మొదలవుతుంది. ఆ తరవాత, అక్కడితో ఆగక మానవ వాదం వైపు పయనిస్తుంది.
(3) ఇప్పుడున్న హేతువాదులు అంటే హేతువాద వైఖరినంగీకరించిన వారెవరైనా, దేవునిపై నమ్మకంలేని హేతువాదిగనే తమను తాము చెప్పుకుంటారు. సమాజం కూడా ఆ అర్థంలోనే వారిని అంగీకరించుచున్నది. మిమ్మల్ని మీరు ముందుగా ఆ విధంగా హేతువాదిగా ప్రకటించుకుంటేనే, హేతువాదోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నాలు సఫలమవుతాయని నా అభిప్రాయం.
(4) అలాకాక; నేనుమెరుగైన సమాజస్థాపన లక్ష్యంగా కల్గి, అందుకు సక్రమాలోచన, మరియు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నాను కాబట్టి నేను కూడ ఆ మేరకు హేతువాదినే అనిగాని; దేవుని పై నమ్మకం లేనివానిగా నేనింకా ఆ భావజాల స్థాయికి చేరలేదనిగాని, అసలా విషయం అంత ముఖ్యం కాదనిగానీ, దేవుని ఉనికి విషయంలో ఎలా ఆస్థికవాదం రుజువు కాలేదో అలానే హేతువాదమూ రుజువు కాలేదు. కనుక నేను మూడవ పక్షంవైపు ఉన్నానని పాత పాఠమే చెపుతుంటేగాని, హేతువాద సంఘాలు మీ భాగస్వామి పాత్రను అంగీకరించవు. మీ దగ్గరకు చేరవుకూడా.
(5) మీరు ప్రయత్నించే హేతువాద పునర్నిర్మాణ కార్యక్రమంలో, మీ నూతన హేతువాద నిర్వచనంలో; హేతుబద్దాలోచన ముందుగా దైవ భావనపై సంధించుట దాని ప్రధాన లక్ష్యం కాదన్నా, దాని అనుబంధ పదాల అర్థాలు ఎంత వివరించి చెప్పినా, దాని తాత్విక విధానాన్ని మార్చినా, ఆ విధమైన హేతువాదంతో ఎంత మందిని ఏకాభిప్రాయానికి తీసుకురాగలరో ఆలోచించగలరు. ఇందుకు భావసారూప్యత గల సంఘాలు అసలే అంగీకరించవు.
కాబట్టి నా సలహా ఏమంటే, గతంలో వివేకపథం 186, 188 సంచికలాధారంగా నేను వ్రాసిన విధానాన్ని సూచనలను ఆధారం చేసికుని, మీ మండలి స్థాయిని తగ్గించుకోకుండగనే, కృషి చేస్తే మంచిదని నా అభిప్రాయం - ఇందులో ఆ నాటి లేఖ కాఫీని కూడా జత చేస్తున్నాను.
ప్ర స్పం :- యోచనాశీలురూ మిత్రులూ సూరన్నగారికి; మీ లేఖా రీతి మీలోని సమాజం బాగుండాలన్న ఆకాంక్షను తెలుపుతోంది. దాంతో బాటు కొన్ని అభిప్రాయాల విషయంలో నాతో విభేధిస్తున్నట్లూ, అయినా నన్ను వ్యతిరేక (శతృ) వర్గం వాణ్ణిగా కాక, మిత్ర వర్గానికి చెందిన వాణ్నిగనే తలంచుతున్నట్లూ తోపింపజేస్తోంది. మీ రెండు లేఖాంశాలూ కేవలం మన ఇరువురికి సంబంధించినవిగా మాత్రమేగాక, సమాజావగాహనకూ పనికి  వచ్చేవిగానూ, ఆలోచించదగినవిగానూ ఉండడంవల్ల, ఆలోచనాపరుల ఆలోచనకకు దోహదపడతాయనిపించిన రీతిలో అంశాల వారీగా ఒకింత విశ్లేషణ చేయడం మంచిదనిపించింది. అందుకే ఈ లేఖ ఈ రీతిగా పాఠకుల ముందుకు తెస్తున్నాను. మీరూ ఆలోచించండి.
(1) నిజానికి మీరనుకున్నట్లు; హేతువాద ఉద్యమావశ్యకతను నేనీనాడు కాదు గుర్తించింది, ఆధ్యాత్మిక జీవితంవైపుకు మరలిన నాడే గుర్తించాను. ఆ మార్గంలో కొంతదూరం నడిచాక 1981 ప్రాంతాలలో పెంచలయ్యగారితో భేటీపడి నేనెత్తుకున్న ఆస్థికపక్షాన్ని స్థాపించలేని క్షణం నుండి అది మరింత బలం పుంజుకుంది. అనంతరం ప్రమాణక్షేత్రాల నెరిగి, దానిని వినియోగించుకోవడంలో ఒకింత పట్టుదొరికాక, హేతుబద్దాలోచనశక్తి, పరిమితులూ కూడా బోధ పడిస్థిరపడింది. అనంతరం జీవితం కొంత వరకు అర్థమైందనుకున్నాక, సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న భావజాలంలోని లోటుపాట్లు కొంతమేర వరికయ్యాక, ఈ విషయాలు సమాజం ముందుంచాలని అనిపించి మొదలెట్టిన మేలుకొలుపు తొలి సంచికలలోనే ఈ విషయాలు క్లుప్తంగా చెప్పానుకూడా. మీ పరిశీలన కొరకుగా ఒకటిరెండు ఆధారాలిస్తాను చూడండి. 1.8.91 నాటి మేలుకొలుపులో స్వమంతవ్యం (నేనూ - నా పత్రిక) పేరున వ్రాసిన వ్యాసంలోనే (3వ పేజీ) (1)... ప్రస్తుత నా బుద్ధి స్థాయిననుసరించి నేనే మతస్థుడినీ కాను, ఏ కులస్థుణ్ణీకాను, ఏ వర్గానికీ చెందిలేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెపుతున్న విషయం.'' అని ప్రకటించాను.
(2) కపటులూ, స్వార్థపరులూ ఆస్థిక క్షేత్రాలలోనే ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి, నాస్తిక, హేతువాద సంఘాలు ఆస్థిక సమాజం యొక్క వికృత రూపాలకీ, దాని ప్రవర్తనకు ప్రతి క్రియాత్మకంగా ఏర్పడినవేనన్నది ఒక చారిత్రక వాస్తవం (15.6.91)
(3) సబబైన మాట పసివాడు చెప్పినా స్వీకరించదగిందే, బేసబబు మాట ఎంతవాడు చెప్పినా విడువవలసిందే.
(4) హేతువాదులమనుకునే వారిలోని అహేతుకవైఖరినీ,... కమ్యూనిస్టుల మనుకునేవారిలోని కమ్యూనలిజాన్ని మేము తరచుగానే గమనించాము.
(5) సంశయించి పరీక్షించడం, నిగ్గుతేలిన వాటిని స్వీకరించడం అన్న విధానాన్ని అనుసరించాలన్నాను.
(6) మండలి ప్రధాన కార్యక్షేత్రమైన ప్రమాణ విద్యలోని అనుమాన ప్రమాణ (తర్క) క్షేత్రమంతా హేతుబద్దాలోచన అన్న దానికి సంబంధించిందే.
(7) ఇక గుత్తా రాధాకృష్ణగారు నాకు పరిచయమైన నాటి నుండీ హేతువాద ఉద్యమం సామాజికావసరమని చెపుతూనే వస్తున్నాను. అటు తరవాత 1995, 96 ప్రాంతాల నుండి 'హేతువాదులకు హేతువాద పాఠాలు' అంటూ తరగతులూ నిర్వహించాను.
(8) గుత్తా రాధాకృష్ణగారి సంస్మరణ సమావేశంలోనూ, హేతువాద ఉద్యమం సామాజికావసరమనీ, ఆ పనిలో స.మండలి 100% నిజాయితీతో నిండా మునిగి పనిచేస్తుందనీ చెప్పాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూనూ వస్తున్నాను. ఇది జరిగిన వాస్తవం.
(2) హేతువాదుల లక్ష్యం భావ విప్లవమన్నారు. నిజానికామాటకు ఆ మాటంటున్న వారంతా అంగీకరిస్తున్న అర్ధం ఏమిటి? విప్లవమంటే తక్కువ కాలంలో అతి త్వరితంగా వచ్చే మౌలికమైన లేదా గుణాత్మకమైన మార్పు అని అర్ధం చెప్పుకుంటున్నాం దానికి భావమన్న దానిని జతకూరిస్తే  భావాలలో అతిత్వరితంగా ఏర్పడే మౌలికమైన మార్పు అని అర్థం వస్తుంది. ఆ సాదారణార్థాన్ని మీరు ప్రత్యేకంగా ఏ విషయాలతో ముడిపెట్టి వాడుతున్నట్లు? ఏ భావాలు పోయి, ఏ భావాలు వస్తే, దానిని మీరు భావ విప్లవం వచ్చిందంటారు? (1) ఇది స్పష్టంగా చెప్పగలగాలి. మీరనుకునే భావసారూప్యత కలవాళ్ళంతా ఒకే మాట చెప్పగలగాలి. అదలా ఉంచితే అన్ని రకాల మౌఢ్యానికీ, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలం దైవభావనేనన్నారు. అదేలా వాస్తవమో రుజువు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. దైవభావన, మత భావనలపై విమర్శకు నేను విముఖుణ్ణికాదు సరికదా పట్టుబట్టి, ఒక పద్దతి ప్రకారం, ఆ పక్షం వాళ్ళూ కాదనలేని రీతిలో వాటిని విమర్శిస్తూ వస్తున్నవాణ్ణి. ఏదైనా ఒక ధోరణికి చెందిన (మత) భావజాలాన్నిగానీ, అది అంగీకరిస్తున్న దైవ భావాన్నిగానీ విమర్శించాలంటే, విమర్శకునికి ఉండాల్సిన అర్హతలు, సామర్థ్యాలు ఏమిటో తెలిసుండాలి. అవేమిటో మీరుగానీ, మీరు ఇతడూ హేతువాదేనని అంగీకరించేవారిలో నేనెంచుకున్న వారుగాని ఒకేరకంగా చెప్పాలి. ఆస్థికులు బండగా దేవుడున్నాడంటున్నట్లే, హేతువాదులూ మొండిగా దేవుడు లేడనగూడదు. అన్న వెంకటాద్రిగారి మాటలు అంగీకరించితీరాలి. దేవుడులేడు అన్న నిర్ణయానికి ఎలా చేరారో నాస్థికులూ, నాస్థికత్వాన్నంగీకరిస్తున్న హేతువాదులూ, ఇతరులూ కూడా యోగ్యమైన ఆధారాలు చూపుతూ చెప్పగలగాలి.
ఇక్కడ నావైఖరి స్పష్టం ఆస్థిక్యతను నిరూపించమనిగానీ, అది నిరూపించ దగిందికాదనిగానీ, ఇప్పటికీ అభౌతిక పదార్థాపు ఉనికి అనిర్థారితమనిగానీ అంటున్నామంటే, అది ఆస్థికతను యోగ్యమైన రీతిలో విమర్శకులోను చేస్తున్నామనే కానీ ఆ పని చేయడానికి నాస్థికుడవ్వాల్సిన పనిలేదన్నది ఎంత మంది హేతువాదులకు తెలుసు?!
దైవవాదాన్ని విమర్శించడంతో ఆగక హేతువాదం మానవవాదం వైపు పయనిస్తుంది అనన్నారు. ఇంతకూ హేతువాదం క్రిందికి ఏయే భావాలువస్తాయో, మానవ వాదమంటే ఏమిటో, హేతువాదం మానవ వాదం వైపు పయనించడమంటే ఏమిటో మీరూ, మీరు భావసారూప్యతకలవాళ్ళం అంటున్నవాళ్ళు ఒకే రకంగా వివరించి, నిర్థారించాల్సి ఉంటుంది. హేతువాదం ఒక సిద్దాంతం కాదంటున్న పక్షం వాళ్ళైన మీరు, మానవ వాదాన్ని సిద్దాంతమంటున్నారా? లేదా? వివరాలు కావాలి.
(3) వచ్చిన ఇబ్బందిదేకదా! ఇప్పుడు హేతువాదులుగ చెప్పుకుంటున్న వాళ్ళంతా తాము నాస్థికులం అనే చెప్పుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హేతువాద సంఘాలు ప్రచారంలోకి తెచ్చిన భావనే. ఆ రెంటి వివరాలు తెలియాల్సినంత తెలియకుండగనే హేతువాద సంఘాలలో సభ్యులైనవారు దానిని నమ్మకంగా తలకెత్తుకున్నారు. హేతువాదులంటే దేవుళ్ళను తిట్టేరకంగానే జనంలో కనబడుతుండడంతో జనమూ అలానే అనుకుంటూ వచ్చారు. జరిగిన ఆ తప్పును (పొరపాటును) సరిజేసి, హేతువాదం యొక్క విస్తారమైన క్షేత్రాన్ని గురించి   తామర్థంచేసుకొని, జనానికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత  హేతువాద పక్షం వారిపైనే ఉందన్నదే ఆది నుండే నేను చెపుతూ వస్తున్నాను. ఆ మేరకు మీరు సరిచేసుకోవలసింది పోయి, నన్ను ఆ అపసవ్యతలోకి రమ్మంటారేమిటి?
(4) సక్రమాలోచన ఒక్కటే హేతువాదం కాదు. హేతువాద భావజాలంలో అదీ ఉంది. అలాగే శాస్త్రీయదృక్పథం యొక్క అవసరాన్నీ నొక్కి చెపుతుంది హేతువాద సిద్దాంతం. ఆ రెండూ ఉన్నంత మాత్రాన్నే ఒకడు హేతువాదికాజాలడు దేవునిపై నమ్మకం లేని వాళ్ళంతానూ హేతువాదులు కాజాలరు(కారు) అలానే దేవుని పై నమ్మకం లేనివాళ్ళంతా నాస్తికులూ కాదు. నిజానికి నాస్థికులంటే దేవుడు లేడన్న దానిపై నమ్మకం ఉన్నవాళ్ళు. నేను ఈ రెండో రకం నమ్మకమూ లేనివాణ్ణంటున్నానేగాని, దేవుడున్నాడన్న నమ్మకం ఉన్న వాణ్ణంటంలా. దేవుడున్నాడన్న నమ్మకమూ లేని వాణ్ణే నేను. నిజానికి హేతువాద దృష్టి తగినంతగా కలిగి ఉంటే, ఇలాటి విషయాలలో నమ్మకాల దగ్గరకు పోకుండా రుజువుల దగ్గరకే పోతాడు వ్యక్తి. చాలా మంది హేతువాదుల మనుకునేవారికంటే, హేతువాదం అర్థమైన వాణ్ణనుకుంటూండబట్టే, నేను ఆస్థిక నమ్మకానికీ, నాస్థిక నమ్మకానికీ దూరంగా ఉండగలుగుతున్నాను. ఏ ధోరణికి చెందిన ఆస్థికుల్నైనా (నాస్తికుల్నైనా) మీదెలా నిర్ధారితాంశమో తెలియజెప్పండని అడుగుతూ వస్తున్నాను. ప్రశ్న నంగీకరించాలి, ఆహ్వానించాలి, ఆస్థికుల మాదిరి బండ సమాధానాలు చెప్పగూడదంటుండే నాస్థిక, హేతువాదులు నా ఈ ప్రశ్నను ఆహ్వానించి, స్వీకరించి, సహేతుకంగానూ, యోగ్యమైన ఆధారాలు చూపుతూనూ నాస్థికత్వాన్ని స్థాపించాలి. అలా జరిగిన మరు క్షణం నేను ఆ విషయాన్ని వివేకపథంలో ప్రకటించి, అప్పటి నుండి నాస్థికునిగా కొనసాగగలను. లేదంటే ఏమి చేయాలో మీరే ఆలోచించుకోవలసి ఉంది. హేతువాదిగా కొనసాగడానికి ఆస్థికుడుగాగాని, నాస్థికునిగా గానీ ఉండఖ్ఖరలేదన్నదే ఇప్పటికీ నా పక్షము. ఈ విషయంలో నేను వక్రంగా ఉన్నాననుకునేవాళ్ళు నన్ను చక్కజేస్తే చక్కనవడానికి నేను సిద్దంగా ఉండగలను. ఆస్థికత రుజువు కాలేదన్నమాట నేనెలా అంటున్నానో మీ పక్షం వాళ్ళందరూ అలానే అంటున్నారు. ఇది నిజమా కాదా? ఇక 'హేతువాదం రుజువు కాలేదు' అని ఎవరన్నారు? నాస్తికత్వం అనబోయి 'హేతువాదం' అని అనుంటారు! కాని వెంకటాద్రి గారు పలుమార్లు హేతువాదమంటే నాస్తికత్వం కాదని ప్రకటించారు. కనుక 'హేతువాదం' 'నాస్తికత్వం' పర్యాయపదాలుగా వాడనేకూడదు. నాస్తికత రుజువు కాలేదిప్పటికీ అన్నది నా పక్షం రుజువైందంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎవరా పని చేశారో, ఇప్పుడు చేయగలరో ఆ వివరాలివ్వండి పరిశీలిస్తాను.
పరిశీలనలో, ప్రయోగంలో నిర్థారణైన విషయాలవైపు భావాలలో మార్పులు చేసుకోడానికి సిసలైన హేతువాది ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అలా సిద్దంకాని వాణ్ణి హేతువాది అనడమే కుదరదు అన్న వెంకటాద్రి గారి మాటలు 100% నాకు అంగీకారమే. మరి మీ మాటేమిటి? ఇది గనక మీరు అంగీకరించి అనుసరిస్తానంటే, మిగిలిన హేతువాదులూ ఇందుకు సిద్ధపడితే, తేలిన వాస్తవం దగ్గర వక్కటవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండఖ్ఖర్లేదు.
ఆమిత్రులు సూరన్న గారికి; నా ఈ విశ్లేషణ కేవలం మిమ్ముద్దేశించిందికాదు. మీరు లేవనెత్తిన అంశాలు మౌలికమైనవి అందరమూ అవగాహన చేసుకుని ఉండాల్సినవీ అవడంతో, మిమ్మడ్డుపెట్టుకుని నాదృష్టికోణాన్ని పాఠకులందరకూ చేరవేయాలనుకునే ఇలా స్పందించాను. ఒకింత కరకుగా ఉందనిపించిన వాటి విషయాన్ని గట్టిగా పట్టించుకోకండి. విషయపరంగా తేడా ఉందనిపిస్తే నిర్మొగమాటంగా విమర్శించండి. వ్యక్తిగత విమర్శవద్దు. మీరన్నట్లు 186, 188 సంచికలు చాలా భావగాంభీర్యం కలవే. వివేకపథం పాఠకులూ వాటిని మరొకసారి నిశితంగా పరికించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
దేవుడనేది అనవసరపు భావనా? అవసరమైనదా? అని మొదటిలేఖలో అడిగారు. ఈనాడది అనవసరపు భావనేనని ఏనాడో నిర్ద్వంద్వంగా ప్రకటించానునేను. అంతేకాదు, సత్యాన్వేషణ మండలికి, పుట్టకముందు విషయాలతోగానీ, మరణానంతర విషయాలతో గాని పనిలేదనీ ప్రకటించాను. మా భావజాలమంతా పుట్టి, చచ్చేలోపల 'వ్యక్తీ - సమాజము - ప్రకృతి' అన్న మూటికి సంబంధించి ఈ లోకానికి పరిమితమైనది మాత్రమే.
తేలని, రుజువులు లేని నమ్మకాల విషయంలో దేవుడున్నాడని, లేడని వాద ప్రతివాదనలు చేసేవారిని కూర్చోబెట్టి చర్చలు సదస్సులు నిర్వర్తించితే, అవి సత్యాసత్య వివేచనకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండన్నారు. నామాటేమిటంటే, నిజంగా మీరన్నట్లు అవి ఇప్పటికీతేలని, రుజువులులేని విషయాలేనన్న నిర్ణయానికి వచ్చారా మీరూ. నేనక్కడికి చేరాను చాలాకాలం క్రితమే. నా అన్వేషణలో అవి తేలనివీ, రుజువులు లేనివీ అని తేలుతుండగా, ఆ రెండూ తేలినవేనని పట్టుకు కూర్చున్న వారిని కూర్చొబెట్టుతున్నది, అవెక్కడ తేలాయో తేల్చండని అంటున్నది, వారికీ నేను చూస్తున్న దానిని చూపించాలనే. ఈ విషయంలో సత్యం తెలిసిందనుకుంటున్న నాకు, ఆ విషయాన్ని సమాజానికి ఎరుక పరచడమూ బాధ్యతై ఉంది.
స్పం (5) :-               ప్రత్యేక ప్రకటన
నా విజ్ఞప్తిని మన్నించి, నా మీద (నా సామర్థ్యం మ్మీద, నిజాయతీ మీద) నమ్మకముంచి చీరాల నుండి ఎన్‌.వి. బ్రహ్మంగారిలా వ్రాస్తున్నారు. ఇది ఆయన పి.డి సుందర్రావు గారికి పంపిననలేఖనకలు అని చెప్పారు.
మిష్టర్‌ పి.డి సుందరావ్‌! నీవు గతంలో చీరాలవచ్చి నన్ను ఛాలెంజ్‌ చేస్తే నేను ఓడిపోయానని ఒప్పుకున్నానని, ఎందుకు అబద్దపు ప్రచారంతో ప్రగల్భించావు? అప్పుటి బైబిలు బండారంలోని అవతారికను అలాగే ఉంచి, 'అసంబద్ధా'లకు తోడు మరో నాలుగు భాగాలనూ చేర్చి, పుస్తకం పేరును 'బైబిలే పలుకుతోంది'గా మార్చి పునఃప్రచురణ చేశాను. అవతారికంటే ఉపోద్ఘాతమే కనుక, అది మిగిలిన పుస్తకానికంతటికీ అవతారికగానే ఉంటుంది. లోగడ నీవు చేసింది అబద్దపు ప్రకటనే అని ఒప్పుకుంటూ మళ్ళీ ప్రకటిస్తూ ఆ ప్రకటన కాపీని నాకు పంపు. లోగడి నీ ప్రకటనల్లో వివాదాంశాలు మరికొన్నీ ఉన్నాయి. వాటిపై సత్యాన్వేషణ మండలి, దోరకుంట, అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబుగారు మీతో తలపడడానికి సిద్దంగా ఉన్నారుకదా! ఆ  సందర్భంగా వారు నా తరపున కూడా, నా ప్రతినిధిగా మీతో పోటీ పడడానికి నేను చిత్తశుద్ధితో ఆమోదిస్తున్నాను. అంతేకాదు, ఆయన గెలుపోటములు నావిగా స్వీకరించడానికీ సిద్దంగా ఉన్నాను. ఎన్‌.వి. బ్రహ్మం - (గారి సంతకం) 27.8.13
ప్ర.స్పం :- ధన్యవాదాలు బ్రహ్మంగారూ! భావజాల పరంగా మనమధ్యనున్న పరిచయానికీ, స్నేహానికీ కూడా వన్నెతెచ్చే విధంగా ఉంది మీ లేఖ. పి.డి. సుందర్రావు పోటీకి రావాలేగాని అతగాడు నాకవుటే. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక ఈ లేఖాధారంగా ప్రగల్భాల పి.డి సుందర్రావుకు మరోసారి సవాలు రూపంలో ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన 'కూతకు దొరకడని' ఇప్పటికి జరిగిందాన్ని బట్టి అనిపిస్తున్నది కనుక, అత్యంత పరుషంగానూ మాట్లాడి, మాటిమాటికీ గిచ్చీ, గిల్లీనన్ను రెచ్చగొట్టిన జగద్గురు గారుగానీ, ఈ సం|| కాలంగా నా రచనలను చూస్తున్న ఆ పక్షపు వందిమాగధులుగానీ, ఆయన దాక ఎందుకు, మేము చాలు దీనికి అంటూ తెగ ప్రగల్భించే, తొడలు చరుచుకునే ఆయన కొడుకు, అల్లుడూ, మరికొందరు చిన్న గురువులుకానీ పూనుకుని బైబిలు పైనా సైన్సుపైనా పి.డి. సుందర్రావు మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్దపడవలసిందిగా వారిని ఒప్పించనైనా ఒప్పించండి, ఎన్‌.వి. బ్రహ్మంగారు తన తరపున నన్ను పోరాడమనీ, నాగెలుపోటములు తనవిగా స్వీకరించగలననీ ప్రకటించినట్లు, ఆయన తరపున నాతో చర్చించడానికి, ఆయన అంగీకరించిన ప్రతినిధిగా ఆధారం చూపి మీరైనా సిధ్దంకండి.
లోకంలో మామూలుగానైతే, బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి కొన్ని సందర్భాలలో తల ప్రాణం తోకకొస్తుంది అన్నంతగా శ్రమ పడాల్సి ఉంటుంది. కాని అదేం విడ్డూరమో మన పి.డి. సుందర్రావు గారిని పోరాటానికి సిద్దం చేయడానికే తలప్రాణంతోక కొస్తోంది. అన్నంతగా శ్రమ పడాల్సి వస్తోంది. పి.డి.సుందర్రావుకు ఒక్కమాట! నిజానికి మొన్నీమధ్య నీ నోటితుత్తర అంశాన్ని జనం పట్టించుకోక పోబట్టి బ్రతికిపోయ్యావుగానీ, అంతలేసి మాటలన్నందుకు భారత ప్రజ నిన్నెంతగా వీధులెంట పరిగెత్తించినా నీకు చేయాల్సిన ప్రాయశ్చిత్తానికి సరిపోదు. అది సరేలే! ఎప్పుడు ఎక్కడ బైబిలుపైనా, సైన్సు పైనా చర్చకుకూచుందామో ఇప్పుటికైనా పలకవయ్యా బాబూ!
ఈ సందర్భానికే చెందిన ఒక విజ్ఞప్తి
యోచనాశీలురైన రావిపూడి వెంకటాద్రిగారికి; పి.డి. సుందర్రావు గారు నాకు వాడు చాలడు, వీడు చాలడు రావిపూడి వెంకటాద్రితోనైతే చర్చకు రెడీ! అంటూ గతంలో చాలా ప్రకటనలు చేశాడు. దానికి బదులుగా మీరు అనవలసినవి అని వాటినీ రచన రూపంలోనూ ప్రచురించారు. ఇతరేతరాంశాలలో కొన్నింట మన మధ్య బినాన్నభిప్రాయాలున్నా; ఏ మత గ్రంథమూ దైవ ప్రాప్తం అనడానికి సరిపోదు. గ్రంథాలన్నీ మానవకృతాలే అన్న విషయంలోగానీ, బైబిలు ఆదికాండంలోని సృష్టిక్రమం అవైజ్ఞానికం, అజ్ఞానమూలకం అన్న విషయంలో గానీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కించపరుస్తూ సుందర్రావుగారు మాట్లాడిన విషయాలు అతనిలోని అజ్ఞానాన్ని (అవగాహనారాహత్యాన్ని) తేలిపేటివేనన్న విషయంలోగాని ఏకాభిప్రాయంతోనే ఉన్నాము. కనుక ఆ విషయాలకు పరిమితమై అతనితో మాట్లాడడానికి, మీ ప్రతినిధిగా నన్నంగీకరిస్తున్నట్లు ప్రకటించగలరేమో ఆలోచించండి. ఈ విషయాలలో నా అవగాహనను, మీరు ఒకసారి పరిశీలించి చూసుకోవాలనుకుంటే ఈ విషయం వరకు మిమ్ము కలసి మాట్లాడడానికీ నేను సిద్దము. నా ఆకాంక్షల్లా గత పాతికేండ్లు పై బడి పి.డి. సుందర్రావు గారు ప్రవర్తిస్తున్న అనుచిత పోకడకు ఒక ముగింపు పలకాలన్నదే. ఈ విషయంలో అవకాశముంటే, అతడు ఛాలెంజ్‌ చేసిన లేదా అతణ్ణి ఛాలెంజ్‌ చేసిన ఈదేశంలోని (రాష్ట్రంలోని) మరికొందరి నుండీ ఇలాంటి అనుమతిని పొందే యత్నమూ చేస్తాను. మీ అందరి ప్రతినిధిగా అతణ్ణి చర్చకు ఆహ్వానిస్తాను. అప్పటికీ అతడు రాకుంటే టి.విలో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి, రాష్ట్రంలోని వివిధ ధోరణులకు చెందిన ప్రసిద్దులందరికీ కబురందించి బహిరంగంగా అతణ్ణి చర్చకు పిలుస్తాను. అందుకూ అతడు చలించకుంటే చివరి యత్నంగా న్యాయాలయం ద్వారా అతణ్ణి విచారణకు సిద్దం చేసే యత్నం చేస్తాను. ఆ తరవాత ఏమి చేయాలన్నదీ అంత వరకయ్యాక ఆలోచిస్తాను.
స్పం :- హైద్రాబాద్‌ నుండి రాజేంద్రప్రసాద్‌ గారిలా వ్రాస్తున్నారు. సురేంద్ర బాబుగారికి; వివేకపథం 201లోని స్పందన - ప్రతిస్పందననూ, హేతువాది ఆగస్టు 2013లోని ''మరల మరో గెలుకులాటా'' అనే విమర్శనాత్మక వ్యాసము చదివాను. హేతువాదిలోని వ్యాసము నన్ను కొంత కలవరపరిచినది. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తృష్ణ కలవారు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు ఇలాటి విమర్శ లేక ప్రతి విమర్శలు అవసరమా అనిపించింది. సిద్దాంత పరంగా భేదాభిప్రాయాలుండడం సహజమే. ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి కలిగిన అవగాహనాపరులు కాలేరుకదా! యిలాటి విమర్శలకు బీజం పడి చాలా కాలమైందనీ, దాని ప్రభావమే ఈ వ్యాసం అనీ అనుకుని ఊరుకున్నాను. ఈ విమర్శకు కారణం ఈ రెండు సంస్థలకూ అనగా మీకూ రావిపూడి మాష్టారుగారికీ సిద్దాంత పరంగా ఉన్న బేధాభిప్రాయాలేగాని, వ్యక్తుల పరంగా లేవని నాభావన. ఈ విభేదాలకు కారణాలు రెండు రకాలుగా ఉన్నాయి. (1) సిద్దాంత పరంగా అతి ముఖ్యమైనవి (2) అంత ముఖ్యం కానివి.
(1) అతి ముఖ్యమైన వాటిలో నాకు తెలిసినంతవరకు, ''సత్యంమారుతుందా? సత్యం శాశ్వతమా కాదా?'' అనే అంశంపైన విభేదించుకుంటున్నారనుకుంటున్నాను. కనుక, ఈ విషయం మ్మీద చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తే, చాల వరకు ఇతర భేదాభిప్రాయాలు కూడాపోతాయి. 'సత్యం' అనే పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ ఒకేలా అర్థం కావలసి ఉంది. నా అవగాహన ప్రకారం, సత్యమంటే వాస్తవానుగుణ్యత కల జ్ఞానం అనే.
(2) అతి ముఖ్యమైన వాటిలో ''సిద్దాంతమని దేనిని అనాలి? ఒక దానిని సిద్దాంతం అనాలన్నా, అనకూడదని అన్నా, దానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?'' అనేదీ ఒకటి. దీనిని గురించిన అవగాహనా అందరికీ కలిగితే మంచిదేగాని, ప్రత్యేకించి సిద్దాంతకారులకు మాత్రం తప్పనిసరి.  సామాన్యులకు ఆ అవగాహన అవసరం లేదంటాను. సిద్దాంతమన్నా, సూత్రమన్నా, మరో పేరేదైనా పెట్టినా పెద్ద తేడా ఏమీరాదు. విషయంపైన అవగాహన కలగడమే ముఖ్యంగాని, దానిని సిద్దాంతమనాల్నా వద్దా అన్నది మా బోటి వారికి అవసరంలేదు. కనుక అలాటి వాటిపై ఏర్పడ్డ భేదాభిప్రాయాల్ని వెంటనే తేల్చుకోవలసిన అవసరం లేదని నా భావన. సమయం సందర్భం వచ్చినప్పుడు తేల్చుకోవచ్చు.
(3) అతి ముఖ్యం కానివి చాలా ఉన్నేౖ. అలాటివి సామాన్యులకు అర్ధమైతే చాలు. లోతైన అవగాహన క్రమంగా వస్తుంది. అలాటి విషయాలకు మీరు ఇవ్వవలసిందానికంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనీ, వెంకటాద్రి గారు అంత ప్రాముఖ్యతనివ్వక్కరలేదన్న దృష్టితో ఉన్నారనీ అనుకుంటున్నాను.
(4) మీ యిరువురి రచనా విధానంలో తేడా ఉంది. మీ రచనలు చదివి అవగాహన చేసికోవడానికి చాలా సమయం పడుతుంది. లోతైన అవగాహన కలుగుతుంది. వెంకటాద్రిగారివి చదవడానికి ఎక్కువ సమయం పట్టదు. అవి సామాన్యుల కోసం వ్రాసినవి అనిపిస్తుంది. నిజానికి రెండు రకాల రచనలూ ఉండాలి. (1) సామాన్యుల కోసం క్రింది స్థాయిలో (2) ఎక్కువ సామర్థ్యం కలవారికోసం ఇంకొంచం ఎక్కువస్థాయిలో. సామాన్యుల కోసం వ్రాసిన రచనలలో అంత ముఖ్యం కాని అంశాలను లోతుకు వెళ్ళకుండా, వారికి అర్థమయ్యేట్లు వ్రాస్తే చాలు. వాటిపై లోతైన అవగాహన పొందగోరేవారు, క్రమంగా ఆలోచించుకునిగానీ, శిక్షణ తరగతుల ద్వారా గాని, రెండవరకం రచనలు చదవడం ద్వారా గానీ వాటిని తెలుసుకోగలుగుతారు.
(5) హేతువాదులకు ఏ వ్యక్తిగానీ, రచనగానీ ప్రామాణికంకాదని అందరం అంగీకరించాం. అలాగే హేతువాదం కూడా. ఈ భావనాధారంగానే నే నీ లేఖ వ్రాయగల్గుతున్నాను. ఈ విషయంలో మీరిరువురూ నాకు ప్రామాణికులు కారు.
(6) ఎం.కె. గౌరవ్‌ గారు ఏమి వ్రాశారో నాకర్థం కాలేదు. చివరకు వ్రాసిన గమనిక మాత్రం అర్థమైంది. అదిన్నీ అన్యాపదేశంగా ఉంది. నేరుగా మీకే వ్రాయవచ్చుగదా? అందులో దాపరికమెందుకు.
(7) రావిపూడి గారి రచనలలో, సత్యాన్ని గురించి పరస్పర విరుద్దభావాలున్నాయి. వాటిని నేనూ గమనించాను. కానీ ఆ దోషం అనాలోచితంగా జరిగి ఉంటుందని భావిస్తాను. ఒకసారి ఒక భావన కలిగిన మనిషి దానికి విరుద్దమైన భావనను ఉద్దేశపూర్వకంగా ఇంకోచోట తెలియపరుస్తారని నేను భావించడంలేదు. వారి మనసులో ఏముందో, మనకేమి చేరిందో, అలా జరగడానికి వివిధ కారణాలుండవచ్చు. యిలాటి దోషాలు ఇతరుల రచనలలోనూ ఉన్నాయి. మీ రచనలలో కూడా.
(8) ఈ లేఖ నకలును వెంకటాద్రిగారికీ, సత్యన్నారాయణ గారి పేరు మీద పంపుతున్నాను. వారు కూడా స్పందిస్తారని తలుస్తాను. ఇట్లు ప్రసాద్‌
ప్ర.స్పం (6) :-  మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి; మీ లేఖ ప్రారంభంలో, మీరన్నట్లు, వెంకటాద్రిగారికీ, నాకూ మధ్య వ్యక్తిగతవైషమ్యాలు ఉండనక్కరలేదు. నావైపు నుండి మాత్రం వ్యక్తిగత విమర్శలు వద్దంటూ ఆది నుండి చెపుతూనే వచ్చాను. ఏ భావజాలానికి చెందిన వ్యక్తులతోనైనా మండలి వైఖరి అదేనన్నది గత పాతికేండ్లుగా వస్తున్న మేలుకొలుపు, వివేకపథాలను జాగ్రత్తగా చదువుతున్నవారికి తెలిసున్నదే. నన్నెరిగిన వారికీ, నేను వ్యక్తిగత శతృత్వ వైఖరినవలంభించే వాణ్ణి కాదన్న విషయం తెలుసు. అవగాహనల్లోనూ, పోకడల్లోనూ ఉన్న వ్యత్యాసాలను ప్రక్కన పెడితే, సమాజహితం కొరకుగా నిబద్దతతో జీవితాన్ని వెచ్చించిన వ్యక్తిగా, మాముందుతరం ఉద్యమకారునిగా, వెంకటాద్రి గారిపట్ల నాకిప్పటికీ గౌరవభావనే ఉంది. ఆ మేరకు ఇక ముందూ ఉంటుంది. ఇక విషయపరంగానైనా, ఇరువురమూ, ఒప్పు భావాలు సమాజానికందాలి, ఉన్న తప్పు భావాలను పోనాడాలి, అన్నంతవరకు సమానశీలురమే గనక, భిన్నాభిప్రాయాలున్న సందర్భాలలోనూ శతృదృష్టి అనవసరమే అవుతోంది. ఏదో ఒక సందర్భంలో మానవికమైన ఆవేశాలకు లోనైనా, వీలయినంత త్వరగా వివేకం అదుపులో మరల స్వస్థచిత్తులం కావాలన్నదీ తెలిసున్నదే. అభ్యుదయాకాంకక్షుల మధ్య వ్యక్తిగత స్పర్థలుండరాదన్న ప్రగాఢ వాంచకలవాణ్ణి నేను. గత 20 ఏండ్లుగా మంచి వాళ్ళందరనూ కలవగలిగిన మేరనైనా కలపి ఉద్యమించాలన్న యత్నాలు చేస్తున్నట్లు మీకూ తెలుసు. సరే అంశాలవారీగా మీ లేఖ పై స్పందిస్తాను, పలికించండి.
(1) 'సత్యం' అన్నది వాస్తవాలను సూచించడానికి వాడే పదంకాదని, ఉన్న వాటికి సంబంధించి కలుగుతున్న ఒప్పు జ్ఞానాన్ని సూచించడానికి వాడినపదమది అనీ నా పక్షాన్ని మొదటినుండీ చెపుతూనే వస్తున్నాను. కొన్ని విషయాలలో వెంకటాద్రి గారున్నూ వేలసం||లు గడచినా ఆ అభిప్రాయాలను మార్చుకోనక్కరలేనివిగనే ఉంటున్నాయిప్పటికీ అనంటూ ఆచరణలో నిలబడినంతకాలం అవి ఒప్పులేనన్నట్లు చెపుతున్నారు. కనుక మీరన్నట్లు సత్యాలు మారతాయి, మారవు; కొన్ని మారతాయి కొన్ని మారవు; అన్న మూటిలో ఏదో ఒక పక్షాన్ని నిగ్గుతేల్చుకునైనా అందరం స్వీకరించడం మంచిది. వాస్తవానుగుణ్యత కల జ్ఞానమునే సత్యమంటామన్న మీ అభిప్రాయమే సరైంది. నా అభిప్రాయమూ అదే.
(2) సిద్దాంతమని దేన్నంటారన్నదీ, ఇటు తాత్విక ధోరణులనుగానీ, అటు వైజ్ఞానిక క్షేత్రాలను గాని పట్టిచూస్తే ఇట్టే తేలిపోతుంది. అనేకాభిప్రాయాల సమాహారాన్ని (భావజాలసంపుటిని) సిద్దాంతాలంటున్నాం. ఖచ్చితమైన ఒక్క అభిప్రాయాన్ని సిద్దాంతమంటున్నాం. ఉదా :- మార్క్సిస్టు సిద్దాంతం, ఆస్థిక సిద్దాంతం, నాస్థిక సిద్దాంతం, సాపేక్ష సిద్దాంతం, ఉష్ణగతి శాస్త్ర సిద్దాంతం, మహావిస్పోటన సిద్దాంతం, అద్వైత సిద్దాంతం, వైష్ణవ సిద్దాంతం, నియంతృత్వం పై అనేకుల సిద్దాంతాలు, ప్రజాస్వామ్యంపై అనేక సిద్దాంతాలు, జనాభా సమస్యపై భిన్న సిద్ధాంతాలు, ప్రమాణాలపై అనేక సిద్దాంతాలు అర్ధశాస్త్రంపై అనేక సిద్దాంతాలు, నీతి శాస్త్రంపై అనేక సిద్దాంతాలు... ఇలా 'సిద్దాంతం' అన్న పదం యొక్క వినియోగం ఎలా ఉందో గమనించగలిగితే అవగాహనలో స్పష్టత ఏర్పడుతుంది. వైజ్ఞానిక క్షేత్రాలలోనైతే, ఊహాత్మక సిద్దాంతాలు (పరికల్పనలు) నిర్ధారిత సిద్దాంతాలు (ఆజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ)  వీగిపోయిన సిద్దాంతాలు (ఈరిరీచీజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ) అన్నమాటలూ వినియోగంలో ఉన్నాయి. 'ఇజం' అన్న శబ్దంతో కలిపివాడే వన్నీ సిద్దాంతాలే. ప్రతి వాద రూపము సిద్దాంతమే. అందుకనే 'సిద్దాంత' మన్న మాటను వివరిస్తూ తార్కికులు సర్వతంత్ర ప్రతితంత్ర అధికరణ అభ్యుపగమాల రూపంలో సిద్ధాంతాలు నాలుగు రకాలుగా వుంటాయని చెప్పారు. దేవుడున్నాడు అన్నదీ ఒక సిద్దాంతమే. దేవుడు లేడు అన్నదీ ఒక సిద్ధాంతమే. ఉన్నాడో లేడో తెలియబడదు (అజ్ఞేయవాదంలో ఒక రూపం) అన్నదీ ఒక సిద్దాంతమే,  అనార్కిజం (అరాచకవాదం) అన్నదీ ఒక సిద్దాంతమే. నిర్థిష్ట రూపంలో ఆయా విషయాల గురించి ప్రకటింపబడిన అభిప్రాయాలన్నీ సిద్దాంతాలే. ఆలోచనా పద్దతికి చెంది పలు సిద్దాంతాలున్నాయి. వాటిని తార్కిక సిద్దాంతాలని అంటారు. విషయ మిట్లుండగా, 'హేతువాదం' సిద్దాంతం కాదు అనడమెలా కుదురుతుంది. ఇది సర్దుకుపోయే అంశంకాదు. నిగ్గుతేల్చుకుని ఏకాభిప్రాయానికి రావలసిన అంశం. కనుకనే విచారణకు పెట్టి చూసుకోవలసి వస్తోంది. ఇక సామాన్యులకీ విషయం అనవసరం అన్న మాట నాకూ అంగీకారమే. సిద్దాంత కారులకు, సైద్దాంతిక రచనలు చేసేవారికీ, భావ విప్లవ క్షేత్రంలో అధ్యయన శిక్షణ తరగతుల బోధనాంశాల స్థాయికి ఈ అంశం చాలా మౌలికమూ, కీలకమూ కూడా. అందుకే దీనిపై ఇంత విచారణ చేయవలసి వస్తోంది.
(3) అంత ముఖ్యం కానివి చాలా ఉన్నై అంటూ అట్టి వాటికీ నేను చాలా ప్రాధాన్యతనిస్తున్నట్లు వాశ్రారు. అవేమిటో, నా రచనల్లో అవి ఎక్కడ చోటు చేసుకుని ఉన్నాయో చెప్పండి. ఒకసారి తిరిగి చూసుకుంటాను. ఒక్క విషయం! ముఖ్యమా? కాదా? అన్నది నిర్ణయించేందుకు మీరెంచుకున్న విధానమూ, కొలత ఏమిటోనూ తెలియజేయండి.
(4) మీరన్నది చాల వరకు సరైందే. కానీ నా రచనలన్నీ ప్రధానంగా తాత్విక క్షేత్రానికి చెందినవో, దానితో ముడిపడి ఉన్నవో అయ్యుంటాయి. నా రచనల ప్రధాన లక్ష్యం కూడా మేధావుల నుద్దేశించిందేనన్నది ఒక నిజం.
(5) హేతువాదులకు ఒక వ్యక్తిగానీ గ్రంథంగానీ ప్రమాణం కాదంటున్నామంటే దానర్థం అతడు చెప్పాడు గనుక అనో ఆ గ్రంథం చెప్పింది గనుక అనో ఆయా అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడమనేగాని, ఒప్పు చెప్పినా వ్యక్తి ప్రామాణికుడు కాడు గనుక ఒప్పుకోను అన్న అర్థం తీసుకోకూడదు. తప్పో ఒప్పో నిర్ణయించుకునే సందర్భంలో సరైన ప్రయోగ పద్దతిన సరిచూసుకోవడమన్నదే విధానం కావాలిగాని, ఫలాని వ్యక్తో, గ్రంథమో చెప్పింది గనుక సరిచూసుకోనక్కరలేదు అనకూడదన్నదే పై మాటల అర్థం. మీకిది అంగీకారమైతే ఆ వాక్యాన్ని ఇద్దరం ఒకే రకంగా అర్ధం చేసుకున్నా మన వచ్చు కానీ మీరిరువురూ నాకు ప్రమాణం కాదంటూనే, హేతువాదం కూడా నాకు ప్రమాణం కాదన్నారు. అదేమిటో నాకర్థం కాలా. ఇంతకూ హేతువాదమంటే మీ అర్థమేమిటి? అదీ నాకు ప్రమాణం కాదన్న మాటకు మీ అర్థమేమిటి? మీరే చెపితే మేలు.
(6) ఎం.కే. గౌరవ్‌ లేఖ నుండి గ్రహించగలిగిన అభిప్రాయాలంటూ నేను కొన్ని పాఠకులముందుంచాను. వాటినీ పరికించండి లేదా ఆ లేఖపై మీ కేమనిపిస్తుంటే అది గౌరవ్‌కు వ్రాస్తూ, నాకొక నకలు ప్రతిని పంపండి. లేఖపై గౌరవే వివరణ చేయాల్సి ఉంది. కనుక దానికొరకై వేచి చూద్దాం.
(7) ప్రతి రచనలోనూ కొన్ని విరుద్ద భావాలుండే వీలుంది అంటూ, అట్టివి మీ రచనలోనూ ఉన్నాయ్‌, అనన్నారు. ఈ ప్రకటన ఒకింత తీవ్రంగా (సీరియస్‌గా) తీసుకోవలసిందిగా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా విషయం పై ఒకసారి తానన్న మాటకు వేరుగా మరోమాట చెపితే, సూత్రప్రాయంగా దానిని 'స్వవచన వ్యా ఘాతం' (ఐలిజితీ ్పుళిదీశిజీబిఖిరిబీశిరిళిదీ) అని అంటారు. అట్టిది ఎప్పుడు జరుగుతుంది?
(1) ఆ విషయంలో ముందేర్పడ్డ అభిప్రాయం తప్పని తెలిసి, దానికి మారుగా సరైందనుకుంటున్న మరో అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నప్పుడు. అయితే అలాగే జరిగినట్లైతే, ఏ ఒక్కసారి మాట్లాడినప్పుడూ ఆ రెంటినీ తన భావాలుగా ప్రకటించడతడు. ఒకనాడు తానలా అనుకున్నాననీ, అనంతరం దానిని మార్పుకుని, ఇప్పుడిలా అనుకుంటున్నాననీ చెపుతాడు. అలాటి వాటిని స్వవచన వ్యాఘాతాలనరు. ఇక అనుభవంలో సరిచూసుకోకుండా గ్రంధాలనుండో, ఇతరుల మాటలనుండో ఆ అభిప్రాయాలను స్వీకరించినప్పుడే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనుభవ జ్ఞానంలోగానీ, సరి చూసుకున్నాక ఏర్పడ్డ నిర్ణయాలలో గాని అట్టి పరస్పర విరుద్ధమైన అభిప్రాయలుండనే ఉండవు. అవునో కాదో ఆలోచించి చూడండి. 'నా రచనల్లోనూ అట్టివి ఉన్నాయనన్నారు' అవునా? ఏవి? ఎక్కడలాటివి ఉన్నాయో చూపించండి. అ పొరపాటు జరిగి ఉంటే, ఆ విషయంలో ఆ మేరకు నేను జ్ఞానం (అవగాహన) లేని వాణ్ణన్నట్లే. ఇప్పటికైనా ఆ విషయంలో నాకేమైన అవగాహన కలిగి ఉంటే, దీన్నంతటినీ కలిపి ఒక ప్రకటన చేసి ఆ తప్పు దిద్దుకుంటాను. కానీ రాజేంద్ర ప్రసాద్‌గారూ! మీరొక సాహసవంతమైన ప్రకటన చేశారు. అట్టివి వెంకటాద్రి గారి రచనల్లోనే కాదు. ప్రతి వక్కరి రచనల్లోనూ ఉంటాయి. మీ రచనల్లోనూ ఉన్నాయని నిజానికిది చిన్న ఆరోపణకాదు. అది సరే మీ లేఖలోనూ అలాటిది చోటు చేసుకునుందేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి.
(8) మీ లేఖ పై హేతువాది ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఉంటాను సెలవ్‌.
హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు - 4
ఉద్యమ మిత్రులారా! రాజకీయ సంక్షోభం తెర మీదికి రావడంతో, మనం తలపెట్టిన నెలవారీ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. జరుగుతున్న అవాంచనీయతలన్నింటికీ, అవగాహనా పరులూ, స్వతంత్రాలోచనా శీలురు లేకపోవడమన్నదీ బలమైన కారణమే. ఆ లోటును సరిచేయగలిగింది హేతువాద ఉద్యమమే. కనుక ప్రస్తుత సంక్షోభాలు సమసిపోవాలన్నా, భవిష్యత్తులో మరల మరల పుట్టుక రాకుండా ఉండాలన్నా హేతువాద ఉద్యమం (1) బాగా విస్తరించడం, (2) బలంగా వేరూనుకోవడం, స్వతంత్రాలోచనా పరుల రాశిని పెంచడం అన్నవి జరిగితేనే సాధ్యపడుతుంది. హేతువాద ఉద్యమం ప్రధానంగా భావజాల క్షేత్రానికీ, ఆలోచనా ప్రక్రియ రీతిరివాజులకూ చెందిందే అయినా, దానిని ఉద్యమ రూపంలో కొనసాగించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికా అవసరం. ఎలా ఒక ఉపాధ్యాయునికి బోధించడమన్నపనే సిద్దాంతానికి తగిన ఆచరణ కూడా అవుతుందో, అలానే భావజాల క్షేత్రంలో పనిచేసే వారికీ ప్రజలకు బోధించడమన్నదే ఆచరణ రూపం కూడా అవుతుంది. పుస్తకాలు ముద్రించడం, విద్యాలయాలలో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలాటిదే. దాంతో విద్యనందించడం అన్న ప్రక్రియ ఎలా పూర్తి కాదో, విద్యాలయాలు పెట్టి నిపుణుల చేత ఆ పుస్తకాంశాలను విద్యార్థుల తలలకెక్కించడం చేయాల్సి ఉంటుందో, అలానే భావజాల క్షేత్రంలోను పుస్తక ప్రచురణలతో ఆ ప్రక్రియ పూర్తికాదు. దానిని ప్రజలకందించే బోధకులను అంటే శిక్షణ పొంది మాట్లాడగలిగిన కార్యకర్తలను తయారు చేసికుని, భావ విప్లవోద్యమ కార్యాచరణలో భాగంగా సమాజంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నప్పుడే, ఉద్యమం ఆచరణ రూపంలోనూ కొనసాగుతున్నట్లు.
హేతువాద సిద్దాంత భావజాలం చాలా విస్తృత క్షేత్రంతో సంబంధాలు కలిగి ఉంటుంది. వ్యక్తి జీవితంలో హేతుబద్దాలోచన అవసరం ఏమిటో, హేతుబద్దాలోచనలో హేతువు స్థానంలో ఎటువంటి సమాచారాన్ని ఆధారంగా ఎంచుకోవల్నో, అక్కడ పొరపాటు జరిగితే జరిగే అనర్థమేమిటోనూ వివరించి అవి జరక్కుండా ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలోనూ తెలయజేస్తుంది. హేతువాద సిద్దాంతం యొక్క గొప్ప తనమేమిటంటే, హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలు అంతిమం- పరమం- కావనీ, అవి మరల ప్రయోగరీత్యా - ఆచరణలో - సరిచూసుకోవలసి ఉంటుందనీ కూడా తెలియజేస్తుంది. ఉహాత్మక నిర్ణయాల విషయంలోనేగాక, ప్రత్యక్ష విషయాలలోనూ అవసరమైతే ఫలుదపాలు పునఃప్రయోగాలు చేసుకుని చూసుకోవలసిందేనని ఉద్బోధిస్తుంది. ఇక శబ్ద ప్రమాణం విషయమైతే, ఎవరు చెప్పిందిగాని వారు చెప్పారు గనక ఒప్పనో, తప్పనో నిర్ణయానికి రావడం సరైన విధానం కాదని విడమరచి చెపుతుంది. ఈ విషయాన్నే 'హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రమాణం కాదు' అంటూ వెంకటాద్రిగారు చెప్పారు. మనమంతానూ ఆ విషయాన్ని ఆయన చెప్పారు గనుక ఒప్పనకుండా, అనుభవంలో చూసుకుని, బాగా ఆలోచించుకునే అది సబబేనన్న నిర్ణయానికి వచ్చాము.
హేతువాదోద్యమ సాఫల్యత అంతా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనా శీలత కలవారినిగా రూపొందించడం దగ్గరే ఉంది. స్వతంత్రాలోచనాపరులు కావాలంటే ఏ విషయం గురించి ఆలోచించాలనుకున్నామో దానికి సంబంధించిన సరైన (యోగ్యమైన) సమాచారాన్ని సంపాదించుకుని ఉండాలి. కనుకనే స్థాయి కలిగిన హేతువాదిగా (నామమాత్రపు హేతువాదికాకుండా) ఉండాలన్నా, హేతువాదోద్యమ కార్యకర్తగా సమర్థవంతంగా కొనసాగాలన్నా, వ్యక్తి, సమాజము, ప్రకృతి అన్నవాటికి సంబంధించి, శాస్త్రీయ సమాచారాన్ని ఆర్జించుకుని ఉండాలి. అది జరగాలంటే తప్పని సరిగా మనకు అధ్యయనం ఉండి తీరాలి. తరచుగా అధ్యయన తరగతులూ జరుగుతుండాలి.
ఒక్కమాట! ముందు మన మన తలల బూజుదులుపుకోకుండా, తలలను సరైన సరుకుతో నింపుకోకుండా, సమాజానికి దీనినందించాలి, సమాజం నాదే అని నిండు గుండెతో తలంచకుండా, మనలో ఏ వ్యక్తీ యోగ్యమైన హేతువాదిగా ఉండలేడు. హేతువాదోద్యమ సారధిగ నూతన పాత్రకు న్యాయం చేయలేడు. కనుక మిత్రులారా! అధ్యయన పరులుకండి, అధ్యయన తరగతులను ఎక్కడికక్కడ ఆరంభించండి. ఆలోచించి స్పందించండి ఉంటాను. ఉద్యమాభినందనలతో
మీ
సురేంద్ర
రాష్ట్ర సంక్షోభం - పరిష్కార యత్నాలు
ప్రజాసంక్షేమం, సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం అన్న మూడంశాల ప్రాతిపదికనే రాష్ట్రాల పునర్విభజన పనులు జరగాలన్నదే రాజ్యాంగ హృదయం.
దీనిని దృష్టిలో పెట్టుకోకుండా అడిగేవన్నీ, చేసేవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనవే అవుతాయి. అలాటివన్ని సమన్యాయాన్ని పట్టించుకోనివీ, ఎవరికివారు తమ వంతుకు అధిక లాభం కోరుకునేవిగానే ఉంటాయి. ప్రస్తుతం వినవస్తున్న మూడు ప్రాంతాలవారి వాదనలుగానీ, విభజన జరగాలి, విభజన జరగవద్దు అన్న రెండు ప్రధాన వాదనలుగానీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నవిగాకాక 'తన-పర' అన్న దృష్టితో స్వీయప్రయోజనాలనుద్దేశించినవిగ మాత్రమే ఉంటున్నాయి. పార్టీల స్వప్రయోజనాలు, ప్రాంతాల స్వప్రయోజనాలు అన్న దానికి, ఉద్యమానికి తమబలం చాలదనుకున్న రాజకీయులు ఉద్యోగుల్నీ, రేపటి ఉద్యోగార్దులు మీరేనని చెప్పి విద్యార్ధుల్ని రెచ్చగొట్టి ఉద్యమంలోకి ఈడ్చుకొచ్చారు. ఈ కుట్ర ఎక్కడ బైటపడుతుందోనని అనిపించి ఈ ఆందోళన రాజకీయులు చేస్తున్నది కాదనీ, ఉద్యోగులూ విద్యార్థులూ పూనుకుని, ప్రజలనూ కలుపుకుని రాజకీయుల, రాజకీయాలకతీతంగా న్యాయంకొరకు చేస్తున్న పోరాటంగా చిత్రించేందుకు పడరాని పాట్లన్నీ పడి కొంత వరకు సఫలీకృతులు కూడా అయ్యారు.
ప్రజలెప్పుడూ వివిధ శ్రేణుల నాయకుల ఎత్తుగడలలో పావులుగనో, కొన్ని సార్లౖేతే బలిపశువులుగనో అయ్యేటివాళ్ళేనన్నది అంబేద్కర్‌ 1948 ప్రాంతాలనాడే చెప్పాడు. అతడన్నాడనికాక, అది ఎప్పుటికప్పుడు ఎప్పుడు పరిశీలించి చూడగలిగినా, జరుగుతున్న వాస్తవమేనని రుజువవుతూ వస్తోంది. ఈ సారి అదే జరిగింది. అయితే అది సాదాసీదాగా, అంతగా ఆందోళనపడనక్కరలేని స్థాయిలోకాక, ప్రమాదకరస్థాయికి పరిణమించింది.
రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన నియంత్రణను దాదాపుగా కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం ఒక వంక వచ్చిపడుతున్న అవినీతి ఆరోపణల నుండి బైటపడడానికీ, రాజకీయ భవిష్యత్తు కొరకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ను కోవడంతో తలమునకలై ఉంది. ఎక్కడా రాజ్యాంగానుకూల వైఖరిగానీ, నీతి న్యాయాలన్న దృష్టి గాని కనపడడం లేదు. తంతేనో, తంతాడనిపిస్తేనో తప్ప ఎవరిపనులను పట్టించుకునే పరిస్థితి లేదక్కడ. సమన్యాయమన్న మాట, పనిలేనివాళ్ళో, అసమర్థులో మాట్లాడేమాటగా వాడుకలో చూడడం మొదలైంది. ఇవెంతటి అడ్డగోలు పరిస్థితులైనా, సమష్ఠిహితైషులైన మేధావులు పూనుకుని సమాజానికి దిశా నిర్ధేశం చేయవలసే ఉందన్నది విజ్ఞులు కాదనలేని వాస్తవం. అదిగో ఆ బాధ్యతను గుర్తెరిగిన మేము ఆ దిశగా కొన్ని యత్నాలు చేయ మొదలిడినాం.
అందులో ప్రస్తుతం మూడు ప్రాంతాలుగ చూడబడుతున్న సీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మొత్తంగా చూస్తే ప్రతిప్రాంతంలోనూ కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నా (ఉదాహరణకు సీమలో అనంతపూర్‌, తెలంగాణలో మెహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌; ఆంధ్రలో (శ్రీకాకుళం ప్రకాశంలో కొంత భాగం) ప్రాంతాలవారీగా రేపు విభజన జరిగాక స్వయంగా నిలదొక్కుకోలేని పరిస్థితి సీమకే ఉంది. మిగిలిన రెండు ప్రాంతాలకు అంటే ఆంధ్ర, తెలంగాణా (ఏది వెనక, ఏది ముందన్నదలా ఉంచినా) కొద్దికాలంలో పోటీపడి నిలదొక్కుకుని అభివృద్ధి చెందే అవకాశాలు తగినంతగానూ ఉన్నాయి. కనుక విభజన అనివార్యమే అయితే, మాట్లాడుకోవలసిన విధి విధానాలలో తొలిప్రాధాన్యత సీమనేమిచేద్దామన్నదిగా ఉండాలి. ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణాలు రెండూ సీమ భద్రత విషయంలో చిత్తశుద్ధితో బాధ్యత వహించాలి.
అలాగే గ్రామ సీమలు అంతో ఇంతో పుంజుకోవాలంటే కనీస పక్షంగానైనా వాటికి ఎంతో కొంత శాతం బడ్జెట్‌ నిధుల్ని నేరుగా అందేలా కేటాయింపులు జరగాలి. సంపాదనే పరమావిధిగా నడుస్తున్న అధికార రాజకీయాలు, వ్యాపార రాజకీయాలలో కాకలు తీరిన రాజకీయులు ఈ పనులు చేయడానికి వారంతట వారుగా పూనుకోనే పూనుకోరు. సమర్ధత, మనస్సు ఉన్నవాళ్ళు పై నుండే విధానం ద్వారా అవి జరిగేలా చూడడమో ప్రజలు మేల్కొని తమదితమ కిమ్మని నిలవేయడమో చేయడం ద్వారా మాత్రమే ఆ పని జరుగుతుంది. అందులోనూ ప్రజలందరిని అందుకు సన్నద్దుల్ని చేయడం అంత సులభమూకాదు, అంతత్వరగానూ కాదు. కనుక కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళలో సమాజహితాన్నికోరగల మంచివాళ్ళను కదిలించడం ద్వారా ఆ పని జరుగుతుందేమో ఒక ప్రయత్నం చేద్దాం అనుకుని మేము కొందరం అందుకు పూనుకున్నాం.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, సాధికారిక సమాఖ్య అన్న రెండు వేదికల ఉమ్మడి నిర్వహణతో ఈ కృషి ఆరంభమైంది. డా.బ్రహ్మారెడ్డిగారి సారధ్యంలోని జె.వి.వి. సత్యాన్వేషణ మండలి, ఏకలవ్య, జై భారత్‌లు స.హ ఐక్యవేదికనుండీ, లోక్‌సత్తా, సోలిపేట రామచంద్రారెడ్డిగారూ మరి కొందరు మిత్రుల సాధికారిక సమాఖ్య వైపు నుండీ ఈ పనిని మొదలెట్టారు. సమాజహిత కాంక్ష ప్రజాస్వామికీకరణ జరగాలి అన్న ఆకాంక్ష బలంగా కలిగిన కె. నాగేశ్వర్‌ (యం.ఎల్‌.సి) పద్మనాభయ్యగారు, కె.ఆర్‌. వేణుగోపాల్‌గారు, రాజేశ్వరరావుగారు, సాయిరెడ్డిగారు, మరి ఎం. పద్మనాభరెడ్డిగారు కొందరు మేధావుల్ని వేదిక మొదలెట్టిన కార్యక్రమంలోకి కలసిరావలసిందిగా అభ్యర్థించాలనుకోవడం జరిగింది. అలాగే స్థానిక ప్రభుత్వాలకు అధికారాల విషయంలో క్రియాశీల పాత్ర వహించాల్సిన పంచాయితీ సర్పంచులనూ ఈ కృషిలో భాగస్వాముల్ని చేయాలనుకున్నాము. మూడు, నాలుగంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రంలోని అన్ని పార్టీల దృష్టికీ తేవాలన్నది తొలిథ కార్యక్రమంగా అనుకున్నాం.
దీనిపై ఈనెల 22వ తేదీన ఒక సమావేశాన్ని హైద్రాబాద్‌లో నిర్వహించాలనుకున్నాము.
అందులో స్వీకరించాల్సిన అంశాల ముసాయిదా రూపం ఇలా ఉంది.
(1) రాయలసీమను అభివృద్ధి పరచేందుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి, పరిశ్రమలను ఆకర్షించాలి. పారిశ్రామికులకు వివిధ పన్ను మినహాయింపులూ, కేంద్ర నిధులనుండి ప్రత్యేక కేటాయింపులూ జరగాలి. (అలాగే మూడు ప్రాంతాలలోని వెనుకబడిన జిల్లాలకు, జిల్లా భౌగోళిక పరిస్థితులకనుగుణ్యమైన అభివృద్ధి పథకాలను రూపొందించి, అందుకుగాను ప్రత్యేక నిధులను సమకూర్చాలి)
(2) నీటి వనరుల విషయంలోనూ పంపిణీ విషయంలోనూ మూడు ప్రాంతాల ప్రతినిధులతో కూడి, నిపుణుల కమిటీని వేసి, నీటి పంపిణీ త్రిసభ్య కమిటీ నిర్ణయాలకు లోబడి ఉన్న నీటిని న్యాయబద్దంగా పంచుకోవాలి.
(3) అధికార వికేంద్రీకరణకు, పెద్ద మనుషుల ఒప్పందంగా విభజన జరిగాక ఏర్పడే రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సిద్దం కావాలన్న నిబంధనను చేర్చాలి.
(4) కేంద్ర ఆర్థిక ప్రణాళికా సంఘం పంచాయితీలకు బడ్జెటు నుండి 25% నిధులను నేరుగా దఖలుపరిచేలా ప్రణాళికారచన చేయాలి.
(5) బాగా వేడెక్కి ఉన్న వాతావరణాన్ని, జాతీయతా స్ఫూర్తితో  మనమంతా 'ఏకప్రజే' నన్న భావనతోను క్రమంగానైనా చల్లబడేలా మూడు ప్రాంతాల వారి న్యాయబద్దమైన కోర్కెలు - అవసరాలు - తీరెలా నియమనిబంధనల్ని రూపొందించాలి. ఈ అంశాల సంక్షిప్త రూపంతో కేంద్రానికో మెమోరాండం ఇవ్వాలన్నది ఇప్పటి మా యోచన.

22వ తేదీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొనగోరు వారు క్రింది  నెంబర్లకు ఫోనుచేసి తెలుసుకొనవచ్చు. 9440474404, 9959828887, 9866074023, 040-27674649, 9490470064.
హేతువాద ఉద్యమ గీతం

పల్లవి : హేతువాదులం మేము హేతువాదులం
మానవాభ్యుదయం కోరు సుమతిశీలురం - మేము ప్రగతి గాములం
(1) ఆలోచన లేకుంటే అడుగు ముందు కేయలేవు
ఆధారం లేకుండా ఆలోచన చేయలేవు
దిక్కుమాలినాలోచన చిక్కు లెన్నొ చేరవేయు
చక్కనైన ఆలోచనె చిక్కులన్ని చక్కజేయు .... హేతు ||
(2) వెనుకకు చూడాలన్నా ముందుకు పోవాలన్నా
హేతుబద్ద యోచనే ఎవరికైన దిక్కన్నా
యోగ్యమైన ఆలోచనే బ్రతుకుబండి విరుసన్న
అది చక్కగ లేకుంటే బండినడక గుండు సున్న ... హేతు ||
(3) హేతువాద మంటేనే ఎగిరెగిరీ పడతావు
చక్కనైన ఆలోచన అక్కర లేదంటావు
తిక్కగాని రేగిందా పిచ్చికుక్క కరిచిందా
ఒక్కదినం బ్రతికి చూపు హేతుబుద్ది లేకుండా .... హేతు ||
(4) ఇంగిత జ్ఞాన మన్నదీ హేతువు ఫలితమేర
విచక్షణా జ్ఞానమున్ను హేతుబుద్ది జనితమేర
వైజ్ఞనిక ప్రగతికంత హేతుబుద్దె మూలమురా
హేతుబుద్ది లేకుంటే బ్రతుకు బుగ్గిపాలేరా .... హేతు ||
(5) శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకొమ్మని
అశాస్త్రీయా లన్నింటిని గెంటి వేయరమ్మని
ప్రయోగాల పద్దతిన ఆర్జించిన జ్ఞానాన్నే
అందుకునీ ప్రగతిబాట పయనింతము రండనే ... హేతు ||

Thursday, August 1, 2013

రాష్ట్రాన్ని రావణ కాష్టంచేస్తున్న రాజకీయాలు


1) రాజకీయుల స్వరూప స్వభావాలు :-

ష రాజకీయులు తమను న్యాయసమీక్షా పరిధికి లోబడని వారుగా తలుస్తున్నారు.

ష రాజ్యాంగ బద్దంగా ప్రవర్తించాలన్న దృష్టి వారిలో కలిగ్గానిక్కూడా (అస్సలేమాత్రం) కానరావడం లేదు.

ష తమపోకడకు రాజ్యాంగబద్దత అన్న రంగుపులమాలన్న తపన మాత్రం దండిగా ఉంది.

ష రాజకీయులందరూ ప్రజాస్వామ్యమన్న పదాన్ని తరచుగా వాడేస్తుంటారు. ఆచరణలో మాత్రం రాచరిక - నియంతృత్వ - వైఖరినే కలిగుంటారు.

ష పేరుకు మాత్రం ప్రజాసేవకులమంటుంటారు. చేతలలో అంతటా పెత్తందారీ తనమే చూపిస్తుంటారు.

ష తమది అనుకున్న దాని ప్రయోజనం కొరకు, అనేకులకు మేలు కలిగించే వాటినైనా బలిపెడుతుంటారు.

ష కనీసం మూడో వంతుకు పైగా నేరచరితో, నేరారోపణపై న్యాయవిచారణో కలిగిన వారుగా ఉన్నారు.

ష ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడమే సర్వత్రా కనిపిస్తున్నది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని హత్య జేయడంతో సమానం.

ష ఓటరును స్వతంత్రంగా తన నిర్ణయాన్ని ప్రకటించనీయకుండా రాజకీయులు చేస్తున్న పనులు ఎన్నో!

1) అందులో ముఖ్యమైనది; అతణ్ణి అజ్ఞానంలో ఉంచడమూ తప్పవగాహన కలిగించడము అన్నది.

2) మతం పేరున, కులం పేరున, ప్రాంతం పేరున, పార్టీపేరున, ఓటరును తన పర అన్న ఆవేశాలకు లోను చేసి గుండు గుత్తగా ఓట్లు దండుకోవాలనుకోవడం.

3) స్థానికంగా ఉండే గుంపు నాయకులకు, వారి వారి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుతామనే ఆశ జూపి ఓట్లు దండుకోవడం.

4) స్థానికంగా ప్రజలలో ఉండే సమస్యల్ని ఆసరా చేసుకుని వారిని శతృమిత్ర సమూహాలుగా విడగొట్టి విభజించి పాలించు అన్న కుటిల నీతిని అమలు చేసి ఊరుమ్మడితనాన్ని తలెత్తకుండా చేయడం.

5) ప్రజలకు అందాల్సిన నిధులను తాము మింగగలిగినంత మింగి, ఆ మిగిలిన దాన్నైనా తామేదో జనం కొరకు దానం చేస్తున్నట్లో వరాలిస్తున్నట్లో మభ్యపెట్టి వారిని లొంగదీసుకోవడం

6) చివరి యత్నంగా ఓటును, అప్పటికి ఉన్న డిమాండు ననుసరించి ఎంత ధరైనా చెల్లించికొనడం

7) మానసిక సమతుల్యత ఉంటే ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తారేమోనన్న అనుమానంతో, వారిని మత్తులో ముంచేటందుకు మద్యాన్ని ఏరులా పారించడం.

8) ఆశకు, ప్రలోభాలకు లొంగనివారిపై దాదాగిరిని ప్రయోగించడం. కడతేర్చడం.

యోచనాశీలులారా!

ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు కాదంటారా? ఒక్కమాట! రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానాలలోకి చొరబడ్డవారు ఇలాటి దిక్కుమాలిన పనులు చేయడానికి తెగబడే అవకాశం ఉందని అంబేద్కర్‌ లాంటి మేధావులు ఆనాడే ఊహించి మనల్ని హెచ్చరించారు కూడాను. వారి మాటల్నే వినండి.

1) రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు పరచే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు పరిచే వారు మంచివారైతే అది మంచిదవడం కూడా ఖాయం.

2) రాజ్యాంగపు పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపంపైన మాత్రమే ఆధారపడి ఉండదు. అది దేశానికి శాసన నిర్మాణ, కార్య నిర్వాహక, న్యాయ - శాఖలను అందించుతుంది. ఈ మూడు శాఖలు ప్రజలపైనా, వారు ఏర్పరచుకున్న పార్టీలపైనా ఆధారపడి ఉంటాయి. భారత ప్రజలు, వారి పార్టీలు ఎలా నడచుకుంటాయో ఎవరు చెప్పగలరు? అవి తమ ఆశయాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలను అనుసరిస్తాయా? విప్లవ విధానాలనా? వారు విప్లవ విధానాలను అనుసరిస్తే రాజ్యాంగం ఎంతమంచిదైనా, విఫలమై పోతుందనడానికి ఏ జ్యోతిష్కుడూ అక్కరలేదు.

3) రాజకీయ విధానాలన్నవి హక్కులూ విధులకు చెందిన సమస్యగా ఉంటాయి. పౌరుడు కడకు ఎవరికి విధేయుడుగా ఉండాలన్నది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి సమాధానం ఒక్కటే.

అత్యయిక పరిస్థితుల్లో పౌరుడు కేంద్రానికే విధేయత చూపాలి. రాష్ట్రాలకు కాదు. ఇందుకు సందేహం లేదు. ఎందుకంటే కేంద్రం మాత్రమే సమష్టి లక్ష్యాల కోసం పని చేయగలదు. అత్యయిక పరిస్థితుల్లో రాష్ట్రాలు తమ సొంత, స్థానిక ప్రయోజనాలతోబాటు, దేశ ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

4) కులాల, తెగల రూపంలో ఉన్న మన పాత శతృవులతోబాటు, పరస్పర విరోధ తత్వాలతో ఉన్న అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాము. ఈ వాస్తవం నన్ను మరీ కలచి వేస్తున్నది. భారతీయులు తమ తత్వాలకు (కుల,మత, ప్రాంత, పార్టీ, వర్గతత్వాలకు) అతీతంగా దేశాన్ని చూస్తారా? లేక దేశాన్ని కంటే మిన్నగా - అతీతంగా - తమ తత్వాలను చూస్తారా? నాకు తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. దేశానికి అతీతంగా పార్టీలు తమతత్వాన్ని చూసినట్లైతే మన స్వాతంత్రం తప్పక కోల్పోతుంది. కనుక స్థిరమైన నిశ్చయంతో మన మీ ప్రమాదాన్నుండి దేశాన్ని కాపాడుకోవాలి. మన చివరి రక్తపుబొట్టు వరకు స్వాతంత్రాన్ని రక్షించుకోడానికి కంకణం కట్టుకోవాలి.

5) మనది ప్రజాస్వామ్య దేశం. కానీ మన దేశం దీనిని నిలబెట్టుకోగలుగుతుందా? కోల్పోతుందా? ఇదీ నా మనస్సుకు పై విషయమంత ఆంధోళనా కలిగిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారితీసే ప్రమాదమూ ఉంది. ఇప్పుడే పుట్టిన మన ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అలా ఉంచుకునే ఆచరణలో నియంతృత్వానికి దారితీయవచ్చు. ఈ దిగజారుడు ప్రారంభమైతే జరిగే ప్రమాదం మరీ పెద్దదిగా ఉంటుంది. అది జరక్కుండా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సింది మన మన సాంఘిక లక్ష్యాలను సాధించుకోడానికి మనం రాజ్యాంగ పద్దతులకు కట్టుబడి ఉండడమే. రక్తపాతంతో కూడిన తిరుగుబాటు పద్దతులను మనం విడిచి పెట్టాలి. సత్యాగ్రహాలు, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన వంటి పద్దతులను విడిచిపెట్టాలి. రాజ్యాంగ పద్దతులు అందుబాటులో ఉండగా, రాజ్యాంగేతర పద్దతులను అవలంబించడంలో అర్ధం లేదు. రాజ్యాంగేతర పద్దతులు అరాచకత్వానికి వ్యాకరణం లాటివి. వీటిని మనం ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిది.

6) ఇండియాలో భక్తిభావం లేదా వీరపూజ రాజకీయాలలో చాలా పెద్ద పాత్ర వహిస్తోంది. .... మత విషయంలో భక్తి ముక్తికి ఒక మార్గం కావచ్చుగానీ, రాజకీయాలలో భక్తి లేదా వీరపూజ దివాళా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికీ సూటిదారి అవుతుంది.

7) సోదరభావం లేనంతకాలం ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అమలవదు. సోదరత్వం లేకుంటే, స్వాతంత్య్రం, సమానత్వం అనేవి లోతుకు వెళ్ళని పై పై రంగు పూతలు మాత్రమే.

8) మన ముందున్న కర్తవ్యాల గురించి ఇవి నా భావాలు. ఇవి కొందరికి రుచించకపోవచ్చు. ఈ దేశంలో రాజకీయాధికారం కొందరికే ఏకస్వామ్యంగా ఉందనడంలో అబద్ధం లేదు. చాలా మంది బరువు మోసే పశువులు గానే కాదు బలిపశువులు గానూ ఉన్నారనడంలో అబద్దం లేదు. ఈ ఏకస్వామ్యం కేవలం ప్రజల అభివృద్ధి అవకాశాలను నిర్మూలించడమే కాదు, వారికి జీవితమంటే అర్థమేలేకుండా చేసేసింది.

9) వివక్షకు గురైన వర్గాలలో, తమ సొంత గుర్తింపు కై పడే ఆరాటం ఒక వర్గపు పోరాటంగా మారనివ్వకూడదు. అది ఇంటిని ముక్కలు చేయడానికి దారితీస్తుంది. అది నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తమే.

10) ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టాలంటే అది ప్రజల చేత నడపబడేదిగా ఉండాలి. అది జరగకుండా, ప్రజల కొరకు నడపబడే ప్రభుత్వాన్ని కోరడమంటే ప్రజాస్వామ్యాన్ని కోల్పోయినట్లే. కనుక ప్రజలచేత నడుపబడే ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పనికంటే దేశ సేవ అనదగ్గది మరొకటిలేదు.

(4-11-1948, 25-11-1949 తేదీలలో రాజ్యాంగ సభలో అంబేద్కర్‌ చేసిన ప్రసంగ వ్యాసాలనుండి)

ష వాక్స్వాతంత్య్రాన్ని గురించి, భావ ప్రకటనా స్వేచ్చ గురించి అంబేద్కర్‌ ఏమన్నాడో చూడండి.

''భావ ప్రకటనా స్వాతంత్య్రం అనేది చాలాకాలంగా స్థిరపడిన ప్రాథమిక సూత్రం. అది రాజ్యాంగం చేత కాపాడబడుతూ ఉంది. అంత మాత్రాన బాధ్యతా రహితంగా ఏది పడితే అది ప్రసంగించడం గానీ, ప్రచురించడం గానీ చేసే పరిపూర్ణ హక్కును అది ఇవ్వదు. అదుపులేని మితిమీరిన స్వేచ్చను అది ఇవ్వదు. ఇష్టానుసారం ప్రసంగాలకు రక్షణ ఇవ్వదు. పైగా దానిని దుర్వినియోగం చేసే వారిని శిక్షిస్తుంది.

ష ప్రాతిపదికగా ఉండదగ్గ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పి ప్రస్తుత రాష్ట్ర సమస్యను విశ్లేషిస్తాను.

రాజ్యాంగ రచనోద్దేశాన్నంతటిని రాజ్యాంగంలోని ప్రస్తావన ప్రకటిస్తోంది. అది రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరుస్తోంది. ఆ మొత్తాన్ని క్లుప్తీకరిస్తే దాని రూపం ఇలా ఉంటుంది.

ష ''సోదరభావము, సమైక్యత, అఖండత, సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి'' అన్న ఐదు లక్ష్యాల కొరకే రాజ్యాంగాన్ని ఆ విధంగా రూపొందించుకోవడం జరిగింది.

కనుక రాజ్యాంగంలోని ఏ అధిశాసనాలకు గాని అర్థాలు చెప్పుకోవాలన్నా, వ్యాఖ్యానం చేయాలన్నా వివరణ లిచ్చుకోవాలన్నా అవన్నీ పై ఐదు లక్ష్యాల సాధనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది పట్టి చూసుకుంటుండాలి. ఈ ఐదు లక్ష్యాలను కూడా ప్రజాస్వామ్య బద్దంగానే చేరవలసి ఉంటుంది.

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

పై భావాల వెలుగులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న కుహనా రాజకీయ పోకడలను వీక్షించి సమీక్షించే పని చేద్దాం.

ఇంతకూ తెలంగాణా విభజన ఉద్యమం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యమైందేనా?

సమా :- రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి నాకున్న అవగాహన ప్రకారం ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజ్యాంగ స్పూర్తికి అనుగుణ్యత కలిగుంది కాదు. నిజానికి ఇక్కడ నడుస్తున్న ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాలూ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతికూలమైనవే. ఇక ఉత్తరాంధ్ర సీమ ఉద్యమాలు సరేసరి. ఎందుకంటే?

రాజ్యాంగంలోని 2, 3 ఆర్టికల్సు రాష్ట్రాల విభజనకు సంబంధించిన శాసన రూపాలు. అందులోనూ 3వ ఆర్టికలు (అధికరణము, పరిచ్చేదము, అధిశాసనము అన్న పదాలూ ఆర్టికల్‌ అన్నదానికి సమానార్థకాలే). కొన్ని చిన్న రాష్ట్రాలను కలిపి ఒకటి చేయడానికీ, ఉన్న రాష్ట్రాన్ని విభజించడానికీ, సరిహద్దులను, పేర్లను మార్చడానికీ వీలు కలిపిస్తున్నది. ఈ ఆర్టికలును సక్రమంగా అన్వయించుకోవాలంటే 1) ఆ పని చేయడానికి అధికారం ఎవరికుంది? 2) ఎందుకు చేయాలి 3) ఎప్పుడు చేయాలి? అన్నది సక్రమంగా నిర్ధారించుకోగలగాలి ఆ వివరాలివిగో.

1) మూడవ ఆర్టికలును అమలుపరిచే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.

2) దేశ ప్రయోజనాలకు, పాలనా సౌలభ్యంకొరకు, పైన ప్రస్తావన లక్ష్యాల నెరవేర్పు కొరకు అవసరమన్నప్పుడే అది చేయాలి.

ష ఒక ప్రాంత ప్రజలు తామువిడిపోవాలని కోరుకుంటే చేయాలా? చేయవచ్చా?

సమా :- చేయనఖ్ఖరలేదు. పై లక్ష్యాలకు ఆటంకంగా ఉంటే చేయకూడదు కూడా.

రాష్ట్రం మొత్తం రాష్ట్రాన్ని విభజించమని కోరితే విభజించేపని చేయవచ్చా?

సమా :- దేశ ప్రయోజనాలు, రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణ్యత ఉంటే చేయవచ్చు. లేకుంటే చేయకూడదు. అప్పుడైనా సమస్య రాష్ట్రానిదై ఉండకూడదు. దేశానిదై ఉండాలి.

ష రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడితే విభజన చేయాల్నా?

సమా :- ఇది అధికారంలో ఉన్న పార్టీ ఇష్టపడితే అన్న అర్ధాన్నిస్తున్నది. అంతమాత్రాన చేయడానికి వీల్లేదు.

ష పోనీ కేంద్ర ప్రభుత్వం ఇష్టపడితే ఆ పని చేసే అధికారం ఉంటుందా దానికి?

సమా :- రాజ్యాంగ హృదయాన్ని బట్టి అయితే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ అధికారంలేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీకి మెజారిటీ ప్రజల ఆమోదం ఉన్నప్పటికీ రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికీ ఆ అధికారాన్నివ్వలేదు. అధికారం చేతికి అందుకున్నప్పటికీ ఆ పార్టీగానీ, ప్రభుత్వంగానీ దేశం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించలేరు కనుక. అట్టి స్వభావం మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థరీత్యా పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. పార్లమెంటు అదిన్నీ లోక్‌ సభే దేశం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించగలుగుతుంది. రాష్ట్రాల విభజన, కలయికలన్న విషయంలో నిర్ణయం తీసుకోవలసింది పార్లమెంటు మాత్రమే అంటున్నామంటే, దేశ ప్రజలంతా కలసి చేయవలసిన నిర్ణయమది అని అంటున్నామనే. కనీసం దేశ ప్రజలలో పెద్ద భాగం తీసుకోవలసిన నిర్ణయమది అనంటున్నామన్నమాట.

రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు కోరారనిగానీ, రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారనిగానీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ఇతర పార్టీలు కోరాయని గానీ, రాష్ట్ర ప్రభుత్వం కోరిందని గానీ, కేంద్ర ప్రభుత్వం కోరిందని గానీ, కేంద్రంలో అధికార పార్టీ ఇష్టపడిందని గానీ '3' వ ఆర్టికలును అమలు చేయనక్కరలేదు. అస్సలా ఆర్టికలు ఈ కూటాల ఇష్టాయిష్టాల నెరవేర్పు కొరకుగా ఏర్పడింది కానేకాదు. అందునా ప్రాంతీయ అసమానతల నేపధ్యం నుండి పుట్టుకొచ్చిన ఆంధోళనోధ్యమాల వత్తిడిననుసరించైతే దానిని అమలు చేయనే కూడదు.

ష కనుకనే రాష్ట్రంలో చాలా కాలం క్రితమే ఏర్పడి కొనసాగుతున్న మూడు ఉద్యమరూపాలూ ప్రజాస్వామ్యపు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యత కలిగినవి కాదంటున్నాము. అవి మూడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను సమానాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పరచడానికి గానీ, దేశ ప్రయోజనాల నాశించి గాని పుట్టుకొచ్చినవి కావు. వాటన్నింటి ప్రధాన లక్ష్యం తమయొక్క, తమగుంపు యొక్క, లేదా తమ ప్రాంతం యొక్క ప్రయోజనాల నుద్దేశించినవీ, ఆ విషయంలో ఇతరుల ప్రయోజనాలకు భంగం కలిగినా పరవాలేదనుకునేటివిగానే ఉన్నాయి. చిన్న నా బొజ్జకు శ్రీ రామరక్ష సిద్దాంతమే వాటన్నింటిదీ. బాగాలోతుగా పరిశీలించి చూస్తే గత 60 ఏండ్లుగానూ వీటిని పట్టుకున్న వారు (1) రాజకీయ పార్టీలు - వాటి అధికార రాజకీయాలు,.

2) బడాబడా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వ్యాపార వేత్తలు (ఇన్వెష్టర్సు) మాత్రమేనని తేలుతుంది.

ష అంబేద్కర్‌ ఆనాడే చెప్పినట్లు దేశంలో ప్రజాస్వామ్యం పేరునా, పార్టీల పేరునా కూడా ఏకస్వామ్యమే అమలవుతోంది. రాజకీయ క్షేత్రాలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఏ నాడో తుంగలో తొక్కేశాయి.

ఆ నాడాయనన్నది ఈనాడు మరింత స్పష్టమైన రూపు ధరించి ఉంది. ప్రజాస్వామ్యం ఎలాగూలేదు సరే పార్టీ స్వామ్యమూ నామమాత్రమే. బృందస్వామ్యంగానీ, నాయక స్వామ్యంగానీ మాత్రమే వాస్తవంలో నడుస్తోంది. ఈ నిజం రాజకీయ నాయకులందరకూ తెలుసు. దీనిని ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా మార్చలేమనీ తెలుసు. ఇంకా సరిగా చెప్పాలంటే, చాలమందికైతే, అలా మార్చడం రాజకీయం తెలియని తనమేననీ అనిపిస్తుంటుంది. అధికారం, పదవీ ఎన్నాళ్ళుంటాయో తెలియని అనిశ్చిత స్థితి ఉంది. ఈ స్థితికి చేరడానికే జీవితమూ, ధనమూ కూడా చాలా ఖర్చైంది. కనుక దీపం ఉండగనే ఇల్లు చక్క బెట్టుకో అన్న ఒకే ఒక్క సూత్రం పనిచేస్తూ ఉంది ఎక్కువలో ఎక్కువ మందిలో ఇలాటి పరిస్థితుల్లో ''రంకునేర్చినమ్మబొంకనేర్చదా'' అన్నట్లు ప్రతి రాజకీయ వ్యాపారీ త్యాగాల గురించి, దేశాన్ని గురించీ, ప్రజల గురించి తెగవదరు తుంటాడు. జనం కోసమే బ్రతుకుతున్నట్లు నటిస్తుంటాడు.

ఈ మధ్యనే జరిగిన ఒకటి రెండు సంఘటనలను ఉదహరించుకుంటే వీరి బాగోతం ఇట్టే బట్టబయలౌతుంది. 1) నేరచరితులు, నేరారోపణల వల్ల నిర్భంధంలో ఉన్నవాళ్ళు, శిక్షలు ఖరారైన వాళ్ళు ప్రజాప్రతినిధులుగ ఉండదగరు. అట్టివారు మరికొంత కాలం పాటు ఎన్నికలలో పాల్గొనడానికీ అనర్హులవుతారు. అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కొన్ని పరిశోధనా విభాగాలందించిన సమాచారం మేర ప్రజాప్రతినిధులుగ, మంత్రులుగ శాసన సభలలోనూ, పార్లమెంటులోనూ, జిల్లా పరిషత్తులలోనూ చేరి ఉన్న వారిలో మూడో వంతుకు పైగా సుప్రీంకోర్టు తీర్పుననుసరించి అనర్హులవుతారు. కొంతమందైతే హత్యారాజకీయాల క్రింద శిక్షలు పడికూడా పై కోర్టుకు అప్పీలు చేసుకోవడమనే వెసులు బాటును వాడుకుని ప్రజాప్రతినిధులుగనే అధికారంలో ఉండగలుగుతున్నారు.

అస్సలు విషయమేమంటే, పార్టీలన్నీ కలసి కోర్టులు పార్లమెంటు సార్వభౌమాధికారంలో తలదూర్చుతున్నాయి. ఆ పని చేయకుండేలా రాజ్యాంగ సవరణ చేస్తాము అన్న వైఖరిని కనబరుస్తున్నాయి.

2) ఇలాటిదే మరో ఘటన, స.హచట్టం కేంద్ర కమీషనర్‌ తీర్పుకు సంబంధించింది. రాజకీయ పార్టీలూ స.హ చట్టం పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే అవి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా ప్రజాధనాన్ని వాడుకుంటున్నాయి కనుక అంటూ ఆ వివరాలనూ (అవి ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని వాడుకున్నాయోనన్న వివరాలనూ) బహిరంగంగా ప్రకటించి ఆ పార్టీలు స.హ. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలను ప్రారంభించాలి. అన్నదే ఆ తీర్పు ఆ దేశం.

గగ్గోలు పెట్టేశాయి ఆ పార్టీలన్నీ. మేము ఆ చట్ట పరిధిలోకి రాము అనన్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం వస్తామనే గనక అన్నట్లైతే, పార్లమెంటులో పార్టీలను మినహాయించేలా సవరణ చట్టాన్ని తీసుకొస్తాము అంటూ నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ, ప్రజాధనం నుండే జీతభత్యాలు తీసుకుంటూ ప్రజల నుండి సేకరించిన విరాళాలు వగైరాల జమా ఖర్చులు ప్రజలకు చూపించండి అంటే, అది మేము చేయము అనంటున్న పార్టీల నేమనాలి? ఇక ఈ రకంమంద దేశ సమైక్యతను, అఖండతను, సమానాభివృద్ధిని కాంక్షిస్తాయని, అందుకు అవసరమైన సోదర భావాన్ని ప్రజల్లో నెలకొల్పుతాయని అనుకోగలమా?

అంబేద్కర్‌ భయపడ్డ రెండు అరిష్టాలూ మన నెత్తి మీద కొచ్చిపడ్డాయి. 1) ప్రజాస్వామ్యం పేరున నియంతృత్వం చెలామణి కావడం, 2) రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన స్ధానాలలోకి చెడ్డ వారు - అయోగ్యులు - వచ్చి చేరడం పరాయి పాలన అంతమైందేగానీ, ప్రజలకు స్వతంత్రం రాలేదింకా ఈ దేశంలో.

రాజకీయ నటనాధురీణాలు

1) తెలుగుదేశం పార్టీ వాడు కాంగ్రెసు వైకాపా కుమ్మకయ్యాయంటాడు.

2 కాంగ్రెసు వాడు తె.దే.పా, వైకాపా కుమ్మకయ్యాయంటాడు.

3. వైకాపా వాడు కాంగ్రెసు తెలుగుదేశం కుమ్మక్కయ్యాయంటాడు.

ష వీరికిదేమి పోయేకాలం? ఇన్ని నిజాలుంటాయా? ఇవన్నీ నిజాలేననుకోడానికి ప్రజలు వెంగళప్పలా? ఇన్ని నిజాలుండవన్నది. ఎంత నిజమో అయినా, వీటిని మూటినీ మోసే మందజనంలో ఉంటూనే ఉన్నారన్నదీ అంతే నిజం.

ష తమతమ ఆశయాలను రాజ్యాంగ బద్ద పద్దతుల ద్వారానే సాధించుకోవాలిగాని, రాజ్యాంగేతర పద్ధతులను అనుసరించనేకూడదు అని అంబేద్కర్‌ చెప్పాడు.

ష బందులు, రాస్తారోకోలు వగైరాలన్నీ రాజ్యాంగ విరుద్దమైన వని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ జరుగుతున్నదేమిటి? ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగ బద్దంగా బందులు చేసుకుంటుంటే అటకాయిస్తున్నారు పోలీసులు అని పార్టీలంటున్నాయి.

ష భావ ప్రకటనా స్వేచ్చ పేరున, వాక్స్యాతంత్య్రం పేరున బెదిరింపులు, బండబూతులు తిట్టుకుంటున్నారు.

ష పేరుపెట్టి మరీ తిట్టడం, బొమ్మచేసి దానిని చెప్పుతో కొట్టడం లాంటివేవీ అప్రజాస్వామికంగా అనిపించడంలేదెవరికీ

ష ఈ మధ్యనే ఒక సీనియర్‌ మోస్టు రాజకీయ నాయకుడు, కె.కె. అంటారు; సమైక్యాంధ్ర అని నువ్వంటే ఎలా, కలిసుండాలంటే ఇద్దరూ అంగీకరించాలి. అందులో ఒకడు విడిపోతానంటే ఇక కలిసుండడం ఎలా? అంటూ విడాకుల ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు. ప్రాంతాన్ని విడగొట్టడానికి ఆ ప్రాంత వాసులు విడిపోతామంటే సరిపోదన్నంత అవగాహనైనా లేని ఈ రకాన్ని చూసిఏమనుకోగలం.

మరోకాయన టి.ఆర్‌.ఎస్‌ చతుష్టయంలో ఒకడు హరీష్‌రావంటారు. సమైక్యాంధ్ర అని సీమాంధ్ర వాళ్ళంటే ఎలా? సమైక్య అని అందరూ అనాలిగాని అనంటాడు. గొప్పలాజిక్కే. సమైక్యవాదాన్ని ఏదో ఒక ప్రాంతం వాడు అనకూడదన్నమాట, అంటే అది హేతుబద్దం కాదన్నమాట. ఒక వాదాన్ని చేపట్టడానికి ఆవాదం యొక్క అవసరం బలం తెలిసుంటే చాలుగాని, అతడే ప్రాంతం వాడు, ఆ మాట అన్ని ప్రాంతాల వాళ్ళు అంటున్నారా, లేదా? అన్న దాన్ని బట్టి దాని యోగ్యతా యోగ్యతలుంటాయన్న మాట. బాగుంది వివేకం. వీరిరువురి లెఖ్ఖన రేపు తెలంగాణలో ఏదో మూలనున్నవారు మేము తెలంగాణలో ఉండమంటే పొమ్మనాల్సిందే నన్నమాట. ఇతర ప్రాంతాలవాళ్ళు అదేంటిరా ఎందుకు కలిసుండవు? మనమంతా ఒక్కటే అనకూడదన్నమాట. ఇక ఇదే వరవడి దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాల మంద మేము వేరుగా ఉంటామననగానే వేరు బెట్టాల్సిందేనన్నమాట. గొప్పతర్కమే. గొప్ప సమష్టి భావనే.

విడిపోడానికొప్పుకుంటే అన్నదమ్ముల్లా కలిసుందాం. కాదంటావా ఖబడ్దార్‌, తరిమేస్తాను, అగ్ని గుండం చేస్తాను. అంటాడొకడు.

ప్రాధేయపడండి. ఉండనిస్తాం. పొట్టపట్టుకుని వచ్చిన వాళ్ళ పొట్టగొట్టం లాటి దయాధర్మపు మాటలాడతాడు మరొకడు. ఇదంతా ప్రజాస్వామ్యమే. రాజ్యాంగ బద్దమేనని కాబోలు.

అంబేద్కర్‌ చిన్న రాజ్యాలు అభివృద్ధి చెందుతాయన్నాడు అంటూ విభజన కోరేవారంటుంటారు. నిజానికిది అంబేద్కర్‌కు అపవ్యాఖ్యానం చేయడమే. ప్రాంతీయ అసమానతలను స్ధిరీకరించే చిన్న రాష్ట్రాలను అతడు ఉద్దేశించింది? అదలా ఉంచి చిన్న రాష్ట్రాలు ఎంతగా బలహీనపడ్డాయో చూడమంటారొకడు, చిన్న రాష్ట్రాలెలా అభివృద్ధి చెందాయో చూడమంటాడింకొకడు. వీడొక రెండు రాష్ట్రాలను, వాడొక రెండు రాష్ట్రాలను ఉదహరిస్తుంటారు. ఆ రాష్ట్రాల వాస్తవ పరిస్థితేమిటో, జనాభా పరిమాణమెంతో అవెందుకు అభివృద్ధి చెందాయో, ఏయే అంశాలలో అభివృద్ధి చెందాయో, ఇవెందుకు బలహీనపడ్డాయో, ఏయే విషయాలలో బలహీన పడ్డాయో వాటిని వివరించరు. అదలా ఉంచి రెండు ఉదాహరణలు మన రాష్ట్రానికెలా అన్వయిస్తాయో అస్సలేమాట్లాడరు.

ఆంధ్రప్రదేశ్‌

సుమారు 9 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మనది. అంత పెద్ద రాష్ట్రాల వల్ల దేశం మొత్తం ప్రయోజనాలకు భంగం కలగవచ్చు. కనుక రెండుగా విభజించదగిందే అయితే ఆ విభజన రాజ్యాంగాశయాలకు దోహదకారిగా ఉండగలిగేదిగా ఉండాలి. ప్రాకృతిక వనరులూ, సామాజిక వనరులూ సమానంగా పంపిణీ అయ్యేందుకు, పరిపాలనలో సౌలభ్యత నెలకొనేందుకూ, జాతీయ ఐక్యత, సోదర భావము నెలకొనేందుకూ, సమానాభివృద్దికీ దోహదపడే రీతిలో ఉండాలా విభజన. ఆ రీతిగా విభజించి ఎల్లలు నిర్ణయించుకోడానికి మూడు ప్రాంతాల వారూ ముఖ్యంగా తెలంగాణవాదులు అంగీకరించగలరా? అంగీకరించలేనపుడు రాజ్యాంగ స్ఫూర్తిని గురించిగానీ, రాజ్యాంగం ప్రకారం అనిగాని అననేకూడదు.

ష ప్రజాస్వామ్య వ్యవస్ధలో; ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవాడు, 1) తన నియోజక వర్గానికి గానీ, 2) జిల్లాకుగానీ, 3) తన ప్రాంతానికి గానీ ప్రాధాన్యతనిస్తూంటే; అతడు ప్రజాస్వామ్యాన్ని గురించి తెలియనివాడైనా అయ్యుండాలి. ప్రజాస్వామ్యం అమలవడం ఇష్టం లేనివాడైనా అయ్యుండాలి. అట్టివాడు మంత్రిగా ఉండడానికి మాత్రం తగడు.

ష అలాగే ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఒక పార్టీ వ్యక్తిగా ఎన్నికలలో నిలిచిగెలిచిన వాడు (నిజానికి గెలిచినవాడు అనకూడదు ఎన్నికైనవాడు అనే అనాలి, ఎందుకనో తెలుసా?, నియోజక వర్గానికి మొత్తానికి ప్రతినిధిగా కాక తన మండలానికో, తన పార్టీ వారికో మాత్రమే ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడనుకోండి. అతడిక రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి శాసన సభ్యునిగా పనికిరాడనే అర్థం.

ష అలాగే అతడొక శాసన సభ్యునిగా శాసన సభలో రాష్ట్ర ప్రయోజనాలను గురించి పట్టించుకోకుండా కేవలం తన పార్టీ ప్రయోజనాలో, తన నియోజక వర్గ ప్రయోజనాలో మాత్రమే చూసుకుంటున్నాడనుకోండి. అప్పుడుకూడా అతడు శాసన సభ్యునిగా ఉండదగడు. భారతరాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని ఇలా అర్ధం చేసుకుంటేనే సరిగా అర్థం చేసుకున్నట్లు.

ష రాష్ట్ర విభజనాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందనడంతోనే అది దేశ సమస్య అనీ, దేశ ప్రయోజనాలకొరకుగా చేయవలసిన పని అనీ తేల్చేసినట్లు. కనుకనే ఒక ప్రాంతంగానీ, ఒక రాష్ట్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, అసెంబ్లీగానీ, కడకు కేంద్ర ప్రభుత్వమైనా ఈ పని చేయలేదు. అది మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించే సభ మాత్రమే చేయదగినది అని చెపుతోంది రాజ్యాంగం.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దేమిటి?

రాజకీయ ప్రాబల్యం కల వ్యాపారస్తులు, రాజకీయ వ్యాపారస్తులు, జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ పార్టీలు వారి వారి స్వప్రయోజనాలకోసం ప్రజల్ని పావులుగా వాడుకుంటూ ఆడుకుంటున్న ఆటగా తయారై ఉందిది. నిజంగా వారంతా తెగ వేదనపడిపోతున్నట్లు మాట్లాడే అభివృద్ధి కొరకు ఇదంతా అన్నట్లైతే, ఆ అభివృద్ధి ప్రాంతాల విభజన దగ్గరలేదు నిజానికి అది అధికార వికేంద్రీకరణ జరిగి, స్థానిక ప్రభుత్వాలేర్పడి, నిర్ణయాధికారం, పర్యవేక్షణాధికారం. చైతన్యవంతులైన పౌరులతో కూడిన గ్రామసభలకు దఖలవడం దగ్గరుందది. అది జరిగిన రోజున రాజకీయాలు వ్యాపార స్వభావాన్ని కోల్పోతాయి. దాంతో పంపిణీ వ్యవస్ధ సక్రమపడుతుంది.

ఇక మూడు ప్రాంతాల రాజకీయాల్లోనూ నోటితుత్తరగాళ్ళున్నారు. అందులో కె.సి.ఆర్‌. నెం.1 ఆయనే తెలంగాణా రాజ్యాధిపతి అన్నట్లుంటుందాయన వాగ్దోరణి. ఉండనిస్తాం. తిండితిననిస్తాం. కడుపు పట్టుకొన్నవాళ్ళను వెళ్ళగొట్టం అంటాడు. సరిహద్దులు దాటేదాకా పారగొడతామంటాడు. మూడు ప్రాంతాలలోని ఈ రకమంతా అంబేద్కర్‌ చెప్పిన ప్రజాస్వామ్యం పేరున సాగే నియంతలన్నమాట. అవి తాత్కాలికంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికి వస్తాయేగాని, ఒక ప్రణాళికగా అమలు చేయడానికి పనికి వచ్చేవికావు. ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నా స్థలాభావం సమస్య ఉంది గనుక, ముఖ్యమైన మరొక్క విషయం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను.

రాజధాని సమస్య

1. హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.

2. తెలంగాణ రాజధానిగనే ఉండాలది.

3. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలి.

4. దేశానికి రెండో రాజధానిగా ఉండాలి.

5. కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగ ఉండాలి.

ఇవే ఈనాడు హైద్రాబాద్‌ విషయంలో వినవస్తున్న వాదనలు ముందుగా ఒక్క విషయం మనమందరం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. తెలంగాణా రూపంలో రాష్ట్ర విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. అదలా ఉంచండి. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర అన్న మూడు వాదాల వాళ్ళూ రాజ్యాంగానుకూలత అంశాన్ని ప్రక్కన బెట్టే వారివారి స్వప్రయోజనాల దృష్టినుండే ఎవరియత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు గనుక, వాటన్నంటి పర్యవసానంగా నెట్టుకొచ్చిన వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడేమి చేస్తే ఉన్నంతలో అందరకూ మేలు జరుగుతూందనేదే మనముందున్న ప్రధానాంశం అవుతోంది. పట్టించుకోవలసిన దీనిని ప్రక్కన బెట్టి గతాన్ని తవ్వుకుంటూ వాదులాడుకోవడం అవివేకం.

అసలింత ప్రాధాన్యత హైద్రాబాద్‌కు ఎందుకొచ్చింది?

మిగిలిన రాష్ట్రాభివృద్దినంతా ప్రక్కన పెట్టేసి, హైద్రాబాద్‌ను సర్వాంగేణా అభివృద్ధి పరచాలన్న తీర్మానం చేసుకుని మరీ, అటు రాజకీయులు, ఇటు పారిశ్రామికులూ, ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గాలు విద్య, వైద్య ఔషధరంగాలతో సహా హైద్రాబాద్‌నే కేంద్రం చేసుకోవడం వల్ల వచ్చిన తిప్పలివి. మొత్తం రాష్ట్రానికంతటికీ వలస ప్రాంతంగా తయారు చేసేశారు దీనిని. ఒక మోస్తరు రాష్ట్రమంతగా తీరికూర్చుందది.

రాజ్యాంగ స్ఫూర్తి కనుగుణ్యంగా, ప్రజాస్వామ్య సమాజవాద సిద్దాంతాల కనుగుణ్యంగా ఆలోచిస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంపైనా ప్రత్యేక దృష్టి పెట్టి దానిని అభివృద్ధి పరచరాదు. అది సమానాభివృద్ధి అన్న రాజ్యాంగాశయానికి విరుద్దం దానికి మారుగా సిద్దాంతపరంగా చూస్తే ప్రణాళిక ఇలా ఉండాలి.

మండల స్థాయిలో చిన్న పట్టణాలు, ప్రతి జిల్లాకు ఒక మహానగరము, అందులో విద్య వైద్య రంగాలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, ప్రాకృతిక సహజవనరుల లభ్యతననుసరించి పెద్ద పరిశ్రమల ఏర్పాటు, వాటిల్లో స్థానికులకు, స్థానికేతరులకు 60 :40 నిష్పత్తిలో చట్టబద్దంగా ఉద్యోగావకాశాలు, అన్నవి ఆర్థిక సమానత్వం కోసమూ సోదర భావము నెలకొనడానికి, ప్రతిజిల్లాలోనూ సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నిర్భంధ ఉచిత విద్య, వైద్య సేవలు భోజన వసతులతో సహా ఏర్పాటు చేసి సాంఘిక సమానత్వాశయంతో స్థానిక ప్రభుత్వాల అజమాయిషీలో అవి నిర్వహింపబడేట్లు ఏర్పాట్లు చేయడమూ, రాజకీయ సమానత్వానికై అధికార వికేంద్రీకరణ రూపంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారాలప్పగించి చైతన్యవంతమైన ఓటరులతో కూడి గ్రామ సభలు పాలనలో ప్రత్యక్ష భాగస్వాములయ్యేలా శ్రద్ధ తీసుకుంటే అప్పుడు మాత్రమే రాజ్యాంగ ప్రధానాశయమైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యమన్నది ఆచరణలోకి రాగలుగుతుంది. అప్పుడు రాష్ట్రమూ సమానాభివృద్ధి కాక, సర్వోన్నతాభివృద్ధి నందడానికీ సూటైన దారి ఏర్పడేది. ఇప్పటికేగాదు, ఎప్పటికైనా మనం - జనం - అనుసరించాల్సిన శాస్త్రీయపద్దతి ఇదే.

విభజన కోరుకుంటున్న వాళ్ళూ, అయిపోయిందిగా సర్దుకుపోదాం అనుకుంటున్న వాళ్ళూ, ఇష్టం లేకున్నా చేసేదేమీ లేక ఊరుకుంటున్న వాళ్ళూ కూడా కొత్తరాజధాని తమ తమ జిల్లాలలో వస్తే బాగుండుననే అనుకుంటున్నారు, ఎందుకని? వారందరి ఆలోచనలూ, అనుభవాలూ కూడా ఎక్కడ రాజధాని ఏర్పడితే అక్కడ మాత్రమే అన్ని రకాల అభివృద్దీ కేంద్రీకృతమవుతుందనీ, మిగిలిన ప్రాంతాలు వివక్షకు గురవుతానే ఉంటాయనీ హెచ్చరిస్తున్నాయి కనుక. వరవడిగా మారిన దీనిని - ఈ ఆలోచననూ ప్రక్కకు నెట్టేయకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా - ప్రణాళికారచనే సాధ్యపడదు. ముందీవైఖరినశించాలి. అందుకేంచేయాలి?

1) రాజధాని ప్రధానంగా పాలన నిర్వహణ కేంద్రంగా మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకుగాను మరీ పెద్ద పరిశ్రమలకు అవకాశమివ్వకపోవడము. మరీ విస్తారంగా స్థలసేకరణ చేయకుండడము నిబంధన రూపంలో తయారుచేయాలి.

2) రాజధాని లేని జిల్లాలలో పట్టణాల నగరాల అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక కేటాయింపులు, పారిశ్రామిక క్షేత్రాల అభివృద్ధికి రాజధానిలోకంటె ఎక్కువ అవకాశాలు కల్పించాలి.

3) విభజనకు సంబంధించిన న్యాయబద్దమైన వాటాల పంపిణీ, నష్టపరిహారము రాష్ట్రం నుండి అందేట్లు దానితో పాటు అదనంగా ప్రతిజిల్లానూ అభివృద్ధి పరచేందుకు కేంద్ర నిధుల నుండి తగినంత మొత్తంలో నిధుల కేటాయింపు సత్వరం విడుదల జరగాలి.

4) నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసి యోగ్యులైన వారి పర్యవేక్షణలో అత్యవసర కార్య క్రమంగా నిర్ణయించి రెండేళ్ళలోపుగా పూర్తి చేయాలి. ఈ విషయంలో మళ్ళా వ్యాపార రాజకీయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సంఘహితైషులైన పెద్దలూ, నిపుణులు, విశ్రాంత న్యాయమూర్తుల సమష్టితో పర్యవేక్షక మండలిని ఏర్పరచాలి. అఖిల పక్షాలకూ అందులో ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటే మరీమంచిది.

5) రెండవ ఎస్‌.ఆర్‌.సి ఈ దేశావసరం. పనిలోపనిగా కేంద్రం దానిపై దృష్టిపెట్టి, దానిని అమలుపరిస్తే దాని ద్వారా రాష్ట్ర సరిహద్దుల ఏర్పాటులోగానీ, జిల్లాల పునర్మిర్మాణం విషయంలోగానీ ప్రస్తుత పరిస్థితులకు రాబోయే కాలానికీ అనుగుణంగా ఉండేలా శాస్త్రీయ పద్దతుల్ని పాటించవచ్చు. ఈ సందర్భంలో కె.సి.ఆర్‌. తెలంగాణను 24 జిల్లాలుగా చేసుకుంటాం అని ప్రకటించినట్లు సీమాంధ్ర జిల్లాలను కూడా ఒక శాస్త్రీయమైన హేతుబద్దమైన రీతిలో మరికొన్ని జిల్లాలుగా విభజించుకోడానికీ వీలుంటుంది.

ముగింపు :- ఇదంతా రాజ్యాంగంలోని ప్రస్తావన ద్వారా మనం భావిభారత నిర్మాణ లక్ష్యాలుగ ఏర్పరచుకున్న చిత్రాన్ని అర్థం చేసుకుని, ఆచరణాత్మకం చేయడానికి పూనుకున్నప్పుడే సాధ్యం. రెండు ప్రాంతాలూ ప్రాంతీయ తత్వం సమసిపోయేలా ఉద్యోగవ్యాపారాలతోనేగాక, వివాహ నివాస సంబంధాలలోనూ ఉమ్మడి తనం ఏర్పడేలా ఒక వరవడిని సృష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయాలు ప్రజల పనులు చేసిపెట్టేవిగాకాక, ప్రజల పర్యవేక్షణలో పనిచేసేవిగా మార్పు చెందాల్సి ఉంది.