Showing posts with label చేదునిజాలు. Show all posts
Showing posts with label చేదునిజాలు. Show all posts

Wednesday, June 9, 2021

మేలుకొలుపు 13

మేలుకొలుపు

సంపుటి-2                                         సంచిక-3                                               1-3-92

ప్రమాణ వివేచన  4

 మానవ జీవితానికి గల తర్కావశ్యకతను గురించీ, దానిని ఒక విద్యగా నేర్వవలసిన అవసరాన్ని గురించీ ప్రతి సంచికలోనూ కొద్దికొద్దిగా పరిశీలిస్తూనే వస్తున్నాము. దానికే చెందిన మరికొన్ని వివరాలున్నూ ప్రస్తావిస్తున్నాను పరికించండి. ఏ విషయాన్ని గూర్చి తెలుసుకుందా మనుకుంటున్న వారైనా ముందుగా ఆ విషయాన్ని గూర్చి అప్పటికేమయినా సమాచారం అందుబాటులో ఉందేమో చూస్తాడు మామూలుగా. మీకే ఒక విషయాన్ని గురించి తెలిసికోవా లనిపించిం దనుకోండి. ఏo చేస్తారు? ఆ విషయం తెలిసిన వారెవరైనా ఉన్నారా? అని విచారిస్తారు. వారిని కలసి వీలైనంత సమాచారాన్నిసేకరిస్తారు. వాటిని లోతుగానూ, నిదానంగానూ పరిశీలించి దోషాదోషాలు విశ్లేషించి స్వానుభవంలో అవెట్లున్నాయో సరిచూసుకుని ఒక నిర్ధారణకు వస్తారు. సాధారణంగా ఎవరైనా యిలానే చేస్తారు. ఈరోజు విశ్వవిద్యాలయాలలో విశేష జ్ఞానరూపమైన పరిశోధనలందు సిద్ధాంత వ్యాసాలు ప్రతిపాదించే అధ్యయన శీలురున్నూ ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. ప్రాచీన మేధావులున్నూ జిజ్ఞాసువులకీ క్రమాన్నే బోధించారు.

గ్రంథ మభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరఃI

ఫలాలమివ ధాన్యార్ధీ త్యజేద్గ్రంథమశేషతః.II

జ్ఞాన విజ్ఞానములను లక్ష్యముగా నెంచిన మేధావి ముందు గ్రంథాధ్యయనం చేయాలనీ, ఏదో ఒక రోజు-అది అనుభవజ్ఞానం పొందిన రోజే-గ్రంథాదులను ఆమూలాగ్రం విడువవలెననీ శ్లోక తాత్పర్యం. మరో విషయం. తర్కమే జ్ఞానగమ్యమనో, తర్కం జీవితానికంత ప్రధానమైనది కాదనో తలచే రెండు దృక్పథాలూ, భ్రమాత్మకాలే. మరో శోచనీయమైన విషయమేమంటే మానవజీవితంలోని వివేక భాగాన్ని సమగ్రమూ, సమర్ధవంతమూ చేసికుని తద్వారా జీవనాన్ని ధార్మికమూ, సుఖశాంతియుతముగా నడుపుకొనుటకుగాను వినియోగించుకోవలసిన తర్కమును నేడు కేవల మొుక జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు తర్కం నేర్చినవాళ్ళు. ఇప్పుడు నేర్చుకునేవాళ్ళున్నూ వృత్తిగానే (ఉద్యోగ సముపార్జనకే) నేర్చుకుంటున్నారు. నిజంగా తర్కం కేవల మొక పొట్టకూటి విద్యకాదు. కారాదుకూడా. వివేకమన్నది జ్ఞాన నేత్రంగా చెప్పుకుంటే, దానిని తయారు చేయటానికి తర్కం నిమిత్త కారణమవుతుంది. అనుభవం ఉపాదాన కారణమవుతుంది. తర్కానికి ప్రారంభం ఏదేని విషయములో అనిశ్చిత స్థితి ఉండడమే. సంశయమే విచారణకు మూలం. ఈ వాస్తవం తర్కశాస్త్రంలోనూ ప్రస్తావించబడింది. సంశయించక పరీక్షించుటే కుదురదు కనుకనే న్యాయదర్శనంలోనూ పదార్థ పరీక్ష సంశయంతో ప్రారంభమవుతుంది. ఈ వాస్తవాన్ని ఆస్తిక సాంప్రదాయకులెందుకు గమనించరో, గమనించామని ఎవరైనా అంటే మరి వారివారి సిద్ధాంత పరీక్షకెందుకు సిద్ధపడరో నావరకు నాకు బోధపడని విషయం. ఈ మాటెందు కనవలసివస్తోందంటే, ముఖ్యమైన అన్ని సిద్ధాంతాలవాళ్ళూ తర్క ప్రావీణ్యులే అయినప్పటికీ, అన్ని ఆస్తిక సిద్ధాంతాలకూ ప్రాతిపదిక విశ్వాసమే అయి ఉన్నది. పరస్పర విరుద్ధములైన ఈ రెంటికీ వారికి సమన్వయం ఎలా కుదిరిందో అర్థం కాని విషయం.

Note:-ఏ విషయమైనా ఒకనికి అది విశ్వాసంగా ఉన్నంతవరకు అతనికి దానిని గురించిన తెలియనితనం ఉన్నట్లే. ఒకవేళ ఎప్పటికైనా ఎవరికైనా దానిని గురించిన జ్ఞానం అనుభవం కలిగిందంటే ఇక ఆ విషయమై అతనికి విశ్వాసమన్నది లేదు. తెలిసే ఉంది కనుక. విశ్వాస మూలకములైన సిద్ధాంతానుయాయు లుపయోగించు తర్కము విశ్వాసానికి-తెలియనితనానికి-అనుయాయియై తన స్వీయ స్వభావాన్నే కోల్పోతుంది. ఈ విషయమూ ముందుముందు విశేష చర్చనీయాంశం కాబోతోంది కనుక ప్రస్తుతానికిదీ ఒక చర్చనీయాంశమే నన్నది గుర్తులో ఉంచుకోండి చాలు.

తర్కం మానవ మేధో ప్రక్రియలో- మెదడు చేసే పనిలో- భాగంగా సహజంగానే ఏర్పడియుండగా దానిని నేర్పడమూ, నేర్వడమూ ఎందుకన్న పక్షాన్ని గూర్చి గతంలో కొంత విచారించాము.

వారినీ, వారి వాదనా సబబుగానే ఉందనుకునే కొందరు పాఠకులనూ, దృష్టి నిడుకుని క్రింది విషయాలు వ్రాస్తున్నాను. (1) ప్రతి మనిషికి కాళ్ళూ, చేతులూ ఉన్నాయి. అవసరమైతే ఆత్మరక్షణకు వాటిని ఉపయోగించడమూ ప్రతి మనిషికి తెలుసు. మరింక ఆత్మరక్షణ విద్యలంటూ నేర్వడమెందుకు? నేర్పడమెందుకు? అలానే ఇప్పటి వరకు మానవ సంఘంలో పుట్టి పెరిగిన అన్ని విద్యల విషయం తోనూ మొదటివాడికి గురువేడీ అని అడిగి, వీటిని ఎవరికి వారే సాధించుకోవచ్చు, అని తర్కబద్దంగా వాదించవచ్చు. అది ఒకరకంగా నిజమూ కావచ్చు. వీటిని ఎవరికి వారే నేర్వవచ్చు. అయినా అవన్నీ నాటినుండి నేటివరకు విద్యారూపాలుగా నేర్పబడుతున్నాయి. నేర్వబడుతున్నాయి, కనుక, వాటిని ఎవరికి వారే నేర్వవచ్చు వాటికై విద్యాలయాలూ, బోధనలూ, నిరర్ధకమనడం వివేకవంతం కాదు. అదలా ఉంచి, సాంప్రదాయక తర్కాన్ని పరిశీలించవలసిన-నేర్వవలసిన అవసరం లేదనుకునే వాళ్ళకు నేచెప్పేదేమంటే ఈ అంశాన్ని పరీక్షకు పెట్టి చూసుకోండి. ఒక్క ఆరుమాసాలు నిజమైన విద్యార్థిలానో, నిష్పాక్షిక పరిశోధకుని లానో ప్రాచీన తర్కాన్ని-తర్క విద్యను-అభ్యసించండి. పూర్తయిన పిదప ప్రారంభానికి ముందున్న బుద్ధి వికాసానికీ, ప్రస్తుత జ్ఞాన స్థాయికి తేడా ఉందో లేదో చూసుకోండి. విషయం పరిశీలనా సామర్థ్యంలోనూ, విషయజ్ఞతలోనూ అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఉందో లేదో గమనించండి. అలా చేయుటవలన విషయాన్ని అనుభవం ద్వారా పరీక్షించినట్లౌతుంది.

Note- : కలిగిన జ్ఞానం సత్యమా కాదా? అందిన సమాచారం (అనుమాన శబ్ద ప్రమాణాల ద్వారా) సత్యమా కాదా? నిర్ణయించుకోడానికి మనిషికున్న ఆధారం ఒక్కటే. అది యదార్ధ అనుభవమే. అదే-స్వతః ప్రమాణం

మీ, మీ పరిశీలనల ద్వారా మీరు ప్రాచీనులలోని దోషాదోషాలను నిర్ణయించగలగడమూ, వెనుకటివారు భ్రమపడినవిషయాలకు చెందిన వాస్తవాన్ని గ్రహించడమూ చేయగలిగినప్పటికీ, వెనుకటి వారిచే చెప్పబడిన ఆయా విషయములను అధ్యయనం చేయడం నిష్ప్రయోజనం మాత్రం కాదు. ఈ విషయాన్ని తర్కం అక్కరలేదనే నవీన వేదాంతులూ, హేతువాదు లనుకునేవాళ్ళూ, తగినంత విషయావగాహన లేకనే తమను తామే జ్ఞానులుగా చెప్పుకునే వాళ్ళు కూడా స్పష్టంగా గమనించడం అవసరం.

అలానే, తార్కికత మానవస్వభావం కనుక తర్కం నేర్వనక్కరలేదనే వాళ్ళను నేనడిగినదేమంటే, సహజ తార్కికులారా! వెనుకటివాళ్ళ ఏ పరిశోధితాంశాలనూ స్వీకరించకుండా మీ స్వాభావిక తర్కశక్తి ద్వారానే యీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం. 1) జ్ఞాన మెన్ని రకాలు? 2) పదార్ధా లెన్ని? 3) భ్రమలెన్ని రకాలు? మానవుడు పొందవలసిందేమిటి? దానిని పొందటమెలా? ఇతరుల భావాలు మీపై పడకుండా సమాధానాలు చెప్పండి చూద్దాం.

ఏతావాతా నే చెప్పదలచుకున్న దేమంటే, ఆయా విషయాలను సాధించిపెట్టు పరికరములమరి ఉన్నంత మాత్రానే ఫలితాలు జనించవు. ఉపయోగించు మెలకువల నెరుంగుటా, ఉపయోగించు అభ్యాసము ద్వారా నిపుణత సాధించుట అన్న విన్నీ సమకూడినప్పుడే ఫలితం కోరినస్థాయిలో సిద్ధిస్తుంది, కనుక ఎంతగా మానవునిలో తర్కించే స్వభావమున్నా, తార్కికంగానే జీవిస్తున్నాడని ఒప్పుకున్నా, తర్కాన్ని సంపూర్ణంగా జీవితంలో వినియోగించుకోగల నేర్పుకై దానిని విద్యగా నేర్వవలసియే ఉన్నది. దీనిపై మీ, మీ యభిప్రాయాలను వ్రాయండి.

ప్రమాణముల పేర్లు ఏ దృష్టినుండి ఏర్పరచడం జరిగింది? అన్నది ప్రస్తుత పరిశీలనాంశమై యున్నది. ఫిబ్రవరి సంచిక చూసిన పిదప శ్రీ మరింగంటి శ్రీరంగాచార్యులవారు వ్రాసిన లేఖను కూడా ప్రచురించడం ఈ విషయంలో జిజ్ఞాసువుల పరిశీలనకు కాగలదని అనిపించుటచే దానినీ వ్రాస్తున్నాను. మIIశ్రీII 1-2-92 సంచిక అందినది. నా ప్రశ్నకు సమాధానము సరిగా లేదు. ప్రత్యక్షమను ప్రమాణము శ్రోతనేత్రాదులకంటె వేరా? కాదా? అని నా ప్రశ్న. వేరనిగానీ, వేరుకాదనిగానీ సమాధాన ముండాలి. ఏదో వివరణ యిచ్చారు. అది నా కంత అవసరము గాదు. వేరే అంటే ఆరింటికంటె వేరైన ప్రత్యక్ష ప్రమాణమేమో చెప్పాలి. వేరు కాకపోతే పద్ధతుల ననుసరించి ప్రమాణములను వాటిలో ప్రత్యక్షమును చేర్చరాదు. మొదటి వర్గములోనే '6'న్నూ చేరినవి కనుక.

మీరు “రంగు” అంటూ ఏదో వ్రాశారు. రంగు అనునది సామాన్యవాచక శబ్దము. ప్రత్యక్ష ప్రమాణమనునది కూడా అటువంటిదే. తెలుపు, నలుపు, ఎరుపు ఇత్యాదులు రంగు యొక్క విశేషముల చెప్పు శబ్దములు. విశేషములకంటె విడిగా సామాన్యముండదు. అంటే తెలుపో, నలుపో, ఎరుపో కాక ఇంకా రంగు అనేది ఒకటి వేరే ఉండదు. అట్లే ప్రత్యక్ష ప్రమాణముకూడా. శోత్రమో, నేత్రమో ఇత్యాది ‘6’ కాక వేరే ప్రత్యక్షముండదు. అనునంతవరకే నాకు తెలిసిన అంశము.

మీరు ప్రత్యక్ష ప్రమాణ విశేషములగు శోత్ర నేత్రాదులారింటినీ మొదటి వర్గములో చేర్చినారు. [మొదటి వర్గమంటే పరికరముల ననుసరించి ప్రమాణములన్న వర్గమని పాఠకులు గమనించాలి-సురేంద్ర] ఇక దానికంటూ అన్యమైన ప్రత్యక్ష ప్రమాణమేదేని ఉంటే దానిని రెండవ వర్గములో చేర్చవచ్చు. కానీ ఆ ఆరింటికీ అతి రిక్తమైన ప్రత్యక్ష ప్రమాణం నాకు తెలియదు. మరొక్కమాట. మీరు అనుమాన ప్రమాణం - ఇంద్రియం - ఏదందాము? అని ఓ మాట న్నారు. దీనినిబట్టి అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లు అర్థమగుచున్నది. అలా అనుమాన ప్రమాణమనునది కూడా ఒక ఇంద్రియమేనని మీ భావమా? ప్రమాణ వివేచన ఆరంభించినప్పుడు మీరన్న ప్రాచీనులు కానీ, మీ సమకాలీనులు కానీ ఎటువంటి అభిప్రాయములు కలిగియున్నారో పేర్కొని, వారి యభిప్రాయములలోగల దోషమేమిటో తెలిపి, మీ అభిప్రాయమునకూ, వారల అభిప్రాయములకూ గల భేధమేమో వివరించి, ఎందువల్ల ఆ భేదమేర్పడిందో వివరించితే కొంత విషయ స్పష్టత ఉండేదేమో ననిపించుచున్నది. సరి. సంతకం.

సురేంద్ర :- ఈ విషయమై నేనిప్పటికే వెలిబుచ్చిన అభిప్రాయములను క్రోడీకరించి చూపుతాను గమనించండి.

1] ప్రమాణమన్నమాట జ్ఞానార్జనలో ఉపయుక్తమవుతున్నది. అది పరికరములనూ, పద్ధతులనూ సూచించగలదు.

2] ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ ఇత్యాది పేర్లు పరికరముల యందలి తేడాలను సూచించునవిగా కాక, ప్రక్రియా విశేషములను సూచించునవై యున్నవి.

3] ప్రమాకరణం ప్రమాణం అని వివరణ చేస్తూ కరణమింద్రియం అని అన్వయించినచో, ప్రమాణముల పేర్లూ, సంఖ్యా ఇంద్రియాల పరంగా నిర్ధారించవలసి వస్తుంది. కానీ అవి అలా లేవు.

4] ప్రత్యక్ష మొక్కదానిలోనే “6” ఇంద్రియాలు చేరిపోతాయి. మరి విుగిలిన ప్రమాణాల కింద్రియాలేవి? అన్న ప్రశ్నకు ప్రమాకరణం ప్రమాణం, ప్రమాణమింద్రియం అన్నవాళ్ళే సమాధానం చెప్పవలసి ఉంది.

5] ఒక్క ప్రత్యక్షంలోనే “6” జ్ఞానేంద్రియాలూ ఇమిడిపోతాయి. పరికరాలననుసరించే ప్రత్యక్షాది పదములు ఏర్పాటుచేసి ఉంటే అనుమానమూ, శబ్దమూ నన్న పేరు నిరర్థకమౌతాయి.

        6] ప్రత్యక్షంలో ఆయా ఇంద్రియాలు ఆయా విశేష విజ్ఞానాలకు ప్రమాణం లౌతాయి. వాటి పేర్లూ వాటికి సంబంధించే ఉంటాయి. నేత్ర ప్రత్యక్షం వగై రా. సరే.

అదీకాక రంగు సామాన్యవాచక శబ్దమై ఎరుపాదులు విశేషత్వబోధకాలై నప్పటికీ ఎరుపూ, రంగూ ఒకే పదార్థమును సూచించు పదము లనరాదు. అవి పర్యాయ పదములు కావు. ఎందుకనగా రంగు అన్న పదార్ధాని కన్యంగా ఎరుపు ఉండదుగానీ ఎరుపు లేకున్నా రంగు ఉంటుంది. అలానే అవయవావయవిలన్న రెండు పదార్ధములనూ విడదీసి చూపలేకపోయినా, అవయవాలకంటే అన్యంగా అవయవి లేకున్నా అవి రెండు పదములూ, రెండు పదార్ధములూ అనాల్సిందే. పదార్థవివేచన అలా చేయవలసిందే. కనుక ప్రకరణోద్దేశాన్ననుసరించి ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ అన్న పేర్లు ప్రకార భేదాలననుసరించిపెట్ట బడినవే. అయితే ప్రత్యక్ష పద్ధతిలో కలుగుతున్న జ్ఞానానికాధారం ఇంద్రియాలే.

ఆచార్యులవారే, మరోమాట అంటూ “అనుమాన ప్రమాణాని కింద్రియ మేదందాము” అన్న నా మాటను ప్రస్తావించి, అనుమాన ప్రమాణం కూడా ఇంద్రియమేనని మీరు భావిస్తున్నట్లున్నది. అవునా? అని అడిగారు. ఇక్కడ నామాటేమిటంటే సంచికను వారూ, పాఠకులూ కూడా మరోసారి చూడమని. ఎందు కంటే ప్రమాణ పద నిర్వచనంలో ప్రమాకరణం ప్రమాణం అని, ప్రమాణ మింద్రియం అను పక్షంవారు సమాధానం చెప్పవలసిన అంశంగా ఆ ప్రశ్న వేశాను. నా ప్రతిపాదన దృష్టినుండీ అది అసంబద్దమనే కదా! ప్రమాణపదములు ఇంద్రియాలనుబట్టి కాక విధానాలనుబట్టి ఏర్పరచారన్నదే నా ప్రతిపాదన.

సాంప్రదాయకులున్నూ ప్రమాణ పదవ్యుత్పత్తి రెండుగా చేశారు;1) ప్రమీయతే ఏన తత్ర్పమాణమ్! 2) ప్రమీయతే అనేన ఇతిప్రమాణం- మొదటిది పరికరాన్ని, రెండవది ప్రకారాన్నీ సూచిస్తాయవి.

ప్రత్యక్ష జ్ఞానకరణ మింద్రియం అనడంలో దొసగేమీలేదుగానీ ప్రమాణ నిర్వచనంలో ప్రమాకరణం ఇంద్రియం అంటే అనుమాన, శబ్దములందు ఇంద్రియ కారణత్వానికి అవ్యాప్తి సంభవిస్తుంది. గమనించగలరు.

ప్రమాణ సంఖ్యపైననూ తార్కికులలో బహుచర్చ సాగింది. కానీ సంఖ్య విషయమై పెద్దగా పెనుగులాడ వలసిన అవసరం లేదు. పోతే కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ మనం నిర్ణయించిన ప్రమాణములలో ఇమడ్చగలగాలి. అదే అసలు విషయం. ఈ దృష్టినుండి చూస్తే(ఆయా పక్షాలవారు, నేచెప్పిన సంఖ్యనే అంగీకరించా లంటూ అక్కరలేని పిడివాదాన్ని పట్టుకోకపోతే) మానవ జీవితంలో కలుగుతున్న జ్ఞానరాశిని, (ఉపయుక్తమవుతున్న జ్ఞానరాశిని) ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్దమూ నన్నమూడు వర్గాలలో ఇమడ్చవచ్చు.

 

చేదు నిజాలు-3

చేదునిజాలు ప్రారంభ వ్యాసంలో విద్య గ్రహించవలసిన వాడూ- (విద్యార్థి, జిజ్ఞాసువు, సాధకుడు) విద్యగరపువాడూ [ బోధకుడూ, వక్తా, గురువు] కలసి శ్రమించినగానీ విద్యా ప్రయోజనం సిద్ధించదనీ, అందుకై యిరువురూ వివేక పరంగానూ, హృదయ పరంగానూ కొన్ని అర్హతలు కలిగియుండాలనిన్నీ, అయితే

ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఈ రెండురకాల అర్హతలూ, ఇరువురిలోనూ మృగ్యమై పోయాయనే అనుకున్నాము. ఇవి అన్ని రకాలైన విద్యారంగాలలోనూ ఉండవలసివే ఐనప్పటికి, ముఖ్యంగా వ్యక్తిత్వ నిర్మాణానికి పనికివచ్చే నైతిక, ధార్మిక, తాత్విక కేంద్రాలలో, వీటిని ప్రాణప్రదంగా ఎంచవలసి ఉంది. శోచనీయమైన విషయమే మంటే ఈ కేంద్రాల లోనూ మామూలు విద్యా కేంద్రాల స్థాయిలోనో, మరింకొంత ఎక్కు వగా నేనో కాపట్యమూ, డాంభికతా, స్వార్థ పరత్వమూ, కులవర్గ, వర్ణపిచ్చిలు, భోగలాలసతా, అజ్ఞానమూ కరడుగట్టుకుని పై అర్హతలను పాతాళానికి తొక్కి వేశాయి. వేస్తున్నాయి.

సమాజాన్ని సరైన దిశకు మళ్ళించాలనుకునే హృదయావేదనకల ఆస్తిక, నాస్తిక, హేతువాదాది నానా సంఘాలలోని సహృదయులలోనూ, అట్టిసరైన మార్పు వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా మాత్రమే సాధ్యమనే అవగాహన లేకపోవడం, ఒక వేళ ఒకరిద్దరికి ఉన్నా, అది అయ్యే పనికాదులే అన్న ఉదాసీనత ఏర్పడి ఉండడం అన్నది, సమాజంలో - వ్యక్తిలో-మార్పు రాక పోవడానికి, ప్రసంగ ప్రహసనాలకూ హేతువౌతూ ఉంది. సంస్కరణోద్యమ నిర్మాతలలో ఈ విషయమైన వివేకాన్ని మేల్కొల్పడమూ కష్టసాధ్యంగా ఉంటున్నది. ఎందుకని? వారి వారిలో ఒకరకమైన అభిమానం విషయం మనకు తెలిసే ఉంది. పరుల సూచనల లేమిటి గ్రహించేది అన్న భావన-హృదయపు లోపలిపొరల్లో ఉండి ప్రతిబంధకం అవుతోంది. ఇది ఎంతో సున్నిత విషయమగుట వలననూ, దీనిని చెప్పి వప్పించవలసిన వారు మేధావులై ఉండడం వలననూ, మేధావులలో ఉంటున్న శృతిమించిన ఆత్మ విశ్వాసం అడ్డుగోడలా ఉండడం వలననూ, ఇది కష్ట సాధ్య మవుతోంది. ఈ రోజు సమాజ సంస్కరణోద్యమకారులందరూ గమనించవలసిన మౌలిక విషయమిది. ఈ ప్రతి బంధకం ఉద్యమానికో రూపు సంతరించుకోనీయడం లేదన్నదో పచ్చి నిజం.

చేదునిజాలు-2లో, ఆధ్యాత్మిక విద్యాలయాలలో- ఆశ్రమాలూ, పీఠాలు మొ|| -గు వాటిలో- తరచుగా గోచరిస్తున్న అధ్వాన్న స్థితుల గురించి కొంతవరకు ఆవలోకించాము. మన దేహంలో తల భాగానికెటువంటి స్థానము-పాత్ర- ఉన్నదో, మొత్తం సమాజాన్ని ఒక శరీరంగా భావిస్తే అందులో విద్యాలయాలకూ - విద్యా విధానానికి కూడా అట్టి పాత్రే ఉన్నది. మెదడులో అపసవ్యత ఏర్పడ్డ వాడి జీవితంలానే ఉంటుంది సమాజంలో విద్యావిధానంలోనూ, విద్యాలయాలలోనూ అపసవ్యత ఏర్పడితే.  దయనీయమైన అంశమేమంటే ప్రస్తుతం మన మందరమూ అనుభవిస్తున్న ప్రమాదకర పరిస్థితే ఇది. బుర్ర చెడిన వాడి బ్రతుకులా ఉంది నేటి సమాజపు బ్రతుకు కూడా. అయినా పట్టించుకొనే నాధుడు లేడు. పిచ్చి వానికి చికిత్స చేస్తానంటే నీకు పిచ్చి, మీ నాన్నకు పిచ్చి నా కేమిటిరా?! అన్నట్లే, సమాజంకూడా ఆరోగ్యకరమైన చికిత్స చేద్దామన్నా స్వీకరించేట్లు లేదు. అది ప్రమాదకరమైన విషయమే. అయినా అంతకంటే దౌర్భాగ్య కరమైన పరిస్థితేమంటే చికిత్సకులూ; చికిత్సాలయాలుగా నుంటున్న ధార్మిక సంఘాలూ, ప్రచారకులూ కూడా యదార్థంగా రోగగ్రస్తులై చికిత్స చేయించుకోవలసినవిగా నుండుటయే. ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే దీనిని చదువుతున్న వారిలో కొందరకైనా ఎందుకొచ్చిన సొద అనో, ఎవరికి తెలీని విషయమిది అనో, అబ్బా! ఈ నాటికో క్రొత్త సంస్కర్త పుట్టుకు వచ్చాడయ్యా అనే....అవహేళనా పూర్వకమైన ఆలోచనో మదిలో కదలాడుతుండవచ్చు - ఎందుకనో తెలుసా? ఈ అంశ మీనాడు మనిషి నిత్యజీవితంలో సామాన్య విషయంగా - ఆశ్చర్యపడవలసిన అంశంగా కాకుండా-మారిపోయింది. సామాజిక మార్పు అవసర మనుకునేవాళ్ళు కూడా ఉదాసీనులై, క్రియా శూన్యులై ఉండడానికి యీ భావన (ఆఁ... ఇది మామూలేలే, సమాజం కుక్క తోక వంటిది. దానిని సరిచేయలేము లాంటి యోచన) బలీయంగా ఉండడం కూడా ముఖ్య కారణమే. ఎప్పుడూ ఏదో రోగం ఉంటూనే ఉంటున్నది. ఇక మందు తినడమెందుకులే అంటే ఎంత సబబుగా ఉంటుందో ఇదీ అంతే. సమాజంలోని ఏదో ఒక భాగంలో, ఏదో ఒక రకమైన సంఘ వ్యతిరేక శక్తులు ఏదో ఒక స్థాయిలో ఉంటాయన్నది కాదన లేని వాస్తవమే అయినా సమాజం ఆరోగ్యదాయకంగా ఉండడం, అవసరమైన వాటిని అవసరమైనంతగానూ సాధించుకోగల క్రియాశీలతా, సామర్ధ్యము కలిగి యుండడమూ, ప్రతికూల శక్తులు ప్రమాద స్థాయికి చేరకుండా నిరంతరం జాగరూకత కలిగి యుండడమూ నన్నవి వివేకవంతమూ, అత్యావశ్యకమూ కూడా. సామాజిక శరీరంలోని ప్రతివ్యక్తీ - భాగము - కూడా తన వంతు విధులను నిర్వర్తించుటా, న్యాయబద్ధమైన హక్కులనే అనుభవించడమూ అన్న విధానమునమలు పరుచుట ద్వారానే యిట్టి స్థితిని సాధించడం సాధ్యపడుతుంది. ఇక్కడో విషయాన్ని గమనించండి.

Note: ఉన్నత లక్ష్యాలు కలిగి యున్న నిరాశావాది కంటె అల్ప లక్ష్యాలు కలిగియున్న ఆశా వాది ఎక్కువ క్రియాశీలుడూ, కార్య శూరుడూ కూడా కాగలరు. ఈనాడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసలు - జాడ్యం అకర్మణ్యతా; కుకర్మణ్యతా అన్న వే.

కళ్ళు మూసుకుని ప్రపంచం మనని గమనించడం లేదులే అనుకునే స్వాముల వార్లనేమనుకోవాలి. వారిని చూస్తుంటే “మార్గాల పయః పాన న్యాయం” గుర్తుకొస్తోంది. సమాజం వాళ్ళ ఎదుట వాళ్ళనేమంటోంది, వాళ్ళ వెనుక ఏమనుకుంటోంది అన్న సృహే వాళ్ళకుండదు, ఒక వేళ ఎటునుండైనా విమర్శలు వచ్చినా, వచ్చిన విమర్శలను స్వీకరించి ఆత్మ విమర్శ చేసుకోగల నిజాయితీగానీ, విమర్శలోని వాస్తవాలను స్వీకరించగల ధైర్యంగానీ వాళ్ళకు లేవు. ఎందుకనో తెలుసా? వారి, విద్యార్ధి లేక సాధన దశలలో వాటి ప్రాముఖ్యత నేర్పబడలేదుగదా వాస్తవంగా. ఆశ్రమానికి రావడమే అసాధారణ విషయంగానూ, అనేక జన్మల పుణ్య ఫలంగానూ వారికి బోధింపబడింది. ఇక సమాజం చేసే విమర్శలను పరిశీలించుకునే అవకాశ మెక్కడిది? వారేమో, వారి  పీఠాధిపత్యమూ, కీర్తీ, భోగమూ, ధనార్జనా అబ్బా తీరు బాటే లేదాయె. వారిలో కొందరైనా నిజాయితీపరులుండక పోతారా అన్న సదుద్దేశ్యంతోనే వారి ఆత్మవిమర్శ కేమైన సహకారి కాగలదేమోనన్న వూహ వల్లనే ఒకటి రెండు జరిగిన విషయాలు చెప్పాలనిపిస్తున్నది.

ఆయా సాంప్రదాయ ప్రచారకులనూ, వారి ప్రచార ధోరణులనూ, ప్రజల నాకర్షించుటకై వారు చేయు గిమ్మికులనూ పరిశీలించు సమయంలో విజయవాడలో జరిగిన అనేక సంఘటనలు కూడా నా అవగాహనకు చాల ఉపయోగ పడ్డాయి. జరిగినవే అయిన వాటిలో కొన్నింటిని మీ ముందుంచుతాను గమనించండి. (1) స్థలం కొత్త గుళ్ళు (విజయవాడ-1లో తరచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే చోటు) - ఆధ్యాత్మిక సమావేశాలకూ, సత్సంగాలకూ వాటి- పేరుతో జరిగే నానా భీభత్సకాండకూ కూడా ఆంధ్రదేశంలోనే ప్రముఖంగా చెప్పుకోదగ్గ నగరం విజయవాడ. ఇక్కడ ప్రారంభించని ఆధ్యాత్మిక, ధార్మిక శాఖలు మరెక్కడా లేవంటే అతిశయోక్తి కాదు. అయితే విజయవాడ పౌరులలోని ప్రత్యేకతేమంటే (అన్ని చోట్లా అలానే ఉన్నారని మీకనిపించవచ్చు ) 1] - అన్నిటినీ ముట్టుకుంటారు దేనినీ అంటించుకోరు.

గమనిక :- విజయవాడలోని సత్సంగాలలో బహుళ ప్రాచుర్యం పొందినదీ, 13, 14 సంIIరాలుగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ, ఇతర సంఘాలతోనూ, సన్నిహిత సంబంధాలు కలిగి యున్న  ఒక సంస్థ ఉంది. దానితో నాకూ చాలాకాలం నేరుగానూ, ప్రస్తుతం ఏదో రూపంలోనూ, బలమైన సంబంధాలున్నా యనే నే ననుకుంటున్నాను. ఆ సత్సంగీయులు పరోక్షంలో ఏమనుకుంటారో గానీ నా ఎదుట మాత్రం నన్ను సంఘ ప్రారంభకులలో ఒకరిగానే యితరులకు పరిచయం చేస్తుంటారు. (బహుశా వారి లౌకిక కొలతల నుండీ, బ్రతకడం

నేర్చిన, ధర్మంగా ఉంటే బ్రతక లేమనే - ఆలోచనల నుండి వారి దృష్టిలో నేనొక దారి తప్పిన సాధకుడై యుండవచ్చు. చాలా కాలం నిజాయితీగా సాంప్రదాయక ఆస్తిక మార్గాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరించిన నేను, వివేక నేత్రం తెరుచుకున్న కొద్దీ, ఆ మార్గం నుండి దారి తప్పిన మాట నిజమే సుమండీ. అయితే నాస్తికత పేరున నేడున్న ఏ సంప్రదాయానికి కూడా చెందిన వాణ్ణి కాదు నేను. మీ పరిశీలనా సందర్భంలో మీరు నా పై ఒక రకమైన అభిప్రాయం ఏర్పరచుకుని నా రచనలు పరిశీలించే ప్రమాదముందనే-అంటే నిస్పాక్షికంగా పరిశీలనలు చేయుట కొరకై-ఇంత మాత్రం చెప్పుకొనుట అవసరం కాగలదని ఈ మాట చెప్పాను. సాంప్రదాయక - ఆస్థికులూ, సాంప్రదాయక నాస్తికులు కూడా సమగ్ర విప్లవానికి తగిన తాత్విక సిద్ధాంత దారుఢ్యమూ, ప్రణాళికా, ఆచరణా కలిగి లేరన్నది నా స్వానుభవం. సిద్ధపడితే ఇతరులకూ ఈ విషయాన్ని ఋజువు చేయగలనుకూడా. సరే.

ఆరోజు క్రొత్తగుళ్ళలో ఉపన్యాసం జరుగుతోంది. రెండు మూడు సిద్ధాంతాలకు చెందిన అస్తిక బోధకులూ, అనుయాయులూ, శ్రోతలతో సభ నిండుగానే ఉంది. ఉపన్యాసకులు ముందు వాక్యానికీ, వెనుక మాటకూ పొంతన లేకుండగనే అనర్గళంగా మాట్లాడేస్తున్నారు. ఒకరి ఉపన్యాసానికీ, మరొకరి ప్రసంగానికి ఏ రకమైన సంబంధ బాంధవ్యాలూ కనబడడం లేదు. మధ్యలో అప్పుడప్పుడూ వాళ్ళ చప్పట్లూ, ఓంకార నినాదమూ వినిపిస్తున్నాయి. సదస్యులు ఎవరి గొడవలో వారున్నారు. ఉపన్యాసకులు ఎవరి సొద వాళ్ళు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్య నిర్వాహక పెద్దలు వేదిక నెక్కి ఇప్పటివరకు మనం జ్ఞానామృతాన్ని చవి చూశాము. చూపించిన వారంతటివారు ఇంతటివారు అని ఉపన్యాసకుని ఆకాశానికెత్తి వేస్తున్నారు.

నగర ప్రముఖులలోనూ, ఆ కార్యక్రమ ఆహ్వాన సంఘ ప్రముఖులలోనూ ఒకరు ఆనాడు వేదిక మీద ఉపన్యసించారు. పేరు పేరున స్వాములను స్మరిస్తూ వారి జ్ఞాన సామర్థ్యాలను, ధర్మ నిరతినీ, నిరాడంబరతనూ, భోగ రాహిత్యాన్నీ అనితర సాధ్యంగా ప్రస్తుతించి నగర పౌరులందరి అదృష్టం పండిన రోజిది. .... వగైరా మరి కొన్ని మాటలు చెప్పి ముగించారు. ఉపన్యాసానంతరం వారే ప్రాంగణం బైట నాకు తారసపడి పలకరించారు. కుశల ప్రశ్నలైనాక ఎవరీ స్వాములు ఏమిటీ కధ? అని అడిగాను. అతనేం చెప్పుంటాడో ఊహించగలరా? ఖచ్చితంగా ఊహించలేరు. ఏమండీ సురేంద్రగారు..... వీళ్ళు స్వాములా? దొంగలు, ఇంద్రియలోలురు, డబ్బుకై నానా వేషాలూ, మాటలూ నేర్చినవారు. పరమ స్వార్ధులు, అజ్ఞానులు.... ఇలా, వేదికపై వారి గుణకీర్తన మెంత స్థాయిలో చేశారో అంతకంటే అధికంగా వారి స్వభావాలను గురించి చెప్పి, కాసుకై మా కాళ్ళ వద్దకు వచ్చిన వారు, అడుక్కునే కళలో ఆరితేరిన వాళ్ళు, జీవితంలో దాన ధర్మాలు గురించి చెప్పని రోజుగానీ, చేసిన రోజు గానీ లేని వాళ్ళు.... ఇలా .... ఇలా... [అతనా నాడు పలికిన ప్రతి మాటా లిపి బద్ధం చేయుట సభ్యత కాదు కనుక ఆ తరహా మాటలు పొందు పరచ లేదు] ఈసడించి వెళ్ళాడు. క్రితం క్షణంలో వేదిక మీద చూసిన అతని స్వరూపానికీ, బయట మరో క్షణంలో కనబడిన అతని అంతరంగానికి ఉన్న తేడా చూసి నివ్వెర పోయాను. అశ్లీలమైన పదాలను విడిస్తే బయట అతడు నాతో అన్న మాటలలో అతిశయోక్తి వుండవచ్చేమో గాని, అవాస్తవం మాత్రం లేదన్నది నిజం. దీనిని మ్రింగడం స్వాములవార్లకూ, ఆశ్రమాధిపతులకూ, ప్రచారకులకూ వారి వారి అనుయాయులకూ కష్టంగా ఉండవచ్చు. అయినా ప్రజలిలా అనుకుంటారన్న విషయం కొందరు స్వాములకైనా తెలియకపోదు. అయినా పై నగర ప్రముఖుల లానే, వీరూ లోపలొకటి బైట ఒకటిగా ఉండగల ఉద్ధండులే. మరింకేం దొందూ దొందే.

2) అదే స్థలం, మరోరోజు, మరోసభ, వేదిక అలంకరించిన ఆనాటి పెద్దలలో యతీంద్రులవారూ ఉన్నారు. ఒక ఉపన్యాసకుడు-అతడు గీతా ప్రచారకుడు కూడా. గీతలోని ఒక శ్లోక పాఠాన్ని చెప్పి వివరించాడు. అది “తన్ని బద్నాతి కౌంతేయ” నాయనలారా అది మామూలుగా బంధించదు. తన్ని మరీ బంధిస్తుంది అని చెపుతున్నాడు. యతీంద్రుల వారికి చురుక్కుమంది. మెల్లిగా అతణ్ణి పిలచి దానర్థం మరొకటంటూ చెప్పారనుకోండి. ఆ మొదటి ఉపన్యాసకుడు తనను తాను సంపూర్ణజ్ఞానిననే భావిస్తున్నాడు. శిష్యుల కొరకై వెదుకులాడుతున్నాడు కూడా !? మీరేం ఆశ్చర్య పోకండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇట్టివీ నాడు సర్వసాధారణం.

3) ఈరోజు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న ఒక స్వామిని విజయవాడకు ప్రప్రధమంగా ఆహ్వానించాలను కుంటున్నారు. పై సత్సంగ స్థాపకు లలో ఒకరు. ఆ విషయం ముందుగా నాకు తెలిసింది. వెంటనే వారిని కలసి మిత్రమా! ధార్మిక సంస్థలు అధార్మికుల తరపున ప్రచారం చేయడమూ, కాలాన్ని, డబ్బునీ అందుకై వినియోగించడమూ, అతనికై కొమ్ము కాయడమూ మీకూ, లోకానికి మంచిది కాదు. ఈ ప్రయత్నం విరమించండి. లేదంటే ముందుగా వారితో ఒక చర్చా వేదిక నేర్పాటు చేయండి మనం మాట్లాడుదాం. ఆపై మీకెలా అనిపిస్తే అలా చేయండి అని చెప్పాను. వారు నా మాట చాలా తేలికగా కొట్టివేస్తూ దోషం లేని వాడెవడండీ, మోసం లేని దెక్కడండి. అలా వెదికితే మనమేమీ చేయలేం. మాలో లేవా, మీలో లేవా దోషాలు అంటూ ప్రారంభించారు. చివరగా ఒక మాట చెప్పి వచ్చేశాను. మీరాహ్వానించబోయే స్వామికై ఈ నగర ప్రజలు వెచ్చించబోయే ప్రతి క్షణమూ, ప్రతి పైసా అధర్మకార్యానికి వినియోగించినట్లే కాగలదు. మీయిష్టం. మీరిది గమనించేటప్పటికి పరిస్థితి మీ చేయి దాటి స్వామి చేతిలో ఉంటుంది. ఆ స్వామి జనాకర్షణలో అంతటి నిపుణుడు అని. తరువాత జరిగిన సంఘటనలు అక్షరశః నా మాటలు సత్యమని ఋజువైనా యా మిత్రునికి. ఈనాడు సత్సంగీయు లనబడేవాళ్లు సమాజ హితాన్ని హృదయ పూర్వకంగా కోరు కుంటున్నారా? పోనీ ఆత్మోద్ధరణనైనా నిజంగా కాంక్షిస్తున్నారా? ఈ రెండూ గానీ, ఈ రెంటిలో ఏ ఒక్కటిగానీ అతని హృదయగత కాంక్షే అయితే ఇక నాతడు తప్పు చేయుటగానీ, తప్పుడు వాళ్ళకు సహకరించుట గానీ చేయగలడా? ఆలోచించండి.

సంక్రాంతి - విప్లవ సందేశం

 గత సంచికలో సారభూతమైన ఒక వాక్యం చెప్పాను. “రావలసిన-కోర దగిన మార్పు. అందుకై మనం చేయ వలసిన పని” అన్నదే ఆ మాట. మనకి తెలీని విషయమా ఇది అనో, మరో దృష్టినుండో దీనిని నిరాదరణ చేయక ఆగి కొద్దిగా ఆలోచించండి. ఈ భావన ఆధారంగానే సమస్తమూ పరిశీలించాల్సి ఉంది. ఈ  భావనాధారంగా చేసిన పరిశీలనల నుండే సమగ్ర విప్లవ సిద్ధాంతమూ, ప్రణాళికలూ తయారు కావలసి ఉంది. అవునో కాదో చూడండి.

జ్ఞానరూపాలే ఐయున్నప్పటికీ హృదయానికీ, విషయజ్ఞతకూ ఉన్న తేడాను గమనించనంతకాలం మానవునిలో-సంఘంలో రావలసిన మార్పుకు తగిన ప్రణాళిక నేర్పరచడం సాధ్యంకాదు ఎందుకంటే అర్హుడై న-సరైన వ్యక్తిత్వంకల వ్యక్తి తయారు కానంతవరకు సాంఘిక విప్లవం యదార్థంగా సాధించలేము. వ్యక్తిని సమాజము బాహ్యం నుండి అదుపు చేస్తే, వివేకము అంతరికమైన అదుపును కలిగిస్తుంది. బైటా, లోపలా కూడా వ్యక్తి ఏదో రకమైన అదుపు చేయ బడుతుంటాడు. అలా ఉండాలి కూడా. అలా రెండు శక్తులూ విలువైనవే అయినప్పటికీ విప్లవ సాధనలో ఉద్యమకారులు ఆత్మనియంత్రణ కలవారై యుండుట తప్పనిసరి. వివేకంచే జనించిన ఆత్మనియంత్రణ విప్లవకారులకు ఊపిరివంటిది. దీనిని గ్రహించని, గ్రహించినా ఆ స్థాయి లేని విప్లవ సంఘాలవల్ల విప్లవ లక్ష్యాలు సాధింపబడవు. కాకుంటే ఆవేశపూరిత నినాదాలూ, బంద్ లూ, విధ్వంసకాండలూ, ఎన్ కౌంటర్లు సాధింపబడవచ్చు. కదాచిత్ ఏవైన సంస్కరణలు జరిగినట్లు గోచరించినా అవన్నీ తాత్కాలికాలే కాగలవు. ఈనాడున్న విప్లవ పంథాలన్నింటా దాదాపు ఈ లోపం-(వ్యక్తిత్వం-వివేకం కల వ్యక్తులు లేని లోపం) కొట్టవచ్చినట్లుగా ఉంటోంది. సిద్ధాంతాలూ ఆవేశకావేశాలూ, వర్గపోరాటాలూ ఉన్నాయే గానీ; సిద్ధాంత లక్ష్యాలను సాధించ గల వ్యక్తిత్వమున్న వ్యక్తులు లేరు. వివేకమూ, సహృదయతా సరైనపాళ్ళలో మేళవింపబడని విప్లవశక్తుల త్యాగాలూ, ఉద్యమాలు కూడా ఆత్మ వినాశనానికో, తమకన్యులైన వారి వినాశనానికో హేతువులౌతాయి. ఇట్టివారు ఆవేశంలో ఆత్మత్యాగమైనా చేసుకుంటారు. అన్యులను చంపనైనా చంపుతారు. ఇదినాడు మనందరికీ - అనుభవంలోనున్న విషయమేనంటాను. మీరేమంటారు?

ఇష్టమూ, అయిష్టమూ, పట్టుదలా, చపలత్వమూ, ప్రేమ, వాత్సల్యమూ, కోపమూ, ద్వేషమూ, ఆవేశమూ, నిరుత్సాహమూ, ధీరతా, పిరికితనమూ, ఆశా భయాలూ, తృప్తి అసంతృప్తి, శాంతి, అశాంతి, సుఖ-దుఃఖాలు, అసూయ, లోభత్వము, మదము, అహంకారము, డాంబికత, కపటము, నిజాయితీ, ఆర్ద్రత, సానుభూతి, కాఠిన్యము, జాలీ, వగైరాలన్నీ భావరూపములే. హృదయానుభూతులన్న మాట. ఈ భావనలే మనిషిని ప్రధానంగా నడిపిస్తున్నవి. ఇవన్నీ మేధస్సుకు, చెందిన అంశములే అయినా-జ్ఞానరూపాలే అయినా ఈ తరహా పదార్థములను హృదయ సంబంధిత పదార్దములనుట ఉచితము. ఈ పదార్థములకు భౌతిక అస్థిత్వం లేక పోయినా అవి అస్థిత్వం కలవే. శక్తిరూపాలే. మీదు మిక్కిలి మనిషిని మరే యితర భౌతిక శక్తీ కదిలించనంత శక్తివంతంగా కదిలించగలవు. తనకొరకు సమస్త ప్రపంచాన్ని బలిపెట్టునట్లూ, తన ఆదర్శాల కొరకూ, ఇషాలకొరకూ తనను తానే బలి పెట్టుకొను నట్లూ కదిలించగల శక్తివంతాలీ భావనలు. నవీన సిద్ధాంతాలలో ఈ భావాల శక్తిని యథాతధంగా అంచనా వేసిన సైద్ధాంతికులు గానీ, భావ విప్లవం ద్వారానే సామాజిక విప్లవం సాధ్యమన్న మౌలికాంశాన్ని తగినంతగా గుర్తించి దానికై యత్నించినవారుగానీ అరుదు. సరే. అదలా ఉంచండి. హృదయ సంబంధితాలైన ఈ భావరూప శక్తులను వివేకశక్తి నియంత్రించవలసి ఉంది. అలా జరిగినంతకాలం ఈ భావశక్తులు అవసరమైన స్థాయిలో ఎక్కువా తక్కువా కాకుండా ఉండి ఆయా కార్య నిర్వహణకు వ్యక్తిని వ్యక్తులను పురికొల్పుతాయి. సంసిద్ధుణ్ణి చేస్తాయి. ఇవి గనుక అదుపు తప్పినట్లేతే వివేకం పనిచేయదు. ఉద్రేక స్థితులలో మనిషి విచక్షణను కోల్పోవడమో, అది బలహీనపడడమో జరుగుతుందన్నది మనందరి అనుభవములోనూ ఉన్నదే. కనుక హృదయపరమైన శక్తులుగా నున్న భావనలూ, విచక్షణా శక్తిగానున్న జీవితానుభవాల సారాంశమూ, కలసి-మెలసి పనిచేసినంతకాలం జీవితం వ్యక్తిది కానీ, సంఘానిది కానీ- ఒక క్రమం లోనూ, అభివృద్ధి దిశ వైపునకున్నూ సాఫీగా సాగిపోతుంది. ఇట్లా ఈ రెంటినీ (హృదయమూ - వివేకమూ) చక్కగా వివేచించగలగడమూ, వాటివాటి క్షేత్రాలలో అవి ఎక్కువా తక్కువా కాకుండా ఉంచగలగడమూ చేయగలగాలి. విప్లవోద్యమ రుల ముందూ, సంస్కర్తల ముందూ, సిద్ధాంతకారులా, ప్రచారకుల ముందూ ఉన్న అసలు సమస్య యిదే. సహృదయతా, యోచనాశీలతా, కార్యకుశలతా ఇవే ఈనాడు లోపించి ఉన్న ప్రధానాంశాలు. వీటియందు విప్లవాన్ని -సరైన మార్పును తేగలిగిననాడే సమగ్ర విప్లవానికి యదార్థంగా అంకురార్పణ జరుగుతుంది.

అయితే ఇది లేక పోవడానికి కారణమేమి? ప్రధానకారణం జీవితంపట్లా, జీవిత సాధ్యాల పట్లా, వృష్టి, సమష్టి, ప్రకృతి వీటి మధ్యనున్న పరస్పర సంబంధాలపట్లో సరైన అవగాహన లేకపోవడమే. అదే సమయంలో తప్పు అవగాహన లుండడమున్నూ, ఈ తప్పు అవగాహన (దీనినే తత్వశాస్త్రం అవిద్య అంటుంది) నుండి పుట్టి నానా విధములైన పోకడలన్నీ సమాజానికెంతో కొంత అప్రకృతిని కలిగిస్తాయి. సమగ్ర విప్లవాన్ని - సంక్రాంతిని గూర్చి విచారించబోయే ముందు విప్లవ ప్రతిబంధకాలైన అజ్ఞాన జనిత వికృత ధోరణులను గురించీ కూలంకషంగానూ, నిష్పాక్షికంగానూ, సమష్టి సంక్షేమ దృష్టి నిడుకుని పరిశీలించవలసి ఉంటుంది. లేనిచో ఎక్కడోచోట, ఏదో క్షణంలో పరిశీలనలోనూ, నిర్ణయాలలోనూ పాక్షికతా, అసమగ్రతా చోటుచేసికొంటుంది. విషయాన్ని రాగంతో చూస్తే ఉన్న దోషాలు కనపడవు. ద్వేషంతో చూస్తే ఉన్న గుణాలూ గోచరించవు. ఇప్పటి వరకు జరిగిన సామాజిక చరిత్రనూ, దానిలోని సిద్ధాంత ధోరణులనూ సవ్యంగా చూడగలిగితే దాదాపు వాటన్నిటా పైదోషం కొట్టవచ్చినట్లుగా కనుపిస్తుంది. ఈ అంశాన్ని వివరించడమూ, చర్చకు పెట్టడమూ కూడా ఎంతో సాహసంతోనూ, అనేక సమస్యల తోనూ కూడుకున్న పనే అయినా ప్రస్తుత సామా జికావసరమై, “మేలుకొలుపు” పత్రిక లక్ష్యాలలోనూ ఒకటై యుండుటచే, క్రమంగా ఆయా సిద్ధాంత ధోరణుల లోని లోపాలోపాలు మీ ముందుంచేందుకు యత్నిస్తాను. సావధానులూ, ఉద్రేక రహితులూనై నిర్వికారంగా సత్యదృష్టి కలిగి విషయాన్ని పరిశీలించండి. నిజంగా నిజాన్ని స్వీకరించి సమాజాని కందించండి, నిజాని కనుబంధంగా మార్పులూ, కూర్పులు చేసికోండి. యదార్థ విప్లవానికై తగిన సాధకులు కండి.

Note: ప్రతిమనిషీ, సమాజం ఉండకూడని విధంగా ఉన్నదని, మార్పు అవసరమనీ అంటున్నాడు. కనీసం అనుకుంటున్నాడు ఏదో క్షణంలో. కానీ ఆ సమాజం తనకు అన్యంగా లేదనీ, తాను మారుటతోనే సామాజిక మార్పు ప్రారంభించాల్సి ఉంటుందనీ తలంచడు. విప్లవ ప్రతిబంధకాల్లో మొదటి అడ్డంకి యిదే. కనుక అందరం మారాలనీ, అవసరమైనంత మార్పు నాతోనే ప్రారంభం కావాలనీ ఎవరికి వారం మానసికంగా నిర్ధారించుకోగలగాలి.

అభ్యాసక్రమము -7

క్రమంగా వ్యక్తిత్వ వికాసాని కవసరమైన అంశాలను సాధన దృష్టినుండి - అమలు పరచు ఉద్దేశ్యంతో ముచ్చటించు కుంటున్నాము. అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి సంచికలో అభ్యాస క్రమం ప్రచురించలేక పోయాను. క్రమాన్ననుసరించి, వాక్కును క్రమబద్ధమూ, శక్తివంతమూ చేయుట అన్న దగ్గర ఉన్నాము. ఈ సమాజాన్ని సరిగా చూడగలిగితే, పత్రికలలోనూ, వేదికల పైననూ, కరపత్రాల - ద్వారానూ, చర్చలలోనూ, సాధారణ సంభాషణల లోనూ ప్రస్ఫుటంగా కనిపించే అంశం వాచాలతే. ఆదర్శాలను వల్లించడమూ, ఇతరులకు సందేశాలివ్వడమూ, తెలిసిన రెండు విషయాలకు తేలీని 98 విషయాలను జోడించి అనర్గళంగా ఉపన్యసించడమూ, విప్లవం, విప్లవ మంటూ యాగీ చేయడమూ, త్యాగం గురించీ, స్వార్ధ రాహిత్యాన్ని గూర్చి, సమానత్వాన్ని గూర్చి నినాదాలూ, కరపత్రాలూ .... యిలా.... అబ్బో రాశులకు రాశులు కొండల మల్లే ఉద్ధరణ సాహిత్యం పెరిగిపోతోంది. ఆధ్యాత్మకవేత్తల స్థానాలలో నున్న వారూ, పరిపాలకులుగానున్న వారూ, వ్యాపారులూ ఈ మూడు వర్గాలవారిలోనున్న వాచాలతా, కపటమూ, విశ్వరూపు ధరించి ఉన్నాయి. వీటిన్నిటికీ మూల వేరు మాటకూ చేతకూ సంబంధం లేని తనమే. అరిచే కుక్క కరవదంటారు. అది కుక్క గురించి చెప్పిన విషయంగాదనీ మనస్తత్వాన్ని ఒకింత లోతుగానే అధ్యయనం చేసిన వారు, మనిషిలోని వాచాలతనూ, దాని మాటున దాగియున్న సోమరితనాన్ని బట్టబయలొనరించేందుకుగా చెప్పిన వాక్యమని స్పష్టంగా గమనించిందెంతమంది? గమనించామని వాదనకు ఎవరైనా అన్నా, అది వదిలించుకోవలసిన దుర్లక్షణమనీ, తానిక్కడ పట్టుదలతో యత్నించి మితభాషిత్వాన్ని సాధించవలసి ఉన్నదనీ మనసా నిర్ణయించుకుని సాధన చేస్తున్న దెంతమంది? నిజం నిష్టురంగానే ఉంటుంది మరి. వాచాలతా, కపటమూ,-చెప్పేదొకటి చేసేదొకటి-దాదాపు ప్రతి మనిషిలోనూ తగితంతగానే ఉన్నా యన్నది నా యనుభవం. ఆత్మ విమర్శన చేసికుని మీరూ మీ మీ యనుభవాన్ని పరిశీలించుకోండి. ఇక్కడ సరైన మార్పురాక మనిషికీ, మనిషికీ ఉన్న సామాజిక సంబంధాలు మెరుగుపడవు. నాయనలారా! దృఢంగా ఒక్క విషయాన్ని నిర్ణయించుకోండి. తెలిసిన విషయాన్నే మాట్లాడుతాను. మాట్లాడిన విషయానికి కట్టుబడి ఉంటాను. ఈ నిర్ణయానికి రాగలిగావా ధన్యుడవే. క్రమంగా జీవితం అర్థవంతమూ, శక్తివంతమూ కాగలదు.

నిజంగా ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయమే మాట్లాడుతాను, యదార్థంగా తెలియని విషయాలు తెలిసికుంటానికే యత్నిస్తాను. అని నిర్ణయించుకున్నాడను కోండి. అప్పుడేమవుతుంది. ఏమవుతుందో నేను చెపితే మీకాశ్చర్యంగా ఉంటుంది? కానీ వాస్తవమేమంటే ఆ వ్యక్తిలో అద్భుతమైన మార్పు వస్తుంది. అతని మాటలలో నిజాయితీ చోటు చేసి కుంటుంది. మాటలలో విజ్ఞానమూ, వివేకమూ, తగినంతగా ఉంటాయి. సొల్లు కబుర్లు తగ్గిపోతాయి. ఇతరుల సమయాన్ని మింగి వేసే ప్రమాదం తప్పిపోతుంది.

అతిగా మాట్లాడడం అలవాటుగా మారిన వాళ్ళకు సందర్భ శుద్ధి ఉండదు. ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారో, అవతల వాళ్ళ పనుల వత్తిడెంతటిదో అన్న స్పృహే ఉండదు. చివరకది వాళ్ళకో కండూతిగా కూడా మారుతుంది. ఎవరూ దొరక లేదనుకోండి. ఏమీతోచదు. ఎదురిచ్చైనా ఎవరోవకరిని కూర్చోబెట్టుకుని తమ కాలాన్నీ ఖర్చు చేస్తూ, వారి కాలాన్ని తినివేస్తుంటారు. ఈ వాచాలతా స్వభావం మానవ సంఘంలో లక్షల, కోట్ల మానవ శ్రమ గంటల్ని హరించి వేస్తుంది. అంతేకాక మనుషులను సోమరులనుగానూ, బాధ్యతా రహితులను గానూ, నిర్వీర్వులనుగానూ మార్చి వేస్తుంది. వాచాలతా-అక్కర లేని మాటలు మాట్లాడు స్వభావం ఈనాడు సంఘానికి పట్టిన పెద్ద భూతం, పెద్దరోగం అంటే ఏమాత్రం అతిశయోక్తికాదు. కానీ దీనిని గూర్చి ఎవ్వరూ ఆలోచించడం లేదు. సాధారణమైన ధూమపానాది దురభ్యాసాలకంటే అతి ప్రమాదకరమూ, నష్టదాయకమూనైన దురభ్యాసమిది. మనిషిని వర్తమానం నుండి ప్రక్కదారులు పట్టిస్తుంది ఆ సామెత మనిషిని లేని గొప్పలు చెప్పుకునే వాడినిగా తయారు చేయ గలదిది. ఇతరులలో లేని దోషాలు చూసే స్వభావాన్ని కూడా పెంచుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ అంశమే ఒక గ్రంథమంత అవుతుంది. అయినా నేను మరింత విడమరచి చెప్పడమెందుకు? మీరే మీ యనుభవంలో నుండే దీనిని కొట్ట వచ్చినట్లుగా చూడవచ్చు. ఒక్కపని చేయండి చాలు.

(1) నిజంగా తెలిసిన విషయాల్నే మాట్లాడుతాను.

(2). అదైనా అవసరమైనప్పుడే ,అవసరమైనంత వరకే మాట్లాడుతాను.

(3) ఇతరుల కాలాన్ని హరించే పనులు చేయను. నా కాలాన్నీ దుర్వినియోగం చేసికోను.

(4) ఇది సాంఘిక విప్లవ కార్యంలో ఒక ప్రధానావశ్యకమైన అంశంగా గ్రహిస్తున్నాము. దీని వ్యాప్తికై త్రికరణ శుద్ధిగా యత్నిస్తాము. ఈ నియమాల్ని పెట్టుకోండి. జీవితంలో వచ్చే అనూహ్యమైన మార్పును గ్రహించండి. వెనుకటి వారూ దీనిని చక్కగా గ్రహించారు. వారి మాటవినండి. “యోగస్య ప్రధమద్వారం వాగ్నిరోధో అపరిగ్రహః”

:-స్పందన ప్రతిస్పందన-:

స్పం సురేంద్ర బాబుకు. నమస్తే, సత్యాన్ని సమగ్రంగా తెలిసికోవాలన్న జిజ్ఞాసులకు, పొందవలసిన దానిని [తెలిసికోవలసినదానిని] స్పష్టంగా పొందే దానికి పనికివచ్చే, శరరేంద్రియ మనస్సులను శక్తివంతంగా సమర్థవంతంగా ఉంచుకోమనీ, చివరికి నీమోక్షానికి కూడా సహకరించేది నీ ముందున్న సమాజానికి ఋణగ్రస్తుడవు కావద్దనీ, స్వార్ధాన్ని నియమించుకుని వీలయినంత సేవ చేయడం కర్తవ్యమనీ, బుద్ధి ఉన్న వాడికి ఆది బాధ్యతనీ, విజ్ఞానం లేనివానికి విధిగానూ, వీటన్నిటికి ప్రధానమైనదైన (పరిక్షించి గ్రహించడమనే) వివేకాన్ని నూరిపోసే మీ రచనలు మీ పత్రికల ద్వారా ఆస్తికులకూ, నాస్తికులకూ ఆదర్శం కాగలవని ఆశిస్తున్నాను. మిధ్యాచారులకు నిజాలు చేదైనా, నిజంకావాలన్న వారికి మధుర పదార్థాలు కాగలవు. హరి ఓం జ్ఞానసేవలో, మీ ప్రమోద చైతన్య.

ప్ర.స్పం ఆర్యా; మీ లేఖ మీపరిశీలనా దృష్టికీ, నిజం ఎడల మీకున్న నీజమైన గౌరవానికి అద్దం పడుతోంది. నా హృదయాంతరాళంలోని ఒక అంశాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించి లేఖలో చూపారు. ఆస్తికులూ, నాస్తికులూ - కూడా రావలసిన విప్లవాన్ని సాధించలేరు. అన్ని సంఘాలలోని వాస్తవికులూ, ధార్మికులూ మాత్రమే విప్లవానుకూల శక్తులు కాగలవన్నదే నా ఆంతర్యము. నా రచనల వెనుక నున్న అనేక లక్ష్యాలలో ఇది అత్యంత ప్రాథమికమైనది. ఈ యత్నంలో మనమూ, మరి మనలాంటి వారమూ, చేయి చేయి కలిపి నడవగల్గుదుము గాక. సెలవ్

మాటిమాటికీ సందేహాలంటూ లేఖలు వ్రాస్తుంటే మీ రేమనుకుంటారోనని శ్రీ మరిగంటి శ్రీరంగాచార్యులు వ్రాశారు.

ప్ర. స్పంఆర్యా! ఇందులో అనుకునేందుకేమీ లేదు. పైగా నా రచనల పై నేనాశించినంతగా స్పందన లేదే అన్న బాధ కూడా నాకున్నది. వ్యక్తికి, ఒక రచన పై స్పందన కలగలేదంటే, ఆ విషయం అతని కఖ్ఖర లేనిదైనా అయ్యుండాలి. లేక పూర్తిగా తెలిసినదైనా, అస్పలు తెలీనదైనా అయ్యుండాలి.పాఠకులు పై వాటిలో ఏ కోవకు చెంది ఉన్నారో గానీ తృప్తికరంగా స్పందించడం లేదన్నదో నిజం. మీలాంటి వారి స్పందనలే నారచనలకు కొంతైనా ఉత్తేజాన్ని ఇవ్వగలవు. తప్పక మీరు, ఈ సంచిక చూసిన పిదపైనా ఒకరి పాఠకులూ (పండితులూ, జిజ్ఞాసువులూ) పత్రిక ఆలోచనలలో పాలుపంచుకుంటారని ఆశిస్తాను.

మీ సురేంద్ర.

గమనికలు:

(1) ఉత్సాహం చూపుతూ అనేక లేఖలు అందుతున్నాయి. సంతోషించదగ్గ విషయమే అది. అయినా ఆత్మ సంస్కారాని కంతమాత్రం ఉత్సాహం సరిపోదు. సాధన ప్రారంభించడం. భావ సారూప్యత కల వారందరమూ వీలయినంత తరచుగా కలుసుకోవడమూ, ఆయా అంశాలను పరస్పరం పరిశీలించుకుంటూ అవసరమైన మార్పులూ, కూర్పులూ, చేసికోవడం జరగవలసి ఉంది.

2) యధాప్రకారం ప్రతి మూడు మాసాలకు జరుగు సమాలోచన సమావేశాలు జరుగుతాయి. పాఠకులందరూ ఆహ్వానితులే. సభ్యులుగా నుండ గోరువారూ, సాధనచేయగోరువారూ, భవిష్యత్తులో మండలి చేయబోయే సామాజిక విప్లవ కార్యక్షేత్రంలో భాగస్వాములు కాగోరువారూ ఈ సమావేశాలకు తప్పక రావలసి ఉంటుంది.        (3) ‘మేలుకొలుపు’ పత్రిక పట్ల అభిమానమూ, మండలి కార్యక్రమంపట్ల సానుభూతీ మాకు ప్రోత్సాహ కారకాలే అయినప్పటికీ మీ నుండి మేము కోరుతున్నదీ మాత్రమే కాదు. చేయవలసిన కార్యక్రమంలోనికి మీరూ రండి, రావలసిన మార్పుకై మన నుండే యత్నం మొదలెడదాం రండి. అన్నదే మండలి ఆకాంక్ష.

సత్య పక్షాన నిలవండి - ధర్మ బద్ధంగా జీవించండి.

మేలుకొలుపు 11

 

మేలుకొలుపు

సంపుటి 2                                              సం క్రాంతి సంచిక -1                                                    1-1-92

ప్రమాణ వివేచన - 2


     ప్రమాణములు పరికరముల ననుసరించి పద్ధతుల ననుసరించీ ఏర్పడతాయనుకున్నాము కదా. పద్ధతుల ననుసరించి ప్రమాణములేమో వివరించలేదంటూ ఒకరిద్దరు లేఖలు వ్రాశారు. ఆ లేఖలనుబట్టి విషయాన్ని మరో విధంగా చెప్పినచో బాగుంటుందనిపిస్తోంది. పరిశీలించి గత సంచికలో ఈ విషయం చెప్పానో లేదో కూడా గమనించండి.

1)     పరికరముల ననుసరించి ప్రమాణములారు.  రూపాదులకు నేత్రమూ, రసాదులకు జిహ్వ అలానే ముక్కు, త్వక్కు, చెవి ప్రమాణములౌతాయి. ఇంత వరకు బాహ్య విషయ జ్ఞాన సాధనములివి. ఆరవదిగా అంతరింద్రియమొకటి. దీనిని మనస్సందాము. మొత్తం పరికరములు 6. కనుక ప్రమాణములారు.

2) పద్ధతులను-ప్రకార భేదాన్ని-బట్టి ప్రమాణములను భిన్న సిద్ధాంతకారులు, విభిన్న రీతులుగా ప్రతిపాదించారు. అందరు చెప్పినవి కూడా క్రోడీకరిస్తే ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనన్న 3 ప్రమాణము లేర్పడతాయి. చిన్నచిన్న తేడాలున్నాయనుకుంటూ వాటినే ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ది, ఐతిహ్యము, సంభవము అన్న పేర్లతో మొత్తం 8 ప్రమాణములుగా మరి కొందరు వర్గీకరించారు. పద్ధతుల ననుసరించి ప్రమాణములివే.

3)  నా దృష్టి నుండి ఇవి ముఖ్యంగా రెండు. (1) ప్రత్యక్ష పధ్ధతి (2) పరోక్ష పద్ధతి. ఈ పరోక్ష పద్ధతిని మళ్ళా కనీసం రెండు భాగాలుగా చూడాల్సి వస్తున్నది. వాటినే అనుమానము, శబ్దము అన్న పేర్లతో పిలుస్తున్నాము. ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనని ప్రకార బేధంచే ప్రమాణాలు మూడన్న మాట.

( Note :- పరికరముల ననుసరించిన ఆరు ప్రమాణాలూ ఒక్క ప్రత్యక్ష పద్ధతిలో ఇమిడి పోతాయి.)

వేటివలన జ్ఞానం కలుగుతున్నది? అని ప్రశ్నించుకుంటే ఆయా ఇంద్రియముల వలన అనీ, ఏ ప్రకారం జ్ఞానం కలుగుతోంది? అని ప్రశ్నించుకుంటే ప్రత్యక్ష, అనుమానాదుల ద్వారాననీ సమాధానం వస్తుంది. అలానే ప్రత్యక్ష పదార్ధ మేది అని ప్రశ్నించుకుని ఏ యింద్రియాన్ని సూచించినా లక్షణం చెప్పినట్లు కాజాలదు. ప్రక్రియా విశేషాన్ని ఇంద్రియార్ధ సన్నికర్ష జరిగి, సన్నికర్షలోనున్నంత వరకు తెలియడం అని చెప్పి తీరాలి. అలానే రూప జ్ఞానం ఎలా కలిగింది? అంటే ప్రత్యక్షాదుల వలన అంటే లక్షణం చెప్పినట్లుకాక, నేత్రం వలన అన్నప్పుడే కరణనిర్దేశం చేసినట్లవుతుంది. విషయాన్ని పరిశీలించి అర్ధం కాకుంటే ప్రశ్నించండి. స్పందనకు లేఖ వ్రాయండి. జ్ఞాన ప్రకరణంలో పరిశీలించవలసిన మరో అంశముందిక్కడ, చూడండి.

మనిషి తనకు కలుగుతున్న అనుభవాలనూ, వాటిననుసరించి తాను చేస్తున్నపనులనూ సమీక్షించి చూసుకుంటే అనుభవాలూ, వాటి నుండి కలుగుతున్న జ్ఞానమూ రెండు రకములుగా నున్నట్లు బోధపడుతుంది. (1) యదార్ధ జ్ఞానము-తద్వతి తత్ర్పకారకానుభవం, (2) అయదార్థ జ్ఞానము-తదభావ వతి తత్ర్ప కారకానుభవం. అంటే (1) ఎట్టి విషయమో అట్టి ప్రతిబింబమే అనుభవ రూపాన్ని పొందడం, దీనినే ప్రమ ఆంటాము. అట్లుగాక (2) ఉన్న విషయానికి భిన్నమైన ప్రతిబింబం అనుభవరూపంగా నుండడం. దీనినే భ్రమ అంటాము. అసలలా ఎందుకు జరుగుతుంది? అంటే భ్రమలకు కారణా లేమిటని అడిగినట్లు. అది సందర్భం వచ్చినప్పుడు అనుకుంటాము. జీవితంలో సహజంగానే జరుగుతున్న జ్ఞాన ప్రక్రియలో భ్రమకూడా చోటు చేసుకుంది కనుకనే, దాని వలన జీవితానికి నష్టమూ, ప్రమాదమూ ఏర్పడుతోంది కనుకనే. అసలీ ప్రమాణ, తర్క విచారణ అవసరమైంది మనిషికి. వీటి పట్ల సామాన్య జ్ఞానం ప్రతి మనిషికి ఉంది. భ్రమ రహితంగా, వాస్తవ జ్ఞానాన్నే నిరంతరం పొందవలసిన అవసరం ఉంది గనుకనే ఆయా పరికరాలు, ప్రక్రియలూ, భ్రమలకు కారణాలూ, వీటిని గురించిన విశేషజ్ఞానం పొందటం తప్పనిసరి అయింది మనిషికి. Note:-జిజ్ఞాసువుకు జ్ఞానార్జనలో, కలిగినది తప్పు జ్ఞానమా? ఒప్పు జ్ఞానమా? నిశ్చయించుకోవడం అతి ప్రధానమూ, జ్ఞానార్జనా ప్రక్రియలో ఆయా విషయాలకు ముగింపు కూడా అవుతుంది. ఈ పాఠ క్రమాన్నలా ఉంచి పాఠకులు గమనించ వలసిన మరి కొంత సమాచారాన్ని అందించి ఈ సంచిక ముగిస్తాను.

తర్క ధోరణులనేక మున్నాయనీ, అలా వివిధ రీతులేర్పడడానికి వారి వారిలోని అవగాహనాలోపమో, స్వపక్ష మండన దృక్పథమో, పరపక్ష ఖండనే లక్ష్యముగా పెట్టుకొనుటో కారణాలుగా ఉంటాయని గమనించాము. అలా తర్కరీతుల మాదిరే తార్కికులలోనూ (1) అతితార్కికులు, (2) మధ్యమానుసారులు (3) మందవేగులు అను మూడురకాల వారుంటారు. Note:-ఈ పేర్లు నచ్చకుంటే మరో పేరు పెట్టుకోండి. 3 రకాల తార్కికులుంటారన్నదే గమనించవలసిన అసలు విషయం.

ప్రతి మనిషీ జ్ఞానేంద్రియాలా, మెదడూ, వాటి పనుల తీరుతెన్నుల ననుసరించి స్వాభావికంగానే విచక్షణా శీలిగా నున్నాడు. అట్లా సహజంగానే ఏర్పడి యున్న తార్కిక శక్తిని కొందరు అక్కరలేనంతగా ఉపయోగిస్తుంటారు. వీరినే అతితార్కికులనేది. (2) మరో రకము వారు తర్కాన్ని అవసరమైనంత మేర జీవితానుభవాల నతిక్రమించకుండా ఉపయోగించుకుంటారు. వీరినే మధ్యమానుసారులు అంటాము. ఈ తరహా తర్కాన్నే గత సంచికలో నేను అనుభవాంగ తర్కము అన్నది. ఇక మూడో రకం వారున్నారే. (సమాజంలోనూ సాంప్రదాయ ప్రచారకులలోనూ, భిన్న ధోరణుల ప్రచారకులలోనూ,వీరే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం). వీరు తర్కాన్ని పూర్తిగా విడువరు, [తర్కించడం మానవ స్వభావం కనుక.] అలా అని అవసరమైనంత మేర అనగా పరిశీలించవలసిన అంశాలలో పరిశీలనలు పూర్తయ్యేంత వరకూ దానిని ఉపయోగిస్తారా అంటే అదీ లేదు. పోనీ యితరులు పరిశీలిస్తానంటే అంగీకరిస్తారా? అబ్బే అలా అయితే ఇక అనుకోవడ మెందుకు? వీరి పనీ, వీరి తార్కికతా కూడా మునగానామ్, తేలానామ్‌గా ఉంటుంది. పూర్తి విశ్వాసులూ కారు, విచారణశీలురూ కారు. నేడు సమాజాన్ని ప్రమాదపు నదిలో ముంచెత్తుతున్నదీ మూడవ తరహా తార్కికులే. వీరు తాము చెప్పగలము అనుకున్నంత వరకు హేతు బద్దంగానే మాట్లాడుతుంటారు. ఋజువులు లేకుంటే ఎలా గయ్యా! అని ఎదుటివారి నడుగుతూనే ఉంటారు. తాము చెప్పగల విషయం ముగిసిందనుకోండి. అప్పటికింకా మిగిలి వున్న సందేహాల నెవరైనా అడిగితే మాత్రం తర్కించకు, తర్కానికవధుల్లేవు, నిలకడా లేదు. తర్కం పనికిరాదు అంటూ మరో పాటందుకుంటారు. ముందు ముందాయా పరిశీలనలలో వీరు మనకధికంగానే ఎదురు పడతారు గనుక తార్కికుల్లోని ఈ రకాలను గుర్తులో ఉంచుకోండి ప్రస్తుతానికి.

ఇక ఒకటవ రకం వాళ్ళన్నారు చూశారూ! వారికిక ఇది అవసరమా? అనవసరమా అన్న స్పృహే ఉండదు. చిన్న చిన్న విషయాలనైనా తర్కించుతూ రోజులకు రోజులే వెచ్చించగలరు వీరు. లోకం ఏమైపోతున్నా వీరికేమీ పట్టదు. ఒక రకంగా తర్క కండూతి వీరిది. తర్కించకుండా ఉండలేరు. ఆ తర్కానికి హద్దే ఉండదు. మరో ఆశ్చర్యకరమైన విషయ మేమంటే అలా రోజులూ, నెలలూ, సంవత్సరాలూ కూడా తర్కిస్తూనే గడిపివేయ గలరు వీరు. అయినా విషయం మాత్రం ఒక కొలిక్కిరాదు. వీరి వరకు వీరికి ఆనందంగానూ, బహు తృప్తిగానూ, గొప్ప ఘన కార్యం సాధించినట్లున్నూ ఉంటుంది తర్కిస్తూ జీవితం గడిపివేస్తుంటే. తర్కమన్నది విషయ పరిశీలనకూ, వివేక సామర్థ్యాన్నిపెంచుకొనుటకూ కేవల మొక సాధనం మాత్రమేనన్న దృష్టి ఉండదు ఈ రకం వారిలో. వీళ్ళలో మరల రెండు రకాల వాళ్ళున్నారు. (1) విషయ పరిజ్ఞానం కలిగున్నవారు, (2) అదీ లేనివారు. ఇరువురూ తర్కానంద స్వాములే. తర్కం వీరికి జ్ఞాన సాధనంగా కాక ఆనంద సాధకంగా ఉంటుంది. వీరిలో రెండో రకం వారు తాము చెడి, యితరులనూ చెడగొడుతుంటారు. మరి ఒకటో రకం వారు మాత్రం తామేమీ నష్టపోడు. వారి పాలబడిన వారు మాత్రం జీవితాన్నీ, విలువైన కాలాన్నీ చాలా నష్టపోతారు. మీమీ అనుభవాల నుండీ, సమాజాన్ని పరిశీలించడం నుండీ పై విషయాలు గమనించి రూఢి పరచుకునే యత్నం చేయండి. అట్టి తరగతుల వ్యక్తులు లేరు అనిపిస్తే నాకు వ్రాయండి. అట్టి వారిని కలిసే ఏర్పాటు చేస్తాను. అలానే మీరూ ఏ మూడు రకాల వారిలో చేరి ఉన్నారో చూసుకోండి.

మరోమాట. తర్కమన్నమాట వ్యవహారంలో రకరకాలుగా వాడుతున్నప్పటికీ, తర్కశాస్త్రము అన్న ప్రయోగంలో మాత్రమే దానికి సరైన అర్థం చెప్పబడింది. ప్రమాణైః అర్థ పరీక్షణం న్యాయం! అన్నది తర్కలక్షణం. ప్రమాణాదులచే (హేతూదాహరణలే ఇక్కడ ప్రమాణ శబ్దంచే సూచితం). అంటే ఆధార సహితంగా విషయాన్ని పరీక్షించి నిర్ణయించే ప్రక్రియావిశేషాన్నే తర్కమంటామని పై వాక్య భావం. సత్యనిర్థారణకై మనిషి చేయు క్రమబద్ధమైన మానసిక ప్రక్రియే తర్కమంటే. ఈ అర్ధాన్ని అర్థం చేసుకోగలిగితే మానవ జీవితంలో తర్కం పాత్రేమిటో, ప్రాధాన్యతేవిటో బోధపడుతుంది. తర్కాన్ని గూర్చి చులకనగా మాట్లాడే వారెవరైనప్పటికీ తర్కమంటే ఏమో వారి కర్థం కాలేదనాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిన మరో అంశముంది. అది వెనుక చెప్పుకున్న అతి తర్కమో, అటూ ఇటూగాని- మందవేగుల తర్కమో కాకుండా ఉండాలి. కేవలం ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి విలువుంది. తర్కపద నిర్వచనం మరో రకంగానూ చెప్పబడింది. “అవిజ్ఞాతతత్వే అర్ధే కారణోపసత్తితః తత్వజ్ఞానార్థం ఊహః తర్కః” తెలియబడని విషయంయొక్క యదార్థ స్థితిని గ్రహించుటకై కొన్ని ఆధారాలతో ఊహ చేయడం తర్కము అని సూత్రార్థం. ఈ సూత్రం అనుమాన ప్రమాణంలో- పరోక్ష జ్ఞానవిషయంలో తర్క దృష్టియొక్క పాత్రను, అవసరాన్నీ సూచిస్తోంది. అందుతున్న ఆధారాన్ని బట్టి అందుబాటులో లేని విషయాన్ని నిర్ధారించుటకై చేయు ఊహనే తర్కమంటారని అర్థం.

తర్కం శాబ్దీ ప్రమ- శబ్ద ప్రమాణం వల్ల కలుగుతున్న జ్ఞానం-విషయంలో కూడా అవసరమా కాదా? పనికొస్తుందా లేదా? ఆలోచించి స్పందనకు వ్రాయండి. అలానే, తర్కబద్ధం కాని సిద్ధాంత ముంటుందా? ఉంటుందంటే ఎలాగో, అదే సిద్ధాంతమో చెప్పండి. ఉండదన్నారనుకోండి! ఇక మీరెప్పుడూ తర్కం పనికిరాదనీ, తర్కించకండనీ ఎక్కడా అనకూడదన్న విషయం గమనించండి. సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళపై కుహనాగురువులు చల్లిన బురదగానీ, తర్కబద్ధంగా యోచించడమనే పనిపట్ల అమాయకులైన తమ తమ అనుయాయులలో కల్పించిన వ్యతిరేకతగానీ, అంతింతనలేము. యదార్ధ శతృవులైన ఈ పండితమ్మన్యుల వల్ల అటు సమాజానికీ, ఇటు విజ్ఞానకాయానికి జరిగిన అపకారం మరే రకమైన శతృవులవల్లనూ జరుగలేదన్నది పచ్చి నిజం. సృష్టిలోని సమస్త పదార్ధములందునూ శుద్ధమూ, వికశిత రూపమూ, శక్తివంతమూనైన మానవ మేధస్సును ఉపయోగించుకోనీకుండా అడ్డుపడుతున్న బాధ గురువుల నేమనాలి? ఏమన్నా ప్రయోజనం లేదు. ఏరివేయాలి.

ఇప్పటికే కొందరు తర్కజ్ఞులకు అసలు విషయం చెప్పవయ్యా ఎందుకీ ఉపోద్ఘాతం అని అడగాల నిపిస్తూండవచ్చు. తార్కికులకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రతి తార్కికునికీ ఎదుటివాడు ప్రతిపాదించే విషయాన్ని సందేహించి పరిశీలించే ప్రవృత్తి అలవాటుగా మారి ఉంటుంది. వారికి నేచెప్పేదేమంటే పత్రికోద్దేశం ప్రమాణ నిర్దేశమో, తార్కికులతో చర్చించడమో మాత్రం కాదు గనుకనూ, భిన్న స్థాయిలోని పాఠకులకు-జిజ్ఞాసువులకు ఆయా విషయాల్ని క్రమంగా అందించడమెలా అన్నది కూడా పరిగణించవలసి ఉంది కనుకనూ రచనా విధానం వివరణాత్మకంగా ఉండుంటే ఉచితమౌతుంది. ఈ ప్రమాణ విద్యనూ, ఆధ్యాత్మిక-విద్యనూ కూడా బోధించడమూ, గ్రహించడమూ, మరో తార్కికునితో చర్చించడమూ కూడా తేలికైన విషయమేమీ కాదు. ఈ విషయమూ తార్కికులకున్నూ తెలియనిది కాదనుకొందును.

Note:-1) ప్రత్యక్షగోచరం కాని దాన్ని తర్కంద్వారానే గమనించాలి, సాధించాలి అన్న నిర్ణయానికి ప్రాచీన తాత్వికులు ఎక్కువమంది వచ్చినా రనిపిస్తోంది నాకు వచ్చిన రచనలు చూస్తుంటే. మీరేమంటారు.

1)     ప్రత్యక్ష గోచరం కాని పరమాణువుల ఉనికినీ, వాటి ధర్మాలను వైజ్ఞానికులే ఆధారంతో ప్రతిపాదించి ఉంటారో యోచించండి. మీ యోచనలను స్పందనకు వ్రాయండి.

 

చేదునిజాలు -1

వెనుకటి తరాల మేధావులూ, విజ్ఞానులూ, సహృదయులూ నైన అనేకుల నిరంతర శ్రను వల్ల ఏర్పడిన అనేక వనరులను నేడు మనం సులభంగా పొంద గలుగుతున్నాము. అందులకు వారలకు సర్వదా కృతజ్ఞులమై యుండుట మన విధి. మరోవంక గతంలోని మరి కొందరు స్వార్ధపరులచే అమాయకులైన సామాన్య ప్రజానీకంలో ప్రవేశ పెట్టబడిన కొన్ని దుష్ట విధానాల వల్లా, అజ్ఞాన జనిత అంధ విశ్వాసాలవల్లా ఏర్పడుతున్న విషఫలాలను కూడా ప్రస్తుతం మనమందరమూ అనుభవిస్తూనే ఉన్నాము. మంచి, చెడుల కలివిడిగా సంక్రమించిన ఆ గతాన్ని పరిశీలించి, ప్రయోగించి వడపోసికొనగలగడం విజ్ఞత కాగలదు. అది మనకూ, మన ద్వారా సంక్రమించబోయే ముందు తరానికి కూడా శుభదాయకమవుతుంది. “చేదు నిజాలు” అన్న శీర్షికన దుష్టాకృతినొంది మనకందిన -వెంటనే అందరం కలసి సవరించుకోవలసిన - కొన్ని అంశాల్ని మీ ముందుంచుతాను. పరిశీలించండి ఆలోచించండి. తగిన విధంగా కదలండి. నలుగురనూ కదిలించండి.

పరిశీలనాసక్తులైన మేధావులారా! జ్ఞానార్ధులైన జిజ్ఞాసువులారా! సాధ్యసిద్ధి పర్యంతం శ్రమించగల సాధకులారా! ఆధ్యాత్మ విద్యా వివేకాన్ని కలిగించడమూ, కలిగించుకోవడమూ (అధ్యాపనమూ, అధ్యయనమూ) కూడా బహు కష్టసాధ్యమైన పని. తెలుపువాడూ , తెలిసికొనువాడూ కూడా తగిన మానసిక స్థాయీ (ఇష్టాయిష్టాల నేర్పరచు కొనకుండా విషయాన్ని విషయంగా చూపించగలా, చూడగలా సమర్ధతా) సునిశిత పరిశీలనా శక్తి (బుద్ధికుశలతా) ఏకాగ్రతా (అన్యమనస్కత లేకుండడం) కలిగియుండిననే గానీ విద్య పూర్ణరూపము నందజాలదు. ఎందుకనగా ఈ ప్రక్రియ ఇరువురి శ్రమపై నాధార పడియున్నది. చెప్పువాడూ, వినువాడూ కూడా తమతమ పనులను లక్ష్యశుద్ధి కలిగి నిర్వర్తించగలిగిన గానీ విద్య వంటబట్టదు. కోరిన-సరైన ఫలితం రావాలంటే బోధకునికీ, సాధకునికి కూడా తగిన అర్హతలుండాలన్నదే ఇచ్చట ప్రముఖాంశము. ఈ విషయంలో ఇరువురూ ఎవరికి వారు ముందు తనకు తాను అర్హుడో కాదో చూసుకుని రెండవవాడూ అర్హుడో కాదో చూడవలసి ఉంది. ఈ పద్ధతి అమలు జరిగినంతకాలం విద్యా ప్రమాణాలు సమున్నతంగానే ఉంటాయి. లేనినాడవి క్రమంగా బలహీనపడతాయి.

బోధకుడు తాను స్వానుభవం ద్వారా గ్రహించినవీ, మరల మరల ప్రయోగ రూపంలో రూఢిపరచుకొనదగినవీ అయిన వాటిని మాత్రమే తెలుప యత్నించడమూ, అదిన్నీ విద్యార్ధి ప్రయోగాలద్వారా స్వానుభవ రూపంగానే ఆయా విషయ జ్ఞానము నండునట్లు ప్రేరేపించడమూ చేయగలగాలి. అట్టివాడే గురువనదగ్గవాడు. అట్లు గాక వాస్తవంగా తనకే తెలియని వాటిని [తెలుసుననుకుని] తెలుప యత్నించాడనుకోండి!? ఆ సందర్భంలో విద్యార్ధిలో ఏర్పడిన సందేహాలను సమర్ధవంతంగా, తానూ, నివృత్తి చేయజాలడు గనుక విషయాన్ని ప్రక్కదారులు పట్టించడమో, పెద్దలను ప్రశ్నించకు అనే అహేతుక మైనట్టి, విద్యావిధానానికే అవమానకరమైనట్టి పంధాను స్వీకంచడమో, లేక ఆ ప్రశ్నకు తప్పు సమాధానాన్ని (అప్పటికి తట్టిన పరిష్కారాన్ని) చూపి తాత్కాలికంగా తృప్తి పడడమో చేస్తాడు. అప్పుడేం జరుగుతుంది? 1) శ్రమ దండుగ, 2) కాలహరణము 3) భ్రమ జ్ఞానాధారంగా జీవితాన్ని సాగించుట జరుగుతుంది. తప్పుజ్ఞానం - జీవితాల్ని (సమా జాల్ని) నడుపుతుంటే ఎంత ప్రమాదమేర్పడుతుందో కొంచెం నిదానించి చూడండి చూడగలిగితే.

చెప్పగలగడమూ-తగిన భాషా సామర్థ్యము- ఆ చెపుతున్నవి స్వానుభవం ద్వారా గ్రహించి, ఆచరిస్తున్నవై యుండడమూ గురువుకుండవలసిన అర్హత లవుతున్నాయి. Note:-ఇక్కడో విషయం చింతించదగియున్నది. అది జ్ఞానానికి, హృదయానికి ఉన్న తేడా ఏమిటనేదే. ఒక్క ఉదాహరణనిస్తాను. గమనించి మీ అనుభవాలనుండి విపుల పరిశీలన చేయండి. ఒక పక్షి దెబ్బతగిలి గిలగిల లాడుతోంది. ఆ దృశ్యాన్ని కొందరు వ్యక్తులు చూశారు. జరిగిన సంఘటన అందరకూ తెలిసింది. ఆపై వారి ప్రవర్తనలు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. ఒకరు అయ్యో అనుకున్నారు. మరొకరు బలే తన్ను కుంటోంది అని ఆనందిస్తున్నారు. మరొక్కరు చిక్కితే బాగుండును ఈ రోజు కూర మజాగా ఉంటుందనుకుంటుంటే, మరొకడున్నూ పట్టుకునే యత్నం చేస్తున్నాడు. అయితే వాడి మనస్సులో చికిత్స చేయాలనుంది. కలిగిన జ్ఞానమొక్కటే అయినా ఆ జ్ఞానం వారిలో కలిగించిన ప్రవృత్తులు వేరుగా ఉన్నాయి. ఆ భిన్న ప్రవృత్తుల కాధారమైన భావనలనే (feelings) హృదయం అన్న మాట సూచిస్తోంది. అలాంటివే మరి కొన్ని పరిశీలించండి.

సరే విషయానికొద్దాం. గురువన్న వానికి వెనుక చెప్పిన జ్ఞానస్థాయి ఒక అర్హతకాగా హృదయ పరంగా ఉండవలసిన అర్హత మరొకటుంది. తాను స్వానుభవం ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని నలుగురకూ పంచాలన్న అందించాలన్న -భావనా, ఇవ్వకుండా ఉండలేనితనం - తపనా కలిగి ఉండాలతడు. ఇవ్వగల సమర్ధతా, ఇవ్వాలన్న తపనా అన్నది గురువు అర్హతలు. అట్టివారే యదార్థ గురువులు. పరమగురువులు కాగలరు.

అట్లే అధ్యయనశీలురకున్ను, విద్య తన అవసరంగా అనిపించాలి. (మొక్కుబడిగానో, ఇతరుల వత్తిడి నుండో యత్నించే వారు యదార్థ జిజ్ఞాసువులు కాలేరు. అలానే జిజ్ఞాస కలిగి ఉన్నప్పటికీ ఏదో తెలిసికోవాలి ఏదో తెలిసికోవాలి అనుకుంటుంటే సరిపోదు. ఏమి తెలిసికోవాలి? అది యిప్పటి కెంత తెలిసింది? ఎక్కడనుండి తెలియవలసి ఉంది? అన్నది విస్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానార్జన సరైన స్థానం నుండి మొదలవుతుంది. ఏనాడు విద్యార్థికి తాను విద్యా గ్రహీతననీ, విద్య తన జీవితావసరమనీ గుర్తులో లేకుండా పోయిందో ఆనాడే విద్యా విధానానికొక మౌలికమైన రోగం సంక్రమించింది. ఈ రోగాన్ని కుదుర్చుకోనంత కాలం అతనికీ విద్య పట్టనూ పట్టదు. పట్టింది సద్వినియోగమూ కాదు. విద్య కొనుక్కోగలను అన్న భావం విద్యార్థికి ఎన్నడూ కలుగరాదు. పరిగ్రహీతనన్న (పొందవలసిన వాడిని, స్వీకరించవలసిన వాడిని అన్న భావం విద్యార్థికి సర్వదా శ్రేయస్కరం కాగలదు.

ఇంతవరకూ అర్థమైందనుకుంటేనూ, బాగానే ఉందనుకుంటేనూ ఈ కొలతల నుండి నేటి గురువులనూ, విద్యార్థులనూ, (అన్ని శాఖలకు చెందిన విద్యాలయాలలోనూ) పరీక్షించి చూసుకుంటే అన్నీ చేదు నిజాల్నే చవిచూడవలసి వస్తుంది. జ్ఞానరహితమైన హృదయం వలన గానీ [ఇందుకు అజ్ఞురాలైన తల్లి ప్రవర్తన మంచి ఉదాహ రణము.] సహృదయతలేని జ్ఞానం వలన గానీ (స్వార్థ పరత్వమూ, కపటమూ కల మేధావులందరూ ఇందుకు ఉదాహరణమే) సమాజానికి కలగవలసిన మేలు కలుగజాలదు. ప్రతి క్షణమూ, ప్రతి రంగాన్ని ప్రభావితం చేయగల అంశమిది. శోచనీయమైన విషయమేమంటే ప్రస్తుతం ఈ రెండూ వేటికవి వేరుగా ఉండి రాజ్య మేలుతున్నాయి, అయ్యలారా. నేను చెబుతున్న విషయాన్నూరక చదువుకుంటూ పోకుండా కొంచమాగి విచారించి చూడండి. సమాజంలో నాడూ నేడూ కూడా ఆయా శాఖలకు చెందిన విద్యాధికులు దండిగానే ఉన్నారు. (ఒక్క ఆధ్యాత్మ విద్యను మినహాయిస్తే) ఉన్న విద్యాధికులనందరనూ ఒక చోట చేర్చి సమాజంలో విద్యాధికుని, పాత్ర-బాధ్యత-అన్న వివేకపు కొలత నుండి గానీ, తెలిసిన దానిని (ఆ తెలియుటకూ ఖచ్చితంగా సమాజమే ఆధారంగా ఉంది సుమా.) సమాజానికై వినియోగించాలి-సమాజానికి తెలుపాలి, తెలుపకుండా ఉండలేను ఉన్న హృదయానికి చెందిన కొలత నుండి గానీ కొలిచి చూస్తే సరి తూగేదెంతమంది? గురువులు వారికై వారు ఆత్మ విమర్శ చేసికునిగానీ మనం చేయబోయే విచారణకు నిలిచి గానీ దీనికి సమాధానం చెప్పమనండి. అబ్బే పరీక్షలో నిలిచే సంఖ్య ఏమాత్రం లెఖ్ఖలోకి రాదన్నది ముమ్మాటికీ నిజం. విద్యా విషయమై తెలుపువారి విభాగానికి చెందిన బోధకులకు సంబంధించిన వాస్తవ స్థితియిది. రాకాసిలా బలపడి దుష్ఫలితాల్ని సృష్టిస్తూన్నదీ, అందువల్లనే ప్రభుత్వమూ, ప్రజలూ కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చి సరిచేసికోవలసినదీ అయిన ఈ అంశం ప్రస్తుతం అత్యంత సామాన్య విషయంగా మారిపోయింది. అంతేకాదు, దాని వాస్తవ విలువల గురించి నాలాంటి వాడెవడైనా వివరించినా అదేదో విషయాన్ని భూతద్దంలోంచి చూపిస్తున్నాడని భ్రమపడేస్తాయి, పడిపోయింది సగటు మనిషి మనస్సు. పై వివరణ అతిశయోక్తిగా ఉందన్న అభిప్రాయం యిప్పటికే మీలోనూ చాలామందికి కలిగి ఉంటుంది. ఆగండి. ఆలోచించి చూడండి. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు సరికదా! వాస్తవంగా చూపాల్సిన రూపాన్ని గూడా కొంత క్లుప్తీకరించే మీ ముందుంచాను. ఎందుకలా అనగలిగానంటే, ఏ పనికైనా అర్హత అన్నది ప్రాధమిక నియమమూ, అవసరమూ కూడా కదా! ప్రాధమిక నియమములూ కనీసార్హతలూ కూడా లేని వ్యక్తులున్న రంగాలు ఏమి సాధించగలవన్నది మన విద్యారంగాన్నీ, ఆశ్రమాలనూ అక్కడ తయారై సహజంలోకి వస్తున్న విద్యార్ధులనూ చూడగలిగితే స్పష్టంగానే కనపడుతుంది. చిన్న నా బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే మన నాయకమ్మన్యులకు పాలకులకు - వాటిని సంస్కరించే తీరుబాటెక్కడిది. ఆ వారి స్వవిషయాలు చూసుకుందుకే 24 గం|| సరిపోవడం లేదాయె పాపం.

ఈ రంగంలోని రెండో విభాగం - విద్యార్థుల పక్షం పరిస్థితి కూడా ఏ మాత్రం ఆశావహంగా లేదు. విద్యార్ధుల వికృత చేష్టలూ, రౌడీ క్షేత్రాలలోనూ, రాజకీయ క్షేత్రాలలోనూ, ఖూనీకోరుల సమాఖ్యలలోనూ, జులాయి తిరుగుళ్ళ విభాగం లోనూ, వ్యసనాల బానిసత్వంలోనూ, సమ్మెలూ-బందులూ నిర్వహించడం లోనూ, ఎన్నికలలోనూ ఇలా ఒక్క తమ స్వంత క్షేత్రమైన విద్యార్జనను విడచి పెడితే విశ్వరూపు ధరించగల స్థాయిలో వికృతంగా ఎదిగిపోతున్నారు వారు. ఈ అమాయక యువశక్తిని ఆయా ప్రాంతాల కుల నాయకులూ, గ్రూపు నాయకులూ,  దాదాలూ, పాలకులు కూడా సరి సమానంగా వాడుకుంటున్నారు. ఇక సంస్కరణేం కుదురుతుంది. వీరు సంస్కరింపబడితే పైనాయక మన్యులందరూ మాడిచస్తారు. తాము బ్రతకాలి గనుక విద్యార్ధులలా బలిపశువులై [ఆవేశంతో స్వంత జీవితాన్ని బలి చేసుకుంటున్నా మనే వివేకం లేక] చావవలసిందే. ఈ విషయాలు ఎవరికి వారికిగా, చాలా మంది సహృదయుల మనస్సులలో మెదులుతూనే ఉన్నా అందరం కలసి అరవాలనీ, ఆలోచించాలనీ, అందువల్లైనా. ఏదో విధంగా కలసి కదిలే యత్నం ఆరంభమవుతుందనీ నా ఆశ.

విద్యారంగానికే చెందినది, అన్నీ విద్యలకూ ఆధార విద్యగానున్నది, ధర్మాచరణకూ, నైతిక విలువలకూ ఉత్పత్తి స్థానీయమైనదీ అయిన తాత్విక - విద్యా క్షేత్రాలు ఎంత బలహీనంగా, ఎంత  కల్మషపూరితంగా [అధార్మికంగానూ, అనైతికంగానూ] ఉన్నాయో మా స్వానుభవంలో గమనించిన వాటిని పై సంచికలో పాఠకుల ముందుంచే యత్నం చేస్తాను. 

(సశేషం...)


అభ్యాసక్రమం 6

సత్యాన్వేషణ మండలి సాధన క్రమాన్ననుసరించి ఆధ్యాత్మ సాధకులుగా నుండగోరిన వారు తప్పనిసరిగా వారి వారి వివరాలతో మాకు లేఖలు వ్రాయవలసి ఉంటుంది. అలానే ప్రతి మూడు మాసాలకూ జరిగే ( సాధనా, విచారణ) శిబిరాలలో విధిగా పాల్గొనవలసి ఉంటుంది. నాయనలారా! ఇప్పటి వరకు క్రమంగా చెప్పుకుంటూ వస్తున్న అభ్యాసాలను అమలుపరుస్తున్నదీ లేనిదీ తెలుపండి. హృదయగతంగా నీకు ఎదగాలి ఎదగాలి అన్న తపన ఉంటే మాత్రం సాధన ఈ క్రమంలో చేసి తీరాల్సిందే. సాధన అన్నది ఎవరికివారు తమకిష్టమైన దగ్గర నుండి, ఇష్టమైనంతవరకు చేసేదిగానో, ఎప్పుడనిపిస్తే అప్పుడాగి చేసేదిగానో, ఉండరాదు. క్రమం (నిర్ణీత వేళలూ, నిర్ణీత పద్ధతి, నిరంతరాయతా) తప్పకుండా అభ్యసిస్తున్నప్పుడే అది సాధన రూపాన్ని పొంది సాధ్యం వేపు మనల్ని కదిలిస్తుంది. నాయనా! నేను సాధన చేస్తాను. సాధకుణ్ణి అని ఒక్కసారి నీవు దృఢంగా నిశ్చయించుకున్న క్షణాన్నుండే నీవు నియమబద్ధుడవైనట్లు తెలిసికో. ఇక నియమమే నిన్ను నడపాలి. అలా నియమబద్ధంగా జీవితాన్ని సాగించే వాళ్ళను చూసి వెక్కిరించేవాళ్ళూ, నిన్ను నీవే అస్వతంత్రుణ్ణి చేసుకున్నావని చిన్నబుచ్చే వాళ్ళూ నీకూ, నీ సాధనకు మొదటి శతృవులన్న (ప్రతిబంధకాలన్న) వాస్తవాన్ని గమనించు. వీలయినంత వరకు, మూర్ఖ మేధావులూ, ఆచరణ శూన్యులూ, జీవితావ గాహన యందు బాలుర వంటి వారుయైన అట్టివారికి దూరంగా ఉండు. వాస్తవంగా

నీవు చేస్తున్న నిత్య సాధన నిష్ఫలమూ, నిర్వీర్యము కాదనియూ, పై మూర్ఖులు తాము చెడి, నలుగుర్నీ చెడ గొట్టుటలో మాత్రం కడు సమర్థులనియూ త్వరలోనే నీ స్వానుభవం నుండే గమనించగలవు. ఇందుకు ఎవరి మాటలు నమ్మవలసిన పనిలేదు. నీకు నీ అనుభవమే సాక్ష్యం కాగలదు.

ఇష్టాయిష్టాలకూ-వివేకానికి మధ్య ప్రతి మానవునిలోనూ అంతః సంఘర్షణ ఉంటోంది. ఏదో విషయంలో ఏదో సమయంలో స్వార్ధమూ, అజ్ఞానమూ ఇష్టాయిష్టాలకు ప్రాతినిథ్యం వహిస్తే, వివేక మన్నది అవసరాలకూ, హితానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. స్వార్ధానికీ, వివేకానికీ మధ్య ఘర్షణ ఉంటూనే వుంది అందరిలోనూ. అయితే వివేకసామర్థ్యం పెరిగినకొలదీ స్వార్ధం అవసరమైన పరిధుల్లోనికి, కనీస స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు ఆచరణలో ధర్మం మొదలై హితాన్ని పుట్టిస్తుంది. ఇష్టాయిష్టాలు (రాగ ద్వేషాలు) ఒకనికి గల సామాన్య జ్ఞానాన్ని, వివేకము విశేషజ్ఞానాన్ని సూచిస్తాయి. వివేకమూ, దానిననుసరించిన జీవితమూ నన్నదే నీకూ, నలుగురకూ యోగక్షేమాలను కలిగించ గలదు. ప్రస్తుతం వ్యక్తులలో-సమాజములో లోపించినది, ఎల్లప్పుడూ మనందరనూ నడుపవలసినదీ వివేకమేనని గుర్తించు. వివేకవంతుడ వగుటకై నిరంతరమూ యత్నించు. మనిషిని, సమాజాన్నీ కూడా అసలైన అభివృద్ధి వైపు కదల్చగల దొక్క వివేకమే.

4 వ సాధనగా, సామాజిక సంబంధాలలో అత్యంత ప్రధాన పాత్ర వహిం గల వాగ్ఞియమాన్ని స్వీకరించవలసి ఉంది. సాధకుడవశ్యమూ మితభాషిగా నుండాలి. అవసరమైన మాటలను, అవసరమైనంత మేరే మాట్లాడాలి. ఇది ఆయా మాట్లాడే విషయాలపై సమగ్రమైన అవగాహనవల్లనూ నిరంతరాభ్యాసంవల్లనూ మాత్రమే సిద్ధిస్తుంది. అందువల్ల వ్యక్తి మాటకు విలువ పెరుగుతుంది. పొల్లు మాటలు తగ్గుతాయి. యోచనలోనూ, పరిశీలనలోనూ గాఢత పెరుగుతుంది. పెట్టుకున్న సాధ్యానికి చెందిన సాధనల నాచరిస్తూండడము ఉత్తమం. అలా మరో వంక అయిన దానికీ, కాని దానికీ పని గట్టుకుని చొరబడడం మానివేయాలి. ఈ రెండు క్రమాల్నీ పాటించడం సాధ్య సిద్ధికి హేతువవుతుంది.

నియమ మన్నది మానవజీవితంలో వివేకం నుండి ఏర్పడింది. అది మనిషి జీవన వ్యాపారంలో ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎంత అన్న కొలతలను కలిగి హక్కులూ, బాధ్యతలూ, విధులూ అన్న వాటిలో క్రమాన్ని ఏర్పరుస్తూ పరిమితుల్ని కూడా నిర్దేశిస్తుంది.

జీవన వ్యాపారం త్రికరణముల ద్వారా జరుగుతుంది. అవి వాక్కు, కాయము, మనసు. నియమించవలసినవీ మూడే ముఖ్యంగా. “యతవాక్కాయ మానసః” అని సూక్తి. “ముని” అన్న మాట వినే ఉంటావు. మౌని (మితభాషి) మనన శీలుడు అని రెండర్థాలు చెప్పవచ్చు ఆ మాటకు. ప్రతి సాధకుడూ ముని కావలసివుంది. “యోగస్య ప్రధమం ద్వారం. వాగ్ఞ్నిరోధో అపరిగ్రహః” అన్నదో సూత్రం. మాటలలో సత్యాన్నీ, చేతలతో ధర్మాన్ని స్వీకరించ గల వారి వల్లే సమాజం నిజంగా ఉద్ధరింపబడుతుంది. అరుపులెక్కువైన నేటి వాచాలుర సమాజాలు సాధన లేమి చేస్తాయి? సిద్దినేల పొందుతాయి? సాధకుడా! నీవెన్నడూ వాచాలుడవు కాకు. ప్రగల్భాలు పలుకకు. చేసినంతవరకు చెప్పుకుంటే ప్రమాదం లేదుగానీ, చెప్పుకోకుండా ఉండలేని స్థితికి దిగజారకు. అవి నిన్ను మరింత దిగజార్చి క్రమంగా చేయనివాటి విషయంలోనూ చేసిన వారిలా కనిపించేలా చేస్తుంది.

ఆచరణ శూన్యతా, ఆత్మస్తుతీ, పరనిందా ఇవే నేడు సమాజాన్నీ, వ్యక్తుల్నీ కూడా భ్రష్టు పట్టిస్తున్న ప్రముఖాంశాలు. ఈ నాడు ఎక్కడ చూసినా చెప్పడానికీ, చేయడానికీ పొంతనే లేదు. ప్రతి ఒక్కణ్ణీ అతని మాటలను బట్టే కొలవ వలసివస్తే జ్ఞానంలో పరిపూర్ణుడే, సాధన విషయంలో సిద్ధుడే, సమాజ విషయంలో ఉద్ధారకుడే

అనవలసి వస్తుంది. మరి ఆచరణను బట్టి చూస్తేనో అజ్ఞానమూ, స్వార్థమూ దాదాపుగా కరడుగట్టుకొని ఉంది. ఇక సాధనెక్కడా? సమాజోద్ధరణెక్కడ? త్రికరణ శుద్ధి నేడు గగనకుసుమమే, గతస్మృతే, కలలోని వార్తే.

నాయనా! చెపుతున్నది గమనిస్తున్నావా? మార్పు రావలసిందెక్కడో, మనిషి ఆధ్యాత్మక సాధన లెట్లు చేయ వలసి యుందో అర్ధమవుతున్నాయా? నిదానంగానూ, నిశితంగానూ ఆలోచించి ప్రయోగం ద్వారా సరిచూసుకుంటూ ఆచి తూచి అడుగు వేయి. ప్రయాణం - సాధన - మాత్రం- గమ్యం చేరే వరకు ఆపకు. మనందరమూ మన మన దృఢయత్నములద్వారా సిద్ధావస్థ నంద గలుగుదుముగాక! మిత భాషణమూ, సత్యభాషణమూనన్నవే వాక్కును నియమించుట యనగా, గమనించి ఆచరించు. సందేహాలుంటే స్పందనకు వ్రాయి.

సంక్రాంతి [విప్లవ] సందేశం

జిజ్ఞాసువులారా! సాధకులారా! సమష్టిహితైషులారా! సంక్రాంతి - విప్లవ శుభాభినందనలు. క్రాంతి అన్నది మార్పుకు సంకేతము. సంక్రాంతి అనగా సరైన మార్పు అని అర్ధము. వివేకం కల ప్రతి మనిషి వాంఛితమూ కూడా సరైన మార్పే. కనుక మనందరమూ మన మన బుద్ధిశక్తినీ, క్రియాశక్తినీ, యిచ్ఛాశక్తినీ సమీకరించి విప్లవ పధంలో పయనింతముగాక! 

మానవ జీవితాన్నీ, మానవ సంఘాన్నీ, ప్రకృతిని పరిశీలించిన ఋషులు-అధ్యయనశీలురు- ప్రతి చోటా మార్పును వీక్షించారు. నేటి ఆధునిక విజ్ఞానం కూడా సమస్తమూ క్రియా వంతమే, పరిణామశీలమే నన్న విషయాన్ని రూఢి పరుస్తోంది. మన మన యనుభవాల నుండి పరిశీలించినా జడచేతనాత్మకంగా ఉన్న తెలియబడుతున్న సమస్తమూ క్రియావంతంగానే ఉంటున్నది. ఇక మానవ సంఘాన్ని పరిశీలించితే వారు వారు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ స్థాయిలో నున్న వారైనా మార్పును (తనకిష్టమైనరీతిలో) కోరుతూనే ఉన్నారు. అందుకై అందుబాటు లోనున్న వనరులననుసరించి (జ్ఞాన క్రియాశక్తుల సామర్థ్యాన్ని బట్టి) నిరంతరయత్నం చేస్తున్నారు. అలానే సామాజిక పరంగానూ (అది ఏ స్థితిలో నున్నప్పటికీ) ఉన్న స్థితి నుండి ఉండాలనుకుంటున్న స్థితి వైపుకు దానిని మార్చే యత్నం కూడా చేస్తున్నారు.

ప్రకృతి స్వాభావింగానే మార్పును పొందుతోంది. మనిషి మార్పునే కోరుతున్నాడు. జరుగుతున్నదీ మార్పే. కోరుతున్నదీ మార్పే. మరి యింత సంఘర్షణ మానవునిలో-మానవులలో ఎందుకుంటున్నది?

[Note : ఈ ఘర్షణ అన్నదే - ప్రాణిలో వెదుకులాటను ప్రారంభింపజేసింది) వస్తున్న మార్పుకూ, కోరుతున్న-ఇష్టపడుతున్న- మార్పుకూ మధ్య వైవిధ్యమూ, వైరుధ్యమూ కూడా ఉంటున్నది. అలానే కోరుకున్న మార్పుకూ, కోరదగిన మార్పుకూ మధ్య కూడా విభేదం ఉంది. ఇక్కడనే వ్యక్తిలో ఘర్షణ ప్రారంభమై సాటి వ్యక్తులతోనూ, ప్రకృతి తోనూ కూడా ఘర్షణ పడే పరిస్థితి ఏర్పడింది. ఘర్షణ ఏ ప్రాణికీ యిష్టం లేదు. కానీ ఘర్షణ తప్పుట లేదు. ఇదే అసలు సమస్య. దీని పరిష్కారాన్ని సాధించడానికే మనిషి నిరంతరం శ్రమిస్తున్నాడు.

వస్తున్న మార్పు ప్రకృతి - స్వభావానికి, కోరుతున్న మార్పు స్వార్ధం ప్రధానమైన ఇష్టాయిష్టాలకు, కోరదగిన మార్పు లేక రాదగిన మార్పు వివేకానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో వస్తున్న మార్పుకు అనుగుణంగా తాను మారడమో, తన కనుగుణంగా ప్రకృతిని మార్చుకోవడమో చేయగలిగినంత కాలమే మానవునికి తన అస్థిత్వాన్ని నిలుపుకోవడమూ, ఇష్టాయిష్టాలను పొందడమూ సాధ్యపడుతుంది. ఒక వంక ఈ పరిస్థితి మానవుణ్ణి నిరంతర శ్రమకు, ఘర్షణకు లోను చేస్తున్నది. ఈ స్థితిని దాటగలిగిన దశలోనూ మనిషి నిలకడగా ఉండలేక పోతున్నాడు. అక్కడతనికి మరో విషయమైన ఘర్షణ ఏర్పడుతోంది. అది బ్రతుకు భద్రతే, ప్రారంభ దశలో ప్రకృతితో ఘర్షణ పడ్డ మనిషి, పిదప సాటి మనుషుల నుండి ప్రాణులనుండి కూడా ఘర్షణను ఎదుర్కొనవలసి వచ్చింది. అది బలవంతుడిదే రాజ్యంగా రూపుదిద్దుకుంది. అట్టి దశలో సామాజిక సంబంధాల పాత్ర రంగ ప్రవేశం చేసింది. దానితో యిష్టాయిష్టాల పై ఆంక్ష ఏర్పరచు కోవడమూ, వివేకం చెప్పినట్లు హక్కులతో పాటు విధులను కూడా స్వీకరించడము తప్పనిసరైంది. విధులు నిర్వర్తించి హక్కులు పొందడమన్నదే మనిషి ప్రస్తుతావసరాలను తీరుస్తూ రేపటికి భద్రతను కూడా యివ్వగలదని అనుభవం ద్వారా ఋజువు చేయబడింది. ఆయా దేశాలలో, ఆయా సిద్ధాంత ధోరణులలో దీనిని ఏ యే పేర్లతో ప్రస్తావించినా ధర్మ స్వరూపమంటే యిదే. చేయవలసినంతా చేయడమూ, తీసికో వలసి నంతే తీసికోవడమూ అన్న విధాన మొక్క దాని వల్లనే రాదగిన మార్పు వ్యష్టిలోనూ, సమష్టిలోనూ, ఎంతో కొంత ప్రకృతిలోనూ వస్తుంది. వివేక మార్గ మొక్కటే అటు - ప్రకృతి సమతౌల్యతనూ, ఇటు సామాజిక సంబంధాల లోను సువ్యవస్థను ఏర్పరచగలదు. ఇప్పటి మానవ జీవితానుభవాల నుండి చూస్తే ఇంతకంటే మార్గాంతరం లేదు. వ్యష్టి, సమష్టి హితైషులూ, ఆ యా సిద్ధాంత ప్రచారకులు, అనుయాయులూ కూడా గమనించవలసిన అసలు విషయ మిదే. ఉన్న ఘర్షణను అతి తక్కువ స్థాయికి తగ్గించగలదీ ఒక్క మార్గమే. ఈ స్థితిని మనిషిలో పాదుకొల్పడమే చేయవలసిన కార్యము. అది, జీవితం పట్ల కల సామాన్య జ్ఞానం నుండి పుట్టిన, స్వార్థం ప్రధానమైన, ఇష్టాయిష్టాలను పొందడం అన్న స్థితి నుండి, అదే జీవితం పట్ల ఏర్పడ్డ విశేషానుభవాల నుండి పుట్టిన సమగ్ర జ్ఞానం ద్వారా భద్రత ప్రధానమైన, అందరకూ మేలు అన్న లక్ష్యం కలిగిన స్థితికి మార్పు చెందడమే. దీని కొరకే ప్రస్తుతం ఉద్యమించవలసి ఉంది. ఈ మార్పు కొరకు శ్రమించేవే విప్లవ శక్తులంటే. ఈ మార్పే నిజంగా సంక్రాతి-విప్లవం రావడమంటే. దీనికై ముందా వ్యక్తిలో గుణాత్మకమైన మార్పురావలసి ఉంది. వ్యక్తి విధి నిర్వహణలో (చేయవలసిన పనుల ఎడల) క్రియాశీలుడై యుండడమూ, సామాజిక స్థితి గతులను భంగపరచని స్థాయిలోనే హక్కులను పొందదమూ, నలుగురి క్షేమంతో ముడిపడే తన యోగ క్షేమాలున్నాయన్న వాస్తవాన్ని హృదయంలో నిలిపి ఉంచు కోవడము అన్నదే వ్యక్తిలో రావలసిన మార్పు. వ్యక్తి స్వీయ వివేక సామర్థ్యం వల్ల తనను తాను అదుపు చేసికునిగానీ, వివేకవంతులచే నిర్మించబడ్డ వ్యవస్థ అదుపులోనుండి గానీ పై విధంగా ప్రవ ర్తించవలసి ఉంది. ఈ విధంగా వ్యక్తి పరమైన విప్లవం సిద్ధించినగానీ, సామాజిక పరమైన విప్లవం ఏర్పడదు.

ఇదెలా వస్తుంది. జీవితం పట్ల అవగాహన పెరగడం వల్లనూ, వివేకం చెప్పిన క్రమాన్ని సాధన రూపంగా ప్రారంభించి అలవాటుగా మార్చుకోవడం వల్లనూ. విషయాన్ని గమనించి పరిశీలించి అభిప్రాయాలు స్పందనకు వ్రాయండి. ఆధ్యాత్మిక సాధనలన్నవి వ్యక్తిని కేంద్రం చేసుకుని వ్యక్తిలో రావలసిన మౌలికమైన మార్పుల నుద్దేశించే ఉన్నాయి. జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలు వాటిలో కూడుకున్న జీవన సరళీ క్రమ పరచడమే ఆధ్యాత్మిక సాధనలకు సాధ్య వస్తువు. రాదగిన కోరదగిన విప్లవ రూపమదే. ఉంటాను. సెలవ్.

సత్యాన్వేషణలో.

మీ సురేంద్ర.