Showing posts with label 7. Show all posts
Showing posts with label 7. Show all posts

Tuesday, January 31, 2023

7 వివేకపథం

  

వివేకపథం

సంపుటి: 1                                  ఫిబ్రవరి 1997                           సంచిక : 7


సంపాదకుని స్వాంతనము

వివేచనాశీలురైన పాఠక మిత్రులారా! సమాజాన్ని ప్రభావితం చేస్తున్న తాత్విక ధోరణులు ఎన్నో ఉన్నట్లు మనందరకూ తెలుసు. ఆయా ధోరణులన్నీ మానవ జీవితంతో ముడిపడి ఉన్న అంశాలాధారంగానూ, కొన్ని ఊహ లాధారంగానూ జనించినవే ననుట నిర్వివాదము. ప్రతి సిద్ధాంతకారుడూ అనేకాంశాలకు సంబంధించిన తన అవగాహనను సమాజాని కందించాలని వాంఛిస్తాడు. యత్నిస్తాడు. ఆయా ధోరణులను నిశితంగా పరిశీలించితే వాటిలో కొన్ని సామాన్యాంశాలు మరికొన్ని విశేషాంశాలూ ఉన్నట్లు- అంటే అందరూ అంగీకరించేవి. కొందరే అంగీకరించేవి. ఎవరికి వారివిగా పరస్పరం విభేదించుకునేవిగా  ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మూడవ రకానివే మనం వేరువేరు ధోరణులుగా చీలిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.

నిజానికి ప్రతి సిద్ధాంతకారునికీ సమాజహిత కాంక్ష ఉంటుంది. ప్రతి సిద్ధాంతాశయమూ సమాజాభ్యుదయమే. సమష్టి హితాన్ని కాంక్షించని తత్వ శాస్త్రం ఉండదు. కనుక నిజానికి మనమందరం ఏకలక్ష్యం కలవారమే నన్న మాట. మరైతే ఏకలక్ష్యం కలవారలమధ్య భిన్న పోకడ లెందుకు ఏర్పడుతున్నట్లు? గతంలోని ఆలోచనా పరులకూ ఈ ప్రశ్న ఉదయించింది. ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పుకున్నారు వాళ్ళు, "దారులు వేరు గమ్య మొక్కటే" అన్న భావనొకటి కాగా? నీ దారి సరైంది కాదనో సమగ్రమైంది కాదనో పరస్పరం అనుకుంటూ చెప్పుకొంటూ దెప్పుకుంటూ విడివిడి కుంపట్ల సంఖ్య పెంచుకుంటూ కొనసాగే వైఖరి రెండోది. నిజానికి దారులు వేరు గమ్యమొక్కటే అనే వారిదీ కూడా అదో తరహా వేరుకుంపటే. ఇంతవరకు చెప్పుకున్నది ఉన్నదే. ఇది జరుగుతున్న  వాస్తవమేనని గమనించగలిగితే ఇక ఆయా ధోరణులను సమాజంలోకి తీసుకువెళుతున్న, వెళ్ళాలనుకుంటున్న సిద్ధాంత వేత్తల, కార్యకర్తలపై ఒక తప్పని సరైన పెద్ద బాధ్యత వచ్చి పడుతోంది.

ప్రతి ఉద్యమ స్వరూపంలోనూ (సిద్ధాంతంలో) నిర్దిష్ట లక్ష్యము (ఉద్దేశము) దానిని చేరుకోవడానికి తగిన పరికరాలు, విధానము, అమలుచే సే వ్యక్తి, వ్యక్తులు [కర్త లేక కార్యకర్తలు అంటాం వీరిని ]అతను-వారి -ప్రయత్నము అన్నవి తప్పని సరౌతాయి. కర్త, ఉద్దేశము, పరికరాలు విధానము, యత్నము అన్న వీటిని కారణ సామగ్రి అంటారు. ఇందేది కొరవడ్డా, సరిగా లేకున్నా, సరైనది కాకున్నా, యత్నం సరైన- అనుకున్న-ఫలితాన్ని పుట్టించదు. ఏ ఉద్యమ కారులైనా, సైద్ధాంతికులైనా అతి కీలకమూ , మౌలికమూ అయిన  ఈ అంశాన్ని చక్కగా గ్రహించకున్నా,  గ్రహించీ అమలు పరచకున్నా జరిగేది తమ ఆశయానికి తామే, ప్రతికూలతను ప్రవేశ పెట్టుకోవడమే.

ఈనాడు, ఉన్న సిద్ధాంతాలన్నీ తమలో తాము, నీది తప్పంటే నీది తప్పనుకుంటూ కొట్లాడుకుంటున్నాయి. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని మారమంటున్నాయి. తమవైపు రమ్మనీ, ఇతర వాటిల్లో తప్పులున్నాయి అటు పోకండనీ, వాటిని విడిచి రమ్మనీ - ఈ మాటలు, ప్రతి ధోరణివారూ అంటున్నవే. దీనర్థం ఏమిటి? తప్పును విడవడం, ఒప్పును గ్రహించి అనుసరించడం అన్న దొక్కటే  అభ్యుదయానికి సరైన మార్గం అనేకదా! మరందుకు సిద్ధపడే నిజాయితీ మాత్రం అటు అనే వాళ్ళలోగానీ, ఇటు వినే వాళ్ళలోగానీ కనిపించడంలేదు. మొండిగా నీది తప్పంటే నీది తప్పనుకోవడము , మాది  ఒప్పేనంటే ,మాది ఒప్పేననుకోవడమూ, నువ్వు మారాలంటే నీవే మారాలనడమూ, నీవు గ్రుడ్డి వాడివంటే నీవే గ్రుడ్డివాడి వనుకుంటుండడమూ, నాది శాస్త్రీయమంటే నాది  శాస్త్రీయ దృక్పథం అంటూ అరవడమూ , పరీక్ష చేయడానికిగానీ, పరీక్షింపబడడానికి గానీ సిద్ధపడకపోవడం, వగైరా వగైరా అపసవ్యపు పోకడలు అన్ని సిద్ధాంతాల వాళ్ళలోనూ సమానంగానే చోటుచేసుకుని ఉన్నాయి. సమాజాన్ని మార్చాలనుకునే వారికి మార్పు ఎందుకో ,  ఎక్కడనో , ఎలానో తెలిసుండాలి. ఆ అంశం తనకూ వర్తిస్తుందన్న గమనింపూ, అవసరమైన చోట మారడానికి నిజాయితీతోకూడిన సంసిద్ధత ఉండాలి. లేకుంటే అదంతా వాచాలతే అవుతుంది. త్వం శుంఠంటే, త్వం శుంఠ అనుకునే వైఖరి అభ్యుదయానికి కాదుగదా, ఉన్న స్థితిని మరింత దిగజార్చి పరస్పర ప్రతికూల వైఖరికి దారితీస్తుంది. చూడగలిగితే ఇప్పటి స్థితి అట్టిదే.

భావ విప్లవం యొక్క ఆవశ్యకత లోగడకంటే ఈనాడెక్కువగా ఉంది. కనుక ఆయా సిద్ధాంతాలకు చెందిన మన మందరమూ సంసిద్ధులమై ఉమ్మడి వేదికపై మన మన భావాలను ముందుగా పరీక్షకు పెట్టుకుని సరైనవేవో, సరికానివేవో తేల్చుకోనిదే 'భావవిప్లవం' అన్నది నీటిమీది రాత, గాలి మూట వంటిదే అవుతుంది.

మాకీ రకమైన అవగాహన కలిగినప్పటి నుండి అంటే దాదాపు 13,14 సం॥రాలుగా పెంచలయ్యగారూ నేనూ కలసి ప్రసిద్ధ తాత్విక ధోరణులకు చెందిన పెద్దలతో చర్చలు చేస్తూ ఈ విషయాల్ని. వారి ముందుకు పెడుతూ వస్తున్నాము.  దానికి కొనసాగింపుగా గత మూడు సం॥ పైబడి 'తత్వ చర్చా వేదిక' పేరుతో ఒక్కో సిద్ధాంతాన్నీ పదిమంది పరీక్షకూ  పెట్టడానికి వీలైన ఒక ప్రత్యేక తరహా సమష్టి వేదికను ప్రతి మూడు మాసాల కొకసారిగా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నాము. అవి జనవరి, ఏప్రియల్, జూలై, అక్టోబరు మాసాలలో జరుగుతున్నాయి. శోచనీయమైన విషయ మేమంటే....

ఈ సూచన నందుకుని వారికి వారుగా ఈ వేదిక పైకి వచ్చిన వారొక్కరు లేరిప్పటికి. ప్రతి వక్కరినీ ఒకటికి నాలుగుసార్లు కలిసి అయ్యా, సమాజం మారాలంటున్నారు కదా! మార్చే యత్నమూ చేస్తున్నామంటున్నారు కదా! మేమూ మీకు సమాజమే. మా ఈ వేదిక  సమాజానికి చెప్పడానికి మీకూ పనికి వచ్చేదే. కనుక ఈ వేదిక ద్వారా మీరు మాకూ ,సమాజానికీ  మీ సిద్ధాం తాన్ని (మారవలసిం దేమిటి? చేరవలసిం దేమిటో- మార్చడమూ చేర్చడమూ ఎలానో) అర్థమైయ్యేట్లు వివరించండి అని అడుగుతున్నా ఒక్కరూ  పూర్తిగా నిర్థారణ రూపంగా వివరించడానికి సిద్ధం కావడంలా . సత్యనిర్ధారణ జరగాలనీ, సరైన దిశలో ఆచరణ ఆరంభించి కొనసాగించాలనీ అందరూ అంటున్నదే. ఎవరి గిరిలో వారు కూచుని, ఎవరి బడిలో వారు చెప్పుకుంటూ పోతుంటే సత్య నిర్ధారణ అయ్యేదెలా? భావ విప్లవం వచ్చేదెలా? ఎప్పటికిది జరిగేను? పైన చెప్పిన లాంటి వేదిక పైకి రాక ఎప్పటికైనా జరిగేనా ?

సత్యాసత్యాలు తేలకుండా, తేల్చుకోకుండా ఏ భావజాలాన్ని నెత్తికెత్తుకున్నా; నినాదాల, ప్రవచనాల హెూరులో సమాజం నెత్తికెత్తాలనుకున్నా ఆ పోకడంతా అశాస్త్రీయమూ, అ హేతుకమూ, అవాంఛనీయమూ మాత్రమే.   ఆ వైఖరిలో ఉండేది అభిమాన, విశ్వాసాల పాత్రేగాని వివేకపు పాత్ర మృగ్యము. మీరందరూ,, మనమందరమూ ఇతరులకు చెప్పుతున్నది అకారణాభిమాన ద్వేషాలు ఉండరాదనీ అది గ్రుడ్డిపోకడేనని కదా! మరి అలా చెప్పేవారూ ఆచరణ కొచ్చేటప్పటికి అదే పోకడ ననుసరిస్తున్నారు. అందులోని ఔచిత్య మేమిటో నా కర్థం కాదు.

ఇదంతా విని మీ నుండి ఒక రకమైన స్పందన రావచ్చు. ఏమయ్యా! మేమలా ఉన్నామని ఎందు కనుకుంటున్నావు. శాస్త్రీయ విశ్లేషణకూ , పరీక్షకూ మేము సంసిద్ధంగానే ఉన్నాం కదా! అంటూ :

నిజంగా అయా సిద్ధాంతకారులుగానీ, ప్రచారకులుగానీ పై మాట వట్టిది కాదనీ గట్టిదేననీ, పైగా అది మా మాటేననీ అనగలిగితే, ముందుకు రాగలిగితే నిజంగా మనమందరం వాంఛించే సమాజంలో రాదగిన మంచి మార్పు వచ్చేందుకు అంకురార్పణ జరిగినట్లే. మీరట్టి వారే అయితే గుండె నిండిన సంతోషంతో సత్యాన్వేషణ మండలి భావి భవితకు బాట వేయగల నిజాయితీ, నిబ్బరమూ కల అట్టి వారి నందరానూ  సాదరంగా కొన్ని సూచనలతో వేదిక పైకి రండని ఆహ్వానిస్తోంది. అన్నలారా! తమ్ములారా! మిత్రులారా! రండి. కలసి కూచుని సామరస్యంతో సత్యావిష్కరణకై యత్నిద్దాం.

1.నిజాలునిరూపింపబడాలి.నిరూపించబడని వాటిని నిజాలనరాదు.అంగీకరించరాదు.

               2. అబద్ధాలుగా తేలిన వాటిని విడిచివేయాలి.విడిపింపజేయడంలో వెనుకాడక గట్టి యత్నం చేయాలి.

3. సిద్ధాంతపరమైన బేధాలే తప్ప మనమధ్య శతృత్వం ఉండాల్సిన అవసరంలేదు. అది మంచిదీ కాదు.

4. ప్రతి సిద్ధాంతాన్ని పదిమంది ఎదుట పరీక్షకు పెట్టగలగాలి . శాస్త్రీయంగా పరీక్షించాలి.

5. ఏ ఒక్క సిద్ధాంతాన్ని పరీక్షకు స్వీకరించినా మిగిలిన వాటితో ముడిపెట్టకుండా దానిని దానిగానే ఆమూలాగ్రం పరీక్షకు లోనుచేయాలి. అప్పుడుగానీ వాస్తవంగా దాని బాగోగు లేమిటో తేలవు.

6. సత్యాన్వేషణ మండలి తనవరకు తాను నిగ్గుతేలిన భావాలను స్వీకరించడానికి, అటువైపు కదలడానికీ ఎటువంటి షరతులూ లేకుండా సంసిద్ధంగా ఉంది.

7. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ప్రసిద్ధమైన భావజాలాన్ని కలిగున్న వారందరినీ పేరు పేరునా సత్య నిర్ధారణలో పాలు పంచుకొనండని ఆహ్వానిస్తోంది. నిగ్గదీస్తోంది కూడా  ఈ ఆహ్వానం అందరికీ వర్తిస్తుంది. అయినా నే నెరిగిన ప్రసిద్ధ ధోరణులను పేర్కొంటాను గమనించండి.

ఆస్తికత 

నాస్తికత 

అజ్ఞేయత

హిందూ, క్రైస్తవ, ఇస్లాం

హిందూ: త్రిమతాలు, ఆర్యసమాజ్, పూర్వమీమాంసకులు, సాంఖ్యులు,నైయాయికులు, భక్తులు, యోగులు

కైస్తవం: క్రైస్తవుల్లోని శాఖలు, యూదులు.

 ఇస్లాం: ఇస్లాంలోని శాఖలు. 

నాస్తికులు 

కమ్యూనిస్టులు 

హేతువాదులు

 నవ్య మానవ వాదులు

అంబేద్కరైట్లు

త్యంతెలియబడదు

నిర్ధారింపబడదు అనేవారు. 


ఇంకా బౌద్ధులు, జైనులు, తాత్విక పునాది ఉందనుకున్న ఎవరుగానీ. 

ఇప్పటికి మండలి "తత్వ చర్చావేదిక" పైకి అద్వైతుల్ని, ద్వైతుల్ని, ఆర్య సామాజికుల్ని, క్రైస్తవుల్ని, ఇస్లాంను, నాస్తికుల్ని, కమ్యూనిస్టుల్ని, హేతువాదుల్ని, నవ్య మానవవాదుల్ని, జైనుల్ని ఆహ్వానించి స్థూలంగా సిద్ధాంత చర్చలు నిర్వహించింది. అందేవీ స్పష్టంగా సమగ్రమైన, ఆచర ణాత్మకమైన భావజాలాలుగా నిర్ధారణ కాలేదు. చర్చలుకూడా ఆసాంతం కొనసాగనూలేదు. సంపూర్ణంగా సిద్ధాంత విచారణ పూర్తిచేయకుండా ఏ నిర్ణయం చేసినా అశాస్త్రీయ మవుతుంది కనుక మలియత్నం మరింత లోతుగా ముగింపు లక్ష్యంగా కొనసాగించాలన్న దృష్టితో తత్వ చర్చను రెండో విడత మొదలెట్ట బోతున్నాం. ఇప్పటికైనా, సత్యనిష్ట, ఆచరణశీలత, నిజాయితీతో కూడిన నిబ్బరమూ ఉంటే లేవండి, కదలి రండి సత్యాసత్యాలు తేల్చుకుందాం. స్వీకరిద్దాం ఆచరిద్దాం.

ఈసారి తాత్విక చర్చాక్రమాన్ననుసరించి 'ఏప్రియల్' లో ఉంటుంది. 'క్రైస్తవం' చర్చనీయాంశం. పైన పేర్కొన్న ఏ ధోరణివారైనా 'మేము సిద్ధం నిజనిర్ధారణ'కు అని నిలవగలిగితే ఎప్పుడంటే అప్పుడు (నాలుగు ధోరణుల పెద్దలనూ వేదికపైకి చేర్చడానికి తగినంత వ్యవధి మాత్రం తీసుకుని) సభ నేర్పాటు చేసుకుందాం. దీనికి వెనుకాడితే నిజంగా మీలో నిజాయితీగానీ, సరైన దిశలో మార్పునుకోరే లక్షణం కానీ, సత్యాని కనుగుణ్యంగా మసలుకో గల ధైర్యంగానీ లేనట్లే, ఇక్కడ వెనుకాడితే, ప్రక్కదారులంట తప్పొప్పులతో పని లేకుండా ప్రచారాలు సాగిస్తున్న వాళ్ళమే అవుతాము మనమూ.

ఆస్తికులారా! (ఆస్తికతకు చెందిన దేశవిదేశ ధోరణుల వారందరూ) నాస్తికులారా! (భౌతికవాద పక్షంలోని విభిన్న ధోరణుల వారందరూ) నిజం తెలిసిఉన్నా, తెలుసుకోవాలనుకున్నా, తెలియజేయాలనుకున్నా మండలి వేదికకు మించిన మంచి అవకాశం ఇప్పటికిలేదు. ఇప్పట్లో ఉండే అవకాశమూ లేదు. కనుక రండి. ప్రచారంలో ఉన్న సిద్ధాంతా లన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని పరీక్షించుకుందాం. ఆస్తికులతో మాకేటిలే అని నాస్తికులూ, నాస్తికులతో మనకెందుకని ఆస్తికులూ అనుకుంటూ కొనసాగుతున్నంత కాలం భావ విప్లవం అసాధ్యం, అసంభవం ముందీ విషయాలపై మీ అభిప్రాయాలు తెలపండి. ఇక్కడ ఒక కొలిక్కి వస్తేగాని.

1) ఆస్తికతగా చెప్పబడుతున్న అంశాలు సత్యాలని తేలకపోవడానికీ, అసత్యమని తేలడానికీ తేడా వుందా? అవి ఒప్పులని తేలకపోవడమే తప్పులని తేలినాయనడానికి శాస్త్రీయమైన ఆధారం అవుతుందా ? 

2) నాస్తికత సత్వమని తేలిందా? ఎక్కడైనా, ఎన్నడైనా?

 నోట్ :- ఈ రెండు ప్రశ్నలూ ఆస్తికత నాస్తికతలకు చెందిన సిద్ధాంతాలపైనా వేసుకుని తమ తమ సిద్ధాంతాలు తప్పులనిగానీ, ఒప్పులనిగానీ తేలినాయో లేదో నిర్దారించుకోగలగాలి. ఎందుకంటే ప్రతి సిద్ధాంతాన్ని మిగిలిన సైద్ధాంతికులు లోపభూయిష్టమనే అంటున్నారు. అయినా ఏ సిద్ధాంతాని కాసిద్ధాంతం సరైనదేనని ఆ సిద్ధాంతానికి చెందిన వారు ఢంకా భజాయిస్తున్నారు. నిజానికి జ్ఞానపరంగా ఇదెంత విచిత్ర, విపత్కర పరిస్థితి, వాస్తవాని కింకా అనిర్ధారితాలుగానో, దోషసహితాలుగానో మాత్రమే అవి తేలుతున్నాయి. కానీ వాటిని ఆ మేరకు సరిచేసుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు.

ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని వివరంగా మీ ముందుంచుతాను చూడండి. అణువు పగులుతుంది. అణువు పగలదు అన్నవి ఒకే అంశానికి చెందిన భిన్నాభిప్రాయాలు (విరుద్ధాభిప్రాయాలనీ అనొచ్చు) పగులుతుంది అన్న పక్షంవారిని రెండోవారు (లేక మనం) మీ ప్రతిపాదన రుజువు చేయండని అడిగారు. చాలాకాలం శక్తిమేర యత్నించి పగలగొట్టలేకపోయారు ఆ పక్షంవాళ్ళు. ఒకానొక దశలో వారూ వీరూ కూడా కలిసి అణువు పగలదు అన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏకాభిప్రాయానికి రావడమే సత్యం మనడం అనుకుని విషయం తేలిపోయింది. అణువు పగలదు అన్నదే సత్యము. పగులుతుందన్న పక్షం వీగిపోయింది. అని నిర్ణయం చేసి ఆ భావాన్ని సమాజం నెత్తినా రుద్దారు. అణువు పగులుతుందన్న వాళ్ళు రుజువు చేయలేకపోయారు గనుక అణువు పగలదన్నది రుజువైనట్లా? కాదా?  హడావుడి పడకుండా ఇక్కడో నిర్ణయానికి రండి. ఆపై మన సిద్ధాంతాల దగ్గరకు రావచ్చు.

సత్యాసత్యాలు వివేచించగలిగే నేర్పులేనివాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తప్పన్నా ఒప్పున్నా దానికేమీ విలువలేదు. కనుక ముందుగా పరీక్షకు కూర్చునే, పరీక్షించే రెండు పక్షాలకు పరీక్షా పద్ధతి తెలుసుండాలి. పరీక్షించగలిగీ ఉండాలి. పై అంశాన్ని మరొక రీతిలో వివరిస్తాను. అప్పుడెలాంటి ముగింపులిస్తుందో చూడండి.

కొంతకాలానికి నేనున్నానంటూ మరొకడు బయలుదేరి క్రితం అందరూ గలసి నిర్ణయించుకున్న అణువు పగలదు అన్న అభిప్రాయాన్ని తప్పుబట్టి పగులుతుంది అన్నాడు. సరే చూడండంటూ పగలకొట్టాడు. ముందటి పక్షం వాళ్ళు అబ్బురపడ్డారు. వైజ్ఞానిక పంధాలో ఉన్నవాళ్ళు గనుక ఏ మాత్రం వెనుకాడకుండా తమ పొరపాటు నిర్ణయాన్ని మార్చుకుని పగులుతుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. మళ్ళా అందరూ కలసి ఏకాభిప్రాయానికి వచ్చారు. అది సత్యమేనన్న నిర్ణయానికి వచ్చారు.

గమనిక :- మొదటిసారీ రెండు పక్షాలున్నాయి. పరీక్ష జరిగింది. అణువు పగలదని రుజువైంది (తేలిపోయింది) కనుక అణువు పగలదు అన్న ఏకాభిప్రాయానికి రావడంతో అందరూ ఆ అభిప్రాయం సరైందేనన్నారు. రెండోసారీ రెండు పక్షాలున్నాయి. పరీక్ష జరిగింది. అణువు పగులుతుందని రుజువైంది (తేలిపోయింది) కనుక అణువు పగులుతుంది అన్న ఏకాభిప్రాయం ప్రకారం, ఆ అభిప్రాయం సత్యమన్నారు. ఈ రెండూ చూసినాయన సత్యాలు మారుతాయి. మారని సత్యాలుండవు అన్నాడు. మరొకాయన ఈయన్నడిగాడు, సత్యాలు మారుతాయి. మారని సత్యాలుండవు-అన్న అభిప్రాయం సత్యమా? అసత్యమా? అని. సత్యమే నన్నాడు పైవాడు. మరి ఈ సత్యంకూడా మారుతుందా అనడిగాడు ఆఖరివాడు. పై మాటన్నాయన నివ్వెరపోయాడు. పై వాటికి మీ సమాధానాలేమిటి? 

 మార్క్సిజం - ఒక తులనాత్మక పరిశీలన- (2)

 గతితర్కం:

ఉద్యమ స్పూర్తి, జిజ్ఞాస, యోచనాశీలతకల పాఠకమిత్రులారా! భిన్న ధోరణులకు చెందిన విజ్ఞులారా !

1996 - జూలై లో మార్క్సిజంపై తాత్విక చర్చా రూపంలో జరుపుకున్న వేదికకు కొనసాగింపే ఈ సమావేశం. ఆనాటి సదస్సులో ఉన్న అన్ని ధోరణులవారం కలసి చేసుకున్న నిర్ణయం మేర గతితర్కాన్ని పరిశీలనాంశంగా స్వీకరించడం జరిగిందీ వేదికకు, వేదికలో పాల్గొనడానికి విచ్చేసిన సంఖ్యను బట్టి చూస్తే చేసిన శ్రమకు తగిన ఫలం పుట్టలేదన్నదో పక్కానిజం - అది నిజంగా నిర్వాహకులను నిరుత్సాహాన్ని కలిగించేదే. జిజ్ఞాసువులూ పరిశీలకులునైన శ్రోతలకూ నిరాశనే కలిగించింది. మొదటిరోజు.

అయితే అనుకోకుండా ఏర్పడ్డ అవకాశం వల్ల రెండోరోజు నండూరి ప్రసాదరావుగారూ, జక్కా వెంకయ్యగారు, కొండపల్లి సీతారామయ్యగారు, పరకాల పట్టాభిరామారావుగారు, రాధాకృష్ణదాసుగారు, మూడవ రోజు ఈడ్పుగంటి నాగేశ్వరరావుగారు, ప్రొ॥ నాగన్నగారు, కళ్యాణ కృష్ణగారు మార్క్సిజం పక్షాన పాల్గొనడంతో తగినంత ప్రాతినిధ్యమూ ఏర్పడినట్లైంది. ప్రశ్నించువారి పక్షాన నవ్యమానవ వాదుల నుండి రావి సుబ్బారావుగారు, ధర్మాచరణ మండలి తరపున సోంప్రకాష్ గారు సందర్భ పడ్డప్పుడల్లా నేనూ పాల్గొన్నాము.

ఒక క్రమంలో పటిష్టమైన రీతిలో వాదప్రతివాదాలు కొనసాగలేదు గనుక ప్రతి అంశాన్ని పేర్కొనడం ఇక్కడ కుదరదు. కనుక సారభూత విషయాలను మాత్రం మీముందుంచుతాను.

ముందురోజు పట్టాభిరామారావు గారు సంధానకర్తకాగా, నవ్యమానవ వాదులు గతితర్కంపై ప్రశ్నించారు.

ప్రశ్న:- అయ్యా, ఉన్న బార్లీ గింజ అభావం చెంది మొలకెత్తి పెరిగి మరల అదీ అభావముచెంది అధికాధికంగా బార్లీ గింజలు రూపొందుతున్నాయన్నారు. సరే. మరి ఉన్న మర్రివిత్తనం అభావం చెంది మొలకెత్తి  మొక్కై మానై తానభావము చెందకనే అనేక విత్తనాల నిస్తుందికదా ఇక్కడ రెండో అభావమెక్కడ? దీనిప్రకారం మీ గతితర్కం తప్పని తేలడం లేదా?

సమాధానం:- మర్రిచెట్టు అభావం చెందకుండగనే  విత్తనాలనిచ్చినా ఏదో ఒకనాటికి అదీ చస్తుందికదా? కనుక ప్రతిదీ అభావం చెందేదే అవుతుంది. కనుక మా గతితర్కం సరైందని రుజువై నట్లే.

దీనిపై ప్రశ్నించేవారు సరైన ప్రశ్న వేయకపోవడంతో పట్టాభిగారు ఇక్కడకిది తేలినట్లేననుకుందాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అనడిగారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రతిపాదక పక్షం స్థాపించబడ్డట్లు ప్రకటించారాయన.

సురేంద్ర:- చర్చ లిలా పేలవంగా జరగడానికి రెండు పక్షాలలోనూ సరైన అధ్యయనం లేకపోవడం ప్రధాన కారణం. అదలా ఉంచి ఒక భావాన్ని ఒప్పుకునేవాళ్ళ కంటే నిజానికి తప్పనబోయేవాళ్ళకు దాన్ని గురించి ఒకపిసరంతైనా అధికం తెలుసుండడం అవసరం. ఇలా ఎందుకంటున్నానంటే! ఆ మధ్య తెనాలిలో ఒక నవ్యమానవవాద ప్రముఖుడొకడు గతితర్కాన్ని ఎద్దేవచేస్తూ, సభాముఖంగా యిలా అన్నాడు. ఏముందండీ గతితర్కమంటే  థీసెస్, యాంటిథీసిస్, సింతసిస్ - లేగదా! అవీ యిదుగో యిలా ఉంటాయి. థీసెస్ రెండురెళ్ళు ఐదనుకుంటే, యాంటిథీసెస్ రెండురెళ్ళు తొమ్మిదంటుంది. ఈ రెంటి సమన్వయంగా సింథసిస్ రెండురెళ్ళు ఏడని తేల్చుతుంది అంటూ ప్రగల్పించాడు బహిరంగంగా వేదికమీదే. పక్కనే ఉన్న ఆ వర్గానికే చెందిన ఇంగిత జ్ఞానమున్న మరోవ్యక్తి, అలా నోరు పారేసుకోకండి.  అదికాదు గతితర్కమంటే. అలా అనలేదు మార్కు, ఏంగెల్సులు అంటూ సర్దిచెప్పాడు. హేతువాద, శాస్త్రీయ దృక్పథాలకు అసలు సిసలైన వారసులం అంటుండే నవ్యమానవవాదుల అధ్యయనమూ, పోకడా అలా ఉన్నాయి. మరి పైగా వేదికపైకి రమ్మంటే మాకు తగిన స్థాయిగల వాళ్ళుంటే చర్చకొస్తాముగానీ, అల్పులూ అనామకులు!? పిలిస్తే చర్చ కొస్తామా అని బిర్రబిగదీసుడు ధోరణొకటి కనిపిస్తుంది వారిలో చాలామందిలో. మార్క్సిజాన్ని సరైన రీతిలో తప్పని తేల్చగల అధ్యయనమూ, అవగాహనా, సత్తా, ఉంటే మండలి వారిని మార్క్సిస్టు సైద్ధాంతికులతో చర్చకే సిద్దపడమని సాదరంగా ఆహ్వానిస్తోంది. వేదిక వారికిష్టమైనచోట ఏర్పాటు చేయగలము.

రెండోపూట సభలో సంధానకర్తగా నేనుండగా వేదికపై మార్క్సిజం పక్షాన కొండపల్లి సీతారామయ్యగారు, నండూరి ప్రసాదరావుగారు, జక్కా వెంకయ్యగారు, పరకాల పట్టాభిరామారావుగారు, నాగన్నగారు, కళ్యాణక్రిష్ణ గారు, రాధాకృష్ణదాసుగారు, గుత్తా రాధాకృష్ణగారు, చుక్కపల్లి రామకోటయ్య గార్లు కూర్చున్నారు. ఆడిగేందుకు సోంప్రకాశ్ గారు, రావి సుబ్బారావుగారు, నారాయణగార్లున్నారు. నండూరి ప్రసాదరావుగారు గతితర్కాన్ని సామాజిక చరిత్ర కన్వయించి వివరించడం జరిగింది. కానీ సోంప్రకాష్ గారు అయ్యా మార్క్సు ఏంగెల్సులు (dialectical laws) ప్రకృతిలో సహజంగా ఉన్నాయన్నారుగదా! మీరు వాటిని ప్రకృతిలో అన్వయించి చూపండని ప్రశ్నిం చారు. మార్క్సి ఏంగెల్పులిచ్చిన ఉదాహరణల్నే ప్రతిపాదకులు ఎత్తిచూపారు. అప్పుడు సోంప్రకాష్ గారు ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తావించి ఆకోణంలో సూత్రాల్ని వివరించమన్నారు. అదేమంటే గతితార్కిక సూత్రాలుగా మన మందరం ఎరిగి ఉన్న 1) విరుద్ధ శక్తులమధ్య ఐక్యతా ఘర్షణ 2) పరిమాణాత్మకమార్పు సంఖ్యాత్మక మార్పుకు దారితీస్తుంది, 3) అభావాభావము లేక ప్రతిసేద ప్రతిసేద నియమము అన్నవి ఒక సంఘటనలోనే చూపించాలి గతితర్కం సరైందనాలంటే. కనుక అలా మాకు ఒక వస్తువును చూపి అందులో పై మూడు నియమములూ పనిచేస్తున్నట్లు చూపండని అడిగారు. గతితర్కాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడానికి తగిన అవసరమైన అతిముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారాయన. నేనెరిగినంతలో గతితర్కాన్ని ఆ రీతిలో అధ్యయనం సాగించినవాళ్లు అరుదు. రెండు పక్షాలకు చెందినవారూ వారి వారి రచనల్లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు నా పరిశీలనకు అందలా ఎక్కడా.

రెండు వైపులనుండీ కొంత సంభాషణ జరిగాక నండూరి ప్రసాదరావు గారు, విజ్ఞతతో ఒక మాటన్నారు. ఈ తరహా చర్చలలో ఈ రీతివాదం మాకూ క్రొత్తగానేవుంది. కనుక ఈ విధానంలో వివరించడానికి వీలుగా మరికొంత అధ్యయనం అవసరం. మరోసారి కలుద్దాం అన్నారు. వెంటనే మంచిదే మీరందరూ అంగీకరిస్తే, తప్పక వస్తామని మాటిస్తే మరో సమావేశం ఏర్పాటు చేసుకుందాం అన్నాను నేను. అలాగేనంటూనే ప్రతిపక్షం ఎలా ఉండేవీలుందో ముందుగా మాకందిస్తే దానికనుగుణ్యంగా అధ్యయనం చేసి రావడానికి వీలవుతుందన్నారాయన. పరిశీలనాంశాలను గూర్చిన కొన్ని వివరాలు త్వరలో అందచేస్తానని వారికి మాటిచ్చాను.

సంభాషణల మధ్యలో జక్కా వెంకయ్యగారు తత్వశాస్త్ర పరంగా వాడుకునే మాటలకూ, వ్యవహారంలోవున్న మాటలకు అర్థాలలో తేడాలుంటాయి. సిద్ధాంత చర్చలలో ముందుగా వాటిని గమనించడం, అర్థం చేసుకుని ఉండడం అత్యంతావసరం అంటూ ఒక మౌలికమైన అంశాన్ని కదిపారు. అలాగే జ్ఞాన సిద్ధాంతం విషయాన్ని ఎత్తిచూపారు. కేటగిరీస్ (భావాభివర్గాలంటారు వాటిని) (పదార్థ వర్గీకరణమంటాము మేము) గురించి తెలిసుండడం తప్పనిసరి అంటూ కొన్ని మార్క్సిస్టు పారిభాషిక పదాలను వివరించారు. శాస్త్రీయ విశ్లేషణకు అవసరమైన మరో ముఖ్యాంశాన్ని వీరు ప్రస్తావించారు. (ఇంతకుముందు సోంప్రకాష్ అలాంటి విలువైందే ఒకటి చెప్పారని అనుకున్నాం గుర్తు చేసుకోండి.)

సురేంద్ర:- అసలింతకూ పారిభాషిక పదాల అర్ధ నిర్థారణ చేసుకోవాలనిగానీ, పదార్థ వర్గీకరణ పట్ల సరైన అవగాహన లేకుండా విషయాన్ని గ్రహించడంగానీ - ప్రతిపాదించడంగానీ సరైన రీతిలో సాగదనిగానీ జ్ఞాన సిద్ధాంతం- ప్రమాణ వివేచన - పట్ల తగినంత అవగాహన సైద్ధాంతిక చర్చల్లో  తప్పనిసరి అనిగానీ విస్పష్టంగా గ్రహించిన వారెందరు? మా లెఖ్ఖల్లో అట్టి వారు బహుతక్కువ. జక్కా వెంకయ్య గారిక్కడ నొక్కు పెట్టడంలో వేదికకో చక్కటి ప్రాతిపదిక ఏర్పరుచుకునేందుకో వీలు చిక్కింది. సరే త్వరలో మరింత సరైన అవగాహనతో విచారణకు- చర్చకు - కలిసి కూచుందాం అనడంతో ఆ సమావేశం అలా ముగిసింది. ఈ సందర్భంలో ఒక పొరపాటు జరిగిందంటూ ప్రొ. నాగన్నగారో విషయం లేవనెత్తారు. సోంప్రకాష్ గారి ప్రశ్నకు ఇంకెవరైనా సమాధానం చెపుతారా అని మీరడిగుండాల్సింది. వారి ప్రశ్నకు కళ్యాణ కృష్ణగారుగానీ, నేనుగానీ సమాధానం చెప్పగలిగుండే వాళ్ళం అన్నారు. నిజమే. ఈ సారలా జరక్కుండా చూసుకుందాం అనుకున్నాము. మరునాడు ఈడ్పుగంటి నాగేశ్వరరావుగారు ప్రతిపాదకులుగా ఉన్నారు. నిన్నటి ప్రశ్న దగ్గరే ఆరంభిద్దాం అనుకుని జరిగినంతవరకు విషయాన్ని వారికి చెప్పి ప్రకృతిపరంగా ఒక ఉదాహరణను తీసుకుని మూడు సూత్రాలను దానియందు చూపండనగా, అయ్యా! ఇక్కడొక విషయం చెప్పాలి. విజ్ఞానశాస్త్రం విస్తరిస్తున్నవేగాన్నీ, అది కనిపెట్టిన కొంగ్రొత్త విషయాలనూ గురించి వింటుంటే మతిబోతోంది. అట్టి స్థితిలో వాటిని గురించి తగినంత పరిజ్ఞానం లేకుండా నేను చెప్పాలనుకోవడమూ, మీరు పరీక్షించాలనుకోడమూ సరైనవి కాదు. నా వరకు నాకు అంతటి యోగ్యతలేదు. అందుకు తగ్గరీతిలో వేదికకు న్యాయం జరగాలనుకుంటే విజ్ఞానశాస్త్ర విషయాల్లో విశేషజ్ఞులైన శాస్త్రజ్ఞుల్ని యిద్దరు ముగ్గుర్ని పరిశీలకులుగానూ, వివరణ లిచ్చేందుకునూ వేదిక పైకి తెచ్చుకుని ఉండడం తప్పనిసరి. అంటూ శాస్త్రీయ విశ్లేషణకు అవసరమైన మరో ముఖ్యాంశాన్ని ఎత్తిచూపారు. ఆ మాట వినీవినగానే కొందరి ముఖాల్లో గోచరించిన వీరూ చెప్పలేక పొయ్యారన్నట్టి భావనను పసిగట్టి నేనో మాటన్నాను. ఇది కొందరనుకుంటున్నట్లు వారి అయోగ్యతను గాక యోగ్యతనే చాటుతుంది. ఏమంటే, నిజంగా తెలీని విషయాలు తెలీనివిగా గుర్తించడం, నిర్ద్వంద్వంగా ప్రకటించగలగడం సరిగ్గా తెలుసుకొనే యత్నంలో కీలకమైన మలుపు తిప్పగల అంశం. నిజానికా అంశంలో ఆయనలాగే మనమందరమూ విశేషజ్ఞుల సహకారం అవసరం అనే స్థాయిలోనే ఉన్నాము అన్నాను. దాంతో గతితర్కాన్ని ప్రకృతి కన్వయించి పరీక్షించడం అన్న కోణం ఆగింది. మరో సారి ఏర్పరచుకుందామనుకున్న సమావేశం నాటికి కొందరు భౌతిక విజ్ఞాన శాస్త్రజ్ఞులనూ వేదిక పైకి ఆహ్వానించాలనుకున్నాం సభ ముగింపుగా, మొదటి- జూలై 1996 సమావేశంలో లానే విషయ పరిశీలన ఒక కొలిక్కి రాలేదు. మరింత అధ్యయనంతో మరో విడత కలుద్దాం. ఆ నాటికైనా రెండు పక్షాలూ తగినంత అవగాహనతో రావడం అవసరం. బాధ్యతకూడా అంటూ  ముగించాను.

 “ఐక్యవేదిక - విశేషాంశాలు”

సుమారు 70, 80 మంది రాష్ట్రం నలుమూలల నుండి సమావేశానికి ఏతెంచారు. జనవరి 11న తిరుపతిలో జరిగిన అడ్ హాక్ కమిటీ సమావేశానికి సంబంధించిన విషయాలను సోంప్రకాష్ వివరించారు. 1) సంఘము పేరు :- వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక. 2) రాష్ట్ర పర్యటన 24 జిల్లాలు మూడు దఫాలుగా చేయాలనీ ముందుగా ఫిబ్రవరి 22 నుండి 28 వరకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలలో ప్రధానమైనచోట్ల సమావేశమై జిల్లా సంఘాలను ఏర్పాటు చేసేందుకు యత్నించాలనీ 3) న్యాయపరమైన అంశాలను న్యాయస్థానాలద్వారా విచారణకు పెట్టి, ప్రజల ముందుకూ విషయాన్ని తీసుకెళ్ళడం అన్న పని

కొరకుగా న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలనీ 4) విధాన, చట్టసభలలో సమాజ వంచనా రీతులను గురించి చర్చను లేవనెత్తి ప్రభుత్వ దృష్టిని ఈ వంచనలవైపు సారింపజేయడం. ఐక్యవేదికకు అనుకూలురైన ప్రజా ప్రతినిధులను ఐక్యపరచి అదో విభాగంగా రూపొందించేందుకు యత్నించడం జరగాలనీ, 5) ప్రచార విభాగాన్ని ప్రత్యేకించి, ప్రచార సాధనాలైన పత్రిక, రేడియో, టి.వి.ల ద్వారానూ, కరపత్రాలు, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారాను వంచకులను సమాజానికి బహిరంగపరచడం ద్వారా  ప్రజల్ని జాగృతం చేయాలనీ, నిర్ణయించామనగా, వాటిని సమావేశం కొంత విశ్లేషణ చేసి పిదప ఏకగ్రీవంగా అంగీకరించింది. దాని కొనసాగింపుగా పర్యటన నాటికి తగిన వాతావారణము నేర్పరచుటకూ, ప్రజలను సమీక రించుటకు జిల్లాకు ఇద్దరు ముగ్గురు కన్వీనర్లను ఎన్నుకోవడం జరిగింది. సంఘంలోనికి సభ్యులను చేర్చుకోవాలనీ విడిగా వ్యక్తికై తే సభ్యత్వ రుసుము సం॥నికి రూ. 5/- లు గానూ, ఒక్కో సమాజానికైతే రూ. 100/- గానూ నిర్ణయించడం జరిగింది. అందరం ఎవరికి వారం మన మన పరిచయస్తు లందరికీ ఐక్యవేదిక సంబంధించిన సమాచారం అందిస్తూ దీనిలో చేరేట్లు ప్రోత్సహించాలనీ, రేపు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశానికి వారూ వచ్చేట్లు చూడాలనీ అనుకున్నాము. ఇది తాత్విక పునాది మీద ఏర్పడ్డ సంఘం కాదుగనుకనూ, మనమధ్య సైద్ధాంతిక భావసారూప్యత లేదు గనుకనూ-దీని పరిమితుల్ని సదా జ్ఞ ప్తి యందుంచుకుని సైద్ధాంతిక ఘర్షణలకు గానీ, చర్చలకుగానీ తావీయకుండా అందరం వివేకంతో ప్రవర్తించవలసి ఉంటుందన్నది మరింతగా నొక్కి చెప్పడమైంది. ఆ మేరకు విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నట్లే అనిపించింది నా వరకు నాకు. క్రొత్త వాళ్ళందరకూ ముందుగా ఈ విషయాన్ని ఎరుకపరచి ఉమ్మడి కార్యక్రమం యొక్క  ఆవశ్యకత, శ క్తి, పరిమితులనూ ప్రతివారూ ప్రతివారికీ అర్థమయ్యేట్లు విడమరచి చెప్పాల్సిన బాధ్యత చాలా ప్రధానమైనదని అనుకోవడం జరిగింది. అలా ఆ కార్యక్రమం ఉత్సాహవంతంగా ముగిసింది. మరునాడీ వార్తను ప్రెస్మిట్ ద్వారా ప్రజలకు తెలియజేశాము. ప్రముఖ దినపత్రికలూ, సిటీ కేబుల్ టి.వీ. వీటికి తగినంత ప్రాధాన్యత నిచ్చి ప్రజల కందించాయి.

ఐక్యవేదిక నిర్మాణంలో భాగంగా ఏజన్సీ ప్రాంత మిత్రులను కలుద్దాం అని జగన్ మోహన్-చీరాల వారనగా సరేననుకుని 20న బయలు దేరి భద్రాచలం వెళ్లి డా॥ భానుప్రసాద్ గార్ని కలిశాము. అప్పటికప్పుడే ఆయన పని ప్రారంభించి రాత్రికి ముఖ్యులైన 10, 15 మందిని హాజరు పరచగా రాత్రి 12.30 వరకు ఐక్యవేదిక స్వరూప స్వభావాల్ని, అవరోధాల్ని, జాగ్రత్త వహించవలసిన అంశాలనూ వివరించగా అందరూ ఎంతో ఉత్సాహంతో ఏజెన్సీ ప్రాంతం ఈ పనిలో పెద్దపాత్ర వహించగలదన్న హామీ నిచ్చారు. ఆ పై మొదటి ప్రతిఘటనకు మన మెంచుకున్న 'కల్కి' వివరాలడగ్గా నా దగ్గరున్నంత వరకు వివరించాను. ముఖ్యమైన విషయంగా శంకర్- విజయకుమార్ అనే మిత్ర ద్వయపు కుటిల నాటకమే ఈ భాగోతం అని ఉద్యమం పుట్టుపూర్వోత్తరాలు సంక్షిప్తంగా వారి కందించాను. వారిద్దరూ తాత్త్వికంగా పొట్టకో స్తే అక్షరం ముక్క రానివారనీ కనుకనే వారు బహిరంగ చర్చకు రానుగాకరారనీ, రెండేళ్ళకు ముందే తిరుపతిలో వీరి తొత్తైన సుబ్రహ్మణ్యం అనే స్వార్థపరుణ్ణి ఎదుర్కొని ఉన్నామనీ చెపుతూ ఐక్యవేదిక లోని మనందరం ఈ ఉమ్మడి కార్యక్రమం యొక్క సామాజికావశ్యకతను గమనించి మనమధ్యనున్న సిద్ధాంత విబేధాలను ఎత్తుకోకుండా కొనసాగ గలిగితే ఈ లాటి వంచకులను ఊఫ్ అని ఊదేయగలమని, వారెంత బలిసి ఉన్నా ఒంటరివాళ్ళేనని మన ఐక్యసంఘటన స్థిరపడి దృఢపడితే సామాజిక భవిత చాలా ఆశావహంగా ఉంటుందనీ చెప్పాను.

మరోవంక గుత్తా రాధాకృష్ణగారు ఖమ్మం మిత్రులకూ ఈ కబురు చేర వేశారు. వారూ ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లూ వాస్తు - అశాస్త్రీయత పై ఒక పెద్ద సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖమ్మం మిత్రులా సదస్సులో పాల్గొనడానికి నన్నూ, పెంచలయ్యగారినీ ఆహ్వానించారని చెప్పగా నా వైపు నుండి అలాగేనంటూ అంగీకారం తెలిపాను.

ఐక్యవేదిక లక్ష్యాలు రెండు, 1) వంచనారీతుల నెదుర్కొనడం, 2) ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటికి ఎవరి గొడవల్లో వారుగా కొనసాగుతున్న మనమందరం క్రమంగా దగ్గరై పరస్పరావగాహనను పెంచుకుని ఐక్యతను సాధించుకుని దృఢపరచుకోవడం. మిత్రులారా! ఐక్యవేదిక మనందరిదీ, మనందరి అవసరం కూడా. గమనించి ఐక్యవేదికలో ఐక్యం కండి. నేల నాలుగు చెరగులా ఈ కబురందించండి.

అంతర్మధనం - (మనలో మనం)

సమాజ హితకాంక్షులూ సహృదయులూనై విభిన్న ధోరణులకు చెందిన విజ్ఞులై న ఉద్యమకారులారా! సామాజిక పరంగా సమూలమైన మార్పును- విప్లవాన్ని లేక సంక్రాంతిని ఆశించే ధోరణులకు తప్పనిసరిగా ఒక సిద్ధాంతమూ, అది సూచించు ఆశయసాధనకైన కార్యాచరణ ప్రణాళిక ఉంటాయి. ఉండి తీరాలి.

అలాగే ఆయా ఉద్యమకారులకు తమ తమ సిద్ధాంతాల యందూ, కార్యాచరణ ప్రణాళికను గురించి సరైన సమగ్రమైన అవగాహాన కలిగుండడం అవసరం. అందునా ముఖ్యంగా అవగాహనా పరంగా ప్రజలను చైతన్య వంతులను గావించాలనుకునే ఉద్యమకారుల విషయంలో ఇది మరింత ఆవసరం. ఇంత మాత్రమే గాకుండా ఈ తరహా భావోద్యమ కారులకు తమ సిద్ధాంతంతో పాటు సమాజంలో ప్రవర్తిస్తున్న మిగిలిన ప్రధానమైన సిద్ధాంతాల గురించిన్నీ క్షుణ్ణమైన అవగాహన అవసరం. అలాంటి అవగాహన ఉన్నవాళ్ళే భావోద్యమాల్ని సార్థకరూపంలో కొనసాగించగలుగుతారు. ఈ స్థాయిలేని వ్య క్తులతో కూడిన ఉద్యమాలు బండపోకడను - మతవైఖరిని - సంతరించు కుంటాయి. అది ఉద్యమ లక్ష్యాన్నే - సమష్ఠిహిత కాంక్షను దెబ్బతీసి గుంపుల (గ్రూపిజాన్ని) శతృత్వాన్ని పుట్టించి బలపరుస్తుంది.

నిజాన్ని చూడగలిగితే సామాజిక ఉద్యమాలకు చెందిన అనేక ధోరణుల వారిమధ్య శతృవై ఖరికి-అది సిద్ధాంతపరమైందిగా గానీ, వ్యక్తులపరంగా గానీ, ఆస్కారమే లేదు. అశాస్త్రీయత, అహేతుకత, ఉద్యమాల లక్ష్యాలను గురించిన అవగాహనా లోపము, వైయక్తిక నిమ్నాధిక్యతల దృష్టి, ఆధిపత్య కాంక్షల లాటివి చోటుచేసుకున్న తావులందు మాత్రమే శత్రుత్వవైఖరి తలెత్తుతుంది, అది క్రమంగా బలపడి విచారణ శూన్యమైన వీరాభిమానంగానో, అకారణ వైరంగానో రూపొంది స్థిరపడుతుంది. నిదానించి చూడగలిగితే ఇది ఈనాడు లెబఖ్ఖలోకి తీసుకోవలసిన స్థాయికి చేరే వుందని తెలుస్తుంది. ముందీ ప్రతిబంధకాన్నుండి మనమందరం బైటపడవలసి ఉంది. అందుకు రెండు రకాలుగా మనం మనమధ్య సంబంధాలను సరిచూసుకుని సరిచేసుకోవలసి ఉంటుంది. 1) సిద్ధాంత-విషయ-పరంగా, 2) వ్యక్తిపరంగా, ఇక్కడ సరైన నిర్ణయానికి రావడానికి వివేకాన్ని ఉపయోగించాలి. ఎ) శాస్త్రీయ దృక్పథము, హేతుబద్ధత బి) సామూహిక శక్తి - ఐక్యత - యొక్క ఆవశ్యకతపట్ల స్పష్టమైన అవగాహన.

1) సిద్ధాంతపరంగా :- మనందరి ఆకాంక్షా-ఉన్నస్థితిలోని అవాంఛనీయత తొలగి ఉండవలసిన స్థితికి సరిపడ సరైన మార్పులూ చేర్పులూ జరగాలన్నదే కదా!? వాటిని గురించిన మన మన అవగాహనలలో ఏర్పడి ఉన్న తేడా పాడాలవల్లనే మనందరం భిన్న భిన్న ధోరణులుగా ఏర్పడ్డాము. ఎవరికి వారంగా మనం, మన మన ఉద్యమాల ప్రధానాశయంగా అందరి సంక్షేమాన్ని సిద్ధాంతపరంగా కోరుతునే ఉన్నాము. (సమాజాభ్యుదయం అంటే అదే కదా అర్థము) అయినా ఆచరణ దగ్గర కొచ్చేటప్పటికి మీది మాది అన్న భావనలు మనమధ్య ఉండవలసిన మిత్ర దృష్టినీ, సహకార సంబంధాలనూ, సామరస్యాన్ని బలహీన పరుస్తున్నాయి. ఒక్క విషయం ఆలోచించండి..

ఎవరికి వారంగా మనం సమాజంలో అత్యల్పభాగం మాత్రమే. నిక్కచ్చి అంచనాలు వేస్తే 1, 2 శాతంలోపే ఎక్కువ సంఘాలున్నాయి. మరి మనం నలుగురం మిగిలిన మొత్తం సమాజాన్నీ అయా సంఘాలవారుగ మనకు పరాయి వారుగా ఎంచితే మనంకోరే సమష్టి శ్రేయస్సు అన్నమాట కేవలం మాటకు మాత్రమే పరిమితమై, నినాదంగా పరిణమించి ఆచరణీయతను కోల్పోతుంది. ఇది అనుభవంలో అలా ఉందో లేదో పరికించి చూడండి. కనుకనే ఉద్యమ లక్ష్యాలు మహోన్నతంగా అందరి బాగు కొరకు ఉండగా, మన మన ఆచరణలు మాత్రం ఒకరిపై ఒకరు పోటీపడే రకంగానూ, కక్ష సాధింపుల రూపంగానూ తయారవుతున్నాయి. అటు అవగాహనా పరంగా గాఢత లేకున్నా మాది రైటంటే మాదే రైటనే మొండివైఖరీ, ఇటు హృదయపరంగా మన అన్న భావన లేమిచే ఏర్పడుతున్న అమిత్ర లేక శతృవైఖరి ఏర్పడి, మన లక్ష్యాలను, ఆశయాలను చేరడానికీ, సాధించు కోవడంలో ప్రధానమైన అడ్డంకిగా ఏర్పరచుకున్నట్లవుతోంది. ఇది ఈనాడు నిజమైన మార్పునుకోరే ఉద్యమకారులందరి ఎదుట ఉన్న పెద్ద సమస్య. మరి ఈ సమస్యను పరిష్కరించుకోలేమా ? పరిష్కరించుకో నక్కరలేదా? ఉద్యమం ఊపందుకోడానికి ఐక్యతయొక్క ఆవశ్యకత ప్రధానం కాదా? గుడి గుడి గుంచాల ల్లాగా ఏ నలుగురి కా నలుగురం ఏదేదో చేసేస్తున్నా మన్న భ్రాంతిలో జీవితాల్ని వెళ్ళదీసుకుంటే చాలునా?!?

మహెూధృతంగా సాగక సామాజికంగా సరైన మార్పును తీసుకురావడం ఒక పట్టాన అయ్యే పనేనా? ఏ మాత్రం ఉద్యమాశయాలకు సంబంధించిన సృహ ఉన్నా, కాదు- కానేకాదు - ముందుగా మనందరం కలసి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంది. అన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తుంది.

మరి పరిష్కారం ఎలా? ఎక్కడ?

1) భావసారూప్యతలేని ఐక్యవేదికలన్ని తాత్కాలికాలూ, చాలా చాలా పరిమితమైనవీ కూడా. వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలూ చాలా పరిమితమైనవే. కనుక భావ సారూప్యతను సాధించవలసి ఉంది. అందుకు మార్గం? ఉంది. ఒకే ఒకమార్గం ఉంది. నిజమైన సత్యాన్వేషణా తత్పరతతో నాది వారిది అన్న భావాలను విడచి మన మన ధోరణులను ఒక్కొక్కదానినీ అందరం కలసి శాస్త్రీయ పద్ధతి ననుసరించి పరీక్షలకు లోనుచేయాలి. కాలం చెల్లిన, వీగిపోయిన అంశాలను విడచి నిర్నిబంధనంగా నిలచిన అవగాహనలను గుదిగృచ్చి  వైజ్ఞానిక స్థాయిగల ఆ అంశాల పరంగా భావసారూప్యతను పొంది వాటికై కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమించాలి. ఇంతకు మించి భావసారూప్యత శాస్త్రీయ పద్దతిలో సాధ్యంకాదు. యూనివర్సాలిటీ - సార్వజనీనత-కల భావాలవద్దే భావసారూప్యత సాధ్యము. అట్టివి కానివి పాక్షి కాలై - సమాజాభ్యుదయానికి ప్రాధాన్యత వహించే సాధారణ సూత్రాలు కాజాలవు. ఇంతకు మించి మరోమార్గం ఉంటే విజ్ఞులైన మీలో ఎవరుగానీ సూచించండి. ఇదే సరైనదన్న నిర్ణయానికి రాగలిగితే మరందుకు మన మందరం ఏం చేయాలి. “అంతర్మధనం” చేయాలి.

అందరిబాగు కోరుకుంటున్నమన్నా మనందరి మధ్యనే ఆయా ధోరణుల స్వరూప స్వభావాలపై విచారణ రూపంగా అంతర్మధనం జరగాల్సి ఉంది. అదుగో అందుకు ఉద్దేశించిన యత్నారంభ రూపమే ఈ లేఖ, పిలుపున్నూ. ప్రస్తుతానికీ వేదికను 'అంతర్మధనం' మనలో మనం విచారించుకోడం అని అనుకుందాం. మరో  పేరెట్టుకుందామన్నా నాకెట్టి పట్టింపూ లేదు. విషయం ప్రధానం.

ఈ వేదికయొక్క ఆచరణ రూపం :

పై అంశాలు సరైనవేనన్న అవగాహన కలిగిన నలుగురం ఈ వేదికలో భాగస్వాములం కావడం, ఒక క్రమపద్ధతిలో ఒక్కొక్క సిద్ధాంతాన్నీ - ఆ పరిశీలనా కాలంలో ఆదొక పరీక్షాంశమే కానీ మన దెవ్వరిదీ కాదు. అన్న భావంతో నిక్కచ్చిగా వైజ్ఞానిక పద్ధతిలో, ఆవేశకావేశాలకు లోనుకాకుండా, తావీయకుండా విశ్లేషణ-విచారణ పరీక్షలకు లోనుచేయడం, ఇతరేతర ధోరణుల వారికిన్నీ ఈ వేదిక సమాచారాన్నందించి వారినీ యిందులో భాగస్వాములను చేయ యత్నించడం క్రమంగా కొనసాగించాలి.

సిద్ధాంత పరిశీలనలో ఒక్కోభావాన్ని ప్రతిపాదనగా స్వీకరించడం-దాని పక్షాన అది సరైనదేనని చెప్పడం కుదురుతుందేమో చూడడం, సరికాదనడానికి కుదురుతుందేమో చూడడం - ఏది యోగ్యపక్షమో, బలవత్తరమో ఒక అవగాహనకు రావడం- అలా ఒక్కో అంశాన్ని విచారించడం ద్వారా ఆయా ధోరణులను ఆమూలాగ్రం పరీక్షించి బాగోగులను విడగొట్టడం చేయాల్సి

ఉంటుంది.

ఇంత విశాల దృక్పథంతో నూటికి నూరు శాతం సత్యాన్వేషిగా, ఉండడం వెంటనే ఆచరణరీత్యా సాధ్యం కాదనుకుంటే, కనీసం, గాఢమైన అధ్యయనంచేసి దాని పక్షాన్ని కొందరు స్వీకరించి నిలబెట్టే యత్నంచేయడం, మిగిలిన వారందరూ దాని యందేమైన లోటుపాట్లున్నాయేమో చూపించే పక్షం వహించడం చేయాలి. నిజమైన వైజ్ఞానిక పద్ధతి వంటబడితే మనమధ్య ఈ తరహా విచారణ ఆత్మవిమర్శా రూపమై, అంతర్మధనం కొనసాగి సామరస్య పూర్వకంగానే మరింత స్పష్టమైన అవగాహన కలవాళ్ళంగా రూపొందడం ఎక్కువ అంశాల్లో భావసారూప్యత ఏర్పడడం సాధ్యపడుతుంది. ఈ లోపు మనమధ్య సాన్నిహిత్యం ఏర్పడడం ద్వారా ఒకరినొకరు పరిశీలించుకుని పరస్పరం మనలను గురించిన సరైన అవగాహన ఏర్పరచుకోడానికీ వీలవుతుంది ఏమంటారు? మంచిదే, అందరికీ అవసరమైందే, సత్యనిర్ధారణకూ మార్గం సుగమమవుతుంది అనుకుంటే వెంటనే మాకు తెలుపండి. సమావేశం ఏర్పాటు చేసుకుందాం.

సత్యాన్వేషణలో, మీ సురేంద్ర

                                              స్పందన - ప్రతిస్పందన

గౌరవనీయులు సురేంద్రబాబు గార్కి

నమస్తే, మీరు "భిన్న తాత్త్విక ధోరణులు ఒక పరిశీలన"లో భాగంగా 'వివేక పథం'లో 2 నుండి 6 సంచిక వరకూ అద్వైత విచారణ చేసారు. విషయం కాస్త జటిలంగావుంది. సామాన్య పాఠకుడికి అద్వైతం గురించి కొద్దిపాటి పరిచయం గలిగింది. అయినా కొన్ని పదాలు అర్థంకాలేదు. కాని వాటిని వివరించడం ఈ వ్యాసంలో కుదరదని అన్నారు. ముఖాముఖి కలిసినప్పుడు వివరించుదురుగాని. కానీ విషయాన్ని సంక్షిప్తం చేయాలనే లక్ష్యంతో మరీ కొన్ని వివరణలు దాటేశారు. ఉదా॥ బ్రహ్మము అణోరణీయాన్ మహతోన్ మహీయాన్ అని చెప్పబడింది. కనుక ప్రత్యక్షమవడం. కుదరదు” అని తేల్చారు. ఏమీ అర్థంకాలా. పాఠకునికి మీరు చెప్పాలనుకున్నది చేరిందా అన్నది సందేహమే - ఆ వాక్యం క్రిందే  మరోచోట "చైతన్యాత్కించిన్నా స్తీ తి సాక్షాత్కారనుభవం జ్ఞానం" అంటాడు. మరీ సాక్షాత్కారానికి అర్థమేమిటో? అని వ్రాశారు. మా అభిప్రాయం డిటో -అంటే ఇదీ అర్థం కాలేదు.

విషయం సూటిగా చెప్పాలంటే అద్వైతంపై మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల్లోని దోషాదోషాలు సామాన్య పాఠకుడు నిర్ణయించలేరు. అద్వైతం గురించి బాగా అధ్యయనం చేసిన వారికే అది సాధ్యం. మరి మీ పత్రికను అటువంటి వారికి పంపిస్తున్నారా? వారి అభిప్రాయాల్ని అడిగారా? లేకుంటే దయచేసి వారికి పంపండి స్పందన - ప్రతిస్పందన రూపంలో చర్చ జరిగితే మాకు వివరంగా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. 

అంతేకాక అద్వైతం ప్రకారం దేవుడూ, జీవుడూ ఒక్కటేనని, రెండు కావని చెప్తూనే అద్వైతులు కొందరు మనిషి (జీవుడు) దేవుని యందు విశ్వాసముగల్గి విగ్రహాలకు పూజ చేస్తుంటారు. ఈ విషయము మీరు 'అద్వైత విచారణలో ప్రస్తావించక పోయిననూ నా మనసులోని అభిప్రాయం. ఈ సందేహం కూడా మీరుగాని, అద్వైత పండితులుగాని తీర్చగలరు.

                                                                                                                                           ఇట్లు,

                                                                                                                                జగన్ మోహన్

శ్రీ ఎమ్. వి. రావు, విజయవాడ నుండి వ్రాస్తూ, వివేకపథంలోని అద్వైతం గురించి మీరు వ్రాసినది చూస్తున్నాను. ఈ ప్రతిపాదనకు అద్వైతుల నుండి ఎలాంటి స్పందన ప్రచురింపబడలేదు. పత్రిక అద్వైతులలోని ముఖ్యులకు పంపడం జరగటంలేదా? పంపించటం జరగకపోతే మరింత శ్రద్ధ తీసుకుని పంపండి అద్వైతం యందలి వాస్తవాస్తవాలు పరిశీలనకు రాబడాలనే కోరికతో ఈ లెటరు వ్రాస్తున్నాను.

ప్రతిస్పందన: జగన్ మోహన్, రావుగార్ల స్పందన అనుగుణంగా మరింత శ్రద్ధ తీసుకుని మరికొంత మంది అద్వైత పండితులకు అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలు చేసిన వివేకపథం కాపీలను పంపుతున్నాము.

ఇప్పటికే శ్రీ రామచంద్రుల కోటేశ్వరశర్మ, హైదరాబాదు; గోడా సుబ్రమణ్యశాస్త్రి పెదకాంచీపురం; వి. గోపాలకృష్ణశాస్త్రి, రాజమండ్రి; రాణి రామకృష్ణ, సికింద్రాబాదు; శ్రీపాద సుబ్రమణ్యం, హైదరాబాదు; సుభి  బ్రహ్మాశ్రమం, శ్రీకాళహస్తి; వ్యాసాశ్రమము, ఏర్పేడుకు పంపుతున్నాము. మిగిలిన పండితులకు కూడా ఇప్పుడు పంపుతున్నాము. పై స్పందనను సరించి పండితులు తగిన విధముగా ప్రతిస్పందించి స్పందనకు వ్రాయగలరు.

                                                     

Monday, June 7, 2021

మేలుకొలుపు - 7

 

 మేలుకొలుపు

స్వమంతవ్యము [ నేనూ నా పత్రిక]

సంపుటి -1                    సంచిక - 7                     1-9-91

గత సంచికలో ముఖచిత్రంలోని కొన్ని అంశాలు విపులంగా పరిశీలించాము. వాస్తవిక దృక్పథం కలవారలే సత్యాన్వేషణ చేయగలరనీ చెప్పాను. సత్యాన్వేషణ అన్న పదంలో తెలిసికోవాలనే, నిజం తెలిసికోవాలనే ఆకాంక్ష ఉంది. సత్యమంటే ఉన్నది అనీ, ఉన్నది ఉన్నట్లు అని అర్ధం చెప్పుకోవచ్చు. ఈ అర్థంనుండి చూస్తే సత్యమన్న పదం ఏదో విషయానికి సంబంధపడే అర్ధమవుతుందన్నమాట. ఏది ఉన్నది? ఎలా ఉన్నది? ఎక్కడ ఎప్పుడు ఉన్నది? యిలా ఆయా సందేహాల కారణంగానే అన్వేషణ-తెలుసుకునే యత్నం- ప్రారంభమవుతుంది. నిస్సందేహస్థితి ఏర్పడేవరకు కొనసాగుతుంది. పిదప ఆ విషయంలో అన్వేషణ ముగుస్తుంది. మరల మరో విషయంలో సందేహం... అన్వేషణ.... సమాధానము. అన్వేషణ ముగింపు. జీవితాన్ని గనుక సవ్యంగా పరిశీలించగలిగితే ఈ ప్రక్రియ ఎల్లప్పుడూ కొనసాగుతూనూనే ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక్కడ సత్యాన్వేషణము అన్న పదాన్ని రెండు విధాలుగా ఉపయోగించే వీలుంది? అది వ్యక్తిపరంగానూ, విషయపరంగానూ, వ్యక్తిపరంగా సత్యాన్వేషణము అన్నది నిజం తెలిసికోవాలనే స్వభావాన్ని సూచిస్తుంది. దీనినే పూర్వ సంచికలతో గవేషణా ప్రవృత్తి కలిగి ఉన్నాడు. మనిషి అని చెప్పాను. 6. వ సంచిక లోనున్నూ ఏదో విషయానికి చెందిన అన్వేషణ ముగించగలడేగాని, మనిషి అన్వేషణే అక్కరలేనిస్థితికి చేరలేడు. చేరకూడదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఆ విషయ పరంగా అన్వేషణము అన్న పదం ఆయా విషయాలకు చెందిన స్థానం యొక్క అసమగ్రతను సూచిస్తోంది. నేను ప్రయోగిస్తున్న ఈ సత్యాన్వేషణము అన్న పదం వ్యక్తి స్వభావాన్ని కలిగి ఉండాలి? అన్న దృష్టినుండేగానీ, తాను చెపుతున్న విషయంలో తెలియనితనాన్ని వ్యక్తీకరించుటకై చెప్పుతున్నది. కాదు. ఆ విషయాన్ని పత్రిక పేరూ, ముఖచిత్రంలోని మాటలుకూడా రూఢిపరుస్తున్నాయి. మేలుకొల్పాలన్న యోచన నిద్రించేవాడికి రాదు కదా!? మేల్కొన్న వాడు అన్న పదం ఏదో విషయానికి చెందిన జ్ఞానస్థితిని తెలుపుతోంది కదా!? కనుక దీనినిబట్టి నా రచనలోని “సత్యాన్వేషణ” పదం తెలిసికోవాలనే ప్రవృత్తి బోథకంగా గ్రహించాలి. అదిన్నీ ఎందుకు ప్రధాన విషయంగా చూడవలసి వచ్చింది. విజ్ఞాన చరిత్రను పరిశీలిస్తే యదార్థాన్వేషకులై కూడా ఒక దశలో, జీవితానికి చెందిన ఒక వాస్తవాన్ని గమనించి (గమనించామని భ్రమించైనా కావచ్చు) ఇక అన్వేషించ వలసిందేమీ లేవన్న నిర్ణయానికి (ఆయా కాలాలనాటి మేధావులేసుమండీ) వచ్చినట్లు కనబడుతోంది. ఈనాటి సహేతుకమైన పరీక్షలకు అందులో ఏ ఒక్కటీ పూర్ణంగా నిలుచుటలేదు. పాక్షికత చోటు చేసికుంటోంది. గంథ న్యాయంగా ఉందీ వ్యవహారాన్ని చూస్తే. కొంతమంది గృడ్డివాళ్లు ఒక ఏనుగును పరీక్షించి ఏనుగంటే ఎలా ఉంటుందో నిశ్చయించారనుకోండి. ప్రతివక్కడు అనుభవంలో చూసిన దాన్నే చెపుతున్నాడు. నిజాయితీగానే చెపుతున్నాడు. అయినా ఒకళ్ళదొకళ్ళకు సరిపడడం లేదు. ఒకరి దొక రంగీకరించడం లేదు. తాను పాక్షిక జానాన్నే పొంది ఉన్నానని గానీ, మరింత పరిశీలించవలసి ఉందనిగానీ తలంచుటలేదు. (అన్వేషణ ముగిస్తున్నాడు) యోచనాశీలురను ఈ విషయంలోనూ మేలుకొల్పాలన్న యోచననుండే అన్వేషణ ముగించుకోకు, అన్వేషించవలసిన విషయం మారుతుందేగానీ అన్వేషణే లేకుండా పోవడం మంచిదికాదు, అన్న మాట పుట్టింది నాలో ఇక్కడ నేను చెప్పదలచుకున్న ముఖ్య విషయమేమంటే ఎవ్వరైనా తనను తాను అన్వేషకుడినని చెప్పుకున్నా, కానని చెప్పుకున్నా వాస్తవంగా అతడు ఏదో విషయంలో అన్వేషకుడి గానే ఉంటున్నాడు. అన్వేషిస్తూనే ఉంటాడు. ముఖచిత్రంలోని సత్యాన్వేషణము అన్న పదం వెనుక నా దృక్పథమిదే. ఇప్పటికి అనుభవంలో ఎన్నో విషయాలు మరింక తెలియవలసింది లేదన్నంతగా తెలిసికొన్నా ఎప్పటికప్పుడు ఏదో విషయం నన్ను గమనించావా? అన్నట్లు ఎదురుపడుతూనే వుంది నా జీవితంలో. అలానే లోకాన్ని గమనిస్తున్నప్పుడు అనేకులు తమకు తామే పరిపూర్ణులం అన్న భ్రాంతిలో కొట్టుకుపోవడమూ కనబడింది. అలా అనేకంగా కలిగిన అనుభవాలనుండే, ఓ మనిషీ, అన్వేషించే స్వభావాన్ని చంపివేయకు. అన్వేషకుడిగానే ఉండు. నష్టమేమీ రాదు. అని చెప్పాలన్న భావన స్థిరపడింది నాలో. తెలుసుకునే యత్నం చేస్తూ ఉండు. ఇప్పటికి తెలిసింది తెలుపుతూ ఉండు. సత్యమని నిర్ణయింవబడిన దానినే తెలుపు. అయినా దానిని కూడా ఏ క్షణంలో నైనా మరల పరీక్షించుకొనుటకు సిద్ధంగా ఉండు. ఇదే నేననుసరిస్తున్న విధానము. అనుసరించమంటున్నది కూడా ఇదే.

 వెనుకటి తాత్వికులలోనూ ఈ భావన చోటు చేసుకునే ఉందనడానికి తగిన ఆధారమొకటుంది మనకందుబాటులో. “అధ్యయన మధ్యాపనం బ్రాహ్మ్యం కర్మ స్వభావజం” తెలుసుకుంటూ ఉండడం, తెలియజేస్తూ ఉండడం అన్న పనులు స్వభావంగా కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు అని పై వాక్యానికర్థం.

గమనిక : ఇక్కడ బ్రాహ్మణపదం. శిరోభాగానికి-జ్ఞానానికి ప్రతీకగా వాడబడింది మాత్రమే. నేటి మన అనుభవంలో చూస్తున్న కుళ్లు కుల వ్యవస్థకు చెందినది కాదా పదం. తెలుసుకోవడమూ-తెలియజెప్పడమూ ఎవనికి స్వభావకర్మలుగా ఉంటాయో అని అర్ధం. ఇది విద్యా సంప్రదాయానికి చెందిన అంశం. సహజ దేహంలో జ్ఞానభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారెట్టి దృక్పథం కలిగి ఉండాలి? లేక ఉంటారు? అన్న ప్రశ్నకు సమాధానరూపమై ఉంది పై శ్లోక భావం. (సత్యాన్వేషణ మండలి ప్రాథమిక నియమాలలో తెలియంది తెలుసుకుంటూ ఉండు. తెలిసింది తెలుపుతూ ఉండు అన్నది కూడా ఒకటి) పై వాక్యభావం దేనిని చూపెడుతోంది. ఇప్పటి కెన్నో తెలిసివున్నవనీ, మరెన్నో తెలియవలసి ఉన్నవనే కదా! ఇదేమీ భ్రాంతినుండి పుట్టిన భావం కాదు. ఎంతో లోతైన అవగాహననుండి, వాస్తవిక దృష్టినుండీ ఏర్పడ్డ నిశ్చయమిది. ఈ విషయం మీరూ మీ మీ యనుభవాలతో పోల్చుకొని ఒక నిర్ణయానికి రండి.

లోకంలో రెండురకాల మనుషులు కనుపిస్తూంటారు. ఒక వర్గంలో ఆత్మ న్యూనతా భావం స్థిరపడి వుంటే, రెండోవర్గం వారిలో ఉండకూడనంత ఆధిక్యతా భావం పాదుకొని ఉంటుంది. నిష్కర్షగా చెప్పాలంటే ఈ రెండూ తప్పు అభిప్రాయాలే. అభివృద్ధి నిరోధకాలే. ఒక రకం వారు మనవల్ల కాదు అని యత్నించడం మానితే మరోరకం వారు ఏమిటి దానికై యత్నించేది అన్న దృష్టినుండి పని

చేయడం మానతారు. రెండు దృష్టులనుండి ఏర్పడుతున్న ఫలితమొక్కటే

జీవితాధ్యయన మన్నది బహుముఖాలుగానూ, జాగరూకతతోనూ అధ్యయనం చేయవలసినదిగా ఉన్నదన్న వివేకం లోపించినప్పుడల్లా వ్యక్తి వికాసానికి గానీ సామాజిక వికాసానికిగానీ ఎంతో కొంత అపకారం జరిగి తీరుతుంది. ఏతావాతా నే చెప్పదలచిన దేమంటే అన్వేషణా దృష్టిని విడువకు అన్వేషించే క్షేత్రాలు మారవచ్చు. అంతేకాదు. అన్వేషణ ముగించిన వాటిని కూడా ఎప్పుడు అవసరపడితే అప్పుడు పునఃపరీక్ష చేసికొనుటకు సిద్ధంగా ఉండు, అన్నదే ఈ భావం. మీలోనూ, ధృఢపడుట కొరకు కొన్ని దృష్టాంతాలను చూపుతాను. 1) శంకర రామానుజాది ఆస్థికులూ, మార్క్సు, సార్త్రేలాటి పదార్ధ వాదులూ, గోరాలాటి నాస్తికులూ ఇలా, ఆయా సిద్ధాంత స్థాపకులూ, ప్రవర్తకులూ కూడా ఎవరికి వారు తాము గమనించవలసింది గమనించేశామనే అనుకున్నారు. జీవితాన్ని అర్థం జేసుకున్నామనే అనుకున్నారు. అందరూ తాము గమనించా మనుకున్న దానికి అన్యమైన వాటిని తప్పులుగానో, పాక్షికమైనవి (అసంపూర్ణమైనవి) గానో కొట్టి పారేశారు. ప్రతివారు ఎదుటివారి గురించి దోషాలను సహేతుకంగా చూపే యత్నం చేశారన్న మాట. తమాషా ఏమంటే ఎదుటి వారందరు దాదాపు అన్వేషణ చేయదగి యున్నారనే ప్రతి వక్కరూ చెపుతున్నారు. తాము అన్వేషణ ముగించామని తలుస్తున్నారు. మేధావులు ఒకే వేదిక పైకి రాలేక పోవడానికి ఇదో అంతర్గతమైన (మౌలికమైన) కారణమన్నది మీకు తట్టడం లేదా? వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు సాధించవలసినదిగా ఉన్నది. అనగా సాధ్య మన్నమాట. దానిని పొందుటకు గాను సాధన సామగ్రీ కావలసి ఉంది. వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు ఎప్పుడు, ఎలా కలుగుతుంది? అని ప్రశ్నించుకుని పరిశీలిస్తే, సమిష్టి వ్యష్టి యోగ క్షేమములకు తగిన వ్యవస్థ నేర్పాటు చేసి అమలు పరచుటా, వ్యష్టిన్నీ స్వార్ధం ప్రధానం కాకుండా బాధ్యతలు సక్రమంగా నేరవేర్చుట ద్వారా సమిష్టి యోగ క్షేమములకు తనవంతు కృషి సల్పుటా అన్నది అమలు చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది?

వివేకము: వాస్తవిక దృష్టి కలిగి, సత్యాన్వేషణ ద్వారా ఏర్పడ్డ జీవితావగాహన ననుసరించి ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఎంత చేయాలి లాటి విచక్షణా జ్ఞానాన్నే వివేకమంటాము. ఇది జ్ఞాన క్రియలలోనూ, శారీరక క్రియల లోనూ, సామాజిక సంబంధాల నుండి ఏర్పడిన బాధ్యతలూ, హక్కుల పరంగాను పనిచేస్తూ ఉంటుంది.

ధర్మాచరణము :- పైచెప్పబడ్డ వివేకం యొక్క మార్గదర్శనంలో ఆయా కర్మల నాచరిస్తూ ఉండడాన్ని ధర్మాచరణ మంటారు. Note:-ధర్మమన్నది మరింత పరిశీలించదగిన అంశముగా నున్నది కనుక దీనిని ప్రత్యేక సంచికగా ముందు ముందు మీ ముందుంచుతాను. మానవ స్వభావాన్ని వీక్షించితే ప్రతి మనిషీ తనది కాని దానిని తనదిగా చేసికుంటానికి, తన దానిని -- నాదిని - బలపరచడానికి నిరంతరం యత్నిస్తున్నాడు. ఇదో తాత్వికాంశము. కనుక ఎంత పరిధిలో నా అన్న భావన పెట్టుకో గలడో దాని యోగక్షేమాలకై యత్నిస్తున్నాడన్న మాట. సామాజిక సమస్యల పట్ల వేదన కలిగి, పరిష్కారాలు వెదుకుతున్న వారు ఖచ్చితంగా అవగాహన చేసికో వలసిన విషయాలలో ఇదీ ఒకటిగా ఉంది. మనం వ్యక్తి సమిష్టి శ్రేయస్సును సాధ్యంగా పెట్టుకున్నాం . అదెట్లు నెరవేరుతుంది. అంటే వ్యష్టి సమిష్టిలు ఒకరిపట్ల ఒకరు నా అన్న భావన దృఢంగా కలిగి ఉండాలన్నమాట. అప్పుడు హృదయ గతంగా పరస్పర యోగక్షేమాలను కాంక్షించే స్థితి ఏర్పడుతుంది. సూత్రప్రాయంగా చెప్పాలంటే మూల సమస్యకు మౌలిక పరిష్కారమన్న మాట ఇది వసుధైక కుటుంబ భావన మన్న పదం దానినే సూచిస్తోంది. (సమిష్టి అన్న పదంచే సామాజిక వ్యవస్థా, దానిని నడపు రాజ్యాంగమూ, న్యాయ వ్యవస్థా, రక్షణ వ్యవస్థా, ప్రభుత్వమూ అన్నది సూచింపబడుతున్నాయి. వ్యష్టి అన్న మాటచే వివేకమూ, బాధ్యతలూ, ప్రజలూ, వ్యక్తిగత హక్కులూ అన్నవి సూచితములు) ఒకే కుటుంబంలో ఉన్న అందరూ అందరనూ నావారు అనే భావిస్తారు. మనమంతా ఒక్కటి అనే భావనే వారిలో ఉంటుంది. ముఖ్యంగా కుటుంబాన్ని నడుపుతున్న, నియంత్రిస్తున్న వారిలో ఈ భావన ఉంటుంది. ఉండాలి. చిన్న వారిలో ఈ భావన లేకున్నా వారు పెద్ద వారి, ఈ భావన కలిగియున్న వారి అదుపులో ఉండాల్సి ఉంది. అలానే సమాజాన్ని నియంత్రించే అన్ని శాఖలకు చెందిన మేధాపులలోనూ ఈ భావన వుండాలి. సామాన్యులలో అట్టి భావన లేకున్నా, అట్టి భావన కలిగి యున్న వారిచే ఏర్పాటు చేయబడ్డ విధి విధానముల నాచరించునట్లు వారిని అదుపు చేయాలి. అప్పుడు ఒకే పెద్ద కుటుంబం ఏర్పడుతుందన్నమాట నిజమైన వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు అప్పుడే సాధ్యమవుతుంది. అంతవరకు అన్నీ చిలక పలుకుల మాదిరే అవుతాయి.

వసుధైక కుటుంబ భావన పొందాలి, వీలయినంత ఎక్కువ ప్రజలలో దీసిని కలిగించాలి. అట్లేర్పడిన వివేకంచే నిర్మితమయిన ప్రణాళికను అందరూ అనుసరించేట్లు వత్తిడి చేయగల వ్యవస్థ నేర్పాటు చేయగలగాలి. మొత్తం మీద ఏమన్నట్లయింది? ప్రతి మనిషి ఆత్మ నియంత్రణ నన్నా కలిగి ఉండాలి, లేక వ్యవస్థచే నియమితుడన్నా కావాలి. ఇప్పటికి ముఖచిత్ర వృత్తంలోని అంశాలను పరిశీలించినట్లయింది.

1. వాస్తవిక దృష్టి, 2. సత్యాన్వేషణా ప్రవృత్తి, 8. వివేకము, 4. వివేకాన్ననుసరించిన కార్యాచరణము వీటన్నిటి బలిమిచే ఏర్పడ్డ వ్యవస్థ, వసుధైక కుటుంబ భావన వల్ల ఏర్పడే వ్యవస్థే అవుతుంది. తద్వారా వ్యష్టి సమిష్టుల శ్రేయస్సు సాధింపబడుతుంది.

వ్యష్టి సమిష్టి శ్రేయస్సు అనవలసిన పనేముంది. సమిష్టి శ్రేయస్సు అంటే సరిపోతుంది గదా! అన్న ఆక్షేపణ రావడానికి వీలుంది యిచ్చట. దీనినర్ధం చేసికోవడానికి విషయాన్నీ, జీవితాన్ని మరికొంత అధ్యయనం చేయవలసి ఉంది. విశ్లేషిస్తాను పరిశీలించండి.

సమాజంలోని ఆయావ్యక్తులచే చేయబడుతున్న పనులు 3 రకాలుగా ఉన్నాయి.

1. ఒక్కడి ప్రయోజనం కోసం ఎక్కువమంది నష్టానికో, ఇబ్బందికో గురి, అయ్యేట్లు చేసేవి.

2. ఎక్కువ మంది ప్రయోజనం కొరకు ఒక్కొడికి నష్టాన్నో, యిబ్బందినో కలిగించేవి.

3. అందరకు ఎవరి విధులు వారికీ, ఎవరి హక్కులు వారికి అందేట్లు చేసేవి.

మరో రకంగా చెప్పుకుంటే

1. ఎవరేమైతే నేమి నావరకు బాగుంటే చాలుననుకునే రకం.

2. నేను బాగుండాలి. నలుగురూ బాగుండాలి అని ప్రవర్తించే వారు.

3. నేనేమైతేనేమి నలుగురకూ మేలు జరిగితే చాలు ననుకునేవారు.

1వ వారు స్వార్ధం ప్రధానమైనవారు, 2వ వారు ధార్మికులు, 3వ వారు త్యాగులు. ఇక్కడే మనం గమనించ వలసిన ప్రధానాంశముంది. 1, 3 స్వభావాలూ, ప్రవర్తనలూ కోరదగినవి కాదు. అందులోని భావాలలో తేడా ఉన్నా జరుగుతుంది కొందరకు జరుగకూడనిదే. 1వ రకం బలపడి సమాజము అధార్మికమైనప్పుడు 3వ రకం వ్యక్తుల అవసరం ఏర్పడుతుంది. ఎందుకొరకు? సమాజాన్ని రెండవ స్థితిలో నిలిపి ఉంచుటకు, అంటే 1వ రకం బలపడడమంటే సమాజ శరీరానికి రోగం రావడం అన్న మాట. 3వ రకం చికిత్సా ఔషదమూ అవుతుంది. స్వస్థత రెండవ స్థితి అవుతుంది. పైన నేను పేర్కొన్న వ్యష్టి సమిష్టి శ్రేయస్సు అన్నది అప్పుడే సాధ్యమవుతుంది. 1వ రకం వారు సమాజాన్ని కాల్చుకు తింటుంటే, 3వ రకం సనూజం కొరకై తాము కాలిపోతుంటారు. వారు చిన్న వారని కాదుగానీ వారి అవసరం (త్యాగుల అవసరం) లేనిస్థితే నిజంగా కోరదగిన స్థితి. ఇంత ఆలోచించే వ్యష్టి, సమిష్టీ అన్న రెండు పదాల్ని వాడాను. వాస్తవిక దృష్టి నుండి వీటిని పరిశీలించండి.

“అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా౬మృతంగమయ.” అన్న వాటిలో మౌలికమైన జీవి ఆకాంక్షలు వ్యక్తం చేయబడ్డాయి.

ఇవి సార్వజనీనమూ, సార్వ కాలీనములైన విషయములుగాన తాత్విక విలువ కలిగి యున్నవి.

అసతోమా సద్గమయ - అసతః, మా, సత్, గమయ అన్న పదాల కూడికగా నున్నది.

లేమి నుండి కలిమి లోనికి పోవాలన్న కోర్కెకు సంకేత మీ వాక్యము. ఇది ఎదుగుదలకు చెందిన అభిలాషను వ్యక్త పరుస్తోంది. అసమర్ధతనుండి బైటపడి సమర్ధతను పొందాలనీ లేక అపరిపూర్ణత నుండి పూర్ణతలోనికి చేరాలనీ, భావన వ్యక్త పరుపబడింది. జీవి ఆకాంక్షలలో ఒకటైన ఎదగాలనుంది అన్న ప్రవృత్తినీ స్వభావాన్ని వ్యక్తం చేసే సూత్రమిది. ప్రతి మనిషికి అలా ఉందో లేదో ఆలోచించుకోండి. ఏ విషయంలో ఎదగాలి అని చూస్తే వ్యక్తుల్ని బట్టి విషయాలు మారతాయేగానీ, ఎదగాలని లేకపోవడం మాత్రం జరుగదు.

“తమసోమా జ్యోతిర్గమయ : తమసః; మా, జ్యోతి, గమయ” చీకటినుండి వెలుగులోనికి, తెలియని తనాన్నుండి తెలిసిన స్థితికి చేరాలన్న కోర్కెను తెలుపుతున్నదీ వాక్యము. మనిషిలోని తెలిసికోవాలన్న స్వభావానికి చెందినదీ సూత్రార్థము. ఇవన్నీ ప్రతి మనిషి స్వభావమో కాదో పరికించండి. ఈ విషయంలోనూ తెలియవలసింది మారుతుందే కానీ తెలిసికోవాలన్నది మారదన్నమాట.

“మృత్యోర్మా ౬మృతంగమయ, మృత్యుః, మా, అమృతం, గమయ” అన్న శబ్దాల కూడికే ఈ వాక్యము. ఇది జీవన పోరాటానికి చెందిన అంశము. ఇది మిగిలిన రెండు వాక్యములకూ ముగింపు వాక్యంగానూ ఉంది. ఉండాలనుంది అన్న స్వభావానికి సూచనగానున్న సూత్రమిది. Struggle for Existents. అన్న సూత్రమునే యిది వ్యక్త పరుస్తోంది. ఇది ప్రథమ కోర్కెగానున్నది. ఉండాలనుంది అన్నామంటేనే అది యిష్టమనీ, ఆటంకాలెదురౌతున్నాయని అర్థం వస్తున్నది. ఆ ఆటంకాలేమిటో అనుభవంలో చూస్తే 1. తరగిపోవడంగా నున్నది. అది యిష్టం లేదు. కనుక ఆశయసిద్ది - ఉండాలన్నది - నేరవేరాలంటేనే తరుగుదల ఉండరాదన్నది తెలియబడింది. కనుకనే ఎదగాలన్న కోర్కె ఏర్పడింది. జీవితాన్ని చూస్తే నడిపించేది జ్ఞానంగా ఉంది. ఆశయం వైపుకే నడక సాగించాలన్నా, ఆశయసిద్ధిని గమనించాలన్నా జ్ఞానం అవసరంగా ఉంది. కనుక 2వ కోర్కెగా అజ్ఞానము లేక భ్రాంతి జ్ఞానం నుండి జ్ఞానం, లేక సత్యజ్ఞానంలోనికి కదలాలన్న కోర్కె ఏర్పడింది. పైశ్లోక భావం యిదే. మూడవ మాటగా చెప్పబడిన అమృతత్వం సాధ్య విషయంగా ఉంది. అది సాధించు కొనుటకు బలమూ, దానిని సరిగా వినియోగింపజేయు సరైన జ్ఞానమూ అవసరమైనాయి. అవే 1, 2 వాక్యాలలో చెప్పబడింది.

సారాంశమేమంటే ప్రతి మనిషి ఉండాలనీ, బలంగా ఉండాలనీ, తెలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాడనియే. ఇది ఒక మతానికి చెందిన విషయం కాకుండా జీవ ప్రవృత్తికి చెందిన అంశమై తాత్విక విలువ కలిగి ఉంది. యదార్థంగా తాత్వికత మత పరిధిని దాటి సర్వ మానవాళిని ఉద్దేశించి సర్వ కాలాలకు చెందినదిగా ఉంటుంది. ఇది ఎప్పుడూ గమనింపులో ఉంచుకోవాలి. Note: ధర్మానికీ, తత్వానికీ ఉన్న తేడానూ, సంబంధాన్నీ ఎరగడమన్నది జీవితాధ్యయనంలో అత్యంత ప్రధానమైన అంశమై యున్నది.

ముఖపత్రంలో క్రింది భాగాన వున్న శ్లోకం కూడా ఇది మత పత్రిక అనుకునేందుకు వీలుగా ఉంది. అయితే దానినిన్నీ విశ్లేషించి చూద్దాము.

“నమో బ్రహ్మాధిభ్యః”:- బ్రహ్మ మొదలగు వారికి నమస్కారం. భారతీయ యోచనలో బ్రహ్మ ప్రథమ జీవుడూ, ప్రథమ జిజ్ఞాసువు, ప్రథమవేత్తా, ప్రథమ గురువు కూడా. కనుక విద్యా సంప్రదాయాన్ని బట్టి ప్రథముడూ, పెద్ద వాడూ అయిన బ్రహ్మకూ, అదే మార్గములో నున్న తదనంతరం వారికీ (ఆది - శబ్దంచేత పరంపర బోధింప బడింది.) నమస్కారమన్న భావం విద్యా భోధకులా, ప్రవర్తకులా ఎడ వినయాన్ని ఈనాడు జిజ్ఞాసువులో ప్రవేశ పెట్టేయత్నమే, ఇక్కడ చేయబడుతోంది.

“బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యః”: ఈ వాక్యాన్ని రెండుగా అర్ధం చేసికోవచ్చు. 1. మొదటి వాక్యంతో కలిపి. బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని ప్రారంభించి, కాపాడుతున్న బ్రహ్మ మొదలైన వారలకు నమస్కారము. 2. దీని వరకే అర్థం చెప్పుకుంటే బ్రహ్మ విద్యా (పెద్ద విద్య లేక అన్ని విద్యలకూ ఆధారమని చెప్పదగ్గ విద్య ఏదో అది) పరంపరను (తరం నుండి తరానికి అందించే పద్ధతిని) ఏర్పరచి, కొనసాగేట్లు చేస్తున్న వారు సాంప్రదాయ కర్తలనబడతారు. అట్టి వారిని విద్యార్థిచే స్మరింపజేస్తున్నారు. వారియెడ వినయాన్నీ, వినమ్రతను అభ్యాసిలో ప్రాదుకొల్పుతున్నాడు గురువులు.

“వంశ ఋషిభ్యః”: వంశ ఋషులన్న మాటకు వ్యవహారంలో కుల గురువులు అన్న అర్ధం చేయబడుతోంది. అయితే ఈ శ్లోకము, విద్యార్థికి, గురువులూ, విద్యా సంప్రదాయ రక్షకులూ నైన వారి ఎడల ఉండదగ్గ భావానికి చెందినదై

యుండుట వలన, వంశ ఋషులు అన్న మాట భిన్న భిన్న శాఖలుగా నున్న విద్యా బోధకులనూ, ప్రవర్తకులను సూచించునదిగా స్వీకరించుట ఉత్తమము. అప్పుడు లోకంలో ప్రవర్తిల్లుతూ మానవ వికాసానికి పనికివచ్చు అన్ని విద్యలకు చెందిన బోధకులూ ప్రవర్తకులూ నైన వారలనున్నూ విద్యార్థి వినయ పూర్వకంగా స్మరించునట్లు చేస్తున్నారన్నమాట.

“మహద్బ్యో నమో గురుభ్యః” :- మహనీయులైన అట్టి జ్ఞాన ప్రదాతలకు గురువులకు అందరకూ నమస్కారమన్నది ముగింపు వాక్యం.

మొదటి సాధకుడూ, బోధకుడూ, పరంపరను ప్రారంభించి తానెరిగిన విద్యను సమాజానికి అందించి, వారున్నూ అట్లే అందించునట్లు ఒకబాట నేర్పరచిన బ్రహ్మకూ, తదితరులకున్నూ అంటూ ప్రారంభించి ఆధ్యాత్మ విద్యా-బ్రహ్మ విద్యా-సాంప్రదాయ ప్రవర్తకులును పిదప స్మరిస్తూ, అన్ని విద్యాశాఖా ప్రవర్తకులను కూడా స్మరిస్తూ అట్టి మహనీయులైన గురువులందరకూ నమస్కారమను భావన ఎంత ఉదాత్తమంగా ఉందో గమనించండి. నిజంగా విద్యార్థికి గానీ, విద్యా బోధకులకు గానీ (బోధకులు కూడా ఒక నాటి విద్యార్ధులే కదా) ఈ శ్లోక భావం వంటబట్టి తదను గుణ్యంగా విద్యా ప్రదానమూ, విద్యార్జనా కొనసాగిన అట్టి విద్యావ్యవస్థ సమాజమంతటికీ మేలొనగూర్చగలదు కదా?

Note:-దీనికి భిన్నంగా ఉన్న నేటి విద్యాలయాలూ, బోధకులూ, విద్యార్థులూ, విద్యాలయా నిర్వాహకులూ అన్న మొత్తం విద్యా విభాగాన్ని పరిశీలిస్తే పై శ్లోక భావం నేడు ఆ విభాగంలో ఎవరికీ పట్టకుండా ఉండడం కొట్ట వచ్చినట్లు కనబడుతుంది.

మేలుకొలుపు:- పత్రికను ప్రారంభించాలనుకున్న వెంటనే ఏ పేరు పెట్టాలన్న ఆలోచన బయలుదేరింది. “మేలుకొలుపు” అన్నది సంస్థ ఆశయాన్ని సమాజంలో ప్రస్తుత ప్రథమావసరాన్నీ సమగ్రంగా చాట గలిగి ఉండాలన్న భావంతో ఆలోచించడం జరిగింది. పిలుపు, సమాలోచన, అంతర్మధనం, జ్యోతిర్మయి మొదలగు అనేక మాటలను కూడా పరిశీలించాము. మేలుకొలుపులో జ్ఞానం-చూపు కలిగి యుండడం. అజ్ఞానం తొలగించుకోవడం అన్నది ప్రధానంగా ఉన్నా, మానవ జీవితం దానితో ముడిపడి యున్న సమస్త విషయాల లోనూ ఉండకూడని స్థితిని గమనించి తొలగించుకోవడమూ నన్నది కూడా వ్యక్తం చేయవీలుంది.

కనుక మేలుకొలుపు కావలసిన కార్యానికి తగిన స్ఫూర్తి నివ్వగల నామంగా ఎంచి స్థిరపరచాము.

ముఖ్య గమనిక:- ముఖ చిత్రం పై కొన్ని విషయాలు వివరణాత్మకం గానూ, మరికొన్ని సంగ్రహంగానూ పాఠకుల ముందుంచడం జరిగింది. ఈసారి సంచిక, స్వమంతవ్యం పై చర్చా వేదికకు చెంది ప్రత్యేక సంచిక అవుతుంది. కనుక మేధావులూ, వివేచనాశీలురూ, నిస్పాక్షికులూ నైన వారెల్లరూ వారి వారి యభిప్రాయములను నిష్కర్షగా పంపగోరుతున్నాము. వీలయినంత వరకు అన్నింటినీ ప్రత్యేక సంచికలో ప్రకటించగలము. సెప్టెంబరు 15వ తేదీలోపుగా చర్చా వేదిక ప్రత్యేక సంచికకు మీ మీ యభిప్రాయములను పంపండి.

:అభ్యాసక్రమము: రెండవపాఠం

ప్రథమ పాఠంలో నేను చెప్పిన అంగములను క్షుణ్ణంగా పరిశీలించిన పిదపనే ఈ పాఠం చదువదగి యుంది. అనేకులలో - ఏవేవో కొద్ది కొద్ది సాధనలు సల్పి తానిక సాధనలు చేయవలసిన స్థితిని అధిగమించానని ఎంచుట జరుగుచున్నది. అది సాధనను గూర్చి ఉండవలసినంత అవగాహన లేకపోవడాన్ని సూచిస్తూందేగాని సాధనలు చేయనక్కరలేని స్థితిని తెలుపదు. ఎందుకంటే మార్పు అన్నది సాధనకు ఆలంబనగా నున్న విషయము. నిజంగా ఆత్మ విమర్శ చేసికోగలిగితే తన మనస్సు ఏదో కోణంలో మార్పును కోరుతున్నదీ లేనిది తెలియ గలదు. ఏ విషయంలో ఏరకమైన మార్పు అన్నది స్పష్టంగా గమనించగలగాలి. అసలు రహస్యమంతా అక్కడనే ఉంది. ఎందుకంటే...

అస్థిత్వ పోరాటమూ, ఎదుగుదల, గుర్తింపూ, భోగప్రాప్తి అన్న వాటినీ, వాటి నుండి ఏర్పడవలె ననుకుంటున్న ఆనందస్థితినీ మనస్సు యిష్టపడుతోంది. క్రమబద్ధమైన, నిరంతర యత్నంలేక అవి లభించుటలేదు. క్రమబద్ధమైన, యత్నాన్నే సాధన అంటామన్నది గమనించితే సాధన ఆ జీవితం చేయవలసినదిగా తెలుస్తుంది. అయితే సాధన రెండు స్థాయిలు కలిగి ఉంటుంది. 1. అభ్యాసస్థాయి 2. పరిణితి చెందిన - సిద్ధ - స్థాయి. ఇంత మాత్రమే తేడా, సాధనలు అవెన్నైనా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు తరిగిపోకుండానూ, పెరిగేట్లున్నూ చేసుకునేందుకే ఉద్దేశించి ఉంటాయి. అభ్యాస స్థాయిలోని వ్యక్తులలో సాధన అపరిపూర్ణంగానూ, సిద్ధస్థాయిని పొందిన వారిలో పరిపూర్ణంగానూ (లోపరహితంగా అనే ఈమాట కర్థం) ఉంటుంది. సిద్ధావస్థలో అది అలవాటుగా - సహజంగా - సాగుతుంటుంది. అభ్యాస స్థాయిలో కష్టంతో కూడుకుని సాగుతుంటుంది.

నేడు దాదాపు అన్ని రకాల సంఘాలలోనూ మరచిపోబడిన, విడిచి పెట్టబడిన అంశమిది. ఎవరికి వారు తాము పరిణితి చెందే ఉన్నామన్న భావన, ఎదుటి వారి నుద్ధరిద్దామనో, ఉద్ధరిస్తున్నామనో భ్రాంత భావన దృఢంగా వేళ్ళూనుకుని ఉంది. సాధన ప్రారంభించాలను కుంటున్న, ప్రారంభించి కొనసాగిస్తున్న, పరిణితి చెందినస్థితిలో నున్న వివేకవంతులారా! సాధన ఆ జీవితం చేస్తూ, యితరులున్నూ చేయునట్లు ప్రేరేపిస్తూ ఉండడం సరైన విధానమనీ, అది  మనకూ, యితరులకున్నూ మేలొనగూర్చగల ఆధార స్థానమనీ గమనించండి. మేల్కొండి; మేలుకొలపండి; కదలండి: కదిలించండి. యదార్థ సాధకులుకండి. అయితే యిక్కడో విషయం మరల గుర్తు చేసికోవలసి ఉంది. మార్పు కోరుకున్నారా? లేదా? ఆలోచించి పత్రికకు వ్రాయండి.

స్పందన - ప్రతి స్పందన

1. స్పందన:- తిరుపతి నుండి రఘపతిరావుగారు, మేలుకొలుపు పడుతున్న శ్రమను అర్ధం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎంతో శ్రమతోనూ, వ్యయంతోనూ కూడుకొని ఉంటాయి. పైగా సహేతుకంగా, ఉన్న దానిని సమ్మతించడం గానీ, మార్పు చెందడం గానీ చాలా చాలా అరుదు. ఆ స్థితికి సమాజం వచ్చేదాకా మీరు ఒంటరిగా పెనుగులాడ వలసిందే కదా! అంటూ వ్రాశారు.

ప్రతి స్పంద.న :- సహృదయంతో వ్రాసిన మీ భావాలను అర్ధం చేసికున్నాను. సమాజపు ప్రస్తుత పోకడ ఎలా ఉందో అర్ధం చేసికున్నారన్న విషయం మీ లేఖ వల్ల తెలుస్తోంది. అది నిజమే అయినా మార్పు రావలసింది ఉన్న సమాజంలోనే కదా! మరియు మార్పు తేవడానికి యత్నించేవారు రావలసిందీ ఉన్న సమాజం నుండే, మీలానే మార్పు అవసరాన్నీ , మార్పు తెచ్చుటకై వెచ్చించ వలసిన శ్రమనూ, కాలాన్ని గమనించిన వారున్నూ ప్రస్తుత సమాజంలోనే ఉన్నారు. ఏకీకృతం కాగలిగితే ఒక సంఘటిత శక్తి ఏర్పడి యత్నారంభం కాగలదు. అనుకోవడం వరకు సమస్యను చాలా మందిని గమనించే ఉన్నాము. ఇక పై మరికొంత క్రియాత్మకంగా కదలవలసి ఉంది. అంతే.

స్పందన:-2. వారే, వారి గురించి పరిచయం చేసికుంటూ, “నేను చాలా మారాను. అయినా వెలుగు ఎక్కడ లభిస్తే అక్కడకు చేరడానికి వెనుకాడను.పత్రిక లోని విషయాలను కలసినప్పుడు చర్చించగలను. నాకై సంచికలు వెచ్చించ కండి. వీలయినప్పుడు కలవడానికి యత్నిస్తాను” అని వ్రాశారు.

ప్రతి స్పందన :- ఈ విషయమై వారికే లేఖ ద్వారా ప్రత్యుత్తర మొసగినా ఇట్టి యభిప్రాయమే గల పాఠకులు మరి కొందరుండ వచ్చునని ఎంచి ఈ విషయాన్ని గూడా పత్రికలో వేస్తున్నాను.

మీలానే మార్పు చెందిన వారూ, సరైన మార్పు చెందడానికి యిష్టపడేవారు లోకంలో ఉన్నారు. గనుకనే మేలుకొలుపు అవసరమూ, ప్రయోజనమూ కూడా కలుగుతున్నాయి. అట్లుగాక మేల్కొనడానికి (సరైన మార్పుకు) యిష్టపడనివారి విషయంలో - నిజాయితీ లేని వారి విషయంలోనూ, మేల్కొలుపు నిరుపయోగమే. నిజాయితీ పరులైన సాధకులెల్లరూ ఈ విషయం గమనించ గలరని ఆశిస్తాను. నాకై సంచికలు వెచ్చించకండి అన్నారు. నిష్కర్షగా చెప్పాలంటే, మారే, మార్పుని అంగీకరించి స్వీకరించే, మీలాంటి - మనలాటి అంటే మరింత సబబుగా ఉంటుంది. వారి కొరకే మేలుకొలుపు పుట్టింది. కనుక ఈ విషయంలో వెచ్చించడం అనడం కంటే సద్వినియోగ పరచడం అన్నమాట బాగుంటుంది. మనం కలవాలన్నదే నా ఆకాంక్ష. ఇట్టి భావాలే ఉన్న ఇతరులనున్నూ ఈ లేఖా ముఖంగానే ఆహ్వానిస్తున్నాను. మనం కలిసే యత్నం మీనుండిన్నీ చేయండని.

2. స్పందన:- యుద్ధనపూడి శ్రీనివాస్ పత్రిక 6వ సంచిక చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది. నా మిత్రులు మరి కొందరున్నూ సంచికలు కావాలన్నారు. అలాగే సత్యాన్వేషణా మండలిలో సభ్యునిగా చేరుటకు కల నియమ నిబంధనలు తెలుపగలరు అంటూ వ్రాశారు.

ప్రతి స్పందన :- మంచిదండీ. పత్రికలు పంపుతున్నాను. వీటి పై మీలో మెదలిన భావాలు నిష్కర్షగా పత్రికకు పంపండి. నలుగురకు ఉపయోగించవచ్చు . పోతే సభ్యులగుటకు ప్రత్యేక నిబంధనలేమీలేవు. నిజాయితీగా, సరైన మార్పును కోరే స్వభావమూ, సత్యజ్ఞానాన్ని ఆర్జించి అమలులో పెట్టుకోవాలనే తపన, భ్రాంతి జ్ఞానాన్నీ, విశ్వాసాల్ని విడువగల తెగువా ఇవే సత్యాన్వేషణ మండలిలో సభ్యులగుటకు అసలైన అర్హతలు. ఇవివున్న వాళ్ళంతా సత్యాన్వేషణ మండలిలో చేరవచ్చు. ఈ గుణాలు కలవాళ్ళకు తగిన సాధన క్రమముంటుంది. దానిని సాధన చేయాల్సి ఉంటుంది. 3. స్పందన: ఎ. పుల్లారావు. వైజాగ్ నుండి. ఓం ప్రకాశ్ గారి లేఖపై, మీ ప్రతి స్పందన తగినట్లు లేదన్న భావాన్నీ, వారి లేఖను యథా తథంగా ప్రచురిస్తే పాఠకులకు నిస్పాక్షికంగా విషయాన్ని గ్రహించేందుకు అవకాశముండేదన్న భావాన్ని వ్యక్తం చేశారు.

ప్రతి స్పందన:- ఓం ప్రకాశ్ గారి లేఖ మొత్తంగా ప్రచురిస్తే బాగుండేదన్న సూచన బాగుంది. కానీ సంచికకు సంబంధించని వాక్యాలను కూడా కలుపుకుని ప్రచురించడం సాధ్యపడదు. ఎందువల్ల నంటే స్థలాభావ మొకటి. (సుదీర్ఘమైన లేఖలు ఉండవచ్చు) 2. అవసరం లేక పోవచ్చు. పాఠక మిత్రులూ, పుల్లారావుగారూ. ఈ విషయాన్ని అర్ధం చేసికోగలరని. భావిస్తాను. అయితే లేఖలోని సంబంధితాంశములనేమీ విడువలేదు. ఏ లేఖకుల విషయంలోనైనా ఈ నియమాన్ని పాటించడం జరుగుతుంది.

 4. G. పాండవులు M.A. గారు, పొదిలనుండి ప్రశంసాత్మకంగా లేఖ వ్రాస్తూ మీ వ్రాతలు బుద్ధి ప్రచోదితములనుట నిస్సందేహము. నిజము నిష్ఠురము అనుమాట నిత్య సత్యము అన్నారు.

ప్రతి స్పందన:-ప్రశాంసాత్మకమైన మీ లేఖను ప్రోత్సాహకారకంగా స్వీకరించాను. ధన్యవాదములు. మేలుకొలుపు కార్యక్రమంలో భాగస్వాములుకండి. అన్నదే నా నినాదము. గమనించి తగిన విధంగా స్పందించగలరని ఆశిస్తాను.

ఇంకను అనేక ఔత్సాహిక, సాధక పాఠక మిత్రులనుండి క్రొత్త చిరునామాలు కూడా అందుతున్నాయి. డా. C. నారాయణరెడ్డిగారి నుండి ఓ అభినందన లేఖ అందినది.

:ముఖ్య గమనికలు:
1. 6, 7 సంచికలు స్వమంతవ్యం (నేనూ, నా పత్రిక ) అన్న అంశానికి చెందినవి. వీటి పై పాఠకులందరి నుండీ స్పందన కోరుతున్నాము, అభిప్రాయములూ , విమర్శలూ, సూచనలూ, దోషాలూ పంపగలరు. 8 వ సంచిక, స్వమంతవ్యం (6, 7 సంచికల) పై విమర్శా, సమీక్షల కొరకుగా ప్రత్యేకించబడింది. అవసరాన్ని బట్టి 9వ సంచికను కూడా ఇందుకై వినియోగించగలను. అయితే సెప్టెంబరు -15 లోపుగా మీమీ స్పందనలు వంపవలసి ఉంటుంది.

2. అభ్యాస క్రమాన్ని గూర్చి, సాధనలు చెప్ప మొదలిడే ముందుగా జిజ్ఞాసువులూ, సాధకులు, గమనించవలసిన కొన్ని విషయాలను సాధనకు ప్రాతిపదికగా, (వేదికగా) - ఉండగలవి చెప్పుచున్నాను. గమనించి వీటి పైన మీ మీ అభిప్రాయాలు తెలుపండి.

3. అక్టోబర్ 16, 17, 18, తేదీలలో, ప్రతి మూడు మాసాలకూ జరుగవలసిన సమాలోచన శిబిరం జరుగుతుంది. మేలుకొలుపు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న, పంచుకోవాలను కుంటున్న వారందరూ విధిగా కార్యక్రమానికి రావలసి ఉంటుంది. ఈ విషయం పైననూ అవసరమనుకున్న వారు ఉత్తర ప్రత్యుత్తరాలు ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.

4. పాఠకులందరూ తమతమ పూర్తి చిరునామాలతో లేఖలు వ్రాయ గోరుచున్నాము.