Showing posts with label 228. Show all posts
Showing posts with label 228. Show all posts

Tuesday, November 1, 2016

రహ్మాన్‌ గారినుద్దేశించి ముక్క అయిలయ్య గారు పంపిన లేఖసారాంశం

మిత్రులు ఫజులూర్‌ రహ్మాన్‌ గారికి నమస్కారములు.
పత్వా అంటే ధార్మికతీర్పు అని కొన్ని పదాలకు అర్థాలు చెప్పుకొని అలాగే 9:29 జిజియా గురించి చర్చ జరిగింది. దీనిపై పీటర్‌ గారి ప్రశ్నలకు సరైన సమాధానం ఖురాను పక్షము నుండి రాలేదు. 9:11 అలాగే కాఫీర్లను మాటువేసి చంపండి అనేది చర్చ జరిగింది. ఖురానులో హింసలేదు అని మీరు అన్నారు. పీటరు గారి ప్రశ్నలకు మీ దగ్గర సరియైన సమాధానం రాలేదు. హింసకు సంబంధించిన రిఫరెన్సు కావాలి అని అడిగినారు మీరు. చాలా వున్నాయి అని పీటరు, సామ్యూలు, జగదీష్‌లు అన్నారు. ఆ రోజు జరిగిన చర్చలో ఖురాను పక్షము వారినుండి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. ది.10-11-2015న ఖురానుపై చర్చ. 9:73, 111, 123, 129 పీటరు లేవనెత్తారు. అలాగే మహమ్మద్‌కు ముందు యూదులు, క్రైస్తవులు ఉన్నారు కదా! మహమ్మదు క్రొత్త విశ్వాసమును ఎందుకు ప్రవేశపెట్టినారు? అది నమ్మని (అవిస్వాసులు) మహమ్మద్‌ చెప్పిన దానిని నమ్మని వారిని ఎందుకు చంపమంటున్నారు అనే ప్రశ్నకు సరైన సమాధానం మీనుండి రాలేదు.
అవిశ్వాస కారణంగా చంపమంటున్న ఖురాను, హదీసులు, ముస్లిమేతరులను చంపమంటుందా? అనే ప్రశ్నలు వచ్చినాయి. జవాబు ఇవ్వలేదు.
మనం నాలుగైదు మాసాలుగా ఖురాను, బైబిలుపై చర్చించి ఒక దశకు వస్తున్న క్రమంలో ఇరుపక్షాలు (ఖురాను, బైబిలువారు) చర్చకు రాలేదు. దీని అర్థం పై విషయాలకు సమాధానాలు మీ దగ్గర లేవని మాకు అర్థమైంది. ఖురానుపై అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసింది మీరు చెప్పటం లేదు. ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. అనేక విషయాలకు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. మీరు ఇంకా చర్చిస్తామంటే అనేక ప్రశ్నలు ఉన్నాయి. గట్టిగా పది ప్రశ్నలకు ఖురాను పక్షమునుండి సమాధానం రాలేదు. అప్పుడే ఆగిపోతుందా చర్చ.
ఖురానులో హింసకు సంబంధించి, అవిశ్వాసుల పట్ల ఖురాను వైఖరి గురించి మీకిప్పటికే స్పష్టంగా తెలిసిందని అనుకుంటున్నాము. మేము సత్యాన్వేషణ వైపు ఉన్నాము. మీరు ఏ వైపున ఉన్నారో తేల్చుకోండి మిత్రమా.

రహ్మాన్‌ గారినుద్దేశించి సురేంద్ర గారికి పంపిన లేఖ సారాంశము


సురేంద్ర గారికి మిత్రులు ఎం.ఎస్‌. అక్బర్‌ బాద్షా వ్రాయునది. ఉభయకుశలోపరి.
నేను కూడా ఖురాను తెలుగులో 30 అధ్యాయాలు పూర్తిగా క్షుణ్ణంగా చదివిన వాడినే, అందులో మీరు లేవనెత్తిన సందేహాలు మెదడున్న మనిషికి అనుకోకుండానే ఈ కాలంలోని వారికి తప్పక కలిగేటటువంటివే. అందులో ఏ మాత్రమూ సందేహమే లేదు.
వివేకపథం మొదలైనప్పటినుంచి మనసుపెట్టి చదివేవారిలో నేనొకడిని. దాని ముఖ్యోద్దేశము సత్యపక్షాన నిలవడం - ధర్మ బద్దంగా జీవించడము. కనుక చదివేవారు నిక్కచ్చితనము కలిగి మాట విడువలేని మానధనులై ఉండాలి. కానీ రహ్మాన్‌ గారు, ఆర్భాటం కోడి, ఇల్లెక్కి కూసి, చివరికి తోలుగుడ్డు పెట్టిన చందాన వ్యవహరిస్తున్నారు.
నేను హైదరాబాద్‌కు పోయి రహ్మాన్‌ గారితో 4,5 సార్లు ఫోన్‌లో మాట్లాడినాను. నేను ఆయన ఇంటికి కూడా వస్తానన్నాను. ఆయన వద్దని చెప్పి, ఆయనే ఈ విషయం మాట్టాడటానికి మా ఇంటికి వస్తానని చెప్పి మాట తప్పి రాకపోయినది కాక వివేకపథం సభ్యులను తూలనాడటము నాకు చాలా బాధ కలిగించినది. వియ్యానికైనా, కయ్యానికైనా సరి ఉజ్జీ ఉండాలి. పిచ్చుకపైన బ్రహ్మాస్త్రాలెందుకండీ సురేంద్ర గారూ.
సమాజానికి ఇతను ఏపాటి వాడో మీ వివేకపథం ద్వారా అందరికీ తెల్సిపోయినది. ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారో? ఇది మీ ఒక్కరితో అయ్యేపని కాదు. సత్యం ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేలోపల, అబద్దము ఊరు తిరిగి వచ్చే ఈ కాలంలో మాట నిలకడ గలవారెంత మంది? కనీసము సమాజానికి భయపడి చెప్పలేక పోతున్నాను అనన్నా చెప్పగలిగితే ఎంతోమేలు. కానీ అతనికి ఆ భావన కూడా లేదు. ఇందులో ఏ మంచి ఇమిడి ఉన్నదో ఆ ప్రకృతికే అర్థమవ్వాలి. బలవంతాలతో పని ముందుకు సాగదు. ఇలాటి వారి గురించి మాట్లాడునది, ఒక విధంగా గౌరవాన్ని ఆపాదించడమే అవుతుంది. మీకు ఎక్కువ చెప్పగల స్తోమత లేనివాడను. కాన క్షంతవ్యుడను. ఇది రాయవలసి వచ్చినందుకు బాధతప్త హృదయంతో
మీ శ్రేయోభిలాషి.

రహ్మన్‌ గారి అహేతుక పోకడ


నెలలో ఒక కొలిక్కి వచ్చిన ''అవిశ్వాసులపట్ల ఖురాన్‌ వైఖరి'' తన వైపు నుండి అన్నమాటకు కట్టుబడి ఉచితంగా స్పందించి ఇస్లాంను విడిచి బైటికి రావలసి ఉన్న ఫజులూర్‌ రహ్మన్‌గారు ఆ పని చేయకపోగా, ఆనాడు ఆయనను మిత్ర దృష్టితో చూస్తుండడం వల్లా, మండలికున్న; ఒక విషయంపై శాస్త్రీయ పరిశీలన పూర్తయ్యాకనూ దానిని మరొకసారి పరిశీలించుదామని ఎవరడిగినా అక్కడరలేదనకుండా పరిశీలనకు సిద్దపడడమన్నది శాస్త్రీయ దృక్పధం కలవాళ్ళు, శాస్త్రీయ పద్దతిని నెరిగినవాళ్ళు అనుసరించిన విధానం అన్న నియమం వలన, మీరు కావాలంటే మరో సారి పరిశీలించుకోడానికి నేను సిద్దం. కానీ ఈ సమావేశంలో నేను చూపవలసినవి చూపాను. నేను చూపిన మూడు సందర్భాలూ మూడు రకాల అవిశ్వాసాలకు చెంది, అవిశ్వాస కారణంగానే వధించడం జరిగినవే. అవిశ్వాసులలో రకాలు వాళ్ళుంటారని ఆనాడూ నేను చెప్పాను. ఆ సమావేశంలో ఉన్న రహ్మన్‌గారూ, ఇతరులు కూడా దానినంగీకరించారు. వారంతా మరోసారి సరిచూసుకోడానికీ, పాఠకులూ ఆలోచించడానికి వీలుగా వాటినిక్కడ వ్రాస్తున్నాను.
1. పుట్టుకనుండీ విగ్రహారాధకుల, అన్యదేవతారాధకులుగ ఉన్న, అల్లా పై విశ్వాసంలేని అవిశ్వాసులు, బహు దైవారాధకులు, విగ్రహారాధకులేకాక దీని క్రిందికి ఖురానును అంగీకరించని యూదులూ, క్రైస్తవులూ కూడా వస్తారు.
2. ముస్లింలుగానే పుట్టి అప్పటి వరకు ముస్లింలుగా ఉండి, ఖురాను దేవుణ్ణి కాదని, ఇతర దైవారాధనల - విశ్వాసాల వైపు మళ్ళినవారు.
మూసా దైవాజ్ఞలకోసం కొండ మీదకు వెళ్ళినప్పుడు, అతని జాతి ప్రజలలోనే కొందరు ఆవు దూడ విగ్రహాన్ని చేయించుకుని అల్లాను విడచి దానిని ఆరాధించడం మొదలెట్టినవారు అంటే ఇస్లాంను విడచి అన్య విశ్వాసంలోకి మరలిన ఖురాన్‌ అవిశ్వాసులు.
3. అప్పటి వరకు ఇతర విశ్వాసాలననుసరిస్తున్న వారిలో నుండి ఏకారణాల వల్ల గానీ ఇస్లాంను స్వీకరించి, ఆ తర్వాత తిరిగి అల్లాను విడచి ఇతర మార్గాల పట్టిన అవిశ్వాసులు.
నేనానాడు బుఖారి ద్వారా చూపించినవారూ ఈనాటి వసంతరావు (ఉరఫ్‌ వహీద్‌) గారిలాటి వాళ్ళూ ఈ రకానికి చెందిన - ఇస్లాంలోకి వెళ్ళి తిరిగి వెనక్కువచ్చిన, మరో విశ్వాసంలోకి మరలిన అవిశ్వాసులు.
4. ఇక విశ్వాసుల ఇంటనే పుట్టినా భవిష్యత్తులో అవిశ్వాసిగా మారి విశ్వాసులను వేధిస్తాడేమోనని అనుమానం, భయం కలగడం వల్ల విశ్వాసి గానే తలంచి ప్రవర్తించాలని 'ఖిజర్‌' బాలకుని కథ ద్వారా ప్రకటించిన రకం అవిశ్వాసతుల్యులు.
1. పుట్టుక నుండీ ముస్లిమేతరులు 2. పుట్టాక ముస్లింలై అనంతరం ఇస్లాంను విడిచిన వారు 3. పుటక అన్యవిశ్వాసులై ఇస్లాం స్వీకరించి విడిచిపెట్టినవారు 4. అవిశ్వాసి కావచ్చునని అనుమానించబడ్డ వారు. అన్న నాలుగు రకాల వారిని ఖురాన్‌ అవిశ్వాసుల జాబితా క్రిందకి చేర్చింది. మన ఇంగితం (హేతుబుద్ది) కూడా, పై వాటిలో నాలుగో రకం వారిని మాత్రం ఇంకా తేలని వారి జాబితాలో పెట్టడం సరైంది మిగిలిన మూడు విభజనలూ సరైనవేనంటోంది. నా ఈ వ్యాసాన్ని పట్టి చూస్తున్న పాఠకులేకాక వివిధ మాధ్యమాల ద్వారాను గమనిస్తున్న యోచనా పరులందరికీ, ఇక్కడికిది సరిగనే ఉందో లేదో ఎవరికి వారుగా ఒక నిర్ణయానికి రండి.
ముఖ్యగమనిక :- ఆనాటి చర్చల సందర్భంలో పై అంశాలపై రహ్మన్‌గారు వెళ్ళడించిన అభిప్రాయాలివిగో
1. బుఖారీ హదీసుల్లో నుండి నేను ఎత్తిచూపిన ''ఇస్లాంలోకి వచ్చి తిరిగి విడిచిపెట్టిన వాని విషయంపై'' అది 100% వాస్తవం. ఒకడు ఇస్లాం స్వీకరించి, తిరిగి దానిని విడిస్తే చేయవలసింది వధించడమే మరో ప్రత్యామ్నాయం గాని, మినహాయింపు గానీ లేదన్నదినే నంగీకరిస్తున్నాను అనన్నారు రహ్మన్‌గారు. ఆనాటి సదస్సులోని ముస్లింలేగాక, ఇతరులూ అవును ఆ వాక్యాలలానే ఉన్నాయని అంగీకరించి నిర్ధారించారు.
2. 'ఖిజర్‌ - బాలుని చంపడం' విషయంపై రహ్మన్‌గారు స్పందిస్తూ, ఈ ఒక్క సంఘటన మాత్రం నాకు బలమైందిగానే కనిపిస్తోంది. దీనిపై నేను ఆలోచించాల్సి ఉంది. ఎందుకలా జరిగిందో సమాధానం చెప్పాల్సి ఉంది అనన్నారు. దీనిపై ఆలోచించాల్సిందీ, ఎందుకలా జరిగిందో చూడాల్సిందీ ఏముందండీ! (అవిశ్వాసి అన్న కారణంగానే కాక) అవిశ్వాసి అవుతాడేమోనన్న అనుమానం కారణంగానూ వధించడం సరైందేననే కదా ఆ ఘటన కు చెందిన మాటలు చెపుతోంది? అని ఆనాడే ఆయన్ని ప్రశ్నించాను. ఆ సందర్భంలోనూ సమావేశంలో పాల్గొన్న వారందరూ ఆ మాటలకు అదే అర్ధం. మరే అర్ధమూ రావడంలేదు అనన్నారు కూడా.
3. అల్లాను విడిచి, ఆవుదూడను పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా మూసా స్వజనాన్నే, అందులోని వారే అయ్యుండి ఆవు దూడ పూజలో పాల్గొనని వారి చేత, చంపించాడు అల్లా. నాలెక్క ప్రకారం ఈ ఒక్క వాక్యం. అల్లాను తిరస్కరించిన వారు, వారెవరకైనా కడకు తన జాతివారే అయినా తల్లైనా, తండ్రైనా కొడుకైనా, భార్య అయినా, అన్నైనా, తమ్ముడైనా, ఎంతటి దగ్గరి సంబంధీకులైనా సరే వధించవచ్చు. వధించాల్సిందేనని సందేహరహితంగా, సూటిగా, ప్రకటిస్తోంది.
గమనిక :- ఆనాడు వధింపబడ్డ వారు 1. జాతిరీత్యా అన్యులుకారు 2. ఎదురు తిరిగి కొట్లాటకు సిద్దమైనవారూ కారు. 3. యుద్ద సందర్భమూ కాదు. కేవలం అల్లాను విడిచి విగ్రహాన్ని ఎంచుకుని పూజించారు అన్న ఒకే ఒక్క కారణంగా, స్వజనులు, రక్త సంబంధీకులూ, అన్నది కూడా ప్రక్కన పెట్టి చంపబడ్డవారే.
ఈ సందర్భంలో నేనేదో రుద్దాను, పులిమాను అంటూ అనుచితంగా, నాపై పెద్ద అభాండం వేసిన ఫజులూర్‌ రహ్మన్‌గారిని సూటిగా ఒక్కటడుగుతున్నాను. అయ్యా రహ్మన్‌జీ! ఆనాటి సంభాషణ రికార్డై ఉంది. ఆ సంభాషణ సారాంశం వివేకపథం పత్రికలలోనూ రాత రూపంలో నమోదైఉంది. ఆనాటి సదస్సులో 20, 30 మంది వివిధ ధోరణులకు చెందిన పరిశీలకులూ ఉన్నారు నేనేమి రుద్దానో, పులిమానో తేల్చాల్సిన నైతిక బాధ్యత మీమీద ఉంది. ఎదుటివాడిని రుజువు చేయమనంటూ తెగ నిగ్గ తీసే మీకు, మీరు ఖురాను ప్రతినిధిగా రుజువు చేయాల్సినవిగానీ, సమావేశంలో మాట్లాడిన వాటికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యతగానీ, ఉండవన్నమాట!? కట్టు బాట్లు నియమాలు, నిగ్గతీతలన్నీ ఇతరుల కొరకేనన్నమాట!
ఇంతకూ ఆ మూడు సందర్భాలకు చెందిన మాటలకు నేనేమి లేని అర్ధాలు రుద్దానో రుజువు చేయండి మొదట. పిదప ఇంతకూ ఆ వాక్యాలకు మీరంగీకరించే అర్ధాలేమిటోనూ స్పష్టంగా ప్రకటించి, మీరు చెప్పే అర్ధాలు భాష తెలిసిన వారందరికీ తెలిసేవేననీ, మీరే మీ రుద్దడాలు, పులమడాలూ చేయనేలేదని కూడా విజ్ఞులముందు చెప్పి వారినివప్పించండి.
విషయాన్ని విడచి అనవసరపు కామెంట్లు చేస్తూ, అదేమన్న వారిని వ్యంగ్యంగా దెప్పిపొడుస్తూ, పరుషంగా, అవమానకరంగా మాట్లాడుతూ వస్తున్న మీకు, మీ పోకడ ఆడలేక మద్దెలవోడన్న చందాన ఉన్నట్లు తెలియడం లేదన్నమాట! మీ భాష బాగలేదు. విషయ దృష్టితో సంభాషణలు సాగించండని సూచన చేస్తే, నీ భాష చూసుకో అనంటారా? నేను ఎవరెవరితో ఏయే సందర్భాలలో కటుభాషనుపయోగించానో మీకభ్యంతరం లేకుంటే కూలంకషంగా పునర్విచారణ జరుపుకోడానికి నేను సిద్దం ఆ పని మీకు సమయం చిక్కినప్పుడు నిదానంగా చేద్దాం గానీ, నా సూచనలో అత్యంత కీలకమైంది, ఏమిటో గమనించారా?! ఈ సందర్భంలో, ఆయావ్యక్తుల విషయంలో ఆ భాష అనుచితం అనన్నానేగాని, కటుభాషణం అసలు అవసరమే లేదన్నానా నేను? ఉదాహరణకు, ఇప్పుడు మీతో ముడివడి ఉన్న ఎన్నో అంశాలలో కటు భాషణ తప్పని సరైన పరిస్థితులు ఏర్పడుతూ వస్తున్నై, అందుకు కారణం మీ వైఖరేనన్నది నిజం. ఎందుకనంటే, ఎదుటి వాడు ఏమంటే నేనామాటన్నాను అన్నది పట్టి చూడాలి అని మీరు అన్నారు. కనుక, మన ప్రస్తుత సందర్భంలో అనవసరపు మాటలు, ఎవరి నుండి మొదలయ్యాయో చూద్దామంటే చూద్దాం. నా లెక్క ప్రకారం.
నేను ఖురాను నుండి, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగానే వధించవచ్చన్న - నిజానికి వధించవచ్చన మాట కాక వధించిన సంఘటనలనే ఎత్తిచూపి, రహ్మన్‌గారూ! మీరు ఇస్లాంను విడిచి బైటికి రండి, అని నా పక్షాన్ని ముగించాను. సభా దానిని అంగీకరించింది. ఇహ, అప్పుడు మీ ముందు రెండే రెండు దారులున్నాయి. వాస్తవిక దృష్టితో సత్యాన్నంగీకరించి, అన్నమాటకు కట్టుబడి ఇస్లాంను విడచి బైటికి రావడం లేదా, నేను చూపిన ఖురాను వాక్యాల అర్ధం అది కాదనీ, ఖురానులో, అవిశ్వాసులను అవిశ్వాస కారణంగా వధించమన్నమాట గానీ, వధించిన సంఘటన గానీ లేదని చెప్పి రుజువు చేయడం.
''ఉందనాలంటే ఒక్కటి దొరికినా చాలు. లేదనాలంటే ఒక్కటీ వదలకుండా అంతా శోధించి చూడాల్సిందే''. అన్నదో విచారణ నియమం. అది మీకూ తెలుసు. కనుక నా పక్షాన్ని విన్నాక దానిని అంగీకరించి నావెంట రావడమో, నాది సరికాదని చెప్పి, ఎలా సరికాదోనూ వివరించి, మీదేమిటో చెప్పి అదెలా సరైందో నిరూపించడం చేయాలి మీరు. కానీ మీరా విధానాన్ని పాతిపెట్టి, రకరకాల ప్రస్తావనలు చేస్తూ వచ్చారు. దానిపై సభలో పాల్గొన్న వారిలో కొందరు అదేమిటని మిమ్మల్ని ప్రశ్నించారు. మరి కొందరు ఇస్లాంను విడవమని చెప్పారు. ఒకరిద్దరు రహ్మన్‌గారు మాట తప్పారు అనో, జారుకున్నారు అనో అన్నారు. ఇక మీరు చెలరేగిపోయారు. అనవసరపు దూకుడును ప్రదర్శించారు. అదీ విషయాన్ని విడచి వ్యక్తుల స్థాయిని గురించి దుందుడుకు మాటలనేశారు. ఈ సందర్భంలో చెప్పాను భాషను సరిచేసుకోండని.
ఎంత రచ్చ చేశారు? అసలు విషయాన్ని విడచి ఎంత సమయాన్ని రకరకాల అనవసరపు అంశాల మీద ఖర్చు చేశారు. చేయించారు? ఖురానులో అవిశ్వాసులను అవిశ్వాసం కారణంగా వధించవచ్చన్న అర్ధాన్నిచే ఒక్కవాక్యమైనా ఉందా లేదా? అన్నదే కదా మనం పరిశీలించి తేల్చుకోవల్సింది? దీనికింత రగడ, వ్యంగ్య భాషణమూ అవసరమా? ఇదంతా అడ్డగోలు పోకడ అని చూసే వారికి, చదువరికీ తేలిగ్గానే అర్ధమవుతోంది కదా! ఇంత జరిగాకనూ, ఎందరో విచారణ పూర్తయింది ఇస్లాంను విడచి బైటకి రండంటుంటేనూ, ఆ మాటలు వినీ, విననట్లుండడంతో మొదలైంది, పాఠకుల నుండి మరో రకమైన విమర్శ. ఆయనెందుకొస్తాడండీ! మీరా వాక్యాలు ఎత్తి చూపిన నిమిషంలోనే ఆయన గుండె బేజారైంది. ఎలా పలాయనం చేయాలోనన్నదే ఆయన ఆలోచన, ఎత్తుగడంతా లాటి మాటలన్నారు వారు. ఆశ్చర్యమూ, ఒకింత హాస్యాస్పదమూ అనిపించేలా వారి ఆ మాటల్నే మీరు తప్పించుకోడానికి, విషయాన్ని ప్రక్కదారి పట్టించడానికి సాధనంగా వాడుకుందామనుకున్నారు. విషయం అందరకూ సుస్పష్టంగా బోధపడుతూనే ఉంది. ఎటొచ్చీ మాకు, మిమ్మల్ని మీ బాధ్యతను (విధిని) నెరవేర్చేలా చేయడమే కుదరడంలేదు. అంతలా మొండికేసేశారు మీరు.
ఇప్పటికైనా మీలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, నిజాన్నంగీకరించే స్వభావం ఉన్నా, మీరన్నమాటకు కట్టుబడి, ఉన్న వాస్తవాన్నంగీకరించి ఇస్లాంను విడిచిపెట్టేయాలి.
లేదా! ఈ విచారణ వేదిక నిర్వాహకుణ్ణైన నన్నుగానీ, సభను గానీ; ఒక్క అవకాశం ఇవ్వండి నా పక్షాన్ని వినిపించుకోడానికి అని అభ్యర్థించాలి. మేము సరేనంటే ఆ పని చేయాలి. చేయాల్సిన ఈ రెంటిలో ఏదీ చేయక, రకరకాల ప్రక్కదారులంటా, అడ్డదారులంటా పరుగు పెడుతూనూ, అదీ కుదరనప్పుడు కొంత తడవు మవునంగా ఉంటూనూ కాలం గడిపేస్తూ వస్తున్నారు.
ఇంత జరిగినా, జరుగుతూ వస్తున్నా, నావరకు నేను మీలో ఎలాగైనా పునరాలోచన కలిగించాలన్న ఉద్దేశంతోనే, ఖురానులో, బుద్దున్న వారు విడిచిపెట్టవలసినవీ, భౌతిక విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలరీత్యా తప్పులని రుజువు చేయగలిగినవీ ఎన్నో ఉన్నాయని చెప్పి, ఒకటి రెండంశాలను మీ దృష్టికీ తెచ్చాను. మీలో 'సత్యతిరస్కారం చేయకూడదెవరూ' అన్నంతవరకైనా ఇంగితం పని చేసి ఉన్నా, రండి సురేంద్రగారూ! ఖురానును ఈ కోణంలో పరీక్షించి చూద్దాం. మీరన్నట్లే ఖురానులో గాని అలాటి తప్పు జ్ఞానం అంటే పరీక్షలో కొట్టుకుపోయే లాటి అభిప్రాయ ప్రకటనలు ఏవైనా ఉంటే - ఒక్కటున్నా మొట్టమొదట అది దైవ గ్రంథం కాదని అంగీకరించి, మిగిలిన గ్రంథాన్నంతా మామూలు గ్రంథాలను చూసినట్లు పరిశీలనా దృష్టితో మళ్ళీ కూలంషంగా అధ్యయనం చేస్తాను. తప్పులను నెత్తినెట్టుకోవాలని గానీ, మందినెత్తిన పెట్టాలనిగానీ నాకేమీ లేదు. 100% పూర్తిగాకాకున్నా, కొంత వరకైనా నేనూ సత్యాలను గమనించి స్వీకరించాలన్న, మంచి చెడులను విచారించుకుని చెడును విడిచి, మంచిని అనుసరించాలన్న ఇంగితం ఉన్నవాణ్ణే, రండి మీరన్నలాటి దోషాలు ఖురానులో ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి చూద్దాం అని ఉండేవారు. తప్పులున్నాయేమో చూడ్డానికీ అట్టివి ఉన్నట్లు తేలితే వాటిని విడిచి పెట్టడానికి, వెనుకాడడం ఉందే, ఒక మనిషిగా దానంత బలహీనత మరోటుండదు. నాలుగైదు ముఖ్యమైన ప్రకటనలు చేస్తాను. అవి వాస్తవాలను చూపెడుతున్నాయో లేదో మీరూ! పాఠకులూ గమనించండి.
1. మీరూ అంతో ఇంతో ఇంగిత జ్ఞానం కలిగి ఉన్నవారే అయితే అది పని చేయకుండా మరేవో ప్రాధాన్యతలు దానిని అణచిపెడుతున్నాయి. నిజాయితీతో వెనుదిరిగి చూసుకోగలిగితే మా అందరికంటే మీకే అవేమిటో ఇట్టే తెలిసిపోతాయి.
2. మండలి ఆలోచనా విధానాన్ని ఎంతో కొంత తెలిసున్న మీరు, ఎన్నో తెలియని విషయాలను అవి తెలియనివేనని తెలుస్తూనే ఉన్నా, తెలుసన్నట్లు నలుగురితో చెప్పి చూపడాన్నేమనాలి? ముక్కు సూటిగా చెప్పవలసి వస్తే 1. అది ఆత్మవంచనే. మిమ్ము మీరే వంచించుకుంటున్నారు. 2. పరవంచన కూడా. లోకాన్నీ వంచింప జూస్తున్నారు.
3. పరిశీలించాల్సిన రీతిలో, పరిశీలించగల వాటివరకైనా విధి విధానాలు తెలిసిన వారితో కలసి పరిశీలించడానికి సిద్దపడని మీ మరియు మీలాటి వైఖరి కలవాళ్ళంతా పెడపోకడ పోతున్న వాళ్ళూ, నీతిమార్గాన్నుండి జారిపోయిన లేదా వైదొలగిన వాళ్ళే.

మనం పరిశీలనాంశంగా ఎంచుకున్నది, మీ నోటి నుండే వచ్చిందీ ఇదిగో ఇదే.

''తనని ఒప్పుకోనందుకే తీసేయ్‌ అనే మాటగానీ, అలాటి అర్ధాన్నిచ్చేమాటగానీ, ఖురానులో ఒక్కటున్నా, ఇస్లాంను విడిచి వచ్చేస్తాను. ఇదినా పబ్లిక్‌ స్టేట్‌మెంటు''
దీనిపై నేను ఖురాను నుండి 1. మూసా - ఆవు దూడ, 2. ఖిజర్‌ - మూసా - బాలుడు 3. హదీసులనుండి ఇస్లాంలోకి వచ్చి మళ్ళా దానిని విడిచిన యూదుని వధించే సంఘటనను ఎత్తి చూపించాను. ఆ సందర్భంలోనూ మరికొన్ని సమావేశాలలో ఈ సందర్భం వచ్చినప్పుడునూ అది 100% నిజం. ఒక ముస్లింగాని, ఇస్లాంను విడిచి అల్లా పై విశ్వాసాన్ని వదిలేస్తే అతణ్ణి వధించమనే ఇస్లాం చెపుతోంది అని మీరే స్పష్టంగా అన్నారు. ఆ మీ మాటలు రికార్డై ఉన్నాయి కూడా. ఒక వేళ ఆ మాటలు రికార్డు చేయకున్నా, అలాటి ఆదేశం ఉన్నట్లుగానీ, అలానే అమలయినట్లుగానీ, ఎప్పుడు ఎవరు (ఇప్పుడు మనం) పరిశీలించినా అవి దొరుకుతాయి ఎందుకంటే రాత రూపంలో ఉన్న వాటిని మీరు గానీ, నేనుగానీ, మరొకరుగానీ కప్పెట్టలేం కదా!?!.

మరొక్కమాట చెప్పి ఇప్పటికి ఆగుతాను

మనం సాగించిన ఆ సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొన్న వాళ్ళలో నాకు గుర్తున్నంతలో ఈ జాబితాలోని వాళ్ళంతా, నేను చూపాల్సింది చూపాను, అది సరిగనే ఉంది. ఇక రహ్మన్‌గారేమి చేస్తారో చూడాల్సి ఉంది అన్నవాళ్ళే. కొందరైతే రహ్మన్‌గారూ! ఇస్లాంను విడచి బైటికి రండి! అని మీకూ, మరి కొందరైతే అతనెందుకొస్తాడండీ మీ పిచ్చిగాకుంటే అని నాకూ చెప్పారు. ఇదంతా మీకూ తెలుసు.
1. మోషే 2. ప్రసాద్‌ 3. కోటి 4. రాజేంద్రప్రసాద్‌ 5. సిద్దాంతి 6. ప్రొ. రాధాకృష్ణ 7. రా.కృ. రెడ్డి 8. మురళీ 9. జయరాం 10. భీష్మాచార్య 11. మణికుమార్‌ 12. శ్రీనివాస్‌ (రాజానగరం) 13. ఖుద్దూస్‌.
14. క్రైస్తవం తరుఫున పాల్గొన్న బృందంలో కొందరు (శ్యామ్యూల్‌, పీటర్‌, జగదీష్‌, మనష్షే. విజయవాడ శామ్యూల్‌).15. మీ వైపు నుండి వచ్చిన వారిలోనూ ఒకరిద్దరు ఖరాఖండిగా చెప్పకున్నా, అలాటి అర్ధాలిచ్చే మాటలు ఖురాను హదీసుల్లో ఉన్న మాట నిజమేనన్నారు. నే చూపినవి అలాంటి అర్ధాన్నిచ్చేవిగానే ఉన్నాయి. మరింత పరిశీలించాల్సి ఉంది అనీ అన్నారు. 16. కన్నెబోయిన అంజయ్యగారు 17. క్రాంతికార్‌ 18. ప్రభు 19. డా. భాస్కరరాజు 20. వసంతరావు 21. నాగిరెడ్డి వెంకటేశ్వరరావు 22. ఐలయ్య 23. శ్రీకాంతరెడ్డి (కర్నూలు) 24. అన్ని సమావేశాలకూ హాజరుకాని వారూ మరి కొందరున్నారు. 1. జగన్‌ 2. లింగన్నగారు 3. వీళ్ళు వాళ్ళెందుకు మారతారండీ మీ పిచ్చిగానీ అన్నవాళ్ళే.
రహ్మన్‌గారూ! మరింత జాగ్రత్తగా గుర్తు చేసుకుంటే, మరి కొందరున్నారన్నదీ బైటపడుతుంది. ఆ సమావేశాలలో పాల్గొన్నవారి సంఖ్య 30, 35కు మించి ఉండదు. క్రైస్తవంలోని వారిపేర్లూ విడివిడిగా రాస్తే తమ అభిప్రాయాల్ని ప్రకటించిన వారి సంఖ్య 28 వరకు చేరుతోంది. ఇకపోతే ఏ అభిప్రాయాల్ని ప్రకటించనివారు; దేనినీ అంతగా పట్టించుకొని ఒకరిద్దరూ; మీ పక్షాన వచ్చిన ముస్లింలూ మాత్రమే. మీ వైపు నుండి 1. మీరు, 2. ముస్తాక్‌గారు, 3. హుస్సేన్‌ గారు, 4. పేర్లు గుర్తులేవుగాని, ముస్తాక్‌ గారి వెంటే కారులో వచ్చిన మరో ముగ్గురు, నలుగురు బహుశా అఖిల్‌ ఆలీ, నూరుద్దీన్‌, గౌతంలూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఆ బృందంలోని వారు, నా అభిప్రాయం ఇదిగో ఇదే అని ఎందుకు ప్రకటించలేదో మీకూ తెలుసు, నాకూ తెలుసు.
1. నిజంగా నేను చూపిన వాక్యాలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా; మొదట మీరే ఆ విషయాన్ని కుండబద్దలు కొట్టినంతగట్టిగా చెప్పి, అంతటితో ఊరుకోకుండా నన్ను తెలిసీ తెలియని మాటలు మాట్లాడేవాణ్ణిగానో, మనస్సులో ఇస్లాం వ్యతిరేకతనూ, హిందూ అభిమానాన్ని పెట్టుకుని ఉన్న అబద్దాల కోరుగాను నిరూపించేందుకు గట్టి కృషి చేసి ఉండేవారు.
2. మీ మాటలా ఉంచి; నేనూ సత్యాన్వేషినే అని మొదట నుండీ అంటున్న ముస్తాక్‌ గారీవిషయంలో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారెందుకని? నిజంగా ఆ మాటలకు నేను చెప్పిన అర్ధం రాదని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా, ఆయన మీ అందరికంటే ముందుగా, ఉత్సాహాన్ని చూపి, నా పక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్దపడి ఉండేవారు. వాస్తవాన్ని కాదనేవీలులేదు కనుకనే, దిక్కుతోచకనే మరీ అడ్డగోలుగా మాట్లాడలేకనే ఆయన ఏమీ మాట్లాడకుండా 'కిమ్మినాస్తి'గా గమ్మునున్నారు. మరోలా చెప్పే సందుండుంటే వాళ్ళందరూ ఎంత రాద్దాంతం చేయాలో అంతరాద్దాంతమూ చేసి ఉండే వాళ్ళు.
నా కందిన వార్త ఎంత వరకు నిజమో నాకు తెలీదుగాని, మీ పక్షంలో దీనిని గమనిస్తున్న వారెందరో, నీ వలాటి ప్రకటనెందుకు చేశావు? అని మిమ్మల్ని ఎద్దెవా చేసినట్లూ, ఏదో అలా వచ్చేసింది, ఏమి చేద్దాం? అని మీరన్నట్లూ సమాచారం అందింది నాకు. కనుక ఈ విషయంలో వాస్తవమేమిటన్నది మీకూ తెలుసు, భాషతెలిసి ఖురానును అంతో ఇంతో చదివిన ఇస్లాం పక్షం వారికీ తెలుసు. మీ అందరిదృష్టీ; దీనికో ముగింపుకు రాకుండా చూసి, ఎలా బైటపడాలన్నదే నన్నది దీనిని పరిశీలిస్తున్న వారందరికీ తెలుస్తున్న నగ్న సత్యమే.

ఇప్పటికి ముగింపు

1. ఇస్లాంను విడిచి పెట్టి బైటకు రండి. ఇది నీతికీ, నిజాయితీకి సంబంధించిన సరైన ముగింపు. లేదా!
2. మరోసారి ఖురాన్‌ పరిశీలనకు మీరే బాధ్యత వహించి సిద్దంకండి.
నా ప్రతిపాదన :- వ్యక్తి - సమాజము - ప్రకృతి, అన్నవాటి గురించి ఖురాను ఏమి చెప్పిందో ముందు వెలికి తీద్దాం. ఆపైన వాటి సత్యాసత్యాలేమిలో ప్రయోగరీత్యా పరిశీలిద్దాం.
3. ఈ లోక సంబంధం కాని అంశాలన్నీ బండ విశ్వాసాలే. అట్టివన్నీ మీకూ తెలీని భావాలే.
- సురేంద్ర
గమనిక : మత మార్పిడులు మారణ హోమానికి దారితీస్తాయనడానికి ఇస్లాం ఆదేశాలే గట్టి రుజువులు.
1. పుట్టుకతో ముస్లింగా ఉండి ఇస్లాం నుండి బైటికి వెళ్ళినవాణ్ణి ఖురాను, (హదీసులు) చంపవచ్చు అంటుంది. చంపమంది చంపడమూ జరిగింది.
2. చరిత్రలో జరిగిన మత యుద్ధాలన్నీ, ఖురాన్‌లో యుద్ధాలన్నీ మత యుద్దాలే. అంటే ఆ మతాన్ని అంగీకరించిన - అంగీకరించని వారి మధ్య అకారణంగా జరిగిన యుద్ధాలే.

రంజిత్‌ ఓఫీర్‌


యోచనాశీలురైన పాఠకమిత్రులారా! హైందవ క్రైస్తవం రచయిత ఎక్కడ మొదలెట్టి ఎక్కడకు దిగజారారో క్రమంగా పరిశీలించాక, నాకైతే! అతని దిక్కుతోచని, దయనీయ పరిస్థితి, ఒక వంక జాలి గొలుపుతూ ఉంది. మరోవంక అతనికలాంటి శాస్తి జరగాల్సిందేననీ అనిపిస్తోంది. అమాయకులైన హిందువుల్ని క్రైస్తవంలోకి తోలుకెళ్ళడానికి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించాడాయన?! 'హిందువులెవరూ పట్టించుకోరులే అన్న ఒకే ఒక్క ధీమా' అతని చేత అంతసాహసం చేయించింది.
ఒక ముఖ్య గమనిక :- 1. పనీపాటా లేని రకం, 2. అమాయకుల్ని తమ వైపు ఆకర్షించి స్వార్థ ప్రయోజనాలను పొందాలనుకునే రకం 3. యువత బలహీనతల్ని సొమ్ము చేసుకుందా మనుకునేరకం, అన్న మూడు రకాల వాళ్ళూ; ఎలెక్ట్రానిక్‌ మీడియా, సోషల్‌ మీడియాల పేరున హోరెత్తిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగానూ దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు.
మన ప్రస్తుత విచారణీయాంశంలోని ముఖ్య పాత్రధారి అయిన ఓఫీరుగారు, పై మూడు రకాలలోని రెండవ రకానికి చెందిన వారు. అందులోనూ ఉద్దండులు. సి.డిలు చేసి, టి.వి లలో ప్రసంగించి, పుస్తకాలురాసి, సభలూ సమావేశాలు పెట్టి, అవన్నీ తప్పులేనని తనకే తెలిసిన అబద్దాలను, తనకే తెలీని అనేక విషయాలనూ కలిపేసి తెగతెలిసిన వానివలే; సాధికారిక ప్రతినిధి మాట్లాడినట్లు మాట్లాడేస్తూ, వాటినన్నంటినీ మందినెత్తిన, అమాయకపు మందనెత్తిన గుమ్మరిస్తూ వచ్చారు. డబ్బుకు కక్కుర్తిపడో, బ్రతుకుతెరవుకొరకో దీన్నంతటినీ భుజానికెత్తుకుని అమాయకజనానికి చేర వేసే సొంత మందా కొందరున్నారాయనకు. ఈ రకమైన పన్నాగంలో భాగంగానే ఉనికిలోకి వచ్చిన హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ఆధారంగా ఏమి జరుగుతూ వచ్చిందో సంగ్రహంగా ప్రకటించడానికి ఉద్దేశించిందే ఈ వ్యాసం.
1. హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ప్రచురించి కొద్ది సంఖ్యలో సమాజం పైకి వదిలాడు.
ఎ) దానిని చూచి సొంత మంద అబ్బో తెగబాగుందన్నారు. క్రైస్తవుల్లోనే కొందరు తప్పన్నవారూ ఉన్నారు. బి) ఇతర మతస్థులు - క్రైస్తవేతరులు- ముఖ్యంగా హిందువులు ఒకడూ అరా అదేమిటన్నారో లేదోగాని, ఈయన గారు పునరాలోచించుకునేలా ప్రతిఘటనేమీ రాలేదు. సి) తూ. గోదావరి జిల్లా నుండి ఈ పుస్తకంలోని అభ్యంతరకర అంశాల ఆధారంగా ఒక కేసువేశారు. అంతో ఇంతో పలుకుబడీ సరిపడినంత డబ్బు ఉన్న వాడవడంతో, ఈయనగారు యాంటిసిపేటరీ బెయిల్‌ మంజూరు చేయించుకుని, ఆ కేసువిచారణకు రాకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు.
2. పెద్దగా ప్రతి ఘటనేమీ రాకపోవడంతో మరో అడుగు ముందుకేసి, భారతదేశం మొత్తానికీ సవాలంటూ ఎవరైనాసరే తన హైందవ క్రైస్తవంలో దోషాలు, తప్పులు ఉన్నట్లు రుజువు చేస్తే తానుక్రైస్తవాన్ని విడచి హిందువునవుతాననీ, సవాలు చేసినవారు అలారుజువు చేయకుంటే తన ద్వారా బాప్తిస్మం తీసుకుని క్రైస్తవంలోకి రావలసి ఉంటుందని, ఒక సి.డి ప్రకటనచేశారు. ఆ ప్రకటనలో హై.క్రైస్తవం అన్న తన పుస్తకాన్ని 600 మంది స్వాములకు పంపినట్లు, టి.వీ ద్వారా బహిరంగ చర్చకు పిలుపిచ్చినట్లు చెప్పారు. అయితే ఆ పుస్తకాన్నందుకున్నవారందరూ దానిలో దోషాలున్నాయనేంత శక్తి తమకు లేదని చెప్పినట్లూ, కొందరైతే చాలెంజికి భయపడి పలాయనం చిత్తగించినట్లూ కూడా ప్రకటించేశారు.
సి.డి.రికార్డు రూపంలో ఉన్న ఈ ఆధారంతో, సత్యాన్వేషణ మండలి అన్న సంస్థకు చెంది, వివిధ తాత్విక, మత సిద్దాంత గ్రంథాలను గత 30 ఏండ్లుగా అధ్యయనమూ, తులనాత్మక పరిశీలనా చేస్తూ వస్తున్న పుట్టా సురేంద్ర బాబు అనునేను, ఓఫీర్‌ గారి సవాలును స్వీకరిస్తున్నాననీ, ఎప్పుడు ఎక్కడ వీటిని తేల్చుకోడానికి ఎదురుపడదామో తేల్చి చెప్పమనీ ఒక రిజిష్టరు ఉత్తరం వ్రాసి, ఆ మొత్తాన్ని మా మాసపత్రిక వివేకపథంలో ప్రకటించి, ఆ సంచికను ఆయనకూ, మరికొన్ని మత సంస్థలకు చెందినవారికీ పంపాను. ఆ నా లేఖలోనే సి.డిలో ఓఫీరుగారు ప్రకటించిందెంత వరకు వాస్తవమో; తెలుసుకుందామనుకుని; ఆయనన్న 600 మంది సాధుసన్యాసులు మొ|| వారి పేర్లు, చిరునామాల జాబితా పంపండనీ రాశాను. (మొదటిలేఖ 14.7.2015లోనూ, రెండోలేఖ 12-8-2015న రాశాను)
ఆశ్చర్యం :- దేశం మొత్తానికీ సవాలన్నాయన, సవాలుకు నేను రెడీ అంటున్నా నాకు సమాధానం పంపనూ లేదు. జాబితానూ పంపలేదు. ఈ వివరాలు (వివేకపథం - 218 చేదు నిజాలు - నిష్ఠుర సత్యాలు) లో ఉన్నాయి.
వివేకపథాన్ని చదువుతున్న వారిలో మరి కొందరు రంజిత్‌ ఓఫీరు గారికి వారి సవాలును తామూ స్వీకరిస్తున్నట్లు చర్చకు సిద్దం కమ్మన్నట్లూ రాశామని నాకు తెలిపారు. ఆ మాటలూ వి.పథం - 219 లో ఉట్టంకించాను. అలా రాసిన వారిలో ఏ మతానికి చెందని, డా.బ్రహ్మరెడ్డిగారూ, వైదిక సాంప్రదాయానికి చెందిన మాతాజీ, నిర్మలయోగ భారతిగారు, ధర్మజాగరణ సంస్థకు చెందిన సిద్దాంతిగారు మరికొందరూ ఉన్నారు. వారిలో కొందరైతే సురేంద్ర బాబుతో మాట్లాడితే మాతో మాట్లాడినట్లే, అతని గెలుపోటములు మావిగా అంగీకరిస్తాము అనీ రాశారాయన గారికి. అయినా మన ఛాలెంజర్‌! నిరంతర సత్యాన్వేషి! సత్య సంస్థాపనాభిలాషి! ఈ యుగపు యేసునోరు! అని తనకుతానే కితాబులిచ్చుకున్న రంజిత్‌ ఓఫీరుగారు కిమ్మన్నాస్తిగా గమ్మునున్నారంతే.
ఏమిచేస్తాం! అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో రకంగా ఆయన్ను ముగ్గుమీదకు తేవడానికి రకరకాలుగా యత్నిస్తూనే ఉన్నాను. ఒక దశలో ఒకింత కఠిన భాషనుపయోగించగా, ఫజులుర్రహ్మన్‌గారు, మన వైపుకు తీసుకురావాలనుకున్న వారిని గానీ, ఆలోచింపజేయాలనుకున్న వారినిగానీ ఇలా కఠినంగా మాట్లాడితే మన లక్ష్యమే నెరవేరకుండా పోతుంది కదా! నాకు తెలిసినంతలో ఓఫీర్‌గారు చర్చకు వెనకాడే మనిషికాడు అనన్నారు. అప్పుడు నేను ఏమండీ రహ్మన్‌గారూ! జరుగుతున్నదంతా మీరూ శ్రద్దగా గమనిస్తూనే ఉన్నారు కదా! బైబిలు, ఖురానులనేగాక, హిందూ గ్రంథాలనూ ఎంతో కొంత చూసిన మీకూ బైబిలు - ఖురానుల ననుసరించే అతడు చెపుతున్నది అబద్దం అని తెలుసు, పైగా మీ కాయనతో మిత్ర సంబంధాలూ ఉన్నాయి. రండి కూర్చుని మాట్లాడదాం అనిగానీ, మీ అభిప్రాయాలు సరైనవి కావనిగానీ ఆయనతో మీరే ఎందుకు చెప్పరండీ! అని అడిగాను. ఆయనను వేదికపైకి తీసుకొచ్చే యత్నం - సత్యం కొరకైనా- మీరూ చేయవచ్చు కదా అని అడిగాను. పొరపాటైంది. ఇప్పటి వరకు నేను ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయనను కలిసి విషయం చెప్పి, ఒప్పించే యత్నం చేస్తాను అన్నారు. రహ్మన్‌ గారు అన్నట్లే పట్టుబట్టి ఆయన్ను కలసి, అక్కడి నుండీ నాతో ఫోనులో మాట్లాడించారు. ఫోనులో ఓఫీరుగారు అప్పుడు నాతో మాట్లాడిన నాలుగు మాటల్ని, మీ లెటర్‌హెడ్‌ పై వ్రాసి పంపండని ఓఫీరు గారికే చెప్పాను. రహ్మన్‌గారు ఆ లేఖను నాకు చేర్చారు.
దానిపై; ఆ లేఖలో ఓఫీరుగారు ప్రతిపాదించిన అంశాలు ఎందువల్ల సరైనవికావో అదంతా వివరిస్తూ, మరొక రిజిష్టర్‌ లేఖ ఓఫీరుగారికి రాస్తూ, దానిని వివేకపథంలో ప్రకటించాను. వివేకపథం ద్వారా ఈ వివరాలందుకున్న విశాఖపట్నానికి చెందిన ఒక చిన్నపత్రిక సంపాదకులు కనకరాజుగారనుకుంటా రంజిత్‌ ఓఫీరుగారిని విమర్శిస్తూ ఒక ప్రకటన చేశారు. దానిపై రంజిత్‌ ఓఫీరు గారు మరో ప్రసంగం చేసి, దానిని సోషల్‌ మీడియాలోనూ పెట్టారు. అందులో తాను మామూలు స్థాయి కలిగిన వాణ్ణికాననీ, దారిన పోయ్యేవాళ్ళేదో అంటే స్పందించి, అందుకు సిద్దపడడానికి తానేమీ పనీ పాటా లేని వాణ్ణి కాననీ, జెబ్బలెగరేసుకుంటూ ఏదేదో తెగ మాట్లాడేశారు. సురేంద్రను నా హైందవ క్రైస్తవం పై ఒక విమర్శనాత్మక గ్రంథం రాసి ప్రచురించమన్నాను. అదింకా ఆయన చేయనేలేదు. ఆయన ఆ పుస్తకం రాసి, దానిని నాకు పంపితే, అదంతా చూసి, సురేంద్ర నాతో కుస్తీకి సరిపోతారో లేదో నిర్ణయించి అప్పుడు చెపుతాను అంటూనూ తెగ రెచ్చిపోయి మాట్లాడారు.
ఓపెన్‌ ఛాలెంజ్‌ అన్న ఓఫీరు గారు; సరైతేరా చూసుకుందాం అని సవాలును స్వీకరించిన నాతో నీకేమేమి పట్లు తెలుసో, నన్నెక్కడెక్కడ కొడతావో, ఎలా కొడతావో వివరంగా చెపితే అవన్నీ పరిశీలించుకున్నాక, నీతో కుస్తీ పట్టాలో లేదో చెపుతాను అంటూ చేసిన బుద్ది తక్కువ ప్రతిపాదనను ఆయన పక్షంలోని ఒక్కడంటే ఒక్కడు ఇదేమి పద్దతని అడగలా. ఒకరిద్దరైతే, ఆయనడిగినట్లు అదేదో పుస్తకం రాసేస్తే పోనుగదండీ అని, అమాయకంగా, అంతే తెలివి తక్కువగా తిరిగి నాకే సలహా ఇచ్చారు. అసలా విధానం ఎవరూ అనుసరించగూడనిదే అయినా, నా పోకడలోని బలమూ, ఆయనన్న వాటిలోని డొల్లతనమూ మచ్చు చూపించడం కోసమని, హైందవ క్రైస్తవంలోని '4' అంశాలను ఎత్తుకుని అవి ఎలా తప్పులో వివరించి నిర్ధారించాను. 1. అట్టపైని ముఖచిత్రంలోని దోషమూ, అది తయారు చేయడం వెనుక నున్న కుటిల పన్నాగం 2. లోపలి పేజిలో ముందే ఉన్న 'సత్యమహంగంభీరః' అన్న కొటేషను, దానికి వివరణగా 'సత్య విజయం' శీర్షికన ఆ పుస్తకంలోనే లోపలి రాతలను 3. ఓంకారమే క్రీస్తు అయ్యెను. 4. అట్ట చివరి పేజిలో ఆయనే తన గురించి రాయించుకున్న అతిశయోక్తులు 5. 'భువనస్యనాభిః' అన్న దానిని గురించి ఆయన రాసిన రాతల్లోని తప్పుడు భావాలు. ఈ ఐదు అంశాల సమాచారం ఆయనకు అందజేశాను పత్రిక పంపడం ద్వారా ఇక్కడికే, ఆయన ససంతా పసలేనిదే ననడానికి అవసరమైన కనీసాధారాలు నేను రాత మూలకంగా ఆయనకు అందించ నట్లయింది, స్థాయిల గురించి తెగ వదరిన అయ్య గారికి, ఈ విషయాల వరకైనా నేనేమిటో నసాళానికంటినట్లే. నోరెత్తితే ఇరుక్కుపోతామని స్పష్టంగా తెలిసినట్లే. నేను ఈ వివరాలు చెపుతూ స్థలకాలాలు నిర్ణయించండి. క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడే వేదికకు రండి. ఇంకా మరికొన్ని అంశాలూ విచారించి మీ పుస్తకమెంత అసత్యాలతో, కల్పనలతో, కూడి ఉందో, దానిని సిద్దం చేసిన మీ మనస్సులో ఎంత కల్మషం ఉందోనూ రుజువు చేస్తాను అనీ ప్రకటించాను. ఆయనకు పరిస్థితేమిటో తెలిసిపోయిందనుకోండీ ఆయన అంతటోడింతటోడంటూ భుజాలకెత్తుకుని, వీరంగం వేసే వారైనా, రాన్నా! నీ ప్రతాపం చూపించు, లోకానికి నీవేమిటో, నీ పసేమిటో తెలియపరచు అని అతణ్ణి వత్తిడి చేయవచ్చుకదా!
ఈ మధ్య ఆయన గారిదే మరో ప్రసంగం, వాట్సాప్‌ ద్వారా నాకు చేరింది. కరుణాకర్‌ సుగుణ అన్నతను, దానిని నాకు పంపాడు. అది చూశాక నాకు 1. పెద్దగా నవ్వుకోవాలనిపించింది. 2. అతని అనుచరగణాన్ని పిలిచి ఈ బేల ప్రార్థన లేమిటి? అని అడగాలనిపించింది. మరో వంక అతని దిక్కుతోచని పరిస్థితీ, దీనాలాపములను బట్టి జాలీ కలిగింది. ఆ వివరాలివిగో? మామూలుగానైతే ఎంతో హుందాగా, డాబుదర్పంతో, అహంభావిగా ట్రిమ్ముగా కనపడే ఓఫీరుగారు దిగులుగా, జబ్బుపడ్డమనిషిలా, మ్లానవదనంతో, తెగ ఆవేదనపడుతున్న ముఖ భంగిమతో మాట్లాడినట్లుంది అందులో. ఓడిపోయినవాడూ, దెబ్బతిన్నవాడూ, తిరిగి ఏమీ చేయలేని స్థితిలో ఏమి మాట్లాడతాడో, ఎలా ఉంటాడో అన్న దానికి గట్టి రుజువుగా ఉందా రికార్డులోని ఆయన తీరు 1. ప్రేమగలిగిన మా మహా పరిశుద్ద తండ్రీ! అని మొదలైందాయన ప్రసంగం.
2. సువార్త విరోధులను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రీ! వారిని నష్టపరచండి, భయపెట్టండి తండ్రీ!
3. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి! ఏసుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇదంతా జరిగిందని తెలుసుకుని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. (ప్రక్కనున్న మంద ఆ మేన్‌ అని అరుస్తున్నారు)
4. రెండవ కీర్తన 4, 5 వచనాలలో చెప్పినట్లు ప్రచండకోపంతో దిగివచ్చి ఏసునాథా వాళ్ళను తల్లడిల్లజేయమని ప్రార్థన చేస్తున్నాం.
5. రెండవ కీర్తన నెరవేర్చండి! ప్రచండకోపంతో దిగిరండి! తండ్రీ నీకు స్త్రోత్రాలు. ఈ దేశంలో, మా దేశంలో, ప్రపంచ దేశాలన్నంటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్లజేయండి.
6. వడగండ్ల వాన కురియునుగాక! భూకంపములు వచ్చునుగాక! సువార్త విరోధుల శిబిరాలు కుప్పకూలిపోవునుగాక! (చప్పట్లు)
7. ప్రభువా! మనుషులేపాటి వారునాయనా! నీవు దేవదేవుడివి. దిగిరా తండ్రీ! మేం ఒప్పుకోం! నీవు రాకుంటే ఒప్పుకోం! మా ప్రాణాలడ్డు వేసి అడుగుతున్నాం. భారత దేశానికి దిగి రండి ఏసయ్యా! నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్ము తెలియపరచుకోడానికి క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు వచ్చావు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 ఏండ్ల నాడు మళ్ళీ రాతండ్రీ! అప్పుడు వచ్చి వేదాలలో నిన్ను గూర్చి రాయించావు. దానిని కాదంటున్న వాళ్ళను తల్లడిల్లజేయడానికి మళ్ళా దిగిరాతండ్రీ!
పాఠక మిత్రులారా! ఇదండీ ఆ ప్రసంగంలోని విషయం -ఓఫీరుగారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనడానికి దీనంతటినీ పరిశీలిస్తున్నవారికి ఎట్టి అభ్యంతరమూ ఉండదను కుంటాను.

సమీక్ష

ఎక్కడ, ఏ గొంతుతో, ఎంత ఆర్భాటంగా, అహంభావంతో మొదలైందాయనగారి ఛాలెంజి ప్రకటన?!
1. 600 మందికి పుస్తకం పంపాం, టివిలలో బహిరంగ చర్చకు ఆహ్వానించాం, పెక్కురు స్వాములకు, అర్చకులకు పంపాం. దానిలో తప్పుందనడానికి ఒక్కడూ సాహసించలా, కొందరైతే తమకంతశక్తి లేదన్నారు. కొందరైతే పారిపోయారు. నేనైనా సత్యం చెపుతా, మీరైనా సత్యం చెప్పండి. నేనైనా హిందువునవుతా మీరు క్రైస్తవులైనా అవ్వండి. అదో యిదో, దేనికైనారెడీ! ఇదీ! ఆనాటి ఆయన గారి ధీమా, దూకుడుమాట.
2. సవాలు స్వీకరిస్తున్నామన్న నాలాటి వారి పిలుపుకు సమాధానంగా, నన్నడిగిన వారి లెవలెంత? నాలెవలేంటి? వారికి పనీపాటా లేకుంటే, నాకూ పనీ పాటా ఉండవా? నేనన్న ప్రతిదానికీ రుజువులతోటీ పుస్తకంరాశాను. అలాగే వారు వాటన్నంటినీ అంశాల వారీగా తప్పు బట్టి, రుజువులతో సహా ఒక పుస్తకం రాసి నాకు పంపాలి. దానిని చూశాక, వారికి మాట్లాడదగ్గ స్థాయి ఉంటేనే చర్చ. దారిన పొయ్యేప్రతి వానికి బదులిస్తామా?! ఇదండీ! ఆయన గారి మలి ప్రసంగపురీతి. ఇందులో వెనకటి డాంబికతతో బాటు ఒకింత మేకపోతు గాంభీర్యమూ జతైంది. ఎందుకంటే?
1. అప్పటికే ఆయనగారి అనుచరుడూ, నాకు పరిచయస్తుడూ అయిన జగదీష్‌ గారికి, బైబిలును పరిశీలిస్తున్న అనేకులున్న సభలోనే, హైందవ క్రైస్తవంలోని ''భువనస్య నాభిక'' అన్న అంశాన్ని చూపించి, వేదంలోని ఆ భాగాన్ని, దానికి ముందు వెనకలనున్న భాగాలనూ, ఆ సూక్తానికి దాశరధి గారు చెప్పిన అనువాదాన్ని, దయానందుడు చెప్పిన అర్ధాన్నీ, ఆ సందర్భాన్నీ వివరించి, రంజిత్‌ ఓఫీరు గారు ఎంత అడ్డగోలుగా, ఆ సూక్తానికి, ఆమంత్రానికి రాని అర్ధాన్ని దాన్నెత్తిన పెట్టారో విడ మరచి చూపించి, అయ్యా ఈ విషయం మీరు ఓఫీరుగారి దృష్టికి తేవడం కొరకే ఇంత సమయాన్ని, శ్రమను ఖర్చు పెట్టాను అని చెప్పాను. దాంతో పాటు పైన పేర్కొన్న నాలుగంశాలపైనా, ఓఫీరుగారిది ఎంత పెడపోకడోనూ వివరించి ప్రకటించాను. ఇదంతా గమనించిన ఆయన గారికి సురేంద్రతో ముడిపడిన ఈ కేసు మిగిలిన కేసుల్లాటిది కాదన్నంతవరకైనా తట్టే ఉంటుంది. ఈ వివాదాన్ని పరిశీలిస్తూ ఆయననూ, నన్నూ ఎరిగిన వారు కొందరు నా గురించీ, నా పోకడ గురించి కొద్ది మాత్రమైనా ఆయన గారికి సమాచారం అందించే ఉంటారు.
3. ఇక మూడో ప్రసంగం యథాతథంగా పైన వ్రాశాను. ఎవరొస్తారో రండి నా తడాకా చూపిస్తాను అన్న ఆరంభం నుండి, శాపం పెడుతున్నాననీ, శాపం అమలయ్యేలా నీవే చూడాలి తండ్రీ! అనీ, అదంతా అవుతుందో లేదోనని తనకే అనుమానం వచ్చి, నీవే దిగిరా తండ్రీ అనీ, మామూలుగా పిలిస్తే వస్తాడో లేడో నన్న అనుమానంతో, రాకుంటే ప్రాణాలు తీసుకుంటామనీ, దయనీయంగా దేబిరించుకొనే స్థితికి దిగజారిందాయన గుండె నిబ్బరం. పైగా వచ్చి ఏమి చేయాలట ఆ ఏసు!? పిడుగులు, భూకంపాలు, గాలివానలు, అగ్ని కీలలు, శిబిరాలు నాశనం చేయడాలు, అమ్మో అమ్మో ఏసు చేత ఎన్ని పనులు చేయించాలనో ఈ ఓఫీరుగారి ఆక్రోశం? ఎంత క్రోధం? ఎంత నిస్సహాయ స్థితి? ఎంత కౄరత్వం? ఎంత వినాశకర దృక్పథం? సువార్తను కాదంటే, అట్టి వారికి ఇంత జరగాలన్నమాట! బలే ఏసునోరే! ఈ యుగానికి ఏసు ఎంచుకున్న (నియమించిన) అపొస్తులుణ్ణి తానేనని ప్రకటించుకున్నాయన, ఏసు నామాన ఏదంటే అది జరుగుతుందన్న ఏసు వాక్యాన్ని నమ్మి, ఆయనే, ఏమి జరగాలో చెప్పక, నీవేరావాలి తండ్రి! వాళ్ళతో కొట్లాడు, వాళ్ళను తన్ను, వాళ్ళే తంతే తన్నించుకో అన్నట్లు ఈ నాటకీయ ప్రసంగాలెందుకు? నన్ను కొడితే కొట్టావు, నా ఏసును కొట్టు చూస్తాను అన్న పోకడన్నమాట ఇది. ఈ గ్రంథంలోనే మరోచోట, నా రచనపై వచ్చిన ప్రశంసలూ ఏసుకే, తిట్లూ ఏసుకేనని, తెగబడి మాట్లాడేశారీయనే.
హలో రంజిత్‌ ఓఫీరుగారూ! ఒక్కమాట! మీ వేళా కోళం కాకుంటే పిల్లి శాపాలకు నల్లరాళ్ళు పగులుతాయటండీ ఎక్కడైనా? ఉడత ఊపులకు ఊడలమర్రి ఊగుతుందటండీ! మరీ చోద్యం కాకుంటేనూ? ఇంతకూ యేసన్నాయన దగ్గర మీకున్న పరపతెంతట? మీ రాతల ప్రకారమే వేదాలను అనువదింపజేయమని అదేపనిగా రెండు దశాబ్దాలపాటు మొత్తుకోవలసి వచ్చింది. అప్పటికీ ఆయన పట్టించుకోలా! మరెందరినో అదే ప్రార్థన చేశారని మీరే సెలవిచ్చారు. అదన్నమాట, యేసు దగ్గర మీ మాటకున్న పవరు. ఎందుకండీ పసలేని ప్రగల్భాలు? ఆ పెట్టే శాపాలేవో వాటిని మీ వరకు పరిమితం చేసుకోక, ముగ్గులోకి యేసునెందుకు లాగారు? మీకు లాగానే ఆయనకూ అంత పసేమీ లేదని తేల్చడానికి తప్ప మరెందుకూ పనికిరావవి. మీరనే ఆ యేసుకు ఆయనకాయన చేసుకోడానికేదిక్కులేదు. తండ్రిని పదే పదే బతిమాలుకున్నాడు. కడకు తండ్రి వచ్చేదిలేదు, ఈయన్ను కాచేదీలేదన్న నిర్ణయానికి వచ్చి; నీ చిత్తమెలాగైతే అలాగే కానీమని ఒక నిర్వేదపు నిర్ణయానికి వచ్చాడు. వేదన తట్టుకోగలిగినంత తట్టుకున్నాడు. తట్టుకోలేనప్పుడు, ఓనా తండ్రి! నన్నేల చేయి విడిచితివని, తలవేలాడేశాడు. ఇదంతా వాస్తవమని బైబిలు చెప్పేదేకాని, ఈనాటి మేమేమి (ఎవరూ) కల్పించిందికాదు గదా. ఆయనకే దిక్కులేదు. దిక్కనుకున్నవాడు వచ్చిందీలేదు. అనంతరం ఈయన వారుగా చెప్పబడినవారు (శిష్యులు) హింసించి చంపబడుతున్నప్పుడూ ఆయన వచ్చిందీలేదు. రక్షించిందీ లేదు. ఇదంతా బైబిలు అందిస్తున్న సమాచారమే.
నా పేరున మీరేది చెపితే అది జరుగుతుందన్న యేసుమాట సత్యమో కాదో తేల్చుకుంటానికైనా, ఆనాటి ఈయన శిష్యుల్లో ఎవరో ఒక్కరైనా తమని బంధించినప్పుడో, శిక్షిస్తున్నప్పుడో చంపుతున్నప్పుడో అయినా, ఆ పనికి పూనుకున్నవారు చావాలనో, కనీసం కాళ్ళూ చేతులూ పడిపోవాలనో అనైనా ఎందుకు అనలేదు? హలో మన పిచ్చిగాని, అనకపోవడమేమిటండీ! వందలసార్లు మనస్సులోనైనా అనుకునే ఉంటారు. కానీ అవన్నీ ఏసు అన్న కాకమ్మకబుర్లేనని అలా అనుకున్న వారికల్లా అనుభవంలోకివచ్చి ఉంటుంది. కడకు ఏమి చేయలేక నిస్సహాయంగా ప్రాణాలు విడిచారు వాళ్ళంతా. దీన్నంతటిని ఏమీ పట్టించుకోకుండా, పిల్లి శాపాలు పెడుతున్నారు రంజిత్‌ ఓఫీరుగారు, వీరి శాపాలకు చిరిగిపోయిన కాగితపు ముక్కైనా కదలదు. ఏసు పేరుపెట్టి గాండ్రిద్దామని మరో ఓపికలేని ప్రయత్నం చేశారు. పాపం అదీ గాండ్రింపు శబ్దాన్ని పుట్టించక, మొరిగినట్లు చప్పుడైంది. (తొడగొట్టడమెక్కడ? చేతులెత్తేసి దేబిరించడమెక్కడ?).
ఏమండీ ఓఫీరుగారూ! ఈ మీ శాపం ఎన్నాళ్ళకి ఆచరణలోకి వస్తుందండీ! టైం చెప్పగలరా? ఆ మీ ఏసును నీవుగాని రాకపోతే చస్తాము అనీ అనేసి మరీ పిలిచారు గదా? ఎంతకాలానికి వస్తాడండీ ఆయన?! పైగా భారత దేశానికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా? అందులోనూ మీ అంతరంగంలో ఆంధ్ర, తెలంగాణాలే ఉండుండాలి. అందునా సురేంద్ర - హైందవ క్రైస్తవంతో ముడిపడి మాట్లాడిన వాళ్ళే ఉండుంటారు. వీళ్ళ మీద, పిడుగులు, భూకంపాలు, తుఫానులు, అగ్నివర్షాలు, వడగళ్ళ వర్షాలు, శిబిరాల కూల్చివేతలు, వ్యాపారాలలో నష్టాలు, అబ్బో, అబ్బో, ఎన్నో, ఎన్నెన్నో! ఎప్పటికి పూర్తి చేస్తాడండీ మీ ఏసు వీటన్నింటినీ? దానికైనా ఒక కాలాన్ని - ఆయన్నడిగైనా సరే - ప్రకటించు ఆ తరవాతైనా క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడు.

మండలి జ్ఞాన సిద్దాంతము - ప్రమాణ - పదార్థ విద్య

 ఉపోద్ఘాతము :- యోచనాశీలురైన చదువరులారా!
మన జీవితాలను జాగ్రత్తగా గమనించితే, అది రెండు ప్రధాన విభాగాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకటి జ్ఞాన భాగం కాగా రెండోది కర్మభాగం. ఈ అంశాన్నే తాత్వికులు జ్ఞానకర్మ సముచ్చయం మానవ జీవితం అన్న సూత్రం ద్వారా చెపుతారు. ఎదురుపడిన మరియు అవసరమైన విషయాలను తెలుసుకుంటూ, అలా కలిగిన జ్ఞానాధారంగా అవగాహన పెంచుకుంటూ, దానిని జీవితానికి అన్వయించుకుంటూ, జీవితాన్ని సాగిస్తుంటాం మన మందరమూ. అంటే జ్ఞానం మన జీవితంలో మార్గదర్శక పాత్ర (నడిపించే పాత్ర)ను పోషిస్తుంటుందన్నమాట. ఇది ఎవ్వరమూ కాదనలేని, నిత్యమూ జరుగుతుండే వ్యవహారమే. గాఢనిద్రలోనూ, స్పృహ కోల్పోయినప్పుడు తప్ప ఇది ఒక నిరంతరాయ ప్రక్రియే. మన శరీరాన్ని పరిశీలించినా అది తల (మెదడు) చేసే పనీ, మిగిలిన శరీరం చేసే పని అన్న రూపంలో రెండుగా ఉంటుంది. అందులో ప్రస్తుతం మనం విచారణకు - అధ్యయనానికి - ఎంచుకున్న అంశం జ్ఞాన భాగానికి చెందింది. (పారిభాషికంగా దీనిని జ్ఞాన క్షేత్రానికి చెందింది అనీ అనవచ్చు) అందుకే దీనికి 'జ్ఞాన సిద్దాంతం' అన్న పేరు వచ్చింది. అంటే జ్ఞానంతో ముడిపడి ఉన్న అనేకాంశాలను గురించిన సిద్ధాంతం అని.
  • మన శరీర నిర్మాణంలోనే, తెలుసుకోడానికి, ఆ తెలుసుకున్నది నిలిపి ఉంచుకుని, తిరిగి ఉపయోగించుకోడానికి అవసరమైన పరికరాలు, వాటి అమరిక అవి పని చేసే (తీరు) పద్దతి అన్నవి పుట్టుకతోనే ఏర్పడి ఉన్నాయి. ఈ మొత్తాన్నే మెదడు, జ్ఞానేంద్రియాలు, నాడులు అన్న మూటితో కూడిన నాడీ మండల వ్యవస్థ అంటున్నాము. జ్ఞాన సిద్ధాంతం అన్నది జ్ఞానమనగానేమి? తో మొదలై, కలిగిన జ్ఞానం సరైందా? కాదా? అన్న సత్యాసత్య విచారణతో ముగుస్తుంది. దీనిని గుర్తులో ఉంచుకోండి.
  • జ్ఞానమేర్పడుతున్న క్రమమేమిటి? ఎన్ని రకాల జ్ఞానం కలుగుతుంది? జ్ఞానాన్నార్జించడానికి- ఆయా విషయాలు తెలుసుకోడానికి - ఎన్ని రకాల పరికరాలున్నాయి? ఎన్ని రకాల విధానాలున్నాయి? తప్పు జ్ఞానము, ఒప్పు జ్ఞానము (పారిభాషికంగా భ్రమ - ప్రమ అనంటారు వీటినే) అంటే ఏమిటి? శరీర నిర్మాణంలోనే పరికరాలు - విధానములన్నవి అమరి ఉండగా, కొన్నిసార్లు తప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? మరికొన్ని సార్లు ఒప్పు జ్ఞానం ఎందుకు కలుగుతోంది? తప్పు జ్ఞానం కలక్కుండా, ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఉండాలంటే తీసుకోవలసిన, తీసుకోగల జాగ్రత్తల మాటేమిటి? కలిగిన జ్ఞానం సరైందేనో కాదో తెలుసుకునే (నిర్ధారించుకునే) పద్దతేమైనా ఉందా? ఉంటే అదేమిటి? జ్ఞానం యొక్క పాత్రేమిటి? తప్పు జ్ఞానం వల్ల జరిగే ముప్పేమిటి? ఒప్పుజ్ఞానం వల్ల ఒనగూడే (మేలు) మెప్పేమిటి? లాటి వాటి నన్నింటినీ విచారించి వివరిస్తుందీ జ్ఞాన సిద్దాంత శాస్త్రం .ఆంగ్లంలో దీనిని థియరీ ఆఫ్‌ నాలెడ్జి అనీ ఎపిష్టమాలజీ అనీ పిలుస్తున్నారు.
  •  దీన్నంతటినీ మేము ప్రమాణ వివేచన అంటున్నాము. జ్ఞాన సిద్దాంతంలో ఒక పార్శ మిదికాగా, రెండో పార్శాన్ని పదార్ధ వివేచన అంటున్నాము. అందులో కలుగుతున్న జ్ఞాన రాశినంతటినీ ఎన్నిగా విడదీసి (ఉపరాశులుగ చేసి) పెట్టుకుని, వినియోగించుకోవచ్చు అన్నది ఇతివృత్తంగా ఉంటుంది. అందుకే మండలి దీనిని 'పదార్ధ వర్గీకరణ' అన్న పేరుతో వ్యవహరిస్తోంది. (పిలుచుకుంటోంది)
  •   కనుక మండలికి సంబంధించినంత వరకు మండలి జ్ఞాన సిద్దాంతంలో ప్రమాణ వివేచన, పదార్ధ వివేచన అన్న రెండు పార్శ్వాలుంటాయి.
జ్ఞాన సిద్దాంత క్షేత్రానికి సంబంధించినంతలో, గతంలో - ఇప్పటి వరకు - దీని విషయంలో జరిగిన పరిశోధనలూ, అందువల్ల వెలువడిన వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన తాత్విక ధోరణులకన్నింటికీ, వాటి వాటికి సంబంధించిన జ్ఞాన సిద్దాంతాలూ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకస్థాయి కలిగిన తాత్వికులందరూ, తమతమ సిద్దాంతాలను (తాత్విక భావజాలాన్ని) ప్రకటించే సందర్భంలో, తమదైన జ్ఞాన సిద్దాంతాన్నీ ప్రకటించారు. అంటే తామంగీకరిస్తున్న ప్రమాణాలనూ - పదార్ధాలనూ ప్రకటించారన్నమాట.

ఉదాహరణకు :- న్యాయదర్శనకారుడు తనకు నాలుగు ప్రమాణాలనీ, 16 పదార్ధాలనీ చెప్పగా వైశేషికుడు ప్రమాణాలు మూడనీ, పదార్ధాలు ఆరనీ ప్రకటించాడు. ఇక యోగదర్శన కారుడూ సాంఖ్యదర్శనకారుడూ తమకు ప్రమాణాలు మూడన్నారు. సాంఖ్యుల ప్రకారం పదార్ధాలు 25. సాంఖ్యయోగ దర్శనాలు రెంటినీ ఒక కట్టగా చూస్తుందీ దేశ సాంప్రదాయం, కనుక యోగుల పదార్ధాలూ సాంఖ్యాన్ననుసరించేనని అనుకోవచ్చు. పూర్వోత్తర మీమాంసాకారులు '6' ప్రమాణాలనంగీకరిస్తారు. జడచేతనాలన్న పదార్ధాలనంగీకరిస్తారు. శంకరుడు వ్యవహారంలో '6' ప్రమాణాలనూ, నాలుగు పదార్థాలను అంగీకరిస్తాడు. ఇక కొందరైతే, పదార్ధ వర్గాలను ప్రత్యేకంగా పేర్కొనకున్నా, వారి వారి ప్రమాణాలను మాత్రం పేర్కొన్నారు. మరికొందరు ప్రత్యేకంగా వాటి పేర్లను పేర్కొనకున్నా, వారి సిద్దాంతాలను జాగ్రత్తగా పరిశీలిస్తూపోతుంటే, వారూ ప్రమాణాలను, పదార్ధాలను ప్రస్తావించారన్న విషయం అన్యాపదేశంగా కనపడుతూనే ఉంటుంది.
           ఏదేమైనా ఈ విషయంలో స.మం తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని విస్పష్టంగా ప్రకటిస్తోంది. మండలికి ప్రమాణాలు మూడు. పదార్ధ వర్గాలు ఐదు అదనంగా పదార్ధాల ఉపవర్గీకరణొకటీ ఉంది మాకు. వివరాలు లోపలి పుటల్లో ఆయా శీర్షికల క్రింద విపులంగా వివరించాను. వాటిని అక్కడ గమనించండి.
        శరీర నిర్మాణంలోనే అమరి ఉండి, పుట్టిన దగ్గర నుండి పని చేస్తూ వినియోగపడుతూనే ఉన్న జ్ఞానేంద్రియ వ్యవస్థ స్వరూప స్వభావాలు మరియు దాని పనితీరు తెన్నుల గురించిన సిద్దాంతరాద్దాంతాల అవసరమేమొచ్చింది? వాటి వాటి పనులు అవి చేస్తూనే ఉంటాయి కదా? అన్నప్రశ్న వేసుకుని పరిశీలిస్తే ఆయా వాస్తవాల గురించిన ఎన్నో వివరాలు మన అవగాహనలోకి వస్తాయి. అలాగే ఆయా సందర్భాలలో ఈ వ్యవస్థను నేర్పరితనంతో ఎలా వినియోగించుకోవచ్చోనూ అర్ధమవుతుంది.
        జ్ఞానేంద్రియాల ద్వారా ఆయా విషయాలకు సంబంధించి మనకు కలుగుతున్న జ్ఞానం రెండు రకాలుగా ఉంటోంది. ప్రపంచంలో ఉన్న వస్తువుల గురించి అవెలా ఉన్నాయో అలానే తెలియడం, అవెలా ఉన్నాయో అలాకాక, మరోలా తెలియడం జరుగుతోంది. వీటినే యదార్ధ జ్ఞానం అయదార్ధ జ్ఞానం అంటారు. ఒప్పుజ్ఞానం - తప్పు జ్ఞానమన్నా, ప్రమ - భ్రమ అన్నా సత్యం - అసత్యం అన్నా ఉన్నది ఉన్నట్లు తెలియడం, లేనిది ఉన్నట్లో, ఉన్నది ఉన్నట్లు కాక మరోలానో తెలియడం అన్నా ఒకే అర్ధాన్నిస్తాయవన్నీ. అంటే జ్ఞాన సిద్దాంత క్షేత్రంలో వాటిని పర్యాయ పదాలుగా వాడవచ్చన్నమాట.
  •   వాడుకలో, వాస్తవం, యథార్ధం, సత్యం, నిజం అన్న పదాలు ఒకే అర్ధంలో వాడేస్తూ ఉంటారు. (వినియోగించడం కనపడుతుంది) కానీ జ్ఞానసిద్దాంతం ప్రకారం ఆ పదాలుదేని అర్ధాన్ని అవి కలిగి ఉన్నాయి. ఒక్కో పదం ఒక్కో దగ్గర మాత్రమే వాడవలసినదిగా ఉంటుంది. అంటే దేని అర్ధం దానిదేనన్నమాట.
  •   అలాగే మనమెవరమైనా ఒక విషయాన్ని గురించి, ఎవరో ఒక తను చెప్పింది విని, అది నీకెలా తెలిసింది అనిగానీ, అది నిజమేనని ఎలా చెపుతున్నావు అనిగానీ మరొకరు - మనం - అడిగామనుకోండి. దానికతడు, అది నేను స్వయంగా చూసి చెపుతున్నాననో, స్వానుభవం ద్వారా తెలుసుకుని చెపుతున్నాను అనో అనగానే, అతడు చెప్పింది సరైందేనన్న నిర్ణయానికి సాధారణంగా వచ్చేస్తుంటారు (ము). కానీ జ్ఞాన సిద్దాంతం, ఒక వ్యక్తి చూసి చెపుతున్నానన్నంత మాత్రాన, లేదా స్వానుభవం ద్వారా చెపుతున్నా నన్నంతమాత్రాన, అతనన్నది సత్యమేనని (యథార్ధమేనని లేదా ఉన్నదేనని) నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే ప్రత్యక్షంలోనూ భ్రమలుండే అవకాశం ఉంది గనుక, కలిగిన జ్ఞానం సరైందో కాదో కూడా తేల్సుకున్నాకనే అంతిమ నిర్ణయానికి రావలసి ఉంటుందన్న జాగ్రత్తనూ జత చేస్తుంది. సరైన రీతిలో తెలుసుకోవడమంటే ఏమిటో, అలా తెలుసుకున్న దానిని, మరలా సరైన రీతిలో సరిచూసుకోవడమెలానో కూడా వివరించి, అభ్యాసరూపాన్నీ జోడించిన జ్ఞానసిద్దాంతమే సరైందీ, సమగ్రమైనదీ అవుతుంది. అత్యంత కీలకమైన ఈ సాధారణ సూత్రాన్ని అర్ధం చేసుకుని, ఆయా సందర్భాలకు అన్వయించగలిగే నైపుణ్యం - సామర్ధ్యం - సంపాదించుకోకుంటే, జీవితంలో ఎదురుపడే మౌలికమైన కీలకమైన సందర్భాలలో సరైన నిర్ణయాలకు రావడం కష్టమవుతుంది.
    వెనుకటి తాత్వికులలో కొందరు ఈ విషయాన్ని నిర్వహించగల విలువైన పాత్రను సుస్పష్టంగా గమనించారుగనుకనే దీనికి సంబంధించిన ఒక సాధారణ సూత్రం ఉనికిలోకి వచ్చింది.  
      సూ :- 'కాణాదం - పాణినీయంచ సర్వ శాస్త్రోపకారకం'
      సాంప్రదాయంలో కాణాదం అంటే తర్కశాస్త్రమని, పాణినీయమంటే వ్యాకరణ శాస్త్రమని రూఢి. తర్కశాస్త్రము - వ్యాకరణ శాస్త్రములన్నవి సర్వ శాస్త్రాలకు ఆధారంగానూ, ఉపబలకంగానూ పని చేస్తాయన్నది సూత్రార్థం. అవి లేకుంటే ఏ సిద్దాంతాన్నీ రూపొందించలేమన్నది నిజం.
       వారెవరో సూత్రీకరణ చేశారనిగాక, మనలో ఎవరం, ఎప్పుడు, ఈ అంశాన్ని పరిశీలించి చూసినా, ఏరకమైన సిద్దాంతాలు రూపొందించాలన్నా, ఆ సిద్దాంతకారులకు తార్కిక శక్తీ, భాష మీద పట్టు తప్పనిసరి అన్నది తెలిసిపోతుంది.
       అంతేకాక, వ్యక్తి జీవితంగానీ, సామాజిక గమనం గానీ, వాటివాటికున్న జ్ఞానము, అవగాహనల ననుసరించే సాగుతుంటాయన్నది మనందరి అనుభవంలో ఉన్నదే. కనుక, కేవలం శరీర నిర్మాణంలో అమరి ఉన్న ఆయా జ్ఞానార్జనా పరికరాలు, అవి పని చేయగల తీరు వాటి సామర్ధ్యాలను సహజ స్థితిలోనే ఉంచితే వాటి వినియోగం చాలా పరిమితమైందిగానూ, దాదాపు జంతు దశతో సమానంగానే ఉంటుంది. ఎలా మనకున్న కరచరణాది అవయవాలను, ఒక క్రమ పద్దతిలో శ్రమకు, శిక్షణకు లోను చేస్తే అలాటి పరిశ్రమ చేయనివారికంటే, ఎన్నో పనులు, ఎంతో ఎక్కువ పని తక్కువ శ్రమతో, నైపుణ్యంతో (చక్కగా) చేయగలగడం జరుగుతుందో, అలానే, జ్ఞానక్షేత్రంలోనూ మనకున్న పరికరాలను ఒక క్రమ పద్దతిలో, శిక్షణకులోను చేస్తే అవీ అధిక సామర్ధ్యాన్ని నైపుణ్యతనూ సంతరించుకుని, తక్కువ శక్తితో ఎక్కువ పని, చక్కగా చేయగలుగుతాయి. కనుకనే జ్ఞానక్షేత్రానికి సంబంధించినవే అయిన ఏ సిద్దాంతాలకైనా మేధో సామర్ధ్యమూ, భాషావిజ్ఞత అన్నవి సహకార శక్తులవుతాయన్న సూత్రం ఏర్పడింది.
  •   మెదడు - జ్ఞానార్జనా వ్యవస్థ కంతటికీ ప్రధానమైనదీ, కీలకమైనదీ అయిన మెదడు - పనితీరు మరింత శక్తివంతం కావడానికీ, నైపుణ్యతను సంతరించుకోడానికీ, మేధో సామర్థ్యాన్ని పెంచే క్రమబద్ధమైన అభ్యాసం చేయాల్సి ఉంటుంది. జ్ఞాన సిద్దాంతంలో అందుకు కావలసిన విధివిధానాలు, అభ్యాస ప్రక్రియలూ చెప్పబడి ఉంటాయి.
  •   మెదడు చేసే పనుల్ని ప్రధానంగా ఐదుగా చెప్పుకోవచ్చు.
         1. గ్రహణ 2. ధారణ 3. స్మరణ 4. చింతన 5. సృజన అనంటారు వాటిని, ఈ ఐదు రకాల పనులను ఒక క్రమంలో అభ్యాసం చేయించితే మేధోసామర్ధ్యం పెరుగుతుంది. జ్ఞాన క్షేత్రంలో మెదడు చేయాల్సిన పనుల విషయంలో దీర్ఘకాలం పాటు వ్యాయామం - పరిశ్రమ చేయించగలిగితే మేధావిత్వం సిద్ధిస్తుంది. అంటే గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం గుర్తుకు తెచ్చుకోవడం, చక్కగా ఆలోచించగలగడం, సృజనాత్మకత, ఊహాశక్తి పెరగడం జరుగుతాయి. వీటినే మేధోసామర్ధ్యాలనేది.
కనుకనే 'లక్షణ ప్రమాణ విద్య' అనేది అభ్యాస విద్యల కోవకు చెందిందైయ్యింది.
గమనిక :- జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచనా అన్న రెంటినీ కలిపే మేము లక్షణ ప్రమాణ విద్య అనంటున్నాము. అది అభ్యాసిక విద్య కనుక, వింటేనో చదివితేనో, చూస్తేనో రాదు. నేర్పితేనే అలవడుతుంది. అభ్యాసిక విద్యలనదగ్గవేవైనా పనితో ముడిపడి, పని ద్వారానే తెలియడం, చేతనవడం జరుగుతుంది. కనుకనే సాంప్రదాయం తర్క విద్యను నేర్చడానికి (తెలుపడానికి కాదు, నేర్పడానికి) దీర్ఘ కాలం నేర్పేవాని దగ్గరుండి నేర్వాలి అనంటోంది. గతంలో 10, 15 ఏండ్ల నుండి 20, 30 ఏండ్ల పాటు దీనిని అభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు.
అనేక మంది తాత్వికులు వారివారి దృష్టి కోణం నుండి ఎవరి జ్ఞాన సిద్దాంతాన్ని అంటే ప్రమాణాలను పదార్ధాలను, వారు ప్రకటిస్తూ వచ్చారు. అవన్నీ లభ్యమవుతుండగా, ఈనాడు మళ్ళా నేను మండలి జ్ఞాన సిద్దాంతమంటూ మరోదాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న అధ్యయన పరుల్లో కొందరికైనా వచ్చే అవకాశం ఉంది. రెండు రకాలుగా దీనికి సమాధానం చెప్పుకోవచ్చు.
1. ప్రతి తాత్వికుడూ లేదా తాత్వికులెందరో అప్పటికే అంతకు ముందటివారు రూపొందించిన జ్ఞాన సిద్దాంతాలున్నప్పటికీ, తానూ తనదైన జ్ఞాన సిద్దాంతాన్ని ఎందుకు తయారు చేసి సమాజం ముందు పెట్టినట్లు? ఏ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరచన చేసినట్లు?
శాస్త్రీయ రచనలు చేసే సందర్భాలలో, ఒక సాంప్రదాయం అమలవుతోందీ దేశంలో, రచయిత తన రచన యొక్క అవసరాన్ని తెలిపే సందర్భం అది. రచనలో అపూర్వత - అప్పటి వరకు లేనిదేదో ఉండడం - ఉండాలి.
గమనిక :- ఈ అపూర్వత - ఇంతకు పూర్వపు వాటిలోలేని కొత్తదనం - అనేక రూపాలలో ఉండవచ్చు. ఉదా :- వెనకటి వాటిలోని దోషాలను - లోపాలనూ ఎత్తి చూపుతూ, వాటిని సరిచేసే రూపం అయ్యుండవచ్చు. భాషా పరంగా, ఒక స్థాయి భాష నుండి మరోస్థాయి భాషలోనికి మార్చడం రూపంలోనూ ఉండవచ్చు. తులనాత్మక పరిశీలన రూపంలోనూ ఉండవచ్చు. అలా అపూర్వత అంటే అప్పటి వరకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో లభ్యంకానిది ఏదో ఉండడం, అది మనకు ఉపయోగపడగలిగి ఉండడం లేదా అవసరమైందై ఉండడం జరిగితే, అపూర్వత అన్న లక్షణాన్ని కలిగి ఉందనే అర్ధం. ఆ దృష్టి నుండి గనక చూస్తే మండలి జ్ఞాన సిద్దాంతంలోని ప్రమాణ వివేచన - పదార్ధ వివేచన అన్న విభాగాలలో వెనకటివాటిలో చోటు చేసుకుని ఉన్న కొన్ని దోషాలు లేకుండా ఉండడం కొన్ని లోపాలను సరిచేసుకున్న సమాచారంతో ఉండడం అన్నదే కాక, ఆనాటి వాటిలోని జఠిల పదాలు, సమాసాలను చాల వరకు సరళమైన రీతిలో చెప్పడం జరిగింది. తర్కం కర్కశమైంది అన్నమాట నుండి, అంతేమీ కర్కశమైంది కాదులే అన్న దృష్టిని కలిగించే రీతిలో ఉందిది.
       వెనకటి కాలంలో తర్కము, తర్కవిద్య ఎవరో కొందరు మేధావులకు అవసరమైంది మాత్రమే నన్న దృష్టి బలంగా ఉండేది. సిద్దాంతరాద్ధాంతాలకు, వాద ప్రతి వాదాలకు చెందింది మాత్రమే అది. పండిత ప్రకాండుల కొరకే ఆ విద్య అన్నట్లుండేది. కాని, స.మండలి, తర్కం ప్రతి మనిషికీ అవసరమైందనీ, ఏదో ఒక సందర్భానికి గాక, నిత్యజీవితంలో, నిరంతరం అవసరపడుతుండేదేనన్న వాస్తవన్ని బలంగా ప్రతిపాదించి, దానిని అందరికీ అందుబాటులోనికి తేవాలని ప్రతిపాదిస్తోంది. తర్కించడమంటే ఎడ్డిమంటే తెడ్డెం అనడం కాదనీ, నందంటే పందనడం కాదనీ, అవునంటే కాదనడం కాదనీ ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. తర్కశాస్త్రమంటే సక్రమాలోచనా నియమాలను, శాస్త్రీయ పద్ధతిలో వివరించి, అభ్యాసమూ చేయడానికి వీలైన సూత్రాలున్న సిద్దాంత గ్రంధమనీ చెపుతుంది. అది మేధోసామర్ధ్యాల పెంపుకు, తప్పనిసరైన విద్య అనీ, ప్రతి మనిషికీ అతడు శిక్షణ పొందే వయస్సుకు చేరినప్పటి నుండి ఆయా వయస్సులకు తగిన రీతిలో తార్కికశక్తి ఇనుమడించేలా విద్యా విభాగం ద్వారా తెలిపి, నేర్పి, అలవడజేయడం, ఏ సమాజానికైనా తప్పనిసరి అనీ చెపుతుంది.
జ్ఞానమంటే ఏమిటి? జ్ఞాన మెర్పడుతున్న క్రమమేమిటి? ఏయే పరికరాల ద్వారా, ఏయే విధానాలలో జ్ఞానం కలుగుతుంటుంది. ఎన్ని రకాల విషయాలకు చెందిన జ్ఞానం కలుగుతుంటుంది? ఒప్పుజ్ఞానము, తప్పుజ్ఞానములంటే ఏమిటి? అవి ఎందుకెర్పడుతున్నాయి? తప్పు జ్ఞానం కలక్కుండా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? తప్పు జ్ఞానం వల్ల కలిగే అనర్ధమేమిటి? ఒప్పుజ్ఞానమే కలుగుతుండేలా ఏమి జాగ్రత్తలు తీసుకుంటుండాలి? ఒప్పు జ్ఞానం వల్ల కలిగే మేలు ఏమిటి? కలిగిన జ్ఞానం సరైందో కాదో నిర్ణయించుకునేదెలా? వగైరా, వగైరా జ్ఞాన క్షేత్రానికి సంబంధించిన పలు విషయాలను ఒక క్రమ పద్ధతిలో వివరించి, దానిని అభ్యాసం చేయడమెలానో తెల్పి, మనిషి, యోగమైన జ్ఞానంతో జీవించేందుకు అవసరమైన భూమికను అందిస్తుందీ జ్ఞానసిద్దాంతం.