Monday, December 1, 2003

వాస్తు శాస్త్రము శాస్త్రీయత అశాస్త్రీయత ఒక పరిశీలన -2


అమాయక జనానికీ, జిజ్ఞాసకలవారికీ, వాస్తు వ్యతిరేకులకూ, అనుకూలురకూ; మిత్రులారా!
వాస్తు విషయ పరిశీలనలో గమనించాల్సిన ప్రధాన వాస్తవాలు కొన్ని వున్నాయి. ఇప్పటివరకు చూసినవి, (1) ఎవరైనా దేనిని గురించైనా ఒక అభిప్రాయాన్ని వెల్లడిస్తే ముందుగా అడగవలసింది; ఆ విషయం మీకెలా తెలిసింది? అని. దీనినే మీకు ప్రమాణమేమిటి? అని అడగడం అంటాం.
గమనిక : జ్ఞాన సిద్ధాంతం ప్రకారం ఒక విషయానికి సంబంధించి పరస్పరం విభేదించుకునే అనేకాభిప్రాయాలు అన్నీ సత్యం కాజాలవు. సరిగా పట్టిచూస్తే ఏదో ఒకటి సత్యం కాగలిగి వుండడమో, అవన్నీ సత్యాలు కాకుండా పోవడమో జరుగుతుంది. సత్యాసత్య విచారణ క్రమంలో అతిక్రమించడానికి వీల్లేని సూత్రీకరణల్లో ఇదీ ఒకటి.
పై ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రతిపాదన చేసినవాడు మాకిది ప్రమాణం - అంటే ఈ విషయం నాకిలా తెలిసింది - అని చెప్పి తీరాలి; లేకుంటే అది నిరాధారమైన వాగుడు క్రింద జమకట్టాల్సిందే. ఈ కోణంలో నుండి మనం వాస్తును చూస్తే.

1. వాస్తుకు ఒక ప్రామాణిక రచనంటూ లేనేలేదు. వాస్తు శాస్త్రాల పేరున అనేక రచనలున్నాయి. ఎన్నో విషయాలలో వాటిలో అవి విభేధించుకుంటున్నాయి. కొన్నింట విరోధమూ వుంది.
2. ఈ అన్ని శాస్త్రాల రచయితలూ ప్రామాణికులుగా '18' మంది ఋషుల పేర్లు ఒక శ్లోక రూపంలో ఉట్టంకిస్తుంటారు.  ఆ ఋషులనబడేవాళ్ళ రచనలు నేడు అలభ్యాలు. కనుక వారేమి చెప్పారన్నది ఎవరికీ తెలియని విషయం. అసలు ఏనాడైనా వున్నాయా లేదా అన్నదీ తేలని, తెలీని విషయమే.
3. ఇప్పుడు మనకు లభించే - అదీ చాలా గట్టి యత్నంవల్లనే సుమండీ - ప్రాచీన గ్రంథాలు అనబడే వాటిలోనూ ఇవి ఏయే కాలాల రచనలో ఖచ్చితంగా తేల్చడం మనవల్ల అయ్యే పనికాదు. కొన్నింటి రచనాకాలాలను మాత్రం అంచనా వేయవచ్చు. ఉదా : బృహత్సంహిత - వరాహమిహురుడు - ఇతడు విక్రమార్కుని ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకడని ప్రతీతి. కనుక సుమారు క్రీ|| పూ|| 2100 సం||ల నాటివాడన్నమాట. అలాగే సమరాంగణ సూత్రదారము - భోజుడు - ఇతడు క్రీ.శ.10-11 శతాబ్దాల నాటివాడు. ఇలానే మరికొన్నింటికీ ఉజ్జాయింపు కాలాలను చెప్పుకోవచ్చు. దాదాపు 18వ శతాబ్దం వరకు ఈ తరహా రచనలు వచ్చాయి. అంటే కాలక్రమంలో సుమారు 2000 సం||ల వ్యవధిలో వివిధ కాలాల్లో జరిగిన రచనలన్నమాట అవి. దానర్థం, ఆయా రచనల కాలంలో అమలులో వున్న గృహ, వాహనాది వస్తు నిర్మాణ విజ్ఞానానికి సంబంధించిన వివరాలున్న గ్రంథాలవి అని అర్థం. ఈ అంశము అనుకూల ప్రతికూలులెవరూ విభేదించడానికి వీలులేదు. అంటే ఇది నిర్వివాదాంశమన్నమాట.
4. ఈమధ్య పై రచనలాధారంగా తగినంత అధ్యయనంతోనూ, స్వానుభవాన్ని జోడించి విభేదాలున్న తావున తమకు తోచిన పరిష్కార రూపాల్ని వివరిస్తూనూ, వాస్తు పండితు లుగా చెలామణవుతున్న మోసగాళ్ళను నిరసిస్తూనూ వచ్చిన రచనలు కొన్ని ఉన్నాయి. మధుర కృష్ణమూర్తిశాస్త్రి, రాణి శ్రీనివాసశాస్త్రి వగైరాలు, వారికి సాంప్రదాయంగా విద్యగరపిన తరం పండితుల, రచనలు మరో రకానికి చెందినవవుతాయి.
5. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడుతూ, ధనసంపాదనే ధ్యేయంగా నాటకీయమైన వేషధారణతోనూ, తగిలింపించుకున్న బిరుదులతోనూ, శ్రమపడకుండా వచ్చిన సొమ్మునే వివిధ ప్రచారాలకు వినియోగించి ప్రసిద్ధునిగా గుర్తింపు పొంది, మంత్రుల, రాజకీయ నేతల, పారిశ్రామికవేత్తల, డాక్టర్లవంటి, సాంఘికంగా గుర్తింపు వున్నవారితో ఫొటోలు దిగి వాటన్నింటినీ, దానికి తోడు తన అజ్ఞానాన్ని జోడించి ప్రచురించిన రచనలు మరో రకానివి. ఈ చివరి రకపు రచనలను బట్టీపట్టి లోకల్‌ వాస్తు దైవజ్ఞులల్లే నిక్కినీల్గేవాళ్ళే ఈనాడు లెక్కకు మిక్కిలిగా తయారై మంది సొమ్ము చక్కబెట్టు కుంటున్నారు.
6. ఇక కృష్ణ వాస్తునో, రామరాయ వాస్తునో ముక్కునబెట్టుకొని కనపడినవారికల్లా వాస్తు విశేషాలను ఊదరగొట్టే చోటా వాస్తు విజ్ఞానులకూ కొదవేలేదు.
విచిత్రం : దాదాపు మనం (మేము) నిలదీసిన ప్రతి వాస్తు పండితుడూ, వాస్తుపేరన చాలా అరాచకం జరుగుతుందనీ, అలాంటి వాటికి తాను బద్ధ వ్యతిరేకిననీ, అట్టి మోసగాళ్ళను పట్టి రాచిరంపానపెట్టి చెమడాలు ఊడబెరకాలనీ, నేనుమాత్రం పరిశోధన ద్వారా తేలిన అంశాలనే చెపుతున్నాననీ, మూఢనమ్మకాలకూ, మోసాలకు తావుండకుండా జాగ్రత్త వహించాలనీ, అలాంటి పనిచేయడానికి మీకంటే ఒకడుగు ముందే వుంటాననీ చెపుతుంటాడు (చెప్పాడు). నిజంగా అలా తలచేవాళ్ళ రచనల్లోను, అలా నాటకమాడే వాళ్ళ రచనల్లోనూ కూడా ఎక్కడోచోట ఈ వంచన గురించిన హెచ్చరిక చోటు చేసుకునే వుంటోంది. మంది ఆ మంద వెంట పడిపోడానికి ఇదో సాధనంగానూ ఉపయోగపడుతోంది. అలా పోయే జనాన్ని గనక మనం అడిగితే, మీరన్నది నిజమేగాని, మా గురువు లేక ఈయనమాత్రం అలాంటివాడుకాడు అనంటుంటారు. ఇదో విపరీతం.
మా పక్షాన్నుంచి కొన్ని ప్రకటనలు చేశాను. మరోసారి గుర్తు చేసుకోండి.
1. ఏ కాలానికాకాలంలో అప్పటి అవసరాలకు సరిపడిన నిర్మాణ విజ్ఞానం సమాజంలో వుంటూనే వచ్చింది. క్రమంగా ఎదుటపడిన అనుభవాలాధారంగానూ, ఏర్పడ్డ నూతన పరిస్థితులవల్లనూ, పెరిగిన అవగాహన ననుసరించీ నిర్మాణ విజ్ఞానం దోషాలను తొలగించుకుంటూ, లోపాలను పూరించుకుంటూ వైజ్ఞానిక పంథాలోనే సాగుతూ వచ్చింది.
2. ఈనాడు మనకున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్ట్యానూ, ప్రస్తుతావసరాలననుసరించీ చూస్తే ఆ వెనుకటి రచనలను ఆధారం చేసుకోవాల్సిన అవసరంగానీ, దానివల్ల ప్రయోజనంగానీ లేదు.
3. ఒక వంక నిర్మాణపరమైన ఒకనాటి విజ్ఞానంగా దానిలోని కొంత భాగాన్ని అంగీకరిస్తూనే ఆ రచనలలోనే చోటుచేసుకుని వున్న అజ్ఞాన భాగాన్ని విడదీసిచూపుతూ ఆ భాగం శాస్త్రీయం అనంటున్నాము.
4. ఆ ప్రాచీన వాస్తు విద్యకు వృత్తిగనో, ప్రవృత్తిగనో ఎంచుకుని కొనసాగుతున్నవాళ్ళలో నిజాయితీ, నిస్వార్థత కలవాళ్ళూ, స్వార్థంతో కూడిన మోసగాళ్ళు అన్న రెండు రకాలవాళ్ళున్నారు అన్నది మా అవగాహన అనంటున్నాం.
5. వారు నిస్వార్థులో నిజాయితీపరులో ఐనంతమాత్రాన వారు చెపుతున్నవి నిజాలు అయ్యుండాల్సిన పనిలేదు. కనుకనే ఆ పక్షంవైపున్న రెండు రకాల వాళ్ళను ఉద్దేశించి రెండు ప్రకటనలు చేస్తున్నాము - చేశాము.
ఎ. సత్యానికి పెద్దపీట వేయగలిగే, శాస్త్రీయ దృక్పథం కలిగే వున్నవారిని వాస్తులోని ఆయా విషయాలపై శాస్త్రీయమైన పరీక్షలు నిర్వహించుదాం రండని మిత్రులను పిలిచినట్లే పిలుస్తున్నాం.
బి. ఇది శాస్త్రమే. మేము శాస్త్రజ్ఞులమే. కావాలంటే పోటీకి సిద్ధం అనేవాళ్ళను, మేమూ సిద్ధమే. పోటీమాత్రం బహిరంగంగా జరగాలి. ఈనాడు దేనికొరకై వాస్తు పండితులను జనం ఆశ్రయిస్తున్నారో ఆ ఫలితభాగం అశాస్త్రీయం, అవాస్తవం అని మమ్మల్ని నిరూపించమన్నా నిరూపిస్తాం, అలాకాదు, ఆ భాగం శాస్త్రీయం - వాస్తవమని మేమే నిరూపిస్తామని వారంటే అందుకూ మేము సిద్ధంగా వున్నామంటున్నాం.
గమనిక : పోటీకి - పరీక్షకు - పందెమే అందం అని గనక మీరనేట్లయితే ఎంత పందేనికయినా మేము సంసిద్ధం. 5 లక్షలా, 10 లక్షలా! చాలదా? అయితే ఎంతో మీ దమ్మెంతో మీరే చెప్పండి. అనీ వారి సవాలుకు ప్రతిసవాలుగా ఈ ప్రకటన చేస్తున్నాం.
5. వాస్తును అంగీకరించేవారిలో దొంగలూ,దొరలూ కలిసివున్నారు. ఇరువురూ ఆ దారి విడవాలన్నదే మా దృష్టి అయినా, దొంగలు శిక్షింపబడాలన్నదే మా మొదటి గురి.
జరిగిన జరుగుతున్న కొన్ని వాస్తవాలు
1. విజయవిహారం ఆరంభ సంచికలోనే దాని ఎడిటర్‌ టి.వి.రమణమూర్తిగారు 'వాస్తు'పై చర్చను ప్రారంభించారు. కళ్ళముందు జరుగుతున్న జరక్కూడని దాన్ని కనిపెట్టి, నలుగురి ముందూ పెట్టే పనిలో గట్టి పట్టున్న ఆయన్ను అభినందించడం మన కనీస బాధ్యత. వారు విజయవిహారంలో క్రమంగా ఫిబ్రవరి 2000 నుండి 10 వ్యాసాలు ప్రకటించారు.
(1) ప్రొఫెసర్‌-నాగిరెడ్డి, (2) గౌరు తిరుపతిరెడ్డి, (3) ప్రొఫెసర్‌ కొల్హాట్కర్‌,
(4) పెన్మత్స సుబ్బరాజు, (5) బుచ్చిరెడ్డి, (6) నార్నె వెంకట సుబ్బయ్య, (7) వై. నూకరాజు, (8) కె.ఎల్‌. కాంతారావు, (9) కొడాలి శ్రీనివాస్‌, (10) డా|| సజ్జెల జీవానందరెడ్డి,
(11) జోడావుల శ్రీనివాస్‌, (12) మోహన్‌ గురుస్వామి, (13) వాస్తు గిరీశం, (14) కుష్వంత్‌సింగ్‌, (15) వావిలాల కృష్ణమూర్తి, స్వర్ణలత, (16) కె. రామంగార్లు 'వాస్తు సంవాదమ్‌'లో పాల్గొన్నారు. వాస్తుపక్షాన గౌరు తిరుపతిరెడ్డిగారు భుజం కాయగా, మిగిలినవాళ్ళంతా ఎంతో కొంతమేర ప్రస్తుత వాస్తుకు ప్రతికూలతనే కనబరిచారు. గౌరువారు మాత్రం ఆరంభంలో అతి దూకుడును ప్రదర్శించి ప్రశ్నించిన విజ్ఞులను సైతం తెగిడి, ధైర్యముంటే పరీక్షకు దిగండంటూ 2 లక్షల పందెపు ప్రకటనా చేస్తూ సవాలు విసిరారు. వెంటనే మేము సిద్ధమంటే మేము సిద్ధమంటూ హేతువాద సంఘాలూ, భా.నా. సమాజమూ, మరికొందరూ ప్రతి సవాల్‌ విసిరారు. మరెందువల్లనో ఆ పరీక్ష ముగ్గుమీదకు రాకుండానే ఆగిపోయింది. వివరాలు వి.విహారాన్ని అడిగి తెలుసుకోవచ్చు.
ఆశ్చర్యకరమైనదీ, ఆలోచించాల్సిందీ ఒకటుందిక్కడ. ఇంత జరుగుతున్నా వాస్తుకు నెత్తికెత్తుకున్నవాళ్ళుగానీ, దానిపైబడే బ్రతుకుతున్నవాళ్ళుగానీ, ఆధునిక వాస్తంటూ వందల పేజీల గ్రంథాలు వ్రాసి అమ్మకానికి పెట్టిన వాళ్ళుగానీ సత్యస్థాపనకు మేము సిద్దమంటూ స్పందించకపోవడం, కనీసం తిరుపతిరెడ్డికి వత్తాసుగానైనా నిలవకపోవడం.
ఇంతకూ ఛాలెంజ్‌ అన్న గౌరువారు రివర్స్‌గేరు ఎందుకు వేసినట్లు? 4, 5 గురు పత్రికాముఖంగానే మేము సిద్ధమన్నారుకదా! శాస్త్రవేత్తను అని పేరుకు ముందు వ్రాసుకుంటున్న గౌరువారు శాస్త్రీయ వైఖరిని ఎందుకు కనబరచనట్లు? వాస్తు శాస్త్రవేత్తల వైఖరిలానే వుంటుందని ఆచరణ ద్వారా తెలిపినట్లా?!
గౌరు తిరుపతిరెడ్డికి వాస్తు ఓనమాలు తెలియవంటున్న అంబికా జగదానంద, వాస్తుకు, లేని శక్తుల్ని అంటగట్టడం అశాస్త్రీయం అంటున్న మధుర కృష్ణమూర్తిశాస్త్రిగారి లాంటి మేటిమగల కలంపోటుల వేటుల్నన్నా ధీటుగా ఎదుర్కోక కిమ్మిన్నాస్తి అంటూ గమ్మునున్నారేమిటీ ఈ తిరుపతిరెడ్డిగారు.
మండలి ఈనెల నుండి 'వివేకపథం' సంచికలను ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధులైన వాస్తు పండితులనుండి, అంతో యింతో ప్రచారంలో వున్నవారి వరకు సుమారు 100, 150 మందికి పంపనుంది. అలాగే వాస్తు పీడను సమాజం నుండి తొలగించాలనుకునే సామాజిక స్పృహ, శాస్త్రీయ దృక్పథమూకల సంస్థలనూ, వ్యక్తులనూ ఒక వేదికపైకి తేవాలనుకుంటోంది. ఇరుపక్షాలనూ సమాయత్తపరచి బహిరంగ వేదికపైకి తేవాలనుకుంటోంది. ఇరుపక్షాలనూ సమాయత్తపరచి బహిరంగ వేదికద్వారానూ వివిధ ప్రసార సాధనాల ద్వారానూ విచారణలో తేలిన విషయాలను ప్రజలకు తెలియజేయాలను కుంటోంది. కనుక ఈ పత్రికా ముఖంగా మేము తెలియజేసేదేమంటే నిజాయితీతో ఈ విచారణ, సత్య నిర్ధారణ వేదికపైకి రాదలచుకున్నవారు మీరేపక్షంలో చేరదలచుకున్నారో తెలుపుతూ మాతో సంప్రదించండి.
మీ మీ ప్రాంతాలలో వాస్తుపై విశ్లేషణాత్మక సదస్సుల నేర్పాటు చేయగలిగితే పాల్గొని సమాచారమందించడానికీ, గోష్ఠులు నిర్వహించడానికీ మండలి సిద్ధంగా వుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రొ|| కొల్హాట్కర్‌ గారన్నట్లు దీనిపై ఒక ఉద్యమం సాగాల్సి వుంది. అందుకూ మండలి రంగం సిద్ధంచేస్తోంది. ఉద్యమంలో చేరదలచుకున్నవాళ్ళూ మండలిని సంప్రదించండి.
సమాజం నెత్తిన పెద్ద బండై, తామరతంపరగా పుట్టుకొస్తున్న పరభోగ్యోప జీవులైన వాస్తు పండితమన్యుల కెందరకో అండై వుంటున్న ఈ వాస్తులోని, అశాస్త్రీయతనూ, ఆ వేషధారుల్లోని అవినీతిని బయటపెట్టి ఎండగట్టాలంటేనూ, ప్రజల మనస్సులకు పట్టిన పీడను తొలగగొట్టాలంటేనూ ఇలా అడపాదడపా రాసే వ్యాసాలుగానీ, ఒకటి అరా రచనలుగానీ సరిపోవు. ఇదో ఉద్యమంగా సాగాలి. వాడవాడా దీని విషయం ప్రచారం కావాలి. ఊరికొక్కరైనా వాస్తు పేర జరిగే వంచన భాగాన్ని గురించి తగినంత అవగాహన చేకూర్చుకోవాలి. ఎక్కడికక్కడ నిర్మొగమాటంగా వాస్తును, వాస్తు వేషధారులను వ్యతిరేకించి వారి అజ్ఞానాన్ని, వాస్తు అశాస్త్రీయతను బట్టబయలు చేయాలి. కొంతకాలం ఇదో నిరంతర ప్రక్రియగా జరగాలి.
నిజానికిదేమంత కష్టమైన పనికాదు. మనస్సుండి, మనకెందుకులే అనుకోకుండా పూనుకోగలిగితే వాస్తు విషయ జ్ఞానాన్ని మీకై మీరు సంపాదించడంగానీ మీకు మేమందించడంగానీ రెండూ సులభసాధ్యమే. కావలసిందల్లా మానసిక సంసిద్ధత-కొంత, సమయాన్ని కేటాయించగలగడం అన్న రెండే. అందుకు ఎవరు సిద్ధపడ్డా మాతో చేయికలపండి. ఖచ్చితమైన అశాస్త్రీయ భాగాలను ఒక 15, 20 అంశాలుగా ఎంపిక చేసుకుని మనస్సుకు పట్టించుకుంటే, కంఠస్థం చేస్తే పనైపోయినట్టే. ఇక ఆ పక్షంలోని వంచకుల భరతం పట్టడానికిగానీ, నిజాయితీపరులలో పునరాలోచన రేకెత్తించడానికిగానీ ఆ మాత్రం పరిజ్ఞానం ఎక్కువలో ఎక్కువ. వివాదంలోగానీ, విచారణకు సిద్ధపడితే పరీక్షలోగాని ఖచ్చితంగా సత్యం మీపక్షానే వుంటుంది గనుక గెలుపు మీదే. అవతలివాడెంత ప్రజ్ఞావంతుడైనా, గద్దరితనంతో, మాటకారితనంతో బల్లలు గుద్దుతున్నా అదంతా గుండు లేని తుపాకి పేల్చడంతో సమానం. సత్యం ఎదుట సత్యంకాని ఏ సామర్థ్యాలూ వీసానిక్కొరగావు. కాకుంటే మీరు మాత్రం పట్టిన పట్టు విడవకూడదు. పట్టుకున్న అంశాన్నుంచి పక్కకు పోకూడదు. అవతలివాణ్ణి పోనీకూడదు. ఉడుంపట్టుపట్టి ఆ విషయం రుజువు పరచండని పట్టుక్కూచుంటే చాలు. ఎంతటివాడైనా ఊపిరాడక చావడమో, తోకముడిచి పలాయనం చిత్తగించడమో చేయాల్సిందే.
ఈ సందర్భంలో శాస్త్రీయ విధానానికి చెందిన అతి కీలకాంశాన్ని చెపుతాను. గుర్తించండి. ఇప్పటికే గుర్తించి వుంటే నిరంతరం దానిని గుర్తులో వుంచుకోండి.
ఒక అభిప్రాయం సరైందో కాదో నిర్ధారించుకోవడం మాటలద్వారా సాధ్యంకాదు. దానికి చేతలు అవసరం. కనుక అవతలివానితో చర్చలొద్దు. అదో పెద్ద రచ్చగా తయారయ్యే వీలుంది. శాస్త్రీయ నిర్ధారణలెప్పుడూ ప్రయోగాలదగ్గరే పూర్తవుతాయన్న నిర్వివాద నియమాన్ని ఆచరణలో పెట్టండంతే. మీ వెనుక మేమున్నాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నిలబడడానికీ, భుజం కాయడానికీ సిద్ధంగా వున్నాం.
ఉద్యమంలో చేరడానికి సిద్ధపడితే ఈ క్షణాన్నుంచే ఉద్యమకార్యం ఆరంభించండి. ఉద్యమకార్యంలో మొదటిది స్వపక్షాన్ని, పరపక్షాన్ని గుర్తించడం. స్వపక్షాన్ని పెంపు చేసుకుంటూ బలపరచడం. అంటే మీ ప్రాంతాలలో వాస్తు విశ్వాసుల్నీ, వాస్తు పండిత వేషధారుల్ని గుర్తించండి, మరోవంక ఆ తప్పుడు వ్యవహారాన్ని ప్రతిఘటించడంలో మనవైపు నిలబడే వ్యక్తుల్నీ గుర్తించి, క్రమంగా సమావేశపరచండి. విడివిడి ఒకట్ల మొత్తంకంటే అంతే సంఖ్యలో సంఘటితమైన మొత్తంయొక్క బలం ఎక్కువ. కనుక సంఘటితమవడమే ఉద్యమానికి ఊపిరి. మనం ఒకటయ్యామా అవతలివాళ్ళైపోయినట్లే. మనం ఒకటి కానంతవరకే వాళ్ళ ఆటలూ, ఆగడాలూ, దండుకోడాలూ. ఈ పచ్చి నిజాన్ని ఖచ్చితంగా గుర్తించి కదలండి. మనలాటి వాళ్ళను కనుగొని కదిలించండి.
వాస్తు పక్షం వాళ్ళకూ ఒక సూచన. నిజాయితీగానీ, ఆవేశంగానీ, సత్తాగానీ వుంటే ఎదురొడ్డి నిలబడండి. విడివిడిగా బలం చాలదనుకుంటే మీకూ పై సూత్రమే వర్తిస్తుంది గనుక గుమిగూడి కలివిడిగా ఎదురొడ్డి నిలవండి. ఆ విధంగానైతే సమస్య ఖచ్చితంగా తేలిపోతుంది. మీరంతా ఒక్కటై విచారణలోకో, బరిలోకో రావాలన్నదే మండలి ఆకాంక్ష. లేకుంటే మిగిలినవాడు నేనుండుంటే చూపించుండేవాణ్ణి తడాకా, శాస్త్రమా మజాకానా అంటూ సందుగొందులంట తోకాడించే వీలుంది.
పెద్దపెద్ద స్థానాల్లో వున్న బుద్ధిలేని ప్రసిద్ధులు - వారి అనుచిత పోకడలు
1. ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు సచివాలయాన్ని వాస్తు మార్పిడులకు లోనుచేశారు.
2. బి.జె.పి. కేంద్ర కార్యాలయం గేటు మార్పిడి వ్యవహారం వాస్తు విశ్వాస మూలకమే.
3. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిగారు బంజారాహిల్స్‌లోని వారింటిని వాస్తుకొరకే రకరకాల మార్పులకు లోనుచేశారు.
4. బండారు దత్తాత్రేయ తన బంధువులింటికి తిరుపతిరెడ్డిగారిచే వాస్తు చూపించారు.
5. పి.వి.గార్కి, దేవేందర్‌గౌడ్‌ గారికి కూడా వాస్తు, జ్యోతిషాలపై గట్టి నమ్మకముంది.
6. బి.ఎన్‌.రెడ్డి (మాజీ ఎం.పి.)గారైతే వాస్తు బ్రహ్మావతారమే ఎత్తి దేశ వాస్తునుకూడా చూసేశాడు.
7. ఎం.పి.,జైపాల్‌ రెడ్డిగారు వాస్తు బాగుకోసం ఉన్న యింటినమ్మి మరో ఇంటిని కొన్నారు.
8. మొన్నటికి మొన్న టి.డి.పి. హైదరాబాద్‌లో పెద్ద బహిరంగసభ జరిపింది. సభావేదిక వాస్తు ప్రకారం అమర్చబడింది. వేదిక దిక్కూ, దిశా మార్చి ఎన్నికలు గెలిచేద్దామనే స్థాయి నేతలతో వుంది రాష్ట్రం.
9. మరో మంత్రి జాతకం చూపించుకున్నట్లు దినపత్రిక వార్త.
10. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు వాళ్ళకిచ్చిన గదుల ద్వారబంధాలు, కిటికీలు వున్నతీరు. గదిలో తన కుర్చీ వున్న స్థానము, ఆ ఇంటి గేట్లు, వీధిశూలలూ, పోట్లు, ఎత్తులు పల్లాలు అన్నీ ఎప్పటికప్పుడు మార్పిళ్ళకు లోనవుతూనే వుంటున్నాయి.
11. కొంత పచ్చిగా చెప్పుకుందాం. వాస్తు పీడ పట్టి, సొంత ఇల్లు వాస్తుప్రకారం చూపించి కట్టించుకోని రాజకీయ నాయకులెందరు? విద్యావంతులెందరు? పారిశ్రామికవేత్త లెందరు? ఈ రకం పోకడ కొంతవరకు అర్థం చేసుకోవచ్చనుకున్నా, సైంటిస్టులూ, ఇంజనీర్లు కూడా వాస్తు ప్రకారమే ఇళ్ళు కట్టించుకుంటున్నారంటే వారి (అ)వివేకాన్నేమనుకోవాలి?
12. పార్లమెంటు భవనానికీ, అసెంబ్లీకి కూడా మరమ్మత్తుల పేర వాస్తు సవరణలు చేయించే ఈ రకాన్నేమనుకోవాలి?
గమనిక : ఇంతోటి శాస్త్రీయ దృక్పథంగల నేతల పాలనలో ఇంకెంతపాటి అజ్ఞాన - విజ్ఞాన వివేకాన్నీ-ఆశించగలం? తాము చెడిందిగాక వాస్తు జ్యోతిషాలను విద్యావిభాగం లోనే చేర్చి ఈ వృత్తికీ సాధికారతనూ, వంచనను లైసెన్సునూ మంజూరు చేయడానికీ ప్రారంభోత్సవం జరిపేశారు. ఈ అవాంఛనీయతను వ్యక్తిగతంగా గమనించీ ఎవరికి వారు ఉదాసీనంగా వుండడంతో ఈ రంగానికీ, దీనిలోని వారి వీరంగానికీ కూడా అడ్డూ ఆపూ లేకుండా పోయింది. పాపాలలోకెల్లా అనుమోదిత పాపం పెద్దదని, ధర్మాధర్మాలు తెలిసినవారంటారు. అంటే తప్పుచేసినవానికంటే, చూసి సహించేవాని దోషం పెద్దదని. భారతంలోనైతే దకక్షుడైయ్యుండీ అధర్మాన్ని ఉపేక్షిస్తే అది వాని వంశ నాశనానికి దారితీస్తుందంటూ ఆ వైఖరి నిరశించబడింది. ఈనాడు అంతో యింతో ఈ పెద్ద దోషంలో పాలుపంచుకుంటున్నవాళ్ళమే మనమంతా. ఇప్పటికైనా తంద్రత, ఉదాసీనతలను విదల్చుకుని ఒక్కటై వంచనపై పోరాటానికి సిద్ధపడడం విజ్ఞత. పౌరునిగా అది మన బాధ్యత కూడా.
ఇక వాస్తుశాస్త్ర విషయానికి వద్దాం. భూమి ఎంపిక గురించిన వివరాల దగ్గరున్నాంకదా! ఈ స్థలాల ఎంపికలో ఆకారాలు రెండు  ప్రకారాలుగా భావించినట్లు కనపడుతోంది.
(1) రెండు కొలతల ఆకృతులు, (2) మూడు కొలతల ఆకృతులు.
(1) రెండు కొలతల ప్రదేశం ఆకృతులు చతురస్రం, దీర్ఘచతురస్రం, వృత్తం, త్రిభుజం అలాగన్నమాట. ఇలాంటివి ఒక్కో గ్రంథంలో ఒక్కో సంఖ్య చెప్పబడింది.
(2) మూడు కొలతల ఆకృతులు. ఇవి ప్రధానంగా నీటి వాటాలను దృష్టిలో పెట్టుకుని చెప్పడం జరిగింది. ఈ స్థలం మధ్య మిర్రుగ-ఉబ్బెత్తుగ- వుండి అన్ని దిక్కులకూ పల్లంగా వున్న భూమిని కూర్మపృష్ఠ భూమి అనంటారు. అలానే దక్షిణ, పశ్చిమాలు ఎత్తుగ వుండి తూర్పు ఉత్తరాలు పల్లంగా వుంటే గజపృష్ఠిభూమి. ఇలా వాటి చదరపు ఆకృతులు కాకుండా ఎత్తుపల్లాల ననుసరించే భూములను వర్గీకరించడం జరిగింది.
అలాగే భూమియొక్క శబ్దాన్నిబట్టీ, రుచీ, రంగు, వాసనలను బట్టీ ఆయా భూములలో ఉత్తమ మధ్యమాది భేదాలనూ, బ్రాహ్మణాది వర్గాలకు ఏయేతరహా భూములు మంచిదో చెడ్డదో వివరించారు. మన మరో ప్రతిపాదనేమంటే.
5. ఈరకమైన భూమి రంగు, రుచి, వాసన లాంటి వాటినిబట్టీ, బ్రాహ్మణాది కులాలనుబట్టీ మంచి చెడులు జరుగుతాయన్నది అశాస్త్రీయం, అనే.
మరికొన్ని రకాల విభజన చేశారు స్థలాల ఎంపికలో.
(1) నారాచ భూములు : రోడ్లు కూడలులందు త్రికోణాకృతి స్థలము లేర్పడితే వాటిని నారాచ భూములంటారు. వీటిని మళ్ళా దేవ, మానుష, రాక్షస, పిశాచ భూములని నాల్గు పేర్లుపెట్టారు. వీటిలోనే ఏయేరకాల చెట్లు చేమలు, క్రిమికీటకాదులు ఉన్న భూములు ఏయే కులాలకు పనికొస్తాయో, పనికిరావో నంటూ చెప్పారు.
6. ఈ ప్రకటనలూ అశాస్త్రీయాలేనన్నది మా మరో ప్రతిపాదన.
విష్ణు, శివ, శక్త్యాలయాలకు ఎటుప్రక్క, ఎంత దూరంలో వుండకూడదోనన్నదొక ప్రకటన. దీనినీ మేము అశాస్త్రీయమనంటున్నాము.
(2) పర్వతచ్ఛాయా దూషిత భూమి : ఎంపిక చేసుకున్న స్థలానికి తూర్పున పర్వతముండి, ఆ పర్వతం ఉత్తర దక్షిణాలుగా సాగివుంటే అక్కడ పర్వతచ్ఛాయ పడుతుంది. కనుక అట్టి భూములు నివాసయోగ్యాలు కావన్నారు. అంటే కొండకు పడమటి తట్టున నిర్మాణాలుండరాదని దానర్థం. అలాంటి నిర్మాణాలవల్ల జరిగే అనర్థాలు చెప్పబడ్డాయి వాస్తు గ్రంథాల్లో.
7. ఆ అభిప్రాయాలూ అశాస్త్రీయమన్నది మా వాదన.
పర్వతాలు తూర్పు పడమరలుగా విస్తరించి (సాగి) వుంటే పర్వతానికి శిరస్సు తూర్పున, పాదాలు పశ్చిమాన వుంటాయి, ఉత్తర దక్షిణాలుగా సాగి వుంటే తల ఉత్తరాన, పాదాలు దక్షిణాన వున్నట్లు. పర్వతు(డు) బోర్లా పడుకుని వుంటాడు. తూర్పు ముఖమైతే కుడిచేయి దక్షిణాన, ఎడమచేయి ఉత్తరాన వుంటుంది. ఉత్తర ముఖంతో వుంటే కుడిచేయి తూర్పువైపున, ఎడమచేయి పడమరన వుంటుంది. రెండు రకాలలోనూ ఎడమచేతివైపు నిర్మాణాలు మంచిదని శాస్త్రము.
గమనిక : బాగుదండీ! మరి దీని ప్రకారం చేయాలంటే ఒకరకంలో మీరే పైనన్న పర్వతచ్ఛాయా దోషం ఏర్పడుతుందిగదా! కనుకనే.
(ఎ) ఈ ఛాయాదోష సిద్ధాంతం అశాస్త్రీయం అన్నది మా పక్షం.
(బి) వృక్షచ్ఛాయా దూషిత భూమి : దీనిలో పలాన చెట్లనీడ ఇంటిపై పడగూడదనీ, ఏయే చెట్లున్న ప్రాంతాలలో ఆ చెట్ల నీడల కెంత దూరంలో ఇట్లు కట్టవచ్చో, కట్టగూడ రాదన్నదీ వివరింపబడింది.
ఈ చ్ఛాయా దోషాల గురించి మరో గ్రంథంలో చెట్లనీడలతోపాటు, దేవాలయాల, రాజగృహాల నీడలు పడగూడని వివరాలూ పేర్కొనబడ్డాయి.
8. ఈ రకమైన ఫలితాల ప్రకటనలనూ మనం అశాస్త్రీయాలని అంటున్నాం.
(4) అలాగే శ్మశానాలకు ఎంత దూరంలో ఇళ్ళుండాలన్నదీ ఈనాటికీ వర్తించనక్కరలేదు అనీ, వాటివల్ల జరుగుతాయనంటున్న లాభనష్టాలు వాస్తవాలుకాదనీ అంటున్నాము.
భూశోధనం - భూమి శుద్ధి
ఎంపిక చేసుకున్న భూమిలో పై చెప్పుకున్న వివరాలనుబట్టి ఏదో ఒక దోషం వుండే అవకాశాలే ఎక్కువ. అందుకొరకై భూమిని శుద్ధి చేయడం లేదా పవిత్రీకరించడం అన్న విధానం కొన్ని గ్రంథాలలో చెప్పబడింది. (అన్నిగ్రంథాలలో ఇది లేదని గుర్తుంచుకోండి) ముందుగా చెట్టూ చేమల్ని, పుట్టలను, ఎత్తుపల్లాలను సరిచేసి నాగలితో బాగా దున్నాలి. ఆపైన ఆవుల మందను కట్టాలి. గోమూత్రం, గోమయం (పేడ)లతో ఆనేల శుద్ధికావాలి. పిదప ధాన్యపు గింజలు చల్లి పంట పండించి ఆవులను మేపాలి. రెండో సంవత్సరం| కూడా ఇదే విధంగా చేయాలి. అటుపిమ్మట గృహనిర్మాణం చేపట్టాలి.
ఏం వాస్తు దైవజ్ఞులూ! ఇది అవసరమా? ఈనాడు అయ్యేపనేనా? ఇది మాత్రం మావల్ల కాదన్నారనుకోండి గృహనిర్మాతలు, శాస్త్రాంతరంలో ప్రత్యామ్నాయవిధి వుందంటూ; గింత ఆవుపేడ, ఆవు మూత్రమూ ఆ స్థలంలో చిలకరించి, ఆ దంపతుల నెత్తినా కాసింత సంప్రోక్షించుకుంటే చాలునంటూ పక్కమార్గం చూపుతారన్నమాట. ఎదుటివాడెంతవరకు చేయగలనంటుంటాడో పసిగట్టి అంతంతమేర చేయిస్తూ చేయకుంటే ప్రమాదం పైబడతదంటూ భయపెడ్తూ దొరకించోట దొరికినంత దండుకుంటూ జీవనాలు వెళ్ళదీస్తుంటారు. వాడుగనుక నావల్లకాదని మొరాయిస్తే, అబ్బే. అంత చేయకపోయినా ఇదిగో గింతచేస్తే ఆపనైపోద్ది, ఆ దోషమూ తొలగిపోద్దంటూ కప్పదాట్లు వేస్తూ, వేయిస్తూ సాగిస్తుంటారన్నమాట.
9. ఈ ప్రహసనమంతా అశాస్త్రీయమేనని మేమంటామని చెప్పక్కరలేదనుకుంటా!
దిక్సాధన
ఈ దిక్సాధన రెండు మూడు రకాలుగా వాస్తులో అవసరపడుతోంది.
1. భూమి ఎంపికలో ఎత్తుపల్లాలననుసరించి అన్న విధానం చెప్పుకున్నాం గుర్తిందికదా. అవి ప్రధానంగా నాల్గు రకాలు. (1) గజపృష్టభూమి, (2) కూర్మ పృష్ట భూమి, (3) నాగపృష్టభూమి, (4) దైత్యపృష్టభూమి.
(1) గజపృష్టభూమి : దక్షిణం, పడమరలతోపాటు నైరుతి, వాయువ్యాలు కూడా మెరకగా వుండి తూర్పు ఉత్తరాలు ఈశాన్య ఆగ్నేయాలు పల్లంగా వున్న భూమిని గజపృష్టభూమి అంటారు. ఏటవాలులో పడమటి నుంచి తూర్పుకు ఏటవాలు అని దీనర్థం.
(2) కూర్మ పృష్టభూమి : నడుమ మెరకగనుండి అన్నివైపులకు వాటం వున్న భూమి ఇది. తాబేలు వీపు వున్నట్లుగా అన్నమాట.
(3) నాగపృష్టం : తూర్పు పడమరలు పొడవు ఎక్కువగా వుండి ఉత్తర దక్షిణాలు ఎత్తుగ ఉన్న ప్లాటును ఈ పేరుతో పిలుస్తారు. అంటే నీరు స్థలం మధ్యకు చేరి తూర్పుకో, పడమటికో ప్రవహిస్తుందన్నమాట. - సహజసిద్ధంగానైతే లోయలు, వాగులూ, వంకలూ ఉన్న స్థలాలకు సరిపోతోందీ పోలిక. చిన్న గమనిక : దక్షిణము - ఉత్తరము పొడవుగ నుండి తూర్పు పడమరలు ఎత్తుగనున్న దాన్నీ నాగపృష్టమనే అంటారు. అంటే నాగపృష్ట భూములు రెండు రకాలనన్నమాట.
(4) దైత్య పృష్టభూమి : తూర్పు ఆగ్నేయము, ఈశాన్యము ఉత్తరము మెరకగా వుండి పశ్చిమానికి పల్లంగా (వాటంగా) వున్న భూమి ఇది.
నాల్గు భూములనూ, వీటిలో ఉపవిభాగ భూములనూ నిర్ణయించడానికి (ఉపవిభాగాలతో ఎత్తుపల్లాల ననుసరించి ఎనిమిది ఆకృతులు వస్తాయి) దిక్సాధన అవసరమైంది.
అతి ముఖ్య గమనిక : ఎంపిక చేసుకున్న స్థలానికి దిక్కులను ఉజ్జాయింపుగా నిర్ణయించడం సులభమేగాని, ఆ స్థలంలో ఎంతభాగం ఏ దిక్కుకు వర్తిస్తుంది అని నిర్ణయించడం అంత సులభం కాదు. దానికై ప్రాచీనులూ, ఈనాటివారు కూడా ఎవరికి తోచిన రీతిని వారు ప్రవర్తిస్తున్నారు. కొద్దిగా కష్టమైనా ఈ అంశాన్ని మనస్సుకు పట్టించుకోవాలి ఉద్యమకారులమైన మనం. నిదానంగా, జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోండి.
సాధారణంగా మనందరకూ దిక్కులు నాలుగని తెలుసు. మూలలు కలిపితే 8 దిక్కులు.
గమనిక-1 : ఓస్‌, ఇంతేగదా! దీనికి జాగ్రత్తగా గమనించడమెందుకు అనిపించింది గదూ! ఇంతకూ పై భాగంలో ఏ స్థలం, ఎంత స్థలం ఏ దిక్కుకు చెందుతుందో చెప్పుకోండి చూద్దాం.
అబ్బే! అది ఒకపట్టాన అయ్యే పనికాదు. నీవెలాగన్నా అదెలాగన్న ప్రశ్న వుండనే వుంది. అందుకే వెనకటివాళ్ళూ, ఈనాటివాళ్ళూ కూడా తెగ కసరత్తులు చేశారీ విషయంలో. (దిక్సాధన మన్నది నిజానికి జ్యోతిశ్శాస్థంలోనిది. కనుకనే దిక్సాధన సిద్ధాంత గ్రంథాల విధి విధానాన్ననుసరించిచేయమని ఒక రుషి అంటాడు)
గమనిక-2 : కొద్దిగా కష్టపడ్డాం. అయినా ఉజ్జాయింపు దిక్కులేగాని ఖచ్చితమైన దిశా నిర్ణయానికి ఈ రెండు దిక్కు కాలేవు. ఎందుకంటే నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేస్తే రెండు దిక్కులూ ఒక విదిక్కూ మిళితం కాకతప్పదు వీటిలో.
గమనిక-3 : మొత్తం ప్లాటుకు శంకువు ద్వారానో, దిక్సూచి ద్వారానో నాల్గు దిక్కులు, 4 విదిక్కులు, నాల్గు రేఖలు గీయడం ద్వారా దిక్సాధన అయిందనిపించినా నిర్మాణభాగం ఏ దిక్కుకు వర్తిస్తుందో నిర్ణయించడానికి పెద్ద
కసరత్తే చేయాలి. దానికై గ్రంథాలలో చతుష్పద, షోడశపద, చతుషష్టిపద, ఏకాశతిపద, శతపద విధానాలంటూ అనేకరీతులు వర్ణించబడ్డాయి. ముందుగా తీసుకున్న ప్లాటును వివిధ రీతులుగా సమవిభాగాలుగా విభజించి దానిననుసరించి నిర్మాణ గృహానికి దిక్కులు నిర్ణయించడం దాని ఉద్దేశం.
పై రకాల్లో ప్రస్తుతం ఎక్కువమందిచే ఏకాశీతి '81' గడుల విధానం అమలు చేయబడుతోంది; ఆయనిర్ణయమనే పద్ధతీ, వర్గు పద్ధతీ కలగలిపిన మరో విధానమూ గ్రంథాల్లో కనబడుతోంది. చతుష్పద, షోడశపద భూముల వివరాలు చూడండి.
గమనిక-4 : ఈ రకమైన విభజనలో మానుష స్థలంలోగానీ, దైవఖండంలోగానీ నిర్మాణం చేయొచ్చు అని వెనకటి వాళ్ళంటుండగా, నేటి వాళ్ళలో చాలామంది ఈశాన్యంలో నిర్మాణం కూడదంటారు.
గమనిక-5 : దానిలో మానుషం 1ని మానుష మానుషమనీ,
2ను మానుష దైవమనీ, 4గును దైవదైవము, 3 ను దైవ మానుషమనీ పిలిచారు. అంటే ఈశాన్యంలో ఈశాన్యం, ఈశాన్యంలో నైరుతి, నైరుతిలో నైరుతి, నైరుతిలో ఈశాన్యం అని వివరించారు.
ఈ నాల్గింటిలోనూ నిర్మాణాలు చేయొచ్చునన్నారు.
గమనిక-6 : పటం(4) 81 భాగాల విధానం. దీనిలో చుట్టూ వున్న ఒక వరుస అంటే 32 గదులపెట్టు ఎట్టి నిర్మాణాలూ చేయకూడదు. దానిని పిశాచస్థలం అనన్నారు.
మిగిలిన 49 గదుల పెట్టు స్థలంలోనే తూర్పు ఇల్లో, దక్షిణపుటిల్లో, పడమటిల్లో, ఉత్తరపుటిల్లో కట్టవచ్చు. ఆధునిక వాస్తువేత్తలు ఈశాన్యంలో నిర్మాణం అస్సలు కూడదంటున్నారు.
గమనిక-7 : వీటిలో మరో విధానమూ వుంది : మరో విధానముంది; మాదింకో విధానము అనంటూ ఎవరెన్నివిధాల చెప్పినా మిశ్రమ దిక్కులతో కూడిన స్థలమే వస్తుంది. ఈ దిక్కుల గొడవ ఫలితాల సంబంధంతో పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. అసలింతకూ ఆయా దిక్కులకు ఆ ఫలితాల్ని పుట్టించే శక్తి ఎక్కడిది? అన్న ప్రశ్న వేసుకుంటేగాని దీని పునాదికదల్దు. ఒక లెక్క ప్రకారం అష్ట దిక్కులకు ఎనిమిది మంది దిక్పాలకులున్నారు.
(1) తూర్పు-ఇంద్రుడు, (2) ఆగ్నేయం-అగ్ని, (3) దక్షిణం-యముడు, (4) నైరుతి- నిరుతి, (5) పశ్చిమం-వరుణుడు, (6) వాయువ్యం-వాయువు, (7) ఉత్తరం-కుబేరుడు, (8) ఈశాన్యం-ఈశ్వరుడు.
గృహము లోపలి, వెలుపలి దిక్పతుల బలమే గృహబలము అన్నది ఈ వర్గం వారిలో ఒక గ్రూపు అభిప్రాయం.
ఆయా దిక్పాలకుల స్వభావ లక్షణాలననుసరించి ఆ గృహస్తుకు లాభాలాభాలు ఏర్పడుతుంటై. ఆ దిక్కుకు పల్లం ఉన్నకొలదీ ఆ దిక్పతికి బలం అధికమవుతుంటుంది.
గమనిక : కొందరు వాస్తు శాస్త్ర రచయితలు దిక్పాలకులకు అంత ప్రాధాన్యతనివ్వరు.
10. ఈ రకమైన దిక్పాలకులు వారికి చెప్పిన లక్షణాల ప్రకారంఫలితాల నిస్తారనడం అశాస్త్రీయం అన్నది మన మరో ప్రతిపాదన.
11. ఫలితాల పక్షం నుండి 1 సంవత్సరంలోగా జరిగి తీరుతాయనీ, సంవత్సరం తరువాత ఆ గృహం పాతగృహం క్రిందికి వస్తుందనీ ఒక శాస్త్రం చెపుతోంది. ఆ ప్రమాణానికి సిద్ధపడి రుజువుకు వస్తానంటే మేము సిద్ధమంటున్నాం. సిద్ధపడకుంటే అది మీలోని వంచనా వృత్తికి తార్కాణమనీ అంటున్నాం.
పై సంచికలో ఉద్యమకారులకు ఊతాన్నిచ్చే నిర్దిష్ట సమాచారాన్ని అందించే యత్నం చేస్తాను.
1. గత సంచికను సుమారు 30-40 మంది వాస్తు వృత్తిలో వున్నవారికి పంపాము. వారినుండి ఎట్టి స్పందనా రాలేదు. ఈ సంచికలో మరో 30-40 మందికీ- చిరునామాలు లభించినదానిబట్టి - సంచికలు పంపాము. పై సంచికనాటికి సుమారు 150 మందికైనా సంచికలు పంపాలనుకుంటున్నాము. మీకు తెలిసిన సమర్థులైన వాస్తు పండితుల చిరునామాలు మాకు పంపండి.
2. వాస్తు ఫలిత భాగం అశాస్త్రీయమన్నది మండలి వైఖరి. ఈ విషయంలో మాతో చేతులు కలిపి కదలదలచుకున్న వాళ్ళు వాళ్ళ వివరాలూ మాకు తెలపండి. త్వరలో భావసారూప్యతకల వ్యక్తులందరితో ఒకసమావేశం ఏర్పరచాలనుకుంటున్నాము.
3. వాస్తుపక్షీయులనూ ఒక వేదికమీదకు తేవాలన్నది మండలి సంకల్పం. అందుకు సిద్ధపడేవాళ్ళు కబురందిస్తే సమావేశం ఏర్పాటు చేయగలము. నిజాయితీతో ముందుకు రండి
4. వాస్తు-దిక్పాలకులు, వాస్తు-వాస్తు పురుషుడు, వాస్తు-నవగ్రహాలు, వాస్తు-గృహస్తు జాతకము, వాస్తు-వర్గులు, వాస్తు-వాటాలు, వాస్తు-పంచభూతాలు, వాస్తు- స్థలాకృతులు, ఈ విషయాలన్నింటిలోనూ అశాస్త్రీయ పాలు వుందంటున్నాం మనం. సిద్ధపడితే ఆ విషయం రుజువుచేస్తాం. శాస్త్రీయాలని రుజువు చేస్తానంటేనూ సరేరండి దానికీ మేము సిద్ధమేనంటున్నాం.
5. ఆ పక్షంలో వుండేవాళ్ళూ పూర్తి గుడ్డివాళ్ళుగానీ, భ్రమలో వున్నవాళ్ళుగానీ, సాగి పోతోందిగదా బ్రతుకుదెరవు అనేరకంగానీ, మోసగాళ్ళుగాని అయ్యుండక తప్పదు. మనం అందరినీ ఆ మార్గం నుండి బైటికి రమ్మంటున్నాం. చివరి రకాన్ని తాటదీస్తాం అని హెచ్చరిస్తున్నాం.
6. మంచిని వాంఛించగల మిత్రులారా! మంది హితం కోరి మేమారంభించిన ఈ మహోద్యత్నంలో మమేకమై కదలండని మరోమారు ఆహ్వానిస్తున్నాం. నిజానికిది మీ బాధ్యత కూడానని గుర్తుచేస్తున్నాం.
7. ప్రత్యేకంగా మీడియాకు ఈ విషయంలో మీ వంతు పాత్ర పోషించండని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక వేదికను ఆరంభిస్తే దానికి తగిన-రుజువులు చూపగల-ఆధారాలతో సమాచారాన్నందివ్వగలమని మాటిస్తున్నాం.
8. న్యాయ వ్యవస్థా దీనిలో జోక్యం కలుగజేసుకోవలసి వుంది. అందుకై ఒక న్యాయ విభాగాన్ని ఆరంభించి కోర్టులకెక్కుదామన్న ఆలోచనా ఆరంభమైంది.
9. నిర్మాణ సాంకేతిక నిపుణులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని చేసిన సిగ్గుమాలినా పనికి సిగ్గిల్లి శాస్త్రీయ వైఖరిని కనబరచమని హితసూచన చేస్తున్నాం.
10. ఈ అంశాలలో అవగాహన పెంచుకుని, ఆ వంచనను అరికడదామనుకుంటున్న క్రియాశీలురకు శిక్షణ గరపడానికి సిద్ధంగా వున్నాం. శిక్షణ అవధిని, త్వరలో ప్రకటిస్తాం. సుమారు వారం పదిరోజులు వుండగలిగితే అట్టి వారికి ఉచిత భోజన వసతులు కల్పించి శిక్షణ గరపగలం.
11. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీమీ సంఘాల నుండి కనీస సంఖ్యలో ఈ విషయంలో శిక్షణ పొందడానికి కొందర్ని ఎంపిక చేసుకుని తరగతులకు పంపగలిగితే ఎక్కడికక్కడ ఈ వంకర పోకడలను అరికట్టడానికి జనం తయారవుతారు. కనుక అర్జెంటు వ్యవహారంగా భావించి వ్యక్తులను సిద్ధం చేసుకోండి. సమావేశ వివరాలు త్వరలో అందజేస్తాను. వ్యక్తుల సంఖ్య, పేర్లు తెలియపరచండి.

వివేక పథం మాస పత్రిక డిసెంబరు 2003 సంచిక నుండి (నెంబరు89)

No comments:

Post a Comment