ప్రజల్లో కనలేనితనం బలంగా వున్నంతకాలం, వినికిడిపై ఆధారపడే మనస్తత్వంతో ఉన్నంతకాలం, కల్లబొల్లి కబుర్లతో వారిని తమ తమ ఇష్టాలకనుగుణంగా మలచుకునే పనులే చేస్తుంటారు కుటిల మేధావులంతా. ప్రజాస్వామ్య సూత్రాన్ననుసరించి, మీ సేవకులం, మాకు సేవచేసుకునే అవకాశమివ్వండి అని అనాలి రాజకీయులంతా. ఒక థాబ్దం వెనక్కిపోతే, ఆనాటి రాజకీయ నేతలు తమతమ గుంపులదగ్గర డాబు, దర్పం వెలగబోసినా ప్రజల దగ్గర కొచ్చేటప్పటికి, తాత్కాలికంగానైనా అతి వినయాన్ని ఒలకబోస్తూ, ప్రార్థిస్తూ, దండాలెడుతూ, నోరు, వళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడుతూ వుండేవారని అర్థమవుతుంది. ప్రజలుకూడా ఆ నాలుగు రోజులైనా వచ్చినవాణ్ణి నాయకుడుగానో, దేవుడుగానో చూడకుండా, అదేంచేశావ్, ఇదేంచేశావ్, ఇది చేస్తావా, చేయవా? లాంటి మాటలతో దబాయించడమూ కనపడేది. క్రమంగా ఆ పోకడ అణగారిపోతూ, నేతలు వరాలిచ్చే దేవుళ్ళలాగా, తమ అబ్బ సొత్తేదే దానం చేస్తున్న దాతల్లాగా ప్రవర్తించడం, వారిని వెంటపడి మోసే సొంతగుంటూ, ప్రజల దగ్గరకొచ్చేటప్పటికి, అక్కడికి తామూ నేతలమేనన్నట్లు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తించడం అన్న వైఖరి పుట్టుకొచ్చి బలపడిపోయింది. ప్రజలూ క్రమంగా అదే సరైన విధానమన్న నిర్ణయానికి వచ్చి పడి దేవుని ప్రార్థించే భక్తులుగానో, దాతలను అర్థించే యాచకులుగానో ప్రవర్తించటానికి అలవాటుపడిపోయారు.
నాయకులు కూడా, ఏ స్థాయికాస్థాయిలో వరాలు, వాగ్దానాలు, దానాలు చేసేస్తూ వితరణశీలురల్లా ప్రవర్తిస్తూ, ప్రచారం చేసుకుంటూ సాగిపోతున్నారు తప్ప, ప్రజా ప్రతినిధి అన్నదానికి ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు బాధ్యత వహిస్తూ అటు అసెంబ్లీల్లోనూ, ఇటు ప్రభుత్వ కార్యకలాపాలలోనూ ఆయా సమస్యల పరిష్కారాలకై యత్నిస్తూ వుండాల్సినవాడు అన్న అర్థానికి తగ్గట్లు ప్రవర్తించడంలా. ఒక ప్రాంతానికి ప్రజల తరఫు మనిషిగా వుండాల్సిన ఎన్నికైనవాడు, తనను ఎన్నుకున్నవారికి, తన పార్టీకీ, ఇంకా ఎక్కువైతే తనవాళ్ళనుకున్నవాళ్ళకు మాత్రమే ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు. అక్కడికైనా వాళ్ళకూ అధిపతిని, పాలకుణ్ణి, పెత్తందారునూ అన్నట్లే వుంటూంది అతని వరస.
మొత్తమ్మీద ప్రజలు ప్రార్థించేవారూ, ప్రతినిధులు (రాజకీయ నేతలు) ప్రార్థింపచేసెడివారు, ప్రార్థనలను ఆలకించేవారుగ తయారైపోయింది.
ప్రతివాడూ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అని తనకవసరమైనపుడల్లా గగ్గోలుగా అరుస్తూనే వుంటాడు. ఈమాట ఈమధ్య ఎంత పేలవంగా తయారైందంటే, మొత్తం రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే శాసనసభ, లోక్‌సభలాంటి వాటిలోనూ పాలనపరమైన ఆయా విషయాల గురంచిన వాస్తవ, ప్రస్తుత సమాచారాన్ని ఇవ్వమని పాలకపార్టీకి వేరుగా వున్న ఇతరులడిగినా, అందరూ కలసి అడిగనా, సభకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తూ వస్తోంది. ఇతరులు సభలో తామడిగిన దానికి తగిన స్పందన లేకపోవడంతో, బైటికొచ్చి, ప్రెస్‌మీట్‌ల ద్వారా, బహిరంగ సమావేశాల ద్వారా తాము ప్రజల తరఫున అడిగిన వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పడంలేదని ప్రచారం చేస్తున్నారు. పాలకపార్టీ కూడా ఎవరెట్లాగ గోలెడితే మనకేమిటిలే, మనపని మనం చేసుకుంటున్నాంకదా! అన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుంటోంది. మరో విషాదమేమంటే, మొత్తం సభను ప్రజోపయోగకరంగా, పాలన ప్రజలకు పారదర్శకంగా వుండేట్లు చూస్తుండాల్సిన 'స్పీకర్' కూడా రాజకీయ పార్టీ ఎంచుకున్నవాడు కావడంతో చిత్తశుద్ధిలేక కొంతా, అది వున్నా ప్రవర్తించడానికి వీల్లేని సొంతవాళ్ళ వత్తిడికొంతా, వల్ల పాలనను యథాతథంగా అవసరమైన అన్నిసార్లు సభముందుంచే పనిచేయడంలా. చేయలేకపోతున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. నిస్పాక్షికంగా వ్యవహరించిన కొన్ని ఘటనలు, మచ్చు చూపడానికి వుండవచ్చేమోగాని, మొత్తం అలానడవడం లేదన్నది నిర్వివాదాంశం.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థంచేసుకున్నవాళ్ళకు - ఇక్కడ అభ్యంతరపడాల్సిందేమో వీసమెత్తూ కనబడదు. ప్రజల తరఫున ప్రజా ప్రతినిధులు, శాసనసభముందు ఫలానా వివరాలివ్వమని అడిగారు. ఆక్షణంలోనే వాటిని సభముందుంచాలి. తప్పనిసరైతే ఖచ్చితమైన గడువులోపల దానిని సభకందించాలి. అడిగిన విషయం చిన్నదా? పెద్దదా? సరళమైందా? జటిలమందా అన్న విచారణే అనవసరం. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీ అయితీరాలి. మినహాయింపులేని ప్రజాస్వామ్య నియమం ఇది. ప్రభుత్వ రికార్డులో వుండి ప్రజలకు తెలియకూడని అంశమేదీ వుండడానికే వీల్లేదు. అసాధారణాంశాలుగా ప్రజల తరఫున రాజ్యాంగం అంగీకరించిన రక్షణ-సాంకేతిక సూత్రీకరణల లాంటి రహస్యాలను మాత్రం మినహాయించవచ్చు. అదైనా బహిరంగ పరచకూడదన్నంతవరకేగాని, ఎంపికచేసిన ప్రజా ప్రతినిధుల సంఘానికైనా అట్టివీ చెప్పితీరాల్సిందే. కనుక దీనిమీద అడగడం, ధర్నాలు చేయడంలాంటి పరిస్థితే దాపురించకూడదు.
నిజానికి పాలన ఎలా జరుగుతుందో, పాలనలో ఏమి జరుగుతోందో తెలియాల్సింది ప్రజలకే, అలా తెలపాల్సిన బాధ్యత పాలన చేస్తున్న ప్రభుత్వానిదే. వారాపని సక్రమంగా నిర్వహించనపుడో, అవసరమనుకున్న సమాచారం పొరపాటుగా ఉద్దేశపూర్వకంగనో ప్రజలకు అందజేయకపోయినప్పుడో, విషయం తెలిసిన ప్రజా ప్రతినిధులెవరైనా దానిని గుర్తుచేసి ఈ విషయాన్ని సభముందుంచడం, తద్వారా ప్రజలముందుకు తేవడం అన్నపని చేయాలి. అది ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షాలపనేకాక, పాలకపార్టీ తరఫువారి బాధ్యతకూడా. సభలో వున్నవారంతా ప్రజాప్రతినిధులే. వారు విడివిడిగా ఒక ప్రాంతానికి ప్రతినిధులనబడుతున్నా, మొత్తం ప్రజాస్వామ్యానికి ప్రజాప్రతినిధులే. ప్రజలకు విషయాలు తెలియజేయాల్సిన సందర్భంలో సభలోని ప్రతి సభ్యుడూ రాష్ట్ర ప్రజలందరికీ, దేశప్రజలందరికీ బాధ్యుడన్నదే అస్సలు విషయం. ప్రాణస్థానీయమైన ఈ అంశం ఆరోగ్యంగా, బలంగా అమలులో లేనంతకాలం ప్రజాస్వామ్యం సరిగా వున్నట్లుకాదు.
''వందరోగాలకు ఒకటే మందన్న'' రీతి, పారదర్శకత-బహిరంగంగా పాలన వ్యవహారాలుండడం- అన్నది అవినీతి జాడ్యానికి గరళంలాంటి ఔషధం అవుతుంది. పాలకులు వాళ్ళకు వాళ్ళే సభకు వివరించాల్సిందిపోయి, వీళ్ళడిగిదేకా బైటపెట్టకపోవడం నేరంకూడా. పైగా పాలకపక్షం నేతలు, ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా, ప్రతినిధులుగా వ్యవహరించకుండా పార్టీకీ, పార్టీ నేతలకు కొమ్ముకాయడం దుర్మార్గం కూడా. కుళ్ళు కంపుకొడుతున్న రాజకీయుల ఈ రీతి రివాజులు, వాటంతటవే బాగవుతాయనుకోడం గొర్రె కసాయిని రక్షకుడనుకోడం లాంటిదే. దీనంతటికీ పరిష్కారం ఒక్కటే, అది ఏ ప్రభుత్వమైనా ఒక నిర్నీత కాలావధుల్లో (సం||రానికి నాలుగుసార్లు లేదా మూడుసార్లయినా) అప్పటివరకు పాలనపరంగా జరిగిన వ్యవహారాలనన్నింటినీ యథాతథంగా సభముందుంచాల్సి వుంటుందన్నది చట్టంకావాలి. ఆ పని జరగనప్పుడు పాలకుల్లో న్యాయ విచారణకు లోనుచేసి శిక్షించాలి. శిక్ష ఎంత కఠినంగా వుండి, త్వరగా అమలవడానికి వీలయితే అంత త్వరగా అమలవ్వాలన్నదీ చట్టరూపంలో నిర్దేశింపబడాలి. ప్రజలకు జవాబుదారీకాని ఏ అంశమైనా అప్రజాస్వామికమేనన్నదే ఇక్కడ అస్సలు విషయం.
ఈ దిశగా జరిగిన కట్టుదిట్టమైన చర్యలలో ఒక ముందడుగే సమాచారహక్కు చట్టమన్నది. అయినా, దాని అమలుకు ఈనాటికీ అనవసరపుటడ్డంకులెన్నో వున్నై. కనుక దానంతటికీ సరిజేయడంకంటే, ప్రభుత్వాలే (కేంద్ర, రాష్ట్ర, జిల్లా, గ్రామ ప్రభుత్వాలు) ప్రతి 3 లేక 4 మాసాలకొకసారి అప్పటికి జరిగిందే రాబోయే పరిమిత కాలంలో జరపబోయేది అన్నవాటిని గురించిన పూర్తి సమాచారాన్ని ప్రజాప్రతినిధుల సభ ముందుంచాలి. ఉదా : రాష్ట్రంలో శాసనసభ ముందు, పంచాయితీలో గ్రామసభముందూనన్నమాట, జిల్లా, మండలస్థాయిలోనూ ఇది అమలయ్యేలా ఏర్పాటు చేయగలిగితే ప్రజలవద్దకు పాలన, ప్రజల పర్యవేక్షణలో పాలన అన్నది ఆరంభమైనట్లు.
దండుకునే అవకాశాలుగానీ, దందాగిరిని, దర్పాన్ని వెలగబెట్టే అవకాశాలుగానీ లేవని తెలిసినపుడు, ఈనాడు రాజకీయాలు, ఆ స్వభావం కుల రాజకీయాలూ చాలావరకు కనుమరుగైపోతాయి. ప్రతిస్థాయి ప్రభుత్వ విభాగంలోనూ సమాచారహక్కు అమలు చేయడానికై ఒక ఉద్యోగిని నియమించాలి. పాలన విభాగపు కాంపౌండు గేటు (ప్రవేశ ముఖద్వారం) దగ్గర ఆ ఉద్యోగిస్థానం వుండాలి. నిరక్షరాస్యులుగానీ, అమాయకులైనవారుగానీ ఆ కార్యాలయం దగ్గరకొచ్చి ఈ శాఖను వెతుక్కోవాల్సిన అవసరం వుండకూడదు. సమాచార హక్కు చట్టాన్నమటుచేసే కౌంటరు గురించి ప్రజలందరికీ తెలిసేలా ఆయా ప్రాంత పాలనాధికారులు, నిర్వహణాధికారులు చర్యలు తీసుకోవాలి. ఆపని విషయంలో వారినే బాధ్యుల్ని చేయాలి.
సామాజిక మార్పుకై చేయాల్సిన అతిముఖ్యమైన ఇలాంటి పనుల్ని పడకనబెట్టి, రాజకీయ లబ్దినందించే రకాలకు చెందిన ఎరవేతల్లాంటి ప్రజోపయోగకార్యులకు పెద్దపీట వేయడం, అంతకంటే పెద్దయెత్తున ప్రచారం చేసుకోవడం ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ఎత్తుగడగా వుంటోంది. దాదాపు ఎక్కువశాతం ఓట్లు కుల, మత, ప్రాంత, పార్టీ నాయకుల (పెద్దల) గుప్పిట్లో వుండడంతో ఈ కార్యక్రమాలకు కేటాయించిన డబ్బు నుండీ ఆ నాయకులు ప్రయోజనం పొందేలా జాగ్రత్తలు తీసుకోడం జరుగుతోంది. అంతా ''ఓటర్లనాకట్టుకోడం ఎలా?'' అన్నదానిచుట్టూ తిరుగుతున్న కుటిల యెత్తుగడల పర్వమే. ప్రతిపక్షాలూ దీనిని నేరుగా, నిజాయితీగా తప్పనడంగానీ, నిరసించడంగానీ చేయడంలా. ఈ తప్పుడు పంథా ద్వారా అత్యధిక ప్రయోజనం ఎదుటి పార్టీవాడు పొందుతున్నాడన్నదే వీరి బాధంతా. అందుకే ఆ విధానం తప్పనకుండా, మేము అధికారంలోకొస్తే అలాంటి పనులే అంతకంత చేస్తామంటూ వరాలు, వాగ్దానాల వర్షం కురిపించేస్తున్నారు. అంతా ప్రజల్ని మత్తులో వుంచి, మాంసపు ముక్కొకటి ఎరగాచూపి, ఓటును గుట్టుగా కొట్టేసుకుందామన్న ఒకే ఒక లక్ష్యమే అందరిలోనూ గూడుకట్టుకుంటోంది.
భారతదేశ ఆర్థిక స్థితిగతులు :
1. ఈ దేశం ప్రపంచ దేశాలలో దేనితో పోల్చినా ప్రకృతిసంపద తక్కువ ఉన్నదిగా తేలదు. అనేక దేశాలతో పోల్చితే అపారంగా వున్న దేశంగానూ తేలుతుంది.
2. రాజకీయ నాయకులంతా కోట్లకు పడగలెత్తినవారే. ఇక ప్రధాన నేతలైతే, నిజాయితీగా వారి ఆస్తుల వివరాలివ్వగలిగితే 99% మందికి 100 కోట్ల పైబడ్డ ఆస్తులే వున్నాయి. అందులోనూ కొందరికైతే 100ల సంఖ్య దాటి వేల సంఖ్యను అందుకుంటూనో, దానిని దాటో ఆస్తులుంటున్నాయి.
3. తప్పుడు వ్యాపారాన్ని అప్పనంగా ఎలా చక్కబెట్టుకోవచ్చో, బినామీ పేర్లతో ఆస్తుల్ని ఎలా కూడబెట్టవచ్చోనన్న విద్యలో, ఉద్దండ పండితులైన వ్యాపారులు, రాజకీయ నేతలు, నిర్వహణ విభాగానికి చెందిన పెద్ద ఉద్యోగులు దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ వ్యాధిలా దాపురించారు.
4. 1 లక్ష కోట్లు నీటి పథకాలకు, లక్షలాది ఎకరాల భూములు, వ్యాపార కూడళ్ళకు, వేల కోట్లు విలువచేసే గనులను తమ స్వార్థ ప్రయోజనాలకు కొమ్ముకాసే అస్మదీయులకు కేటాయిస్తూ ఆస్తులు పోగేసుకునే పనికి గతకాలపు పాలకపార్టీ అంకురార్పణ చేయగా, ప్రస్తుత పాలక పార్టీ దానినో మహావృక్షంగా పెంచిపోషించేసింది.
5. ఈ దేశంలోనే ఈ వివిధ పార్టీల నేతల ఆస్తులన్నింటిని గనుక బైటపెట్టగలిగితే భారతదేశపు మొత్తం అభివృద్ధి పథకాలకు కావలసినంత ధనం సమకూడుతుంది. ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే 294 మంది ఎం.ఎల్.ఏ.ల ఆస్తే లక్ష కోట్ల వరకు వుండవచ్చు. (ఇప్పటి సి.ఎం., ఒకప్పటి సి.ఎం.ల కుటుంబ ఆస్తులు వారిరువురూ ప్రకటించకుండా వున్నదానినిబట్టే 20 వేల కోట్ల వరకు వుంటుంది. ఇది ఈ రాష్ట్రంలో వంకర లెక్కల క్రింద దాగున్న సంపద కాగా,
6. ఈమధ్య 'స్విజ్ బ్యాంకు' భాగోతమొకటి పెద్ద దుమారాన్ని లేపింది. 2006 నాటికే 1.5 త్రిలియనులు అంటే 1500 బిలియను డాలర్ల భారతీయుల డబ్బు; రూపాయలలోనైతే 1500þ50þ100=75 లక్షల కోట్లు స్విజ్ బ్యాంకులో నిల్వ చేయబడింది. దీని ఖాతాదారులు ముఖ్యంగా రాజకీయులు, బడా వ్యాపారులు, నిర్వహణ విభాగంలోని పెద్ద పదవుల్లో వుండే ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఆర్.ఎస్. లాంటి ఉద్యోగాల్లోనున్నవారు అనే ఆర్థికాంశాల విశ్లేషకులు చెపుతున్నారు.
ఈ అడ్డగోలు వ్యవహారాన్నంతా చూస్తుంటే, అణువంతైనా అమలుకాని ప్రజాస్వామ్య వ్యవస్థకంటే కొంతకాలంపాటైనా, సోక్రటీసు ఊహించిన తాత్వికుడైన నియంతపాలనగానీ, మార్క్స్ ఊహించిన కార్మిక నాయకత్వంగానీ అధికారంలో వుంటే బాగుండుననిపిస్తోంది.
రాజకీయ నాయకులు, విశ్లేషకులు అప్పుడప్పుడు చెపుతుండే, ''ప్రజలు చాలా తెలివైనవారు. సరైన సమయంలో పార్టీలకు, ప్రభుత్వాలకు సరైన గుణపాఠం చెపుతారు, చెప్పారు'' లాంటి మాటలన్న ప్రజల్ని మత్తులో వుంచేందుకు పనికొచ్చే ఎత్తుగడ మాటలు మాత్రమే. ప్రజలు గుడ్డిపోకడగాళ్ళు, గొర్రెల మంద, పల్లకీ మోయడానికి అలవాటుపడ్డ బోయీల స్వభావం కలిగినవారుగా వున్నారిప్పటికీ అన్నది పచ్చినిజం. దానిని గుర్తించి, ప్రజల్ని నచ్చజెప్పి, లేదా తిట్టీ, కొట్టయినా వారిని మేలుకొల్పి, రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని నిలబెట్టి, 'సేవకుల్లా ప్రవర్తించకుంటే చమడాలొలుస్తాం' అని నిగ్గదీసేలా జాగృతుల్ని చేయాల్సి వుంది.
బాధ్యతాయుతులైన పౌరులు లేని సమాజంలో ప్రజాస్వామ్యం మనలేదు. అది ఖచ్చితంగా మూకస్వామ్యంగా మాత్రమే వుంటుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ మూకను కట్టడి చేయగలిగిన కొద్దిమంది నాయకస్వామ్యంగా మాత్రమే వుంటుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ మూకను కట్టడి చేయగలిగిన కొద్దిమంది నాయక స్వామ్యంగా మాత్రమే వుంటుందది. ఈ దేశంలో ఇప్పటివరకు జరుగుతూ వచ్చిందదే. అత్యంత దౌర్భాగ్యం ఏమంటే, ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలున్నాయి, తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యంపార్టీ, సి.పి.ఎం., సి.పి.ఐ., బి.జె.పి., టి.ఆర్.ఎస్., నవ తెలంగాణా పార్టీ... ఇంకా ఈమధ్య పుట్టకొచ్చిన చిల్లర మల్లర - అన్నింటిలోనూ ఒకే ఒక్క రివాజు కనపడుతుంది.
టి.డి.పి.-చంద్రబాబు, కాంగ్రెస్-వై.ఎస్., ప్ర.రా.పా.-చిరంజీవి, సి.పి.ఎం.-రాఘవులు, సి.పి.ఐ.-నారాయణ, బి.జె.పి.-దత్తాత్రేయ; టి.ఆర్.ఎస్.-చంథ్రేఖర్, నవ తెలంగాణా పార్టీ-దేవేందర్ గౌడ్... ఇలా ఒక్కొక్కడే ఆ పార్టీ అంటేగా కనపడుతుంటారు. విచారకరమేమంటే రాజకీయ సంస్కరణలు, ప్రజాస్వామ్యాన్ని రక్షణ, ప్రజలే పాలకులు లాంటి ప్రతిపాదనలలో తెరమీదికొచ్చిన లోక్‌సత్తాలో కూడా లోక్‌సత్తా అంటే జె.పి. అన్నదే ప్రజలలో ఏర్పడ్డ భావం. బృంద నాయకత్వానికి పెద్దపీటవేసి ఎక్కడికక్కడ నాయక బృందాన్ని ప్రజలముందు పెట్టేపని ఒక్కరూ చేయరెందుకనో నాకర్థంకాదు. ప్రజాస్వామ్యానికి-ప్రాతినిధ్య ప్రజాస్వామ్యరూపంలోనైనా-ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలంటే అత్యవసర ప్రాధాన్యతను విషయంగా దీనిని తీసుకుని, రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ కమిటీల వరకు బృంద నాయకత్వానికి ఊపిరిపోయాలి. జిల్లాస్థాయిలో జిల్లా నాయకత్వాన్నదే నిర్ణాయక పాత్రగా వుండాలి. రాష్ట్ర నాయకత్వం రెండోస్థాయి ప్రాధాన్యతనే కలిగి వుండాలి. ప్రజాపాలను ఆకృతినివ్వడమంటేనే అది. దానికి వేరుగా ఎవరెవరు చెప్పినా అది ప్రజాస్వామ్యం మాత్రం కాజాలదు.
ఉదా : రాష్ట్రంలోని అభ్యర్థుల ఎంపిక అధిష్ఠానం చేస్తుంది అని నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. అది ప్రజాస్వామ్య విరుద్ధమన్న స్పృహే లేదు అందులోని వారికెవరికీ. తెలంగాణా సోనియాగాంధీ యిస్తుంది అనంటారు వాళ్ళు, తెలంగాణా కావాలన్నవాళ్ళు రాజ్యాంగబద్ధంగా అదెలా సాధించుకోవాలో చూడరు. సోనియా గాంధీకి విజ్ఞాపనలు, ప్రార్థనలు, విన్నపాలు చేస్తుంటారు. అంటే ఏమిటి? ఈ దేశంలో (1) ప్రజాస్వామ్యం లేదు; (2) ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం లేదు, (3) రాజరిక వ్యవస్థే నడుస్తోంది. ప్రస్తుతం ఈ దేశాన్ని పార్టీ అధ్యకక్షురాలి పేరున ఒక రాణి పరిపాలిస్తోంది అని అంగీకరించడమేకదా?
'బృందనాయకత్వం, ఎక్కడికక్కడ క్షేత్ర-స్థానిక-నాయకత్వం' అన్నది అమలుకానంతవరకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్య మన్నదానికి ఆరోగ్యంగానీ, బలంగానీ చేకూరనట్లే. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికే ఊపిరి రాకుండా ఇక ప్రజాస్వామ్యమెక్కడ? ప్రపంచంలో రాజకీయ క్షేత్రాలలో కేవలం పడికట్టు పదాలుగా రూపొందిన మాటలు రెండున్నాయి. ఒకటి కమ్యూనిజం, రెండు ప్రజాస్వామ్యం. ఈ రెంటి అర్థాలు (వాటి సంపూర్ణ రూపంలో) తెలిసినవారే అంతంత. ఇక వాటిని ఆచరణాత్మకం చేయాలన్న బుద్ధి, చిత్తశుద్ధి వున్నవాళ్ళు ఇంకెంత? అదీ సమస్య!
ప్రజాస్వామ్యంలో అదీ కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలన్న విధానాన్నెంచుకున్న దేశంలో ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పనే వుండకూడదు. అలాగే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామనే పార్టీలలో కూడా పార్టీ సభ్యులకు పై కమిటీ నాయకులతో (కొన్ని ప్రత్యేక పరిస్థితుల్నితప్ప) పని వుండనేకూడదు. స్థానిక ప్రభుత్వాలంటున్నామంటేనే, అధికారాన్ని, పాలన, నిర్వహణమైన అంశాలనూ వికేంద్రీకరిస్తున్నామన్నమాట. పనుల్ని, పదవుల్ని, అధికారులను, వికేంద్రీకరిస్తున్నామనేకదా దానర్థం? ఇందులో అర్థంకానంత జటిలతగానీ, గంద్రగోళంగానీ ఏమీ లేదు. ఏస్థాయికాస్థాయిలో ఎవరికీ దీనిని అమలు చేయడం ఇష్టంలేదు. ఒకరిద్దరికా ఆలోచనున్నా దానిని ఆచరణకు తెచ్చేంత శక్తి వుండదు.
1) ప్రజలు జరిగిన, జరుగుతున్న, జరగాల్సినదేమిటన్న దానిని గురించిన అవగాహన, స్పృహ లేకపోవడం.
2) ప్రతినిధులలో తాము ఆధిపత్యం చెలాయించే నాయకులంగానీ, అధికారులంగానీ కాదు, వారి తరఫున, వారికొరకు, వారిచేత ఎంచుకోబడి ఆ పనులు చేస్తున్నందుకుగానీ జీతభత్యాలు తీసుకుంటున్న జీతగాండ్లమన్న స్పృహ లేకపోవడం.
3) ఎంత నిర్దిష్టంగా పేర్కొనబడి, బుద్ధి గరపబడ్డా, గేటు వాచ్‌మెన్ ఉద్యోగినుండి, రాష్ట్రపతివరకు ప్రజలపై ఆయాస్థానాలకు తగిన అధికారులం అన్నదృష్టే ఏర్పడి వుండడం.
ఇవే, ఇవే ఈ దేశంలో జరగాల్సిన దాన్నంతటినీ తిరగేసి-తల్లక్రిందులుగా జరిగేట్లు చేస్తున్న కారణాంశాలు.
సమాజహితైషులకు కొన్ని సూచనలు
1) 'ఎన్నికల నిఘా కార్యక్రమం' కొరకై ఒక ఐక్యవేదిక ఊపిరిపోసుకోడం సంతోషించదగ్గదే. అయినా సమాజంలో రాజకీయ అనారోగ్యాన్ని పోగొట్టాలని పుట్టించుకున్నదానికి రోగం అంటకుండా చూసుకోడం, బలం పుంజుకునేలా శ్రద్ధ పెట్టడం తక్షణావసరం.
2) ఉద్యమ సంస్థలు రేపటి ఎన్నికలలోపున కలవగలంత మందిమి కలసి, ఉమ్మడి వేదికలు రాష్ట్రమంతటా నిర్వహిస్తే బాగుంటుంది. నిజాయితీ, ప్రజాస్వామ్య స్ఫూర్తిగల పార్టీలు దీనికి నిర్వహణాపరమైన అండదండలు చేకూర్చితే బాగు. ఇటువంటివాటికి (1) మానవ వనరులు, (2) ఆర్థిక వనరులు సమృద్ధిగా, కనీసం తగినంతగా వుంటేగాని ఇటువంటివి ఆటంకాలు లేకుండా పూర్తికావు. అది జరగాలంటే ఎక్కడికక్కడ పూనుకునేవారు సమకూడాలి.
3) (1) సామాజిక న్యాయం, (2) నల్లధనాన్ని, దొంగసొత్తును వెలికితీసి సమాజపరం చేయడం, (3) అధికార వికేంద్రీకరణ, (4) సామాజిక స్పృహను, ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగించగల విద్య, వైద్యము, ఉపాధి కల్పన, (5) గ్రామాల, వెనుకబడిన ప్రాంతాల సత్వరాభివృద్ధి-అన్న పంచసూత్రాల ప్రణాళికకు బహుళప్రచారం కలిగించడం జరగాలి.
(4) వివిధ ప్రసార మాధ్యమాలూ ఈ విషయానికి ప్రత్యేక, అత్యవసర ప్రాధాన్యతనిచ్చి వార్తాలాపాల పాత్రకు న్యాయం చేయాలి. ఆలోచించండి.
(5) ఎవరికొరకు ఈ మొత్తం కథంతా ఏర్పడిందో, ఆ ప్రజలలో సమష్టి బాగు-తమబాగు-కొరకు అన్న స్పృహ రానంతవరకు ఈ సమస్య పరిష్కరింపబడదు. ప్రజలు మేల్కొంటే సమస్య కొద్దికాలంలోనే సమసిపోతుంది. ప్రల్ని మేల్కొల్పాలి.
No comments:
Post a Comment