'వివేకపథం' పత్రిక జిల్లా పాఠకుల సమావేశ వివరాలు
కృష్ణాజిల్లా :
ముందుగా ప్రకటించినట్లుగనే 15-2-09న ఆదివారం ఉదయం 10 గంటల నుండి సా|| 5 గంటల వరకు 'వివేకపథం' పత్రిక కృష్ణాజిల్లా పాఠకుల సమావేశం సాయిదత్తా టవర్స్‌లో జరిగింది. సుమారు 30 మంది హాజరయ్యారు. మిత్రసంఘాల సభ్యులు జంపా క్రిష్ణకిషోర్, టి.వి.రమణయ్య, ఆర్.ఎస్.నాయుడు, అహల్యాదేవి మొదలగువారు కూడా హాజరైనవారిలో వున్నారు.
ముందుగా సత్యాన్వేషణ మండలి కోశాధికారి యర్రంశెట్టి జగన్మోహనరావు సభికులకు స్వాగతం పలుకుతూ, సంస్థ వ్యవస్థాపకులైన పుట్టా సురేంద్రబాబు, అధ్యకక్షులైన చెరుకూరి వెంకట్రామయ్య, సిద్ధాంత పరిచయకర్త శీలం నాగార్జున, ప్రధాన కార్యదర్శి కోట ప్రసాద్, మిత్రసంఘమైన జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ఉపాధ్యకక్షుడైన జంపా క్రిష్ణకిషోర్‌లను పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. వక్తలు ముందుగా శీలం నాగార్జున మండలి ప్రాతిపదికల్లో ముఖ్యమైనవాటిని, మండలి నియమాలకు, కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు.
ప్రాతిపదికలు :
1. సరియైన జ్ఞానంతో, సరియైన పనిచేస్తే సరియైన ఫలితాన్ని పొందవచ్చు.
2. మనిషికి తెలిసిన తెలియని.... పరిస్థితులుంటాయి. వాటిని గమనించి తన జీవితాన్ని సరిదిద్దుకోవాలి.
3. నేను-నాది నుండి, మేము-మాదికి, మేము మాది నుండి మనము-మనది అనే స్థాయికి మనుషులు ఎదిగినపుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది.
మండలి సభ్యులు పాటించవలసిన నియమాలు :
1. సమయ పాలన పాటించాలి.
2. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం
3. చేస్తానన్న పని మనసుపెట్టి చేయడం.
4. గురువు వేషం వేయకుండటం.
5. పొగడకుండటం, పొగిడించుకోకపోవటం, తెగడకుండడం, తెగిడించుకోకపోవటం.
6. గుర్తింపుకు ప్రాధాన్యత యివ్వకపోవడం.
7. చందాలు స్వీకరించకుండటం
8. కుల, మత, లింగ వివక్షతలు పాటించకుండటం.
ఆ తరువాత విద్య, వైద్యరంగాల మీదా దృష్టితో మండలి చేపట్టిన కార్యక్రమాల్ని స్పృశించి ముగించారు.
ప్రధాన కార్యదర్శి కోట ప్రసాద్‌గారు ప్రసంగ సారాంశం ఏమంటే - ''మండలి ఒక సామాజిక అభ్యుదయ స్వచ్ఛంద సంస్థ. ఆస్తిక పక్షంతో మొదలై అనేక మజిలీలు చేస్తూ ప్రస్తుత స్థితిలో వుంది. సిద్ధాంతాల మధ్య భిన్నాభిప్రాయాలు, విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు కూర్చుని తేల్చుకోవాలి, భ్రమల్లో ఉన్నవారు తమది భ్రమజ్ఞానమని తెలుసుకొని సరిదిద్దుకోవాలి. అనేక సిద్ధాంతకారుల్ని కలసి, వారి ప్రతిపాదనలు సత్యమని ఋజువు చేయమనేవాళ్ళం. ఋజువు చేయలేకుంటే, తప్పని ఋజువయితే ఆ విషయాన్ని ప్రకటించాలని నియమం పెట్టేవాళ్ళం. కాని తేలిందేమంటే నియమాన్ని ఒప్పుకోనివారు లేరు. చర్చ అనంతరం నియమాన్ని పాటించిన వారు లేరు. ఇదంతా భిన్న తాత్విక ధోరణుల ద్వారా కలిగిన అనుభవం. అనేక సంఘాలు సమాజ ప్రగతికోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఫలితం రావటంలేదు. కారణం ఏ సంఘానికో సంఘం విడివిడిగా పనిచేయడమే. ఇది గమనించే ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని సంఘాలు కల్సి పనిచేయాలని నిర్ణయించాము. అది వంచనా ప్రతిఘటనా వేదికతో మొదలై ఐక్యమిత్రమండలి వరకు వచ్చింది.
అంతేకాక మనం చేసే పనిద్వారానైనా మనం ఆశించిన ఫలితాలే రావాలంటే, అన్య ఫలితాలు రాకూడదని ఆశిస్తే లక్షణ ప్రమాణ విద్య తెలియడం అవసరం. అది నేర్పిస్తున్నాము. మనిషి తాను తానుగా గాక వేరేవారి ప్రభావంతో నడుస్తున్నాడు. లక్షణ ప్రమాణ విద్యద్వారా తన్నుతానుగా చూడగల్గుతాడు.
అంతేకాక మనిషి తప్పుడు సామాజికీకరణవల్ల కూడా ప్రభావితుడౌతున్నాడు.
మనం శాంతితో గూడిన సుఖముగావాలని కోరుకుంటాము. కాని మనకు అనేక సామాజిక సమస్యలు వున్నాయి. కొన్ని తీరేవి, కొన్ని తీరటానికి అవకాశం లేనివి వున్నాయి. ఉదాహరణకి ప్రకృతి వనరులు మనం వాడుకుంటే తరిగిపోతుంటాయి. అది మనకు తీరని సమస్య. అందువలన ప్రకృతి వనరుల విషయంలో ముందుచూపు వుండాలి. వీటన్నింటికీ అధిక జనాభా ఒక కారణం. జనాభా నియంత్రణ గురించి మనందరం ఆలోచించాలి. అదేవిధంగా మన దేశములో గ్రామీణ జనాభా అత్యధిక శాతము. మన అభివృద్ధి గ్రామాలమీద ఆధారపడి వుందిగనుక గ్రామాల సమస్యలపై, గ్రామాభ్యుదయముపై కార్యక్రమాలు జరగాలి. దీనికి ముఖ్యంగా యువతను సమాయత్తం చేయాలి. అందుకొరకు ఐక్యమిత్రమండలి 10,000 కాలేజీల్లో యువకులకు గ్రామాభ్యుదయం గురించి వివరించేందుకు కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. అందుకనే మేము కేవలం మా సత్యాన్వేషణ మండలిలోనే సభ్యులుగా చేరమని మిమ్మల్ని అడగడంలేదు. మీకు ఏ సంస్థ భావజాలం నచ్చితే ఆ సంస్థలో సభ్యునిగా చేరి సమాజంకొరకు పనిచేయమని అడుగుతున్నాం'' ఇలా ఉత్తేజభరితంగా సుదీర్ఘంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ సాగింది కోట ప్రసాద్‌గారి ప్రసంగం.
తదుపరి-సంస్థ అధ్యకక్షులు చెరుకూరి వెంకట్రామయ్యగారు మాట్లాడుతూ, ''అసాంఘిక శక్తులను ప్రతిఘటించటానికి, సమాజంలో మార్పు తేవటానికి సామ, దాన, భేద, దండోపాయాలలో తగినదాన్ని ఎంచుకుని'' ప్రయోగించాలన్నారు. ప్రతి దేశం సాంఘికంగా, ఆర్థికంగా, నైతికంగా, రాజకీయంగా, మానసికంగా, శారీరకంగా అనే ఆరు రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి.
జన్మకు ముందు, మరణం తరువాత జరిగే విషయం ఏమిటి అనేవి, చైతన్యంముందా, పదార్థం ముందా అనేవి అనిర్ధారితాలు. తేలేవికావు. వాటిని గురించి ఆలోచించి తలలు బద్దలుకొట్టుకుని సైద్ధాంతిక ఘర్షణ పడటంకంటే ఇహలోకపరమైన విషయాలపై తాత్వికులు దృష్టిపెట్టాలి''అంటూ సంక్షిప్తంగా ప్రసంగించారు.
తదుపరి లోక్‌సత్తా కార్యకర్తగా నూజివీడులో కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుత్తికొండ అహల్యాదేవి ఉద్యమకారిణిగా తన అనుభవాలు, మహిళగా సమాజంలో తాను ఎదుర్కొన్న ప్రతిఘటన, వివక్ష సవివరంగా, స్ఫూర్తిదాయకంగా వివరించారు. తన ఆదాయంలో 10 శాతం సమాజంకోసం కేటాయిస్తామన్నారు. తాను వ్రాసిన 'నడుస్తున్న చరిత్ర' కవితల సంకలనం సభికులకు ఉచితంగా పంచారు.
తరువాత క్రిష్ణకిషోర్‌గారు ఐక్యమిత్రమండలి కార్యక్రమమైన 'ఎన్నికల నిఘావేదిక' కార్యక్రమాన్ని వివరించి అందర్నీ పాలుపంచుకొమ్మని సూచించారు. తాను టి.వి.లోనూ సత్యాన్వేషణ మండలిలోనూ, రెండింటిలోనూ సభ్యుడనని, అలా ఎవరైనా ఎన్ని సంస్థల్లో కార్యక్రమాలు చేయగలిగితే అన్ని సంస్థల్లో సభ్యుడిగా చేరటానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని చెప్పారు.
తరువాత కె.ఎల్.సి. ఇంజనీరింగ్ కాలేజి ఇంజనీరింగ్ విద్యార్థి మృత్యుంజయ మాట్లాడుతూ తాము అందరూ అనుకున్నట్లు గొప్ప కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదనీ, ఒక అనాధ శరణాలయానికి వారి పండ్లు, బట్టలు పంచామని, ఇంకా ఎంతో చేయాలని వుందనీ, వేసవి సెలవుల్లో కొన్ని కార్యక్రమాలు చేయాలనీ ఆశిస్తున్నట్లు చెప్పారు.
రాజీవ్ గృహకల్ప బాధిత సంఘం అధ్యకక్షుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ, రాజీవ్ గృహకల్ప లబ్దిదారులు అంతా సంఘటితంగా ఎలా ప్రభుత్వాధికారులతో పోరాడుతున్నారో వివరించారు. భవిష్యత్లఓ ఈ సంఘటితమే తనకు మేలు చేస్తుందన్న ఆశను వెలిబుచ్చారు. వినియోగదారుల సమాఖ్య తరఫున హాజరైన డా|| రమణయ్యగారు వినియోగదారులు అవగాహన పెంపొందించుకోవాలని, మోసానికి గురవకుండా జాగ్రత్త వహించాలని, అవసరమైతే కేసులు వేయాలని తమ అనుభవాలు వివరించారు.
మధ్యాహ్నం భోజనానంతరం సంస్థ వ్యవస్థాపకులు, వివేకపథం పత్రిక సంపాదకులు పుట్టా సురేంద్రబాబు పాఠకులతో సందేహాలు, సమాధానాలులో పాల్గొన్నారు.
అహల్యగారు వెలిబుచ్చిన సందేహాలు సంక్షిప్తంగా ...
1. ముఖచిత్రము కవర్‌పేజీలో ఆనెల ప్రత్యేక కథనాన్ని సూచించేట్లు వుంటే ఆకర్షణీయంగా వుంటుంది.
2. స్పందన-ప్రతిస్పందనలో కేవలం ఇద్దరు సైద్ధాంతికుల మధ్య చర్చ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పాఠకుల పాత్ర కనిపించుట లేదు. అయోమయంలో పడిపోతున్నట్లుగా వుంటుంది.
3. కేవలం ఈ సిద్ధాంతాలేకాకుండా అనేక సామాజిక సమస్యలనూ ప్రస్తావించవచ్చు.
4. చదవాలంటే పాఠకులు భయపడుతున్నారు. ముఖ్యంగా భాషా శైలి.
క్రిష్ణకిషోర్‌గారి సూచనలు :
1. ఇలాంటి కార్యక్రమాల ఫొటోగ్రాఫ్‌లను కూడా ప్రచురించండి.
2. మీడియాను కూడా ఆహ్వానిస్తుండండి.
3. మిత్రసంఘాల సమాచారాన్ని కూడా ప్రచురించండి.
4. ఇతరులు వ్రాసినవికూడా ప్రచురిస్తే బాగుంటుంది.
కోయ వెంకటేశ్వర్లుగారు :
స్పందన-ప్రతిస్పందనకు పేజీలు పెంచండి. కేవలం పత్రికలో వచ్చిన విషయాలపైనేకాక ఇతర అనేక అంశాలపైన పాఠకులు ప్రశ్నించే అవకాశం వుంటే బాగుంటుందన్నారు. అంతేకాక మండలి ఎలక్ట్రానిక్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన భావజాల ప్రచారానికి ఉపయోగించుకోవాలని చెప్పారు.
తోటకూర వెంకటేశ్వర్లుగారు :
ఏదైనా విషయంమీద సుదీర్ఘంగా చర్చ జరిగినపుడు, దాన్ని సీరియస్‌గా అనేక సంచికల్లో ప్రచురించటమేకాక, చర్చ పూర్తి అయిన తరువాత ఆ సారాంశాన్ని ఒక సంచికలో ప్రచురిస్తే పాఠకులకు ఉపయోగంగా వుంటుందన్నారు.
ఇలా పాఠకులు అడిగిన ప్రశ్నలకు సురేంద్రగారు సమాధానాల సారాంశము ఏమంటే - వివేకపథం కేవలం సైద్ధాంతిక పత్రికగానే నడుపుతున్నాం. మా సిద్ధాంతాన్ని మేం చెప్పుకుని ప్రతిపాదిస్తే బాగుంటుంది. మా ప్రతిపాదనలు ఋజువుచేసే బాధ్యతకూడా మాదే. ఇతర పత్రికలలాగా అన్ని విషయాలకూ ఇందులో చోటుండదు. అందువలన ఇతరుల వ్యాసాలనూ వేయడం కుదరదు. కాకుంటే అహల్యగారూ, వెంకటేశ్వర్లుగారు అన్నట్లు ప్రశ్నలు-సమాధానాలు, స్పందన-ప్రతిస్పందన శీర్షికల నిడివి పెంచి పాఠకుల అభిప్రాయాలను ప్రచురిస్తాము. అలానే ఈ శీర్షిక ద్వారా పాఠకుడు ఏ విషయాన్నయినా ప్రతిపాదించదలచినపుడు ఋజువు చేసే బాధ్యత కూడా తీసుకోవాలి.
స్పందనలు చర్చనీయాంశానికి అనుగుణంగా వున్నంతవరకు యథాతథంగా ప్రచురిస్తాము. కాని ప్రశ్నలను క్లుప్తీకరించి పంపండి. జవాబులు వివరంగా వ్రాయటానికి కారణం కేవలం ప్రశ్నించినవారి కోసమేకాక, పాఠకులందరికీ చర్చ అర్థంకావాలనే ఉద్దేశ్యం వుంది. ప్రశ్నలు ప్రకరణ భంగంగాకుండా వుండాలి. ఆవేశాలు చోటుచేసుకుంటున్న అనేక లేఖలు వస్తున్నాయి. అన్నీ వేయలేము. అందుకనే ముఖ్యంగా ఈమధ్య మాతో దీర్ఘకాలంగా చర్చిస్తున్న రహ్మాన్ గారికి ముఖాముఖి కూర్చుందామని సూచన చేశాం. ఆ విధంగా చేసిన చర్చని రికార్డుచేసి తేలిన విషయాన్ని ప్రచురిద్దామని వ్రాశాం. ఇది పాఠకులకు సౌలభ్యంగా వుంటుందనుకుంటున్నాను.
ప్రతి రచయితకూ ఒక్కో ప్రత్యేకశైలి వుంటుంది. వివరణాత్మకంగావ్రాయటం నాశైలి. పత్రికను సైద్ధాంతిక పత్రికగానే చూడండి. మండలి మత మార్పిడికి వ్యతిరేకం. అందువలనే దానిమీద సుదీర్ఘంగా వ్యాసాలు రాస్తున్నాను. ముఖ్యంగా విభేదిస్తున్నవారిని నిర్లక్ష్యం చేయం.
భాషాశైలిని సాధ్యమైనంతవరకు సరళీకరించాం. మొదట్లో మేము ప్రచురించిన 'మేలుకొలుపు' పత్రికలు చూసినవారికి ఈ విషయం అర్థం అవుతుంది. ఇది ఒక స్థాయిలో వున్నవారిలో ఆలోచన రేకెత్తించే పత్రికకాదు. కాలక్షేపం కోసం చదివే సామాన్యుల పత్రిక కాదు. ఎం.ఏ. స్థాయిలో నేను వ్రాస్తుంటే మీ ఆ స్థాయికి రావాల్సిందేతప్ప నేను స్థాయికి తక్కువగా వ్రాయటం కుదరదు. విషయం అలాంటిది. మేధోశ్రమ చేయగలవారి నుద్దేశించి పత్రిక వ్రాస్తున్నాను.
వంచకుడు తప్ప మాకు ఎవరూ శత్రువుకాదు. జ్ఞానం తక్కువగా వుంటే పోయేదేమీ లేదు. కాని హృదయం మాత్రం పెంచుకోండి. చెప్పిందంతా ఎవరూ చేయలేరు. అందుకనే సాధన అవసరం. మేము నిరంతర సాధకులం. మేము సైద్ధాంతిక పత్రిక నడుపుతున్నా, సంస్థల కార్యక్రమాలతో కలసి పనిచేస్తున్నాం.
మా సంస్థకు విలువైన సిద్ధాంతము వుంది. కాని నిర్మాణం కాలేదు. ఇప్పుడు దానిపై దృష్టి సారిస్తున్నాము అంటూ వివరించారు.
చివరగా జంపా క్రిష్ణకిషోర్‌గారు ఎన్నికల నిఘావేదిక గురించిన కార్యక్రమ ప్రణాళిక అందరికీ తెలియపరుస్తామన్నారు.
సాయంత్రం 5 గంటలకు సమావేశం ముగిసింది.
ఉద్యమ సమాచారం :
1. ఎన్నికల నిఘావేదిక కార్యక్రమంలో భాగంగా 19-3-2009వ తేదీన మధ్యాహ్నం నూజివీడులో ఎం.ఆర్.అప్పారావు పి.జి. క్యాంప్‌లోని విద్యార్థులకు ఎన్నికలలో ఓటు ఉపయోగం, అవకతవకలపట్ల జాగరూకత, నిఘా ఆవశ్యకత, సమాచారాన్ని ఎలా నిఘావారికి అందించాలి అనే విషయం గురించి జంపా క్రిష్ణకిషోర్, ఉదయసింగ్ గౌతమ్, కోట ప్రసాద్, అహల్యగార్లు వివరించారు.
2. అదేరోజు సాయంత్రం నూజివీడులో రామాలయంవద్ద ఓటర్లకు కూడా పై విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జంపా క్రిష్ణ కిషోర్, ఉదయసింగ్ గౌతమ్, యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు, అహల్యగార్లు ప్రసంగించారు.
3. 20-3-2009 తేదీన గన్నవరం ఎస్.ఎస్.వి.ఎస్.రామ్ పబ్లిక్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సత్యాన్వేషణ మండలి ప్రధాన కార్యదర్శి కోట ప్రసాద్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ''తల్లిదండ్రులు పిల్లలకు అవసరమైనవి ఇవ్వాలా లేక పిల్లలు కోరినవి యివ్వాలా అనేది ఆలోచించాలన్నారు. పిల్లలు రోజూ స్కూల్‌కి వెళ్తే చాలునని, కేవలం ఫస్ట్ ర్యాంక్ వస్తే మంచిదనే అశాస్త్రీయ భావనలతో వున్నారు. వారి భావాలను పిల్లలపై రుద్దటం జరిగి వారు పిల్లల్ని ఎ.టి.ఎం.ల్లాగా భావిస్తున్నారు. హోమ్‌వర్క్ చేస్తేనే భోజనం లేకుంటే లేదు అని బాధలు పెట్టేవారూ వున్నారు. ఇంట్లో పెద్దతరాన్ని గౌరవించటం పూర్వ నేర్పేవారు. ఇపుడు అలాలేదు. విద్యార్థులు మంచిగా తయారయితే రేపు సమాజం కూడా ఉత్తమ సమాజం అవుతుంది. తమ ఆలనపాలనను పిల్లలు పెద్దయిన తరువాత చూడవలసిన అవసరం లేదని మామూలు విషయంగా చెప్పేస్తుంటారు. కాని పిల్లలు ఆ బాధ్యత లేనివారుగా తయారవుతారని, ఆ సామాజికీకరణలో అది తప్పుమార్గమని గమనించటంలేదు. తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యాయలు పిల్లల సామాజీకరణలో ముఖ్యపాత్ర వహిస్తారు. ఉపాధ్యాయులకు జీతాలు తక్కువ. బాధ్యతలు ఎక్కువ. వీరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే సమాజం అంతా దెబ్బతింటుంది. విద్యార్థులకు, సమాజ శ్రేయస్తే తమ శ్రేయస్సు అని నేర్పేవారే ఉత్తమ ఉపాధ్యాయడు అనాలి. అమాయక విద్యార్థులను శిక్షించకూడదు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. విద్య కేవలం ఉద్యోగం కోసమేకాక వివేకం కోసం అని ఉపాధ్యాయులు గుర్తుంచుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలి''అంటూ తమ సందేశాన్నిచ్చారు.
4. 25-3-2009వ తేదీన 'ప్రత్యేక మండళ్ళ' విధానానికి వ్యతిరేకమంటూ, ఆ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని సబ్‌కలెక్టర్, కృష్ణాజిల్లా ద్వారా రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో అశ్లీల ప్రతిఘటన వేదిక అధ్యకక్షులు ఈదర గోపీచంద్, సత్యాన్వేషణ మండలి కోశాధికారి యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు, రాజీవ్ గృహకల్ప బాధితుల అధ్యకక్షుడు ఆర్.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment