Wednesday, April 1, 2009

స్పందన - ప్రతిస్పందన



స్పం. (1) : సి.టి.ఎఫ్‌. పేరున, ఒక ఇ-మెయిల్‌ వచ్చిందినాకు. అందులో వివేకపథంలోని నా వైఖరిని అభినందిస్తున్నామని, ప్రస్తుతం పనుల వత్తిడిలో వుండడంవల్ల తమ సమాధానాన్ని పంపలేకపోతున్నామనీ, దీనిని తాము బాధ్యతల్ని ఎగవేయడంగా భావించవద్దని వ్రాశారు. ప్రకాష్‌గారి తల్లిదండ్రులకు అనారోగ్యంగా వుండడంతో ప్రకాష్‌గారు వారి పనులు చూడడంలో బిజీగా వుంటున్నారనీ వ్రాశారు. చెన్నైలో ఏవో సమావేశాలు పనులున్నట్లు వ్రాశారు.

ప్ర.స్పం. : మంచిదండీ! తీసుకువచ్చిన అత్యవసర పనుల్లో ముందుగా చక్కబెట్టుకోవడం ఎవరైనా చేయవలసిన క్రమమే. అందునా ప్రకాష్‌ విషయానికి వస్తే, అవెంత వత్తిడి పనులైనా ఆవలబెట్టి, తల్లిదండ్రుల విషయంలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించడమే సముచితం. ఆ పెద్దవాళ్ళిద్దరి ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిద్దాం. ఇంతలోనే మన విషయ విచారణ కొంపేమీ మునిగిపోదు. అలాగే మీ పనులూ కానివ్వండి. తరువాతే మన వివాద విషయం దగ్గరకొద్దాం.
ఒక్క విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పటికి నా లేఖను ఆపుతాను. మళ్ళా నేనే మొదలెట్టి మీ సమాధానం పంపలేదేమండీ అనడిగేదాకా ఊరుకోకుండా, మన వేదిక క్రమాన్ననుసరించి మీ పక్షపు బాధ్యతను నిర్వర్తించండి. అది (1) మా సి.టి.ఎఫ్‌. సభ్యుల వివరాలు (కనీసం ప్రకాష్‌ మొదట లేవనెత్తిన 13 అంశాలకు ఉమ్మడిగా బాధ్యత వహిస్తున్నామనేవారి వివరాలు) అందించండి, (2) బైబిలు సృష్టివాదాన్ని ప్రకటించి అది సరైందేనని నిరూపించండి, (3) స్వస్థత ప్రార్థనల శక్తినీ నిరూపించండి. వేదిక నిర్వాహకులుగనున్న నేను-ఫజులుర్‌ రహ్మాన్‌గారూ ఇరువురమూ ఇక సృష్టివాదాన్ని ప్రతిపాదించడమే జరగాల్సిందని నిర్ణయించాం. ఆపని చేయండని అడగడానికి, అడిగేవారు వారి సిద్ధాంతాలను చెప్పే ఆ మాట అడగాలన్న నిబంధనేదీ మా వేదికలో లేదు కనుక ఆ మాట మళ్ళా మళ్ళా అనకండి.
మీకు అభ్యంతరం లేకుంటే మీ చెన్నై సమావేశపు వివరాల రికార్డు కాపీ (సి.డి.) ఒకటి పంపండి. మీ వేదిక నిబంధనావళి ఏమైనా వుండి, ఇవ్వడానికి సాధ్యపడకుంటే వత్తిడేమీ లేదు. ఇప్పటివరకు ఆ మా వేదికలో పాల్గొన్న వారిలో పెక్కురు మీకూ, మీకూ కూడా అనంతర కార్యక్రమంగా ఇస్లాం క్రైస్తవ వాదాల్ని ప్రకటించమని లేఖలు వ్రాశారన్నది మన ఇరువురకూ తెలిసిందే. ఆ బాధ్యత నుండి దూరం పోడంలేదని మీరూ వ్రాశారుగనుక, ఆ మీ సమాధానం కొరకు మేము, మా వేదికలో పాల్గొన్న ఇతర సంస్థలవారూ, మా పాఠకులూ ఎదురు చూస్తుంటాము. సెలవ్‌.
స్పం. (2) : 151 సంచిక చదివాక ఈ లేఖ వ్రాస్తున్నానంటూ ఫజులుర్‌ రహ్మాన్‌గారు ఇలా వ్రాశారు.
గత సంచికలో పత్రిక ద్వారాకంటే, మనం కూర్చుని మాట్లాడుకుంటే బాగుంటుందేమోనన్న నా సూచనను, అది మన మధ్యనున్న సత్సంబంధాలను బలహీనపడకుండా వుండాలన్న హిత సూచనగా తలంచక దానిపైనా అనేక సందేహాలను అభిప్రాయాలను వెలిబుచ్చారు''అని వ్రాశారు.
అది సరికాదు. వివేకపథం 150, 23వ పేజీ చివరిలో ''మీకేది మంచిదని తోస్తే అలాగే సాగిద్దాం మన సంబంధాన్ని'' అని మీరేకదా రాశారు. దానిపై నాకు పత్రిక ద్వారానే బాగుంటుందని నా అభిప్రాయాన్ని తెలిపాను.
మీరే వ్రాసిన ఆ వాక్య భాగాన్ని పట్టించుకోకుండా, మళ్ళా వివేకపథం 151లో మరో రెండు పేజీలు నేను వ్రాసిందానిపై అనవసరంగా విశ్లేషణ చేశారనిపించింది (గత లెటర్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది).
''మీకేది మంచిదనిపిస్తే ఆ మార్గాన్నే సాగిద్దాం'' అని మాటవరసకు స్వేచ్ఛనిచ్చినప్పటికీ, మాకు పత్రికద్వారా ఇష్టంలేదనిపిస్తోంది కాబట్టి, నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఇక పత్రిక ద్వారా నా అభిప్రాయాలను తెలియజేయడం విరమించుకుంటున్నాను. వీలునుబట్టి, పరిస్థితుల్నిబట్టి మనం కూర్చునే మాట్లాడుకుందాం.
ప్ర.స్పం. : యోచనశీలురైన రహ్మాన్‌గారికి, మీ లేఖల్లో ఒక ముక్క చెపితే సరిపోయేదనికి ఇంతెందుకు రాశారు. అంతెందుకు వ్రాశారు అన్నమాట వుంటోంది. పత్రికలో నా రచనంతా, పాఠకులందరినీ కూడా దృష్టిలో పెట్టుకున్నదిగనే వుంటుంది. అందునా నిర్దిష్టమైన లక్ష్యంతో ప్రజలకు ఏదో తెలియజేయాలన్న దృష్టికల పత్రికలకు అలా విషయాన్ని విశ్లేషణాత్మకంగా వ్రాయడం తప్పనిసరౌతుంది. అది మన సంబంధాలను బలహీనపరచవచ్చు అని వ్రాశాను. మీరూ ఆలోచించండి అన్న సూచన చేశాను. ఇంతా ఆలోచించే పత్రికే సరైన వేదిక అని మీరనుకుంటే అలాగే చేద్దాం అనీ అన్నాను.
నేను అత్యంత సరళంగా అన్న మాటల్ని ప్రతిసారీ మీరు తప్పుగా తీసుకుని దానిపై మరికొన్ని ప్రకటనలు చేస్తున్నారు. అక్కడికందులోనే ఏదో దోషముందన్నట్లు వ్రాస్తున్నారు. 150వ సంచిక 23వ పేజీలో నేను రాసిందాన్ని, మీరు సజావుగనే అర్థంచేసుకుని వుంటే, పరిచయాలేమీ చెడిపోవులెండి విషయాన్నికదా విచారిస్తోంది మనం. మన స్నేహాన్ని చెడగొట్టేంత బలమేమీ వుండదులే దానికి. పత్రికద్వారానైతే మన ఇరువురిమధ్య జరిగిన, జరుగుతున్న పరిశీలన-దాని పర్యవసానాలు పదిమందికీ తెలుస్తాయి. కనుక అందరికీ ఆ మేరకు మేలు కలుగుతుంది అని వ్రాసి వుండాల్సింది. కానీ మీరలా వ్రాయలా. పైగా ఈ లేఖలో మరో ఎత్తిపొడుపు పోకడ పోయారు.
''మీకేది మంచిదని తోస్తే ఆ మార్గాన సాగిద్దాం మన సంబంధాన్ని'' అన్నమాట మీకు మాటవరసకు యిచ్చిన స్వేచ్ఛగా కనపడిందన్నమాట. నిజానికి అనుమాటల్లో స్వేచ్ఛగానీ, స్వేచ్ఛ లేకపోవడంగాని అన్న అర్థంలేదు. ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి ఒక నిర్ణయం చేయండన్నానంతే. ఆమాటా ఎందుకన్నాను? బహిరంగంగా పరస్పరం విషయ విచారణ వ్యక్తి పోకడల విచారణ సాగించే విధానంలో 'అహం' వత్తిడికి లోనయ్యే అవకాశం వుంది గనుక అది క్రమంగా మన సంబంధాలను ఏమైనా బలహీనపరుస్తుందేమోనన్న ఆలోచనతో అన్నవవి. దానిపై మీరేమి వ్రాశారు?
(1) ఆనా సూచనలో ఆలోచించాల్సిన పెద్ద భాగమే వుందన్నారు, (2) అదంతా అందరూ తెలియాల్సిన భాగమన్నారు, (3) నా మాటలకు-రాతలకు మధ్య వైవిధ్యాన్ని చూశానన్నారు, (4) భిన్న ఆలోచనలుకల వ్యక్తుల మధ్య రాతలు పరిచయాలను బెడిసికొట్టేలా చేస్తాయా? మనలో మనం పేరిట పత్రికలు, మీడియా ఉపయోగపడవా? అనీ అడిగారు, (5) నా లెక్క ప్రకారమైతే మాట్లాడుకోవడం కంటే వ్రాయడం ద్వారానైతేనే చేస్తున్న విశ్లేషణనుబట్టి వ్రాసిందేమిటో, వ్రాసినవారేమిటో సమాజం గ్రహిస్తూ వుంటుందనీ, కనుక నాకైతే పత్రికద్వారా విశ్లేషణే మంచిదనిపిస్తోందని వ్రాశారు.
నేను చేసిన సూచనేంటి? మీరు లేవనెత్తిన అంశాలేమిటి? మన సంబంధాలు బలహీనపడొచ్చు, బహిరంగ విమర్శలకు దిగితే, ఆలోచించండి అనంటే, 5, 6 అనవసరపు ప్రశ్నలు లేవనెత్తిందికాక, నేనేదో మీకు మాటవరస స్వేచ్ఛనిచ్చానంటూ, నిజానికి స్వేచ్ఛనివ్వలేదంటూ ఈ లేఖలోనూ మరో విరుపుమాట మాట్లాడారు.
పరిస్థితిని విడమరచి ఎలాచేస్తే బాగుంటుందో ఆలోచించమంటే, అక్కడికి, పత్రిక ద్వారా విచారణకు నేనే వెనుకాడుతున్నట్లు మాట్లాడి, మీ కిష్టంలేదు గనుక విరమిస్తున్నాను. అని ఒక ముక్తాయింపూ జోడించారు. వీలునుబట్టి పరిస్థితులనుబట్టి మనం కూచునే మాట్లాడుకుందాం అంటూ ముగించారు.
అస్సలింతకూ విషయ విచారణ, విమర్శ మొదలెట్టకుండగనే, బహిరంగ విచారన మన సంబంధాలపై ఒత్తిడి పెట్టవచ్చునన్న నా మాట, దానిని వివరించడానికి నే చేసిన విశ్లేషణే వీలుంటే, పరిస్థితుల్నిబట్టి కలుద్దాంలెండి అన్నదగ్గరకు మిమ్మల్ని నెట్టేశాయి. విచారణ సజావుగ సాగుతుంటే సంబంధాలు పటిష్టంగా వుండడం చాలా అవసరం. అందుకై మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోడం అవసరం అన్న నా మాటలు, మీకెంత తేడాగా కనిపించాయి? ఈ మీ లేఖనుబట్టి, ఇప్పటికే మన సంబంధాలు, విచారణకు సంసిద్ధత అనేవి ఒకింత బలహీన పడనే పడ్డాయి.
మధ్యలో విచారణను విరమించుకోనూ, సంబంధాలు తెంచుకోను. విచారణలో తేలిన అభిప్రాయాలను స్వీకరిస్తాను అని బహిరంగంగా-పత్రికాముఖంగానే-మీరొక ప్రకటన చేయండి. పత్రికద్వారానే, మీరభిలషించేలా నలుగురికీ తెలిసేలానే మాట్లాడుకుందాం. నావైపునుండి నేనుచేసే బహిరంగ ప్రకటనేమంటే, నా వైఖరిలోగానీ, అవగాహనలోగానీ లోపాలుంటే సరిదిద్దుకుంటాను. మళ్ళామళ్ళా ఆ తప్పులు జరగక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాను. తేలిన విషయాలు స్వీకరిస్తాను. విచారణ ఒక కొలిక్కి వచ్చేవరకు విచారణను అర్థాంతరంగా విరమించుకోను. విషయాన్ని విచారించేటప్పుడు వ్యక్తిత్వాన్నిగానీ, వ్యక్తిత్వాలను విశ్లేషించేటపుడు విషయాన్నిగానీ రెండోస్థానంలో వుంచుతాను. ఉద్దేశపూర్వకంగా గెలవాలి, ఓడగొట్టాలిలాంటి వైఖరిని అనుసరించను. ఈ విషయంలో మీరూ వీటికి ఆమోదం తెలుపగలదో లేదో లేఖద్వారానే వ్రాయండి.
ఇదంతా అటు మిత్ర సంబంధాలు, ఇటు విషయ విచారణ రెండూ అవసరమైనవేనన్న దృష్టినుండి అవసరమనుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే. మరోమాట మనమధ్య మొదటి ప్రాధాన్యత కలిగింది విషయ విచారణే, తప్పనిసరైతే తప్పు వ్యక్తిత్వాల విశ్లేషణలోకి దిగవద్దు. ఈ మాటా విచారణ ఆగకుండా చూడడానికి చెప్పుకుంటున్న జాగ్రత్తలకు చెందిందే.
గత రెండు మూడు సంచికలలో రెండు మూడు విషయాలలో, మీ అభిప్రాయాలను విమర్శిస్తూ అవి అంత సరైనవి కావనడానికి అవసరమైన, తార్కిక విశ్లేషణ చేశాను. అందులో ఒక విషయం, నా విధానాన్ని తప్పుబడుతూ, అది మీకు నచ్చనిది అంటూ 'మన విధానంవల్ల శతృవులూ పోరాట మిత్రులవుతారన్నది మా అనుభవం' మీరు వెల్లడించిన అభిప్రాయం అన్నది. శతృవుల్నికూడా ప్రాణమిత్రుల్ని చేసుకోగలిగిన ఆ మీ విధానం ఏమిటో నాకింకా ఎదుటపడలా. ఇప్పటివరకు మీరనుసరించిన విధానం మాత్రం నాలో లేని దోషాలను, నా మాటల నుండి రాని అర్థాలను చూపెట్టడమే జరిగింది. ఏ రకంగానూ శతృవునిగాని నన్ను మీ ప్రాణస్నేహితునిగా చేసుకోడంగానీ, మీరు నాకు మరింత మరింత సన్నిహితుల్ని చేయడంగానీ చేయలేకపోయిందిగదా మీ విధానం. ఇదికాక ఇంకో విధానమేమైనా మీ దగ్గర వేరుగా వుందా? ఇప్పటివరకు నా విషయంలో మీరనుసరించిందేనా?
ఈ మీ లేకలో వీలునిబట్టి, అవసరాన్నిబట్టి-పరిస్థితులనుబట్టి-కూచుని మాట్లాడుకుందామన్నరంటేనే, దాదాపు ఎంతో కొంత ఎడమయ్యాం మనమన్న అర్థాన్నిస్తున్నాయి ఆ మాటలు.
నేను ఇతరుల విషయంలో ఊహలు చేయను. ఊహలు సత్యంయొక్క అవసరాన్ని తీర్చవు గనుక అని ఒక మాట అన్నారు. ఊహ చేయకుండా వుండలేడు, బ్రతుకును సాగించలేడు మనిషి. 'ఊహలు సత్యంయొక్క అవసరాన్ని తీర్చలేవు' అనన్నామంటే, ఊహించకు అని అర్థం కానేకాదు. జీవితం అర్థమైనవాడు ఊహ అంటే ఏమిటో తెలిసి జీవితంలో ఊహ పాత్రేమిటో స్పష్టంగా చూసినవాడెవడూ ఊహించకూడదని చెప్పడు. నాకు తెలిసి ఆమాట వెనకనున్న భావం, ఊహే అంతిమం అనుకోను. ఊహ సత్యమిది అని తేల్చడానికి సరిపోదు. ఊహ తరువాతా సత్యం తేల్చుకోవలసిందిగనే వుంటుంది. దానికై తగిన యత్నం చేయవలసి వుంటుంది అనే.
ఇక ఏదో ఒక మతగ్రంథాన్ని తలకెత్తుకుని, దానిని చెప్పిన వానిని నిజాయితీపరుడూ, నిజం తెలిసినవాడుగ గుడ్డిగా నమ్మేసి పోతుండేవారు చెప్పవలసింది కాదామాట. ఊహకంటే దిగువస్థాయిది విశ్వాసం. విశ్వాసం సత్యంయొక్క అవసరాన్ని అస్సలు తీర్చలేదు. విశ్వాసంతో పడిపోతున్న మీరు, తర్కానికందినంతవరకు ఊహ చేస్తూనే వున్నారు. తర్కిస్తున్నామన్నా, ఒక వాదాన్ని పట్టుకున్నామన్నా, అనుమాన ప్రమాణాన్ని వాడుకుంటున్నామన్నా, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నామనాన, ఇంగితజ్ఞానాన్ని ఉపయోగపెట్టుకుంటున్నామన్నా, వాటన్నింటిలోనూ 'ఊహ' భాగం వుండనే వుంటుంది. అస్సలు తర్కమంటేనే ఆధారసహిత ఊహ అని దానిని గురించి తెలిసినవారు చెపుతారు. బ్రతుకు వర్తమానంలో వుండి భవిష్యత్తు గురించి ఆలోచించేది, నిర్ణయం తీసుకునేది అలాగే గతానికి సంబంధించిన అవగాహన రూపంగా నిర్ణయాలకొచ్చేది అంతా ఊహరూపంతోనే. నేను ఊహించను అన్నారంటేనే ఊహంటే ఏమిటో మీకు తగినంత స్పష్టత లేదనిపిస్తోంది. విశ్వాసము-ఆధారసహిత ఊహ, ప్రత్యక్షము, సరిచూసుకోడము అన్న అంశాల్ని తీసుకుంటే...
(1) విశ్వాసం సత్యంయొక్క అవసరాన్ని అస్సలు తీర్చలేదు.
(2) దానికంటే ఉన్నతమైనదే అయినా ఊహకూడా సత్యంయొక్క అవసరాన్ని తీర్చలేదు.
(3) ప్రత్యక్షం మాత్రమే సత్యంయొక్క అవసరాన్ని తీర్చగలదు.
(ఎ) అందునా సరైన రీతిలో ఏర్పడ్డ ప్రత్యక్షం మాత్రమే సత్యపు అవసరాన్ని తీర్చగలదు.
మిత్రమా! పత్రిక ద్వారానే మాట్లాడుకుందాం. పై నాలుగు ముక్కలు మీకర్థమయ్యాయో లేదో చెప్పండి. అర్థమైతే అది తప్పో ఒప్పో చెప్పండి. నా లెక్క ప్రకారం ఒక వ్యక్తి తనంత తాను ఈ అవగాహన కలిగించుకోవాలంటే సంవత్సరాల శ్రమ అవసరం.
నాద్వారా మీకే అవగాహన కలిగిన మాట నిజమైతే జ్ఞానపరంగా నేను మీకు చేసిన మేలు మా జీవితంలో మరచిపోడానికి వీల్లేనిది. ఈ నా పక్షం తప్పనిపిస్తే ఊహ, విశ్వాసం, సత్యంలకు సంబంధించి మీ అభిప్రాయం (అవగాహన) ఏమిటో వ్రాయండి.

No comments:

Post a Comment