వివేకపథం పాఠకుల సమావేశం-ఖమ్మంజిల్లా నివేదిక
రిపోర్టర్స్ : ఎం. నిర్మల్‌కుమార్, వై.జగన్మోహనరావు
ది. 22-3-2009న ఖమ్మం జిల్లాస్థాయి వివేకపథం మాసపత్రిక పాఠకుల సమావేశం సత్తుపల్లిలోని ఎస్.ఎస్.ఆర్. జూనియర్ కళాశాలలో ఉదయం గం|| 9-45 నుండి సాయంత్రం 6-15 వరకు జరిగింది. సత్యాన్వేషణ మండలి రాష్ట్ర బాధ్యులు కె. ప్రసాద్, సిహెచ్.నాగార్జునలు వక్తలుగా పాల్గొనగా, జగన్‌గారు ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. చెరుకూరి వెంకట్రామయ్యగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. దాదాపు ముప్పైమంది పాఠకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సభికులందరూ తమకు సత్యాన్వేషణ మండలి మరియు వివేకపథం పత్రికలు ఏ విధంగా పరిచయమయ్యాయో తెలియచెపుతూ తమ సొంత పరిచయం కూడా చేసుకున్నారు. హేతువాద ఉద్యమాలద్వారా, కమ్యూనిస్టు ఉద్యమాలద్వారా శాస్త్రీయ ఆలోచనామార్గంలో పయనించడం ప్రారంభించిన తాము ఆ మార్గంలో ఈ సంస్థకు దగ్గరయ్యామని ఎక్కువమంది తెలిపారు. మరికొందరు మితృల సలహాలతో మండలి సమావేశాలకు హాజరై క్రమంగా ఈ సంస్థ భావజాలానికి ఆకర్షితులమయ్యామని కొందరు తెలిపారు. ఏ భావాలు మంచివో, ఏ భావాలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయో, సత్యం తెలుసుకోవడం ఎలాగో, తెలుసుకొనేముందు సరైన మార్గాన ప్రయాణించేందుకు వివేకపథం పత్రిక ఉపయోగపడుతుందని సభికులు తెలిపారు. సీనియర్ హేతువాడివెంకటేశ్వరరావుగారు (వెల్‌కమ్ హోటల్) పత్రిక, మండలిపట్ల సానుకూల దృక్పథం కలిగివున్నట్లు చెప్పారు.
సిహెచ్.నాగార్జునగారు సత్యాన్వేషణ మండలి ప్రధాన లక్ష్యాలను వివరించారు. వ్యక్తులలో స్వతంత్ర ఆలోచనాశక్తిని పెంచటం, సైన జీవితావగాహనను కలిగించడం, వివేకం చూపుతున్న బాటలో జీవించడం, సమాజ అభ్యుదయ శక్తులను సంఘటితపర్చటం, సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి వ్యవస్థలోని కీలకస్థానాలలో ప్రవేశపెట్టడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
కోట ప్రసాద్‌గారు సత్యాన్వేషణ మండలి ఆవిర్భావ నేపథ్యాన్ని వివరించారు. యోగాభ్యసనము, తాత్వికగ్రంథాల అధ్యయనం ద్వారా ఆధ్యాత్మికసాధనాల మార్గంలో పయనిస్తున్న కొందరు వ్యక్తులు ఎంత నిష్టగా సాధనచేసినా శాస్త్రోక్త ఫలితాలు రాకపోవడం వలనా, మరియు సిద్ధాంత గ్రంథాలలో పరస్పర విభేదాలు, సంశయాలను కలుగజేసిన ఫలితంగా శాస్త్రం ప్రమాణం అనే నిశ్చయం సడలిందన్నారు. పెంచలయ్యగారి సత్యజ్ఞాన సంఘంతో పరిచయం ఫలితంగా వివిధ తాత్విక సిద్ధాంతాలను కూలంకషంగా అధ్యయనం చేస్తూ ఆ క్రమంలోనే సత్యాన్వేషణ మండలిని ఏర్పర్చడం జరిగిందన్నారు.
వై. జగన్‌మోహన్‌గారు మాట్లాడుతూ లక్షణప్రమాణ విద్యనుగూర్చి సమాజానికి తెలియజేసి స్వంత తలగలిగినవారిని రూపొందించే ప్రయత్నం మండలి చేస్తుందన్నారు. మేలుకొలుపు పత్రిక, వివేకపథం పత్రికలు ఆ క్రమంలోనే వచ్చాయన్నారు. మండలి తత్వచర్చావేదికను ఏర్పర్చి ఆస్థికత్వం, నాస్తికత్వం, దైతం, అద్వైతం, విశిష్టాద్వూతం, క్రైస్తవము, ఇస్లాము, మార్క్సిజం, అంబేద్కరిజం, జిడ్డు కృష్ణమూర్తి తత్వము మొదలైన విషయాలపై సిద్ధాంత చర్చలను మండలి నిర్వహించిందన్నారు. కళాంజలి అంజయ్యగారు మండలిని ప్రశంసిస్తూ, 'వందేమాతరం' సినిమా గీతంపాడి సమావేశానికి కళనూ జోడించారు.
కట్టా శ్రీనివాసరావుగారు వివేకపథం పత్రికనుగూర్చి చర్చను ప్రోత్సహించగా అందరూ ఆ పత్రిక తమకు బాగా ఉపయోగపడుతుందని, తమలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని తెలిపారు..
అయితే ఆ పత్రికలోని భాష క్లిష్టంగా వుండి చదవడంలో ఇబ్బందులెదురవుతున్నాయని ఎక్కువమంది అన్నారు. ఇద్దరు ముగ్గురు వ్రాసుకునే ఉత్తర ప్రత్యుత్తరాల పత్రికగా పత్రిక ప్రస్తుతం నడుస్తున్నట్లుగా వుందని, ఆ ధోరణి మారాలని అన్నారు. ఇలాంటి సమావేశాల్లో ప్రకరణభంగంవంటి లోపాలు లేకుండా చూడాలనే సూచనలతోను, సభ ముగించారు.
No comments:
Post a Comment