Saturday, August 1, 2009

త్రైమాసిక సమావేశ విశేషాలు



అనుకున్న ప్రకారం ది. 11, 12, 13 లలో మండలి త్రైమాసిక సమావేశాలు కేంద్ర కార్యాలయంలో జరిగాయి. షుమారు 15 నుండి 20 మంది వరకు కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా నాలుగు మాటలంటూ సురేంద్రబాబుగారు మొదలెట్టారు. వారి మాటల్లోనే చూడండి.

భావప్రసారము సక్రమంగా జరగాలంటే భాషాపరమైన జాగ్రత్తలు వహించాలి. సమాన సంకేతాలు సమాన సంకీతులు లేని వారి మధ్య జరిగే భావ ప్రసారము తప్పుడు అవగాహన కలిగించేదిలాగునో అవగాహనా రాహిత్యాన్ని కలిగించేదిగానో వుంటుంది. అలానే పారిభాషిక పదాల అర్థాలు తెలియక ఆ భావము అర్థము కాదు.
ఏదైనా శబ్దము వినపడగానే కొన్ని ప్రశ్నలకు సమాధానము తెలిస్తేనే ఆ విషయం తెలిసినట్లు. ఆ ప్రశ్నలు (1) అది అంటే ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎంత వుంది? ఎలా వుంది? దాని గుణాలు ఏమిటి? క్రియలు ఏమిటి? దానికి మనకు వున్న సంబంధము ఏమిటి?
ప్రతి పదము పదార్థ వర్గీకరణలో చేరే వుంటుంది గనుక ఆ పదము ఏ వర్గములో చేరివుందో తెలుసుకోవాలి. అలానే విచారణా నియమాలైన విషయపు ఎంపిక, ప్రతిపాదన, ప్రతిపాదిత విషయం చర్చించే సమయంలో ఆ విషయం పూర్తి అయ్యేవరకు అన్యవిషయాలను సృజించరాదు.
హేతుబద్ధాలోచన, అహేతుక ఆలోచన అంటున్నామంటే, అహేతుక ఆలోచనంటే నిరాధార ఆలోచన అని చెప్పకూడదు. అయోగ్యమైన, లేదా తప్పు ఆధారముతో కూడిన ఆలోచన అని చెప్పాలి. అలానే మానవ మేధస్సు యొక్క సామర్థ్యానికి లోబడే చర్చలు సాగాలి అంటూ ఆస్తిక సిద్ధాంతము-ఒక పరిశీలన అని ఇవ్వబడిన ప్రశ్నలను చర్చించండి అలానే నేను చెప్పిన పై విషయాలను చర్చించండి అన్నారు. వెంటనే సబనుండి మానవ మేధో సామర్థ్యము ఇదియేనని చెప్పగలమా? అన్న ప్రశ్న వచ్చంది. దానికి సమాధానంగా మానవ మేధ చేసే పనులలో సామర్థ్యమునే మేధో సామర్థ్యము అంటాము. గ్రహణ, ధారణ, చింతన, సృజన దాని పనులు అంటే ఆ పనులలో మానవ మేధకు జనరల్‌ కొలతలు ఉన్నాయని చెప్పవచ్చు. ఉదా : నేత్రముతో ఒక స్థాయి కాంతి తరంగ దైర్ఘ్యము మాత్రమే చూడగలము. అంతకంటే తక్కువ ఎక్కువ వాటిని నేత్రము పట్టుకోలేదు. అలానే శబ్దము కూడా మేధస్సు తాను లేని కాలములో తాను లేని దేశములో విషయాలను ప్రత్యక్షతతో తెలుసుకోలేదు. అలానే ఏ పరిమితమైన పదార్థానికి అపరిమితమైన శక్తి వుండదు. ప్రతి మేధస్సుకు సామర్థ్యాలలో వ్యత్యాసాలుంటాయి అన్న విషయాన్ని అంగీకరిస్తూనే మేధస్సు సామర్థ్యానికి పరిమితులుంటాయని చెప్పవచ్చునన్నారు. మేధో పరిధికి అవతల విషయాలు నీవు అంగీకరించడము, నన్ను అంగీకరించమనడము సబబా? కాదా? సబబేనంటే నేను చెప్పే విషయాలను నీవు ఎందుకు అంగీకరించవన్న ప్రశ్న వస్తుందని, చర్చలకు ఆధారము లేకుండా పోతుంది గనుక ఎవ్వరు మాట్లాడినా మేథపరిథికి లోబడే మాట్లాడాలని చెప్పారు.
మొదటి ప్రశ్నను చర్చనీయాంశంగా తీసుకొని మీమీ సమాధానాలు చెప్పమన్నారు. ఒక సర్వజ్ఞుడు కానివాడు మరొకడిని సర్వజ్ఞుడు కాదని నిర్ణయించగలడా? అన్నదానికి సమాధానంగా నిర్ణయించగలడని, నిర్ణయించలేడని రెండు సమాధానాలు వచ్చినాయి.
సురేంద్రగారు మాట్లాడుతూ ముందుగా దానిలో వుండే పారిభాషిక పదాలకు అర్థాలు తెలుసుండాలని దాని గురించి కొంత వివరణ చేస్తానంటూ లోకంలో అజ్ఞుడు, అల్పజ్ఞుడు, అధికజ్ఞుడు, సర్వజ్ఞుడు అన్న నలుగురు వుంటానికి అవకాశం వుందా? నలుగురు కాదు కొంతమంది వుండటానికి అవకాశముందా చర్చించండి అన్నారు. చర్చానంతరం అజ్ఞుడు అంటే అసలు ఏమీ తెలియనివాడు, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు మానవుడిగా వుండటానికి అవకాశము లేదనుకొన్నాము. అంటే సమాజములో వున్నవారంతా అయితే అల్పజ్ఞులో లేక అధికజ్ఞులోనన్నమాట. ఇంకా కొన్ని క్లూలిస్తానంటూ ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం పొందటానికి పరసహాయము అవసరమైతే ఆయనను సర్వజ్ఞుడు అనగలమా? లేదా?
ఫలానా సందర్భంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోటానికి పరీక్ష పెడితే ఆయనను సర్వజ్ఞుడు అనవచ్చా? లేదా? ఒక పొరపాటు చేశానని తనే అంగీకరిస్తే అతనిని సర్వజ్ఞుడు అనవచ్చా? లేదా? నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడంటూ అతనిని సర్వజ్ఞుడు అనవచ్చా? లేదా? మీరు ఇలా నడవండి, ఇలా నడవవద్దు అన్నాడంటే అతనిని సర్వజ్ఞుడిగా అంగీకరించవచ్చా? లేదా? అంటూ ఏ మతగ్రంథమైనా ఇద్దరు సృష్టికర్తలను అంగీకరిస్తుందా? ఒక సర్వజ్ఞుడు మాత్రమే మరొక సర్వజ్ఞునుని గుర్తించగలడు ఔనా? కాదా? అంటూ ఇలాంటి ప్రశ్నలు ఇంకెన్ని రాగలవో చూడాలన్నారు. నాకనిపించిన ప్రశ్నలు తాను లేనిచోట విషయంలో కూడా తాను గుర్తించగలడంటే, అలానే పరసహాయముతో పనిలేదంటే మానవ మేధ అంగీకరిస్తుందా?
పుట్టించేది, నడిపించేది ఆయనేనంటూ, కేవలం స్వర్గ నరకాలు పొందించే విషయంలో ఆయన పాత్ర వుండదని చెప్పగలమా? ఆయన పాత్ర వుందంటే పుట్టబడిన అంగవికలురకు, మానసిక ఎదుగుదల లేనివారుండుటకు అతని సృష్టే కారణమనాలి? తెలిసే అలా పుట్టించాడంటే దయార్ద్రహృదయుడు, అనంత కరుణామయుడు, అనకూడదు. అలా కాదంటే సృష్టికర్త ఆయన అనకూడదు. పోనీ పొరపాటు మనకందరికీ సహజము అని సరిపెట్టుకొందామనన్నా సర్వజ్ఞత్వానికి, సర్వశక్తిమత్వానికి భంగం ఏర్పడుతుంది. అలాకాదు అయన వ్రాతప్రకారం ఇవ్వవలసినవి అందజేస్తాడంటే ఆయన ఒక సాధనమైపోయాడని అర్థము. సాధనమైన అతనిని ప్రార్థించుటవలన, కీర్తించుటవలన మనం పొందగలిగేది ఏమీ వుండదు. అలాకాదు ఆ వ్రాతకూడా అతను రాసిందేనంటే, అసలు పుస్తకము మీద పెట్టవలసిన అవసరము ఎందుకు వచ్చింది? అయితే మర్చిపోతాననో, లేదా క్రమం తప్పుతుందోనన్నా అనుకోవాలి. అలా అనుకొంటే సర్వజ్ఞుడు కాదనటానికి వేరే ఋజువులతో పనిలేకుండా పోతుందిగదా? మొదటి ప్రశ్నకు సమాధానంగా ఒక సర్వజ్ఞుడు కానివాడు మరొకడిని సర్వజ్ఞుడు కాదని నిర్ణయించగలమని తేలింది. దాని వివరాలు ఆ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున ఎవరికీ తెలియని విషయాలు తనకు మాత్రమే పరిమితమైన విషయాలు ప్రతి వ్యక్తికి వుంటాయి. అలాంటి విషయాలు చెప్పమని అడిగితే ఏ ఒక్కటి చెప్పలేకపోయినా అతను సర్వజ్ఞుడు కాదని తేల్చవచ్చునన్నారు.
మోషే మాట్లాడుతూ అగణితమైన వాటిని అతని వెనుకనున్నవానిని అడిగామనుకోండి అతను చెప్పలేకపోతే తేలిపోతుంది అనగా నేను రానున్న పది రోజులలోనూ వంద మందికి జరిగే సంఘటనలు అడిగి లిస్టు రాసుకొంటాను. ఆ లిస్టుకు అన్యంగా 100 మంది ప్రయత్నిస్తాము. ఆ లిస్టుకు వ్యతిరేకంగా ఒక్కపని జరిగినా అతనిని సర్వజ్ఞుడు కాదని నిర్ణయించవచ్చునన్నారు. అలానే రెండవ ప్రశ్నకు సమాధానంగా ఒక సర్వజ్ఞుడు కానివాడు మరొకనిని సర్వజ్ఞుడని నిర్ణయించలేడనుకొన్నాము. కారణము తనకు తెలిసినంత ఎదుటివానికి తెలిస్తే సర్వజ్ఞుడు అనకూడదు, సమానజ్ఞుడు మాత్రమే అనాలి. అంతా తెలిస్తేనే సర్వజ్ఞుడు అనాలి. ఆయనకు అంతా తెలిసిందని తేల్చాలంటే తనకంతా తెలిసుండాలికనుక.
ఇక మూడవ ప్రశ్నకు సమాధానంగా ఒకనిని సర్వజ్ఞుడు అనాలంటే మరొక సర్వజ్ఞునికే సాధ్యం అనుకొన్నాము. ఇక నాల్గవ ప్రశ్నకు సమాధానంగా ఫలానావాడు సర్వజ్ఞుడని ఏ అల్పజ్ఞుడు పలికిన మాటలకు విలువుండదనుకొన్నాము. ఐదవ ప్రశ్నకు సమాధానంగా ఒక వ్యక్తి సర్వజ్ఞుడో కాదో నిర్ణయించే పద్ధతి వుందా అనో అట్టిది లేదు, మరొక సర్వజ్ఞునికి ఇతను సర్వజ్ఞుడని తెలిసే వుంటుంది అతను కూడా సర్వజ్ఞుడు కనుక అనుకొన్నాము.
సురేంద్రగారు మాట్లాడుతూ చర్చించినంత వరకు ఇవి ఇంతేననుకోవలసిన అవసరము లేదని ఎవ్వరైనా? ఎప్పుడైనా చర్చిస్తామంటే ఆ చర్చకు సిద్ధపడాలిగాని ఎప్పుడో తేల్చివేసుకొన్నామన్న వైఖరి సరైందికాదని సత్యాన్వేషి ఓడిపోయి ఎదుగుతాడు, గెలిచి ఎదుగుతాడు, గెలిచి ఎదగడమంటే తన జ్ఞానంలో స్థిరత్వం ఏర్పాటు చేసుకోవడమని, ఓడిపోయి ఎదగడం అంటే తప్పయిన ఆ స్థానం వదిలి ఒప్పుస్థానానికి వెళ్లడమేనన్నారు.


ది. 12-7-2009 సమావేశం ఉదయం 9 గంటలకు మొదలైంది. మొదటగా సురేంద్రబాబుగారు మాట్లాడుతూ మనిషికున్న తాపాల గురించి వివరించారు. వారి మాటల్లోనే చూడండి.
రాకూడనివి వచ్చి మీదపడుతుంటే మనకు కలిగేదే తాపము. తాపము మూడు రకాలు : (1) ఆధ్యాత్మిక తాపం, (2) అధిభౌతిక తాపం; (3) అధిదైవిక తాపము. ఆధ్యాత్మిక తాపం అంటే తనవలన తనకు రాకూడనివి వచ్చిపడుతుంటే తనకు కలిగేది. అధిభౌతిక తాపం అంటే, భూమిపై వుండే ఇతర ప్రాణుల నుండి తనకు రాకూడనివి వచ్చిపడుతుంటే తనకు కలిగేదని అలానే అధిదైవిక తాపం అంటే ప్రకృతి కారణంగా వచ్చిపడే సమస్యల నుండి ఏర్పడే తాపాలు. వీటన్నింటిలో తననుండి తనకి ఏర్పడే కీడు ఎక్కువ. పనులలో నిత్యం, నైమిత్తికం అని రెండు రకాలు నిత్యం అంటే 24 గంటలు రిపీట్‌ అయ్యే పనులు అలానే నైమిత్తికంలో అప్పుడప్పుడు వస్తూ వుండే పనులు.
ఆరోగ్యము-బలము ఉత్పత్తి చేయటానికి, వాటిని ఉపయోగించుకోటానికి అవసరము. బలము లేని ఆరోగ్యము వలన ఆరోగ్యము లేని బలము వలన ఉపయోగము లేదు. కావున మనిషి ముందు ఆరోగ్యము - బలము సాధించుకోవాలి. తన నుండి తనకు వచ్చే సమస్యలలో ఆరోగ్యము-బలము లేమి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అలానే అవసరాలే మనిషిని నడిపిస్తున్నా, ఆ అవసరాల లిస్టు ఒప్పుజ్ఞానం ఆధారంగానే తయారుచేసుకోవాలి. తప్పుజ్ఞానం ఆధారంగా తయారైన లిస్టువలనే సమస్యలొస్తాయి. శరీరం బాగుంటేనే మనస్సు బాగుంటుంది. శరీరం రోగగ్రస్తమైతే మనస్సుపై ఆ ప్రభావం వుంటుంది. మనం ఏమిచేయాలన్నా శరీరం ఆరోగ్యంగా, బలంగా వుండాలిగనుక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇప్పటికీ చేయనివారుంటే కనీసం 30 నిమిషాలైనా చేయాలన్న నియమం పెట్టుకోవాలి. అలానే రోజులో ఒక గంట అధ్యయనానికి కేటాయించాలి.
మీరు ఇతరులకు మాట యిచ్చినా, ఇతరుల నుండి మాట తీసుకున్నా ఆ మాటలు నెరవేర్చే ప్రయత్నములో లోపం ఏర్పడకూడదు. అభ్యాసము, వైరాగ్యము ద్వారా కావలసినవి సాధించుకోవాలి. నష్టం కలిగించేవాటిపట్ల వైరాగ్యభావన ఏర్పరచుకొని అలాగే తెచ్చుకోవలసిన వాటిని అభ్యాసముతో సాధించుకోవాలి. అధిభౌతిక తాపానికి తాను ఎప్పుడూ కారకుడుకాకూడదు. ఈ జీవితం ఉత్తమమైన జీవితం కావాలంటే నానుండి నాకు, నా నుండి ఇతరులకు నష్టము కలగని జీవితము గడపాలి. అదే ధార్మిక జీవితము. ఈరోజు చేయవలసిన పనిని రేపు చేయవచ్చులే అనే మనస్తత్వము ఆ వ్యక్తిని సోమరిని చేయటానికి పనికి వస్తుంది. 24 గంటల టైమ్‌ టేబుల్‌ తయారుచేసుకొని ఆ ప్రకారంగా జీవించాలి. మార్పు నాతో మొదలవ్వాలిగాని ఎదుటివారితో అని అనుకోకూడదు. మనిషి తెలియక చేసే తప్పులకంటే తెలిసి చేసే తప్పులే ఎక్కువ. సాధకుడికి ఆశ చనిపోకూడదు, తృప్తి పడకూడదు. ఆ రెంటిలో ఏది జరిగినా అతని సాధన, అభివృద్ధి ఆగిపోయినట్లే అంటూ ముగించారు. సమావేశంలో వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవడంతో ఆరోజు ముగిసింది.
మరునాడు అనగా ది. 13-7-2009న అష్టపద వివేకము గురించి వివరించే తరగతిని నేను తీసుకొన్నాను. ఆ అష్టపదాలకు సభికుల నుండి సమాధానాలు రాబట్టే పనిచేశాను. వాటి సారాంశాన్ని వివరిస్తూ ఆయా అంశాల నిర్వచనాల్ని ఎవరికి వారుగా తయారు చేసుకొని వస్తే వాటిల్లో నుండి సరైన నిర్వచనాలు తయారు చేసుకొందామన్నాను.

No comments:

Post a Comment