Tuesday, September 1, 2009

స్పందన-ప్రతిస్పందన



యోచనాశీలురైన పి. సుబ్బరాజుగారికి,
మీ లేఖలో చోటుచేసుకునివున్న రెండు ముఖ్యమైన అంశాలను గురించి ప్రస్తావించి, అటుపై ఇతరాంశాల దగ్గరకొస్తాను.
1) ఆ రెంటిలో ఒకటి; 'సందర్భశుద్ధిని పాటించడం చాలా అవసరం' అన్నది. ఆ సూత్రం నాకు సర్వాంగీణ అంగీకారమే. అసందర్భంగా ఎవరు మాట్లాడినట్లు తేలితే వాళ్ళం ఆ మేరకు జరిగిన పొరపాటును సవరించుకునేందుకు సిద్ధపడడం వివేకవంతం. నేనందుకు సిద్ధం. మీరూ అందుకు సిద్ధపడగలరనే అనుకుంటున్నాను.

2) రెండోది. రచనలో వ్యంగ్యం-హేళనధ్వని-చోటుచేసుకుంటుండడం. ఇది నాకు సుతరామూ ఇష్టంలేదు. నిజానికి విషయ విచారణ సందర్భమైనప్పుడు సౌమ్యంగా మాట్లాడుకోవడమే మంచిది. ఎంతగా అదే సరైన విధానమనుకున్నా, ఎక్కడోచోట విషయంలోని లోటుపాట్లను ఎత్తిచూపినప్పుడు, అది ఆ విషయ విమర్శకు లోనైన పక్షపు వ్యక్తి అహాన్ని అంతో ఇంతో ప్రభావితం చేస్తుంది. అంతటితోనాగక, విమర్శకుడు విషయంలోని లోటుపాట్లు చూపవలసిందిపోయి, వ్యక్తి వైఖరిలోని లొసుగులంటూ మాట్లాడడం మొదలెడితే, అది వారి మధ్య వాతావరణం వేడెక్కడానికి నిప్పురాజేసినట్లే. అయితే విమర్శకుడు ఈ చేయకూడనిపని ఉద్దేశపూర్వకంగానైనా చేసుండవచ్చు. అలవాటుగనో, పొరపాటుగనో అయినా జరిగి వుండవచ్చు. అదెలా జరిగినా, విడిచిన బాణంలా అది చేయవలసిన పని చేసితీరుతుంది. అటు విషయపరంగాగానీ, ఇటు వ్యక్తిపరంగాగానీ మనమన దృష్టికోణాల నుండి జరిగినవనుకుంటున్న లోటుపాట్లను బైటపెట్టడం పలు రకాలు. అవతలి వారి దృష్టికి తేవడం అతడు మిత్రుడన్నప్పుడు ఒక విధంగా వుంటుంది. శతృవన్నప్పుడొకవిధంగా వుంటుంది. ఆ రెండు రకాల సంబంధంలో లేనివారన్నప్పుడు మరోరకంగా వుంటుంది.
ఇందరిలోనూ వాస్తవాలను యథాతథంగా అంటే వాటిని పెద్దవి చేయకుండా చిన్నవి చేయకుండా చూపించే పనిగాని, పెద్దవిగానో, చిన్నవిగానో చూపించేపనో, లేని దోషాలు అంటగట్టే పనోకూడా చేసే అవకాశముంది. అలాగే ఆయా లోటుపాట్లను మిత్రునిలోచూసి, వానికీ చూపించి సరిచేసుకోమని చెప్పదలచుకుంటే-అతణ్ణి మిత్రునిగా తలంచితే మాత్రం సర్వసాధారణంగా అతనికి మాత్రమే తెలిసేలా చూస్తాం. నలుగురి ముందూ పెట్టడానికి ఇష్టపడనేపడం-అతడు మిత్రుడు కాదన్నప్పుడూ నలుగురికి తెలిసేలా చేద్దాం అని చూడం. అతడెప్పుడు దొరుకుతాడా, అన్న తలంపు ఉన్నవారి విషయంలోనే, అవతలివాడు ప్రతిపక్షంవాడు, ప్రతికక్షి, శత్రువు, ఎక్కడోచోట అతడికంటే పైచేయి అనిపించుకోవాలి లాంటి మానసిక నేపథ్యం ఉన్నప్పుడే మనస్సు అటువైపుకు నెడుతుంది.
మృదువుగ మాట్లాడుకోవడమే సరైంది - పరుషంగా మాట్లాడుకోవడం కొంతవరకు సహించుకోవచ్చు. కానీ హేళనగా మాట్లాడడం ఏరకంగాను అంగీకరించదగిందికాదు. ఎదుటివాణ్ణి హేళన చేయాలనిపించే మనస్సు కౄరమైనది. అది ఎవరూ అనుసరించ దగిందికాదు. ముఖ్యంగా ఉద్యమ క్షేత్రాలలో ఉన్నవారు దానిని వంచకుల విషయంలో తప్ప ఎప్పుడూ ప్రయోగించనే కూడదు. అక్కడైనా తప్పనిసరైతేనే ఆదారి పట్టాలి. వీలున్నంతవరకు శతృవుదగ్గరైనా ఆగ్రహంతోనే సరిపెట్టాలి. హేళన చేయాలనిపించడం నిజానికి మనలోని మానసిక సెబ్బరితనానికి గుర్తు. ఆ విత్తనం లేకుండా చేయాలి. కనీసం మొలకెత్తకుండనైనా జాగ్రత్త వహించాలి.
ఎదుటివారిని గేలిచేయడమంత దురలవాటు మరోటిలేదు. ఆ దారి మనకొద్దు. ఆ దారిపట్టామా అది, అటు విషయాన్ని విషయంగా చూడనీయదు. సత్సంబంధాలను కొనసాగనీయదు, పైపెచ్చు లేని దోషాలు వున్నాయనాలనిపించడమో, ఏవైన దోషాలు ఏర్పడితే బాగుండును అనిపించడమో, అవతలివారికి కష్టనష్టాలు కలిగితే బాగుండునని పించడమో లాంటివాటి దిశగా మనని గుంజుతుంటుంది.
మనం ఒక అవగాహనకొద్దాం. (1) విషయ ప్రధానంగా విచారణ సాగించుదాం, (2) తప్పనిసరైనంత మేరకు వ్యక్తి విచారణ పరిమితం చేసుకుందాం, (3) సౌమ్యంగా మాట్లాడదాం, (4) తప్పని సరైనప్పుడే గింత పరుషభాష దగ్గరకొద్దాం, (5) వ్యంగ్యమొద్దనే వద్దు. నిజానికది మనిద్దరిమధ్యేకాదు. ఏ ఇద్దరి మధ్యనైనా అభిలషణీయం కాదు.
అలవాటుగానో, పొరపాటుగనో నాకైతే తెలీదుగానీ, మీ ఈ లేఖలో అలాంటి పదాలు చోటు చేసుకున్నై.
1) నా ప్రతిస్పందన ముడ్డిగిల్లి జోలపాడినట్లుందన్నారు.
2) మీ పుట్టిల్లు వూరు? అనడిగితే, చేంతాడు కుంచైందన్నదట, అలా వుంది మీ సమాధానం.
3) మోక్షం అనగానే ఆస్తికత కోణంలోనుంచి చూడక్కరలేదని సెలవిచ్చారు.
4) స్క్రిప్టుకు భిన్నంగా గుదిగుచ్చిన ఏడు ప్రతిజ్ఞలు సప్తపదికి బదులుగా పెట్టినవే అని అంగీకరించినందుకు సంతోషం.
5) మంగళసూత్రాన్ని యథాతథంగా ఆమోదించలేక, సువర్ణహారాలను వేయించి 'పవిత్రత' అన్న భావన నుండి పుట్టిన గౌరవంలోనే, 'ఉదాత్తభావన' అంటూ స్వర్ణహారాలు వేయించారనిపిస్తోంది.
6) సప్తపదికి బదులు ఏడు ప్రతిజ్ఞలు పెట్టామని వేదికమీద ప్రకటిస్తే బాగుండేది. ఆమేరకు మీరు దాపరికం ప్రదర్శించారు.
7) రాసిచ్చిన సమాధానాలు చదివించి సామాజిక స్పృహ పెంచామని తృప్తిపడడం నేలవిడచి సాము చెయ్యడమే అవుతుంది.
8) పితృరుణం.... ప్రకృతి రుణం తీర్చుకోవడం అంటూ ఉపన్యాసాలు ఇప్పించడం, మీబోటి సంస్కృతాభిమానులకే చెల్లుతుంది.
9) మీ ఇష్టప్రకారం కొనసాగించే స్వేచ్ఛ మీకుంది. మీకు తోచినరీతినే ముందుకు వెళ్ళండి, ధన్యవాదాలు.
10) సంస్కృతంమీద మమకారం వీడి స్వేచ్ఛ అన్నమాటనే ప్రయోగిస్తే బాగుంటుంది.
11) వివాహం నిర్వహించిన తీరుపట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తంచేసినా, స్పందన రూపంలో మీముందు పెట్టకపోవడానికి ప్రధాన కారణం, మీ ప్రతిస్పందన తీరుపై గతానుభవాలు వుండడంవల్లనే అని భావించాల్సి వస్తోంది.
గమనిక : భాషను శక్తివంతంగా వాడుకునే మెలకువలలో వ్యంగ్యం కూడా ఒకటైనప్పటికీ, వ్యంగ్యం సున్నితత్వం చెడకుండా చురుకుదనాన్ని పుట్టించగలిగినప్పుడే సద్వినియోగపడుతుంది. దానిలో ఆ లక్షణం పోయి గేలి, ఎగతాళి, హేళన ధ్వని చోటు చేసుకుందా వాతావరణమంతా కలుషితమైపోతుంది. ఏదేమైనా మనమధ్య వ్యంగ్యం చొరబడకుండా చూసుకోవడమే మేలని నా అభిప్రాయం.
ఇక రెండు మూడంశాల్ని కించిద్విశ్లేషిస్తాను, మీరూ ఆలోచించండి.
1. నాకు తోచించి నేను వ్రాసి ప్రచురించేసి ఇష్టమున్నవాళ్ళు ఇలా చేసుకోండి వివాహాన్ని, అన్న వైఖరి కలవాణ్ణి కాదు నేను. కనుకనే ముందుగా పుస్తకం వేసి, సలహాలు, సూచనలు తెలుపండన్నాను. తరువాత వివేకపథంలోనూ ప్రచురించి దోషాదోషాలు, చేర్పులు వుంటే తెలుపండని బహిరంగంగా ప్రకటించాను. ఇప్పటికి వచ్చిన స్పందనలేకాక మరింత మందిని సంప్రదించి తగుమేర మార్పులు చేస్తాననీ చెప్పాను. మొదటి ప్రయోగం. అంతా క్రొత్త, అందరికీ క్రొత్తే కనుక, రానురాను మరింత చక్కగా నిర్వహించుకోడానికి అవసరమైన జాగ్రత్తలూ తీసుకోవలసి వుంది అనీ వ్రాశాను. మీరూ వీటినేమీ పట్టించుకోలా.
2. అదలా వుంచండి, నేను, పెళ్ళి వేదికలో (ప్రయోగంలో) ఏమేమి లొసుగు లున్నాయో తెలుపమని ఎవరినీ అడగలా. నేనడిగింది 'వివాహవిధి' అన్న రచనలో చోటుచేసుకునివున్న లోటుపాట్ల గురించే. ఎందుకంటే ఒక యోగ్యమైన వివాహ విధానాన్ని సమాజానికందించాలన్నదే నా ఉద్దేశం. అందుకే అనేకమంది ఆలోచనలనూ ఆహ్వానించాను.
గమనిక : ఈ సందర్భంలో ఇక్కడ ఈ రెండు విషయాల మధ్యనున్న తేడాను స్పష్టంగా గమనించాల్సి వుంది.
(1) 'వివాహ విధి' అన్న రచనలో ఉండకూడని అంశాలేమైనా ఉన్నాయా? ఎందుకవి వుండకూడనివైనాయి? చేర్చుకోవలసిన విషయాలేమైనా వున్నాయా? అనేవి? ఎందుకవి చేర్చాలి?
(2) జరిగిన వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న లోటుపాట్లేమిటి? అవెందువల్ల జరిగాయి? అందులోనూ వేటివేటికి ఎంతెంత ప్రాధాన్యతివ్వాలి? అస్సలు చేయకూడనివేమైనా జరిగాయా? అవేవి? అనవసరమైనా పెద్దగా పట్టించుకోనక్కరలేని కోవకు చెందినవేమైనా ఉన్నాయా? అవేవి?
3) నేను రూపొందించిన 'వివాహ విధి' రచనలోని భావజాలాన్నే పరిశీలించండి అన్న దృష్టితో వున్నాననడానికో ఆధారమూ చూపుతాను. వివాహ వేదికలోని ముగ్గురి ప్రసంగాలను అనంతరం వివేకపథంలో యథాతథం వేయలా - వారికి నేను ముందుగా అందించిన ప్రసంగాలనే పత్రికలో వేశాను. కారణం, వివాహ విధిలో నేను పొందుపరచిన భావాలు పరిశీలనకు లోను చేయబడాలనే. వక్తలు మూలభావనలు చెడకుండా స్వేచ్ఛగా మాట్లాడవచ్చునని ముందుగనే అనుకొని వుండడంతో, వారికి అప్పటికి మాట్లాడాలని పించిన రీతిలో వాళ్ళు మాట్లాడారు. అటూ ఇటూ జరిగిన వాటిని నేనంతగా పట్టించుకోలేదు. నేను వేదికమీదే ఆ సాంతం వుండాల్సిరావడంతో నొక్కుపెట్టి అన్నింటినీ పర్యవేక్షించడమూ కుదరలేదు. ఇది మీరు గమనించి వుండాల్సింది. జరిగిన క్రమంలో ఈ ఈ దొసగులు చోటుచేసుకున్నాయి. నిరంతరాయంగా జరగాలనుకుంటున్న వివాహాలలో అట్టివి చోటుచేసుకోకుండా, ఇదిగో ఈ జాగ్రత్తలు పాటించండి, అనో, ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించి, వివాహ విధి రచనలోనే చివరిలోనో, మొదట్లోనో వాటినీ సూచించండి అనో అనుంటే మీ పాత్ర మిత్రధర్మాన్ని కలబోసుకుని ఉన్నట్లయ్యేది. కానీ మీ రచనాశైలి-మీ మనస్సూ అలాగే వుందని ఖచ్చితంగా నేను నిర్ణయించలేను- మాత్రం ఒకింత ఎద్దేవ చేసేదిగానూ, ఒకటి రెండుచోట్ల నా నిజాయితీనీ శంకించేదిగానూ, ఒకటి రెండు చోట్ల హేళన ధ్వని కలదిగానూ వుంది. ఇది వాస్తవమో కాదో మీరు ఒకసారి పరిశీలించి చూడండి. సరే, ఈ విశ్లేషణ పూర్వరంగాన్నిప్పటికాపి, మీరు ప్రధానమనుకుంటున్న మూడంశాలపై నా ఆలోచనలను తెలుపుతాను.
4) పర్యావరణ పరిరక్షణ అన్నది చాలా విస్తృత క్షేత్రాన్ని ఆవరించుకుని వున్నది. అందులో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ప్రాధాన్యతా దృష్టి కలిగి, ఒక్కో విధానాన్ని ఎంచుకుని, అమలుచేస్తూ సాగుతుంటారు. పర్యావరణ పరిరక్షణ క్రింద తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకోవడంగానీ, విసర్జించాల్సిన వాటన్నింటినీ విసర్జించడంగానీ పూర్తిగా అయ్యేపనికాదు. అది క్రమాభివృద్ధిగా రావలసిన మార్పు. అదలా వుంచి పర్యావరణానికి హాని కలిగించేవాటిని మనిషి, సమాజం ఏనాటికీ వినియోగించడాన్ని పూర్తిగా ఆపలేదు. కనుకనే సమతుల్యతను కాపాడే ప్రత్యామ్నాయ క్షాళన కార్యక్రమాల్ని చేపట్టాల్సి వచ్చింది. ఈనాడు పర్యావరణాన్ని చెడగొడుతున్న - సమతౌల్యతను దెబ్బతీస్తున్న వాటిలో ప్రధానమైనవి హైడ్రోకార్బన్లు, (కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడు, క్లోరోఫ్లోరో కార్బన్లు) మరికొన్ని రసాయన వ్యర్థాలు (అణుధార్మిక వ్యర్థాలు, సల్ఫ్యూరికామ్ల వ్యర్థాలు వగైరా). భూమి అవసరానికి మించి వేడెక్కడం, ఓజోనుపొర దెబ్బతినడం, జీవజాతుల లోని సహజ జీవ ప్రక్రియను దెబ్బతీయడం వగైరా వగైరాలు దాని ఫలిత రూపాలు. అలాగే పర్యావరణ కాలుష్యంలో శబ్దకాలుష్యం, వాయుకాలుష్యం, జలకాలుష్యం, వ్యర్థ పదార్థాల కాలుష్యం, లాంటివన్నీ చేరి వున్నాయి.
ప్రాణుల మనుగడను సజావుగా వుండనీయని, కొనసాగనీయని, తాత్కాలిక, దీర్ఘకాలిక అంశాలన్నీ పర్యావరణ కాలుష్యం క్రిందికి చేరేటివే. వాటి గురించి నాకు తెలిసింది కొద్దే-శాస్త్రజ్ఞులు ఇప్పటికే అట్టివాటిని అనేకం గుర్తించారు. ఇంకెన్ని ఎదురుపడతాయో తెలియదు.
ఈ విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి?
1) మొట్టమొదట చేయాల్సింది, చివరికంటా చేస్తూ వుండాల్సింది, ఈ విషయంలో మనం మేలుకుని, సమాజాన్ని మేలుకొలుపుతూ వుండడం.
2) మేలుకోడం అన్నా తెలుసుకోడం అన్నా ఒక్కటే అర్థంలో వాడుతున్నాను. తెలుసుకున్నది జాగ్రత్తపడడానికే గనుక, ఆ దిశగా యత్నాలు మొదలెట్టడం తప్పనిసరి, యత్నం రెండు పార్శ్వాలుగా వుంటుంది.
ఎ) వ్యర్థాలను - కాలుష్యాన్ని పెంచే వాటిని తగ్గిస్తూ పోవడం.
బి) ఏర్పడ్డ కాలుష్యాన్ని తొలగించే అవసరమైన పనులు చేస్తూపోవడం.
అంటే కాలుష్యాన్ని పెంచేవాటి వినిమయాన్ని తగ్గిస్తూ, కాలుష్యాన్ని తగ్గించే హరించే వాటి ఉత్పత్తిని పెంచుతూ సాగుతుండడం, ఆ పనిని మరింత మంది చేసేలా ప్రోత్సహించడం.
ఇంతవరకు వివరాలు సవ్యంగానే వున్నాయని అనుకుంటే;
1) ఈ విషయం తెలిసి ఆ దిశగా ఇంకా ప్రయత్నం మొదలెట్టనివాడు, తాను తెలుసుకున్న వివరాలు ఇతరులకు చెప్పవచ్చా? చెప్పకూడదా? చెప్పాలా, వద్దా?
2) విషయం తెలిపి మానాల్సినవాటిలో కొన్నింటిని కొంతవరకు మానుకునే యత్నం చేస్తున్నాడు. కొన్నింటినింకా వినియోగిస్తూనే వున్నాడు. ఈ తరహా వ్యక్తులు, తనకు తెలిసిన వివరాల్ని ఇతరులకు తెలుపడం మేలా, తెలుపకుండడం మేలా?
3) మరో వ్యక్తి కాలుష్యకారకాల వినియోగం తగ్గించడంపట్ల అంతగా శ్రద్ధపెట్టక, శుద్ధిచేసే వాటి ఉత్పత్తిపట్ల అధిక శ్రద్ధపెట్టి ఆ దిశగా పనిచేస్తూ, అనేకులచేత చేయిస్తూ పోతున్నాడు. ఈ రకం ఇతరుల్ని మేల్కొల్పడానికి తగినవారా, కాదా?
ఇలా, ఒక వ్యక్తి తానెరిగిన లోకహితకరమైన విషయాన్ని లోకానికి చెప్పడానికి అతనికి ఏవి తప్పనిసరి అర్హతలనగలం? ఇక మీరు నేరుగా ప్రస్తావించిన ప్లాస్టిక్‌ వాడకం గురించి : నేను ప్లాస్టిక్‌ వినియోగాన్ని మొత్తంగా ఆపలేదు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు భవిష్యత్తులో పర్యావరణానికి చాలా కీడుచేస్తాయన్నది వినియున్నాను. అది నాకింకా ప్రమాదకారకాల పట్టికలో ముందుస్థానంలోకి రాలేదు. అయినా ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, తగ్గించండని చెపుతుండడం అవసరమేనన్న దృష్టిలో వున్నాను. వివాహ సందర్భంలో మీరన్నపనిచేస్తే బాగనే వుండేది. అనేక వత్తిడులవల్ల ఆ విషయంలో మీరు కనబరచినంత శ్రద్ధ కనబరచలేకపోయాను. రాబోయే 'వివాహవిధి' రచనలో పర్యావరణ పరిరక్షణతో ముడిపడి వున్న దేనినీ, ఇలాంటి మరికొన్ని చేయగలవాటినీ పొందుపరుస్తాను. క్రమంగా ఇంట్లో వీటి వాడకాన్ని తగ్గించే ఆలోచన చేస్తాను. పర్యావరణం విషయంలో ఇప్పటికే మరో కోణంలో కొంతకొంత పని ప్రారంభించాను. కారు ప్రతిపనికీ వాడగలిగివున్నా, అత్యవసరమైతే తప్ప వాడకుండడం-కట్టెలు, ఇంధనం అనవసరంగా మండించకుండడం, పచ్చదనాన్ని పెంచే, పెంపొందించే పనిచేయడం, ప్లాస్టిక్‌ వస్తువుల్నికూడా మళ్ళామళ్ళా (వాడిపారేయడం కాకుండా) వాడుతుండడం లాంటివి చేస్తూ వస్తున్నాను. అంతో ఇంతో ఇతరులచేతా చేయిస్తూనూ వున్నాను.
2) కులం, మతంవంటి అశాస్త్రీయ వివక్షతలను పాటించకుండా, మంచి సమాజం కొరకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాం అని నూతన జంటతో సభాముఖంగా చెప్పించారు. కులానికి లోబడే వివాహం నిశ్చయించినపుడు కులప్రమేయం లేకుండా మెలగుతామని చెప్పించడమెందుకన్నది-మీ అభియోగం.
అంతటితో ఆగక, మామూలు నిత్య వ్యవహారాలలో అందరూ కులప్రమేయం లేకుండానే జీవిస్తున్నా, వారికి కులంపట్ల వున్న మమకారాన్ని పెళ్ళిళ్ళలోనే గమనించగలం. కులంలోనే పెళ్ళిళ్ళు చేస్తూ కులప్రమేయం, మత ప్రమేయం లేని సమాజాన్ని నిర్మించడం సాధ్యంకాదని నా భావన అనీ వ్రాశారు.
నిజానికిలాంటి విషయాలలో ఆయా వ్యక్తుల అంతరంగ మేమిటన్నది నిర్ధారించడానికి చాలా లోతైన పరిశీలన చేయాల్సి వుంటుంది. నేనుగానీ, శ్యామలగానీ, మా ఆదిత్యగానీ కులంలోనే పెళ్ళిచేసుకోవాలని మొదటినుండీ (ఏనాడూ) అనుకోలా. అలాగే కులంలో చేసుకోవద్దనీ అనుకోలా. అవసరమైన అంశాలు ఏమిటి? అని ప్రశ్నించుకుని, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు బైటపెట్టుకున్నాం. (1) ఆరోగ్యంగా, అందంగా వుండాలి, 5'.4'' ఎత్తుండాలి, (2) కలుపుగోలుతనం, కలసిపోయేతనం, పనిచేసే లక్షణం వుండాలి, (3) విద్యా, వైద్యరంగాలకు పనికివచ్చే చదువు చదువుకుని వుండాలి,
(4) ఆడంబరాలకు, విలాసాలకు పోకుండా నిరాడంబరతను ఇష్టపడాలి, (5) క్రమబద్ధమైన జీవిత విధానానికి అనువుగా వుండాలి, (6) సామాజిక స్పృహతో వృత్తికి న్యాయం చేయాలన్న దృష్టితో వుండాలి, (7) సమాజహిత కార్యక్రమాలకై ఎంతోకొంత తన శక్తియుక్తుల్ని ఖర్చు చేయడానికి సిద్ధంకావాలి, (8) చదువుకున్న చదువుకు న్యాయం జరిగేలా సమాజంలో దానిని వినియోగంలో వుంచాలి. ఇవి మా కుటుంబం ఉమ్మడిగా అనుకున్న అంశాలు. ఈ విషయాలనే మా మండలి సభ్యులముందూ పెట్టాం. ఇతర బంధుమిత్రులముందూ పెట్టాం, వివాహ వేదికల ముందూ పెట్టాం. పెండ్లిండ్ల పేరయ్యల ముందూ పెట్టాం. కుల, మతాల ప్రమేయం లేదు అని బయోడేటాలోనే ముద్రించాం. మూఢనమ్మకాలకు వ్యతిరేకం అనీ ప్రకటించాం. కట్నకానుకలు నిషిద్ధం అనీ ప్రకటించాం. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాంఛితాలకు దగ్గరగా వున్న వివిధ కులాలలోని వధువులను పరిగణనలోకి తీసుకుని ప్రయత్నించాం. 'కుల మత ప్రమేయం లేదు' అనన్నామంటే అందులో కులాభిమానమేగాక, కుల వ్యతిరేకత కూడా లేదనే అర్థం. మాకు కావలసిన అంశాలున్న అమ్మాయి బంధువర్గంలో వుంటే చేసుకోకపోవడం, ఖచ్చితంగా చేసుకో కూడదనుకోవడం, కుల ప్రమేయం లేకపోవడంకాదు. అది కుల వ్యతిరేకత వుండడమో, కులం పోలేదంటారేమోనన్న జంకు వుండడమో, కులం పోయినవాడు అన్న ప్రఖ్యాతి రావాలనుకోవడమో. అలాంటిదే ఇంకేదైనా ఊగిసలాట వుండడమో కారణం కావచ్చు. ఆదిత్యకు అమ్మాయిని వెదికే యత్నంలో, ఒంగోలు ప్రాంతంలో ఒక ఎస్‌.సి. అమ్మాయి వుంది. మీరు కోరిన లక్షణాలుంటే చేసుకుంటారా? అని కబురొచ్చింది. నిక్షేపంగా చేసుకుంటాం అని చెప్పాను వాళ్ళకు.
నచ్చిన, కోరుకున్న అమ్మాయినిగానీ, అబ్బాయినిగానీ స్వకులంలో చేసుకున్నవారు అనంతరం మెరుగైన సమాజం కొరకు పనిచేయరని, పనిచేయలేరని నిర్ధారణేమైనా వుందా? అదలా వుంచి కుల ప్రభావం ఇంకా పోనివాళ్ళకూ కొంత అవగాహన పెంచి కుల, మతరహిత సమాజం వాంఛనీయం అని అంగీకరింపజేయకూడదా? ఆపై వారూ ఆ దిశగా కదలకూడదా? కనుక ఆదిత్య వివాహం కుల మతాల ప్రమేయం లేకుండా జరిగిందేనన్నదీ, మా కుటుంబానికి అంటే నాకు, శ్యామలకు, ఆదిత్యకు, లీనార్కకు, చాలాకాలం ముందునుండే కుల మతాల గొడవ లేదన్నది 15, 20 సంవత్సరాలుగా మమ్మల్ని దగ్గరగా చూస్తున్నవారందరికీ తెలుసు. మండలి తాత్విక భావజాలంలో కులమడగొద్దు, చెప్పొద్దు అన్న సూత్రమూ ఒకటుంది. అయితే సభ్యులందరూ దానిని నూరుశాతం పాటిస్తుండకపోవచ్చు. కుల రహిత సమాజం అనగానే అది మెరుగైన సమాజం అవుతుందనడం అహేతుకం. కులంలో వుండే సమాజహితం కొరకు ఎంతో ఉదాత్త జీవితం గడిపిన వారు అన్ని కులాలలోనూ ఎదురుపడతారు. అలాగే ఒకవంక కుల నిర్మూలనంటూనే కరుడుగట్టిన స్వార్థంతో ప్రవర్తించేవారూ వుంటున్నారు. కులం ఒక అవాంఛనీయాంశమన్నది నిజమేగానీ, మెరుగైన సమాజావిర్భావానికి అదొక్కటి లేకపోవడమే కారణంకాదు.
3) వేదికమీద వున్న వక్తలలో ఒకరు 'ఈ వివాహం చట్టబద్ధంకాదు' అన్నప్పుడు దానిని ఖండించకుండా ఊరుకుండడంతో, ఇలాంటి పెళ్ళిళ్ళు చట్టసమ్మతం కాదన్న సందేశమే ప్రజల్లోకి వెళ్ళింది తప్ప ఇలాంటి పెళ్ళిళ్ళు చేయాల్సిన ఆవశ్యకత వుందన్న భావన వారిలో కలిగించలేకపోయారు. దీన్ని మీరెందుకు పట్టించుకోలేదో ఇప్పటికీ నాకర్థంకాలేదు.
అసలామాటన్నాయన ఎవరో, ఏమన్నారో అన్యమనస్కంగా వున్న నేను గమనించ లేదు. మీరు నిర్వాహకునికి చెప్పిన విషయాలూ నా దృష్టికి రాలేదు. వచ్చి వున్నా మీఅంత తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణించి వుండేవాణ్ణికాదు. ఆయా విషయాలలో దేనికెంత ప్రాధాన్యతనివ్వాలన్నది వారివారి దృష్టికోణాల్నిబట్టి వుంటుంది. అందులో ఏది సరైందన్నది విపుల విచారణచేస్తేగాని తేలదు. అవసరమైతే ఆ చర్చ మనం వేరుగా చేయవచ్చు. సజావుగా ముగిసిన ఏ ఫలితాంశాలనైనా స్వీకరించడానికీ, ఆ మేరకు ప్రకటన చేయడానికి నావరకు నేను సిద్ధం. అక్కడ మాత్రం నాలో ఏ గుంజులాటా లేదు, ఉండదు.
ఇక జరిగిన వివాహం గురించి : అందరం కలసి ముందుగా అనుకున్నది స్పెషల్‌ మ్యారేజి యాక్టు క్రిందనే రిజిస్ట్రేషన్‌  జరిపిద్దాం. వివాహం మన నూతన రీతిలో జరిపిద్దాం అని. సొంత పనుల మరియు ఉద్యమ కార్యక్రమాల వత్తిడివల్ల రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసే పని అమ్మాయి వాళ్ళకప్పగించాం. వాళ్ళు సరేనని ఆపని చూస్తామన్నారు. తీరా 30 రోజుల గడువుకు సమీప దినాలవరకు ఆ పని వాళ్ళు చేయలేకపోయారు. ఆఖరి సమయంలో రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళితే వివాహం చేసుకోనున్న జంట రిజిస్ట్రార్‌ సమక్షంలో దరఖాస్తు పెట్టాల్సి వుంటుందనీ, వారి ఫొటోలు, వేలిముద్రలు లాంటివీ తీసుకోవలసి వుంటుందనీ చెప్పారట. ఆఖరిరోజు మాకా వివరం తెలిపారు అమ్మాయి తరఫువారు. మేము హడావిడిగా కోదాడ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్ళాం. అక్కడా అదే సమాచారం అందింది. ఆదిత్య ట్రైనింగ్‌ క్యాంపు నుండి వచ్చే అవకాశం లేదు. మళ్ళా మండలి సభ్యులం ఇద్దరం ముగ్గురం కూచున్నాం. ఏమి చేద్దామని? హిందూ వివాహ చట్టం క్రింద రిజిస్ట్రేషన్‌ పనిపూర్తి చేసేద్దాం అన్న నిర్ణయానికి వచ్చాం. కనుక ఆదిత్య సమతల వివాహ నమోదు కార్యక్రమం హిందూ వివాహ చట్టం క్రింద జరిగింది. ఇక్కడికిదొక నిజం.
వివాహానికి చట్టబద్ధత కలిగించడం మినహా రిజిస్ట్రేషన్‌ విషయంలో నాకంత పట్టింపు దృష్టిలేదు. నా దృష్టి కోణమంతా వివాహం నెపాన మండలి మంచివని భావిస్తున్న భావజాలాన్ని మంది ముందుకు తీసుకుపోవడం, అది కొనసాగేటట్లు చూడడం ఎలాగన్న దగ్గరే వుంది. దాంతో అంతగా పట్టించుకోలేదా విషయాన్ని. ''చాలా ప్రధానమైన ఈ అంశాన్ని మీరు ఎందుకు పట్టించుకోలేదో ఇప్పటికీ నాకర్థంకాలేదు'' అని రెండో లేఖలోని మరో వాక్యాన్ని చూశాకనూ దానిని అంత తీవ్రంగా పరిగణించాలనిపించడంలేదు నాకు.
ఇప్పటికే మీ స్పందన-నా ప్రతిస్పందన పత్రికలో చాలా స్థలాన్నాక్రమించాయి. మీరు లేవనెత్తిన ఏ అంశాన్నీ విచారించకుండా వదిలేయాలని నాకేమీ లేదు. అయితే అందుకు పత్రిక తగిన వేదిక కాదనిపిస్తోంది. పత్రిక (1) ఎంతో వ్యయప్రయాసలతో ముడిపడి వుంది, (2) సామాజిక క్షేత్రానికి సంబంధించిన అనేక అంశాలూ క్రమాన్ననుసరించి ఇందులో కొనసాగించాల్సిన అవసరం వుంది, (3) దీనిపై మనమిరువురమే మరింత సాగదీస్తూ, లోతుగా విశ్లేషిస్తూ అక్కడక్కడా ఖండన మండనలు చేసుకుంటూ చేసే శ్రమ ఇతరులకూ అంత అవసరమైందిగా, విలువైందిగా అనిపించక పోవచ్చు, (4) కాలహరణమూ అయ్యే అవకాశముంది.
ముగింపు : మీకభ్యంతరం లేకుంటే ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. మీరూ నేనూ, మరి ఒకరిద్దరూ కూర్చుని అవసరమైతే రెండు మూడు రోజులైనా వుండి, పూర్తి విచారణ చేద్దాం. విచారణలో సరైనవని తేలిన వాటిని స్వీకరిద్దాం. సరికానివని తేలిన వాటిని విడిచివేద్దాం. తేలనివి పరిశీలనలో వుంచుదాం. ఈ మొత్తాన్ని రికార్డు చేద్దాం. సారాంశాన్ని పత్రికలోనూ వేద్దాం. బాగనే వుందనిపిస్తే ఎప్పుడు కూచుందామంటారో తెలుపండి. మిత్ర సంబంధాలు దెబ్బతినకుండా, విషయ విచారణలో నిష్కర్షకు లోపం రాకుండా సాగడం సర్వదా వాంఛనీయం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమ క్షేత్రాలలో క్రియాశీలంగా ఉన్నవారి మధ్య జరిగే చర్చలలో ఈ వైఖరి మరింత అభిలషణీయం. నా ఈ ప్రతిస్పందనలో ఎంతోకొంతమేర నిష్కర్షకంటే మిత్ర సంబంధాలకే అధిక ప్రాధాన్యత నిచ్చాను. కలసి కూచోగలిగితే విషయ నిష్ఠలో నిష్కర్షించుకోవచ్చు.
స్పం. :  శ్రీమతి గుత్తికొండ అహల్యాదేవిగారు ఆకేటి సూరన్నగారి లేఖకు జవాబిస్తూ, సురేంద్రగార్కి లేఖ ప్రతిని పంపించారు. లేఖాసారాంశం - స్త్రీకి జన్మహక్కుగా సంక్రమించిన అలంకారం స్త్రీకి బ్రతికియున్నంతకాలం అలాగే వుండాలి. పునర్వివాహం చేసుకోవడమూ, మానడమూ అన్నది స్త్రీ వ్యక్తిగత విషయం. పురుషుడు పునర్వివాహం చేసుకోవడం తనకు సేవ చేయించుకోవడం కొరకే. ఉన్న ఊరు వదిలి బిడ్డల దగ్గర గడిపితే కాలక్షేపం కాదనో, పిల్లలు తమను సరిగా చూడరనో ఉద్దేశ్యంతో పురుషుడు బిడ్డల దగ్గర గడపడానికి యిష్టపడడు. అలాకాక స్త్రీ పునర్వివాహం చేసుకోకుండా బిడ్డలదగ్గరో, లేక ఒంటరిగానో బ్రతకగలదు. ఇకపోతే సురేంద్రబాబుగారి దంపతులు వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నారుకనుక వారికి పునర్వివాహాల విషయంలో మీరు చేసిన సలహా వర్తించదు. మీరు మీ భార్యతో పునర్వివాహం గురించి చెప్పడం అభినందనీయమే. కాని పెళ్ళయిన రెండోరోజునే అలా చెప్పారంటే మిమ్మల్ని ఎలా అర్థంచేసుకోవాలో అంతుబట్టడంలేదు. హేతువాది అయినంత మాత్రాన కొత్తగా పెళ్లయిన శుభవేళ భార్యతో సంభాషించవలసిన అంశం అదేనా?
స్పం. : తూ.గో.జిల్లా నుండి జిల్లా హేతువాద సంఘాధ్యకక్షులు ఆకేటి సూరన్నగారు : మిత్రులు సురేంద్రగారికి, నమస్తే! అంటూనే ''మీ వివేకపథం జులై 2009 సంచికలో మీరు వ్రాసిన వ్రాతలకు-మీ ఆచరణకు పొంతనలేదు'' అంటూ ఒక దోషారోపణతో లేఖ మొదలెట్టారు.
జులై సంచికలో అహల్యాదేవిగారి వ్యాసంపై స్పందిస్తూ నేను వెలిబుచ్చిన అభిప్రాయాలను 'చక్కటి వివరణ' అంటూ ప్రశంసిస్తూనే, నీ మాటలకూ-చేతలకూ పొంతన లేదంటూ నిందవేసి, నేను చూసుకో, నా వివాహమైన రెండోరోజునే నా భార్యతో, నేను నీకంటే ముందే చనిపోతే నీ అభీష్టం మేరకు అలంకరణలతోబాటు, రెండవ వివాహం చేసికోమనీ సలహాయిచ్చాను అని తానెంత ఆచరణ పురుషుడో చూసుకోమంటూ స్వోత్కర్షను ప్రదర్శించారు.
నిజానికి పెళ్ళైన రెండోరోజునే ఆ సమయ సందర్భాలలో మాట్లాడుకోవలసిన వాటిని విడచి నేను చస్తే నీవు మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా వుండేవు. రెండో పెళ్ళి చేసుకో అంటూ మీచేత మాట్లాడించిన మీ హేతుబుద్ధికీ, దానికున్న సందర్భశుద్ధికీ జోహార్లు అర్పించితీరాలి. విషయ విమర్శ సందర్భానికీ, వ్యక్తి విమర్శ సందర్భానికీ తేడా చూడని (చూడలేని) ఎదుటివాడిలో ఎక్కడోచోట ఏదో లోపాన్ని చూపకుండా వుండలేని రంధ్రాన్వేషణాతత్పరతను చూసి నేనైతే జాలిపడతాను. వీలుంటే ఒక దెబ్బవేసి తట్టి లేపేపని చేస్తాను.
అహల్యగారి వ్యాసం దేనిని ఉద్దేశించిందో పట్టుకోలేనితనమూ వుంది మీలో. అది ఎక్కడోచోట తప్పు కనిపెట్టాలన్న తొందరలో జరిగిన పొరపాటైనా అయ్యుండాలి. లేదా, ఆమె ఆశించినదానికంటేను చాలా ఎత్తులో వున్నాను నేను అని మిమ్ము కనబరచు కోవాలన్న తొందరవల్ల జరిగిన పొరపాటైనా అయ్యుండాలి. ఈ రెండూ కాదంటే ఇక ఆ వైఖరి ఆత్మస్తుతి, పరనిందలకు అలవాటుపడడం వల్ల ఏర్పడిందైనా అవ్వాలి.
నాకు తెలిసి అహల్యగారి దృష్టి స్త్రీకి పుట్టుకతో-చిన్ననాటినుండీ- అందిన అలంకరణలు-భర్త చనిపోయాక ఉండకూడదనడం తప్పు అని చెప్పాలన్నదే. ఆమేరకు నేను సందర్భోచితంగా స్పందిస్తూ నేను నా భార్యకేగాక, బంధుమిత్రులకూ, నా మాటను, పట్టించుకునే వారందరికీ అనంటూ ఈ విషయంలో నా దృఢనిశ్చయం ఇది అంటూ అలంకరణలు తీసేయక్కరలేదు అని వ్రాశాను. మంచిగా వ్రాశాడని ఒకవంక మీ మనస్సు చెపుతున్నా, సురేంద్రపట్ల ముందేర్పరచుకుని వున్న అభిప్రాయం ఎక్కడోచోట లోపాన్ని కనిపెట్టాలని, లేకుంటే అంటగట్టాలనీ ఉబలాటపడుతోందన్నమాట.
ఎదుటివానిని మిత్రునిగా మనస్సు అంగీకరిస్తే ఎలా ప్రవర్తించమంటుంది? అమిత్రునిగా పరిగణిస్తే ప్రతిపక్షంగా చూస్తే, శతృవుగా భావిస్తే ఎలా ఎలా ప్రవర్తించ మంటుంది? అన్నది వాస్తవాల దృష్ట్యా ప్రవర్తన దృష్ట్యా చాలా కీలకమైనదవుతోంది. నిజంగా మీరు నన్ను మిత్రునిగా స్వీకరించారా? లేదా? అన్నది మీరే నిర్ధారించాలి. కనీసం సమాజహితైషిగనైన నన్నంగీకరించగలుగుతారా? సంఘ వ్యతిరేకశక్తిగనే చూడాలనిపిస్తుందా? మీ మనస్సు ఎటు మొగ్గుతోందో ఒకపరి తిరిగి చూసుకోండి.
పాఠకులందరికీ ఉపయోగపడే ఒక ముఖ్యాంశాన్ని మీ లేఖనడ్డుపెట్టుకుని చెపుతాను. అందరూ పరిశీలించవచ్చు. విషయాన్ని విచారించే సందర్భంలో వ్యక్తిని వెనుకకు పెట్టి, వ్యక్తిని విచారించేటప్పుడు విషయాన్ని రెండునబెట్టి విచారించాలన్నది, విచారణ నియమాలలో చాలా కీలకమైంది. వాటినే పారిభాషికంగా వాద పరీక్ష, వాది పరీక్ష అనంటారు. వాదాన్ని పరీక్షించేటప్పుడు వాది ప్రవర్తనేమిటి? నైజమేమిటి? అన్నది అనవసరాలు, అసందర్భాలు కూడా. అలాగే వ్యక్తి వర్తనే విచారణీయాంశమైనపుడు వాదపు విచారణ అనవసరం.
ఏంచేద్దాం! హేతువాద ఉద్యమాలలో అధ్యయనము-శిక్షణలన్నవి మృగ్యమయ్యాక, ఊకదంపుడు ప్రసంగాలు, వార్షికోత్సవాలే ఉద్యమాచరణగా చూడడం మొదలయ్యాక ఇట్టి మెలకువలు నేర్వాలని సభ్యులకుగానీ నేర్పాలన్న ఇంగితం నేతలకుగాని వుండడంలా. ఉద్యమాలు నామమాత్రావశిష్టంగా మారుతూ వుండడానికిదో ప్రబల కారణం ఆలోచించండి.
మరోమాట! నా స్పందనపై మీ అభిప్రాయం తెలప మొదలెట్టి ఆ లేఖ ఆమెకు ఎందుకు పంపినట్లు? ఇదిగో! సురేంద్రఅయితే ఇంతే, మేమైతేనో ఇంత అని చెప్పుకోవాలనిపించా! మరేదైనా కారణముందా?
తప్పుడు వ్యాఖ్యానం చేయని, తప్పులు దొర్లని రీతిలో మీదికాని, ఏదేని ఒక తాత్విక ధోరణిని విచారిస్తూ ఒక వ్యాసం రాయండి చూద్దాం. నా ఈ వత్తిడివల్లనైనా పట్టుబట్టి సక్రమ విచారణ (విశ్లేషణ-విమర్శ-సమీక్ష) చేసేందుకు యత్నిస్తారనే, ఈ మాట చెపుతున్నాను.
మరోమాట! మీ లేఖలోని మొదటి ఆరోపణను కొంత విచారించాల్సి వుంది. మాటకు చేతకు తగినంతగా పొంతనలేనితనం, అసలే పొంతనలేనితనం అన్నది ఎప్పుడేర్పడు తుంటుంది?
1) ఏ మనిషీ తెలిసిందంతా చేయలేడు. గట్టిపట్టుదలగలవాడైతే తెలిసిందాంట్లో అవసరమైనదనిపించినంతమేర ఆచరించే యత్నం మొదలెడతాడు. శక్తిననుసరించి అందులో అంతానో, ఎంతోకొంతనో చేసుకుంటూ పోతుంటాడు. ఈరకంవారి నిజాయితీని శంకించకూడదు. ఇట్టివారినీ నిజాయితీ లేనివానిగా పరిగణించబూనడం మతిసెబ్బరి తనం.
2) తెలిసినవాటిలో కొన్నింటిని అంత ప్రధానమైనవిగ తలంచక పోడంవల్ల వాటిని పాటించకపోవడం జరుగుతుంటుంది. ఈరకంవారినీ నిజాయితీ లేనివారిగ తలంచ గూడదు. వీరి అవగాహనలోని తేడాపాడాలను పరిశీలించాల్సి వుంటుంది. నిజంగా అతని అవగాహనలో లోపం వున్నట్లయితే, వ్యక్తిత్వాన్ని నిందించకూడదు. అవగాహనలోని లోపాన్ని ఎత్తిచూపాలి.
3) తెలిసినవాటిలో కొన్నింటిని అవి చేయవలసినవే అయినా చేయక్కరలేదు అనేగాక, చేయకూడదు అనీ అనుకుంటున్నామనుకోండి. అందుకు కారణం స్వార్థ ప్రయోజనాలనాశించడం అయితే, అప్పుడు మాత్రం ఆచరణ లేనివాడు అన్న పదం వాడాలి. తెలిసి తప్పు చేస్తున్నాడనన్నమాట. అక్కడా తప్పక చేస్తున్నాడా! కావాలని చేస్తున్నాడా అన్నది చూడాల్సి వుంది. తప్పకనే చేస్తున్నది నిజమైతే అట్టివాడినీ కపటి అనకూడదు- కావాలని చేస్తున్నవాడి దగ్గరే దోషారోపణ- దోషి అనడం- ఉచితం.
'మాటకు చేతకు పొంతనలేదు' అన్న వాక్యాన్ని ప్రకటించేముందు ఇంతా తెలిసి, ఇందులో ఆఖరిదాన్ని దృష్టిలో పెట్టుకుని అంటేనే అది తెలిసి చేసిన విమర్శ అవుతుంది. లేకుంటే అంతా దుందుడుకుతనమే. ఒక్కమాట! సరైన విమర్శ చేయడానికి చాలా విషయజ్ఞత, నిపుణత వుండాలి. అది అవగాహన, నిపుణతలతో కూడిన కళ. విమర్శచేయడం అంటే గుణాన్ని గుణంగా, దోషాన్ని దోషంగా వేరుచేసి చూపడం. ఉంటాను సెలవ్‌.

No comments:

Post a Comment