Thursday, October 1, 2009

ఒక ముఖ్య ప్రకటన సృష్టివాదుల బండారం



మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌గారికి మరియు సి.టి.ఎఫ్‌. సంస్థకు, నేను రహ్మాన్‌గారు కలసి నిర్వహించిన పరిణామ వాదము సృష్టివాదమా? అన్న చర్చలో పాల్గొన్న మిత్రులకు, సంస్థలకు.
క్రమంగా జరగాల్సిన వేదిక, అటు క్రైస్తవపక్షం, ఇటు ఇస్లాం పక్షం తరఫున పాల్గొంటూ వచ్చిన సి.టి.ఎఫ్‌. సంస్థ వాళ్ళమన్న ప్రకాష్‌, సుధాకర్‌, ఆనంద్‌కుమార్‌గార్లు, కడపకు చెందిన గౌస్‌, తారిఖ్‌, కాకినాడకు చెందిన రహ్మాన్‌, హైద్రాబాద్‌లోని అసీవుద్దీన్‌గార్లూ తగినరీతిలో తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించకపోవడంవల్ల అర్ధాంతరంగా నిలిచిపోయింది. అయితే ఈ రెండు పక్షాలు సమయోచితంగా స్పందించకపోవడం ఇంకా ఖచ్చితంగా (నిష్ఠూరంగా వున్నా) నిజం చెప్పాలంటే మెల్లగా జారుకోవడం చేస్తూ వచ్చాయి. ఇస్లాం పక్షంలోని పైన పేర్కొన్నవాళ్ళు తెలివిగా, ఎటువంటి వాద వివాదాలూ, ప్రగల్భాలూ లేకుండా వేదికనుండి విరమించుకున్నారు.

కానీ, క్రైస్తవపక్షం తరఫున పాల్గొన్న ప్రకాష్‌, సుధాకర్‌గార్లు మాత్రం, తెగబడి అనేకంగా మాట్లాడిందేకాకుండా, అస్సలు సిస్సలు సత్యాన్వేషులం, సత్యాన్వేషణ మండలివారు సత్యాన్వేషులనుకున్నాం. పొరబడ్డాం అంటూ అనుచిత వ్యాఖ్యలూ చేసి, సోత్కర్షను ప్రదర్శిస్తూ (సొంతడబ్బా కొట్టుకుంటూ) వచ్చారు. ఒకటి రెండుసార్లు, మండలి వైఖరిని చూస్తూ ఊరుకోం అని బెదిరిస్తూనూ ప్రకటనలు చేస్తున్నారు.
ఇంతకూ, సి.టి.ఎఫ్‌.వారు ఇంతటి అసందర్భ ప్రలాపాలు చేయడానికి వెనుక మండలి వారినేమడిగింది? ఆ వేదిక క్రమాన్ననుసరించి ప్రవర్తించడనేకదా! క్రైస్తవపక్షం నుండి వీరూ, ఇస్లాం పక్షం నుండి వారూ అడిగినప్పుడు పరిణామవాద పక్షీయులం ఎవరుగానీ ఏరకమైన సాగతీత పన్నాగాలు పన్నలేదే. ఎగవేత ధోరణిని కనపరచలేదే. వ్రాతమూలకంగానూ వారి పక్షాన్ని ప్రకటించారు. విచారణణకు సిద్ధమయ్యారు. అదంతా ఒక కొలిక్కివచ్చాక, పై సమావేశంలో బైబిలు సృష్టివాదం ప్రతిపాదన జరగాలి అని అందరం కలసి నిర్ణయించుకున్న నిర్ణయాన్ని అమలుపరచండనేగా మేమడిగింది. ఆ సమావేశం జరిగి ఇప్పటికి 10 నెలల పైనే అయ్యింది. ఈమధ్యకాలంలో అనేకసార్లు మీ బైబిల్‌ సృష్టివాదాన్ని ప్రకటించి నిరూపించండని మేమూ, పరిణామవాద పక్షాన పాల్గొన్న డా|| ప్రసాద్‌, గుమ్మా వీరన్నగార్లు, మరికొందరూ అడుగుతూనే వున్నాం. వేదిక నిర్వహణలో నాతోపాటు పాలుపంచుకున్న ఫజులుర్‌ రహ్మాన్‌గారూ పలుమార్లు వారిని అడుగుతూనే వస్తున్నారు. ఇదిగో వస్తున్నామని ఒకసారి, సురేంద్ర జ్ఞానసిద్ధాంతం ప్రకటించి నిరూపిస్తేనే వస్తామని మరోసారి, రేపటి వేదికలో మాకు ఎదుటిపక్షంలో ఎవరు పాల్గొంటారో ముందుగా తెలుపండని ఇంకోసారి, పేర్లు తెలిపినాక, నోటిమాటగాను, వ్రాతమూలకంగా వుండాలంటూ వేరొకసారి... ఇలా... రకరకాల పోకడలతో తమ వాదాన్ని ప్రకటించే పనిని మాత్రం అతి తెలివిగా వాయిదాలు వేస్తూ నెట్టుకొస్తున్నారు.
ఇస్లాం పక్షాన పాల్గొన్నవారు దొడ్డిదారి తొక్కలా. ఎదుటి గుమ్మ నుండే వెనక్కెళ్ళిపోయారు. నేనడిగినా, నేనడుగుతున్నానని రహ్మాన్‌గారడిగినా కిమ్మినాస్తిగా గమ్మునున్నారు. ఎవరన్నారో, అంతమేర నిజమో ఖచ్చితంగా నాకు తెలీదుగాని, అలాంటి చర్చలు మనకొద్దు, మీరూ విరమించుకోండన్న  సూచన రహ్మాన్‌గారికి చేసినట్లు వార్తలు నాదాకా వచ్చాయి. ఫజులుర్‌ రహ్మాన్‌గారు మాత్రం మావాళ్ళు ముందుకు రావడంలేదు, ప్రయత్నిస్తునే వున్నాను అని నాతోనే అన్నారు. ఇక్కడ ఇస్లాం పక్షాన పాల్గొన్నవారికీ, పాల్గొనాలనుకునేవారికీ నేను చెప్పేదేమంటే, ''సత్యాన్ని మరుగుపరచవద్దు, సత్యాన్ని పల్కడానికి వెనకాడవద్దు'' అనంటోందా లేదా ఖరాను. ఈ విషయంలో ఖురాన్‌ ప్రామాణికతపై మీకు ఖురాన్‌ వుండాలంటున్నంత విశ్వాసం వుందా? లేదా? మీకు మీరే పరిశీలించుకుని తేల్చుకోండి. ఈ విషయంలో ముందు మిమ్ము మీరు మోసగించుకోకుండా ఎదుటివారిని మోసగించలేరు. బాగా యోచించుకుని సత్యపక్షాన నిలవండి అనే.
ఇక సి.టి.ఎఫ్‌. యోధులమంటున్న వారి విషయంలో, ఈ సలహా యిచ్చే అవకాశమే లేదు మాకు. ఎందుకంటే! వారు ఇస్లాం పక్షీయుల్లా ఊరకుండలా. రక్కేస్తాం, కొరికేస్తాం, మీ అంతూ జూస్తాం, దమ్ముంటే నిలబడు! రా! అంటూ తెగమాట్లాడారు. ఇదిగో వచ్చిస్తున్నాం. మాది నిరూపిస్తాం అనంటూనూ గాంభీర్యాన్ని ప్రదర్శించారు. ఒకవంక దొడ్డిదారినబడి పరుగులెడుతూ, పలుగుకోసం పోతున్నాను పట్టుకొచ్చి దిగేస్తాను అనడం వారిలాంటివారివల్ల తప్ప అందరివల్లా అయ్యేపనికాదు.
కుటిల మేథకు పన్నాగాలు పన్నడంలో ఎన్నలేని వన్నె వుంటుంది. నా ఈ లేఖనడ్డుపెట్టుకుని ప్రకాష్‌గారు, మమ్మల్ని సురేంద్ర అనరాని మాటలన్నాడు కనుక ఆ వేదికను వెలివేస్తున్నాం. మేమిక సృష్టివాదాన్ని ప్రతిపాదించడానికి రాబోవడంలేదు అని ప్రకటించెయ్యగలరుకూడా.
ఫజులుర్‌ రహ్మాన్‌గారిని ఎప్పుడడిగినా, అడిగేటప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకింత అసహనాన్ని కనబరిచినా, ఆయన మాత్రం అసహనపడకండి, వేచిచూడండి అనంటూ వస్తున్నారు. పరిమితిలేని సహనం-ఓరిమి-జడత్వంతో సమానమైంది. ఎంతకాలం వేచిచూడడం? దింపుడకళ్లపు ఆశకైనా హద్దుండాలికదా! సం||కాలం కావస్తున్నా అపసవ్యపు పోకడలు తప్ప రావలసిన దారికిరాని వాళ్ళ విషయంలో ఓరిమి వహించడం! అసలదేమి ఓరిమి? దానిని ఓరిమి అనడంకంటే అంటీ ముట్టనితనం అనడం సబబుకదా! ఆలోచించండి.
ఆమధ్య సి.టి.ఎఫ్‌. పేరనే ఒక ఇ-మెయిల్‌ వచ్చింది నాకు! ఆ మధ్యంటే నిన్నా, మొన్నా అనుకునేరు. ఆ అర్థం రావాలంటే ఈమధ్య అనాలి. జనవరికి ముందన్నమాట. జనవరిలో చెన్నైలో ఏదో పెద్ద సమావేశం వుంది. అదయ్యాక వచ్చేస్తున్నాం. మేము భయస్తులంకాదు. వగైరా, వగైరా ప్రకటనలలో వుందా ఇ-మెయిల్‌. బాగుంది. బాగుంది. విషయం నెమ్మదిగానైనా ఒక కొలిక్కి రాబోతుందిలే అనుకున్నాను. కానీ ఆ నిర్భయస్తుని, ధీరుని జనవరి కార్యక్రమాలు ఇంకా పూర్తయినట్లు లేదు. అక్టోబర్‌, నవంబర్‌ల కొచ్చాము గనుక జనవరి ఇంకా రాలేదు గదయ్యా అనేంత తెగింపూ వున్నవాళ్ళే వాళ్ళు. నేను గమనిస్తున్నంతలో ప్రకాష్‌గారిలాంటి వాటిలో అవసరమైన దానికంటేనూ ఎక్కువ తెగువ చూపించగలరు.
ఈ సందర్భంలో ఈమధ్య జరిగిన (ఆరంభమై కొనసాగుతున్న) ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. మొన్నటి మా వేదికలో పరిణామవాద పక్షాన పాల్గొన్న రాజేంద్రప్రసాద్‌గారు ఊరుకుండబుద్ధికాకనో, అలవాటుగానో ఒక ఇ-మెయిల్‌ తెలిసిన నలుగురికీ పంపుతూ ప్రకాష్‌గారికీ పంపారు. 'శాంతికి పది సూత్రాలు' అనే అర్థం వచ్చేలా వుందా వ్యాసపు శీర్షిక. ఇంకేముంది దానిపై చర్చ (రచ్చ అందామా?) మొదలెట్టారు ప్రకాష్‌గారు. అందులో కొన్ని పదాల దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ పదం మీరన్నారు గనుక మీరే అర్థం చెప్పాలిఅని ప్రసాద్‌గారిని నిగ్గదీశారు ప్రకాష్‌గారు. ఎక్కడికక్కడ ఎదుటివాణ్ణి నీదేమిటో చెప్పు, నీవన్నమాటల అర్థంచెప్పి, అది సరైందేనని తేల్చు ముందుర! అంటూ అదరగండంగా మాట్లాడే ప్రకాష్‌గారికి, ఆ నిమం తనకీ వర్తిస్తుందన్న ఇంగితం పనిచేయదెప్పుడూ. ఎందుకనో! ''నీ కంట్లో దూలాలెట్టుకుని ఎదుటివాని కంట్లో నలుసుల్ని వెదుకుతావేమిటన్న'' ఏసు సూక్తి, ప్రకాష్‌గారికి వర్తించినంత ఖచ్చితంగా మరొకరికి వర్తించడం చాలాకష్టం. ఇక ఆయన ప్రసాద్‌గారి సృష్టివాదపు మీ పక్షాన్ని పంపండి అన్న అభ్యర్థనను మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రక్కనబెట్టి, మిగిలిన విషయాలను మాత్రం నిరవధికంగా కావలసినంత సమయాన్ని, స్థలాన్ని, శ్రమనూ ఖర్చుపెడుతూనైనా వాద ప్రతివాదాలు సాగించగలరు. వారిరువురి మధ్య జరుగుతున్న దాన్ని చూస్తే ఆ నిజం మీకూ తెలుస్తుంది.
మన వేదిక క్రమాన్నిబట్టి ఆయన జవాబుదారీ కావలసిందీ ఒక బైబిలు ప్రచారకునిగా సమాజానికీ జవాబుదారీ ఆయ్యుండాల్సిందీ, దైవాస్తిత్వాన్ని అంగీకరించకుండా నీతి న్యాయము, మంచిచెడు, అన్నవాటిని వివరించుకోడమూ, అలా వుండడమూ సాధ్యంకాదన్న భావాన్ని వెలిబుచ్చిన ఆయన అందువల్లనైనా మాటకు కట్టుబడి వుండాల్సింది ఈ సందర్భంలో ఒకటుంది. బైబిలు సృష్టివాదాన్ని ఎటువంటి వత్తిడులలో పనిలేకుండగనే ప్రతిపాదించి, అది సరైందేనని నిరూపించడం. ఆ పని చేయకుంటే సృష్టివాదం (బైబిలు సృష్టివాదం) సరైందని ప్రకటించడం విరమించుకోవడం.
గమనిక : పరిణామవాదం ఒక సిద్ధాంతమే కనుక దానిని రుజువైన అంశమని చెప్పవద్దని పరిణామవాదులకు నన్ను చెప్పమన్నారు.
చరిత్రను గట్టిగా పట్టిచూసి అందులోని వంచనల చిట్టా బైటపెట్టుగలిగితే, ఆస్తికత పేర జరిగినంత వంచన, అమానుష హింసాకాండ మరి దేనివల్లనూ జరగలేదని తేలుతుంది. అన్నిమతాల చరిత్రలోనూ, వారి వారి మత సాహిత్యం నుండే ఇందుకవసరమైన సమాచారం దొరుకుతుంది.
ముగింపు : పొరపాట్లు చేయడం, తప్పులు చేయడం మానవసహజం. మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒకింత కుటిలత్వాన్ని అనుసరించడమూ కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా అదే వరవడిగా సాగిస్తూ పోవడమే తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఇప్పటికైనా ప్రకాష్‌గారు జరిగినదాన్నంతా నెమరువేసుకుని, విజ్ఞత సూచిస్తున్నమేర తనవంతు బాధ్యతను స్వీకరించగలిగితే మంచిది. ఏ మనిషైనా అతడెంత సవ్యంగా వున్నా, అపసవ్యంగా వున్నా అతనిలో మరో పద్ధతికి మారే అవకాశం వుంది, వుంటుంది అన్న ఒక సాధారణ సూత్రాన్ని అంగీకరించే ఈ ఆఖరి సూచన చేస్తున్నాను. ప్రకాష్‌గారూ! ఇప్పటికైనా మా వేదిక క్రమాన్ననుసరించి మీరు పూచీపడాల్సిన బైబిలు సృష్టివాదాన్ని ప్రతిపాదించి, అది సరైందని నిరూపించడానికి సిద్ధపడండి. ఈ విషయంలో రహ్మాన్‌గారూ వారి వంతు న్యాయసమ్మతమైన పాత్రపోషణ చేయాల్సి వుంది. వేదికలో పాల్గొన్న ఇతరులూ సృస్టివాదుల్ని వారి వారి సృష్టివాదాల్ని ప్రకటించి, నిరూపించమని వత్తిడి చేయాల్సి వుంది. అది వేదికలో వున్న ప్రతి ఒక్కరి బాధ్యత.

No comments:

Post a Comment