Sunday, November 1, 2009

వరద బాధితుల సహాయంలో మండలి పాత్ర



క్రమక్రమంగా వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావానికి దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రదర్శిస్తున్న అతివృష్టి, అనావృష్టులకు దేశప్రజలంతా గురి అవుతున్నారు. ఈ సంవత్సరం ఇక అసలు వర్షాలే పడకపోవచ్చు అని ఆశలు వదులుకొన్న తరుణంలో సెప్టెంబర్‌ 29వ తేదీన మొదలైన వర్షాలు ముఖ్యంగా మన రాష్ట్రంలోని కర్నూలు, మహబూబ్‌నగర్‌, నల్గొండ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేశాయి. గత వందేళ్ళుగా ఇంత ఉధృతస్థాయిలో వరదలు రాలేదని నీటిపారుదల నిపుణులే చెప్తున్నారు. 1977లో జరిగిన దివిసీమ ఉప్పెనలో జరిగిన ప్రాణనష్టంతో పోలిస్తే ఈ వరదల్లో జరిగిన ప్రాణనష్టం చాలా స్వల్పమనే చెప్పవచ్చు.
దీనికి ఈ 6 జిల్లాల్లోని ప్రభుత్వ యంత్రాంగం, మీడియా హెచ్చరికలు, స్వచ్ఛంద సంస్థల సహకారం కారణం అని చెప్పవచ్చు. ప్రాణనష్టం తక్కువైనప్పటికీ, రాష్ట్రంలో ఆస్తుల, పంటల రూపంలో జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు మించిందనటంలో భిన్నాభిప్రాయం లేదు. ఒక్కరాత్రిలో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పట్టణాలకు పట్టణాలే జలమయమైనాయి. అందువలన ఈ విపత్తును బాధితులు తట్టుకోవాలంటే ప్రభుత్వ సాయమొక్కటే సరిపోదు. అందుకే, సమాజంలో విలువలు దినదినం దిగజారుతూ, మానవత మృగ్యమైపోతున్నదనుకుంటున్న నేటికాలంలో, అదేంకాదు, ఇంకా మానవతా విలువలు ఉనికిలో వున్నాయంటూ వరద బాధితులను ఆదుకోవటానికి వ్యక్తిగతంగానూ, స్వచ్ఛంధ సంస్థల రూపంలోనూ అనేకమంది ముందుకు వచ్చారు. వాటిలో సత్యాన్వేషణ మండలి కూడా ఒకటి. రహదారులు బందై రాకపోకలకు జరిగిన అంతరాయంవల్ల, మరియు ఇలాంటి సందర్భాల్లో పాల్గొన్న అనుభవం సంస్థాగతంగా సభ్యులకు లేనందువల్ల, 4, 5 రోజులు ఆలస్యంగా క్యాంప్‌ మొదలైనప్పటికీ, మొదలైనప్పటినుండి క్యాంప్‌ జరిగిన 2 వారాలూ సభ్యులు ఈ క్యాంపులో నిండా మునిగి పనిచేయడం జరిగింది.
క్యాంపులో మండలి సభ్యులైన పుట్టా సురేంద్రబాబు, పుట్టా శ్యామల, చెరుకూరి వెంకట్రామయ్య, కోట ప్రసాద శివరావు, కోట జయశ్రీ, యర్రంశెట్టి జగన్‌ మోహన్‌రావు, యర్రంశెట్టి పార్వతి, మంతెన విజయలక్ష్మి, శీలం నాగార్జునరావు, శీలం కుమార్‌, పార్వతి (గన్నవరం), మోదుగుల శివారెడ్డి, పెరికల మోషే, ఎన్‌.శివప్రసాద్‌, పిచ్చిరెడ్డి, సుబ్బయ్య, పోతంశెట్టి యోగయ్య, ఎం.శ్రీనివాసరావు, ఎం.మాధవి, ఎం. మధు, వెంకటేశ్వర్లు (పి.డబ్ల్యు.డి. వర్క్‌షాప్‌) పాల్గొన్నారు.
ఈ క్యాంప్‌ ద్వారా మొత్తం 3,440 కుటుంబాలకు సాయం అందించగలిగాం. రేపల్లె మండలంలోని 9 ప్రాంతాలు, నాగాయలంక మండలంలోని 9 ప్రాంతాలు, ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు ప్రాంతం మొత్తం 19 ప్రాంతాలలోని బాధితులకు సహాయం అందించగలిగాం - వివరాల్లోకి వెళితే ...
రేపల్లె మండలంలోని ఉమ్మడి కాల్వగట్టు ప్రాంతంలో 100, 13వ వార్డు యానాదికాలనీలో 100, గూనెడుపాలెం రోడ్డులో 105, యానాది కాలనీ చెరువువద్దనున్న 150, ఎం.ఆర్‌.ఓ. ఆఫీసు వెనుక యానాది కాలనీ ప్రాంతంలోని 160, రావి అనంతారంలోని 100, ముస్లిమ్‌ కాల్వగట్టు ప్రాంతంలోని 10, 22వ వార్డు పాములోళ్ళు వున్న 250, ఎరుకలపాలెంలోని 250 చొప్పున, ఇలా మొత్తం 1225 కుటుంబాలకు సహాయం అందించాం. ఈ సహాయ కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో శీలం నాగార్జునరావు, పెరికెల మోషే, ఎన్‌.శివప్రసాద్‌, మోదుగుల శివారెడ్డిలు పాల్గొన్నారు.
అలాగే కృష్ణాజిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు ప్రాంతంలోని పూరిళ్ళ నివాసులైన 230 కుటుంబాలకు క్యాంప్‌ సహాయం అందించాం. నాగార్జునరావు, శివారెడ్డి, యోగయ్యగార్లు ఈ ప్రాంతంలోని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
చివరిగా కోట ప్రసాద్‌గారు, ఉదయ్‌సింగ్‌ గౌతమ్‌గారి సహకారంతో నాగాయలంక మండలంలోని ఎదురుమొండిలోని 480, క్రిష్ణాపురంలోని 95, బొడ్డువారి మూలలోని 50, ఏసుపురంలోని 105, గొల్లమందలోని 170, హరిజనవాడలోని 35, నాచుగుంటలోని 450, ఈలచెట్ల దిబ్బలోని 390, బ్రహ్మయ్యగారి మూలలోని 210 చొప్పున మొత్తం 1985 కుటుంబాలకు సహాయం అందించాం.
సాయం పొందిన 3,440 కుటుంబాల్లోని 200 కుటుంబాలకు, కుటుంబానికి 10 కిలోల చొప్పున, 3060 కుటుంబాలకు, కుటుంబానికి 5 కిలోల చొప్పున, 180 కుటుంబాలకు, కుటుంబానికి 4 కిలోల చొప్పున మొత్తం 28 టన్నులకు పైగా బియ్యం రూపేణా సాయం చేయడం జరిగింది. అన్ని కుటుంబాల వారికి బియ్యంతోపాటు ప్యాంటు, షర్టు, చీర, జాకెట్‌, చిన్నపిల్లల డ్రెస్‌లు అందించాం. కొన్ని ప్రాంతాలవారికి సరుకులతోపాటు కొత్త దుప్పట్లు, టవల్సు వంటి పాత్రలు కూడా అందించాం. ముఖ్యంగా దాములూరు ప్రాంతంలోని 50 కుటుంబాలకు బియ్యంతోపాటు అన్నం గిన్నెలు, కూరగిన్నెలు, వాటిపై మూతలు, వడ్డనకు హస్తాలు, గరిటెలు, దుప్పటి, టవలు చొప్పున ప్రత్యేక ప్యాకేజి యివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు తమ వంతుగా రు.34,000/-లు ఇవ్వగా, ఇతర దాతల నుండి రు.26,500 విరాళం వసూలు చెయ్యగలిగింది. ఈ క్యాంప్‌ నిర్వహణకు ధనరూపేణా ఖర్చు రు.62,019/- అయినందువల్ల రు.1,519/- తరుగు భర్తీ అవవలసి వుంది. వసూలు, ఖర్చుల వివరాలు :-
1. సత్యాన్వేషణ మండలి రు. 34,000/-
2. పుట్టా జగన్‌మోహన్‌రావుగారు రు. 10,000/-
3. డా|| క్రాంతి (హైదరాబాద్‌) రు. 10,000/-
4. బంగారమ్మ (విజయమ్మగారి ద్వారా) రు.3,000/-
5. ప్రమోద్‌ చైతన్య, అన్నపూర్ణ దంపతులు రు.2,000/-
6. రమేష్‌, పాతూరు రు. 1,000/-
7. కె. జగన్‌మోహన్‌రావు (ఆంధ్రా బ్యాంకు మేనేజర్‌) రు. 500/-
మొత్తం  =   రు. 60,500/-
క్యాంప్‌ నిర్వహణకు అయిన ఖర్చుల వివరాలు :
1. పంపిణీ నిమిత్తం కొనుగోలు చేసినవి
జర్మన్‌సిల్వర్‌ గిన్నెలకై రు.16,506/-
కంచం, గ్లాసు, గరిటెలు రు.5,535/-
100 దుప్పట్లు రు. 6,500/-
400 టవల్సు రు. 8,550/- రు. 37,091/-
2. భోజనాల కొరకు రు.3,267/-
3. ట్రాన్స్‌పోర్ట్‌ కొరకు రు.17,850/-
4. సర్వేల నిమిత్తం రు. 1,534/-
5. కార్యకర్తల ప్రయాణపు ఛార్జీలకై రు. 795/-
6 గోడౌన్‌కు, కరెంట్‌, క్లీనింగ్‌ నిమిత్తం రు. 1,000/-
7. ఇతర చిల్లర ఖర్చు రు. 482/-
మొత్తం = రు. 62,019/-
ఇక వస్తురూపంలో క్యాంప్‌కు సహాయం అందించిన దాతలుగా ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌, విశాఖ వారు హెచ్‌.ఎం.టి.వి. విశాఖ, విజయవాడ, హైద్రాబాద్‌ వారు వున్నారు. వారు అందించిన సాయంలో....
బియ్యం 18,100 కిలోలు, నూనె 80 కిలోలు, పంచదార 55 కిలోలు, ఉప్పు 90 కిలోలు, చింతపండు 100 కిలోలు, బిస్కెట్‌ ప్యాకెట్స్‌ 1,900, నీళ్ళ మగ్గులు 100, టవల్స్‌ 100, దుప్పట్లు 90, వాటర్‌ ప్యాకెట్స్‌ 3000, మరియు పాత దుస్తులు 9 టన్నులు వున్నాయి.
చుక్కపల్లి పిచ్చయ్యగారు 100 దుప్పట్లు, 100 టవల్స్‌ పంపించారు. విశ్వశాంతి గ్రామైక్యసంఘం, జగన్నాథపురం వారు 20 చీరలు పంపించారు. కె.ఎస్‌.ఎంటర్‌ప్రైజెస్‌ ప్రొప్రయిటర్‌ అడపా పుల్లారావుగారు తమ మినీ ట్రక్కును సరుకు పంపకానికై క్యాంపుకు అందించారు. పంపిణీ అయిన పై సరుకులేకాక మెడికల్‌ క్యాంప్‌ నిర్వహణకై మెడిసిన్స్‌ కూడా అందాయి. వాటిని కర్నూలువారు నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంప్‌కు పంపడం జరిగింది.
ఉదయ్‌సింగ్‌ గౌతమ్‌గారు సుమారు 1,300 ఖాళీ బ్యాగ్‌లను సప్లయి చేశారు. అంతేకాక నాగాయలంక ప్రాంతంలో సర్వేకు, పంపిణీకి కూడా మండలికి సహకరించారు. ఈ క్యాంప్‌ నిర్వహణకై కళ్యాణ మండపాన్ని ఉచితంగా వాడుకోవడానికి వెంకటేశ్వర ఆలయ ట్రస్టీ శ్రీ ఆంజనేయులుగారు అనుమతించారు. దేవాలయాలు ఇలాగే భవిష్యత్‌లో కూడా సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడతాయని ఆశిద్దాం. ఈ క్యాంప్‌ నిర్వహణకు ప్రభుత్వాధికారి శ్రీ జోషిగారు సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా ధనరూపేణా, వస్తురూపేణా, సేవలు రూపేణా క్యాంప్‌ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మండలి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా సామాజిక సేవల్లో మనందరం కలుస్తుండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఇట్లు,
యర్రంశెట్టి జగన్‌మోహన్‌రావు
క్యాంపు కో-ఆర్డినేటర్‌

No comments:

Post a Comment