1. నేపధ్యం :
అది ఐక్యవేదిక ఆరంభయత్నాలు జరుగుతున్న సమయం. పని పెద్దది పెట్టుకున్నామని ముఖ్యులందరికీ స్పష్టంగా తెలుస్తూనే వుంది. ఐక్య వేదిక అవసరాన్ని గుర్తించిన సమాజ హితకాంక్ష కలిగిన పెక్కు సంస్థలు పటిష్టమైన మిత్ర సంబంధాలు కలిగి ఉండడంతో ఉద్యమాలకవసరమైన రెండు వనరులలో ఒకటైన మానవ వనరులు కొంతవరకు ఉన్నాయన్న దృష్టి మా అందరికీ ఉంది. ఇక ఆర్థిక వనరుల దగ్గరకొచ్చేటప్పటికి ఎవరికి వారికి ఎంతో కొంత సందిగ్దత, ఊగిసలాట ఉంటూనే వచ్చింది. ఆరంభయత్నాలే సరైన స్థాయిలో చేయడానికి 10 కోట్ల రూపాయలు అవసరపడతాయన్న అంచనా ఉంది.
ఆర్థిక వనరులు సమకూర్చుకొనేందుకు ప్రణాళికా బద్దంగా, జిల్లాల వారీగా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. జిల్లాకు ఒక వందమంది వదాన్యులను ఎంపిక చేసుకొని వారినుండి విరాళాలు - నిధిని - సేకరించాలన్నది ఒక కోణం కాగా, ఉద్యమంలో ఉన్నవారిలోనే ఒకింత స్తోమత కలవాళ్ళు తలాకొంత నిధిని అందిద్దామనుకున్నాం. సభ్యత్వాల చేర్పుద్వారా ఇంకొంత సమకూర్చుకోవాలనుకున్నాం. అంతా సవ్యంగా జరిగినా ఆర్ధిక అవసరాల కొరత ఉండేట్లే ఉందనిపించి ఇలాంటి కార్యక్రమాలకు అనుగుణ్యత కలిగిన ప్రభుత్వ భాగస్వామ్యం లభిస్తే బాగుండును, అనుకొని ఆ దిశగా విచారణ చేయమొదలెట్టాము.
ప్రయత్నంలో భాగంగా, మన జంపా క్రిష్ణకిషోరుగారి ద్వారా అపార్డు డి. డైరెక్టర్ కుమార్ రాజా గారు పరిచయంలోకి వచ్చారు. జంపానే వారికి మన ఐక్యవేదిక వివరాలందించి ఈ పెద్ద పనిలో మీ వంతు సహకారం ఏమైనా చేయగలరా ! అని అడగడం, వారు చేయగలంత చేస్తాం. రండి. కమీషనర్ గారితోను మాట్లాడండనడం జరిగింది. ఐక్య వేదిక ముఖ్యులం కొందరం కలసి అపార్డు మనకు సహకరించగల అంశాలు, మన అవసరాలు అన్నదానిని చర్చించుకొని రాష్ట్రవ్యాపితంగా శిక్షణా తరగతుల నిర్వహణ, ప్రచారములన్న వాటికి కావలసిన సాధన సామాగ్రిని మీరు సమకూర్చండి. ఐక్యవేదిక తరపున మేము మానవ వనరుల్ని సమకూర్చుతాం. తగినంత మంది శిక్షకుల్ని, ప్రచారకుల్ని తయారు చేసే పనికి పూనుకుంటాం. బోధన, శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలు, ప్రణాళిక రూపొందించే బాధ్యత చాలావరకు మేమే వహిస్తాం. ఇరువురం కలసి ఆ పనిని పూర్తి చేసుకొని పౌర సాధికారిత దిశగా ప్రజలను మేలుకొలిపే పనికి పూనుకొందాం అనడం జరిగింది.
అన్నంతనే ఏ మాత్రం తడుముకోకుండా, అప్పటి కమీషనర్ ఫణికుమార్ గారు శుభస్య శీఘ్రం. మంచి పనికి ఆలస్యమెందుకు, మీరు బోధనాంశాలను, శిక్షణా తరగతుల ప్రణాళికలను రూపొందించుకు రండి. ఒక సంవత్సరము ఒప్పందం చేసుకుందాం. మీలాంటి నిబద్దత కలిగిన సంస్థలతో కల్సి పనిచేయటం మాకూ ఆనందమే. ఈ మొత్తం కార్యక్రమం, ఏమాత్రం కాల విలంబన లేకుండా చకచకా జరిగిపోవడానికి అపార్డు డి. డైరెక్టరు గారైన మిత్రులు కుమార్ రాజా గారు నిర్వహించిన పాత్ర ప్రశంసార్హమైంది. ఆయన మనలో ఒకరిగానే ఉద్యమ స్ఫూర్తితోనూ బాధ్యతాయుతమైన ఉద్యోగిగానూ తాము చేయగలిగినంతా చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలోనూ, ప్రజాహితం కోరేవారు ఇంకా కొందరు మిగిలే వున్నారనడానికి రుజువుగా నేరుగా మన అనుభవంలోకి వచ్చారు వీరు మరియు కమీషనర్ గారైన ఫణికుమార్‌గారూనూ.
ఇంత పెద్ద పని, ఎలా, ఎలా అనుకుంటున్న తరుణంలో ఈ సయోధ్య ఏర్పడటంతో మేమంతా చాలావరకు కుదుటపడ్డ మనస్సులతో, అనంతర కార్యక్రమాలకై ఉత్సాహంతో కదిలాం. ఒక 15, 20 రోజుల్లోనే, 3,4 అంశాలకు సంబంధించిన అధ్యయనాంశాల చిత్తు ప్రతులు తయారయ్యాయి. అపార్డు వారు ముఖ్యంగా కుమార్ రాజా గారు, మేము కూర్చొని బోధనాంశాలను ఒకింత సమీక్షించుకొని తొలి శిక్షణా తరగతుల నిర్వహణకు సిద్దమయ్యాం.
ఐక్యవేదిక మరియు అపార్డు ఉమ్మడి లక్ష్యాలు - కార్యాచరణ ప్రణాళిక :
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవ్వాలంటే ప్రజలు అవగాహనాపరులు, చైతన్యవంతులు అయ్యుండాలి. దురదృష్టవశాత్తు ప్రజలలో ఎక్కువమంది ఇప్పటికీ ఈ రెండు సామర్ధ్యాలు లేనివారే. ఆ లోపాన్ని సరిచేయాలన్న దృష్టితో ఏర్పడిందే మన ఐక్యవేదిక. అపార్డు సంస్థ లక్ష్యాలలోనూ ప్రజలకు అవగాహన కలిగించడం, ఆ పైవారు క్రియాశీలంగా తమ తమ పాత్రలను పోషించేలా ప్రోత్సహించడం ద్వారా పౌర సాధికారతను నెలకొల్పడం అన్నది ఉండడంతో మనకూ, వారికీ ఈ విషయాలలో చాలా వరకు భావసారూప్యత (ఏకాభిప్రాయం లేదా ఏక లక్ష్యం) ఏర్పడింది. కనుకనే సంయుక్త నిర్వహణలో ఆ లక్ష్యాల దిశగా కలసి కదులుదాం అనుకున్నాం. నిబద్దతతో పనిచేసే కార్యకర్తలను సమకూర్చడం (ఐక్యవేదిక) మనం చేయగలిగిన పని కాగా సాధన సామాగ్రిని సమకూర్చడం, నిర్వహణ వ్యయప్రయాసల బాధ్యత స్వీకరించడం వారి (అపార్డు) పని. ఈ రెండూ తోడవడంతో, చేయాలనుకున్న పని పెద్దదైనప్పటికీ, చేయటానికి తగిన వాతావరణం (కారణ సామాగ్రి సమకూరిన పరిస్థితి) ఏర్పడినట్లయింది. నిజానికి మనస్పూర్తిగా సమాజ హితం కోరేవారందరూ సంతోషించదగ్గ అంశమిది.
ఎక్కడైనా భావజాల వ్యాప్తికి, ఆ పని చేయగల సమర్ధుల్ని తగినంత మందిని సమకూర్చుకోవటమే ముందుగా చేయవలసిందవుతుంది. అందుకు అధ్యయన, శిక్షణా తరగతులు నిర్వహించుకోవడమొక్కటే సరైన మార్గం. అందుకనే ముందుగా, జిల్లాకు 10 మంది శిక్షకుల్ని తయారుచేయాలనుకున్నాం. దీనిని మూడు నెలల్లో పూర్తిచేయాలనుకున్నాం. ఎందుకంటే, ఈ పని పూర్తయితే, జిల్లా శిక్షణా తరగతులు నిర్వహించుకోవటానికి అవసరమైన శిక్షకులు సిద్ధమవుతారు.
మలిథలో అపార్డుకు ఉన్న ప్రాంతీయ శిక్షణా కేంద్రాలలోనూ శిక్షణా తరగతులు ప్రారంభించుకోవాలి. రాజేంద్రనగర్‌తో కలుపుకొని హసన్‌పర్తి, సామర్లకోట, బాపట్ల, కాళహస్తిలలో వున్న ఐదు కేంద్రాలలోనూ తరగతులు ఆరంభించుకోవాలి. ఈ రెండు థల కార్యక్రమాలలోనూ 1. శిక్షకులకు శిక్షణనిచ్చేవారు, 2. శిక్షకులు, ప్రచారకులు కాగలిగిన వారు రూపొందుతారు. ఇంతవరకు పూర్తి స్థాయిలో శిక్షణా తరగతులు ఆరంభమై, కొనసాగుతుంటే 5 కేంద్రాలలోనూ కలుపుకొని ప్రతినెలా 250 మంది సుశికక్షుతులైన శిక్షకులు (ప్రచారకులు) తయారవుతుంటారు. మిత్రులారా ! మన యత్నాలు ఇక్కడి వరకు సజావుగా పూర్తైతే అటు తరువాత ప్రజలందరకూ అవగాహన కలిగించడం అన్న పనిమొదలవుతుంది.
ఈ థలో 23 జిల్లా శిక్షణ కేంద్రాలు, పని ప్రారంభిస్తాయి. జిల్లాకు నలుగురు గాని, ఆరుగురు గాని శిక్షకుల్ని ఏర్పరచుకోవలసి ఉంటుంది. ఈ థ కార్యక్రమాల దగ్గర నుండే ఉద్యమ కార్యాచరణ ఆరంభమవుతుంది. ఈ 23 కేంద్రాలలో ప్రతి వారం తరగతులు నిర్వహించగలిగితే, ప్రతి కేంద్రము నుండి 100 మందికి శిక్షణ గరపగలుగుతాం. అంటే. ప్రతి నెలా 2,300 మంది శిక్షణ పొందిన వారు తయారవుతారన్న మాట.
ఈ థలో తయారైన వారిలో నుండి, మండల స్థాయిలో 2 రోజుల శిక్షణ, అవగాహన కలిగించే పనికి సిద్ధపడిన వారిని తీసుకొని, మండల శిక్షణా కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంటుంది. గ్రామానికి 10 మందికి తక్కువ కాకుండా ఈ మండల స్థాయి తరగతులలో ప్రజలకు అవగాహన కలిగించితే దాదాపు రాష్ట్రస్థాయిలో మనం చేయాలనుకున్న పని ఒక కొలిక్కి వచ్చినట్లే. ఆ పైన మనం గాని, గ్రామములో తయారైన ఆ పది మంది అవగాహనా పరులైన గ్రామస్తులుగాని, మిగిలిన గ్రామమంతటికీ పౌర సాధికారితకు అవసరమైన కనీసాంశాల గురించిన అవగాహన కలిగించే పని చేస్తూ ఉండవచ్చు.
సారాంశం - శిక్షణా తరగతుల పరిధి 3 థలుగ ఉంది.
1. శిక్షకులకు శిక్షణ - ఈ థలో తొలివిడతగా 250 మందిని తయారుచేయాల్సి ఉంది. అందులో 125 మంది సుమారు జిల్లా శిక్షణాలయాలలో శిక్షకులుగా వుండేవారు, మిగిలిన 125 మంది ప్రచారకులుగా ఉండేవారు ఉంటారు.
2. మలి థలో జిల్లా శిక్షణాలయాలు పని మొదలెడతాయి. ఇవి ప్రతినెలా 2300 మందిని మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ద్వారా తయారు చేస్తుండాలి. ఇక్కడ శిక్షణ పొందిన వారిలోనుండి సిద్ధపడిన వారితో మండల శిక్షణా తరగతులు నిర్వహించుకోవాలి. ఇందుకు మనకు కనీసం 2000 మంది నుండి 3000 మంది వరకు అవసరపడతారు. వీరు పౌరులకు అవగాహన కలిగించే సదస్సులను నిర్వహిస్తూ, గ్రామ సభలను చైతన్యవంతం చెయ్యడానికి పౌరుల్ని సన్నద్దం చేస్తుంటారు. మిగిలిన వారు ఎక్కడికక్కడ ప్రజలకు అవగాహన కలిగించే పనిచేస్తుంటారు.
3. మండల శిక్షణా తరగతులు మొదలైతే అక్కడితో శిక్షణా తరగతుల ప్రణాళిక పూర్తయినట్లు.
ఎ) రాష్ట్ర స్థాయిలో శిక్షకులకు శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలం 5 రోజులుంటుంది.
బి) రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన వారు జిల్లా స్థాయిలో మూడు రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తుంటారు.
సి) జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తుంటారు.
నోట్ : ప్రక్కవానికి అవగాహన కల్గించే పని తాను చెయ్యవలసే ఉందని పౌరులు తెలుసుకొని అలా ప్రవర్తించగలిగిన రోజు మనలాటి ఉద్యమ క్షేత్రాలపై పనిభారం చాలావరకు తగ్గిపోతుంది. కనుక మనం కొద్దిమంది ప్రజలకు కేవలం అవగాహన కలిగించడమే గాక, వారు ఇతరులకు అవగాహన కల్పించే పనిలో పాలుపంచుకొనేట్లు ప్రోత్సహించడము చేయవలసి ఉంది.
సమర్ధుడైన ఉద్యమ కార్యకర్త రెండు సామర్ధ్యాలు - మంచి లక్షణాలు - కలిగి వుంటాడు. ఒక ప్రక్క ఉద్యమాశయాలకనుగుణంగా తననితాను మలచుకొంటూ మరోప్రక్క తనలాటి వారిని మరికొందరినీ తయారుచేయడంపై దృష్టిపెట్టి ఉంటాడు.
ప్రశ్న - బాగుందండీ ! అధ్యయన శిక్షణా తరగతుల చట్రాన్ని గురించి చెప్పారు సరే, ఇంతకూ అధ్యయనం దేనిని గురించి, శిక్షణ దేనిగురించి?
సమా- అభినందనలు మిత్రమా ! అడగవలసిన ప్రశ్నే అడిగావు. ఈ ప్రశ్న సమాజ పునర్నిర్మాణం కొరకు పాటుపడేవారందరూ వేసుకొని సమాధానం చెప్పుకొని ఉండాల్సినంత మౌలికమైనది.
పౌరులందరూ, ఏ దేశ పౌరులైనా సరే వారందరూ ముందుగా తెల్సుకొని ఉండాల్సింది, ఆ దేశం తనకు తానుగా ఏర్పరచుకున్న ఒప్పందాన్ని గురించే. దానినే ఆ దేశపు రాజ్యాంగం అని అంటారు. కనుక మనం పౌరులందరకూ అవగాహన కల్గించాల్సిన మొదటి విషయం భారత రాజ్యాంగం అవుతుంది. ఏ రాజ్యాంగమైనా రెండు ప్రధాన విభాగాలుగ ఉంటుంది. అందులో, ఎవరి ప్రయోజనాల కొరకై రాజ్యాంగం పుట్టిందో వారు పొందవలసిందేమిటి? అందుకై వారు అనుసరించవలసిందేమిటి? అన్న భాగం ఒకటి కాగా, రెండవది మొదటి భాగపు లక్ష్యాల నెరవేర్పుకు ఏర్పరచుకున్న వ్యవస్థను, దాని తీరుతెన్నులను తెలిపే భాగం.
మొదటి భాగం క్రిందకి ప్రస్తావన, పౌరుల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అన్నవి వస్తాయి. రెండవ భాగం లోనికి ప్రస్తావన ఉద్దేశం నెరవేరేందుకు, ఆ క్రమ సాధనలో పౌరులు వారి వారి హక్కుల పొందేలా, విధులు నిర్వహిస్తుండేలా చేసేందుకు, వాటి అతిక్రమణలు జరిగితే వాటిని సక్రమ పరిచేందుకు అవసరమైన పాలన, నిర్వహణ రూపమైన యంత్రాంగాన్ని (రాజ్యాంగాన్ని) గురించిన వివరణల భాగం వస్తాయి.
ఈ మూడంశాలకు సంబంధించిన కనీసావగాహన కలిగించడం మనముందున్న మొట్టమొదటి పని అవుతుంది.
చిన్న కుటుంబం - పెద్ద కుటుంబం :
మనం సంఘ జీవులం, సంఘమంటే ఒక పెద్ద కుటుంబమని చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదట అందరం దృష్టిపెట్టాల్సింది ఒక ఏకమొత్తంగా ఆ కుటుంబ అవసరాలు తీరడంపైనా, కుటుంబాభివృద్ధిపైనా, కుటుంబ భవిష్యత్తు మరియు భద్రతపైన. అటుతర్వాత కుటుంబాభివృద్ధికి ఆటంకం కాని రీతిలో, అనుకూలంగా ఉండేందుకు అవసరమైన రీతిలో ప్రతి ఒక్కరి తాత్కాలికావసరాలు, దీర్ఘకాలిక అవసరాలు తీరే విధంగా పనుల పంపిణీ, ఉత్పత్తుల పంపిణీ (పనుల, ఫలితాల) లోనూ యోగ్యమైన వాటా కేటాయింపులు జరగాలి. మరోవంక ఏ కారణాల వల్ల గాని ఏర్పడుతుండే అసాధారణ పరిస్థితుల వల్ల తలెత్తే అసమంజసతలను, అసమానతలను తొలగించుకొనేందు కవసరమైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక మినహాయింపులు (తాత్కాలిక ప్రాతిపదికన) అమలు చేస్తుండే విధానం సమర్ధవంతంగా అమలవుతుండాలి.
ఉదాహరణ :
1. కుటుంబములో ఒకనికి జబ్బు చేసింది. అతని ఆరోగ్యానికై ప్రత్యేక శ్రద్ధ, అదనపు వ్యయం పెడతామా? లేదా?
2. ఒకడు చేసిన పనికి అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితం వచ్చింది. ఆ అదనాన్ని కుటుంబానికి మొత్తానికి చెందేలా ఉమ్మడి పరం చేస్తామా ? లేదా ?
3. ఒకడు చేసిన పనికి అనుకున్నంత రాలేదు. లేదా ఫలితం రాలేదు. ఆ లోటును కుటుంబం మొత్తానికి వర్తింపజేస్తూ ఉమ్మడి లోటు క్రింద పరిగణిస్తామా ? లేదా ?
4. కుటుంబంలోని ఆయా వ్యక్తులు నిర్వహిస్తున్న పాత్రల స్వభావాన్ని బట్టి వారికి వనరులు కల్పించటంలో ఏర్పడే తప్పనిసరి వ్యత్యాసాలను ఉమ్మడి అభివృద్ధికి అవసరమైనవిగా మాత్రమే పరిగణించడం జరుగుతుంది. అంతేగాని వాటిని అర్హతలకు చెందిన వ్యత్యాసాలుగా పరిగణించం కదా !
మిత్రులారా ! ఇంతో అంతో అవగాహన కలిగిన కుటుంబాలన్నింటా జరుగుతుండే సహజ లేదా సాధారణ క్రమం ఇలాగే ఉంటుందంటారా ? లేదా ? ఇలా వుండటమే సబబు అంటారా ? ఉండక్కరలేదు అంటారా ? కలసి జీవించే అనేకుల మధ్య ఆచరణకు సంబంధించిన విధివిధానాలు ఇలా ఉండటం మేలా ? ఇంకొక రకంగా ఉండటం మేలా ?
ఒక కుటుంబం ఆరోగ్యంగా, బలంగా ఉంటూ, ఒక మొత్తంగా పురోభివృద్ధినొందాలంటే ఇంతకంటే మెరుగైన సూత్రీకరణలను రాబట్టగలరేమో ఆలోచించండి. అలాంటివి ఉంటే సూచించండి.
సమాజము అంటే ఒక పెద్ద కుటుంబమని అర్ధం. కుటుంబానికి అతి చిన్న రూపం భార్యా భర్తలుగా ఇద్దరు 'ఉమ్మడిలోకి రావడం'. ఒక ఒప్పందానికి - కట్టుబాటుకు - లోనై జీవించడానికి సిద్ధపడటం అన్నదే. కనుక కుటుంబ వ్యవస్థకు పునాది పరస్పర సహకారం అంతఃసూత్రంగా, ఉమ్మడి ప్రయోజనాల నెరవేర్పు లక్ష్యంగా ఒప్పందానికి రావడమన్నదే అవుతుంది. అక్కడినుండి ఆ ఇరువురికి మరి రెండు క్షేత్రాలతో సంబంధాలు ఏర్పడతాయి. 1. తాము పుట్టించిన వారి విషయంలో, 2. తమను పుట్టించిన వారి విషయంలో. మొదటి రకంవారు అసమర్థత నుండి సమర్ధత పొందే వైపుకు కదులుతున్న వారు లేదా కదలాల్సిన వారు. భావితరం అనందాం వారిని. లేదా ఆ కుటుంబ వారసులు అనందాం. రెండో రకం, క్రమంగా సామర్ధ్యాలను కోల్పోతున్న పెద్ద తరం. అనారోగ్యం, వృద్ధాప్యం అన్న రెండు కారణాల వల్ల క్రమంగా సామర్ధ్యలోపం ఏర్పడుతుంటుందీ విభాగంలో. ఎప్పుడూ కుటుంబంలోని వర్తమాన తరానికి, తమకు ముందు, వెనుక తరాల ఆలన - పాలన బాధ్యత అన్నది విధులలోకి చేరుతుంది.
మనమీనాడు మన బిడ్డల విషయంలో ఎలాటి హృదయం కలిగి ఉంటున్నామో మన తల్లిదండ్రులు, మన విషయంలో అంటే వారి బిడ్డల విషయంలో అలాటి హృదయమే కలిగిఉన్నారు, ఉండేవారు అనడం సహజ క్రమాన్నంగీకరించడం కనుక కుటుంబంలోని వర్తమాన తరానికి, కుటుంబంలోని ముందూ వెనుక తరాల పోషణ, రక్షణ అన్నది విధి అవుతుంది.
కుటుంబ న్యాయం అన్నదానికి సంబంధించిన ప్రాతిపదికలలో ఇదీ ఒకటి.
కుటుంబంలోని అందరికీ సమన్యాయం జరగాలంటే, అమలవుతుండాల్సిన ఒకేఒక సూత్రం ఎవరి విధులు వారు నిర్వర్తిస్తుండడమే. ఎవరు చేయాల్సినది వారు చేస్తూ ఉంటే కుటుంబ అవసరాలన్నీ సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. కుటుంబాభివృద్ధి, ఉన్నంతలో సవ్యంగానే కొనసాగుతూ ఉంటుంది.
ఇద్దరితో మొదలై మూడు తరాల వారితో కూడి ఏర్పడే కుటుంబపు సాధారణ రూపాన్ని సమాజానికి వర్తింప చేయటమే సమాజ సంక్షేమానికి లేదా యోగక్షేమాలకు, ఇప్పటికి మనకు తెలిసిఉన్న ఏకైక ఉత్తమ మార్గం.
కుటుంబంలోని ఒక వ్యక్తి కుటుంబ ఆసరాతో పెరిగి పెద్దవాడైనాడు. ఉమ్మడి శ్రమనుండి ఏర్పడ్డ ఫలితాలలో భాగం పొందాడు. అటుతర్వాత కుటుంబానికి తన శ్రమ ఫలితాలనందించడానికి గాని, కుటుంబ మొత్తపు ఆదాయ వ్యయాలలో పాలుపంచుకోవడానికి గాని సిద్దపడటంలా. కుటుంబాన్ని దానిమానాన దానిని వదిలేసి తన దారి తాను చూసుకుంటున్నాడు. ఇప్పుడు సాంప్రదాయంగా జరుగుతున్నదిదే. దీనిని తప్పు విధానంగా, ఇప్పటి కుటుంబ వ్యవస్థ, సాంప్రదాయం భావించడం లేదు.
తనకు ఓపిక వచ్చేంత వరకు కుటుంబం నుండి ఇబ్బడిముబ్బడిగా పొందుతున్నాడు అది తన హక్కని అనుకుంటున్నాడు. ఓపిక రాగానే కుటుంబ బాధ్యత తనకేమీ లేదంటూ తనదారి తాను చూసుకుంటున్నాడు. అలా పోతూ పోతూ కూడా తనకింకా ఉమ్మడి నుండి రావలసింది ఉందంటూ కొట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు కుటుంబాలలో జరుగుతున్న రీతి, రివాజు. నడుస్తున్న కుటుంబ వ్యవస్థలో ఒక పార్శ్వములోనున్న పెద్ద లోపమిది, దీనిని సరిచేసుకోవలసిన అవసరం ఉంది.
కుటుంబానికి వర్తించే నియమనిబంధనలేవీ, తనకిక వర్తించవని చెప్పడం లేదా వర్తించవని అంగీకరించడం అనే దాని అర్ధం. దాని తప్పొప్పుల్ని తర్వాత విచారించుదాం. మౌలికంగా అందులో వున్న ప్రధాన దోషం, ఆ విధానం సహజన్యాయ సూత్రాలను అతిక్రమిస్తుండడమే.
అయితే ఇక్కడ సమాజమనే పెద్ద కుటుంబం నుండి వ్యక్తి విడిపోవడమన్నదే సాధ్యపడదు. ఇది నిజమా ? కాదా ? ఆలోచించండి. ఈ దేశస్తుడు భారత దేశంతో నాకు సంబంధం లేదు, అక్కరలేదు అనిగాని, మరో దేశస్థుడు ఆ దేశంతో తనకు సంబంధం లేదు, అక్కరలేదు అనిగాని అనవచ్చుగదా! అని మీలో కొందరు వాదించవచ్చు. ఒక వ్యక్తి ఒక దేశంతో అంటే ఒక ఒప్పందం క్రింద జీవిస్తున్న సమూహంతో సంబంధాన్ని తెంచుకొని మరోదేశంలోకి మరో ఒప్పందం క్రిందికి చేరవచ్చు. అది అసాధ్యం కాదు. కానీ ఏ ఒప్పందం క్రింద నున్న సమూహమైనా అట్టివాడు ఆ సమూహాన్ని కాదని తమలోకి ఎందుకు వస్తున్నాడా ? అన్న దానిని చాలా జాగ్రత్తగా పట్టిచూస్తుంది. చూడాలి కూడా.
అలా చూడటం ద్వారా ఆ వ్యక్తి, ఆ సమూహం నుండి తనకు ఒప్పందం ద్వారా రావలసిందానికంటే అధికంగానే పుచ్చేసుకొని, తిరిగి ఇవ్వడానికి ఇష్టంలేక వచ్చేస్తున్నాడు అన్న నిజాన్ని గుర్తించిందనుకోండి. అట్టి వ్యక్తిని ఒప్పందపు సాధారణ న్యాయాన్ని అంగీకరించగల ఏ సమూహమూ తన సమూహములోనికి ఎట్టిపరిస్థితులలోనూ రానివ్వదు అవునా ? కాదా ? నిర్ణయించండి. అదే మరి ఆ రెండో సమూహం గాని ఇంకొంత వివేకం కలిగిన సమాజమైతే, అట్టివాడ్ని ముందెళ్ళి వెనుకటి సమాజానికి నీవు ఇవ్వవలసింది ఇచ్చేయ్. అటు తర్వాతైనా ఇక్కడ మా లెక్కల ప్రకారం నీవు ఇవ్వవలసింది ఇవ్వడానికి సిద్ధపడితేనే ఇక్కడికి రా. అని కట్టడి కూడా చేస్తుంది. అట్టివాని పట్ల. అతడా రెండు పనులకు సిద్ధపడి వచ్చినా, అతనిపై ప్రత్యేక నిఘాపెట్టి ఉంచుతుంది కూడా. ఇక్కడికిది నిజమో కాదో, సబబో కాదోను తేల్చండి. కనుక ఒప్పందాన్నతిక్రమించేవాడు ఆ సమూహంలో ఉండడానికి అర్హుడు కాకుండా పోతాడు. నిజానికి సమాజమనే పెద్ద కుటుంబం నుండి బయటికి పోవడం సాధ్యపడదు.
మరో సమూహం దగ్గరకు పోను, మీ సమూహములో ఉండను అనంటేనో ? అంటూ కొంటె వాదన లేవనెత్తే వారు ఉండవచ్చు. అట్టివారికేమి చెబుదామండీ అని శంకర్రావుగారి శంఖ.
మేమిచ్చింది మాకిచ్చి నిక్షేపంగా వెళ్ళవచ్చు అని మన సమాధానం. ఇప్పుడా వ్యక్తికి రెండు దారులు గోచరించవచ్చు. ఇచ్చి, ఇస్తూ ఇక్కడే ఉండడం, ఇవ్వవలసింది ఇచ్చేసి ఒంటరిగా వెళ్ళిపోవడం, జీవితం అర్ధమైనవాడు మొదటి మార్గాన్నే ఎంచుకొని బుద్ధికలిగి బుద్దిగా జీవించడానికి అలవాటు పడతాడు. అందుకు వేరైనవాడు, వాడడిగిందిచ్చేసి వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఇక్కడ ఎంతిస్తే సమాజం అతనికి ఇచ్చింది తిరిగిచ్చేసినట్లు అన్నది పెద్ద లెఖ్ఖ. చాలా లోతుగా గణన చేయాల్సిన లెఖ్ఖ అది. దాన్ని అలా ఉంచుదాం. ఉన్నదంతా ఇచ్చో ఎంతో కొంతకు సమూహంఅంగీకరిస్తే అంతవరకు ఇచ్చో వెళ్ళడానికి సిద్దమైనాడనుకుందాం. అప్పుడైనా అతగాడు ఎక్కడికి పోతాడంటారు?
ఈ సమూహానికి సంబంధించని చోటుకు కదా వెళ్ళాలతడు ? అట్టి ప్రదేశం ఎక్కడుంటుందో అతనికేమైనా తెలుసేమో ఆడిగిచూడండి. అతనికి తట్టకుంటే మీరేమైనా చూపెట్టగలరేమో మనసుపెట్టి చూసి చెప్పండి.
విషయం అర్ధమవుతుందా ? నాకు తెలిసి సమూహంలో ఉండను, విడిగా ఉంటాను అన్న వ్యక్తికి ఉండే చోటుండదు, సరికదా, బ్రతికేందుకు అవసరమైనవేవీ సమూహాలకు సంబంధించకుండా ఉండవు. ఇదర్ధమైతే గాని, విజ్ఞులు మనిషిని 'సంఘజీవి' అని ఎందుకన్నారో అర్ధం కాదు. కనుక సంఘజీవి కాకుండా ఉండలేవు. విధులు నిర్వర్తించకుండా సంఘజీవితాన్ని పొందలేవు. ఇదంతా అర్ధమైతే, సమాజం కోసం నేనెందుకు పనిచేయాలి ? అన్న ప్రశ్న ఎంత పిచ్చి ప్రశ్నో, ఎంత అసంబద్దమైన ప్రశ్నో, ఎంత ప్రమాదకరమైన ప్రశ్నో ఇట్టే తెలిసిపోతుంది.
కనుక వ్యక్తులకు సంఘ జీవితం అంటే ఏమిటో తెలియజెప్పే, సంఘజీవిగా మసలుకొనే వైఖరిని అలవరచి అందుకు తగిన వాతావరణాన్ని కల్పించటం అన్నదగ్గరే సామాజిక సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంది. మరోవంక సంఘ జీవితాన్నిచ్చగించని వానికి సంఘ బహిష్కరణ శిక్ష విధించటం ద్వారా, సంఘజీవి కానివాని జీవితం ఎలా ఉంటుందో రుచిచూపించటం చేయాలి. అక్కడికీ అది వ్యక్తిని పూర్తిరూపములో సంఘ జీవితాన్నుండి బయటపెట్టడం అవదు.
ఎందుకంటే ఒక సమాజము నుండి విడివడడం అంటే ఆ సమాజానికి సంబంధించిన ప్రకృతి నుండి విడివడటం అనే అర్థం. సంఘ జీవితాన్ని వదులుకోవడం అని అంటే చనిపోవడానికి సిద్ధపడడం అనే. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వెంటనే చనిపోవడమనే. కనుక సమర్ధవంతమైన సమాజం, సమాజం ఏమైపోతే నాకేమిటి ? సమాజం పని నేనెందుకు చేయాలి లాంటి మాటలనే వాణ్ణి, ఆ నిముషం, నీవు మాకేమీ చేయనక్కరలేదు, నీవిక్కడ ఉండక్కరలేదు. మేము నీకేమీ చేయనక్కరలేదు అని చెప్పి సమాజాన్ని విడిచి తక్షణం వెళ్ళిపొమ్మనాలి. మరొక్క మాట మాట్లాడితే తన్ని వెళ్ళగొట్టాలి. అప్పటికి గాని తానేమిటో, తన బ్రతుకేమిటో, సమాజానికి తన అవసరం ఉందో, తనకు సమాజంతో అవసరం ఉందో తలకెక్కదు.
'వ్యక్తి - సమాజం - ప్రకృతి' అన్న మూటి మధ్య సంబంధం పరస్పరాధార సంబంధం కానేకాదు. వాటిమధ్య 1. ప్రకృతి, 2. సమాజం, 3. వ్యక్తి అన్న క్రమములో ఆధారాధేయ భావసంబంధం, అంటే ప్రకృతిపై సమాజం, సమాజంపై వ్యక్తి ఆధారపడే మనుగడ సాధించవలనన్న మాట. ఈ నిజం అర్ధమైతేగాని సమాజాన్ని, ప్రకృతిని ఎందుకు సరైన రీతిలో కాపాడుకుంటూ, అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలో అర్ధం కాదు. ప్రకృతి - సమాజం అన్నవాటి పట్ల తన వంతు విధి నిర్వహణ చేయడమే ధర్మాచరణమనంటే. ప్రతి ఒక్కరూ ఇలా ప్రవర్తించినపుడు మాత్రమే వ్యక్తులందరికీ వారి సహజాకాంక్షల నెరవేర్పుకు అవసరమైన, తగిన, స్థితిగతులు ఏర్పడి అందుబాటులో ఉంటాయి, కొనసాగుతుంటాయి.
నిర్వహణ చేయడమే ధర్మాచరణమనంటే ప్రతిఒక్కరూ ఇలా ప్రవర్తించినపుడు మాత్రమే, వ్యక్తులందరికీ వారి సహజాకాంక్షల నెరవేర్పుకు అవసరమైన, తగిన, స్ధితిగతులు ఏర్పడి అందుబాటులో ఉంటై.. కొనసాగుతుంటై.
వివిధ స్వచ్ఛంద సంస్ధలు - ఉమ్మడి ఆశయం
లోకంలో అనేకమంది మంది హితం కోరుతూ, వివిధ కార్యక్షేత్రాలలో పనిచేస్తున్నారు. సమాజంలో ఏకాలంలో చూసినా ఏదో ఒక స్ధాయిలో ఈ వైఖరికల మనుషులు ఉండి తీరతారు. మన మందరమూ ఈ కోవకు చెందిన వాళ్ళమేననడం అతిశయోక్తి కాదంటాను. ఈ వైఖరి కలవాళ్ళు ఏ క్షేత్రంలో పని చేస్తున్నా వారందరి దృష్టి ఒక్కటే. ''ఇక్కడ లేదా ఈ విషయంలో సమాజం ఉండవలసినట్లులేదు. ఉండకూడనితనం చోటు చేసుకుని ఉంది. శక్తి ఉన్నంతలో ఆ ఉండకూడని తనాన్ని పోగొట్టి, వీలైనంతమెరుగైన స్థితిని ఏర్పరచేందుకు పనిచేద్దాం'' అనుకుంటున్న వాళ్ళే వాళ్ళంతా. అంటే మనం ఇప్పుడున్న సమాజానికంటే ఎంతో కొంత మంచి సమాజం ఏర్పడాలని కాంక్షిస్తున్నామన్నమాట.
ఎంత మెరుగైన సమాజం ఏర్పడితే ఇక నీవు చేయాల్సిన పనిని ఆ పేస్తావు? ఇక ఆ విషయంలో చేయవలసిందిలేదు అన్న నిర్ణయానికి వస్తావు? అనడిగామనుకోండి. అవగాహన కలవాడైతే మాత్రం ఇక అక్కడ ఉండకూడనితనం ఏమాత్రం లేదు. ఏర్పడదు అని తేలినప్పుడే, అదే సమాధానం చెపుతాడు. కనుక మనలాంటి వాళ్ళందరి ముందు ఉన్న ఏకైక లక్ష్యం మంచి సమాజం ఏర్పడాలన్నదే. అందుకు మనం చేయగలిగింది, ఎప్పటికప్పుడు అప్పుడున్న దానికంటే మెరుగైన సమాజం కొరకు పాటు బడుతుండడమే. ఇంతకంటే అభ్యుదయాకాంకక్షులు చేయగలిగింది లేదు.
సరైన అవగాహన, చిత్తశుద్ధి ఉన్నవాళ్ళెవరైనా ఉత్తమ సమాజం ఆదర్శంగా, మెరుగైన సమాజం అంచలవారీ లక్ష్యంగా పెట్టుకుని అభ్యుదయ శక్తులన్నింటినీ సంఘటిత పరచుకుంటూ మహోద్యమ రూపంలో కృషి చేస్తూ సాగుతుండడమే చేయాల్సిన పనవుతోంది. కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.
1. జె.వి.వి. పౌరులకు శాస్త్రీయదృక్పధాన్ని కలిగించి, వైజ్ఞానిక సమాచారాన్ని అందించే పని చేస్తోంది. ఎందుకాపనికి పూనుకున్నారని అడిగాం :- ఉత్తమ సమాజం ఏర్పడాలని అంటోంది.
2. మానవ వికాస వేదిక మూఢనమ్మకాలను తొలగించాలని, శాస్త్రీయ సృహను పెంపొందించాలని అనుకుంటోంది. ఎందుకాపనికి పూనుకున్నారని అడిగాం :- మంచి సమాజం ఏర్పడాలని అంటోంది.
3. హేతువాద, నవ్య మానవవాద సంఘాలు, శాస్త్రీయ విజ్ఞానాన్ని, అందిస్తూ, హేతు దృష్టిని అలవరచడానికి కృషి చేస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ఎందుకాపని చేస్తున్నారని అడిగాం :- మంచి సమాజం కొరకు అనే అంటున్నాయి.
4. జై భారత్, మతసామరస్యం, దేశభక్తి, సామాజిక న్యాయం కొరకు పని చేస్తున్నానంటోంది. ఎందుకు పని చేస్తున్నారనడిగాం. అవి నెలకొంటే ఇప్పటికంటే మంచి సమాజం ఏర్పడుతుందనే అనంటోందదిన్నీ.
5. ఎమ్. వి. ఫౌండేషన్ బాలకార్మిక వ్యవస్ధ నిర్మూలనకై, అందరికీ విద్యనందించడానికై కృషి చేస్తొంది. ఎందుకు పని చేస్తున్నారనడిగాం. అది అమలైతే మంచి సమాజం ఏర్పడుతుందని. అనే అంటోందాసంస్ధ కూడా.
6. లోక్‌సత్తా అవినీతి రహిత రాజకీయాలు ఏర్పరచాలని కృషి చేస్తోంది. ఎందుకాపని అనడిగాం, మంచి సమాజం రావడానికొరకై అనే చెపుతుంది.
గమనిక :- ఇలా అవగాహన, చిత్తశుద్ధి కల స్వచ్ఛంద సంస్ధలను వేటిని పట్టి చూసినా, వారివారికి కనపడిన సామాజిక సమస్యలపై వారివారికి తోచిన రీతిలో, వారి వారికున్న శక్తియుక్తులననుసరించి సమాజంలో ఉండకూడనితనాన్ని పోగొట్టడానికీ, తద్వారా ఎంతోకొంత మెరుగైన సమాజం రూపొందించడానికీ కృషి చేస్తున్నట్లు తేలుతుంది. దీన్నంతటినీ గమనించుకొనే, 'సర్వోద్యమాల లక్ష్యమూ వ్యష్టి సమష్టి శ్రేయస్సేననుట నిర్వివాదము'. అన్న సూత్రీకరణ తాత్వికుల్లో నుండి రూపొందింది. కనుక మిత్రులారా! మన మందరమూ, ఇంకా సరిగా చెప్పుకోవాలంటే, విజ్ఞతగలిగిన సహృదయులంతా సమస్యారహిత సమాజం ఏర్పడాలని కోరుకుంటున్నవారేననాలి. కనుక అభ్యుదయవాదుల మధ్య అవగాహనా పరంగా, అభిరుచులపరంగా ఎన్ని వ్యత్యాసాలున్నా వారందరూ కోరుకుంటున్నది, సమాజంబాగుండాలనే, కనుక మనందరి ఆశయం మంచి సమాజమేనన్నది మనస్పూర్తిగా మనమందరం గుర్తించాలి. అంగీకరించాలి. ఆ నేపధ్యం నుండీ మన మన అవగాహనలలోని వ్యత్యాసాలను సమీక్షించుకుంటుండాలి.
ఉత్తమ సమాజ సాధనలో దేశభక్తి పాత్ర
సమాజాన్ని కుటుంబంతో పోల్చుకున్నాం. నిజానికి అంతకంటే చక్కని పోలిక నాదృష్టిలో మరోటిలేదు. దేశభక్తి విషయంలోనూ, కుటుంబాన్నే నమూనాగా (ప్రతీకగా) తీసుకుని విషయాన్ని విచారించుకోవచ్చు.
ప్రశ్న:- కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ ప్రథమకర్తవ్యం ఏమిటై యుండాలి?
నా సమాధానం :- అతగాడు మొట్టమొదట కుటుంబాన్ని ఇష్టపడాలి. ప్రేమించాలి. కుటుంబంతనది అన్న భావన దృఢంగా కలిగి ఉండాలి. ప్రతివ్యక్తీ కుటుంబం పట్ల ఇలాంటి దృష్టినే కలిగి ఉండాలి. ఇదే అతని ప్రథమ కర్తవ్యం అనంటాను. అవునంటారా? కాదంటారా? కుటుంబంలోని ఏ వ్యక్తైనా కుటుంబం పట్ల మమకారాన్ని కలిగిలేరనుకోండి. అట్టి వాని ప్రవర్తన ఎలాగుంటుందంటారు? మనిషి స్వభావతః తనది అనుకున్నదానిని పెంచి పోషించుకుంటూ, రక్షించుకుంటూ ఉంటాడు. ఇక అదే స్వభావం, దేనిపట్ల 'తన' అన్న భావాన్ని కలిగి ఉండదో, దానిని విడిచి పెడుతుంది. దాని ఆలనాపాలన పట్టించుకోదు. సరికదా వీలైతే దానిని తన అవసరాలకు వాడుకుని పారేస్తూ ఉంటుంది. ఈ రెండు వైఖరులూ మనిషి స్వభావంలో ఉన్నవే. కనుక కుటుంబాన్ని తనదిగా చూడనటువంటివాడు, వీలైనంతవరకు తన అవసరాలకు దానిని వాడుకుని, దాని బాగోగుల్ని పట్టించుకోకుండా వదిలేస్తుంటాడు. అట్టి వాణ్ణి ఆ కుటుంబం తనతో కలుపుకుని ఉండడం వివేకవంతమా? విడిచిపెట్టడం సరైనదా. ఏమాత్రం ఇంగితం పని చేస్తున్నా, కుటుంబాన్ని తన అవసరాలకు వాడుకుంటూ, కుటుంబాన్ని ప్రేమించని, తనదిగా తలంచని కుటుంబాన్ని గురించి పట్టించుకోని వారిని కుటుంబం నుండి తొలగించడమే సరైంది అని నిర్ణయించగలం. అవునంటారా? కాదంటారా? ఆలోచించండి.
ప్రశ్న :- నిజమైన ఇష్టత, లేదా ప్రేమ యొక్క వ్యక్తీకరణ చేతులలో కనిపిస్తుంటుందా? మాటలలో మాత్రమేనా?
సమా :- మంచి ప్రశ్న ఇది. ఇక్కడ ఏది సరైన విధానమో తెలిసి ఉండడం చాలా అవసరం. కుటుంబం పట్ల తనది అన్నభావన నిజంగా కలిగి ఉన్నవాడు ఏమి చేస్తుంటాడు? కుటుంబ సంక్షేమాన్ని గురించి ఆలోచిస్తూ అందుకై పాటు పడుతూ ఉంటాడు. అవునా? కాదా? కుటుంబ భారం మోయడానికి, కుటుంబానికి భారం కాకుండడానికీ, వీలుగా నిజాయితీతో తన వంతు పాత్ర పోషణ చేస్తుంటాడు. అది దాదాపుగా శక్తివంచన లేకుండా పనిచేస్తుండడం, అవసరమైతే అదనపు పని భారాన్ని మోయడానికీ మనస్పూర్తిగా సిద్ధపడిఉండడం, అవకాశమున్నా అవసరానికి మించి తనకై వాడుకోకుండడం, భవిష్యత్తు భద్రతకై వీలైనంత మిగిల్చే పని చేస్తుండడం, కుటుంబంలోని వ్యక్తుల అవసరాలు తీర్చడానికి, మానసికంగా విముఖత లేకుండడంతోబాటు, ప్రత్యేక పరిస్థితులెదురైతే వారికి అదనపు కేటాయింపులకూ సిద్ధపడి ఉండడం, అన్న రూపంలో ఆచరణలో కనపడుతుంటుంది. కుటుంబం ఒక మొత్తంగా అభివృద్ధి చెందడాన్ని ఇష్టపడుతూ, అందుకవసరమైన రీతిలో తానునడుస్తూ ఇతరులూ నడుచుకునేలా నచ్చజెపుతూ, వత్తిడి చేస్తూ ఉంటాడు. అధికంగా వాడుకునేవాళ్ళను అదుపు చేస్తుంటాడు. అధికంగా శ్రమించే వాళ్ళనూ, అదుపు చేస్తుంటాడు. బలహీనంగా ఉన్న వాళ్ళు బలపడేందుకు వీలుగా, వాళ్ళు చేసిందాన్ని బట్టిగాక, వాళ్ళ కవసరమైన దాన్ని బట్టి, అన్న విధానంలో వారు బలపడడానికి తగినంత అదనము అందిస్తుంటాడు.
ఒక కుటుంబంలో, ఆ కుటుంబం తనది అనుకుంటున్నవాడు, సహజంగానే ప్రవర్తించే రీతి ఇలాగే ఉంటుందా? ఉండదా? ఆలోచించండి. అలాటి వర్తన కలవాణ్ణే కుటుంబాన్ని ప్రేమిస్తున్నవాడు అనంటాం. కుటుంబ పెద్ద (నిజంగా పెద్ద అనదగ్గవాడు) కుటుంబ అవసరాలతోనే తన అవసరాలు, కుటుంబ అవసరాల తరవాతనే తన అవసరాలు అన్న వైఖరి కలిగి ఉంటాడా? లేదా? నిజజీవితంలో ఈ విషయం విూ అనుభవంలో ఉందా లేదా?
దీనినే మన పెద్ద కుటుంబానికి అన్వయిస్తే దాని చిత్రం ఎలా ఉంటుంది?
ప్రశ్న :- దేశాన్ని ప్రేమిస్తున్నావా? దానిని నీదిగా తలంచుతున్నావా? దేశ పౌరుని ప్రథమకర్తవ్యం ఏమైయ్యుంటుంది? ఉండాలి?
సమా :- దేశాన్ని తనదిగా భావించడం, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించడానికి సిద్ధపడిఉండడం పౌరుని ప్రథమ కర్తవ్యం.
దేశమన్నది ఒక కుటుంబంగా పోల్చదగింది గనుకనే, జాతిసమైక్యత- మన మంతా ఒక్కటే నన్న భావన- ప్రాతిపదికగా ఉండాలి. పౌరులందరకూ, అని రాజ్యాంగ ప్రస్తావనలోనూ, పౌరుని ప్రాథమిక విధుల్లోనూ నిర్ధేశించబడింది. దానికి మరింత స్పష్టతను చేకూర్చడం కొరకుగా, భారతదేశం నా మాతృభూమి అన్నభావన, భారతీయులందరూ నా సహోదరులే అన్న భావన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ, అని బోధింపబడింది. అలాగే ప్రాథమిక విధుల్లో, సమానాభివృద్ధికి, సమగ్రాభివృద్ధికి తగిన విధంగా ప్రతివక్కరూ కృషి చేయాలని ఆదేశింపబడింది.
భక్తి :- భక్తంటే అదేదో కొండమీది కోతో, బ్రహ్మపదార్ధమో (ఎవరికీ అంతుబట్టనిదో) కాదు.
సాతు అస్మిన్ పరమప్రేమ రూపాభక్తిః! అంటే దాని యందు మిక్కిలి ప్రేమ ఉండడాన్నే భక్తి అంటారని దానర్ధం. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండు అనన్నాం. అది అవసరమేననీ అనుకున్నాం. దేశమంటే పెద్ద కుటుంబం అనుకున్నాం. దానియందూ ప్రేమ ఉండాలనుకున్నాం. అయితే కుటుంబం దగ్గర ప్రేమను 'భక్తి' అని అనం. దేశం పై ఇష్టం ఉండడాన్ని చెప్పేటప్పుడు 'భక్తి' అన్న మాటనూ వాడుతున్నాం. అంటే మిక్కిలి ప్రేమ కలిగి ఉండడమని దానర్ధం. మాతృదేశం పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలన్న దానిని. వాల్మీకి, రామునినోట ఇలా పలికించాడు.
అపి స్వర్ణమయీ లంకా నమేలక్ష్మణరోచతే!
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!!
''తమ్ముడా! లంక స్వర్ణమయమై, సకల భోగాలకూ ఆకరమైనా దానిని నేను వాంఛించను. నా వరకు నాకు మాత, మాతృభూమి అన్న రెండూ స్వర్గంకంటే మిన్నయైనవి. ''వేల సంవత్సరాల నాడే ఎంతటి ఉదాత్తమైన భావాన్ని సమాజంమ్ముందు పెట్టారు కవి. ఈ విషయంలో కృతజ్ఞతా పూర్వకంగా ఆక్రాంత దర్శిని స్మరించుకోవడం ఉచితం. దేశభక్తిని గురించి మరెవ్వరూ చెప్పలేనంతగా, భావాలను మనసా దర్శించగలిగితే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా, తేటతెనుగున తేట తెల్లంగా వల్లించిన మహానుభావుడు గురజాడ. జాతీయగీతంగా పెట్టుకోదగినంత స్థాయి కలిగిన రచన అది. దానిని వినీ, ఒక పరి ఆత్మావలోకనం (తనలోకి తాను చూసుకోవడం) చేసుకోని వాడు, ఎంతో కొంత స్పందించనివాడు బండతో సమానం (జడప్రాయుడు) దేశభక్తిని గురించి చెప్పుకోవలసివస్తే ఆ గేయాన్ని వివరించుకోడం కంటే అదనం ఎమీ చేయనక్కర్లేదు.
దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా
ఒట్టిమాటలు కట్టిపెట్టోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్
పాడిపంటలు పొంగి పొరలే దారిలో నువు పాటుపడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్
ఈసురోమని మనుసులుంటే దేశమేగతి బాగుపడునోయ్
దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పబోకోయ్
పూని ఏదైనను ఒకమేల్ కూర్చి జనులకు చూపవోయ్
సొంతలాభం కొంత మానుకొ పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్
చట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ములవలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్
దేశాన్ని ప్రేమించనివాడు, (ఇష్టపడనివాడు, తనదిగా భావించనివాడు) దేశపౌరునిగా ఉండడానికే అనర్హుడు. మిత్రుడా నిన్ను నీవు ఈ దేశ పౌరునిగా తలపోస్తున్నట్లేౖతే, ఈ పెద్ద కుటుంబంలో నీ పాత్రేమిటో గుర్తించు, నిజాయితీగా దానిని అంగీకరించి, స్వీకరించు. తదనుగుణ్యంగా నడుచుకునేందుకు యత్నించు.
సామాజిక సంబంధాలు - వ్యక్తిపాత్ర
మిత్రులారా! ఎన్ని రూపాలుగా విషయాన్ని విడమరచి చెప్పుకున్నా అవన్నీ ఒక సమష్టిలో భాగంగా వ్యక్తివర్తన ఎలా గుండాలో తెలిపేటివిగనే ఉంటాయి. సామాజిక సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలేనన్నది నిర్వివాదాంశం. ఇచ్చి పుచ్చుకునే సంబంధాలన్నింటిని ఒక క్రమంలో ఉంచగలిగిగే సాధారణ సూత్రం ఒకటుంది. అది సార్వత్రిక విలువకలిగిఉంది. ముందుగా పుచ్చుకున్నవాడు, రుణగ్రహీత స్థానంలోకి వస్తాడు. గనుక రుణగ్రస్తుడై ఇవ్వవలసినవాడుగా - తీర్చుకోవలసిన వాడుగా- ఉంటారు. ఇచ్చినవాడు రుణప్రదాతగా ఉండి, పుచ్చుకోవలసినవాడుగ, పుచ్చుకునేందుకు అధికారం పొందినవాడుగా ఉంటాడు. ముందుగా పుచ్చుకున్న వానికి, తిరిగిచ్చేందుకుగాను, చేసే పనిలో, ఆ పనివల్లవచ్చే ఫలితాన్ని కోరే హక్కుండదు. ముందుగా ఇచ్చినవానికి, పుచ్చుకున్న వాని నుండి తిరిగి రాబట్టుకునేందుకు చేయించుకునే పని వలన వచ్చిన ఫలితంలో భాగం, చేసినవానికి యివ్వాల్సిన పనిలేదు. ఇది ఇచ్చి పుచ్చుకొనే సమస్త వ్యవహారాలకూ వర్తించే సాధారణ నియమం. అవునా ? కాదా? తేల్చి చెప్పండి.
సమాజం- వ్యక్తి అన్న సంబంధంలో, వ్యక్తి ఉనికిలోకి రావడం దగ్గర నుండి కనుక ఈ లావాదేవీలను లెక్కించితే, ప్రతి వ్యక్తీ పుచ్చుకునే పుట్టాడని, అతని జీవన కాలంలో ఏ సమయానికి లెక్కలు చూసినా, అప్పటికతడు సమాజానికి ఇచ్చిందానికంటే, పుచ్చుకున్నదే అధికంగా ఉంటుందనీ, కనుక ప్రతి వ్యక్తీ ఆ జీవితం సమాజానికి రుణపడే ఉంటాడని తేలుతుంది. గీతలో ఈ భావాన్ని స్పురింపజేసే ఒక సూత్రం ఉంది.
కర్మణ్యేవాధికారస్తే, మాఫలేషు కదాచన|
మా కర్మ ఫల హేతుర్బూ మాతే సంగోస్త్వ కర్మణి ||
పని చేయడానికి మాత్రమే నీవు తగి ఉన్నావు. ఆ పని యొక్క ఫలితం పొందడానికి నీవు అధికారిగా లేవు. అన్న సూత్రం సాధారణ దృష్టితో చూస్తే చాలా అసంబద్ధంగానూ, సహజన్యాయ సూత్రాలకు విరుద్దంగా కనపడుతుంది.
సహజ న్యాయ సూత్రం :- చేసిన వాడికి ఫలితం దక్కాలి. చేసిన దానిననుసరించి ఆ ఫలితం ఉండాలి. చేసిందానికి తగినంత రాకపొవడంగానీ చేసిందానికంటే మించి రావడంగానీ, (అంటే చేయనిదానికిరావడం గానీ) చేయని వానికి రావడంగానీ జరగకూడదు.
ఈ సహజ న్యాయాన్నతిక్రమించే 'పని - ఫలితాల' రీతి ఏదైనా అంగీకరించరానిదే అవుతుంది. ఈ సూత్రాన్ని అలాగుంచుదాం.
కర్మ సిద్దాంత మూల సూత్రం ఒకటుంది.
''అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం|
నా భుక్తం క్షీయతేకర్మ కల్పకోటి శతై రపి||''
మంచి పనిగానీ, చెడ్డపనిగాని, చేసినవాడు ఆ ఫలితాన్ని అవశ్యం పొందితీరుతాడు. ఫలితాన్ని అనుభవించకుండా ఆ లెఖ్ఖ కొట్టి వేయబడదు ఎంతకాలమైనా.
మామూలుగా చూస్తే ఈ రెండు పరస్పర విరుద్దాలలా కనిపిస్తాయి. కానీ పై గీతావాక్యానికి, ఏ వ్యక్తైనా అప్పటికే తాను పుచ్చుకున్న దానికి ప్రతిగా, అంటే తిరిగిచ్చేందుకుగాను, చేసే పనికి ప్రతిఫలంగానీ, ఆ పని వల్ల పుట్టిన ఫలితంలో భాగంగాని పొందడానికి అర్హుడుకాడు. ఎందుకంటే అప్పటికే అతను పుచ్చుకుని ఉన్నదానికి చెల్లింపుగా ఈ పని చేసి ఉన్నాడుగనుక. అని అన్వయం చేస్తే, మనకు సంఘజీవిగా ఉన్న వ్యక్తికీ, సమాజానికీ మధ్య ఏర్పడి, కొనసాగుతూ ఉన్న ఇచ్చిపుచ్చుకునే సంబంధాలకు సంబంధించి ఒక అద్భుత చిత్రం ఏర్పడుతుంది.
సంఘజీవితంలోని ఏ వ్యక్తి, ఏ థలో ఉన్నప్పటి లెక్కలు తీసినా, అతడప్పటికింకా సమాజానికి తిరిగి ఇవ్వవలసినవాడుగనే ఉన్నాడని తేలుతుంది. కనుక వ్యక్తి ఇప్పుడు సమాజానికి చేస్తున్నదంతా తిరిగి చెల్లించుకునే దానిలో భాగమే అవుతోంది, కాబట్టి అతడు ఇప్పుడు చేసిందానికి ఇవ్వమని హక్కుగా అడిగేందుకు వీలులేదు. భారతీయతాత్విక సాహిత్యంలోని, 'మూడురుణాల భావన' చాల గంభీరమైనది. ఉదాత్తమైనది కూడా. అందొకటి శరీరాన్నిచ్చిన వాళ్ళ రుణం, రెండోది అవగాహనను, సామర్ధ్యాలను కలిగించినవాని రుణం. నిజానికీ రెండు రుణాలూ సమాజ రుణాలే. మూడోది ప్రకృతిరుణం. మన చట్రంలో నుండి దీనిని చెప్పుకుంటే, ప్రతి వ్యక్తీ ఇటుసమాజానికీ, అటు ప్రకృతికీ ఎప్పటికీ మొత్తంగా చెల్లించలేని రీతిలో రుణ పడి ఉంటాడని చెప్పినట్లు. ఇది సబబుగ ఉందా? లేదా? మిత్రులారా! ఈ నిజం అర్థమైన వాడెవడూ సమాజంపని నేనెందుకు చేయాలనిగానీ, ప్రకృతి పని నేనెందుకు చేయాలనిగాని, అనలేడు. అనడు. సమాజం నీకు రుణమిచ్చింది. నీవు రుణగ్రస్తుడివై, తిరిగి చెల్లించుకోవలసిన విధుడవై ఉన్నావు. సమాజం పని ప్రతివ్యక్తీ ఎందుకు చేయాలో అర్ధమైందా? ఎదిగిన మనుషులందరూ, ఎంతో చేసే, దాన్నంతటినీ దేశమాత రుణం తీర్చుకుంటున్నానని ఎందుకన్నారో అర్ధం చేసుకోడానికి యత్నించి ఇప్పటి నుండైనా వాటి రుణం తీర్చుకునే పని బాధ్యతతో మొదలెట్టు.
ఉద్యమకారుడు - సామాన్యుడు
ఈ రెండు పేర్లతో పిలువబడుతున్న వాళ్ళు ఇరువురూ మనుషులే. పౌరులే. అయితే వాళ్ళ వాళ్ళ వైఖరులలో వ్యత్యాసాన్ని బట్టి వాళ్ళను ఆ పేర్లతో పిలుస్తున్నాం.
సామాన్య మానవుడు సమాజం నుండి, (ఇతరుల నుండి) తనకేమి వస్తుందా అన్న దృష్టి కలిగి ఉంటాడు. ఇవ్వవలసినరతైనా ఇవ్వడానికి అయిష్టంగా, పుచ్చుకోవలసిందానికంటే అధికం పుచ్చుకోడానికి ఇష్టంగా ఉంటాడు.
అదే మరి ఏ ఉద్యమ క్షేత్రంలో పని చేస్తున్న ఉద్యమకారుడైనా, సమాజం కొరకు తానేమైనా చేయగలనా? ఏదో ఒకటి చేద్దాం శక్తి ఉన్నంతలో, అన్నదృష్టి కలిగి ఉంటాడు. ఈ పని చేసినందుకు ప్రత్యేకంగా ప్రతి ఫలాన్ని ఆశించడు కూడా.
ప్రశ్న :- ప్రతిఫలం తీసుకుని ఉద్యమ క్షేత్రాలలో పని చేస్తున్న వారూ కనబడుతున్నారు కదా! వారిని ఉద్యమకారులనరా?
సమా :- మంచి ప్రశ్న! మనలో మరి కొంత మందిలోనూ ఈ ప్రశ్న పుట్టే ఉంటుంది. దీనికి సరైన సమాధానం, సాధారణ సమాధానం అట్టి వారిని ఉద్యమకారులు అనకూడదన్నదే. నీవు చేస్తున్న పని మంచిదైనా, చెడ్డదైనా అది ప్రతి ఫలాన్నాశించి చేస్తున్నదైతే దానిని నిస్వార్ధకర్మ అనిగానీ, పది మంది కోసం చేస్తున్న పని అనిగానీ అనకూడదు. అవన్నీ నీ కొరకు చేస్తున్న పనులే. ఇచ్చిపుచ్చుకునే సంబంధానికి (వ్యాపారానికి) చెందిన పనులే అవుతాయి.
1. అయితే ఇవ్వకూడనిదిచ్చి, ప్రతి ఫలం తీసుకుంటే మోసపూరిత వ్యాపారం అవుతుంది.
2. ఇవ్వవలసిందే ఇచ్చి ప్రతి ఫలం తీసుకుంటే మంచి వ్యాపారమవుతుంది.
3. ఇవ్వవలసిందే ఇచ్చినా పుచ్చుకోవలసిన దానికంటే అధికం పుచ్చుకుంటే దానిని తప్పుడు వ్యాపారమని అంటాం.
4. ఇవ్వవలసిందే ఇచ్చి నష్టమూ, లాభమూ లేనంత మాత్రంగా ప్రతిఫలం పుచ్చుకుంటే ఆదర్శప్రాయమైన వ్యాపారమవుతుంది.
5. ఇక ఇవ్వలసిందిచ్చి, ప్రతి ఫలం కోరని దానినే, నిస్వార్ధ లేదా నిష్కామ కర్మ అనంటాము. ఉద్యమ కార్యం ఈ కోవకు చెందిందే.
మిత్రులారా! ఇందులో మీరెక్కడున్నారో నిజాయితీగా, గుర్తించండి. 2, 4, 5 చేయవలసిన పనుల జాబితాలోనికే వస్తాయి. 'నిషిద్ద కర్మ దుర్మార్గపు కర్మ క్రిందికి వస్తుంది. 3 వది కూడా వదులుకోవలసిందే అయినా మొదటిదానంత ప్రమాదకారి కాదు. ఎందుకంటే ప్రతిఫలం పొందే దగ్గర దోషం ఉందేగాని, పుచ్చుకునే వాడు ఏ ఫలితం కోరి ఆ వస్తువును కొనడానికి సిద్దమైనాడో, ఆ ఫలితాన్నిచ్చేందుకు - ఆ అవసరం తీర్చిందుకు - తగిన సరుకునే ఇస్తున్నాడు గనుక, కొనుగోలుదారుని ఆ కాంక్షను నెరవేర్చినట్లే అయ్యింది కనుక.
ఉద్యమకారునిగ ఉండడం ఉత్తమం (శ్రేష్టతమం) అధవ ఆదర్శప్రాయుడైన వ్యాపారిగనో, న్యాయ బద్దమైన వ్యాపారిగనోనైనా ఉండు. ఈ మూడు రకాల వైఖరులూ సమాజం అంగీకరించదగినవే, కోరదగినవే. 5వ రకానికి చెందిన హృదయం కలవారిలోనే ఒక మినహాయింపు నిబంధన అవసరమై ఉంది. కొందరు వ్యక్తులు నిస్వార్ధంగనే త్రికరణ శుద్ధిగా సమాజ కార్యం - ప్రతి ఫలాన్నాశించకుండగనే చేయాలన్న దృష్టి కలిగి ఉంటారు. అయితే అట్టి వారికి కుటుంబ బాధ్యతల దృష్ట్యా కొంత ఆర్ధిక సహకారం తప్పనిసరైన పరిస్ధితి ఉంటుంది. అట్టి వారి యెడల ఉద్యమం బాధ్యత వహించడం న్యాయం. అలాంటివారికి అందించే సాయాన్ని ఉద్యమకార్యం చేస్తున్నందుకు ఇస్తున్న లేదా తీసుకుంటున్న ప్రతిఫలంగా పరిగణించరాదు. ఇది చాలా కీలకమైప సూత్రం. మరికొందరు తాము చేయగల పని విషయంలో, పని దొరికే అవకాశం, అందుకు తగిన ప్రతి ఫలం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఉద్యమకార్యం కూడా అతని ఎదుటికి వచ్చినపుడు అదే ప్రతి ఫలాన్నంగీకరించి ఉద్యమ కార్యం చేయడానికి సిద్దపడితే అట్టి వ్యక్తిని ఉద్యమ కారుడనంగానీ, సామాజిక స్పృహ గలిగిన మంచి పౌరుడు అనగలం.
ఇప్పటికి మీరెక్కడున్నారో, ఇక ముందు ఎక్కడ ఉండదలచుకున్నారో మీకు మీరైనా (మాకు చెప్పుకున్నా) తేల్చుకోండి.
ప్రేరణ :
దేశంలో సాహసవంతులున్నారు. బహుముఖ ప్రజ్ఞావంతులున్నారు. ఇక శీలవంతులమాటే గట్టిగా చెప్పలేని పరిస్ధితి ఉంది. ఈ దేశ ప్రగతికి ఈ నాడు అవసరమైంది, సరిపడినంతలేనిదీ శీలవంతుల సమూహమే. ఈ శీల మన్నది, వ్యష్టి శీలం, సమష్టి శీలం అని రెండు రకాలుగా అర్ధం చేసుకోవాలని విజ్ఞులంటారు.
ఇంతకూ శీలమంటే ఏమిటి?
సక్రమప్రవర్తనకు అవసరమైన వ్యక్తిత్వాన్నే శీలమంటాం. శీలమన్నది ప్రవర్తనలో కనబడేదే, ప్రవర్తన ద్వారా గుర్తించేదే అయినా, అట్టి ప్రవర్తనకు కారణమైన అంతరంగానికి సంబంధించిన గుణగణాల విషయంగా దానిని అన్వయించుకోవలసి ఉంటుంది. శీల వంతుడనడానికి తగిన ప్రవర్తనను గమనింపకముందే అతడు శీలవంతుడై ఉంటాడన్నమాట. ఎట్టి అవగాహనో, ఎట్టి దృక్పథమో అట్టి వర్తనే ఏర్పడుతుంది. శీల మన్నది స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని సూచించే పదం. గుణవాచకం.
నిజానికి శీలవంతుడు కానివాడు కూడా, శీలవంతుడు అనిపించేలా ప్రవర్తించవచ్చు. అట్టి వారిని మిధ్యాచారులు అనంటాం. ఈనాడు భారతదేశం ఇంతకంటే ఎంతో మెరుగైన స్ధితిలో ఉండడానికి కావలసిన భౌతికపరమైన అన్ని వనరులూ ఉన్నాయి. సహజవనరులుగానీ, సాంకేతిక విజ్ఞానం గాని, నిపుణశ్రమగాని, మనకు సమృద్ధిగా ఉంది. లేనిదల్లా చిత్తశుద్ధే. లేనిదల్లా సమైక్యతా భావనే. పౌరధర్మాన్నెరిగిన వారు ఈ నాడు చాల తక్కువ మంది ఉన్నారు. అవగాహన ఉన్న కొద్ది మందిలోనూ, ఎక్కువ మందికి దానిని పాటించాలన్న స్పృహలేదు. ఇదంతా 'శీల' భాగం బలహీనంగా ఉండడాన్ని తెలిపేదే.
చిత్తశుద్ధి లేకపోవడం శీలం లేకపోవడమే
ఇంద్రియ నిగ్రహం లేకపోవడం శీల రాహిత్యం క్రిందికి చేరేది.
నిజాయితీ లేకపోవడం, కపటత్వం శీలం లేనితనాన్ని చూపేదే.
మాటకు చేతకు పొంతన లేకపోవడం శీల రాహిత్యమే.
బాధ్యతా రాహిత్యమూ శీలం లేకపోవడంలో భాగమే.
ఒప్పందాన్ని అమలు చేయకపోవడం, అతిక్రమించడం శీల రాహిత్యమే.
హక్కులకై వెంపర్లాట, విధినిర్వహణలో ఏమరపాటు శీలం లేనందువల్ల జరిగే పనులే.
దేశభక్తి లేకపోవడం సమష్టి శీలం బలహీనంగా ఉండడమే.
పౌరులందరినీ సమానులుగ తలంచకపోవడం, ప్రవర్తించకపోవడం సమష్టి శీలం లేనితనమే.
ప్రక్కవారి సంగతి పట్టించుకోకపోవడం శీలరాహిత్యాన్ని తెలిపేదే.
తనకష్టాల నుండి బైటపడడానికి ఎదుటి వారికి కష్టాలు, నష్టాలు కలిగించాలని సిద్దపడడం శీలంలోపమే.
అతిస్వార్ధం - చిన్ని నాబొజ్జకు శ్రీరామరక్ష - అన్న వైఖరి శీల రహితుని పోకడే.
సమష్టి సంక్షేమా కాంకక్షుడు శీలవంతుడే.
ఇలా సమాజం కోరదగిన ప్రవర్తనలను ఉద్దీపింపజేయగల మానసిక గుణగణాలన్నీ శీలం క్రిందికి, తద్భిన్నమైనవి, ఇటు తనకుగానీ, అటు ఇతరులకు గాని అపకారం కలిగించే ప్రవర్తనకు కారణమైన గుణగణాలన్నీ శీల రాహిత్యం క్రిందికి వస్తాయి.
నీతివంతుడు శీలవంతుడే, న్యాయ వంతుడు శీలవంతుడే, సత్య సంధుడు శీలవంతుడే ధార్మిక వర్తకుడు శీలవంతుడే, ఇలా సద్వర్తనను ప్రేరేపించగల స్వభావాన్ని 'శీలం' అనవచ్చు.
గమనిక :- 1. 'శీలం' అన్నది వ్యావహారికంగా, కామ సంబంధమైన సద్వర్తనకే చెప్పుకోడం జరుగుతోంది. సైద్దాంతికంగా చూస్తే 'శీలం' అన్న పదం చాలా విస్తృతార్దం కలిగి ఉంది. సమష్టి శీలం అన్నప్పుడు అది సామాజిక సంబంధాలకు సంబంధించిన సద్వర్తనను తెలిపేది అవుతోంది. పరులకు అపకారం చేయని, ఉపకారం చేసే స్వభావాన్ని సమష్టి శీలం అనవచ్చు. దేశభక్తులంతా సమష్టి శీలవంతులే అనబడతారు.
2. 'శీలం' అన్న పదానికి విశేషణాన్ని చేర్చి చెప్పడమూ ఉంది. వాడుకలో, దుశ్శీలుడు, సుశీలుడు, సౌశీల్యము లాంటి ప్రయోగాలు వాడిన సందర్భంలో 'శీలము' అన్నదానికి వర్తన, స్వభావము అన్న సాధారణార్ధం చెప్పుకోవాలి. దుశ్శీలుడు = చెడ్డ వర్తనం కలవాడు. సుశీలుడు = మంచి వర్తనం కలవాడు. సౌశీల్యము = మంచి స్వభావము, అనన్నమాట.
అదేమరి శీలవంతుడు అన్నప్పుడు మంచి స్వభావం కలవాడు, మంచి నడవడి కలవాడు అన్న అర్ధం వస్తుంది. అలాగే శీలరహితుడు, శీలంలేనివాడు అన్నప్పుడు, మంచి నడవడి లేనివాడు, చెడునడతకలవాడు అన్న అర్ధాన్నిస్తాయామాటలు. శీలానికి ఎంతవిలువ నివ్వాలన్నది గాంధీ మాటల్ని బట్టి చూద్దాం.
ఒక సందర్భంలో గాంధీజీ లోహియా నుద్ధేశించి, ''లోహియా నీవు సాహసివి. అయితే అదేం గొప్పకాదు. లోకంలో ఎందరో సాహసులున్నారు. పులి, సింహంలాంటివీ సాహసవంతమైనవే. నీవు మహాజ్ఞానివి. అయితే అదేం గొప్పకాదు. లోకంలో ఎందరో న్యాయనిపుణులు, మహాజ్ఞానులున్నారు. నీవు శీలవంతుడివి. అదే నీవిశిష్టత అనంటాడు. శీలవంతులు అరుదు.
మిత్రులారా! ఈనాడు భారతదేశ పరిస్థితిని పట్టిచూస్తే, ఇక్కడ సాహసవంతులు, విజ్ఞానులు కోకొల్లలు. ఉన్న సమస్య అల్లా శీలవంతులు లేమే. దేశ పునర్నిర్మాణ దిశగా మనం చేయబోయే - ఎవరు చేయదలచిన - యత్నంలో ప్రధమస్ధానం ఇవ్వవలసింది శీలవంతుల నిర్మాణానికే సామాజిక స్పృహకలిగిన - అంటే సమష్టి శీలవంతులైన - పౌరుల నిర్మాణమే ఇప్పుడు జరగవలసిన పని. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవలసిన సూత్రం ఒకటుంది.
సూత్రం :- ఒక రకమైన మనిషే సామాజిక సమస్యలన్నంటికీ కారణమవుతున్నవాడు, కనుక మరోరకమైన మనిషే వాటి పరిష్కారానికి కారణం కాగలుగుతాడు.
విషయం అర్ధమవుతునే ఉందనుకుంటాను. శీలరహితులైన వ్యక్తులవల్లనే సామాజిక సమస్యలు పుట్టుకొస్తున్నై. శీలవంతులైన వ్యక్తుల వల్లనే అవి సమసిపోతాయి. మెరుగైన పౌరసమాజాన్ని రూపొందించుకోవాలన్నది నీ, మీ, (మన) గుండెలోతుల్లో నుండి తన్నుకొచ్చిన బలమైన ఆకాంక్షే గనక అయితే, దానిని సిద్దంపజేసుకోడానికి మనకున్న ఒకే ఒక మార్గం ముందు మనని మనం శీలవంతులుగా తయారుచేసుకోవడం, అటు పై ప్రజలను శీలవంతులుగా చేసేందుకు గట్టి పూనికతో పెద్ద ఎత్తున ఉద్యమించడం. ఇదే, ఇదే మనం చేయాల్సిన అస్సలుపని.
మెరుగైన పౌరులు లేకుండా - ఏర్పడకుండా - మెరుగైన పౌర సమాజం ఎలా ఏర్పడుతుంది?
ప్రజలు పౌర ధర్మాన్నెరిగి తదనుగుణ్యంగా ప్రవర్తించిన రోజున, అట్టి వారిని మంచి నడవడి కలిగిన వారంటామా? లేదా? మరి దానర్ధం, అట్టివారు శీలవంతులనేకదా! శీల మన్న పదం అటువ్యక్తిగత జీవితానికీ, ఇటు సంఘజీవితానికీ కూడా వర్తించే, మంచి స్వభావము, మంచినడవడి అన్న వాటిని సూచించేందుకు వాడవలసిందన్న మాట.
స్వార్ధపరుడు, శీలరహితుడన్నమాటే అలాగే విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించనివాడూ శీలరహితుడే. కనుక, తనవంతు హక్కులు, విధులను అతిక్రమించకుండా, తన పాత్రకు న్యాయం చేసేవాడే శీలవంతుడనబడతాడు. ప్రస్తుతం సమాజంలో, పౌరుడు పౌర ధర్మాన్ని ఆచరించడంలా, ఉద్యోగి ఉద్యోగ ధర్మాన్నాచరించడంలా, ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ధర్మాన్నాచరించడంలా. ఇది సమాజంలోని అన్ని రంగాలలోను అధిక భాగం ఇలానే ఉంటున్నారు. అల్పభాగం, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అత్యల్పభాగం మాత్రమే ధర్మవర్తనులుగ ఉంటున్నారు.
సంఘజీవిగా ఉన్నవాడు, ఒప్పందాన్నతిక్రమించకుండా ఉండడం, ఒప్పందాన్ననుసరిస్తుండడం చేస్తున్నప్పుడే అతడు సంఘజీవిగా మంచి నడవడిక కలవాడు అనగలుగుతాం. అంటే సాంఘికంగా శీలవంతుడు అనగలుగుతామన్నమాట.
ఇదండీ! 'శీలం' కథాకమామీషు; ఇంతకు మీరు శీలవంతులుగ ఉన్నారా? కనీసం ఉండగోరుతున్నారా? మంచి సమాజాన్ని ఏర్పరచుకోవడమంటే శీలవంతులైన ప్రజలున్న సమాజాన్ని ఏర్పరచుకోవడమేనన్న అవగాహన మీకు స్పష్టంగా ఉందా? సామాజిక సృహకల వ్యక్తిత్వాల నిర్మాణమే జరగాల్సిన అస్సలు పని. ఆలోచించండి మిత్రులారా! ఉద్యమ కార్యం ఎంత ఉదాత్తమైనదో జీర్ణం చేసుకోండి ముందు.
ధర్మ సూక్ష్మం :- వ్యష్టి శీలం కంటే సమష్టిశీలం విలువైనది, కీలకమైనది, వ్యష్టి శీలంలో కదాచిత్ ఒకటి రెండు లోపాలున్నా పెద్ద ప్రమాదం లేదుగాని, సమష్టి శీలం కొరవడితే మాత్రం సమాజానికి పెద్ద నష్టం జరిగిపోతుంది.
వ్యష్టి శీలం :- మనిషి ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆహార విహారాదులలో అంతా శాస్త్రీయమైన పద్థతినే పాటిస్తున్నాడు. దుర్వసనాలు ఏమీలేవు. లైంగిక బలహీనతలూ లేవు. దేహ సౌష్టవం కూడా బాగానే ఉంది. ఉదయం పెందలాడేలేస్తాడు, వ్యాయామం చేస్తాడు, ఆత్మ రక్షణ విద్యనూ అభ్యసిస్తాడు. (కరాటే ప్రాక్టీసు చేస్తాడు) ఇరుగుపొరుగు వారిని అక్క, బావ, పిన్ని ,బాబాయ్, పెదనాన్న, పెద్దమ్మ అంటూ సంబోధిస్తుంటాడు. మితంగానే అయినా, చాల వరకు కలుపుగోలుగనే ఉంటుంటాడు.
సమష్టి శీలం :- ఒకరోజు హఠాత్తుగా దేశదోహ్రం నేరం క్రింద పోలీసు నిఘా విభాగం అతనిని బంధించింది. ఈ దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను, భద్రతకు సంబంధించిన వివరాలను, ఇతర దేశాలకు చేరవేసే పని చేస్తున్నందుకుగా అతడు బంధింపబడ్డాడు. నేరం రుజువైంది కూడా. దీనినే సమష్టి శీలం లేకపోవడం అనంటారు.
మిత్రులారా! వ్యష్టిశీలం, సమష్టి శీలం, రాష్ట్రీయశీలం అన్న పదాలు తెలిసిన వారెందుకు వాడుతున్నారో అర్ధమైందనుకుంటాను. పై వ్యక్తి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకు సరైన నడవడినే కలిగి ఉన్నాడు. అదే సమష్టి సంబంధాల విషయంలో మొత్తం సమాజానికే ప్రమాదకారిగా ఉన్నాడు.
దీనినే మరో కోణం నుండి చూద్దాం :ఒక వ్యక్తి తాగుడు, సిగరెట్టు లాంటి దురలవాటు, ఎలాంటి లైంగిక బలహీనతలూ లేవు. తన వ్యక్తిగత ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలూ పాటిస్తుంటాడు. కాని ఉద్యోగ నిర్వహణలో లంచగొండితనం ఉంది.
మరొక వ్యక్తి ఒక కీలకమైన స్థానంలో ఉద్యోగిగా ఉండడం, కొన్ని బలహీనతలూ ఉండడంతో, శతృదేశం ఇతనిని వాడుకోవాలని యత్నించింది. లొంగలేదు. అతని కుటుంబానికి కీడు తలపెడతామని బెదిరించింది కూడా. అయినా లొంగకపోగా లొంగినట్లు నటించి, శతృదేశపు ముఠా అనుపానులనూ తెలుసుకుని ప్రభుత్వానికి సమాచారం అందించాడు. ఈ రెండు సంఘటనలలో మొదటి వాడు వ్యష్టి శీలం కలవాడు, సమష్టి శీలం లేనివాడు, రెండోవాడు వ్యష్టి శీలం లేనివాడు, సమష్టి శీలం ఉన్నవాడు.
గమనిక :- విూలో కొందరీ వివరణను చూసి, ఇలాంటివి కథలుగా చెప్పుకోడానికి పనికి వస్తాయే గాని, వాస్తవాలవడానికి వీలులేదు. లాంటి వాదనను లేవనెత్తవచ్చు. పైన నేనన్నట్లు జరగడం అసంభవమైనప్పుడే అలాంటి వాదన చేయడం సరైనదవుతుంది. నూటికొక్కటి, లేదా వేయి కొక్కటి జరగడానికి అవకాశమున్నా ఇక నా వివరణను కొట్టివేయరాదు.
వ్యష్టి శీలం లేని సమష్టి శీలం అంతగా ప్రమాదకారికాదని చెప్పడమే ఇక్కడనాఉద్దేశంగాని, వ్యష్టి శీలం అక్కరలేనిదని చెప్పడం నా ఉద్దేశంకాదు. అయితే సమష్టి శీలంలేని వ్యష్టి శీలం బహు ప్రమాదకారి కూడా. రెండూ ఉండడం ఉత్తమం. అది సాధ్యంకాదు అన్న పరిస్థితి వస్తే ఏమి చేయాలి? అనంటే వ్యష్టి శీలం లేకున్నా పరవాలేదు. సమష్టి శీలం తప్పనిసరి అనాల్సిందే.
ఎందుకిదంతా చెప్పవలసి వచ్చింది?
ఈ నాటి భారతదేశ అస్తవ్యస్ధతంతా వ్యక్తులలో సమష్టిశీలం కొరవడడం వల్ల ఏర్పడిందే. కనుక మంచి సమాజం ఏర్పడాలనీ అందుకు మనవంతు చేయగలిగినంతా చేద్దామని అనుకుంటూ, అందుకు సిద్ధమైన మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది సామాజిక స్పృహకల, సమర్ధులైన వ్యక్తుల్ని తయారు చేయడం ఎలాగన్న దగ్గరే అందుకు ముందుగా వ్యక్తులలో సమష్టిశీలం ఏర్పడేలా చూడాలి. క్రమంగా వ్యక్తిలో వ్యష్టిశీలమూ చోటు చేసుకోవాలి. ముందుగా నొక్కుపెట్టాల్సింది మాత్రం సమష్టిశీలం పైనే, దీనినే దేశభక్తి అని అనవచ్చు.
సాతు అస్మిన్ పరమప్రేమ రూపాభక్తిః ఒకదాని యందు మిక్కిలి ఇష్టం - ప్రేమ- కలిగి ఉండడాన్నే భక్తి అంటారని సూత్రార్ధం. మిక్కిలి - పరమ - ప్రేమనే భక్తి అంటారు. అన్నది గుర్తు చేసుకోండి.
దేశభక్తి
దేశమంతా ఒక్కటే. దేశప్రజలంతా నావాళ్ళే. దేశ ప్రజల అవసరాలలో భాగంగానే నా అవసరాలున్నూ. ఉమ్మడిలో న్యాయమైన భాగానికి మాత్రమే హక్కుదారుణ్ణినేను. ఉమ్మడికి కలిగే లాభాలతోపాటు నష్టాలకూ భాగస్వామినే, ఉమ్మడిగా లభించే సుఖాలతో పాటు కష్టాలలోనూ భాగస్వామినే. నాచర్యల వల్ల ఉమ్మడికి కష్టనష్టాలు ఏర్పడేలా ప్రవర్తించను. లాభాలు, సుఖాలు అందేలా ప్రవర్తిస్తాను. వైౖయక్తిక ప్రత్యేక ప్రయోజనాల నాశించను. దేశ భద్రతకు భవితకు అడ్డంకయ్యే ఏ పనీ తలపెట్టను. ఆ రెంటినీ కాపాడుకోడానికి సర్వ సన్నద్దంగా ఉంటాను. దేశ ఔన్నత్యాన్ని పెంపొందింపజేసే ఏ పనిలో గాని పాలు పంచుకుంటాను. ముందుంటాను.
మిత్రులారా! ఇదేగదా దేశ భక్తంటే? ఇంకేమైన ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే నా దేశము, నా దేశ ప్రజలూ, ఆరోగ్యంగా, బలంగా, కలకాలం కొనసాగడానికి నా వంతుగా చేయవలసిందంతా చేస్తాను, ప్రతి కూలంగా చేయను. అనుకోవడం, ఆరకంగా మసలుకోవడం. ఇదే దేశభక్తంటే.
ఏర్పరచుకున్న ఒప్పందానికి - రాజ్యాంగానికి - అనుకూలంగా ప్రవర్తిస్తుండడం, ప్రతికూలంగా ప్రవర్తించకుండడం అంటే ఒప్పందానికి లోబడి లేదా కట్టుబడి ఉండడమే దేశభక్తంటే. పౌర బాధ్యత అన్నది దీనితోనే ప్రారంభమై, మరణ పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. పౌరుడు బాధ్యతా యుతంగా ప్రవర్తించడంకంటే వేరుగా దేశభక్తి అనేది ఉండదు. ఒప్పందానికి లోబడి ఉండడమంటే (దానినే పౌరధర్మం అనీ అనవచ్చు) తాను తన విధులు నిర్వర్తిస్తూ ప్రక్కవారూ అలానే ఉండేలా శ్రద్ధ పెట్టడమనీ అర్ధం.
నీకు ఇతరులు పరిస్థితుల క్రిందికి ఎలా వస్తారో, అలాగే, వారికి నీవూ పరిస్థితుల క్రిందికి వస్తావు. అంటే ప్రతి వక్కరికీ మిగిలిన వారంతా ఇరుగుపొరుగు రూపంలో, పరస్పర సంబంధంలో పరిస్థితుల క్రిందికి వస్తారన్నమాట. నీ ఒక్కనికే - వ్యక్తిగత జీవితానికే - ముడిపడి ఉన్న సంబంధాలలో నీ నడవడి సక్రమంగా ఉండడాన్ని వ్యష్టిశీలమని అనేకులతో, అందరితో ముడిపడి ఉన్న సంబంధాలలో నీ నడవడి సక్రమంగా ఉండడాన్నే సమష్టి శీలం అని అంటారు. ఉన్నత స్ధాయిలో చెప్పుకోవాలంటే వ్యష్టి సమష్టి శీలం కలిగి ఉండడాన్నే దేశభక్తి అనంటారు. కనీసం సమష్టి శీలం కలిగి ఉన్నప్పుడూ దేశభక్తి ఉన్నట్లే అనవచ్చు. సమష్టి శీలం లేకుండా వ్యష్టిశీలం కలిగి ఉన్నా దేశభక్తి ఉందనలేము. విషయం ఒకింత విపులంగానే చెప్పుకున్నామనుకుంటాను.
మిత్రులారా! ఇప్పుడు మనముందున్న అస్సలు పని దేశభక్తుల్ని తయారు చేయడమే. అంటే సమష్టి శీలం కలవారిని, వీలైతే వ్యష్టి సమష్టి శీలవంతుల్ని తయారు చేయడమే. ఉత్తమ పౌరుడు, లేదా మెరుగైన పౌరుల నిర్మాణమన్నా అర్ధమిదే. ఇదిగో ఈ మహత్కార్యాన్ని సక్రమంగా, సమర్ధవంతంగా నిర్వర్తించడానికి మనల్ని మనం సన్నద్దులను చేసుకోవలసి ఉంది. ఆ పని సక్రమంగా జరగాలంటే, మొట్టమొదట ఈ విషయం స్పష్టంగా తెలిసుండాలి (సరైన అవగాహనంటాం దీనినే) ఆ పై దానిని మనం బలంగా ఇష్టపడాలి. (దానినే సంసిద్దత అనంటారు), పిదప పట్టుబట్టి గట్టిగా పూనికతో శిక్షణ పొందాలి. అలా మసలుకోడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. (దానినే క్రియా శీలత అనంటున్నాను.) అవగాహన, సంసిద్దత, కార్య కుశలత అన్న మూడు ఉన్న వారిని 'దకక్షులు' అనంటాము.
అధ్యయనం వల్ల అవగాహనను, ప్రేరణ వల్ల సంసిద్దతను, శిక్షణ (అభ్యాసం) వల్ల కార్యకుశలతనూ సమకూర్చు కోవాలి. అదిగో అందుకుద్దేశించినవే మన ఈ శిక్షకుల శిక్షణా తరగతులు! విషయాలను శ్రద్ధ పెట్టి అధ్యయనం చేయండి. 'శ్రద్దావాన్ లభతేజ్ఞానం' శ్రద్ధా వంతుడే అవగాహన పరులవుతారు. స్థాయి కలిగిన సాటి ఉద్యమకారులను చూస్తుండడం ద్వారానూ గతంలో మందిహితానికై జీవితాలను వెచ్చించిన వారి చరిత్రలను తెలుసుకోవడం ద్వారానూ ప్రేరణ పొందండి. అటు పై అట్టి వారితో కలిసి నడవడమన్న అభ్యాసం ద్వారా కుశలురుకండి.
ముందుగా మనం దేశభక్తిని అలవరచుకుని, ఆపై మందినంతా దేశభక్తులను చేసేందుకు సన్నద్దులమవుదాం. ఇదే, ఇదే, ఉత్తమ సమాజ స్ధాపన దిశగా మనం పని చేస్తూ, చేయిస్తూ ఉండాల్సిన కర్తవ్యకర్మ.
ఎందుకీ శిక్షకుల శిక్షణా తరగుతులు
సమావేశాలకు పరిమితమైన యత్నాలు ఇంతటి సమున్నత లక్ష్యాన్ని సాధించిపెట్టలేవు. సమావేశాలలో చెప్పడం, వినడం ప్రధాన భాగంగా ఉంటుంది. చేయడాన్ని ప్రధానంగా చేయగలిగింది క్షేత్రస్థాయి కార్యాచరణ మాత్రమే. కనుక ప్రజలను ఉత్తమ పౌరులుగ తీర్చిదిద్దడం ప్రబోధాల వల్ల కాదు. అది క్షేత్రస్ధాయిలో వారితోమమేకమై, మనం నడుస్తూ వారిని నడిపించడం, క్రమంగా వారంతట వారే నడిచేలా తర్ఫీదునివ్వడం అన్న విధానం వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది. ఈ మాట యధార్ధమో కాదో ఆలోచించి చూడండి.
మరలా ఒక రాష్ట్రం మొత్తంలో ప్రజలకు చెప్పి ఊరుకుండకుండ ప్రజలను ప్రక్క నుండి నడిపించే పని కూడా చేయాలనుకుంటున్నప్పుడు, అందుకు తగిన వాళ్ళను పెద్ద సంఖ్యలో తయారు చేసుకోవలసి ఉంటుంది. ఆ పని మూడు స్ధాయిలలో జరగాలి.
1. శిక్షకులకు శిక్షణ :- ఇది తొలివిడత 250 మంది లక్ష్యంగా రాజేంద్రనగర్‌లో నిర్వహిస్తున్నాము. ఇక్కడ శిక్షణ పొందిన శిక్షకులు ప్రాంతీయ మరియు జిల్లా శిక్షణ కేంద్రములో శిక్షకులుగ ఉంటారు.
2. అదనంగా తయారవుతున్నవారు మండల స్థాయి శిక్షణాలయాలను నిర్వహించడానికి, జిల్లా యూనిట్‌గా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించడానికీ పూనుకుంటారు.
3. రెండవ శ్రేణి శిక్షణ అన్నది జిల్లా శిక్షణా తరగతులను ఆరంభించుకోడంతో మొదలవుతుంది. ఈ థలో నెలకు 2000 మంది వరకు శిక్షణ నందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము.
4. మూడవ థలో, రెండవ శ్రేణి శిక్షణ పొందిన వారి ద్వారా మండల స్ధాయిలో అవగాహనా తరగతులను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు, విషయాలను చక్కగా చెప్పగలవారు కనీసం 2000 మంది, అవసరము. అయితే 10, 000 మంది ఉన్నా పని ఉంటుంది. తరగతులు నిరంతరాయంగా నిర్వహిస్తుండాలంటే మండలానికి కనీసం 5గురు అవసరం. 10 మంది ఉంటే బాగుంటుంది.
గమనిక :- ఇక్కడితో తరగతుల రూపం ఆగిపోతుంది. ఈ మూడు థలలో అవగాహన కలిగించుకున్న వారూ అనంతరం వారువారు చేయగలిగినంత పరిధిలో పౌరులను మేల్కొలిపే పని చేస్తుంటారు. పౌర సాధికారిత ఆచరణలోనికి రావాలంటే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తునా జరగాల్సిందే.
మొత్తమ్మీద శిక్షణా తరగతుల లక్ష్యం గ్రామానికి 10 మందికైనా అవగాహన కలిగించాలన్నదిగా ఉంది. లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రజలను చైతన్య పరిచేందుకు అవసరమైన కనీస బృందం ప్రతి గ్రామాన ఉంటుంది. వారు ఆ గ్రామాన్ని చైతన్య పరచే పని చేస్తూ ఉంటారు.
శిక్షణా తరగతుల విశేషాలు
ముందనుకొన్న ప్రకారము శిక్షకులకు శిక్షణ (టి.ఓ.టి) శిక్షణా తరగతులు డిసెంబరు 20వ తేది నుండి 24వ తేది వరకు సత్యాన్వేషణ మండలి కేంద్ర కార్యాలయం, దోరకుంటలో జరిగినాయి. వివిధ జిల్లాల నుండి షుమారు 20 మంది తరగతులకు హాజరైనారు. శిక్షణ గరపటానికి స.హ. ప్రచార ఐక్య వేదిక నుండి పుట్టా సురేంద్రబాబు గారు, నేను, మాధవిగారు, సిరి సంస్ధ నుండి టి.వి. భాస్కర్ గారు పాల్గొన్నారు.
ముందుగా పుట్టా సురేంద్రబాబుగారు ప్రేరణ - ప్రసంగం చేస్తూ, తరగతుల పద్దతులైన సంభాషణా పద్దతి, ప్రసంగ పద్దతి, మధ్యేమార్గములు వివరించి మనము మధ్యే మార్గములో నిర్వహించుకొందామన్నారు. ఆ పద్దతిన సురేంద్రగారు ప్రేరణ, భారత రాజ్యాంగము- కనీస అవగాహనను, నేను, ప్రసంగనైపుణ్యాలు, మాధవిగారు స.హ ప్రచార ఐక్యవేదిక పరిచయము, టి.వి. భాస్కర్‌గారు స.హ. చట్టం పై తరగతులు నిర్వహించడం జరిగింది.
ఒక్కొక్క తరగతి అనంతరం శిక్షకులను 4 గ్రూపులుగా విభజించి, ఆ తరగతికి సంబంధించిన అంశాలు ఆ గ్రూపుల్లో చర్చించుకొని కో ఆర్డినేటర్ ఎవరిని పిలిస్తే వారు ప్రసంగించాలన్న నియమంతో శిక్షకులను మాట్లాడించడం జరిగింది. ఒక్కొక్కరి ప్రసంగానంతరం, వారి ప్రసంగంపై మిగిలిన వారి అభిప్రాయాలు సేకరించితగిన మార్పులు ఆ ప్రసంగీకులు తీసుకోవాలని పెట్టుకొన్న నిర్ణయము బాగా ఫలించిందని చెప్పాలి. ముందు ప్రసంగానికి, ఆ తరువాత జరిగే ప్రసంగానికి గల నైపుణ్యతలలోని తేడాను బట్టి ఇదే సరైన విధానమని అందరం అనుకోవడం జరిగింది.
సంభాషణా పద్దతి కూడా మిళితమై యుండుట వలన ఆయా విషయాలలో శిక్షకులకు లోతైన అవగాహన ఏర్పడడము స్పష్టంగా గమనించాము. కనుక ఇక జరగబోవు తరగతులలో కూడా ఈ పద్దతి ద్వారా విషయంలో లోతైన అవగాహనను కలిగించడము, 4 గ్రూపులు చేయడము వలన అందరికి అన్ని అంశాలలో ప్రసంగించే అవకాశాలు ఏర్పడడము, ప్రసంగించే సమయాలలోనే తమ తప్పులు తాము తెలుసుకొని తమకు తాము మార్పులు చేసుకొని మరింత నైపుణ్యముతో మాట్లాడటము తప్పనిసరిగా పాటించాలనుకొన్నాము.
తరగతుల అనంతరం శిక్షకులను జరిగిన తరగతులపై మీ మీ అభిప్రాయాలను, సూచనలను, మీరు ఎలా ఫీలయ్యారో తెలపమన్నప్పుడు వారు చేసిన ప్రసంగం వలన నిజంగా ఇంత లబ్ది చేకూరిందా అని ఆశ్చర్యపోయాము. కొందరి అభిప్రాయాలు క్లుప్తంగా
పరమేశ్వరరావు, విజయనగరం వారు మాట్లాడుతూ ఆర్.టి.ఐ అవగాహనా సదస్సు అని ఆహ్వానిస్తే హాజరు అయినాను, సురేంద్రగారు ఐక్యవేదికను పరిచయం చేస్తే అప్పుడు అర్ధమైంది స్ధానిక ప్రభుత్వాలకు అధికార బదలాయింపు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఏమిటో అందుకే టి.ఓ.టి.గా పేరిచ్చాను. వచ్చిన రోజున షెడ్యూలు సరిగా లేదని ఫీల్ అయ్యాను, కాని ఇప్పుడు నేను శిక్షణ పొందుటమేగాదు, నా తరపున శిక్షణకు మాటకు కట్టుబడి వుండే వ్యక్తిని పంపుతాను, మీరు కూడా అలాంటి వారిని పంపడని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. నందా అనిల్, ఆదిలాబాద్ జిల్లా వారు మాట్లాడుతూ స.హ. చట్టం అంటే నాకు చాలా ఇష్టము. ఆర్.టి.ఐ. మీద పూర్తి అవగాహన ఏర్పడింది. సందేహాలు అన్నీ తీర్చుకొన్నాను. గ్రామస్ధాయిలో పని చేయటానికి తాను సిద్ధమని ప్రకటించారు.
గౌతమ్, రాజమండ్రి వారు మాట్లాడుతూ మాచిరాజుగారు పంపితే వచ్చానన్నారు. స.హ. చట్టం గురించి, భారత రాజ్యాంగాము గురించి తెలుసుకొన్నాక ప్రతి నెలా 2 లేక 3 రోజులు శిక్షణా తరగతుల్లో ప్రేరణ ప్రసంగం చేద్దామనకొన్నానన్నారు.
చంద్రనాయక్, గుంటూరుజిల్లా వారు మాట్లాడుతూ, తనకు ధరఖాస్తు పెట్టడం మాత్రమే తెలుసన్నారు. దాని నుండి ఇంటరెస్ట్ ఏర్పడిందన్నారు. 1996లో గిరిజన సామాజకాభివృద్ధి సంస్ధ స్ధాపించానన్నారు. ఎన్.ఆర్.డి.లో 14 కోర్సులకు శిక్షణ తీసుకొస్తానన్నారు. కాని నాలోని లోపాలు నేను గ్రహించలేదు. నా తల్లి దండ్రులు కూడ చెప్పలేదు. ఈ రోజు నేను నాలోపాలు సరిచేసికోగలిగానన్నారు. రాబోయే కాలంలో నా జాతికి భారతరాజ్యాంగ అవగాహన కలిగిస్తానని ఐక్యవేదికలో భాగస్వామని అవతానని తరగతల మధ్య మధ్యలో కళారూపం వుంటే బాగుంటుందని సూచించారు.
దీనదయాళ్, నిజామాబాద్ జిల్లా వారు మాట్లాడుతూ స.హ. చట్టం గురించి అవగాహన వుందన్నారు. నలుగురిలో ఎప్పుడూ మాట్లాడలేదని మీటింగులకు వెళితే మాట్లాడమంటారని వెళ్ళేవాడిని కానన్నారు. ఇంతకు ముందు ఇలాంటి శిక్షణ ఎవ్వరూ ఇవ్వలేదని, ఇప్పుడు మీటింగ్‌లో నేను మాట్లాడగలనన్న ధైర్యం ఏర్పడిందన్నారు.
మురళీధర్, సిరిపూర్ ఖాగజ్‌నగర్ వారు మాట్లాడుతూ నేను ఊహించిన దానికంటే తరగతలు చాలా బాగా జరిగినాయి. కుటుంబంతో వచ్చియుంటే బాగుండేదన్నారు. సమాజంను మరింతగా అభివృద్ధి పొందించే బాధ్యత అందరిమీద వుందంటూ, ఇప్పుడు తనకూ ఏదో చేయాలన్న ఆరాటము మొదలైందన్నారు.
రామప్పారావు, పశ్చిమగోదావరిజిల్లా వారు మాట్లాడుతూ స.హ. చట్టం 2007 నుండి తెలుసన్నారు. శిక్షణా తరగతులు 2రోజులు జరగడము తెలుసు కాని 5 రోజుల శిక్షణ తరగతులు ఇదే తెలవడమన్నారు. ఇంతకు ముందు కార్యకర్తలు తయారు కాలేదు అనుచరులు మాత్రమే తయారయ్యారు, సహచర నాయకత్వం నాకు బాగా నచ్చింది. విషయ పరిజ్ఞానం బాగా జరిగిందన్నారు. తరువాత కొన్ని సూచనలంటూ తరగతికి 30 మంది వుండాలని, రిసోర్స్ పర్సన్స్ 6గురు వుండాలని 5 రోజుల తరగతులు 4 రోజులు చేస్తే బాగుంటుందంటూ సీనియర్‌సిటిజన్, రిటైర్డ్ ఎంప్లాయిస్‌ను ఉద్యమాలలోనికి తీసుకోవాలన్నారు.
బాలాజిరెడ్డి, కఱ్ఱలపాలెం వారు మాట్లాడుతూ రాజ్యాంగము అమలు కావాలన్న తపన వుండేదని ఇప్పుడు అది మరింత పెరిగిందన్నారు. ట్రైనింగ్ బాగుందంటూ ఎక్కువ మందిని తయారు చేయాలని తాను ఆ విధంగా తయారుచేస్తానన్నారు.
ముస్తక్ అహ్మద్ (అభిలాష్), కాకినాడ వారు మాట్లాడుతూ స.హ.ప్రచార ఐక్యవేదికలో ఇన్ని సంస్ధలు కలిసుండడం ఆనందం కలిగించిందన్నారు. ప్రజాసంస్కరణ, వ్యక్తి సంస్కరణ యందు ఆసక్తి వుందన్నారు. ప్రజలలో ఐక్యత తేవాలనుకొంటున్నానని, అందుకు ఈ వేదిక బాగా వుపయోగపడుతుందన్నారు. తమ తమ సంస్ధ పనులు చూసుకొంటూనే ఈ వేదికలో పాల్గొనవచ్చన్న వార్త చాలా సంతోషమైందన్నారు. దేశానికి ఏమైనా చేయాలనుకొనేవారు రెండు రకాలని ఒకటి రాజ్యాంగ ఆధారంగా మరొకటి రాజ్యాంగ వ్యతిరేకంగా వున్నారని, చట్టబద్దంగా చేసే కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులౌతారని ప్రతివారు రాజు అవ్వాలని కోరుకొంటున్నారుగాని, రాజులను తయారుచేసే వారు కావాలనుకోవడం లేదని అలాంటి హృదయం సురేంద్ర గారికి వుందన్నారు. భవిష్యత్‌లో వేదిక తరపున తను చేయగలిగినంత చేస్తూ ముందుకు వెళతానన్నారు.
సత్తిబాబు, విశాఖ వారు మాట్లాడుతూ శిక్షణ గరపడంలో తేడా గమనించానన్నారు. తరగతులకు వచ్చినాక 5 రోజులు బైటకే వెళ్ళలేదన్నారు. ఆర్.టి.ఐ మీద పట్టుదొరికిందన్నారు. తన ఉపన్యాసములోని తేడా ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదని ఇప్పుడు తనకి తెలిసిందని ఏం జరిగినా మన మంచికేననిపించిందన్నారు. మంచి వ్యక్తులను శిక్షణా తరగతులకు ఎంపిక చేసి పంపుతానన్నారు.
శ్రీనివాసరావు, మార్కాపూర్ వారు మాట్లాడుతూ తన సమస్య తీర్చుకొనే నేపద్యంలో క్రమంగా ఉద్యమంలోకి చేరిపోయానన్నారు. తాను నేర్చుకొనే దేమిలేదని అయినా చూద్దామని తరగతులకు హాజరైనానన్నారు. ఈ తరగతుల వలన ఖచ్చితంగ తనలో మార్పు వచ్చిందన్నారు. 46 సం||లో వయస్సుగల తాను తన సమస్య పరిష్కరించుకొంటూ ఎంతో మందికి ఉపయోగపడ్డానన్న గర్వం వుండేదని, ఈ తరగతులు అయిపోయినాక నేను నేర్చుకోవలసింది చాలా వుందని గ్రహించానని, నాలాంటి మరొక్కడినైనా వేదికకు పరిచయం చేసి రుణం తీర్చుకొంటానన్నారు.
చివరగా వి.వి. ప్రసాదరావు, నిజామాబాద్ జిల్లా వారు దీనదయాళ్ అభిప్రాయం విన్నాక మళ్ళీ సమాజంలో ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష మొదలైందంటూ తనవంతు కార్యక్రమాలు ఏవైనా బాధ్యత వహిస్తానన్నారు.
రిపోర్టర్ : కోట ప్రసాదశివరావు
(సత్యాన్వేషణ మండలి ప్రధానకార్యదర్శి)
No comments:
Post a Comment