యోచనాశీలురైన ఐక్యవేదిక ఉద్యమ మిత్రులారా ! కార్యకర్తలారా ;
ప్రణాళికాబద్దమైన నడవడి కలిగిన వ్యక్తులుగానీ, సంస్థలు గానీ, ఆయా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు కార్యక్రమాలనంతరం ముఖ్యులంతా కూడి జరిగిన దానిపై సమీక్ష జరుపుకుంటుంటారు. ప్రస్తుతం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థలు, సమీక్షలు జరుపుకుంటున్నాయి గానీ, అవన్నీ దాదాపు నామమాత్రంగానే ఉంటున్నాయి. సమీక్షా సమావేశం ఒక మొక్కుబడిగా మారి, యాంత్రికంగా తయారైంది. నిజానికి సమీక్షయొక్క లక్ష్యం జరిగినదాన్నంతా నిశితంగా పరిశీలించడమే.
సమీక్ష = సమ్యక్ - ఈక్ష = సరైన రీతిలో సరిపడినంతగా చూడడం అని ఆ పదానికర్థం. ''చక్కగా చూడడం'' అన్నది సరళమైన అర్థం. నిశితంగా, లోతుగా ప్రత్యంశాన్ని అధవా ప్రధానాంశాల నన్నింటినీ పరిశీలించడం అన్నది సమీక్ష అన్నమాటకున్న విపులార్థం. ఆపని అంతపని సజావుగా చేయనంతకాలం అక్కడ, అప్పుడు ఆ విషయంలో సమీక్ష జరిగినట్లు కాదు.
విమర్శ : - విశేషంగా విశ్లేషించడాన్ని విమర్శ అంటారు. ''విమర్శా గుణదోష విచారణం''. పరిశీలించాలనుకున్న దానిలోని గుణాలను, దోషాలను అంటే మంచీ చెడులు, సత్యాసత్యాలు, సవ్యాపసవ్యతలు, బలాబలాలు, క్రమ-క్రమరాహిత్యాలు, లాభాలాభాలు, జయాపజయాలు, సాఫల్యవైఫల్యతలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతులు వగైరా వగైరా ఇరుపార్శ్వాలున్న సందర్భాలలోనూ, అనేకాంశాలున్న సందర్భంలోనూ వాటిని విడకొట్టి యధాతథంగా, వేటికివాటినిగా చూసే ప్రక్రియ విమర్శ అన్నది. విమర్శకు చక్కగా చూడగలగడం చేతనైయుండాలి. సమీక్షకు చక్కగా విమర్శించే సామర్ధ్యం ఉండాలి. సందర్భాన్ని బట్టి విమర్శ అన్నమాటను, సమీక్ష అన్నమాటను వాడుతుంటాం. కానీ ఆ రెంటి క్షేత్రాలలో చక్కగా, లోతుగా పట్టిచూడడం అన్న లక్షణం ఉంటుంది. అయితే సాధారణంగా సమీక్ష క్లుప్తరూపంలోనూ, విమర్శ విస్తృతరూపంలోనూ ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో విశ్లేషణాత్మక సమీక్ష, సంగ్రహ విమర్శ అన్నవి జరుగుతుంటాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఎడాపెడా అభిప్రాయాలను ప్రకటించైడాన్ని విమర్శ అనిగాని, సమీక్ష అనిగాని అనకూడదు. చేపట్టిన పనికి న్యాయం చేయడం ఆపనికి పూనుకున్న వాని బాధ్యత. బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ప్రతివ్యక్తీ ప్రాథమిక కర్తవ్యం. (కర్తృత్వం వహించి చేసేపని, చేయాల్సిన పనిని కర్తవ్యం అంటారు).
గమనిక : - విషయావగాహన పెంచుకోదలచుకున్న వాడు భాషపై తగినంత పట్టు సంపాదించాలి. ఇక్కడ కొన్ని పదాలు కావాలనే ఉపయోగించాను. విధి, హక్కు, బాధ్యత, కర్తవ్యము అంటే ఏమిటో ఆలోచించండి. అలాగే ధర్మము, న్యాయము, నీతి, సత్యము, మంచి, చెడు లాటి కీలకమైన పదాల అర్థాలను వాటిమధ్య ఉన్న తేడాపాడాలను స్పష్టంగా గమనించండి. ఎందుకంటే పద - పదార్థ జ్ఞానం లేని వానికి వాక్యార్థ జ్ఞానం కలగదన్నది భాషాపరంగా ఉన్న సార్వత్రిక నియమం.
అనుకున్నదేమిటి ? అయ్యిందేమిటి ? అన్న విచారణే సమీక్షకు పరమావధి. ఆ దృష్టితోనే మన 4,5 తేదీల నాటి సమావేశాలను (కార్యక్రమాలను) పట్టిచూడాలి.
సాఫల్య - వైఫల్యాలు : జయాపజయాలు :
ఇలాటి కార్యక్రమాలు జరిగాక కార్యక్రమాలు విజయవంతంగా ముగిసాయి (జరిగాయి), దిగ్విజయంగా నిర్వహించగలిగాం, అని అంటుండడం వింటుంటాం. నిజానికామాటలు ఇలాటి కార్యక్రమాలకు అంతగా వర్తించవు. జయం (విజయం - దిగ్విజయం) అన్న మాటలు పోరాటమో, పోటీనో ఉన్నప్పుడు మాత్రమే వాడవలసినవి. ఇరుపక్షాలున్నప్పుడు, వారిమధ్య పోటీఉన్నప్పుడు, కార్యక్రమాల ఉద్దేశం గెలుపు ఓటములు తేల్చుకోవడమైనప్పుడు మాత్రమే పనిపూర్తయ్యాక గెలిచాననో, ఓడాననో అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాటిదేమీ లేకుండా వ్యక్తులుగాని, సంస్థలుగాని తలపెట్టిన కార్యక్రమాలు ముగిశాక ఫలితాలు ఆశించిన విధంగా వచ్చాయో లేదో చూసుకొనే సందర్భాలలో పనులు విజయవంతమైనాయి లాటి మాటలు కాక సభ సఫలమైంది లేదా విఫలమైంది అన్న మాటలు వాడటమే సరైన ప్రయోగం. ఇంతవరకు సబబుగనే అనిపిస్తే...
జరిగిన మన సమావేశాలు సఫలమైనాయో, విఫలమైనాయో చూడాలి. అటుపైన సఫలమైనాయనిగాని, విఫలమైనాయనిగాని అనాలి, జయాపజయాల సందర్భం కాదిది.
సాఫల్య - వైఫల్యతల విచారణ :
ఈ దృష్టితో పరిశీలన జరిపి, సరైన నిర్ణయాలకు రావాలంటే ముందుగా సభ ఏ ఉద్దేశంతో ఏర్పరచాము? దానికి సంబంధించి ముందస్తు అంచనాలేమిటి ? అన్నది స్పష్టంగా పరిగణనలోకి తీసుకోవాలి. అనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు కార్యక్రమం సఫలమైందంటాము. నిజానికి అప్పుడు మాత్రమే అలా అనాలి. అలా జరగనప్పుడు అది విఫలమైందనాలి. కనుకనే సాఫల్య, వైఫల్యతల గురించి సమీక్షించాలంటే కార్యక్రమానికి ముందేర్పరచుకున్న వివిధ లక్ష్యాలు, ఉప లక్ష్యాలకు సంబంధించిన వివరాలు ముందుంచుకోవాలి. నా అవగాహనకు అందినంతలో ఆ వివరాలివిగో ఇలా ఉన్నాయి.
1. మహాసభ జరుపుకోవాలని గత వార్షికోత్సవం నాడే అంటే 2011 జనవరి 30,31నే నిర్ణయించుకున్నాం.
2. మొదటి రోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరుపుకోవాలి. ఆ సమావేశానికి జిల్లాకు 5గురికి తగ్గకుండా (అధ్యకక్షుడు, కార్యదర్శి, కోశాధికారి అన్న జిల్లా ప్రధాన బాధ్యులు ముగ్గురు, శిక్షణ పొందిన వారో లేదా మిత్ర సంస్థల బాధ్యులలో ఇద్దరు వెరసి 5గురు) హాజరు కావాలనుకున్నాం. మొత్తం ఆనాటి ప్రాతినిధ్యం 125-150 మధ్య ఉండాలనుకున్నాం.
3. రెండవ రోజు మహాసభ 23 జిల్లాల ప్రాతినిధ్యంతో 1000 మందికి తగ్గని హాజరీతో జరుపుకోవాలనుకున్నాం. ప్రతి జిల్లా నుండి 50 మంది ప్రతినిధులుండేలా చూడాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాం.
4. పని పెద్దదని ముఖ్య బాధ్యులంతా బాధ్యత తీసుకొని పట్టుబట్టి గట్టిగా కృషిచేస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరటం కష్టమని అనుకున్నాం.
5. ప్రతినిధులను తరలించే బాధ్యత రెండు బృందాలపై ఉంటుందని అనుకున్నాం.
ఎ) ఐక్యవేదికలోని మిత్ర సంస్థలు జిల్లాల వారీగా గానీ, సంస్థల వారీగాగాని వ్యక్తుల్ని సన్నద్ధం చేసే బాధ్యత స్వీకరించడం.
బి) ఆయా జిల్లా, మండల బాధ్యులు ఐక్యంగా పూనుకుని అనుకున్న సంఖ్య తగ్గకుండా ప్రతినిధులను తీసుకురావాలనుకుని అందుకు బాధ్యత వహించటం.
6. రాష్ట్ర కమిటీ బాధ్యులంతా శ్రద్ధపెట్టి అటు మిత్ర సంస్థల ప్రతినిధుల్ని, ఇటు జిల్లా కమిటీ బాధ్యులను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి ? ఏవైనా జిల్లాలలో మరింత శ్రద్ధపెట్టి పనిచేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా. మిత్రసంస్థల భాగస్వామ్య కృషి ఎలాఉంది ? వగైరా పర్యవేక్షణ చర్యలన్నింటిని నిరంతరం చేస్తూ ఉండాలి. ఈ పని సక్రమంగా జరిగిందా ? లేదా ? అన్నదీ పరిశీలించాలి.
గమనిక : - 1000కి తగ్గకూడదనే గాని ఎక్కువ వస్తే మంచిదేగా అనుకుని, ఒక థలో ఎందుకైనా మంచిదని ముందస్తు జాగ్రత్తగా నేనొక ప్రతిపాదన చేశాను రాష్ట్ర కార్యవర్గం ముందు. కృష్ణాజిల్లా మరియు దానికి ఆనుకుని ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టి జిల్లాకు 100 మందిని సమీకరించేందుకు కృషిచేయాలన్నదే ఆ ప్రతిపాదన. అప్పటికే కృష్ణమూర్తి రాజుగారి కృషివల్ల, మరి కొందరు శిక్షణ పొందినవారి క్రియాశీల పాత్రవల్ల పశ్చిమ గోదావరి చైతన్యవంతంగా ఉంది. గుంటూరు, ప్రకాశం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ జిల్లా బాధ్యుల ఐక్యవేదిక అర్ధమై, గట్టిగా కృషిచేస్తున్న పరిస్థితి ఉంది. కనుక ఆ 6 జిల్లాల నుండి జిల్లాకు 100 మందిని సన్నద్ధం చేద్దామనుకున్నాం. ప.గో. జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం జిల్లాల బాధ్యులున్నూ అలాగే యత్నిస్తాం, మన లక్ష్యాన్ని పూర్తిచేస్తాం అన్న దృష్టిని కనపరిచారు.
7. కేవలం రాశి ప్రధానంగా కాక, వాసినీ దృష్టిలో పెట్టుకోవాలనీ, ఎవరిని బడితే వారిని తరలించటంగా కాక, ఐక్యవేదిక గురించి కనీసంగా నైనా తెలిసి ఇష్టపడిన వాళ్ళనే మహాసభకు తోడ్కొని రావాలని అనుకున్నాం.
8. మహాసభ ప్రధానాశయం, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, సంస్థ కార్యక్రమాలను వారికెరుకపరచి, వారిని మరింత ఉత్సాహపరిచి, తిరిగి వెళ్ళి వారివారి జిల్లాల్లో క్రియాశీలంగా ఉద్యమ మలిథ కార్యక్రమాలలో పాలుపంచుకొనేలా ప్రేరణ కలిగించడం రెండో ప్రాధాన్యతాంశం. రాష్ట్రంలో ప్రణాళికాబద్దమైన ఒకపెద్ద ఉద్యమ కార్యం రూపుదిద్దుకుంటుందన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం. మూడవ అంశంగా, సుశికక్షుతులైన కార్యకర్తలున్న కార్యక్రమాలు ఎలా జరుగుతాయోనన్నది అటు వివిధ మిత్ర సంస్థలకు, ఇటు కార్యకర్తలకు, మరోవైపు జనబాహుళ్యానికి స్పష్టంగా తెలియజేయడం. కార్యక్రమం జరుపుకోవాలన్న దానివెనుక ఈ మూడు ప్రయోజనాలను ఆశించాం.
మహాసభ ఈ మూడు ప్రయోజనాలను సాధించి, అందువల్ల ఏర్పడ్డ నూతనోత్తేజంతో భవిష్యత్ కార్యక్రమాలకు పూనుకోవాలనుకున్నది. మహాసభ నిర్వహించుకుందమను కోడానికి వెనుకనున్న అస్సలు ఉద్దేశ్యం ఇదే.
4వ తేదీన జరగాల్సిందేమిటి ?
9. మొదటి రోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో జిల్లా బాధ్యుల నుండి ఆయా జిల్లాల్లో అప్పటికి జరిగిన కార్యక్రమాలు, ఉద్యమ నిర్మాణరీత్యా ప్రస్తుత పరిస్థితి, ప్రయత్నాల సందర్భంగా ఎదురవుతున్న అనుకూల, ప్రతికూలాంశాలు, ఇకముందు ఏమిచేయాలను కుంటున్నది, జిల్లాల్లో ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థల తోడ్పాటు పరిస్థితి, వారు రాష్ట్ర కమిటీకి ఏమైనా సలహాలు, సూచనలు చేయదలచి ఉన్నా ఆ వివరాలు కూర్చి జిల్లా నివేదికలు సిద్ధంచేసి రాష్ట్ర కమిటీకి ఇవ్వాల్సి ఉంది.
10. జిల్లాల్లో అధ్యయన శిక్షణ తరగతుల పరిస్థితి ఏమిటి ? స.హ. చట్ట వినియోగంపై జరిగిన కృషిఏమిటి ? ఆర్థిక వనరుల మాటేమిటి ? అన్నది చర్చించుకుని వాస్తవ పరిస్థితులాధారంగా భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించుకోవలసి ఉంది.
11. ఐక్యవేదిక ఆశయాదర్శాలు - వాటి సాధనకై చేయాలనుకున్న థలవారీ కార్యక్రమం గురించి జిల్లాల్లో ఏమేరకు, ఎందరికి అవగాహనున్నదీ పరిశీలించుకోవాల్సి ఉంది. దానితోపాటు మహాసభలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలను చర్చించి రూపొందించుకోవాల్సి ఉంది.
12. మహాసభ - రెండోరోజు - కార్యక్రమాల గురించి అంతిమంగా మాట్లాడుకొని, ఎవరెవరు ఏఏ బాధ్యతలు నిర్వహించాల్సి ఉందీ నిర్ధేశించుకోవడమూ ఆనాడు జరగాల్సిన పని.
ఇవండీ రెండు రోజుల కార్యక్రమాల వెనుకున్న ఉద్దేశాలు
- ఒక క్రమంలో చేయాల్సిన పనులు.
సాఫల్య వైఫల్యాల గురించి మాట్లాడే సందర్భాలలో కొందరు 60% సక్సెస్, 40% సక్సెస్, 20% సక్సెస్, 10% సక్సెస్ లాటి మాటలు మాట్లాడుతుంటారు. దాదాపు అన్ని సంస్థలలో ఇదొక ఆనవాయితీగానూ మారిఉంది.
సభలంటే అలాగే జరుగుతాయండీ, అనుకున్నట్లు ఎలా జరుగుతాయి ? సమయం 10 అంటే 12 అనే అనుకోవాలి. ప్రతినిధులు 100 అంటే 50 అనే అనుకోవాలి లాటి మాటలూ దాదాపు అన్ని సంస్థల నిర్వాహకులలోనూ సామాన్యాంశంగా తలచబడుతోంది. ఈ చెడ్డ సంప్రదాయం నుండి ఉద్యమ సంస్థలు ఎంత త్వరగా బైటపడితే అంతమంచిది.
ఇలాంటి కార్యక్రమాల నిర్వాహకులలో 'గతాను గతికో లోకః' అన్నట్లు అనుసరణశీలతే బలంగా కనపడుతోంది. సభలు, సమావేశాలు అలాగే జరుగుతాయి. జరగాలి కూడా లాటి మాటలన్నీ ఈ కోవకు చెందినవే. కొందరైతే మరో అడుగు ముందుకు వేసి మీరన్నట్లు ఎక్కడ జరిగాయో చూపండి అనీ అంటున్నారు.
ఈ విషయంలో అలా ఆలోచిస్తున్న మిత్రులందరికీ నేను నాలుగు మాటలు చెప్పదలచుకున్నాను.
మనం ఉద్యమాలు చేస్తున్నది సమాజంలోని తప్పుడు పోకడల్ని సరిదిద్దడానికేనా ?
అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోని, చేసుకోలేని సంస్థలు గుడ్డి పోకడ పోతున్నట్లు కాదా ?
అట్టి వాటిని జడప్రాయాలు అనాలనంటాను. నిజమా ? కాదా ?
గతంలో ఎవరైనా చేశారా ? అన్న మాట అంత సరైంది కాదు. ఎందుకంటే ఎవరో ఒకరు, ఎప్పుడోకప్పుడు ఒక నూతన ఒరవడి ఆరంభించాల్సిందే కదా. అతడారంభించ డానికి ముందు అలాంటి పని మరింకొకరు చేయలేదనే కదా ? ఆ ఆరంభకుడు గాని గతంలో ఎవరైనా చేశారా ? అని అనుకుని, ఎవరూ చేయలేదని తెలుసుకొని, ఎవరూ చేయనిది మనమెందుకు చేయడం అని గనుక అనుకుని ఉంటే లోకంలోనికి అసలేవిధానాలు వచ్చిఉండేవి కాదు. ఏ వరవడికైనా దానిని ఆరంభించేవాడొకడుండి, అంతక్రితం లేని దానిని మొదలెడితేనేకదా కొత్త వరవడి ఏర్పడేది.
అందులోనూ, సమయపాలన, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కార్యక్రమాల నిర్వహణ అన్నది తప్పనిసరిగా అనుసరించాల్సిన పద్ధతి అని తెలుసుండీ, ఆ మేరకు అప్పటిదాకా జరుగుతున్న దానిలోని లోపాలను సరిదిద్దుకోకపోవడం సబబుకాదు గదా. నా అవగాహన ప్రకారం గత 15,20 ఏండ్లుగా నేను గమనిస్తున్న దానిని బట్టి అనేకాంశాలలో ఉద్యమాలు, ఉద్యమ సంస్థలు, అంతః సంస్కరణ పొందాల్సిన పరిస్థితి ఉంది. అవసరమైన మార్పులు చేర్పులకు మనం సిద్ధం కాకుండా సమాజాన్ని మారుస్తాననడం, మార్చగలననుకోవడం ఊహల్లో విహరించడమే. ఉత్తుత్తిమాటే. ఏ ఉద్యమానికైనా పాతక్రొత్తల మేలుకలయికే ఎప్పటికప్పుడు అప్పటికి ఉత్తమరీతి అవుతున్నదన్నది విజ్ఞులందరూ గుర్తించిన వాస్తవం. మన ఐక్య వేదికా ఈ సూత్రాన్ని సరైందే అంటున్నది. కనుక ఇలా, ఇప్పటికెవరూ చేయలేదు కనుక మనమెందుకు చేయడం అన్న ఆలోచన విడచిపెట్టి, ఏమి చేస్తే బాగుంటుంది ? మరింత శాస్త్రీయంగా, ప్రయోజనకరంగా ఉంటుంది? అన్నదాలోచించి అలాటి వైఖరిని అవలంభించడమే వివేకవంతం. సమాజ పునర్నిర్మాణ దృష్టి కలిగిన వారికైతే అది మరింత అవసరం కూడా. ఈ దిశగా మనను (ఉద్యమకారులను) ఉత్తేజపరచగల కొన్ని అనుభవపూర్వకమైన సూక్తులున్నై వాడుకలో వాటిని చూడండి మీరున్నూ.
1. త్రికరణ శుద్ధి : ఆలోచనకు - మాటకు - చేతకు పొంతనుండాలి. వ్యత్యాసం ఉండరాదు.
2. పట్టుపట్టరాదు, పట్టి విడువరాదు : పట్టెనేని బిగియపట్టవలయు, పట్టివిడుచుట కంటే పరగి చచ్చుటమేలు.
3. లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, డొక్కశుద్ధి అన్నవి కార్యశూరునికి ఉండాల్సిన మూడు శుద్ధులు. (డొక్క శుద్ధి అంటే ఇక్కడ సరైన అవగాహన అని అర్థం.)
4. మందబుద్దులు పనే ఆరంభించరు. కొద్దిగా పట్టుదలగలవారు పని ప్రారంభిస్తారుగానీ, అవరోధాలేర్పడగానే ఆగిపోతుంటారు. ధీరులు - అంటే బుద్ధిమంతులు, ధైర్యస్థులు ఎదురవుతున్న విఘ్నాలను పరిహరించుకుంటూ గమ్యం చేరేవరకు కృషిసాగిస్తారు.
5. స్థితప్రజ్ఞులు - స్థిరమైన ప్రజ్ఞకలవారు అంటే ధీరులు - లక్ష్యసాధన క్రమంలో మధ్యమధ్యలో ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలకు గానీ, లాభనష్టాలకు గాని, జయాపజయాలకు గానీ, మానావమానాలకుగానీ, అత్యుత్సాహాన్ని, నీరసాన్ని గానీ పొందక గమ్యం చేరేవరకు అనుకున్నది సాధించేవరకూ - దృఢచిత్తంతో కృషిచేస్తూ ఉంటారు.
6. కర్త, ఉద్దేశ్యము, పరికరాలు, విధానము, పని అన్నవి ఫలితోత్పత్తికి అవసరమైన కారణాంశాలు. పైనాలుగూ సమకూడి ఆపై పనీ సక్రమంగా జరిగినపుడే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అలా అనుకున్నది అయినపుడే కార్యం సిద్ధించింది- ఫలితం దక్కింది-. అనంటాము. దానిపేరే సాఫల్యత. ఉద్దేశ్యం నెరవేరినపుడే పని సఫలమైంది అననాలి. అనుకున్నవి అనుకున్నట్లు జరగనపుడు కార్యక్రమం విఫలమైందనడమే సరైంది. వెనుక చెప్పుకున్నట్లు 60%, 40%, 20%, 10% సఫలత చేకూరింది లాటి మాటలు మాట్లాడే వారి నిఘంటువులో వైఫల్యమన్న మాటే లేదన్నమాట. ఇక అలాటి వైఖరి కలవాళ్ళు చేసే సమీక్షలు వాస్తవ పరిస్థితుల్ని ఎన్నటికినీ కనుగొనలేవు. లోపాలోపాలను యధాతథంగా గమనించగలిగే పరిస్థితే లేనపుడు, ఇక వాటిని సరిదిద్దుకునేదెన్నడు ? అలాటి దృక్ఫధం కలవాళ్ళ కార్యక్రమాలన్నీ ఎప్పటికప్పుడు 'అడుసుతొక్కుడు - కాలుకడుగుడు' చందానే సాగుతుంటాయి.
కాకుంటే కొన్ని సందర్భాలలో అంటే కార్యక్రమం అనేక లక్ష్యాలతో కూడిఉండే సందర్భాలలో అందులో కొన్ని లక్ష్యాలను అనుకున్న రీతిలోనే చేరగలిగినపుడు మాత్రం, ఆయా అంశాలలో సఫలత లభించిందని గుర్తించడం, విఫలమైన వాటి విషయంలోనూ, విఫలమనోరధులమయ్యామనీ అంగీకరించడం చేయవచ్చు. అంతేగాని 60%, 40%....10% లాటి మాటలు ఉద్యమ క్షేత్రాలకు తగినవికాదు.
7. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిస్తూ గాంధీ ''సాధించు లేదా మరణించు'' ''డూ ఆర్ డై'' అనే నినాదాన్నిచ్చారు. ఆ సూత్రం ఆ సందర్భానికి మాత్రమేగాక కార్యశూరులైన వారికి ఏ సందర్భానికైనా వర్తిస్తుంది. చరిత్రలో గట్టిపట్టుదల ఉన్నవాళ్ళ వల్లే ఏమైనా సాధించబడ్డాయి. ఈ సందర్భంగా అనుకున్నది సాధించడానికి అవసరమైనవిగా పైన చెప్పుకున్న సాధారణ సూత్రంలోని పని అన్న దాని దగ్గర పనికి వర్తించే మరో అనుబంధ సూత్రం ఉంది. సఫలతకు సూత్రం ; ఎంత పనికి అంతయత్నం అన్నదే అది. ఎప్పుడైనాసరే పనికి తగ్గ యత్నం చేయకుంటే వైఫల్యమే ఫలితంగా - (ముగింపుగా, పర్యవసానంగా) ఉంటుంది. కనుక మన సమీక్ష సందర్భంలో ఆద్యంతం (మొదటినుండి చివరిదాకా) పట్టిచూడాల్సింది అనుకున్నదెంతపని? అందుకై చేసినదెంత యత్నము? అయ్యిందెంత? అన్న విషయాలనే.
ఇక సంగ్రహంగా సమీక్షించుకుందాం
1. 4వ తేదీ సమావేశానికి సమీకరించాలనుకున్నది ప్రతి జిల్లానుండి 5గురికి తక్కువ కాకుండా రాష్ట్రం మొత్తం నుండి 125 నుండి 150 మందిని కదా !
ఎ. 4వ తేదీ సమావేశానికి హాజరైనవారు సుమారు 66 మంది. అందులో కృష్ణా, గుంటూరుల నుండే 20 మంది.
బి. 6,7 జిల్లాల నుండి ప్రాతినిధ్యమే లేదు. 5,6 జిల్లాల నుండి ఒకరు, ఇద్దరూ వచ్చారు.7,8 జిల్లాల నుండి మాత్రం 4,5 గురు వచ్చారు. ఈ అంకెలు మనకు అనుకున్నది జరగలేదన్న నిజాన్ని తెలపటం లేదా ?
సి. ఇందులోనూ వాసిపరంగా అంటే అధ్యకక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, శిక్షణ పొందిన ఇరువురు అన్న దృష్టితో చూస్తేనే, ఏఏ జిల్లాల నుండి అనుకున్నంత మంది అనుకున్న స్థానాలకు చెందినవారు వచ్చారో తెలుస్తుంది.
2. ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థల ముఖ్యులూ, రాష్ట్రకమిటీ సమావేశానికి రావలసి ఉంది. అదీ జరగలా ?
3. ఆరోజు చర్చించాల్సిన అంశాలు సంతృప్తికరంగా చర్చించబడలేదన్నదే ఎక్కువమంది అభిప్రాయము.
4. మరునాటి మహాసభ నిర్వహణ పరంగా పనుల పంపిణీ, బాధ్యతలప్పగింతలన్నవి నిర్ధిష్టంగా జరగలేదు.
5. జిల్లాల బాధ్యులు ఎ) జిల్లా కమిటీ నివేదికలు సమర్పించటం, బి) సభ్యత్వాలకు సంబంధించిన లెక్క అప్పగించటం, సి) జిల్లాలోని విషయాలపైగాని, రాష్ట్ర కమిటీ విషయంలోగాని ఏమైనా చెప్పదలుచుకున్నది చెప్పటం జరగాలి.
6. ఐక్యవేదిక ఆశయాదర్శాలు, స్వరూప స్వభావాల గురించి అందరికీ సమానమైన, ఒకేరకమైన అవగాహన ఏర్పడేలా ఐక్యవేదిక భావజాలంపై ఒకింత చర్చజరుపుకోవాలనుకున్నాం.
గమనిక : - ఇవేవి అనుకున్నంత స్థాయిలో, అనుకున్న రీతిలో జరగలేదన్నది నిజం. దీనిపై జిల్లా సమీక్షా సమావేశాలలో లోతుగా చర్చించి వాస్తవాలను అందుకు కారణాలను కనుగొనాలి. అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి.
5వ తేదీ పరిస్థితి : అనుకున్నది
1. ప్రతి జిల్లా నుండి ''50'' మంది ప్రతినిధులు రావాలని, మరింత పట్టున్న మరియు కృష్ణాజిల్లాకు ఆనుకుని ఉన్న జిల్లాల నుండి 100 మందిని తరలించేందుకు కృషిచేయాలని అనుకున్నాం. ఆ లెక్కన 13,14 వందల మందికై యత్నం చెయ్యవలసి ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణ లక్ష్యంగా చూసుకున్నా 1000 మందికి తగ్గకూడదు మహాసభ హాజరీ.
2. ఇక వాసి పరంగా చూస్తే ఎంతోకొంత వరకైనా ఐక్యవేదిక గురించిన అవగాహన ఉన్నవాళ్ళనే సమావేశానికి తీసుకురావాలనుకున్నాం. అంటే మహాసభకు వచ్చిన వాళ్ళంతా ఐక్యవేదికకు చెందిన వాళ్ళే అయ్యిండాలన్నమాట. నిజానికి నాదృష్టికోణం నుండి ఈమాట చాలా చాలా కీలకమైనది. మహాసభ కార్యకర్తల సభ మాత్రమే నన్నమాట.
3. స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని సన్మానించడం ఒకపని. ఐక్యవేదిక భాగస్వామ్య సంస్థల ప్రతినిధులను సభకు పరిచయం చెయ్యడం మరోపని. విశిష్ఠ అతిధులకు సన్మానం, వారి సందేశాలు వినిపించడం మూడోపని, ఆపై ప్రధాన కార్యదర్శి నివేదిక, ఐక్యవేదిక గురించిన అవగాహన కలిగించే 1,2 రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ప్రసంగాలు. ఇది 5వ తేదీ ఉదయపు సమావేశ సమాచారం.
జరిగింది :
1. మొత్తం ప్రతినిధుల సంఖ్య 420 లోపే ఉంది. అందులోనూ కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రాతినిధ్యమే 210 వరకు ఉంది.
2. అంటే, మిగిలిన 21 జిల్లాల ప్రాతినిధ్యం 200 మంది మాత్రమేనన్నమాట. అందులోను 10 జిల్లాల మొత్తం ప్రాతినిధ్యం 18 మందే. ప్రతినిధుల హాజరీ విషయంలో అనుకున్నది జరగలేదు అని తెలుస్తోంది కదా !
3. వచ్చిన కొద్దిమందిలోను కొంతమంది ఐక్యవేదిక ఆశయాదర్శాల గురించి అంతగా అవగాహన లేనివారు, మొహమాటానికి వచ్చినవారూ, సభ చూసి వద్దాం, విజయవాడ చూసి వద్దాం అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజానికి అంత పెద్దఎత్తున సభ జరపాలనుకున్నది కార్యకర్తల్లో ద్విగుణీకృత ఉత్సాహాన్ని నింపి, తిరిగి వెళ్ళాక వారు మరింత, మరింతగా కార్యక్షేత్రంలోకి చొచ్చుకుపోయేలా ప్రేరణ కలిగించాలని, తాము భాగస్వాములుగా ఉన్న ఐక్యవేదిక ఇటు భౌతికంగాగాని, అటు భావజాల పరంగా కాని చిన్నదేమి కాదని, సమున్నతమైనదని గమనించి వారంతా నిండైన ఆత్మస్థైర్యంతో (గుండె నిబ్బరంతో) తిరిగి వెళ్ళాలని మన ఆకాంక్ష.
నిజానికి వచ్చిన వారు ఆ మేరకు, ఆరకంగా ప్రేరణ పొందలేదనే అనిపిస్తోంది నావరకు నాకు.
4. శిక్షణ పొందిన కార్యకర్తలకు, శిక్షణ పొందని కార్యకర్తలకు; ముందస్తుగా ప్రణాళికాబద్దమైన కార్యక్రమాలకు, అలాకాక జరిగినంత జరుగుతవిలే అనుకొని చేసే కార్యక్రమాలకు ఎంత వ్యత్యాసముంటుందో ప్రత్యక్షంగా, ప్రయోగరూపంలో అందరికీ తెలిసేలా చేయాలన్నది ఐక్యవేదిక సంకల్పం. రకరకాల కారణాలవల్ల అది సంతృప్తిగా నెరవేరలేదు. సభలో క్రమబద్దత తృప్తిపడగలంత స్థాయిలో లేదన్నది మరోనిజం.
ఉద్యమ సారధ్యం - కొన్ని మౌలిక భావనలు
ఉద్యమ క్షేత్రాలలో, ఆశయాదర్శాల విషయంలో ఏకాభిప్రాయం కలిగిఉన్నవారిలోనూ, మూర్తిమత్వాలలోని వ్యత్యాసాల వల్లా, అవగాహనల్లోని వ్యత్యాసాలవల్లా రకరకాల వైఖరులున్నవారుంటుంటారు. అట్టి వారిని గురించిన కొన్ని వివరాలిస్తున్నాను, గమనించండి.
ఎ. 1. అల్ప సంతోషులు, 2. అంతా మన మంచికే ననుకొనేవారు, 3. నిరాశావాదులు, 4. ఆశావహులు, 5. అసంతుష్టులు
బి. 1. ప్రతి విషయాన్ని తీవ్రంగా తీసుకొనే వాళ్ళు, 2. ఏ విషయాన్ని తీవ్రంగా తీసుకోని వాళ్ళు, 3. మధ్యస్తంగా ఉండేవాళ్ళు
సి) ఎలాగోలా పనిజరిగితే బాగుండుననుకొనేవాళ్ళు, తన స్థానం భద్రంగా ఉంటేకాని కుదరదనుకునేవాళ్ళు.
డి. 1. తలొంచుకుని పనిచేసుకుపోయేవాళ్ళు. 2. గుర్తింపు కొరకు పనిచేసేవాళ్ళు. 3. పనిచేయకుండానే గుర్తింపు రావాలనుకొనేవాళ్ళు.
ఇ) 1. వేదిక కార్యక్రమాలకు వచ్చి అతిధులుగా ప్రవర్తించేవాళ్ళు.2. బాధ్యతంతా నెత్తినవేసుకొని వచ్చినవారి పనులన్నీ చూస్తుండేవాళ్ళు. ఈ తరహా మనుషుల్ని 1. అంటీ ముట్టనివాళ్ళు, 2. అన్నీ పూసుకునేవాళ్ళు అనీ అనవచ్చు.
ఎఫ్. 1. ఉద్యమ కార్యక్రమాలకు భారంగా తయారయ్యే వాళ్ళు, 2. భారం కాకూడదనుకొనేవాళ్ళు, 3. ఉద్యమ భారం మోసేవాళ్ళు.
గమనిక :- ఇలా రకరకాల మనస్తత్వాల వాళ్ళు చేరిఉంటారు ఉద్యమ క్షేత్రాలలో.
1. అల్ప సంతోషులు : - ఈ స్వభావులకు ఎంత జరగాలనుకున్నాం ? ఎంత జరిగింది అన్న స్పృహ ఉండదు. నలుసంత జరిగినా మహదానందభరితులై పోతుంటారు. ఈ స్వభావులకు వైఫల్యాలు కనిపించవు. అంతా సక్సెసే.
2. అంతా మనమంచికే - అంతా మంచే - జరిగింది అనుకునేవాళ్ళు : - ఈరకం స్వభావులు చెడులోనూ మంచిని, కీడులోనూ మేలునే చూస్తుంటారు. అపజయంలోనూ విజయాన్ని, వైఫల్యతలోనూ సాఫల్యతను వెదుక్కొనే రకమన్న మాట. ఉదాహరణకు ఒక బస్సు యాక్సిడెంట్ అయ్యిందనుకోండి. ఈరకం ఏమేమి దెబ్బతిన్నాయన్నది పట్టించుకోరు. మనుష్యులకేమీ కాలా ! టైర్లు బాగానే ఉన్నాయి, ఇంకానయం ఆయిల్ ట్యాంక్ అంటుకోలా ! ఇలా ఆలోచిస్తుంటారు. యాక్సిడెంట్‌లో వ్యక్తులకు దెబ్బలు తగిలాయి అనుకుందాం, కాలు విరిగిందొకనికి ! ఇంకానయం తలకు తగిలుంటే ఏమయ్యుండేది, కాలుతో పోయింది అక్కడకు సంతోషించాలి అనుకుంటుంటుంటారన్నమాట.
3. నిరాశావాదులు : - వీరు పై ఇద్దరికీ పూర్తి వ్యతిరేక దృక్పథం కలవారు. సాఫల్యతలోనూ వైఫల్యమే కనపడుతుంటుంది వీరికి. ''ఇల్లలగ్గానే పండగయ్యిందన్నట్లు కాదు'', ''ముందుంది ముసళ్ళ పండుగ'', మన వల్లకాదిది, నిజం చెప్పాలంటే ఎవళ్ళవల్లా కాదు, ఎందుకీ శ్రమ దండగ పనులు, చెబితే వినవు, అనుభవిస్తేగాని అర్థం కాదులే, ఇలాంటివి ఎన్నో చేశాం, చూశాం, కొత్తబిచ్చగాడు పొద్దెరగడు లాంటి మాటలు మాట్లాడుతూ చేతనైనంతలో కార్యకర్తల ఉత్సాహంపై నీళ్ళుచల్లే పని చేస్తుంటారు. అయినా వీళ్ళ విషయంలో ఒక నిజం చెప్పుకోవాలి. వీళ్ళు మానసికంగా చెడ్డవాళ్ళు కాదు. కాని ఈ వైఖరి మాత్రం ఉండకూడనిదే.
కార్యశీలునికి లక్ష్యం సిద్ధించేవరకు ఆశ చావకూడదు. తృప్తి కలగకూడదన్న తాత్విక భావనను ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఆశ చచ్చినా, తృప్తి కలిగినా ఇక ఆ విషయంలో వ్యక్తి చేసేది, చేయగలిగింది పెద్దగా ఉండదు.
4. ఆశావహులు :- ఆశావాదం (ఆశావహ దృక్పథం) అన్నదాని గురించి సమాజంలో చాలా తప్పభిప్రాయాలున్నాయి. అల్ప సంతోషుల క్రిందకొచ్చేవారిని ఆశావాదులనే అంటున్నారు కొందరు వివరణకర్తలు. అది సరైన వివరణ కాదు. వైఫల్యంలోనూ సాఫల్యతను భావించేవానిని భ్రాంతుడనాలి గాని ఆశావాది అనకూడదు. ఎండమావిలోనూ నీళ్ళను వెదుక్కునే వానిని భ్రాంతుడనాలి కాని ఆశావహుడు అనకూడదు. ఆశావాదంలో వైఫల్యానికి క్రుంగనితనం ఉండాలి కాని, వైఫల్యాన్ని సాఫల్యం అనుకొనే లక్షణం ఉండకూడదు. ఆశావాద దృక్పథం యొక్క వైఖరి వైఫల్యాలను సాఫల్యాలనుకోవడం కాదు. ఒకతూరి వైఫల్యం పొందినా, భవిష్యత్తులో సఫలత పొందగల అవకాశం ఉంది, పొందగలను. అందుకు ఇప్పుడు వైఫల్యాలకు కారణాలైన దోషాలను, లోపాలను సరిచేసుకొని యత్నిస్తాను, అనుకోగలగడంలో ఆశావహ దృక్పథం యొక్క లక్షణం లేదా సారం. ఆశావాది జరిగిన వాస్తవాలను అనుకూల - ప్రతికూలాంశాలను ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రధానంగా ప్రతికూలాంశాలను గమనిస్తూనే, ఎదుర్కొనడానికి సిద్ధమై భవిష్యత్తు తనదేననుకుంటూ వర్తమానంలో ఉత్సాహాన్ని కోల్పోకుండా కృషిచెయ్యడానికి సన్నద్ధుడు కాగలుగుతాడు.
అన్నీ సక్రమంగా, అనుకున్నవి అనుకున్నట్లు జరిగిపోతూ ఉంటే ఇక ఆశావాద దృక్పథంతో పనేముంది. అనుకున్నది ఆ యత్నంలో అనుకున్నట్లు జరక్కపోయినా, క్రుంగిపోనీయక, మరో ప్రయత్నానికి సంసిద్ధుణ్ణి చెయ్యటానికి కదా కావాలి ఆశావాద దృక్పథం. దీనిని గురించి సరిగాను, సరిపడినంతగాను తెలిసుండడం ఉద్యమ క్షేత్రాలలో చాలాచాలా కీలకం అవుతుంది. పగటి కలలు కనడాన్ని ఆశావాదం అనకూడదు. అపజయం ఎదురైనా, వైఫల్యం ప్రాప్తించినా, నీరసపడిపోకుండా, మరోయత్నానికి దారితీయించే వైఖరినే ఆశావహ దృక్పథం అనాలి. ఈ విషయాన్ని నిదానంగా పరికించి చూడండి. మీ మీ అనుభవాలతో పోల్చిచూసుకొని వాస్తవాలేమిటో గమనించండి. ఆశావాద దృక్పథాన్ని దాని సరైన అర్ధంలో అలవరుచుకోవాలి మనమందరం. నిజమైన కార్యశూరునికి, ధీశాలికి ఆశావహ దృక్ఫధమే బలంగా పనిచేస్తుంది.
గమనిక : ''కీడెంచి మేలెంచు'' అన్నది ''అంతా మన మంచికే'' అన్నది కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలకు వర్తించే సూత్రీకరణలే గాని, అవి సర్వసాధారణ సూత్రీకరణలు కావు. వాటికున్న ఈ పరిమితులను సక్రమంగా అర్థం చేసుకొని అన్వయించుకోకుంటే పరిస్థితులు, ఫలితాలు తల్లక్రిందులుగా మారిపోతాయి. ''ఆలస్యం అమృతం విషం'' 'నిదానం ప్రధానం' అన్న సూత్రాలు అలాంటివే. వాటిని ఎప్పుడు, ఎక్కడా, ఎలా (ఎంతమేర) వాడాలో తెలియకుంటే ఆ రెండూ విపరీత ఫలితాలనే పుట్టిస్థాయి. తస్మాత్ జాగ్రత్త !
బి) అసంతుష్టులు :- ఎంత జరిగినా, అంతా జరిగినా కూడా ఏదో కారణం చూపిస్తూ, ఎక్కడో ఏదో లోపం ఆపాదించుకునైనా అసంతృప్తికి లోనవుతుంటారు ఈ రకం. సఫలమైన సందర్భంలోనూ, ఇప్పటికేదో అయ్యిందిలే, ఈసారి మాత్రం సరిగా జరుగుతుందనిపించటం లేదు అనుకుంటుంటారు ఈ స్వభావులు. ఒక నిజమేమిటంటే వీరు చెడ్డవాళ్ళు కాదు. వారికి నిజంగానే అలా అనిపిస్తుంటుంది. ఈ రకమైన అసంతృప్తి కార్యకర్తను క్రమంగా నీరసపడేట్లు చేస్తూ, కార్యోన్ముఖున్ని కానీకుండా వెనక్కు గుంజుతూ ఉంటుంది. ఉద్యమాలలో ఒక స్ధాయికి మించి ఆలాంటి వాళ్ళు ఉంటే ఆ ఉద్యమాలు క్రమంగా నీరుగారిపోతాయి.
గమనిక : - కార్యశూరుడు తృప్తి - అసంతృప్తుల మేళవింపుగా ఉండాలి, ఉంటాడు కూడా. జరిగిందాన్ని, జరుగుతున్నదాన్ని యథాతథంగా గమనిస్తూనే ''పర్వాలేదు'' అన్న దగ్గరకు రాగలగడాన్ని పరిమిత తృప్తి అనందాం. ఇంకా కావలసింది చాలా ఉంది. అందుకు చెయ్యవలసింది ఎంతో మిగిలే ఉంది, అన్న దృష్టి ఉండడాన్నే అవసరమైన అసంతృప్తి ఉండడం అనందాం. ఈ రెంటిని అవసరమైన పాళ్ళలో మేళవించుకోగలిగితేనే ఎవరైనా స్థాయికలిగిన కార్యకర్త కాగలుతారు. ప్రతి పని విషయంలోనూ ఈ వైఖరి అవసరమయ్యే ఉన్నా, పెద్దపెద్ద పనులకు, సమష్టి యత్నాలకు పూనుకునే వారి విషయంలో మాత్రం ఇదే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమవుతుంది.
జరుగుతున్న పని, థలవారీ లక్ష్యాల దిశగా కదలిక, లక్ష్యాలను ఒక్కటొక్కటిగా చేరుతుండటం (అధిగమించడం అంటారు దీనిని) ఆ పైవాటిని దాటుకుని అనంతర లక్ష్యాల దిశగా సాగిపోతుండటం (అతిగమించడం అంటారు దీనిని). ఇక్కడికి ఇది, పని ఆరంభమై, క్రమాభివృద్ధిగా కొనసాగుతుండడం అన్న థను సూచిస్తుంది. దీనిని గమనించి కొంతమేర తృప్తిని పొందుతూ ఉత్సాహాన్ని నింపుకుంటూ, ఇంకా మిగిలి ఉన్న పనిని, చేయాల్సిన లక్ష్యాలను చేస్తూనే తగినంత అసంతృప్తిని కలిగిఉండి లక్ష్యాన్ని చేరుకోవాలని, చేరుకోగలననే లక్షణాన్నే ఆశావహ దృక్పథం అంటారు.
6. నిత్యశంకితులు : అన్న మరోరకం వైఖరి కలవారుంటారు. నిజానికిది చాలా ప్రమాదకర వైఖరి, వ్యక్తిని ఏ విషయంలోనూ నిర్ణయాలకు రానీయకుండా అడ్డుపడుతుంటుందీ దృష్టి. ప్రతిదీ అనుమానమే. ప్రతి పనివిషయంలోనూ గుంజులాటే. ఆఫీసులో బయలుదేరే ముందు ఇంటికి చేరగలనంటావా? అన్న దగ్గరనుండి పరీక్ష పాసవుతానంటావా ? పరీక్ష రాయగలనో లేదో ? ఇంతకీ పరీక్షా హాలుకు సకాలంలో చేరగలనా ? లాటి సందేహాలెన్నో తామర తంపరగా పుట్టుకొస్తుంటాయి ఈ స్వభావులకు. ''సంశయాత్మా వినస్యతి'' అన్న గొప్ప సూక్తి ఇటువంటి వారిని చూడడం వల్ల పుట్టుకొచ్చిందే. ఈ రకం వాళ్ళు పని తనదైనప్పుడు నిరంతరం ఆందోళనకు లోనవుతూ, తారసపడ్డవాళ్ళను ఆందోళనకు గురిచేస్తుంటారు. అదేమరి పని తనది కానప్పుడిక మరింతగా చెలరేగిపోతూ, పనిచేయాలనుకుంటున్న, చేస్తున్న వారిలో కూడా అవసరమైన సందేహాలతోబాటు అనవసరపు సందేహాలనూ రేకెత్తించి వారినీ సందిగ్ధతలోకి నెట్టేయడానికి గట్టిగా కృషిచేస్తుంటారు.
ఒక ఉదాహరణ చెప్పుకుందాం :- కారు కొనుక్కుందామండీ అన్నది భార్య ! కొన్న వెంటనే ఏదైనా పాడైతేనో అన్నాడు భర్త. కంపెనీ వాళ్ళే మూడు సర్వీసులు ఉచితంగా చేస్తారండీ అన్నది భార్య. అలాగా అయితే సరే పద, అంటూ బయలుదేరి గడపదాటగానే, అది సరేగాని, మూడో సర్వీసు చేయించుకొని ఇంటికి వచ్చేటప్పుడు ఏమైనా అయితే ఇక ఉచితంగా చెయ్యరుకదా అన్నాడు భర్త. ఏమనాలో తెలియక జుట్టుపీక్కుంది భార్య. మిత్రులారా! నిత్య శంకితుని పోకడ అర్థమవుతుందా ? నిత్య శంకితుల్లోనూ మంచివాళ్ళుంటారు, చెడ్డవాళ్ళుంటారు, అంతర్ముఖులుంటారు, బహిర్ముఖులుంటారు. అందరూ పని మొదలెట్టకుండానో, మొదలెట్టనీయకుండానో చేయగలంతా చేస్తుంటారు నిజాయితీగానే.
7. ఆత్మన్యూనతా భావం : - తన సామర్ధ్యంపై తనకు సరైన అంచనా లేకపోవడం, తక్కువ అంచనా ఉండడంతో మొదలవుతుంది ఈ స్వభావానికి చెందిన వారి ప్రవర్తనంతా. నిజానికి ఒకపని చేయగల సమర్థత ఉన్నా లేదనుకుంటుంటారీరకం. ఈ స్వభావులు కనుక ఉద్యమ నేతృత్వ స్థానాలలో ఉంటే ఇక ఆ ఉద్యమం క్రమక్రమంగా చచ్చుబడిపోవడమే. నిత్య శంకితుల్లో ఎక్కువ భాగం ఆత్మన్యూనతా భావం కలవాళ్ళుండే అవకాశం ఉంది. ఈ స్వభావం కలవాళ్ళు వ్యక్తిగత జీవితంలోనే గాక, సమష్టి కార్యక్షేత్రాలలోనూ వనరులున్నా లేవనుకుంటుంటారు. ఉన్నా సరిపడవనుకుంటుంటారు. పనిచేద్దామనుకుంటుండే వాళ్ళలోనూ ఉత్సాహాన్ని నీరుగారుస్తుంటుంటారు. కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ గడిపేస్తుంటారు. అసమర్థ నాయకత్వానికి ఈ రకం అద్దం పట్టినట్లుంటారు. సమర్ధత వల్ల చేకూరిన నాయకత్వం కాదీరకానిది. పరిస్థితులు కట్టబెట్టిన నాయకత్వం మాత్రమే.
8. ఆత్మాధిక్యతా భావం ఉన్న వ్యక్తిత్వాలు :- వీరికి తాము అసాధారణులం అనిపిస్తుంటుంది. ఏపని గురించైనా అడగండి. అదెంతండి అయిపోతుందిలే అనేస్తుంటారు. అవగొట్టేయగలనని అనుకొంటుంటారు కూడా. ఆత్మన్యూనతా భావం కలవాళ్ళు చేయలేమేమోనన్న దృష్టితో పనినారంభించరు. ఆత్మాధిక్యతా భావం కలవాళ్ళు ఏ నిముషాన మెదలెట్టైనా చేయగలననుకుంటూ తగిన సమయంలో పని మొదలెట్టరు. సకాలంలో మొదలెట్టకపోవడమన్నది ఈ రెండు రకాల మూర్తిమత్వంలోనూ సమానమే. కాని అందుకు కారణాలు మాత్రం పూర్తి భిన్నమైనవి. ఒకరు నావల్ల - మనవల్ల - కాదు అనుకుంటూ ఆరంభించరు. ఆత్మాధిక్యతా భావం కలవాళ్ళు ఇంత చిన్నపనికి నా అంతటి వాడు ఇంత ముందునుండి శ్రమించాలా ? పిచ్చిపని. ముందు జాగ్రత్తలు అసమర్థులకవసరం. ఆఖరి నిమిషంలోనైనా పనికానిచ్చేయగల నాలాంటి వారికవి అనవసరపు పనులు అనుకుంటుంటారు.
వీరి నాయకత్వంలో కూడుకున్న పనులన్నీ ఆఖరి ఘడియలలో హడావిడిగా సాగుతుంటాయి. సాధారణ స్వభావులందరికీ ఇంకేపనులూ ఆరంభం కాలా, పూర్తి కాలా అన్న ఆందోళన కలుగుతుండగా వీరు మాత్రం అదెంత పనిలే అనుకుంటూ ప్రశాంతంగా ఉంటుంటారు. చివరి నిమిషంలో చేయగలంత చేసి ఇంతకంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు అనేయడం, సతికిలపడి తట్ట క్రింద పడేయటమో చేస్తుంటారు. ఉద్యమ క్షేత్రాలలో ఈ రెండు స్వభావాలూ ఉద్యమ ప్రతికూల శక్తులుగనో, వైఫల్యాలకు దారితీసేటివిగనో తమ పాత్రను పోషిస్తుంటాయి. కార్యకర్తలు, నాయకత్వం కూడా ఈ స్వభావాన్ని మార్చుకోవడమో, అదుపుచేసుకోవడమో చాలా అవసరం.
9. ఇట్టివారి జీవిత పుస్తకంలో ఎక్కువలో ఎక్కువ వైఫల్యాల చిట్టానే ఉంటుంది తెరచి చూస్తే. పంచతంత్ర కథలలోనూ విష్ణుశర్మ ఇలాంటి వైఖరి గలవాళ్ళ గురించి చక్కగా మనస్సుకు హత్తుకునేలా వివరించాడు,. దీర్ఘదర్శి, తత్కాల ప్రాప్తజ్ఞుడు, మందబుద్ధి అన్న పేర్లతో ఆ స్వభావుల్ని పేర్కొన్నాడు. ఒకడు ముందుచూపు కలవాడు. రెండవ వాడు సమస్య వచ్చి నెత్తిపై పడ్డాక ఆ చివరి క్షణంలో ఎలాగోలా బైటపడేవాడు. మూడవవాడు ఆ ప్రమాదాన పడి బాధలను భరించేవాడు లేక వ్యతిరేక ఫలాలను పొందేవాడు.
మొదటి వాడి కార్యక్రమమంతా ప్రణాళికాబద్దంగా ఉంటుంది. ఎప్పుడు చేయాల్సిందప్పుడు, ఎంతచేయాలో అంత, ఎలా చేయాలో అలా అన్న రీతిలో ఉంటుంటాయతని కార్యక్రమాలు. అందుకే అతణ్ణి దీర్ఘదర్శి (దూరం చూడగలవాడు) అన్నాడు కవి.
రెండవ వాడు మనం పైన చెప్పుకున్న ఆత్మాధిక్యతా భావం నుండి జనించిన వాయిదా మనస్తత్వం బలంగా ఉన్నవాడు. సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే, అనుకొనేవాడు. ఈ రకాన్ని గురించే చావుతప్పి కన్ను లొట్టపోయింది, తలప్రాణం తోకకొచ్చింది లాంటి నానుడులు (సామెతలు) పుట్టుకొచ్చాయి. ఉద్యమకారులకు ససేమిరా ఉండకూడని స్వభావమిది.
ఇక మూడవ వాడు మందబుద్ధి అంటే ఆలోచనా లేదు, క్రియాశీలతా లేదు అనన్నమాట. ఉద్యమాలు నామమాత్రావశిష్టంగా ఉంటున్నాయంటే అవి ఇలాంటి వాళ్ళవల్లే. సోమరులు వీరు. చేయవలసింది చేయకపోవటం, వచ్చినదాంతో సరిపెట్టుకోవడం, జడప్రాయంగా సాగిపోతుండటం ఈ రకం వారి చేష్టలే.
10. చపల చిత్తులు : ఒక పనినంటిపెట్టుకోరు. ఏ పనిని వదిలిపెట్టరు ఈ రకం స్వభావులు. ప్రతి దాంట్లోనూ వేలెడతారు. ఏ పని పూర్తిచేయరు. నిర్థిష్ట లక్ష్యం లేని తనం ఈ రకం వారిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. 'జాక్ ఆఫ్ ఆల్ - మాస్టర్ ఆఫ్ నన్' అన్న సూక్తి ఇట్టివారిని దృష్టినిడుకుని పుట్టింది. ఈ రకం వారిలో కొందరు ప్రతి పనిలో తానున్నానిపించుకోవటానికి కనపడుతుండగా. మరికొందరు అన్నిచోట్లా ఎంతో కొంత క్రియాశీలురుగా ఉంటూఉంటారు. అన్ని చోట్లా క్రియాశీలంగా ఉండాల్సి రావటంతో ఎక్కడా క్షణం తీరిక లేకుండా నానా హైరానా పడుతుంటారు. శక్తికి మించి శ్రమిస్తుంటారు. నిజానికది ఎక్కువలో ఎక్కువ సార్లు ఫలితం లేని శ్రమగనే పరిణమిస్తుంటుంది. కొందరు కుటిల మేధావులుగానీ, స్వార్థపరులుగానీ, ఇట్టివారిచేత తమకు అవసరమైన పనులు (నానా చాకిరీ) చేయించుకుంటుంటారు. అవసరం లేదనుకున్నప్పుడు వదిలేస్తుంటారు.
11. మంచిపనులు చేసేవారిలో రెండు రకాల వాళ్ళుంటారు. ఒకరు మంచివాళ్ళనిపించుకోవాలన్న కాంక్షతో మంచిపనులు చేసేవారు కాగా, రెండోవారు ఆవలి వాళ్ళకు మంచిజరగాలన్న దృష్టితో మంచి పనులు చేస్తుండేవారు. వీరిద్దరూ మంచిపనులే చేస్తుంటారు గాని, వీరి లక్ష్యాలు - ఆకాంక్ష, కోర్కెలు మాత్రం భిన్నమైనవి.
ఒకరి లక్ష్యం కీర్తి (ప్రసిద్ధి). మరొకరి లక్ష్యం లోకహితం. కనుక ఎవరికి వారు తామనుకున్నది సాధించేదాకా కృషిచేస్తుంటారు. సాధించినపుడు తృప్తిపడతారు. ఈ ఇద్దరిలో మొదటివానికి కీర్తి గనక రాకపోయిందా, ఇక ఆపని, అదెంత మంచిపనైనా నిస్సంకోచంగా అర్థాంతరంగానైనా ఆపేస్తారు. వదిలేసి వెళ్ళిపోతారు. ఆవలి వారి లాభనష్టాలతో గానీ, సాధక బాధకాలతో గానీ అతనికంతగా పనిలేదు. తానేమిటి, తన స్థానమేమిటి ?అన్న ధ్యాసే ప్రధానంగా ఉంటుంది. రెండోవానికీ పొగడ్త, గుర్తింపులన్నవి ఆనందాన్ని కలిగిస్తూనే ఉన్నా, అతని దృష్టిమాత్రం అనుకున్న పని అయ్యిందా, జనులకు జరగవలసిన మేలు జరిగిందా? అన్నదగ్గరే ఉంటుంది. ఆ మేలు వారికి అనుకున్నంత మేర అందేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడు. అందినప్పుడే తృప్తినొందుతాడు. ఒకరి లక్ష్యం గుర్తింపు కాగా, మరొకరి లక్ష్యం జనహితం. శోచనీయమైన విషయమేమంటే ఈనాడు ఉద్యమ క్షేత్రాలలో గుర్తింపు కొరకు పనిచేసేవారే, గుర్తింపు వస్తేనే పనిచేద్దామనుకునే వారే అధికాధికంగా ఉంటున్నారు.
మరికొందరైతే పనిచేయకుండానే గుర్తింపు రావాలనుకుంటున్నారు. ఇట్టివారినీ ఉద్యమ సంస్థలలో నేను చూస్తూవస్తున్నాను. ఆయా పదవుల్ని ఆక్రమిస్తారు ఎలాగోలా. ఆపై ఆస్థానానికి తగిన పనిచేయరు. ఆపదవినీ వదిలిపెట్టరు. వీరిలో అగ్రేసరులు కొందరున్నారు. ఒక్కొక్కరూ 5,6 సంస్థలలో ఏదో ఒక పదవిని పట్టేసుకుంటారు. ఏ పనీ చేయరు. ఏ పదవినీ వదలరు. నిజానికారకం ఉద్యమాలకు భారభూతులు. తాము చేయరు. చేసేవానిని రానీయరన్న మాట. ఈనాడు ఎక్కువ ఉద్యమ క్షేత్రాలు నామమాత్రంగా ఉండడానికీ, అరకొరగా పనిచేస్తుండడానికీ, ఉద్యమాలలో ఈరకం వారు చొరబడి ఉండడమూ బలమైన కారణమే.
ఆ ఉద్యమ సంస్థలలోని కొందరు బాధ్యులు కూడా అంతో ఇంతో ప్రసిద్ధి ఉన్నవాళ్ళను ఎక్కడోచోట తమ సంస్థలలో చొరబెట్టుకుని వారి ప్రసిద్ధిని తమ సంస్థ ప్రయోజనాలకు వాడుకుందామనుకుంటారు. అంటే నలుగురికీ తెలిసిన మనుషుల్ని చూపించి సంస్థకు పేరు సంపాదిద్దామని కాబోలు. ఊరుపేరు చెప్పి కాయలమ్ముకోడం అన్న సామెత ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని వచ్చినదే. ఆరోగ్యవంతమైన ఉద్యమాలు ఇలాంటి ఎత్తుగడల జోలికి పోకూడదు. పోవు.
దకక్షులైన పథాధికారులు - దకక్షులైన కార్యకర్తలు
1. దక్షత : - అవసరమైన అంశాలకు సంబంధించి తగినంత అవగాహన, సంసిద్ధత (దృఢదీక్ష), కార్యకుశలత అన్న మూడింటి సామర్ధ్యాల కూడికను దక్షత అంటారు. ఆ మూడు ఉన్నవాడు దకక్షుడవుతాడు.
2. పథాధికారులు : - కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసి, మార్గోపదేశం చేసి నడిపించే వాళ్ళను పథ+అధికారులు అనంటారు.
3. కార్యకర్తలు :- తాము చేస్తున్న పని ఎందుకు చేస్తున్నదీ తెలిసి, ఐచ్ఛికంగా - తనకుతాను ఇష్టపడి - పనికి పూనుకున్నవాడు కార్యకర్త. కర్తుత్వం వహించేవాడు కార్యకర్త. స్వతంత్రాలోచనాశీలత అన్నది కార్యకర్తకుండాల్సిన ముఖ్య లక్షణం. దకక్షులైన పథాధికారులూ, దకక్షులైన కార్యకర్తలూ తగినంతమంది కూడిఉన్న ఉద్యమాలే - యత్నాలే - సఫలీకృతమవుతాయి.
ఈ ఇరువురిలో ఎవరు లేకున్నా, తగినంత మంది లేకున్నా అనుకున్న పనులు అనుకున్నట్లు జరగవు. దక్షత అన్నది పుట్టుకతో వచ్చేది కాదు. అధ్యయనం వల్ల అవగాహన, దాని ననుసరించిన ప్రణాళిక వల్ల సంసిద్ధత, ఆరెంటి వూతంగా గట్టిగా, శ్రద్ధగా పొందిన శిక్షణ వలన కార్యకుశలత జనిస్తాయి. కనుక దక్షత అన్నది అభ్యాసవశమైనది. కనుక యోగ్యమైన - అంటే వివేక మూలకమైన - ఏ ఉద్యమాలైనా దకక్షుల్ని ఉత్పత్తిచేసుకొనే పనికి పెద్దపీట వేయాలి. ఆ ఉద్యమాలూ దీర్ఘకాలిక కార్యాచరణ అవసరమైన లక్ష్యాలతో కూడినవైతే, దకక్షుల ఉత్పత్తి ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతుండేలానూ వ్యవస్థ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది.
మిత్రులారా ! సమీక్ష అన్న నెపంతో ఉద్యమ క్షేత్రాలకు అవసరమైన కొన్ని మౌలికాంశాల ప్రస్థావన చేశానీవ్యాసంలో. మరికొన్ని విషయాలూ ఈ సందర్భానికి సంబంధించే చెప్పుకోవాలనిపిస్తున్నా స్థలాభావము, విషయ గాంభీర్యత దృష్ట్యా ఇప్పటికి, ఇక్కడికి ఆగుతున్నాను. నా అవగాహనను అనుసరించి ఉద్యమ క్షేత్రాలలో సారధ్య బాధ్యతలు వహించేవారు పై విషయాలన్నింటినీ ఆకళింపుచేసుకొని, కార్యకర్తలలో రావలసిన అవసరమైన మార్పులకు తగిన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది. ఉద్యమంలో ఉన్నవారందరి దృష్టికీ ఈ అంశాలను తీసుకువచ్చి, ఎవరికి వారుగా తామెటువంటి వైఖరికి చెందిన వాళ్ళుగా ఉన్నది, ఆత్మ పరిశీలన చేసుకొని, ఉద్యమ ప్రయోజనాలకు అనుగుణ్యమైన వైఖరిని అలవర్చుకొనేలా ప్రోత్సహించాల్సి ఉంది.
మన ఐక్యవేదికలోనూ, ఐక్యవేదికలోని భాగస్వామ్య సంస్థలలోనూ పై రకాల వాళ్ళంతా లేదా కొన్ని రకాల వాళ్లైనా ఉండే వీలుంది. మన వేదికే కాకుండా, ఏ సంస్థకాసంస్థా కూడా ఈ విషయమును బట్టి, తన సంస్థను ఆరోగ్యంగా, బలంగా రూపొందించుకొనే యత్నం చేసుకోవలసి ఉంటుంది. ఇందులోనుండి ఖచ్చితంగా ఉద్యమావరోధకంగా అయ్యేరకాన్ని వేరుచెయ్యడం, అనుకూలంగా మార్చుకోవలసిన విషయాలను పట్టుబట్టి మార్చుకోవడం నిరంతరాయ ప్రక్రియ కావాలి. అట్టిఉద్యమాలే అనుకున్న దిశగా ప్రయాణము సాగించడమూ, థల వారీగా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ సాగిపోతుండటమూ చేయగలుగుతాయి. ఒక్కమాట...
యోగ్యులైన కార్యకర్తలున్న ఉద్యమం యోగ్యమైన ఉద్యమం. అలాగే
యోగ్యులైన పౌరులున్న సమాజం యోగ్యమైన సమాజం. కనుక
యోగ్యుల్ని తయారుచేయడమన్నదానిపైనే పునర్నిర్మాణ కార్యక్రమమంతా ఆధారపడి ఉంది.
మననుమనం యోగ్యులుగా రూపొందించుకోవడమన్నదే అన్నిటికంటే కీలకము, మౌలికమూ కూడా. అలాగే ఆరోగ్యము - బలముల కూడికే దక్షతకు ప్రాతిపదిక. దక్షతే యోగ్యతకు కొలత. ఆలోచించండి. ఎటుకదలాలో, ఎలా కదులుదామో ఒక ఖచ్చితమైన, ధృఢమైన నిర్ణయానికి రండి.
ముగింపు :
1. నా అవగాహన ప్రకారం ఐక్యవేదిక కార్యక్రమాలన్నీ ఎంతోకొంత కృషిలోపంతో కూడుకొని ఉన్నాయి.
2. ఈ నిజాన్ని గుర్తించాలంటే ఐక్యవేదికలోని వ్యక్తుల్ని కొన్ని సముదాయాలుగా విడగొట్టి అర్థంచేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థలు :
1.రెండు ఐక్యవేదికలలోని సంస్థలన్నింటినీ పూర్వ భాగస్వామ్య సంస్థలనందాం.
2. క్రొత్త ఐక్యవేదికలో పాల్గొనడానికి ముందుకొచ్చిన సంస్థల సముదాయం.
3. ఐక్యవేదిక రిజిష్టరు బాడీలో చోటుచేసుకున్న సంస్థలు.
4. ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉండి ఐక్యవేదికలోకి వస్తామన్న, వచ్చిన సంస్థలు.
5. వీటన్నింటిలోనుండి ఐక్యవేదిక ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఆయా జిల్లాల బాధ్యతలు స్వీకరిస్తామన్న సంస్థలు.
గమనిక : - సంస్థల పరంగా ఇలా విభజించి వారువారు (ఆ సంస్థలు) చేయాలనుకున్న, చేస్తానన్న పనులేమిటి ? అవి చేసిన పనులేమిటి ? అన్న వాటిని విచారించాలి.
కమిటీలు :
రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు :
1. రాష్ట్ర కమిటీలో ఉన్న సంస్థలు.
2. రాష్ట్ర కమిటీ కార్యవర్గం.
3. రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గం.
4. రాష్ట్ర కమిటీ మొత్తం కలిపి.
జిల్లా కమిటీలు :
1. జిల్లాలో ఐక్యవేదికలో ఉన్న సంస్థలు.
2. జిల్లా కమిటీ కార్యవర్గం.
3. జిల్లా కమిటీ మొత్తం.
గమనిక : - డివిజను, మండల కమిటీలుంటే వాటినీ పరిశీలించవచ్చు.
శిక్షణ బృందాలు :
1. రాష్ట్ర స్థాయిలో శిక్షకులుగా శిక్షణ పొందినవారు.
2. శిక్షణ పొందినవారు.
3. శిక్షణా తరగతులలో శిక్షకులుగా సిద్ధపడినవారు.
4. ప్రచారానికి సమయమివ్వగలవారు.
5. స.హ. చట్టంపై ఐక్యవేదిక కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు.
ఈ సముదాయాలు ఐక్యవేదిక లక్ష్యాల సాధనలో చేయవలసిఉన్న పనులు, స్వీకరించాల్సి ఉన్న బాధ్యతలు అవి ఇప్పటివరకు నిర్వహించిన పాత్ర.
జరిగిన 4,5 తేదీల సమావేశాలపరంగా ఈ సముదాయాలు చేయాల్సిన కృషి ఏమిటి? అందులో చేసిందెంత ?
రాష్ట్ర కేంద్రం ఆరోగ్యంగా, బలంగా ఉండి నిర్వహిస్తుండాల్సిన పాత్ర - ఇప్పటికి నిర్వహించగలిగిన పాత్ర, నిర్వహించిన పాత్ర.
మానవ వనరులు, ఆర్థిక వనరులు సమకూర్చుకొనే విషయంలో పై సమూహాలు నిర్వహించాల్సిన పాత్ర, నిర్వహించిన పాత్ర.
మిత్రులారా ! ఇవీ ఇలాంటి మరికొన్ని కలిపి ముందుంచుకొని సమీక్షా కార్యక్రమాన్ని జరుపుకుంటే ఐక్యవేదిక ఇప్పటి పరిస్థితి ఏమిటో నిక్కచ్చిగా తేలుతుంది. అప్పుడుగాని అటుపై ఉద్యమ లక్ష్యాలకనుగుణ్యంగా భవిష్యత్ కార్యాచరణ ఎలా రూపొందించుకోవాలో అర్థం కాదు.
సమీక్షలో భాగంగానే జిల్లా సమీక్షా సమావేశాలు జరుపుకోవాలనుకున్నాం. జూలై నెల 15 లోపు జరుపుకుంటే బాగుంటుందనుకున్నాం. కాదంటే జూలై 20 లోపైనా అవి పూర్తికావాలి.
శిక్షణ తరగతులను రెండు స్థాయిలలో జరుపుకుంటే బాగుంటుందని రాష్ట్ర కమిటీ అభిప్రాయ పడింది.
1. ప్రాథమిక శిక్షణ. 2. ఉన్నత శిక్షణ. అందుకై మూడంచెల కార్యక్రమాన్ని సాగిద్దామనుకున్నాం.
1. మండల స్థాయి అవగాహనా సదస్సు :- మండలం లోని గ్రామాలనుండి వీలయినంత ఎక్కువ మందిని సమావేశపరచి వారికి ఒక రోజు కార్యక్రమంగా ఎ) స.హ.చట్ట వినియోగం, బి) రాజ్యాంగం - కనీస అవగాహన అన్న విషయాలు వివరిస్తూ, ఐక్య వేదికను పరిచయం చేయటం చేయాల్సి ఉంటుంది.
2. ప్రాథమిక శిక్షణా తరగతి :- రెండు రోజులుంటుంది (అవకాశమున్న వాళ్ళు మూడు రోజులూ పెట్టుకోవచ్చు).
ఎ) ఐక్యవేదిక పరిచయం, బి) ప్రేరణ, సి) స.హ.చట్టం - దాని వినియోగం, డి) రాజ్యాంగం - స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు అన్న అంశాలపై అవగాహన కలిగించడం, కొద్దిగా, వచ్చిన వారిచే మాట్లాడించడం జరగాలి ఈ తరగతుల్లో.
గమనిక : - విద్యాలయాల లోనూ ఈ రెండు రకాల సమావేశాలు జరిపి, విద్యార్థి, యువతను మేల్కొలపాలనుకన్నాం. అందుకై వారికొరకు ప్రత్యేకంగా బోధనాంశాలను రూపొందించాల్సి ఉంది.
ఉన్నత శిక్షణ లేదా శిక్షకులు - ప్రచారకులు కాగోరిన, కాగలవారికై శిక్షణ. ఇది మూడురోజులుంటుంది. శిక్షణకు రాదలుచుకున్న వారు ముందుగా బోధనాంశములను చదువుకొని రావలసి ఉంటుంది. ఈ తరగతులలో చెప్పేవారికంటే వినేవారే (శిక్షణ పొందేవారే) ఎక్కువ పాత్ర పోషణ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎ. ప్రసంగ నైపుణ్యాలు, బి. ప్రేరణ, సి. ఐక్యవేదిక, డి. స.హ.చట్టం, ఇ. రాజ్యాంగం, ఎఫ్. ఉద్యమ లక్ష్యాలు సాధన అన్నవి బోధింపబడి, అభ్యాసం చేయించబడతాయి.
గమనిక : - అక్టోబర్ నాటికి 1000 మందికి ప్రాధమిక శిక్షణ, మరో 100 మందికి ఉన్నత శిక్షణ గరపాలన్నది లక్ష్యంగా పెట్టుకోవడం బాగుంటుందనిపిస్తోంది. ఇప్పటికి సుమారు 300 మందికి శిక్షణ గరిపాము. సుమారు 30 మంది శిక్షణ గరపగలిగే సామర్ధ్యం ఉన్నవారు తయారైనారు.
ఐక్యవేదిక ఆర్థిక వనరుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కొంతమంది పెద్దలు జిల్లా వ్యయభారం మోస్తామని వాగ్దానం చేశారు. ఆర్థికాంశాలకు ఒక వ్యవస్థ నిర్మాణం కావలసి ఉంది. తక్షణ, జరుగురు కార్యంగా దీనిని పెట్టుకుని, రాష్ట్ర, జిల్లా నిధికై బ్యాంకు ఖాతాలను ప్రారంభించుకొని నిధిని సేకరించుకోవలసి ఉంది.
ఉద్యమాలు, కార్యకర్తలు స్థబ్దతకు లోనుకాకుండా ఉండాలంటే, కార్యక్రమాలు ఒక క్రమంలో ఒకదానివెంట ఒకటి వ్యవధానం లేకుండా జరుగుతుండేలా ఉద్యమ సారధులు కార్యాచరణ ప్రణాళికను అందిస్తూ ఉండాలి. ఒక వంక ఉద్యమ నిర్మాణం, మరోవంక ఉద్యమ కార్యాచరణ ఆచరణ లో ఉంటూ పరస్పర పూరకాలుగా పనిచేసుకుంటూ సాగుతుండాలి.
ఉద్యమ సారధ్యబృందాలకు (రాష్ట్ర బృందం, జిల్లా బృందాలు) జరిగిన, జరుగుతున్న, జరగాల్సిన కార్యక్రమాలకు చెందిన చిత్రమంతా విస్పష్టంగా కనపడుతుండాలి.
కార్యకర్తలకు, సారధ్య బృందాలకు మధ్య చక్కని సమన్వయం కుదరాలి. అలాగే రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికీ మధ్య బలమైన అనుసంధానం, సమన్వయం ఏర్పరచుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర కమిటీనే చొరవ తీసుకోవాలి.
శిక్షణగరిపే బృందం, ప్రచారం చేసే బృందం పనులను పంచుకొని ఎవరి క్షేత్రాలలో వారు క్రియావంతులు కావాలి.
ఈ థలో ప్రచార కార్యక్రమం ముమ్మరంగా సాగాల్సి ఉంది.
1. రాష్ట్ర ప్రచార బృందం, 2. జిల్లా ప్రచార బృందం, 3. విద్యాలయాల ప్రచార బృందం అన్నరీతిలో ప్రచార బృందాలు ఏర్పడాలి.
ఆర్థిక వనరులు, ప్రచార సామాగ్రి అన్న రెంటిని సమకూర్చుకోవటం ఈ థలో అత్యవసరం. ఎవరి వంతు కర్తవ్యాలను వారు బాధ్యతతో నెరవేర్చితేనే ఈ ఉద్యమం అనుకున్న దిశగా కదలగలుగుతుంది. అలా చేయలేకుంటే, నేనూ ఉన్నాను అనుకోడానికి మాత్రం పరిమితమై, ఉనికిని మాత్రం నిలుపుకునేదిగా మారిపోతుంది.
పనే ఫలితాన్ని పుట్టిస్తుంది. ఎట్టిపని అట్టి ఫలితాన్నే పుట్టిస్తుంది. సరైన పనే సరైన ఫలితాల్ని పుట్టించగలదు. సమాచార హక్కు ప్రచార ఐక్యవేదికలో కృషిలోపం జరిగింది, జరుగుతోందన్నది ఒక చేదునిజం. ఎవరికి వారం అందరం ఈ నిజాన్ని గుర్తించి, చేయగలంత కృషి బాధ్యతతో చెయ్యడానికి సిద్ధపడితే తలపెట్టిన కార్యం అసాధ్యం కాదు. జన బాహుళ్యానికీ, బడుగు జీవితాలకు ఎంతో మేలొనర్చగల ఈ ఉద్యమానికి చేయూతనివ్వడం, భాగస్వాములు కావడం బాధ్యతాయుతులమైన పౌరులంగా మనందరి విద్యుక్త ధర్మం.
1. లేవండి ! మేల్కొనండి. గమ్యం చేరే వరకు విశ్రమించకండి.
2. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్థులై
యారంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగచున్ దృత్యన్నతోత్సాహులై
ప్రారబ్దార్థములుజగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.
3. లక్ష్యశుద్ధిగల దృఢవ్రతులు లక్ష్య సాధన క్రమములో ఎదురయ్యే ఎంతటి లాభాలను గానీ, ఎంతటి నష్టాలను గానీ పట్టించుకోరు. అనుకున్నది నెరవేరేదాకా లక్షైకయత్నాలై సాగుతుంటారు.
4. మంచివాళ్ళు, సంఘటితం కాగలిగితే అసాంఘిక శక్తులను అదుపుచేయటం సాధ్యమవుతుంది.
కలసిపోదాం కలుపుకు పోదాం చేయందిద్దాం చేయందుకుందాం.
పునరుత్సాహంతో, జరిగిన పొరపాట్లు మళ్ళా జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యమ లక్ష్యాల సాధనకై పూనుకుందాం.
ఉద్యమాభినందనలతో
మీ ఐక్యవేదిక.
No comments:
Post a Comment