వర్ణాంతర వివాహ కుటుంబాలు సాంఘికశక్తిగా రూపొందాలి
లవణం విజ్ఞప్తి
నేడు సమాజం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. రోజురోజుకూ సాంఘిక విలువలు, నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. దీనికి ఒక ప్రక్క ప్రపంచీకరణ, అంతర్జాతీయ పెట్టుబడిదారీ మార్కెట్ విస్తరణ వాదం కారణమైతే మరొకప్రక్క స్తానికంగా అవినీతి, సంకుచితత్వం కారణాలవుతున్నాయి. వ్యక్తికి విలువ పడిపోతోంది. రాజకీయ, ఆర్థిక సమస్యలను సాంఘిక దృక్పథముతో పరిష్కరించవలసినదిపోయి, సాంఘిక సమస్యలకు రాజకీయ, ఆర్థిక పరిష్కారాలు మాత్రమే ప్రతిపాదిస్తున్నారు. సాంఘిక, నైతిక విలువల పతనంతో సమాజంలో ఒకప్రక్క సామాజిక ఐక్యత దెబ్బతింటూ వుంటే మరొకప్రక్క అసాంఘిక శక్తులు బలపడుతున్నాయి.
ఈ పరిస్థితులలో ఆర్థిక, రాజకీయ, పరిపాలనా శక్తులకు భిన్నంగా కులం, మతం వంటి అన్ని సంకుచితతత్వాలకు అతీతంగా ఒక సాంఘిక శక్తి అవసరం. ఇందుకు వర్ణాంతర, మతాంతర వివాహ కుటుంబాలు చక్కటి సాధనం. వారు కులాన్ని, మతాన్ని దాటి మానవీయ దృష్టితో ప్రేమకు కులం, మతం లేవని నిరూపిస్తున్నారు. మరొకప్రక్క కొంతమంది కులరహిత, మతాతీత సమాజస్థాపన ధ్యేయంగా పెట్టుకుని ఆదర్శ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమించి కులాన్ని, మతాన్ని దాటినా, ఆదర్శం కోసం కులాన్ని, మతాన్ని దాటినా అలా వివాహం చేసుకున్నవారు కులాన్ని, మతాన్ని దాటిన ఒక విశాల సమాజంలో సభ్యులవుతున్నారు. అయితే వారు ముందుకు వచ్చి అటువంటి ఒక విశాల సమాజ నిర్మాణానికి పూనుకోవడం లేదు. అంతేగాక, ప్రేమించి పెండ్లు చేసుకున్న కొందరు తమది వర్ణాంతర, మతాంతర వివాహం అని కూడా చెప్పుకోడానికి ఇష్టపడడం లేదు. అలాగే తమ పిల్లల వివాహాలు వచ్చేసరికి వాళ్ళను తండ్రి కులంలోనో, తల్లి కులంలోనో ఇమిడ్చివేయాలని ప్రయత్నిస్తున్నారు. మరోప్రక్క కుల నిర్మూల ధ్యేయంగా సెక్యులర్ సమాజాన్ని నిర్మించవలసిన ప్రభుత్వ వ్యవస్త కులాల పేరుతోనే అవకాశాలు యిస్తూ, కులాల సమాజాన్నే బలోపేతం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు సాంఘిక, నైతిక విలువలకు దూరమవుతున్నప్పుడు కులము, మతమే వారికి ఓట్లు తెచ్చిపెట్టుటకు సాధనాలుగా కనిపిస్తున్నాయి. అందుచేత ప్రజాప్రతినిధుల్లో కొందరు ప్రేమించి వర్నాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారు వున్నా, వారు సాంఘిక సమైక్యతకు తోడ్పడలేకపోతున్నారు. ఈ స్థితిలో వర్ణాంతర వివాహాలు చేసుకున్న వేలాదిమంది ముందుకువచ్చి తాము కులరహిత మతాతీత సమాజానికి పునాదులమని నిర్భయంగా చెప్పుకోవలసిన అవసరముంది. అందుకు మనం ఒక సామాజిక శక్తిగా రూపొందాలి. వివాహం ఒకప్రక్క వ్యక్తిగత విషయమైతే, మరొకప్రక్క సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థకి శుభారంభం. అందుచేత మా వివాహం వ్యక్తిగతం అనడానికి వీల్లేదు. వివాహంతో కుటుంబాన్ని ప్రారంభిస్తున్నాం. కుటుంబం సమాజ వ్యవస్థకి మూలం. సమాజ వ్యవస్థ విలువల నుంచి పతనమవుతున్నప్పుడు కుటుంబం కూడా దిగజారిపోతుంది. అందుచేత మనం ప్రేమమీద, ఆదర్శంమీద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు సమాజం కూడా పరస్పర ప్రేమ, పరస్పర సహకారంతో నడిచేటట్లు చూడవలసిన బాధ్యత వర్ణాంతర వివాహం చేసుకున్నవారి మీద వుంది. కనుక మనం ఒక స్వచ్ఛంద సామాజిక శక్తిగా రూపొందుదాం. సమాజ పునర్నిర్మాణానికి మనవంతు బాధ్యత మనం నిర్వహిద్దాం.
ఈ దృష్టితో, నా చిరకాల మిత్రుడు, లక్ష్మిని వర్ణాంతర వివాహం చేసుకుని, భార్యతో కలసి జీవితాంతం కులనిర్మూలన కోసం పాటుపడి, తన పిల్లలకు కూడా వర్ణాంతర వివాహాలు చేసిన కీ||శే|| వి. నాగేశ్వర్ స్మృతిలో, కనీసం ఒక వెయ్యిమంది వర్ణాంతర వివాహ కుటుంబాలను సమాజం ముందు ఒక పుస్తక రూపంగా పెట్టాలని శ్రీమతి వి. లక్ష్మీ నాగేశ్వర్, నేను పూనుకుంటున్నాము. దీనికి ప్రధాన బాధ్యత నేను తీసుకున్నాను. అందుచేత వర్ణాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారు తమ కుటుంబం గురించి వివరాలన్నీ తెలుపుతూ తమ పూర్తి చిరునామా, ఫోన్, మొబైల్, ఇ-మెయిల్ అడ్రస్సు మొదలైన వాటిని నాకు తెలియజేయవలసినదిగా కోరుతున్నాను. తమ పుట్టిన తేదీలు, విద్యార్హతలు, తాము చేస్తున్న వృత్తి/ఉద్యోగం, తమ వివాహం ఎలా జరిగింది; అడ్డంకులు వస్తే ఎలా అధిగమించారు, మీ పిల్లలు ఏమి చేస్తున్నారు, వారికి వివాహాలైతే వారి వివాహాలు ఎలా చేశారు? మొదలైన వివరాలు తెలుపుతూ మీ కుటుంబం ఫొటో కూడా పంపవలసిందిగా కోరుతున్నాను. మనం సామాజిక సమతా సమరయోధులమని నేను భావిస్తున్నాను. అందుచేత యోధులైన మనం మన వీరత్వానికి గర్వపడాలి. ఇతరులు మన వీరత్వాన్ని గుర్తించేట్లు చేసుకోవాలి. సంకుచిత పరిధులను మనం త్యాగంచేసి ముందుకు పురోగమిస్తూ నూతన సమసమాజ నిర్మాణానికి తోడ్పడాలి. అందుకు మనం ఒక శక్తిగా రూపొందడానికి ముందు మనం పరస్పరం ఒకరికొకరం తెలియడం కోసం ఈ వర్నాంతర వివాహ కుటుంబాల పరిచయ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాము. మీరేగాక ఇలా వివాహాలు చేసుకున్న మీ స్నేహితులను కూడా తమ వివరాలు పంపమని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి ఈ పరిచయాలతో మనం సన్నిహితం అయిన తరువాత ప్రతీ జిల్లాలో నిర్వహించగలమని మనవి చేస్తున్నాను. మీ అందరి సక్రియ సహకారాన్ని ఆహ్వానిస్తున్నాను.
స్వాతంత్ర సమరయోధునిగా మాత్రమేగాక, సాంఘిక సమరయోధునిగా తోటి సాంఘిక సమతా సమరయోధులందరికీ నా శుభాకాంక్షలు.
ఇట్లు, మీ లవణం.
No comments:
Post a Comment