Tuesday, August 9, 2016

చింతనాశీలి ఎన్‌.వి.బ్రహ్మం



సత్యాన్వేషణ మండలి ఆంతరంగికుల్లో ఒకరైన శ్రీ ఎన్‌.వి.బ్రహ్మం గారి ప్రథమ వర్థంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ మిత్రులు శ్రీ గవిని వెంకట స్వామి గారు వ్రాసి పంపిన వ్యాసాన్ని యధాతథంగా ప్రచురిస్తున్నాము.

గమనిక : భావాల విషయంలో ఎవరితో మేము విబేధిస్తూ ఉన్నా అట్టివారు ఉద్యమ చరిత్రలో నిర్వహించిన పాత్ర విషయంలో వాస్తవాలు గమనించటానికి, స్వీకరించటానికి, ప్రకటించటానికి ఎట్టి భేషజాలు లేకుండా మండలి సిద్ధంగా ఉంది. ఇక ముందూ ఉంటుంది కూడా. ఆ క్రమంలో హేతువాద ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ముఖ్యులలో వెంకటాద్రి గారిని, బ్రహ్మం గారిని ముందు స్థానాలలో ఉన్నవారుగా మండలి పరిగణిస్తోంది 

- ఎడిటర్‌.
"To be radical is to take things by the root. The root for man, however is man himself'". ` Karl Marx


ఏ సాంఘిక విప్లవం సఫలంకావాలన్నా ముందుగా, లేదా కనీసం సమాంతరంగానైనా తాత్విక విప్లవం - భావవిప్లవం తప్పనిసరిగా రావలసి వుంటుందని, 1937లో జైలు నుండి విడుదలైన వెంటనే, మానవేంద్రనాథ్‌ రాయ్‌ ప్రకటించాడు. ఒకవేళ అలా జరక్కుండా పైనుంచి సంస్కరణలను, విప్లవాలను బలవంతంగా రుద్దితే, ఆ మార్పు ఎంతో కాలం నిలబడదని అనుభవపూర్వకంగా రాయ్‌ గ్రహించాడు. ఇది ప్రపంచ చరిత్ర నేర్పిన పాఠం కూడా.

1946లో రాయ్‌ నిర్వహించిన చరిత్రాత్మకమైన డెహ్రాడూన్‌ అధ్యయన శిభిరంలోనే నవ్యమానవవాదం అనే నూతన తత్వశాస్త్రం రూపుదిద్దుకుంది.  ఆ అధ్యయన పాఠశాలకు హాజరైన కొద్దిమంది జిజ్ఞాసువుల్లో బ్రహ్మం ఒకరు. ఈ అనుభవం బ్రహ్మం జీవితాన్ని మార్చివేసింది. ఇటు జాతీయవాదానికి, అటు కమ్యూనిజానికి ప్రత్యామ్నాయంగా మానవవాదం మూడవ మార్గంగా వికసిస్తూవచ్చింది. హేతువాదిగా త్రిపురనేని రామస్వామి రచనలతో ప్రభావితుడై, కవిత్వం చెప్పుకుంటున్న బ్రహ్మానికి ఈ సమావేశం కనువిప్పు కలిగించింది. జాతీయవాదంలోని సంకుచితత్వం గురించి తెలియటమే గాక, మార్క్సిజం మానవజీవితానికి ఎలా చాలనిదవుతుందో, వర్తమాన ప్రపంచ సమస్యల్ని పరిష్కరించటంలో విఫలమైన తీరు బ్రహ్మాన్ని ఆలోచింపజేసింది. కేవలం పురాణ సంప్రదాయాన్ని వ్యతిరేకించటానికి పరిమితమైన తన నాస్తిక - హేతువాద దృక్పథానికి, ఎం.ఎన్‌.రాయ్‌ ఉపన్యాసాలతో ఒక తాత్విక భూమిక సమకూరినట్లయింది. జాతీయవాదం కమ్యూనిజం కూడా సమష్టితత్వాలు కావడమే గాక, అవి వ్యక్తిస్వేచ్ఛను మన్నించవు. కనుక ఆ మేరకు అవి మానవత్వ విలువలకు, ప్రజాస్వామ్యస్ఫూర్తికి వ్యతిరేకమే.

పేదరికంలో పుట్టి పెరిగిన బ్రహ్మం గుంటూరు ఎ.సి. కాలేజిలో ఇంటరు చదువుకు స్వస్తిచెప్పి, ఇరవయ్యేళ్ళ వయసులో బ్రతుకుతెరువు కోసం, మద్రాసులో కొత్తగా ప్రారంభించిన ''విజయప్రభ'' దినపత్రికలో ఉపసంపాదకుడిగా జీవితం ప్రారంభించాడు. కొద్దికాలంలోనే ఆ పత్రిక మూతపడింది. అనంతరం తన స్వతంత్ర ప్రవృత్తికి అనువైన ఉపాధ్యాయవృత్తి చేపట్టి చీరాల పట్టణంలో మనీషా విద్యావిహార్‌ను స్థాపించాడు. రెండు దశాబ్దాలపాటు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ మానవవాద ఉద్యమ కార్యాచరణకు అంకితమయ్యాడు. 1955-75 మధ్య ఆ పాఠశాల ప్రాంగణం వైజ్ఞానిక, తాత్విక చర్చలకు నిలయమయింది. పాఠశాల విద్యార్థుల మనసులు వికసించటానికి బ్రహ్మం బోధన దోహదంచేసింది.

తెలుగునాట రాయిస్టు ఉద్యమానికి కేంద్రం తెనాలి ప్రాంతం, ఈ ప్రాంతం ఒకస్థాయి రినైజాన్స్‌ ఉద్యమానికి నెలవుగా వెలుగొందింది. త్రిపురనేని రామస్వామి ప్రారంభించిన హేతువాద ఉద్యమం దీనికి బీజాలు నాటింది. ఈ సాంప్రదాయ వ్యతిరేక ఉద్యమమే తరువాత వచ్చిన అన్ని అభ్యుదయ ఉద్యమాలకు పునాదిగా నిలిచింది.

ఎం.ఎన్‌.రాయ్‌ అడుగుజాడల్లో ఆంధ్రప్రాంతంలో భావవిప్లవ పతాకను ఎగురవేసి, తన శక్తియుక్తుల్ని ధారపోసి, అనేక సభల్లో, సమావేశాల్లో మరియు సెక్యులర్‌ వివాహవేదికల్లో, హేతువాద, మానవవాద భావాలకు విశేష ప్రాచుర్యం, ప్రచారం కల్పించిన ఖ్యాతి బ్రహ్మానిది. బ్రహ్మం తాత్విక చర్చల్లో నాకు అమితంగా నచ్చిన అంశం- అది అంత తేలికగా పట్టుబడేదికాదు - మానవుడు ప్రకృతిలో భాగం. కాని సమాజంలో భాగం కాదు. అయితే మానవుడు సమాజ నిర్మాత, చరిత్ర నిర్మాత. జాతి వికాసం మొత్తం వ్యక్తి వికాసంలో ఉంటుంది. ప్రతి మనిషీ ఒక సమాజం వ్యక్తికీ, సమాజానికి వున్న సంబంధాన్ని అంగాంగీ భావంగా చెప్పటానికి వీలులేదు. విశ్వంలో మానవుడి స్థానాన్ని గురించి రాడికల్‌ హ్యూమనిజం అవగాహన కూడ అదే. ఎం.ఎన్‌.రాయ్‌ రచనల్లో అంతర్లీనంగా కొన్ని చోట్ల ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని పట్టుకుని, వివరించటంలోనే బ్రహ్మం ప్రతిభ కనిపిస్తుంది.

భారతదేశంలో యురోపియన్‌ రినైజాన్స్‌ తరహా ఉద్యమం నడవాలంటే ప్రాచీన సంప్రదాయ విజ్ఞానాన్ని విమర్శనాత్మక విశ్లేషణకు గురిచేయాల్సిన అవసరాన్ని రాయ్‌ తన రచనల్లో, ఉపన్యాసాల్లో నొక్కి చెప్పాడు. ఆ భావాలు ఉద్యమ పత్రికల్లో, ముఖ్యంగా ''సమీక్ష'' అనే మాసపత్రికలో బ్రహ్మం కలం నుండి జాలువారాయి. సూటిగా, పొదుపుగా, స్పష్టంగా రాయటం బ్రహ్మం ప్రత్యేకత. తర్కసహిష్ణుత లేని వాక్యాన్ని గానీ, వాదాన్ని గానీ అయిన ఏనాడూ ఆమోదించలేదు. వి.ఎం తార్కుండే సంపాదకత్వంలో నడుస్తున్న ''ది రాడికల్‌ హ్యుమనిస్ట్‌'' ఆంగ్ల మాసపత్రికలో బ్రహ్మం హ్యూమనిజాన్ని, హోమియోపతిని విశ్లేషిస్తూ అనేక వ్యాసాలూ రచించారు.

జిజ్ఞాసే మానవుణ్ణి నిర్వచించే గుణమని గాఢంగా విశ్వసించిన బ్రహ్మం తన జీవితపర్యంతం ఒక జిజ్ఞాసువుగానే జీవించాడు. హోమియో వైద్యం శాస్త్రీయమైనదని నిర్ధారించుకున్న తరువాతే ఉపాధ్యాయ వృత్తిని వదలి హోమియో వైద్య వృత్తిని చేపట్టాడు. హోమియోపతి శాస్త్రీయతను నిరాకరిస్తూ కొందరు హేతువాదులు చేసిన ఖండనలకు సమాధానంగా ''హేతుబుద్ధి కలవారు హోమియోపతిని కాదనగలరా?'' అనే మౌలిక గ్రంధాన్ని రచించాడు. ఈ పుస్తకంలో హోమియోపతిని సమర్ధిస్తూ ఆయన చేసిన వాదాన్ని ఇంతవరకూ ఖండించిన దాఖలాలు లేవు. హోమియోపతి శాస్త్రీయతను నిరూపిస్తూ ఆయన రాసిన మరోపుస్తకం ''సారూప్యవైద్య దర్శనం'' (2014) హోమియో తత్వానికే వన్నెతెచ్చింది.

1956లో ''బైబిలు బండారం'' పేరుతో బ్రహ్మం రచించిన విమర్శనాత్మక గ్రంథం తెలుగునాట ఆయన ప్రతిష్టను ఎలుగెత్తిచాటిన మొదటి రచన. దీని తొలిప్రచురణ క్రైస్తవ సంస్థల ఆగ్రహానికి గురై, నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు ద్వారా నిషేధించబడింది. నాలుగు సంవత్సరాలపాటు పట్టువీడకుండా బ్రహ్మం, ఆయన మిత్రులు చేసిన ప్రయత్నంవల్ల సుప్రీంకోర్టు నిషేధాన్ని తొలగించటంతో మళ్ళీ ''బైబిలే పలుకుతోంది'' అనే పేరుతో పునర్ముద్రణ పొందింది. 'సాంస్కృతికంగా వెనుకబడిన భారత సమాజంలో యిటువంటి విమర్శ ఒక చారిత్రిక అవసరమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పటంతో, ఈ తీర్పు మన దేశంలో మతాన్ని విమర్శించే ప్రాథమిక హక్కును పునరుద్ధరించినట్లయింది. స్వేచ్ఛా చింతనాపరుడిగా, సాంస్కృతిక విమర్శకుడిగా బ్రహ్మం సాధించిన గొప్ప విజయమది.

బ్రహ్మం తన సమకాలికులైన అనేకమంది హేతువాద ఉద్యమ దిగ్గజాలతో కలసి పనిచేసినప్పటికీ, ఆయన తన స్వంత వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే వచ్చాడు. 1965లో అవనిగడ్డలో జరిగిన హ్యుమనిస్టు అధ్యయన శిబిరంలో ఈ ధోరణి మరింత ప్రస్ఫుటమైంది. మానవవాద సిద్ధాంతంలోని అనేక మౌలిక విషయాలపై జరిగిన వాద, వివాదాల్లో బ్రహ్మం వెలిబుచ్చిన తాత్విక ప్రతిపాదనలను ప్రఖ్యాత సెక్యులర్‌ ఉద్యమ నిర్మాత ఎ.బి.షా ప్రశంసాత్మకంగా సమర్ధించటం యిందుకు ప్రబలతార్కాణం.

బ్రహ్మం ప్రధానంగా తాత్వికుడు ఏ నూతన అంశమైనా ఏ విభావనా పరికల్పన అయినా అది తన తాత్విక చట్రం (Philosophical frame) లో  ఇమిడిపోవాలసిందే. అలా తార్కికంగా సమన్వయం చేసుకోవటానికి ఆయన ఎంతగానో మానసిక పరిశ్రమ చేస్తున్నట్టు కనిపించేవాడు.

వ్యక్తి స్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను అరికట్టే ఆధికారిక మనస్తత్వాన్ని, ప్రామాణిక బుద్ధిని, మంద మనస్తత్వాన్ని ఆయన ఏనాడూ హర్షించలేదు. సంఘాల్లో, సమావేశాల్లో వ్యక్తమయ్యే నియంతృత్వ పోకడలను సహించేవాడు కాదు. తన వాదనాపటిమతో, తార్కిక ప్రతిభతో ఎదుటి వాదనలను చిత్తుచెయ్యటంలో బ్రహ్మం ఆరితేరినవాడు. 1964 ప్రాంతంలో ''కథకులంటే పథికులా?'' అనే సమీక్షా వ్యాసం రాసి హ్యుమనిస్ట్‌ ఉద్యమంలో సంచలనం సృష్టించాడు. దాదాపు యిదేకాలంలో ''కలలో దేవుడు'' అనే విమర్శనావ్యాసం రాశాడు. వ్యక్తికి వ్యవస్థకు, వ్యష్టికి సమష్టికి మధ్య జరిగే సున్నితమైన సంఘర్షణను (tension) విశ్లేషిస్తూ సాగిన ఈ తాత్విక సంవాదం బ్రహ్మం రచనలన్నిటిలో మకుటాయమానమైనది.

తత్వశాస్త్రం ఏదైనా అది విశ్వంలో, చరిత్రలో, సమాజంలో మానవుడి స్థానాన్ని వివరించి, జీవిత లక్ష్యాలను నిర్ధేశించగలగాలి. తాత్వికంగా దీనినే సత్యం, శివం, సుందరం విలువలుగా చెబుతారు. 1964 లోనే బ్రహ్మం నవ్య మానవవాదం - మానవ విలువలు అనే వ్యాసంలో నవ్యమానవవాదం సత్యం, శివంకి ఇచ్చిన ప్రాధాన్యం సుందరానికి ఇవ్వలేదని, ఆ మేరకు ఆ తత్వం అసమగ్రమని ప్రతిపాదించాడు. విమర్శించకుండా సిద్ధాంతాలను వేదం లా భావించేవాళ్ళకు ఇది కష్టంగా తోస్తుంది. బ్రహ్మం వాదానికి సమర్ధన అన్నట్టుగా 1979లో ప్రపంచ హ్యూమనిష్టు మేధావి శిబి నారాయణ్‌ రే, రాయ్‌ ప్రతిపాదించిన హ్యూమనిజంలో రామణీయకతకు స్థానం లేకపోవటం విచారణీయమని ఒక ప్రధాన వ్యాసంలో రాశాడు.

కవిత్వం చెప్పటం బ్రహ్మానికి బాల్యం నుండి అలవడిన విద్య. ఆయన రచించిన పద్యకవితా ఖండికలు హేతువాద, మానవవాద భావాలకు వ్యాఖ్యానప్రాయంగా ఉంటాయి. భర్తృహరి నీతిశతకానికి గీతపద్యాల్లో ఆయన చేసిన అనువాదం రాళ్ళబండి కవితాప్రసాద్‌ ప్రశంసకు పాత్రమైంది. భావ ప్రపంచంలో హేతువాద, మానవవాద తత్వాల స్థానాన్ని మానవాభ్యుదయంలో వాటి పాత్రని వివరించటంలో రావిపూడి వెంకటాద్రి, ఎన్‌.వి.బ్రహ్మం చేసిన కృషి విస్మరించరానిది. రాయిస్టు బృందంలో వీరిద్దరూ జంట మేథావులుగా గణతికెక్కారు. వీరితోపాటు జి.వి.కృష్ణారావు, త్రిపురనేని గోపీచంద్‌, పాలగుమ్మి పద్మరాజు మొదలగు ప్రసిద్ధ రాయిస్టు రచయితల కృషివల్ల తెలుగు సాహిత్యంలో రాడికల్‌ కోవ ఒకటి రూపుదిద్దుకొంది. పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడకుండా నిశ్శబ్దంగా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, మానవవాద పథాన్ని వీడకుండా, తుదిశ్వాస విడిచేవరకూ జీవితాన్ని ఒక పోరాటంగా నడిపిన ధీశాలి ఎన్‌.వి. బ్రహ్మం, ''ఆత్మవిమర్శ చేసుకోకుండా జీవించే జీవితానికి విలువలేదు'' అన్న సోక్రటీస్‌ సూక్తికి సాక్ష్యంగా నిలుస్తుంది బ్రహ్మం జీవితం. ఆయన తలపెట్టిన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించటమే ఆయనకు మనం యివ్వగలిగే నిజమైన నివాళి.

- గవిని వెంకటస్వామి

No comments:

Post a Comment