Friday, December 15, 2017

క్రైస్తవ మత ప్రచారకుడు విజయకుమార్‌కు సూచన


  మొన్నటి జై భారత్‌ కార్యాలయంలో మనం కలసినప్పుడు తీసిన వీడియో రికార్డింగు ఆధారంగా, దానిలో మీరు మాట్లాడిన, నేను మాట్లాడిన అంశాలకు పరిమితమై విచారణకు కూచుందాము. అందులో ఎవరి పక్షంలో అపసవ్యతుంటే, దుందుడుకుతనం ఉంటే వారం లెంపలేసుకుని, క్షమాపణ చెపుతూ ఒక ప్రకటన విడుదల చేద్దాం. ఇలాటి వివాదాల విషయంలో ఎప్పుడు ఎవరు విచారణకు - చర్చకు - సిద్దపడ్డా అందులో అందరూ పాటించాల్సిన మొట్టమొదటి నియమం అనుకున్న విషయానికి పరిమితమైయ్యే మాట్లాడాలి. అన్యవిషయాలు మాట్లాడనే కూడదు అన్నదేకనక ఆ సమావేశంలో మన ఇరుపక్షాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ హద్దులు దాటి మాట్లాడారో చూద్దాం. సమావేశం ఏర్పరచిందే, కరుణాకర్‌ రాసిన ''బైబిలు దేవుని నిజస్వరూప స్వభావాలు'' అన్న పుస్తకం పై చర్చకు నియమనిబంధనలు ఏర్పరచుకుని ఒప్పంద పత్రం రాసుకోడం కొరకు. ఇప్పుడు మనం ఆనాటి వీడియోను పరీక్షించేది 1. పై విషయంపై ఎవరేమి మాట్లాడిందీ తిరిగి చూసుకోడానికీ, అన్య విషయ ప్రస్తావన లెవరు చేసిందీ తేల్చుకోడానికీ, మాట్లాడినంతలో ఎవరు ప్రస్తావించిన అంశాలు సబబుగా ఉన్నాయో సరిచూసుకోడానికి. దీనిపై అనవసరపు మాటలు మాట్లాడకుండా వీడియో పరిశీలించడానికి సిద్దపడండి. నేను ఈ రోజు నుండి సిద్దంగా ఉంటాను. ఒక్కమాట! సమంజసమైన ఏ షరతుకైనా కరుణాకర్‌ని సిద్దం కమ్మని చెపుతాను. మీరుగానీ అతణ్ణికాదని, నాతోనే మాట్లాడతాననేట్లైతే, అందుకూ నాకభ్యంతరం లేదు. ఇకపోతే! ఆనాటి సమావేశానంతరం, హైద్రాబాదు కొత్తపేటలో ననుకుంటా, మీ బృందం ఏర్పరిచిన వేదికపై నుండి మీరు మాట్లాడిన దాన్నంతా విచారణకు తీసుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. ప్రగల్భాలు ఎవరు మాట్లాడినా అట్టి వారిని పిట్టలదొర అనో, ఉత్తరకుమారుడనో అనడం తెలుగు ప్రాంతంలో ఆనవాయితీ. మీరు మాట్లాడిన మాటలన్నింటిని బట్టి నేను ఇంకా కొంత మాట్లాడవలసిఉన్నా, నేనేదో అనడం, మీరేదో అనడం ఇదంతా మాటల మనుషులు చేసే కాలహరణ ప్రక్రియే. కనుక పై రెండు సందర్భాలకు చెందిన సంభాషణలపైనే విచారణకు కూర్చుందాం. దాన్నంతానూ రికార్డు చేద్దాం. చర్చలో మీరూ- నేను మాత్రమే మాట్లాడాలి. మీతోపాటు 4,5 గురు ఉండవచ్చు. నా వెంటా అంతే మంది ఉంటారు. వారెవరూ మాట్లాడకూడదు. వాస్తవాలను ఇష్టపడే స్వభావం నాకుంది. అది మీకూ ఉంటే ఈ సమావేశానికి సిద్ద కాకుండే అవకాశమేలేదు. సమావేశం విజయవాడలోనైనా, హైద్రాబాదులోనైనా అయితే బాగుంటుంది. మీ ప్రతిస్పందనగా వివేకపధానికి లేఖ రాసినా పరవాలేదు. నాకు వ్యక్తిగతంగా తెలియజేసినా సరే. మీ వీడియో రికార్డింగు రూపంలో ప్రకటించినా సరే. లుచ్చాల కంటెనూ హీనంగా ప్రవర్తిస్తున్న కొందరు బచ్చాగాండ్లు : ఇలాటి భాష మాట్లాడడానికి ప్రజ్ఞలేమీ అవసరంలేదు. బుద్దిహీనతుంటే చాలు. విజయకుమార్‌ మరియు విజయప్రసాద్‌రెడ్డి గార్లకు, అయ్యలారా! మన తెలుగులో ''పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ'' అనీ; సంస్కృతంలోనైతే ''మహాగజాః పలాయంతే మశకానాంతుకాగతిః'' అనీ రెండు నానుడులున్నాయి. మీకు అవి వర్తిస్తాయో లేదో గాని, మీ మందలోని కొందరికి మాత్రం అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. మొన్నామధ్య ఒకరోజు కరుణాకర్‌ ఒక ఫోన్‌కాల్‌ వాయిస్‌ రికార్డు వినిపించాడు. అందులో ఒకడు ''బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు'' అన్న మా పుస్తకాన్నీ, కరుణాకర్‌ చేస్తున్న ప్రసంగాలను ప్రస్తావించి, ఆపై తిట్ల పురాణం లంకించుకున్నాడు. పెంటనోట్లో పెట్టుకుని అతడు మాట్లాడిన అశుద్ధాన్నంతా ఇక్కడ రాయడం కుదరదు. నీ అమ్మ, నీ అక్క, నీ పెళ్ళాం అంటూ సాగిందా సంధి ప్రేలాపన. మీ చెవిదాకా అది వచ్చిందో లేదోగాని, మీ మందలోనే ఉన్న అలాటి మతిచెడిన వాళ్ళ విషయంలో మీ నిజాయితీ, నిస్పాక్షికతతో కూడిన నియంత్రణ ఎలా ఉంటుందో మీరే ప్రకటిస్తే మంచిది. బౌద్ద సాహిత్యంలో ఇలాటిదే ఒక సంఘటన గురించిన ప్రస్తావన ఉంది. పైన నేను చెప్పిన లాటి పిచ్చోడొకడు ఒకరోజు బుద్దుణ్ణి నానాదుర్భాషలూ ఆడాడు. అప్పుడు బుద్దుడు ఆ మాటలన్నవాడితోనే శాంతంగానే, మీరు పంపినవి చేరవలసిన వారికిగాక, వేరే వారికి చేరితే, ఆ నిజాన్ని బట్టి అవతలివారు వాటిని ఇవి నాకు సంబంధించినవి కావని తిరస్కరిస్తే అవి ఎవరికి చెందుతాయి అనడిగాడట. అవి పంపినవారికే గదా అన్నాడట. అలా అయితే ఇప్పుడు మీరు పంపినవి నాకు తగినవికావు. కనుక అవి పంపిన వారికి చెందడమే న్యాయం అన్నాడట. బుద్దిలేని వారికిలాటి సుద్దులు అంతుబట్టవుగాని, అర్ధం చేసుకునే సామర్ధ్యం ఉన్నవాళ్ళకి మాత్రం అన్నవాడికి మాడుపగిలింది అన్న విషయం తేలిగ్గానే అర్ధమవుతుంది. అలాగే, మరో పోస్టింగూ చూశాను కరుణాకర్‌ని ఉద్దేశించిందే. ఏదో ఇతర దేశంలో ఉన్న యువకుని వీడియో ప్రసంగం అది. అతడూ మతిచెడినవాడే. మొదటతానో హిందువునన్నట్లు మాట్లాడి, క్రమంగా ఆ ముసుగు తొలగించి అసలు రూపాన్ని చూపిస్తూ వచ్చాడతడు. ఒక దశలో హద్దులు మీరిన ఆవేశంతో, ఇండియా రాబోతున్నాను. అరే దుర్గుణగా! నిన్ను వదిలిపెట్టను. ఫిజికల్‌గా డామేజ్‌ చేస్తాను. అంటూ తెగ మాట్లాడేశాడు. అతడు మీ వాడో కాదో నాకైతే తెలీదు. అలాగే అక్కడున్నాను ఇక్కడున్నానంటున్న ఆ ఉత్తరకుమారుడు, ఇక్కడే ఎక్కడో సందులు గొందుల్లో ఉంటూ అంత బిల్డప్పు ఇచ్చాడేమో కూడా అన్న సందేహమూ ఉంది నాకైతే. అలాటి ''ఆల్‌బిత్తర్‌' గాండ్ల గురించినేను చెప్పేది ఒక్కటే, దొంగ దెబ్బలు, చాటుమాటు దాడుల బాపతుకాకుంటే, ఒక్కసారి మా ఎదుటబడి, అతడు చేస్తానన్నదీ, చేయగలిగింది చేసేస్తే ఒక పనైపోతుందికదా! ఆ గుంటడు ఈడనే ఉన్నాడనీ కరుణాకర్‌ మిత్రులలో ఎవరో అన్నారని కరుణాకర్‌ నాతో అన్నాడు. ఏడున్నావురా బిడ్డా! ఓసారి ఎదురుపడి చూడరాభడవా! మరో దుండగుడు విషయమూ కొద్దిరోజుల క్రిందటే నాకు తెలిసింది. మిత్రులు జాన్‌రాజ్‌ గారు, తన అవగాహనననుసరించి 1. రంజిత్‌ ఓఫీరుగారి హైందవక్రైస్తవం పోకడ దిక్కుమాలింది క్రైస్తవాన్ని బలహీనపరచేది, నిజమైన క్రైస్తవులూ, బైబిలును పరిశుద్ద గ్రంధంగా నమ్మేవాళ్ళూ ఏమాత్రం అంగీకరించనే అంగీకరించకూడనిది అని విస్పష్టంగా ప్రకటించారు. 2. మరో వంక బైబిలు దేవుని నిజస్వరూపస్వభావాలు అన్న పుస్తకంలో బైబిలు దేవునికి మనిషికుండే లక్షణాలన్నీ.. అరిషడ్వర్గాలన్నీ - ఉన్నాయన్న కరుణాకర్‌ మాటలు తనకెంతో అభ్యంతరకరమైనవి కనుక ఆ విషయంలో కరుణాకర్‌తో చర్చకు సిద్దమంటూ తెలియజేశారు. దీన్నంతటినీ గమనిస్తున్న క్రైస్తవపక్షంలోని మతి చెడిన మందలో ఎవరో ఒకరు, కరుణాకర్‌ వాళ్ళతో చర్చకు సిద్దపడవద్దు. మా మాటకాదని పోయావా నిన్ను మర్డర్‌ చేసేస్తాం అని ఆయన్నే బెదిరించారట. ఈ రకం మంద ముందుగా ఏసుని అనుకరిస్తూ ప్రియమైన సోదరుడా! దేవునికి స్తొత్రం ప్రేమతో నేను చెప్పిదేమంటే, నీ పద్దతి మార్చుకోకుంటే అత్యంత కౄరంగా నిన్ను చంపేయబోతున్నాను. లాటి రెండు రకాల మాటలూ మాట్లాడేస్తుంటారు. మొదట మాట పడికట్టుపదం - తరవాతది తన సొంతం అన్నమాట. 
ఈ రకానికంతా నేను చెప్పిదేమంటే! 
బైబిలునో, మరో గ్రంధాన్నో ఆ మూలాగ్రం పరిశీలించుదాం రమ్మంటేనో, మాట్లాడుకుందాం రమ్మంటేనో, అందుకు సిద్దపడక, జ్ఞానం విషయంలో చేయాల్సిన పనినీ, పద్దతినీ విడిచి, భౌతిక దాడులంటూ బెదిరిస్తారేమిటి బుడతలూ! బుద్దున్నవాళ్ళైతే తలతో ఆలోచించేపనీ విచారించే పనీ మాత్రమే చేస్తారు. ఆ సామర్ధ్యం లేనివాళ్ళే, గొర్రెపొటేళ్ళ మాదిరో, దున్నపోతుల మాదిరో తలను ఢీ కొట్టేందుకు మాత్రమే వాడుతుంటారు. అలాటి వారి విషయంలో అవకాశముంటే మాడు పగిలేలా ఒక్కటిచ్చికోవడమో, అవకాశంలేకుంటే ప్రక్కకు తప్పుకోడమో చేస్తారు బుద్దిమంతులు. కనుక మీ మీ స్వభావాలు సామర్ధ్యాల ననుసరించి మీరు చేయదలచింది చేయండి. మేం చేయవలసింది చేస్తాం. ఈ రకమంతా ఎలాగూ గొర్రెల మందేగాని, ఆ మందలకు కాపరులమంటున్న వారికైనా తల ఉండొద్దా? తలగలిగినవాళ్ళు ప్రవర్తించాల్సిన తీరున ప్రవర్తించవద్దా? సిద్దాంత విచారణెక్కడ? సిగ్గెగ్గులు గానీ, సభ్యతా సంస్కారాలుగానిలేని కారుకూతలెక్కడ? రెంటికీ ఏమైనా పొంతన ఉందా? ఓ సభ్యతా సంస్కారాలు లేని, ఏ పెద్దల వద్దా బుద్ది గరవని మంద, స్ధాయిల గురించి తెగవదరుతోన్న పిదప కాలంలో ఉన్నాం మనం. ఓ చర్చావేదిక నియమనిబంధనల గురించి కనీస అవగాహన కూడా లేనివారే ఎక్కువగా చర్చల పేరిట నానా రభసా చేస్తున్న పిదపకాలంలో ఉన్నాం. ఓ విమర్శకు, విచారణకు, సమీకక్షూ, రుజువుకూ, ఖండనకు, నిందకు తేడా తెలియని మంద ఉన్న పిదపకాలంలో ఉన్నాం మనం - ఏం చేద్దాం? సమయం, సందర్భం కొరకు వేచి చూద్దాం 
సత్యాన్వేషణలో - 
మీ సురేంద్ర 

No comments:

Post a Comment