మేలుకొలుపు
సంపుటి-1 సంచిక-10 1-12-91.
ప్రమాణ వివేచన -1
మానవ జీవన యానానికి చుక్కాని వంటిదగు జ్ఞానాన్నీ, జ్ఞాన సాధనలనూ గురించి వివరించేముందు
దానికి చెందిన గతాన్ని స్మరించడం, అధవా పూర్వీకుల ధోరణులను
గూర్చి పాఠకులకు కనీసంగానైనా పరిచయం చేయడం సందర్భో చితంగా ఉండ గలదు.
ప్రమాణ వివేచన అన్నది వాస్తవంగా, శరీరంలోనే సహజంగా నిర్మితమై యున్న ఆయా
జ్ఞాన పరికరాలనూ, వాటి పనుల తీరు తెన్నులనూ సమగ్రంగా అవగాహన
చేసికోవడమే ఐయున్నది. దానితో పాటే సహజంగానే ఏర్పడి మొత్తం -జ్ఞాన ప్రక్రియలో
అంతర్భూతంగానే ఉన్న విచక్షణా శక్తి, దానికాధారమైన
హేతురూపజ్ఞానమూ వాటి తీరుతెన్నులూ కూడా అర్థం చేసికోవలసి యున్నది. ఈభావాలనే నేను
ప్రమాణ వివేచన-తర్కవిద్య- అన్న పేరున తెలియజేస్తున్నాను. వీటినే మరోలానూ
చెప్పుకోవచ్చు.
వాటి వాటి క్షేత్రాలలోని విషయాలను ఆయా ఇంద్రియాలు
స్వీకరించి, మెదడుకు పంపడంద్వారా అనుభవ రూపాన్ని పొంది తెలివిచే గ్రహింపబడి, విశ్లేషించబడి నిశ్చయరూపాన్ని పొందుతున్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు పని
చేయడమూ, తద్వారా అందిన సమాచారాన్ని పూర్వానుభవ సామర్థ్యంతో
విచారించి నిర్ణయించు కోవడమూ నన్నది, తలలో జరుగుచున్న
కార్యక్రమ మన్నమాట. ఈ క్రమంలో (1) ఇంద్రియార్థ సన్నికర్ష, (2) అనుభవమూ, తద్గ్రహణా, (3) గతజ్ఞానంతో సరిచూసుకుని ఒక నిర్ణయానికి రావడమూ (4)
అదిన్నీ స్మృతిరూపంగా నిక్షిప్తం చేయబడి వర్తమాన, భవిష్య
జీవితాలను నడుపు వివేకరూపంగా-బుద్ధిశక్తిగా-ఉండడమూ జరుగుతోంది. ఈ బుద్ధి శక్తి
స్వాభావికంగానే హేతుబద్ధత కలిగి ఉంది.
ఎట్లు విషయగ్రహణా, హేతుబద్ధతా అన్న రెండూ, శరీరంలో స్వాభావికంగానే ఏర్పడి యున్నవో అట్లే ప్రస్తుతాంశమైన ప్రమాణ
వివేచనలోనున్నూ ప్రమాణములూ, తర్కమూ కూడా విడదీయరానివిగానే
ఉన్నాయి. తర్కశాస్త్రం(తర్కం)పై ఒక విపరీత భావన బహుళ ప్రాచుర్యంలో ఉంది. అందుచే
జిజ్ఞాసువులైన పాఠకులలోనూ అట్లే ఏర్పడి యుండుటకు వీలున్న ఆ దోష దృష్టిని పోగొట్టిన
పిదపనే అసలు విషయాన్నివారి వారి పరీశీలనలకు అందించడం సర్వదా సమీచీనమూ, శ్రేయస్కరమూ
కాగలదు. కనుకనే ఈ విషయం ముందుగా చెప్పవలసి వచ్చింది. మీరందరూ ముందీ విషయాన్ని
చక్కగా అర్థం చేసికోవలసి ఉంటుంది.
జ్ఞానేంద్రియ వ్యాపారంలో బుద్ధికున్న స్థానమే, విషయ పరిశీలనలో తర్కానికి ఉంది.తర్కాన్ని
విడచి పరిశీలించడమంటే బుద్ధిని విడచి జ్ఞానార్జన చేయడం వంటిదే ఔతుంది. అయితే తర్కం
ప్రస్తుతం రెండురూపాల్లో ఉంది. (1) కేవలతర్కమూ (2) అనుభవాంగ తర్కమూనని. వాటిని సందర్భం వచ్చినప్పుడు విపులంగా వివరిస్తాను.
వాటిలో ఒకటవది విడువదగినదిగానూ, రెండవదైన అనుభవాంగ తర్కము
సర్వులూ, సర్వదా స్వీకరించవలసినది గానూ ఉన్నాయి. ఈవిషయం
ఇంతవరకూ స్పష్టంగా అర్ధం చేసికోగలిగితే మిగిలిన విచారణ సులభమవుతుంది. సక్రమమైన
జీవనానికి సక్రమమైన వాస్తవజ్ఞానం ఆధారంగా ఉందన్నది నిర్వివాదాంశం. అట్టి
సత్యజ్ఞానమునే ఎప్పుడూ పొందుచుండవలె నన్నచో తర్క ప్రమాణములను గూర్చి తెలిసికొని,
వినియోగించుకోవలసి యున్నది. అయితే ఈ రెండు విషయాల్ని గూర్చి
సమగ్రమైన అవగాహన పొందడం మిక్కిలి కష్టంతో కూడుకున్న పనిగాను ఉంది. గత చరిత్రను
చూస్తే అనేకవేల ఏండ్లుగా ప్రతి సంప్రదాయ ప్రవర్తకుడూ, సిద్ధాంతకారుడూ
కూడా వారి వారి సిద్ధాంతాల కనుగుణ్య మైన రీతిలో తర్కాన్నీ, ప్రమాణ
స్వరూపాల్నీ ఏర్పరచుకునే యత్నం చేసినట్లు కనబడుతోంది. అలా ఏర్పడినవే తర్కం పేరుతో
నున్న వివిధరీతులూ.
ప్రధానంగా తర్కశాస్త్రం అన్న పేరనే రెండు దర్శనములున్నా
[న్యాయ, వైశేషికములను తర్కశాస్త్ర మంటారు. వీటిని సిద్ధాంత రూపములుగా అంగీకరించి
అనుసరించువారిని తార్కికులు లేక నైయాయికులు అంటారు] ప్రతి దర్శన కారుడూ తన పరిధిలో
తర్కాన్నీ, ప్రమాణాల్నీ
ప్రతిపాదించారు. (1) నైయాయికుల తర్కం, (2) అద్వైత తర్కం, (3)
బౌద్ధతర్కం, (4) సాంఖ్యతర్కం (5) జైన
తర్కం (6) నాస్తిక తర్కం (7) ద్వైత
తర్కం (8) పాశ్చాత్య తర్కం. ఇట్లా యనేకంగా ఏర్పడ్డాయవి. వాటి
మధ్య కొద్దిగానో, గొప్పగానో తేడాలున్నా అన్నిటిలోనూ
హేతుదృష్టి, విశ్లేషించి, పరీక్షించి,
నిర్ధారించడమూ నన్నది సామాన్యంగానే ఉంటూ వచ్చింది. అలా సామాన్య
నియమాన్ని కలిగియుండి కూడా తర్కాన్నీ, ప్రమాణాలనూ రకరకాలుగా ఎలా
ప్రతిపాదించగలిగారు? అసలెందుకలా చేయవలసివచ్చింది? ఈ అంశాన్ని ముందుగా అర్థం చేసికోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆయా ప్రతిపాదన
లన్నింటి వెనుకా ప్రతిపాదించువారి కాధారంగా నున్నది స్వీయ జీవితమేకనుకనూ, ఆ జీవితంలో జ్ఞానేంద్రియాల స్వరూప స్వభావాలూ అందరకూ ఒక్కరకంగానే ఉన్నవి
కనుకనూ, వాస్తవంగా వైరుధ్యానికీ, వైవిధ్యానికీ
కూడా తావుండరాదు కదా? మరెందుకు, ఎలా
ఇన్ని తేడాలేర్పడ్డాయి? నిష్పాక్షికంగానూ, లోతుగానూ విచారించగలిగితే కొన్ని విషయాలు గోచరించగలవు.
(1)
ప్రధమ కారణం ఆయా సిద్ధాంతకారుల అవగాహనలలోని అసమగ్రత. (2)
ముందుగానే కొన్ని సిద్ధాంతాలేర్పరచుకుని వాటిని నిలబెట్టుకొనుటకే తర్కాన్ని తయారు చేసికోవటం,
(3) ఎదుటి పక్షాన్ని నిగ్రహించుటే లక్ష్యంగా కలిగి అందుకే తర్కాన్ని
తయారు చేసికోవడం. ఎప్పుడైతే తర్కం యిలా అవగాహనా లోపం కలవారిచేతనూ, రాగద్వేష సంకలితమైన మనస్సుగలవారల చేతనూ తయారు చేయబడిందో ఆనాడే అది తన సహజ
వివేకరూపాన్నీ, ప్రయోజనాన్నీకూడా కోల్పోయింది. ఆయా తర్క
పద్ధతులందు పాక్షికత, చోటుచేసికుని ఉంది. కనుకనే నాటినుండి
నేటివరకూ ప్రతితార్కికుడూ మరోతార్కికుని తనదైన శైలిలో తప్పు పట్టగలుగుతున్నాడు.
అట్లుగాక అనుభవాంగ రూపమైన తర్కాన్ని ఉన్న దున్నట్లుగా ప్రతిపాదించ గలిగితే లోకంలో
ఎవ్వరూ, ఏనాడూ దానిని కొట్టివేయ జాలరు. ఎప్పుడైనా ఒక్క
అనుభవాంగ తర్కానికే అట్టి సామర్థ్యం ఉంటుంది.
ఇప్పుడు మనం చేయబోయే విషయ పరిశీలనలోనూ ఎన్నో దోషా దోషాలు
ప్రస్తావించవలసి ఉంటుంది గనుక అనుభవంలో ఎట్లుంది? అన్న కొలత నుండే అందరమూ ప్రతిపాదిత
విషయాలను పరికించవలసి ఉంటుంది. అదే ఆద్యంతమూ మన పరిశీలనకు వేదిక గానుండగలదు.
ఉండాలికూడా. అట్లుగాక నేను చెప్పిన విషయాన్ని ఎవరుగానీ, ఆయా
సాంప్రదాయ గ్రంధాలలో చెప్పినవాటినే ప్రమాణాలుగా పెట్టుకొని పరిశీలించడం మొదలిడితే
వాస్తవం తెలియడం కష్టతరమౌతుంది. అట్టివారిని ముందుగా నే నడిగే ప్రశ్నేమంటే ఆయా
శాస్త్రాలలో చెప్పబడ్డ వాటికి ప్రామాణికత ఎలా ఏర్పడింది? అని.
వాటిని ప్రామాణికములే నని నిరూపించిన పిదపనే వాటి ఆధారంతో నేను చెప్పిన విషయాన్ని
కొలిచిచూడడం ఉచితంకాగలదు. కానినాడు వారి పరిశీలనలన్నీ నేలవిడిచిన సాము వంటివే
కాగలవు. మరో దృష్టినుండి ఆలోచిస్తే ప్రమాణాదులలోని వైవిధ్యానికి మరో కారణమూ
కనిపిస్తుంది. అది వారివారి అనుయాయులకు బోధించుటకుగాను అవగాహనా సౌలభ్యం కొరకుగా
వారు వారు ఏర్పరుచుకున్న విభజన అయ్యుండచ్చు. నిజంగా అట్లు జరిగే ఏర్పడి ఉన్న తేడా
లైతే వాటిని అర్ధం చేసికోవడమూ, సర్దుకుపోవడమూ కూడా
కష్టమేమీకాదు. ఈ ప్రమాణ వివేచన మన్నది ఆ విషయము యొక్క గాఢతా,
జటిలతలను బట్టి నిదానంగానూ కూలంకషంగానూ, పరిశీలించుకుంటూ,
అవగాహన చేసి కుంటూ మాత్రమే చేయదగియున్నది. ఇందు రచయిత లేక వక్త
పాత్ర చాలా కొద్ది మాత్రమే. అదే మంటే విషయాన్ని ఒక క్రమంలోనూ, తగినంత స్పష్టంగానూ, శ్రోతచే శ్రవణం చేయించడమే.
పఠితలకు తగినంత సమాచారాన్నందించడం మాత్రమే నన్నమాట. అటుపిమ్మట
వినిన-చదివిన-విషయాన్ని సమగ్రంగానూ, నిష్పాక్షికంగానూ
పరిశీలించి నిర్ణయించుకోవలసిన పని శ్రోతపైనే ఉన్నది. మననమూ, నిదిధ్యాసనమూ
రెండూ శ్రోత బాధ్యతే. అప్పుడే అది అతనికి అనుభవాంగ రూపమౌతుంది. గతంలో జ్ఞానపీఠ మను
పేర ప్రకటించిన ఒక సంచిక ఈ సందర్భంలో గుర్తుచేసుకోవడం మిక్కిలి ప్రయోజనకారి
కాగలదు. అందులో విషయాన్ని చెప్పాలకున్నవారూ, వినాలనుకున్న
వారూ కూడా అనుసరించ వలసిన నియమావళి విపులీకరింపబడింది.
సహజంగానే ఆయా విషయాలు గ్రహించినప్పుడు దానిని పరిశీలించి ఒక
నిర్ణయానికి రావడం జరుగుతుంది. తెలుస్తున్న విషయాలను పరిశీలించి ఒక అభిప్రాయానికి
రావడం సహజ ప్రక్రియగా నున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కూడా మీరందరూ అలా పరిశీలనా
దృష్టితోనే చూస్తారు. అందుకే ఇచ్చట మీకో హెచ్చరిక చేయవలసి వస్తోంది. అదేమంటే,
ఏ విషయాన్ని గూర్చి న్యాయ నిర్ణయం చేయాలన్నా చేయు వారు న్యాయ
నిర్ణేతలుగా- న్యాయమూర్తిగా ఉండగలగాలి. న్యాయవాదిగా ఉన్నంతకాలం ఎవరూ సరైన న్యాయం
చేయలేరు. అప్పుడు వారి వారి మేథస్సులన్నీ తమ పక్షాన్ని నిలుపుకొనుటకే
వినియోగిస్తారు. అనుకోకుండానే, నీ పక్షంలోనే న్యాయముంటే తప్ప
ఏ న్యాయవాదైనా స్వపక్షాన్ని నిలుపుకొనుటకే యత్నిస్తాడు. రాగ ద్వేషాలు
లేకుండా-నిష్పక్షపాతంగా-నిర్ణయించగల స్థితిలో ఉన్నప్పుడు, (అది
ఒకే పక్షాన్ని స్వీకరించిన వారి వల్ల కాక న్యాయ మూర్తిగా నుండగలిగిన వారి వల్లనే
సాధ్యపడుతుంది.) తీసుకున్న నిర్ణయమే వాస్త వానికి దగ్గరగా ఉండగలుగుతుంది.
సాంప్రదాయక తర్కాన్ని [ఏదో ఒక తర్క ధోరణికి కట్టుబడి] ప్రామాణికంగా స్వీకరించిన
పిదప నీవు శుద్ధంగా ఉండుట కష్టము. ఈ కారణమే ఇంతకాలమూ సత్య నిర్ధారణకు అడ్డుపడుతూ
వచ్చింది.
ఇక్కడ మార్పు రాక, అంటే అనుభవాంగ తర్కాన్ని ప్రమాణంగా స్వీకరించక సత్యాన్ని నిర్ధారించడం
కుదరదు. ఈ విషయంలో మీకేమైనా అభిప్రాయ భేదముంటే మాకు తెలుపండి. స్పందన-ప్రతిస్పందన
శీర్షికన ఆయా విషయాలలోని నిజానిజాలను పరిశీలించి చూద్దాము.
ప్రమాణములనగా జ్ఞానోత్పత్తికి అసాధారణ కారణము లనుకున్నాము
కదా! జ్ఞాన మన్నదొక కార్యరూపము, పుడుతోంది కనుక. ప్రతి కార్యోత్పత్తికీ పరికరములూ, పనీ
సామాన్య కారణాలు గానే ఉంటాయి. ఆ రకమైన పరికరాలూ, ఆ రకమైన పనీ,
ఆ రకమైన కార్యానికి అసాధారణ కారణాలౌతాయి. కనుకనే
ప్రస్తుతాంశమునందునూ ప్రమకు-జ్ఞానానికి-జ్ఞానేంద్రియములూ, ప్రక్రియలూ
కూడా కరణములు (సాధకములు) అవుతున్నాయి. ఈ సందర్భంలో, ప్రమాణ
మంటే జ్ఞాన సాధకమనాలా? యదార్ధ జ్ఞాన సాధక మనాలా? అన్నది పరిశీలించ వలసి ఉంది. వెనుకటి వాళ్ళీ విషయంలో కొందరు జ్ఞాన సాధకమనీ,
మరి కొందరు యదార్ధ జ్ఞాన సాధకమనీ, రెండు
రకాలుగానూ అభిప్రాయపడ్డారు. ఈ దృష్టి భేదం వల్ల కూడా తర్క ధోరణులు వేరు వేరుగా
మారాయి. ఎవరి అభిప్రాయాల్ని వారు మాటి మాటికీ పునరుద్ఘాటిస్తున్నంత కాలం ఈ విషయంలో
వాస్తవం తేలదు. రెండు పక్షాలలో అనుభవానికేది సరిపోతుందో చూసుకోవాలి గాని నాది
నాదేనంటే ఎలా? దీనినే విశ్లేషించి చూపడానికి యత్నిస్తాను.
మీరూ పరిశీలించి చూసుకోండి.
సంస్కృత భాషలో ప్రమ, భ్రమ అన్న రెండు పదాలున్నాయి. ప్రమ అనగా ఒప్పు జ్ఞానమనీ, భ్రమ అనగా తప్పుజ్ఞానమనీ ఆ పదాలకు రూఢ్యర్థం ఉంది. దాని ననుసరించి
ప్రమాణమనగా ప్రమాకరణమనీ, అనగా యదార్ధ జ్ఞాన సాధకమనే
అర్ధాన్ని స్వీకరించా మనుకోండి. అప్పుడు మనం నిర్దేశించే-అంగీకరించే ప్రమాణాలన్నీ
యదార్ధ జ్ఞాన సాధకములేనని నిరూపించవలసి ఉంటుంది. మరో వంక భ్రమ(తప్పు జ్ఞానాని) కి
సాధకమేమో చెప్పవలసి ఉంటుంది. భ్రమ కూడా ఒక రకమైన జ్ఞానమే నన్నది అందరూ
అంగీకరిస్తున్న విషయమే.
[Note :అవగాహనకూ, జ్ఞానార్జనలో ఎల్లప్పుడూ ఉపయోగించుకో
గలందులకూ ఒక విషయాన్ని యీ సందర్భంలో చెప్పడం మంచిదనిపిస్తున్నది. అజ్ఞాన మన్న పదం
రెండు సందర్భాలకు సరిపోతుంది. బొత్తిగా తెలియని తనానికి, తప్పుగా
తెలిసి ఉండడానికీ, ఎలానంటే రెండు సందర్భాలలోనూ ఉన్నది తెలియక
పోవడం జరుగుతోంది. అయితే వాటిని రెండని ఎందుకనాలి? శుద్ధంగా
తెలియ లేదు అన్న స్థితిలో ఆ వ్యక్తి తెలుసుకుంటానికి వీలుంది. ఈ విషయం తనకి
తెలియలేదు అన్న దృష్టి ఉంటుంది కనుక. మరి రెండోదైన తప్పు తెలివి గల వారిలో తనకు విషయం తెలిసి పోయింది.
అన్న భావం ఉంటుంది. ఇకవారు తెలిసికునే అవకాశమే ఉండదు. బొత్తిగా తెలియని తనం కంటే
తప్పుగా తెలియడం ఆద్యంతమూమూ ప్రమాదకరమైయున్నది. జ్ఞానార్జనలో ప్రారంభకులూ, కొంత పరిశ్రమ చేసిన వారు, పూర్తయిందను కున్నవారూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఉండడం సర్వదా
శ్రేయస్కరము. జ్ఞానార్జనాపరుడు అప్పటికా విషయంలో తనకెంత తెలిసిందో, ఎక్కడనుండి, తెలిసికోవలసి ఉందో స్పష్టంగా గమనించి
ఉండాలి. అప్పుడే ఆతని జ్ఞానార్జనా యత్నం ఫలవంతమవుతుంది. చక్కగా వ్యక్తం చేయబడీ
తప్పుగా వ్యాఖ్యానించబడుతున్న గీతా శ్లోకాన్నొక దాని నిచ్చట చెప్పితే విషయం మరింత
వివరణాత్మకంగా ఉంటుంది.
“అజ్ఞానేనా౬ వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః”
"అజ్ఞానముచే
నావరింపబడిన జ్ఞానంచే మోహితు లౌతున్నారు జనులు" అన్న అర్ధాన్నిస్తోందా
వాక్యము. జ్ఞానమే మనిషిని కదిలిస్తోంది అన్న అనుభవాన్ని బట్టి చూస్తే
అజ్ఞానం-తెలియని తనం-మనిషిని మోహితుల్ని చేయలేదు, ప్రయత్న పరుల్నీ చేయజాలదు. మరిక్కడ
అజ్ఞానానికే అర్ధం చెప్పుకోవాలి? క్రితం నే చెప్పిన రెండవ
అర్థాన్నే. తప్పుగా తెలియడమన్నదే ఒప్పు తెలివిని సాధించు కోడానికి గల మార్గాన్ని
మూసి వేస్తోంది, కప్పివేస్తోంది. మరి మోహితు లవడమేమి? తప్పుగా
తెలియడంలో ఉన్నది తెలియక పోవడమూ, తెలిసింది అనుకోవడమూ కలిసి
ఉన్నాయి. యీ ఉన్నది తెలియకనే తెలిసిందనుకోవడం వలన ఆ విషయమై ఇక తెలిసికోవడం అన్నదే
ఏర్పడదు. ఇదే కప్పి వేయడమంటే, విపర్యయ-భ్రమ-జ్ఞానమే
వాస్తవాన్ని కప్పివేయ గలదు. చక్కగా ఒకటి, రెండు సార్లు చదివి
ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. లోపాలున్నా యనిపిస్తే సహేతుకంగా పత్రికకు వ్రాయండి.]
సరే అసలు విషయానికి వద్దాం. భ్రమ కూడా జ్ఞాన రూపమే ఐనప్పుడు అదీ ఒక కార్యరూపమే
అవుతుంది. దానికీ అసాధారణ కారణం ఉండితీరాలి. ఆ కరణాలూ, పద్దతీ
ఏమిటి? వాటినే పేరుతో పిలవాలి? యదార్ధ
జ్ఞాన సాధకమే ప్రమాణ మన్న నిర్వచనం చేసేవారు, ఈ సందేహానికి
సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఏ పక్షం వారైనా మూడు పదాలకు అర్థ నిర్దేశనం
చేయాల్సి ఉంటుంది. (1) జ్ఞానము, (2) యదార్థ జ్ఞానము, (3) అయదార్థ
జ్ఞానము. ఈ మూడు పదార్థాల జ్ఞానం లేక ప్రస్తుత విషయాన్ని పరీక్షించుట కుదురదు.
భిన్న ధోరణులు కల వారు పత్రికను పరిశీలిస్తున్నారు గనుక వారు గానీ, మీరు గానీ ఈ మూటి అర్థాల్నీ మీమీ దృష్టుల నుండి నిర్వచించండి. భిన్న
మార్గీయులైన ఆయా తార్కీకులు ప్రతిపాదించిన నిర్వచనాలు రెండు, మూడు మీ ముందుంచుతాను గమనించండి. న్యాయ, వైశేషిక
దర్శనాలను ప్రామాణిక గ్రంధాలుగా స్వీకరించు తార్కికులు-వీరిని
నైయాయికులంటారు-చెప్పిన నిర్వచనం ప్రకారం, ప్రత్యక్షంలో
భ్రమకు తావు లేదు.
సూ:- “ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం
జ్ఞానమ్, అవ్యపదేశ్య మవ్యభిచారి
వ్యవసాయాత్మికం ప్రత్యక్షం!” ఇంద్రియములూ, విషయములూ సంబంధ
పడగా ఏర్పడ్డ జ్ఞానమే, వినికిడి జ్ఞానం కాకుండానూ, తెలియబడుతున్నది మార్పుకు లోనుగాకుండానూ, సంశయ
రహితంగానూ ఉన్నప్పుడే ప్రత్యక్ష మవుతుంది. అని పై సూత్రార్థం. ఈ సూత్రం ద్వారా
రెండు విషయాలు తెలుస్తున్నాయి. (1) ఇంద్రియార్థ
సన్నికర్షవల్ల జ్ఞాన మేర్పడుతుందని, (2)
ఆ జ్ఞానము అవ్యప దేశ్యాది మూడర్హతలు కలిగి యున్ననే ప్రత్యక్ష ప్రమ అవుతుందని,
ఈ పద్ధతి ప్రకారం ప్రత్యక్షంలో వ్యపదేశ జ్ఞానం గానీ, భ్రమజ్ఞానం గానీ సంశయ జ్ఞానం గానీ ఉండవు. అదే మరి సాంఖ్య దర్శన కారుని మతం
ప్రకారమైతేనో.
అసన్ని కృష్టార్థ పరిచ్చిత్తిః ప్రమా!
బుద్దికి, ఫలానా కొత్త విషయం మేధస్సుకు చేరింది అని
తెలియడాన్నే ప్రమ అంటారు అని సూత్రార్ధం. ఇక్కడ ప్రమ అనగా ఇంద్రియార్థ
సన్నికర్షవలన పుట్టిన జ్ఞానమనే అర్ధం వస్తోంది. అయితే మరి ఆ తెలుస్తున్నది ఉన్నది
ఉన్నట్లేనా అన్న నిర్ధారణేమీ వారి సూత్రం ద్వారా లభించదు. పై నైయాయిక
మతాన్నంగీకరించి నట్లైన ప్రత్యక్షంలోనే గాక, ఏ ప్రమాణం లోనూ
భ్రమలుండవు. సాంఖ్యాదుల ప్రకారం కలుగుతున్న జ్ఞానానికే ప్రమ అని పేరు. అందు తప్పు
జ్ఞానమూ, ఒప్పు జ్ఞానమూ ఉండవచ్చు. మరొకరి దృష్టి నుండి
ప్రమకు అనధిగతత్వమూ, అబాధితత్వమూ ఉండాలి. తెలియనిది తెలియడం, తెలిసింది మార్పుకు లోనుగాకుండడం అన్న స్థాయిగల ఆయా విషయ జ్ఞానాన్నే ప్రమ
అంటామని వారి అభిప్రాయం. మరో వర్గం వారికి ప్రత్యక్షమే ప్రమాణం అంటే ఇంద్రియాలే – పరికరాలే - జ్ఞానసాధకాలు. మన మనుకునే అనుమానాది ప్రమాణములు
ప్రమాణములే కాదు. వాటి వలన జ్ఞాన మేర్పడదు అని, అంటే పరోక్ష జ్ఞానమన్న పదమే తప్పని దాని అర్ధం. పరిశీలకులను
పరిశీలనకు తగిన విధంగా సంసిద్ధులను చేయవలసియుండుట చేతనూ, అది
బహు ప్రయాసతో కూడియున్న విషయమగుటచేతనూ ఈ ప్రమాణ వివేచనకు పీఠికగానున్న ఈ వ్యాసము
ఒకింత దీర్ఘమైంది. మేలుకొలుపులో క్రమంగా వస్తున్న ఆయా విషయాలను భిన్న
సిద్ధాంతాభిమానులైన తార్కికులొకవంకా, ప్రాధమిక పరిచయాన్ని
పొంద యత్నించు జిజ్ఞాసువు లొకవంకా పరిశీలించే వారుగా ఉండుటచే ఇరువురకూ అందుబాటులో
ఉండే విధంగా భాషను మలచడం కొంత శ్రమతో కూడుకున్న పని. వెనుకటి వారు ఉపయోగించిన భాషా
పదాలు వాడక తప్పదు. వాటిని ఉపయోగిస్తూనే వాటి అర్థాలలోని దోషాదోషాలు చూడడమంటే బహు
క్లిష్టమైన పని ఔతుంది. ప్రకరణ విషయం నాకు అనుభవ రూపంలో స్పష్టంగానే ఉన్నప్పటికీ
రెండు స్థాయిలలోని పరిశీలకులకూ అందుబాటులో ఉండగల వాక్య నిర్మాణానికై నేపడ్డ శ్రమ
ఎంత వరకు ఫలవంత మవుతుందో మీ స్పందనలను బట్టి గాని నిర్ధారించ వీలులేదు.
అభ్యాస క్రమము - 5
సాధన
విధానమును గురించి చెప్పవలసినది యదార్థ సాధకులకే, గమనించ వలసినదీ యదార్థ సాధకులే సాధనా
వసరాన్ని గమనించక పోయినా,
సాధన ఇష్టపడక పోయినా సాధనలు ఆచరణ సాధ్యాలుగా కనిపించవు. అవసరంగానూ అనిపించవు. కనుక
మనమెంత చెప్పినా వినివూరుకుంటారు వారు. వీరి విషయంలో- మన బోధనలు వ్యర్ధాలే కాగలవు.
అంతవరకే పరిమితమైతే,
పెద్దగా మునిగిపోయేదేమీ లేదు. కేవలం శ్రమ దండుగ మాత్రమే అవుతుంది. అయితే మరో
రెండు రకాల మనుషులున్నారు. అందొకరికి ఆయా విషయాలను తెలుసుకోవడం స్వార్థ ప్రయోజనాలు
సాధించుకోవడానికై ఉంటుంది. ఇందులో ఒక రకం వారు గుర్తింపు తపన –కీర్తి కండూతి కలిగి కేవల వాచాలురై - ఆచరణ శూన్యులై
పాండిత్య ప్రకర్ష కనపరుస్తూ ఉంటారు. రెండవ
వారికి స్వార్ధమే పరమార్థంగా ఉండటమేగాక కపటులుగా కూడా ఉంటారు. ఆధ్యాత్మ విద్యా
విలువలనూ, ధర్మాన్ని, సమ్యగాచరణనూ - బ్రష్టుపట్టించిందీ రెండు రకాలవారే. లోకహిత కాంక్షులైన
మేధావులారా, యదార్థ
సాధకులారా! జిజ్ఞాసువులారా! ఈ విషయాన్ని చక్కగా గమనించండి. నేను చెపుతున్నది
వాస్తనమో కాదో నిస్పాక్షికంగా విచారించి ఓ నిర్ణయానికి రండి. మరలా ఆధ్యాత్మ విద్య
మానవాళికి తనదైన ప్రయోజనాన్ని కలిగించాలన్నా, సమాజం యదార్థ ఫలితాల్ని
సాధించుకోవాలన్నా ఈ రెండు వర్గాల వారి బారినుండి దానిని కాపాడి సరైన పంథాలో
అర్హులైన వారికందించే క్రమాన్నేర్పరుచుకోవాలి. ఈనాడు మన ముందున్న అనేక బాధ్యతలలో
ఇదీ గురుతరమైనదే. ప్రస్తుతం యదార్థ బోధకులకూ, సాధకులకూ కూడా పై రెండు రకాలవారు
వ్యతిరేక శక్తిగా పనిచేస్తుంటారు. ఈ రకంవా రన్ని తరహాల సంఘాలలోనూ చాపకింద నీరులా
పాకిపోతుంటారు. వీరిని గుర్తించడమూ, తొలగించడమూ కూడా ఎంతో కష్టంతో
కూడుకుని యున్నది. వీటన్నిటి నుండి ఏర్పడుతున్న, ఏర్పడనున్న ప్రమాదం నుండి యదార్థ
సాధకులు తమను తామైనా రక్షించుకోవాలంటే సాధన విషయాలుగా చెప్పబడుతున్న వాటిని తమ
అనుభవాలతో సరిపోల్చుకుని అది తమకవసరమో కాదో వాటిని అమలు పరచుట ద్వారా ఏమి
జరుగుతుందో, విడచిపెట్టిన
వచ్చు నష్టాలేమో పరిశీలించి చూసుకోవాలి. అట్లు చేయగలిగిన వారిని మాత్రం పై రెండు
వర్గాల వారూ-ఆచరణ శూన్యులూ, కపటులూ
ఏమీ చేయ జాలరు. నిదానంగా ఆలోచించి నిరంతర మెలకుల కలిగియుండండీ విషయాలలో.
విషయాన్నింతగా
ఎందుకు చెప్పవలసి వస్తోంది? సాధన క్రమంలో సాధన కెంత ప్రాధాన్యత ఉందో దానిని రక్షించు కోవడానికి ప్రతిబంధకాల్ని
తొలగించు కోవడానికి అంతకంటే అధిక ప్రాధాన్యత ఉండడమే అందుకు కారణం.
మొదటి
అభ్యాసముగా-ఆధ్యాత్మ సాధనా దృష్టి నుండి సకాలమునకు మేల్కొండుట, పరుండుట అన్న వాటిని స్వీకరించి
అమలుపరుస్తున్నాము. అట్లే రెండవ సాధనగా నిత్య కాలకృత్యములూ, శరీర
వ్యాయామమూ అన్న వాటిని స్వీకరించాము. పిదప సాధించవలసినది ఆహారనియమాన్ని. గత
సంచికలలో ఆరోగ్యమూ - ఒక పరిశీలన అన్న శీర్షికన ఈ విషయమై కొన్ని అంశాల్ని
ముచ్చటించాను. ఒక్కసారి వాటిని మననము చేసుకోండి. ఒక సారి ఆహారాన్ని స్వీకరించిన
పిదప 8గం. వ్యవధి శ్రేష్టమైన అవధి కాగలదు. కనీసం 4గం. వ్యవధానంతో మాత్రమే మళ్ళీ ఏమైనా తినడం చేయాలి. ఆహారంలో తప్పనిసరిగా
ఆరోగ్యదాయకములైనవీ, బలమునిచ్చునవీ అని రెండు రకముల పదార్థములు
కలసి ఉండేట్లు చూసుకోవలసి ఉంది. తిండే జీవిత పరమార్థంగా ఉండే వ్యక్తులనూ, తిండి కనీసావసర మన్న స్పృహే లేని వ్యక్తులను కూడా సమాజంలో నేను గమనించాను.
ఈ రెండూ, యదార్థమైన ఆధ్యాత్మ సాధనలకు ప్రతిబంధకాలే. ఈ విషయం యోగ దర్శనకారులూ,
వ్యాసుడూ కూడా చాలా స్పష్టంగా గమనించారు. వారు చెప్పారు గనుక వాటికా
విలువ రాలేదు. మన జీవితంలో ఎప్పుడైనా పరిక్షించి చూసుకోదగిన విషయంగా ఉందది.
ఆత్మోన్నతి నందగోరిన వారందరూ, ఆహార నియంత్రణనూ (ఎక్కువా
వద్దు, తక్కువా వద్దు అన్న సూత్రాన్ని, యధావిధిగా స్వీకరించవలసి ఉంది. ఇంద్రియాలలో రుచి-నాలుక-బలీయమై మనిషిని
ఆహార స్వీకరణంలో అదుపు కోల్పోయేట్లు చేస్తున్నది. కనుక క్రమంగా దృఢ యత్నం చేసి
ఆహార నియమాన్ని సాధించుకోవాలి. సాధకుడు-ఈ విషయమై అధిక వివరాలకూ, సందేహ నివృత్తికి మమ్ము సంప్రదించండి.
-:స్పందన - ప్రతిస్పందన:-
గత సంచిక
నుండి నూతనముగా పంపుచున్న వారినుండియూ క్రమంగా లేఖలు అందుతున్నాయి. అందరూ తగినంతగా
స్పందిస్తారో లేదో చూడవలసి ఉంది. ప్రస్తుతాని కందినంత వరకు మీ ముందుంచుతున్నాను.
స్పం|| (1) శ్రీ
మరంగంటి శ్రీ రంగాచార్యులు. హైద్రాబాద్ వారు “మిత్రులు శ్రీమాన్” సురేంద్రకు
నమస్కారములు. మీరు పంపిన మేలుకొలుపు సంపుటి-1 సంచిక -9
అందినది. మీ వ్యష్టి సమష్టి శ్రేయోభిలాష సత్యాన్వేషణమువలె సర్వ
సమ్మతము. సంతోష ప్రదము. మీ ఆశయాల నవగాహన మొనరించుకొనడానికి యత్నింతును.
'5' వ పేజీలో ప్రమాణమును వివరించుచు అది (1) పరికరములను
బట్టి (2) పద్ధతుల ననుసరించి రెండు రకా లనినారు. సరి. వీనిలో
“ఇహపోతే పద్ధతుల ననుసరించి కలుగుతున్న జ్ఞానం” అంటూ జ్ఞానమును రెండురకాలుగా
విభజించినారు. మరి జ్ఞాన సాధనమనిన ప్రమాణము యొక్కడ రెండవ రకమేమిటో వీలును బట్టి
స్పష్టపరచండి.
చక్కని
శాస్త్రీయ విషయమును ఆధునిక మేధావి ఆలోచనాసరిణికి అందించే మీ మేలుకొలుపు, సత్యాన్ని మరికొంత బట్టబయలొనరించి
సమాజానికి మేలు కలిగించ గలదని ఆశింతును. “ధన్యవాదములు” అంటూ వ్రాశారు.
ప్ర.
స్పం: ఈ 10 వ సంచిక
నుండి ప్రత్యేక శీర్షికగానే “ప్రమాణ వివేచన” ధారావాహికంగా మీ ముందుండబోతోంది. అందుకు
భూమికే యిప్పుడు మీ చేతిలో నున్నది. అయినా మీ ప్రశ్నకు సంగ్రహంగా
వివరణనిస్తున్నాను గమనించండి. పరికరముల ననుసరించి ప్రమాణములారు. అవి
జ్ఞానేంద్రియములే. పద్దతులనసరించి ప్రమాణములు ముఖ్యముగా రెండు (1) ప్రత్యక్ష ప్రమాణము, (2) పరోక్ష
ప్రమాణము. ఈ రెండవది మరల అనుమాన, శబ్ద, ఉపమానాది విభాగమును కలిగి యున్నది. ప్రత్యక్షము అందరికీ సమానమే.
పరోక్షమన్న పదం పరోక్ష జ్ఞానమునిచ్చునది అన్న అర్థంలో ఉపయోగించాను. జ్ఞానం ప్రత్యక్ష
జ్ఞానమనీ, పరోక్ష జ్ఞానమనీ రెండు రకములన్నదే ఇక్కడ నేను చెప్పదలచుకున్న అంశం
గమనించగలరు.
స్పం॥ (2) శ్రీడా:ఐ. బి. రామారావు ఎమ్. ఎ.
పి హెచ్ డి. ప్రొద్దుటూరు వారు. “ప్రియమైన మేలుకొలుపు ఎడిటర్ మహాశయులకు నమస్కా
రములు.” మీరు పంపిన మేలుకొలుపు అందినది. అందు నన్ను మేధావి వర్గంలో చేర్చడం
ముదావహమే కానీ చేర్చడానికి హేతువు మృగ్యము. తర్క శాస్త్రోద్దేశము తెలిసికుని ఆ
శాస్త్రము నిర్వచించిన పదార్థములను, వాటి వివరములనూ మీరు
ఎన్ను కొనిన పెద్దలనుండి ప్రశ్నోత్తరముల రూపమున రాబట్టి ప్రచురించిన మేలుకొలుపు
అన్వర్థ నామము కలదగును. అని నా యభిప్రాయము. అని వ్రాశారు.
ప్రతి.
స్పం|| (2) ఆర్యా, మీకూ నాకు పరిచయమున్న ఆప్తులనుండి మీ వివరం
గ్రహించడం జరిగింది. ఇప్పుడు మీ లేఖ ద్వారానున్నూ మిమ్ము మేధావి వర్గంలో చేర్చుట
ఉచితమనియే తేలినది. ఏలనంటే ప్రతిపాదిక విషయ మదేదైనా, మీకు
యిష్టాన్ని కలిగించేదైనా హేతువును చూడక అంగీకరించని స్వభావం మీదని మీ వాక్యాలు
తెలుపుతున్నాయి. పరిశీలించవలసిన వ్య క్తికుండదగిన ప్రధాన అర్హత కదా అది. ప్రమాణ
వివేచన మన్న శీర్షికన నేనే తార్కిక విషయాన్ని మీవంటి వారి ముందూ, జిజ్ఞాసువుల ముందూ ఉంచబోతున్నాను. అందు పైవచ్చు అభిప్రాయములను
స్పందన-ప్రతిస్పందన శీర్షికలో ప్రచురించగలను. యధావకాశం మనం కలవ గలిగిన విషయములను
విపులంగా చర్చించు కొనుటకు వీలుపడగలదు. వారం వారం జరుపుకొనునట్లు తిరుపతిలో
ప్రారంభింపనున్న అధ్యయన శిబిరములో నెలకొక తూరి నేనూ పాల్గొనునట్లు నిర్ణయించు
కోవడం జరిగింది. కనుక మనం అక్కడైనా కలుసుకోవడానికి వీలవుతుంది. సంచికాంతర్గత విషయాలపై
నిష్కర్షగా మీ అభిప్రాయాల్ని స్పందనకు పంపండి.
స్పం || (3) శ్రీ రమణేంద్రకుమార్.
హైద్రాబాద్ వారు “పూజ్యులైన శ్రీ సురేంద్రగార్కి రమణేంద్రకుమార్ నమస్కరించి
వ్రాయునది.” అదివరలో మీరు మాకో లెటర్ వ్రాస్తూ మా యొక్క activities గురించి అడిగినారు. మేము సిండికేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాము. బ్రహ్మచారులము.
జీవితమును భక్తి మార్గములోనూ పరులకు మంచి చేయవలెనను ధ్యేయముతోనూ మార్గము నేర్పాటు చేసికొనుటకు
యత్నించుచున్న జిజ్ఞాసువును. పెద్దలా, సత్పురుషులా సత్సంగములో గడపుటకు ఇష్టపడే
వ్యక్తిని. అనేక పెద్దల అనుగ్రహ భాషణము వినే భాగ్యమునకు నోచుకున్న వ్యక్తిని.
ఇహపోతే మీ పత్రిక మీద అభిప్రాయం వ్రాయమన్నారు. చాల సంతో షము. మీరు చేయు కృషికి మా
సహాయ సహకారము లెప్పుడూ ఉండును. పత్రిక ప్రతినెలా పంపండి. మా అభిప్రాయాల్ని
తెలుపుతూ ఉంటాము. క్రొత్త మెంబర్సుకు తెలుపగలము. పత్రిక ఉచితముగా కాకుండా కనీస చందా
స్వీకరిస్తే బాగుంటుందని మా సలహా. మీరు పత్రికలో పెద్దలా, నిష్ణాతులా,
పరిశీలనాత్మక వ్యాసములను ప్రచురించవలెను. ఒకే వ్యక్తి వ్రాసిన
అభిప్రాయాలూ వ్యాసాలూ - చదివిన విసుగని పించవచ్చు. కనుక మా మెంబర్స్ రుచులను కూడా
దృష్టిలో పెట్టుకొన వలెను. నమస్కారములతో మీ మిత్రుడు అంటూ వ్రాశారు.
ప్ర. స్పం|| (3)
విశ్లేషించవలసిన రెండు మూడంశములు కలిగి ఉందీ లేఖ. లేఖకులూ, పాఠకులూ
కూడా పరిశీలించండి. విషయాన్ని క్రమంగా వివరించడానికి యత్నిస్తాను.
(1) మీ వ్యక్తిగత వివరములడుగుటలో గల
వుద్దేశము (A) మీ పరిచయాన్ని పెంచుకొనుట కొరకు (B) జరుపవలసి ఉన్న వుద్యమంలో మీరే పాత్రకు సరిపోతారో అన్నది కూడా ఒక ఆలోచనగా
ఉంది. వ్యక్తిలో సమాజహిత దృష్టి బలీయంగా ఉన్న నాడు అవసరమైన మార్పులను తానై
గుర్తించిగానీ, ఇతరులచే గుర్తింప జేయబడి గానీ, ఆ వ్యక్తి పొందుతాడు. కనుక మనం కలవడానికి భావాలలో ఇప్పటి కేమైనా తేడాలున్నా
మౌలికమై వేదిక ఏర్పడినట్లే కాగలదు.
(C) ఇహ చందా విషయం వ్యక్తిగతంగా నాకు
భారమనిపించిన నాడు సమాజ కార్యానికవసరమైన అండ దండల్ని సమాజంనుండి స్వీకరించడానికేమీ
వెనుకాడను. ప్రస్తుతానికంత ఆర్థిక యిబ్బంది లేదు. నా వద్ద చేరిన డబ్బు వనరులు కూడా
సమాజం నుండి ఏర్పడినవే కనుక అవసరమైనంతమేర అవి సమాజానికై వినియోగింపబడడం ఉచితమే ఔతుంది.
(D) మీరన్నట్లు ఇతరుల వ్యాసావళి
ప్రచురించడం, పత్రికోద్దేశ రీత్యా సాధ్య పడదు. పెద్దలనబడే
వారి నుండి వ్యాసాలను స్వీకరించడం మొదలెడితే అనేక విష యాలు, అనేక
ధోరణులూ చోటు చేసికుంటాయే గానీ అందించాలనుకున్న విషయాన్ని క్రమబద్ధంగా అందించడం
కుదరదు. అయితే మేలుకొలుపు ఇతర స్వరాలను స్వీకరించదా అంటే అట్లేమీకాదు. ‘స్పందన-ప్రతిస్పందన’
శీర్షికన అందరి భావాలను స్వీకరించి ప్రచురించగలను.
(E) ఎప్పుడూ ఒకే వ్యక్తి రచనలు విసుగనిపించవచ్చు అన్నదో సందేహము.
రమణేంద్రకుమార్ గారూ, నేచెప్పదలచుకున్నది ఉబుసుపోక వ్యాసాలు
కాదు. ఆధ్యాత్మ విద్యను. జీవితం పట్ల సమగ్రమైన అవగాహనా, తదనుగుణ్యాచరణా, మనం కలిగియుండి ఇతరులలోనూ కలిగించుట సత్యాన్వేషణ మండలి లక్ష్యమైయున్నది.
అందుకు ఒక క్రమం అవసరం. విషయాన్ని నిష్పాక్షికంగా గ్రహించ గలరనుకుంటాను.
స్పం॥ (4) T. పానకాలు,
తుళ్ళూరునుండి సంచికను గూర్చి ప్రశంసాత్మకంగా వ్రాస్తూనే ఒకటి రెండు
- సందేహాలను వెలిబుచ్చారు. “తాను లేని చోటులో జరిగినది విచారణతో పనిలేదని”
అన్నారు. భారత రామాయణాదులు మనం చూడ లేదు. వాటిని విశ్వసించకూడదా! అవి నిజంగా కధలే
అయినా నాలాటి సామాన్యులకు కొంత ఆధారముగా, ఉపయోగంగా ఉందని నా విశ్వాసము.
ప్ర. స్పం
:- (4) తాను లేని చోటులో,
లేని కాలంలో జరిగిన వాటినిగూర్చి విచారించుట కుదరదు అన్నది నా ప్రతిపాదన.
అక్కడ విశ్వాసమే (ఒప్పుకోవడం, గానీ ఒప్పుకోక పోవడంగానీ)
మనిషి కాధారము. మీరన్న విషయాన్నే తీసికుందాం. రామాయణాదులు జరిగినవంటున్న దేశకాలాలలో
మీరు లేరు. ఇప్పుడు మీరు ఇతరులపై ఆధారపడి విశ్వసించడమో, విశ్వసించకపోవడమో
కాక ఏమి చేయ గలరు? ఏవైన ఆధారాలు లభించినచో కొంత ఊహ చేయగలరు.
ఉన్న వాస్తవాన్ని మీ ముందుంచడం వరకే నా పని. గమనించి ఒక నిర్ణయానికి రావడం మీవంతే.
నేను విశ్వసించమనను, విడువమనను. మన పరోక్షంలో జరిగిన జరిగినవంటున్న
- వాటి ఎడల మీకెప్పటికీ పరోక్ష జ్ఞానమే ఉంటుంది.
స్ప-4-B. రామాయణాదులలో
మంచే వుంది. అన్నది మీ యభిప్రాయం.
ప్ర. స్పం|| అందరకూ అలా అనిపించడం లేదెందుకని?
ఈ ప్రశ్నకు ఒక పక్షాన్ని స్వీకరించకుండా సమాధానం చెప్పడానికి యత్నించండి.
నాయభిప్రాయం చెప్పమంటే వాటిని పరిశీలించేవారు అనుకూల దృష్టినో, ప్రతికూల దృష్టినో పెట్టుకునే ఉంటున్నారు కనుక అని చెపుతాను. గ్రంథం పై
అభిప్రాయం చెప్ప మంటే వాల్మీ కాదులు లోకహిత కాంక్షకల మేధావులేననియూ, గ్రంథ రచనలో సమాజంలోని విభిన్న స్వభావాలనూ, ఆ స్వభావాలుకల
వ్యక్తుల పోకడలనూ అనితర సాధ్యమైన రీతిలో భావితరం వారి ఎదుట ప్రతిఫలింపజేయగలిగారు
అంటారనియూ,
కనుకనే ఈ
నాటికీ అవి బ్రతికే ఉన్నాయి. మంచికీ చెడుకూ కూడా-ఆయా వ్యక్తుల స్వభావాలననుసరించి
ప్రేరకాలుగా ఉంటున్నాయి. ఇది మీకాశ్చర్యకరంగానో, కొంత చేదుగానో ఉన్నప్పటికీ వాస్తవమే ఐయున్నది. మంచి,
చెడుల కెట్లు సమాజమే ప్రేరణ స్థానంగా ఉందో అట్లే ఆ గ్రంథాలున్నూ,
ఇక్కడ మరో నిజమేమంటే అట్టి రచనే నిజంగా పూర్తి సమాజానికి దర్పణం వంటిది
కాగలదు. అట్టి రచయితే సమాజాన్ని -మానవుల స్వభావాల్ని-వీలయినంత ఎక్కువగా అర్థంచేసికున్న
వారు కాగలడు. ఆ శక్తి వాల్మీకి, వ్యాసులలో గోచరించినంత
ఇతరులలో గోచరించదు. నవీనులలో ఆ పంథాననుసరించిన వారున్నా ఎంతో కొంత పై యిరువురిచే
ప్రభావితులైయ్యే ఉంటారనిపిస్తుంది నావరకు. ఆలోచించగలరు. సరైన రచయిత ఉన్న స్థితిని
చూపడమూ, ఉండాలను కుంటున్న స్థితిని ఫలిత రూపంలో చూపడమూ చేస్తాడు.
అదే అటు రామాయణంలోనూ, భారతంలోనూ ముగింపుగా కనుపిస్తుంది.
రావణ వధ, రామ పట్టాభిషేకం, కౌరవ వధ,
పాండవ పట్టాభిషేకం ఈ రెండూ సమాజానికి ఆదర్శాన్నివ్వడానికి కవి ఎంచుకున్న
రూపాలు. కవిలోని వాస్తవిక దృష్టి కాలంబనగా మరో అంశం కూడా కనుపిస్తుంది చూడగలిగితే,
అది ధర్మజ పట్టాభిషేకానంతరం మరల అధార్మికత క్రమంగా చోటు చేసికోవడం
అన్నది. ఇది సమాజపు పోకడకు అద్దం పడుతోంది. సమాజ గమనానికి ప్రబంధకాలేమీ లేకుంటే
అది క్రమంగా అవాంఛనీయ స్థితికి జారడం ఎప్పటికప్పుడు దానిని సరిచేయడానికో ఉద్యమం
అవసరం కావడం; జరిగిన, జరుగుతున్న, జరుగనున్న విషయమై ఉన్నది.
ఈ వాస్తవాన్ని గమనించనిచో ఊహలలో ఉండడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ అనుభవాల నుండీ,
చరిత్రాధ్యయనం నుండి గ్రహించి నిర్ణయించుకోండి.
:విశ్వాసమూ - వివేకము:
గత రెండు సంచికలలోనూ విశ్వాస వివేకాలను గూర్చి
కొంత వరకు వివరించాను. పాఠకులా విషయాన్ని సరిగనే అర్థం చేసికున్నారనుకుంటాను. మరికొన్ని
విషయాలు చెప్పి ఈ శీర్షిక ముగిస్తాను. ఆపై మీనుండి వచ్చే సందేహాలకూ, అభిప్రాయాలకూ స్పందన శీర్షికన
బదులివ్వగలను.
విశ్వాసమంటే
తెలియని వాటిపట్ల ఒక నిర్ణయానికి రావడమనీ,
ఆ నిర్ణయానికి రావడానికి ఆధారంగా ఆ విషయానికే చెందిన అంశాన్ని గాక
మరొక దానిని (సాధారణంగా ఆయా వ్యక్తులనూ, గ్రంథాలనూ) ఆధారంగా
స్వీకరిస్తుంటారనీ చెప్పాను. ఏనాటికైనా వ్యక్తి ఈ మెట్టును విడువక ఆయా విశ్వాసాంతర్గత
విషయాలలోని వాస్తవావాస్తవాలను తెలిసికో లేడు. ఆయా విషయాలను గురించి ఎవరు
తెలిసికోవాలనుకున్నా వాటిని ప్రయోగం ద్వారా మాత్రమే రూఢిగా తెలిసి కోవడం
సాధ్యపడుతుంది. జ్ఞానానికంతకంటే మార్గం లేదు. అన్వేషకులు ముందీ విషయాన్ని
స్పష్టంగా గమనించాలి. ఇక్కడో విషయం తెలుపడం ప్రయోజన కారికాగలదు. విశ్వాసులనగానే
ఆస్తిక మార్గీయులు అనే అర్ధం ప్రచారంలో వుంది. కానీ వాస్తవమేమంటే ఆయా విషయాలను
గూర్చి సమగ్ర జ్ఞానం లేకనే ఆ యా మార్గాలను బట్టి పోవువారందరూ విశ్వాసులే. ఈ విషయాన్ని
గమనించగలిగితే ప్రతి సిద్ధాంత ధోరణికి కొందరు విశ్వాసుల గుంపు ఏర్పడే వీలుంది అనీ
తెలుస్తుంది. ఆస్తికులూ, నాస్తికులూ కూడా ఆయా సిద్ధాంతకారులు
ప్రతిపాదించిన విషయాలను సిద్ధాంత స్వరూప స్వభావాలను-అర్థంచేసికొని గాక సిద్ధాంత ప్రవర్తకుల
వ్యక్తిత్వం చేతనో, మరో కారణం చేతనో ప్రభావితులై ఆ
మార్గాలనుసరిస్తున్న వారే. ఈ కోవకు చెందిన అందరిలోనూ అజ్ఞానం పాత్ర సమానంగానే
ఉంటున్నది. ఉదా: వేదం చెప్పింది గనుక ప్రమాణమని వైదికులెలా అంటుంటారో అలానే
మార్క్సు లెనిన్ లు చెప్పారు గనుక కమ్యూనిజం శాస్త్రీయమేనని కమ్యూనిష్టు
లంటుంటారు. యదార్ధంగా, కమ్యూనిష్టు లనుకునే వారిలో ఎంతమందికి
కమ్యూనిజం గానీ, మార్క్సు ఆర్థిక సూత్రాలు గానీ అర్థమైనాయంటారు?
కొందరకు అర్థమైనా యనుకున్నా అవి ఆచరణ సాధ్యాలేనని ఎంచి ఎందరు నిజ జీవితంలో
అమలు పరుస్తున్నారు. (పి. సుందరయ్యగారి లాంటి ఆదర్శ వ్యక్తిత్వం గలవారిని అలా
వుంచండి. అలాటి వారు ఏ పోకడకు కట్టుబడి ఉన్నా త్రికరణశుద్ధిగా ఉంటారు.)
మార్క్సిజానికి ఆధారంగా ఉన్న పదార్థ తత్వశాస్త్రపు మూడు ముఖ్య సూత్రాలనూ
అర్థంచేసికున్న దెంతమంది? అసలా మూడు సూత్రాలూ జడపదార్థానికీ,
చేతన పదార్థానికి అన్వయించి సరి పెట్టడం కుదురుతుందా? మార్క్సుకే ఊహా స్వర్గమైన కమ్యూన్ - (ఆశ్చర్యంగా ఉందా!? కొందరకు ఆవేశంగా కూడా ఉండొచ్చు. విశ్వాసులెవరికై నా వారి, వారి విశ్వాసాలపై దెబ్బపడితే అలానే ఉంటుంది మరి) నేటి కమ్యూనిష్టులకొక శాస్త్రీయ
సత్యమెట్టైంది. అలానే వెంకటాద్రిగారు కమ్యూనిజం అశాస్త్రీయం అనగానే అవుననుకునే,
(ఆ విషయ పరిజ్ఞానం తగినంత లేకనే అవునని వాదింపబోయే) హేతువాద
సంఘీయులు చాలమంది దొరుకుతారు మీకూ. వారిని విశ్వాసులనాలా? వివేకులందామా? గోరాగారు దేవుడు లేడంటే లేడనుకునే నా స్తికానుయాయులూ విశ్వాసులే. ఆయా పంధాలననుసరిస్తున్న
వీరందరూ ఆయా సిద్ధాంతాల విషయంలో కొద్దిపాటి జ్ఞానం కలవారే. ఇక పోతే విశేషజ్ఞానం
కలిగి ఉన్నామనుకునే వారిలోనూ ఆ యా సిద్ధాంతాలను పరీక్షించి సత్యా సత్యాలు
నిర్ధారించ గల కొలతలు-ప్రమాణ జ్ఞానం కలవా రెందరు? ఇందెంత
నిష్కర్షగా పరిశీలించ వలసిన అంశమో అలానే ఆ యా సిద్ధాంతకారులూ, ప్రవర్తకులూ కూడా సమాజ క్షేమాన్ని కోరే సహృదయులేనన్నదీ అంతే నిష్కర్షగా
అంగీకరించాల్సిన వాస్తవమే. గతంలో సత్యా సత్యాలను నిర్ధారించు యత్నాలే జరగ లేదనను
గానీ సరైన తూనికలు కలిగి సత్య నిర్ధారణా యత్నం జరిగి యుండినచో, (అలా నిర్ధారించబడినా వాటిని స్వీకరించుటకు అందరూ సిద్ధపడి ఉండినచో) ఈనాడు
ఇన్ని వర్గ వైషమ్యాలుండేవి కాదని మాత్రం చెప్పగలను. అసలీనాడు మాత్రం, రాగ ద్వేషాలు విడచి సత్య నిర్ధారణకై సిద్ధపడు వారెంత మందున్నారు? నా విజ్ఞాపనేమంటే అందరి శ్రేయస్సూ కోరి అలా పరిశీలించుకుందాము కదలిరండనే.
విశ్వాసమూ-వివేకమూ-3
ప్రకృతి పరిణామ క్రమంలో అత్యుతమ వికాసరూపం మానవుడు.
అయినా మానవ సామాజిక చరిత్రను చూడగలిగితే,
స్పందించే హృదయం నీకుంటే అవెల్లా సహృదయుల నెవ్వరినైనా కలచి వేయుగల
సంఘటనలే నన్నది, నిర్వివాదం. నాటి బుద్ధుని హృదయస్పందనల నుండి, నేటి శ్రీశ్రీ లాంటి వారి కలాల నుండి జాలువారిన కన్నీటి సిరా ముద్రల వరకు
చూడగలిగే హృదయముంటే చూడండి. “నరజాతి చరిత్ర అంతా పరపీడన పరాయణత్వం ” అన్న మాట
ఎన్ని విషాద సంఘటనలు ఆయన హృదయాన్ని తాకితే పుట్టి ఉంటుందో ఊహించగలరా? మాదిగొప్ప, మాదిగొప్ప అనుకుంటూ నాలుగు గోడల మధ్యనో,
అనుయాయుల పొగడ్తల మధ్యనో కూర్చుని జీవితాల్ని జీవితాల్నే గడిపివేసే
వాళ్ళకేం తెలుస్తాయి మానవత్వపు విలువలు. వందల, వేల
సిద్ధాంతాలు కలసైనా సమాజహితం కంటే విలువైనవి కాలేవన్న వివేకం ఆయా సిద్ధాంతాల
ప్రవర్తకులలో కలుగనంత కాలం, ఈ వర్గ వైషమ్యాలకు అంతం ఉండదు.
వ్యష్టి, సమష్టి, సుఖ శాంతుల కొరకై ఉపయోగించవలసిన ఆయా సిద్ధాంతాలూ, - ప్రణాళికలూ కూడా మానవ వినాశనానికి (ద్వేషమూ, పగా
మొదలైన అవలక్షణాలకు) ఆధార స్థానాలుగా ఉంటున్నాయి. వాస్తవాన్ని చూడాలన్న తపనా,
ధర్మానికి మానవత్వపు విలువలకూ అనుగుణ్యంగా స్పందించే హృదయమూ ఉంటే,
వివేక నేత్రాన్ని తెరవడానికి యిష్టపడగలిగితే, జ్ఞానమన్నది
ఉన్న సమస్యల్ని పరిష్కారాలనూ కూడా చూపుతుందనీ, అజ్ఞానం-తప్పు
తెలివి-అసలు సమస్యల్ని చూపజాలదనీ, పరిష్కారాలు కూడా లభించవనీ
గ్రహించగల తెలివి తేటలుంటే, గతాన్నీ వర్తమానాన్ని మీ
వ్యక్తిగత జీవితాన్ని కలిపి అధ్యయనం చేయండి. అప్పుడు తెలుస్తుంది జరగ కూడనివెన్ని
జరిగిపోయాయో, జరుగుతున్నాయో, జరగనున్నాయో, కొన్ని సంఘటనలు చూపుతాను గమనించండి. (1)క్రీస్తు
ఎందుకు సిలువ వేయబడ్డాడు? (2) మహమ్మద్
మక్కా వదిలి పారిపోవలసిన పరిస్థితి ఎందు కేర్పడింది? (3) వేద విధుల పేరిట నర మేధ పర్యంతమైన హింసాకాండకు బలమెక్కడ నుండి వచ్చింది?
(4) శంకరులవారి పై విషప్రయోగ మెందుకు జరిగింది?
శంకరుల నానాటి – బ్రాహ్మణ
సంఘం వెలివేసిందెందుకు? (5) శంకరుల ప్రాణాల్ని కోరిన కాపాలికుని కోర్కె
వెనుక నున్న ప్రేరణశక్తి ఏమిటి? (6)
దయానందసరస్వతి పై విష ప్రయోగం ఎందుకు చేయబడింది? (7) అలానే
పల్నాటి యుద్ధానికి బీజం ఎక్కడుందో గమనించగలరా? (8) ఈ దేశంలో మతాంధత నుండి పుట్టిన యుద్ధాలను గూర్చి ఆలోచిస్తే ఏమి
తెలుస్తుంది? (9) గజనీ, గోరీ దండయాత్రల -వెనుక నున్న మార్మకశక్తి ఏది? ఈనాటి
పంజాబ్, అస్సాం, పాకిస్తాన్, కాశ్మీర్, నక్సలిజం ఈ
సమస్యలన్నిటినీ పుట్టిస్తున్న శక్తి ఏది?
బాహ్య కారణాలనేకం కనుపిస్తున్నా వీటన్నిటికీ
మూలకారణం ఒక్కటే. అది అజ్ఞానమే. ఆ అజ్ఞాన జనిత విశ్వాసాల నుండి ఏర్పడిన, నాదీ-ఇతరులది అన్న భావనే వర్గ
వైష్యమ్యాలకు ఆధారస్థానంగా ఉంటోంది. ఈ అజ్ఞానమన్నది శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది.
మతతత్వం, కులతత్వం, ప్రాంతీయతత్వం,
పార్టీతత్వం, ఇలా ఎన్నో శాఖ లున్నాయి, ఈ అజ్ఞాన వృక్షానికి. దీనికి స్వార్ధం కాండంగా ఉంది.
ఈ అజ్ఞానం
నుండి పుట్టిన విళ్వాసాలను, వీటిని కల్పించిన స్వార్ధపూరిత కుటిల మేధావి వరాన్నీ, సంఘం సామూహికంగా వెలివేయగలిగిననాడు అంతా శుభంకాగలదు. కొందరు కుహనా మేధావుల
యత్న ఫలితంగా ఈ దేశంలోని మనిషి క్షుద్ర జంతువు కంటే హీనంగా చూడబడ్డాడు. దీనికి
బాధ్యులైన వారిని శిక్షించ కుండా విడువడం మానవత్వానికే మచ్చ కాగలదు సహించి
ఊరుకోవడం అధర్మా నికి పట్టం కట్టడమే. అసలు ఒక మనిషికి మరో మనిషిని శాసించే అధికారం
ఎలా సంక్రమించింది? ఏవడో కుటిల మేధావి అది నాకు జన్మతః
లభించిన హక్కు అన్నాడనుకోండి, నిజం దానిని ఎలా, ఎందుకు అంగీకరించి సహించగలిగింది. ఇలా జరిగిన అన్యాయాలూ, అమానుషాలూ వందల కొలది ప్రత్యక్షమవుతాయి చూడగలిగితే. కళ్ళుండీ చూడలేని,
మనుషులుగా పుట్టి మనిషిగా జీవించ లేని వారిని మనుషులుగానూ, మాన్యులుగానూ చూడడమే సమాజం గతంలో చేసిన నేరం చేస్తున్న పొరబాటు, నేడూ నేనంటానూ ఎవ్వడైనా నిన్ను అసృశ్యుడా అంటే నీవే వాడిని వెలివేసేయ్.
సమాజంలోని సాటి మనిషిని పుట్టుకను బట్టే నికృష్టులనీ,
అంటరానివారనీ వేరు చేసే బుద్ధి లేనివాళ్ళను వేలి వేయగలిగిన రోజునగానీ వారికి
బుద్ధిరాదు. అంతవరకు మనమెంతచెప్పినా వినరు సరికదా! ఏవేవో దిక్కుమాలిన ప్రమాణాల్ని
వారి వారి చచ్చు గ్రంధాలనుండి ఉటంకిస్తారు. అట్టి వారినీ, వారి
కాధారమైన గ్రంధ రచనలు చేసి మానవత్వాన్నే మంట గలిపిన వారి మూల పురుషుల్నీ, గంగలో దూకమనండి. ...
సాటి
మానవులారా! మానవత్వపు పరిధిలోనే జీవించగల మేధావులారా! మనిషి మనిషిగా జీవించడమే
సహజంగా ఉంటుంది. మిగిలిన నానా భావాలన్నీ కృత్రిమమే. ఈనాడు మన ముందూ, అన్ని సాంప్రదాయ ప్రవర్తకుల ముందూ
ఉన్న అసలు సమస్య, నిద్రాణమై, అణగ
గొట్టబడియున్న మానవత్వాన్ని మేలుకొలిపి ఉద్ధరించి దానికి పట్టం కట్టడమే. అందులోనే
ఉంది అసలు శ్రేయస్సూ, అందరి శ్రేయస్సూ. లేవండి! వివేక నేత్రం
తెరవండి. అజ్ఞానపు పొరల్ని చించి వేయండి. సమాజంలో మానవత్వమే రాజమార్గమని చాటండి.
ఇది కష్టసాధ్యమైన విషయమే అయినా ఈ విషయం లోనే విప్లవం రావలిసి ఉంది. ఈ వందల సంవత్సరాలపాటు
అనేక కుటిల మేధావుల నిరంతర యత్నంవల్ల (అజ్ఞానాన్ని తొలగించుకునే అవకాశాలు లేకుండా
చేయడం ద్వారానూ, విశ్వాసాల ప్రయోజనాన్ని పదే పదే నూరిపోయడం
ద్వారానూ) సహజంగా సంక్రమించిన విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మనిషి గొర్రెలా
మారాడు. ఈనాడు మన మనస్సులెంతగా ముకుళించుకుపోయాయంటే, నాయనా!
కళ్ళు కప్పి వేయ బడ్డాయ్ నీకు, నిజంగా నీవు చూడగల సమర్థుడివే, కళ్ళు తెరువు అని తట్టి లేపుతుంటే, కళ్ళు మూసుకుని “గొర్రెలా”
అనుసరించటాని కలవాటు పడ్డ అతని మనస్సు లేవ నంటోంది. కళ్ళు తెరవనంటోంది. అదేమంటే
అదేదో పుట్టి మునిగిపోతుందని భయపడుతోంది. పైగా అసలెందుకు కళ్ళు తెరవాలి? అని మనల్నే కసురుకుంటోంది. ఇది ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితి.
ఎక్కువభాగం ఈ పంధాలోనే ఉంది సమాజం. వీటన్నిటికీ కారణం తప్పు తెలివే, అజ్ఞానమే. అజ్ఞానాంధ కారమునుండీ ఏర్పడిన కొన్ని విశ్వాసాలే. అజ్ఞానమనే
విత్తనం నుండే విశ్వాసవృక్షం పుడుతోందన్న వాస్తవాన్ని గమనించగలిగినవాడు, విశ్వాస క్షేత్రాన్ని జీవితంలో దాని పాత్రనూ కనీస (ప్రమాదరహిత) స్థాయికి
కుదించడానికి వీలవు తుంది.
అయ్యలారా!
కళ్ళుతెరవండి! మీ కొంపేంమునగదు. విచారణ-వివేకమార్గంలో ప్రమాదములేమీ ఉండవనీ, ఏ రకంగా చూసినా జ్ఞానం యొక్క పాత్ర
జీవితంలో తగ్గించడానికి వీలు లేనిదనీ, దాని ఆధారంతోనే జీవికను
సాగించవలసి వుందని స్పష్టంగా గమనించండి. చక్కగా విషయ పరిశీలన చేసి ఉచిత నిర్ణయం
తీసుకుని శ్రేష్ఠ మార్గాన ప్రయాణించండి. ఈ శీర్షిక ఇంతటితో ముగిస్తున్నాను. దీనిపై
ఉత్తర ప్రత్యుత్తరాలు స్పందన-ప్రతిస్పందన ద్వారా జరుపుకొనగలము. పై సంచిక నుండి
“చేదు నిజాలు” అన్న శీర్షిక ప్రారంభం కానున్నది. ఉంటాను.
No comments:
Post a Comment