మేలుకొలుపు
సంపుటి – 2 సం క్రాంతి సంచిక -1 1-1-92
ప్రమాణ వివేచన - 2
ప్రమాణములు పరికరముల ననుసరించి పద్ధతుల ననుసరించీ ఏర్పడతాయనుకున్నాము కదా. పద్ధతుల ననుసరించి ప్రమాణములేమో వివరించలేదంటూ ఒకరిద్దరు లేఖలు వ్రాశారు. ఆ లేఖలనుబట్టి విషయాన్ని మరో విధంగా చెప్పినచో బాగుంటుందనిపిస్తోంది. పరిశీలించి గత సంచికలో ఈ విషయం చెప్పానో లేదో కూడా గమనించండి.
1)
పరికరముల ననుసరించి ప్రమాణములారు.
రూపాదులకు నేత్రమూ, రసాదులకు జిహ్వ అలానే ముక్కు, త్వక్కు, చెవి ప్రమాణములౌతాయి. ఇంత వరకు బాహ్య విషయ జ్ఞాన సాధనములివి. ఆరవదిగా
అంతరింద్రియమొకటి. దీనిని మనస్సందాము. మొత్తం పరికరములు 6.
కనుక ప్రమాణములారు.
2) పద్ధతులను-ప్రకార భేదాన్ని-బట్టి
ప్రమాణములను భిన్న సిద్ధాంతకారులు, విభిన్న రీతులుగా ప్రతిపాదించారు. అందరు చెప్పినవి కూడా
క్రోడీకరిస్తే ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనన్న
3 ప్రమాణము లేర్పడతాయి. చిన్నచిన్న తేడాలున్నాయనుకుంటూ
వాటినే ఉపమానము, అర్ధాపత్తి, అనుపలబ్ది,
ఐతిహ్యము, సంభవము అన్న పేర్లతో మొత్తం 8 ప్రమాణములుగా మరి కొందరు వర్గీకరించారు. పద్ధతుల ననుసరించి ప్రమాణములివే.
3) నా దృష్టి నుండి ఇవి ముఖ్యంగా రెండు. (1) ప్రత్యక్ష పధ్ధతి (2) పరోక్ష పద్ధతి. ఈ
పరోక్ష పద్ధతిని మళ్ళా కనీసం రెండు భాగాలుగా చూడాల్సి వస్తున్నది. వాటినే అనుమానము,
శబ్దము అన్న పేర్లతో పిలుస్తున్నాము. ప్రత్యక్షమూ, అనుమానమూ, శబ్ధమూనని ప్రకార బేధంచే ప్రమాణాలు మూడన్న
మాట.
( Note :- పరికరముల ననుసరించిన ఆరు ప్రమాణాలూ ఒక్క ప్రత్యక్ష పద్ధతిలో ఇమిడి
పోతాయి.)
వేటివలన జ్ఞానం కలుగుతున్నది? అని ప్రశ్నించుకుంటే ఆయా ఇంద్రియముల వలన
అనీ, ఏ ప్రకారం జ్ఞానం కలుగుతోంది? అని
ప్రశ్నించుకుంటే ప్రత్యక్ష,
అనుమానాదుల ద్వారాననీ సమాధానం వస్తుంది. అలానే ప్రత్యక్ష పదార్ధ మేది అని
ప్రశ్నించుకుని ఏ యింద్రియాన్ని సూచించినా లక్షణం చెప్పినట్లు కాజాలదు. ప్రక్రియా
విశేషాన్ని ఇంద్రియార్ధ సన్నికర్ష జరిగి, సన్నికర్షలోనున్నంత వరకు తెలియడం అని
చెప్పి తీరాలి. అలానే రూప జ్ఞానం ఎలా కలిగింది? అంటే
ప్రత్యక్షాదుల వలన అంటే లక్షణం చెప్పినట్లుకాక, నేత్రం వలన
అన్నప్పుడే కరణనిర్దేశం చేసినట్లవుతుంది. విషయాన్ని పరిశీలించి అర్ధం కాకుంటే
ప్రశ్నించండి. స్పందనకు లేఖ వ్రాయండి. జ్ఞాన ప్రకరణంలో పరిశీలించవలసిన మరో
అంశముందిక్కడ, చూడండి.
మనిషి
తనకు కలుగుతున్న అనుభవాలనూ, వాటిననుసరించి తాను చేస్తున్నపనులనూ సమీక్షించి చూసుకుంటే అనుభవాలూ,
వాటి నుండి కలుగుతున్న జ్ఞానమూ రెండు రకములుగా నున్నట్లు
బోధపడుతుంది. (1) యదార్ధ జ్ఞానము-తద్వతి తత్ర్పకారకానుభవం,
(2) అయదార్థ జ్ఞానము-తదభావ వతి తత్ర్ప
కారకానుభవం. అంటే (1) ఎట్టి విషయమో అట్టి ప్రతిబింబమే అనుభవ
రూపాన్ని పొందడం, దీనినే ప్రమ ఆంటాము. అట్లుగాక (2) ఉన్న
విషయానికి భిన్నమైన ప్రతిబింబం అనుభవరూపంగా నుండడం. దీనినే భ్రమ అంటాము. అసలలా
ఎందుకు జరుగుతుంది? అంటే భ్రమలకు కారణా లేమిటని అడిగినట్లు.
అది సందర్భం వచ్చినప్పుడు అనుకుంటాము. జీవితంలో సహజంగానే జరుగుతున్న జ్ఞాన
ప్రక్రియలో భ్రమకూడా చోటు చేసుకుంది కనుకనే, దాని వలన
జీవితానికి నష్టమూ, ప్రమాదమూ ఏర్పడుతోంది కనుకనే. అసలీ
ప్రమాణ, తర్క విచారణ అవసరమైంది మనిషికి. వీటి పట్ల సామాన్య
జ్ఞానం ప్రతి మనిషికి ఉంది. భ్రమ రహితంగా, వాస్తవ జ్ఞానాన్నే
నిరంతరం పొందవలసిన అవసరం ఉంది గనుకనే ఆయా పరికరాలు, ప్రక్రియలూ,
భ్రమలకు కారణాలూ, వీటిని గురించిన విశేషజ్ఞానం
పొందటం తప్పనిసరి అయింది మనిషికి. Note:-జిజ్ఞాసువుకు
జ్ఞానార్జనలో, కలిగినది తప్పు జ్ఞానమా? ఒప్పు జ్ఞానమా? నిశ్చయించుకోవడం అతి ప్రధానమూ, జ్ఞానార్జనా
ప్రక్రియలో ఆయా విషయాలకు ముగింపు కూడా అవుతుంది. ఈ పాఠ క్రమాన్నలా ఉంచి పాఠకులు
గమనించ వలసిన మరి కొంత సమాచారాన్ని అందించి ఈ సంచిక ముగిస్తాను.
తర్క
ధోరణులనేక మున్నాయనీ, అలా వివిధ రీతులేర్పడడానికి వారి వారిలోని అవగాహనాలోపమో, స్వపక్ష మండన దృక్పథమో, పరపక్ష ఖండనే లక్ష్యముగా
పెట్టుకొనుటో కారణాలుగా ఉంటాయని గమనించాము. అలా తర్కరీతుల మాదిరే తార్కికులలోనూ (1) అతితార్కికులు, (2)
మధ్యమానుసారులు (3) మందవేగులు అను మూడురకాల వారుంటారు. Note:-ఈ పేర్లు నచ్చకుంటే మరో పేరు పెట్టుకోండి. 3 రకాల తార్కికులుంటారన్నదే
గమనించవలసిన అసలు విషయం.
ప్రతి
మనిషీ జ్ఞానేంద్రియాలా, మెదడూ, వాటి పనుల తీరుతెన్నుల ననుసరించి
స్వాభావికంగానే విచక్షణా శీలిగా నున్నాడు. అట్లా సహజంగానే ఏర్పడి యున్న తార్కిక
శక్తిని కొందరు అక్కరలేనంతగా ఉపయోగిస్తుంటారు. వీరినే అతితార్కికులనేది. (2) మరో రకము వారు తర్కాన్ని అవసరమైనంత మేర జీవితానుభవాల నతిక్రమించకుండా
ఉపయోగించుకుంటారు. వీరినే మధ్యమానుసారులు అంటాము. ఈ తరహా తర్కాన్నే గత సంచికలో
నేను అనుభవాంగ తర్కము అన్నది. ఇక మూడో రకం వారున్నారే. (సమాజంలోనూ సాంప్రదాయ
ప్రచారకులలోనూ, భిన్న ధోరణుల ప్రచారకులలోనూ,వీరే ఎక్కువగా ఉండటం దురదృష్టకరం). వీరు తర్కాన్ని పూర్తిగా విడువరు,
[తర్కించడం మానవ స్వభావం కనుక.] అలా అని అవసరమైనంత మేర అనగా
పరిశీలించవలసిన అంశాలలో పరిశీలనలు పూర్తయ్యేంత వరకూ దానిని ఉపయోగిస్తారా అంటే అదీ
లేదు. పోనీ యితరులు పరిశీలిస్తానంటే అంగీకరిస్తారా? అబ్బే
అలా అయితే ఇక అనుకోవడ మెందుకు? వీరి పనీ, వీరి తార్కికతా కూడా మునగానామ్, తేలానామ్‌గా
ఉంటుంది. పూర్తి విశ్వాసులూ కారు, విచారణశీలురూ కారు. నేడు
సమాజాన్ని ప్రమాదపు నదిలో ముంచెత్తుతున్నదీ మూడవ తరహా తార్కికులే. వీరు తాము
చెప్పగలము అనుకున్నంత వరకు హేతు బద్దంగానే మాట్లాడుతుంటారు. ఋజువులు లేకుంటే ఎలా
గయ్యా! అని ఎదుటివారి నడుగుతూనే ఉంటారు. తాము చెప్పగల విషయం ముగిసిందనుకోండి.
అప్పటికింకా మిగిలి వున్న సందేహాల నెవరైనా అడిగితే మాత్రం తర్కించకు, తర్కానికవధుల్లేవు, నిలకడా లేదు. తర్కం పనికిరాదు
అంటూ మరో పాటందుకుంటారు. ముందు ముందాయా పరిశీలనలలో వీరు మనకధికంగానే ఎదురు పడతారు
గనుక తార్కికుల్లోని ఈ రకాలను గుర్తులో ఉంచుకోండి ప్రస్తుతానికి.
ఇక
ఒకటవ రకం వాళ్ళన్నారు చూశారూ! వారికిక ఇది అవసరమా? అనవసరమా అన్న స్పృహే ఉండదు. చిన్న చిన్న
విషయాలనైనా తర్కించుతూ రోజులకు రోజులే వెచ్చించగలరు వీరు. లోకం ఏమైపోతున్నా
వీరికేమీ పట్టదు. ఒక రకంగా తర్క కండూతి వీరిది. తర్కించకుండా ఉండలేరు. ఆ తర్కానికి
హద్దే ఉండదు. మరో ఆశ్చర్యకరమైన విషయ మేమంటే అలా రోజులూ, నెలలూ,
సంవత్సరాలూ కూడా తర్కిస్తూనే గడిపివేయ గలరు వీరు. అయినా విషయం
మాత్రం ఒక కొలిక్కిరాదు. వీరి వరకు వీరికి ఆనందంగానూ, బహు
తృప్తిగానూ, గొప్ప ఘన కార్యం సాధించినట్లున్నూ ఉంటుంది
తర్కిస్తూ జీవితం గడిపివేస్తుంటే. తర్కమన్నది విషయ పరిశీలనకూ, వివేక సామర్థ్యాన్నిపెంచుకొనుటకూ కేవల మొక సాధనం మాత్రమేనన్న దృష్టి ఉండదు
ఈ రకం వారిలో. వీళ్ళలో మరల రెండు రకాల వాళ్ళున్నారు. (1)
విషయ పరిజ్ఞానం కలిగున్నవారు, (2) అదీ
లేనివారు. ఇరువురూ తర్కానంద స్వాములే. తర్కం వీరికి జ్ఞాన సాధనంగా కాక ఆనంద
సాధకంగా ఉంటుంది. వీరిలో రెండో రకం వారు తాము చెడి, యితరులనూ
చెడగొడుతుంటారు. మరి ఒకటో రకం వారు మాత్రం తామేమీ నష్టపోడు. వారి పాలబడిన వారు
మాత్రం జీవితాన్నీ, విలువైన కాలాన్నీ చాలా నష్టపోతారు. మీమీ
అనుభవాల నుండీ, సమాజాన్ని పరిశీలించడం నుండీ పై విషయాలు
గమనించి రూఢి పరచుకునే యత్నం చేయండి. అట్టి తరగతుల వ్యక్తులు లేరు అనిపిస్తే నాకు
వ్రాయండి. అట్టి వారిని కలిసే ఏర్పాటు చేస్తాను. అలానే మీరూ ఏ మూడు రకాల వారిలో
చేరి ఉన్నారో చూసుకోండి.
మరోమాట.
తర్కమన్నమాట వ్యవహారంలో రకరకాలుగా వాడుతున్నప్పటికీ, తర్కశాస్త్రము అన్న ప్రయోగంలో మాత్రమే
దానికి సరైన అర్థం చెప్పబడింది. ప్రమాణైః అర్థ పరీక్షణం న్యాయం! అన్నది
తర్కలక్షణం. ప్రమాణాదులచే (హేతూదాహరణలే ఇక్కడ ప్రమాణ శబ్దంచే సూచితం). అంటే ఆధార
సహితంగా విషయాన్ని పరీక్షించి నిర్ణయించే ప్రక్రియావిశేషాన్నే తర్కమంటామని పై
వాక్య భావం. సత్యనిర్థారణకై మనిషి చేయు క్రమబద్ధమైన మానసిక ప్రక్రియే తర్కమంటే. ఈ
అర్ధాన్ని అర్థం చేసుకోగలిగితే మానవ జీవితంలో తర్కం పాత్రేమిటో, ప్రాధాన్యతేవిటో బోధపడుతుంది. తర్కాన్ని గూర్చి చులకనగా మాట్లాడే
వారెవరైనప్పటికీ తర్కమంటే ఏమో వారి కర్థం కాలేదనాల్సిందే. అయితే ఇక్కడ గమనించవలసిన
మరో అంశముంది. అది వెనుక చెప్పుకున్న అతి తర్కమో, అటూ
ఇటూగాని- మందవేగుల తర్కమో కాకుండా ఉండాలి. కేవలం ఒక్క అనుభవాంగ తర్కానికే అట్టి
విలువుంది. తర్కపద నిర్వచనం మరో రకంగానూ చెప్పబడింది. “అవిజ్ఞాతతత్వే అర్ధే కారణోపసత్తితః
తత్వజ్ఞానార్థం ఊహః తర్కః” తెలియబడని విషయంయొక్క యదార్థ స్థితిని గ్రహించుటకై
కొన్ని ఆధారాలతో ఊహ చేయడం తర్కము అని సూత్రార్థం. ఈ సూత్రం అనుమాన ప్రమాణంలో-
పరోక్ష జ్ఞానవిషయంలో తర్క దృష్టియొక్క పాత్రను, అవసరాన్నీ
సూచిస్తోంది. అందుతున్న ఆధారాన్ని బట్టి అందుబాటులో లేని విషయాన్ని నిర్ధారించుటకై
చేయు ఊహనే తర్కమంటారని అర్థం.
తర్కం
శాబ్దీ ప్రమ- శబ్ద ప్రమాణం వల్ల కలుగుతున్న జ్ఞానం-విషయంలో కూడా అవసరమా కాదా? పనికొస్తుందా లేదా? ఆలోచించి
స్పందనకు వ్రాయండి. అలానే, తర్కబద్ధం కాని సిద్ధాంత ముంటుందా?
ఉంటుందంటే ఎలాగో, అదే సిద్ధాంతమో చెప్పండి.
ఉండదన్నారనుకోండి! ఇక మీరెప్పుడూ తర్కం పనికిరాదనీ, తర్కించకండనీ
ఎక్కడా అనకూడదన్న విషయం గమనించండి. సమాజంలో హేతుబద్ధంగా ఆలోచించేవాళ్ళపై
కుహనాగురువులు చల్లిన బురదగానీ, తర్కబద్ధంగా యోచించడమనే
పనిపట్ల అమాయకులైన తమ తమ అనుయాయులలో కల్పించిన వ్యతిరేకతగానీ, అంతింతనలేము. యదార్ధ శతృవులైన ఈ పండితమ్మన్యుల వల్ల అటు సమాజానికీ,
ఇటు విజ్ఞానకాయానికి జరిగిన అపకారం మరే రకమైన శతృవులవల్లనూ
జరుగలేదన్నది పచ్చి నిజం. సృష్టిలోని సమస్త పదార్ధములందునూ శుద్ధమూ, వికశిత రూపమూ, శక్తివంతమూనైన మానవ మేధస్సును ఉపయోగించుకోనీకుండా
అడ్డుపడుతున్న బాధ గురువుల నేమనాలి? ఏమన్నా ప్రయోజనం లేదు.
ఏరివేయాలి.
ఇప్పటికే
కొందరు తర్కజ్ఞులకు అసలు విషయం చెప్పవయ్యా ఎందుకీ ఉపోద్ఘాతం అని అడగాల
నిపిస్తూండవచ్చు. తార్కికులకలా అనిపించడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ప్రతి
తార్కికునికీ ఎదుటివాడు ప్రతిపాదించే విషయాన్ని సందేహించి పరిశీలించే ప్రవృత్తి
అలవాటుగా మారి ఉంటుంది. వారికి నేచెప్పేదేమంటే పత్రికోద్దేశం ప్రమాణ నిర్దేశమో, తార్కికులతో చర్చించడమో మాత్రం కాదు గనుకనూ,
భిన్న స్థాయిలోని పాఠకులకు-జిజ్ఞాసువులకు ఆయా విషయాల్ని క్రమంగా
అందించడమెలా అన్నది కూడా పరిగణించవలసి ఉంది కనుకనూ రచనా విధానం వివరణాత్మకంగా
ఉండుంటే ఉచితమౌతుంది. ఈ ప్రమాణ విద్యనూ, ఆధ్యాత్మిక-విద్యనూ
కూడా బోధించడమూ, గ్రహించడమూ, మరో
తార్కికునితో చర్చించడమూ కూడా తేలికైన విషయమేమీ కాదు. ఈ విషయమూ తార్కికులకున్నూ
తెలియనిది కాదనుకొందును.
Note:-1) ప్రత్యక్షగోచరం కాని దాన్ని తర్కంద్వారానే
గమనించాలి, సాధించాలి అన్న నిర్ణయానికి ప్రాచీన తాత్వికులు
ఎక్కువమంది వచ్చినా రనిపిస్తోంది నాకు వచ్చిన రచనలు చూస్తుంటే. మీరేమంటారు.
1)
ప్రత్యక్ష గోచరం కాని పరమాణువుల ఉనికినీ, వాటి ధర్మాలను వైజ్ఞానికులే ఆధారంతో ప్రతిపాదించి ఉంటారో
యోచించండి. మీ యోచనలను స్పందనకు వ్రాయండి.
చేదునిజాలు -1
వెనుకటి తరాల మేధావులూ, విజ్ఞానులూ, సహృదయులూ
నైన అనేకుల నిరంతర శ్రను వల్ల ఏర్పడిన అనేక వనరులను నేడు మనం సులభంగా పొంద
గలుగుతున్నాము. అందులకు వారలకు సర్వదా కృతజ్ఞులమై యుండుట మన విధి. మరోవంక గతంలోని
మరి కొందరు స్వార్ధపరులచే అమాయకులైన సామాన్య ప్రజానీకంలో ప్రవేశ పెట్టబడిన కొన్ని దుష్ట విధానాల వల్లా, అజ్ఞాన జనిత అంధ విశ్వాసాలవల్లా
ఏర్పడుతున్న విషఫలాలను కూడా ప్రస్తుతం మనమందరమూ అనుభవిస్తూనే ఉన్నాము. మంచి,
చెడుల కలివిడిగా సంక్రమించిన ఆ గతాన్ని పరిశీలించి, ప్రయోగించి వడపోసికొనగలగడం విజ్ఞత కాగలదు. అది మనకూ, మన ద్వారా సంక్రమించబోయే ముందు తరానికి కూడా శుభదాయకమవుతుంది. “చేదు
నిజాలు” అన్న శీర్షికన దుష్టాకృతినొంది మనకందిన -వెంటనే అందరం కలసి సవరించుకోవలసిన
- కొన్ని అంశాల్ని మీ ముందుంచుతాను. పరిశీలించండి ఆలోచించండి. తగిన విధంగా కదలండి.
నలుగురనూ కదిలించండి.
పరిశీలనాసక్తులైన మేధావులారా!
జ్ఞానార్ధులైన జిజ్ఞాసువులారా! సాధ్యసిద్ధి పర్యంతం శ్రమించగల సాధకులారా! ఆధ్యాత్మ
విద్యా వివేకాన్ని కలిగించడమూ, కలిగించుకోవడమూ (అధ్యాపనమూ, అధ్యయనమూ) కూడా బహు
కష్టసాధ్యమైన పని. తెలుపువాడూ , తెలిసికొనువాడూ కూడా తగిన
మానసిక స్థాయీ (ఇష్టాయిష్టాల నేర్పరచు కొనకుండా విషయాన్ని విషయంగా చూపించగలా,
చూడగలా సమర్ధతా) సునిశిత పరిశీలనా శక్తి (బుద్ధికుశలతా) ఏకాగ్రతా
(అన్యమనస్కత లేకుండడం) కలిగియుండిననే గానీ విద్య పూర్ణరూపము నందజాలదు. ఎందుకనగా ఈ
ప్రక్రియ ఇరువురి శ్రమపై నాధార పడియున్నది. చెప్పువాడూ, వినువాడూ
కూడా తమతమ పనులను లక్ష్యశుద్ధి కలిగి నిర్వర్తించగలిగిన గానీ విద్య వంటబట్టదు.
కోరిన-సరైన ఫలితం రావాలంటే బోధకునికీ, సాధకునికి కూడా తగిన
అర్హతలుండాలన్నదే ఇచ్చట ప్రముఖాంశము. ఈ విషయంలో ఇరువురూ ఎవరికి వారు ముందు తనకు
తాను అర్హుడో కాదో చూసుకుని రెండవవాడూ అర్హుడో కాదో చూడవలసి ఉంది. ఈ పద్ధతి అమలు
జరిగినంతకాలం విద్యా ప్రమాణాలు సమున్నతంగానే ఉంటాయి. లేనినాడవి క్రమంగా
బలహీనపడతాయి.
బోధకుడు తాను స్వానుభవం ద్వారా
గ్రహించినవీ, మరల మరల ప్రయోగ రూపంలో రూఢిపరచుకొనదగినవీ అయిన వాటిని మాత్రమే తెలుప
యత్నించడమూ, అదిన్నీ విద్యార్ధి ప్రయోగాలద్వారా స్వానుభవ
రూపంగానే ఆయా విషయ జ్ఞానము నండునట్లు ప్రేరేపించడమూ చేయగలగాలి. అట్టివాడే
గురువనదగ్గవాడు. అట్లు గాక వాస్తవంగా తనకే తెలియని వాటిని [తెలుసుననుకుని] తెలుప
యత్నించాడనుకోండి!? ఆ సందర్భంలో విద్యార్ధిలో ఏర్పడిన
సందేహాలను సమర్ధవంతంగా, తానూ, నివృత్తి
చేయజాలడు గనుక విషయాన్ని ప్రక్కదారులు పట్టించడమో, పెద్దలను
ప్రశ్నించకు అనే అహేతుక మైనట్టి, విద్యావిధానానికే
అవమానకరమైనట్టి పంధాను స్వీకంచడమో, లేక ఆ ప్రశ్నకు తప్పు
సమాధానాన్ని (అప్పటికి తట్టిన పరిష్కారాన్ని) చూపి తాత్కాలికంగా తృప్తి పడడమో
చేస్తాడు. అప్పుడేం జరుగుతుంది? 1) శ్రమ దండుగ, 2) కాలహరణము 3) భ్రమ జ్ఞానాధారంగా జీవితాన్ని
సాగించుట జరుగుతుంది. తప్పుజ్ఞానం - జీవితాల్ని (సమా జాల్ని) నడుపుతుంటే ఎంత
ప్రమాదమేర్పడుతుందో కొంచెం నిదానించి చూడండి చూడగలిగితే.
చెప్పగలగడమూ-తగిన భాషా సామర్థ్యము- ఆ
చెపుతున్నవి స్వానుభవం ద్వారా గ్రహించి, ఆచరిస్తున్నవై యుండడమూ గురువుకుండవలసిన అర్హత లవుతున్నాయి. Note:-ఇక్కడో విషయం చింతించదగియున్నది. అది జ్ఞానానికి, హృదయానికి
ఉన్న తేడా ఏమిటనేదే. ఒక్క ఉదాహరణనిస్తాను. గమనించి మీ అనుభవాలనుండి విపుల పరిశీలన
చేయండి. ఒక పక్షి దెబ్బతగిలి గిలగిల లాడుతోంది. ఆ దృశ్యాన్ని కొందరు వ్యక్తులు
చూశారు. జరిగిన సంఘటన అందరకూ తెలిసింది. ఆపై వారి ప్రవర్తనలు మాత్రం భిన్నంగా
ఉంటున్నాయి. ఒకరు అయ్యో అనుకున్నారు. మరొకరు బలే తన్ను కుంటోంది అని ఆనందిస్తున్నారు.
మరొక్కరు చిక్కితే బాగుండును ఈ రోజు కూర మజాగా ఉంటుందనుకుంటుంటే, మరొకడున్నూ
పట్టుకునే యత్నం చేస్తున్నాడు. అయితే వాడి మనస్సులో చికిత్స చేయాలనుంది. కలిగిన జ్ఞానమొక్కటే
అయినా ఆ జ్ఞానం వారిలో కలిగించిన ప్రవృత్తులు వేరుగా ఉన్నాయి. ఆ భిన్న ప్రవృత్తుల
కాధారమైన భావనలనే (feelings) హృదయం అన్న మాట సూచిస్తోంది. అలాంటివే మరి కొన్ని పరిశీలించండి.
సరే విషయానికొద్దాం. గురువన్న వానికి
వెనుక చెప్పిన జ్ఞానస్థాయి ఒక అర్హతకాగా హృదయ పరంగా ఉండవలసిన అర్హత మరొకటుంది.
తాను స్వానుభవం ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని నలుగురకూ పంచాలన్న అందించాలన్న -భావనా, ఇవ్వకుండా ఉండలేనితనం - తపనా – కలిగి ఉండాలతడు. ఇవ్వగల సమర్ధతా, ఇవ్వాలన్న తపనా అన్నది గురువు అర్హతలు.
అట్టివారే యదార్థ గురువులు. పరమగురువులు కాగలరు.
అట్లే అధ్యయనశీలురకున్ను, విద్య తన అవసరంగా అనిపించాలి.
(మొక్కుబడిగానో, ఇతరుల వత్తిడి నుండో యత్నించే వారు యదార్థ
జిజ్ఞాసువులు కాలేరు. అలానే జిజ్ఞాస కలిగి ఉన్నప్పటికీ ఏదో తెలిసికోవాలి ఏదో
తెలిసికోవాలి అనుకుంటుంటే సరిపోదు. ఏమి తెలిసికోవాలి? అది
యిప్పటి కెంత తెలిసింది? ఎక్కడనుండి తెలియవలసి ఉంది? అన్నది విస్పష్టంగా తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే జ్ఞానార్జన సరైన
స్థానం నుండి మొదలవుతుంది. ఏనాడు విద్యార్థికి తాను విద్యా గ్రహీతననీ, విద్య తన జీవితావసరమనీ గుర్తులో లేకుండా పోయిందో ఆనాడే విద్యా విధానానికొక
మౌలికమైన రోగం సంక్రమించింది. ఈ రోగాన్ని కుదుర్చుకోనంత కాలం అతనికీ విద్య పట్టనూ
పట్టదు. పట్టింది సద్వినియోగమూ కాదు. విద్య కొనుక్కోగలను అన్న భావం విద్యార్థికి
ఎన్నడూ కలుగరాదు. పరిగ్రహీతనన్న (పొందవలసిన వాడిని, స్వీకరించవలసిన
వాడిని అన్న భావం విద్యార్థికి సర్వదా శ్రేయస్కరం కాగలదు.
ఇంతవరకూ అర్థమైందనుకుంటేనూ, బాగానే ఉందనుకుంటేనూ ఈ కొలతల నుండి నేటి
గురువులనూ, విద్యార్థులనూ, (అన్ని
శాఖలకు చెందిన విద్యాలయాలలోనూ) పరీక్షించి చూసుకుంటే అన్నీ చేదు నిజాల్నే
చవిచూడవలసి వస్తుంది. జ్ఞానరహితమైన హృదయం వలన గానీ [ఇందుకు అజ్ఞురాలైన
తల్లి ప్రవర్తన మంచి ఉదాహ రణము.] సహృదయతలేని జ్ఞానం వలన గానీ (స్వార్థ పరత్వమూ, కపటమూ కల
మేధావులందరూ ఇందుకు ఉదాహరణమే) సమాజానికి కలగవలసిన మేలు కలుగజాలదు. ప్రతి క్షణమూ, ప్రతి
రంగాన్ని ప్రభావితం చేయగల అంశమిది. శోచనీయమైన విషయమేమంటే ప్రస్తుతం ఈ రెండూ
వేటికవి వేరుగా ఉండి రాజ్య మేలుతున్నాయి, అయ్యలారా. నేను చెబుతున్న
విషయాన్నూరక చదువుకుంటూ పోకుండా కొంచమాగి విచారించి చూడండి. సమాజంలో నాడూ నేడూ
కూడా ఆయా శాఖలకు చెందిన విద్యాధికులు దండిగానే ఉన్నారు. (ఒక్క ఆధ్యాత్మ విద్యను
మినహాయిస్తే) ఉన్న విద్యాధికులనందరనూ ఒక చోట చేర్చి సమాజంలో విద్యాధికుని, పాత్ర-బాధ్యత-అన్న
వివేకపు కొలత నుండి గానీ, తెలిసిన దానిని (ఆ తెలియుటకూ ఖచ్చితంగా సమాజమే
ఆధారంగా ఉంది సుమా.) సమాజానికై వినియోగించాలి-సమాజానికి తెలుపాలి, తెలుపకుండా
ఉండలేను ఉన్న హృదయానికి చెందిన కొలత నుండి గానీ కొలిచి చూస్తే సరి తూగేదెంతమంది? గురువులు
వారికై వారు ఆత్మ విమర్శ చేసికునిగానీ మనం చేయబోయే విచారణకు నిలిచి గానీ దీనికి సమాధానం చెప్పమనండి. అబ్బే పరీక్షలో
నిలిచే సంఖ్య ఏమాత్రం లెఖ్ఖలోకి రాదన్నది ముమ్మాటికీ నిజం. విద్యా విషయమై
తెలుపువారి విభాగానికి చెందిన బోధకులకు సంబంధించిన వాస్తవ స్థితియిది. రాకాసిలా
బలపడి దుష్ఫలితాల్ని సృష్టిస్తూన్నదీ, అందువల్లనే ప్రభుత్వమూ, ప్రజలూ కూడా
ఎంతో ప్రాధాన్యతనిచ్చి సరిచేసికోవలసినదీ అయిన ఈ అంశం ప్రస్తుతం అత్యంత సామాన్య
విషయంగా మారిపోయింది. అంతేకాదు, దాని వాస్తవ విలువల గురించి
నాలాంటి వాడెవడైనా వివరించినా అదేదో విషయాన్ని భూతద్దంలోంచి చూపిస్తున్నాడని
భ్రమపడేస్తాయి, పడిపోయింది సగటు మనిషి మనస్సు. పై వివరణ అతిశయోక్తిగా
ఉందన్న అభిప్రాయం యిప్పటికే మీలోనూ చాలామందికి కలిగి ఉంటుంది. ఆగండి. ఆలోచించి
చూడండి. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు సరికదా! వాస్తవంగా చూపాల్సిన రూపాన్ని
గూడా కొంత క్లుప్తీకరించే మీ ముందుంచాను. ఎందుకలా అనగలిగానంటే, ఏ పనికైనా అర్హత అన్నది ప్రాధమిక నియమమూ, అవసరమూ
కూడా కదా! ప్రాధమిక నియమములూ కనీసార్హతలూ కూడా లేని వ్యక్తులున్న రంగాలు ఏమి
సాధించగలవన్నది మన విద్యారంగాన్నీ, ఆశ్రమాలనూ అక్కడ తయారై
సహజంలోకి వస్తున్న విద్యార్ధులనూ చూడగలిగితే స్పష్టంగానే కనపడుతుంది. చిన్న నా
బొజ్జకు శ్రీరామరక్ష అనుకునే మన నాయకమ్మన్యులకు – పాలకులకు - వాటిని సంస్కరించే తీరుబాటెక్కడిది. ఆ వారి
స్వవిషయాలు చూసుకుందుకే 24 గం|| సరిపోవడం లేదాయె పాపం.
ఈ రంగంలోని రెండో విభాగం - విద్యార్థుల
పక్షం పరిస్థితి కూడా ఏ మాత్రం ఆశావహంగా లేదు. విద్యార్ధుల వికృత చేష్టలూ, రౌడీ క్షేత్రాలలోనూ, రాజకీయ క్షేత్రాలలోనూ, ఖూనీకోరుల సమాఖ్యలలోనూ, జులాయి తిరుగుళ్ళ విభాగం లోనూ, వ్యసనాల
బానిసత్వంలోనూ, సమ్మెలూ-బందులూ నిర్వహించడం లోనూ, ఎన్నికలలోనూ ఇలా ఒక్క తమ స్వంత క్షేత్రమైన విద్యార్జనను విడచి పెడితే
విశ్వరూపు ధరించగల స్థాయిలో వికృతంగా ఎదిగిపోతున్నారు వారు. ఈ అమాయక యువశక్తిని
ఆయా ప్రాంతాల కుల నాయకులూ, గ్రూపు నాయకులూ, దాదాలూ, పాలకులు
కూడా సరి సమానంగా వాడుకుంటున్నారు. ఇక సంస్కరణేం కుదురుతుంది. వీరు సంస్కరింపబడితే
పైనాయక మన్యులందరూ మాడిచస్తారు. తాము బ్రతకాలి గనుక విద్యార్ధులలా బలిపశువులై
[ఆవేశంతో స్వంత జీవితాన్ని బలి చేసుకుంటున్నా మనే వివేకం లేక] చావవలసిందే. ఈ
విషయాలు ఎవరికి వారికిగా, చాలా మంది సహృదయుల మనస్సులలో
మెదులుతూనే ఉన్నా అందరం కలసి అరవాలనీ, ఆలోచించాలనీ, అందువల్లైనా. ఏదో విధంగా కలసి కదిలే యత్నం ఆరంభమవుతుందనీ నా ఆశ.
విద్యారంగానికే చెందినది, అన్నీ విద్యలకూ ఆధార విద్యగానున్నది, ధర్మాచరణకూ, నైతిక విలువలకూ ఉత్పత్తి స్థానీయమైనదీ అయిన తాత్విక - విద్యా క్షేత్రాలు ఎంత బలహీనంగా, ఎంత కల్మషపూరితంగా [అధార్మికంగానూ, అనైతికంగానూ] ఉన్నాయో మా స్వానుభవంలో గమనించిన వాటిని పై సంచికలో పాఠకుల ముందుంచే యత్నం చేస్తాను.
(సశేషం...)
అభ్యాసక్రమం – 6
సత్యాన్వేషణ మండలి సాధన క్రమాన్ననుసరించి
ఆధ్యాత్మ సాధకులుగా నుండగోరిన వారు తప్పనిసరిగా వారి వారి
వివరాలతో మాకు లేఖలు వ్రాయవలసి ఉంటుంది. అలానే ప్రతి మూడు మాసాలకూ జరిగే ( సాధనా, విచారణ)
శిబిరాలలో విధిగా పాల్గొనవలసి ఉంటుంది. నాయనలారా! ఇప్పటి వరకు క్రమంగా చెప్పుకుంటూ
వస్తున్న అభ్యాసాలను అమలుపరుస్తున్నదీ లేనిదీ తెలుపండి. హృదయగతంగా నీకు ఎదగాలి
ఎదగాలి అన్న తపన ఉంటే మాత్రం సాధన ఈ క్రమంలో చేసి తీరాల్సిందే. సాధన అన్నది
ఎవరికివారు తమకిష్టమైన దగ్గర నుండి, ఇష్టమైనంతవరకు చేసేదిగానో, ఎప్పుడనిపిస్తే
అప్పుడాగి చేసేదిగానో, ఉండరాదు. క్రమం (నిర్ణీత వేళలూ, నిర్ణీత
పద్ధతి, నిరంతరాయతా)
తప్పకుండా అభ్యసిస్తున్నప్పుడే అది సాధన రూపాన్ని పొంది సాధ్యం వేపు మనల్ని
కదిలిస్తుంది. నాయనా! నేను సాధన చేస్తాను. సాధకుణ్ణి అని ఒక్కసారి నీవు దృఢంగా
నిశ్చయించుకున్న క్షణాన్నుండే నీవు నియమబద్ధుడవైనట్లు తెలిసికో. ఇక నియమమే నిన్ను
నడపాలి. అలా నియమబద్ధంగా జీవితాన్ని సాగించే వాళ్ళను చూసి వెక్కిరించేవాళ్ళూ, నిన్ను నీవే
అస్వతంత్రుణ్ణి చేసుకున్నావని చిన్నబుచ్చే వాళ్ళూ నీకూ, నీ సాధనకు
మొదటి శతృవులన్న (ప్రతిబంధకాలన్న) వాస్తవాన్ని గమనించు. వీలయినంత వరకు, మూర్ఖ
మేధావులూ, ఆచరణ
శూన్యులూ, జీవితావ
గాహన యందు బాలుర వంటి వారుయైన అట్టివారికి దూరంగా ఉండు. వాస్తవంగా
నీవు చేస్తున్న నిత్య సాధన నిష్ఫలమూ,
నిర్వీర్యము కాదనియూ, పై మూర్ఖులు తాము చెడి, నలుగుర్నీ చెడ గొట్టుటలో
మాత్రం కడు సమర్థులనియూ త్వరలోనే నీ స్వానుభవం నుండే గమనించగలవు. ఇందుకు ఎవరి
మాటలు నమ్మవలసిన పనిలేదు. నీకు నీ అనుభవమే సాక్ష్యం కాగలదు.
ఇష్టాయిష్టాలకూ-వివేకానికి మధ్య ప్రతి
మానవునిలోనూ అంతః సంఘర్షణ ఉంటోంది. ఏదో విషయంలో ఏదో సమయంలో స్వార్ధమూ, అజ్ఞానమూ ఇష్టాయిష్టాలకు ప్రాతినిథ్యం
వహిస్తే, వివేక మన్నది అవసరాలకూ, హితానికి
ప్రాతినిథ్యం వహిస్తుంది. స్వార్ధానికీ, వివేకానికీ మధ్య ఘర్షణ ఉంటూనే వుంది
అందరిలోనూ. అయితే వివేకసామర్థ్యం పెరిగినకొలదీ స్వార్ధం అవసరమైన పరిధుల్లోనికి,
కనీస స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు ఆచరణలో ధర్మం మొదలై హితాన్ని పుట్టిస్తుంది.
ఇష్టాయిష్టాలు (రాగ ద్వేషాలు) ఒకనికి గల సామాన్య జ్ఞానాన్ని, వివేకము విశేషజ్ఞానాన్ని సూచిస్తాయి.
వివేకమూ, దానిననుసరించిన జీవితమూ నన్నదే నీకూ, నలుగురకూ యోగక్షేమాలను కలిగించ గలదు. ప్రస్తుతం వ్యక్తులలో-సమాజములో
లోపించినది, ఎల్లప్పుడూ మనందరనూ నడుపవలసినదీ వివేకమేనని
గుర్తించు. వివేకవంతుడ వగుటకై నిరంతరమూ యత్నించు. మనిషిని, సమాజాన్నీ
కూడా అసలైన అభివృద్ధి వైపు కదల్చగల దొక్క వివేకమే.
4 వ సాధనగా, సామాజిక
సంబంధాలలో అత్యంత ప్రధాన పాత్ర వహిం గల వాగ్ఞియమాన్ని స్వీకరించవలసి ఉంది.
సాధకుడవశ్యమూ మితభాషిగా నుండాలి. అవసరమైన మాటలను, అవసరమైనంత మేరే మాట్లాడాలి. ఇది
ఆయా మాట్లాడే విషయాలపై సమగ్రమైన అవగాహనవల్లనూ నిరంతరాభ్యాసంవల్లనూ మాత్రమే సిద్ధిస్తుంది. అందువల్ల
వ్యక్తి మాటకు విలువ పెరుగుతుంది. పొల్లు మాటలు తగ్గుతాయి. యోచనలోనూ, పరిశీలనలోనూ గాఢత పెరుగుతుంది. పెట్టుకున్న
సాధ్యానికి చెందిన సాధనల నాచరిస్తూండడము ఉత్తమం. అలా మరో వంక అయిన దానికీ, కాని దానికీ పని గట్టుకుని చొరబడడం మానివేయాలి. ఈ రెండు క్రమాల్నీ
పాటించడం సాధ్య సిద్ధికి హేతువవుతుంది.
నియమ మన్నది మానవజీవితంలో వివేకం నుండి
ఏర్పడింది. అది మనిషి జీవన వ్యాపారంలో ఏది, ఎప్పుడు, ఎక్కడ,
ఎలా ఎంత అన్న కొలతలను కలిగి హక్కులూ, బాధ్యతలూ,
విధులూ అన్న వాటిలో క్రమాన్ని ఏర్పరుస్తూ పరిమితుల్ని కూడా
నిర్దేశిస్తుంది.
జీవన వ్యాపారం త్రికరణముల ద్వారా
జరుగుతుంది. అవి వాక్కు, కాయము, మనసు. నియమించవలసినవీ మూడే ముఖ్యంగా.
“యతవాక్కాయ మానసః” అని సూక్తి. “ముని” అన్న మాట వినే ఉంటావు. మౌని (మితభాషి) మనన
శీలుడు అని రెండర్థాలు చెప్పవచ్చు ఆ మాటకు. ప్రతి సాధకుడూ ముని కావలసివుంది.
“యోగస్య ప్రధమం ద్వారం. వాగ్ఞ్నిరోధో అపరిగ్రహః” అన్నదో సూత్రం. మాటలలో సత్యాన్నీ,
చేతలతో ధర్మాన్ని స్వీకరించ గల వారి వల్లే సమాజం నిజంగా
ఉద్ధరింపబడుతుంది. అరుపులెక్కువైన నేటి వాచాలుర సమాజాలు సాధన లేమి చేస్తాయి?
సిద్దినేల పొందుతాయి? సాధకుడా! నీవెన్నడూ
వాచాలుడవు కాకు. ప్రగల్భాలు పలుకకు. చేసినంతవరకు చెప్పుకుంటే ప్రమాదం లేదుగానీ,
చెప్పుకోకుండా ఉండలేని స్థితికి దిగజారకు. అవి నిన్ను మరింత
దిగజార్చి క్రమంగా చేయనివాటి విషయంలోనూ చేసిన వారిలా కనిపించేలా చేస్తుంది.
ఆచరణ శూన్యతా, ఆత్మస్తుతీ, పరనిందా
ఇవే నేడు సమాజాన్నీ, వ్యక్తుల్నీ కూడా భ్రష్టు పట్టిస్తున్న
ప్రముఖాంశాలు. ఈ నాడు ఎక్కడ చూసినా చెప్పడానికీ, చేయడానికీ పొంతనే లేదు. ప్రతి
ఒక్కణ్ణీ అతని మాటలను బట్టే కొలవ వలసివస్తే జ్ఞానంలో పరిపూర్ణుడే, సాధన విషయంలో సిద్ధుడే, సమాజ విషయంలో ఉద్ధారకుడే
అనవలసి వస్తుంది. మరి ఆచరణను బట్టి
చూస్తేనో అజ్ఞానమూ, స్వార్థమూ దాదాపుగా కరడుగట్టుకొని ఉంది. ఇక సాధనెక్కడా? సమాజోద్ధరణెక్కడ? త్రికరణ
శుద్ధి నేడు గగనకుసుమమే, గతస్మృతే, కలలోని
వార్తే.
నాయనా! చెపుతున్నది గమనిస్తున్నావా? మార్పు రావలసిందెక్కడో, మనిషి ఆధ్యాత్మక సాధన లెట్లు చేయ వలసి యుందో అర్ధమవుతున్నాయా? నిదానంగానూ, నిశితంగానూ ఆలోచించి ప్రయోగం ద్వారా సరిచూసుకుంటూ ఆచి తూచి
అడుగు వేయి. ప్రయాణం - సాధన - మాత్రం- గమ్యం చేరే వరకు ఆపకు. మనందరమూ మన మన
దృఢయత్నములద్వారా సిద్ధావస్థ నంద గలుగుదుముగాక! మిత భాషణమూ, సత్యభాషణమూనన్నవే వాక్కును నియమించుట యనగా,
గమనించి ఆచరించు. సందేహాలుంటే స్పందనకు వ్రాయి.
సంక్రాంతి
[విప్లవ] సందేశం
జిజ్ఞాసువులారా! సాధకులారా!
సమష్టిహితైషులారా! సంక్రాంతి - విప్లవ శుభాభినందనలు. క్రాంతి అన్నది మార్పుకు
సంకేతము. సంక్రాంతి అనగా సరైన మార్పు అని అర్ధము. వివేకం కల ప్రతి మనిషి వాంఛితమూ
కూడా సరైన మార్పే. కనుక మనందరమూ మన మన బుద్ధిశక్తినీ, క్రియాశక్తినీ, యిచ్ఛాశక్తినీ
సమీకరించి విప్లవ పధంలో పయనింతముగాక!
మానవ జీవితాన్నీ, మానవ సంఘాన్నీ, ప్రకృతిని పరిశీలించిన
ఋషులు-అధ్యయనశీలురు- ప్రతి చోటా మార్పును వీక్షించారు. నేటి ఆధునిక విజ్ఞానం కూడా
సమస్తమూ క్రియా వంతమే, పరిణామశీలమే నన్న విషయాన్ని రూఢి
పరుస్తోంది. మన మన యనుభవాల నుండి పరిశీలించినా జడచేతనాత్మకంగా ఉన్న తెలియబడుతున్న
సమస్తమూ క్రియావంతంగానే ఉంటున్నది. ఇక మానవ సంఘాన్ని పరిశీలించితే వారు వారు
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా,
ఆర్థికంగా ఏ స్థాయిలో నున్న వారైనా మార్పును (తనకిష్టమైనరీతిలో) కోరుతూనే ఉన్నారు.
అందుకై అందుబాటు లోనున్న వనరులననుసరించి (జ్ఞాన క్రియాశక్తుల సామర్థ్యాన్ని బట్టి)
నిరంతరయత్నం చేస్తున్నారు. అలానే సామాజిక పరంగానూ (అది ఏ స్థితిలో నున్నప్పటికీ)
ఉన్న స్థితి నుండి ఉండాలనుకుంటున్న స్థితి వైపుకు దానిని మార్చే యత్నం కూడా
చేస్తున్నారు.
ప్రకృతి స్వాభావింగానే మార్పును
పొందుతోంది. మనిషి మార్పునే కోరుతున్నాడు. జరుగుతున్నదీ మార్పే. కోరుతున్నదీ
మార్పే. మరి యింత సంఘర్షణ మానవునిలో-మానవులలో –ఎందుకుంటున్నది?
[Note : ఈ ఘర్షణ అన్నదే - ప్రాణిలో
వెదుకులాటను ప్రారంభింపజేసింది) వస్తున్న మార్పుకూ, కోరుతున్న-ఇష్టపడుతున్న- మార్పుకూ
మధ్య వైవిధ్యమూ, వైరుధ్యమూ కూడా ఉంటున్నది. అలానే కోరుకున్న
మార్పుకూ, కోరదగిన మార్పుకూ మధ్య కూడా విభేదం ఉంది. ఇక్కడనే
వ్యక్తిలో ఘర్షణ ప్రారంభమై సాటి వ్యక్తులతోనూ, ప్రకృతి తోనూ
కూడా ఘర్షణ పడే పరిస్థితి ఏర్పడింది. ఘర్షణ ఏ ప్రాణికీ యిష్టం లేదు. కానీ ఘర్షణ
తప్పుట లేదు. ఇదే అసలు సమస్య. దీని పరిష్కారాన్ని సాధించడానికే మనిషి నిరంతరం
శ్రమిస్తున్నాడు.
వస్తున్న మార్పు ప్రకృతి - స్వభావానికి, కోరుతున్న మార్పు స్వార్ధం ప్రధానమైన
ఇష్టాయిష్టాలకు, కోరదగిన మార్పు లేక రాదగిన మార్పు
వివేకానికి సంకేతాలుగా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో వస్తున్న మార్పుకు అనుగుణంగా తాను
మారడమో, తన కనుగుణంగా ప్రకృతిని మార్చుకోవడమో చేయగలిగినంత
కాలమే మానవునికి తన అస్థిత్వాన్ని నిలుపుకోవడమూ, ఇష్టాయిష్టాలను
పొందడమూ సాధ్యపడుతుంది. ఒక వంక ఈ పరిస్థితి మానవుణ్ణి నిరంతర శ్రమకు, ఘర్షణకు లోను చేస్తున్నది. ఈ స్థితిని దాటగలిగిన దశలోనూ మనిషి నిలకడగా
ఉండలేక పోతున్నాడు. అక్కడతనికి మరో విషయమైన ఘర్షణ ఏర్పడుతోంది. అది బ్రతుకు భద్రతే,
ప్రారంభ దశలో ప్రకృతితో ఘర్షణ పడ్డ మనిషి, పిదప
సాటి మనుషుల నుండి ప్రాణులనుండి కూడా ఘర్షణను ఎదుర్కొనవలసి వచ్చింది. అది
బలవంతుడిదే రాజ్యంగా రూపుదిద్దుకుంది. అట్టి దశలో సామాజిక సంబంధాల పాత్ర రంగ
ప్రవేశం చేసింది. దానితో యిష్టాయిష్టాల పై ఆంక్ష ఏర్పరచు కోవడమూ, వివేకం
చెప్పినట్లు హక్కులతో పాటు విధులను కూడా స్వీకరించడము తప్పనిసరైంది. విధులు
నిర్వర్తించి హక్కులు పొందడమన్నదే మనిషి ప్రస్తుతావసరాలను తీరుస్తూ రేపటికి
భద్రతను కూడా యివ్వగలదని అనుభవం ద్వారా ఋజువు చేయబడింది. ఆయా దేశాలలో, ఆయా సిద్ధాంత ధోరణులలో దీనిని ఏ యే పేర్లతో ప్రస్తావించినా ధర్మ
స్వరూపమంటే యిదే. చేయవలసినంతా చేయడమూ, తీసికో వలసి నంతే
తీసికోవడమూ అన్న విధాన మొక్క దాని వల్లనే రాదగిన మార్పు వ్యష్టిలోనూ, సమష్టిలోనూ,
ఎంతో కొంత ప్రకృతిలోనూ వస్తుంది. వివేక మార్గ మొక్కటే అటు - ప్రకృతి
సమతౌల్యతనూ, ఇటు సామాజిక సంబంధాల లోను సువ్యవస్థను
ఏర్పరచగలదు. ఇప్పటి మానవ జీవితానుభవాల నుండి చూస్తే ఇంతకంటే మార్గాంతరం లేదు.
వ్యష్టి, సమష్టి హితైషులూ, ఆ యా సిద్ధాంత ప్రచారకులు,
అనుయాయులూ కూడా గమనించవలసిన అసలు విషయ మిదే. ఉన్న ఘర్షణను అతి
తక్కువ స్థాయికి తగ్గించగలదీ ఒక్క మార్గమే. ఈ స్థితిని మనిషిలో పాదుకొల్పడమే
చేయవలసిన కార్యము. అది, జీవితం పట్ల కల సామాన్య జ్ఞానం నుండి
పుట్టిన, స్వార్థం ప్రధానమైన, ఇష్టాయిష్టాలను
పొందడం అన్న స్థితి నుండి, అదే జీవితం పట్ల ఏర్పడ్డ
విశేషానుభవాల నుండి పుట్టిన సమగ్ర జ్ఞానం ద్వారా భద్రత ప్రధానమైన, అందరకూ మేలు అన్న లక్ష్యం కలిగిన స్థితికి మార్పు చెందడమే. దీని కొరకే
ప్రస్తుతం ఉద్యమించవలసి ఉంది. ఈ మార్పు కొరకు శ్రమించేవే విప్లవ శక్తులంటే. ఈ
మార్పే నిజంగా సంక్రాతి-విప్లవం రావడమంటే. దీనికై ముందా వ్యక్తిలో గుణాత్మకమైన
మార్పురావలసి ఉంది. వ్యక్తి విధి నిర్వహణలో (చేయవలసిన పనుల ఎడల) క్రియాశీలుడై
యుండడమూ, సామాజిక స్థితి గతులను భంగపరచని స్థాయిలోనే
హక్కులను పొందదమూ, నలుగురి క్షేమంతో ముడిపడే తన యోగ
క్షేమాలున్నాయన్న వాస్తవాన్ని హృదయంలో నిలిపి ఉంచు కోవడము అన్నదే వ్యక్తిలో
రావలసిన మార్పు. వ్యక్తి స్వీయ వివేక సామర్థ్యం వల్ల తనను తాను అదుపు చేసికునిగానీ,
వివేకవంతులచే నిర్మించబడ్డ వ్యవస్థ అదుపులోనుండి గానీ పై విధంగా
ప్రవ ర్తించవలసి ఉంది. ఈ విధంగా వ్యక్తి పరమైన విప్లవం సిద్ధించినగానీ, సామాజిక పరమైన విప్లవం ఏర్పడదు.
ఇదెలా వస్తుంది. జీవితం పట్ల అవగాహన
పెరగడం వల్లనూ, వివేకం చెప్పిన క్రమాన్ని సాధన రూపంగా ప్రారంభించి అలవాటుగా మార్చుకోవడం
వల్లనూ. విషయాన్ని గమనించి పరిశీలించి అభిప్రాయాలు స్పందనకు వ్రాయండి. ఆధ్యాత్మిక సాధనలన్నవి
వ్యక్తిని కేంద్రం చేసుకుని వ్యక్తిలో రావలసిన మౌలికమైన మార్పుల నుద్దేశించే
ఉన్నాయి. జ్ఞానేంద్రియాలూ, కర్మేంద్రియాలు వాటిలో
కూడుకున్న జీవన సరళీ క్రమ పరచడమే ఆధ్యాత్మిక సాధనలకు సాధ్య వస్తువు. రాదగిన
కోరదగిన విప్లవ రూపమదే. ఉంటాను. సెలవ్.
సత్యాన్వేషణలో.
మీ సురేంద్ర.
No comments:
Post a Comment