Thursday, January 1, 2009

ఐక్య మిత్రమండలి ఆవశ్యకత - సంపాదకీయం


సంపాదకీయం
ఉద్యమ బంధువులారా!
మనమంతా ఉత్తమ సమాజం ఆదర్శంగా, ఎప్పటికప్పుడు, అప్పటికి ఉన్నదానికంటే మెరుగైన సమాజం లక్ష్యంగా వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్నవాళ్ళమే. ఇదే ఉద్దేశ్యంతో మనకంటే ముందే ఈ పనిలో తమ తమ శక్తియుక్తుల్ని ఖర్చుపెట్టిన మన పెద్దతరం ఉద్యమకారుల అనుభవాలుగానీ, ఆ వరవడినేపడి యధాశక్తి (శక్తికిమించీ) పనిచేస్తూ వస్తున్న ఈతరం ఉద్యమకారుల (మన) అనుభవాలుగానీ, ఒకే ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అదేమంటే, ఉద్యమ లక్ష్యాల సాధనకు ఉద్యమ క్షేత్రాలకు ఇప్పుడున్న శక్తియుక్తులు చాలవు. మరింత మరింతగా వాటిని సమకూర్చుకుని, ఏకోన్ముఖులమై పనిచేయాల్సి వుంది అన్నదే.
నేను తరచుగా చెపుతూ వస్తున్నదీ, ఉద్యమ క్షేత్రాలలో క్రియాశీలంగా పాల్గొంటూ, వాటి సాఫల్య వైఫల్యాలను, వాటికిగల కారణాలను పట్టిచూస్తున్న యోచనాపరులు గమనిస్తూ వున్నదీ ఏమిటంటే;
1) ఉద్యమ నిర్మాణం తగినంత స్థాయిలో జరగలా! జరగడంలేదుకూడా.
2) అవగాహన, ఇష్టము, కార్యకుశలతలు కలబోసుకున్న కార్యకర్తల నిర్మాణం జరగాలి! అదీ జరగడంలా.
3) వివిధ సంస్థల మధ్య ఉండాల్సినంత ఐక్యత, సామరస్యత, సహకారమన్నవీ నెలకొనే వుండడంలా.
4) సమస్య ఎంత పెద్దదో అంత ఎత్తున్న పరిష్కారయత్నమూ జరగాలన్న దృష్టి బలంగా వుండడంలా.
5) 1. కర్త-ఉద్దేశము-పరికరాలు-విధానము- పని- పనినిబట్టి ఫలితము అన్నది సాధారణ నియమం; 2. యెంత పనికి అంతయత్నమన్నదే సఫలతకు ఏకైక మార్గము - అన్న రెండు సార్వత్రిక సూత్రాలు మనందరిమధ్య బలంగా పాదుకుని అందరినీ కలిపి నడిపించలేకపోయాయి.
6) ఏ ఉద్యమ సంస్థకైనా వనరులే శక్తిస్థానాలు అవుతాయి. అందునా సుశిక్షితులైన కార్యకర్తలే మూల వనరు అవుతారు. ఇతరేతరాలన్న అవసరమైనవే అయినా దీనితో పోల్చితే తరువాతవి అవుతాయి.
- ఇవన్నీ అనుభవంలో మనందరికీ ఎదురైనవే. అప్పుడప్పుడు కలసి కూచుని మాట్లాడుకునే సందర్భంలో ప్రస్తావనలోకి వచ్చినవే. అయినా ఇప్పటికీ, అవి మళ్ళీ గుర్తుచేసుకుంటూ ఆచరణలోకి తెచ్చుకోవలసినవిగనే వున్నాయి.
- సమాజ పునర్నిర్మాణమన్నది ఏకోన్ముఖమైన సమష్టియత్నాలవల్ల మాత్రమే సాధ్యపడుతుందన్నది ఎవరూ కాదనకూడని వాస్తవం. నాకు తెలిసి, అవగాహనాపరుల మధ్య నిర్వివాదాంశం.
- ఆ అవగాహన ఆధారంగానే అక్కడక్కడా ప్రాంతీయంగానూ, జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ కనీస ఉమ్మడి కార్యక్రమాల పేరిట ఐక్యవేదికలు ఏర్పడ్డాయి. వాటి పుట్టుకకు ఆధారమైన భావనయొక్క స్ఫూర్తి వున్నంతకాలం అవి ఆయా సమస్యలపై శక్తివంతంగా పోరాడగలిగాయికూడా. అయితే ఆ అవగాహన; స్ఫూర్తి అన్నవి బలహీనపడుతూ వచ్చినకొద్దీ ఆ వేదికలు, అంశాల ప్రాధాన్యతాక్రమంలోని వ్యత్యాసాలవల్లగానీ, వైయక్తిక ప్రాధాన్యతాక్రమంలోని వ్యత్యాసాలవల్లగానీ క్రియాశీలతను కోల్పోయాయి. దాని అంతస్సారమైన కనీస ఉమ్మడి కార్యక్రమం అన్న విధానం మరుగునపడి, ఎవరి ప్రాధాన్యతలు వారు బలంగా ముందుకు తేవడం జరిగి పేరుకు మాత్రం ఐక్యవేదికలుగ తీరి కూచున్నాయి. అందులో వున్న సంస్థలు ఎవరికి వారు ఆ వేదికను, అది ఆరంభించిన పనిని రెండో, మూడో ప్రాధాన్యతగల అంశంగా చూడమొదలెట్టాయి. మళ్ళా సమస్య-సమష్టి యత్నం' అన్న వైఖరి వెనకబడింది.
మిత్రులారా! వివిధ ఉద్యమక్షేత్రాలలో నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసిన పలువురి సమష్టి సమాలోచన పునాదిగ ఏర్పడిందే 'మన ఐక్య మిత్రమండలి' దానికి మనం రూపొందించిన స్వరూప స్వభావాలరీత్యా అది ఇతరేతర ఐక్యవేదికలన్న కొంత విలక్షణమైనది, ఆరోగ్యకరమైనదికూడా. అయినా ఏ శరీరానికైనా ఆరోగ్యమొక్కటే సరిపోదు, బలమూ అవసరమే.
ఈమధ్యకాలంలో ఐక్యమిత్రమండలిలోని భాగస్వామ్య సంస్థలు వారి వారి మాతృక్షేత్రాలు పనుల వత్తిడివల్లగానీ, అవగాహనలోని వ్యత్యాసాల వత్తిడివల్లగానీ, ప్రవర్తనాపరమైన తేడాల వత్తిడివల్లగానీ, ఇలాంటి మరికొన్ని కారణాలవల్లగానీ కలుసుకోవడం తగ్గింది. ఆరోగ్యకరమైన, బలమైన ఉద్యమ భవిష్యత్తురీత్యా లోపాన్ని సత్వరం సరిచేసుకోవలసి వుంది.

No comments:

Post a Comment