Thursday, January 1, 2009

రాజకీయ సంక్షోభంలో రాష్ట్రం-మేధావుల కర్తవ్యం


ప్రత్యేక విజ్ఞప్తి

అవినీతికి, ఆశ్రిత పక్షపతానికీ, ధన సంచయనానికీ, దాదాగిరికీ, పదవీ వ్యామోహానికీ నిలయాలైన రాజకీయాలలో సమూలమైన మార్పులు రావాలని, లేకుంటే మెరుగైన సమాజం ఏర్పడడం అసంభవమని, అనుభవజ్ఞులూ, అభ్యుదయాకాంకక్షులూ తీవ్రంగా తలంచుతున్న తరుణంలో, 'చిరు' గాలి దుమారంలా రానున్నదని ఉన్న రెండు ప్రధాన పార్టీలూ దాని ఉధృతికి అధికార పీఠానికి దూరంగా విసిరివేయబడతాయనీ అనిపించింది నాలాంటి చాలామందికి. మంచి సమాజానికై చేసే యత్నాలలో మంచి రాజకీయాలు రావలసిన అవసరం ఎంతైనా వుంది. సమాజ గతి నిర్దేశకత్వంలో రాజకీయాల పాత్ర అనితరసాధ్యమైనది అన్న ఆలోచనకల వాళ్ళం కొందరం ఒకచోట కూడి, రాబోయే నూతన వేదికను ఆరోగ్యంగా, బలంగా పాత కొత్తల మేలు కలయికగా వుండేలా శక్తిమేర కృషిచేద్దాం అనుకోవడం జరిగింది. ఆ ఉద్యమ క్షేత్రాలలో వుంటూ, రాజకీయాలలో ప్రవేశించాలన్న అభిలాషా కలిగి, ఆయా ఉద్యమాల కార్యక్రమాలకు విఘాతం కలగనిరీతిలో గుర్తించి ఆ క్రొత్త రాజకీయ వేదికలో క్రియాశీల స్థానాలలోకి ప్రవేశపెట్టాలనుకున్నాము. అందువల్ల రెండు, మూడు ప్రయోజనాలు కలుగుతాయి అనుకున్నాం. (1) ఆ వేదిక విజయవంతమై అధికారంలోకి వస్తే, సామాజిక స్పృహ కలిగి, ఉద్యమాలలో పనిచేసినవారూ, ఉద్యమ సంస్థలతోటి ఆత్మీయ సంబంధాలు కలిగి వున్నవారూ వివిధ పదవులలో-అధికారంలో-వుంటారు గనుక రాజ్యాన్ని-పాలనను-ప్రజలవద్దకు చేర్చవచ్చు.

(2) ప్రజాప్రతినిధులుగనూ, శాసన నిర్మాతలుగను-పాలకులుగను యోగ్యులెలా వుంటారో, వుండవచ్చో, ప్రజలకు ఆచరణరీత్యా రుజువు పరచవచ్చు.
(3) క్రొత్త రాజకీయవేదిక-తనలోని నూతనత్వాన్ని, సంస్కరణాభిలాషను ప్రయోగపూర్వకంగా, యోగ్యులైన వ్యక్తుల్ని నాయకత్వస్థానాలలో వుంచడం ద్వారా ప్రజలకు చూపించుకోవచ్చు.
థాబ్దాలకాలంగా ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనవద్దు, ప్రజల్ని మేల్కొల్పడమే మన కర్తవ్యాలకు హద్దు అనుకుంటూ వచ్చిన మేము, సూత్రప్రాయంగా దానికి కట్టుబడే వున్నా, ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో రాజకీయ సంస్కరణలకై ఆపద్ధర్మంగా ఎన్నికలలోపు చేయగలంత కృషిచేద్దాం అనుకున్నాం.
ఆ నూతన వేదిక ఆరంభ గమనం కొంత ఆశావహంగనే అనిపించినా క్రమంగా అక్కడ జరుగుతున్న దానినిబట్టి మాలోని ఆశ సన్నగిల్లుతూ వచ్చింది. ఇప్పటికీ మా బృందంలో కొందరికి దానిపై దింపుడు కల్లం ఆశ వుందేమోగాని, నావరకు నాకు అది అంతకు ముందున్న వాటి వరవడినే చాలావరకు అందిపుచ్చుకుంది. ఆ రెంటినీ పడగొట్టేంత పెనుగాలేమీ పుట్టలేదనీ, పుట్టుక రాదనీకూడా తేలిపోయింది. కనీసం దీటైన పోటీని ఇవ్వగలదా లేదా అన్నదీ అనుమానమే అనిపిస్తోందిపుడు. అదేదో చేసేయబోతోంది అని ప్రజలు, పార్టీలు కూడా మల్లగుల్లాలు పడుతున్న తరుణంలోనే, ఆ వేదిక కలుపుకోగలిగినంతమేర ఉన్నంతలో మెరుగైన, రెండు పార్టీల ప్రతికూలత కలిగిన వారందరినీ కలుపుకోడానికి, బేషజాలకు పోకుండా చొరవ తీసుకునుండాల్సింది. ఆ పని చేయకపోగా, కలుద్దామన్న అభిలాషను, అనుకూల సంకేతాలను పంపినవారివైపు కన్నెత్తీ చూడకుండా తాత్సారం చేస్తూ వచ్చింది.
మరోవంక, ఇతర పార్టీలతో అసమ్మతివర్గంగా వుంటూ, అవకాశాలు రానిస్థితిలో వున్నచోటా, మోటా నాయకుల వలసలు కొద్దికొద్దిగా ప్రారంభమయ్యాయి. నిజాయితీ, నిబద్ధత, సమర్థత కలిగిన క్రొత్త శక్తులూ, యువత చేరవలసినంతగా చేరకపోవడం, చేరినంతవరకైనా క్రియాశీల స్థానాలలోకి చేరకపోవడం, చేర్చుకోకపోవడంతో ఆ వేదికకూ పాత రాజకీయ వేదికల స్వభావమూ, వాసనా వచ్చేసింది.
(1) అభిమాన సంఘాల ఆవేశం, (2) ఇతర పార్టీల నుండి అవకాశవాద రాజకీయాల వలస, (3) ప్రధాన కూటమిలోని ఎవరో ఒకరికి సన్నిహితులైనవారికి పెత్తనం దక్కడం వగైరా, వగైరాలన్నీ కలగలిసి లోపలా బైటాకూడా ఒక గంద్రగోళ పరిస్థితి నెలకొని వుంది. ప్రధాన నేతలతో సన్నిహితంగా వున్నవారిని చూస్తుంటే పనిచేసేవారికంటే పలుకుబడిగలవాళ్ళకే పట్టంగట్టే వైఖరే కనిపిస్తోంది కూడా! రాజకీయాలను స్వప్రయోజనాలకు వాడుకుందామనుకునేవారే లోలోపలికి చొచ్చుకుపోతున్నారు, పైపైకి ఎగబాకుతున్నారు. లోపలి పరిస్థితంతా అశాంతిమయమై నివురుగప్పిన నిప్పులా వుంది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు, అభ్యర్థుల ఖరారు జరిగితేగాని అస్సలు పరిస్థితి బైటపడదు. ఆ అంతర్ఘర్షణగా చల్లారుతుందో, మరింతగా ప్రజ్వరిల్లుతుందో వేచిచూడాల్సిందే. కుట్రలు, కుతంత్రాలు, రిగ్గింగులూ, కిడ్నాపులూ, కొనడాలు, అమ్మడాలు వగైరాలలో తలపండిన పెద్దపార్టీలు రెండూ ఈ మూడో వేదికలో గెలిచినవారిని ఏదోరకంగా ఎంతిచ్చినా కొనేయడానికి వ్యూహాత్మకంగా సిద్ధమై వుంటాయి. ఇదంతా మూడోవేదిక మంచి రాజకీయాలకు ప్రాతిపదిక కాలేదనడానికి చెపుతున్నదే.
ఇక వ్యక్తులుగా వారూ కొంత దిగజారుడుతనానికి లోనైనా సిద్ధాంత స్వరూప స్వభావాలకు వేరైన పోకడలు పోతున్నా కమ్యూనిస్టులు సొంతంగా అధికారంలోకి వస్తే మాత్రం ఇతర పార్టీల పాలనకంటే ఎంతో కొంత మెరుగ్గా రాజ్యాన్ని ప్రజలవద్దకు తీసుకెళతారు, అన్నది నా వ్యక్తిగతాభిప్రాయం. కానీ వారికి వారుగా అధికారంలోకి రావడమన్నది ఇక కలలోమాటే.
అందుకే మా బృందం, క్రొత్తవేదిక చొరవతీసుకుని, లోక్‌సత్తా, రెండు కమ్యూనిస్టు పార్టీలు, మొత్తం తెలంగాణావాదులు అన్న మూడు సముదాయాలతో పొత్తు కుదుర్చుకోవడం అత్యవసర కార్యం అన్న నిర్ణయానికి వచ్చింది. క్రొత్త వేదికలోని కొందరు ప్రముఖులనే సమాచారం అందించడమూ జరిగింది. అబ్బే! హితోక్తులు ఆత్మాధిక్యభావంగానీ, అతిశయంగాని కలవాళ్ళకు చేరవు. అక్కడ జరుగుతున్న తంతంతా గమనించాక ఇక ఆ వేదికపై మాలో చాలామందికి ఆశ చచ్చిపోయింది. ఇక్కడికిది గతం.
ఇకపోతే వర్తమానంలో రాజకీయ సంస్కరణలకు సూత్రప్రాయంగా కట్టుబడివున్న వేదిక లోక్‌సత్తాపార్టీ ఒక్కటే కనపడుతోంది. అయితే అది పలు కారణాలవల్ల (అందులో గెలిచేవారికే ఓటేద్దామన్న సాధారణుడి మనస్తత్త్వం ఒకటికాగా, మూడు రాజకీయాలా! అది చెప్పుకోడానికేగాని, చేయడానికి కుదిరేదికాదు అన్న లోకవాడుక బలంగా పనిచేస్తుండడంతోబాటు, వ్యవహారం దగ్గరకొచ్చేటప్పటికి, ఎవరికివారం తాన, తనవాళ్ళ ప్రయోజనాలు, అవసరాలు సాధించడంకొరకు అవినీతికి, అడ్డదారితొక్కడానికి వెనకాడకపోవడం చేస్తున్నపనేగనక; అవినీతి, ఆశ్రితపక్షపాతం లేకపోతే బాగుండదని కొంతా, అది పోనేపోదని ఇంకొంతా అనిపిస్తుండడంతో, లోక్‌సత్తా లేదా మంచి రాజకీయం అధికారంలోకి రావడం దుస్సాధ్యం అన్న దృష్టీ అత్యధిక జనాభాలో వుంటోంది. లోక్‌సత్తా తగినంతగా బలం పుంజుకోకపోవడానికి మరికొన్ని సంస్థాగతమైన లోపాలుంటే ఉండవచ్చునేమోగాని, ప్రధానకారణం జనం వైఖరిలోని పైనన్న అంశాలేనన్నది ఒక నిప్పులాంటి నిజం.
నిజంగా ప్రజలేగనక అవినీతిని అంతమొందించదలచుకుంటే అది ఎంతోకాలం పట్టదు. పైనుండి అవినీతిని ప్రోత్సహించేవారంతా దూదిపింజలల్లే ఎగిరిపోతారు. ప్రజలు 'ప్రలోభాలకు లొంగం, ఓటును అమ్మం' అనిగనక అనుకుంటే పైరవీలు, దాదాగిరీలు, డబ్బు, సారా పంపకాలు వగైరా వగైరాలన్నింటినీ తక్షణమే చెల్లుచీటీ ఇచ్చేసినట్లేకదా! అవినీతి ఈ విధంగా మనగల్గడానికి మూలకారణం ప్రజల్లో సమష్టి ప్రయోజనాలకంటే స్వార్థప్రయోజనాలకే ప్రాధాన్యతనిచ్చే స్వభావం బలంగా వుండడమే. కనుకనే సామాజిక స్పృహకల, బాధ్యతాయుతులైన పౌరులు రూపొందనంతకాలం మంచి సమాజం ఏర్పడదు. ఇదంతా తాత్వికతకు చెందిందే అయినా, ఈ అవగాహన ఆధారంగా చేసుకునే ఎవరమైనా ఆచరణసాధ్యమైనమేర మంచి మార్పుకై యత్నించాల్సి వుంది.
వ్యక్తులు, 'పదవి, అధికారం, అధికారం నుండి స్వప్రయోజనాలు' అన్న ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల వైఖరి నుండి మరలి, పదవి, అధికారం, మంచి సమాజ నిర్మాణంకొరకు అన్న దృష్టికి రావాలి. పదవి, అధికారం సంపాదించడానికి, శక్తివంచన లేకుండా కృషిచేయడానికి అంటే రాజకీయ సంస్కరణోద్యమంగా దీర్ఘకాలం పనిచేయడానికి (దీర్ఘకాలమంటే అంతూపొంతూ లేదనికాదు నా భావన) అంటే కనీసం 5, 6 సం||లు నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధపడగల ఉద్యమ స్వభావంకల వ్యక్తులు అందుకు అవసరపడతారు. దానికై అంచలవారీగా కార్యాచరణ ప్రణాళికా అవసరం.
ఇక లోక్‌సత్తా విషయానికివస్తే, (1) ఇతర పార్టీలతో పొత్తులొద్దు, (2) రేపటి ఎన్నికలు నెట్టుకొచ్చిన అనివార్యత గనుక, దానిని పార్టీ నిర్మాణానికి సాధనంగా వాడుకోవాలి. ప్రస్తుతానికిది రెండు రూపాలు. (ఎ) కమిటీల నియామకం, (బి) అభ్యర్థుల ఎంపిక, (3) మొత్తం స్థానాలకు పోటీచేయాలి. 'పై ఎన్నికలనాటికి గెలుపు' అన్న అభిప్రాయాన్ని అంగీకరించి 5, 6 సం||లు పనిచేయడానికి సిద్ధపడగలవారిని అందుకు ఎన్నుకోవాలి. (4) అలాగే కమిటీల బాధ్యుల్ని, ఈ అవగాహన, అభిప్రాయాలు కలవారినిగా చూసే ఎంపిక చేసుకోవాలి.
గమనిక : ఇందుకు నాకు తెలిసినంతలో, మంచి సమాజంకోసం వివిధ క్షేత్రాలలో థాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యమకారుల స్వభావంకల వ్యక్తులు తగినవారవుతారు. అయితే ఆ రకాన్ని గుర్తించడం, సమీకరించడం చాలా పెద్దపనే. (5) ఇక జనంలోనూ అట్టి భావాలను కలిగించడానికిగాను రాజకీయ అధ్యయన, శిక్షణ తరగతులు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం అన్నింటికంటే కీలకమైనదవుతుంది. గ్రామానికి 10 మంది శిక్షితులైన సభ్యులుండాలి పార్టీకి. ఈ పని 1 సం||లోగా చేసుకోవాలి. ఆపై గ్రామగ్రామాన సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలెట్టాలి, (7) గ్రామాలకు, పట్టణాలకు అవసరమైన, చేయగల ప్రత్యేక ప్యాకేజిలను పార్టీ ప్రణాళికగా రూపొందించి విస్తృతంగా ప్రచారంచేయాలి. (8) ఈ మేకు అవగాహనకల పార్టీ ప్రతినిధులు ఎక్కడికక్కడ  అప్పటికున్న ప్రభుత్వాలు, నిర్వహణాకారులతో ఆ పనులు చేయించడానికి పూనుకోవాలి. పార్టీలకతీతంగా, అవసరమైన పనులు చేస్తుండడంద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమన్నదే, ఇతరేతర యత్నాలన్నింటికంటే వాస్తవమైన బలం అవుతుంది ఎన్నికల బరిలోకి.
(9) ఉద్యమ సంస్థలతో బలమైన స్నేహ, సహకార సంబంధాలు నెలకొల్పుకోవడం నూతన రాజకీయ సాధనలో విప్లవాత్మకమైన అంశం కాగలదు.
(10) రేపటి ఎన్నికలలో కొన్నిస్థానాలనైనా గెలుచుకునేలా అవకాశమున్న వాటిని ఎంచుకుని, కేంద్రీకరించి, సర్వశక్తుల్నీ వెచ్చించి గెలుపుకై నిలబడగలగాలి. తద్వారా గెలిచిన కొద్దిమంది ద్వారానైనా యోగ్యుడైన శాసనసభ్యుడు ఎలా వుండాలో, వుండగలడోనన్న నమూనాను ప్రజల దృష్టికి తీసుకురావచ్చు.
పాఠకమిత్రులారా!
ఉద్యమ బంధవులారా! సమయం పరుగెడుతోంది. ప్రతి మనిషీ తన పనులు మానుకోకుండగనే మంచికి చేయూతనిస్తూ సాగుతుండవచ్చు. అలాగే వుండాలికూడా-కనుక, ఒకవేళ మొత్తంగా లోక్‌సత్తా రాజకీయ ప్రణాళికతో మనలో ఎవరంగానీ ఏకీభవించకున్నప్పటికీ, ఉన్నపార్టీ వేదికలన్నింటినీ తులనాత్మకంగా పట్టిచూస్తే, వివేకవంతమైన పౌరులంగా లోక్‌సత్తానే వున్నంతలో మెరుగు అన్న దగ్గరికి రాకతప్పదనిపిస్తోంది.
అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తామనీ, దానిని మాటవరసకుకాక చేతలలో చూపుతామని ప్రకటించి, గెలిచినా, ఓడినా అవినీతికి పాల్పడడం అన్న నినాదంతో ముందుకొచ్చిన లోక్‌సత్తా పార్టీని బలపరచడం సందర్భోచితం అవుతుంది. మరింత క్రియాశీలంగా అందులో పాలుపంచుకోగలిగినవారు దానిని మరింత ఆరోగ్యంగా వుండేలా చూసుకోవడం సముచితం, సందర్భోచితం అనిపిస్తోంది. చివరిగా ఒక్కమాట చెప్పాలి. లేకుంటే మండలిపై ఒక అపోహ పుట్టేవీలుంది.
సత్యాన్వేషణమండలి ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనదు. కానీ, సామాజిక నయంత్రణ స్థానాలన్నింటిలోకీ శక్తివంతమైనదీ, విస్తృతి కలది, అయిన రాజకీయ సంస్కరణలకై తనవంతు కృషిచేయక మానదు. సమాజ పునర్నిర్మాణ కార్యక్రమానికి చెందినంతలో, మండలి తాత్విక భావనల్లో నియంత్రణ స్థానాలలోకి సుశిక్షితులైన వ్యక్తులు చేరి స్థిరపడనంతకాలం మార్పు అసాధ్యం అన్నదీ ఒకటి. మండలి మూలభావనల్లో ఆదినుండీ ఉన్నదే ఇదిన్నూ.
కనుక ఉన్నంతలో మెరుగైనదీ, మరింత మెరుగుపరచుకోడానికి అవకాశమున్నదీ, మంచి రాజకీయాలే లక్ష్యంగా ఉనికిలోకి వచ్చానంటుందీ అయిన లోక్‌సత్తా పార్టీని అభ్యుదయ శక్తులంతా పెంచి పోషించుకోవలసి వుంది. ఆ దిశగా చొరవతీసుకుని రాజకీయ సంస్కరణల దిశగా ముందుకు కదలిరావలసిందిగా సామాజిక స్పృహ కలిగినవారందరికీ వ్యక్తిగతంగా విజ్ఞప్తిచేస్తున్నాను. 'తగిన సమయంలో, తగిన పని అన్నదే సత్ఫలితాలకు మూలం' కాగలుగుతుంది. ఆలోచించండి.  సత్యాన్వేషణలో - మీ సురేంద్ర

No comments:

Post a Comment