సమాజం ఎటుపోతోంది? ఎటు పోవాలనుకుంటుంది? జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తూ మంచి సమాజం కావాలని కోరుకునే హృదయాలు చాలా వత్తిడికి లోనవుతున్నాయి. వాస్తవంలో ఒక వ్యక్తి చేస్తున్న పని చేయదగ్గదే అనిగాని చేయదగింది కాదు అనిగాని చేయవలసిందే అనిగానీ, చేయనే కూడదు అనిగాని ఏ కొలతల ఆధారంగా నిర్ధారించాలి? ఆ కొలతలు రూపొందించుకోవడం వెనక పనిచేసిన ఆలోచనలేమిటి?లాంటి మూలాధార భావాలను గురించి స్పష్టత లేకుండా, కొన్ని సంఘటనల బాగోగులను నిర్ణయించడం కుదరదు. జులై 3, 4 తేదీలలో ప్రముఖంగా వార్తలకెక్కిన స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన కోర్టుతీర్పునూ, పై ప్రాతిపదికలాధారంగా విచారించడం చాలా అవసరం.
సంఘంతో ముడిపడి వున్న అంశాలలో మనుషుల ప్రవర్తనయొక్క సబబు బేసబబుల్ని నిర్ణయించడానికీ, సంఘ సంబంధాలు అప్రధానమై కేవలం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలలో మనుషుల ప్రవర్తనయొక్క సబబు బేసబబుల్ని నిర్ణయించడానికి వేరువేరు కొలతలు అవసరమవుతాయి.
1. ఆపని సంఘపరంచేస్తే రాబోయే పరిణామాలు ఎలా వుంటాయి? అవి సంఘ ప్రయోజనాలను దెబ్బతీస్తాయా? నేరవేర్పే దిశగా దోహదపడతాయా?
2. వ్యక్తిగతంగా ఏ అవసరం కొరకుగా ఆ పని జరుగుతున్నట్లు? ఆ పనిని నిషేధిస్తే జరగబోయే పరిణామాలేమిటి?
3. వ్యక్తి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను, సామాజిక స్థిరత్వానికీ, అవసరానికి మధ్య ప్రతికూలత-పొసగనితనం-ఏర్పడితే దేనికి ప్రాధాన్యతనివ్వాలి?
4. వ్యక్తికి అనివార్యంగా సమాజం అందించాల్సిన-హక్కుగా సంక్రమింపజేయాల్సిన-స్వేచ్ఛకు, ఒక వ్యక్తి, వ్యక్తిగా తాను కోరుకుంటున్న స్వేచ్ఛకు మధ్య పొసగనితనం చోటుచేసుకుంటే సమాజం దేనికి ప్రాధాన్యతనివ్వాలి?
5. స్వేచ్ఛ, విశృంఖలత రెండూ వ్యక్తి కోరుకుంటున్నవే అయినా సంఘం ఏ సూత్రాలాధారంగా స్వేచ్ఛ తప్పుకాదు, విశృంఖలత ఉండకూడదు అనంటుందో జాగ్రత్తగా విచారించాలి.
6. ఏయే అంశాలలో, ఏ స్థాయి స్వేచ్ఛ, విశృంఖలత క్రిందికి వస్తుంది? ఏది విశృంఖలత క్రిందికిరాదు అన్నది నిర్ణయించడానికి, ఆధారంగా తీసుకోవలసిన అంశాలేమిటి?
7. ఒక వ్యక్తి, లేదా కొందరు వ్యక్తులు చేస్తున్న, చేయడానికి ఇష్టపడుతున్నపని, దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలకు విఘాతం కలిగించవచ్చునన్నప్పుడు ఆ పనికి, ఆ కోర్కెకు ఒక హద్దు ఏర్పరచడం అవసరమా? కాదా?
గమనిక : మరింత కూలంకషంగా పరిశీలన మొదలెడితే ఇలాంటివే మరికొన్ని పరిశీలనాంశాలూ బైటపడవచ్చు. మీరూ ఎవరికి వారుగా ఆ దృష్టినుండి ఆలోచించండి. క్రొత్త ఆలోచనలు వస్తే పత్రికకు వ్రాయండి.
ఇహ ఇప్పుడు స్వలింగ సంపర్కాన్ని గురించి కొన్ని వివరాలలోకి పోదాం.
1. స్వలింగ సంపర్కం బ్రతుకు అవసరాల క్రిందికి వస్తుందా? రాదా?
2. ఏ అవసరం తీర్చుకోడానికి ఇది మార్గమైంది? ఆ అవసరం తీర్చుకునే మరో మార్గం. ఇతర మార్గాలు - ఏమీ లేవా? అనేక మార్గాలున్నాయనంటే ఏది అనుసరించదగింది అవుతోంది? ఏది మెరుగైంది అవుతోంది?
3. స్వలింగ సంపర్కం సామాజిక అవసరం నుండి పుట్టుకొచ్చిందా?
4. ఏ సామాజికావసరాన్ని నెరవేర్చడానికై అది ఏర్పడింది?
5. అసలింతకూ లైంగిక సంబంధం ప్రాణుల్లో ఏ అవసరం కోసం ఏర్పడింది?
6. స్వలింగ సంపర్కానికీ, సజాతి సంపర్కానికీ, విజాతి సంపర్కానికీ మధ్యన్ను తేడాఏమిటి?
7. మగ-మగ, ఆడ-ఆడ లైంగిక వాంఛ తీర్చుకోడానికి చట్టబద్ధత కలిగించాంకదా? మరి విజాతి సంపర్కానికి ఆమోదం తెలిపితే అభ్యంతర పడాల్సిన అవసరముందా?
8. స్వలింగ సంపర్కం అంటే ఏమిటసలు? ఇరువు స్త్రీలు స్వలింగ సంపర్కం చేసుకోడమంటే ఏమిటి?
9. నోటితో రతి, గుదంతో రతి, హస్తప్రయోగం, పరస్పర హస్తప్రయోగం వగైరా ఇరువురు పురుషుల అనుసరించడానికి వీలున్న పద్ధతులు అనుకుంటే, ఇరువు స్త్రీలు స్వలింగ సంపర్కం చేసుకునే మార్గాలేమిటి?
10. స్వలింగ సంపర్కం, విజాతులతో రతి ఈ రెంటిలో ఏదో ఒకటి మాత్రమే వీలయ్యే థలో ఏది మెరుగైనది?
11. హస్తప్రయోగంగానీ, స్వలింగ సంపర్కంగానీ, విజాతి సంపర్కంగానీ ఆరంభం కావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? అది వివేకవంతమైన సమాజం నిలిపి వుంచుకోవలసినవా? నియంత్రించుకోవలసినవా?
12. వైద్యశాస్త్రపు-మానవ విజ్ఞానశాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం - పరిశోధనలు, పరికల్పనల దృష్ట్యా వీటిని ఏ స్థానంలో పెట్టిచూడాలి?
13. ఒక వ్యక్తిలోని లైంగికోద్రేకత ఏ స్థాయిలో వుంటే దానిని సాధారణస్థితి అనంటారు? అసాధారణస్థితి అంటారు? వైద్యశాస్త్రం ఈ విషయంలో ఏమంటుంది?
యోచనాశీలురైన పాఠకమిత్రులారా! ఈ అంశం ఇంకా ఎన్నో అంశాలను కలుపుకుని లోతుగా విచారించాల్సిందిగా వుంది. ఏదో ఆవేశంలోనో, ఏదోటి అనేద్దాం అనే తొందరపాటుతోనో అభిప్రాయాలు ప్రకటించేసుకుంటూ పోవడం సరైందికాదు. కనుక కొన్ని ఆలోచించాల్సిన అంశాలను, ప్రశ్నావళిని మీముందుకు తెచ్చి దీనిపై కొంత విచారణ జరగడానికి వీలుగా తెరతీశాను. సామాజిక బాధ్యతగా మీరూ ఉచితంగా స్పందించండి.
మానవహక్కుల పోరాటకమిటీ జడ్జిమెంట్‌పై తన హర్షాతిరేకాన్ని ప్రకటించింది అని పేపరువార్త. అలాగే మరికొన్ని సంస్థల హర్షామోదాలతోపాటు, మరోపక్షం వారిని నిరసన ధ్వనులూ ఉప్పెనలా ఎగిసిపడుతూనూ ఉన్నాయి. రాగద్వేషాలు, ఆవేశకావేషాలకు లోనుకాకుండా, శాస్త్రీయ విచారణతో కూడుకుని, సామాజిక ప్రయోజనాల నుద్దేశించి విచారణ సాగించాల్సి వుంది. ఆ దిశగా కదులుదాం. ఇప్పటికి నా బుద్ధి కందినంతలో,
మంచి సమాజం లేదా వివేకవంతులు దీనిని అవసరం లేని విషయంగానూ, ఉంచుకోకూడని అంశంగానూ పరిగణిస్తారనే అనుకుంటున్నాను. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మనిషి తప్పక చేసే పనుల జాబితాలో వీటిని చేర్చుకోవచ్చు. ప్రతిమనిషీ ఏదో ఒక సందర్భంలోనో, అందరిలో కొందరు అలవాటుగనో ఈ పనికి లోనవచ్చునేమోగానీ, అందరికీ ఈపని తప్పుగాదు, హక్కుకూడా అన్నదారి తెరవడం తొందరపాటుచర్యే అనిపిస్తోంది.
1. అది ఆరోగ్యరీత్యా, సహజప్రక్రియþఈ విధానం అన్న రెంటినిబట్టి ప్రోత్సహించదగిందేనా?
2. సామాజికావసరమైన పునరుత్పత్తి అన్నదానిదృష్టినుండి ఏది సరైన విధానము?
3. సంతానాన్ని కనక్కరలేకుండా, పెంచే పనిలేకుండా, విచ్చలవిడిగా, కలుపుకోడం, విడిపోవడం క్రమాన్ని అమలుచేస్తూ సాగేందుకు సుముఖంగా వున్న వ్యక్తుల మానసిక వైఖరి ఎటువంటి సమాజం ఏర్పడడానికి దారితీస్తుంది?
వగైరా వగైరాలను పట్టి - దీనితో ముడిపెట్టి పరిశీలిస్తే ఇది వుండవచ్చు అనేదానికంటే, లేకుంటేనే మంచిది అనేవైపుకే మొగ్గుతోంది నా బుద్ధికొలత.
ఆ గుంపుకు, దానిని ఆమోదిస్తున్నవారికీ నా ప్రశ్న ఒక్కటే! ఎందుకీ విషయానికి - పోకడకు - చట్టబద్ధత వుండాలనుకుంటున్నారు? కుటుంబం, సంతానం, భావితరం-సమాజావసరం, వ్యవస్థ అస్తవ్యస్థం కాకుండడం వగైరా సంఘజీవుల ముందున్న అంశాలన్నింటితో కలిపి మీ వాదనేమిటో బైటపెట్టండి ముందు.
లోతైన, విపులమైన పరిశీలన కొరకుగా ఈ వేదికలో అవగాహన కలవారంతా పాల్గొనండి.
No comments:
Post a Comment