ఈమధ్యనే సత్యాన్వేషణ మండలి హైద్రాబాద్‌శాఖ బాధ్యతలు స్వీకరించిన బి. కృష్ణంరాజుగారు జులై 22న హఠాత్తుగా మరణించారు. మృదుస్వభావిగా, మంచి మిత్రునిగా, మంచి భర్తగా, మంచి గృహస్తుగా, సహనశీలిగా, క్రియాశీలిగా, ఆయా సంబంధాలలోనున్న వారందరికీ ఆయన సుపరిచితులే.
పాతికేండ్లనాడు మా విజయమ్మద్వారా నాకు పరిచయమైన నాటినుంచి రాజుగారి సతీమణి పద్మమ్మగారు బి.హెచ్.ఇ.ఎల్.లో జరిగిన అనేక తాత్విక చర్చల, సత్సంగాల నిర్వహణపరంగా మూలస్థంభంలా నిలబడ్డారు. ఆదిలో పద్మమ్మగారి నిబద్ధతకు తనవంతు సహకారమందిస్తూ వచ్చిన రాజుగారు క్రమంగా మండలి భావజాలాన్ని వంటబట్టించుకుంటూ ఆమేరకు మిత్రులకూ, బంధువులకూ ఆ విషయాలను అందిస్తూ వచ్చారు. పద్మమ్మగారున్నూ మండలి భావజాలాన్ని ఒకింత అర్థం చేసుకున్ననాటినుండి వారి అక్కచెల్లెండ్రనూ, పిల్లలనూ మండలి సంపర్కంలోకి చేర్చారు. అలాగే ఇరుగుపొరుగువారినీ, స్నేహితులను కూడా మండలి భావజాలానికి చేరువ చేయాలనే నిరంతరం తపనపడుతుండేవారు.
ఈమధ్య రెండు మూడేండ్లుగా కృష్ణంరాజుగారు మెలుకువులు, వివేకపథాలు మరింత నిశితంగా అధ్యయనం చేస్తూ పద్మమ్మగారికంటే ఒకింత ముందుకొచ్చి మండలి బాధ్యతలూ స్వీకరించారు.
రాజుగారిలాంటి భర్తలు అరుదుగా వుంటారన్నది ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసినవారందరికీ ఇట్టే తెలిసిపోతుంది. పైన నేనన్న నాలుగు మాటలు ఏమాత్రం అతిశయోక్తులు కాదని, అవి ఆయనకు చక్కగా సరిపోయేవేనని ఆయన నెరిగున్నవారందరికీ తెలిసిన వాస్తవమే. ఏంచేస్తాం-కాలమాగదు. కాలగతిని ఆపనెవరితరమూ కాదు. వృద్ధాప్యంలో పడకనబడకుండా తిరుగుతూ తిరుగుతూ బండిదిగేయడం-అనాయాసేన మరణం- గొప్ప విషయమని భారతీయ తాత్వికులంటారు. ఆయనపరంగా అది సరైన భావనే అయినా, అలాంటి జీవిత భాగస్వామిని కోల్పోయిన పద్మమ్మగారికి ఏ మాటలు చెప్పి ఊరటనందించగలం. ఆ మేరకు మండలికి జరిగిన లోటూ లోటుగా వుండిపొయ్యేదే.
సమస్యలు లేని థలో గుండె నిబ్బరం కలవారూ, లేనివారూ కూడా ఒకేలా కనపడతారు, ప్రవర్తిస్తుంటారు. సమస్యలొచ్చి పైబడ్డప్పుడే ఇరువురికీ ఉన్న తేడా కనపడుతుంది. రెండు మూడు థాబ్దాలుగా జీవితంపట్ల ఎంతో కొంత అవగాహనకల మనమందరం ఇలాంటి సమయంలోనే నిబ్బరంగా వుండగలగాలి.
రాజుగారు లేనిలోటు, ఆయనకు, మీకు మాత్రమే వర్తించే స్మృతులు అన్నవాటి విషయంగా ఎవరం చేయగలిగింది ఏమీ లేకపోయినా, అమ్మా! పద్మమ్మా! మేమంతా మీతోనే వున్నాం. అంతా ఒక కుటుంబంగానే వున్నాం, ఉందాం. మండలిలో మీరు విడదీయరాని భాగమనే నేననుకుంటున్నాను. కాలం మాత్రమే మాపగల గాయమైంది మీకు. నిదానంగా కుదుటపడండి. గుండె నిబ్బరాన్ని వదలకండి. మండలి ద్వారా, సత్సంగాల ద్వారా పొందిన వివేకబలంతో లేచి నిలబడండి. కృషికి రాజుగారి ఆకస్మిక మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ....
సత్యాన్వేషణ మండలి మరియు మిత్రులు.
No comments:
Post a Comment