Friday, January 1, 2010

విద్యార్థులు-విద్యాలయాలు


యువశక్తికి బలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థిలోకం, నిజంగా తిన్నదరక్క, తమ స్థానమేమిటి? తమ లక్ష్యమేమిటి? భావి సమాజం విషయంలో తమ పాత్రేమిటి అన్న స్పృహ లేకుండా, రాజకీయ సమూహాలను అనుబంధ, కార్యాచరణశక్తులుగ మారి, వారాడించినట్లల్లా ఆడుతూ, ఇటు స్వీయ జీవితాల్ని, అటు భావి సమాజ భవిష్యత్తును చిన్నాభిన్నం చేసేస్తున్నారు.
ఈ రాజకీయ బకాసురులకు ఆ భావితరపు జీవితాలేమైపోతాయన్న స్పృహగాని, వ్యధగాని లేనేలేవు. పైకిమాత్రం మొసలికన్నీరు కారుస్తూ, ఆ కన్నీరు కార్చడాన్నీ మరో విద్యార్తి సమూహాన్ని మరోకోణంలో, మరింత రెచ్చగొట్టడానికే ఉపయోగించుకుంటున్న నీచమైన వూహ్యలతో సాగుతన్నారు. తెలిసితెలిసి, కావాలని చేస్తున్న ఈ తప్పుల నుండి రాజకీయుల్ని మేల్కొలప్పడం, బైటకు తీసుకురావడం అయ్యేపని కానేకాదు. వారి పోకడలోని అత్యధికభాగం నాటకీయమైనదే. ద్వంద్వవైఖరే. లోన కోరుకుంటున్నదొకటి, బైటకి చూపుతున్నదొకటి అనన్నమాట.

ఏమాటకామాట చెప్పుకోవాలి. ఇంత నీచమైన, నికృష్టమైన పోకడపోతున్నా, వీరిలో విద్యార్థుల జీవితాలు మట్టిపాలు చేద్దామన్న ఉద్దేశం వుందనలేము. వీరికి, వాళ్ళ మేలు చూద్దామని ఎలా లేదో, అలాగే వాళ్ళ కీడు చూద్దామన్న దృష్టీ లేదు. కేవలం తమ అవసరాలకు వాళ్ళ అసాధారణమైన ఆవేశశక్తిని వాడుకుందామన్నదొక్కటే వీరి దృష్టంతా.
ఉపాధ్యాయ, నిర్వాహక వర్గాలుకూడా తమపాత్రచితిని విడచి-మంచికాదు-ఏదోఒక రాజకీయుని చేతి ఆయుధంలా తయారైయుండడం మరో విషాదంలో విషాదం. ఆచార్యులలోనూ, కులానికీ, మతానికీ, పార్టీకి, ప్రాంతానికి తమని తాము బలెట్టుకుని (ముడెట్టుకుని అందామా) ఆమేరకు విద్యార్థులనూ ఉపసమూహాలుగ చీల్చి, పరస్పరం వారిలో వారికి వైషమ్యాలు నెలకొనేలా శక్తివంచన లేకుండా బోధనలు (బోధకులుకదామరి) చేస్తూ శిక్షణనిస్తున్నారు.
ఈ వ్యవహారమంతా గొంగళిలోని అన్నాన్ని తినడంలా తయారైవుంది. బుద్ధున్న నేతలైతే, విద్యార్థులను కేవలం పాఠాలు బట్టీపెట్టి, పరీక్షలు (కాపీకొట్టయినా) గట్టెక్కి ఉద్యోగాలకొరకే చదువులు అనుకునేలా తయారుకాకుండా సామాజిక స్పృహకూడా వారిలో నెలకొనేందుకు వీలైన కార్యక్రమాలలోనికి, వారి విద్యకు ఆటంకం కాని పరిమితుల్లో చొరబెట్ట పనిచేయాలి. మంచి పౌరునిగా తీర్చిదిద్దడానికి కృషిచేయాలి. దానిని విడచి తమతమ రాజకీయ ఆధిపత్య పోరాటాలలో ఒక బండ, మొండి సైనికునిలా నిలబెట్టి తమ కోసం పోరాడించుకోడమే పనిగా సాగుతున్నారు వాళ్ళు. అందుకు శక్తివంతమైన ఉపాయంగా, విద్యార్థుల్ని, యువతను పొగడడం, ఉబ్బేయడం లాంటి చతురతలు కనబరుస్తున్నారు.
ఇదంతా దేశ దౌర్భాగ్యంగా, ఆధిపత్యము, పదవి, ధనసంపాదన అన్న లక్ష్యాలే రాజకీయ లక్ష్యాలుగా అమలవుతున్న ఒక దయనీయమైన, ప్రమాదకరమైన సంధికాలంలో మనమున్నాం. అరాచకం కాకుండా, ప్రశాంత వాతావరణము, క్రమబద్ధమైన సామాజిక జీవనము, సమష్టి అభివృద్ధి అన్న లక్ష్యాల సాధనకై పుట్టిన రాజకీయాలు-వాటిని లేకుండా చేయడానికి పూనుకున్నాయి. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే సహృదయులైన మేధావి వర్గం పూనుకుని దీనిని సక్రమపరచేదిశగా ప్రజల్ని-యువతను-సంఘటితపరిచే యత్నాలు పునరారంభించుకోవలసిన తరుణంలో ఉన్నాం మనం.
ఆంధ్రరాష్ట్రం-ప్రాంతీయ వివక్షతలు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాన్ని గనుక, ఒకింత నిశితంగా, లోతుగా, కొన్ని థాబ్దాలు వెనుక నుండి పరిశీలించుకుంటూ వస్తే ఇక్కడ రెండు రకాల తప్పులు జరిగినట్లు తేలుతుంది. భాషాప్రయుక్త రాష్ట్రంగా రూపొందేనాటికే ప్రాదేశికంగనే ఇదంతా మూడు, నాలుగు భాగాలుగా చూడబడుతూ వచ్చింది. అందరూ తెలిసి, అవునుగదా అనిపించేలా ఆంధ్ర, రాయలసీమ తెలంగాణాలుగా వ్యవహరించుకోవడమూ జరిగింది. పెద్దరాష్ట్రంగా రూపొందాక రాయలసీమ-ఆంధ్రప్రాంతాల నేతలు ప్రాంతీయ అడ్డుగోడను దాదాపుగా తొలగించుకున్నారుగానీ, తెలంగాణా భావన మాత్రం కొట్టేయబడలా. అది ఆదినుండీ ఆరని మంటలా రగులుతూనే వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌గా రూపొందిన రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వంగానీ, ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీలుగానీ, ప్రజాప్రతినిధులుగ ఉన్నవారుగానీ, ఉమ్మడితనానికి నిజమైన ఆచరణను రాష్ట్రం మొత్తంలో పాదుకొల్పాలనే యత్నం చిత్తశుద్ధితో చేసిన పాపానపోలా. ఎప్పటికప్పుడు, ఎవరికివారు, ఎక్కడికక్కడ తమ తమ ప్రాబల్యంకొద్దీ, స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, వాటిని సాధించుకోడానికే యత్నిస్తూ వచ్చారు. ఆ క్రమంలో అనివార్యంగా చేయకతప్పని మంచిపనులూ కొన్ని చేస్తూ వచ్చారు-ఎలాగూ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన పాలన చూడక తప్పదుగనుక ఎవరికీ అభ్యంతరం లేని పనుల వరకు అందరికీ చెందగల కొన్ని పనులూ జరుగుతూ వచ్చాయి. అంతేగాని, తమకై ప్రత్యేకించుకున్న పనులదగ్గరకొచ్చేటప్పటికి, ఇతరులను వెనక్కినెట్టడమో, పట్టించుకోకపోవడమో అన్న విధానాన్నే దాదాపు అందరూ అమలు చేశారు.
ఆ క్రమంలో ప్రాంతాలవారీగా కొంత, జిల్లాలవారీగా కొంత వివక్ష చోటుచేసుకుంది రాష్ట్రంలో. ఈనాడు ప్రత్యేక తెలంగాణావాదులు చూపెడుతున్న వివక్ష జరిగిందన్నమాట వాస్తవమా? అవాస్తవమా? కొన్ని అంశాలలో వివక్ష జరిగిందన్నది వాస్తవం. ఈ విషయాన్ని నిష్పాక్షికులైన విజ్ఞులూ, పార్టీలు, ప్రభుత్వమూ కూడా గమనించడం జరిగింది కనుకనే దఫాలవారీగా (వత్తిడి పెరిగినప్పుడల్లా) కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. నీటి పంపిణీ విషయంలో కనపరచాల్సిన శ్రద్ధ కనపరచలేదన్నది ఒక నిజం. రెండోది ఉద్యోగాల కేటాయింపులాంటి మరికొన్ని విషయాలలోనూ ఒప్పందాలు జరిగాయి. అప్పుడప్పుడూ గొడవలూ, చర్యలూ, ఒప్పందాలు జరుగుతున్నాయంటేనే అంతా సవ్యంగా జరగడంలేదని అందరం అంగీకరించినట్లు. ఈ రకంగా జరిగిన అన్ని ఒప్పందాలలోనూ మీకన్యాయం జరిగిందన్న పక్షం తెలంగాణా వారన్నదికాగా, దానిని సవరిస్తాం, మీకు ఈ అవకాశాలు, వాటాలు కల్పిస్తాం అనేపక్షంగా ప్రభుత్వం వుంటూ వచ్చింది. ఈ చారిత్రక నేపథ్యం చాలు తెలంగాణపట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, దానిని నడుపుతున్న పార్టీలు వివక్షను కనపరిచాయనడానికి, అయితే ఈ వివక్ష ఉద్దేశపూర్వకంగా జరిగిందా, తన ప్రాంతానికి పెద్దపీట వేసుకోవడంవల్ల దీనిని పట్టించుకోకపోవడం జరిగిందా అన్నది ఒకపట్టాన తేల్చగలిగిందికాదు. అయినా సాధారణ తర్కాన్నిబట్టి ఆలోచిస్తే తన ప్రాంతపు అభివృద్ధిపై దృష్టిపెట్టడంవల్లనే దీనిని అంతగా పట్టించుకోకపోవడం అన్నది జరిగిందనడమే ఎక్కువ సబబు అనిపిస్తుంది. అంటే తెలంగాణాను భ్రష్టుపట్టించాలన్నదే ఉద్దేశంగా అది జరగలేదు. తన ప్రాంతాన్ని అభివృద్దిపరచుకుండా మరోవైపు అధికశ్రద్ధ ఏర్పడడంవల్లనే అది జరిగింది అని.
ఏదేమైనా తెలంగాణాకు ఉమ్మడిలో రావలసిన భాగంగానీ, వెనుకబడిన వాటివిషయంలో ఉమ్మడి వ్యవస్థ అందించవలసిన ప్రత్యేక భాగంగానీ ఆ ప్రాంతానికి అందలేదన్నదో నిప్పులాంటి నిజం.
హైదరాబాద్‌ : సహజంగానే పెద్దపెద్ద నగరాలు, ఆ మొత్తం ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకంటే అధికాధికంగా అభివృద్ధిచెందుతాయి. ఇక రాజధానిగానూ వుండి, ఇతర రాష్ట్రాలకూ, ఇతర దేశాలకూ కూడా అందుబాటులో వుండగల పరిస్థితులు, వనరులు కలిగివున్న ప్రాంతం మరి దేనితోనూ పోల్చిరానంత అభివృద్ధి నందడం విడ్డూరం కాకపోవడమేగాక-సాధారణంకూడా. కనుక హైదరాబాద్‌ పోల్చడానికి వీలైనంతగా అభివృద్ధి చెందింది. దీనిని ఆంధ్రరాష్ట్ర ప్రజలుగానీ, ప్రభుత్వంగానీ అభివృద్ధిపరచింది అనడం అంత సబబుకాదు. అది అభివృద్ధి చెందింది అనడమే వాస్తవానికి దగ్గరిమాట. అంటే ఎవరో కొందరు లేదా ప్రభుత్వం, లేదా పార్టీ ఉద్దేశపూర్వకంగా, దీనిని అభివృద్ధి పరచాలనుకుని అభివృద్ధి పరచింది అనడం సరికాదు. పరిస్థితులన్నీ అది అభివృద్ధి చెందడానికి తగిన రీతిలో తీసుకువచ్చాయి. హైదరాబాద్‌ విషయంలో రెండు బలమైన పక్షాలు తెరమీదికి వచ్చితీరతాయి. అది ప్రాంతాలవారీగా ఏ ప్రాంతం క్రింద వున్న (1) ఒక రాజధానిగా అది అందరికీ చెందింది. కనుక దాని అభివృద్ధి ఫలాలూ అందరికీ చెందుతుండాలి, (2) ఉమ్మడిలోని అభివృద్ధి ఫలాలు ఉమ్మడి వాటాలకు న్యాయబద్ధంగా అందాలన్న నియమం అమలు కాకపోవడం వల్లనేకదా విడిపోదాం అన్న ప్రశ్నపుట్టింది. ఇప్పటికీ మీరు పొందిన అదనం చాలు. మీ ప్రాంతంలో ఉన్నదానిని మాకు వదిలేయండి. మాకు జరిగిన నష్టానికి అదే సరైన పరిష్కారమవుతుంది. అయినా నిరంతరంగా లభించే దాని ఫలితాలు శాశ్వతంగా మీకేనా అనిగనక అనేట్లయితే ఏ ఒప్పందం చేసుకుంటే దాని అభివృద్ధి ఫలాల్లో కొంత మీకూ చెందుతుందో ఆలోచించుకుందాం. కానీ హైదరాబాద్‌ లేని తెలంగాణాకు అంగీకరించమని మీరనడంగానీ, మేమంగీకరించడంగాని రెండూ అసంబద్ధమైనవే.
ఈ రెండు వాదాల్లోనూ కొంతకొంత వాస్తవ మూలాలున్నాయన్నదే సమస్యకు చిటుక్కున పరిష్కారం చెప్పలేకపోవడానికి కారణం. సమస్య జఠిలమైందవడానికి ఆ వాస్తవాలే కారణాలవుతున్నాయి. ఇదంతా ప్రాంతీయంగా తెలంగాణాకు జరిగిన వివక్ష క్రిందికి వస్తుంది. దానినలా వుంచితే, ఏ ప్రాంతానికా ప్రాంతంలోనూ జిల్లాలవారీ వివక్షపు సమానాభివృద్ధి జరక్కపోవడం కనబడుతుంది. దానికి రెండు, మూడు కారణాలు కనిపిస్తున్నాయి. (1) ఆ జిల్లా, ప్రాదేశిక పరిస్థితులూ, ప్రకృతి వనరులలోనే అభివృద్ధికి అనుకూలత లేకపోవడం, (2) ఆ ప్రాంతంలోని పార్టీల, నేతల ప్రత్యేక దృష్టి మొత్తం ప్రాంతంపైగాక కొన్ని జిల్లాలకు పరిమితమవడంతో, వీటినంతగా పట్టించుకోకపోవడం, (3) ఈ జిల్లాల ప్రతినిధులు మిగిలిన ప్రతినిధులు మిగిలిన ప్రతినిధులతో పోల్చితే బలహీనులవడమో, అసమర్థులవడమో, తమ వ్యక్తిగత స్వార్థానికి పరిమితులై జిల్లా గురించి పట్టించుకోకపోవడమో వల్ల వెనుకబాటుతనం ఏర్పడి వుండడం. కనుకనే ఈనాడు ఏ ప్రాంతానికాప్రాంతాన్ని తీసుకుని చూసినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్న మూడు ప్రాంతాలలోనూ వెనుకబడిన జిల్లాలు, మండలాలు కనబడతై. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల వెనుకబాటుస్థాయికంటేనూ, మరింత వెనుకబడిన జిల్లాలు ఆంధ్ర, రాయలసీమల్లో వుండడం చూస్తాము.
ఈ మొత్తం సమస్యకు పరిష్కారం ఎలావుండాలి?
1) ఉమ్మడిగా అభివృద్ధి జరగాలి. అందుకు సహజ పరిస్థితులే అడ్డంకిగా వుంటే ఆ భాగపు అభివృద్ధికై ఉమ్మడి నుండి ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యామ్నాయ అభివృద్ధి పథకాలను చేపట్టాలి. బాగా వెనుకబడివున్న వాటికి తాత్కాలిక ప్రత్యేక వనరుల కేటాయింపులు, అన్న విధానాన్ని అమలు చేయాలి. ఇదే ఎక్కడైనా అమలు చేయాల్సిన సాధారణ వివేకపద్ధతి కనుక.
- ఉమ్మడికి సరైన ప్రాతినిధ్యం ఏర్పడి, అది జరిగిన వివక్షకు పరిష్కార రూపచర్యలను చేపట్టడం.
- కలిసుండలేని వాతావరణం నిజంగా ఏర్పడితే, విడిపోడానికి అన్నిప్రాంతాల దీర్ఘకాలిక ప్రయోజనాలు అన్న లక్ష్యం నెరవేరే నియమ నిబంధనలతో పంపిణీలకు సిద్ధపడడం.
- ఈ పని సజావుగ సాగడానికి, 'ఒక న్యాయస్థానంలాంటి' వేదికను నిర్మించుకోవాలి. అందులో ఆయా ప్రాంతాల వాదనలు వినిపించే పక్షాలు, నిష్పక్షపాతంగా వ్యవహరించగల సామాజిక స్పృమ, జాతీయ స్ఫూర్తిగల అవగాహన, యోచనకల మేధావివర్గముతో కూడిన బృందం వుండాలి. ఆ మూడో వర్గంపై అందరూ విశ్వాసముంచడమో, నిర్ణేతలుగ వారిని ఆమోదించే విచారణకు కూర్చోడమో చేయాలి.
గమనిక : ఇంతచేసినా నూటికి నూరుశాతం అందరికీ సమన్యాయం అన్నది అమలవుతుందని నిర్ధారించలేము. వీలయినంత సమన్యాయం జరిగేలా చూడడానికి, తక్కువ దోషాలుండేలా జాగ్రత్తపడడానికి ఎప్పుడైనా ఇంతకంటే మార్గం లేదు. ఆ దిశగా అన్ని బృందాలూ యత్నాలు మొదలెట్టడమే ఇప్పుడు జరగాల్సి వుంది.
ఆపని సక్రమంగా జరగాలంటే పాలన, నిర్వహణలన్నవాటిని యధాపూర్వపు అంటే ఎప్పుడూ జరుగుతుండేలా సాధారణ స్థితిని కల్పించడానికి అన్నిపక్షాలు సిద్ధంకావాలి. దానర్థం సమస్య తేలిపోయిందనో సమసిపోయిందనోకాదు. (1) జనజీవితం స్థంభించకూడదు కనుకనూ, (2) వ్యవస్థను స్థంభింపజేయడం సమస్యకు పరిష్కారం కాదుగనుకనూ, (3) రాజుల, రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగే సందర్భంలోనూ ముందు తాత్కాలికంగానైనా యుద్ధమాపక, సంధియత్నాలుగానీ, న్యాయాన్యాయ విచారణగాని, ఒప్పందాలుగాని జరుపుకోడానికి వీలవదుగనుకను యుద్ధపూర్వస్థితిని కల్పించాలనడం సాధారణ సూత్రమేనంటున్నాం.
ఇప్పటికే జరిగిన విధ్వంసం, అటు విద్య, ఇటు ఆస్తులు వగైరాలకు జరిగిన నష్టం, వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం వగైరాలను గమనించిన ప్రభుత్వం చర్చలకు సిద్ధంకండి. అందుకు తగిన వాతావరణాన్ని కల్పించండి అన్న పిలుపునిచ్చింది. అయితే ఇక్కడో కీలకాంశం వుంది. చర్చలకు మళ్ళా పార్టీలవరకే కూర్చుంటే ఆ వేదిక నిర్ణయాలు చేయడానికి తగింది కాలేదు. వేదికలో నిర్ణేతలుగా లోతైన అవగాహన కలిగి, ఉమ్మడి శ్రేయస్సును కాంక్షించే, విచక్షణ చేయగల బృందం వుండేట్లు చూసుకోవడం దగ్గరే సమస్య పరిష్కారం కావడానికి కావలసిన విత్తనాలున్నాయి. ఆ బృందం ఎవరన్నదే మనందరి ముందున్న పెద్ద ప్రశ్న.
ఒక చిన్న సూచన. (1) ఈ రాష్ట్రానికి చెందని, సామాజిక శ్రేయస్సు కోరుతూ సమాజంలో పనిచేస్తున్న మేధావుల్ని ఇందులో కలుపుకోవచ్చు, (2) ఈ రాష్ట్రంలోనూ స్వచ్ఛందంగా సమాజాభివృద్ధికై పాటుపడుతున్న అలాంటి మేధావుల్ని వెదకి వారినీ కలుపుకోవచ్చు.
సమష్టి అభివృద్ధి, సమానావకాశాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు, కలిగిన నష్టాన్ని పూరించుకునే ప్రత్యేక కేటాయింపులు, విభజనే నిర్ణయమైతే, విభజనవల్ల నష్టం జరుగుతున్న పక్షానికి పరిహారపు చెల్లింపులు, అనంతరం సామరస్యపూర్వక సహకారం అందించుకోడానికి అవసరమైన షరతులు-వీటిని దృష్టిలో పెట్టుకుని వాద ప్రతివాదనలు, నిర్ణయాలు ఉండేలా ప్రాథమిక ఒప్పుదలకు వచ్చి వేదికను సృష్టించుకోవాలి.
మీడియా :
ఒక్కమాట చెప్పకుంటే ఈ వ్యాసానికి సమగ్రత రాదు. నిజానికి మీడియా సమాజంలో నిర్వహించాల్సిన పాత్ర చాలా ఉదాత్తమైనది. అది నిర్వహించగల పాత్ర చాలా పెద్దది. కానీ అది తరచుగా-ఎక్కువసార్లు-అది నిర్వహిస్తున్న పాత్రమాత్రం తగనిదిగా వుంటుంది. మీడియానే వ్యాపార రంగంగా మారి, వ్యాపారపు పోటీ వత్తిడి భరించరానంతగా తయారై, ఉనికిపోరాటానికీ సిద్ధపడవలసిన వాస్తవ పరిస్థితుల్లో అంత ఉదాత్తమైన పాత్రపోషించమని ఆదర్శాన్ని వల్లించడం సబబుకాదేమో, ఆచరణసాధ్యంకాదేమోగాని, వారంతా కొంతమేరనైనా ఆత్మవిమర్శ చేసుకుని సమాజహితం దిశగా దృష్టిసారించడం తప్పనిసరి అనగలను.
సమస్యల్ని మషాలా జోడించిమరీ భూతద్దంలో చూపించడం, ఇంతటి బీభత్స వాతావరణంలోనూ సన్నివేశంలో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని జొప్పించబూనడం చాలా అనుచితం, దానిని తగ్గించుకుని పరిష్కార దిశగా సూచనలు అందించే దిశగా, అందుకు తగిన విజ్ఞులకు పెద్దపీటవేసి, వాటిని ప్రముఖంగాచూపించడం అన్న ప్రక్రియకు శ్రీకారం చుడితే బాగుంటుంది. అదే మీడియా పాత్రోచితికి తగిందికావాలి.
ప్రస్తుతానికి వుంటాను. సమాజహితకాంక్షలో... మీ  సురేంద్ర.

No comments:

Post a Comment