రాజరిక వ్యవస్థకు చెందిన చరిత్రలో యుద్ధాల భాగం చాలా పెద్దది. జమీన్‌దారు సామంతుడు కావాలనుకుంటాడు, సామంతుడు రాజు కావాలనీ, రాజు మహారాజవ్వాలనీ, మహారాజు చక్రవర్తి కావాలనీ, ఆపైన ఏకఛత్రాధిపతి కావాలనీ అనుకోడం ద్వారా మొదలైనవే యుద్ధాలు. ఆ క్రమంలో పరస్పర ఆక్రమణలు, దురాక్రమణలు, దోపిడీలు, విధ్వంసాలు లెక్కకు మిక్కిలిగా జరిగిపోయాయి. యుద్ధాలలో పాల్గొన్న అన్నిపక్షాలవారూ ఒకవంక పైకి శాంతి, సుస్తిరతల గురించి అతిగా మాట్లాడుతూనే ఆచరణలో దారుణ మారణకాండకు దారులు తీస్తూ వచ్చారు. రాజుల, రారాజుల ఆధిపత్యకాంక్ష, గెలుపును ఇష్టపడే గెలుపువల్లగాని తృప్తిపడని అహాన్ని తృప్తిపరచుకోవాలన్న తమకము, కలసి ఊరుకుండనీక పోవడంతో జరిగినవే ఎక్కువలో ఎక్కువ యుద్ధాలు. తనమాట, తనచేత, తన తలపు నెగ్గాలన్న దుగ్ధ మానవస్వభావంలోని లక్షణాలలోకెల్ల బలమైంది. నిజానికి ప్రతిమనిషి ఏదోఒకస్థాయిలో ఈరీతి ప్రవర్తనను కనబరుస్తూనే వుంటాడు. ఆ లక్షణాన్ని వ్యక్తిని క్రియావంతుణ్ణి చేసి, అనుకున్నది సాధించేందుకు ప్రోత్సాహకశక్తిగా వుంచుకున్నంతవరకు అభివృద్ధికారకంగా పనిచేస్తుంది. అదే లక్షణం హద్దుమీరి, మరికొందరిని అణచేంతవరకూ, తన అభివృద్ధి క్రమంలో జరిగిన, అవసరమైన పెంపుదగ్గర తృప్తిపడనీయక ఉరుకులెట్టించేంతవరకు ప్రబలమై అతి పోకడను సంతరించుకుంటే మనిషిచేత అది చేయించని, చేయించలేని చెడుగంటూ మిగిలివుండదు.
ఆ థలో, మనిషి ఆకాంక్ష 'కీర్తి' అయితే ఎంత ప్రఖ్యాతి లభించినా తృప్తి ఏర్పడదు. అదొక దురదగా-కీర్తికండూతి అన్నారందుకే-మరి గోకినకొద్దీ గోక్కోవాలనిపిస్తుంటుంది. ఆ కీర్తి సంపాదించుకోడానికి ఎంతకైనా తెగబడతాడామనిషి.
అలాగే, ఆ థలో పదవీకాంక్ష అతనిలో చొరబడితే, ఎంతసా&థయి కెదిగినా తృప్తికలగదు. పదవీకాంక్ష పదవీ వ్యామోహంగామారి, నిరంతర అసంతృప్తితో ఇంకా పదవికెదగాలన్న దుగ్ధతో వివశుడౌతాడు. ఆ థలో అతడు తన పదవీకాంక్షను కోరే అహాన్ని తృప్తిపరచుకోడానికి ఎంతకైనా తెగబడతాడు.
అదేమరి, ధనవంతుణ్ణి కావాలన్న కోర్కెపుడితే, ఇక ధనసంపాదన విషయంలో అతనెంత శ్రీమంతుడైనా తృప్తికలగదు. మరింత మరింత కావాలి, ఉన్నది చాలదు అన్న అసంతృప్తితో కాగిపోతాడు. అధిక ధనవంతుడవ్వాలనుకుంటున్న తన అహాన్ని తృప్తిపరచుకోడానికి ధర్మాధర్మాలను, న్యాయాన్యాయాలను నీతి, అవినీతులు అన్న విచక్షణను విడిచి ఎంతకైనా తెగబడతాడు.
అదిగో అలాంటి స్వభావంతో సర్వాధిపతిని, లేదా విజయుణ్ణి కావాలన్న ఆకాంక్షవల్లే రాజులమధ్య యుద్ధాలు జరిగాయి. శృతిమించిన లేదా అదుపుతప్పిన పై లక్షణం దీనికి తోడై ఎన్ని విజయాలు పొందినా, అతని అహాన్ని తృప్తిపడనీయదు. అదిగో ఆ అతి విజిగేషా వైఖరే విదేశీ దండయాత్రల వరకు నడిపించింది కొందరిని.
ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఈ దరహా బృహద్యత్నాలన్నింటి వెనక తన కోరిన విషయాలలో తన అహాన్ని తృప్తిపరచుకునేందుకే అవన్నీ జరిగాయిగానీ, ఇతరుల ప్రయోజనాలకొరకుగా ఉద్దేశింపబడినవి కావవి. కాకుంటే అలాంటి పనులవల్ల అనుకోకుండనో, ప్రధానలక్ష్యం నెరవేర్చుకోడానికి తప్పనిసరైయ్యో ఇతరులకు కొంత ప్రయోజనం-కొన్ని మేళ్ళు-జరిగి వుండవచ్చు. అతడే చేసుండనూవచ్చు.
ఈ మొత్తం కథలో ప్రజలు ప్రేక్షకులు, బాధితులు - భోక్తలు - మాత్రమే. వారు ఎక్కడా కర్తలుగా వుండరు. అలాగే ఆ రాజుల పక్షాన పోరాడినవారుగానీ, పోరాడుతూ అసువులు బాసినవారుగానీ తెలిసితెలిసి, ఉద్దేశపూర్వకంగా యుద్ధంకావాలనుకుని అందుకు పూనుకున్నవారు కాదు. అందులో చాలాభాగం బ్రతుకుతెరువుగా అందుచేరి బలవంతంగా యుద్ధానికి దిగి, చంపడమో చావడమో అన్న ముగింపుకు చేరినవారే. అతి విచిత్రమేమంటే ఈ కొద్దిమంది వారి ఆకాంక్షల నెరవేర్పుకై చేసినవాటినే చరిత్ర అంటున్నామిప్పుడు. అందులో పాత్రధారులైన సైనికులుగానీ, ఆ యుద్ధం సృష్టించిన అవాంఛిత ఫలితాలకు భోక్తలైన ప్రజలుగానీ చరిత్రలో మనకెక్కడా అగపడరు. అందుకే, జరిగిన ఈ దురంతాల్ని ఆసాంతం అర్థం చేసుకున్న ఒక మానవ హృదయం 'నరజాతి చరిత్ర అంతా పరపీడన పరాయణత్వం' అంటూ ఆక్రోశించింది.
కొద్దిమంది కోసమే రాజ్యం అన్న రీతిని అనుభవించి, అనుభవించి, అది మనకిక వద్దనే వద్దనుకుని, దానికి మారుగా అందరికోసం రాజ్యం లేదా, ఎక్కువమందికోసం రాజ్యం అన్నరీతికి మరలింది సమాజం. మరలింది అనడానికి ధైర్యం చాలడంలా. మరలాలనుకుంది సమాజం. కొద్దిమంది ఎదిగిన మనుషుల్లో పొరసూపిన ఈ ఆలోచన క్రమంగా ఆ దిశగా కొంత ప్రయత్నం జరిగేలా వ్యక్తుల్ని ప్రోత్సహించింది. అదిగో దాని పర్యవసానంగనే, ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన భావన ఉనికిలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు అనడంకంటే ప్రజలే పాత్రధారులు అనడం సబబు. పాలకులంటే పాలితులెవరని, యజమానంటే సేవకుడెవడని ప్రశ్నపుడుతుంది. సొంతదారులైతే హక్కులు లేకుండడం. బాధ్యతలు, కర్తవ్యాలు మభ్యపెడతాయి. ఫలితాలెలాగూ వారికే చెందుతాయి. ప్రజాస్వామ్యానికి ఇది ఉదాత్తచిత్రం.
అయితే మనీసావంతుల్లో పుట్టిన ఆ భావన, మరింతమందికి అంది, ఒక సిద్ధాంతంగా భావజాలక్షేత్రం లోనైతే నిలదొక్కు కోగలిగిందిగాని, ఆచరణలో బలాన్ని పుంజుకుని స్థిరపడలేకపోయింది. వెనక చెప్పుకున్నట్లు, ఆధిపత్యకాంక్ష, ధనవ్యామోహం, జిగేషా ప్రవృత్తి అన్నవి ముసురుకున్న వ్యక్తులే మళ్ళీ ఈ క్రొత్త వ్యవస్థలోనూ ప్రజాప్రతినిధులుగా వేషం మార్చుకుని రంగంమీదికొచ్చారు. గతాన్నుండి పెత్తందారీతనాన్ని రాజకీయ వారసత్వంగా సంక్రమింపజేసుకుని మరీ కథ నడిపిస్తున్నారు.
అయం నిజః పరైవేతి గీరానా లఘుచేతసాః | ఉదారచరితా నాంతు, వసుధైక కుటుంబమ్ ||
తా|| : అల్పబుద్ధులకే తన పర అన్న దృష్టి వుంటుంది. ఎదిగిన మనుషులకైతేనో ఏకత్వ (అందరం ఒక్కటే అన్నదృష్టి వుంటుంది) అన్న సామాజిక తత్వశాస్త్రపు సార భావన, ఈనాడు పూర్తిగా తిరగబడిపోయింది. ప్రతివాడూ అవకాశము, ఓపిక ఉన్నంతమేర గిరిగీసికుని అంతవరకే తనదనుకుంటూ, ఆ అంతవరకూ కూడా తానే స్వామి కావాలనుకుంటూ, తనమాటే చెలామణి కావాలనుకుంటూ సాగడమే ఈనాటి వరవడి అయ్యింది. ఏయే పేర్లతో పిలవబడుతున్నా ఆయా సంస్థలలోని నేతలంతా లేదా ఎక్కువలో ఎక్కువమంది పోకడ పెత్తందారీ స్వభావాన్నే కలిగి వుంటోంది. తనవరకు, తనవారి వరకు లబ్దిపొందితే చాలుననుకునే వైఖరే ఎక్కడచూసినా, ఆ అపసవ్య ధోరణి అక్కడికైనా ఆగక మరికాస్త పెచ్చరిల్లితే తనవారి లబ్దితో తృప్తిపొందక, ఎదుటివానికి నష్టం కలిగించడానికీ ఉబలాటపడుతుంది. ఏ యిరువురి మధ్యగానీ, స్వార్థోపలబ్దికి సంబంధించిన పోటీ ఆరంభమై బలపడితే, ఇక ఆ యిరువురూ అనుసరించే రీతి దీనికి సంబంధించిందిగనే వుంటుంది. ప్రస్తుతం అటు వ్యాపార రంగంలోనూ, ఇటు వ్యాపారంగనే మారిన రాజకీయ రంగంలోనూ సాగుతున్న తంతంతా ఈ కోవకు చెందినదే.
ఏనాడైతే ప్రజాస్వామ్యం పేరున పార్టీ నాయకస్వామ్యమో, కులనాయక స్వామ్యమో, ప్రాంతీయ నాయకస్వామ్యమో అమలవడం మొదలైందో ఆనాటినుండే అక్కడ తన పర అన్న దృష్టే కీలకపాత్ర పోషిస్తూ వచ్చింది. సమష్టి అవసరాలు, అభివృద్ధి అన్న ఉమ్మడి దృష్టి ఆచరణలో కనుమరుగైంది. ఆ ముసుగు వేసుకోడానికి మాత్రం పరిమితమై పోయింది. ఈ ముసుగు వ్యవహార మరింత ప్రమాదకరంగా తయారైంది. అందరం అన్నదమ్ములమే. విడిపోయి కలిసుందాం అనంటూనే ఒక గుంపు, ఇందుకు వప్పుకోకుంటే మేము చచ్చో, మిమ్ము చంపో, దేశాన్ని రణరంగం చేసైనా మేమనుకున్నది సాధిస్తాం అనేమో వెంటనే అనేస్తుంది.
మరోగుంపు, వద్దుతమ్ముడూ! విడిపోతే పడిపోతాం. కలిసుంటే బలిసుంటాం. కనుక కలిసే వుందాం మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనంటూనే మేమేమీ గాజులు వేసుకుని లేం. మీకంటే పెద్దయెత్తున అరాచకాన్ని సృష్టించగలం, దౌర్జన్యం చేయగలం, రెచ్చగొట్టవద్దు, మేం రెచ్చిపోతే మీరు చచ్చిపోతారు. ఇంటికో పీనుగ వెళుతుంది. రాయలసీమ పోరుకు పోతుగడ్డ. ఆ కారం తిన్నవాళ్ళం, మనందరం అన్నదమ్ములం దురుసుమాటలొద్దు. అనంటూ వుంది.
నీవెవడివిరా! మాచోటికొచ్చి మా సంపద దోచుకుంటూ మమ్మభివృద్ధి చేశానంటావ్. మా ప్రాంతానికొచ్చి మీరభివృద్ధి చెంది, మమ్మభివృద్ధిచేశానని చెప్పుకోడానికి సిగ్గేయడంలేదా? బద్మాష్ కా బచ్చా దురుసుగా మాట్లాడితే నాలుక కోస్తా, అని ఒకడంటే.
నోరు దగ్గరెట్టుకో! నాలుక కోస్తావా? దమ్ముంటే రారా! మొగాడివైతే రారా! అతిగా మాట్లాడడం ఆపకుంటే తలతీస్తా, సభ్యత, సఖ్యత, సభ్యతగా మాట్లాడడం నేర్చుకో, లేకుంటే పాతరేస్తానంటాడింకో ఆయన.
ఇదంతా కాచి వడపోసిన మరో యువ రాజకీయవేత్త. రాజకీయులు ఎంతటి నాటకమాడగలరో, ప్రజల్ని ఎలా మభ్యపెట్టగలరో చూడండి, అని ఒక నిరాహారదీక్ష అనే నాటకం ద్వారా చూపించాడు. నేను రాజకీయులు ఎలా నాటకాలాడతారో చూపించడానికే ఇదంతా చేశాననీ కుండబద్దలు కొట్టాడు. కనుక ప్రజలారా! అనవసరపు ఆవేశ కావేషాలకు పోయి నష్టపోకండి. మమ్మల్ని మరీ అంత గుడ్డిగా నమ్మకండి! అని మరీ తేల్చి చెప్పాడు.
రాష్ట్ర విభజన-కొన్ని వాస్తవాలు
రాజ్యాంగ నిర్మాతలు విశాలభారత దేశంలో, వివిధ ప్రాకీతిక వనరులు, పరిస్థితులు, ఆయా ప్రాంతాలలోని ఆదాయ వ్యయాల పరిస్థితులలో వచ్చే మార్పులు, ప్రజల మనోభావాలు (భాష, సంస్కృతి, అవసరాలు, ఆకాంక్షలు) జనాభా పరిస్థితులు మొదలగువాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, క్రొత్త రాష్ట్రాలనేర్పరచడానికి రాజ్యాంగంలోనే అవకాశాన్ని కల్పించారు. ఇది వారి దూరదృష్టికి నిదర్శనం. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, మొత్తం దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని ఏదేని ఒక ప్రాంతం దేశపు లేదా రాష్ట్రపు సగటు అభివృద్ధిని సమానంగా అభివృద్ధి కాకున్నట్లయినా, నిరంతరమూ వెనుకబాటుతనంతోనే వుండిపోతున్నా, ఆ తేడాని సరిచేయడానికి వీలుగా వున్న చిన్నవాటిని కలిపి ఒకే పెద్ద ప్రాంతంగా చేయడానికీ, లేదా ఒకే పెద్ద ప్రాంతంగా వున్నదానిని అవసరమైన మేర విడగొట్టడానికీ పార్లమెంటుకు అధికారం కట్టబెట్టారు వారు. ఇక్కడ పరిశీలించాల్సిన ముఖ్యాంశాలు రెండున్నాయి.
1) ఇలాంటి సందర్భాలలో ప్రాంతీయ ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేయక్కరలేదన్నది ఒక ముఖ్యాంశం.
2) మొత్తం దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభే ఈ విషయంలో (తగినంత మెజారిటీ అభిప్రాయాన్నే అంతిమ నిర్ణయంగా పరిగణిస్తూ) తీర్పరిగా వుండాలన్నది రెండో ముఖ్యవిషయం.
రాజ్యాంగ ప్రతిపాదితమైన క్రొత్త రాష్ట్రాల ఏర్పాటు (ఉన్న రాష్ట్రాన్ని విభజించడం, ఉన్న రాష్ట్రాలను కలపడం అన్న రెండు విధానాలూ ఇక్కడ అన్వయిస్తాయి) అన్న భాగంలోని పై రెండు ముఖ్యాంశాల్ని అర్థం చేసుకుంటేనే రాజ్యాంగ నిర్మాతల హృదయాన్ని పట్టుకున్నట్లు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం అన్నదానిని సక్రమంగా అన్వయించాలంటే, మొత్తం ప్రజల అభిప్రాయం అనిగానీ,, మొత్తం ప్రజలలో సింహభాగపు ప్రజల అభిప్రాయంగానీ అర్థాన్ని గ్రహించాలి. కనుకనే ఒక రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని, ఒక రాష్ట్రం విడిపోవాలా? కలిసుండాలా? అన్నదాన్ని నిర్ణయించడానికి ఆ రాష్ట్రం ప్రజల అభిప్రాయాన్ని తప్పనిసరి చేయనక్కరలేదు. లేదా చేయకూడదు అన్న దృష్టిని కనపరచారు రాజ్యాంగ నిర్మాతలు. అంటే దేశంలోని చిన్న చిన్న విభాగాలుగ-రాష్ట్రాలుగ-ఉన్నవాటి విషయంలో వీలైన మార్పులు చేర్పులూ చేయవలసివస్తే, ఆ పని చేయాల్సింది మొత్తం దేశానికి చెందిన ప్రజలేగాని, కేవలం ఆ ప్రాంతానికి లేదా రాష్ట్రానికి చెందిన ప్రజలుకాదు అన్నదే రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయం.
ఇక్కడే మరో కీలకమైన విషయమూ వుంది. రాష్ట్ర విభజన చేసేది ప్రభుత్వమే అయినా, ప్రభుత్వం తనంత తానుగా ఈపని చేయకూడదన్నదే రాజ్యాంగ హృదయంలోని ముఖ్యభావము. పాలిస్తున్నది మెజారిటీ వున్న పార్టీయే అయినా, ఆ మెజారిటీ నిజానికి ప్రజల మొత్తంలో అధికభాగం అనడానికి వీలు లేందిగా వుంటోంది గనుక, లేదా బహుళ పార్టీల వ్యవస్త, నిరాసక్తులు, అవగాహనా రహితులునైన ఓటర్లు గణనీయంగా వున్న స్థితిలో ఇతర పార్టీలకంటే అధికస్థానాలు గెలుచుకోవడం ద్వారానూ ప్రభుత్వాన్ని ఏర్పరచే వెసులుబాటు వుంటోంది గనుక కేవలం ప్రభుత్వం, అధికజనుల అభిప్రాయానికి యదార్థమైన ప్రతినిధి కాకపోతోంది కనుక, ఇంతా ఆలోచించే సమష్టి అభ్యుదయాకాంకక్షులైన రాజ్యాంగ నిర్మాతలు మొత్తం లోక్‌సభ మాత్రమే దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలుగుతుంది అనుకుని, రాష్ట్రాల పునర్విభజనకు లోక్‌సభయొక్క ఆమోదం తప్పనిసరి చేశారు.
వేర్పాటువాదులు - సమైక్యవాదులు
మన రాష్ట్రానికి సంబంధించినంతలో వేర్పాటువాద పక్షాలు రెండున్నాయి. సమైక్యవాదులు ఒకపక్షం, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేకాంధ్ర కావాలంటుండే రెండూ వేర్పాటువాద పక్షాలు. అంతా కలిసుండాలంటుండేవారు సమైక్యవాదులు.
వేర్పాటువాదుల్లో, మీ చావు మీరు చావండి, మా తెలంగాణ మాకివ్వండి అంటూ తెరమీదికి ప్రధానంగా వచ్చినవారు తెలంగాణావాదులు. ఈ పక్షం చాలా వయస్సు కలదంటుంటారు వీరు. అంటే సుమారుగా స్వాతంత్యం వచ్చిన దగ్గరనుంచే ఈ పక్షం మేము విడిపోతాం అంటూనే వస్తున్నారన్నమాట. కానీ ఆనాటినుండీ ఏ పార్టీవారు ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చినా, ఆ ప్రభుత్వంలో ఏ ప్రాంతానికి చెందినవారు ముఖ్యమంత్రిగా వున్నా, ప్రత్యేక తెలంగాణా కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కేంద్రప్రభుత్వంపై గట్టిగా వత్తిడి తెచ్చిందీ లేదు. కానీ తెలంగాణా ప్రాంతంలోని కొందరు ప్రజానేతలు, రాజకీయ నేతలు మాత్రం నిరంతరాయంగా లేదా కనీసం అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని లేవనెత్తుతూనే వచ్చారు. అసమహం ఎప్పుడెప్పుడు తగినంత వత్తిడి తేగలిగిందో, ప్రభుత్వం నడుపుతున్న పార్టీలోని తెలంగాణాకు సంబంధించిన బలంకల నేతలూ వారితో గొంతు కలిపారో అలాంటి సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక తరహా పంచాయతీ జరగడం, అప్పటికి తాత్కాలికంగా ఆవేశాలు చల్లబడేలా వప్పందం కుదుర్చుకోవడం జరుగుతూ వచ్చింది. అలా ఏర్పడ్డవే 610 జీవోగానీ, పెద్దమనుషులు ఒప్పందంగానీ. ఏదేమైనా ఇటు రాష్ట్రంగానీ, అటు కేంద్రంగానీ ప్రత్యేక తెలంగాణాను ఏర్పరచాలన్న దృష్టిని ఎన్నడూ కనపరచలా.
రెండు థాబ్దాలు రాష్ట్రాన్ని పాలిస్తున్న రెండు పార్టీల ముఖ్యమంత్రులూ ఎన్టీరామారావు, చంద్రబాబు, వై.యస్.రాజశేఖరరెడ్డిగార్లు, ముగ్గురూ సమైక్యాంధ్ర అన్న దృష్టినే కనబరిచారు. ఎన్.టి.రామారావుగారి హయంలో తెలంగాణా వేర్పాటువాదం ఉధృతిని కోల్పోయి నిద్రాణంగా వుండడంతో దాన్ని గురించి మల్లగుల్లాలు పడాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురుకాలా. ఇక చంద్రబాబుగారు తమ పార్టీ రాజకీయ ఉనికి కొరకే పోరాడాల్సిన పరిస్థితిలోకి వచ్చాక తమ పార్టీలోనే ప్రత్యేక తెలంగాణా వాదం క్రమానుగతంగా బలపడుతూ రావడంవల్ల, వై.ఎస్.ఆర్. దెబ్బకు పార్టీ పునాదే కదలబారే పరిస్థితి రావచ్చునన్న శంక తోడవడంతో ఒక దిక్కుమాలిన పరిస్థితిలో, మేమూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకులం కాదు. కేంద్రం తీర్మానం చేస్తే తెలంగాణాకు అనుకూలంగానే ఓటేస్తాము అన్న వాగ్దానంచేసి, టి.ఆర్.ఎస్.తో చేతులు కలిపి ఎన్నికలలోకి వెళ్ళారు. కనుకనే ఈనాటికీ తెలంగాణాకు అనుకూలంగా మనస్ఫూర్తిగా మాట్లాడలేకున్నారు. చంద్రబాబుగారి దృష్టంగా ఎన్నికలలో గెలిచి, పార్టీకి ఎదురు లేకుండా చూసుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఎలాగన్నదే. మిగిలిన ఏ విషయాలైనా ఆయనకు రెండో ప్రాధాన్యత కలవే. తెలంగాణ ఏర్పడి, ఇటు ఆంధ్రలోనూ, అటు తెలంగాణాలోనూ తన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది అన్న హామీ లభిస్తే గురికుదిరితే, నిజం చెప్పొద్దూ, చంద్రబాబుగారు నిజాయితీగా, బలంగా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని నెత్తికెత్తుకుంటారు. ఆయన ప్రధాన దృష్టంతా తన పార్టీ, తన పాలన మీదనేనన్నది ఆయన్ను సరిగా చూస్తున్నవారందరికీ తెలుసున్నదే. ఈ నిజాల్ని గమనించలేని, లేదా గమనించినా పట్టించుకోని నేతల కొందరు చంద్రబాబు మాట్లాడరేమి? ఎటూ తేల్చరేమి? లాంటి చిన్నబుచ్చే మాటలు రెచ్చగొట్టడానికి వాడేస్తున్నారు. వీళ్ళపిచ్చిగాని, అలాంటి రెచ్చిపోడానికాయనేమన్నా రాజకీయ బడుగు ప్రాణా? ఆధునిక రాజకీయాలలో చాణుక్యుడంతటివాడాయన. ఆయన మౌనానికి అస్సలు కారణం, ప్రత్యేక రాష్ట్రం వస్తే పార్టీకేమవుతుంది? తనకేమవుతుంది? కలిసుంటే పార్టీకేమవుతుంది? తనకేమవుతుంది అన్నది తేలకపోవడమే. ప్రత్యేక తెలంగాణా వాదానికాయనగారు నిజమైన వ్యతిరేకి కాదన్నదొక నిజం.
ఇక వై.ఎస్.ఆర్.ని మాత్రం సమైక్యవాది అనడమే వాస్తవానికి దగ్గరి మాట. ఇస్తేగిస్తే కాంగ్రేసే-మేమే-తెలంగాణా ఇవ్వాలి. మరొకరివల్ల ఆ పని అవదు, అన్నది అతని పరిణతి చెందిన రాజకీయ పోకడలోని భాగం మాత్రమే. ఎలాగూ రాష్ట్ర విభజన రాష్ట్రం చేసేదికాదు, చేయగలిగిందీకాదు. అది కేంద్రం అదీ లోక్‌సభ మెజారిటీ నిర్ణయాన్నిబట్టి ఆకృతి ధరించాల్సిందేనన్న నిజం సుస్పంష్టంగా ఆయనకు తెలుసు. కనుకనే తెలంగాణకు మేము అంటే రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ వారం వ్యతిరేకులంకాదు అన్న నినాదం వరకు నిరభ్యంతరంగా ఎన్నికల పోరాటంలో వాడేసుకున్నారు. మరోవంక తెలంగాణాలోనూ ఒక పరిమిత సమూహం మాత్రమే గట్టిగా పట్టుక్కూర్చున్న ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బలహీనపరచడానికి చేయగల పరోక్ష యత్నాలన్నీ చేశారు. తెలంగాణా అభివృద్ధి, ప్రజలకు లబ్ది అనిపించే కార్యక్రమాలకు స్వీకారంబట్టడం ద్వారా తెలంగాణాలోని సామాన్యప్రజల దృష్టిని ప్రత్యేక తెలంగాణా వాదాన్ని బలహీనపరచడానికి చేయగల పరోక్షయత్నాలన్నీ చేశారు. తెలంగాణా అభివృద్ధి, ప్రజలకు లబ్ది అనిపించే కార్యక్రమాలకు స్వీకారం బట్టడం ద్వారా తెలంగాణాలోని సామాన్యప్రజల దృష్టిని ప్రత్యేక తెలంగాణా అన్నదానివైపునుండి కొంతమేర మరల్చగలిగారు. నడచినంతకాలం గొడవలేకుండా నడవనీ అన్న లక్ష్యంతో టి.ఆర్.ఎస్.తోనూ జతకట్టి తన పార్టీ గెలుపుకు, తన ఆధిపత్యానికీ ఒడిదుడుకుల్లేని బాట వేసుకోగలిగారు. తోకాడించినవారినల్లా తొక్కేయడం, తనవారనుకున్నవారిని ఆక్కున చేర్చుకుని, అందలమెక్కించేయడం ఇదే ఆయన ప్రధాన రాజనీతి. నిజానికీ వైఖరి అన్నిచోట్లా చెల్లుబాటయ్యేది కాకున్నా, ఎదుర్కొని చేయగలిగిందేమీ లేదు. అనుకూలతా వుండి, అందినంత ప్రయోజనాన్ని పొందడమే తెలివైన పని అనుకునే రకం ఉన్నచోట్లలో మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా చక్రం తిప్పగలిగారు గనుకనే, ఏకచ్ఛత్రాధిపతిగా చలామణి కాగలిగారాయన. కేంద్రమూ ఆమేరకు ఆయన్ను ఆదరించక తప్పిందికాదు. ఆయన పోయాక రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంత వివిధత్వం, వర్గతత్వం బైటపడిందో చూశాక, అయనున్నంతకాలం ఎంతో ఐకమత్యంగా వున్నట్లుండడం అన్నది ఆశ్చర్యం కలిగించక మానదు. 'అవునంటే అందలపు విందు, కాదంటే కడబంతి కూడు' ఇదే రాజశేఖరుడి దేవిడీ గారడీ.
ప్రత్యేక తెలంగాణా వాదాన్ని మళ్ళీ నిద్రలేపి, దుమ్ముదులిపి, రోడ్డున నిలబెట్టింది చంథ్రేఖరే ననడం సత్యదూరం కాదు. ఆయనకు వెనక తలగలవాళ్ళు కొందరున్నా, వాళ్ళ ఆలోచనలకు బాహ్యాకృతినిచ్చింది మాత్రం కె.ఎస్.ఆర్.గారే. ఆయనలోని విలక్షణ ప్రసంగశైలి, ప్రజానాడిని పట్టుకోగల వడుపు, వారిని రచ్చగొట్టగల దుడుకు, ఆయా విషయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికతడు తీసుకునే శ్రద్ద, ఆ మొత్తాన్ని ప్రజల భాషలోకి మార్చి మాట్లాడే చాకచర్యము కలసి ఆయనకొక ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టాయి.
తెలంగాణా ప్రజలకొరకు తెగ మదనపడిపోతున్నారని బల్లగుద్దిచెప్పలేంగానీ, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కలుపుకునే అయినా, ప్రత్యేక తెలంగాణా భావనను ప్రజాభిప్రాయంగా మలచింది, ఉద్యమ రూపాన్నించ్చింది. ఆ నేపథ్యం నుండే రాజకీయంగా నిలదొక్కుకున్నదీ, ఇటు రాష్ట్ర రాజకీయాలలోనేగాక, అటు కేంద్రంలోనూ తనకంటు ప్రాధాన్యతనివ్వక తప్పనిస్థితిని కల్పించిందీ, ఆయనలోని ప్రజ్ఞాపాటవాలేనన్నది అంగీకరించక తప్పదు.
అదొకరకమైన తెగువ. మాటతిప్పినప్పుడూ, మాటలు మార్చినపుడూ కూడా నిర్మొహమాటంగా, నిర్భయంగా అవును మాట తప్పామండి. తప్పుతాంకూడా. మా ధ్యేయం తెలంగాణా రాష్ట్రసాధన. దానికోసం అవసరమైన ఏ పనికైనా మేము సిద్ధం. మాకదే నీతి. మానీతదే. అని బల్లగుద్ది చెప్పగల తెగువగలవారాయన. చాణక్య రాజనీతి రీతాయనది. అనుకున్నది సాధించడానికి అడ్డదారైనా పనికొస్తే అదే సరైనది అన్నదే ఆయన నీతి.
ఆయన అడ్డగోలుతనంలో రెండు రీతులున్నాయి. (1) తాను చెప్పదలచుకున్న విషయానికి చెందిన విలువైన సమాచారాన్ని సేకరించి దానిని ఒక క్రమంలో సూటిగా చెప్పగలగడం, (2) అసభ్యంగా, సంస్కార హీనంగా, దౌర్జన్యంగా తానో అసామాన్యుణ్ణనుకుంటూ విశృంఖలంగా మాట్లాడడం.
ఎదుటివాళ్ళపై దాడి చేయాలనుకున్నప్పుడు విజ్ఞులు అసహ్యించుకునేంత అసభ్యంగా వుంటుందాయన భాష. యువతను రెచ్చగొట్టాలనుకున్నపుడూ రెచ్చిపోడానికి అవసరమైన భాషను వాడగల పటిమా వుందాయనలో. కె.సి.ఆర్. మంచి వక్తన్నది ఎవ్వరం కాదనలేని నిజం. రాజకీయ ప్రసంగాలలో గతంలో ఇంత వల్గారిటీ వుండేదికాదు. ఈయన ప్రసంగాల హోరు జోరందుకున్నాక, మిగిలిన అయ్యలూ అదే భాషను లంకించుకున్నారు. ఈనాడు రాజకీయ క్షేత్రాలలో ఏ రాజకీయుడు, ఏ విషయం మాట్లాడడం మొదలెట్టినా, మొదలెట్టిన రెండో నిమిషం నుండే తన పార్టీలోని వ్యతిరేక వర్గంతో మొదలెట్టి ఎదుటి పార్టీల వరకు తప్పులెన్నడం, తిట్లు వడ్డించడం తప్ప ఇంకోటి కానరాదు. అన్ పార్లమెంటరీ భాష లోగడ ఎప్పుడోకప్పుడు చాలా అరుదుగా వినబడడం, దానిని రికార్డుల నుండి తొలగించడం జరుగుతుండేది. కానీ ఈనాడది సర్వసాధారణమైంది. భాషరానివారు, వచ్చినా మంచిభాష వాడే అలవాటు లేనివారూ, దాదాగిరిలో నేర్పున్నవారూ రాజకీయ క్షేత్రాలలో సింహ భాగాన్ని ఆక్రమించేశారు. ఈ రకమైన అసభ్య భాషా వరవడికి వడినిచ్చిన ఘనతా కె.సి.ఆర్.దే.
ఇక ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని పట్టిచూద్దాం
రాజ్యాంగం ప్రకరం ఆర్టికల్ 2, 3 ల ననుసరించి రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియంతా కేంద్ర ప్రభుత్వం చేయవలసిందిగా వుంది. అదైనా ప్రభుత్వంగానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీగానీ నిర్ణయించగలిగిందికాదు. అది పార్లమెంటు మాత్రమే చేయాల్సిన పని. అయితే సమస్యను సభ ముందుంచడం అన్న ఆరంభచర్య ప్రభుత్వం చేతిలో వుంది. అదిన్నీ ప్రభుత్వ సేచనమేర రాష్ట్రపతి సభకు సిఫారసు చేయాలి. ఆ ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేసే స్థితిలో వారి పార్టీ వుంటోంది. ఈ నాలుగైదు నిజాలు పైన మనం చెప్పుకున్న మూడు వాదాల వారికీ తెలుసు.
అంటే ప్రధానమంత్రి కూడా రాజ్యానికి చెందిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, అతనున్న పార్టీలోని విధాన నిర్ణయ మండలి ఆమోదం పొందవలసి వస్తోందన్నమాట. అందుకే రాజ్యాంగం ప్రకారం ఏ సంబంధం లేకపోయినా, పార్టీలు, పార్టీ అధిష్టానాల వైపే అందరూ చూడడం జరుగుతోంది. టి.ఆర్.ఎస్. తెలంగాణా ఇవ్వమని సోనియాగాంధీనెందుకు వేడుకున్నట్లో, రాజ్యాంగ నేత్రాలతో చూసేవారికి అంతుబట్టిచావదు. రాష్ట్రప్రభుత్వం కూడా రాష్ట్ర సమస్య మేడంగారి ముందుంచాం. ఏ నిర్ణయంగానీ తీసుకోవలసింది ఆమేననడం విడ్డూరం. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, తన రాష్ట్రంలో పుట్టి కేంద్రం పరిష్కరించాల్సిన సమస్య ఎదురైనపుడు తాను చెప్పాల్సింది ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికా? ఒక పార్టీ అధ్యక్ష స్థానానికా? పైగా కేంద్రమైనా పార్లమెంటు ద్వారా పరిష్కరించాల్సిన సమస్యను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటులో ఉన్నవాళ్ళ ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తేవడంకదా క్రమపద్ధతి. ప్రధానమంత్రి మొదలుకుని మొత్తం ప్రభుత్వమంతా ఒక పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నామె ప్రకారమే నడచుకునే అసాధారణ పరిస్థితి ఈనాటి కాంగ్రెస్‌లో ఏర్పడి వుంది. ఇంతగా పార్టీ ఏకనాయకస్వామ్యం ఇతరత్రా కనపడదు. ప్రస్తుత భారతదేశ పరిపాలన పరంగా, ప్రజాస్వామ్యాన్ని కొలతగా తీసుకుని దానిని చూస్తే ఇదో విచిత్ర పరిస్థితి, విడ్డూరంకూడా.
దేశంలోనే ఎవరు ఏ విషయంపై పరిష్కారం కోరినా, పరిష్కర్త సోనియాగాంధీగారేననుకోవడం అలవాటుగనూ మారిపోయింది. ఆమెగారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరో నలుగురు సహచరుల్ని సంప్రదిస్తే సంప్రదించవచ్చుగాక, అలాంటి పని వెనకటి రాజరిక వ్యవస్థలోనూ జరిగేది, మంత్రిమండలి అననేవారు దానిని. కానీ భారత రాజ్యాంగం ప్రకారం, నిపుణుల సలహా, అధిక జనుల - మెజారిటీ ప్రజల-ఆమోదము అన్నవాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయా విషయాలపై నిర్ణయాలు తీసుకుని ఆచరణలోకి తేవాల్సి వుంటుంది. కానీ నేడది పార్టీలో కొద్దిమంది మధ్య చర్చించబడి, మేడంగారి నిర్ణయానికి లోబడి పాలనలోకి తీసుకోబడుతోంది. దానర్థం ఏమిటి? ప్రజాస్వామ్యం పేరున రాజరిక వ్యవస్థే అమలులో వుందనేగదా?
- తెలంగాణా యిస్తామని సోనియాగాంధీ మాటిచ్చింది. ఆమె ఒకసారి కమిటైతే ఇక దానికి తిరుగుండదు. కనుక తెలంగాణా వచ్చినట్లే అని ఈనాడు అంటున్నవాళ్ళందర్నీ ఏమనాలో అర్థంకావడంలా! వీరంతా అటు రాజ్యాంగాన్నిగురించిగానీ, ఇటు ప్రజాస్వామ్యాన్నిగురించిగానీ సరైన అవగాహన లేనివారని మాత్రం అనక తప్పదు. అస్సలు సోనియాగాంధీగారికీ, తెలంగాణా రాష్ట్రం ఇవ్వడానికీ, ఇవ్వకపోవడానికీ మధ్య వున్న బాదరాయణ సంబంధం ఏమిటి? ఆమె సర్వసహాధినేత్రి (మహారాజ్ఞి) అన్నది మానసికంగా ఒప్పుకోవడం కాకుంటే దీనికి మరో కారణం కనిపించదు.
ఇక ఆయా పార్టీలు తమకు నచ్చని విషయాలు ఎదురైనపుడు అనుసరిస్తున్న విధానాలతో నిరసన తెలియజేయడం ఒకటి. అది భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఎంచుకున్న, లేదా రాజ్యాంగం అంగీకరించిన విధానం. అది తన (తమ) అభిమతాల్ని బలంగా చూపడానికి, తెలియపరచడానికి వాడుకోడం అన్నదానిని అతిక్రమించి, ఎందరో ప్రజల స్వేచ్ఛను, హక్కులను, అవసరాలను అడ్డుకొట్టేదాకా సాగిపోయింది. ఒక చిన్న సమూహానికి-తమకు నచ్చని లేదా నష్టం కలిగించే పనేదైనా అటు ప్రభుత్వం నుండిగానీ, ఇటు సమాజంలోని ఏ సమూహం నుండిగానీ ఎదురవ్వగనే పై నిరసనకు సంబంధించిన వికృతరూపం ఆచరణకు పూనుకుని, బందులు-రాస్తారోకోలు, ధర్నాలు పేరున విచ్చలవిడి వీరంగాన్ని సృష్టించేస్తోంది.
నేనో, మీరో, మరొకరో ఒకదారంట తన అవసరంకొద్దీ, తన మానాన తాను పోతున్నాడు. అతణ్ణి ఆ మార్గాన పోనీకుండా ఆపే హక్కుగాని, అధికారంగానీ మరొకరికి ఎవరిచ్చారు? ఎవరివ్వగలరు? జనజీవనాన్ని స్థంభింపజేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ క్రిందికి వస్తుందా?
రాస్తారోకో, బంద్, వగైరాలకు రాజ్యాంగం అనుమతివ్వడమంటే దాని వెనకనున్న దృష్టి ఏమైయుంటుంది? బంద్‌కు పిలుపిచ్చినవారు తమకు, జరిగిన అన్యాయాన్ని ప్రజలకెరుకపరచి మాకు మీరూ నైతిక మద్దతునివ్వండి అని ప్రజలకు వినతి చేయడమే అది కనుకనే 'బంద్‌కు పిలుపివ్వవచ్చు' అన్నంతవరకే వీరి స్వేచ్ఛ. అటుపై ప్రజల వ్యవహారాన్ని బలవంతంగా నిలిపివేసే స్వేచ్ఛగాని, హక్కుగాని వీరికి లేనేలేదు, ఉండకూడదు. ప్రజలు వీరి పిలుపును అర్థం చేసుకుని అది తమకూ సరైందిగనే అనిపించి, అలా అనిపించిన వారంతా ఎవరికి వారు వారి వారి అభీష్టంమేర ఆ పిలుపు ననుసరించడం వరకే రాజ్యాంగం అంగీకరించగలిగింది. మరో సమూహం యొక్క స్వేచ్ఛను హరించే, అడ్డుకొట్టే అవకాశాన్నీ (స్వేచ్ఛను, హక్కును) వేరొక సమూహానికి ఇచ్చి అధికారం రాజ్యాంగానికి కూడా లేదు, వుండదు. ఇది ప్రజాస్వామ్యంలో, వ్యవస్థ మొత్తానికీ వర్తించే మూలసూత్రం. అయినా ఈనాడిది ఎప్పుడోగాని, ఎక్కడోగాని కొన్ని మినహాయింపు ఘటనలుగా మాత్రమే) జరుగుతుందేగాని, సాధారణంగా దీనికి వ్యతిరేకంగానే అంతటా జరుగుతూ వస్తోంది. ఎక్కడికక్కడ బలవంతుడిదే రాజ్యం అన్న సూత్రమే అమలవుతోంది. ఏ ఒక్క పార్టీకిగానీ, పార్టీలో నాయకుడి పాత్రలో వున్నవాడికిగాని ఎదుటివాడి స్వేచ్ఛను అడ్డుకోకూడదన్న ఇంగితంగానీ, ఇతరుల హక్కులకు భంగం కలిగించగూడదన్న దృష్టిగాని, తన స్వేచ్ఛ, తన హక్కులకు చాలా పరిమితులున్నాయన్న స్పృహగానీ కొద్దిమాత్రంగానైనా వుండడంలేదు. అవకాశం లేకో, బలం చాలకో పూరుకుంటే వూరుకుంటున్నారేమోగాని, మొత్తం మొత్తంగా పార్టీలు, అందులోని వివిధ స్థాయిన నేతలు చెలాయించడమెలాగన్న దానిదగ్గరే వుంటున్నారు.
ఎంత విషాదకర పరిస్థితి? ప్రజాస్వామ్యాన్ని గురించిగానీ, సామాజిక పురోగతిని గురించిగాని నిజాయితీగా ఆలోచించే వాళ్ళంతా విషణ్ణవదనంతో, నిట్టూర్పులు విడవడంతప్ప ఏమీ చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో నెలరోజులపైబడి ఏకధాటిగా జనజీవనాన్ని స్థంభింపజేసే, వ్యక్తిగత ఆస్తుల్ని విధ్వంచేసే, ప్రజల్ని భీతావహుల్ని చేసే కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రం బందని ఒకడంటే, ప్రాంతం బందని మరొకడు, జిల్లా బందని వేరొకడు మొదలెట్టి అడ్డూ ఆపుగానీ, బాధ్యతగాని లేని అరాచకపు మందను, యువతను ప్రేరేపించి, రెచ్చగొట్టి మొత్తం జనజీవితాన్ని స్థంభింపజేస్తున్నాడు. సమాజపు ఆస్తిని, ప్రజాదనాన్ని, వ్యక్తిగతాస్తుల్ని విధ్వంసం చేసేస్తున్నారు. ఆపని చేసినందుకు సిగ్గుతో కుచించుకు పోవలసిందిపోయి, వెన్ను విరుచుకుని మరీ తామంటే ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా? అని విర్రవీగుతున్నారు. నిస్సిగ్గుగా ప్రగల్భాలాడుతున్నారు. ప్రజలూ ఈ విధ్వంసాన్నంతా మౌనప్రేక్షకులల్లే చూస్తున్నారు. కొందరైతే ఈ తంతునంతా విని చూస్తూ ఆనందిస్తున్నారు.
No comments:
Post a Comment