Friday, January 1, 2010

అధ్యయన, శిక్షణ తరగతులు


యోచనాశీలురైన ఉద్యమ మిత్రులారా!
దాదాపుగా ఏ సంస్థ తలపెట్టిన కార్యక్రమాలైనా అనుకున్నపని అనుకున్నరీతిలో అనుకున్నంతగా పూర్తికావడం లేదన్నదో వాస్తవం. ఈ అసంతృప్తి ఆయా సంస్థలతో నిండా మునిగి పనిచేస్తున్న వారందరి అనుభవంలో వున్నదే. అందుకు కారణం ఉద్యమ క్షేత్రాలలో వుంటున్న, కనపడుతున్న వాళ్ళలో ఎక్కువమంది అవగాహన, తపన లేనివాళ్ళే. ఆయా సంస్థల నిర్వాహకులున్నూ, కార్యకర్తలకు అధ్యయన శిక్షణ తరగతులు నిర్వహించుకోవడంలో తగినంత శ్రద్ధపెట్టడంలేదు. నిజానికిదెంతో విచారకరమైన విషయం. ఇది చాలాదన్నట్లు, దీర్ఘకాలం, పెద్దయెత్తున సాగించాల్సిన ఉద్యమాలకు వనరుల కొరతా ఎంతో వుంటోంది. ఆయా సంస్థల సభ్యుడు దొరికితే చాలన్నట్లు భావిస్తుండడం, ఆ చేరినవారున్నూ, మొహమాటానికో, గొప్పకోసమో సభ్యులుగ చేరుతుండడంతో దాదాపు ప్రతి సంస్థలోనూ అది చేపట్టిన సామాజిక కార్యక్రమాలలోనూ క్రియాశీలంగా, తనకున్న శక్తియుక్తులనన్నింటిని వినియోగిస్తూ పనిచేస్తుండేవారు అతికొద్దిమందే అవుతున్నారు.

ఏదైనా ఒక కర్యాక్రమం చేద్దామనుకుని, కొన్ని నెలలో, వారాలో పట్టుబట్టి చేసిన గట్టి యత్నాలవల్ల ఆరంభ సమావేశాలు మాత్రం ఒక మోస్తరుగ జరుగుతున్నాయి. అవైనా, బ్రతిమాలో బామాలో, మొహమాటపెట్టో, ప్రశంసించో పెద్దపీట వేస్తామని చెప్పో, ఛార్జీలు, భోజన వసతులు భరిస్తామని చెప్పో అనేకసార్లు మరీమరీ పిలవడం ద్వారా వచ్చినవాళ్ళతో కూడి వుంటున్నవిగనే వున్నాయి. సంస్థనుగానీ, సంస్థ చేపట్టిన కార్యక్రమాలనుగానీ సొంతం చేసుకున్న వాళ్ళ సంఖ్య చాలాచాలా తక్కువగా వుంటోంది. దాంతో అలా ప్రారంభమైనవన్నీ మలి సమావేశానికీ నామమాత్రాలై పోతున్నాయి. పట్టుబట్టి మొదలెట్టినవాళ్ళు మనసూరకుండబట్టక, జనాలను కదిలిస్తూ, నానాహైరాన పడుతున్నంతకాలమే ఆమేరకైనా సమావేశాలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. విసుగుపుట్టో, నీరసంవచ్చో వీళ్ళుగాని యత్నించడం ఆపేస్తే ఇక ఆ వేదిక కార్యక్రమాలన్నీ పడకనబడ్డట్లే. ఉద్యమక్షేత్రాలలో దాదాపు ప్రతిచోటా కనపడే సాధారణ చిత్రమిది.
సుస్పష్టమైన అవగాహన, కార్యదీక్ష దక్షతలన్నవి కార్యకర్తలలో చోటు చేసుకోనంతకాలం ఈ సమస్య ఇలా సాగుతూనే వుంటుంది. అందుకే మొదటినుండీ, తొలిథలో ముందుగా ఉద్యమ నిర్మాణంపై దృష్టిపెట్టాలనీ, అటుపైనే ఉద్యమ కార్యాచరణకు దిగాలనీ చెపుతూ వస్తున్నాను. థాబ్దాలుగా వివిధ ఉద్యమాలలో పనిచేస్తూ వచ్చిన మీకు, కార్యకర్తల నిర్మాణం అన్న విషయంలో ఉద్యమాలన్నీ చాలా బలహీనంగా వున్నాయన్న వాస్తవం తెలియంది కాదు.
మనం వుండే కొద్దిమందిమి. ఏదైనా ఒక్కపని చేపట్టి గట్టిగా సాగించడానికే శక్తిచాలడంలేదు. అయినా ఇదేమీ పట్టించుకోకుండా మరోవంక రకరకాల సమస్యలపై ఐక్యపోరాటాలంటూ క్రొతక్రొత్త వేదికలు లెక్కకు మిక్కిలిగా పుట్టుకొచ్చుస్తున్నాయి. ఇలాంటి వేదికలలో, నేను దీనిలో వున్నాను, దానిలో వున్నాను, మరోదానిలోనూ వున్నాను. నేను లేని వేదిక లేదు అని చెప్పుకోడానికి ఇస్టపడేవారు, ఆయన పిలిచారు, వెళ్ళకుంటే బాగుండదు, రేపు మనం పిలిస్తే ఆయన రాడేమోలాంటి ఆలోచన కలవారు, కాలక్షేపం కానివాళ్ళు వగైరా, వగైరాలు సభలు, సమావేశాలలో ఎక్కువమంది వుంటున్నారు. కనుకనే అటు సమావేశాల సందర్భంలోగానీ, ఇటు సమస్యలపై పోరాడే సందర్భంలోగానీ క్రియాశీలస్థానాలతో కనపడేవారు ఉన్న ఆ పదిమందే అవుతున్నారు. దాంతో ఆ కొద్దిమందిపైన అధికభారం పడడమేగాక, పనులూ పూర్తికావడంలేదు.
జరుగుతూవున్న వాస్తవ పరిస్థితి ఇది. నిజానికి ఏ ఉద్యమాలైనా ఆరోగ్యంగా, బలంగా సాగాలంటే, కార్యకర్తల రాశి, వాసి నిరంతరం పెరుగుతూ వుండాలి. అలాగే ఉద్యమశాఖల విస్తరణా జరుగుతుండాలి. సరైన ఉద్యమానికిది తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణం. కనుకనే సమాజాన్ని పునర్నిర్మించుదాం అనుకుంటున్న మనం, ముందుగా ఉద్యమాల తీరుతెన్నులనూ అవసరమైన మార్పులు చేర్పులకు లోనుచేసి వాటినీ పునర్నిర్మించుకోవలసి వుంది.
(1) అధ్యయన, శిక్షణ తరగతులు :
గతంలో ఎంతో కొంతమేర అమలవుతుండేవీ, ఈమధ్యకాలంలో పూర్తిగా విడచివేయబడ్డవీ అయిన అధ్యయన శిక్షణ తరగతుల్ని ముందుగా పునరారంభించుకోవలసి వుంది. ఏ ఉద్యమంయొక్క స్థితిగతులైనా ఆ ఉద్యమ కార్యకర్తల అవగాహన, సంసిద్ధత, దక్షతలన్న వాటిపైనా, కార్యకర్తల రాశిపైనా ఆధారపడే వుంటాయి. కనుక ఉద్యమాలు ఒకవంక కార్యకర్తల రాశిని పెంచుకుంటూనే, ఒక నిరంతరాయ ప్రక్రియగా అధ్యయన శిక్షణ తరగతులను నిర్వహించుకుంటుండాలి. తప్పనిసరైనదీ, మరోదారి లేనిదీ అయిన దీనిని ఆరంభించి ఇతరులకూ ఒక నమూనా కాగలిగేలా మలచుకోవాలి. రాశి, వాసి తగినంతగా సమకూర్చుకోడంమ్మీదే ఉద్యమ సఫలత ఆధారపడి వుంది.
- 'సఫలతకు సూత్రం ఎంతపనికి అంతయత్నం అన్నదే'
- ఉద్యమ నిర్మాణం : ఉద్యమ నిర్మాణానికీ, ఉద్యమ కార్యాచరణకు కూడా సమాజమే క్షేత్రం. అందులో ముందు పని ఉద్యమ నిర్మాణమే. అందుకు మనకున్న ఒకే ఒక మార్గం.
- ''వెదుకు-గమనించు-సమీకరించు-సంఘటితపరచు-శిక్షణ గరపు-పోరాడు'' అన్నదే.
శిక్షణ అన్నది రెండు రూపాలలో వుంటుంది : (1) ఉద్యమ కార్యకర్తలకొరకు, (2) సమాజంలో స్థానికంగా సమస్యలపై పోరాడాల్సిన ప్రజల కొరకు. ఈ రెండు సమూహాలు అక్కడక్కడా, అప్పుడప్పుడూ కలసి పనిచేసినా, నిజానికి ఎవరి కార్యక్రమం వారికుటుంది, (3) విద్యాలయాలలో ప్రసంగాలు-భావజాల వ్యాప్తి - అన్నదగ్గర నుండి పై రెండు రకాల సమూహాలను వెదకి పట్టుకునే పని ఆరంభించాల్సి వుంది. అందుకే పెద్దయెత్తున కళాశాలల్లో ప్రసంగాలు చేయాలనుకున్నాము. అందుకై ముందుగా ప్రసంగీకుల్ని తయారు చేసుకోవలసి వుంది. సుమారు 200 మంది ఉపన్యాసకులు అవసరం అనుకుని ఆ దిశగా శిక్షణ మొదలెట్టాలి.
- ఏ ఉద్యమానికైనా 'అదే తనపని' అనుకుని పూనుకునే ఇరుసుభాగం అవసరం. కనుక అందుకై భావసారూప్యతకల మనలాంటి వారం వారిని వెదకి గుర్తించాలి. అట్టివారందరం సమావేశమై ఉద్యమ లక్ష్యం, స్వరూప స్వభావాలు, థలవారీ కార్యక్రమాలు అన్నవాటిపై కూలంకష విచారణ జరిపి, దానికో స్థిరాకృతి నివ్వాలి. రెండో విడత సమీకరణకై భావసారూప్యత కలవారినీ, భావాలను అందిపుచ్చుకోగలవారినీ వెదకిపట్టుకుని ప్రాంతాలవారీగా ఉద్యమ నిర్మాణానికీ, కార్యాచరణకు వారిని సన్నద్ధుల్ని చేయాలి.
- ఉద్యమ కార్యకర్తలకుండాల్సిన సాధారణావగాహన, శిక్షణతోబాటు, ఎంపిక చేసుకున్న కార్యక్షేత్రానికి సంబంధించిన అవగాహన, విశేష శిక్షణ కూడా గరపుకుంటూ ఉద్యమాన్ని విస్తరింపజేయాల్సి వుంటుంది. అవగాహన, శిక్షణకు సంబంధించి -
1) శాస్త్రీయ దృక్పథం - శాస్త్రీయ పద్ధతుల గురించిన అవగాహన - వినియోగ నైపుణ్యత.
2) సామాజిక సంబంధాలు - వ్యక్తిపాత్ర అన్నవాటిని గురించిన అవగాహన-వినియోగ నిపుణత.
3) మానవీయ విలువలన్న వాటి గురించిన అవగాహన - ఆచరణ.
4) ఆర్థికాంశాలు, వినిమయ తత్త్వంవల్ల వచ్చిపడే అనర్థాల గురించిన అవగాహన - ఆచరణ.
5) ఉద్యమ నిర్మాణం - కార్యాచరణల గురించిన అవగాహన-కార్యకుశలత.
6) భావజాల వ్యాప్తికి తప్పనిసరి అవసరమైన ప్రసంగ నైపుణ్యము నలవరచుట.
7) ఉద్యమాలకు ఊపిరివంటిదైన కలసిపోవడం, కలుపుకు పోవడంలో శిక్షణ, సంసిద్ధత.
3. ఐక్యవేదికయొక్క అవసరం :
భావసారూప్యతకల అనేకులు కలసి ఏకోన్ముఖంగా, పెద్దయెత్తున క్రమబద్ధంగా, అనుకున్న పని పూర్తిచేయుటకొరకు గట్టిగా చేసే పనుల్నే ఉద్యమాలనాలి. వ్యక్తులుగాగానీ, సంస్థలుగాగానీ చేయగలిగింది విడివిడిగా చేస్తూనే వున్నా మొత్తం సమాజానికీ, అందరికీ వర్తించే అంశాలపై ఉద్యమించదలచుకున్నపుడు, ఆ ఒక్క విషయానికే పరిమితమై అందరం కలసి ఒక్కుమ్మడిగా పనిచేసే వీలున్న ఐక్యవేదిక నేర్పాటు చేసుకోవడం చాలా మేలు కలిగిస్తుంది. గతంలోకి చూడగలిగితే ఉద్యమక్షేత్రాలలో తలలు పండిన వాళ్ళు ఐక్యవేదికల నిర్మాణానికై గట్టికృషిచేసినట్లు సాధ్యమైనప్పుడల్లా ఐక్యవేదికల నిర్మాణానికై గట్టి కృషిచేసినట్లు సాధ్యమైనప్పుడల్లా ఐక్యవేదికలను ఏర్పరచుకుంటూ వచ్చినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా, జాతీయంగా అలాంటి వేదికలెన్నో ఏర్పడ్డాయి. మన రాష్ట్రంలోనూ అదే అవగాహనతో (1) వంచనా ప్రతిఘటన ఐక్యవేదిక, (2) లౌకిక ఐక్యవేదిక, (3) ఫారా, (4) వాస్తు నిజనిర్ధారణ ఐక్యవేదిక, (5) ఐక్య మిత్రమండలి అన్నవి అలా ఉనికిలోకి వచ్చినవే. అందులో ఐక్యమిత్రమండలి అన్నది మరింత అవగాహన అనే పునాది బలంకలిగి, దకక్షులైన అనుభవజ్ఞుల ఉమ్మడి ఆలోచనల ఫలితంగా ఏర్పడింది. కనుకనే అది సామాజికాభివృద్ధికి అవసరమైన (1) ఉమ్మడి శిక్షణా తరగతులు, (2) ప్రాథమిక విద్యారంగ సంస్కరణలు, (3) ఎన్నికల నిఘా, (4) ప్రజారాజ్యం శిక్షణ, (5) మద్యనిషేధంలాంటి అంశాలను తీసుకుని ఐక్యవేదికలను రూపొందించుకుని పనిచేయగలిగింది.
4. గ్రామాభ్యుదయోద్యమం :
సామాజిక స్థితిగతుల్ని ఆయా క్షేత్రాలలో క్రియాశీలంగా పిచేస్తూ నేరుగా నిశితంగా పరిశీలించడం ద్వారా అటు రాజ్యంగానీ, ఇటు ఉద్యమాలుగానీ గ్రామీణ మరియు లోతట్టు ప్రాంతాలకు, బలహీనులవద్దకు చేరలేదన్న చేదునిజాన్ని అనుభవజ్ఞులైన ఐక్యమిత్రమండలి ముఖ్యులు చాలా స్పష్టంగా గ్రహించారు. అదిగో ఆ నేపథ్యం నుండి పుట్టుకొచ్చిందే 'గ్రామాభ్యుదయోద్యమం' అన్న భావన. 75, 80 శాతం ప్రజలున్న గ్రామాల - లోతట్టు ప్రాంతాల ప్రజలను చైతన్యపరిచే పనికి పూనుకోకుండా సమాజ పునర్నిర్మాణం అన్నది నీటిమీది రాతో, గాలిమేడో మాత్రమే అవుతుంది. 'మన ఊరిని మనమే బాగుచేసుకుందాం' అన్న స్ఫూర్తితో నిండిన గ్రామాభివృద్ధి సంఘాలను నిర్మాణం చేయడం గ్రామాభ్యుదయోద్యమం యొక్క ప్రధానాశయం.
అందుకుగాను, (1) విద్యావంతులైన గ్రామీణ యువత, (2) యువతకంటే పై వయస్సు వారైన గ్రామాభివృద్ధికాంక్షించేవారు, (3) గ్రామాన్ని ఆవేశకావేశాలకు లోనుగానీకుండా అనునయించగల సలహామండలిగా పెద్దతరంలోని యోగ్యులు అన్న మూడు రకాల సమూహాలతో కూడి గ్రామాభ్యుదయం సంఘాలు ఏర్పరచుకోవలసి వుంది. గ్రామాభివృద్ధికై (ఎ) అందరికీ అవసరమైన, (బి) ఎక్కువమందికి ప్రయోజనకరమైన, (సి) వివాదరహితమైన కార్యక్రమాల జాబితాను రూపొందించుకుని పనులు ఆరంభించుకుంటే, క్రమంగా కొరవవున్న అన్ని సమస్యలనూ పరిష్కరించుకుంటుండవచ్చు.
గమనిక : 'గ్రామాభ్యుదయోద్యమం'క్రింద చేసుకోగల ఒక సాధారణ కార్యక్రమాల ప్రణాళిక మనమూ రూపొందించి దానిని విస్తృతంగా ప్రచారం చేయవచ్చు. ఆ విషయాల్ని మరోమారు ప్రత్యేకంగా విచారించుకుందాం.
5. అవినీతి : ఈనాడు అవినీతి సమాజమంతా విస్తరించి, బలంగా వేరూనుకునీ వుందని మనందరకూ తెలుసు. అయితే అవినీతికి మూలం-కారణం-ఏమిటన్న విషయంలో మేధావులలోనే భిన్నాభిప్రాయాలున్నట్లు గమనించాను నేను. ఏదైనా ఒక సమస్యను గురించి విచారించేటపుడు దాని పుట్టుకస్థానం-మూలకారణం-ఏమిటి? అనంతరం ఏర్పడ్డ పరిణామ రూపాలేమిటి? ఇప్పటి పరిస్థితేమిటి అన్న మూటిని విడివిడిగానూ, కలివిడిగానూ పట్టిచూడాలి. అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన సరైన-పూర్తి-చిత్రం చూడగలుగుతాం.
- సమాజంలో బలంగా వుంటూ, వ్యాపించగలుగుతున్న ఏ అంశమైనా, ప్రజలు అంగీకరిస్తున్నారు గనుకనే అలా మనగల్గుతుంటుంది. అలాగే ఏ విషయంగానీ బలపడలేక, విస్తరించలేక పోతుందంటేనూ, ప్రజలంతగా దానిని కోరుకోవడంలేదనే అనాలి. ఇది ఏదో ఒకటీ అరా అసాధారణాంశాలకు తప్ప, అన్నింటికీ వర్తించే సాధారణ సూత్రమే.
మన ప్రస్తుతాంశమైన అవినీతికీ వర్తిస్తుందీ సూత్రం. ప్రజలు అవినీతి వుండాలనుకుంటున్నారు గనుకనే అది వుంటూ, బలంగా పాదుకొంటూ, బహుముఖాలుగా విస్తరించగలుగుతోంది. అలాగే అవినీతిని తొలగించాలన్న యత్నాలు అప్పుడప్పుడూ, అక్కడక్కడా మొదలవుతున్నా, వాటిపట్ల ప్రజలంతగా సుముఖంగా లేకపోవడంవల్లనే అవేవీ అవసరమైనంతగా బలం పుంజుకుని, విస్తరించలేకపోతున్నాయి. ఇది మనలాంటి వారందరికీ మింగుడుపడని చేదునిజం. అవినీతిని పుట్టించింది ప్రజలే. ప్రజలు అదిక వుండనేకూడదు అనుకోనంతకాలం అది వుంటూనే వుంటుంది. ఈనాడు మనం 'అవినీతి' అంటున్నదానిని పుట్టించగల శక్తి మనిషి స్వభావంలోనే వుందన్నదో తాత్వికాంశం.
ఈ సందర్భంలో 'సమస్య' గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. సామాజిక నేపథ్యం నుండి దీనిని చెప్పవలసివస్తే సమష్టి ప్రయోజనాలకు ఆటంకం కలిగించేవన్నీ సమస్యలే అనాలి. అంటే అందరియొక్క నేటి రేపటి అవసరాలు, ఆకాంక్షలు నెరవేరడానికి ఆటంకమయ్యేవి. అట్టివాటికి కారకాలు ప్రేరకాలు కాగలిగేవి అన్న రెండూ వుండకూడనివి తొలగించుకోవలసినవి అవుతాయి. ఆ రెంటినీ సమస్యలు-సమస్యలకు కారణాలు అనంటున్నాం. అలాంటి వాటినన్నింటినీ వుండనీలెమ్మనుకుంటున్న మనిషి మానసిక వైఖరిలో వుంది అవినీతి పుట్టడానికి కావలసిన విత్తనం.
వ్యక్తి లేదా వ్యక్తులు (1) అర్హతలేనిది పొందడానికిగానీ, పొందదగిందే అయినా తప్పుడు మార్గంలో పొందడానికిగానీ, (2) ఇవ్వవలసింది ఇవ్వవలసినంత ఇవ్వకుండడానికిగానీ చేయాల్సింది చేయవలసినంత చేయకుండడానికిగానీ, సిద్ధపడే, లేదా అభ్యంతరపడని మానసిక వైఖరిలోనే అవినీతికి మూలాలున్నాయి. అవినీతిపుట్టుక ఆత్మాశ్రయమైనది. అంటే వ్యక్తి ఆలోచనలో మొదట అంకురించి, కార్యాచరణ ద్వారా వ్యక్తమవుతుంటుంది. ఈనాడు అవినీతి సర్వే సర్వత్రా విస్తరించి వుందని మనకందరకూ తెలుసు. అట్టి అవినీతిని శాశ్వతంగాగానీ, సమూలంగాగానీ తొలగించడం అసాధ్యం. అయినా, అవినీతిని తగ్గించుకుంటూ, క్రమాభివృద్ధిగా అదుపు చేసుకుంటూ వుండడం వరకు గట్టిగా పూనుకుంటే సాధ్యమే.
- అవినీతిని పుట్టించింది ప్రజలే. ఆపై దానిని పెంచి పోషిస్తున్నది మాత్రం పాలన నిర్వహణ భాగాలలో పనిచేస్తున్నవారు ప్రజలలోని ధనవంతులు, నాయకులు.
మానవ జీవితాన్ని కాచివడపోసి కనుగొన్న సారాంశం, ''ఇతరులు నీయెడల ఎలా ప్రవర్తించకూడదనుకుంటున్నావా. ఇతరుల యెడల నీవున్నూ అలా ప్రవర్తించకు'' అన్నదే. ఇదే ధర్మాలకెల్ల ధర్మం అనతగ్గది. ఇలా ప్రవర్తిస్తున్న వాళ్ళ నుండి అవినీతి పుట్టదు. ఈ వైఖరి బలహీనపడి, వేరుగా ప్రవర్తించడానికి సిద్ధమైన మనస్సులో అవినీతి అంకురించిందన్నట్లే. దీనినే వ్యక్తులకు అన్వయిస్తే, ప్రతిమనిషీ ఇతరులంతా తనపట్ల ధర్మబద్ధంగా వ్యవహరిస్తుండాలనీ, అన్యాయం చేయకుండా వుండాలనీ అనుకుంటుంటాడు. ఇంకా వీలయితే ఎదుటివారు తమ పనులాపుకునీ తనపని చేసిపెడితే మహాబాగనీ తలపోస్తాడు. అదే సమయంలో తానితరులపట్ల అలా వుండడానికి అంత సుముఖంగా వుండడు. ఒక్క అవినీతికేగాక, ఎన్నోరకాల పెడపోకడలకూ కుదురు ఇదిగో ఇక్కడే వుంది.
గమనిక : ధర్మము-అధర్మము, న్యాయము-అన్యాయము, నీతి-అవినీతి అన్న మూడు జంటలను ప్రత్యేకంగా విశ్లేషించుకోవడం మంచిది. అవకాశం కల్పించుకుని మరోమారు అందుకు కూచుందాం. అవినీతి అంటే ఏమిటి? దాని పుట్టుకకు కారణమెవరు? అన్నదగ్గర సామాజిక విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలున్నా, అవినీతి వుంది. దానినిటు ప్రజలూ, అటు వ్యవస్థలో ప్రజలకొరకై నియుక్తులైన ఉద్యోగులు కూడా పెంచిపోషిస్తూ వస్తున్నారన్నదగ్గర ఏకాభిప్రాయులై వున్నారు.
మరి ఈ అవినీతిని అదుపులో వుంచడమెలా? నాకు తెలిసినంతలో పాలన, నిర్వహణలో పారదర్శకత అంటే జరుగుతున్నదాన్నంతా బహిరంగపరచడం అన్నదొక్కటే ఇందుకు శక్తివంతమైన సాధకం కాగలదు. అంటే సమస్త వ్యవహారాలలో పారదర్శకత ఎంతెంతమేర శక్తివంతంగా అమలు జరుగుతుంటుందో, అంతంతమేర అవినీతి ఉధృతి తగ్గుతూ వస్తుంటుందన్నమాట. వీటికితోడు నీతిమంతులకు ప్రోత్సాహకాలు, అవినీతిపరులకు కఠినశిక్షలు ఏర్పరచి, వెంటనే అమలుపరచడంగాని చేయగలిగితే నీతి మార్గానికో దారి ఏర్పడుతూ వస్తుంది.
6. సమాచార హక్కు చట్టం మరియు పౌర సేవాపత్రం :
పారదర్శకతయొక్క ప్రయోజనాన్ని సరిగా గుర్తించగలిగితే, దాన్ని అమలు చేసుకోడానికి చట్టం కల్పించిన సమాచార హక్కు ఎంతటి శక్తినిస్తుందో అర్థమవుతుంది. అధికారులూ, అవినీతిపరులూ కుమ్మక్కు కాకుండా నిరోధించే శక్తివంతమైన సాధనమిది. ప్రజల దరఖాస్తులకు, నిర్ణీత వ్యవధిలోపుగా విధిగా సమాధానం చెప్పితీరాలి. లేకుంటే నేరం చేసినట్లే. అందుకు శిక్షణు అనుభవించాలి. అనిగదా చెపుతుంది చట్టం. అంటే జరుగుతున్నదానిని పట్టి చూసుకోడానికి, అందులో లొసుగులుంటే కలసికట్టుగా కట్టడి చేయడానికి కూడా వెసులుబాటు ఏర్పడిందన్నమాట.
అయితే, చట్టమైతే వచ్చిందిగానీ, అటు నిర్వహణస్థానాలలో వున్న ఉద్యోగులుగానీ, ఇటు ప్రజలుగానీ దీనిని వినియోగించుకోడానికి అలవాటుపడిలేరు. ఇదిగో ఇక్కడే, సమాచారహక్కు చట్టాన్ని అమలు చేయడానికారెండు సమూహాలను తయారుచేయాల్సిన పని ఉద్యమంపైన వుంది.
మరి అందుకు మనమేమిచేయాలి?
1) సహ చట్టాన్ని మరియు పౌర సేవాపత్రాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా ప్రజలకు అవగాహన కలిగించి, సమాచారం సేకరించుకోడానికి సిద్ధమయ్యేలా చైతన్యపరచాలి.
2) కొంతమందికీ విషయాలలో లోతైన అవగాహనతోపాటు, దీనిని ఎలా వినియోగించాలన్న విషయంలో శిక్షణనిచ్చి ఆయా కార్యాలయాల దగ్గర సేవా కేంద్రాలను, నిఘా కేంద్రాలను ఏర్పరచాలి. అవి దీర్ఘకాలం పట్టుదలతో శ్రద్ధగా పనిచేస్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
3) వ్యక్తిగతంగా వారివారికి అవసరమైన విషయాలతో సమాచార సేకరణేగాక, అవకాశమున్న ప్రతివిషయంలోనూ సమాచార సేకరణకై దరఖాస్తులు పెట్టడం ద్వారా ఒక నూతన వరవడిని ఏర్పరచాలి. అది అటు ఉద్యోగస్తులకూ, ఇటు ప్రజలకూ కూడా తమ విధులు-హక్కుల గురించిన స్పృహను కలిగించి ఆ విధానాన్ని అలవాటు చేస్తుంది.
7. ఉద్యమావసరాల వ్యయప్రయాసలకు చెందిన వనరుల మాటేమిటి?
1) రాష్ట్రాన్ని క్షేత్రావధిగ-ఒక యూనిట్‌గా-అనుకుందాం. అందులో...
25వేల గ్రామాలు, 11 వందలకు పైచిలుకు మండలాలు, 23 జిల్లాలు, 30, 40 ఒక మోస్తరు పట్టణాలుగా వాటిని విభాగించి థలవారీ కార్యాచరణకు ప్రణాళికారచన చేసుకోవచ్చు. దానికై ఎప్పటికప్పుడు అప్పుడున్న వనరుల ననుసరించి, సఫలితకు సూత్రం ఎంతపనికి అంత యత్నం. అన్న సూత్రం ప్రకారం, ఉద్యమిస్తూ పోతుండాలి.
2) తాత్కాలికంగా, ఒక సంవత్సరంపాటు ఉద్యమిద్దాం అనుకుందాం. అటుపైన ఉద్యమమే అవసరమైన సూచన చేస్తుంది.
3) ప్రచార విభాగం : దీనికి వీలున్నన్ని వాహనాలు, లోతైన అవగాహన, ప్రసంగ నైపుణ్యంకల ప్రచారకులూ అవసరం.
4) కార్యాలయాల ముందు సేవ, నిఘా పనులు చేయడానికి తగిన, తగినంత మంది వ్యక్తులు కావాలి.
గమనిక : ఈ పనికి ఒకింత వయస్సుపైబడ్డ సీనియర్‌ సిటిజన్స్‌, పెన్షనర్స్‌, మాజీ మిలిటరీవారు, కుటుంబ బరువు బాధ్యతలు లేని సమాజాభ్యుదయకాంకక్షులు అయిన పెద్దవాళ్ళు ప్రథమగణ్యులవుతారు. వారిని ఒప్పించి రప్పించుకోవాలి.
5) కేంద్ర నిర్వాహక మండలి, జిల్లా నిర్వాహక మండలుల్ని ప్రథమథ ఉద్యమ నిర్మాణంలో ఏర్పరచుకోవాలి. మలిథల్లో సాధ్యమైనంత మేర ఉద్యమ ఉపకేంద్రాల విస్తరణ చేసుకుంటూ వుండాలి.
6) రాష్ట్రంలో ప్రజల బాగు, ప్రజల హక్కు, అధికారులను గుర్తించి, అంగీకరించి, అందుకై పనిచేయగల వ్యక్తులనూ సంస్థలనూ (ఈ ఒక్క అంశంపై ఉద్యమానికి సిద్ధమన్న వారందరినీ) కలుపుకుని ఉద్యమించాలి.
7)
8) సామాజిక నియంత్రణస్థానాలలో ముఖ్యమైనవి.
1) రాజకీయాలు : దీని క్రిందికి ఎన్నికలు, ప్రజాప్రతినిధులు, శాసనమండలి, ప్రభుత్వము అన్నవి వస్తాయి.
2) నిర్వహణ విభాగం : ప్రభుత్వ పాలనకు సంబంధించిన కార్యాలయాలలోని ప్రధాన బాధ్యులంతా
3) న్యాయ విభాగం : సమాజంలోని వ్యక్తులు, సంస్థలూ రాజ్యాంగబద్ధంగా వుండేలా అదుపుచేసే భాగము
4) ప్రజలు, ప్రజాసంఘాలు : వ్యవస్థంతా ఎవరికొరకు ఏర్పరచబడిందో ఆ సమూహము.
5) పోలీసు విభాగం : పై నాలుగు విభాగాలు సక్రమంగా వుండేలా చూసేందుకై ఏర్పడ్డ నియంత్రణ భాగము.
- ఏ సమాజంలోనైనా ఈ ఐదు విభాగాలు 'రాజ్యాంగ హృదయ సారాంశమైన అందరి యోగక్షేమాలు' అన్నదానికి తగిన విధంగా ప్రవర్తిస్తుంటాయో ఆ సమాజంలో అవినీతి అత్యల్పస్థాయికి తగ్గి అదుపులో వుంటుంది. కనుక మెరుగైన సమాజం కావాలనుకునేవారు వీటినీ, వీటిలోని వారినీ ఆరోగ్యంగా, బలంగా వుండేలా చూసుకోవాలి.
9. వినిమయతత్వం : సామాజిక స్పృహతో కూడిన జీవన శైలి కనుమరుగై 'ఆర్జించు-అనుభవించు' వారసులకు పోగేసిపెట్టు' అన్న వైఖరి సామాజిక వైఖరిగా తీరి కూర్చుంది. బిడ్డలకు తల్లిదండ్రులుగానీ, ఉపాధ్యాయులుగానీ, ఇరుగుపొరుగు రూపంలో ఉన్న వాతావరణంగానీ సంఘజీవిగా, సమష్టిలో భాగంగా అతనెలా మసలుకోవాలో నేర్పడంలేదు. వ్యక్తిగతాభివృద్ధినే సాధించుకోవలసిన గొప్ప విషయంగా చూపెడుతున్నాయి. విద్యారంగంలోనూ, బోధనాంశాల ప్రాధాన్యతాక్రమంలోనూ వ్యక్తిత్వ నిర్మాణపరంగానూ గొప్ప మార్పులు రావలసి వుంది. అది రానంతకాలం ఉన్నపోకడ వినిమయతత్త్వాన్నే పుట్టిస్తుంటుంది.
10. అధికోత్పత్తి - దుబారా : పైదాని పర్యవసానంగా, అందుబాటులోకి వస్తుంది. అది మరింత పెరిగితే 'వాడిపారేయ్‌' (యూజ్‌ & త్రో కల్చర్‌) అన్న రీతే గొప్ప సంస్కృతిగా తయారవుతుంది. ఉన్న, పెరిగిపోతున్న అధిక జనాభాకు తోడు, ఇది పెచ్చరిల్లితే దాని పర్యవసానం ఏమిటో ఊహించగలరా? భావితరాలకు దిక్కులేనిస్థితి, క్రమంగా మానవ మనుగడకు వీలులేని పరిస్థితులేర్పడడంవల్ల మానవజాతి వినాశనం.
- కనుక యుద్ధప్రాతిపదికన, వినిమయతత్వాన్ని, అధికోత్పత్తిని, దుబారాను అదుపుచేసే పనిని చేపట్టాల్సి వుంది.
ముగింపు :
1) ఉద్యమాల అంతిమ లక్ష్యం మంచి సమాజాన్ని స్థాపించుకోవడం.
2) దానికై ప్రజలను ప్రజాస్వామ్యానికీ, లౌకికతత్వానికీ, ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణ్యంగా వుండేలా సిద్ధపరచాలి.
3) గ్రామాభ్యుదయోద్యమం సాగించడం చాలా ప్రాధాన్యతను కలిగివుంది.
4) ప్రధాన నియంత్రణ స్థానాలను సంస్కరించుకోవలసి వుంది. అందుకు ప్రధానంగా మంచి రాజకీయ వేదిక అవసరం.
5) వీటన్నింటినీ సాధించుకోడానికి దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడగల ఐక్యవేదిక అవసరం.
6) కార్యాచరణ ప్రణాళిక మొదటిథ యత్నంగా సమాచారహక్కు చట్టాన్ని, పౌర సేవాపత్రాన్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ఉద్యమారంభం చేద్దాం.
మిత్రులారా! రేపు డిసెంబర్‌ 27న విజయవాడలో మలి సమావేశం వుంది. ఆనాటికి మన మన ఎరుకలోవున్న ఉద్యమాభిలాషులను (లోతైన అవగాహన, సంసిద్ధత, కార్యకుశలతకల వాళ్ళను) మరికొంతమందినీ తోడ్కొని రావలసి వుంది. దీనిని జరుగురు కార్యంగా, పెద్దపనిగా తలచి మీవంతు ప్రయత్నం మీరు చేయండి. మీ దృష్టిలో దీనికి తగినవారనిపించిన వారికీ ఈ వ్యాసాన్ని అందజేయండి. దీనిపై మరికొంత ఆలోచించుకునీ రండి. ఉంటాను. సెలవ్‌. ఉద్యమాభివందనలతో, ఐక్యమిత్రమండలి తరఫున, సత్యాన్వేషణలో, మీ సురేంద్ర.

No comments:

Post a Comment