Friday, January 1, 2010

ఓటు వేయడం ప్రజల హక్కేకాదు - విధికూడా


వివేకపథం-153వ సంచిక చదివిన పాఠకులకు ప్రజాస్వామ్యం-అస్సలు, నకిలీ శీర్షిక క్రింద కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యానికి పునాది ప్రజలు పరిపాలనలో భాగం పంచుకోవడం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌరునికి ఓటు మినహా మరోమార్గం లేదు. కాని ఆ ఓటు కూడా వేయడానికి అవకాశం లేకుంటేనో, అవకాశం వున్నా పౌరుడు ఉదాసీనత కనపరిస్తేనో ప్రజాస్వామ్యానికి అర్థంలేదు. అలా ఎన్నుకోబడిన ప్రభుత్వము ప్రజాస్వామికం అనలేము. కాని నిజం చేదుగా వున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అదే. ఓటు వేయడానికి బూత్‌లకు వచ్చిన పౌరులు తమ ఓట్లు గల్లంతయ్యాయనే ఫిర్యాదులకు లెక్కేలేదు. మరోరకమైన పరిస్థితి ఏమిటంటే తమ ఓటుహక్కును వినియోగించుకోవటంలో ఓటరు చూపే నిరాసక్తత, ఉదాసీనత, నిర్లక్ష్యం, టి.వి.లో క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి 6 గంటలు ఖర్చుచేస్తాం. గుడిలో దైవదర్శనం కోసం రోజంతా క్యూలో నిలబడతాం. రోజుల తరబడి ప్రయాణాలు చేస్తాం. వేలకువేలు ఖర్చుచేస్తాం. సినిమా రిలీజైన మొదటిరోజే ఒక పూట ముందుగా అడ్వాన్స్‌డ్‌ టికెట్‌ తెచ్చుకుని మరో మూడు గంటలు సినిమాహాల్లో గడుపుతాం. ఇంట్లో కుటుంబ సభ్యులతో టి.వి.సీరియల్స్‌ చూస్తూ వారంలో 7 రోజులూ కాలక్షేపం చేస్తాం. ఇలా ఎన్నోరకాలుగా కాలాన్ని వృధాచేస్తూనే పోతాంకానీ ఐదు ఏళ్ళకొకసారి 'నీ భవిష్యత్తుని' నిర్ణయించే ప్రతినిధుల్ని ఎన్నుకోవటానికి ఒక్కగంట ఖర్చుచేయలేకపోవటం అవగాహనారాహిత్యమా? సోమరితనమా? విద్యావంతులమనుకునేవారు కూడా ఓటువేయక పోవడము సోమరితనముకాక మరేమౌతుంది. అందువలననే ఒక దేశభక్తి ప్రబోధగీతంలో 'చదువుండీ ఓటు వేయకుంటే దేశద్రోహమేనయ్యా' అని హెచ్చరించాడు.
సత్యాన్వేషణ మండలి కూడా ప్రజాస్వామ్యము అసలు రూపంలో మనుగడ సాగించాలంటే ప్రజలు తమ అభిప్రాయ వ్యక్తీకరణ అవశ్యంగా చేయాలి.
1. ఓటు హక్కుగాకాక, ప్రాథమిక విధిగా (కర్తవ్యంగా) పేర్కొంటూ చట్టంరావాలి.
2. ఈ విధిని నిర్వర్తించనివారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా శిక్షాస్మృతీ సవరింపబడాలి.
- అని మండలి తన సూచనలలో నిర్దిష్టంగా పేర్కొంది.

No comments:

Post a Comment