యోచనాశీలురైన పాఠక మిత్రులనుండి కొన్ని స్పందనలందాయి. అందుకు ప్రతిగా ఇలా స్పందించాను, గమనించండి.
స్పందన : వివేకపథం సంపాదకులు సురేంద్ర బాబు గార్కి నమస్కారం. నేను వాస్తవాన్ని, వర్తమానాన్ని బాగా ఇష్టపడతాను. అలాగని అందరూ ఇలాగే ఉండాలని నేననను... 2010 ఆగస్టు సంచిక 169లో, పాఠకులకు విూరిచ్చిన నివేదన - వేదన - నిష్టూరములను చదివాను. అందులో గత సంచికలో ''విజ్ఞతకో విజ్ఞప్తి'' అన్న పేరున మా ముందు పెట్టిన విషయాలపై విూరిచ్చిన నివేదనకు పాఠకులెవ్వరూ స్పందించక పోవడం పట్ల విూరు పొందిన వేదన, ఆ పై విూరు పాఠకులపై సంధించిన నిష్టూరము సబబే కాని, వాస్తవంలో ఆలోచించే ప్రతి వ్యక్తీ ఆచరణకు సరిపోడు. అలాగే సామాజిక స్పృహ కల వారందరూ సాహసించలేరు. అయినా సామాజిక ప్రయోజనం కొరకు పాటుపడాలనుకునే చాలామంది తాత్కాలికంగా కార్యాచరణకు కలిసి రాలేకపోయినా, కసిగా చేసేవారిని చూసి ఏదోనాటికి కార్యోన్ముఖులవుతారు. విూలాంటి విజ్ఞులు ఈ విషయం గ్రహించగలరు. ఇరవై ఏళ్ళ విూ శ్రమ భ్రమ కాదు, వృధా పోవటానికి. అది అకుంఠిత, అకళంక దీక్ష. దాని విలువలు త్వరలోనే వెల్లువెత్తుతాయి.
నిజమే సాధన చేసినవాడు తగిన ఫలితం అందనప్పుడు వేదన చెందడం సమంజసం. జరిగిన దానిని పాఠకునిగా నేనూ బాధపడుతున్నాను. కానీ 'ఇకపై వివేకపథం విూకు పంపబడదు' అన్న వాక్యం పత్రిక కోసం ఎదురుచూసే మమ్ముల్ని కలచివేసింది. వేల సం||ల మానవ జీవన పోరాటంలో యింకా వడిదుడుకులు వస్తూనే వున్నాయి. అందుకని సంఘహితైషులు ప్రయత్నాలనాపివేశారా ? సోమరులు ఇంకా నిద్రనుండి మేల్కొనలేదని సూర్యుడు ఉదయించడం మానివేస్తున్నాడా? లేదుకదా ! కనుక అనర్హులకు పత్రిక పంపడం సరికాదన్న నిర్ణయాన్ని ప్రక్కనబెట్టండి. విూకున్న స్వేచ్ఛతో ఆపని చేయవచ్చుగాని, పత్రికను పంపడం మాత్రం మానకండి. 'సత్యాన్వేషణలో వివేకపథం' పత్రిక ప్రవాహం ఆగకూడదు. ఎందుకంటే అది శ్రేష్ట సమాజ స్థాపనా పిపాసులకు ఊపిరి. అలాంటివి కనుమరుగైతే, కనీస స్పృహకూడా సమాజంలో ఉండదు. పిదప విూ యిష్టం. నా అభిమాన పత్రిక ఆగిపోతుందేమోనన్న వేదనతో వ్రాసిన ఈ మాటలను తప్పుగా అర్ధంచేసుకోవద్దని మనవి. విూ ఫణికుమార్, మండపేట.
ప్రతిస్పందన : యోచనాశీలురైన ఫణికుమార్ గారికి! సహానుభూతితో, సామాజిక హితైషిగా విూరు వ్రాయవలసిందే వ్రాసారు. పత్రిక ప్రచురణను ఆపను. అది నాకు తెలిసి సామాజికావసరం. దానిని ఉద్యమ క్షేత్రాలలో వున్న వారికి పంపే పనిచేస్తాను. అలాగే ఇప్పటికి ఉన్న పాఠకులలోనూ దాని అవసరాన్ని గుర్తించి కావాలని అడిగిన వారికీ పంపుతాను. ఎందుకంటే సమాజంపై నాకు ఈసడింపేవిూ లేదు. పత్రికను రూపొందించడం వెనుకనున్న శ్రమ నిరర్ధకం కాకూడదన్నదే నా ఆలోచన. కనుకనే ప్రస్తుతం మొదలెట్టిన సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక లో పాల్గొంటున్న వారందరికీ పత్రికను పంపే ఏర్పాట్లు చేస్తున్నాము. 'వివేకపథం' ఒక స్థిరమైన రూపంలో, స్పష్టమైన లక్ష్యంతో, ఎటువంటి ప్రగల్భాలకు చోటీయకుండా, భావ గాంభీర్యంతో కొనసాగుతున్న పత్రిక అన్నది నిజం. నిజమైన అధ్యయనపరులకు, జిజ్ఞాసులకు ఖచ్చితంగా అవగాహన పెరగడానికి దోహదపడే పత్రిక. దాన్నందుకుని సక్రమంగా వినియోగించుకోలేనివారిని చూసి జాలిపడాలి. ఉంటాను ....
స్పందన : వివేకపథం 169 సంచిక అందింది. చదివాను వెంటనే నా చందా పునరుద్దరిస్తాను. అలుపెరుగక సమాజాభివృద్ధికి నిర్విరామ కృషి సల్పుతున్న విూకు అభినందనలు. ఉద్యోగ బాధ్యతల వల్ల సమయం లేకపోవడంతో సమాజ కార్యక్రమాలలో పాల్గొనలేకున్నాను. త్వరలో ఆ పరిస్థితిని అధిగమించగలను. పత్రికను పంపండి. అని బాపట్ల నుండి హరిప్రసాద్ గారు వ్రాశారు.
ప్రతిస్పందన : మంచిది మిత్రమా ! పత్రిక విూకు అందుతుంటుంది. వీలయినంతలో సమాజ కార్యంలో పాల్గొంటూ ఉండండి.
స్పందన : జంగంగూడెం నుండి జి.అహల్యాదేవి ఇలా వ్రాస్తున్నారు. ఒక ఉద్యమకారిణిగా విూలాంటి అనుభవజ్ఞుల సూచనలు నాకు నిరంతరం దారి చూపిస్తుంటాయి. మీలాంటి ఉద్యమకారులతో పరిచయాలు కలిగిన తరువాత నాలో ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. 'వివేకపథం' పత్రికను శ్రద్ధగా చదివే పాఠకులలో నేనూ ఒకర్ని. కనుక పత్రికను పంపుతూ ఉండండి.
ప్రతిస్పందన : అహల్యాదేవి గారికి, అమ్మా ! పత్రిక సమాజం కోసం పనిచేసే వారికొరకే పుట్టి, మనుగడసాగిస్తూ ఉంది. కనుక అలాంటి వ్యక్తులుగా మా దృష్టిలో ఉన్నవారికి అందుతూనే ఉంటుంది. సమాజం కోసం పాటుపడుతున్నవారినిగా మేము గుర్తించిన వారి జాబితాలో విూపేరు ఉంది. కనుక పత్రిక విూకు వస్తూనే ఉంటుంది.
స్పందన : అనంతపురం నుండి బి.వి.రాధాకృష్ణమూర్తి గారు, మిత్రులు సురేంద్ర బాబు గారికి నమస్కారాలు. స.హ.చట్టం ఉద్యమం క్రింద ప్రతినెలా 500/- విరాళంగా ఇవ్వడానికి నా సంసిద్ధతను తెలియజేస్తున్నాను. ఎవరికి, ఏ రూపంలో ఇవ్వాలో తెలియజేయండి ! అంటూ వ్రాశారు.
ప్రతిస్పందన : మిత్రులూ, సంఘహితైషులూ అయిన రాధాకృష్ణ గారికి ! విూ విరాళాన్ని అనంతపురం ఉద్యమ నిర్మాణానికే ఖర్చుచేద్దాం. ప్రస్తుతానికి ఆ డబ్బు విూవద్దనే ఉంచండి. రేపు జిల్లా కమిటీ ఆవిర్భావం రోజున జిల్లా నిధికి దానిని జమచేయవచ్చు. విూలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది ముందుకు వస్తే బాగుంటుంది.
స్పందన : భువనగిరి నుండి మూర్తిగారి జనార్ధన్ గారిలా వ్రాశారు. సురేంద్ర గారికి నమస్కారం. విూ పత్రిక ఆగస్టు సంచిక అందింది. చాలా విషయాలు తెలిశాయి. విూ 'నివేదన - వేదన - నిష్ఠూరం' కూడా చదివాను. విూరలా స్పందించటం సహజం. గత కొన్నేళ్ళుగా విూరు తీవ్రంగా ఆలోచిస్తూ, శ్రమపడుతూ, సత్యాన్వేషణ మండలిని నడుపుతూ, బహుముఖంగా విస్తరించడానికి పూనుకున్నారు. విూ కృషివల్లనే ఐక్యవేదిక ఏర్పడినది.
అయితే ఏ ఉద్యమమైనా మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు వెళుతుందని పెద్దలు చెపుతారు. కాని కాలం మారింది. ప్రజల్లో కొంత మార్పు కలిగింది. అయితే ఆ మార్పు ప్రస్తుత వ్యవస్థలోని సమస్యలను పరిష్కరించటానికి ఏ మాత్రం సరిపోదు. ఇకపోతే శారీరక పరిస్థితులు నన్ను క్రియాశీలంగా ఉండలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. విూ వివేకపథం తప్పక పంపిస్తూ ఉండండి. నా ఆరోగ్యం సహకరించినంత మేర ఉద్యమానికి, విూకు సహకరిస్తూ ఉండగలను.
వివేకపథం పేజీలు పెంచి ఇతరుల వ్యాసాలు, ప్రశ్నలు, జవాబులు వగైరా శీర్షికలు పెడితే బాగుంటుంది. పత్రిక ఆర్థిక సౌష్టవం కోసం ప్రకటనలు తీసుకోండి. పత్రిక మొత్తం విూ రచన స్వగతంలా ఉంది. విూ ఆవేదన అర్ధం చేసుకున్నాను. అయితే పత్రిక మొత్తం 20, 30 పేజీలు విూ రచనతోనే నింపడం సబబుకాదు. విూకు ఒకటి, రెండు పేజీలైతే సరిపోతుంది. విూ వ్యాసాలు బాగుంటున్నప్పటికీ, ఇతరుల వ్యాసాలకు అవకాశం ఇవ్వండి. మార్పును అంగీకరించండి.
ప్రస్తుతం హేతువాదులు, నాస్తికులు, అభ్యుదయ వాదులు, సంఘ సంస్కరణ వాదులు కలసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. విడిగా ఉంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకరికొకరు సహకరించుకోవలసి వస్తుంది. హేతువాద నాయకులు క్రాంతికార్, ఇన్నయ్య, సుబ్బారావు, భానుప్రసాద్ తదితరులు మత విమర్శల కేసులో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న విషయం విూకు తెలిసిందే కదా. అందువల్ల అందరూ ఐక్యంగా కలిసి పనిచేయటం ఇటు నాయకులకు అటు ఉద్యమానికి మంచిది.
ఎంతో శ్రమకోర్చి భావ వివేక ఉద్యమాన్ని, సత్యాన్వేషణ దృక్ఫధాన్ని కొనసాగిస్తూ మాకందరికీ ఆదర్శంగా నిలుస్తూ, నిత్యం మాకు ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నందుకు విూకు అభినందనలు.
''నిరాశ మనకు వద్దు - ఆశే మనకు ముద్దు'' ఉంటాను సెలవ్.
ప్రతిస్పందన : జనార్ధన్ గారికి. నాలుగైదుంశాలు ప్రస్తావించారు. అందులో ''ఉద్యమాలు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు నడుస్తాయని పెద్దలంటారు'' అనన్నారు. నిజానికామాట ఎవరన్నారు? అన్నవారు ఏ ఉద్యమాలలో పాల్గొన్నారు? స్వయంగా ఏదైనా ఉద్యమాన్ని నిర్మించారా ? ఆ మాట నిజమే అయితే ప్రతి ఉద్యమమూ, ప్రతి సారీ తాను మొదలెట్టిన దగ్గర నుండి తిరోగమనమే సాగించిందని చెప్పిసట్లు ! చరిత్రలో అలాంటి దాఖలా ఏవిూ లేదు. కాకుంటే ఉద్యమాల పేరిట, ఉద్యమాలనడానికి వీల్లేని పనులెన్నో జరిగిపోతున్నాయి. ఉద్యమ క్షేత్రాలు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా, సమష్టి ప్రయోజనాల కొరకు పనిచేసే, చేయాల్సిన స్థానాలు. కానీ ఉద్యమాల పేరున స్వార్ధప్రయోజనాల నాశించే వారు క్రమ క్రమంగా ఉద్యమ క్షేత్రాలలో జొరబడుతున్నారు. పేరుగొప్ప, ఊరుదిబ్బ అన్న రీతిలో మాటలు కోటలు దాటుతున్నై, చేతలు గడప దాటటంలేదు అన్న రీతిలో, సమావేశాలలో ప్రసంగాల జోరు కనపడుతోంది. మూడు నెల్లకో, ఆరు నెల్లకో, సంవత్సరానికో ఒక సమావేశం ఏర్పాటు చేసి, రానుపోనూ ఛార్జీలిచ్చి, భోజన వసతులు సమకూర్చి, ఒకటికి పదిమార్లు పిలిస్తే సమావేశాలకు, అదీ అకాలంలో వచ్చి వెళ్ళడమే ఉద్యమ కార్యంలో పాల్గొనటమంటే అన్న వరవడి బలపడి ఉందీనాడు. నిజానికవేవీ ఉద్యమాలు కావు.
ఇక పత్రికలో ఇతర వ్యాసాలకు, వ్యాపార ప్రకటనలకు చోటు కల్పించడం గురించి విూరీ సూచన మిత్ర దృష్టితోనే చేశారని అర్ధమవుతున్నా, నేనాపని చేయలేను. ఎందుకంటే, మండలి తాత్విక పునాదిగల భావజాలాన్ని సమాజానికందించాలన్న దృష్టితో ప్రారంభించిన పత్రిక వివేకపథం. అందులో ఎవరభిప్రాయాలు వారివి అన్న విధానానికి అవకాశం లేదు. విూ ఆలోచన, భిన్న దృష్టులు పాఠకులకు తెలుస్తాయి కదా అన్నదే అయినా, సత్యాన్వేషణలో ఏది సరైనది? అన్న దానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకొరకై మేము తత్వ చర్చా వేదిక పేరున లోకంలోని వివిధ తాత్విక ధోరణులను, వాటిని ప్రతిపాదించి వాదించే పండిత ప్రకాండులను వేదికపైకి తెచ్చి వాటన్నింటినీ పాఠకులకు అందించే పనిచేశాము. నాలుగు పుస్తకాలు చదివి, వ్యాసాలు వ్రాస్తూ, వ్యాసకర్తలుగా, రచయితలుగా చలామణి అయ్యే వారికి, వారి రచనలకు తాత్విక క్షేత్రంలో ఏమాత్రం విలువ ఉండదు. ఏ రచయితైనా తాను వ్రాసి ప్రకటించిన భావాలు సరైనవేనని రుజువుపరచడానికి సిద్ధమైనపుడే వాటిని పరిశీలనకు తీసుకోవలసిన స్థాయి ఏర్పడుతుంది. కనుక ఎవరభిప్రాయాలు వారివి. అనే తరహా వ్యాసాలను, రచయితలను వివేకపథం ఆహ్వానించదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఆహ్వానించలేదు.
ఒకవేళ విూ దృష్టిలో, అలా సత్య నిర్ధారణకు సిద్దపడే రచయితలుంటే అట్టివాటిని, వారిని ఆహ్వానించడానికి, స్వీకరించి ప్రచురించడానికి మండలికెట్టి అభ్యంతరం లేదు. ఆ వివరాలుంటే పంపండి. అట్టి రచనలున్నా పంపండి.
ఇక హేతువాదులు, వగైరాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్రాశారు. నిజానికి అభ్యుదయ శక్తులంతా సంఘటితం కావాలన్న భావనను ఆచరణలోనికి తేవడానికి ముందుకు రానివారిలో ముందున్నవారే విూరన్నవారంతా. అదలా ఉంచి విూరు సూచించిన సంస్థలు లేదా తాత్విక ధోరణి కలవాళ్ళు ఏ విషయంలో కలసి పనిచేయటానికి వీలవుతుందో విూరు గాని, వారు గాని చెప్పండి.
నావరకు నేను రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడటంలో కలసి పనిచేద్ధాం రండంటూ ఇప్పటికే పిలుపునిచ్చాను. పెక్కు సంస్థలు అందుకు సిద్ధమై కలసి పనిచేస్తున్నాయిప్పటికే. ఇందుకు సిద్ధపడనివారు లేదా అత్యల్ప స్థాయిలో మాత్రమే పాలుపంచుకుంటున్నవారు హేతువాద నాస్తిక సంఘాల వారే. అందుకు ఎవరి కారణాలు వారికి ఉండవచ్చునేమోగాని జరిగిన వాస్తవమిది. కనుక ఏ సామాన్యాంశాన్ని తీసుకుని వీరంతా కలవగలరో విూరే చెప్పండి.
నేనొక సూచన చేస్తాను. విూరు విూరన్న సంస్థలకు చెప్పగలరేమో, చెప్పి ఒప్పించగలరేమో చూడండి. ''శాస్త్రీయ దృక్ఫధాన్ని అలవరచుకోవడం, 2. శాస్త్రీయ పద్ధతిని వినియోగించుకోవడం, 3. శాస్త్రీయ విజ్ఞానాన్ని అందుకుని, ప్రజలకందించడం, 4. దాని ఆధారంగానే తాత్విక భావజాలాన్ని రూపొందించు కుంటూండడం, 5. హేతుబద్ద యోచనాపరులుగా పౌరులను తయారు చేసేందుకు పూనుకోవడం''. ఈ అంశాల ప్రాతిపదికన ఎవరితోనైనా కలసి కదలడానికి మండలి సర్వాంగీణా, సర్వసన్నద్ధంగా ఉంది. మండలి ఉన్నంత కాలం అలానే ఉంటుంది. ఈ విషయంలో కలసి కదలాలా వద్దా అన్న నిర్ణయం చేయాల్సింది విూరు. విూరన్న సంస్థలవారు మాత్రమే. నిబద్దతతో ఉచితంగా స్పందించండి.
గమనిక : అందరం కలసి పనిచేయడానికి వీలున్న, కలసి పనిచేయాల్సిన అవసరం వున్న రెండు క్షేత్రాలను విూముందు, విూ ఆసరాతో పాఠకులందరి ముందు ఉంచాను. ఏమి చేయడానికి సిద్ధపడతారో విూవైపునుండే ప్రకటన రావాల్సి ఉంది. విూరే కొన్ని కీలకాంశాలు లేవనెత్తడంతో ఒకింత విపులంగా స్పందించాల్సి వచ్చింది. విషయగౌరవం రీత్యా ఇది సరైనదే.
స్పందన : హైదరాబాద్, మధురాగనర్ నుండి ఎస్.పి. రావు గారు ఇలా వ్రాస్తున్నారు.
సత్యాన్వేషణ మండలి వారికి, జనహిత ప్రచురణ పేరున విూరు వ్రాసిన సృష్టివాదమా? పరిణామ వాదమా? అన్న గ్రంథం పూర్తిగా చదివాను. విూ కృషి అభినందనీయం. చాలావరకు విూ అభిప్రాయంతో ఏకీభవిస్తూన్నాను. అయితే రెండు మూడంశాలు విూరు పునరాలోచన చేస్తే బాగుండుననిపించింది. పరికించండి.
1. ''వక్త హృదయం ఇదేనని నిర్ణయించే అధికారం ఏ వ్యాఖ్యానకారుడుకి లేదు''. ఇది వేదికపై ప్రసంగిస్తున్న వ్యక్తి గురించైతే ఫరవాలేదు. అక్కడైతే వక్త తననితాను ఎలాగు సమర్ధించుకోవడం లేదా తన అభిప్రాయాలను సరిచేసుకోవడం అన్న వాటికి అవకాశముంటుందక్కడ. అలాకాక 'ఒక గ్రంథ రచయిత హృదయం' అన్న అర్ధంలో వాడి ఉంటే ఇది చాలా ఇబ్బందికరం.
2. ''ఎక్కడ విశ్వాసమో అక్కడ అజ్ఞానం ఉంటుంది. తెలియనితనమున్నంత మేర వాటి జ్ఞానం కలిగించకూడదు''.
ఈ నియమానికి కొంత సడలింపు అవసరమేమో చూడండి. విశ్వాసంలో కొంత గుడ్డితనమో, మెల్లతనమో ఉన్నా, దానిని మరీ అంత అంటరానిదిగా చూడక్కరలేదు. ఆ విశ్వాసం మానవాళి పురోగమించడానికి ఉపకరించితే, అది మరో వర్గానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపకారం చేయనంతకాలం మంచిదే కదా! నిజానికి శాస్త్ర వైజ్ఞానిక రంగాలు కూడా అనేక విశ్వాసాలనే ప్రాతిపదికగా చెప్పుకుని పురోగమించాయి. తర్వాతి పరిశోధనలు, ప్రయోగాలు వారి విశ్వాసం సరికాదని తేల్చితే, ఆ మేరకు ఆ విశ్వాసానికి మార్పులు, చేర్పులు చేసుకుని తిరిగి ఆవిష్కరించడం జరిగింది.
మానవ వ్యక్తిగత జీవితంలో విశ్వాసం, పట్టుదల వల్ల అనేక సత్ఫలితాలు నొందడం అందరికీ తెలిసిందే. ఇటువంటి తాత్కాలిక విశ్వాసాలు కుంటివైనా, గుడ్డివైనా సత్యశోధనకు ఆటంకం కానంతవరకు సత్యసౌధారోహణకు ఉపకరిస్తున్నంత వరకు వాటిని త్రోసిరాజనడం అంత మంచిది కాదేమో ఆలోచించండి. సత్యాన్వేషణ ద్వారా అంధవిశ్వాసాలను పోగొట్ట వచ్చు అనుకోవడం ఒక విశ్వాసమే.
3. ఒక వ్యక్తి, ఏదైనా నిర్ధిష్ట ప్రతిపాదన చేసి ఇది సత్యమని చెబితే ఆ విషయం సరైనదేనని తెల్సుకున్నాననీ, విూకు తేల్చి చూపగలనని అంగీకరించినట్లే.
ఇది అత్యంత ఇబ్బందికరమైన నియమంగా మారే అవకాశం ఉంది. ప్రతి మనిషీ అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలలోనూ తానే స్వతంత్రంగా నిగ్గుతేల్చుకోవడం దాదాపు అసాధ్యం.... మన జ్ఞానం చాలావరకు ఆయా రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు, విశ్వసించదగిన వాళ్ళు చెప్పిందే. నమ్మక తప్పని జ్ఞానమే. దానిని అనుమాన ప్రమాణికంగానైనా, ఆప్త వాక్యంగానైనా మరేపేరుతో నైనా పిలవండి.
ప్రతిస్పందన : ఎస్.పి. రావు గారికి, తాత్వికాంశాలకు చెందిన మౌలికమైనవి ప్రశ్నించారు కనుక విచారణ అవసరమైంది. జాగ్రత్తగా పరికించాలి. ఈ రూపంగా కొన్ని కీలకాంశాలను పాఠకులకు కలిగించే అవకాశం కలిగింది. సంతోషం.
1. వక్త హృదయం ఇదేనని నిర్ణయించే అధికారం వ్యాఖ్యాత కుందా? లేదా? అన్నది విచారణీయాంశం. సమాధానాలు
ఎ) ఉంది బి) లేదు సి) కొన్ని సందర్భాలలో ఉంటుంది, కొన్ని సందర్భాలలో ఉండదు అన్న మూడు సమాధానాలు చెప్పే వీలుంది. అందులో ఏదో ఒకటి మాత్రమే వాస్తవాన్ని చూపేది - సత్యం - అవుతుంది. నిజమా ? కాదా?
ఇక్కడ నా పక్షం ఆ అధికారం లేదు అన్నది. విూ ప్రతిపాదన అలా అంటే చాలా ఇబ్బందిగా వుంటుంది అని. వ్యాఖ్యానకారుడు వేదిక విూద ప్రస్తుతం మాట్లాడుతున్న సందర్భంలోనైతే పర్వాలేదు, తన దానిని నిలుపుకోవడమో, సరిచేసుకోవడమో చేసుకోవచ్చు అనన్నారు. నిలుపుకోవాలన్నా, సరిచేసుకోవాలన్నా ముందు వక్త హృదయం ఏంటో తెలిసుండాలి కదా? మరి దానిని తేల్చేదెవరు ? వక్తే కదా? ఏ వ్యాఖ్యానకారుడు తాను చెప్పదలచుకున్న దానినే చెప్పాడో నిర్ణయించాల్సింది, నిర్ణయించగలిగింది ఒక్క వక్త మాత్రమే.ఇందులో కాదనేందుకు ఏవిూలేదు. ఇబ్బంది వున్నా, లేకున్నా నిజం మాత్రం ఇదే. నిజానికి ఈ నియమాన్ని గమనించకపోవడం వల్లే, లేదా గమనించీ ఆచరించకపోవడం వల్లే మానవ సమాజంలో పరస్పరం పొసగని వివిధ భావాలు ఒకే సిద్ధాంతంపై అనేక వ్యాఖ్యానాలు వచ్చేశాయి. ఎవరికిచ్చిన లేదా తోచిన అర్థం వాళ్ళు చెప్పేసుకుంటారు. సామాన్య జనాన్ని వివిధ గ్రూపులక్రింద విడగొట్టి పరస్పరం కొట్టుకొనేదాకా సాగదీశారు పరిస్థితిని.
2. ఇక విశ్వాసం గురించి, విశ్వాసమన్న విూటను విూరు ఏ అర్థంలో వాడుతున్నారో స్పష్టంగా తెలియాలి. విశ్వాసాలు గుడ్డితనమో, మెల్లతనమో ఉంటే ఉండవచ్చన్నారు. గుడ్డితనమో, మెల్లతనమో అన్న రెండు మాటలు వాడకూడదా. మెల్లతనంలో మెల్ల ఉన్నవాడికి విషయాలు మనకు తెలిసినట్లే తెలుస్తుంటాయి. కానీ అతని చూపు మనకు కొద్దిగా తేడాగా వున్నట్లు అనిపిస్తుంది. గుడ్డితనంలో చూపే ఉండదు. విశ్వాసంలో తెలియనితనం ఉండి తీరుతుంది. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు అనేక విశ్వాసాలే ప్రాతిపదికలు అన్నారు. ఏవీ? అలాంటి వాటిని కొన్నింటిని పేర్కొనండి చూద్దాం. నాకు తెలిసి వైజ్ఞానిక పరిశోధనంతా, ముందుగా ఏర్పరచుకున్న లేదా వచ్చిపడిన సమస్యతో మొదలవుతుంది. దానిపై ఏ మేరకు సమాచారం అందుతుందా అన్నది ఆలోచించి సమాచార సేకరణ చేస్తాడు పరిశోధకుడు. ఆధారాలు లభిస్తే, అందునా ఆ ఆధారాలు, సాధారణ సూత్రాలు చేసుకోవడానికి తగినవైయుంటే వాటిననుసరించి పరికల్పన చేస్తాడు. వాటినే శాస్త్రీయ ఊహలు అనంటారు. అటుపై ప్రయోగము, పునః ప్రయోగము చేసి పరికల్పనలో ఊహించింది సరైనదో కాదో నిర్ణయించుకుంటాడు. నాకు తెలిసి పరిశోధనా పద్ధతి అదే. మరిక్కడ విశ్వాసమెక్కడ? ప్రయోగాలలో తెలిసినదాన్ననుసరించి విశ్వాసాలను ఉంచుకోవడమో, వదులుకోవడమో, కొత్త విశ్వాసాలు ఏర్పరచుకోవడమో జరగవచ్చునని వ్రాశారు. విశ్వాసమన్నదానిని అభిప్రాయం అన్న అర్ధంలో వాడుతున్నట్లుంది అది సరికాదు. విశ్వాసంలోనూ అభిప్రాయాలుంటాయి గాని విశ్వాసమంటే అభిప్రాయం కాదు. ప్రత్యక్షం ద్వారా ఏర్పడే అభిప్రాయాలు, హేతుబద్ద యోచన ద్వారా ఏర్పడే అభిప్రాయాలు, భాష (వినడం, చదవడం) ద్వారా ఏర్పడే అభిప్రాయాలని అభిప్రాయాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి రెండు రకాల వాటిని విశ్వాసాలనకూడదు. ఇక మతాలలోని కొన్ని విశ్వాసాలు ప్రయోగం ద్వారా సరిచూచుకోవడానికి వీలయ్యేటివి కానేకాదు. అట్టి విశ్వాసాలే మానవ సమాజాన్ని పట్టి పరస్పరం కొట్టుకుని చచ్చేంతగా పీడిస్తున్నాయి. కనుక మత విశ్వాసాల గురించి విచారించే సందర్భంలో వైజ్ఞానిక క్షేత్రాల పద్ధతులను ఉటంకించి, అక్కడ ఇలాగే ఉందంటూ పోల్చకూడదు.
''సత్యాన్వేషణ ద్వారా అంధ విశ్వాసం పోగొట్టవచ్చనుకోవడం ఒక విశ్వాసమే'' అనన్నారు. అలా అంటున్నారు గనుకనే విశ్వాసం అన్నమాటను నిర్ధిష్టంగా వాడడం లేదనిపిస్తోంది. సత్యాన్వేషణ లక్ష్యం సరైన జ్ఞానం పొందడం. దానికి మరో అర్థం చెప్పకూడదు. ఒక వ్యక్తి సత్యాన్వేషణ ద్వారా ఒక తెలీని విషయాన్ని తెలుసుకుని, అది సరైందేనని తెలుసుకున్నాడనుకుందాం. అతడు ఆ విషయంలో విశ్వాసాన్నో, అంధ విశ్వాసాన్నో వదలగొట్టుకున్నాడనే ఒక్క సంఘటన అలా జరిగినా, అన్వేషణ ద్వారా తెలియకనే అంగీకరించిన - విశ్వసించిన స్థితినుండి తెలిసినతనానికి చేరవచ్చు అని రుజువైనట్లు. జ్ఞాన సిద్ధాంతమంతా, తెలియనితనాన్నుండి తెలిసినతనంలోకి వ్యక్తి ప్రయాణించడం ఎలాగని చెప్పేదే.
3. ఒక వ్యక్తి ఒక ప్రతిపాదన చేసి అది సత్యము అనంటే దాని విషయంలో తాను తేల్చుకున్నానని, విూకు తేల్చి చూపగలను అని అంటున్నట్లే అన్న నా ప్రతిపాదన విూకు ఎందుకు నచ్చలేదో అర్ధం కాలేదు. ప్రతి మనిషీ అన్ని రంగాలలో తనే నిగ్గుతేల్చుకోగలడా? అని అడిగారు. అక్కడనే విూ ఆలోచన ప్రక్కదారినపడింది. మనమంటున్నది ఫలానా విషయంలో సత్యమిది అని ప్రజలముందు ప్రకటించి, దానిని గ్రహించండి, అంటున్న వానిని గురించి మాత్రమే. అతడా సందర్భంలో నాకు తెలుసు ఇది సత్యమేనని అంటున్నట్లా, దీని గురించి నాకు తెలీదు, అయినా ఇది సత్యమేనని అంటున్నట్లా ? కనుక మనం విచారణ చేసేటప్పుడు ఏ సందర్భాన్ని దృష్టినిడుకుని ఆయా మాటలంటున్నామో జాగ్రత్తగా పట్టించుకోవాలి. లేకుంటే విచారణంతా నేలవిడిచిన సామే అవుతుంది.
అందరికీ ఉపయోగపడే, ఆలోచించుకోవాల్సిన విషయాలే గనుక ఇంత వ్రాయాల్సి వచ్చింది.
1. వక్త హృదయం ఇదేనని నిర్ధారించే అధికారం, వ్యాఖ్యాతలెవరికీ లేదు. ఉండదు, ఉండకూడదు.
2. విశ్వాసం అజ్ఞాన మూలకం. ఏ విషయంలో తెలియనితనమున్నవాడు ఆ విషయం సత్యము అని గాని, అసత్యము అని గాని అనకూడదు.
3. నాకు తెలిసినంతటిలో పై రెండు భావాలూ ఎక్కడైనా చెల్లుబాటవుతాయి. సార్వత్రిక విలువ కలిగినవి. స్పందించండి.
- సత్యాన్వేషణలో విూ సురేంద్ర
No comments:
Post a Comment