ఈ దేశపు గతంలోకి సావధానంగా దృష్టి సారిస్తే మనకో విచిత్ర పరిస్థితి ఎదురవుతుంది. ఆనాటి చింతకులు ఒక వంక ప్రకృతిని, సమాజాన్ని, మనిషిని లోతుగా, జాగ్రత్తగా అన్వేషించినట్లు, అన్వేషించమని గట్టిగా ప్రోత్సహించినట్లు కనపడుతుంది. వైదిక సాహిత్యంలో ద్రష్టలుగా పరిగణింపబడే రుషుల దర్శనాలు ఇందుకు గట్టి నిదర్శనాలు. మూలపదార్ధం, జడమా? చేతనమా? అన్న ప్రశ్నకు (1) జడము, (2) చేతనము అన్న రెండు మూల పదార్ధాలువేటికవే అనాదినిత్యాలు అన్న సమాధానాన్ని, (2) జడమే మూలం (అసద్వాఇదమగ్రఆసీత్) దాని నుండే జీవంతో సహా సమస్తం ఉత్పన్నమైంది. అన్న సమాధానాన్ని, (3) చేతనమే మూలం (సదేవసౌమ్యేదమగ్ర ఆసీత్) దాని నుండే జీవ, జడజగత్తులన్నీ ఉద్భవించాయి అన్న సమాధానాన్ని, (4) ఏమో ఇదంతా ఎలా జరిగిందో ఎవడికి తెలుసు అన్న సమాధానాన్ని చెప్పుకున్నారు ఒకనాటి చింతకులు.
(2) అటు తరువాత ; ఉన్న ఈ ప్రపంచం దేనితో ఏర్పడినట్లు? అని ప్రశ్నించుకుని, పంచభూతాలతోనని కొందరు, చతుర్భూతాలతోనని కొందరు, మూడు భూతాలతోనేనని కొందరు సమాధానాలు చెప్పారు - సాధారణ వాడుకలోకి మాత్రం జగత్తు పాంచభౌతికం అన్న భావన వచ్చి స్థిరపడింది. ఆకాశం గగనం శూన్యం, అన్నవి పర్యాయపదాలుగ పరిభాష తెలిసిన వారన్నారు. ఈ అర్ధాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆకాశమనే ద్రవ్యం లేదని, ఏవైన ద్రవ్యాలు ఉండడానికున్న అవకాశంనే - అక్కడేమీ లేకుండడం, ఏదైన ఉండడానికి వీలుండడం అన్నదానినే ఆకాశం - శూన్యం - అన్నారని చెప్పుకోవలసి వస్తుంది.
(3) వైదిక సాహిత్యాన్ని దాటి ఈవలికొస్తే దర్శనాలు అన్న పేరున ప్రసిద్ది చెందిన తాత్విక థోరణులు ఎదురవుతాయి. అందులో న్యాయ వైశేషిక దర్శనాలు తార్కిక పోకడకు ప్రాధాన్యతనిచ్చాయి. వాటిలో తెలుసుకునే విధానాలు (సాధనాలు) తెలియబడే పదార్ధాలు (అర్ధాలు, విషయాలు అనీ అనవచ్చు) అన్న రెంటికి సంబంధించిన విచారణ ప్రధానంగా సాగింది. హేతుబద్ధంగా ఆలోచించాల్సిన అవసరాన్ని, అభిప్రాయరూపంలో ఉన్న ప్రతిభావనను సంశయించి విచారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారీ ధోరణివాళ్ళు.
సంశయించక విచారించడం కుదరదనీ, విచారించకనే స్వీకరించడం సరికాదని అంటాడు న్యాయదర్శనకారుడు. అంటే ప్రతిదానినీ ప్రశ్నించి, పరీక్షించాకనే నిర్ణయానికి రా అన్నట్లన్నమాట. హేతువును గురించీ, అహేతుకరూపాల గురించీ ఈ నాటికీ సరిచేయనక్కరలేనంత లోతైన అవగాహన కలిగి ఉన్నారు వాళ్ళు. న్యాయ దర్శనంలోని న్యాయమన్న మాటకు, 'ప్రమాణైః అర్థ పరీక్షణం న్యాయం' అనే వివరణ చేశారు వ్యాఖ్యాన కారులున్నూ.
(4) వీటి అనంతరం ధర్మశాస్త్రాల పేరిట రచనలు వచ్చాయి. వీటినే స్మృతులు అనంటారు. సాంప్రదాయంలో ఇవి అనేకం ఉన్నా ప్రబలంగా ప్రాచీన సమాజంలో అమలులో ఉండగలిగింది మను ధర్మశాస్త్రమన్నదే. మనుస్మృతి, శంఖలిఖితస్మృతి, గౌతమస్మృతి, పరాశరస్మృతి అన్నవి ధర్మశాస్త్రాలుగ పేర్కొనబడ్డాయి. నారదస్మృతి, విష్ణుస్మృతి లాంటి మరికొన్నింటి పేర్లూ అనంతరం వచ్చిన సాహిత్యంలో కనబడతాయి. ఇవన్నీ పేర్లు చెప్పుకోడానికి పనికి వచ్చేవేగాని, వాస్తవంగా ఈ దేశంలోని ఎక్కువమంది ధర్మశాస్త్రంగా అంగీకరించిందీ, సమాజంలో విస్తారంగా అమలైందీ మనుధర్మశాస్త్రమే. 'మనుస్మృతి' అంటారు దీనినే.
(5) దీని తరువాత మనకేెదురయ్యేది నీతిశాస్త్రాలు, పురాణాలు. నీతి శాస్త్రాలలో మానవుని ప్రవర్తన ఎలా ఉండాలో, అలా ఉండాలంటే ఎటువంటి మానసిక వైఖరి కలిగిఉండాలో తెలియజెప్పే సాధారణ సూత్రీకరణలు ఉన్నాయిగాని, పురాణాల దగ్గరకొచ్చేటప్పటికి, అవన్నీ పై వాటన్నింటి కలగూరగంపలాంటివిగ తయారయ్యాయి. తాత్విక స్థాయికి చెందిన ఉద్ధాత్తభావాలతో పాటు నానాజాతి సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ఆరాధనా పద్ధతులు వగైరాలన్ని అందులో దర్శనమిస్తాయి. ఈ దేశంలో 18 పురాణాలన్న ప్రసిద్ధి ఉంది. వివిధ సంస్కృతీ సంప్రదాయాలతోబాటు, వివిధ ఆస్థిక ధోరణులను తలకెత్తుకున్న వైఖరి కనపడుతుందందులో. వాటిలో ఒకింత తాత్వికత, మరికొంత ధార్మికత, ఇంకొంత నీతిసూక్తులు, కొంతచరిత్ర, ఇంకెంతో కల్పనచోటు చేసుకుని ఉంది. అనంతర కాలంలో తలగలిగీ ఒక వైపుకు వంగిన వారు వాటిని సాత్విక, రాజసిక తామసిక పురాణాలంటూ విభజించి దైవాలకు, దేవతలకు మధ్య తరతమ భేదాలను సృష్టించి మంది నెత్తికెక్కించారు. కొంతకాలం ఈ దేశంలో త్రిమూర్తులు, ఆదిశక్తి, గణపతి, సూర్యుడు ప్రధాన దేవతలుగ ఆస్ధికతకొనసాగింది. వేద సాహిత్యంలో ఇంద్రాగ్నివాయు, వరుణ దేవతలకు ఉన్నత స్థానం ఇవ్వబడ్డా, అక్కడే ఈ ఆరుగురికి సంబంధించిన ప్రస్తావనలూ చోటు చేసుకుని ఉన్నై. కొన్నిచోట్ల విష్ణువు, ఉపేంద్రుడు అనబడ్డారు.
ఇక ఉపనిషత్సాహిత్యంలో 'జీవుడు -ఈశ్వరుడు - ప్రకృతి' అనే మూటి ప్రస్తావనే ప్రధానంగా కనబడుతుంది. వివిధ దేవతల గొడవ అంతగా కనపడదు. అవి ప్రధానంగా ఏకేశ్వర ప్రతిపాదకాలు. పదార్ధవర్గాలు ప్రధానంగా రెండే. జీవపదార్ధము, జడపదార్ధము. అందు జీవపదార్ధం రెండు రకాలు, ఈశ్వరుడు, జీవుడునని. ఈ ధోరణి ప్రకారం ఈశ్వరుడు (ఇక్కడ ఈశ్వరుడంటే త్రిమూర్తులలోని శివుడని అర్ధంకాదు. సృష్టికర్త, నియామకుడు అయిన వాడని అర్ధం) తక్క మిగిలిన వారంతా అంటే త్రిమూర్తులలో మిగిలిన ఇద్దరూ. ముగ్గురమ్మలూ, శక్తి, ఇందాద్రులు, వగైరాలంతా, (పిపీలికాది బ్రహ్మపర్యంతం అనంటారు ఈ మొత్తాన్ని) వీరంతా జీవులే. వీరంతా కర్మ బద్దులై వారి వారి కర్మలననుసరించి ఆయా సుఖదుఃఖాదులను భోగిస్తూ ఉంటారు. ఈ సాహిత్యంలో, ప్రకృతికి సంబంధించిన వివిధ సిద్ధాంతాలు, మనిషికి సంబంధించిన వివిధ భావనలు విస్తారంగా చోటు చేసుకుని ఉన్నై.
ఇక రామాయణ, మహాభారతాలను ఇతిహాసాలని పిలిచినా, ఒక దేశ చరిత్ర అనడానికి తగిన సమగ్రతలేని, ఒకటిరెండు వంశాలకు చెందిన వివరాలకు ప్రాధాన్యతనిచ్చిన కథలివి. రెండు ముక్కల్లో వంశవృక్షాన్ని చెప్పి, ఆ పై ప్రధానంగా ఒకటిరెండు తరాల వ్యక్తుల చుట్టూ నడచిన కథలవి. అయితే జాగ్రత్తగా పట్టి చూస్తే వాటిలో పైన మనం చెప్పుకున్న రచనలన్నింటి ఆనవాళ్ళు లభిస్తాయి. ఆ కాలానికి చెందిన కొంత గతాన్నీ, కొంత భవిష్యత్తుకు చెందిన ఊహలనూ కలుపుకుని, వర్తమానంలోని సమాజ స్థితిగతులకు అద్దం పడతాయారచనలు. కనుక ఒక కాలంలోని సమాజాన్ని చిత్రించే పనిచేశాయి. గనుక చరిత్ర స్వభావమూ కొంతచోటు చేసుకుని ఉంటుంది వీటిలో.
భారతీయ తాత్విక సాహిత్యంలో నాస్తిక గళమూ వినపడుతుంది గాని, అది ప్రజా జీవనాన్ని ప్రభావితం చేయగలంత స్థాయిలో ఎన్నడూలేదు. భౌతిక వాద దృష్టి ఉన్న యోచనాపరుల రచనలోనూ అభౌతిక పదార్ధపు ఉనికిని అంగీకరించిన ధోరణి కనబడుతుంది. కనుక ప్రాచీన భారత సమాజం ఎన్ని ప్రాంతాలుగా విభజితమై ఉన్నా రాజు, రాజ్యము ఆస్థిక పంథానంగీకరించే మనుగడ సాగించింది. దాంతో సామాజికపరమైన కట్టుబాట్లన్నీ విధినిషేధాలన్నీ, ఆస్థిక పంథీయులు రచించిన ధర్మశాస్త్రాల (స్మృతుల)ననుసరించే అమలవుతుండేవి. అదిన్నీ మనుస్మృతే ప్రబలంగా అమలవుతూ వచ్చింది. భారతీయతాత్విక సాహిత్యంలో ఉన్న ఒక అసాధారణత ఏమంటే, దానిలో ఒక వంక అత్యంత విశాల, ఉదాత్త భావజాలమూ ఉంటుంది. అదే సమయంలో మరోవంక అత్యంత నికృష్టమైన క్రూరమైన భావజాలమూ ఉంటుంది. ఈ రెండు రకాల భావాలనూ సాంప్రదాయకులు ప్రామాణిక వచనాలుగ ఉట్టంకిస్తూనే ఉంటారు. ఉదాత్త భావాలను స్వీకరించి ప్రవర్తిస్తుండేవారూ కనపడతారు, అత్యంత నింద్యమైన వాటిని పట్టుకుని పాకులాడేవాళ్ళూ కనపడతారు. రెండు ధోరణుల ఉనికీ, దానిననుసరించేవాళ్ళ ఉనికీ వాస్తవమే అయినా, మొత్తం సమాజాన్ని ఒక ఏకమొత్తంగా పట్టిచూసినపుడు దానిస్థితీ గతీ ఎలాగున్నా యన్నదానిని బట్టి, ఆ సమాజ స్థాయిని, వైఖరినీ లెక్కగట్ట్టాల్సి ఉంటుంది. ఆ లెక్కన భారత సమాజ సాధారణ గమనం, నిందాత్మకమైందిగ చెప్పుకోవడమే వాస్తవాలను చెప్పుకోవడం అవుతుంది. ఎందుకంటే, ఎలాగంటే,
వైదిక యుగం - వేదకాలం - తొలినాళ్ళలో ఈ వర్ణాల గొడవలేని థ ఒకటి ఉండేదన్నట్లు మహా భారతంలో వ్యాసవచనం ఉంది. ఆ థలో మనుషులంతా ఏకవర్ణం అంటే ఒకే కులం అంటే సమూహం(గుంపు) గా ఉండే వారన్నమాట. మలిథలో 'ఆర్యా స్రైవర్ణికా' అన్నట్లు మూడు వర్ణాలుండేవి, ఆ తరవాతది పురుషసూక్తంలోని బ్రాహ్మణాస్య ముఖమాసీత్, బాహూరాజన్యకృతః ....... పధ్బ్యాం సూద్రో అజాయతః అన్నభావన; వర్ణ విభజన క్రమం అక్కడితోనూ ఆగలా. అనంతరకాలంలో మరోసమూహమూ ఏర్పడినట్లు యజుర్వేదంలో ఆధారం ఉంది.
యధేమాం వాచం కళ్యాణీ మావదాని జనేభ్యః, బ్రహ్మరాజన్యాభ్యాగం |
శూద్రాయ చార్వాయచస్వాయ చారణాయ || 262
బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకే గాక, శూద్రులకు, స్త్రీలకు, అతి శూద్రుల కొరకున్ను ఈ వేదాలను ఇస్తున్నాను అన్నది మంత్రార్థం. ఈ దేశంలో ఒక థలో, వేదం స్త్రీలు శూద్రులు, అతి శూద్రులకు కూడా తెలియదగిందే నన్న భావన ఉనికిలో ఉండేదన్నమాట. ఈ మంత్రంలో వేదాద్యయనాధి కారం సర్వులకూ అన్న విషయమేగాక, ఐదోవర్ణంగా అతిశూద్రుల ప్రస్తావనా చేయబడింది. అయితే ఈ అతి శూద్రులెవరో, ఆ గుంపు ఎలా ఏర్పడిందో, వారినలా ప్రత్యేకించడానికానాటి సమాజం పరిగణించిన కొలత లేమిటో స్పష్టంగా తెలిపే ఆధారాలు లేవు.
ఇలాంటి ఐదు విభాగాలను తెలిపేందుకు పనికి వచ్చే మరో మాటే 'పంచములు' అన్నదన్నూ నాలుగు సమూహాలుగా ఉన్న చతుర్వర్ణాలనబడే గుంపులకు వేరైన సమూహాన్ని పంచములు అనన్నారన్నమాట వాళ్ళు. ఈ థ వరకు కూడా నానా కులాల ప్రస్తావన అంత పట్టింపుగా లేదనే అనుకోవాలి. ఈ పంచమవర్ణం క్రిందికి వచ్చేవారంతా అస్పృశ్యులేనన్నమాట. అతి శూద్రులంటే శూద్రవర్ణాన్నిదాటి ఇంకా దిగువ స్థాయిలో నున్న జనులని అర్థం.
గమనిక :- అస్పృశ్యునిగ ఎన్నో అవమానాలను, ఆటంకాలను స్వయంగా అనుభవించిన డా|| అంబేద్కర్ కూడా, వైదిక వర్ణవ్యవస్థా, మనుస్మృతిలోని కులవ్యవస్థా ఒకటికాదన్న అభిప్రాయాన్నే వెళ్ళడించారు. గాంధీ కూడా వైదిక వర్ణ వ్యవస్థ సరైందేనంటూ దానికి తనదైన ఆకృతి నివ్వడానికి యత్నించారు. ఇక ఆర్య సామాజిక స్థాపకుడైన దయానంద సరస్వతి వర్ణ వ్యవస్థ ఉండాల్సిందేనంటూ ఆయన దానర్ధం ఇదీ అంటూ తనదైన వివరణ చేశాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూనే, ఈనాడు నేను చెప్పదలచిందేమిటంటే, గతంలో ఒకే వర్గం ఉండేదా? లేదా అన్న దగ్గర నుండి, మూడు వర్గాలు, నాలుగు వర్గాలు, ఐదువర్గాలంటూ వారు వారు చెపుతున్న దానిలో ఏది నిజంగా ఉండేది? వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాలలో వివిధ విధానాలు అమలయ్యాయా? అన్న వివరాలుగానీ, వాటి సత్యాసత్యాలుగానీ, సబబు బేసబబులుగానీ ఇప్పుడు మనకు అనవసరపు విషయాలు. ఈ నాటి మనందరికీ, ఆచరణలో ఏమి జరుగుతూ వచ్చిందో చూడడం, యీ ఆచరణలో ఉన్నది ఉండదగిందో? కాదో; (ఉంచుకోదగిందోకాదో) సక్రమాలోచనా నియమాల ననుసరించి, అందరి అభివృద్ధి - (సామాజిక న్యాయం) అన్న కొలతల నుండి పరీక్షించి నిర్ధారించుకోవడమే సరైనది.
ఆలెఖ్ఖన చూస్తే ఆచరణలో ఉన్నది, దయానందుడుగానీ, అంబేద్కర్‌గానీ, గాంధీగానీ, ప్రాచీన కాలంలో ఉండేది అంటూ వచ్చిన వర్ణ వ్యవస్థకాదనీ, మను స్మృతిలో చెప్పబడ్డ కులవ్యవస్థేనని తేెలుతుంది. అలాంటి అమానుష వ్యవస్థను మానవ జాతి నెత్తికెత్తినవాళ్ళు చేసినంత ఘోరం మరెవ్వరూ ఏనాడు చేయలేరన్నది గింతఇంగితమున్నా చెప్పగలిగిన మాటే. ఆలోచనకు ఇది సబబుకాదని తేలికగానే అర్ధమవుతూఉన్నా, ఈ విషమ, విషసమ విధివిధానం వేల సం||లు ఈ సమాజాన్ని బంధించగలిగింది. ప్రాచీన చరిత్ర మొత్తంలో ఒకటీ, అరా ఘటనలు తప్ప ఈ దుర్మార్గాన్ని గట్టిగా ప్రతిఘటించిన దాఖలాలులేవు. ఎందుకని ఈ ఘోరాన్ని ప్రతిఘటిస్తే మరింత ఘోర దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయాన్నీ జనంలో కలిగించగలిగారన్న మాట, ఆనాటి సమాజ గతి నిర్ధేశికులు. 'శంభుక వధలాంటి' ఘటనలు ఈ విషయాన్నే రూఢి పరుస్తున్నై.
ఒకవంక, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గవిహస్తిని శునిచైవశ్వపాకేచ పండితాస్సమదర్శినః|| (గీత) అంటూనే, మరోవంక; బ్రాహ్మణం థ వర్షంతు శతవర్షంతు భూమిపమ్!
పితాపుత్రౌ విజానీయాద్బ్రాహ్మణస్తుతయోః పితా|| మనుస్మృతి పది సం|| ప్రాయం వారైన బ్రాహ్మణుడు వంద సం|| వాడైన క్షత్రియుడు తండ్రి కొడుకులు లాంటివారు. అందులో బ్రాహ్మడే తండ్రి లాటివాడు, అంటున్నారు.
యోనధీత్య ద్విజోవేద మన్యత్రకురుతే శ్రమం|
సజీవన్నేవ శూద్రత్వ మాశుగచ్చతి సాన్వయః|| (మనుస్మృతి) (2-168) అంటే;
ఏద్విజుడైతే వేదాధ్యయనాది బ్రాహ్మణవిధిని విడచి, ఇతరేతర విషయములందు శ్రమ చేస్తాడో అతడు ఈ జన్మములోనే తన వారందరితో కూడి శూద్రుడవుతాడు. అని అర్థం. శాస్త్రం, శాస్త్రం అంటూ పడిచచ్చేవాళ్ళంతా ఈ వాక్యార్ధానికి కట్టుబడి ఉంటారా? అలా జరిగిన దాఖలాలు ఉన్నాయా? వచ్చిన చిక్కంతా ఇక్కడే ఉంది. అక్కడక్కడా వివేకం అంగీకరించదగిన భావాలూ చెప్పబడిఉన్నా, అట్టివెక్కడా, ఎన్నడూ ఆచరణకు నోచుకోవు. శాస్త్రాలలో మంచి విషయలెన్నో చెప్పబడి ఉన్నాయి అని వాదించడానికో, బుకాయించడానికో మాత్రమే పనికొస్తాయవి.
ఈనాడు; ఈనాడే కాదు గతానికి చెందిన కొన్ని వందల (వేల అనైనా అనవచ్చునేమో) సంవత్సరాల నుండి ఈనాటి వరకు, మొత్తం భారతదేశంలో అమలవుతున్నది జన్మ చేతనే కులం అన్నది మాత్రమే. (గమనిక :- కులమన్నా, వర్ణమన్నా ఈనాడు ఆచరణలో ఏ మాత్రం అర్ధభేదం లేదు. ఆచరణలో రెండూ పర్యాయ పదాలుగనే వినియోగమవుతున్నాయి. ఈ సందర్భంలో, మానవత్వాన్నే మంట గలిపి, మనుషుల మధ్య అంతరాల్ని మరేరకంగానూ కల్పించలేనంతగా కల్పించిన రెండు భావనలను గురించి చెప్పుకోవలసి ఉంది. ఆ రెండు భావనలను తెలిపే పదాలు 'పవిత్రత, అపవిత్రత' అన్నవే.
నాకు తెలిసి, ఏ సాహిత్యంలో గాని ఇంతటి క్రూరమైన నేపధ్యం కలిగిన పదాలు ఉండవు. ప్రతి మత సాహిత్యంలోనూ ఈ పవిత్రత, పవిత్రుడు అన్న దృష్టి చోటు చేసుకునే ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా భారతీయ సాహిత్యంలో, సమాజానికి వర్తింపజేసే మానవులమధ్య పరస్పర సంబంధాలకు చెందిన సందర్భాలలో, ఈ రెండు పదాలు అత్యంత క్రూరమైనవిగా తమ పాత్రను పోషించాయి. సామాజిక సంబంధాల దగ్గర అని ఎందుకంటున్నానంటే. ఒక్కడే మనిషిగనక ఉన్న సందర్భాలలో అతడు పవిత్రుడా, అపవిత్రుడా? అన్న ప్రశ్నగాని; ధార్మికుడా? అధార్మికుడా? అన్న ప్రశ్నగాని; నీతివంతుడా? అవినీతి వంతుడా అన్న విచికిత్సగానీ; న్యాయకారా? అన్యాయకారా? అన్న చర్చ గాని పుట్టే అవకాశమే లేదు. ఉండదు. ఈ పదాలన్నీ అనేకుల మధ్య సంబంధాలతో ముడిపెట్టి చెప్పుకోవలసినవే. అంటే సామాజిక సంబంధాలతో ముడిపడిఉన్నవేనన్నమాట.
''పవిత్రత, అపవిత్రత'' అన్న భావాలతో ముడిపడి ఈ దేశ సామాజిక సాంప్రదాయ సాహిత్యంలో ఇరువురు అంటరానివారున్నారు. ఒకడు పవిత్రుడుగనక, అతనిని ఇతరులు అంటరాదు. మరొకరు అపవిత్రుడుగనుక ఇతరులు అతణ్ణి తాకరాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో 'మడి-మైల' అన్న భావాలు, మరికొందరికీ వర్తించేవిగా వాడబడ్డా, కుల వ్యవస్థ-వర్ణ వ్యవస్థ-అమలవుతున్న మన దేశంలో ఇది ప్రధానంగా అటు బ్రాహ్మడికీ, ఇటు పంచములకూ వర్తించే విషయం మాత్రమే.
అ గమనిక :- నిజానికి పంచములన్న పదం క్రిందకు చాలా పెద్ద జాబితా వస్తుంది. అయితే పుట్టుక చేతనే తరతమ భేదాలుంటాయి అన్న భావన ఈ దేశ ప్రజలందరిలోనూ నరనరాన జొరబెట్టి, జీర్ణింపజేయడాన, ఇక్కడి ప్రతి కులం వాడికీ (ఒక్క బ్రాహ్మడికి తప్ప) తనకంటే జన్మచేతనే ఒకప్రక్క అధికుడూ, మరోప్రక్క అల్పుడు కూడా ఉంటారు. ఆ భావన ఇక్కడ వ్యక్తికి ఉగ్గుపాలతోనే రంగరించిపోస్తారు. గొప్ప విచిత్రమూ, విషాదమూ ఏమిటంటే ఆయా కులాల పెద్దలే తమ పిల్లలకు, తాము ఫలానకులంకంటే అధికులం, ఫలాన కులం మన కులం కంటే అధికమైంది అన్నది భాగా వంటబట్టిస్తారు. అదెంతగా వంటబడుతుందంటే, చచ్చేవరకు అంటుకునే ఉంటుందది. ప్రపంచ చరిత్రంతటిలోనూ, ఇంతగా అసమానతలను స్థిరీకరించిన వ్యవస్థ ఇంకొకటి కానరాదు. ఒక బ్రాహ్మణుడు తన సంతానానికి మనం బ్రాహ్మలం అని బోధిస్తాడు. ఆ రకమైన అహాన్ని-ఆత్మధిక్యతా భావాన్ని- వానిలో నిర్మాణంచేస్తాడు. అదే సమయంలో నిమ్న కులాలుగ చెప్పబడ్డ సమూహంలోని ఒకడు తన సంతానానికి మనం అల్పులం అన్న అహాన్ని - ఆత్మన్యూనతాభావాన్ని - రూపొందిస్తాడు.
సమస్త అవలక్షణాలు కలిగి ఉన్నా శారీరకంగా బలహీనుడై ఉన్నా ఒక బ్రాహ్మణుడు తాను బ్రాహ్మణ్ణి, అగ్రవర్ణం వాణ్ణి, కనుక ఇతరుకంటే అధికుణ్ణి అనే తలంచుతాడు. మాట్లాడతాడు, వీలున్నంతలో ప్రవర్తిస్తుంటాడు. అలాగే మరో వైపున్నవాడు తాను మానసికంగా, శారీరకంగా బలంగనే ఉన్నా కులాలను బట్టి తన కంటే పై నున్న వారితో పోల్చుకునేటప్పుడు, అల్పుణ్ణి అనే తలంచుతాడు, మాట్లాడతాడు, అందుకు తగ్గట్టే ప్రవర్తిస్తుంటాడు.
'ఊరు-వాడా' అనే పదాలు వెనకటి తరంలో చాలా ఖచ్ఛితమైన అర్ధాలతో గ్రామాలలో - జనపదాలలో - వినియోగమవుతుండేవి. గ్రామాలలో ఊరు, పల్లె, గూడెం అన్న పదాలు వేరు వేరు కులాలు నివసించే ప్రాంతాలకు వాడుకగా వినియోగమయ్యేవి. నాలుగు కులాలు (వర్ణాలందాం వీటిని) నివశించే ప్రాంతాన్ని ఊరు అంటారు. మాలలుండే దానిని పల్లె అని, మాదిగలుండేదానిని గూడెం అని సాధారణంగా వ్యవహరించేవారు. కుల దొంతరుల సమాజంలో మాలలు, మాదిగలు ఊరి వెలుపలి వాళ్ళుగనే చూడబడేవారు. విచిత్రమేమంటే వీరూ, చండాలురను, తంబళ్ళవాళ్ళనబడే వారినీ, తమకంటే తక్కువ వారినిగ తలచేవాళ్ళు. ఇక గ్రామాలలో ఊరికి వెలుపల నివాసాలుండేవారిలో ఎరుకల, యానాది, ఉప్పర, వడ్రు వాళ్ళు సాధారణంగా కనిపిస్తారు. నిజానికి వీరందరిన్నీ కులవ్యవస్ధ ఊరివెలుపలి వాళ్ళుగనే తలంచింది. ఆనాటి సమాజంలో ఉన్న ఒక వాడుక తిట్లను పట్టిచూస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఊరి వెలపలి కులాల వాళ్ళలో తమ కులం వానిపై ఆగ్రహం వస్తే తిట్టే తిట్లలో పెద్ద తిట్టు, నీవేమైనా ఊరంగోడికి పుట్టావా? అన్నదే. ఈనాడు వినడానికి మనకిది ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తున్నా, ఆ తిట్టు కులవ్యవస్థలో ఉన్న గ్రామాలలోని, 'ఊరిలోని వాళ్ళు, వెలుపలివాళ్ళు' అన్న సామాజిక చిత్రానికి చెందిన ఒక వాస్తవాన్ని పట్టిస్తోంది.
త్రికరణాలు
ఒక మనిషి చేసే పనులను గనుక వర్గీకరిస్తే అవన్నీ మూడు సాధారణ రాశులుగ తేలతాయి. మానసికకర్మలు, వాచిక కర్మలు, కాయికకర్మలు అనంటారు వాటిని. త్రికరణాలు అన్న శబ్దం ఈ అర్ధాన్ని తెలిపేందుకు పుట్టిందే. కరణం అంటే సాధనం - పనిముట్టు- అని అర్ధం. పనిముట్టు అనంటే పని చేయడానికి అవసరమైంది, పని చేయగలది అని అర్ధం.
(వివరణ :- జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్న పదాలు మనమందరికి తెలిసున్నవే. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక అన్నవి జ్ఞానేంద్రియాలుగ, వాక్కు, కాళ్ళు, చేతులు, మలవిసర్జనావయవం, మూత్ర విసర్జనావయవం అన్నవి (వాక్పాణి పాదపాయూపస్ధలు) కర్మేంద్రియాలుగ వాడుక ఉంది. మనస్సు అంతరింద్రేయం అనబడ్డది. మన ప్రస్తుతాంశానికి సంబంధించి పై వాటినే ఆలోచించడం, మాట్లాడడం, చేయడం అన్న మూడుగా విభజించుకున్నది. జ్ఞానేంద్రియాలు - కర్మేంద్రియాలు అన్న వాటిలో మనస్సు క్రిందికి జ్ఞానేంద్రియాలన్నీ చేరతాయి. మాటా చేత కర్మేంద్రియాల క్రిందివవుతాయి. మానవ జీవితంలో మనిషి చేసే ప్రధానమైన పనులు అన్న దృష్టి నుండి వీటన్నింటినీ, మరో రకంగావిడగొట్టి వీటిని త్రికరణాలన్నారు. 'ఆలోచిస్తాడు మాట్లాడతాడు, చేస్తాడు' అన్న విభజన అది. ఈ వివరాలు ఇప్పటికింత చాలు)
'పవిత్రత' అన్నది ఇందులో దేనికి సంబంధించింది? అస్సలు పవిత్రతంటే ఏమిటి? ఒకడు పవిత్రుడో అపవిత్రుడో నిర్ణయించే కొలమానమేమిటి? 'శుభ్రత' అన్న పదమూ మనకు తెలిసిందే. అయితే పవిత్రత అన్నదేమైనా ఈ 'శుభ్రత'ను తెలిపే పదమా?
నాకు తెలిసినంతలో పవిత్రతంటే శుభ్రతకు పర్యాయంకాదు. కాకుంటే పవిత్రతలో శుభ్రతా ఒక భాగం కావచ్చు. అదీ కొన్ని సందర్భాలలోనే, ఎందుకంటే పవిత్రత గురించి మనకందుతున్న సాహిత్యాన్ని ఇట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో పరిశుభ్రత కొరవై కూడా పవిత్రత ఉండగలుగుతుంది.
ఇక 'శుచి' అన్న పదం కూడా మనందరికీ తెలిసిఉన్నదే. ఏమిటీ 'శుచి' అనేమాటకు అర్ధం? శుచి-శుభ్రత అన్న పదాలు పేపర్ కాగితం, కప్ గిన్నె లాంటి మాటలా? రెండూ వేరు వేరు అర్ధాలనిచ్చేటివా? ఒకే అర్ధాన్ని బలంగా చెప్పేటందుకు అంటే 'మొట్టమొదట', 'ఉత్తమోత్తమం' అన్నట్టు వాడబడ్డవా?
కల్మషం నిష్కల్మషం; నిర్మలం-మలినం, అన్న మాటలూ ఆయా సందర్భాలలో వాడుతూనే ఉంటాం. అలాగే కపటం-నిష్కపటం అన్నవీను.
స్వార్ధం-నిస్వార్ధం, అసూయ-అనసూయ; మదం, మత్సరం, కామం, క్రోధం, లోభం, మోహం అన్నవీ, వాటికి వ్యతిరేకరూపాలన్నవీ, పవిత్రత గురించి విచారించే సందర్భంలో పరిశీలించాల్సినవే. వీటితోపాటు, జాలి, దయ, కరుణ లాంటి మానవీయ విలువలను తెలిపే భావనలనూ పరిగణనలోకి తీసుకుందాం.
వీటన్నంటినీ ఎదుట పెట్టుకునే (పవిత్రత-అపవిత్ర గురించి మాట్లాడేవాళ్ళు ఇంకా వేటినైనా చేర్చాలంటే వాటన్నింటినీ చేర్చుకోడానికి నాకైతే ఎట్టి అభ్యంతరంలేదు) ఇంతకూ 'పవిత్రతంటే' ఏమిటి? 'అపవిత్రతంటే' ఏమిటి? అని అడుగుతున్నాను.
నాకు తెలిసి, 'పవిత్రతంటే ఇది; పవిత్రుడంటే వీడు' అని చెప్పగల చిత్రమేదీ లేదు. పవిత్రతనూ అపవిత్రతనూ కొలవడానికి గాని, పవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి గుర్తించడానికి గాని వీలైన సాధారణ కొలమానం అంటూ ఏదీ లేనేలేదు. ఉండే అవకాశమూ లేదు. మానవ సమాజాన్ని అత్యంత క్రూరంగా విడగొట్టిన, ఏమాత్రం విలువలేని, వాస్తవీకరించడానికి వీలులేని భ్రమాత్మక భావన అది. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే కుటిల తంత్రంలో భాగంగా ప్రవేశపెట్టిన భావనఅది.
అ పవిత్రత-అపవిత్రత (పవిత్రుడు-అపవిత్రుడు) అన్న పదాలను వాడే వాళ్ళందరకూ ఈ ముఖంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రెండు పదాలకు విూరిచ్చే అర్ధాలేమిటి? వాటికి అవే సబబైన అర్ధాలు అనడానికి విూకున్న ఆధారం ఏమిటి? ఆ అర్ధాలతో వ్యక్తుల్ని పరీక్షించి, వాడు పవిత్రుడు, వీడపవిత్రుడు అని మనుషుల్ని విభజించగలమా? అలా చేసిన విభజనను స్థిరీకరించగలమా, అంటే శాశ్వతీకరించగలమా? ఆ విూ కొలమానాన్ని ఏ సమాజమైనా అమలు పరచగలదా? నిజాయితీగా ఆలోచించి విూ అభిప్రాయమేమిటో ప్రకటించండి.
నా వరకు నాకు, ఆ రెండు పదాలూ అత్యంత ప్రమాదకరమైనవి. మానవ సమాజంలో అత్యంత క్రూరమైన పాత్ర పోషించినట్టివి. వాటికి ఎవరు ఏ అర్ధాన్ని చెప్పినా ఆ అర్ధంలోనుంచే లోకంలో పవిత్రుడులేడు, ఆపవిత్రుడు లేడని చెప్పవచ్చు. చెప్పగలను. లేని గొప్పలు చెప్పుకోడానికో, లేని చెడ్డను అంటగట్టడానికో తప్ప ఆ మాటలు మరెందుకూ కొరగావు. నా ఈ మాటలు ఆలోచింపదగినవేననడానికి వీలుగా దీనినే మరికొంత విశ్లేషణ చేస్తాను. సావధాన చిత్తంతో, బ్రతుకు వాస్తవాలతో సరిపోల్చి చూసుకుని, యథార్ధమేమిటో గమనించేయత్నం చేయండి.
వ్యక్తిని అంచనా వేయడానికి, త్రికరణాలతో అతనేమి చేస్తున్నాడన్న దాన్ని పట్టిచూడడం వినా మరో మార్గంలేదు. ఇది నిజమా కాదా? ఆలోచించి ఒక నిర్ణయానికిరండి. సరే, విషయానికి వద్దాం.
1) అతని ఆలోచనలెలా ఉన్నాయి? అందులో ఎటువంటి ఆలోచనలున్న వానిని పవిత్రుడు అనాలి, లేదా అపవిత్రుడనాలి?
2) అతని మాటలెలా ఉన్నాయి? ఎటువంటి మాటలున్న వానిని పవిత్రుడనగలవు? లేదా అపవిత్రుడనగలవు?
3) అతని చేతలెలా ఉన్నాయి? ఎట్టి చేతలు కలవాణ్ణి పవిత్రుడనో, అపవిత్రుడనో అనాలంటావు?
గమనిక :- భారతీయ తాత్విక సాహిత్యంలో; మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః!
మనస్సన్యం వచస్తన్యం, కర్మణ్యన్యం దురాత్మనః || అన్న భావన ఉంది.
మనసు, మాటా, చేతా ఒకటిగా ఉన్నవాడు మహాత్ముడు, అలాలేనివాడు అంటే, మనస్సు వేరు, మాటవేరు, చేతవేరుగ నున్నవాడు దురాత్ముడు అన్న భావన చాలా ఉదాత్తమైనదిగ చెప్పబడింది. దీనినే క్లుప్తరూపంలో త్రికరణ శుద్ధి కలిగి ఉండడం, త్రికరణ శుద్ధి లేకపోవడం అనంటున్నారు. ఇక్కడ స్పష్టత, నిర్ధుష్టత కొరకు కొంత విచారణ చేయాల్సి ఉంది.
త్రికరణాలు ఒక్కటిగా ఉండడమన్నా, త్రికరణాలు శుద్ధంగా ఉండడమన్నా ఒకే అర్ధం వస్తుందా? వేరర్ధాలు చెప్పుకునే అవకాశం లేదా? ఉదాహరణకు :
1) ఒక వ్యక్తికి మరో వ్యక్తిని హింసించాలనిపించింది, నిన్ను హింసించాలను కుంటున్నాను అని చెప్పాడు, ఆ పైన హింసించాడు.
2) ఒకనికి ఒకని సొత్తు దోచుకోవాలనిపించింది, నీ సొత్తు దోచుకుంటానని చెప్పాడు, దోచేసుకున్నాడు.
ఈ రెండు సందర్భాలలోనూ ఆ వ్యక్తుల్లో పైన శ్లోకంలో చెప్పినట్లు త్రికరణాలు ఒక్కటిగనే ఉన్నాయి. కనుక వారిని మహాత్ములనవచ్చా? లేక వారిని మరీ బరితెగించిన దురాత్ములనాల్నా? ఆలోచించండి.
అదే మరో రకం ఘటనలో ఒక వ్యక్తి ఒక స్త్రీని చూశాడు, (ఒక స్త్రీ ఒక పురుషుని చూసింది అనైనా అనుకోవచ్చు). ఇక్కడ చూసిన మనిషికి ఆవతలి వ్యక్తిపై కామవాంచ కలిగింది. పైకి మాత్రం ఏమాంటీ బాగున్నారా అనో, ఏమంకుల్ బాగున్నారా అనో పలకరించి, నీతి నియమాల గురించి సత్ ప్రవర్తన గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. లేదా వాళ్ళకవసరమైన సాయమూ చేశాడు. అనుకుందాం. ఇక్కడితనికి త్రికరణాలు ఏకంగా లేవు. కనుక ఇతణ్ణి దుష్టడనాల్నా? పై మొదటి ఉదాహరణలోని వారికంటే మెరుగైన వాడనాల్నా? ఇక్కడ రెండు ధోరణుల వారి మాటల్ని ఉట్టంకిస్తాను. ఏది మెరుగైన వైఖరో, వాస్తవానికి దగ్గరో, గమనించండి.
భగవద్గీత ద్వారా వ్యాసుడిలా అంటున్నాడు : బాహ్యేంద్రియాణి సంయమ్యయ ఆస్తే మనసాన్మరన్...
ఇంద్రియార్థాన్విమూఢాత్మామిథ్యాచారస్సఉచ్చ్యతే,
మాటా, చేతలను మంచిగా ఉండేట్లు నిగ్రహించి, మనస్సులోని చెడ్డ ఆలోచనలను ఆపనివాడు మిథ్యాచారుడు, అని శ్లోకార్థం.
ఇదే విషయంలో గోరాగారిలా అన్నారు : మనస్సు నీఅదుపులో లేకుంటే పోనీ, వంకరాలోచనలు వస్తుంటే రానీ, మాటా చేత వరకైనా సక్రమంగా ఉండు. త్రికరణ శుద్ధి లేకుంటే మానె, 'ద్వికరణశుద్ధి' వరకైనా కలిగుండు.
అ యోచనా శీలురైన పాఠకుమిత్రుడా! పై రెంటిలో ఏవైఖరి సరైనదో ఆచరణ సాధ్యమైనదో తేల్చుకో.
1) ఇంతకూ త్రికరణాలు శుద్ధంగా ఉండడాన్ని త్రికరణ శుద్ధి అందామా? త్రికరణాలు ఒక్కటిగా ఉండడాన్ని త్రికరణ శుద్ధి అందామా?
2) త్రికరణ శుద్ధి ఆచరణ సాధ్యమా? ద్వికరణ శుద్ధి ఆచరణ సాధ్యమా? సాధారణీకరించడానికి ఏది సరితూగుతుంది?
3) సాధ్యాసాధ్యాలనలా ఉంచి త్రికరణ శుద్ధీ అవసరమేనన్న భావన ఆదర్శప్రాయమైనదా? ద్వికరణ శుద్ధి చాలునన్నది ఆదర్శప్రాయమైనదా? సమాజం ముందు ఆదర్శంగా దేనిని ఉంచడం మంచిది? నిదానంగా ఆలోచించండి.
ఇవన్నీ సరే! ఇంతకూ 'పవిత్రత, అపవిత్రత' అన్న సన్నాయినొక్కులు నొక్కే వాళ్ళు, వీటిలో దేనిని గాని పవిత్రత క్రిందికో, అపవిత్రత క్రిందికో చేర్చుతారా? ఇవి గాక అవింకా వేరేగున్నాయి అనంటారా?
అ భారతీయ ఆస్థిక సాహిత్యంలో అగ్ని పవిత్రుడు, యజ్ఞోపవీతం పవిత్రమైనది, యజ్ఞం పవిత్రమైనది లాంటి ప్రయోగాలున్నాయి.
అ మనుస్మృతి లాంటి వాటిలో, బ్రాహ్మణుడు పుటక చేతనే పవిత్రుడు అనీ, పంచముడు పుటక చేతనే అపవిత్రుడు అనీ చెప్పబడి ఉంది.
అ కొన్ని గ్రంధాలలోనైతే పుటక చేత అందరూ సమానులే, శూద్రులే, అపవిత్రులేననీ, వారి వారి కర్మలననుసరించి ఆయా వర్ణాల క్రిందికి వస్తారనీ వ్రాయబడిఉంది.
అ పౌరాణిక సాహిత్యంలో దేవాలయం పవిత్రమైనదనీ, గంగ, గోదావరి, కృష్ణ లాంటి నదులు పవిత్రమైనవనీ ఉంది. ఎందుకు వాటిని పవిత్రమైన వన్నారు? అని చూస్తే అవి తమ తమ స్పర్శవల్ల పాపాలను తొలగిస్తాయి గనుక, పుణ్యాన్ని కలిగిస్తాయి గనుక, అన్న సమాధానం వస్తుంది.
అ సాధు సన్యాసులు, గురువులు పవిత్రులనీ, వారి దర్శన, స్పర్శన, సేవనాలవల్ల పాపం నశించి పుణ్యం చేకూరుతుందనీ కొన్ని రచనలలో ఉంది.
ఇలా పవిత్రమన్న మాట. అనేక సందర్భాలలో ప్రయోగింపబడ్డా, వాటిలో ఎక్కడా మనకవసరమైన; ఇంతకూ పవిత్రతంటే ఏమిటి? ఒకణ్ణి పవిత్రుడనో, అపవిత్రుడనో అనడానికి కొలమానం ఏమిటి? అన్న దానికి 1. అందరం అంగీకరించగల, 2. ఎవరూ కాదనడానికి వీల్లేని, 3. పరీక్షించి నిర్ధారించుకోవడానికి వీలైన సమాధానం మాత్రం దొరకదు.
వివేకి, అవివేకి; సాధకుడు, సిద్ధుడు, స్వతంత్రాలోచనా శీలుడు, మూఢుడు మూఢఃపరత్య్రయనేయబుద్దిః (ఇతరులతలపై ఆధారపడేవాడు), అనుభవజ్ఞుడు, అనుభవశూన్యుడు, మిథ్యాచారుడు, సదాచారుడు, దుష్టుడు - శిష్టుడు లాంటి ప్రయోగాలూ, మనం నిత్యం చూస్తున్నట్టివే. 'పవిత్రఅపవిత్రముల' గురించి మాట్లాడేవారు చెప్పాలి, పై పదాలలో వేటిని బట్టైనా పవిత్రతాపవిత్రతలను నిర్ణయించాలనిగాని, నిర్ణయించ వచ్చనిగాని అంటున్నారా?
అ నాకు తెలిసి, వీటిలో వేటిని బట్టీ ఒక్క వ్యక్తిని పవిత్రుడనిగానీ, అపవిత్రుడనిగాని నిర్ణయించవచ్చని చెప్పడం, అలా చేయడం, ఆ పై ఆ విధానాన్ని సమాజంలో అమలు చేయడం సాధ్యం కానేకాదు.
(1) వివేకమంటే వేరు చేసి చూడగల అవగాహనా సామర్ధ్యం అని అర్ధం. 'విచక్షణాశక్తి' అన్నది దానికి పర్యాయ పదం. అట్టి జ్ఞాన సామర్ధ్యం (మేధాశక్తి) లేకపోవడాన్నే అవివేకం అనంటారు. యుక్తా యుక్తాలు అర్హతానర్హతలు, నిత్యానిత్యాలు, సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతులు, సబబు బేసబబులు, లాభాలాభాలు, జయాపజయాలు, మానావమానాలు ఇలాంటి, రెండు విధాలుగ ఉండగల వాటి విషయంలో, ఆయా సందర్భాలలో సరైన రీతిలో వాటిని వేరు చేయగల మేథోసామర్ధ్యాన్నే వివేకమంటారు.
ఈ సామర్ధ్యం ఉన్నవాణ్ణి పవిత్రుడందామా? అదికుదరదు. ఎందుకంటే తప్పొప్పులు తెలిసీ తప్పులు చేస్తుండేవారిని లోకంలో ఎంతో మందిని చూస్తున్నాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మన మన జీవితాలలో ప్రతి ఒక్కరం ఏదో విషయంలోనైనా తెలిసి తప్పుచేసిన, చేస్తున్న వారమేనన్నది ఆత్మ విమర్శ చేసుకుంటే కనపడేనిజమే.
ఆ అనుభవం నుండే ''తప్పులెన్నువారు తండోపతండంబు. ఉర్విజనుల కెల్ల ఉండు తప్పు'' అన్న నానుడి వచ్చింది.
(2) సాధకుడు :- ఏదో ఒక సాధ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దానిని చేరడానికి పూనికతో యత్నించే వాడిని సాధకుడు అనంటారు. విహిత సాధ్యులు, అవిహిత (నిషిద్ధ) సాధ్యులు ఉండేవీలుంది కనుక అనుకున్నది సాధించే మొండితనాన్ని (దృఢవైఖరిని) చూపి పవిత్రతంటే అదేననడం కుదరదుకదా!
ఇలాగనక పై మాటలు వర్తించే సందర్భాలను విచారించి చూస్తే, వాటిలో వేటిని బట్టీ పవిత్రతంటే ఇది అనిగాని, దీనిని బట్టే వీడు పవిత్రుడనిగాని అనడం సాధ్యపడదు అని తేలుతుంది.
శంకర విజయంలో ఆదిశంకరాచార్యుని గురించిన ఒక ఘట్టం వ్రాయబడి ఉంది. మనీషాపంచకం పేరున ప్రశస్తమై ఉందది.
ఒక చండాలుడు ఎదురొస్తాడు శంకరునికి. చండాలుడా ప్రక్కకు తొలగు అని కసురుకుంటాడు శంకరుడు. అయ్యా తొలగమంటోంది దేహాన్నా, ఆత్మనా? అని అడిగి, దేహమైతే, నీదీ, నాదీ పాంచ భౌతికమేకదా? రెంటికీ తేడాలేదుకదా? అనీ, మరి ఆత్మనైతే అది అంటేది, ముట్టేది కాదు, పైగా అంతటా ఉన్నదీను. కనుక తొలగు తొలగనడం అనవసరంకదా, అని తిరిగి ప్రశ్నించినట్లు ఉందా ఘటనకు చెందిన వివరాలలో. దాంతో శంకరునికి వివేకోదయమై, చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ' అని పలికినట్లు ఆప్రకరణ ముగింపు.
మనీషావంతుడు చండాలుడైనా, ద్విజుడైనా నాకు గురుతుల్యుడేనని ఆ మాటకు అర్ధం. ఇంతా చేసి శంకరుడు ఏమితేల్చినట్లు? మనీషావంతుడంటే జ్ఞానం కలిగినవాడనేనా? ఇంకేమైనానా? జ్ఞానం కలిగిన వాణ్ణి జ్ఞానిగా చూడకుండా జ్ఞాని చండాలుడైనా, బ్రాహ్మడైనా అని ఎందుకంటున్నట్లు? నిజానికా సందర్భంలో సరైన వివేకం కలగడమంటే, చండాలుడూ లేడు, ద్విజుడూ లేడు. ఉన్నది మనిషే. అందునా, జ్ఞానవంతుడైన మనిషి, జ్ఞాన శూన్యుడైన మనిషి అన్నదే ఉన్న తేడా అంతా అని కదా అనుండాలి. కనుక శంకర విజయం రచనా కాలానికే కులాల గబ్బు ఉందన్నమాట.
అ దాన్నలా ఉంచి, ఇంతకూ ఈ సందర్బాన్నేమైనా మన విచారణీయాంశమైన పవిత్రాపవిత్రతలకు అన్వయించడం కుదురుతుందా? నాకు తెలిసినంతలో అలాంటి అన్వయం కుదరదు గాక కుదరదు.
'భగవద్గీత'ను తీసుకుంటే (గీత అనడంకంటే వ్యాసుని ఆలోచనా ధోరణిని తీసుకుంటే అననడం మరింత సరైన మాట) మొదటి అధ్యాయంలో అర్జునుని మాటలుగ స్త్రీలు దుష్టులైతే వర్ణ సంకరం జరుగుతుంది. అది నరకకారణము, కుల నాశనకరము అని చెప్పి, ఆ తరువాత అధ్యాయంలో విచారించదగని వానిని గురించి అతిగా విచారిస్తున్నావు. మాటలు మాత్రం ప్రజ్ఞావంతుల మాటలవలె చెపుతున్నావు అని ఒక రకంగా ఆ పక్షాన్ని పూర్వ పక్షంగా చూపుతాడు.
మళ్ళీ గీతలో వ్యాసుడే, కృష్ణుని మాటలుగ ; చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణకర్మ విభాగశః)
తస్య కర్తారమపి విద్య కర్తారమవ్యయం|| అంటాడు, అంటే
నాలుగు వర్ణాలు; గుణాల, కర్మల తీరుననుసరించి సృష్టింపబడ్డాయి. అందుకు ఆ విభజన చేసిన వానిగా నేను కర్తనే అయినప్పటికి, నిజానికి ఆ గుణాలు, కర్మలు, వారువారు కలిగుండడానికి తాను కర్తను కాదు గనుక తనను అకర్తగనే తెలుసుకోమంటాడు. ఒకింత విచారిస్తే వాక్య నిర్మాణంలో, వాడిన పదాలలోని రీతి వలన కొంత గందరగోళముందిక్కడ అని తేలుతుంది. గ్రంథకర్త హృదయాన్ని సూటిగా నిక్కచ్చిగా పట్టుకోవడానికి కష్టంగా ఉందిక్కడ. ఎలాగంటే,
కృష్ణుడు లేదా దేవుడు సృష్టించానంటున్నది నాలుగు వర్ణాలన్నవాటినా? నాలుగు వర్ణస్తులనా? ఈ రెండు ఏర్పాట్లకు చాలా వ్యత్యాసముంది. నాలుగు వర్ణాలను సృష్టించడమంటే, అదీ గుణకర్మలననుసరించి అనంటే, ఈ గుణాలు, ఈ కర్మలు బ్రాహ్మణ వర్ణానికి చెందినవి. అట్టివి కలవారంతా ఆ జాబితాలోకి (ఆ శీర్షిక క్రిందికి) వస్తారు అని చెప్పినట్లు. కనుక ఇప్పుడు మన కెదురవుతున్న వ్యక్తి (మనిషి) ఏ వర్ణం వాడో నిర్ణయించాలంటే అతడు బ్రాహ్మణాది వర్ణాలకు వర్తింపజేసిన వాటిలో, ఏ వర్ణానికి తగ్గ గుణక్రియలు కలవాడో చూసి, దానిని బట్టి ఆ వ్యక్తిఫలాన వర్ణస్తుడు అని చెప్పాల్సి ఉంటుంది. మిత్రులారా ! విషయం అర్థమవుతోందా? ఆచరణలో ఈ విధానం....
ఎ) పుట్టుక చేత వర్ణాన్ని తిరస్కరిస్తుంది.
బి) పుట్టినాకను ఒకే వర్ణంలో చనిపోయేంతవరకు ఉండి తీరాలన్న నియమం లేదంటుంది.
సి) ఒకే కుటుంబంలో నాలుగు వర్ణాల వారుండవచ్చంటుంది.
డి) ఒకే వ్యక్తి నాలుగు వర్ణాలలోనూ పరిభ్రమిస్తుండవచ్చననీ అంటుంది.
గమనిక : ఈ శ్లోకంలోనూ, ఇతరత్రా ఉన్న ఇలాంటి శ్లోకాలలోనూ, ఎవరర్ధం వారు గుంజుకునే అవకాశం ఉంది గనుకనే వర్ణ వ్యవస్ధను వివరించడానికి పూనుకున్న అనేకులు అనేక రకాల వ్యాఖ్యానాలు చేసి దీని విషయంలో మరింత గందరగోళాన్ని సృష్టించారు.
విభాగం చేసిందినేనేనయినా వ్యక్తులు ఆయా వర్ణాలలో జన్మించడానికి నేను కర్తను కాదు గనుక, ఎవరి గుణ కర్మ స్వభావాలకు వారే కర్తలు గనుక, వారు వారా వర్ణాలకు చెందడానికి వారి వారి గుణకర్మలే కారణంగనుక ఆయా వర్ణాలను పొందడానికాయాజీవులే కర్తలవుతున్నారు. అన్నది శ్లోకం నుండి వస్తున్న - రాబట్ట గలిగిన - మరో భావన. జన్మాంతరాలను గీత అంగీకరిస్తుంది గనుక, ఆయా జన్మలను వారి వారి గుణ కర్మలననుసరించే జీవులు పొందుతుంటారని అంగీకరించినట్లవుతోంది. అర్జునా నీవు క్షత్రియుడవు. నీకు యుద్ధం స్వధర్మమే అవుతుంది అన్నమాటలు గానీ, అస్త్ర విద్యా ప్రదర్శన సందర్భంలో అర్జునుడు క్షత్రియుడు, నీ కులమేమిటి? అని ద్రోణుని చేత కర్ణుని ప్రశ్నింపజేయడం గానీ చూస్తే, వ్యాసునికి ఖచ్చితంగా తనదైన నిర్ణయం లేదేమోనన్న అభిప్రాయం కలుగుతుంది.
ఈనాడు మనం గొల్లలను (యాదవులను) శూద్రుల క్రిందనే జమకడతాం. కాని యాదవులు రాజులుగ చెలామణి అయిన దాఖలాలు చరిత్రలో ఉన్నై. రాజులు వేరు క్షత్రియులు వేరు అన్న అభిప్రాయం కలుగుతుంది వాటన్నింటినీ పరికిస్తే. అదలా ఉంచి చాతుర్వర్ణాలకు చెప్పబడ్డ వృత్తులను-పనులను బట్టి చూస్తే; కృషి గోరక్ష, వాణిజ్యం అన్న మూడు వైశ్య వర్ణానికి స్వభావజకర్మలు అవుతున్నాయి. ఆ లెఖ్ఖన కృష్ణాదులు - యాదవులు - వైశ్య వర్ణం క్రిందికి రావాలి.
అటు రామాయణంలోకి తొంగి చూసినా రావణుడు క్షత్రియుడా? బ్రాహ్మడా? అన్న మీమాంస కలుగుతుంది. రావణుడు రాజేనన్నంత వరకు ఎవ్వరికీ సందిగ్థత లేదు. చరిత్ర నవలోకించినా నాలుగు వర్ణాలవారూ రాజ్యాలేలినట్లు, రాజులైనట్లు విస్తారమైన ఆధారాలు దొరుకుతై. ఛత్రపతి శివాజీని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేయాల్సిన సందర్భంలో బ్రాహ్మణ వర్ణం వేదోక్తంగా అతనికి పట్టాభిషిక్తుని చేయము, అతడు క్షత్రియుడు కాదు గనుక అని అభ్యంతర పెట్టడం ఒక చారిత్రక వాస్తవమే కదా!.
రామాయణంలోనూ, ఒక సందర్భంలో పరశురాముడు 21 మార్లు క్షత్రియవధ చేశాక, ఇహకలోకంలో క్షత్రియుడెక్కడున్నాడు, బ్రాహ్మణ బీజానికి జన్మించినవారే ఈ నాటి క్షత్రియులంతా అన్న ఒక వాదం కనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వర్ణాల పుట్టుపూర్వోత్తరాలకుగానీ, కులాల పుట్టు పూర్వోత్తరాలకుగాని వాస్తవమన దగ్గ - సర్వామోదం పొందిన - సమాచార మేదీ లేదు. మొత్తం సాహిత్యాన్ని కుప్ప బోసి చూస్తే ఇదిగో ఇలాంటి విభాగాలు తేలతాయి. విూరూ పరికించండి.
1) పుట్టుకతోనే కులం సంక్రమిస్తుంది. అది చనిపోయేవరకు ఉంటుంది. ఏ కులంలోనైనా ఉత్తమాధములు ఉండవచ్చు.
2) పుట్టుకతో కులం సంక్రమించినా, విశేష పరిశ్రమ చేత క్రమంగా ఉన్నత వర్ణాలలోకీ, నిమ్నవర్ణాలలోకీ కూడా వ్యక్తి చేరవచ్చు.
3) పుట్టుకతో అందరూ శూద్రులే (జన్మనాజాయతే శూద్రః) వారి వారి కర్మలననుసరించి క్రమంగా ఆయా వర్ణాలకు చెందుతారు.
4) ఆయా వర్ణాల వారు వర్ణాంతరాలలోని వారిని కూడి సంతానాన్ని కంటే, ఆ పుట్టినవారు కొన్నిసార్లు తండ్రివర్ణానికీ, ఇంకొన్ని సార్లు తల్లి వర్ణానికీ, మరికొన్నిసార్లు రెండూగాని, సంకరవర్ణాలకు చెందుతారు.
5) మొదట్లో వర్ణాలు లేవు. అనంతర కాలంలో వర్ణాలు, కులాలు ఏర్పడ్డాయి.
6) వివిధ రకాల జన్మ వృత్తాంతం కలవారూ, స్త్రీలు కూడా వేద మంత్రద్రష్టలుగ పేర్కొనబడ్డారు.
7) పూర్వం స్త్రీలకూ ఉపనయన సంస్కారము, యజ్ఞోపవీత ధారణము ఉండేది. ఉపనీతులు ద్విజులవుతారు.
8) ద్విజత్వం (ద్విజుడంటే బ్రాహ్మడని కాదు. ఉపనయన సంస్కారం పొందినవాడనే) బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకే.
9) మహాత్ముల పుట్టుకను అడగకూడదు. (అవెంత గంద్రగోళంగా ఉంటాయోనన్నది వజ్ర సూచికోపనిషత్తులో ఉంది)
వివిధ కాలాలతో ఏర్పడు హైందవం పేరున పిలవబడుతున్న, సాహిత్యాన్నంతటినీ తరచి చూస్తే కులాలకు వర్ణాలకు చెందిన పై సాధారణాభిప్రాయాల లాంటివెన్నో బైటపడతాయి. ఇందులో వేటిని ఇష్టపడేవాళ్ళు వాటిని పట్టుకుని ప్రాకులాడుతుంటారు. పోట్లాడుతునూ ఉంటారు.
ప్రశ్న :- గ్రంథాలలో ఇన్ని రీతుల సమాచారం ఉన్నా వాస్తవంలో అమలైందేమిటి? ఈ నాటికీ అమలవుతున్నదేమిటి? ఈనాటి భారత రాజ్యాంగం కూడా దేనిని పరిగణనలోనికి తీసుకుంది? ఈ అంశమే మన విచారణంతటికీ, ఇప్పుడు తీసుకోవలసిన నిర్ణయాలకూ ప్రాతిపదిక అవుతుంది.
సమా :- సమాధానం మనందరికీ తెలిసి ఉన్నదే. 'పుట్టుకనుబట్టే కులం' అన్నదే అమలయ్యేదన్నదే ఆ సమాధానం. గుణ కర్మలను బట్టే కులం (వర్గం) అన్నది వాస్తవంలో ఏనాడూ అమలు కాలేదు. అమలుచేయడం సాధ్యమూకాదు. మనుధర్మశాస్త్రంగా చెప్పబడుతున్న దానిలోని కులాలకథే సమాజంలో అమలవుతూ వచ్చింది. అప్పుడపుడు దానికి ప్రతికూల యత్నాలు కొన్ని జరిగినా, అవన్నీ మినహాయింపు ఘటనలే గాని, సామాజిక సాధారణ వ్యవహారమంతా పుట్టుకతో కులాలు అన్నదే. అందునా మొదటి మూడు కులాలే స్థిరమైన పరిధులలో ఉన్నాయి. నాల్గవదైన శూద్రకులమంటూ ఒకటి లేకుండా పోయింది. కడమ కులాలన్నీ శూద్ర సమూహం క్రింద చెప్పబడ్డాయి. అందులో మళ్ళీ కొన్ని కులాలు అగ్రకులాలుగ, కొన్ని నిమ్న కులాలుగ పరిగణింపబడుతూ వచ్చాయి. వీరికవతలి వారిని, అతిశూద్రులన్నారు. శూద్రులకు మల్లేనే అతిశూద్రులన్న ఒక కులం కూడా ఎక్కడాలేదు. అతి శూద్రుల క్షేత్రంలోనూ అనేక అధమకులాలనబడేవారున్నారు. ఏవేని రెండు కులాల వారి మధ్య లైంగిక సంబంధమేర్పడి పుట్టిన వారిని సంకరులన్నారు. అవీ అనేకంగా చెప్పబడ్డాయి.
(సమాజంలో ఈనాటికి కులాలు కుదురుకున్నతీరు)
శూద్రులలోనే వ్యవసాయము (పాడిపంటలు, తత్సంబంధ వ్యాపారము) ప్రధాన వృత్తిగ కమ్మ, రెడ్డి, తెలగ (కాపు) కులాలు మనుగడసాగించడంతో ఆర్థికంగా ఆ మూడు కులాలు క్రమంగా బలం పుంజుకున్నాయి. బ్రాహ్మడు బ్రాహ్మడిగనే ఉన్నాడు, అతడు కుల వృత్తికే పరిమితమైయ్యాడు, వైశ్యుడు సరుకులు అమ్ముకునేవానిగ ఉండి, స్థానిక వ్యాపారిగ స్థిరపడ్డాడు, క్షత్రియోచిత కర్మకు - వృత్తికి - ప్రతి గ్రామంలోనూ అవకాశం లేకపోవడంతో, రాజుల దగ్గర పోగుపడ్డారు క్షత్రియులు. - కనుకనే ప్రతి గ్రామంలో క్షత్రియులు లేకుండా పొయ్యారు. బలమైన కులాలుగ తీరి కూర్చున్న కమ్మ, రెడ్డి, వెలమలు ముగ్గురూ, రాజ్యాలు ఏర్పరచుకుని రాజులైయ్యారు. కులవ్యవస్థలో వీరు శూద్రులే అయినా సంపదలో బలం పుంజుకుని (భూస్వాములు, జమీందారులు, సామంతులు, రాజులు అన్నది ఈ రకం వారు ఎదిగిన క్రమం) క్రమంగా అగ్రవర్ణులుగ పేరు పొందారు. శూద్రులలోనే దిగువ శ్రేణి వారుగ చూడబడ్డవారు చాకలి, మంగలి, సాలి, కంసాలి కులాలు. ఈ నాలుగు కులాలవాళ్ళు ఊరంతటికీ ఉమ్మడి సేవకులు. వారికి బ్రతుకు దెరవుగా వార్షికంగా కుటుంబానికింత చొప్పున ('మిరాశి' అంటారు దానిని) ఇచ్చే ఏర్పాటు జరిగింది. కనుకనే ఈ కులాలు ఊరికి రెండు మూడు కుటుంబాలుగ పరిమితమయ్యాయి.
అతి శూద్రుల క్రిందికి మాల, మాదిగ, ఎరుకల, యానాది, కులాలు వచ్చినా, వడ్డెర, ఉప్పర కులాలు కూడా ఊరి వెలుపలి వాళ్ళుగనే చూడబడ్డారు. వీరికంటే క్రిందివారుగ చూడబడ్డ వారెందరో ఉన్నారు.
గొప్ప విషాదకరమూ, ప్రమాదకరము, అర్హతానర్హతల నిర్ణయించే సరైన విధానం లేనితనమూ కలబోసుకున్న వైఖరేమిటంటే, ఈ కుల వ్యవస్థలో బ్రాహ్మడుతక్క మిగిలిన వారంతా తాము కొందరి కంటే అధికులము, ఇంకొందరికంటే అల్పులము అని స్వచ్చందంగా నిర్ణయించుకుని జీవిస్తుండమే. యోచనాశీలురైన పాటకమిత్రులారా! నిజానికీ కుల వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాలను కూలంకషంగా విచారించడానికీ వివరణ చాలదు. అలాగే మన ప్రస్తుతాంశమైన 'పవిత్రత- అపవిత్ర' అన్న దానిని విచారించడానికి ఇంత మాత్రమైనా విచారణ అవసరం. కనుక ఈ వివరాలను ఇక్కడి కాపుదాం.
ఇందులో ఎవరిని పవిత్రుడందాము? దేనిని బట్టి పవిత్రుడందాము? అలాగే ఎవరిని, దేనినిబట్టిఅపవిత్రుడందాము?
ఇంతకూ 'పవిత్రత-అపవిత్రత'ల గురించి మాట్లాడేవాళ్ళు, ఆ మాటలకు ఏమి అర్ధాన్ని చెపుతారో తేలనేలేదుగదా! మరలాటప్పుడు ఆయా వ్యక్తులు పవిత్రులా? అపవిత్రులా? నిర్ణయించడం సాధ్యపడదుకదా! నా ఈ వాదనను కాదనడానికి హైందవ సాహిత్య మంతటిలోనూ సరైన, సమర్ధనీయమైన సమాధానం దొరకనే దొరకదు. మొత్తం సాహిత్యంలోనే ఇంతగా వివిదార్థాలతో, ఎవరిష్టం వచ్చిందానికి వాళ్ళు ముడిపెట్టి వాడుకున్న పదమే మరొకటి ఉండదేమో.
సాంప్రదాయకులు అభౌతికాలతో ముడిపెట్టీ ఈ పదాన్నివాడారు. (పవిత్రాత్మ, అపవిత్రాత్మ), భౌతికాలతో ముడిపెట్టీ ఈ పదాన్ని వాడారు. శరీరం పవిత్రమైనది, శరీరం అపవిత్రమైనది, పాదాలు పవిత్రమైనవి, అపవిత్రమైనవి. మనస్సు పవిత్రమైనది, అపవిత్రమైనది, భౌతికాలలోనూ రాయిరప్ప, చెట్టు, చేమ, జలము, అగ్ని వగైరా జడరూపాలకు, చరాచరాలకు, పవిత్రతను, అపవిత్రతను అంటగట్టారు.
ఏ పేరున చెప్పినా, ఒక మనిషి మరో మనిషిని అంటరాని వాడని తలంచడంకంటే తప్పుడు ఆలోచన, క్రూరమైన ఆలోచన ఇంకోటుండదు. బ్రాహ్మడు స్నానం చేయడు. దుమ్ముధూళిలో అపరిశుభ్రంగా ఉన్నాడు అనుకుందాం. అయినా అతడు పవిత్రుడే, నిమ్నవర్ణాలవారికి అంటరానివాడే. అదే మరి ఒక పంచముడు నిత్యం రెండుపూటలా స్నానం చేస్తాడు. మంచి బట్టలు ధరిస్తాడు. అయినా అతను మిగిలిన వర్ణాల వారికి అంటరాని వాడే పుటక చేతనే అపవిత్రత సంక్రమించి ఉందిగనుక.
ఒకడు శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నాడు. స్నాన శౌచాదుల విషయంలోనూ జాగ్రత్తగనే ఉన్నాడు. స్త్రీలోలత్వం ఉంది. అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగిఉన్నాడు. హైందవం అతణ్ణి పవిత్రుడంటుందా? అపవిత్రుడంటుందా?
ఒక స్త్రీ ధూళిదూసరిత వస్త్రాలతో ఉంది. స్నానం కూడా సరిగా చేయదు. లైంగిక పరంగా ఎట్టి సంబంధాలు కలిగిలేదు. ప్రాణం పోయినా శీలాన్ని కాపాడుకుంటుంది. ఆమె పవిత్రురాలవుతుందా? అపవిత్రురాలవుతుందా?
ఇలా వివిధ సంఘటనలు వివరించుకుంటూ పోతే దేనిని పవిత్రత అన్నారు? అనాలి? దేనిని అపవిత్రతఅనాలి? అన్నది పెద్ద చిక్కుముడిగా తయారవుతుంది. 'ఇదిగో సరైన సమాధానం' అనడానికి దారేదీ దొరకదు.
5 గురు భర్తలతో ఉన్న ద్రౌపదిని పవిత్రురాలు అనే అన్నారు. ఇంద్రుని కూడి అహల్య అపవిత్ర అయ్యిందన్నారు. రాముని స్పర్శతో మరల పవిత్ర అయ్యిందన్నారు. లంకలో సీత సం|| పాటు స్నానపానాదులను చేసిందా? చేయలేదా? (సరైన వివరాలు లేవు) శుచి, శుభ్రతల విషయంలో ఆమె ఎలా ఉండేది? మిధిలతోనో, అయోధ్యలోనో ఉన్నప్పటిలా మాత్రం ఉండి ఉండకపోవచ్చు. అయినా ఆమె పునీత, అతి పవిత్ర అని చెప్పబడింది.
మరో వంక గీత; స్త్రీలు, వైశ్యులు, శూద్రులూ పాపయోనులేనంటోది. (9-32) కనుక వారి జన్మతఃనే వారు అపవిత్రులనేనా? పాపయోనులైనా పవిత్రులు కావచ్చు. పుణ్యయోనులయ్యీ అపవిత్రులు కావచ్చు, అనేమైనా అంటారా?
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక పెద్ద గ్రంథానికి సరిపడినంత సమాచారం దొరుకుతుంది హైందవ సాహిత్యంలో. అయినా అంతటి సమాచారాన్నుండీ; ఇందువల్ల ఇతడు పవిత్రుడు, ఇందు వలన ఇతడు అపవిత్రుడు అని నిర్ధారించగల సాధారణ కొలమానం అంటూ ఎక్కడా లభించదు. అస్సలు భారతీయం అనదగ్గ సాహిత్యంలోనే ఒక విచిత్ర సంకట పరిస్ధితి ఉంది. అనేక థోరణుల సమాహారంగా కనిపిస్తుందది. కనుకనే దానిలో అత్యంత ఉదాత్తమైన భావనలతోపాటు, అత్యంత నికృష్టమైన భావనలవరకు చోటు చేసుకోగలిగాయి. అందులో ఎవరి గొడవ వాళ్ళదే. అయినప్పటికీ,
ఈ దేశంలో నాటి నుండి ఈనాటి వరకు, ఇక్కడ, మానవుల మధ్య అనుచితమైన అంతరాలే ప్రబలంగా అమలవుతూ వచ్చాయి. ఉదాత్తమైన భావనలు (అంగీకరించి, స్వీకరించదగిన భావనలు) చాల వరకు మాటలకే పరిమితమైపోయాయి. అదే మరి, ఏ రకంగానూ అంగీకరించకూడని పైగా అసమానతలను స్థిరీకరించడానికి ఉపయోగపడిన భావాలు మాత్రం చేతల వరకు సాగాయి. ఇంతవరకు గతం. ఇప్పుడు (ఆ గతంతోనూ ముడిపడే) వర్తమానంలో మనమున్నాం. ఇప్పటికైనా వర్తమాన సమాజం, గతం నుండి సంక్రమించిన పనికి మాలిన దాన్నంతటినీ విసర్జించి, విదిలించుకుని, ఊడగొట్టుకుని, అవసరమైన వాటినీ కూర్చుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి.
గతాన్ని తవ్వుకుంటూ అక్కడే కూర్చొవడం మృతజీవనంతో సమానం. అలాగని దాని నుండి గుణ పాఠాలు నేర్చుకోకుండా సాగుతుండడం కూడా అవివేకమనే అనాలి. నాకు తెలిసి మన రాజ్యాంగ నిర్మాతలూ ఈ వాస్తవాన్ని గుర్తించారు. కనుకనే. గతానికి చెందిన పనికి మాలిన వాటి అన్నింటి ప్రభావం నుండి బైటపడడానికి అవసరమైన ఎన్నో సూత్రీకరణలు చేసి, ఈ నాటి ధర్మశాస్త్రంగా దానిని మనకందించారా మహనీయులు.
1.ధర్మ సంబంధమంతా ఈలోకానికి సంబంధించిందేనన్నారు వాళ్ళు. ఇక్కడ చేసింది మరెప్పుడో ఎక్కడో లభిస్తుంది. పాప రూపంలోనో, పుణ్యరూపంలోనో అన్న ప్రమాదకర భావానికి స్వస్తి చెప్పారు. ఆ భావాన్ని తెలిపేదే మనది లౌకిక రాజ్యాంగమన్నమాట.
2) ఈ దేశ శాసనం క్రింద ఉండే ఎవరు ఎవరిపట్లగాని, మత, కుల, ప్రాంత, వర్గ, లింగ సంబంధంగా వివక్షలు చూపరాదు అని నిబంధన విధించారు.
3) అందరికీ విద్య అని ఊరుకోకుండా, నిర్భంధ ఉచిత విద్య నందించాలన్నంత వరకు దిశానిర్ధేశం చేశారు.
4) బానిస వ్యవస్థను రద్దు చేశారు.
5) అస్పృశ్యతను నిషేధించారు.
6) చట్టంముందు అందరూ సమానులేనన్నారు.
7) ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలన్నారు.
8) ఆర్థిక సమానత్వానికై నిరంతర కృషి జరగాలనీ, సంపదలో అందరికీ భాగస్వామ్యముండాలని అన్నారు.
9) అంతరాలు పాటించడం వల్ల ఏర్పడ్డ బలహీన వర్గాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి సమానత్వం సిద్ధించేంతవరకూ బలపరచాలన్నారు.
వేల సంవత్సరాలుగా ఎన్నడూ అమలవనిసమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుని, మానవీయ విలువలతో కూడిన ఎంతో మెరుగైన ధర్మశాస్త్రాన్ని మన పెద్దలు 60 ఏండ్లనాడు మనకందించారు. దాంతో పాటు మరింత ముందు చూపుతో; సమానత్వానికి, సమాన, సమగ్రాభివృద్ధికి సమైక్యతకు, అఖండతకు అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకుంటూ సాగండని మార్గోపదేశమూ చేశారు. అందుకవసరమైన వెసులుబాటునూ రాజ్యాంగం ద్వారా కల్పించారు. అందరూ సమానులేనన్న ఒకే ఒక్క సూత్రం - దేశ ప్రజలంతా అన్నదమ్ములేనన్న భావనను ప్రవేశపెట్టిన సూత్రం. గతానికి చెందిన కల్మషాన్నంతటినుండి సమాజాన్ని బైటపడవేయనుద్దేశించింది. నిజాయితీగా ఆచరిస్తే అంతపనీ చేయగలిగింది కూడా.
అయినా ఈ నాటికీ మనలో ఎక్కువ మంది ఆ గతానికి చెందిన కులమత పరమైన గబ్బునే తాము పూసుకుని, మరింత మందికీ పూసే పని చేస్తున్నారు. ఆ రొచ్చులో నుండి బైట పడకుండా, ఇతరుల్నీ బైటపడనీకుండా తెలిసీ తెలియకా కూడా, సమాజాన్ని కుదబడేస్తున్నారు. ఒకనాటి కులవ్యవస్ధలోని అగ్రవర్ణాలను ఒకింత వెనక్కి నెట్టేసి లేదా ప్రక్కనబెట్టి, కమ్మ, రెడ్డి, కాపు కులాలు అగ్రవర్ణాలుగ తీరికూచుని ఆర్ధికంగా, రాజకీయంగా, సాంఘికంగా కూడా ఆధిపత్యాన్ని చెలాయించగలుగుతున్నాయి. బ్రాహ్మణులీనాడు మాకు న్యాయం చేయండి అని అడగడం అక్కడకూడా కనపడుతోంది.
వెనకటి కాలాన ధర్మశాస్త్రాలే రకరకాల అంతరాలకు నారు, నీరు కూడా పోసి వాటిని పెంచిపోషించాయి. వేలసం|| పాటు, సమాజంలోని పెద్ద భాగం ఆ అమానుష విధి నిషేధాలకు బలైపోయింది. వాటన్నింటినీ కఠినంగా అమలు చేయడానికి రాజు, రాజరిక వ్యవస్థ పెద్దగా దోహదపడ్డాయి. ఈనాడు పరిస్థితి మారింది. అందరికీ విద్య అందుబాటులోకి వచ్చింది. ఆ నాటి ధర్మశాస్త్రాలలో గానీ, మత, తాత్విక సాహిత్యంలో గానీ ఆదరణీయాంశాలకంటే, నిరాదరణీయాంశాలే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయని అందరకు తెలిసిపోయింది. అంతేగాక వాటిలోని అమానుష క్రూరకర్మకాండలు కూడా నిమ్నవర్గాలు, స్త్రీల కొరకే ఏర్పరచబడ్డాయనీ తెలిసింది. దాంతో మనసున్న మనిషావంతులెందరో పట్టుబట్టి సమాజాన్ని ఆనాటి ధర్మశాస్త్రాల, ముఖ్యంగా మను ధర్మశాస్త్ర కదంబహస్తాల నుండి బైట పడవేయడానికి యత్నించారు. దారికితోడు పరాయిపాలన, అందులో ఆంగ్లేయుల వల్ల ఈదేశీయులకు జరిగిన హింస, అవమానాలూ అగ్నికి ఆజ్యం పోసినట్లేౖ మొత్తం వ్యవస్థ మార్పుకూ పెద్ద ఉద్యమమే పుట్టి ఊపందుకుంది. ఈ రెండు రకాల అణచివేతలకు పరిష్కారంగా నూతన రాజ్యాంగాన్ని - ఆధునిక భారత స్మృతిని నిర్మించి మనకందించారు మన పెద్దలు. అది ఏర్పడి ఇప్పటికి 65 ఏండ్లు గడచింది.
ఒకనాడు సమానత్వా కాంక్షగానీ, దానినమలు చేసుకునే అవకాశాలుగాని లేక బలైయ్యాం. ఈనాడు అందుకవసరమైన మౌలిక సదుపాయాలన్నీఉండీ, సమానత్వంతో కూడిన సమష్టి అభివృద్ధిని సాధించుకోలేకపోతున్నాం. ఎంతటి విషాదమిది.
అ ఈనాటి రాజ్యాంగం ప్రకారం భారతదేశం..
1) సార్వభౌమికమైనది అంటే ఈ దేశపు మరియు పరాయిదేశపు వ్యక్తుల ఆధిపత్యం ప్రజలపై లేదంటున్నది.
2) లౌకిక రూపమైనది అంటే మరణానంతర వ్యవహారాలతో, పుట్టుకకు పూర్వపు అంశాలతో, తనకు ప్రమేయం లేదంటున్నది. విధి నిషేదాలన్నీ ఈ లోకానికి చెందినవేనంటుంది.
3) సమాజవాద పద్ధతి : ఆర్ధిక సమానత్వం, (సంపదపై ఉమ్మడి భాగస్వామ్య హక్కు, అన్న వాటిని ప్రజలందరకూ అందేలా) నెలకొల్పాలని అందుకు తగిన హక్కులు, విధులను విధిస్తోంది.
4) ప్రజాస్వామ్య పద్ధతి : సమాజస్థితిగతులకు ప్రజలే యజమానులు, సొంతదారులు. నిర్ణయాధికారం ప్రజలది, పర్యవేక్షణాధికారమూ ప్రజలదే. వ్యవస్థ నిర్వహణకై ఏర్పడ్డ ప్రభుత్వాలు, ఉద్యోగులు, వారి అధికారాలు అన్నీ ప్రజలు వారికి సంక్రమింప జేసినవేనంటోంది.
5) ఎన్నికలు : ప్రజలు తమతరపున వ్యవస్ధను నిర్వహించడానికై ప్రతినిధుల నెంచుకునే ప్రక్రియ ఇది. తమకు ప్రతినిధులుగ, తమ కొరకు తమ అభిమతానుసారం పనిచేయగలవారిని ఎంపిక చేసుకోవడం కొరకు ఏర్పరచుకున్నదీ, అధికారాన్ని కేంద్రీ కృతం కాకుండా, వికేంద్రీకరించుకోడానికి రూపొందించుకున్నదే ఇది.
6) స్థానిక ప్రభుత్వాలు : ప్రజాస్వామ్యం అమలై, పెత్తందారీ వ్యవస్ధ రద్దు కావాలంటే ఉన్న ఒకే ఒక్క విధానం, అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజాసదస్సులు చైతన్యవంతంగా జరుగుతుండడమన్నదే. ఈ 5,6 అంశాలలో కీలక పాత్రధారులు-నిర్ణయాధికారం కలవారు ప్రజలే. ప్రజలు అవగాహన, విచక్షణ కలవారైతే ఎన్నికలు సక్రమంగా జరుగుతై. అధికారంలోకి యోగ్యులు వస్తారు. అధికారం విభజింపబడుతుంది. ప్రజా సభల ద్వారా ప్రజలే నిర్ణయాలు చేస్తూ, జరుగుతున్న దానిని పర్యవేక్షిస్తూ రాజ్యాంగాన్ని అమలు చేసుకోగలుగుతుంటారు. గత 65 ఏండ్లుగా ఇది జరగలేదు. జరక్కపోవడానికి మూలకారణాలు రెండు.
1) ప్రభుత్వం ప్రజల్ని అవగాహనాపరుల్నిగా చేయడానికి ఏ మాత్రం కృషి సల్పలేదు. కానీ ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం చెబుతోంది.
2) అవగాహనారహితులైన ప్రజలు, అనర్హుల్ని, స్వార్ధపరుల్ని, గుడ్డిగా లేదా రకరకాల ప్రలోభాలకు లొంగి, ఎంపిక చేసి అధికారాలప్పగిస్తూ వచ్చారు.
ఈ రెండు కారణాల వల్లనే ఆధునిక రాజ్యాంగం అమలవలేదు. పాత ధర్మశాస్త్రాల, మతాల పట్టూ సడలలేదు. ఈనాటికీ బ్రాహ్మడు తాను పుటక చేతనే అధికుణ్ణి, పవిత్రుణ్ణి అనుకుంటున్నాడు. నిమ్నకులాలవారిని అపవిత్రులు, అల్పులు అని తలుస్తున్నాడు. మిగిలిన జనంలోనూ అవే భావాలు అంతరాంతరాలలో సజీవంగానే ఉండి, ఆలోచనలపైనా, ప్రవర్తనపైనా ప్రభావాన్ని ప్రసరింపజేస్తూనే ఉన్నాయి.
ఈ దుర్మార్గమంతటికీ బలమైన కారణం 'పవిత్రత - అపవిత్రత' అన్న భావనలే. నిజానికి మనుషులలోగానీ, మిగిలిన ప్రకృతిలోగాని పవిత్రము, అపవిత్రము అనడానికి తగినదంటూ ఏమీలేదు. ఉన్నదంతా జ్ఞానపరంగా సత్యాసత్యాలు, కర్మపరంగా ధర్మాధర్మాలు మాత్రమే, మంచి చెడు, తప్పుఒప్పు, నీతి అవినీతి, న్యాయము, అన్యాయము లన్నవి మాత్రమే. పుట్టుకతోనే నిమ్నాధిక్యతలు ఏర్పడతాయన్నది క్రూరమైన స్వభావులు సృష్టించిన తప్పు భావన మాత్రమే. పవిత్రము అపవిత్రము, పవిత్రులు-అపవిత్రులు అన్న పదాలు భాషలో పుట్టి ఉండకుండా ఉంటే ఈ దేశంలోనేకాదు, ప్రపంచ మానవ సమాజంలోనే ఇంతటి అమానుష అంతరాలు నెలకొనకపొయ్యేవి. ఈ నాటికైనా ఆ రెండు పదాలు దానివెనకున్న అవాస్తవిక భావనలు సమాజం నుండి తీసి వేయగలగాలి. ఆధునిక ధర్మశాస్త్రాన్ని అమలు చేసుకోవడమే ఈనాటి సమాజమ్ముందున్న ఏకైక కర్తవ్యము. సంఘహితైషులందరూ ఒక్కటై ఆ దిశగా ప్రజల్ని మేలుకొల్పి, అవగాహనా పరుల్ని చేయవలసి ఉంది.
ప్రభుత్వపు ప్రధమ కర్తవ్యమైన ప్రజల్ని అవగాహనాపరుల్ని చేయడమన్న దానికై ప్రభుత్వం పైనా వత్తిడి తేవలసిఉంది.
మత ధర్మ శాస్త్రాలు మనకొద్దు. మన ధర్మశాస్త్రమే -
భారత రాజ్యాంగమే మనకుముద్దు.
No comments:
Post a Comment