Sunday, April 1, 2012

బైబిలు దైవగ్రంథమా ? అందులో చెప్పబడ్డ దేవుడున్నాడా ? - 2


యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

వివిధ మత మరియు తాత్విక సిద్ధాంతాలలో తగినంత అభినివేశం (పరిచయము, పట్టు) ఉండి, వాటిలో ప్రకటింపబడ్డ భావజాలపు సబబు బేసబబుల్ని, సబబైనరీతిలో విభజించిచూడాలన్న దృష్టి ఉన్నవాళ్ళకు కొద్దికాలం ధారావాహికగా వెలువడే ఈ శీర్షికాంశం, మెదడుకు మేతను, వివేచనకు పదునునూ, అవగాహనలో విస్తారాన్ని, గాఢతను కలిగించగలదనే అనుకుంటున్నాను. ఒక్క బైబిలు పక్షానికేగాక ఇతర ఆస్తిక పక్షాలతో సంబంధపడి ఉన్న అనుకూల, ప్రతికూలధోరణులవారికీ, అనుకూల ప్రతికూల వైఖరిని అనుసరించకనే తులనాత్మక అధ్యయనం చేయాలన్న అభిలాష కలవారికీ కూడా ఈ శీర్షిక క్రింద క్రమంగా ప్రకటింపబడే వివిధాభిప్రాయాలు ఎంతో కొంత ఉపయోగపడతాయనే అనుకుంటున్నాను. కనుక ఇప్పటికి మీరే పక్షం వైపు నిలబడిఉన్నా, 'సబబుబేసబబుల విచారణ' అన్న దృష్ఠితో దీనిని క్రమంతప్పకుండా పరిశీలించవలసిందిగనూ, వ్యక్తిగత విమర్శలకు దిగకుండా విషయపరమైనంత వరకు విమర్శలనుగానీ, విూమీ అనుకూల, ప్రతికూల పక్షాలనుగానీ, నలుగురకూ ఉపయోగపడగలవనిపించే సలహాలు, సూచనలను గానీ పంపేందుకు సిద్ధమై ఈ విచారణలో పాలుపంచుకోవలసిందిగా ఆహ్వానించుచున్నాను.

గతమాసం, వివేకపథం - 185 సంచికలో, ప్రధానంగా - పి.డి. సుందర్రావు గారి మాటలను దృష్టిలో పెట్టుకుని, ఆయా ప్రసంగాలలో వారు మాట్లాడిన మాటలను, వాటిననుసరించి నేను చెప్పదలచుకున్న అభిప్రాయాలను ప్రచురించాను. అందులోనే చివరగా, పి.డి. సుందర్రావుగారి నుద్ధేశిస్తూ ఒక బహిరంగ ప్రకటనా చేశాను. అందులోనే ఈ ప్రకటన ఆయనకేగాక సత్యస్థాపనోద్దతులందరకూ వర్తిస్తుందనీ, ఎవరైనా స్పందించవచ్చనీ కూడా తెలియజేశాను. ఆనా మాటలకర్థం, బైబిలు మతస్థులకేగాక, హిందూ, క్రైస్తవ మతస్థులకూ ఆనా ప్రకటన వర్తిస్తుందని అలాగే 'దేవుడున్నాడు. ఫలానా దేవుడే అసలైన దేవుడు' అనదలచుకున్న వాళ్ళందరకూ వర్తిస్తుందని. దేవుడనేవానికి సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్వము అన్న రెండు సామర్థ్యాలు అవశ్యం ఉండాలి. అన్న అభిప్రాయాన్నంగీకరించే వాళ్ళే నా ఈ ప్రకటన పరిధిలోనికి వస్తారు. దేవునికి సృష్టికర్తుత్వము, ప్రళయానంతరాస్థిత్వము ఉంటాయనీ అంగీకరించే వాటినే ఆస్థిక సిద్ధాంతాలనంటారు. కనుక నా ఈ ప్రకటన పరిధిలోకి రాదలచుకున్న ఆస్థిక పక్షాలవాళ్ళు, తమ దేవుడు సృష్టి ఆరంభానికి ముందు, ప్రళయానికి పిదపకూడా ఉంటాడని అంగీకరించాలి. దాంతో పాటు సృష్టి ఆరంభానికి ముందాయన ఏమి చేస్తుండేవాడు? సృష్టి అంతం అయ్యాక అతడేమిచేస్తుంటాడు, సృష్టిలో అతని పాత్రేమిటి? అన్నదీ ఇదమిద్దంగా ప్రకటింపబడాలి. లేకుంటే ఆస్థిక పక్షీయులు చెప్పే దేవుని సాధారణ స్వరూప స్వభావాల ప్రతిపాదనే అసంపూర్ణంగా ఉన్నట్లు ప్రతిపాదనే నిర్థిష్టరూపంలో ప్రకటింపబడకుండా యోగ్యమైన స్థాయిలో చర్చగాని, విచారణగానీ, ఆరంభించడమే కుదరదు. అలాంటప్పుడు నిర్ధారించడమన్న పనితో అవసరమే ఉండదుకదా! ఈ సందర్భంలో మనందరకూ వర్తించే ఒక సర్వ సాధారణ (పరసామాన్యంఅనదగ్గ) సూత్రాన్నొకదాన్ని గుర్తు చేస్తాను. అది అలాటిదేనోకాదో మీరూ పరిశీలించి చూడండి. 

ఏదైనా ఒకటి ఉనికిలో ఉండనాలన్నా, లేదనాలన్నా, మొదట, (1) అదంటే ఏమిటి? (2) ఏక్కడుంది? (3) ఎప్పుడుంది? (4) ఎంతుంది? (5) ఎలా ఉంది? (6) దాని గుణగణాలేమిటి? (7) దాని క్రియలేమిటి? అన్న విషయాల వివరం తెలిసుండాలి. ఇక దేవుని విషయంలోనైతే అదనంగా (8) అతనితో మనకున్న సంబంధమేమిటి? అతనవసరం మనకు గానీ, మనవసరం అతనికిగానీ ఏముంది? అన్నదీ తెలియాల్సి ఉంటుంది.

ఈ సందర్భంలోనే ఆస్థికులూ, నాస్థికులూ కూడా అంటే దేవుడున్నాడనిగాని లేడనిగాని అనదలచుకున్న వాళ్ళిరువురూ తాము ఉన్నాడంటున్న, లేదా లేడంటున్న దేవుని వివరాలు ముందు చెప్పి, అదిగో అలాంటి దేవుడు ఉన్నాడనో, లెడనో చెప్పాల్సి ఉంటుంది. ఈ సూత్రాన్ని లేదా నియమాన్ని - గనక పరిగణనలోకి తీసుకోకుంటే, అట్టి వారనీ ఉన్నాడన్న మాటకుగానీ లేడన్న మాటకుగానీ విలువేమి ఉండదు. ఆస్థిక, నాస్థిక విచారణలో ఇదెంతో కీలకమైన విషయము.

నా దృష్టికి వచ్చిన కొన్ని చర్చా వేదికలు - వాటి తీరు తెన్నులు

1) ఇస్లామిక్‌ రిసెర్చి పౌండేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌) వారు విడుదల చేసిన సి.డిలు

2) అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌గారు, ఇమ్రాన్‌ల మధ్య జరిగిన చర్చ సి.డి

3) పి.డి. సుందరావుగారు ఏర్పరచానంటున్న వేదికల గురించి సుందర్రావుగారి ప్రసంగాలున్న సి.డి.లు

4) రంజిత్‌ ఓఫిర్‌గారే విడుదల చేసిన పి.డి. సుందర్రావు గారికి సవాలు ప్రసంగపు సి.డి.

5) అసీపుద్దీన్‌ గారికి నాకు మధ్య జరిగిన సంభాషణలో చర్చావేదిక నియమాలంటూ ఆయనన్నవి.

6) వివిధ ధోరణుల ప్రతినిధులు అక్కడక్కడా ఏర్పరచిన సిద్ధాంత చర్చల వివరాలు కనడం ద్వారా, వినడం ద్వారా నాకందినవి ఉదా : గోరా - చిన్మయానందల మధ్య 'గాడ్‌ఈజ్‌డెడ్‌' అన్న అంశం పై జరిగిన చర్చ జాకీర్‌ నాయక్‌కు, ఒక క్రైస్తవ పండితునికి జరిగిన చర్చ మొ||నవి.

వీటన్నింటిలోనూ దాదాపు ఒకే రక మనదగ్గ నిబంధనల్ని అనుసరించారావేదిక నిర్వాహకులు, అవేమంటే ...

1. ఎ. ముందుగా ఒకరు ఒక నిర్ణీత సమయం (సుమారు 45 నిముషాలు) తన పక్షాన్ని ప్రతిపాదిస్తారు. అటుపైన రెండోవారూ అంతే సమయం తన ప్రసంగం చేస్తారు.

బి. మరో సారి మొదటాయన మరో 15 నిముషాలు ప్రసంగిస్తాడు, ఆపైన రెండో వ్యక్తీ అలానే ప్రసంగిస్తాడు.

2. నిర్వాహకుడు ఇప్పుడిక ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అని ప్రకటించి దానికెంత సమయముంటుందో చెపుతాడు.

ఎ. సభను ప్రశ్నలు అడగమంటారు. సమాధానాలు చెప్పే స్థానంలో ఉన్న ప్రసంగీకుడు నిర్ణీత సమయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతాడు. రెండో ప్రసంగీకునికీ ఇలాటి అవకాశమే ఇవ్వబడుతుంది. ఇది సుమారు చెరి 15 నిముషాలు ఉంటుంది.

3. ఆఖరున చెరి 5 లేక 10 నిముషాలు ఇద్దరు వక్తలు మాట్లాడతారు. లేదా నిర్వాహకుడు ముగింపు ప్రసంగం చేస్తాడు.

4. ఎక్కువలో ఎక్కువసార్లు ఈ సమావేశాల నిర్వాహకులు, నిర్ణీతలు శ్రోతలేనని ప్రకటిస్తుంటారు.

ముఖ్యగమనిక :- ఇలాంటి సదస్సులు సత్యాసత్యవివేచనకు ఏమాత్రం పనికి రావు. వీటిని చూస్తుంటే నిర్వాహకులుగానీ, ఈ వేదిక నంగీకరించిన ఇరుపక్షాలుగానీ చర్చా వేదిక నియమనిబంధనలుగానీ, చర్చ స్వరూప స్వభావాలుగానీ తెలిసున్నవారు కారెమోననిపిస్తున్నది. అసలీ వేదికలలో చర్చేజరగదు. అదలా ఉంచి, వినడానికొచ్చిన ప్రజలే నిర్ణేతలనడమన్నంత అడ్డగోలు తనం అపసవ్యత మరోటీలేదు.

ఎందుకంటే, ఇందులో ప్రసంగీకులిద్దరూ ఎవరి సొద వాళ్ళు చెప్పుకున్నారు తప్ప ఏ ప్రతిపాదననూ పరీక్షకు పెట్టలేదు. కొందరైతే, అస్సలలా పరీక్షకు పెట్టాలన్న నియమం పెట్టుకోకపోగా, అలా ప్రత్యేక విషయాన్ని పరీక్షించడానికి అవకాశమూ ఉండదనీ నియమాలలో చెప్పుకున్నారు. ఉదాహరణకు రంజిత్‌ ఓఫిర్‌ గారికి, ఇమ్రాన్‌ అన్నాయనకు చర్చంటూ ఏర్పరచిన వేదికలో, వేదిక ఏర్పాటుకుముందే ఇది పోటీ కాదు, గెలుపోటములూ ఉండవు. ఇరువురి మాటలు విని ప్రజలే ఏది సరైందో నిర్ణయించుకుంటారు. అన్న షరతునూ పెట్టుకున్నారు. చర్చనీయాంశంగా 'బైబిలా? ఖురానా? ఏది నిజమైన దైవవాక్కు?' అన్న దానిని ఏర్పరచుకున్నారు. ఇమ్రాన్‌ రెచ్చిపోయినట్లు మాట్లాడడం రంజిత్‌గారు సర్ధిచెపుతున్నట్లు మాట్లాడడం, అన్న దృశ్యం కనబడిందక్కడ.

సరైన చర్చావేదిక ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది?

(1) చర్చ యొక్క లక్ష్యం ఎంపిక చేసుకున్న విషయంలో ఎవరిపక్షం సరైందో తేల్చుకోవడం దీని క్రిందికి రెండు వైఖరులు వస్తాయి.

(ఎ) తాము స్వీకరించిన సిద్ధాంతం ఏమి చెపుతుందో చెప్పింది సరైందేనని నిర్థారించడం.

బి) ఆ సిద్ధాంతం విషయంలో ఇరువురిలో ఎవరికెంత తెలుసో పరీక్షించి చూసుకోవడం

దీనిలో మొదటి దానిని వాద పరీక్ష లేదా సిద్ధాంత పరీక్ష అనంటారు. ఇందులో చర్చావేదికలో పాల్గొన్న వారందరి దృష్టీ సత్యమేమిటో తేల్చుకోవడంగా మాత్రమే ఉంటుంది.

రెండవ దానిని వాద పరీక్ష అనంటారు. దీనిలో ఎంచుకున్న సిద్ధాంత విషయం ఎవరికెంత తెలుసో నిర్ణయించుకోవాలన్నది లక్ష్యంగా ఉంటుంది. దీని ఉద్దేశం ప్రధానంగా గెలుపోటములకు సంబంధించిందిగా ఉంటూ ఉంటుంది.

సత్యావిష్కరణైక లక్ష్యం కలమొదటి తరహా వేదికలో ఇరుపక్షాలూ గెలుపోటముల్ని అప్రధానంగా చూస్తాయి. ఆయా అభిప్రాయాల సబబు బేసబబుల్ని మాత్రమే నిగ్గుతేల్చుకోవాలనుకుంటుంటాయి. సబబు బేసబులన్నవి ప్రధానంగా సత్యా సత్యాలు, ధర్మాధర్మాలన్న వాటికి సంబంధించినవిగనే ఉంటుంటాయి. సత్యా సత్యాలు జ్ఞానభాగానికి చెందినవికాగా ధర్మాధర్మాలు కర్మ భాగానికి సంబంధించినవి. వీటికి అనుబంధంగా న్యాయాన్యాయాలు, నీతి అవినీతులన్నవీ పరిశీలించడం జరుగుతుంటుందా. వేదికలో కనుక జ్ఞానభాగానికి చెందిందైతే.

చర్చావేదికలో ప్రకటితాభిప్రాయం సత్యమా? అసత్యమా? అనిగాని, కర్మ భాగానికి చెందిందైతే ధర్మమా? అధర్మమా? అనిగాని విచారించాల్సి ఉంటుంది. వాటితో ముడిపెట్టి ఒక వ్యక్తి న్యాయకారా? అన్యాయకారా? నీతివంతుడా? అవినీతిపరుడా అన్నదీ పరిశీలించాల్సి ఉంటుంది.

ఈ విచారణ సక్రమంగా జరగాలంటే చర్చా వేదికకు పటిష్టమైన నియమ నిబంధనలుండాలి. అవి విషయాన్ని సూక్ష్మంగా నిశితంగా, లోతుగా విచారణ చేయడానికి తగినంత శక్తివంతమైనవి అయ్యుండాలి. వీటినీ సాధకాలు అనంటాము. ఏ ఫలితాన్ని కోరిన సందరర్భంలోనైనా సాధక బాధకాలన్నవి కారణ సామగ్రి క్రిందికి వస్తాయి. పని అనుకున్న ఫలితాన్ని పుట్టించాలంటే కారణ సామగ్రి అందుకు తగినవిగా ఉండి తీరాలి. ఇది సార్వత్రిక నియమం. అంటే మరో మార్గం లేదని కార్యకారణ నియమాన్ని అనివార్యతా నియమం అనీ అంటారు. విజ్ఞులు.

కర్త - ఉద్దేశము - పరికరాలు, విధానము - పని అన్నవి ఫలితొత్పత్తికి కారణ సామగ్రి అవుతాయి. కనుక కారణ సామగ్రిలో ఏదిలేకపోయినా, తగినట్లు లేకపోయినా రావాల్సిన ఫలితంరాదు. పైగా శ్రమదండుగవడమో, అవాంచిత ఫలితాలు రావడమోనూ జరుగుతుంది. ఫలిత దృష్టినుండి అట్టి పనులను (1) సాదిక శ్రమ, (2) నిరర్థకశ్రమ (3) దురర్ధక శ్రమ అనంటారు. వివేకులు వ్యర్థ శ్రమకు పూనుకోరు. ఇక పడుతున్న శ్రమ దురర్ధకశ్రమ రూపు ధరించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. కనుకనే వివేకపధికుల శ్రమే సార్థక శ్రమ అవుతుందంటారు పనిమంతులు. పని విధానం తెలిసినవారూ.

ఇంతకూ చర్చ ఎప్పుడు జరుగుతుంది? ఏ యిరువురి మధ్యన జరుగుతుంది?

(1) ఏదైనా నిర్ధిష్టరూపంలో విషయపు ఎంపిక జరగక చర్చకు ఆస్కారమేఉండదు. ఎందుకనంటే, విషయంలేని ప్రతిపాదనగాని, ప్రతిపాదన లేనివాదనగాని, విచారణగానీ, నిర్ధారణగానీ ఉత్పన్నమేకావు. కనుక చర్చకు ఆధారస్థానం చర్చనీయాంశమే. కనుక అదిగాని నిర్థిష్టరూపంలో లేకపోయిందా! ఇక అలాంటప్పుడు అనేకుల మధ్య జరిగేదంతా పిచ్చాపాటినో, ఉబుసపోకకబుర్లో. రచ్చనో, రగడలో మాత్రమే. అట్టి వాటిని వేటినీ 'చర్చ' లనే అనకూడదు.

(2) కనీసం ఇద్దరులేక చర్చ జరగదన్నది నిర్వివాదాంశం. అలాగే చర్చలో అనేకులు పాల్గొన్నా, వారంతా ప్రతిపాదితాంశానికి సంబంధించినంతలో దానినంగీకరించే వాళ్ళుగనూ, అంగీకరించని వాళ్ళుగనూ ఉంటూ పక్షప్రతి పక్షాలుగా వాద. ప్రతివాదులుగ, రెండు బృందాలుగనే ఏర్పడి ఉంటారు. అయితే ప్రతి పక్షంలో ఉన్నవారిలో ప్రతిపాదితం తప్పనేవాళ్ళూ, అనిర్థారితమనే వాళ్ళూ ఉండవచ్చు. ఇక్కడికిది తప్పో ఒప్పో ఆలోచించండి.

(3) అలా తారసపడే ఇద్దరిలో, ఆయా విషయాలకు సంబంధించి (ఎ) ఇద్దరూ తెలిసినవాళ్ళుగానీ, (బి) ఇద్దరూ తెలియనివాళ్ళుగానీ, (సి) ఒక తెలిసినవాడు, ఒక తెలియనివాడుగానీ అయ్యుండే వీలుంది. నిజానికీ మూడు పక్షాల వారి మధ్యా చర్చ జరగనే జరగదు. ఎందుకంటే (ఎ) ప్రతి పాదితాంశం ఇరువురికీ తెలిసి ఉన్న సందర్భంలో దానిని ఎవరు ప్రతిపాదించినా రెండో పక్షం అది సత్యమేనని ఆమోదించడమే చేస్తుంది.

(బి) ప్రతిపాదనీయం విషయంలో ఇరువురూ అజ్ఞానులే అయ్యుంటే వారి మధ్య చర్చనీయాంశమే ఉండదు గనుక వారి మధ్య పై నున్న ఒకటవ వాక్యం యొక్క పరిస్థితి ఉంటుంది, కనుక చర్చ జరగదు.

(సి) ఇక ఎంపిక చేసుకున్న విషయంలో ఒకడు తెలిసినవాడు మరొకడు తెలియని వాడు అయితే, వారిద్దరి మధ్యకూడా చర్చ ఉండదు. ఎందుకంటే తెలిసినవాడు చెప్పిందానిని, ఆ వ్యక్తి పై ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని బట్టి నమ్మడమో, నమ్మకపోవడమన్నదే అక్కడ జరుగుతుంది. ఎందుకని? మొదటన్నవాడిది తప్పనడానికైనా, ఒప్పనడానికైనా ఇతడికది తెలిసిన విషయం కాదు కనుక.

మరైతే ఇంతకూ చర్చ ఏ యిరువురి మధ్య జరుగుతుందన వచ్చు? అనాలి?

(1) ఖచ్చితంగా ఎంపిక చేసుకున్న అంశం పై రెండు పక్షాలు, ఆ విషయం తనకు తెలుసుననీ, తనకు తెలిసిందే సరైన జ్ఞాన మనీ అనుకుంటూ పరస్పరం విభేధించకుంటున్నప్పడే చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. అంటే, వారిద్దరి మధ్య ఆ విషయం నీకెంతతెలుసు? నాకెంత తెలుసు అన్నది గానీ,

ఆ విషయం పై నీవు వెలిబుచ్చుతున్న భావాలు సరిగ ఉన్నాయా నావి సబబుగ ఉన్నాయా? అని గానీ,

ఖ ఆయా విషయయాలపై ఆ (మత లేక సిద్ధాంత) గ్రంథం చెపుతున్న అభిప్రాయాలు సబబుగున్నాయా లేదా అన్నదిగానీ నిర్ణయించుకోవాలన్న స్పష్టమైన ఉద్దేశం ఉన్నప్పుడే ఇద్దరి మధ్య జరిగే సంభాషణ చర్చారూపాన్ని ధరిస్తుంది.

చర్చకు, రెండు విషయాలలో నిర్ణయాలకు రావాలన్న ఖచ్చితమైన దృష్టి ఉండాలి. (1) ఫలాని విషయంలో ఎవరికెంత తెలుసో తేల్చుకోవడం (2) ఒక గ్రంథంగాని, ఒక వ్యక్తిగాని ప్రకటించిన అభిప్రాయం సబబుగా ఉందా లేదా తేల్చుకోవడం.

ఈ రెండు లక్ష్యాలలో దేని కొరకు చర్చ చెద్దామనుకున్నా, చర్చించేవారి దృష్టి మిత్రదృష్ఠితో ఉంటూ విషయాన్ని అర్థం చేసుకోవడం కొరకై ఉండవచ్చు. లేదా పోరాట ప్రవృత్తిలో ఉండే ఎవరు గెలుస్తారో చూసుకుందాం అన్నదీ అయ్యుండవచ్చు. మొదటి దానిని జిజ్ఞాస అనీ, రెండోదానిని జిగీప (విజిగీష) అనీ అంటారు పారిభాషికంగా. తార్కికంగా మొదటిదానిని వాద కథ అనీ, రెండో దానిని జల్పకథ అనీ అంటారు.

ఉదా : పి.డి సుందర్రావు గారి ప్రసంగాలను వింటుంటే, వారిది విజిగీష ప్రవృత్తి అని స్పష్టంగా అనిపిస్తుంది ఆయన పేరుకు, ముందు తగిలించుకున్న 'జయశాలి' అన్న విశేషణము, అందులోనూ 'జ' అన్నమాట దగ్గర ఉన్న ఖడ్గము, ఇతరచింతకులలో, ఆయనెలా ప్రవర్తించాలనుకుంటున్నదీ తెలియజేస్తున్నాయి. తొడగొట్టడమూ, మీసాలు మెలెట్టడము, చేతులు దురదగా ఉన్నాయి ఎవడో ఒకడు రండిరా బాబూ అనడమూ, మొగాడేవడూలేడా అనడమూ, నాకవుట్‌ నాతో పెట్టుకుంటే, అనడము వగైరా వగైరాలన్నీ అతనిలోని గొడవ పడే మనస్తత్వాన్ని పట్టిస్తున్నాయి. అయినా ఇంతకాలంగా ఏ ఒక్కరితోనూ పోటీ జరక్కపోవడం, ప్రత్యర్థులలో ఎక్కువమంది అస్సలింతకూ ఎవరితో ఎక్కడ ఎప్పుడు పోరాడి గెలిచావో చెప్పరా దొరాని అడగడం, అలాటి సంఘటన ఒక్కటీ జరిగిన దాఖలా లేకపోవడం చూస్తే, ఆయన బీరాలపాలు, సింహగర్జనలు, వగైరాలున్నీ ఉత్తర కుమార ప్రగల్భాలా?! అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి.

రంజిత్‌ ఓఫిక్‌గారు పి.డి. సుందర్రావుగారిని దృష్టిలో పెట్టుకుని, అతడు ఎన్ని సార్లు పిలిచినా పోటీకి రావడంలేదు. అతణ్ణి పోటీకి సిద్దం చేయగలవాళ్ళుంటే, చర్చకు ఆయన్ని పట్టుకొచ్చినవాళ్ళకి ఒక లక్ష రూపాయలిస్తాను, అన్న ప్రకటనా చేశారు. అయినా ప్రపంచ చాలెంజర్‌ నని చెప్పుకుంటున్న సుందర్రావుగారు పోటీకి రెడీ అనలా. ఆయన అనుయాయులు పోటీకి ఆయన్ను పట్టుకరాలేదిప్పటికి. ఇలాంటి సమాచార మంతాఆయనకు చాలెంజర్‌గా కనపడాలన్నదుగ్దేగానీ, చాలెంజర్‌గా నిర్ధారణ జరగాలన్న తాపనేమీలేదేమోనన్న ఆలోచననూ రేకెత్తిస్తోంది.

చర్చకు - అంటే అనేకుల మధ్య ఒక విషయంపై సరైన అవగాహనకు రావడానికి జరగాల్సిన ప్రక్రియకు

1) ఎ. విచారణీయాంశం ఉండాలి.

బి. ఒకరు దానిపై తనకు తెలిసిందిది లేదా తానంగీకరిస్తున్న భావం ఇది! అంటూ ప్రకటించిన అభిప్రాయప్రకటన ఉండాలి.

సి. దానిని వ్యతిరేకిస్తూనో, సందేహిస్తూనో, విభేదిస్తూనో ఎదురాడే వేరొక పక్షం ఉండాలి.

2) ఎ. ఆ విషయంలో సత్యమేమిటో (వాస్తవమేమిటో) తెలుసుకోవడంగానీ,

బి. ఎవరెంత ప్రజ్ఞావంతులో తేల్చుకోవడంగానీ ప్రయోజనమై ఉండాలి.

ఈ రెండు పక్షాలను విడిచి చేసే సంభాషణాలన్ని రచ్చలో, రగడలో పిచ్చాపాటి కబుర్లు అవుతాయేగాని 'చర్చ'లనడానికి మాత్రం తగిఉండవు.

చర్చావేదికలో చోటు చేసుకునే అంశాలు, పాత్రధారులు

1) ఎ. చర్చావేదిక నిర్వాహకులు ఎ. నిర్వాహకులు

బి. ప్రతిపాదక పక్షము బి. ఇరుపక్షాలు

సి. పృచ్చక పక్షము సి. పరిశీలకులు, నిర్ణేతలు

డి. పరిశీలకులు

ఇ. నిర్ణయ నిర్ణీతలు

ఇందులో నిర్వాహకులకు చర్చనీయాంశంపై తగినంత అవగాహన లేకున్నా ప్రమాదమేవిూ లేదు. ఎందుకంటే వారు సభకు కావలసిన ఏర్పాట్లు చేయడం విషయంలోనే ప్రధాన బాధ్యత వహిస్తారు. భౌతికంగా మాత్రమే పాలుపంచుకుంటుంటారు.

ఖ ఇక ప్రతిపాదక పక్షం - చర్చనీయాంశానికి సంబంధించిన వివిధ విషయాలపై తమ పక్షాన్ని నిర్ధిష్టరూపంలో ప్రకటించి, అది సరైనదేనని నిరూపించే బాధ్యత వహిస్తారు.

ఖ ప్రతిపక్షం, సిద్ధాంత పక్షం వారు ప్రకటించిన దానిలో దోషాలనో, లోపాలనో ఎత్తి చూపే పని చేస్తూ లోతైన, విస్త్రృతమైన అవగాహనకు తగిన వాతావరణాన్ని వత్తిడిని కలిగిస్తుంటారు.

ఇక పరిశీలక పక్షంలో, ఆయా విషయాలకు సంబంధించిన విశేషజ్ఞులూ, చర్చకు సంబంధించిన నియమనిబంధనలు తెలిసినవారూ ఉంటారు. వీరు ఒక వంక ఇరుపక్షాలు సాగిస్తుండేవాద ప్రతివాదాలకు సాకక్షులుగానూ, వాటి సబబు బేసబబుల్ని విచారించే సందర్భంలో నిర్ణీతలకు సహాయకులుగను పని చేస్తుంటారు.

నిర్ణేతలపాత్ర వహించేవారు నిర్ణయాధికారాన్న కలిగి ఉండి,పరిశీలకుల కుండాల్సిన సామర్థ్యంనూ కలిగి ఉండాలి. నిర్ధారణ చేయాల్సిన వారికి ప్రధానంగా ఉండాల్సిన సామర్థ్యం ప్రకటితాభిప్రాయపు సబబుబేసబబుల్ని నిర్ణయించే విధి విధానాలు తెలిసి ఉండి, రాగ ద్వేషరహితంగా వాటిని అమలు పరచగలిగి ఉండడం.

గమనిక : - పరిశీలక పక్షానికీ, నిర్ణేతల పక్షానికీ కూడా నిర్ధారణ పర్యంతం పాటించాల్సిన సాధారణ నియమాలన్నీ తెలిసుండడం తప్పనిసరి. ఇంత వరకు అంగీకారం కలిగి ఉండడం, అవగాహనుండడం వాద ప్రతివాదులకూ అవసరమే. అయితే కేవలం పరిశీలకులనదగ్గ బృందంలో ఇరు పక్షాలలో ఏదో ఒక పక్షాన్ని అంగీకరించేవాళ్ళూ ఏ పక్షాన్ని స్వీకరించక ఏది సబబో తెలుసుకుందామనుకుంటుండేవాళ్ళూ చేరి ఉండవచ్చు. ఇక నిర్ణేతల స్థానంలో ఉన్నవారికి పరిశీలనా సామర్ధ్యాలతోపాటు, న్యాయనిర్ణయ సామర్థ్యం ఉండాలి. అంటే ప్రధానంగా నిస్పాక్షిక దృష్టికలిగిఉండడంతోపాటు తగినంత వివేచనాశక్తీ ఉండాలి.

ఈ సందర్భాన్ని మరింత వివరంగా తెలుసుకోడానికి, మరొక సూక్ష్మాంశాన్ని వివరించుకోవలసి ఉంది. చర్చ - పోటీ - గెలుపోటములకు సంబంధించినదైతే మాత్రం పోటీలో ఇరువురే పాల్గొనాల్సి ఉంటుంది. అన్నది ప్రధాన నిబంధన అవుతుంది. అంటే పైననుకున్నట్లు 'వాది బలం' ఏపాటిదో తెలుసుకునే పరీక్షన్నమాట. కనుక వారిరువురికి ఎవరూ సహాయపడకూడదు.

ఇక చర్చ 'వాదబలం' ఏ పాటిదో తెలుసుకోవాలనుకున్న సందర్భానికి చెందిందైనప్పుడు, ఇరుపక్షాలలో ఒక్కరొక్కరేగాక, ఎంత మందైనా పాల్గొనవచ్చు. ఎందుకని? ఇక్కడ మన దృష్టి ఆ వ్యక్తికెంత తెలుసన్నది తేల్చుకోవాలన్నదానిపై కాక, ఆ సిద్ధాంతమేపాటిదో తెలుసుకోవాలన్నదిగ ఉంటుంది కనుక.

మిత్రులారా! ఈ పై అంశాలను మరోసారి మరోసారి పరికించి చూసి ఒక స్పష్టమైన అవగాహనకురండి. చర్చావేదికలో పాలుపంచుకునే పాత్రఏమిటో మరోక్కమారు గుర్తుచేసుకోండి. ఎందుకంటే ఇక్కడగాని స్పష్టతలేకుంటే, మనమెవరమైనా అలాంటి వేదికలను సరైన రీతిలో నిర్వహించడంగానీ, వాటిలో సరైన రీతిలో పాలుపంచుకొనడంగానీ అట్టి వేదికలు నిర్వహించాలనుకునేవాళ్ళకు సరైన మార్గదర్శనం చేయడంగానీ సాధ్యపడనేపడదు.

(1) నిర్వాహకులు :- వీరు నిజానికి వేదికకు బైటుండేవాళ్ళే. ఏర్పాట్లు చేయడమే వీరి ప్రధాన బాధ్యత.

(2) పక్షప్రతిపక్షాలు :- వీరికొరకే వీరి ప్రజ్ఞేమిటో, వీరి సిద్ధాంత స్థాయేమిటో తేల్చుకోవడమే వేదికలక్ష్యం.

(3) పరిశీలకపక్షం :- ఇందులోనివారికి చర్చనీయాంశాలకు సంబంధించిన లోతైన అవగాహన, చర్చావేదిక నియమ నిబంధనలకు సంబంధించిన అవగాహన కలిగుండడం తప్పనిసరి. అయితే వీరిలో (ఎ) ఏదో ఒక పక్షానికి కొమ్ముకాసేవారు, ఎటువైపు మొగ్గనివారు, నిస్పాక్షిక దృష్టితో నిర్ణయం చేయడానికి ఏర్పరచుకున్న వారూ చేరి ఉంటారు. వేదికలోని వారందరినీ విభాగాలుగా విడగొట్టడం, మరింత సరళంగా ఉండాలనుకుంటే (1) ఎటో ఒకవైపు మొగ్గినవారిని వాద ప్రతివాదుల పక్షాలకు అనుబంధించి, (2) తటస్థుల్ని పరిశీలక పక్షంలో ఉంచి (3) న్యాయనిర్ణేతలను నిర్ణీతల పక్షంగానూ వర్గీకరించవచ్చు అప్పుడు (1) వాది పక్షం (2) ప్రతివాదిపక్షం (3) పరిశీలక పక్షం (4) నిర్ణీతల పక్షం అని నాల్గు పక్షాలవుతాయి.

వీరందరికీ వర్తించే సర్వ సాధారణ నియమం, అందరకూ చర్చావేదిక నియమనిబంధనలు సమానంగా తెలిసిఉండాలన్నదే. న్యాయాన్యాయాలు విచారించే పద్దతులను తెలిపే న్యాయశాస్త్రం ప్రకారం, వాద ప్రతివాదులు, పరిశీలకులు, న్యాయవాదులూ, న్యాయమూర్తులూ అందరూ న్యాయశాస్త్ర సూత్రాలను సమానంగా అంగీకరించి తీరాలి. అవునా కాదా? అవి ఈ నియమాన్ని సూచించేమాటే.

ఇంతగా దీనిని ఒకటికి రెండుమార్లు ఎందుక చెప్పుకోవలసివస్తోంది?

ఈ మధ్య కాలంలో (దాదాపు చాలాకాలం నుండి అనైనా అనవచ్చు) ఈ ప్రాథమిక నియమ నిబంధనలను పట్టించుకోకుండగనే చర్చలపేరున సభలు జరుగుతూ వస్తున్నేౖ. ప్రజలే నిర్ణీతలన్న దృష్టి ఎక్కువ బలంగా కనబడుతోంది. సామాన్యజనులే నిర్ణేతలనడంగానీ, బహిరంగ ప్రదేశాలలో, నానాజాతి జనం కూడి ఉన్న సంతల్లాటి స్థలాలలో చర్చించుదామనడంగానీ, ఏ రకంగానూ చర్చలకు తగిందికాదు. చర్చలో పాల్గొనే అన్ని పక్షాలు ఆయా పాత్రలకు సంబంధించిన అంశాలలో విషయజ్ఞులూ, విశేషజ్ఞులూ అయ్యుండాలన్నదీ, ఆయోగ్యతలులేని వారెవ్వరూ చర్చావేదికలో పాల్గొనకూడదన్నదీ అనివార్యమైన, అనుల్లంఘనీయమైన మొదటి నియమం. ఒక్కమాట చెప్పి ఈ విషయాన్నిప్పటికి ఆపుతాను. అలా యోగ్యమైన స్థాయిలో జరిగే చర్చావేదికలో పాల్గొంటున్న - పాల్గొనాలనుకుంటున్న వారు ఇంతకు తానేపక్షంలో ఉండగోరుతున్నదీ ముందే ప్రకటించి, తన పాత్రోచితికి బంగంకలగకుండా, అన్యపాత్రలలో చొరబడకుండా ఉండగలగాలి. ఈ నియమాన్ని అతిక్రమించిన వారిని ఆ వేదిక నుండి (బైటికి పంపించే లేదా తొలగించే) బహిష్కరించే విధానాన్ని ముందే ఏర్పరచుకోవడం కూడా అవసరం.

వస్తువుల ఎంపిక విషయంలో బాగోగుల్ని సరిగా గమనించకపోయినా, పట్టించుకోకపోయినా ఎదురయ్యే లాభనష్టాలు ఆ వస్తువుకు పరిమితమవుతాయి చాలా సందర్భాలలో. అదే మరి, ఒక తాత్విక భావం విషయంలో సబబుబేసబబుల్ని పట్టించుకోకుంటే జరిగే అరిష్టం అంతా ఇంతా కాదు. ఎందుకంటే అది దీర్ఘకాలంపాటు, వందల, వేల, కోట్ల జనం మీద పడుతుంటుంది. ఉదా :- ఈనాడు బైబిల్‌వెంట గాని, ఖురాన్‌ వెంటగానీ, ఒక్కోదాని వెంట 250 కోట్ల మంది పైగా పోతున్నారు. వాటిలోని అపసవ్యతల్ని పట్టించుకోకుండగనూ, అపసవ్యతల్ని సవ్యతలనుకుంటూనో ఆ 4, 5 వందల కోట్ల ప్రజలు దీర్ఘకాలంగా వాటి వెంట పడిపోతూనే ఉన్నారు. ఆ రెండు మత గ్రంథాలకే ఈ సూత్రాన్ని పరిమితం చేయనక్కర్లేదు. చేయనక్కరలేదు అనే కంటే చేయకూడదు అనడం మరింత సరైన ప్రయోగం. ఆ సూత్రం యూదు, క్రైస్తవ, ఇస్లాం మత ధోరణులకేగాక, హైందవం పేరున అంగీకరింపబడుతున్న వైదిక, ఔపనిషదిక, పౌరాణిక, స్థానిక ఆస్థిక పోకడలకూ, ఆస్థికేతరపోకడలకూ కూడా సమానంగనే వర్తిస్తుంది.

నచ్చినా నచ్చకున్నా, మింగుడుపడినా పడకున్నా

నిప్పులాంటి ఒక పచ్చి నిజాన్ని కూడ చెప్పుకోవాలి.

దేవుడొక్కడే అందరూ అతని బిడ్డలే, నీవలె పొరుగు వానిని ప్రేమించు, అందరూ సోదరులే నని చెప్పే మతాలన్నీ ఆచరణ కొచ్చేటప్పటికి మానవ మారణకాండకు పెద్ద ఎత్తున ఒడిగట్టినవే. అంతరాలు నశించాలి. అందరొక్కటై వసుధైక కుటుంబంగా జీవించాలి, సమసమాజం స్థాపించాలి. అని నినదించిన కమ్యూనిజపు చరిత్ర కూడా మానవ మారణహోమానికి తనవంతుగా పెద్ద పాత్రే పోషించింది. ఈ రకం సైద్దాంతిక ధోరణులను నెత్తికెత్తుకుని వారికి సాటి మనిషి మనిషిగా కనిపించడు. అందులోని పెద్దలనబడేవాళ్ళకు అక్కడికి తామేదో లోకోద్దారకులం అన్న భావన. ఫీలింగు ఆనఖాగ్రం వ్యాపించి నరనరాన జీర్ణించుకుని ఉంటుంది.

వేద సంరక్షకుల పేరున, బైబిల్‌ సంరక్షకుల పేరునా, ఖురాన్‌ సంరక్షకుల పేరునా ఈ మధ్య ప్రభలితమవుతున్న సంస్థల, వ్యక్తుల పోకడలు పైనేనన్న అభిప్రాయం వట్టిదికాదనడానికి గట్టి రుజువులు భావజాల క్షేత్రంలో ఎంతో విధ్వంసకర పాత్ర పోషించిన, పోషిస్తున్న మూడు ప్రధాన ధోరణుల గురించి ఒక్కమాట చెప్పుకోకుంటే ఈ శీర్షికకు ఈ సందర్భానికీ న్యాయం జరగదు. వేదంలో అన్నీ ఉన్నాయ్‌, వేదం ఈశ్వరీయం (దైవవాక్కు); బైబిల్‌లో అన్నీ ఉన్నాయ్‌, బైబిలు దైవవాక్కు, ఖురాన్‌లో అన్నీ ఉన్నాయ్‌, ఖురాన్‌ దైవవాక్కు అంటున్న ముగ్గురినీ ఒకే వేదికపైన కూర్చుండబెట్టి;

అన్ని ఉన్నాయ్‌ అనిగాని, దైవవాక్కు అనిగాని నిర్ధారించడమెలా?

లేదా నిర్ధారించుకోవడమెలా?

అన్న ఒకే ఒక్క ప్రశ్న వేసి, సరైన సమాధానం చెప్పేవరకు, తాను చెప్పింది సరైందేనని నిరూపించేంతవరకు వదిలిపెట్టగూడదు, కట్టిపడేయాలి. అటుపైన తనకే తెలియని విషయాలు, తానుగా తేల్చలేని విషయాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నందుకు తగిన దండన వేయాలి. ఆ దండన సమాచారాన్ని ప్రతి వక్కరికీ తెలిసేలా బహిరంగ పరచి మరొకరెవ్వరూ అలాంటి పనికి సాహసించకుండా ఉండే పరిస్థితుల్ని సృష్టించాలి.

ఎంతో ఉదాత్తమైన మన భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 51 ఎ / బిలో శాస్త్రీయ దృక్పథము, హేతుబద్దాలోచనాసరళి, సంస్కరణాభిలాష, మానవీయ విలువల దృష్టి కలిగి ఉండడం, అలా ప్రవర్తించడాన్ని అలవరచుకోవడం ప్రతీ పౌరులు ప్రాథమిక విది అంటోంది.

ఎంత గొప్ప భావనను, సమాజపురోభివృద్ధికి సర్వాంగీణ అవసరమైన ఆచరణను గూర్చి ప్రాథమిక విధిగా ఎంచుకున్నాం?! 65 ఏండ్లు గడిచినా ఆ దిశగా సంతృప్తి పడగల ఒక్క అడుగైనా గట్టిగా వేయలేకపోయిందీ సమాజమిప్పటికీ ఇంతకంటే విషాదకరమైన విషయమేముంది?

మిత్రులారా!

చర్చావేదిక చట్రం ఎలా ఉండాలో ఒకింత వివరంగానే చెప్పుకున్నాం. అదంతా మొత్తం చర్చావేదిక ఒక పార్శ్వం మాత్రమే. మనం విచారించాల్సిన మరో పార్శ్వముందిక్కడ. చర్చా వేదికన్నది ఆయా సైద్ధాంతిక ధోరణుల భావజాలాన్ని ప్రదర్శించి సమీక్షించుకునేందుకేర్పడిందే గనుక, ఆపనంతా 'ఆ' నుండి 'హ' వరకు సక్రమంగా సాగాలంటే మరికొన్ని అంశాల పట్లా అవగాహన, జాగరూకత కలిగిఉండాల్సి ఉంది. చర్చా ద్వారా సిద్ధాంత పరీక్ష చేయాలనుకునే పనిలో (1) భాష (2) వాద ప్రక్రియ (3) విచారణ ప్రక్రియ (4) నిర్ధారణ ప్రక్రియ అన్న నాలుగంశాలు చోటు చేసుకునుంటాయి భారతీయ తార్కిక చట్రంలో సిద్ధాంత విచారణన్నది (5) అవయవాలు కలిగి ఉంటుంది. అలాగే, ప్రతిపాదనను సంశయించడమన్న దానితోనే విచారణ ఆరంభమవుతుందన్నది తార్కిక నియమం.

(1) ప్రతిజ్ఞ 
(2) హేతువు 
(3) ఉదాహరణ 
(4) ఉపనయము 
(5) నిగమనము అన్నవే ఆ ఐదు భాగాలు.

ఎంపిక చేసుకున్న విషయానికి సంబంధించినంతలో సిద్ధాంత పక్షాన్ని వహించేవాడు (వాది) ముందుగా ఒక నిర్థిష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. వేదిక పరిశీలించాల్సిన లేదా ప్రతివాదిశంకించాల్సిన లేదా ప్రతివాది విభేదిస్తున్న అభిప్రాయమన్న మాట అది. దానినే చర్చావేదిక పరిభాషలో సిద్ధాంతమనీ, ప్రతిపాదన అనీ, వాదమనీ, ప్రతిజ్ఞఅనీ, పరిశీలనాంశమనీ, పరీక్షార్థమనీ అంటారు.

వివరణ : ప్రతిపాదన సరైన రూపులో సిద్ధం కాకుండా చర్చకు ప్రాతిపదికే ఏర్పడదు. కనుక ప్రతిపాదన రూపమైన అభిప్రాయ ప్రకటన స్పష్టంగానూ, సంపూర్ణంగానూ, నిశ్చితరూపంలోనూ వాది భావాన్ని ప్రకటించేదిగా ఉండాలి. ఇదంతా భాషతో ముడిపడి ఉంటుంది కనుక, అటు పై అతడు చేసే వాదన ఆర్గ్యుమెంట్‌ - కూడా భాసాధారంగానే జరుగుతుంటుంది గనుక, చర్చావేదికలో అందరూ చర్చకు అవసరమైన మేరనైనా భాషా నియమాల్ని పాటించాల్సి ఉంటుంది.

గమనిక :- వాదము - వాదన అన్నవి వేరు అర్ధాన్నిచ్చే పదాలు ప్రతిపాదనను వాధమంటారు. దానిని నిలుపుకునేందుకు చేసే సంభాషణను వాదన అంటారు.

ఖ కనుక చర్చా వేదిక నియమనిబంధనలకు చెందిన రెండో పార్శ్వంలో భాషా నియమాలన్నవి ఉంటాయి.

చర్చలో పాల్గొనే వాద ప్రతివాదులిద్దరూ వారి పక్షం సరైందేననడానికి చేసే సంభాషణను వాదన (ఆర్గ్యుమెంటు) అంటారు. ఇదిన్నీ ఒక పద్దతి ప్రకారం జరగాల్సి ఉంటుంది.

ఖ కనుక చర్చావేదిక నియమనిబంధనలకు చెందిన రెండో పార్శంలో వాద నియమాలూ ఉంటాయి.

ఇక వాద ప్రతివాదుల వాదాలు (ప్రతిపాదనలు) వాదనలు (వాటి నిలబెట్టడానికి చేసే సంభాషణలు) పరిశీలించే థలో పరిశీలకులు, నిర్ణేతలు నిర్వహించే పాత్రను విచారణ అంటారు. వీటికీ అందరూ అంగీకరింపక తప్పని సూత్రీకరణలు అవసరపడతాయి.

కనుక చర్చా వేదిక నియమనిబంధనల్లోని రెండో పార్శ్వంలో విచారణ నియమాలూ అవసరమవుతాయి

ఇక అంతిమంగా చర్చ లక్ష్యం నెరవేరడానికవసరమైంది నిర్ధారణ. నిర్థారణైన దానినే నిర్ణీతల స్థానంలో ఉన్న చర్చావేదిక వారు నిర్ణయంగా ప్రకటిస్తారు. కనుక నిర్ధారణకు ఒక పద్దతిననుసరించడం అవసరం.

కనుక చర్చావేదిక నియమనింబధనల్లోని రెండో పార్శంలో నిర్ధారణ నియమాలన్నవీ ఉంటాయి.

వివరణ :- నిర్ధారణన్నది మూడు రూపాలలో మాత్రమే ఏర్పడుతుంటుంది.

(1) ప్రకటితాభిప్రాయం ఒప్పని - సరైందేనని - తేలుతుంది.

(2) ప్రకటితాభిప్రాయం తప్పని - సరైందికాదని - తేలుతుంది.

(3) ప్రకటితాభిప్రాయం ఈ వేదికలో అనిర్ధారితంగా ఉందని అంటే తప్పో, ఒప్పో తేలలేదిప్పటికి అని తేలుతుంది.

మరల ఈ తేలడమన్నదీ (1) జ్ఞాన పరంగాగానీ (2) కర్మపరంగాగాని తప్పో, ఒప్పో, అనిర్ధారితమో అని తెల్తాయి.

వాటినిలా క్రోడీకరించుకోవచ్చు.

(1) ప్రకటితాభిప్రాయం జ్ఞానానికి చెందిందైతే సత్యమా? అసత్యమా? అనీ,

(2) కర్మ భాగానికి చెందిందైతే ధర్మమా? అధర్మమా; న్యాయమా అన్యాయమా? నీతివంతమా అవినీతివంతమా? అనిగానీ తేల్చుకోవలసినవిగా ఉంటాయి. ఆయా సందర్భాలలో చర్చ ముగిసే సమయానికి పై విషయాలై ముగింపు, అవి తేలినవిగనో, తేలనివిగనో నిర్ధారణవుతాయి.

చర్చావేదిక నియమనిబంధనల సాధారణ రూపం

సంఖ్య ప్రధమ పార్శ్వం సంఖ్య ద్వితీయ పార్శ్వం

1. నిర్వాహకులు :                                   1 భాషానియమాలు

                                                              వీరు వేదిక ఏర్పాట్లు చూస్తారు (వేదికావసరం మేర)

2 వాద ప్రతివాదులు                                2 వాద నియమాలు

3 పరిశీలకులు                                        3 విచారణ నియమాలు

4 నిర్ణేతలు                                              4 నిర్ధారణ నియమాలు

వారి వారి పాత్రల స్వరూపస్వభావాలు, ఇవన్నీ ముందుగా చర్చించుకుని యోగ్యతలు, ప్రస్ఫుటంగా అందరికీ ఏర్పరచుకోవాలి. వీటి విషయంలో

తెలిసుండాలి ఏకాభిప్రాయం అవసరం ఎందుకంటే 2,3,4 పాత్రలకు చెందిన అర్హతలు వీటిని పాటించకున్నా, అతిక్రమించినా

గల ఎంపిక చేసుకున్నవారు కాక చర్చ సక్రమంగా ముగియదుగనుక. సమావేశంలో ఇతరులెవ్వరూ ఉండరాదు వాద ప్రతివాదులెవరూ అర్థాంతరంగా మొత్తం ప్రక్రియనంతా దృశ్య, శ్రవణ చర్చను ముగించకూడదు. అలా ఏక పద్ధతులద్వారా నిక్షిప్తం చేసే పని పక్షంగా చర్చను ముగించడం ఓటమిని

విధిగా చేయాలి. అంగీకరించడమే అవుతుంది

ప్రస్తుత విచారణీయాంశము : బైబిలు సిద్ధాంత పరీక్ష

(1) బైబిలు దైవ గ్రంథము - పరిశుద్ధ గ్రంథము అంటే సత్యాసత్యాల విషయంలోనూ, ధర్మాధర్మాల విషయంలోనూ, న్యాయా న్యాయాల విషయంలోనూ, నీతి అవినీతుల విషయంలోనూ దోష రహితమైన అభిప్రాయాలను, వైఖరిని కలిగి ఉంది.

(2) బైబిలులో చెప్పబడ్డ దేవుడే (తెలుగు అనువాదం ప్రకారం యోహోవా అనబడ్డవాడే) నిజమైన దేవుడు.

(3) ప్రకృతిని గురించి, సమాజం గురించి, వ్యక్తిని గురించి బైబిలు చెప్పినవన్నీ సత్యాలే.

ఈ విషయాలను గురించి బైబిలులో ఏమి చెప్పబడి ఉందో చూపెట్టె అవన్నీ సరైన ప్రకటనలేనని (సత్యాలేనని) నిరూపించే పని పి.డి. సుందర్రావు గారు చేయాల్సి ఉంటుంది.

గమనిక :- నాకూ - బైబిలు పక్షాన్ని స్వీకరించే వాళ్ళకు మధ్య చర్చ బైబిలు ఎవరు బాగా చదివారు? అది ఎవరికెక్కువ తెలుసు? వాక్యాలు, వాటి అధ్యాయాల, వచనాల సంఖ్యలు చూడకుండా ఎవరు ఎక్కువ చెప్పగలరు అన్నది కానే కాదు. ఈ మధ్యకాలంలో జాకీర్‌ నాయక్‌, ఇమ్రాజ్‌, దీదాత్‌ మొ|| వారు గానీ, వారిని అనుకరిస్తూ మాట్లాడుతున్న మరికొందరు ప్రచారకులు గానీ, అదే వరవడి ననుసరిస్తూ వస్తున్నా క్రైస్తవ ప్రసంగీకులుగానీ చేస్తున్న ఆ పని, పట్టుబట్టి వారికి కావలసిన వాక్యాలను ఎన్నింటిని బట్టీ పట్టారో తెలుసుకునేందుకు పనికి వస్తుందేగాని, ఏ వక్క వాక్యపు సత్యాసత్యాలు తేల్చడానికీ అది పనికిరాదు.

మన వేదిక పరీక్షాంతమే (బైబిలు గాని, ఖురాన్‌గాని, వేదంగాని) ఎవరికెంత కంఠతావచ్చు అన్నదైనప్పుడు మాత్రమే దానిని పరిగణనలోనికి తీసుకుని పరిశీలించాల్సి ఉంటుంది. మన ప్రస్తుత చర్చనీయాంశం బైబిలులో అసత్యాలు, అధర్మబోధలు ఉన్నాయాలేదా? అన్నది మాత్రమే.

మత గ్రంధాల విషయంలో ఇటు వైదికులూ, అటు ముస్లిములూ, వారి గ్రంధాన్ని మొత్తాన్ని కంఠోపాఠం చేసే సంప్రదాయాన్నే ర్పరచుకున్నారు.

బైబిలు (వేదము, ఖురాన్‌ల) ప్రకటనల సత్యాసత్యాలు పరిశీలించడానికి ఆయా గ్రంధాలలోని ఒక్క వాక్యాన్ని కూడా కంఠతా పట్టనక్కరలేదు. ముఖ్యంగా ప్రతి పక్షంలో కూర్చున్నవారికిగానీ, పరిశీలకులకు నిర్ణేతలకుగానీ ఆ సిద్ధాంత గ్రంథాన్ని బట్టీ పట్టుండాల్సిన అవసరం ఏమాత్రములేదు. వేదికలోని అన్ని పక్షాలూ ముందీ విషయాన్నంగీకరించాలి. ఎందుకంటే బైబిల్‌ ఏమి చెపుతుందో తెలుసుకోడానికి వేదికకు రెండు పద్దతులున్నాయి. (1) బైబిలు సిద్ధాంతాన్ని ప్రకటించి అది సరైందేనని నిరూపించడానికి ఆ పక్షాన్ని స్వీకరించిన వ్యక్తి (వ్యక్తులు) వేదికలో ఉండనేఉన్నారు. నిజానికి వారైనా బైబిలును బట్టీ పట్టి ఉండక్కర్ల ఫలాన విషయంలో బైబిలు ఏమి చెపుతుందో చెప్పగలిగితేచాలు. అదైనా బైబిలు చూసి చెప్పినా చాలు

(2) అన్నింటికంటే సుళువైనదేకాక పటిష్టమైనది కూడా అయిన విధానం; బైబిలు గ్రంథాన్ని తీసుకుని వరుసగా చదువుకుంటూ పోవడం. బైబిలు ఏమి చెపుతుందో తెలుసుకోవడానికింతకంటే సరైన విధానం మరోటిలేదు. ఎందుకంటే బైబిలును - సిద్ధాంత గ్రంథాన్ని - కంఠతా పట్టినవారైనా చెప్పిన మాట నిజమోకాదో వేదికలోని వారు నిర్థారించుకోవాలంటే ఆ మాట ఆ గ్రంథంలో ఉందో లేదో, అలానే ఉందో లేదో చూడడమొక్కటే సరైనదీ, తప్పనిసరైనదీ అవుతుంది. నిజమా? కాదా?

అలా గడగడ మాట్లాడడం వింటున్న సామాన్య జనానికి 'అబ్బో ఇతడు చాలా తెలిసినవాడు' అని ప్రలోభపెట్టడానికి, అపోహ కలిగించడానికి పనికొస్తుందేమో గాని, బైబిలు సబబు, బేసబబుల్ని నిర్ధారించడానికి, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బైబిలులోని ఏ ఒక్క వాక్యపు సబబుబేసబబుల్ని నిర్థారించడానికీ అది పనికిరాదు. ఎందుకంటే బైబిలు ప్రకటించిన అభిప్రాయాల సత్యాసత్యాలు నిర్ణయించడానికి, దానిని నిర్ధారణ నియమాల ప్రకారం పరీక్షకు లోను చెయ్యడమొక్కటే దారి అంతకంటే వేరు దారిలేనే లేదు.

బైబిలులో ఏముందో చూడడానికి బైబిల్ని కంఠస్తం చేయాల్సిన పనేమొచ్చింది? నిజానికీ విచారణకైతే అది వ్యర్థ శ్రమ (గాడిదచాకిరీ) మాత్రమే. అస్సలు బట్టీపట్టడమన్నది దానికదే ఒక బండపని. అది ధారణ శక్తిని ప్రదర్శించడానికి, జ్ఞాపకశక్తిని ప్రదర్శించడానికి పనికి వస్తుందేగాని, అవగాహన స్థాయిని తెలపడానికిగానీ అది ప్రకటించిన అభిప్రాయాల సబబుబేసబబుల్ని నిర్ణయించడానికి గాని కించిత్తూ ఉపయోగపడదు. ఈ వాస్తవాలు తెలియకున్నా, వేదికలోని పరిశీలక, నిర్ణేతల పక్షాలు దీనిని పరిగణనలోకి తీసుకోకున్న విషయవిచారణలో అనవసరపు టంశాలెన్నో చోటు చేసుకునే వీలేర్పడుతుంది.

బైబిలు, ఖురాను ప్రసంగీకులు చేస్తున్న ప్రసంగాల పోకడను ఈ మధ్య ఒకింత శ్రద్ధ పెట్టి గమనించాను. ఒక అంశంపై బైబిలు (ఖురాను) ఏమి చెపుతుందని అడిగితే ఆ ప్రసంగీకుడు ఒక పదో, ఇరవైయ్యో వచనాలు ఆ గ్రంథంలోని వివిధ అధ్యాయాలనుండి ఎత్తి చూపిస్తాడు. లేదా గడగడా అప్పజెప్పేస్తాడు. ఇక్కడ, ముఖ్యమైన పరిశీలనాంశమేమంటే ఫలాని అంశంపై మీ గ్రంథం ఏమి చెపుతుందయ్యా అని అడిగితే, ఇదిగో ఈ అభిప్రాయాన్ని ప్రకటిస్తోంది. అని ఒక్కమాట చెపితే చాలు కదా? ఆ మాట ఎక్కడుంది? అని మళ్ళీ అడిగితే, ఇదిగో ఇక్కడుంది అని ఒక్కవాక్యం చూపితేచాలుకదా! ఆ సందర్భంలో ఆ అభిప్రాయం ఆ గ్రంథంలో ఉందో లేదో చూడడానికి పదిచోట్ల చెప్పబడి ఉందా మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక్కచోట ఉన్నా ఉందనడానికది సరిపోతుందికదా!

ఒక్కసారి చెప్పిందానికంటే పదిసార్లు చెప్పిందానికి దైవవాక్కు విషయంలో బలమేమైన పెరుగుతుందా? అవునంటే! అది వారి వాదాన్ని బలహీన పరుస్తుందేగాని, ఏ మాత్రం బలపరచజాలదు. ఒక్క సారే చెప్పితే దేవుడు చెప్పినా అదంతగా పట్టించకోవలసిందికాదు అన్న భావాన్నిస్తుందది. ఎన్నిసార్లు చెప్పాడామాట అన్నదాన్ని బట్టి దానికెంత విలువియ్యాలో తేల్చుకోవాలన్నది దైవ వాక్కంటున్న వాళ్ళ విషయంలో ఎంతదోషయుక్తమైందో అనేవాళ్ళకు అర్థంకాలేదనిపిస్తోంది. వాళ్ళ విషయమలా ఉంచుదాం. చర్చా వేదికకు సంబంధించినంతలో ఫలాన విషయంలో ఆ గ్రంథం ఏమి చెపుతుందన్నదే వేదిక అవసరంగాని, ఆ మాట ఆ గ్రంథం ఎన్నిసార్లు చెప్పిందన్నది వేదికకు ఏమాత్రం అవసరంలేదు. ఈ విషయం అర్థమైతే ప్రసంగీకులు గడగడా చదువుతుండే అధ్యాయాల, వాక్యాల సంఖ్యలు, వాక్యాలు అనవసరపు గొడవేనని తేలిపోతుంది ఎవరికైనా.

కొన్ని ముఖ్యాంశాలు

బైబిలు, ఖురాను, వేదం అన్న మూడు గ్రంథాలను బుజానికేత్తుకున్న వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు వ్రాస్తున్నాను. ముఖ్యంగా బైబిలుపక్షానికి, అందులోనూ పి.డి. సుందర్రావు గారికి ఇది మొదట వర్తిస్తుంది.

(1) సత్యా సత్యాలు నిర్ణయించడమెట్లా?

(2) ధర్మా ధర్మాలు, న్యాయాన్యాయాలు, నీతి అవినీతుల్ని నిర్ణయించడమెలా?

(3) భాషానియమాలు చర్చావేదికకు అవసరమా? కాదా? చర్చతో ముడిపడిఉన్న భాషా నియమాలేమిటి? భాషా నియమాలు లేకుండానే చర్చ చేయవచ్చనంటే అదెలానో చెప్పండి

(4) వాద నియమాలు అవసరమా కాదా? మీరంగీకరించే వాద నియమాలేమిటో తెలుపండి.

(5) విచారణ ప్రక్రియలో పాటించాల్సిన పద్ధతులేమిటి?

(6) నిర్ధారణ నియమాల గురించి మీ పక్షాన్ని తెలియపరచండి.

(7) ప్రతిపాదక పక్షం వారి విధినిషేదాలేమిటి?

(8) ప్రతిపక్షం వారి విధినిషేదాలేమిటో తెలపండి.

(9) పరిశీలక పక్షం వారి అర్హతలు, సామర్ధ్యాల వివరాలివ్వండి.

(10) న్యాయనిర్ణేతల అర్హతలు - సామర్థ్యాల గురించి మీ అభిప్రాయాలను వ్రాయండి.

(11) ఒక పక్షం ఓడిపోయిందనిగానీ, గెలిచిందనిగానీ నిర్ణయించడమెలా?

ఈ 11 అంశాలకు సంబంధించి ముందుగా వాద ప్రతివాద పక్షాలను స్వీకరించే వారిరువురూ వ్రాత మూలకంగా తమ తమ అభిప్రాయాలను సిద్ధం చేసుకొచ్చి నిర్ణీత సమయానికి ఒక దగ్గర కలసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకోవాలి.

ఇందుకు సిద్దపడేముందే చర్చకు సిద్దమనీ, మధ్యలో ఆపబోమని, అలా ఆగిన వాళ్ళు ఓడినట్టేనని, ఓడిన వారనుసరించాలని పెట్టుకున్న నిబంధనల్ని అలా ఆగిపోయిన వాళ్ళు పాటించాలనీ కూడా మొదటే ఒప్పందంలో వ్రాసుకోవాలి. మన చర్చంతా బైబిలు దేవుని జ్ఞానమేపాటిది? అతని ధర్మకత ఏపాటిది? అతని నైతికత ఏపాటిది? అతడి న్యాయ రీతి ఎలాంటిది? అన్నది పరిశీలించడమే విచారణీయాంశమిదేనని అంగీకరిస్తేనే చర్చా వేదికకు ప్రాతిపదిక ఏర్పడ్డట్లు.

బైబిలును విచారణకు స్వీకరించినప్పుడు, దానికి వేరైన సిద్దాంతాలను పరిశీలించాల్సిన పనిలేదు. బైబిలు పక్షం వాళ్ళు ఇతర సిద్ధాంతాల గురించి ప్రస్తావించకూడదు. బైబిలుపై వేయగలన్ని ప్రశ్నలను వేసి, వాటికి బైబిలు ఏమి చెపుతోందో వెలికి తీయడం అలా బైబిలు ప్రకటించిన భావాలు సరైనవో కావో పరీక్షించడమే జరగాల్సిన పని.

ఈ క్రమంలో బైబిలు సత్య, ధర్మ, నీతి న్యాయాలకు ఆకరం, దోషరహితం అని తెలితే నేను బైబిలును అనుసరించడానికి, ఎటువంటి కుటిల ఎత్తుగడలకు పాల్పడకుండా, సిద్ధపడాలి. అలా నన్ను సత్యం వైపుకు మళ్ళించినందుకుగాను పి.డి. సుందర్రావు గారికిగాని, ముందుగ ఆ పని చేసిన ఎవరికిగానీ ఒక కోటి రూపాయలు కృతజ్ఞతా సూచకంగా (గురుదక్షిణగా) నేను చెల్లించాలి. అంతేగాక అటుపైన జీవితాంతము వారి అడుగుజాడల్లో బైబిలును అనుసరిస్తూ, ప్రచారం చేస్తూ గడపాలి. ఇది నాకు సర్వాంగీణా అంగీకారమే.

ఒకవేళ బైబిలు పక్షాన పాల్గొన్న పి.డి. సుందర్రావుగారు గానీ, ఆయన ఎంపికచేసి పంపిన వారెవరుగానీ, పై నాలుగంశాలలో బైబిలు సరైనది, సమగ్రమైనది అని నిరూపణ చేయలేకపోయినట్లైతే, పి.డి. సుందర్రావుగారు, ఆయనను బైబిలు భ్రమ నుండి బైటపడవేసినందుకుగాను కృతజ్ఞతా సూచకంగా నాకు ఒక కోటి రూపాయలు చెల్లించి నేను పయనిస్తున్నసత్యాన్వేషణా పథంలో నా వెంట నడుస్తూ, నలుగురికీ ఆ మార్గాన్ని గురించి తెలియజేస్తూ జీవించాలి.

ఈ షరతునంగీకరించే వైదిక పక్షానికీ, ఖురాను పక్షానికీ, బైబిలు పక్షానికి చెందిన ఇతరులకూ కూడా ఈ లేఖ ముఖంగానే నేను చర్చకు సిద్ధమంటూ నా సంసిద్దతను తెలియపరుస్తున్నాను. ఇందుకు సిద్ధపడగల వాళ్ళెవరైనా ఈ పత్రికాముఖంగనే వారి సమ్మతిని తెలియపరచవచ్చు. దీని పై వారు వారు వెలిబుచ్చిన ప్రత్యుత్తరాలను రాబోయే సంచికలలో అవసరమైన మేర ప్రచురించగలను. తప్పనిసరనుకుంటేనూ, లేఖలు క్లుప్త రూపంగా ఉంటేనూ యథాతథంగా ముద్రించడానికీ నాకెట్టి అభ్యంతరంలేదు. అన్య విషయ ప్రస్తావన లేవీ అంగీకరింపబడవు. ఈ కాలపు ఏసునోరునంటున్న అద్దంకి రంజిత్‌ ఓఫిర్‌ గారికీ నా ఈ లేఖ వర్తిస్తుంది. అలాగే జాకీర్‌ నాయక్‌ గారికీ, వారి బృందానికీ ఈ నా కబురంది వారిందుకు సిద్దపడితే, వారితో చర్చకు కూర్చొడానికీ నా కెట్టి అభ్యంతరం లేదు.

వారి వారి ప్రామాణిక గ్రంథం, సత్యధర్మాలు, నీతి న్యాయాల విషయంలో దోషరహితాలు లోపరహితాలు, సార్వకాలీనులు అని నిరూపణైతే వారి మార్గంలో నేను నడుస్తూ, జనుల్ని ఆ మార్గంలో నడవమని ప్రబోధించాలి. అలా అని వాటిని వారు నిరూపించలేనట్లైతే వారు నా మార్గాన సత్యాన్వేషణా పథంలో నా వెంటనడుస్తూ, జనాన్నలా నడవమని ప్రబోధిస్తూ జీవించాలి. ఒక కోటి రూపాయల కృతజ్ఞతా సూచకంగా చెల్లించుకోవడానికీ ఇరువురూ సిద్ధపడాలి.

ప్రథమయత్నంగా జరగాల్సిన పనులు రెండు

(1) చర్చకు తాము సిద్ధమని వ్రాతమూలకంగా ప్రకటించడం

(2) చర్చా వేదిక రెండు భాగాలకు చెందిన నియమనిబంధనల్ని ప్రకటించడం

ఇంతవరకు జరిగాక మలిథ ఆరంభయత్నంగా చర్చా వేదికకు స్థలకాలాలు నిర్ణయించుకునే పని చేసుకుందాం.

సత్యావిష్కరణ లక్ష్యంగా గాని, జల్ప దృష్టినుండి గాని వారి వారి అభీష్టాన్నుండి ఇందుకు సిద్దం కావచ్చు. నా పక్షపు ప్రాధాన్యత సత్యాసత్య విచారణే సత్యావిష్కరణే.

- సత్యాన్వేషణలో మీ సురేంద్ర.

ఉద్యమ సమాచారం

ముందుగా నిర్ణయించుకున్న ప్రకారము ప్రాంతీయ సదస్సు ఏప్రిల్‌ 3వ తేదీన విజయవాడలో జరిగింది. సుమారు 20 మంది ఆయా జిల్లాల బాద్యులు హాజరైనారు.

సమావేశంలో పుట్టా సురేంద్రబాబు గారు మాట్లాడుతూ అప్పటివరకు జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా వివరించారు. రాజ్యాంగం అమలుపరుచుకోమని చెప్పటానికి అధికారులను, నాయకులను ప్రశ్నించడాన్ని నేర్పడానికి, ప్రజలను మేలుకొలిపి అవగాహనాపరులుగా తీర్చిదిద్దడానికి గ్రామాల పర్యటన పెట్టుకున్నామని తెలిపారు.

వివిధ జిల్లాల నుండి హాజరైన బాధ్యులు ఆయా జిల్లాలు గత మాసములో జరిపిన కార్యక్రమాల వివరాలు సభకు అందజేశారు. ఖమ్మం జిల్లా బాధ్యులు నారయ్య, హనుమంతరావు గార్లు గ్రామాల సందర్శనములో ఉండి సభకు హాజరు కాలేకపోయామని, 400 గ్రామాల పైచిలుకు సందర్శించి సభ్యత్వ నమోదు జరిపామని సమాచారం పంపారు.

ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. నెలకు ఒక దరఖాస్తునైనా పెట్టాలన్న నిర్ణయం, నెలకు ఒక్కసారైనా ఉన్న కంప్లైంట్స్‌ను ప్రధాన కవిూషనరు గారి దృష్టికి తీసకువెళ్ళాలని నిర్ణయించటం జరిగింది. ఏప్రిల్‌ 14న అంబేద్కర్‌ జయంతి సందర్భంలో అంబేద్కర్‌ సంఘాల నేతలతో కలిసి గాని, విడిగా గాని సదస్సులు ఏర్పాటు చేసుకొని రాజ్యాంగంపై ఆయన వెలిబుచ్చిన భావాలను ప్రజలలోకి తీసుకెళ్ళాలని అనుకున్నాము.

అలాగే మే 6న హైదరాబాద్‌ జె.వి.వి. ఆఫీసులో జరుగబోవు స.హ.ప్రచార ఐక్యవేదిక కార్యవర్గ సమావేశమునకు అన్ని జిల్లాల నుండి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు తప్పక రావాలని కోరుతూ అందుకు సంబంధించిన ఎజెండాను కూడా అందరికి అందించటం జరిగింది. ఈ క్రమంలోనే మే 3న విజయవాడలో జరపాలనుకున్న ప్రాంతీయ సదస్సును రద్దుచేయటం జరిగింది.

మార్చిలో తెలియపర్చినట్లు ప్రాథమిక శిక్షణా తరగతులు జరుపుకోటానికి ప్రాంతీయ జిల్లాల బాధ్యులను, శిక్షకులను పంపవలసిందని కోరగా, ఏప్రిల్‌ 5,6,7 తేదీలలో ఆ ప్రాథమిక శిక్షణ దోరకుంటలో జరిగింది. బోధకులుగా పి.సురేంద్రబాబు, వై. జగన్మోహనరావు, అశోకరెడ్డి గార్లు పాల్గొనగా, శిక్షణ పొందటానికి వచ్చిన వారి వివరాలను క్రింద తెలియపర్చుచున్నాము. మరలా జరుగబోవు ప్రాథమిక శిక్షణా తరగతులకు ఇలానే ప్రాంతీయ జిల్లాల నుండి శిక్షకులను పంపించవలసినదిగా కోరుతూ సమావేశం ముగించటం జరిగింది.

1. బి. వెంకటేష్‌, శ్రీహరిపురం, విశాఖపట్నం, 09966600543.

2. ఎం. విక్రమ్‌, కనర్‌గామ్‌, ఆదిలాబాద్‌, 9492681651.

3. జె. కిరణ్‌కుమార్‌, కరన్‌గామ్‌, ఆదిలాబాద్‌, 9492752056.

4. జె. బాబూరావు, కనర్‌గామ్‌, అదిలాబాద్‌, 8985737180.

5. పి. ముత్తయ్య, పేరకలపాడు, కంచికచర్ల మం. కృష్ణాజిల్లా.

6. కె. హనుమంతరావు, కీసర, నందిగామ మం. 9490003605.

7. ఎం. అర్జునరావు, గన్నవరం, కృష్ణాజిల్లా, 8500731334.

8. మల్లిపూడి షర్మిల, తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా.

9. ఎం. విజయలక్ష్మి, విజయవాడ, 0866-2488323.

10. దొంతగాని వీరన్న, ఆరేకోడు, ఖమ్మం జిల్లా. 9000432158.

11. సిరిపురపు రవి, ఆరేకోడు, ఖమ్మం జిల్లా. 9951927328.

12. కురగంటి సంపతమ్మ, కీసర, నందిగామ మం. కృష్ణాజిల్లా, 8500734163.

13. కాసాని మురహరి, కంచికచర్ల, కృష్ణాజిల్లా. 9177724341.

14. కె. సృజనశ్రీ, కీసర, కంచికచర్ల మం. కృష్ణాజిల్లా.

15. కొండ్రు రాజారావు, తోటరావులపాడు, చందర్లపాడు మం. కృష్ణాజిల్లా.8686758855.

16. తక్కెలపల్లి శ్యామ్‌సుందర్‌, ఆమన్‌గల్‌, నల్గొండ జిల్లా. 9963302777.

17. జి. సరస్వతి, ఏటికట్ట, కర్లపాలెం మం. గుంటూరు జిల్లా. 08643-258740.

No comments:

Post a Comment