Sunday, February 1, 2009

ఎన్నికలు : రాజకీయ సంక్షోభం : సంపాదకీయం - ఫిబ్రవరి 2009 ( 151)


సంపాదకీయం
యోచనాశీలురైన పాఠకమిత్రులారా!
ఎన్నికలు వచ్చిపడిన మరియూ రాజకీయ సంక్షోభం ఆందోళన కలిగిస్తున్న ప్రస్తుత తరుణంలో అవగాహనగల వాళ్ళందరూ పౌరునిగా తన పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించవలసి వుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని అస్సలు స్వభావాన్నిబట్టి ప్రతి పౌరుడూ (ఓటరు) ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పనిలో సమాన భాగస్వామ్యమే అయివున్నాడు. కానీ ఇప్పటివరకు ఎక్కువలో ఎక్కువ జరిగిందేమిటి? రాజకీయాలకు చెందిన నాయకులంతా చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా కష్టపడి, పౌరుణ్ణి అలా ఆలోచించకుండా, ఆలోచించలేకుండా వుండేట్లు చేయగలిగారు. రాజకీయాల గురించిన లోతైన అవగాహన కలిగినవాళ్ళను మినహాయించితే, మామూలు బ్రతుకుతెరువుకొరకైన విద్యల్లా ఎంత నిష్ణాతులైన వారైనా అంటే డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, విజ్ఞానులు, వగైరా వగైరాలు కూడా పాలనలో పాలకులు ఎంపికలో తామూ భాగస్వాములమే (నిర్ణేతలలోని వారమే)నన్న స్పృహ కలిగి లేరు. ఇది రాజకీయాలను ఆధిపత్యానికి సాధనంగా వాడుకున్న ఆ వేదిక నాయకులంతా గొప్ప యత్నంచేసి సాధించిన విజయమన్నమాట. ఇప్పటివరకు జరిగినదాని సారాంశరూపమిదే. మింగుడు పడినా పడకున్నా మ్రింగక తప్పని నిజమిది.

ప్రజల్లో రాజకీయ చైతన్యం(?!) కలిగించనంతకాలం రాజకీయ క్షేత్రంలో సంస్కరణలు సమూల మార్పులు అందామా) తేవడం సాధ్యంకాదు (రావు). రాజకీయాలపేరన జరుగుతున్న అరాచకాలను స్పష్టంగా గమనించిన మనసున్న బుద్ధిమంతులు కొందరు రాజకీయ క్షేత్రాలను సరిచేయడానికి పూనుకున్నారు. వివిధ సంస్థలు వివిధ విధానాల ద్వారా ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి యత్నిస్తున్నాయికూడా.
''ప్రజలకొరకు, ప్రజలచేత, ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం''అన్నది వర్ణించుకోడానికి తప్ప ఆచరణలో కానరాని పరిస్థితి ఉంది నేడు. నిజానికా సూత్రం ఆచరణలోకి రావాలంటే పాలన రూపం, ప్రభుత్వరూపం ఎంత చిన్న సమూహం దగ్గర ఏ రూపంలో ఆకృతి దాల్చాలన్నదే రాజకీయ సంస్కరణలన్నింటికీ కేంద్రం కావాలి. మరో ప్రత్యామ్నాయం లేదు.
ప్రజాస్వామ్య వ్యవస్థ తీరుతెన్నులను సాకల్యంగా విచారించి జీర్ణం చేసుకున్న వాళ్ళందరూ భావించిందీ, ఎవరూ కాదనలేనిదీ అయిన దాని రూపం ఏమంటే..
1) గ్రామసభలు సక్రమంగా అంటే, ఆరోగ్యంగా, బలంగా పనిచేస్తుండాలి. స్థానిక ప్రభుత్వాలు (పంచాయతీల నుండి ఏర్పడి క్రియాశీలం కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివిధాంశాలపై హక్కులు, విధులు, బాధ్యతలన్నవి ఏ సూత్రాలాధారంగా ఏ నిష్పత్తులలో అమలవ్వాలన్నది రూపొందించబడిందో అవే సూత్రాలు, జిల్లా మండల, గ్రామ ప్రభుత్వాలకూ వర్తింపజేయాలి. గ్రామాలకు గ్రామ సభలెలానో, మండలాలకు, జిల్లాలకు వర్తించే మహాప్రతినిధుల సభలు సక్రమంగా స్పష్టీకరింపబడి ఆచరణాత్మకం కావాలి. గ్రామమనే సంస్థకు గ్రామసభ ఎలా మహాజనసభ అవుతుందో, పంచాయితీ సభ్యులందరి సభ ఎలా సర్వప్రతినిధి సభ అవుతుందో అలాగే మండలాలకు, జిల్లాలకూ అవ్వాలి, అవుతుంది.
అదిగో కథ అక్కడ మొదలైతేగాని ప్రజాస్వామ్యానికి ప్రపంచమంతా అంగీకరించిన నిర్వచనమైన 'ప్రజలకొరకు ప్రజలచేత ప్రజలతో ఏర్పరచుకున్న' అన్న భావం సాకారం కాజాలదు. అప్పుడు మాత్రమే ప్రజల అధికారం 'నిర్ణయాధికారం' రూపాన్ని ధరిస్తుంది. అత్యధిక శక్తివంతంగా ఆచరణలోకి వస్తుంది. ప్రజాప్రతినిధుల స్థానంలో ఉన్నవారి అధికారం అధిక ప్రజల ఆమోదితాన్ని అమలుజరిపే మేరకు కుదించబడుతుంది. త్రికరణశుద్ధితో (నిజాయితీగా) దీనిని నిలబెట్టాలనే వారందరూ దృష్టి సారించి పని ప్రారంభించాల్సింది ఈ లక్ష్యాలకు అనుగుణమైన పనుల్ని మాత్రమే.
దీనికి (1) స్థానిక ప్రభుత్వాలను తక్షణం ఏర్పరుస్తాము, (2) ప్రజల్ని చైతన్యవంతుల్నిచేసి గ్రామసభల్ని సక్రియాత్మకం చేస్తాము, (3) సమాచార హక్కు చట్టాన్ని దిగువ స్థానిక ప్రభుత్వాల స్థాయివరకు ఖచ్చితంగా అమలయ్యేలా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలవద్దా ప్రకటనలు (వివరాల బోర్డులుంచి) ఆ పనుల్ని నిర్వహించే ఉద్యోగిని ఏర్పరుస్తాము, (4) నామమాత్రావశిష్టంగా తీరికూర్చున్న 'సిటిజన్‌ చార్టర్‌' విభాగాన్ని ఖచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటాము, (5) వీటిని అమలు విషయంలో వాస్తవ పరిస్థితుల్ని సమీక్షించుకునేందుకు వీలుగా నిర్ణీత అవధుల్లో ప్రజాభిప్రాయ సేకరణ, విచారణ, నిర్ణయాలు' అన్న వాటిని అధికారికంగా నమోదుచేసి, ఆ ప్రాంత ప్రభుత్వపాలన చరిత్రగా దానిని ప్రజలకందుబాటులో ఉంచుతాము. ఆ ప్రభుత్వాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఉన్న ప్రకృతి వనరుల్ని, ఉత్పాదక సామర్థ్యాన్నిబట్టి అధికోత్పత్తిని సాధించి దానికి సమన్యాయం అన్న దృష్టితో, ఉత్పాదకులకు, శ్రామికులకు, వినియోగదారులకు యోగ్యమైన లేదా మెరుగైన రీతిలో ఫలితాలు అందేలా గట్టిచర్యలు తీసుకోబడాలి.
ప్రజల ఆరోగ్యాన్ని, బడుగువర్గాల జీవితాల్ని చిద్రం చేసివేస్తున్న దురలవాట్లను ప్రోత్సహించే పరిస్థితుల్ని క్రమంగా తగ్గించుకుంటూ రావడానికి చిత్తశుద్ధితో కృషిచేయాలి.
స్థానిక ప్రభుత్వాలు ప్రాధాన్యతా క్రమాన్ననుసరించి ముందుగా అందరికీ చెందిన సమస్యల్ని పరిష్కరించేందుకు, తరువాత పెద్దభాగానికి వర్తించే పనులు చేసేందుకు... వ్యక్తుల సమస్యలను పరిష్కరించేందుకు అన్న క్రమాన్ని పాటించాలి. (అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ఈ క్రమాన్ని తాత్కాలికంగా మినహాయించే వెసులుబాటును కల్పించుకోవాలి.
గ్రామీణాభివృద్ధి, బడుగువర్గాలను బలపరిచే పనీ, విద్యా వైద్య సేవలను వారికి అందుబాటులోకి తెచ్చేపని అన్నది ఎన్నికల సందర్భంలో ప్రధానాంశం కావాలి.
'థలవారీ అభివృద్ధి' అన్న తాత్వాక భావనకు అనుగుణ్యంగా, కులవృత్తుల స్థానంలో కుటీర పరిశ్రమలకు పెద్దపీట వేసి, అందుకవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని వెనుకబడిన మరియు గ్రామసీమలను అందుబాటులోకి తేవాలి.
స్థానిక ప్రభుత్వాలు ఏర్పడితే నిర్ణీత అవధుల్లో సంఘజీవితాన్ని గురించి, పౌర ధర్మాల్ని గురించి, జీవితాన్ని గురించి, మానవ విలువల్ని గురించిన ప్రబోధాలు ప్రజలకందేలా ప్రజా చైతన్యవేదికలను నిర్వహించే పనిని పాలనలో భాగంగా చేయాలి.
పర్యావరణ కాలుష్య నివారణ, పారిశుద్ధ్యము, రక్షిత మంచినీరు, విద్యా వైద్యసదుపాయాలు గ్రామ ప్రభుత్వాధీనంలో వున్న భూమి, ఇతర వనరులను ఉత్పత్తిస్థానాలుగ రూపొందించడం లాంటి శాస్త్రీయమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న మార్గదర్శకాలను విధులుగా ఏర్పరచుకోవాలి.
యోచనాశీలురైన మిత్రులారా! భారత పౌరులారా! మనని మనం బలపరచుకోవాలన్నా, అభివృద్ధి పరచుకోవాలన్నా, వ్యష్టిగా, సమష్టిగా ఈ కార్యక్రమాలలో తగినంత పాత్ర పోషించాల్సి వుంది. రేపటి, అసాధారణ, గంద్రగోళ, సంకక్షుభిత రాజకీయ ఎన్నికల సందర్భంగా ప్రజలు, ప్రజా సంఘాలు రాజకీయుల్ని, పార్టీలను, నాయకుల్ని వీటి విషయమై వార, వారేమిటో ప్రకటించమనాలి.
ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటరును ఎటువంటి బాహ్య ప్రలోభాలకు లోనుచేయకుండా జరిగేలా మావంతు కృషిచేస్తాం. దానికి వేరుగా చేసినట్లయితే మమ్మల్ని ఎంచుకోకండి అని ఆ పార్టీలు, నాయకులు ప్రకటించేలా అభ్యుదయ శక్తులు, సభలు, సమావేశాలు, ఇంటర్వ్యూలు, ఉమ్మడి వేదికలు అన్న వాటిని పెద్దయెత్తున నిర్వహించగలిగితే ఒక పెనుమార్పుకు అవసరమైన ఆలోచనల్ని ప్రజల మెదళ్ళలోకి ప్రవేశపెట్టగలుగుతాము.
ఇతర కార్యక్రమాల్ని ఈ కొద్దినెలలు ప్రక్కనబెట్టి ఈ కార్యక్రమాన్ని, రాష్ట్ర, దేశ ప్రజల బాగుకొరకు ఆపద్ధర్మంగా చేయవలసిన (అర్జంటు, ఇంపార్టెంట్‌) పనిగా తలంచి కలవగలిగినంత మందిమి కలిసి రాష్ట్రమంతా ప్రచారం చేయడం, అన్ని పార్టీలను వారి వారి ప్రణాళికలను, వీటిపై వారి నిర్దిష్ట సమాధానాలను ప్రకటించమని వత్తిడి చేయడం చేయగలిగితే వివేకం అంగీకరించే సందర్భోచిత కార్యక్రమమవుతుంది.
ఈ విషయంలో మీ మీ వైఖరేమిటో సిన్సియర్‌గా, సీరియస్‌గా ఆలోచించి స్పందించవలసిందిగా ఈ ముఖంగా వ్యక్తులకూ, సంస్థలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికి వెళ్ళడవుతున్న ఆయా పార్టీల భావజాలాన్నిబట్టిచూస్తే ఉన్నంతలో మెరుగైన (ఉత్తమమైన అనడంలా, ఎవరూ అనకూడదుకూడా) వేదిక లోక్‌సత్తా పార్టీయేనని నాకనిపిస్తుంది. ఈ నా భావన తప్పని రేపు ఆచరణలో తేలితే దానినాక్షణానే మార్చుకోడానికి నేను సిద్ధంగా వున్నాను. సత్వాన్వేషణ మండలి సంస్థగా దీనినంగీకరిస్తే సంతోషమే. కానీ నిబంధనమేమీ లేదు. తగినంత కూలంకష విచారణ అన్నది ఎమర్జెన్సీ, అర్జెంట్‌ అనదగ్గ సందర్భంలోనూ సాధ్యపడదు. అత్యయిక పరిస్థితిలో ఏమిచేస్తే చెడు జరగదు, అంతో ఇంతో పరిస్థితి కుదుటపడదు అన్నంతవరకే ఆలోచించగలం. లోపాలోపాలను చూసుకోడం మరింత సరైన కార్యక్రమాలను రూపొందించుకోవడం అత్యయిక పరిస్థితి నుండి బైటపడ్డాక మాత్రమే చేయాల్సి వుంటుంది. ఇది గమనించాక, ఒక ప్రకటన చేయకుండా వుండలేని వత్తిడి ఏర్పడింది నా వివేకానికి. వ్యక్తిగా నా విజ్ఞప్తి లేదా సూచన ఏమంటే అధికారంలోకి మంచి ప్రణాళికల పార్టీ(లు), మంచి వ్యక్తులు రావడంతప్ప ప్రజలకు మేలు జరగడానికి మరోదారిలేదు కనుక, ప్రస్తుత పార్టీ ప్రణాళికల్లో లోక్‌సత్తా పార్టీ ప్రణాళిక, ఆ పార్టీ నాయకత్వము ఈ దిశగా కదలడానికి సిద్ధంగా వున్న సూచనలు అందుతున్నాయిగనక మనమందరం ఈ ఆపద్ధర్మ సమయంలో (1) ఆ పార్టీని బలపరచడం, (2) ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులుగా ప్రజలకొరకు పనిచేసే వ్యక్తుల్ని గుర్తించి, నిలబెట్టుకోడం, (3) శక్తిమేర ప్రజల్ని ఈరెండంశాల్ని గుర్తించి ఓటు వేయమని ప్రబోధించడం అన్న పనికి పూనుకోవడం సందర్భోచితం అనిపిస్తోంది.
జనాభాలో అధికశాతం వున్న బి.సి.లను, ఎస్‌.సి., ఎస్‌.టి.లను ఉద్దేశించి ఆ పార్టీ ఈ వేదికలో చేరి నాయకత్వాన్ని స్వీకరించండని బహిరంగాహ్వాన్నందించడమూ సంతోషించదగిందేగాక, తక్షణం అందుకు పూనుకోవలసిందిగనూ అవుతోంది. ఈ సందర్భంగా అటు పార్టీ నాయకత్వానికీ, ఇటు ఆ రెండు సామాజిక వర్గాల నాయకత్వానికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎస్‌.సి.లుగానీ, బి.సి.లుగానీ సమైక్యంగా లేరన్నది జగమెరిగిన సత్యం. దీనిని గమనించిన ఆ వర్గాలలోని సహృదయులైన మేధావులు చాలాకాలంగా వారి వారి వర్గాల ఐక్యతకోసం శక్తిమేర, శక్తికి మించీ కూడా కృషిచేస్తూనే వస్తున్నారు. అయినా ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో లేవన్నది వాస్తవం. దీనికి ప్రధాన కారణం ఆయావర్గాల ప్రజలు కానేకాదు. వారికి చిన్నచిన్న గ్రూపులుగా నాయకత్వం వహిస్తున్న నేతల వైఖరులే అందుకు ప్రధాన కారణం. ఇంకా కొన్ని కారణాలున్నా అవన్నీ ఉపకరణాలు మాత్రమే.
ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఒక నిప్పులాంటి నిజం చెప్పుకోవాలి.
ఈనాడు గనుక, ఆ రెండు సమూహాలకు చెందిన వారిని, చిన్న చిన్న బృందాలుగా చీల్చి నడిపిస్తున్న నాయకుల్ని లేకుండా చేశామనుకోండి, 100% ఆ రెండు వర్గాలలో అంతర్గత గ్రూపులు - వాటిమధ్య అంతరాలు ఇప్పుడంత ఉండనే వుండవు. మరోమాటేమంటే అందరినీ కలపాలని ఇప్పటివరకు యత్నిస్తూ విఫలమైన చరిత్రను తిరగరాస్తూ అందరినీ కనీసం సింహభాగాన్ని (మెజారిటీ) అతికొద్దికాలంలోనే సమైక్యపరచడం సాధ్యపడింది. ఐక్యంకండంటున్న నాయక శ్రేణులే ఐక్యంకాకపోడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతున్నారన్నదే అత్యంత విషాదకరమైన వాస్తవం - ఆ రెండు వర్గాల నాయకుల్లోనూ 3 రకాల వాళ్ళున్నారు. ఆ వర్గం పేరుచెప్పి, గుంపును సమీకరించి ఆ బలం సాధనంగా తానెదగాలి అనుకునేవారు. ఈ రకం ఆ సమూహాలకు అప్పుడప్పుడు చేసే మేలుకూడా వాళ్ళని తనవెంట వుంచుకోడానికి, నమ్మించడానికి మాత్రమే. అతడి లక్ష్యం మాత్రం తాను ఎదగడమే.
(2) మరో రకం నాయకులుంటారు. వీరి లక్ష్యంలో తానెదగడం వున్నా, అది మాత్రమే ప్రధానంకాదు. తన వర్గానికంతటికీ మేలు జరగాలన్న దృష్టితో ఉంటారు వీళ్ళు. వీళ్ళలో మళ్ళా రెండు రకాలవాళ్ళుంటారు. తప్పుడు పద్ధతిద్వారానైనా తనవాళ్ళ రావలసింది రాబెట్టడం, వీలుంటే ఇదీ అన్యాయమనడానికి వీలైనంత ఎక్కువలో ఎక్కువ రాబట్టడం కొరకు పనిచేసేవాళ్ళు కాగా, రెండోవారు తమ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని పోగొట్టి న్యాయంగా రావలసిన దానివరకు పోరాడేవాళ్ళు.
(3) మూడోరకం ఒక ప్రత్యేక వర్గం బలంతో అధికారానికి రావాలనుకుంటున్నా అధికారం (శక్తి లేదా అవకాశం) వుంటే వున్నంతలో అందరి న్యాయం కొరకు అంటే ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అక్కడ వారికి న్యాయం జరిగేందుకై పోరాడదాం అనుకునేవాళ్ళు.
గమనిక : అటు వీరిని రమ్మని ఆహ్వానించిన లోక్‌సత్తాపార్టీగానీ, ఇటు ఈ మూడురకాల నాయకుల నేతృత్వంలో సాగుతున్న ఆ సామాజిక వర్గాలుగానీ, 1వ రకం వారిని వెదకి పట్టుకుని వారిని నెట్టివేయాలి. రెండవరకంగానీ, రెండు నుండి మూడోరకం వైపుకు అడుగులేస్తున్న వారినిగానీ, అరుదుగా వుండే మూడోరకంవారినిగానీ ఎంచుకుని వారికే నాయకత్వ స్థానాన్నిచ్చుకోవాలి. లేకుంటే అంతా చిందరవందరే. ఇక్కడ ఏమాత్రం తొందరపడ్డా రాజకీయాలతోగానీ, ఆ సామాజిక వర్గాల బ్రతుకుల్లోగానీ, యధాపూర్వస్థితే నడుస్తుంటుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ఈ విషయంలో ఆ పార్టీ, ఆ రెండు సామాజిక వర్గాలు, సమాజం బాగుండాలన్న మనలాంటి ఉద్యమ శక్తులూ ఈ సందర్భానికి తగినట్లు యోగ్యులైన అంటే మందికొరకు పనిచేయాలన్న నిబద్ధతకల వ్యక్తుల్ని లోక్‌సత్తా వేదికలోకి చేరేలా శ్రద్ధ తీసుకోవడం, ఆ మేరకు ప్రజల్ని చైతన్యపరచడం చేయాల్సి వుంది. అటుపైన ఉద్యమ శక్తులు మళ్ళా యధాపూర్వం మనమన కార్యక్షేత్రాలలో పాల్గొనవచ్చు. దీనివల్ల ఇటు ఉద్యమ శక్తులకు - అటు మెరుగైన రాజకీయ వేదికకు యోగ్యమైనంతమేర సహకార శక్తులుగా వుండే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాక ఉద్యమశక్తుల సూచన విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలూ, ప్రజలూకూడా సావధానులై, శ్రద్ధపెట్టి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. వివేకవంతమైన నిర్ణయం తీసుకోవలసిందిగా వ్యక్తులకూ, సంస్థలకూ, మిత్రసంస్థలకూ, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ సురేంద్ర.

No comments:

Post a Comment