Sunday, February 1, 2009

మానవ వినాశానికి దారులుతీస్తున్న మతమార్పిడులు మత సామరస్యం - ఒక పరిశీలన



స్వాతంత్య్రానికి ముందునుండే ఈ 'మతసామరస్యం' అన్నమాట అప్పుడప్పుడూ వినపడుతూనే వుంది. మతపట్టునుండి బైటపడిన కొందరు, మతాన్ని యథాతథంగా పట్టిచూడని కొందరు, పట్టించుకోని కొందరూ మానవత్వపు శుభలక్షణాల బలంతో ప్రేరణ పొంది ఈ మాటంటుండేవాళ్ళు. అట్టివారిలో ప్రజలకొరకు, ప్రజల సుఖశాంతులకొరకు నిజంగా పరితపించినవారూ ఉన్నారు. వాటినంతగా పట్టించుకోని ఉదారుల్లా, మానవత్వపు విలువలుకలవారిగా కనపడాలన్న దుగ్ధ కలవారూ ఉన్నారు. ఈ రెండు దృష్టులూ లేకనే, అందరూ మాట్లాడుతుండగా, తానేమీ మాట్లాడకుంటే ఎలా? అనుకుని ప్రసిద్ధులైనవారు మాట్లాడిన మాటలు నాలుగు ముక్కునపట్టి పడికట్టు పదాల్లా వాటిని ఉచ్ఛరించేవాళ్ళూ వున్నారు.

ముందుగా ఒక నిప్పులాంటిది మరియు ఎప్పటికప్పుడు ఆచరణలో రుజువవుతూ వస్తున్నది అయిన నిజాన్ని చెపుతాను. మతసామరస్యమన్నది దాని నిజమైన అర్థంలో, దాదాపు అసాధ్యం. లోకంలో మనకు మత సహనం రూపంలో అమలవుతున్నదంతా, మత పట్టు సడలిన, లేదా మతమింకా అంతగా పట్టుబిగించని వ్యక్తుల మధ్య మాత్రమేనన్నది చాలా చాలా కీలకాంశం. మతపట్టు సడలినవారిలోనూ రెండు సముదాయాలుంటాయి. అందొకరు మత వ్యతిరేక దృష్టికలిగినవారు. మరొకరు మతవ్యతిరేకత లేకుండా మానవీయ విలువలకు పెద్దపీట వేయాలనుకుంటుండేవాళ్ళు. ఈ ఇరువురిలో ఒకటవరకం, మతాన్ని దానిపునాదుల్తోసహా పెకలించేయాలనేదగ్గరనుండి, మతాలలోని చెడుగును గురించే అధికాధికంగా మాట్లాడుతుండే వారి వరకు వివిధ స్థాయిలవారుంటారు. నిజానికీరకాన్ని మతపట్టు సడలినవారనడంకంటే మత వ్యతిరేక బంధంలో చిక్కుకున్న వారనడం మరింత ఖచ్చితంగా వాస్తవాన్ని చెప్పడం. అయినా మతానికి కట్టుబడి వుందనితనం వుంది గనుక పరిమితార్థంలోనే వీరినీ మతపట్టు సడలినవారన్నారు. విపరీతార్థాలు లాగకుండా దీనిని గుర్తుంచుకోండి.
ఇక రెండవవాడు, మతానుకూలతగానీ, వ్యతిరేకతగానీ లేకుండా వున్నదాన్ని ఉన్నట్లుగా చూస్తూ, సబబు బేసబబుల్ని వివేచించే వైఖరి ఉన్నవాళ్ళు. వీరు మానవ సంబంధాలకూ, వాస్తవ జీవితాలకూ ముడిపెట్టి పరస్పర సంబంధాలుండడం మేలు, అవసరం అన్న దృష్టిని కలిగివుంటారు. అలాగే అన్నిమతాలలోని గుణదోషాల్ని యథాతథంగా పట్టిచూస్తూ వాటిలోని మంచిని మంచిగా, చెడును చెడుగా నిష్పక్షపాతంగా వివిచిస్తూ, అవసరమైనపుడల్లా ప్రకటిస్తూ, మంచికి వత్తాసుగా, చెడుకు ప్రతికూలంగా ఎంతోకొంతమేర పనిచేస్తుంటారు. ఆచరణలో ఆయా మతపక్షాలవాళ్ళు ప్రవర్తించినరీతిని, పనులను రాగద్వేషాలు లేకుండా చూస్తూ మంచికి, న్యాయానికి మద్తతునిచ్చే స్వభావాన్ని కలిగివుంటారు.
ఇక, మతానుసరణకు ఖచ్చితంగా కట్టుబడిగానీ, మతవ్యతిరేకతను గట్టిగా పట్టుకునిగానీ వుండనివారు సాధారణ ప్రజలు. వారు చిన్నప్పటినుండీ ఇరుగుపొరుగు సంబంధాల ప్రభావంలోనో, శతృమిత్ర సంబంధాల ప్రభావంలోనో ఆయా వృత్తివ్యాపారాలకు సంబంధించిన బంధంలోనూ వుంటూ వాటికే ప్రాధాన్యతనిస్తుంటారు. ఇదిగో ఈ రకమైన సాధారణ జనమే, మనకు నిత్యం ఎవరి మత విశ్వాసాలలో వారుంటూ సహనంతోనూ, పరస్పర సహకారవైఖరితోనూ జీవిస్తూ ఎదురవుతుంటారు. ఈ పోకడనే మతసామరస్యం అని పొరపడకూడదు. ఇదీ ముఖ్యమైన అంశమే.
మన ప్రస్తుత సందర్భానికి సంబంధించి అత్యంత ప్రధానమైన నా ప్రతిపాదనేమిటంటే, ఈ రెండు రకాలలో ఎవరినిగానీ మతసామరస్యానికి రుజువుగా (తార్కాణంగా) చూపించనేకూడదు. వీరిరువురిలోనూ మతం తన పూర్తిరూపంలో లేదా యదార్థ స్వభాంతో పనిచేయని స్థితి వుంది. ఏదైనా ఒక మతం పరమతాన్ని సహించకు అని సూటిగా ప్రబోధించాక (ఆజ్ఞాపించాక) ఆ వ్యక్తితో ఇతరునిపట్ల, కనపడే వ్యతిరేకతలేనితనాన్ని మతసామరస్యం వుండగా భ్రమపడకూడదు.
గొప్ప పొరపాటేమిటంటే, దాదాపు మత సామరస్యాన్ని గురించి గట్టిగా చెప్పచూసుకునే ప్రతివారూ ఈ రెండు రకాలకు చెందిన సమూహాలనుండి 'రుజువిదిగో' అంటూ ఉదహరించబోతారు. మతప్రభావం లేనివారిని చూపిస్తూ ఇదిగో మతస్తుల మధ్య సామరస్యం అనడం వెనక ఆ వ్యక్తుల సహృదయతను కాదనలేముగానీ, ఖచ్చితంగా అది శాస్త్రీయ అవగాహనలేనితనమేనని చెప్పక తప్పదు.
మతం గురించి స్పష్టమైన అవగాహన వుండి, ఆ మతాన్ని గట్టిగా పట్టుకుని వున్నవారిలో మతసహనమే సందేహాస్పదం. ఇక మతసామరస్యమెక్కడ.
మతసామరస్యానికై గతంలోనూ కొన్ని యత్నాలు జరిగిన దాఖలాలు చరిత్రను నిశితంగా పట్టిచూస్తే కనపడతై. కానీ అవన్నీ ఒకే రీతివీకాదు, ఈనాడున్న స్వరూపంలోనూ లేవు. అవి ఏనాడూ సమాజాన్ని తగినంతగా ప్రభావితం చేసినదీ లేదు. సామరస్యవాదులకు అంగీకరించబుద్ధి పుట్టకున్నా, మింగుడుపడకున్నా జరిగిన వాస్తవం మాత్రమిదే.
మత సామరస్యవాదులకు నేను చేసే సూచనేమంటే, మిత్రులారా! మీ వాదానికి తార్కికంగా బలం చేకూరాలన్నా, శాస్త్రీయ విచారణ స్వరూపం ఏర్పడాలన్నా ముందుగా మీరు చూపే ఉదాహరణలు మతపట్టు బిగవని సాధారణ జనం నుండిగానీ, మతపట్టు సడలిన ఎదిగిన మనుషుల సమూహం నుండిగానీ ఇదిగో మతసామరస్యం అంటూ చూపే పని చేయకండి. మొదటిరకం దానిలోకి రానివారుకాగా, రెండోరకం దానినుండి బైటపడినవారు. కనుక ఆధారాలుగా వీరిరువురిని ఎత్తుకోవడం అతార్కికం. (చెప్పిందే చెపుతావెందుకు అనుకోకండి. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చేసే విచారణంతా ఆరంభంలో దారితప్పినట్లు. దానిని నిజక్షేత్రాన్ని విడిచినట్లు) కనుక.
మత సామరస్యం అమలైంది అని మీరు ఎప్పుడు చెప్పదలచుకున్నా, ఆ రెండుపక్షాలకు వారి వారి మతాల అవగాహన తగినంతగా వుందనీ, వారిరువురూ తమ మతాన్ని నిక్కచ్చిగా అనుసరిస్తున్నవాళ్ళేనని నిర్ధారించాలి. అది తేలాక, అట్టివారి మధ్య ఇదిగోనండీ సామరస్యం అని పట్టిచూపించాలి.
ఒక వ్యక్తి ముందు నేను మనిషిని, అటు తరువాతే మతస్తుణ్ణి అనన్నాడనుకోండి. అతడు వివిధ మతస్తులపట్ల కనబరిచే మిత్రదృష్టిగానీ, సహకార వైఖరిగాని మతసామరస్యానికి రుజువు కానేకాదు. అతడు మానవత్వపు క్షేత్రంలో వుండి ఎదుటివానిలోనూ మతాన్నికాక, మనిషినే చూస్తున్నాడని అర్థం. మనిషినో మతాన్నో ఏదో ఒకదాన్నే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడితే మతాన్నివదిలి, మనిషినే పట్టుకుంటాడని అర్థం.
అదే మరింకొకడు, నేను మతస్తుడ్ని, మతాన్ననుసరించే మనుషులలో నాకు నావారు, ఇతరులు కనిపిస్తారు. నా ప్రవర్తనంతా మతాదేశాలననుసరించే వుంటుంది అన్నాడనుకోండి. అదిగో అట్టివారినే మతవాదులు లేదా మతానికి సంబంధించిన అతివాదులు (మతస్తుడు) అననాలి. ఈ రెండు పదాలలో ఏ పదానికి వారు సరిపోయినా అట్టివారికి సంపూర్ణ హృదయంతో మతసహనాన్ని ప్రదర్శించలేరు. సహనాన్ని కలిగుండడమే కష్టమవుతుండగా, ఇక సామరస్య.
అలాగే ప్రతిమతంలోనూ సున్నిత మనస్కులు, కౄరత్వం కలవారూ, శాంతులు, ఆవేశపరులు, దాతలు, లోభులు, ధీరులు, బీరువులు, సహాయపడే నైజంకలవారు, అట్టి వైఖరి లేనివారూ, స్వార్థులు, ధార్మికులు, త్యాగులు ఇలా రకరకాల మానసిక వైఖరి కలవాళ్ళుంటారు. ఈతరహా స్వభావాలు అటు మతస్తులలోనేగాక, మతేతరుల్లోనూ గోచరిస్తారు. కనుక ఒక వ్యక్తిలోని సేవాతత్పరతనుగానీ, హింసాత్మకవైఖరిగానీ చూపి ఆ మతం సేవను బోధిస్తోందనిగానీ, హింసను బోధిస్తోందనిగానీ చెప్పకూడదు. ఆరకమైన తీర్మానాలూ అశాస్త్రీయమైనవే అవుతాయి. ఒక మతం ఎలా వుండమంటోందో చూడాలంటే మనకా మతగ్రంథం ఏమి చెపుతోందో చూడడం వినా మార్గంలేదు. మతగ్రంథం చెపుతున్నదన్నా అంతగా పట్టించుకోకుండా, వైయక్తికంగా, మనిషి ప్రవర్తనల్ని చూపి అదిగో ఆ మతం అలాంటిదనడంలోనున్న అనాలోచిత-అహేతుక-పోకడేమిటో ముందర్థమైతేగాని, వ్యక్తి వాస్తవాలను చూడగిలే థకు రాడు. కనుక 'మతం-మతసహనం, మత సామరస్యం' లాంటి అంశాల్ని సజావుగా విచారించదలచుకుంటే ఆ మతంలోని ఏయేభావాలు వ్యక్తి ప్రవర్తనను ఏయేమేరకు ప్రభావితం చేస్తున్నాయో, ఆ భావాలు మినహాయించి ఆ వ్యక్తి స్వభావం ఎట్టిదో కొంతవరకైనా విడగొట్టి చూడాల్సి వుంటుంది. మతానికి ప్రతీకగా, వ్యక్తి ఆచరణలను ఉదహరించాలనుకున్నప్పుడు, ఈ విచక్షణ తప్పనిసరి. దీనిని సరిగా పట్టించుకోకుండా చేసే వాదనంతా ఆరంభంలోనే దారితప్పినట్లు.
ఈనాడు దేశంలో (ప్రపంచంలో) ప్రథమంగా గణింపదగ్గ మతాలుగా చెప్పుకోవలసినవి నాలుగున్నాయి. క్రైస్తవం, ఇస్లాం, హైందవం, బౌద్ధం. ఎందుకీ నాల్గింటినీ ప్రథమ గణనీయాలన్నానంటే,
క్రైస్తవులు ఈనాడు 220 కోట్ల పైబడి వున్నారు, ముస్లింలు సుమారు 150 కోట్లు, హిందువులనబడేవాళ్ళు 90-95 కోట్లు, బౌద్ధులు 45-50 కోట్లు వున్నారు.
రెండవ జాబితాలోకి, యూదులు, జైనులు, సిక్కులు వగైరాలు వస్తారు. మిగిలిన చిన్నా చితకా మూడో జాబితాలో వేయవచ్చు. రెండో జాబితాలోని జైనులవల్లా ప్రస్తుతం మతపరమైన సాంఘిక సమస్యలేమీ లేవు.
మానవ సముదాయాల్లో సిక్కులనుండీ ఈమధ్యకాలంలో కొంత సామాజిక సమస్య తలెత్తివుంది. అయినా అది మన భారత్‌కు పరిమితమై వుంది. ఇకపోతే యూదులకు, క్రైస్తవులకు, ముస్లింలకూ ప్రపంచంలో ఎక్కడున్నా మతప్రాతిపదికన విభేదాలున్నాయి. బౌద్ధులవల్ల ఈనాడు ఇతరులకు మతపరమైన సమస్యలు లేవు. కొన్ని మినహాయింపు ఘటనలు తక్క వివరం ఖచ్చితంగా చరిత్రకు అద్దంపట్టేదే. ఒకనాడు వైదిక, పౌరాణిక సాంప్రదాయం బౌద్ధాన్ని తన ప్రథమ శతృవుగా చూసిందన్నదీ, దానిని అణచివేసే యత్నం చేసిందన్నదీ గుర్తుచేసుకుని, ఆ మేరకు గుర్తుంచుకోవడమూ అవసరమే.
ఇంతవరకు అంగీకరిస్తే, మతపరమైన విభేదాలు వుంటున్నదీ, ఉండబోతున్నదీ, ఉండకుండా చూసుకోవాలనుకుంటున్నదీ కూడా మొత్తం ప్రపంచాన్నిబట్టిచూస్తే భారతేతర ప్రపంచంలోనైతే యూదులు, క్రైస్తవులు, ముస్లింల మధ్య సమస్య వుంది. వారివారి మతసాహిత్యం (ప్రమాణ గ్రంథం) ప్రకారమే (1) యూదులు క్రైస్తవాన్ని, ఇస్లాంను అంగీకరించరు. (2) క్రైస్తవులు యూదుల్ని, ముస్లింలను అంగీకరించరు, (3) ముస్లింలు యూదుల్ని క్రైస్తవుల్ని అంగీకరించరు.
నోట్‌ : అంగీకరించరు అనేకంటే, అంగీకరించకూడదు అనడమే సత్యాన్ని ఖచ్చితంగా చెప్పడం అనాలి. ఇక్కడకు ఇది అవునో కాదో, ఆ మూడు మతాలవాళ్ళు, మతసామరస్యం కావాలి. సాధ్యంకూడా అనేవాళ్ళు తేల్చండి ముందు. ఆ మూడిటిలోనూ యూదులు మిగిలిన క్రైస్తవ, ఇస్లాం అన్న రెంటినీ ఖరాఖండిగా గ్రంథం ఆధారంగా ఖండిస్తున్నారు అనలేంగానీ ఇస్లాం క్రైస్తవాన్ని, యూదు మతాన్ని నిర్మొగమాటంగా, విస్పష్టంగా ఖండిస్తోంది. అలాగే క్రైస్తవం క్రీస్తును దైవ కుమారునిగా, రక్షకు

No comments:

Post a Comment