అలవరుస్తుంది. నిజానికి మనిషిలో లైంగిక వాంఛే గనక లేకపోయుంటే స్వలింగ సంపర్కం గొడవాలేదు, హస్తప్రయోగం గొడవాలేదు. విలింగ సంపర్కం గొడవా వుండేదికాదు. ఈ వ్యవహారమంతా సహజంగానే శరీరధర్మంగనే లైంగికవాంఛ, అందుకై ప్రయత్నించడానికి అవసరమైన శారీరక, మానసిక ఉద్రిక్తత అన్నవి వుండడంవల్లనే జరుగుతోంది. అది సమాజం అంగీకరించి పెంపొందించాల్సిన అంశమూ, తిరస్కరించి అణచి వుంచాల్సిన అంశమా అన్నది నిర్ధారించడానికి అదొక రోగమా? కాదా అన్నదిగాని, జన్యు సంబంధంగానే అసమతుల్యత, అసాధారణత ఉన్నదా? లేదా? అన్నదిగాని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు.
సమాజ పురోగతికీ, సరళమైన (ఒడిదుడుకులు లేని) గమనానికీ మనిషి స్వభావంలోని ఏ లక్షణం (అది నార్మల్ స్థితిలో వుండేదైనా, అబ్‌నార్మల్ స్థితిలో వుండేదైనా) అనుకూలమో, దానిని వుండనివ్వడం, ఉద్దీపింపజేయడం, ప్రోత్సహించి అలా ప్రవర్తించేలా అలవాటు చేయడం, అందుకవసరమైన భావజాలాన్ని విలువల రూపంలో మెదడుకెక్కించడం, అలాగే ప్రవర్తించడానికి తగిన వాతావరణాన్ని కల్పించడం చేయాలి.
అలాగే, మనిషి సహజాత లక్షణాలలోనే ఏ అంశం, సమాజ పురోగతికి, దాని సరళ గమనానికీ ఆటంకంగా వుంటుందో దానిని నిద్రపుచ్చడం, అణచి వుంచడం, దానిపట్ల విముఖత కలిగేలాంటి భావాలను తలకెక్కించడం, అటువంటి పనులు చేయడానికి వీల్లేని వాతావరణాన్ని, అలవాట్లను అందుబాటులోకి తేవడం చేయాల్సి వుంది. వీటి విషయంలో మనిషి స్వభావంలోని ఆశాభయాలను ఆసరా చేసుకుని, ఉద్దీపింపచేయాల్సిన విషయాలలో అందుకు తగిన రీతిలోనూ, అణచి వుంచాల్సిన అంశాలలో అందుకు తగిన రీతిలోనూ ఆశాభయాలనూ కలిగించగల విషయాలను అతని బ్రతుకులోకి ప్రవేశపెట్టాలి. ఇది సామాజికంగా చూడాల్సిన అన్ని అంశాలకూ సామాన్యంగా వర్తించే సాధారణ సూత్రం ఈ సూత్రం అర్థమై, దీని సబబు బేసబబుల విషయంలో స్పష్టత లేకుండా సామాజికమైన ఏ విషయాన్ని సరిగా విచారించలేము. కనుక ఇక్కడికాగి దీనినే మరోసారి పరిశీలించి ఒక నిర్ణయానికి రండి.
ఉదా : లైంగిక వాంఛ ప్రాణి సహజాతమా కాదా? అందులోనూ మానవులకది బలమైన ఆకాంక్షనా కాదా? ఇదేమైనా రోగమా; అబ్‌నార్మలిటీనా; ఆ వాంఛ తీర్చుకునే హక్కు ప్రతిమనిషికీ వుండాల్నా వద్దా? దానినీ ప్రాథమిక హక్కుల్లో చేర్చాల్నా వద్దా? అని అడిగామనుకోండి,
వైద్యశాస్త్రం నాల్గింటికీ సమాధానాలు చెప్పదు-చెప్పలేదు-చెప్పకూడదు. దాని క్షేత్రము, అది రోగమో కాదో చెప్పడం, చికిత్స వుందో లేదో చెప్పడం, అబ్‌నార్మల్‌లో నార్మల్ నిర్ణయించడం, పుట్టుకతో వచ్చిందో, మధ్యలో వచ్చిందో చూడడం, స్వస్థ స్థితికి చేరడానికి చేయగలంత తాను చేయడం.
మిగిలిన రెండు ప్రశ్నలకూ సమాజం సమాధానం చెప్పాలి, చెపుతుంది. లైంగికావసరం తీర్చుకునే హక్కు ప్రతివ్యక్తికీ వుండాలన్నదే ఆ సమాధానం. సాధారణ స్థితిగతుల్లో అది ప్రాథమిక హక్కుగానూ పరిగణించవచ్చు సమాజం. కొన్ని అసాధారణ పరిస్థితులలో తాత్కాలికంగా ఆ హక్కుకు కళ్ళెం వేయడానికీ వీలుంది. సమాజం గురించి అందులోని హక్కులు, విధుల స్వరూప స్వభావాల గురించీ తెలిసినవారెవరైనా చెప్పగల అంశమే ఇది.
అయితే వ్యక్తి తన హక్కుననుభవించడానికి సమాజం రూపొందించిన విధానాన్నే పాటించి తీరాలి. అది నా హక్కుగనుక-హక్కును నీవు (సమాజమూ) అంగీకరించింది గనుక ఆ హక్కును యధేచ్ఛగా పొందుతాను అనడానికి వీల్లేదు - హక్కు విషయంలోగానీ, విధి విషయంలోగానీ నీకున్నది పరిమిత స్వేచ్ఛనన్నదే ఒడంబడిక స్వరూప స్వభావాలలోని సారాంశం. కనుకనే లైంగిక వాంఛ సహజమైందే అయినా స్త్రీ పురుషులెవరుగానీ, యధేచ్ఛగా దానిని తీర్చుకోకూడదు అని సామాజిక కట్టడి చెపుతోంది. వివిధ దేశాకాలాలలో వివిధ ఒడంబడికలు, వివిధమైన కట్టుబాట్లు ఏర్పరచుకున్నా, అవి సరైనవైనా, కాకున్నా వ్యక్తి ప్రాథమిక హక్కులనైనా ఒడంబడికకు లోబడే పొందవలసి వుంటుంది అన్న సాధారణ నియమం అంతటా కనబడుతుంది. ఈనాటికీ అదే అమలవుతుంది. ఆ సూత్రం అమలవ్వడమే ఎప్పుడైనా సరైనదవుతుంది.
ప్రాణిజాతుల్లో పరిణామం జరుగుతూ వస్తున్నకొద్దీ ఇష్టాఇష్టాలలో స్పష్టత, ఇష్టానికనుకూలంగా, అయిష్టానికి ప్రతికూలంగా యత్నించడమూ క్రమాభివృద్ధిగా చోటుచేసుకుంటూ వచ్చాం. మానవుని థలో ఆ యత్నాలు ఆత్మనియంత్రణ, బాహ్యనియంత్రణ రూపాలుగా స్పష్టతను సంతరించుకున్నాయి. కనుకనే ఉమ్మడి అవసరాలరీత్యానూ, తన అవసరాల రీత్యానూ తనపై తన అదుపు, తనపై ఇతరుల అదుపు, ఇతరులపై తన అదుపు అన్నవాటి అవసరాన్ని గుర్తించి అందుకు తగిన నియమ నిబంధనలను, భావజాలాన్ని, శిక్షణనూ (అభ్యాసం, సాధనలను) రూపొందించుకున్నాడు మనిషి. అనగా తన సహజాకాంక్షల నెరవేర్పుకై ప్రతి మనిషీ పరిమిత స్వేచ్ఛను అంగీకరించాలనీ, కొన్ని విధులనూ నెత్తినేసుకోవాలనీ, ఆ రెంటినీ అమలు పరచడంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలనీ ఒక సర్వసాధారణ నియమాన్ని పెట్టుకున్నాడు.
మనిషి కొన్నిరకాల మానసిక స్థితుల్ని కలిగించగల అనుభవాలను మాటిమాటికీ కావాలని తలుస్తాడు. మరికొన్ని మానసిక స్థితుల్ని కలిగించే అనుభవాలను ఎప్పుడూ తిరస్కరిస్తుంటాడు. వీటినే తాత్వికంగా అనుకూల లేదనీయాలు, ప్రతికూల వేదనీయాలు అనంటారు. సుఖం, సంతోషం, హాయి, ఆనందం, తృప్తి శాంతి అన్నమాటలు ఏ మానసిక స్థితులకు పెట్టామో వాటినే అనుకూల వేదనామాలంటారు. అంటే అవి ఏర్పడినప్పుడు మనకు వాటిని అలానే వుండనివ్వాలనిపిస్తుంది. తిరస్కరించాలనిపించదు.
వాటికి మారుగా దుఃఖం, అసంతుష్టి, ఆందోళన, శ్రమ, అలసట, అసంతృప్తి, అశాంతి అన్న పదాలచే సూచించే మానసిక స్థితులు ఏర్పడ్డప్పుడు అవి వుండకూడదనిపిస్తుంది. తిరస్కరించే యత్నం జరుగుతుంటుంది. అందుకే వాటిని ప్రతికూల వేదనీయాలు అనన్నారు. ఇక్కడికిదీ అర్థమైతేగాని మన విచారణ సజావుగ సాగదు.
గమనిక : ఇదంతా మానవ స్వభావరీత్యా ఎవరూ కాదనలేని వాస్తవం కనుక నిర్వివాదమే అంటున్నాను.
మనిషిని అతినిష్టానికి అతణ్ణి ప్రవర్తించమని అంగీకరించి, ప్రోత్సహించామనుకోండి. దానికేమీ ఆటంకాలు లేకుండాచేసి, అనుకూల వాతావరణాన్నీ కల్పించామనుకోండి. అప్పుడతని సాధారణ ప్రవర్తన ఎలా వుంటుంది. తనకితరములైన వాటిని, అనుకూల వేదననీయతను ఇవ్వగలవాటిని వుంచుకుని, వాడుకుంటూ, ప్రతికూల వేదనీయతను కలిగించే వాటిని వదిలించుకుంటూ సాగిపోతుంటాడు. అంటే తన అవసరాలవైపే మొగ్గి ఇతరుల విషయం పట్టించుకోకుండా సాగిపోతుంటాడు.
మనిషికి సుఖం పొందే హక్కు వుందా లేదా? దుఃఖాన్ని పోగొట్టుకునే హక్కు వుందా? లేదా? అనడిగామనుకోండి! ఉంది. ఉంది. ఉంది అని తీరాలి. రెండూ గనక లేవనేట్లయితే ఏ వ్యక్తీ ఇతర వ్యక్తులతో ఒక ఒప్పందానికి రావలసిన అవసరమే లేదు. రాకూడదుకూడా. అయినా ఆ రెండూ తనిష్టమొచ్చిన మార్గంలో పొందే స్వేచ్ఛ అతడికి లేదు. అక్కడ ఎప్పటికప్పుడు అప్పటికున్న సామాజిక కట్టుబాటుకు లోబడే వాటిని పొందుతుండాలి. అప్పటికున్న కట్టుబాటేదైనా సామాజిక ఒడంబడికయొక్క ప్రధాన లక్ష్యానికి ఆటంకంగా తయారైతే ఆ మేరకు ఆ కట్టుబాటును సవరించుకోవలసి వుంటుంది. ఒక ఉదాహరణ ద్వారా దీనిని విచారిద్దాం.
ఉన్నది స్త్రీ పురుషులే. వారిద్దరికీ కొన్ని విషయాలలో ఒకరి అవసరం మరొకరికి తప్పనిసరై వుంది.
గమనిక : నపుంసకులు అన్న సమూహం వున్నా పుట్టుక జన్మసిద్ధంగా ఏర్పడ్డ అపసవ్యతవల్ల ఏర్పడ్డదే. కనుక వైకల్యం రూపంగనే దానిని చెప్పుకోవాలి. సృష్టి సహజంగా మానవుల్లో మూడు జాతులు లేవు. అట్టివారి సహజాకాంక్షల నెరవేర్పుకై ఎట్టి వెసులుబాటు లేదా ఏర్పాటు చేసుకోవాలో యోచించాలిగాని, వారికొరకుగా లైంగిక సహజాకాంక్ష తీర్చుకోడానికి మొత్తం మానవులలోనూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయకూడదు. అది మరిన్న సమస్యలకు దారితీస్తుంది.
అందులోనూ తప్పనిసరైంది కామవాంఛ తీర్చుకోవడమన్నది. ప్రాణుల్లో కామవాంఛ కలగడం, అది సుఖంగా వుండడం అన్నది ఆరంభంలో పునరుత్పత్తి అవసరం దృష్ట్యా రూపుదిద్దుకున్నది. కనుకనే పునరుత్పత్తి సామర్థ్యం సమకూడిన వయస్సు నుండే, అందుకు తగిన సమయంలోనే మగ, ఆడ జీవుల మధ్య లైంగిక ప్రేరణ కలుగుతుండేది. బాగా పరిణితి చెందిన జీవుల్లో, ముఖ్యంగా మానవుల్లో మాత్రం అది పునరుత్పత్తి లక్ష్యంగానేకాక ఆనంద ప్రాప్తికీ బలమైన సాధనంగా తయారైంది. అటుపై క్రమంగా మనిషి దానిని పునరుత్పత్తి కొరకు కంటే సుఖప్రాప్తి కొరకే ముఖ్యమైనదిగా భావిస్తూ, వాడుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలోనూ సమాజం ఒడిదుడుకులకు లోనుకాకుండా, ప్రశాంతంగా సాగిపోవాలంటే ఈ సహజవాంఛను, తీర్చుకోడానికీ దానిద్వారా నిరంతరాయంగా సుఖాన్ని పొందుతుండడానికీ కూడా విశృంఖలత కంటే, కట్టుబాటుకు లోనైన అవకాశం అన్న పద్ధతే సరైందన్న అవగాహనకు వచ్చాడు. ఆ విధానంలోనే సమాజంలో అలజడి లేకుండా వుండం, అవసరమైనపుడల్లా ఆ తృప్తిని పొందే అవకాశం వుండడం, మానవజాతి మనుగడకు అవసరమైనమేర పునరుత్పత్తినీ అదుపులో వుంచే వీలూ వుండడం జరుగుతుందని తేల్చుకున్నాడు. కనుకనే లైంగిక స్వేచ్ఛకు రకరకాలైన అడ్డుకట్టలు పెట్టుకుంటూ, ఆ హక్కును సామాజిక విధుల్తో ముడిపెట్టి పొందేందుకు అంగీకరించి ఆ మేరకు సర్దుబాటు చేసుకున్నాడు.
కనుకనే ఉన్నది రెండు జాతులే అయినా, ఆ రెంటికీ కామవాంఛ సహజాతమే అయినా, అది తీర్చుకునే హక్కు ప్రాథమిక హక్కుగా వుండాలన్న మాటకు ఎదురులేకున్నా, దానినెలా పొందాలన్న దాని విషయంలో ఎన్నో కట్టడులు పెట్టుకున్నాడు. ఆ రకంగా జంతు ప్రవృత్తి నుండి విచక్షణాశీలియైన మానవ ప్రవృత్తి అన్న నూతన వరవడిని రూపొందించుకున్నాడు.
మిత్రులారా! ఈ సమాచారం ఆధారంగా 'స్వలింగ సంపర్కం' ప్రోత్సహించాల్సిన పనుల్లోకి వస్తుందా? నిగ్రహించడానికి వాటి జాబితాలోకి వస్తుందో మీరూ ఆలోచించండి. పై సంచికలో మరిన్ని వివరాలు అందిస్తా.
No comments:
Post a Comment