యోచనాశీలురైన పాఠకమిత్రులారా! హైందవ క్రైస్తవం రచయిత ఎక్కడ మొదలెట్టి ఎక్కడకు దిగజారారో క్రమంగా పరిశీలించాక, నాకైతే! అతని దిక్కుతోచని, దయనీయ పరిస్థితి, ఒక వంక జాలి గొలుపుతూ ఉంది. మరోవంక అతనికలాంటి శాస్తి జరగాల్సిందేననీ అనిపిస్తోంది. అమాయకులైన హిందువుల్ని క్రైస్తవంలోకి తోలుకెళ్ళడానికి ఎంత కుట్ర పూరితంగా వ్యవహరించాడాయన?! 'హిందువులెవరూ పట్టించుకోరులే అన్న ఒకే ఒక్క ధీమా' అతని చేత అంతసాహసం చేయించింది.
ఒక ముఖ్య గమనిక :- 1. పనీపాటా లేని రకం, 2. అమాయకుల్ని తమ వైపు ఆకర్షించి స్వార్థ ప్రయోజనాలను పొందాలనుకునే రకం 3. యువత బలహీనతల్ని సొమ్ము చేసుకుందా మనుకునేరకం, అన్న మూడు రకాల వాళ్ళూ; ఎలెక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల పేరున హోరెత్తిపోతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగా దుర్వినియోగం చేయాలో అంతగానూ దుర్వినియోగం చేస్తూ వస్తున్నారు.
మన ప్రస్తుత విచారణీయాంశంలోని ముఖ్య పాత్రధారి అయిన ఓఫీరుగారు, పై మూడు రకాలలోని రెండవ రకానికి చెందిన వారు. అందులోనూ ఉద్దండులు. సి.డిలు చేసి, టి.వి లలో ప్రసంగించి, పుస్తకాలురాసి, సభలూ సమావేశాలు పెట్టి, అవన్నీ తప్పులేనని తనకే తెలిసిన అబద్దాలను, తనకే తెలీని అనేక విషయాలనూ కలిపేసి తెగతెలిసిన వానివలే; సాధికారిక ప్రతినిధి మాట్లాడినట్లు మాట్లాడేస్తూ, వాటినన్నంటినీ మందినెత్తిన, అమాయకపు మందనెత్తిన గుమ్మరిస్తూ వచ్చారు. డబ్బుకు కక్కుర్తిపడో, బ్రతుకుతెరవుకొరకో దీన్నంతటినీ భుజానికెత్తుకుని అమాయకజనానికి చేర వేసే సొంత మందా కొందరున్నారాయనకు. ఈ రకమైన పన్నాగంలో భాగంగానే ఉనికిలోకి వచ్చిన హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ఆధారంగా ఏమి జరుగుతూ వచ్చిందో సంగ్రహంగా ప్రకటించడానికి ఉద్దేశించిందే ఈ వ్యాసం.
1. హైందవ క్రైస్తవం అన్న పుస్తకం ప్రచురించి కొద్ది సంఖ్యలో సమాజం పైకి వదిలాడు.
ఎ) దానిని చూచి సొంత మంద అబ్బో తెగబాగుందన్నారు. క్రైస్తవుల్లోనే కొందరు తప్పన్నవారూ ఉన్నారు. బి) ఇతర మతస్థులు - క్రైస్తవేతరులు- ముఖ్యంగా హిందువులు ఒకడూ అరా అదేమిటన్నారో లేదోగాని, ఈయన గారు పునరాలోచించుకునేలా ప్రతిఘటనేమీ రాలేదు. సి) తూ. గోదావరి జిల్లా నుండి ఈ పుస్తకంలోని అభ్యంతరకర అంశాల ఆధారంగా ఒక కేసువేశారు. అంతో ఇంతో పలుకుబడీ సరిపడినంత డబ్బు ఉన్న వాడవడంతో, ఈయనగారు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయించుకుని, ఆ కేసువిచారణకు రాకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు.
2. పెద్దగా ప్రతి ఘటనేమీ రాకపోవడంతో మరో అడుగు ముందుకేసి, భారతదేశం మొత్తానికీ సవాలంటూ ఎవరైనాసరే తన హైందవ క్రైస్తవంలో దోషాలు, తప్పులు ఉన్నట్లు రుజువు చేస్తే తానుక్రైస్తవాన్ని విడచి హిందువునవుతాననీ, సవాలు చేసినవారు అలారుజువు చేయకుంటే తన ద్వారా బాప్తిస్మం తీసుకుని క్రైస్తవంలోకి రావలసి ఉంటుందని, ఒక సి.డి ప్రకటనచేశారు. ఆ ప్రకటనలో హై.క్రైస్తవం అన్న తన పుస్తకాన్ని 600 మంది స్వాములకు పంపినట్లు, టి.వీ ద్వారా బహిరంగ చర్చకు పిలుపిచ్చినట్లు చెప్పారు. అయితే ఆ పుస్తకాన్నందుకున్నవారందరూ దానిలో దోషాలున్నాయనేంత శక్తి తమకు లేదని చెప్పినట్లూ, కొందరైతే చాలెంజికి భయపడి పలాయనం చిత్తగించినట్లూ కూడా ప్రకటించేశారు.
సి.డి.రికార్డు రూపంలో ఉన్న ఈ ఆధారంతో, సత్యాన్వేషణ మండలి అన్న సంస్థకు చెంది, వివిధ తాత్విక, మత సిద్దాంత గ్రంథాలను గత 30 ఏండ్లుగా అధ్యయనమూ, తులనాత్మక పరిశీలనా చేస్తూ వస్తున్న పుట్టా సురేంద్ర బాబు అనునేను, ఓఫీర్ గారి సవాలును స్వీకరిస్తున్నాననీ, ఎప్పుడు ఎక్కడ వీటిని తేల్చుకోడానికి ఎదురుపడదామో తేల్చి చెప్పమనీ ఒక రిజిష్టరు ఉత్తరం వ్రాసి, ఆ మొత్తాన్ని మా మాసపత్రిక వివేకపథంలో ప్రకటించి, ఆ సంచికను ఆయనకూ, మరికొన్ని మత సంస్థలకు చెందినవారికీ పంపాను. ఆ నా లేఖలోనే సి.డిలో ఓఫీరుగారు ప్రకటించిందెంత వరకు వాస్తవమో; తెలుసుకుందామనుకుని; ఆయనన్న 600 మంది సాధుసన్యాసులు మొ|| వారి పేర్లు, చిరునామాల జాబితా పంపండనీ రాశాను. (మొదటిలేఖ 14.7.2015లోనూ, రెండోలేఖ 12-8-2015న రాశాను)
ఆశ్చర్యం :- దేశం మొత్తానికీ సవాలన్నాయన, సవాలుకు నేను రెడీ అంటున్నా నాకు సమాధానం పంపనూ లేదు. జాబితానూ పంపలేదు. ఈ వివరాలు (వివేకపథం - 218 చేదు నిజాలు - నిష్ఠుర సత్యాలు) లో ఉన్నాయి.
వివేకపథాన్ని చదువుతున్న వారిలో మరి కొందరు రంజిత్ ఓఫీరు గారికి వారి సవాలును తామూ స్వీకరిస్తున్నట్లు చర్చకు సిద్దం కమ్మన్నట్లూ రాశామని నాకు తెలిపారు. ఆ మాటలూ వి.పథం - 219 లో ఉట్టంకించాను. అలా రాసిన వారిలో ఏ మతానికి చెందని, డా.బ్రహ్మరెడ్డిగారూ, వైదిక సాంప్రదాయానికి చెందిన మాతాజీ, నిర్మలయోగ భారతిగారు, ధర్మజాగరణ సంస్థకు చెందిన సిద్దాంతిగారు మరికొందరూ ఉన్నారు. వారిలో కొందరైతే సురేంద్ర బాబుతో మాట్లాడితే మాతో మాట్లాడినట్లే, అతని గెలుపోటములు మావిగా అంగీకరిస్తాము అనీ రాశారాయన గారికి. అయినా మన ఛాలెంజర్! నిరంతర సత్యాన్వేషి! సత్య సంస్థాపనాభిలాషి! ఈ యుగపు యేసునోరు! అని తనకుతానే కితాబులిచ్చుకున్న రంజిత్ ఓఫీరుగారు కిమ్మన్నాస్తిగా గమ్మునున్నారంతే.
ఏమిచేస్తాం! అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో రకంగా ఆయన్ను ముగ్గుమీదకు తేవడానికి రకరకాలుగా యత్నిస్తూనే ఉన్నాను. ఒక దశలో ఒకింత కఠిన భాషనుపయోగించగా, ఫజులుర్రహ్మన్‌గారు, మన వైపుకు తీసుకురావాలనుకున్న వారిని గానీ, ఆలోచింపజేయాలనుకున్న వారినిగానీ ఇలా కఠినంగా మాట్లాడితే మన లక్ష్యమే నెరవేరకుండా పోతుంది కదా! నాకు తెలిసినంతలో ఓఫీర్‌గారు చర్చకు వెనకాడే మనిషికాడు అనన్నారు. అప్పుడు నేను ఏమండీ రహ్మన్‌గారూ! జరుగుతున్నదంతా మీరూ శ్రద్దగా గమనిస్తూనే ఉన్నారు కదా! బైబిలు, ఖురానులనేగాక, హిందూ గ్రంథాలనూ ఎంతో కొంత చూసిన మీకూ బైబిలు - ఖురానుల ననుసరించే అతడు చెపుతున్నది అబద్దం అని తెలుసు, పైగా మీ కాయనతో మిత్ర సంబంధాలూ ఉన్నాయి. రండి కూర్చుని మాట్లాడదాం అనిగానీ, మీ అభిప్రాయాలు సరైనవి కావనిగానీ ఆయనతో మీరే ఎందుకు చెప్పరండీ! అని అడిగాను. ఆయనను వేదికపైకి తీసుకొచ్చే యత్నం - సత్యం కొరకైనా- మీరూ చేయవచ్చు కదా అని అడిగాను. పొరపాటైంది. ఇప్పటి వరకు నేను ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఆయనను కలిసి విషయం చెప్పి, ఒప్పించే యత్నం చేస్తాను అన్నారు. రహ్మన్ గారు అన్నట్లే పట్టుబట్టి ఆయన్ను కలసి, అక్కడి నుండీ నాతో ఫోనులో మాట్లాడించారు. ఫోనులో ఓఫీరుగారు అప్పుడు నాతో మాట్లాడిన నాలుగు మాటల్ని, మీ లెటర్‌హెడ్ పై వ్రాసి పంపండని ఓఫీరు గారికే చెప్పాను. రహ్మన్‌గారు ఆ లేఖను నాకు చేర్చారు.
దానిపై; ఆ లేఖలో ఓఫీరుగారు ప్రతిపాదించిన అంశాలు ఎందువల్ల సరైనవికావో అదంతా వివరిస్తూ, మరొక రిజిష్టర్ లేఖ ఓఫీరుగారికి రాస్తూ, దానిని వివేకపథంలో ప్రకటించాను. వివేకపథం ద్వారా ఈ వివరాలందుకున్న విశాఖపట్నానికి చెందిన ఒక చిన్నపత్రిక సంపాదకులు కనకరాజుగారనుకుంటా రంజిత్ ఓఫీరుగారిని విమర్శిస్తూ ఒక ప్రకటన చేశారు. దానిపై రంజిత్ ఓఫీరు గారు మరో ప్రసంగం చేసి, దానిని సోషల్ మీడియాలోనూ పెట్టారు. అందులో తాను మామూలు స్థాయి కలిగిన వాణ్ణికాననీ, దారిన పోయ్యేవాళ్ళేదో అంటే స్పందించి, అందుకు సిద్దపడడానికి తానేమీ పనీ పాటా లేని వాణ్ణి కాననీ, జెబ్బలెగరేసుకుంటూ ఏదేదో తెగ మాట్లాడేశారు. సురేంద్రను నా హైందవ క్రైస్తవం పై ఒక విమర్శనాత్మక గ్రంథం రాసి ప్రచురించమన్నాను. అదింకా ఆయన చేయనేలేదు. ఆయన ఆ పుస్తకం రాసి, దానిని నాకు పంపితే, అదంతా చూసి, సురేంద్ర నాతో కుస్తీకి సరిపోతారో లేదో నిర్ణయించి అప్పుడు చెపుతాను అంటూనూ తెగ రెచ్చిపోయి మాట్లాడారు.
ఓపెన్ ఛాలెంజ్ అన్న ఓఫీరు గారు; సరైతేరా చూసుకుందాం అని సవాలును స్వీకరించిన నాతో నీకేమేమి పట్లు తెలుసో, నన్నెక్కడెక్కడ కొడతావో, ఎలా కొడతావో వివరంగా చెపితే అవన్నీ పరిశీలించుకున్నాక, నీతో కుస్తీ పట్టాలో లేదో చెపుతాను అంటూ చేసిన బుద్ది తక్కువ ప్రతిపాదనను ఆయన పక్షంలోని ఒక్కడంటే ఒక్కడు ఇదేమి పద్దతని అడగలా. ఒకరిద్దరైతే, ఆయనడిగినట్లు అదేదో పుస్తకం రాసేస్తే పోనుగదండీ అని, అమాయకంగా, అంతే తెలివి తక్కువగా తిరిగి నాకే సలహా ఇచ్చారు. అసలా విధానం ఎవరూ అనుసరించగూడనిదే అయినా, నా పోకడలోని బలమూ, ఆయనన్న వాటిలోని డొల్లతనమూ మచ్చు చూపించడం కోసమని, హైందవ క్రైస్తవంలోని '4' అంశాలను ఎత్తుకుని అవి ఎలా తప్పులో వివరించి నిర్ధారించాను. 1. అట్టపైని ముఖచిత్రంలోని దోషమూ, అది తయారు చేయడం వెనుక నున్న కుటిల పన్నాగం 2. లోపలి పేజిలో ముందే ఉన్న 'సత్యమహంగంభీరః' అన్న కొటేషను, దానికి వివరణగా 'సత్య విజయం' శీర్షికన ఆ పుస్తకంలోనే లోపలి రాతలను 3. ఓంకారమే క్రీస్తు అయ్యెను. 4. అట్ట చివరి పేజిలో ఆయనే తన గురించి రాయించుకున్న అతిశయోక్తులు 5. 'భువనస్యనాభిః' అన్న దానిని గురించి ఆయన రాసిన రాతల్లోని తప్పుడు భావాలు. ఈ ఐదు అంశాల సమాచారం ఆయనకు అందజేశాను పత్రిక పంపడం ద్వారా ఇక్కడికే, ఆయన ససంతా పసలేనిదే ననడానికి అవసరమైన కనీసాధారాలు నేను రాత మూలకంగా ఆయనకు అందించ నట్లయింది, స్థాయిల గురించి తెగ వదరిన అయ్య గారికి, ఈ విషయాల వరకైనా నేనేమిటో నసాళానికంటినట్లే. నోరెత్తితే ఇరుక్కుపోతామని స్పష్టంగా తెలిసినట్లే. నేను ఈ వివరాలు చెపుతూ స్థలకాలాలు నిర్ణయించండి. క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడే వేదికకు రండి. ఇంకా మరికొన్ని అంశాలూ విచారించి మీ పుస్తకమెంత అసత్యాలతో, కల్పనలతో, కూడి ఉందో, దానిని సిద్దం చేసిన మీ మనస్సులో ఎంత కల్మషం ఉందోనూ రుజువు చేస్తాను అనీ ప్రకటించాను. ఆయనకు పరిస్థితేమిటో తెలిసిపోయిందనుకోండీ ఆయన అంతటోడింతటోడంటూ భుజాలకెత్తుకుని, వీరంగం వేసే వారైనా, రాన్నా! నీ ప్రతాపం చూపించు, లోకానికి నీవేమిటో, నీ పసేమిటో తెలియపరచు అని అతణ్ణి వత్తిడి చేయవచ్చుకదా!
ఈ మధ్య ఆయన గారిదే మరో ప్రసంగం, వాట్సాప్ ద్వారా నాకు చేరింది. కరుణాకర్ సుగుణ అన్నతను, దానిని నాకు పంపాడు. అది చూశాక నాకు 1. పెద్దగా నవ్వుకోవాలనిపించింది. 2. అతని అనుచరగణాన్ని పిలిచి ఈ బేల ప్రార్థన లేమిటి? అని అడగాలనిపించింది. మరో వంక అతని దిక్కుతోచని పరిస్థితీ, దీనాలాపములను బట్టి జాలీ కలిగింది. ఆ వివరాలివిగో? మామూలుగానైతే ఎంతో హుందాగా, డాబుదర్పంతో, అహంభావిగా ట్రిమ్ముగా కనపడే ఓఫీరుగారు దిగులుగా, జబ్బుపడ్డమనిషిలా, మ్లానవదనంతో, తెగ ఆవేదనపడుతున్న ముఖ భంగిమతో మాట్లాడినట్లుంది అందులో. ఓడిపోయినవాడూ, దెబ్బతిన్నవాడూ, తిరిగి ఏమీ చేయలేని స్థితిలో ఏమి మాట్లాడతాడో, ఎలా ఉంటాడో అన్న దానికి గట్టి రుజువుగా ఉందా రికార్డులోని ఆయన తీరు 1. ప్రేమగలిగిన మా మహా పరిశుద్ద తండ్రీ! అని మొదలైందాయన ప్రసంగం.
2. సువార్త విరోధులను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున మేము శపిస్తున్నాము తండ్రీ! వారిని నష్టపరచండి, భయపెట్టండి తండ్రీ!
3. వారి కుటుంబములు, వ్యాపారములు నష్టపరచండి! ఏసుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇదంతా జరిగిందని తెలుసుకుని గడగడ వణికే వాతావరణం పుట్టించండి. (ప్రక్కనున్న మంద ఆ మేన్ అని అరుస్తున్నారు)
4. రెండవ కీర్తన 4, 5 వచనాలలో చెప్పినట్లు ప్రచండకోపంతో దిగివచ్చి ఏసునాథా వాళ్ళను తల్లడిల్లజేయమని ప్రార్థన చేస్తున్నాం.
5. రెండవ కీర్తన నెరవేర్చండి! ప్రచండకోపంతో దిగిరండి! తండ్రీ నీకు స్త్రోత్రాలు. ఈ దేశంలో, మా దేశంలో, ప్రపంచ దేశాలన్నంటిలోనూ సువార్త విరోధులను తల్లడిల్లజేయండి.
6. వడగండ్ల వాన కురియునుగాక! భూకంపములు వచ్చునుగాక! సువార్త విరోధుల శిబిరాలు కుప్పకూలిపోవునుగాక! (చప్పట్లు)
7. ప్రభువా! మనుషులేపాటి వారునాయనా! నీవు దేవదేవుడివి. దిగిరా తండ్రీ! మేం ఒప్పుకోం! నీవు రాకుంటే ఒప్పుకోం! మా ప్రాణాలడ్డు వేసి అడుగుతున్నాం. భారత దేశానికి దిగి రండి ఏసయ్యా! నీకు వందనాలు. మహర్షులతో మాట్లాడి మిమ్ము తెలియపరచుకోడానికి క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు వచ్చావు. ఇప్పుడు క్రీస్తు శకం 2000 ఏండ్ల నాడు మళ్ళీ రాతండ్రీ! అప్పుడు వచ్చి వేదాలలో నిన్ను గూర్చి రాయించావు. దానిని కాదంటున్న వాళ్ళను తల్లడిల్లజేయడానికి మళ్ళా దిగిరాతండ్రీ!
పాఠక మిత్రులారా! ఇదండీ ఆ ప్రసంగంలోని విషయం -ఓఫీరుగారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనడానికి దీనంతటినీ పరిశీలిస్తున్నవారికి ఎట్టి అభ్యంతరమూ ఉండదను కుంటాను.
సమీక్ష
ఎక్కడ, ఏ గొంతుతో, ఎంత ఆర్భాటంగా, అహంభావంతో మొదలైందాయనగారి ఛాలెంజి ప్రకటన?!1. 600 మందికి పుస్తకం పంపాం, టివిలలో బహిరంగ చర్చకు ఆహ్వానించాం, పెక్కురు స్వాములకు, అర్చకులకు పంపాం. దానిలో తప్పుందనడానికి ఒక్కడూ సాహసించలా, కొందరైతే తమకంతశక్తి లేదన్నారు. కొందరైతే పారిపోయారు. నేనైనా సత్యం చెపుతా, మీరైనా సత్యం చెప్పండి. నేనైనా హిందువునవుతా మీరు క్రైస్తవులైనా అవ్వండి. అదో యిదో, దేనికైనారెడీ! ఇదీ! ఆనాటి ఆయన గారి ధీమా, దూకుడుమాట.
2. సవాలు స్వీకరిస్తున్నామన్న నాలాటి వారి పిలుపుకు సమాధానంగా, నన్నడిగిన వారి లెవలెంత? నాలెవలేంటి? వారికి పనీపాటా లేకుంటే, నాకూ పనీ పాటా ఉండవా? నేనన్న ప్రతిదానికీ రుజువులతోటీ పుస్తకంరాశాను. అలాగే వారు వాటన్నంటినీ అంశాల వారీగా తప్పు బట్టి, రుజువులతో సహా ఒక పుస్తకం రాసి నాకు పంపాలి. దానిని చూశాక, వారికి మాట్లాడదగ్గ స్థాయి ఉంటేనే చర్చ. దారిన పొయ్యేప్రతి వానికి బదులిస్తామా?! ఇదండీ! ఆయన గారి మలి ప్రసంగపురీతి. ఇందులో వెనకటి డాంబికతతో బాటు ఒకింత మేకపోతు గాంభీర్యమూ జతైంది. ఎందుకంటే?
1. అప్పటికే ఆయనగారి అనుచరుడూ, నాకు పరిచయస్తుడూ అయిన జగదీష్ గారికి, బైబిలును పరిశీలిస్తున్న అనేకులున్న సభలోనే, హైందవ క్రైస్తవంలోని ''భువనస్య నాభిక'' అన్న అంశాన్ని చూపించి, వేదంలోని ఆ భాగాన్ని, దానికి ముందు వెనకలనున్న భాగాలనూ, ఆ సూక్తానికి దాశరధి గారు చెప్పిన అనువాదాన్ని, దయానందుడు చెప్పిన అర్ధాన్నీ, ఆ సందర్భాన్నీ వివరించి, రంజిత్ ఓఫీరు గారు ఎంత అడ్డగోలుగా, ఆ సూక్తానికి, ఆమంత్రానికి రాని అర్ధాన్ని దాన్నెత్తిన పెట్టారో విడ మరచి చూపించి, అయ్యా ఈ విషయం మీరు ఓఫీరుగారి దృష్టికి తేవడం కొరకే ఇంత సమయాన్ని, శ్రమను ఖర్చు పెట్టాను అని చెప్పాను. దాంతో పాటు పైన పేర్కొన్న నాలుగంశాలపైనా, ఓఫీరుగారిది ఎంత పెడపోకడోనూ వివరించి ప్రకటించాను. ఇదంతా గమనించిన ఆయన గారికి సురేంద్రతో ముడిపడిన ఈ కేసు మిగిలిన కేసుల్లాటిది కాదన్నంతవరకైనా తట్టే ఉంటుంది. ఈ వివాదాన్ని పరిశీలిస్తూ ఆయననూ, నన్నూ ఎరిగిన వారు కొందరు నా గురించీ, నా పోకడ గురించి కొద్ది మాత్రమైనా ఆయన గారికి సమాచారం అందించే ఉంటారు.
3. ఇక మూడో ప్రసంగం యథాతథంగా పైన వ్రాశాను. ఎవరొస్తారో రండి నా తడాకా చూపిస్తాను అన్న ఆరంభం నుండి, శాపం పెడుతున్నాననీ, శాపం అమలయ్యేలా నీవే చూడాలి తండ్రీ! అనీ, అదంతా అవుతుందో లేదోనని తనకే అనుమానం వచ్చి, నీవే దిగిరా తండ్రీ అనీ, మామూలుగా పిలిస్తే వస్తాడో లేడో నన్న అనుమానంతో, రాకుంటే ప్రాణాలు తీసుకుంటామనీ, దయనీయంగా దేబిరించుకొనే స్థితికి దిగజారిందాయన గుండె నిబ్బరం. పైగా వచ్చి ఏమి చేయాలట ఆ ఏసు!? పిడుగులు, భూకంపాలు, గాలివానలు, అగ్ని కీలలు, శిబిరాలు నాశనం చేయడాలు, అమ్మో అమ్మో ఏసు చేత ఎన్ని పనులు చేయించాలనో ఈ ఓఫీరుగారి ఆక్రోశం? ఎంత క్రోధం? ఎంత నిస్సహాయ స్థితి? ఎంత కౄరత్వం? ఎంత వినాశకర దృక్పథం? సువార్తను కాదంటే, అట్టి వారికి ఇంత జరగాలన్నమాట! బలే ఏసునోరే! ఈ యుగానికి ఏసు ఎంచుకున్న (నియమించిన) అపొస్తులుణ్ణి తానేనని ప్రకటించుకున్నాయన, ఏసు నామాన ఏదంటే అది జరుగుతుందన్న ఏసు వాక్యాన్ని నమ్మి, ఆయనే, ఏమి జరగాలో చెప్పక, నీవేరావాలి తండ్రి! వాళ్ళతో కొట్లాడు, వాళ్ళను తన్ను, వాళ్ళే తంతే తన్నించుకో అన్నట్లు ఈ నాటకీయ ప్రసంగాలెందుకు? నన్ను కొడితే కొట్టావు, నా ఏసును కొట్టు చూస్తాను అన్న పోకడన్నమాట ఇది. ఈ గ్రంథంలోనే మరోచోట, నా రచనపై వచ్చిన ప్రశంసలూ ఏసుకే, తిట్లూ ఏసుకేనని, తెగబడి మాట్లాడేశారీయనే.
హలో రంజిత్ ఓఫీరుగారూ! ఒక్కమాట! మీ వేళా కోళం కాకుంటే పిల్లి శాపాలకు నల్లరాళ్ళు పగులుతాయటండీ ఎక్కడైనా? ఉడత ఊపులకు ఊడలమర్రి ఊగుతుందటండీ! మరీ చోద్యం కాకుంటేనూ? ఇంతకూ యేసన్నాయన దగ్గర మీకున్న పరపతెంతట? మీ రాతల ప్రకారమే వేదాలను అనువదింపజేయమని అదేపనిగా రెండు దశాబ్దాలపాటు మొత్తుకోవలసి వచ్చింది. అప్పటికీ ఆయన పట్టించుకోలా! మరెందరినో అదే ప్రార్థన చేశారని మీరే సెలవిచ్చారు. అదన్నమాట, యేసు దగ్గర మీ మాటకున్న పవరు. ఎందుకండీ పసలేని ప్రగల్భాలు? ఆ పెట్టే శాపాలేవో వాటిని మీ వరకు పరిమితం చేసుకోక, ముగ్గులోకి యేసునెందుకు లాగారు? మీకు లాగానే ఆయనకూ అంత పసేమీ లేదని తేల్చడానికి తప్ప మరెందుకూ పనికిరావవి. మీరనే ఆ యేసుకు ఆయనకాయన చేసుకోడానికేదిక్కులేదు. తండ్రిని పదే పదే బతిమాలుకున్నాడు. కడకు తండ్రి వచ్చేదిలేదు, ఈయన్ను కాచేదీలేదన్న నిర్ణయానికి వచ్చి; నీ చిత్తమెలాగైతే అలాగే కానీమని ఒక నిర్వేదపు నిర్ణయానికి వచ్చాడు. వేదన తట్టుకోగలిగినంత తట్టుకున్నాడు. తట్టుకోలేనప్పుడు, ఓనా తండ్రి! నన్నేల చేయి విడిచితివని, తలవేలాడేశాడు. ఇదంతా వాస్తవమని బైబిలు చెప్పేదేకాని, ఈనాటి మేమేమి (ఎవరూ) కల్పించిందికాదు గదా. ఆయనకే దిక్కులేదు. దిక్కనుకున్నవాడు వచ్చిందీలేదు. అనంతరం ఈయన వారుగా చెప్పబడినవారు (శిష్యులు) హింసించి చంపబడుతున్నప్పుడూ ఆయన వచ్చిందీలేదు. రక్షించిందీ లేదు. ఇదంతా బైబిలు అందిస్తున్న సమాచారమే.
నా పేరున మీరేది చెపితే అది జరుగుతుందన్న యేసుమాట సత్యమో కాదో తేల్చుకుంటానికైనా, ఆనాటి ఈయన శిష్యుల్లో ఎవరో ఒక్కరైనా తమని బంధించినప్పుడో, శిక్షిస్తున్నప్పుడో చంపుతున్నప్పుడో అయినా, ఆ పనికి పూనుకున్నవారు చావాలనో, కనీసం కాళ్ళూ చేతులూ పడిపోవాలనో అనైనా ఎందుకు అనలేదు? హలో మన పిచ్చిగాని, అనకపోవడమేమిటండీ! వందలసార్లు మనస్సులోనైనా అనుకునే ఉంటారు. కానీ అవన్నీ ఏసు అన్న కాకమ్మకబుర్లేనని అలా అనుకున్న వారికల్లా అనుభవంలోకివచ్చి ఉంటుంది. కడకు ఏమి చేయలేక నిస్సహాయంగా ప్రాణాలు విడిచారు వాళ్ళంతా. దీన్నంతటిని ఏమీ పట్టించుకోకుండా, పిల్లి శాపాలు పెడుతున్నారు రంజిత్ ఓఫీరుగారు, వీరి శాపాలకు చిరిగిపోయిన కాగితపు ముక్కైనా కదలదు. ఏసు పేరుపెట్టి గాండ్రిద్దామని మరో ఓపికలేని ప్రయత్నం చేశారు. పాపం అదీ గాండ్రింపు శబ్దాన్ని పుట్టించక, మొరిగినట్లు చప్పుడైంది. (తొడగొట్టడమెక్కడ? చేతులెత్తేసి దేబిరించడమెక్కడ?).
ఏమండీ ఓఫీరుగారూ! ఈ మీ శాపం ఎన్నాళ్ళకి ఆచరణలోకి వస్తుందండీ! టైం చెప్పగలరా? ఆ మీ ఏసును నీవుగాని రాకపోతే చస్తాము అనీ అనేసి మరీ పిలిచారు గదా? ఎంతకాలానికి వస్తాడండీ ఆయన?! పైగా భారత దేశానికి రమ్మని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా? అందులోనూ మీ అంతరంగంలో ఆంధ్ర, తెలంగాణాలే ఉండుండాలి. అందునా సురేంద్ర - హైందవ క్రైస్తవంతో ముడిపడి మాట్లాడిన వాళ్ళే ఉండుంటారు. వీళ్ళ మీద, పిడుగులు, భూకంపాలు, తుఫానులు, అగ్నివర్షాలు, వడగళ్ళ వర్షాలు, శిబిరాల కూల్చివేతలు, వ్యాపారాలలో నష్టాలు, అబ్బో, అబ్బో, ఎన్నో, ఎన్నెన్నో! ఎప్పటికి పూర్తి చేస్తాడండీ మీ ఏసు వీటన్నింటినీ? దానికైనా ఒక కాలాన్ని - ఆయన్నడిగైనా సరే - ప్రకటించు ఆ తరవాతైనా క్రైస్తవాన్ని విడవడానికి సిద్దపడు.
No comments:
Post a Comment