Monday, June 7, 2021

మేలుకొలుపు - 1

 

మేలుకొలుపు

సంపుటి -1                                        మొదటి సంచిక                                       సంచిక -1

భూమిక

పవిత్రాత్ములైన,

ఎల్లెడలా అన్ని ఆధ్యాత్మిక, రాజనైతిక, సామాజిక సంఘాల ఉద్దేశ్యమూ వ్యక్తి వికాసము బ్రతుకు భద్రత యని చెప్పవచ్చును. సర్వోద్యమముల లక్ష్యము సామాజిక శ్రేయస్సేననుట నిర్వివాదము, అయితే వాస్తవికత ప్రాతిపదికయై ఆచరణ యుక్తమైన ప్రణాళిక కలిగి సమాజంలోనికి కదలగలిగిన సంఘాలు మాత్రమే సమాజంలో రా తగిన మార్పుకు (వ్యష్టి, సమిష్టి యోగక్షేమములకు హామీ) దోహద పడగలవు అట్లగుటకు ఈ ప్రణాళిక ప్రధానంగా వ్యక్తి నిర్మాణోద్దేశ్యము కలిగి యుండవలెను. వ్యక్తి నిర్మాణము అనగా, శారీరక మానసిక సామర్థ్యమును పెంపుచేయుట, ఆరెంటితో సమాజములో తాను జీవించు పద్దతిని (హక్కులూ, బాధ్యతల విషయమైన క్రమతను) వివేకయుతముగా స్థిరపరచు కొనగలుగు జ్ఞానమును (తాను, సమాజమూ, ప్రకృతి వీటి మధ్య నుండ దగిన సంబంధములను గురించిన వివేకమును) కలిగించుట యని నాభావము. ఇందుకు తగిన కార్యక్రమ ప్రణాళిక ఎవరి యొద్ద నున్నదో అట్టివారి ద్వారా మాత్రమే సమాజానికి వాస్తవంగా అవసరపడిన మార్పు రాగలదు మిగిలిన అన్ని సంఘాల వలనా ఏదో రూపంలో మార్పు సంభవిస్తూనే ఉంటుంది. (పనిచేస్తున్నారు గనుక ఫలం అనివార్యం గనుక) అయితే ప్రతి సంఘము వారూ ఎవరి గిరులు వారు గీసుకుని ప్రక్క వారిని పట్టించుకొనక పోవడము - ఇది తరచుగా ప్రక్కవారిలో దోషాలను చూడడముగా కూడా ఉంటున్నది -  అన్న విధానము వలననే యింతవరకు సమాజంలో రా దగిన మార్పు రాక పోవడమూ, మొత్తం మీద సమాజపు కదలిక అవాంఛనీయమైన దిశకే కదలడమూ జరుగుచున్నది. ఇది యందరూ గుర్తించుచున్న విషయమే.

ప్రస్తుతం, సంస్కరణోద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్థిక , నాస్థికాది నా ధోరణులవారూ ఒకపరి పునరాలోచనా, ఆత్మ విమర్శా చేసుకుని తగిన సంస్కరణను కలిగించగల ప్రణాళిక విషయమై తగిన మార్పులూ, కూర్పులూ చేసికొన గలగడం అభిలషనీయమై యున్నది. లేకుంటే వారి ధోరణి “చిన్న నా బొజ్జకు శ్రీరామరక్ష” యన్న సూత్రానికి చెందినది కాగలదు. ప్రతి సంఘమూ అవశ్యం రెండు విభాగాలు కలిగి ఉంటుంది, ఉండాలి కూడా. 1. సిద్ధాంత పక్షమూ 2. తత్ప్రతిపాదిత లక్ష్య సిద్ధికై ఆచరణాత్మకమగు కార్యక్రసు ప్రణాళికా పక్షమూ, ఈ రెండూ లేని సంఘాలు ఉద్యమాలు-సరియైన ఫలితాన్నివ్వలేవు. ఈ రెండూ కలిగి యున్నా అవి మళ్ళా సత్య నిర్ధారణకు లోను చేయబడాలి. సిద్ధాంత పక్షాన్ని మాటి మాటికీ శోధించ వలసిన పని లేనప్పటికి, ప్రతిపక్ష మేర్పడినప్పుడల్లా పరీక్షింపబడుటకు సిద్ధంగా ఉండాలి. కార్యక్రమాన్ని మాత్రం తరచుగా సమీక్షించుకుంటూ అవసరమైనంత మేర సవరణలు చేసికుంటూ ఉండాలి. ప్రతి సంఘానికి తప్పనిసరియైనదీ, ప్రస్తుతం ఏ సంఘమూ సక్రమంగా అమలుపరచనటు వంటిదీ యైన అంశమిది. ఆయా సంఘాలలో విచక్షణా సామర్ధ్యము లోపించుటయే గాక, కరడు గట్టిన యనుసరణ శీలత గృడ్డిగా పాతుకొనిపోవడానికి, అట్టి యాచరణ నుండి అవాంఛనీయ స్థితులనేక మేర్పడుటకూ పై యంశమే ప్రధాన కారణము. అయినా ఎవ్వరూ దీనిని గమనించరు. కొందరు మేధావులు గమనించినా వారి వారి వ్యక్తిగత యిష్టా యిష్టములు ప్రథమస్థానాన్ని పొందియుండుటచే పట్టించుకోరు. కానీ,

వ్యష్టి ప్రయోజనాలు అవెంతటివైనా సమిష్టి ప్రయోజనాలతో పోటీ పడరాదనన్నదే ధర్మసూక్ష్మము. అధర్మం పెచ్చు పెరగడ మంటే ఈయంశం తిరుగబడడమే. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రతిచోటా జరుగుతున్నదదే, సమిష్టి ప్రయోజనమును గూర్చి వ్యష్టి హక్కులపై అదుపూ, బాధ్యతల విషయమైన నియమమూ అన్న రెండు ముఖాలు కలిగి ఉంటుంది ధర్మ స్వరూపము ఎక్కడైనా. ఇది గమనించి అమలు పరచడం లోనే మేధావులా, సంఘహితైషులా కర్తవ్యం యిమిడి ఉంది. శోచనీయమైన స్థితి ఏమంటే యిది మాత్రం ప్రతిచోటా అప్రధానంగా చూడబడడమే. కనుక ఈ నాటి ప్రధాన సనుస్య ఏమంటే సంఘమార్గ దర్శకులలో (అది ఏ రూపంలో నున్న సంఘాలైనా స్థాపకుల దృష్టి సమిష్టి ప్రయోజనమైతే మాత్రం) పైవిషయానికి చెందిన మెలకువను - జాగృతిని కలిగించుటయే కాగలదు.

 ఆ దృష్టినుండే అట్టి సంఘాల కోవకే (సామాజిక హిత దృష్టికల సంఘాలు) చెందిన మేము మావంతు బాధ్యతలో కొంతగా ఈ “మేలుకొలుపు” కార్యక్రమాన్నొకదానిని స్వీకరించినాము. ఒక వంద మందిని - మేధావులూ, సమిష్టి హితైషులూ అని మా దృష్టి కందిన వారిని ఎంచుకుని ఒక క్రమంలో మా యోచనలను వారికందించుటకూ, వారిచే సరిచూడ బడుటకున్నూ, తద్వారా సమీచీనమూ, హిత ఫల జనక మూనని నిర్ధారింపబడ్డ వాటిని అందరం కలసి ఒక క్రమంలో అమలు పరచుటకున్నూ సంకల్పించి మా దృష్టి నుండి క్రమంగా సిద్ధాంతమూ ఆచరణమన్న రెండు పక్షాలకు చెందిన యంశములను సంపుటీకరించి ధారావాహికంగా పక్షైక మాత్ర క్రమంలో గానీ మాసపత్రికగా గానీ, వెలువరింప నుద్యమించినాము. పత్రము మేలుకొలుపు అన్న పేరున ప్రకటితము. మా దృష్టిలోని ప్రథమ శతంలో మీరున్నూ ఒకరు. ఇందుపై మా కోణం నుండి మేము చేస్తున్నాము కదా!  అనుకోకుండా మీరున్నూ సముచితంగా స్పందించగలరనియే మా నిశ్చయము. ప్రధమంగా శ్రీ విద్యానంద (వ్యాసాశ్రమం) వారితో ప్రారంభింపబడిన ఉత్తర ప్రత్యుత్తర రూపమైన నాయీ వ్యాస పరంపర మే 1 నుండి 20 మందికి ప్రథమ విస్తరణగా పంపనుద్దేశింపబడినది. అది జరిగిన వెంటనే అందరకూ, అందరి పేర్లూ కూడా సూచింపబడగలవు. మీ దృష్టిలో మరికొందరు అర్హులున్న వారి చిరునామాలున్నూ సూచింపగలరు.

ధర్మాధర్మ పక్షాలకు చెందిన గత చరిత్రనూ, వర్తమాన స్థితులనూ అధ్యయనం చేయగలిగినచో వేరు వేరుగా కార్యక్రమాలలో నున్న ధార్మికుల, ధార్మిక సంఘాల (అవి నాస్థిక  ఆస్తికాది ఏ రూపంలోనైనా యుందవచ్చు. సమీకరణయే - కలయిక యే - సామాజిక సనుస్యలన్నిటికి (ఆధ్యాత్మిక ఆధిభౌతిక) అధిదైవికములైనవి సమస్యలవి ఏ రూపంలో నున్నప్పటికి, ఏ పేరుని పిలువబడినా పై మూడధికరణాలకు మాత్రమే పరిమితమై యుంటాయి.) ఏకైక పరిష్కార మార్గం కాగలదు. ఆలోచించగల సంఘ హితైషుల కెవ్వరికైననూ కొద్దిగా చూడగగితే చాలు స్పష్టంగానే గోచరించగల యంశమిది. అయినా యీ విషయంలో తగినంత యత్నం జరుగుటలేదు. మత సమ్మేళనాలూ, సాధు పరిషత్తులూ, విశ్వహిందూ పరిషత్తులాంటి బృహత్సంస్థలు ఏర్పాటు చేయబడ్డా, మరోవంక హేతువాద సంఘాలూ, విప్లవ సంఘాలూ, వాటి నినాదాలూ హోరెత్తిపోతున్నా - అందున్న అందరిలో ఆశయం పట్లా, ఆశయ సిద్ధికై వలయు సాధన క్రమం పట్లా, సరియైన, సమగ్రమైన యవగాహన గోచరించుట లేదు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా అనుభవంలో మేము గమనించిన అవసరమైతే ఋజువు పరచగల వాస్తవము. అంతేకాక నిజాయితీ పరులైన ఆత్మ విమర్శనా శీలుర కందరకూ ఏదోనాడు ఎదురుపడగల విషయము కూడా. Note:- మేము గ్రహించిన ముఖ్యాంశమేమంటే సమాజంలో నేడున్న ప్రతి సంఘములోనూ అవి ఏ వర్గానికి చెందినప్పటికీ అందు స్వార్ధశక్తులూ, సంఘ హితైషులూ అన్న రెండు రకములైన వ్యక్తులను దర్శించినాము. ఆయనుభవాన్నుండే నాస్థిక, ఆస్థిక సంఘాలను పైన సూచించినాము.

ఉన్న నాలుగు రోజుల్లో వైయుక్తిక ప్రాధాన్యతల నా వల నుంచి నలుగురం కలవ గలిగితే సమాజానికి కోరదగిన స్థితి కలిగించుటలో శక్తి సమకూరుతుంది. అదే కార్యక్రమాన్ని వ్యక్తిగతంచేస్తే వాటిల్లోనూ కొంతవరకు మంచి ఉన్నప్పటికిన్ని అవన్నీ వైయుక్తిక రూపాన్ని సంతరించుకుని క్రమంగా వర్గాలుగా మారగలవు. నీ పిదప ఆయా వర్గాల అనుయాయుల్లో - స్థాపకుల్లో విరోధభావం లేకున్నా వైరుధ్యాన్ని పాదుకొల్పుతాయి. ఇదిన్ని చూడగగిగితే చారిత్రక పరిణామంలో స్థూలరూపు దిద్దుకున్న విషయమే. మనిషి గతానుభవాలనుండి స్పూర్తిని పొంది వర్తమానంలో తగిన యత్నంచేసి భవిష్యత్తుకు బాట వేసికోవాలి. అట్టి యత్నం చేయలేనినాడూ, చేయనివాడూ, అతడు జంతు జీవనానికి చెందినవాడే కాగలడు. (జ్ఞానం నరామధికో విశేషః పశుభి సమానః) గతాన్నుండి యనేక కారణాల వల్ల మనకు సంక్రమించిన మంచిని బలాన్ని - పెంచుకుంటూ, రోగ రూపాల్ని చెడును తొలగించుకుంటూ జీవించడమూ, రాబోవు తరాల వారికి శక్తివంతమైన వ్యవస్థను అందించుట ద్వారా వారి జీవనం సుగమం చేయడమూ మన విధి. ప్రముఖంగా యిది మేధావులైన, లోక కళ్యాణ కాంక్షులైన వారిపై నున్నది. ఇందుకే ముందుగా కొందరమైనా కలవగలిగిన లక్ష్యశుద్ధితో సరైన యత్నం ప్రారంభించవచ్చును. పిదప కార్యం ఉద్యమ రూపాన్ని సంతరించుకొనుట కెట్టి యాటంకములుండవు. జరిగినంత జరుగుతుంది. కళ్యాణ కార్యానికి ప్రత్యవాయం లేదు కదా!? ఆ పై కార్యం రానున్న వారి కందించుట జరగాలి

సమాజంలో ఆయా సంఘాల విషయంలో మేము గమనించిన అత్యంత ప్రధానమైన మరో అంశాన్ని ప్రస్తావిస్తాను. 1. ఆంధ్రదేశంలో ప్రముఖమైన, పెద్దదైనట్టి ముందుగా స్థాపింపబడినది, యని చెప్ప దగినది ఓంకార స్వామి వారి శాంతి ఆశ్రమం. క్రమంగా సమాజం నుండి అచ్చటకు చేరిన ఆర్థిక వనరులు ప్రస్తుతం అనల్పం. అయితే అచ్చటి నుండి, నేడు సమాజానికి అందుతున్నది, ఆధ్యాత్మక కేంద్రాల నుండి సమాజాని కందవలసింది అన్న దృష్టినుండి అత్యల్పం. మరి కొంత కాలమీలాగునే సాగితే అది శూన్యస్థాయికి పడిపోతుంది.

2. ఆంధ్రలోనిదే అనుభవానందాశ్రమం నిష్ఠకూ, జ్ఞానానికి కూడా ప్రత్యేకంగా పేర్కొన్న దగ్గ మనిషి యనుభవానంద. అయితే వారి తదనంతరం నేటి స్థితి అందుకు భిన్నంగా ఉందనడం సత్యదూరం కాదు.

3. చిన్మయా మిషన్ కు చెందిన పలువురు బ్రహ్మచారులను కలిశాము మేము మా అన్వేషణలో వారి వారి ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ జీవనాధారంగా మారిపోవడం వృత్తిరూపాన్ని సంతరించుకోవడం, వ్యక్తిని సంస్కరించడంలోనే అసలు సమస్యకు పరిష్కారం యిమిడి ఉందన్న దృష్టి లోపించి నేను అంటనివాడిని బంధరహితుడనూ అన్న అద్వైత తాత్విక పదాన్ని, శ్రవణానికి కూడా అధికారికాని వారలకు యదేచ్ఛగా బోధించడం, ధార్మిక అచరణ అప్రధానంగా చూడబడడం ఆసంఘంలో మేము గమనించిన ప్రముఖాంశము. సత్యదృష్టినుండి, ఎవరైనా ఈ విషయాన్ని పరిశీలించి చూచుకోవచ్చు గమనిక:- కఠోపనిషత్ వ్యాఖ్యానంలో చిన్మయానంద; ప్రవర్తనకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ భాషించుట గమనింపదగ్గ విషయం-ఎందువల్లనో శిక్షితులు దానిని ప్రధానంగా బోధించుట లేదు.

4. అరవిందాశ్రమం. ప్రపంచ తాత్విక సాహిత్యంలో అనితర సాధ్యమైన ప్రయోగాలు చేసి తత్వవేత్తల చేతనే బహుదా ప్రశంశింపబడ్డ వ్యక్తి వారు. అయితే వారూహించిన ఆశ్రమకల్పన ఎట్టిది? నేడు వాస్తవంలో అందున్న తీరెట్టిది? అరవిందుల పిదప ఆయన ఆశయాలకు ప్రతిరూపమైన చిన్న అరవిందుల నిర్మాణం జరగక పోవడమే దానికి కారణం.

5. సత్యశాయి సమాజ్: సిద్ధులూ మహిమల విషయమై మేమానయతో విభేధిస్తున్నా, ఆయన తీసుకుంటున్న సామాజిక కార్యక్రమావళి అసాధారణమనాలి. మిగిలిన అనేక ఆధ్యాత్మిక కేంద్రాలలో గోచరించని సామాజిక సృహ బాబా వారిలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాల దృష్టి ఎచ్చట కేంద్రీకరింప పడినగానీ, వాటి బాధ్యత తీరినట్లు కాదో అట్టి విద్యా, వైద్య రంగాలపట్ల ఆయన ప్రవర్తిస్తున్న (అట్లు కార్యక్రమాలద్వారా మనకగుపిస్తున్న) దానిని బట్టి ఆయన జ్ఞానము తాత్విక వేదిక కలిగి ఉన్నదను కోవలసివస్తున్నది. ఈ విషయంలో దేశంలోని అనేక సంస్థలు ఆయన కార్యక్రమాన్నుండి స్ఫూర్తిని పొందదగి యున్నాయి. ఈ విషయంలో ఒక వ్యక్తిగా నేను ఆయనను ఆదర్శ స్థానంలో చూస్తున్నాను. అయితే యింతటి బృహత్కార్యక్రమానికి రూపుదిద్ది నిజంగా ఒక వ్యక్తే అయినా ఒక సంఘటనా శక్తిగా ప్రకటితమైన బాబా అనంతరం కొనసాగించగల ప్రతిరూపాలేవి? ప్రతిచోటా-వారెంతటి అసాధారణ ప్రజ్ఞావంతులైనా, ఎంతటి సంఘహితైషులైనా; తన యనంతరం కార్యక్రమాన్ని యధావిధిగానూ, మరింత వేగవంతంగానూ అమలు పరచగల పరంపర నేర్పాటు చేయుటలో చాలా వెనుకబడి యున్నారు. ఎవరిని చూసి ప్రజలు వనరులను సమీకరించినా, ఏ దృష్టి నుండి యివ్వబడినా ఆశ్రమాల, సామాజిక సంఘాల వనరులన్నీ ప్రజాశ్రమ నుండి ఏర్పడిన ధనం వల్ల సిద్ధించినవే. ఏకోణంలో ఏనాడు అది దుర్వినియోగం చేయబడ్డా అది క్షమార్హం కాని విషయ మవుతుంది. ప్రతి సంఘ మార్గదర్శకులూ దీర్ఘ కాలం ఆ ప్రజాధనం దుర్వినియోగం కాకుండానూ, నిర్వీర్యం (మూలపడి పోకుండానూ) కాకుండానూ ఆ మానవ శ్రమ రూపాన్ని సద్వినియోగ పడగల విధానమునందు యిమడ్చగలగాలి. అది వారి బాధ్యతగా స్వీకరించాలి. భావితరం వారికిన్నీ ఈ బాధ్యతను ఎరుక పరచి తమ ప్రతిరూపాలుగా (సమాజం కొరకై తమను అర్పణ చేసికొన గలుగు వారినిగా) కొందరినైనా తీర్చిదిద్దుకోవాలి. ప్రస్తుతాధిపతులలో ఎంతటి వివేక స్థాయి ఉన్నదో ఎరుగముకానీ, ప్రాచీనులు, జగద్గురు పీఠ స్థాపకులు, గతకాల, వర్తమాన, భవిష్య కాలములకు చెందిన పీఠాధిపతులను కలిగి ఉంటున్నారు. అది పూర్వీకుల దీర్ఘదృష్టికీ, తమ ఆశయ స్థాపన, ప్రాచుర్యములకై వారిచ్చిన ప్రాధాన్యతకు, గీటురాయిగా నున్నది, అందుకే ఆయా సంస్థానాలు వేల ఏండ్లుగా స్థిరంగా, మనగలుగుతూ కొంతవరకైనా స్థాపకుల ఆశయానికి దోహదకారులుగా ఉంటున్నాయి.

ఏనాడైనా, వ్యక్తి ప్రధానుడుగా కాక సిద్ధాంతమూ తదనుగుణ్య వ్యవస్థ ప్రధానమైననే గానీ దీర్ఘకాలము మనజాలదు. వ్యక్తి ఆకారంగా కాక, సిద్ధాంతరూపంగా రూపుదిద్దుకుని ఆ రూపంలో సమూజముచే ఆరాధింపబడిన గాని శాశ్వతుడు కాలేడు. ఆ సిద్ధాంతమున్నూ సత్య నిర్థారణ కనువైనదిగా నుండుటవసరము.

ఏతావాతా నే చెప్పదలచుకున్నదేమంటే, ఆధ్యాత్మక, సాంఘిక సేవా కేంద్రాలన్నిటా ఒకటే ప్రధాన సమస్య. గోరా అనంతరం గోరా లేరు. కవిరాజు పిదప ఆయన ప్రతినిధి లేరు. మళయాళ స్వామి పిదప మరల ఆయన స్థానాన్ని పూర్తి చేయువారు లేరు. విద్యానంద పిదప మరో విద్యానంద ఏరి? అలానే మనకిక అనుభవానంద, శ్రీరమణ, అరవిందులు లేరు. J. K. పిదప ఆ చోటు ఖాళీగానే ఉంది. అమ్మ-జిళ్ళెళ్ళమూడి-స్థానాన్ని పూరించేదెవరు? బాబా అనంతరం ఆ సంఘం (సాధారణ వ్యక్తులు వందమంది కూడా నిర్వహించడం అసాధ్యం దానిని) ఎట్టి రూపు దిద్దుకోనున్నదో? ప్రతిచోటా మేము గమనించిన ప్రధానమూ ప్రమాదకరమూనైన యంశమిది.

అన్ని విషయములను క్రోడికరించిన పిదప మాయనుభవము మాకు సూచిస్తున్న పరిష్కార మిట్లా ఉంది. వీలైనంత మందిమి ఏకత్రాటి పైకి రాగలగాలి. ఓకే ప్రణాళికను జనింపచేయాలి. బహు ముఖంగా వారివారి బాధ్యతలను నిర్వర్తింప గల వ్యక్తుల కార్యకర్తల నిర్మాణం జరగాలి. కార్యకర్తల నిర్మాణమే అన్నిటికీ తిరుమంత్రం కాగలదు. కార్యకర్త అనగా సమ్యగ్వివేకమూ, క్రియాశీలత కలిగి ఒక వైపు కార్యరంగంలో ఉంటూ, మరో వంక తనలాటి వారిని తయారు చేసుకోగలవాడు అని అర్థము. అప్పుడే ఆ సంస్థ సిద్ధాంతమూ, ఆచరణా, వ్యక్తిగత రూపాన్నుండి సామాజిక రూపానికి రూపాంతరం చెందగలదు. ఇంతకంటే మార్గాంతరం లేదు. కావలసిన కార్యమిదే. మీరెలా స్పందిస్తారో మీ ఇష్టము. ఎట్లున్నా కాలమాగదు. ఎల్లకాలమూ భౌతికంగా మునముండము. జ్ఞానరూపులో తప్ప మానవునికి శాశ్వతత్వం మరెట్లున్నూ కుదరదు. కలసి పని చేయాలని మా ఆకాంక్ష, వ్యక్తిగతాభిప్రాయాలు సిద్ధాంతాలూ, వాస్తవికత. నిస్పాక్షికత ప్రాతిపదికన సరిచూచుకోబడాలి. ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక విద్య మరల సమాజాన్ని ఆవరించి మరల భవిషత్తుకు, మానవ సంఘానికి భద్రతను కూర్చాలి. వివేకవంతులూ, సమిష్టి , శ్రేయోకాములూ నైన మీరందరూ యధోచితం ప్రతిస్పందింప గలరని ఆశిస్తూ ఈ లేఖారూపమైన ఉపోద్ఘాతాన్ని ముగిస్తాను. ఏ రూపంతో నాతో సంప్రదించదలచినా నేను సంసిద్ధుడను. ఇక క్రమంగా పక్షపత్రిక మీ ముందుంచే యత్నం చేస్తాను. ఉంటాను.     సెలవ్...

నమస్సులతో

    సత్యాన్వేషణలో మీ సురేంద్ర..

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment