మేలుకొలుపు
సంపుటి -1 సంచిక-2 15-5-91
ఆశ్రమాధిపతుల కర్తవ్యమూ-ఆశ్రమ భవిష్యత్తు - ఒక పరిశీలన.
ఆర్యులారా! శ్రీ విద్యానంద (వ్యాసాశ్రమం)
వారితో ఉత్తర ప్రత్యుత్తర రూపంలో సాగిన ఒకనాటి లేఖాంశమే ఈ వ్యాసరూపంగా పునః
ప్రకటితము. పస్తావితాంశము సార్వకాలీనమైన విలువ కలిగి యున్నదగుట చేతనూ, ప్రతి సంఘ నిర్వాహకులూ (యదార్ధంగా సామాజిక
శ్రేయస్సు కలిగించు ఉద్దేశ్యము కలిగి యున్న ఎడల) అవశ్యం-వారికే స్ఫురించిగానీ,
మరొకరి నుండి స్ఫూర్తిని పొంది గానీ గమనించి అమలు పరచదగిన దగుట
చేతనూ, శ్రీ విద్యానందుల వారికి ముందుగా దీని ముద్రణ గూర్చి
తెలుపకపోయిననూ దీని ఔచిత్యమునూ, అవసరాన్ని వారు శంకించరని
భావించుట చేతను, ఒకనాటి, స్వామి వారికి
వ్రాసిన లేఖను కొద్ది మార్పులతో మీ ముందుంచుతున్నాను. మౌలికంగా సామాజిక సృహను కలిగియున్న
మీరందరూ చిన్న, పెద్ద సంఘాల రూపంలో ప్రకటితమౌతున్నా తులనాత్మక దృష్టితో దీనిని
పరిశీలించగలరని ఆశిస్తాను.
గమనిక:-ఆశ్రమాలు అన్న పదం వెనుక నా భావం
సామాజిక శ్రేయస్సును కోరి సమాజంలో ప్రవర్తిస్తున్న సంఘాలు - అవి నాస్టిక, ఆస్తిక, హేతువాదాది ఏ
రూపంలో నైనా ఉండొచ్చు అని మాత్రమే. ఎందుకలా వివరించవలసి వచ్చింది? ఆస్తిక సంఘాల పట్ల విరోధాన్ని, వైముఖ్యతనూ, అట్లే ఒక సంఘం మరియొక సంఘము ఎడ చిన్న చూపునూ కలిగియుండడమూ, నిష్పాక్షికంగా ఆయా సంఘాల స్థాపకుల హృదయాన్ని తట్టి చూడగలిగినప్పుడు అంత
చిన్న చూపు చూడదగిననిగా అవి లేకుండడమూ మాకు ఎదురైన యనుభవం. ఉదా: నాస్తిక కేంద్రం
అన్న పేరున నెలకొన్న గోరా గారి యత్న రూపాన్ని మేము చూసాము. లోపాల విషయమట్లుండనిండు.
వారి సిద్ధాంతరూపం వాసవ్య- అన్న మాటలో యిమిడ్చినారు-వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తి నిర్మాణము. ఆయన ఈ మూడు మాటల్ని
ప్రతిపాదించడాన్ని బట్టి చూస్తే ఆయన జ్ఞానమున్నూ తాత్విక వేదిక కలిగియున్నదని
చెప్పి తీరాలి. ఆయా ప్రతిపాదనలు ఏ సంఘం పేరున ప్రతిపాదింపబడ్డాయి అని గాక, ఎంత విలువను కలిగి యున్నవి అన్నది వాస్తవిక దృష్టి నుండి గమనించవలసిన యంశము.
ఆ దృష్టి నుండి నిష్కర్షగా చెప్పవలెనంటే వారున్నూ బుషితుల్యులే, ఋషియే. అసందర్భం కాకపోవుటే గాక సత్య శోధకుల తులనాత్మక దృష్టికి కొంతబలం
చేకూర్చగల యంశముగా ఈ విషయాన్ని నేను భావించుటచే ఇట ఉటంకించాను. ప్రస్తుతాంశానికి
వస్తాను.
1.
ఉత్తరాధికారిని నియమించే విషయంలో ఆయా ఆశ్రమాధిపతుల సరైన సమగ్రమైన యోచన చేయక
పోవుటచేత ఆశ్రమ స్థాపకుల యనంతరం, ఆశ్రమాలూ, నిర్వహణా, సమాజంలో ఆశ్రమాల బాధ్యత అన్న విషయాలు
శోచనీయ స్థితిని పొందుతున్నాయి. ఈ విషయాన్ని కూడా క్లుప్తంగా ప్రథమ సంచికలో మీ
ముందుంచాను.
2.
సన్యాసులకూ, ఆధ్యాత్మిక సంఘాలకూ, ఆశ్రమాలకూ గురుతరమైన, యనితర
సాధ్యమైన బాధ్యత ఉంది సమాజంలో, వారూ, అవీ
సోమరితనానికి స్థానాలు కాకూడదు. ఉదా: మళయాళస్వామి వారి యోజన లోనున్న అత్యంత
విశిష్ట విషయం కూడా యిదే. సోమరుల కెచ్చటా చోటు లేదనీ, నియమానికి
మించి, శేయస్సు నిచ్చునది లేదనీ, ఈ రెండువిషయాలూ తు.చ.
తప్పకుండా తానాచరిస్తూ, ఆశ్రమవాసులచే, అనుయాయులచే
ఆచరింపజేస్తూ, సమాజాన్ని కూడా తమ వెంట నడిపించవలసిన బాధ్యత
వీరి - వీటి - పైన ఉంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక సంఘాలలోనూ, తదితర
సామాజిక సంఘాలలోనూ ఈ బాధ్యత విషయమైన లోటును మేము గమనించాము. ఎప్పుడైనా, ఎవ్వరైనా -
వారు యదార్థ సాధకులూ, సత్య శోధకులూనై యుండిన చాలు. పరీక్షించి
చూచుకోవచ్చు ఈ విషయాన్ని.
3.
ఎట్టి విషయమైన జ్ఞానాన్ని - వివేకాన్ని, తదనుగుణ్యాచరణనూ - సమాజానికి అందించే బాధ్యతా, కర్తవ్యమూ ఆశ్రమాల పైనా, తాత్వికుల పైనా ఉన్నదో
అట్టే విషయంలో ప్రస్తుత ప్రచారకులు ఎక్కువమంది వల్లెవేసే విధానాన్ని - కేవల మాత్రంగా
– అనుసరిస్తున్నారన్నది సత్యదూరం కాదు.
వారికి తాము చెపుతున్న విషయంలో స్వానుభవ జ్ఞానమేది? ఎంత మందిలో ఉంది. అంతా దాదాపుగా వ్యపదేశ
జ్ఞానమేకదా! అంతవరకే వారి స్థాయి. శ్రోత్రియుడు అనడానికి అర్హమైన స్థాయిలో
వాస్తవంగా ఉంటున్నదా? అవునని ఘంఠాపథంగా మాత్రం చెప్పలేము. ఏదో
కొద్దికాలం ఒకటి రెండు గ్రంధాలు చదివీ, కొన్ని శ్లోకాలు
కంఠతా పట్టి, కొద్దిపాటి నామజపమో, ధ్యానమో,
యోగాభ్యాసమో, మంత్ర పునశ్చరణమో జరిపి దానిని
శ్రోత్రియత్వంగానూ, దీనిని బ్రహ్మ నిష్ఠగానూ, చేస్తున్నది
విచారణ గానూ భావిస్తే అది భారతీయ తాత్విక మార్గాన్ని నిజంగా అనుసరిస్తున్నట్లు
అవుతుందా? భారతీయ
తాత్విక శిల్పానికి మెరుగులు దిద్దినట్లు గానీ, కనీసం దానిని చెడకుండా కాపాడి
భావితరానికి అందించినట్లు గానీ కాగలదా? తులనాత్మకంగా, సత్యదృష్టితో
ఆలోచించండి. వాస్తవాన్ని గుర్తించినా, గుర్తించక పోయినా అంగీకరించినా, యంగీకరింపక
పోయినా వాస్తవం వాస్తవమే. సత్యమేవజయతేనా౬నృతం. అస్తు. మరియు “స్వయం తీర్త్వా పరాం
స్థారయతి” అని గదా ఆరోక్తి. ఈనాటి ప్రచారకులలో ఎందరు దీనిని గమనించారనీ, అనుగుణ్యంగానే
వ్యవహరిస్తున్నారనీ చెప్పగలం.
4.
ప్రతి ఆశ్రమాధిపతీ, సంఘస్థాపకుడూ
అనివార్యంగా ఏదోనాడు తమ తమ సంస్థలను మరొకరికి అప్పగింపక తప్పదు. ఈ విషయంలో ప్రస్తుత యాజమాన్యము - చేయబోయే నిర్ణయం
ధనుర్విముక్త శరం వంటిది. ముక్త శరంపై ధానుష్కుని అదుపు వుండదు. ఒక వేళ ఆశ్రమాల
విషయంలో కొంత అదుపు పూర్వాధిపతుల కుంటుందని మనస్సుకు నచ్చచెప్పుకున్నా అది ఆశ్రమ
వ్యవహారాలు అదుపు తప్పినప్పుడు సరిదిద్దగల స్థాయిలో మాత్రం ఉండదు. ఇక్కడ మరో
వాస్తవం కూడా గమనింపవలసి ఉంది. ఎక్కడైనా భావితరం ఆధిపత్యానికి వచ్చాక వెనుకటి తరం వారిని
అదుపు - చేయడమో, పట్టించుకోక పోవడమో సమాజంలోని కుటుంబాల నుండి ప్రతి సంఘాలలోను అనుభవంలో
చూస్తున్నాము.
5.
ఆధ్యాత్మిక సంఘాలలో ధన ప్రభావం ప్రబలమవడం కూడా అనుభవంలో ఎదురవుతున్న సత్యమే
అయితే. తాత్వికునికి ధనం ప్రధానం కాకుండా ఉండడం, ఆయాచితంగా సమాజం నుండి లభించిన దానిని సమాజ
శ్రేయస్సుకే నియోగించగలగడం స్వభావంగా ఉండాలి. ఉంటుంది కూడా. వ్యక్తిగతంగా తనదంటూ
ఏమీ లేని వాడుగాను, సమిష్టిపరంగా తనది కానిదేదీ లేనివాడు
గానూ ఎవడుండగలడో, ఎవనికిట్టి భావన స్వభావంగా ఉంటుందో ఆతడే
నిజమైన తాత్వికుడనాలి. అతడే వేత్త, సన్యాసి, సాధువు, లోకహితుడున్నూ. ఆతడే జగానికి మార్గోపదేష్ట
(జగద్గురువు) కావడానికి యర్హుడు. అయితే స్వభావరీత్యా అర్హుడైన యట్టి వాని చెంత
మార్గోపదేశం చేయగల ప్రణాళికా జ్ఞానం - అనుభవ దారుఢ్యంతో ఉన్నచో, అప్పుడు మాత్రమే సమాజానికి తాత్వికుల యొక్కా, ఆధ్యాత్మిక
సంఘాల యొక్క, ప్రయోజనం వాస్తవంగా అందివ్వబడుతుంది.
6.
ఈ రోజు లోక కళ్యాణమే పరమార్థంగా పెట్టుకున్న బుషి, సాంప్రదాయానికి తగిన కార్యకర్తలు కావాలి.
కార్యకర్త యనగా ఋషి ప్రణాళికకు వ్యక్త రూపమైన జీవిక కలిగి, తనలాంటి
వారిని తయారు చేసికొనగల వ్యక్తి. ఇదొక్కటే మిగిలిన సామాజిక అవసరాలనన్నిటినీ
క్రమంగా పూరించగలదు.
7.
ఆధ్యాత్మిక సంఘాలూ, సామాజిక సేవా సంస్థలూ-అవి ఏ వర్గానికి చెంది, ఏ,
యే, పేరులతో పిలవబడుతున్నా మానవుని భౌతిక,
మానసిక యభివృద్ధికి ఆరోగ్య ప్రదమైన శిక్షణాలయాలు కావాలి సమర్ధులు,
సుశిక్షితులూ అయిన మానవ యంత్రాలను నిర్మించే పరిశ్రమలు కావాలి. ఒక బ్రహ్మచారి,
ఒక సాధకుడు, ఒక యతి, యిలా
భిన్న ప్రాయాలలో, భిన్న స్థితులలో ఉండి సాధనలు చేస్తున్న
వారిలో ఎవరిని సమాజం చూసినా వినమ్రమవక తప్పని స్థితి వీరిలో ప్రకటమవ్వాలి. ఇదే
సమాజ హితైషులూ, లోక కళ్యాణ కాంక్షులూ నైన తాత్వికులెల్లరి
ఎడల నున్న గురుతరమూ, అనితర సాధ్యమూనైన బాధ్యత. దానిని
నెరవేర్చాలి. అందుకై తగిన యోచన చేయాలి. ఆ యోచన కార్యరూపం పొందడాని కొరకే జీవించ
గలగాలి. ఇదే ధర్మపక్షానికి చెందిన వాస్తవ-తాత్విక-రూపానికి హృదయం కాగలదు.
8.
ఏ నిర్ణయం తీసికోవడానికి గానీ క్షణం పట్టదు. కానీ అది ఉచితమా కాదా అన్నది తేల్చుకోవడానికే
ఎంతో యోచన చేయాల్సి ఉంటుంది. నిర్ణయానికి ముందే ఆ యోచన చేయడం మరింత కష్టమైన విషయం.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనందరి మీదా ఏదో కోణం నుండి అట్టి బాధ్యత ఉందన్నది కొద్దిగా
చూడగలిగినా తెలియగల యంశమే. సమయం గడిచి పోతున్నదన్నదియూ, త్వరపడ వలసిన అవసరం ఏర్పడిన దన్నదియూ,
అందరం ముఖ్యంగా గమనించవలసిన యంశము. ఎంతో కాలం, ఎంతో పరిశ్రమా తపస్సులు-శారీరకంగాను, మానసికంగాను కూడా
చేసిన ఫలితంగా ప్రస్తుత స్థితులలోనున్న ఆయా సంస్థలు నిజంగా ఏ
ఒక్కరి శ్రమ ఫలితాలు కావు. ఎందరో విశ్వాసంతో ఆశ్రమాలకూ, ఆయా
సంస్థలకూ ఆలంబనగా తమతమ శక్తియుక్తుల్ని ధారపోయగా, ఏర్పడిన ఆయా సంస్థల ప్రస్తుత భౌతిక
రూపము, సాధనా
వివేచనా రూపమైన మానసిక రూపము, మరింత ప్రవృద్ధమై సమాజానికి భౌతికంగానూ, మానసికంగానూ, మార్గదర్శనం
చేయుటలోనూ, చేయగలిగేట్లు
చూడడం లోనూ మాత్రమే వ్యక్తం కావాలి మనందరి బాధ్యతా, నిర్వహణా, ఔచిత్యమూ.
నిష్కర్షగా చెప్పాలి గనుక ఆశ్రమాలు, ఆయా సంస్థలు, భౌతికంగా ప్రబలమైనంతగా, మానసికంగాను, బౌద్ధికంగానూ,
ఎదగలేదన్నది ఒక వాస్తవము. ఈ విషయమున్నూ మనలో పరిశీలనా దృష్టి కల వారందరూ
గమనించగల యంశమే.
9.
నియమబద్ధతకు వెసులు బాటు ఏర్పడిన మరుక్షణం మనిషి ప్రవర్తనలో అలసత్వం, భోగలాలసత్వం చోటుచేసుకుంటాయి. ఇందుకు
బౌద్ధారామాలూ, అనేక అధ్యాత్మిక కేంద్రాలు గత చరిత్రలో మనకు
నిదర్శనాలు. మన మన యభిప్రాయముల నన్నిటినీ కేవలం లేఖల ద్వారానే వ్యక్త పరచుకోవడం
కాలహరణకూ, అచ్చటచ్చటా సందిగ్ధానికీ కారణ మవవచ్చు. కనుక
యధావకాశం మనం కలవగలిగిన శుభప్రదం కాగలదు. సమాజానికో మార్గదర్శినీ, శిక్షణాలయాన్ని అందివ్వగలిగిననాడు ఎవరికి వారుగా తమ బాధ్యతను
పూర్తిచేసినట్లు కాగలదు.
10.
గమనిక:- (ఆశ్రమాల, కేంద్రాల నిర్వాహకులకు మాత్రం) ఇంత కాలంగా ఆశ్రమాధిపత్యాన్నీ నిర్వహణా
భారాన్ని మోసి అలసిన మీరు ఆ యలసట వలన ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందనో, అనుకున్నది జరుగదు, తనకున్నది తప్పదు ఆనో , మనం నిమిత్త మాత్రులం అనో, యనుకునే అవకాశం ఉంది.
అయితే తాత్విక హృదయం కలిగిన ఎవ్వరూ అట్టి నిర్ణయానికి రారనియే నా అభిప్రాయము.
నేనెరిగిన, నా యనుభవాలనుండి ఎదురైన విచారకర ఫలితాల వలన
ఏర్పడ్డ ఆవేశ పూరిత వేదనా హృదయం వల్ల ఈ లేఖలలో అచ్చటచ్చటా ఒకింత తీవ్రత
వ్యక్తపరుపబడుతుందనచ్చు. కానీ యవి సత్యదూరాలు మాత్రం కావు.
చక్కగా పరిశీలించి విషయాన్ని (పఠించడం గాకుండా)
అధ్యయనం చేసి మీ స్పందనలను (అభిప్రాయాలు, సూచనలు, విమర్శలు, సందేహాలు) తెలియ పరచిన వాటినన్ని ఒక క్రమంలో ప్రకటింపగలము. వారి వారి
స్థానాలకు మమ్మాహ్వానించిన సంతోషముగా రాగలము. మా స్థానానికి రాదలచిన ఇదే మా
యాహ్వానము గమనించగలరు.
వ్యక్తి నిర్మాణము ప్రస్తుత కర్తవ్యము.
అందుకుగానూ వ్యక్తులూ, వ్యక్తుల కొరకు సంస్థలూ అవశ్యం స్వీకరింపదగిన ఒక కార్యక్రమ ప్రణాళిక
సూచిస్తున్నాను. మీరూ పరిశీలించండి.
1.
నియమిత కాలాలలో మేల్కాంచుట, నిద్రించుట, కాలకృత్యములు నెరవేర్చు కొనుట.
2.
విధిగా అందరూ శరీర దారుఢ్యాన్నివ్వగలా, ఆరోగ్య దాయకమైన వ్యాయామం చేయడం. (శారీరకంగా దుర్భలులైన వారు
క్రియాశీలంగా ఉండడం అరుదు.)
3.
గ్రహించడం, నిలిపి ఉంచుకోవడం, సమయానికి వినియోగించుకోవడం అన్నవి
జ్ఞాన సామర్థ్యానికి చెందిన అంశాలు. వాటికై నిత్యమూ అభ్యాస రూపంగా మానసిక పరిశ్రమ
కూడా అందరూ విధిగా చేయడం.
4.
సమాజంలో తన పాత్ర అన్న విషయంలో ఆశ్రమ వాసుల సాధకుల కందరకూ విపులమైన, స్పష్టమైన, గాఢమైన
యవగాహన కలిగి యుండగల నేర్పును, వివేకాన్ని కలిగించడం.
5.
ప్రతి వ్యక్తీ, అతనే స్థాయిలోనున్నా, తెలియ వలసింది తెలుసుకోడానికీ, తెలిసింది
తెలుపడానికి సర్వ సన్నద్దంగా ఉండే స్వభావాన్ని నిర్మాణం చేయడం.
6.
విద్య, వివేకమూ, దేహదారుఢ్యమూ నన్నవి వ్యక్తిలోని శక్తిరూపాలు. అవి బలహీనులకు
అందివ్వడానికి, అన్యాయాన్ని ఎదిరించడానికి, వ్యష్టి, సమష్టి అభివృద్ధికి ఉపయుక్తం కావాలి. ఈ విషయం నేర్పేవారికి, నేర్చుకునే వారికిన్నీ జీర్ణం కావలసి ఉంది.
7.
పై శక్తులు తనలో ఎదుగుతున్న కొద్దీ వివేక బలంచే వినయమూ, సేవాభావము (బాధ్యతా స్వీకరణము) ఎదుగవలసి
ఉంది. అప్పుడే యవి తమదైన సత్ఫలితాన్ని యివ్వగలుగుతాయి.
8.
నిరంతరం ప్రవాహగతిలో కార్యకర్తలు - సుశిక్షితులైన వ్యక్తులు - సృష్టింపబడాలన్నదే
అసలు రహస్యం. ఈ వివేకాన్ని ప్రతి సాధకుని లోనూ దృఢంగా నాటుకునేట్లు చేయగలగాలి.
9.
కర్తవ్యపాలనలో తానే యితరులకు మార్గదర్శకుడిగా ఉండగలగాలి అన్న బాధ్యతా యుతమైన
యోచనను, మనస్తత్వాన్నీ సాధన దశ
నుండే అందరిలో కలిగించ గలగాలి.
10.
అహంకారమూ, డాంబికతా, స్వార్ధ పరత్వమూ, అధిక్యతాభావమూ, యివ్వడం కంటే పుచ్చుకోవడం వైపే అధికంగా మొగ్గు చూపడమూ అన్న యవాంఛనీయ
లక్షణాలు తమ దరి చేరకుండా అనుక్షణం ప్రతి ఒక్కరూ జాగరూకత వహించాలి. ఈ విషయంలో ఒక
పర్యవేక్షక సంఘము-ప్రధానంగా, ఆయా సంస్థలలోని యనుభవజ్ఞులు అందరినీ పర్యవేక్షించే
బాధ్యతను స్వీకరించాలి. ఇది అత్యంత ప్రధానమైన యంశము.
11.
సత్యశోధన యన్నది. ఈ సాధనా క్రమానికంతటికీ ఆయువు పట్టుగా, అంతిమ లక్ష్యంగా ఉండగలగాలి. ఈ విషయం అందరకూ
స్ఫురణలో ఉండాలి.
12.
నిరంతరం సమాజములోనికి, సమాజానికి మార్గదర్శనం చేయగల వ్యక్తులను పంపడం ఆశ్రమ-సంస్థల-ప్రథమ
కర్తవ్యంగా భావించి తగిన రీతిలో కార్యక్రమాన్ని మలచుకోవాలి
13.
వేదాంతమూ, వేదాంత సాధన యన్నవి సోమరితనానికి, డాంబికతకూ, అహంభావానికి,
వాచాలతకూ, ఉత్పాదకాలుగా కాక, క్రియాశీలతకూ, వినమ్రతకూ, నిరాడంబరమూ, నిరహంకార పూరితమూ, ఆర్ద్రమూ నైన స్వభావానికి జనక
స్థానాలుగా మలచబడాలి.
14.
సమాజంలో ప్రవృద్ధములౌతున్న ఆయా సంస్థలన్నీ ప్రస్తుత, భావి సమాజాలకు కరదీపికలు కాగల ఆచరణాత్మకమైన
ప్రణాళికను కూడా కలిగి యుండగలవనీ, అట్టి శ్రేయస్సును ఒనగూర్చగల నిర్ణయాలను
తీసికోగలరని ఆశిస్తూ నమస్సులతో.
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర
No comments:
Post a Comment