Monday, June 7, 2021

మేలుకొలుపు - 5

 

మేలుకొలుపు

జ్ఞాన పీఠం- ఒక పరిశీలన


సంపుటి 1                      సంచిక 5                               1-7-91

ఆర్యులారా!

 గత నాలుగు సంచికలలోనూ ప్రతి వ్యక్తి జీవితంలోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడియున్న కొన్ని అంశాలను పరిశీలించాము. ఈ సంచికలోనూ అట్టిదే మరో ప్రముఖాంశం వివరిస్తాను. మానవ జీవితాన్ని గమనించితే అది రెండు ప్రధాన విభాగాలుగా గోచరిస్తుంది. [1] అనుకోవడం (జ్ఞానభాగం) [2] అనుకున్న దానికి తగినట్లు ప్రవర్తించడం (కర్మ విభాగం) ఈరెంటి సమాహారమే (కూడికే) జీవితమని చెప్పుకోవచ్చు ఒకరకంగా. ఈ సంచిక జ్ఞాన భాగానికి చెందినదిగా నున్నది. జ్ఞానాధారంగానే (ఆలోచనలపై నాధారపడే) మనిషి జీవిస్తున్నాడన్నది ఒక వాస్తవము. అయితే ఆ జ్ఞానం ఒప్పు జ్ఞానమూ, తప్పు (భ్రమ) జ్ఞానమూనని రెండు ప్రకారములుగ నుంటున్నది. ఈ రెండు విషయాలనూ స్పష్టంగా గమనింపబడ వలసి ఉంది. ఈ విషయాన్ని కావలసినంత స్పష్టంగానూ గమనించాడనుకోండి వ్యక్తి, అప్పుడతడు తన జ్ఞానము ఏ కారణం వలనగానీ, (ఉదా: పెద్దలు చెప్పారు గనుక సరిచూడ వలసిన పని లేదనో, తొందర పాటువలననో, మరో విధంగానో కూడా భ్రమపొందవచ్చు) భ్రమాత్మక మైనచో ఆ జ్ఞానంతోనే తాను ఆయా కర్మలు చేస్తాడు గనుక అట్టి పనులన్నీ ఇటు తనకూ, అటు తనతోటే సంబంధాలున్న సమాజానికి కూడా నిరుపయోగంగానో, దురుపయోగంగానో మారగలవని గమనించ గలుగుతాడు. భ్రమజ్ఞానం వలన ఎంత నష్టం రావడానికి వీలుందో గమనింపబడినగానీ వాస్తవజ్ఞానం యొక్క ఆవశ్యకతను సరిగా గుర్తించలేడు. అట్లు గుర్తించిన గాని వ్యక్తి నిజంగా సత్యజ్ఞానార్జనకు యత్నించడు. ఇట్లు జీవన యాత్రలో మేథస్సు (జ్ఞానం) యొక్క పాత్రను గూర్చి స్పష్టత తగినంతగా ఏర్పడినగానీ సత్య జ్ఞానార్జన యవసరమూ, విలువా గమనింపబడవు. అట్లు గమనింప బడిన గాని జ్ఞానార్జన యందు నిజమైన శ్రద్ధ ఏర్పడదు. చెప్పినదే చెప్పినట్లనిపిస్తున్నది కదూ! మీకు. అవును, దీనికంత ప్రాధాన్యత ఉంది మరి. ఆయా సందర్భా లలో మేము ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రతివారూ దీనికింత చెప్పాలా! ఈ విషయం ఎవరికి తెలియదు అన్న భావాన్ని వ్యక్తం చేశారు. అయినా అట్లు పదే పదే హెచ్చరింపబడ్డ వాళ్ళూ, మాకు ముందే తెలుసన్న వాళ్ళూ కూడా యిప్పటికీ మేమనుకున్న స్పష్టత అన్న స్థాయికి చేర లేదు వాస్తవంగా. ఆ విషయం ప్రత్యక్ష ప్రయోగాల ద్వారానే వారికి తెలిసేట్లు చేయడం జరిగింది చాలచోట్ల. అస్తు.

వ్యక్తి వికాసం గురించి చెప్పవలసివస్తే అది నిజంగా వ్యక్తి మానసిక, శారీరక సామర్థ్యముల పెంపు అన్న దగ్గర నుండే ప్రారంభ మవుతుంది. చివరకు మరల దానితోనే ముగుస్తుంది కూడా. ఈ విషయం వెనుకటి వాళ్ళూ స్పష్టంగానే గమనించారనడానికి వ్యవస్థలోనే మిళితం చేయబడ్డ ఒక అంశాన్ని ఉటంకిస్తాను. అది ఉపనయన సంస్కారమే. ఆయా కర్మలు చేయడానికధికారి ఉపనయనం చేయబడిన వాడేనన్నారు వాళ్ళు. ఆచారంగా నేడది వికృత రూపంలో నున్నా దాని భావం “ఉప సమీపేనయనం ప్రాపణి” అన్న వ్యుత్పత్తిని బట్టి ఏర్పడింది. దాని సమీపానికి కన్ను చేరడం అంటే ఆయా విషయాలకు చెందిన జ్ఞానం పొందబడడం అన్న భావం పుడుతోంది. ఆ భావాన్ని స్వీకరించడం కూడా ఉపయోగకరంగా కూడా ఉంది. ఉండగలదు. ఒక పని చేయడాని కధికారెవరు కాగలరు? దానిగూర్చి తెలిసినవాడే, అనడం సబబే కదా! సరే ప్రస్తుతాంశానికి వస్తాను.

ఒక విషయాన్ని గూర్చి తెలిసికొనగోరినా, తెలుపగోరినా తెలిసికొనువారూ, తెలుపువారూ ఆవశ్యం పాటింపదగిన తప్పనిసరి యంశముల సంపుటియే ఈ జ్ఞాన పీఠమను శీర్షికని చెప్పబడుచున్నది. గమనించగలరు. దీనిని నాలుగు పాదములుగా సౌలభ్యం కొరకు చేయడమైనది.

1. చక్కగా వినడము:-ఈ వినగలగడమన్నది ఒక కళ. వినడమూ, చెప్పడమూనన్న విషయములను కడు జాగరూకతతో అభ్యాసము చేసినగాని యలవడదు. అన్ని కాలములందునూ ఆయా విషయ పరిశీలన, విషయ గ్రహణల యందలి పొరపాటులకూ, యనవసర వాగ్వివాదాలకూ చాలావరకు సరిగా వినక పోవడమన్నది కారణంగా యుంటున్నది. మరియు చెప్పేవారిని గూర్చి చదువుచున్న గంథాన్ని, గ్రంథ రచయితను గూర్చి మనకున్న యభిప్రాయాన్ని బట్టి చెప్పబడ్డ విషయానికి విలువల నాపాదించి చూడడం తరచుగా జరుగుతున్న పొరబాటు. అంటే ముందుగనే ఒక యభిప్రాయా న్నేర్పరచుకుని (రాగద్వేష రూపంగా) చూడడం అవుతున్న దన్నమాట. ఇది అసలు విషయాన్ని సంపూర్ణంగా చూడనివ్వక పోవడమో, ఆలోచనలను అన్యదృష్టికి మరల్చడమో చేస్తుంది. దీని వలన చెప్పిన విషయానికి చెందిన వక్త (రచయిత) యభిప్రాయాన్ని సరిగా గ్రహించలేక పోవడమో, అన్యథా గ్రహించడమో జరుగుతుందన్న మాట. ఆపై మన మెంత విశ్లేషణ చేసినా యది దుష్టార్థవ్యంజకమే యవుతుంది.

ఇక్కడ దీనికి ముందుగా జాగ్రత్త వహించవలసిన మరో ప్రముఖాంగముంది. అది ఎదుటివారు చెపుతున్నప్పుడు, [గ్రంథాన్ని పఠిస్తు న్నప్పుడు] శ్రద్ధలోనూ, ఏకాగ్రతలోనూ ఆ పదాలను వాక్యాలను వినాలి. అలాగే మనం చెప్పదలచుకున్న ప్పుడన్నూ, చెప్పదలచుకున్న భావాన్ని సక్రమంగా వ్యక్తం చేయగల పదాలను చెప్పడం, చెప్పిన విషయాన్ని ఎదుటి వారు యధాతధంగా గ్రహిస్తున్నారో, గ్రహించినారో లేదో గమనించడం చేయాలి. ఈ విషయంలో వినేవాళ్ళూ, అనే వాళ్ళూ ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఆ క్షణంలో కొంత భాగం వినలేక పోవడమో, వినని భాగాన్ని విన్నా మనుకుని ఆ వినని భాగాన్ని మనస్సునుండి పూరించడమో జరుగుతుంది. అట్టి సందర్భం ఏర్పడిందే యనుకుందాం. అప్పుడేమవుతుంది? అన్న వారు తానన్నది ఫలానా యనుకుని తన పక్షాన్ని కొనసాగిస్తే విన్న వారు మరో విధంగా గ్రహించి యున్నారు గనుక ఆ దృష్టినుండి పరిశీలన ప్రారంభిస్తారు. ఆపై వారి వారి వేరువేరైన దృష్టుల నుండి పరిశీలనలూ, చర్చలు సాగుతాయి. ఎంత సేపటికి తెగవు. నేను చెప్పింది సరిగనే యున్నది కదా? ఎందుకంగీకరించరు. అని అన్న వారూ, ఇంత దోషమున్నా దాన్నే పట్టుకుని ఊగులాడతారేమా యని విన్న వారూ అనుకుంటూ యుంటారు. ఇక ఆ పరిశీలన ముగింపు పరస్పర యసమర్థతలనూ, దోషాలనూ ఎత్తి చూపుకొనుటతోనో, అసంపూర్ణంగానో ముగుస్తుంది. లేదా ఎప్పటికోగాని అసలు పొరబాటు ఎక్కడ జరిగిందో గమనింపబడదు. ఈ విషయాన్ని గమనిస్తే చెప్పాలనుకున్న వారూ, వినాలనుకున్న వారు ప్రారంభం నుండే మెలకువగా నుండవలసిన, ఉండి తీరవలసిన యగత్యం ఎంతుందో గోచరిస్తుంది.

అయితే మెలకువగా ఉండడం అంటే ఏమిటి? వినువారూ, చదువువారూ మనస్సులో మరో భావం లేకుండగ ఉన్న విషయాన్ని ఉన్నట్లువినడమో, చదవడమో మొదట చేయాలి. చాల వరకు అలానే జరుగుతున్నది యనుకుంటారే గానీ అలా జరగడం లేదన్నది మా పరిశీలనలో అనేక సందర్భాలలో రుజువైంది. ఉదా:- రాయామణం, మహారాభతం అన్న పదాలు వ్రాసి చదువమన్నపుడు చదువరులు వీటిని రామాయణ మహాభారతాలుగా చదివారు. అయితే యిక్కడేమి జరిగింది? పైన చెప్పిన పొరబాటే. ఈ విషయాన్ని చెప్పకుండా ఇలాటి ప్రయోగాలు మీరు చేసి చూడండి. ప్రమాదం ఎక్కడుందో ఆలోచించండి. ఇదంతా రామాయణంలో పికడల వేటలాగుంది కదూ? మొట్ట మొదట శ్రోత ఈ దోషాన్ని తొలగించుకుని వినాలి. అది మది ప్రాముఖ్యమైన సిద్ధాంతపరమైన విషయమైనచో అన్న వారిని మరల యిదేనా మీరన్నది యని అడిగి తెలుసుకోవాలి. నిర్ధారించుకోవాలి. ఇంతా క్రమంగా జరిగినప్పుడు మాత్రమే అన్న వారి నుండి (గ్రంథమునుండి) విన్న వారికీ,(పఠితకూ) ప్రతిపాదన చేరిందన్నమాట. యథాతథంగా చేరిందో లేదో నిర్ధారించుకోవాలన్నది మరలా గుర్తు చేస్తున్నాను. దానికున్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పటికి పదప్రత్యక్షం దోషరహితంగా జరిగిందన్న మాట. ఈ విషయమున్నూ వెనుకటి తాత్వికులలో కొందరకైనా తెలిసేఉంది అనడానికొక ఆధారాన్ని ఉటంకిస్తాను. ఒక వంక “నాయమాత్మా  ప్రవచనేనలభ్యం” అంటూనే మరోవంక “ఆశ్చర్యో వక్తాకుశలో స్వలాబ్ద్వా అశ్చర్యోజ్ఞతా కుశలం సుశిష్ట:” అంటూ పై విషయాన్ని సూచించినారు. ఇక అర్థ బోధ జరుగవలసియుంది. అది జ్ఞాన పీఠంలో రెండవ పాదంగా ఉంది. చక్కగా వినడం జరిగిన పిదప, విన్న దానికి అన్న వారి నుండే యర్ధాన్ని గ్రహించడం రెండవ పాదస్థ విషయంగా ఉంది. భాషకున్న శక్తి పరిస్థితుల దృష్ట్యా విన్న పదానికి అర్ధాన్ని అన్న వారి (ప్రయోక్త) నుండే గ్రహించడం అవశ్యానుసరణీయమై ఉంది. నిజం చెప్పాలంటే పరిశీలకునికి అంతకంటే గత్యంతరం కూడా లేదు. ఈ యర్థగ్రహణ విషయంలో ఏ మాత్రం అవసవ్యత, అన్యథా గ్రహణకానీ భిన్నా ర్థారోపణకానీ జరిగినా ఆ పైనంతా గందరగోళమే. ఇది జరిగిన పిదప పరిశీలకుని మేధస్సూ, నిజాయితీ, తీక్షణత, అన్ని నిరుపయోగాలు గనో కదా చిత్ దురుపయోగాలు గనో మారగలవు. చూడడానికంత ప్రాధాన్యత కల విషయంగా గోచరింపకపోయినా తరచుగా జ్ఞానర్జనలోనూ, పరిశీలనలోనూ ఆటంకాలనూ, అప మార్గాలను ఏర్పరుస్తూన్న ప్రధాన విషయమిది. ఈ విషయం మాయనుభవంలో మేము తరచుగా - ప్రతి సారీ ఏదో సందర్భంలో అనొచ్చు కూడాఎదుర్కొన్నాము. ఆయనుభవ పరంపరనుండే జ్ఞాన పీఠాన్ని ఏర్పరచుకున్నాము. మీరూ మీయనుభవాలను దీని నేపధ్యం నుండి యవలోకించినా యిప్పుడు ప్రయోగం చేసి చూసినా వీటి విషయంలోని వాస్తవాన్ని - విషయ పరిశీలనలోనూ, మనం తీసుకునే నిర్ణయాలలోనూ తరచుగా జరుగుతున్న ప్రమాదాల్ని గమనించ గలరు. పైన చెప్పినట్లు, అతనన్నది యిదీ యనుకున్నా, దానర్థం యిదై ఉంటుంది యనుకున్నా కథ అడ్డం తిరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా విషయ పరిశీలన సత్యాసత్యాలు నిర్ణయించేదిగా ఉన్న సందర్భంలో దీని విలువ యపారంగా యుంటున్నది. ఎందుకనగా ఆవతలివారు చెప్పినదేమిటి? దాని విషయంలో యుద్దేశ ముమిటి? యన్నది యధాతథంగా స్వీకరింపబడిననే గాని అసలు యదార్థ పరిశీలన, సత్యా సత్య నిర్ణయమూ అన్నది పొసగదు. అయితే అనేకానేక సందర్భాలలో యిచ్చటనే ఎంతో కొంతమేర లోపం ఏర్పడుతూ యుంటున్నది. భాష ద్వారా-గ్రంథములద్వారా వ్యక్తం చేయదలచుకున్న యితరుల యనుభవ పరంపరలను విశ్లేషించి వాటి బాగోగులను సమీక్షించాలనుకునే వారికి పై విషయాలు స్ఫురణలో యుండడం చాలా యువసరము. ఏతావాతా యిప్పటికి తేలిన సాంశ మేమంటే,

అన్న విషయాన్ని అన్నట్లుగనే వినడం (గ్రహించడం) విన్న దానికి ఉన్న అర్ధాన్ని అన్న వారి నుండే గ్రహించడం జ్ఞానార్జనలోనూ, ప్రదానంలోనూ ప్రాధమిక అవసరంగా గుర్తించడం, అట్లు జరుగనప్పుడు పరిశీలనా, జ్ఞానార్జనా, ఆ పై చేయు సత్యాసత్య నిర్ణయాలూ, అన్నీ యవకతవకలు గానే యుంటాయనీ గుర్తించడం ఇదీ సారాంశం.

ఇప్పటికి జ్ఞానపీఠంలో యర్ధ భాగాన్ని యవలోకించి నట్లయినది. ఇంతవర కున్న క్రమాన్ననుసరించినచో రచయిత-వక్త-వుద్దేశ్యాన్ని పఠిత-శ్రోత-యథాతధంగా స్వీకరించినట్లైనది. యింతా జరిగిన గానీ యదార్ధమైన పరిశీలన యన్నది నిజంగా ప్రారంభం కావడంలేదు. ఇక మరో పాద విషయంగా పైన లభించిన విషయాన్ని రెండు కోణాలనుండి పరిశీలించడం ప్రారంభిస్తాము.

1)     చర్చా సందర్భమైతే ప్రయోక్త ప్రతిపాదన యనుభవజన్య జ్ఞానం నుండి ప్రవృత్తమైనదా? అనుభవ రహితంగానా? అనగా వినికిడే లేక యనుసరణ శీలమైన విశ్వాసం నుండియా? అన్నది పరిశీలించవలసి యున్నది.

2)     ప్రయోగింపబడిన పద-వాక్య-సముదాయమును ఒక సమర్థవంతమైన పద్దతి ద్వారా అర్థ నిర్ధారణ చేయుటకు యత్నించడం, తద్వారా లభించిన యర్థము సబబైనదా కాదా యని సత్య నిర్ధారణకై యత్నించడం చేయవలసి ఉంటుంది.

ఇందులో ప్రధమపక్షమైన యనుభవ జన్యజ్ఞానం కాదు విశ్వాసమే-పెద్దలు వాక్కు అని చెప్పినాడనుకోండి వక్త. అప్పుడతడు విషయ నిర్ధారణ చేయుటకు తగిన యర్హ స్థానంలో లేడన్న మాట. ఆ విషయాన్ని గమనించి, యతడు కూడా గమనించునట్లు చేయాలి.

Note:-ఇదే విషయాన్ని మనమేదైనా ప్రతిపాదన చేసేటప్పుడు కూడా నియమంగానే స్వీకరించాలి. ఎందుకంటే ప్రతిపాదించినది మనమైనా, మరొకరైనా ప్రతిపాదిత విషయంలో విశ్వాసమే గాని, జ్ఞానం లేనట్లు యంగీకరించి నదైనది గనుక. ఇది యంతే యని చెప్పడం ఆయా విషయాలలో జ్ఞానం- అనుభవజన్యత్వం ఉన్నవారి విషయంలోనే సాధ్యము. తదితరుల-విశ్వాసుల విషయంలో విశ్వాసం విశ్వాసమే ఔతుంది. జ్ఞాన స్థాయిలేని వారి పక్షం నిజ నిర్ధారణలో నిలచుట కష్టము. “జ్ఞానినః తత్వదర్శినః అనియు శ్రోత్రియం బ్రహ్మ నిష్టం” అన్నదియు ఈ విషయాన్నే.

ఇక రెండవ విషయాన్ని బట్టి ప్రతిపాదిత విషయం అనుభవజన్య జ్ఞానమే తెలిసే చెపుతున్నాను యనినచో దానిని ఒక క్రమంలో విశ్లేషించాల్సియుంటుంది. అదెలాగంటే భాష సాంకేతిక రూపై యున్నది. అనగా ఒక్కొక్క పదమూ ఒక్కొక్క నిర్ధిష్టార్థాన్ని సంకేతిని కలిగియున్నది. పద పదార్థాలు సంజ్ఞా సంజ్ఞ సంబంధమన్న మాట. ఆయా పదాలను స్వయం సత్తాకాలూ, సంబంధ జనితాలూ నన్న రెండు వర్గాలుగా విభజించవచ్చు. మరలయవన్ని నామవాచకాలు గానో, క్రియావాచకాలుగానో, గుణవాచకాలుగానో అర్థాన్ని కలిగి యుంటాయి. యింత వరకు గమనించినట్లైనచో యిక ప్రయోక్త ప్రయోగించిన పదాన్ని గుర్తించి దాని భావాన్ని గమనించుటకై యత్నించాలి. ఉక్త పదం ఒక నామిని తెలుపుతుందా? అవునన్నచో దాని గుణమేమి? క్రియలేమి? అని విచారించాలి. అట్లే గుణ వాచక

మైనచో అది దేని గుణము, దాని క్రియలేమి? అనియూ, క్రియయైనచో అది దేని క్రియ? దాని గుణమేమి యనియూ విచారించి సమాధానం రాబట్టాలి. వక్తవు నీవైనా యిదే విధానము. మనచే ప్రయోగింపబడ్డ పదముల విషయంలోనూ పై ప్రశ్నావళికి సమాధానం చెప్పగలిగి యుండడమూ, చెప్పవలిసిన బాధ్యత ప్రయోక్తపై నున్నదన్న విషయాన్ని గమనించి బాధ్యతా యుతంగా వ్యవహరించడమూ యిరు పక్షాలు చేయ వలిసి యుందన్న మాట.

Note:-వస్తువు, ద్రవ్యము, గుణము, క్రియ, అన్న నాలుగు రూపాలలోనే మన కలిగే జ్ఞానమంతా యిమిడి ఉంటుంది. ప్రాచీనులున్నూ యీ విషయాన్ని గమనించారు అయితే వస్తువునూ, ద్రవ్యాన్ని కలిపి ద్రవ్యంగానే పరిగణించారు. ఉదా : మృద్ద్రవ్యం, ఘఠ ద్రవ్య మన్న పదములు - కార్య, దవ్యం, కారణ ద్రవ్యం అన్నమాటలూ ఈ యర్థాన్నే సూచిస్తున్నాయి. ఇంతదనుక చెప్పుతున్న విషయాలు మనచే గ్రహింపబడిన పిదప జిజ్ఞాసువు (పరిశీలకుడు) మూడవ కోణం నుండి పరిశీలన ప్రారంభించాలి. గుణరహితములైన వస్తు దవ్యములు గానీ ద్రవ్యాధారం లేని గుణ క్రియలు గానీ మన యనుభవంలో లేవు. కనుక తెలిసి మాట్లాడుతున్నా నన్న వాని యవగాహన ఎటువంటిదో, లేక తెలిసికొనగోరి యత్నించు వాని గ్రహణ ఎట్టిదో పరిశీలించు కోవడం సర్వదా సమీచీనం కాగలదు. గుణ జ్ఞానము కలిగిందా? గుణి తెలియబడకుండగనా? తెలియబడుతూనా? గుణ గుణి సంబంధము విడదీయదగునా? ఆ గుణమును విడదీసిన ఆ గుణి యుండునా? ఉండునన్నచో ఆ గుణికి యాగుణీ యన్న పేరెట్లు వచ్చింది? ఇలా పరిశీలించాలి. ఆ గుణమును విడచి గుణి యుండ దన్నచో గుణము గ్రహింపబడ్డ తావులెల్ల గుణి యస్తిత్వాన్ని యంగీ కరించాల్సి యుంటుంది. అట్లే క్రియ విషయమున్నూ. అయితే క్రియ ఉన్న చోటు దవ్యం ఉండి తీరుతుంది. గానీ ద్రవ్యం ఉన్న చోటులెల్ల క్రియ ఉండి తీరాలన్న నియమం లేదు. మొత్తం మీద జ్ఞానపీతం మూడవ పాద విషయంగా గుణ గుణి సంబంధాలు తెలిసి ఆ వివేకంతో తెలియబడుతున్న వాటినీ, తెలియాలను కుంటున్న వాటినీ, గూర్చి యవగాహన చేసికోవలయు నన్నదే నే చెప్పదలచుకున్న యంశముగా నున్నది.

ఇహ నాలుగవ పాదస్థ విషయంగా గమనించ వలసిన యంశము. జీవిత గమ్యమూ, గమన పద్ధతులను బట్టి మరింత ప్రాముఖ్యతను కలిగి యున్నది. మనిషి కదలిక యన్నదే కావలసిన దానిని సాధించుకొనుటకూ, యక్కరలేని దానిని పోగొట్టు కొనుటకుగా జరుగుచున్నది. అట్టిచో కార్య సాఫల్యతను కోరువారు పై రెండు సాధ్యముల విషయమైన (కావలసినవి తెచ్చుకొనుటకూ, అక్కర లేనివి పోగొట్టు కొనుటకూ) కావలసినవి ఎందుకు రావడం లేదో గమనించి యారాక పోవడానికి గల కారణాన్ని తొలగిస్తే గాని యది రాదనియు, అట్లే యక్కర లేనిది పోక పోవడానికి గల కారణాన్నెరిగి దానిని తొలగిస్తే గాని యదిపోదనియూ గమనించాలి. ఆపై తగిన రూపంలో కారణ నాశాన్ని చేయగలిగిన గాని కామితార్థ ఫలసిద్ది జరుగదు. నేటి ఆయా సాంప్రదాయాలు సిద్ధాంతా యనుయాయులు అభీష్ట సిద్ధి నందక పోవడానికి ఇది ప్రబల కారణముగ నున్నది. కనుక కారణాన్నెరిగి అదెందుకుంటున్నదో గమనించి ఎట్లు కారణ నాశాన్ని చేయాలో గమనించి యట్లొనరించిన గాని యనుకున్నది జరుగదు. ఈ కార్య కారణ నియమాన్ని యెంత సమగ్రంగా యవగాహన చేసికుని యమలు పరుపగలరో యంతమేర జీవితం జయావహంగానూ; పురోగామి పథంలోనూ ఉంటుంది. ఇది ప్రతి సంఘటనలోనూ ఎంతో కొంతమేర సంబంధం కలిగి ఉంది. విశ్వమంతా కార్య కారణ నియమాన్న నుసరించే కదులుతున్నది. పరిణామం పొందుతోంది. ఏతావాతా తేలినదేమంటే,

1) చక్కగా విన గలగడం అనగా రాగద్వేషాలు లేకుండగనూ, అన్యమనస్కత లేకుండగనూ, పూర్వ నిశ్చిత యభిప్రాయాలు లేకుండగనూ వినడం యని యర్ధము.

2) వినిన మాటలకు, వాక్యములకు అర్థాన్ని యన్న వారి నుండే గ్రహించడం. [గ్రహించు విధానం పైన వివరింపబడ్డది.] అట్లే అన్ని మాటల అర్థాలు చెప్పుటలో బాధ్యత వహించడం.

3) గుణ, గుణి, అవయవ, అవయవి అన్న వాటి విషయాలను, సంబంధాలను చక్కగా యవగతం చేసి కొని ఆ వివేకంతో. తెలియబడిన, తెలియగోరిన దానిని యవలోకించడం,
4) కార్య కారణ నియమాన్ని యర్థం చేసికొని ఆ సామర్థ్యంతో అక్కర లేనిది ఉండడానికి కారణాన్ని అలానే అక్కరైనది లేక పోవడానికి గల కారణాన్ని గ్రహించి కారణ నాశం చేయడం ద్వారా కావలసిన దానిని పొందడం, అక్కర లేని దానిని విడవడం చేయవలసి యుంటుంది. ఈ నాలుగు యంశాల్ని జ్ఞానార్జనా, ప్రధానమూ యన్న రెండు వైపుల నుండే అనగా చెప్పువాడూ, వినువాడూ చక్కగా గ్రహించి వాటి యాధారంతోనే చెప్పడంగానీ, వినడం గానీ జరుపవలయును. అట్లు సాధించుకున్న జ్ఞానమే సత్యజ్ఞానం కాగలదు. మరోసారి మరో యంశాన్ని ప్రస్తావిస్తాను. ప్రస్తుతానికి సెలవ్. నమస్సులతో.

Note: కనీసం మరొక్కసారి పరిశీలించండి దయచేసి.

                                                                                                                                    సత్యాన్వేషణలో

 మీ   సురేంద్ర

స్పందన - ప్రతి స్పందన

 మిత్రులు శ్రీ సురేంద్రగారు మీరాశించే మౌలికమైన మార్పుల విషయంలో నాకు ఆశ లేదు ఆధ్యాత్మ రంగం కూడా ఒక జీవనోపాయంగా మారిపోయింది. Survival Instinctకి బలైపోయింది. ప్రజలకు అనుకూలంగా విషయాలు చెప్పకుంటే నాకు ఆదరణ, గుర్తింపు పోతుందనే భయం ఆంధ్రదేశపు ప్రచారకుల్లో ఉంది. ఎక్కువ మంది ప్రచారకులకు శాస్త్రజ్ఞానంగానీ, వైజ్ఞానిక జ్ఞానంగానీ లేదు. తడబడకుండ గట్టిగా ఒక ధారగా మాట్లాడగలగడం ప్రసంగాల మథ్యలో కొన్ని ఉపమానాలూ, కొన్ని పిట్టకధలూ, కొన్ని పాటలు, పద్యాలూ, నామసంకీర్తన వగైరా హంగులతో మాట్లాడితేచాలు అతనికిక ఢోకాలేదు. ఇది వ్యక్తుల విషయం ఇక ఆశ్రమాలకు సంఘంలో ఉన్న పరపతిద్వారా ఆ ఆశ్రమాలకు చెందిన ప్రచారకుల సంఘంలో - ఆ వ్యక్తులు ఏ సరకూ లేనివారైనా సరే - ఒక మంచి గుర్తింపూ, ఆదరణ లభిస్తున్నాయి. వాళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడినా, వ్రాసినా చెల్లిపోతుంది. సంఘంలో బాగా పరపతి సంపాదించిన ఆశ్రమాల్లో ఉండేవాళ్ళకు ఒకరకమైన అధిక్యతాభావం, అహంభావం, సంపన్న శైలి జీవిత విధానం వగైరా చోటు చేసికున్నాయి. ఇక వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ సంపాయించుకొన్నారా - వాళ్ళు ఆ Routine లోనే ప్రయాణం చేస్తారుగానీ, ఆత్మ పరిశీలన వగైరాలకు యిష్టపడరు. తాము మూర్ఖత్వాన్ని పెంచి పోషించే కార్యక్రమం చేపట్టామని అసలే గుర్తించరు. ఇలాంటి వాళ్ళకు మీరు చెప్పేవి తలకెక్కుతాయా?

వేదాంతోపన్యాసాలు కూడా హరికథల క్రింద మన ప్రచారకులు మార్చివేశారు. ఇక మన మూర్ఖ ప్రజలు ఆధ్యాత్మక జీవనం గడిపేవాళ్ళు తమకన్నా చాల భిన్నంగా ఉండాలని ఆశిస్తారు. ఆ భిన్నత్వం చూపడానికే సాధువుల్లో దంబాచారం ఎక్కువైపోయింది. ఈ మధ్య ప్రజల్లో అక్షరాస్యత పెరగడం వల్ల ఎవరికి వారే - స్వయంగా కొన్ని బూటకపు ఆధ్యాత్మ గ్రంధాలు చదవడం వల్ల తాము అన్నీ గ్రహించేశామనే ఒక మిధ్యా భావాన్ని పెంచుకున్నారు. ఈ రకం వారిని చాలా Hopeless కేసుగా నేను పరిగణిస్తాను. మీకు వినే వోపిక ఉండాలేగాని ఈ రకంమనుషులు గంటల తరబడి బోధ చేస్తారు.

మీరన్నట్లు మనకు సరియైన దారి చూపగల సత్తా మన ప్రాచీన శాస్త్ర గ్రంథాలో ఉంది. నిక్షిప్తమై ఉంది. ముఖ్యంగా వేయ్యేళ్ళ పూర్వ గ్రంధాల్లో వెయ్యేళ్ళుగా మన శాస్త్ర గ్రంథాల్లో దిగజారుడుతనం గోచరిస్తుంది. ఆ దిగజారుడే యిప్పుడు ప్రచారంలో ఉండేది. ఆ గ్రంథాలనుండి మేలు పొందాలంటే ఎంతో శ్రమ పడాలి. సంస్కృతం బాగా రావాలి. అవి చాల ఆధునిక భావాలు కనుక ఆధునిక భావజాలంతోనూ చక్కని పరిచయం ఉండాలి. లేకుంటే ఆ గ్రంథాలు వట్టి భాషా పండితునికీ, దిగజారుడు శాస్త్ర పండితునికీ అర్థంకావు. సామాన్య ప్రజలు ఇంత శ్రమ పడలేరు కనుక ఆధ్యాత్మ రంగంలో నున్న నాయకులీ పనికి పూనుకోవాలి. కానీ ఈ యహంభావులు, మూఢాత్ములు, చచ్చు సాంప్రదాయ దాసులు ఇందుకు పూనుకోరుగదా! ఇట్లు గుప్త లేఖకుడు.

ప్రతి స్పం: ఆధ్యాత్మికరంగంలో - బహుకాలం [దాదాపు 25, 30 సం] నుండి ఉంటూ అనేక బృహత్సంతులలో అనేక బాధ్యతలు నిర్వహించి, యిప్పటికీ ఆ మార్గంలోనే అధ్యయనాధ్యాపనములు సాగిస్తున్న ఒక మేధావి, సంఘహితైషి, నిష్కర్ష విమర్శనా శీలుడనైన ఒక సాధకుని సుదీర్ఘ లేఖయిది. యదార్ధవాది లోకవిరోధి యన్న వచనం సర్వదా ప్రమాణంగానే సాగుతున్న నేటి రోజుల్లో, ఆయనున్న తీరును బట్టి ఆయన పేరు గుప్త లేఖకుడు అని ప్రకటించడ మైనది. ఆయన లేఖాంశములను మాయనుభవాల నుండి సరిచూసినప్పుడవి కఠిన పదజాలముల ద్వారా వ్యక్తపరుపబడినా అక్షర సత్యములనియే నాయభిప్రాయము-ఎందుకంటే.

జీవిత దృక్పధాలు- జీవన విధానములు - రెండురకములు-వెనుకటి వాళ్ళు వాటిని లౌకిక జీవనము, పారమార్థిక జీవనముగా వ్యక్తీకరించారు. లౌకిక జీవనమన్నది ప్రధానంగా మూడు మూల్యములు-విలువలు కలిగి ఉంటుంది

[1] స్థిర, చర ఆస్తులు పెంచుకోవడమూ [2] యితరు లేమయితేనేమి వీలయినంత భోగము పొందాలను కోవడమూ, [3] గుర్తింపు స్వభావము వెర్రితలలు వేసి కీర్తి ప్రతిష్టలే ప్రధానమనుకోవడమూ. వ్యక్తి ఏ ఆశ్రమంలో నున్నా, ఏ సంఘంలో నున్నా, ఏ దేశీయుడైనా, ఏ వేషభాషలు కలిగివున్నా పై మూడంశములకు చెందిన వాడైతే అతను లౌకికుడు ప్రేయోమార్గగామి అన్నమాటే దానికి విరుద్ధంగా పారమార్థిక జీవనము ధర్మాన్ని ఆధారం చేసికుని అర్ధకామాలను పొందాలన్న దృక్పధం కలిగి ఉంటుంది. ఆ మార్గము పై మూడు విషయాలలోనూ పరిమితాలను విధిస్తుంది. దీనిని శ్రేయో మార్గమంటాము. ఈ కొలతలలో నుండి చూస్తే ఆశ్రమాలూ సంఘాలలోని 78% వ్యక్తులు లౌకిక జీవనులుగానే ఉంటున్నారన్న మాట నిజాయితీగా పరిశీలించి నా వాక్యాలు (గుప్తలేఖనుని యభిప్రాయాలు) వాస్తవమో, అవాస్తవమో నిర్ణయించండి.

No comments:

Post a Comment