మేలుకొలుపు
సంపుటి -1 సంచిక – 8 1-10-91
స్వమంతవ్యంపై విమర్శా – సమీక్ష
స్వమంతవ్యం
అన్న శీర్షికన నా గురించీ, పత్రికను గూర్చి అనేకాంశాలను 6, 7 సంచికలలో
వివరించాను. ఆయా వివరణల పై అభిప్రాయాలను 8వ సంచికకు
పంపవలసిందనియూ, 8వ సంచిక అందుకై ప్రత్యేక సంచికగా
వస్తుందనియూ, గత సంచిక లోనే తెలిపాను. అయితే విచారించవలసిన
విషయమేమంటే పాఠకుల నుండి ఇంతవరకూ తగినంత స్పందన రాలేదు. పాఠకులలో ఉత్సుకతను
కలిగించ లేక పోయిందేమో పత్రిక అన్న సందేహం కలుగుతోంది. అట్లుకాక పత్రికను
దినపత్రిక లానో, ఏదో కాలక్షేపానికి పనికివచ్చే పుస్తకంగానో
మాత్రమే ఒకసారి చూసి అవతల పడవేస్తున్నారేమో ననిపిస్తుంది. అయితే నా హృదయంలో
కదులాడుతున్న భావాలను బట్టి పత్రికను గూర్చి చెప్పవలసి వస్తే, ఇది గుర్తింపుకొరకో, కాలక్షేపానికో
ప్రారంభింపబడింది కాదు. భావాత్మకమైన, ఆచరణాత్మకమైన
క్రాంతిని, విప్లవాన్ని కోరి ఆరంభింపబడింది మాత్రమే. నిశితంగా చూడగలిగితే నా రచనలీ
విషయాన్ని ప్రకటపరుప గలవు. మార్పూ, మార్పు యిష్టపడేవారి సంఘటనా-కలయికా-ప్రస్తుత
ప్రథమావసరమన్నది కొట్టవచ్చినట్లుగా కనబడుతున్నప్పటికీ, సమాజం
దీనిని ఎందుకు చూడడం లేదో, అధవా కొందరు చూసినా ఎందుకు
స్వీకరించడం లేదో పరిశీలించవలసి ఉంది. పరిశీలన వల్ల నా వరకు ముఖ్యంగా నాలుగు
కారణాలు ఎదురు పడుతున్నాయి. [1] అవగాహనా లోపము. అనగా,
అసమగ్ర జ్ఞానమో, తప్పు జ్ఞానమో కలిగి ఉండడం. [2] స్వార్థం ప్రధానం కావడం. [3] సోమరితనం అలవాటుగా మారడం. [4] ఉదాసీనత. ఇది జరిగేదా? పెట్టేదా? మనకెందుకులే అన్న
భావన. పరిశీలిస్తే యింతకన్న సరైన కారణాలు ద్యోతక మగుట లేదు. మంచివేపుకు మరలుదామన్న
భావన – తపన - క్రమంగా సామాజిక చైతన్యం మనుష్యుల
మనస్సులలో నుండి దిగజారి పోతోంది. అక్కడక్కడా ఎక్కడో మనస్సు అంతరాంతరాల్లో అది
మినుకు మినుకు మంటున్నా ధర్మ మార్గంలో జీవించాలనుకునే వారి బ్రతుక్కే భద్రత
ఉండదేమోనన్న పరిస్థితి అనుభవంలో ఎదురవుతున్నది. మనుషులలో అమానుష ప్రవృత్తి జనించి
క్రమంగా పాశవికంగానూ, పైశాచికంగానూ మారుతూ బలపడుతోంది. సమాజాన్ని అవలోకిస్తే నిత్య సంఘటనలుగా,
ఇవే మనకు గోచరిస్తాయి. ఈ విషయంలో అంతకంటే ప్రమాదకరమైన విషయమేమంటే పై
అమానుష ప్రవృత్తులన్నీ ఏదో ఒక అభ్యుదయం పేరిటో, విప్లవం
పేరిటో చెప్పబడుతూ ఉద్యమాలుగా రూపాంతరం చెందడం.
ప్రజా
విప్లవోద్యమాల పేరిట మతోద్యమాలూ, వర్గ పోరాటోద్యమాలూ, కులోద్యమాలు, స్వతంత్ర రాష్ట్రోద్యమాలూ, వీటికై చేయబడుతున్న
బందులూ, రాస్తారోకోలూ వాటిలో ప్రధాన కార్యాలుగా ఉంటున్న
లూటీలూ, గృహ, వాహన దహనాలూ, దౌర్జన్యాలూ, నక్సలైటు ఉద్యమాల పేరిట మారణకాండ, దానిపై సమాజ భద్రత పేరిట ఎన్ కౌంటర్లూ, రాజకీయ పదవీ
వ్యామోహం- దీనిని పిచ్చి అంటే బాగుంటుంది – నుండి పుట్టి ప్రజలను గుడ్డివాళ్ళను చేస్తున్న
నాయకమ్మన్యుల వాగ్దానాలూ, నాయకత్వాన్నీ, అధికారాన్ని పొందాలనుకునే కుహనా
మేధావుల రెచ్చగొట్టు ధోరణులూ, మరో వంక సామాన్య ప్రజానీకంలోనూ
పెచ్చుపెరిగిన లంచగొండితనం, డబ్బు కోసం గడ్డి తినే ప్రవృత్తి,
బాధ్యతల ఎగవేత దనం, హక్కుల పోరాటం, రకరకాల రూపాల్లో అంతర్యుద్ధాలూ, నిరక్షరాస్యత,
కుల పిచ్చి, చిన్న చిన్న ఘర్షణల నుండే
ప్రాణాలు తీసుకునే వినాశకర ప్రవృత్తి, దోపిడీలూ, అత్యాచారాలూ భూతాల్లా ముసురుకుంటున్నాయి.
ఇవన్నీ యిలా ఉండగా ఆధ్యాత్మికత పేరున అంకచండాలం, ఆచరణ శూన్యమైన ప్రగల్భాలూ, హితోక్తుల ముసుగులో స్వార్ధమూ, ప్రాచుర్యాన్ని
పొందుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ రూపంలో ఉన్న కుహనా రాజకీయ నాయకుల బాల్యచేష్టలూ,
అనవసర ప్రసంగాలూ, యువశక్తిని స్వార్థ ప్రయోజనాలకై
బలి చేసే నానా సంఘాల నాయకుల కౌటిల్య తంత్రాలూ, గృడ్డిగా
వారలచే ఈడ్వబడి శలభాలై పోతున్న యువతా, ఆవేశమే తప్ప ఆలోచనే
లేని నానా విధ యత్నాలూ, కేవల వ్యాపార సరళికంటేనూ మిక్కుటంగా
వ్యాపార దృష్టిని సంతరించుకున్న జ్ఞాన కేంద్రాలూ, తనది తనకు
ముడితే చాలు విద్యార్థులే మైతేనేమి అనుకునే గురువులూ, వీలుంటే
పంగ నామాలు పెడదాం, అవకాశం దొరికితే అవమానిద్దాం అదో
హీరోయిజం అనుకునే విద్యార్థులూ ... ఇలా....ఇలా .... ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు
నేటి సామాజిక శరీరంలోని వికృత రూపాల్ని గూర్చి.
ఉన్నదున్నట్లుగా
పై వినాశ కారకాలైన వికృత రోగ రూపాలన్నింటిన్నీ క్రోడీకరించి ఏ మహాశిల్పో, చిత్రకారుడో గనుక ఒక రూపాన్ని మలచగలిగితే
దాని వికృత రూపాన్ని ప్రస్తుత మానవ మేధస్సు ఊహించలేదు. అది సుమారుగా, అమానుష రీతిలోనూ, పశువులకు భిన్నంగానూ, రాక్షస, పైశాచికాకృతి కంటేనూ వికృతమూ, భయానకమూ, ప్రమాదకరమూ కాగల స్థితిలోనూ ఉంటుందని
మాత్రం చెప్పగలం. ఇట్టి స్థితిలోనూ, వీటితోనే కలసి జీవించక తప్పని స్థితిలోనూ
మార్పుకై ఎవరి వంతు వాళ్ళు నిజాయితీగా యత్నించక పోవడాన్ని ఏమనుకోవాలి? మార్పు అవసరాన్ని గుర్తించిన వాళ్ళ వరకన్నా ముందుగా ఒక వేదిక పైకి రావడమూ,
పరస్పరావగాహన ద్వారా వాస్తవమన్న ఒకే తాటి పైకి చేరడమూ మాత్రమే
సమస్యా పరిష్కారానికి నాందీ ప్రస్తావన కాగలదు. ఇంతటి ప్రమాదకర పరిస్థితి
సమాజాన్నంతటినీ కబళించే స్థితిలోనూ ఎవరికి వారు తమకు మోక్షం కావాలనుకుంటూ
(మోక్షమంటే ఏమో అదెలా వస్తుందో కూడా తెలియని అంధానుయాయులే ఈ తరహా వారిలో ఎక్కువ
మంది.) లోకమేమైతేనేమీ నాకు మాత్రం దుఃఖలేశం కూడా ఉండ కూడదన్న కోర్కె మఱ్ఱి
వృక్షంలా ఊడలు దిగి బలపడుతూంటే, ఆధ్యాత్మిక సాధనల పేరిట నానా హంగామా
చేస్తుండేవారిని, తత్వజ్ఞానం పేరిట శాస్త్రాలను చిలక
పలుకుల్లా వల్లించే వారినీ, ఉబుసుపోక కబుర్లతో కాలం గడిపే
వారినీ ఏమనాలో అర్థం కాదు. అలానే ఆత్మోద్ధరణమంటే నేను బ్రహ్మను, ప్రపంచం మిధ్య అని మాటకు మాత్రం అనుకునే, చెప్పుకునే
వారలను ఎంతమందినో చూశాను. తెలియడమంటే ఏమో తెలియని వీరు పుస్తకంలో చూశో, వినో అలా అనుకుంటే చాలుననుకుంటుంటారు. ఒక వంక ఏకాదశేంద్రియాలూ పటుత్వం
కోల్పోయి వాటి వాటి పనులు నిర్వర్తించలేని స్థితిలోనూ నాదీ, నావాళ్ళంటూ
సంసార లంపటంలో పడి తన్నుకుంటూ తనకంటె చిన్న వారికి మాత్రం ఇదంతా వట్టిది, బొత్తిగా లేనిది అంటూ చిలక పలుకులు పలుకుతుంటారు. పిచ్చి వాళ్ళుగా
గుర్తించడానికి వీలుగానున్న పిచ్చివాళ్ళ వలన పెద్దగా ప్రమాదమేమీ లేదు గానీ, పెద్దవాళ్ళుగా గురింపబడుతున్న పిచ్చివాళ్ళ వలననే అసలు ప్రమాదమంతా. ఈ తరహా
బోధకులు తాము మాత్రం ఏది అంతా వట్టిది అని సాధకులకు చెపుతుంటారో దానిలోనే (డబ్బు,
కీర్తి, భోగం) మునిగి తేలుతుంటారు. వారి వలలో
పడిన సాధకులు మాత్రం (గృడ్డివారూ, అమాయకులూ) అటు లౌకిక భోగాల్నీ
వదలు కుంటారు. ఇటు వారనుకునే మోక్షమున్నూ ఆయా అసంబద్ధ విచారణలూ, అవకతవక సాధనల వల్ల గగన కుసుమమే ఔతుంది. ఇలా వీరు రెంటికీ చెందిన
రేవడౌతారు. అయితే ఎంతకాలమలా ఉండగలరు? కొంతకాలానికి క్రమంగా
వీరూ చిన్న చిన్న బోధకులుగా మారతారు. ఆపై జరిగేదేమో పాఠకులు గ్రహించ గలరనుకుంటాను.
వీరు కూడా డబ్బు, కీర్తి, భోగం అన్నవే
అసలైనవని వారి సాధన కాలంలో గల జీవితానుభవాల నుండి గ్రహించి వాటికై యత్నించడం
మొదలెడతారు.
అయితే
ఇక్కడో గమనించవలసిన విషయముంది. ఈ తరహాకు భిన్నమైన స్వభావం కల వ్యక్తులు ఉంటారన్నదే
ఆ విషయం అట్టివారు వేలల్లోనో, లక్షల్లోనో ఒకరిద్దరుంటారు. వారి వారి సిద్ధాంత విషయాలను పరీక్షించి
చూడవలసే ఉన్నప్పటికీ, మళయాళ స్వామీ, అరవింద,
రమణ, రామకృష్ణ లాంటి వాళ్ళూ అలానే మార్క్సు,
గోరా, వినోభా, గాంధీ
లాంటి వాళ్ళూ పై వేలల్లోని వారిలో చేరి పోతారు. ఈ కోవకు చెందిన వారిలో వాస్తవంగా
స్వార్ధం ప్రధానం కాకుండా ఉండి సమాజాన్ని సంస్కరించాలన్న తపన వీరిని నడిపిస్తూ
ఉంటుంది. గుర్తింపు తపనేమీ ఉండదు. వారి వారి జ్ఞానస్థాయిల నుండి ప్రణాళికల
నేర్పరచుకుని అమలు చేసికుంటూ పోతూంటారు. ఇట్టి వారిని మినహాయించే సామాజిక వికృత
రూపాన్ని మీకు చూపించే యత్నం చేశాను. మీరున్నూ ఈ విషయాన్ని విడగొట్టి చూడగలరనే
ఆశిస్తాను. పై వ్యక్తుల నిజాయితీని శంకించ వలసిన పనిలేదు గానీ, వారికి నిజం తెలిసి వుందా? అన్నది మాత్రం
పరీక్షించవలసియే ఉంటుంది. వారు ఎవరైనా, వారు ప్రవచించిన
విషయాలు ఏవైనా అవి మాత్రం పరిశీలించే స్వీకరించటం సర్వదా శ్రేయస్కరం అన్నది
ఎప్పుడూ మరువకూడదు. సరే ఈ విషయ మట్లుంచండి.
మేలుకొలుపు
పత్రికలు పోస్టు ద్వారానే 200 మందికి పైగా అందజేస్తున్నాము. సుమారు మరో వంద మామూలుగా ఆయా వ్యక్తులకు
చేరుతున్నాయి. మొత్తం మీద 500 మందైనా పత్రిక చూసుంటారని
అంచనా. పత్రిక చూసిన పిదప వారంతట వారికిగానీ, నా ప్రకటననుసరించి
గానీ అభిప్రాయాలు వ్రాయాలన్న ప్రేరణ కలగకపోవడం కొంత విచారించవలసిన విషయమేమరి.
స్వమంతవ్యం పై విమర్శలు పంపండని నేను ప్రకటించినా యింతవరకు 5, 6 వుత్తరాల కంటే ఎక్కువ నాకు చేరలేదు. ఇప్పటికి నాకందిన స్పందనలను మీ
ముందుంచి ఈ సంచిక ముగిస్తాను. మరిన్ని విశేషాలుంటే మరో సంచికలో ప్రచురిస్తాను.
(1) డా. మో. కృష్ణస్వామి ఎమ్.ఎ.పి.హెచ్.డి.
అధ్యక్షులు మానవ ధర్మ రక్షణ సంస్థ; వారి నుండి, “సత్యాన్వేషకులు సురేంద్రగార్కి శుభాకాంక్షలు. మేలుకొలుపు పత్రికను గూర్చి
అభిప్రాయం వ్రాయమన్నారు. భాష రాను రాను సరళతను సాధించుకుంటున్నది. వ్యక్తీకరణము
క్రమముగా సూటిదనమును పొందుచున్నది. ఈ రెండునూ పత్రికకు కావలసిన అంశములు. ఇంకనూ
చెప్పవలెనన్నచో పత్రికకు ప్రాణప్రదమైన అంశములు. వీటి విషయమున మీరు చేయుచున్న కృషి
ఆదర్శప్రాయమైనది.
(2) సి. హెచ్. సుబ్బారావు బి.కాం.బి.యి.డి.,
ఎన్.ఎస్.ఎమ్, పబ్లిక్ స్కూలు వారు, “గౌరవనీయులైన సురేంద్రగార్కి, మీరు వెలువరిస్తున్న
పత్రిక సంచికలు కొన్ని చదివే భాగ్యం కలిగింది. అత్యంత క్లిష్టమైన యిటువంటి
విషయాలను అందించే పత్రికను నిర్వహించడం విశేషమైన శ్రమతో కూడుకొన్న పని. అటువంటి
సాహసోపేతమైన పనులు చేస్తున్నందుకు ముందుగా మీకు నా హృదయపూర్వక అభినందనలు
తెలియజేస్తున్నాను. ముందు సంచికలకూ, ఈ మధ్య వచ్చిన సంచికలకూ
పురోభివృద్ధి కన్పించినది. భాషను సరళం చేయుట, విషయాలను
వివరించుట ముఖ్యంగా నేను మెచ్చుకుంటున్న మార్పులు. ముఖచిత్రంపై వివరణ చాలా
బాగుంది. అయినప్పకీ దానిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత యున్నది.
మేలుకొలుపు పాఠకునిగా కొనసాగుటకు నేనేమి చేయవలయునో తెలియపరచండి. అక్టోబర్ నెలలో
మీరు ఏర్పాటు చేస్తున్న సమాలోచన శిబిరానికి హాజరగుటకు యత్నించెదను.
(3)
ఎమ్. రామచంద్రకుమార్. హైద్రాబాద్ వారు “గౌరవనీయులైన సురేంద్రగార్కి, మీరు ప్రచురించిన పత్రిక రామకృష్ణ మఠం,
హైద్రాబాదులో ప్రతినెలా చదువుచున్నాము. మమ్ములను మీ మండలిలో
సభ్యులుగ చేర్చుకొనగోరెదము.
(4) టి. శంకర్రావు, తుళ్ళూరునుండి.
“పూజ్యులైన సత్యాన్వేషణ మండలి వార్కి నమస్కారములు. మేలుకొలుపు అన్న పేరు పత్రికకు
బాగా సరిపోయినది. ఇంకా సమాజంలో అంతానాకే తెలుసు, నేను
చెప్పిందే కరెక్టు అనే స్వాములూ ఉన్నారు. పెద్దలూ ఉన్నారు. ఎంత నిజమయినా దాన్ని
కూడా పరిశీలించాలి అన్నమాట చాలా ముందుచూపుతో కూడుకున్నదిగా ఉన్నది. వాస్తవిక
దృష్టి, సత్యాన్వేషణమూ, వివేకమూ, ధర్మాచరణమూ,
వ్యష్టి, సమిష్టి శ్రేయస్సు ప్రతివారిలో వుంటే
అదే వసుధైక కుటుంబము. అవి ఇప్పుడు సమాజంలో లోపించాయి. వాటిని మీ పత్రిక ద్వారా
ప్రజలకు మేలుకొలుపు పాడాలని మనసారా కోరుకుంటున్నాను. మిమ్ములను తుళ్ళూరులో కలసిన
దగ్గరనుండి నాలో కూడా మార్పు వస్తున్నది. ఇంకా తెలిసికోవలసినది చాలా ఉన్నది.
నమస్కారము.
(5) శ్రీరామశర్మ. తెలుగుపండిట్. రామకృష్ణ
విద్యాలయం వారు సుదీర్ఘ మైన లేఖ వ్రాశారు. అయినా సారాంశాన్ని కాక విషయానికి
సంబంధించినంత వరకు వారి మాటలనే వ్రాస్తున్నాను గమనించండి.
“సత్యాన్వేషి
సురేంద్రగార్కి, ఆర్యా, మీరు పంపిన ‘మేలుకొలుపు’ అనే పత్రికలను
చూచితిని. చాల బాగున్నవి. విషయము పరమార్ధ విషయము గనుక విషయాన్ని గూర్చి బాగుంది,
లేదు అని చెప్పనవసరం లేదు. ఇక విషయం చెప్పుటలో భాషను గూర్చి ఎవరి
పంథా వారిది. వాక్య నిర్మాణము అనగా భావము కాక, వ్యాకరణమునకు
సంబంధించినది. నేటి సమాజంలో వ్యాకరణమునకు ప్రాధాన్యము లేదు. పరస్పరము వారి వారి
భావములను అర్థమగునట్లు విశదపరచిన చాలును. ఇందులో మీ భావములను వాక్య నిర్మాణములో
పెట్టినప్పుడు సామాన్య వ్యక్తికి అర్ధమగుట కష్టము. పారిభాషిక పదమును తెలిసిన
వారికి సులభము. ఇక సత్యాన్వేషణములో సురేంద్ర అంటే తప్పులేదు అని నాయభిప్రాయము.
(6)
పాఠకులలో కొందరు ముఖాముఖి కలుసుకున్నప్పుడు మౌఖికంగా వారి అభిప్రాయాల్ని
వెలిబుచ్చారు. కవి శేషాచలం, ప్రిన్సిపాల్, విజ్ఞానవిహార రెసిడెన్షియల్ స్కూలు
వారు “మీ పత్రికను గూర్చి మీరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎంతో వివరణాత్మకం గానూ,
విమర్శల పై మీ వ్యాఖ్యలు వాడిగానూ ఉన్నాయి'' అన్నారు.
ఇప్పటివరకూ.
అందిన పై లేఖలవరకు, ప్రత్యేకంగా సమీక్షించ వలసినంత విషయమేమీ వాటి ద్వారా అందలేదు. పై 5,
6 అభిప్రాయాలూ దాదాపుగ ప్రశంసాత్మకంగానే ఉన్నాయన్నది మీరు గమనించే
ఉంటారు. పైగా ఆ యభిప్రాయాలు సంగ్రహంగా ఉన్నాయి. కనుక వారిని విశ్లేషించి
సమీక్షించుట పొసగదు. నా వైపు నుండి ప్రయత్న లోపం జరుగ కూడదనే ఉద్దేశంతో 10 మంది సాహితీవేత్తలకున్నూ పత్రికలు పంపాను అభిప్రాయాలు పంపండని. వారి నుండి
సమాధానాలు యింతవరకు నాకు చేరలేదు. వచ్చే సంచిక లోగానైనా; ఎన్ని
అభిప్రాయాలు వచ్చినా, వాటిని పై సంచికలో ప్రచురించగలను.
నలుగురూ అంటున్నట్లు శైలి కొంతవరకు సరళతను పొందిందనే అనిపిస్తున్నది నాకుకూడా.
స్వమంతవ్యంలో
నా గురించీ, నా మాటల గురించి నేను చేసిన వివరణల పై ప్రత్యేక విమర్శలేవీ లేవు. పత్రికలో
వాడిన 1, 2 పదాలపై మాత్రం చిన్న విమర్శలు వచ్చాయి.
వివరిస్తాను పరిశీలించండి.
(1) “స్పందన – ప్రతిస్పందన” అన్న ప్రయోగం వింటానికి బాగుందే గానీ సరైనది
కాదు. ఎందుకంటె స్పందన అంటేనే ప్రతిచర్య (రియాక్షన్) అని అర్ధము. మరల
ప్రతిస్పందనేమిటి? అర్ధం లేకుండా అన్నది విమర్శ. పైగా ఈ విమర్శ చేసినవారే చేసిన మరో సూచన,
పత్రికను ప్రచురించే ముందు ఒకరిద్దరు సాహిత్యం తెలిసిన వారికి
చూపించుకోవచ్చుగా, అన్నది. వారి మాటలు కొంత వ్యంగ్యాన్ని
ధ్వనింపజేస్తున్నాయి. సరే.
ఇది
అక్కర లేని విమర్శే కాక, అసంబద్ధం కూడా. స్పందన అంటే రియాక్షన్ అన్న రూఢ్యర్ధం ఎక్కడుంది? ఈ దోషాన్ని, మరో సూచననూ, చేసే
ముందు వారు తమకెంత సాహిత్య ప్రవేశం ఉందో ఆత్మ విమర్శ చేసికొని ఉంటే బాగుండేది.
ఎందుకంటే అసలు చర్యా ప్రతిచర్య అన్నవి సాపేక్షకాలు. ఏ పనినీ దాని నొక్కదానినే చూపి
అది చర్య అని గానీ, ప్రతిచర్య అనిగానీ చెప్పడం కుదురదు.
అలానే అదే పనిని ఒక దానితో ముడిపెట్టి చర్య అనీ, మరో దాని
సంబంధంతో ప్రతిచర్య అని చెప్పవచ్చు. పై విమర్శ - అదో దోషంగా - చేసిన వారికీ విషయం
తెలియదన్నది స్పష్టంగానే తెలుస్తున్నది. మరో విషయమేమంటే ఈ చర్యా ప్రతిచర్యా గొడవలు
లేకుండానే ఆ శీర్షిక అర్ధం అందరకూ తెలుస్తూనే వుంది. పాఠకులు వారి అభిప్రాయాలు
పత్రికకు వ్రాయడం స్పందన అనీ, అందుపై రచయిత అభిప్రాయాలు
ప్రతిస్పందన అనీ, ఇదేమీ వ్రాయకూడనిదీ; అర్థంకానిదీ
కాదు గదా. ఇదేదో తీవ్రమైన దోషంగా వారు చెప్పడం ఎలా ఉందంటారు? అక్కర లేని విమర్శ అనిపించడం లేదా? వారి నుండే మరో
విమర్శ వచ్చింది. “ప్రతికక్షుల దురాగ్రహ ప్రతిష్ఠంభన” అన్న నా ప్రయోగం లోని
దురాగ్రహమన్న మాటను వారే దుర+ఆగ్రహము అని విడదీసి అర్ధం చెప్పినారట వాస్తవంగా ఆ
పదాన్నలా విడగొట్ట కూడదు. దుర్+ఆగ్రహము = దుష్టమైన ఆగ్రహము, ఉండకూడని
కోపము - చెడ్డకోపము అని అర్ధమునిచ్చే పదమది. వేరే అర్థం దాని నుండి ఎవరైనా
సాధించినా నేను మాత్రం నేను చూపిన అర్థంలోనే ప్రయోగించానా పదాన్ని. అది దుష్ట ప్రయోగమేమీ
కాదు, నాకు సూచించిన సలహాను వారే స్వీకరించి ఇలా అభిప్రాయాలు
చెప్పేముందు భాషావేత్తలను సంప్రదించి ఉంటే బాగుండేది, బాగుంటుంది
అంటాను. మీరేమంటారు? ఈ నా విమర్శ కొంత ఇబ్బంది కలిగించేదిగా
ఉన్నప్పటికీ వ్రాయక తప్పలేదు. ఎందుకంటే పత్రికాంతర్గత విషయాలపై నిస్పాక్షిక విమర్శ
చేయుట సబబై యుండగా దానిని విడచి అక్కర లేనీ, ప్రమాదం కానీ
రెండు పదాలను అపసవ్యంగానూ పరోక్షంగానూ విమర్శించడం సరైన విధానమని అనుకోను. అలా
పరోక్షంగా విమర్శించే వారందరకూ, దయచేసి మీ విమర్శలు నేరుగా
పత్రికకే పంపండని ఆహ్వానిస్తున్నాను. మీ మీ విమర్శలు వాడిగా, వేడిగా ఉన్ననూ యదార్ధ విలువలు కలిగి యున్నంతవరకూ వాటిని స్వీకరించుటకూ, అవసరమైన మార్పులు చేసి కొనుటకు నేను సంసిద్ధుడనే. గమనించగలరు.
(సశేషం)
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర
విశ్వాసమూ - వివేకమూ
మానవ
జీవితాల్ని నడిపిస్తున్న రెండు దృక్పధములను గూర్చి తగినంత యవగాహన గలిగియుండుట
మానవుల కందరకూ అవసరమై ఉంది. అయితే జీవితాధ్యయనాధ్యాపన శీలురైన వారలకది మరింత
ఆవశ్యకముగానున్నది. మనిషి, అనేకానుభవాలను గమనించి పరిశీలించుట ద్వారా ఏర్పడిన, వివేకాధారంగా జీవిక సాగించే
స్వభావం ప్రధానంగా కలిగియున్నా, విశ్వాసమన్నది కూడా మానవ
జీవన యాత్రలో గణనీయమైన పాత్రనే వహిస్తున్నది. పరిశీలించుట, గ్రహించుట
అన్నది ప్రాణికి ముఖ్యముగా మనిషికి-స్వభావంగా వుంది. పరిశీలించకనే అంగీకరించి
అనుసరించే లక్షణమున్నూ జీవితావసరంగా తెచ్చి పెట్టుకోబడ్డది. ఇందుకు ప్రధానకారణం
ఏమంటే మనిషి తెలిసినస్థితి నుండి తెలియని-తెలుసుకోవలసిన స్థితికి
ప్రయాణిస్తున్నాడు. వర్తమానము నుండి భవిష్యత్తులోనికి కదులుతున్నాడన్న మాట. కనుక అనుసరించిన
పిదప గ్రహించడం జరుగుతోంది. ఇది మార్చడానికి వీలు లేని వ్యవహారంగానూ ఉంది. ఈ
పరిస్థితే మనిషిలో అనుసరించే స్వభావాన్ని పుట్టించింది. వాటి వాటి పరిధుల్లో
వివేకమూ, విశ్వాసమూ కూడ ప్రయోజనకారులుగానే ఉన్నప్పటికీ,
ఒక దాని క్షేత్రంలో మరొకటి ప్రవేశించడం వల్లనూ, ఏదోవకటి అతిగా వినియోగించడం వల్లనూ అనర్థాలు ఏర్పడుతున్నాయి. జీవితాన్ని
సక్రమంగా నడుపుకోదలచిన వాళ్ళూ, జీవితాన్ని, అధ్యయనం చేయ దలచుకున్న వాళ్ళూ కూడా జీవన మార్గాలుగానున్న పై రెండు
విషయాలలోనూ సంపూర్ణంగా-కనీసం తగినంత వరకైనా అర్థం చేసికోవలసిన అవసరం ఉంది.
ప్రత్యేక
శీర్షికగా స్వీకరించి విశ్లేషించి చూడవలసినంత ప్రాధాన్యతనేగాక, ఈ విశ్లేషణకు తోడు ఎవరికివారు వారి
జీవితానుభవాలను కూడ జోడించి ఇదే అంశాన్ని మరల మరల పునర్విచారణ చేయవలసినంత విలువను
కూడా కలిగి ఉందిది. ప్రపంచమంతా-ఆయా వర్గాలుగానీ, వ్యక్తులుగానీ
ఈ రెండు మార్గాలను బట్టే పోతూవున్నారు. తాత్వికాంశాలు గానీండి (ఆయా సిద్ధాంతాలు)
ధార్మికాంశాలు గానీండి (ఆయా సిద్ధాంతానుయాయుల జీవన ప్రణాళికలు) ఈ రెండు మార్గాలకే
చెంది ఉంటాయి. ఒక సిద్ధాంతముందనుకుందాం. అది విశ్వాసాధారంగా ఏర్పడినదా? స్వానుభవ విశ్లేషణ నుండి జనించిన వివేకాధారంగానా? అన్నది
ప్రతి సాధకుడూ, బోధకుడూ కూడా ముందుగా నిర్ధారించుకోవలసియున్నది.
మన పరిశీలనలో ఒకటి విశ్వాసాధారంగా ఏర్పడింది అని నిర్ధారింప బడిందనుకోండి; అప్పుడు దానిననుసరించువాడూ, అనుసరించమని బోధించువాడూ
కూడా అది సత్యమని చెప్పగల స్థాయిని కోల్పోతారు. ఎందుకని? అది
వారి వారి పరిశీలనలనుండి [అనుభవాలనుండి] ఏర్పడలేదు గనుక. అనుభవమే(యదార్థానుభవం అనుట
మరింత సబబు) ప్రమాణం కానంతవరకు నిజానిజాలు తేల్చబడవు. తేల్చబడ్డాయన్న భ్రాంతి ఏర్పడవచ్చు;
ఈ వాక్యం పై మీ మీ యభిప్రాయాలు సహేతుకంగా స్పందనకు వ్రాయండి. పైన
చెప్పిన విషయాని కాధారంగా ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటనను చెప్పుకోవడం సందర్భానికి
తగినట్లుంటుంది. గమనించండి. ఈ మధ్యకాలంలో సమాజంలో కొంత అలజడి రేకెత్తించి
సద్దుమణిగిన విషయమిది. అద్వైతులకూ ద్వైతులకూ మధ్య జరిగిన వివాదమిది. ఒకరు
రెండోవారి సిద్ధాంతాన్ని దోషయుక్తమని చెపుతూ తమ సిద్ధాంతం సరైనదని
నిరూపించుకోమనండి, లక్ష రూపాయల బహుమానం (పందెం) అని బహిరంగ
ప్రకటన చేశారు. బహుశా మధ్వ పీఠాధిపతి అనుకుంటాను. దానిపై స్పందిస్తూ అద్వైతపీఠం వారూ,
వారి తరపు పండితులూ అద్వైతం ఎలా తప్పో నిరూపించండి.
రెండులక్షలిస్తాం అంటూ మరో ప్రకటన చేశారు. ఎవరి పక్షంలో వారు వారి వారికి చెందిన
పండిత సదస్సులను నిర్వహించుకుని యుద్ధానికి ముందు వ్యూహ రచన కొరకుగా సేనాధిపతులు
సమాలోచన సమావేశాలు జరుపుకున్నట్లు జరుపుకున్నారు. (ఎందువల్ల, ఏ మధ్యవర్తి ప్రయత్నంవల్ల, చివరికేమవుతుందో ఎందుకొచ్చిన గొడవ అన్న భయమైనా అయ్యుండవచ్చునో - గానీ
ఇరుపక్షాలు ఆపై అర్ధాంతరంగానే ముగించుకున్నా యనుకోండి) ఇరువైపులనున్న పండితులూ
స్వీయ సిద్ధాంతాన్ని నిలబెట్టుకొనుటకూ, ఎదుటివారి
సిద్ధాంతంలోని దోషాలను ఎత్తిచూపుటకు కావలసిన ఆధారాలపై తర్జన భర్జనలు చేసికుంటున్న
ఆ సమయంలోనే మూడవ సిద్ధాంతం ఉన్న మరొకరు మధ్వాధిపతికో లేఖ వ్రాశారు. అయ్యా, మీ రెంటిలో ఏది సత్యమో అన్నది అట్లుంచండి. అసలు మీ రెండూ సత్యం
కాదనేవారికి మీ సమాధానమేమి? సత్యాసత్యాలు నిర్ధారించగల
కొలత-ప్రమాణం- ఏమిటన్నది తేల్చకుండా మీరిరువురూ - మీది సత్యమా, మాది సత్యమా అనుకుంటుంటే వాస్తవంగా రావలసిన ఫలితం వస్తుందా? అన్నది మూడవవారి లేఖ సారాంశం. వారికింతవరకు సమాధానం లేదు. ఇది నిజంగా ఏ
యిరువురు మధ్య గానీ, లేక సకల సిద్ధాంతకారుల, మధ్యనూ పరీక్షింపబడి
నిర్ణయించుకోవలసిన విషయమై యున్నది. ఈ విషయంలో (సత్య నిర్ధారణకు కొలతేమిటి అన్న
విషయంలో) అందరకూ సమాన వేదిక లేకుంటే - సత్యం పాక్షికమూ, వైయుక్తికమూ
అవుతుంది. నేను చెప్పిన విషయం యిప్పటికే మీకర్థమయ్యుంటే సరే. లేకుంటే ఈ విషయాన్ని
మరల మరల చదవండి, పరిశీలించండి. ఈ విషయంలో స్పష్టత లేకుండా
చేసే చర్చలూ, సిద్ధాంత ప్రచారాలూ కూడా సమాజాన్ని ఛిన్నా
భిన్నం చేసి వేస్తాయి. వర్గాలూ, సంఘాలూ పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తాయి. ఇప్పుడు
పుట్టుకొస్తున్న నానావిధ సంఘాలకున్నూ -ఆధారస్థానం సత్యం వ్యక్తిగతమైయుండుటే, ఈ
విషయాన్ని అనుభవం నుండి చూసి అర్థంచేసికోగలిగితే సమజంలో ఇదెంత ప్రమాదకరమైన
పాత్రవహించ గలదో భోధపడగలదు.
దీనినే
మరికొంత వివరిస్తాను పరిశీలించండి.
సత్యం
వ్యక్తిగతం కావడమంటే నిజానిజాలు లేవని చెప్పడమే. నీది నీకు నిజం, నాది నాకు నిజం అంటే అంతేగదా మరి.
ఆస్తిక సంఘాలలో తరచు ఓమాట వింటుంటాం. దేవుడు ఉన్నాడనుకునే వాళ్ళకు ఉన్నాడు,
లేడనుకునేవాళ్ళకు లేడు అని ఈ పూట అంటున్న వాళ్ళు ఇదేదో గొప్ప
విషయంగానూ, తార్కికంగానూ ఉందనుకోవడం కూడా నేను చూశాను. కానీ
ఈ మాటకర్థం సత్యం వ్యక్తిగత మనడమే. ఈ పంథావుంది చూశారూ! ఇది మనిషికి నిజం
తెలుసుకునే అవకాశం కూడా లేకుండా చేస్తుంది. ఈ ప్రమాదం లేకుండా యదార్థంగా సత్యనిర్ధారణ
జరిగేట్లు చూపాలంటే సత్యం నిర్ణయించడమెట్లా? అన్న విషయాన్ని
పరిశీలించి అందరకూ అంగీకారమయ్యే ఒక కొలతను పొందవలసి ఉంది. Note:-ఈ కొలత అన్నది సజంగానే ఉంది. మన మేమీ సృష్టించవలసిన పనిలేదు. సరే విషయానికొస్తాను.
పై
ద్వివిధ పీఠాధిపతుల రాద్ధాంతం కూడా ఈ కోవకు చెందినదేనని నేనంటే మీలో కొందరకు
ఆశ్చర్యమూ, మరికొందరకు
కోపోద్రేకము కూడా కలుగవచ్చు. అయినా వివేక దృష్టినుండి సత్యం అన్నిటికంటే విలువైనది
అని అంగీకరించి విషయాన్ని పరిశీలిస్తే నామాటలోని వాస్తవం బోధపడుతుంది. అదెలానో
వివరిస్తాను మీరూ చూడండి.
పై రెండు
సిద్ధాంతాల వాళ్ళూ ప్రమాణంగా దేనిని తీసికుంటారు? ప్రస్థాన త్రయాన్ని అంటే 1)
ఉపనిషత్తులు [వేదభాగం] 2) బ్రహ్మ సూత్రాలు [వేదాంత వ్యాఖ్యాన
గ్రంథం] 3) గీత [సాంప్రదాయంగా ఆధ్యాత్మిక గ్రంథంగా బహుళ ప్రాచుర్యం
పొందిన గ్రంథమిది] పై, ఇరువురూ ఈ మూటినే ప్రమాణంగా తీసికుని నిజానిజాలు
తేల్చుకోవడానికి సిద్ధపడినారు. అంటే ఏమన్నమాట గ్రంథం ఏమి చెపుతున్నది? మొత్తం దాని సారాంశమేమి? అన్న విషయాన్ని మాత్రం
చర్చిస్తున్నారన్న మాట. పైగా ఇరువురూ అంగీకరించిన ప్రామాణిక శబ్దాలనే ఎవరి అర్ధం
వారు చెప్పుతున్నారన్నమాట. అసలు ఒక గ్రంథానికి - అది ఏ గ్రంథమైనా కానీండి.
ప్రమాణార్హత ఎప్పుడు, ఎలా వస్తుంది? అన్నది
ముందుగా పరిశీలించ వలసి యుండగా దానిని విడచి ఆ గ్రంధం యిలా చెప్పింది, అలా చెప్పింది అని వాగ్యుద్ధం చేసుకుంటున్నారన్న మాట. అసలు విషయమేమంటే ఒక
వేళ యిరువురూ గ్రంథం యొక్క అర్థం విషయంలో ఒకే అభిప్రాయానికి రాగలిగినా ఇంకా అది
సత్యమో కాదో నిర్ధారింపబడవలసియే ఉంది. లోకములో ఇది గమనింపబడుటలేదు. ఒక గ్రంథములో
ఏమి చెప్పబడిందో తేల్చినంత మాత్రాన అది నిజమని చెప్పినట్లు కాదు. అది
వ్యాఖ్యానకారుని ప్రతిజ్ఞ మాత్రమే ఔతుంది. అంతవరకు చూద్దామన్నా గ్రంథోద్దేశ్యమిదే
అని నిర్ణయించు అర్హత రచయితకు తప్ప అన్యులకు లేదు.
Note:-ఈ విషయం స్పష్టం కావాలంటే భాషా స్వరూప స్వభావాలూ, శక్తీ,
పరిమితులు తెలియవలసి ఉంది. అది ఆలోచించండి. నేనూ ప్రత్యేక సంచిక గా
ముందు ముందు మీ కందించగలను.
వారు వారు,
వారి వారి యభిప్రాయములను వ్యక్తీకరించగలరే గానీ, నే చెప్పిందే రచయిత భావము అని నిర్ణయించ లేరు. ఆయా
అభిప్రాయాల్ని రచయిత చూసి తన యభిప్రాయాన్ని గమనించిన వ్యాఖ్యాత ఎవరన్నది
నిర్ణయించవలసి ఉంటుంది. ఈనాడున్న ఆయా సాంప్రదాయాల బోధకులూ, అనుయాయులూ
కూడా ఈ విషయాన్నంగీకరించరు. ఎందుకని? అట్లంగీకరిస్తే వారి
వారి ఆధార పీఠమే కదులుతుంది గనుక. అయితే ఈ విషయాన్ని పూర్వం ఆయా సిద్ధాంతాలను ప్రవర్తింపజేసిన
కొందరు మేధావులు గమనించారు. పై ప్రమాదం నుండి బైట పడుటకుగాను త్రిమతాచార్యుల
బాష్యాలకు వ్యాసుని ఆమోదముద్ర పడినట్లు ఆయా గ్రంథాలలో వ్రాసుకున్నారు. ఉదా:- శంకరులవారు
భాష్యరచన పూర్తి చేసి వ్యాసునికి చూపినట్లూ, దానిపై వ్యాసుడు
నీ వివరణ నా రచనకు అద్దం పట్టినట్లుందని తాఖీదూ, కితాబూ యిచ్చినట్లూ
గ్రంధంలో ఉంది. మిగిలిన వారి విషయమూ అట్లే. ఈ ఆధారం కూడా పై నా విశ్లేషణకు బలాన్ని
చేకూర్చుతోంది.
నిజం
నిప్పులాంటిది. అది ఒకని యిష్టాయిష్టాలను బట్టి మారదు. నీవంగీకరించినా లేకున్నా
యిష్టపడినా లేకున్నా వాస్తవం వాస్తవమే. ఈ విషయాన్ని గమనించకుండా
వైయక్తికాభిప్రాయాలే, అనుభవాలే-వాస్తవాలుగా-చెలామణీ
కావాలన్న
భావమూ, యత్నమూ కూడా
అజ్ఞాన జనితాలే కాగలవు. శోచనీయమైన విషయమేమంటే విచారణ, వివేకములనెడి
పేరున అజ్ఞాన కార్యాలే రాజ్యమేలుతున్నాయి. వివేక మార్గానికీ, విశ్వాసమార్గానికి ఉన్న తేడా గమనింపబడనంత కాలం ఈ ప్రమాదం తప్పదు. విశ్వాసం
వివేకం క్రింద చెలామణి అవుతున్నది ప్రస్తుత సమాజంలో ఆస్తిక, నాస్తికాది
సంఘాలన్నిటా ఈ ప్రమాదం ఏర్పడే ఉన్నప్పటికీ ఆస్తిక పంథాలో ఇది కరడుగట్టుకుని ఉంది.
విశ్వాసమూ, వివేకమూ అన్న పదాలకు అర్ధం చెపుతాను. మీరూ
పరిశీలించండి.
1)
విశ్వాసం: అప్పటికి తనకు తెలియని దానిని గూర్చి వినీ, చదివీ
అది వుందనిగానీ, లేదనిగానీ, అవునని గానీ,
కాదని గాని, సత్యమని గానీ, అసత్యమని గానీ నిర్ణయానికి వచ్చుటనే విశ్వాసముంటాము. దాని ప్రకారం నడచుట
విశ్వాస మార్గాన నడచుట.
2)
వివేకం: స్వీయానుభవాల్ని, విశ్లేషించి,
వాటి కనుగుణ్యమైన హేతుదృష్టి కలిగి (దానినే అనుభవాంగ తర్కం అంటాము) పిదప ఆయా విషయాలకు
చెందిన అభిప్రాయాల్నేర్పరచుకొనుట తదనుగుణ్యంగా, నడచుట వివేక
మార్గాన నడచుట.
తన కన్యమైన
వ్యక్తులు [వారు - అసాధారణ ప్రజ్ఞావంతులు కావచ్చు. వారు చెప్పింది వాస్తవమూ
కావచ్చు] చెప్పిన దానిని ప్రమాణముగ స్వీకరించి అనుసరించు విధానమంతా విశ్వాస
మార్గానికి చెందిందే. శాస్త్రం ప్రమాణం
అన్నాక నీవు విచారణ మార్గంలో లేవనే చెప్పినట్లైనది. దీనిపై మీ మీ స్పందనలను
పంపండి.
సశేషం.
అభ్యాసక్రమము - 3
ఆధ్యాత్మికత
పేరున పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న (రోజుకో సంఘము, వీధికో సంఘము) సంఘాలనూ, ఆశ్రమాలనూ, బోధకులనూ అనుభవంలో గమనిస్తున్న కొలదీ
యదార్థ సాధనలను గురించిన మేలుకొలుపు కార్యక్రమాన్ని అట్లుంచి బోధ గురువులూ, సంఘాలూ,
వారి భ్రాంత సాధనలూ, సాధ్యాలూ అన్ని వాటి విషయమై
జిజ్ఞాసువులనూ, యదార్థ సాధకులనూ మేలుకొలుప వలసిన అగత్యం
ముందుగా ఏర్పడుతున్నది. అహా ఎన్ని సంఘాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని రకాల సాధనలు ఏమిటిదంతా? ఎందుకదంతా? జీవితం ఎటు నడుప బడుతోంది? ఎందుకొరకు? కాలమూ, శక్తి ఎంత ఖర్చు చేయబడుతున్నాయి? యిలా ఎన్నో విషయాలు లోక హితైషుల ముందు వికృతరూపాలు దాల్చి వారిని
వేదనాభరితులనుగా చేస్తున్నాయి. అంధ విశ్వాసా లొకవంక, అజ్ఞాన మొకవంక,
ఆడంబరా లొకవంక , అతి అభిమానాలూ, అనవసర ద్వేషాలూ మరోవంక, గుర్తింపబడాలనే, గౌరవింపబడాలనే తపన మరోవంక ఇలా... ఇలా ఎన్నో శక్తులు - సామాన్య మానవులపై, ప్రారంభ సాధకులపై తమతమ శక్తియుక్తుల్ని, ప్రయోగిస్తూ
తమవైపు ఆకర్షించు కోవాలనీ, ఉపయోగించుకోవాలనీ నిరంతరయత్నం
చేస్తుండగా జిజ్ఞాసువులకూ, సాధకులకూ ఉక్కిరిబిక్కిరయ్యే స్థితి
ఏర్పడుతోంది. కొంతలో కొంత సంతోషించ దగినదేమంటే సమాజంలోని ఎక్కువమంది ప్రజలు రకరకాల
సంఘాలవాళ్ళు చెప్పేది విని ఊరుకుంటున్నారు. అంటీ ముట్టనట్టుగా (దేనినీ ఆచరణలో
స్వీకరించక పోవడమన్నది కోరదగినది కాకపోయినా ఈ విషయంలో అది కొంతలో కొంత మేలు
చేస్తున్నది. ఆశ్చర్యమే మరి.) అట్లుగాక నిజంగా వారు చెప్పేవి స్వీకరించ దలుచుకుంటే,
ఎటు కదలాలి అన్న దాలోచిస్తే అంతా అయోమయమే, గందర
గోళమే. ఎందుకని? అనంతంగా ఉన్నాయి పంథాలు. పరస్పర
వైవిధ్యమేకాక, వైరుధ్యం కూడా గణనీయంగానే ఉంది. దానికి తోడు -
సంఘాలలోనూ, బోధకులలోనూ ఋజుత్వం లోపించి ఉంది. కపటము-లోపలొకటి
పైకొకటిగా ఉండుటకూడా తక్కువేమీ లేదు. నాలుగు సంఘాల వాళ్ళూ కలుస్తారు. ఒకే వేదిక
పైన. మేమంతా ఒక్కటే నంటారు. అది బైటికి కనబడే వేషమే. లోపల - వ్యక్తిగతమైన
సిద్ధాంతాలూ, సాధనలూ కలిగి అనుయాయులకవే అత్యుత్తమాలుగా
బోధిస్తుంటారు. బ్రహ్మరాక్షసి లాంటి ఈ విధానం విశ్వరూపాన్ని కూడా పొంది ఒక్క
ఆధ్యాత్మిక కేంద్రాలలోనే గాక, ఆస్తిక, నాస్తిక,
రాజకీయాది సకల సంఘాలలోనూ తాండవ మాడుతోంది, రాజ్యమేలుతోంది. ఆస్తికంగా
(హిందూపరంగా, విశ్వహిందూ పరిషత్తు లాటివీ, క్రైస్తవపరంగా) వారిలో వారి కనేక బలీయమైన విభేదాలున్నా. బైటికి ఒకటిగా
కనిపించే క్రైస్తవసంఘాలూ, అట్లే నానా మతాలకు చెందిన్నీ ఉండగా,
మరోవైపు నాస్తికంగా నాస్తికులూ, హేతువాదులూ,
వారి వారి అభిమానాలనూ, గుర్తింపులనూ అనుసరించి ఉమ్మడి సంఘాల
నేర్పరచుకుంటుండగా, మరోవైపు కమ్యూనిజ మాదిగాగల రాజకీయపక్షాలున్నూ,
బైటికి ఉమ్మడిగా కనుపిస్తూ మేమంతా ఒక్కటేననే చిలుకపలుకులు పలుకుతూ ఉంటున్నారు.
ఎక్కడ చూసినా ఒకే వికృతరూపం. అది నిజాయితీ లోపించడం, కపటం,
స్వార్ధం పెచ్చు పెరిగి ఉండడం అన్నదే కనబడుతోంది. ఇంతటి జటిలమైన,
ప్రబలమైన, కల్మషమైన వాతావరణంలో సామాన్యుని
స్థితి ఏమి? ప్రారంభ సాధకుల బలమెంత స్థిరంగా నిలబడటానికి? ఇదే సంఘ హితైషుల ముందున్న పెద్ద సమస్య. మహా ప్రభంజనంలా సాగుతున్న పై కల్మష
దుమారంలో సాధకులూ, యదార్థ బోధకులూ కూడా అల్లల్లాడి పోతున్నారన్నది నగ్న సత్యం. అందుకే
ఎంత – యత్నించినా రాదగిన మార్పు రావడం లేదు. అట్లని
ఊరుకుండుట కూడా కూడనిది. ఇట్టిస్థితిలో ఎంతో కొంత మేలు జరగాలంటే నిజాయితీగల, హితకాంక్షగల బోధకులూ, సాధకులూ సంఘటితం కావలసి ఉంది. దానికై ప్రస్తుతమున్న ప్రమాద పరిస్థితినీ;
దాని వలన తనకూ, అందరకూ జరుగుతున్న, జరుగనున్న అనర్థాన్నీ; సాధకులూ, జిజ్ఞాసువులూ కూడా గమనించవలసి ఉంది. మరికొందరున్నూ గమనించేట్లు
చేయవలసి యుంది. ఇదిన్నీ యధార్థాభ్యాసాన్ని ప్రారంభించేముందే గమనించవలసినదిగా ఉంది.
చెప్పే మాటకూ, చేసే పనికీ, లోపలి
ఆలోచనకూ ఏది పోలిక? మరీ అంత వ్యత్యాసమా? అంతా కృత్రిమత. ఒక వ్యాపారిని తీసుకుందాం. సత్యమే జయిస్తుంది అని బైటకు చెపుతాడు.
తన వ్యాపార విషయమైన సత్యం చెపితే కొడుకుని గానీ, తన అజమాయిషీ
లోనున్న పనివారిని గానీ అంగీకరించలేడు. ఇది ఒక కోణం. ఇలా వందలు వేలున్నాయి
చూడగలిగితే. గదిలో తాను దేవుడనుకుంటున్న చిత్రం ముందు కూర్చుని ఎన్ని ప్రార్ధనలు, ఎన్ని వేడికోళ్ళు, మరెన్ని మంత్రానుష్టానాలు, ప్రాణాయామాలు, ఇలాటి సాధనలు మరెన్నో. తానేమి
కోరుకుంటున్నాడో, ఏమి చేస్తున్నాడో, కోరుకుంటున్నది
రావాలంటే ఏమి చేయాలో, ఆ రావాలనుకుంటున్న దసలు తన అవసరంనుండే
కోరబడిందో, లేదో ఏమైనా ఆలోచించాడా? అబ్బే,
అలా ఏమీ లేదు చాలవరకు. అలా అని ఎలా చెప్పగలవు అని పాఠకు లడుగవచ్చు.
మా పరిశీలనలే అందుకాధారం. ఈ విషయంలో సందేహిస్తున్న, ఈ
భావాన్ని వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడడానికి, ప్రయోగరూపంలో
పరిశీలించడానికి నేను యిప్పటికీ సిద్ధంగానే ఉన్నాను.
ప్రతి
వ్యక్తికీ – తన విషయంలోనూ, ఎదుటివారి విషయంలోనూ కూడా ప్రస్ఫుటంగా
ఎదురుపడుతున్న ఈ విషయాన్ని గూర్చి, ఇక్కడ తానూ, సమాజమూ కూడా మారవలసి ఉన్నదనీ, ఈ విషయంలో మినహాయింపులుండ
గూడదనిన్నీ గమనింపు కలుగనంతకాలం చేస్తున్న సాధనలన్నీ నేల విడచిన సాము వంటివే
కాగలవు. అది స్టాండు వేసి సైకిల్ తొక్కడం లాంటిది. “ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే” అన్న
నానుడి ఇట్టి వాటికి చెందినదే.
ఓ
పాఠకులారా! ఇది ముందు గమనించండి. మారవలసింది;
సాధన ప్రారంభించవలసింది యిక్కడనుండే.
1) సాధకుడు:-
సాధన చేయగోరినవాడు అంటే సరిపోదు. సాధన చేస్తున్నవాడు అనాలి. ఈ రెంటి మధ్య తేడాని
గమనించారా? 2) సాధ్యవిషయమై స్పష్టమైన ఉద్దేశ్యమూ, దానిని సాధించి పెట్టగల పరికరాలూ, ఉపయోగించు విధానమూ వీటిపట్ల సమగ్రమైన
అవగాహన కలిగి, ఆ వివేకం యొక్క మార్గదర్శకత్వంలో క్రమమైన, నిరంతరాయమైన, దృఢమైన యత్నం చేయువాడే నిజమైన
సాధకుడు. మిగిలిన ప్రక్రియలన్నీ 1) పనికిరానివో 2) చెడు ఫలితాన్నిచ్చేవో అయ్యుంటాయి. అథవా ఉద్దేశించని, వాటివాటికి తగిన ఫలితాల్ని మాత్రం పుట్టిస్తాయి. యదార్థ సాధకులవి అవాంఛనీయాలే
కదా!? ఈ విషయాన్ని కూడా సాధన చేయగోరువారు మున్ముందుగనే గమనించ
వలసి యుంది. సాధనల తీరు తెన్నులు పై సంచిక నుండి ప్రారంభిస్తాను. అయితే ఈ పాఠాన్ని
కూలంకషంగా పరిశీలించి మీ యభిప్రాయాన్ని తెలుపుతూ స్పందన-ప్రతిస్పందనకు లేఖలు
వ్రాయండి.
సాధన - 1
No comments:
Post a Comment